1. బాబా ఎప్పుడూ నాతో ఉన్నారు
2. బాబా మంచే చేస్తారు - మనమెప్పుడూ విశ్వాసాన్ని కోల్పోకూడదు.
3. బాబా కృపతో అమ్మకి ఆరోగ్యం
బాబా ఎప్పుడూ నాతో ఉన్నారు
ముందుగా సాయిభక్తులకు నమస్కారం. నా పేరు ఆదిత్య. నా వయసు 31 సంవత్సరాలు. నేను చిన్నప్పటినుండి బాబాని ప్రార్థిస్తున్నాను. బాబా నాకు ఎన్నో మహిమలు చూపించారు, ప్రతి విషయంలోనూ ముందుండి నన్ను నడిపించారు. ఈ మధ్యకాలంలో నేను ఈ బ్లాగులోని సాయిభక్తుల అనుభవాలు చదివి నేను కూడా నా అనుభవాలను తోటి భక్తులతో పంచుకోవాలని నిశ్చయించుకున్నాను. బాబా ఎప్పుడూ నాతో ఉన్నారనే నా నమ్మకానికి నిదర్శనమైన నా అనుభవాలు కొన్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. "బాబా! నా అనుభవాలు పంచుకోవడంలో కొంచెం ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి".
కొన్నిరోజుల క్రితం నేను, నా భార్య మనాలి విహారయాత్రకి వెళ్ళాం. ముందుగా మేము ఢిల్లీ చేరుకుని, అక్కడినుండి మనాలికి బస్సులో వెళ్ళాము. మొత్తం అంతా ఘాట్ రోడ్డు అయినందువల్ల నాకు చాలా భయమేసి, "బాబా! ఎలాగోలా మేము మనాలి చేరుకుని, అక్కడ అన్ని ప్రదేశాలు చూసి తిరిగి క్షేమంగా బస్సులో ఢిల్లీ చేరుకునేలా చూడండి" అని ప్రార్ధించాను. బాబా దయవల్ల మేము క్షేమంగా మనాలి చేరుకున్నాము. అక్కడ 'సోలంగ్' వ్యాలీ అనే ప్రదేశంలో క్యాబ్ వాడు మమ్మల్ని దించి, "సాయంత్రం 5 గంటలకి వస్తాను, అంతవరకు ఇక్కడ అన్నీ చూస్తూ ఉండండి" అని చెప్పి వెళ్ళిపోయాడు. సాయంత్రం 4 గంటలకల్లా మేము ఆ ప్రదేశమంతా చూసేసాము. క్యాబ్ వాడు రావటానికి ఇంకా సమయముంది. ఈలోపు చిన్నగా చినుకులు మొదలయ్యాయి. అసలే ఆ ప్రాంతంలో చలి ఎక్కువ. చినుకులు కూడా తోడయ్యేసరికి నా భార్య చాలా ఇబ్బందిపడింది. వర్షం ఎక్కువైతే ఇంకా ఇబ్బందిపడాల్సి వస్తుందని నేను వెంటనే బాబాని తలుచుకుని, "బాబా! వర్షం పడకుండా చూడండి" అని ప్రార్థించాను. బాబా దయవల్ల క్యాబ్ వచ్చేంతవరకు వర్షం పడలేదు. మేము హోటల్‍కి చేరుకున్న వెంటనే వర్షం మొదలై మరుసటిరోజు వరకు తగ్గలేదు. బాబా మాకోసమే వర్షాన్ని అపారనిపించింది. బాబా నా ప్రార్ధన విన్నారు. నాకు సహాయం చేసారు. మాకు తోడుగా ఉన్నారు. మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటికి తిరిగి చేరుకున్నాము.
ఈమధ్య నేను మొదటిసారి శబరిమల వెళ్ళినప్పుడు అందరూ "కొండ ఎక్కటం కష్టంగా ఉంటుంద"ని చెప్పారు. అప్పుడు నేను, "బాబా! ఏ ఆటంకాలు లేకుండా అంతా బాగా జరిగేలా చూడండి" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవలన ఏ ఆటంకాలు లేకుండా అయ్యప్పస్వామి దర్శనమై తిరిగి ఇంటికి క్షేమంగా వచ్చాను. ఇలా బాబా ప్రతి నిమిషం నాతో ఉంటూ నన్ను ముందుకి నడిపిస్తున్నారు. ఇలా ఎన్నని చెప్పాలి? ఈ జీవితం అంతా బాబా మహిమలతో నిండి ఉంది. ఇంకొక విషయంలో బాబా చూపించిన మార్గం వల్ల నేను అనుకున్నది జరగబోతోంది. ఆ అనుభవాన్ని ఇంకోసారి వివరంగా తెలియచేస్తాను. బాబా కృపాదృష్టి ఎల్లవేళలా మా మీద, భక్తులందరీ మీద ఉండాలి, ఉంటుందని నా నమ్మకం. చివరిగా ఇలా మీ అందరితో నా అనుభవాలు పంచుకోగలిగినందుకు బాబాకు, ఈ బ్లాగు సభ్యులకు నా నమస్కారాలు.
బాబా మంచే చేస్తారు - మనమెప్పుడూ విశ్వాసాన్ని కోల్పోకూడదు
నా పేరు అలేఖ్య. నాకు తల్లి, తండ్రి గురువు, దైవం అన్నీ సాయిబాబాయే. మా కుటుంబ యజమాని బాబాయే. మా భారం అంతా ఆయనదే. బాబా దయతో నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. వాటిలో కొన్ని ఈ బ్లాగు ద్వారా ఇదివరకు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలు పంచుకుంటున్నాను. ఈమధ్య మూడు నెలలపాటు మా నాన్నగారు కొంచెం ఆయాసం, గ్యాస్ సమస్యలతో ఇబ్బందిపడుతున్నా అంతగా పట్టించుకోలేదు. 2021, డిసెంబర్ మూడోవారంలో మాత్రం నాన్న యశోద హాస్పిటల్‍కి చెకప్‍కి వెళ్తే, డాక్టరు హార్ట్ కు సంబంధించిన టెస్టులు వ్రాసారు. అందులో యాంజియోగ్రామ్ కూడా ఉంది. నేను చాలా భయపడి సహాయం కోసం బాబాను ప్రార్థించాను. టెస్టులు చేసిన తరువాత డాక్టర్లు నాన్న గుండెలో బ్లాకులున్నాయని, రెండు స్టెంట్స్ వేయాలని అన్నారు. నేను బాధతో, "ఏమిటి బాబా మాకు ఈ పరీక్షలు?" అని అనుకున్నాను. ఆ సమయంలో బాబా వద్ద నుండి, "మీ కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని జరగదు. నేను హామీ ఇస్తున్నాను. ఆందోళన పడవద్దు. అద్భుతాలు జరుగుతాయి" అని మెసేజ్ వచ్చింది. నిజంగానే అద్భుతం జరిగింది. రెండు స్టెంట్లు వేయాలన్న డాక్టర్లు ఒక స్టెంటే వేసి, మందులతో నయమవుతుందని అన్నారు. బాబా దయవలన అంతా మంచే జరిగింది. నా మనసుకి చాలా సంతోషంగా అనిపించి బాబా అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకోవాలని అనుకున్నాను. బాబా ఏం చేసినా మంచే చేస్తారు. మనమెప్పుడూ ఆయనపట్ల విశ్వాసాన్ని కోల్పోకూడదు. "బాబా! మీకు అనంత వేల కృతజ్ఞతలు".
ఎప్పుడూ హ్యాపీగా ఆడుకుంటూ చురుకుగా ఉండే మా బాబు ఈమధ్య ఒకరోజు రాత్రి హఠాత్తుగా ఏడవడం మొదలుపెట్టాడు. ఏం చేసినా బాబు ఏడుపు అసలు ఆపలేదు. ఇదివరకు ఎప్పుడూ మా బాబు అలా ఏడ్చింది లేదు. నాకు భయమేసి హాస్పిటల్‍కి తీసుకుని వెళితే, డాక్టరు ముందు కూడా బాబు ఏడుస్తూనే ఉన్నాడు. డాక్టరు బాబుని చూసి కడుపునొప్పి తగ్గడానికి టానిక్, అలాగే చెవినొప్పి తగ్గడానికి మందు వేశారు. అయినా బాబు నిరంతరాయంగా ఏడుస్తుంటే నా ప్రాణం విలవిల లాడింది. అప్పుడు బాబా ఊదీ వేసి సిరప్ ఇచ్చాను. అయినా బాబు ఏడుపు ఆపలేదు. చివరికి నేను, "బాబా! మీ దయతో బాబు ఏడుపు ఆపితే, ఉదయం నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అలా బ్లాగులో పంచుకుంటానని అనుకున్నంతనే బాబా దయవల్ల బాబు ఏడుపు కొంచం అపి నిద్రపోయాడు. అప్పుడు సమయం తెల్లవారు ఝామున 3 గంటలయింది. వెంటనే ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే నా అనుభవం వ్రాసి పంపాను. ఈ అనుభవం ద్వారా బాబా నాకు ఈ బ్లాగు యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలియజేశారు. ఇలా సాయినాథుడు అడుగడుగునా మమ్మల్ని కాపాడుతున్నారు. "బాబా! మీకు అనంతవేల కృతజ్ఞతలు. నిన్నే నమ్ముకున్నాము తండ్రి".
బాబా కృపతో అమ్మకి ఆరోగ్యం
సాయిబంధువులందరికీ నమస్సులు. ఆ సాయినాథుని కృపతో అందరూ బాగుండాలి. అందులో మనమూ ఉండాలి. నాపేరు గంగా భవాని. మాది వైజాగ్. ఇటీవల బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను. ఈమధ్య మా అమ్మగారి ఆరోగ్యం బాగోలేదు, బాగా సీరియస్ అయ్యింది. నేను సాయిని ప్రార్ధించి, మూడురోజులు వదలకుండా బాబా నామాన్ని జపించాను. బాబా కారుణామయుడు, తప్పక మేలు జరుగుతుందని పూర్తి నమ్మకం ఉంచాను. బాబా దయవలన మూడోరోజుకి అమ్మ ఆరోగ్యం కాస్త మెరుగుపడి ఇప్పుడు బాగుంది. ఈవిధంగా బాబా నన్ను నా కుటుంబాన్ని అడుగడుగునా కాపాడుతున్నారు. నా ఇంటికి రక్షణ ఆయన. బాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. "ధన్యవాదాలు బాబా".