సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1342వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అనుగ్రహముంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా శిరిడీ ప్రయాణం ఆగదు
2. అనూహ్యంగా అందిన బాబా సహాయం
3. ఆటంకాలు లేకుండా పెళ్లి జరిపించిన సాయి

బాబా అనుగ్రహముంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా శిరిడీ ప్రయాణం ఆగదు


అందరికీ నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. నేను ఇప్పుడు నా శిరిడీయాత్రకి సంబంధించిన అనుభవాన్ని పంచుకుంటాను. మేము 2000 నుండి ప్రతి సంవత్సరం శిరిడీ దర్శిస్తుండేవాళ్ళము. కానీ 2021లో కరోనా కారణంగా వెళ్ళలేకపోయాము. లాక్‌డౌన్ సమయంలో నేను 7 వారాల చొప్పున 4 సార్లు దివ్యపూజ చేశాను. ఆ తర్వాత మరో రెండుసార్లు దివ్యపూజ చేశాను. బాబా అనుగ్రహంతో చాలావరకు నా ఆందోళనలు తొలగిపోయాయి. కానీ నేను మొక్కుకున్న 6 ముడుపులు అలానే ఉండిపోయాయి. అందువల్ల 2022వ సంవత్సరం ఆరంభం నుండి శిరిడీ వెళ్ళాలని ఎంతగానో ప్రయత్నించాం కానీ, ప్రతిసారీ ఏదో ఒక అడ్డం వచ్చేది. చివరికి నేను శ్రీవినాయకచవితి అవగానే ఎలాగైనా శిరిడీ వెళ్ళాలనుకున్నాను. కానీ అది నా నెలసరి సమయం. ఆ కారణంగా అప్పుడు శిరిడీ వెళ్లడం మానుకుంటే నవరాత్రులు అయ్యాకనే వెళ్ళగలము. అన్ని రోజులు ఆగడం నాకు ఇష్టంలేక, బాబా మీద భారం వేసి నేనే స్టేషన్‌కి వెళ్లి టిక్కెట్లు బుక్ చేశాను. ఇక నెలసరి రాకుండా మాత్రలు వేసుకుందామంటే, నాకు నెలసరి వచ్చే సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందుకే నేను వెళ్ళేరోజు వరకు ఏ టాబ్లెట్ వేసుకోలేదు. బయలుదేరే సమయానికి కూడా నెలసరి రాకపోతే బాబాకి దణ్ణం పెట్టుకుని అప్పటినుండి నెలసరి టాబ్లెట్ వేసుకుందామని అనుకున్నాను. ఇలా ఉండగా, రేపు ప్రయణమనగా ముందురోజు నాకు గొంతు ఇన్ఫెక్షన్‌తో 102 డిగ్రీల జ్వరం వచ్చింది. ఆ రాత్రంతా నేను, "జ్వరం తగ్గాలి" అని బాబాను ఎంతగానో ప్రార్థించాను. కానీ జ్వరం అస్సలు తగ్గలేదు. మా నాన్న మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళదామన్నారు. అయితే అదేరోజు సాయంత్రం మా ప్రయాణం. అప్పటికింకా ఏమీ సర్దుకోలేదు. హాస్పిటల్‌కి వెళ్లిరావాలంటే 5 గంటల సమయం వృధా అవుతుంది. నాకు పడుకుని విశ్రాంతి తీసుకునే సమయం ఉండదు. అందువల్ల నేను మా నాన్నతో, "హాస్పిటల్‌కి వద్దు. టాబ్లెట్ వేసుకుని ఇంట్లో పూర్తి విశ్రాంతి తీసుకుంటాను" అని చెప్పాను. కానీ బాబాకి నేను అలా చేయటం ఇష్టంలేదేమో! కాసేపు తరువాత మా మావయ్య వచ్చి, "హాస్పిటల్‌కి వెళ్ళకపోతే జ్వరం తగ్గదు" అని మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్‌కి నన్ను తీసుకుని వెళ్లారు. డాక్టర్ చూసి, "గొంతులో ఇన్ఫెక్షన్ బాగా ఉంది" అని చెప్పి ఇంజక్షన్ ఇచ్చి, టాబ్లెట్లు కూడా ఇచ్చారు. "సాయంత్రం ప్రయాణం ఉంద"ని చెప్తే, "వాయిదా వేసుకోండి. ఎందుకంటే, ఒకవేళ జ్వరం తగ్గకపోతే డెంగ్యూ అవ్వొచ్చు. అదే జరిగితే ప్రయాణంలో కష్టమైపోతుంది" అని డాక్టర్ అన్నారు. కానీ, 'ఏదేమైనా ఈసారి శిరిడీ వెళ్ళాల'ని నేను చాలా పట్టుదలగా ఉన్నాను. అందువల్ల 3 రోజులకి మందులు తీసుకుని ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకున్నాను. బాబా దయవల్ల కొంచెం జ్వరం తగ్గగానే, అన్నీ సర్దుకుని శిరిడీ ప్రయాణానికి సిద్ధమయ్యాను. బాబా అనుగ్రహం వల్ల నేను అనుకున్నట్లే బయలుదేరేవరకు నాకు నెలసరి రాలేదు. అలాగే బయలుదేరే సమయానికి జ్వరం తగ్గింది. మరుసటిరోజుకి నా ఆరోగ్యం పూర్తిగా మామూలు అయిపోయింది. బాబా దర్శనం చేసుకుని, నా ముడుపులన్నీ ఆయనకి సమర్పించుకున్నాను. ఎలా చేయగలమన్న శిరిడీ ప్రయాణం ఎంతో హాయిగా పూర్తయింది. "నా పిలుపు లేనిదే ఎవరూ శిరిడీకి రాలేరు" అన్న బాబా మాట అక్షరసత్యం. అందువల్లే ఎన్ని అవాంతరాలు ఎదురైనా మా శిరిడీ ప్రయాణం ఆగలేదు. "ధన్యవాదాలు బాబా. తొందర్లో మళ్ళీ మీ పిలుపు రావాలని మనస్పూర్తిగా  వేడుకుంటున్నాను బాబా".


రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!


అనూహ్యంగా అందిన బాబా సహాయం


ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయిభక్తులందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. నా పేరు కృష్ణ. బాబా నాకు 2022లో ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు పంచుకుంటున్నాను. అమ్మాయిలకి జుట్టు విషయంలో ఎంతో ఆసక్తి ఉంటుంది. అలాంటిది ఆ సమయంలో మానసిక ఆందోళన వల్ల నాకు తీవ్రమైన హెయిర్ సంబంధిత సమస్య వచ్చింది. దానివల్ల నా జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉండేది. నేను సాయి దివ్యపూజ చేసినా, ఏదైనా సమర్పిస్తానని మ్రొక్కుకున్నా, సప్తాహపారాయణ చేస్తానని అనుకున్నా, బ్లాగులో పంచుకుంటానని చెప్పుకున్నా బాబా నా కోరికలు ఎప్పుడూ నెరవేర్చారు. అలాగే, మనం మొక్కుకోకపోయినా, పూజలు చేయకపోయినా కూడా బాబా మన మనసులో ఉన్న కోరికలను తీరుస్తారు. అవి చిన్నవైనా, పెద్దవైనా తప్పక అనుగ్రహిస్తారు. అందువల్ల నేను నా జుట్టు విషయంగా బాబాకి ప్రత్యేకంగా ఏమీ చేయలేదు, అడగనూ లేదు. పైగా, 'అలాంటి విషయం కోసం బాబాను ఎలా పూజించాలి?' అని అనుకునేదాన్ని. మనసులో మాత్రం 'ఆ సమస్య పరిష్కారమైతే బాగుండు' అనిపించేది. అయినా నాకు ఏది కావాలన్నా బాబా చూసుకుంటారనే నమ్మకంతో ఆయన నా జీవితాన్ని మార్చేస్తారని ఇలాంటివి పట్టించుకునేదాన్ని కాదు. ఎందుకంటే, నేను ఎప్పుడైతే బాబా చెప్పినట్లు ఇతరులకు సహాయం చేయడం మొదలుపెట్టానో అప్పటినుండి నాకు కూడా ఏదో ఒక రూపంలో సహాయం అందుతూ ఉంది. ఈ హెయిర్ ఫాల్ విషయంలో కూడా అదే నిజమైంది. ఒకరోజు నేను అనుకోకుండా 'గోదావరి వంటలు' అనే ఒక యూట్యూబ్ ఛానల్ చూశాను. అందులో హెయిర్ ఆయిల్ గురించి చెప్పిన విషయాలు ముందు నమ్మాలని అనిపించకపోయినప్పటికీ తర్వాత వాళ్ళు చెప్పేది చాలా జెన్యూన్‌గా అనిపించింది. ఇంకా వాళ్ళు ఇతరులకి చేసే సహాయం నచ్చి ఆ హెర్బల్ ఆయిల్ ఉపయోగించాను. దాంతో నా హెయిర్ ఫాల్ సమస్య సమసిపోయి మునుపటిలా నా జట్టు చాలా బాగుంది. ఇదంతా కేవలం బాబా ఆశీస్సులతోనే సాధ్యమైంది. ఆయన గురించి నేను ఏం చెప్పను? ఆయన మనల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రేమకు ఇంకో పేరు ఉంటే అది బాబా. ప్రేమకు మరోరూపం బాబా. "థాంక్యూ సో మచ్ సాయీ. ఎప్పటికీ ఇలానే మా మీద ప్రేమ చూపించు తండ్రీ. మేము కూడా మరింత ప్రేమను మీ మీద చూపించేలా ఆశీర్వదించు బాబా".


ఆటంకాలు లేకుండా పెళ్లి జరిపించిన సాయి


ముందుగా సాయిబంధువులకు హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక చిన్న సాయిసేవకుడిని. 2022, ఆగస్టు 20న జరిగిన మా కుమారుడు హనీష్ వివాహ విషయంలో బాబాను ప్రార్థించి భారమంతా ఆయనకే అప్పగించి దృఢవిశ్వాసంతో సాయినామస్మరణ చేసుకున్నాము. ఆ చల్లని తండ్రి అన్నీ తామై మమ్మల్ని ముందుకు నడిపి ఎటువంటి ఆటంకాలు లేకుండా మా అబ్బాయి పెళ్లి జరిపించారు. ఒకరోజు ఆకాశం మేఘావృతమయ్యేసరికి పెళ్లి పనులకి ఇబ్బంది కలుగుతుందని అనుకున్నాము. అప్పుడు, "బాబా! పెళ్లి కార్యక్రమాలకు వర్షం ఆటంకం కాకుండా చూడండి" అని బాబాకు పదేపదే విన్నవించుకున్నాము. ఆరోజు వర్షం పడలేదు, మరుసటిరోజు సాయంత్రం పడింది. బాబా అనుగ్రహం వల్లే పెళ్లి కార్యక్రమానికి ఆటంకం కలగలేదని మేము సంతోషించాము. ఇకపోతే, వివాహ సమయంలో సరైన నిద్ర, ఆహారం లేక కొద్దిగా నలతగా ఉంటే బాబాను వేడుకున్నాను. బాబా దయతో మా ఆరోగ్యం కుదుటపడింది. ఇలా బాబా అనుగ్రహం సంపూర్ణంగా మా కుటుంబంపై ఉన్నందుకు మేము చాలా ఆనందిస్తున్నాము. బాబా సహకారానికి సర్వదా ఋణపడివుంటాము. ఆ సాయినాథుని ఆశీస్సులు సదా అందరిపై పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను.


సదా సాయిసేవలో..

మోదడుగు శ్రీనివాసరావు, నెల్లూరు.

9849144198.


సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!



6 comments:

  1. Om sairam sai nenu anukunnadhi jarigithe na anubhavanni blog lo panchukuntanu sai om sairam 🙏

    ReplyDelete
  2. Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  4. sai baba maa husband nannu vizag velladaniki ok chepite naa anubhavanni ee bloglo panchukuntanu baba , meere maa husband manasu maarchi vizag vella daniki oppukovali swamy

    ReplyDelete
  5. Baba me daya valana Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house problem solve cheyandi pl na health bagu cheyandi pl

    ReplyDelete
  6. Om sri sairam 🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo