సాయి వచనం:-
'నా భక్తులు నన్నెట్లు బావిస్తారో, నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను.'

'సద్గురు కృప ఉంటే ఆ సద్గురు సాన్నిధ్యంలో ఉండి సాధన చేసుకోవాలన్న తలంపు నెరవేరుతుంది' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 780వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా అనుగ్రహంతో పరిష్కరమైన సమస్య

  2. మనసు మార్చి అనుగ్రహించిన సాయినాథుడు
  3. సాయి స్మరణతో తగ్గిన నొప్పి

బాబా అనుగ్రహంతో పరిష్కరమైన సమస్య


సాయిభక్తుడు సత్యసాయి తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


అందరికీ నమస్కారం. నా పేరు సత్యసాయి. సాయిబాబా నాకు ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. వాటిలో చాలావరకు నాకు గుర్తులేవు. కానీ, ఈ బ్లాగ్ ద్వారా పంచుకున్న అనుభవాలు మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని ఇచ్చాయి. అంతేకాదు, ఈ బ్లాగ్ ద్వారా నేను బాబాకు విన్నవించుకున్న సమస్యలను అవి ప్రచురితమైన కొన్నిరోజులలోపే బాబా  పరిష్కరించటం నాకెంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తోంది. నాకు ఈ బ్లాగుని పరిచయం చేసిన అక్క రేవతికి మరియు ఈ బ్లాగ్ నిర్వాహకులకు సాయిబాబా అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.


ఇంతకుముందు నేను ఈ బ్లాగులో పంచుకున్న చివరి అనుభవంలో నా ఉద్యోగం గురించి రాస్తూ, మా అమ్మగారి సమస్యను ఈ బ్లాగ్ ద్వారా సాయిబాబాకు విన్నవించుకున్నాను. ఆశ్చర్యంగా, ఆ అనుభవం బ్లాగులో ప్రచురితమైన రెండు రోజులలో బాబా ఆ సమస్యను పరిష్కరించారు. అది ఎలా జరిగిందో ఇప్పుడు వివరిస్తాను. మా అమ్మగారు ఒక ఆర్గనైజేషన్‌లో పనిచేసి 2020, ఆగస్టులో పదవీవిరమణ చేశారు. పదవీవిరమణ తరువాత తనకు రావలసిన డబ్బుల కోసం 2021, మార్చి వరకు మేము ఎన్నిసార్లు వాళ్ల ఆఫీసు చుట్టూ, బ్యాంకు చుట్టూ తిరిగినదీ మాకే తెలియదు. మేము వాళ్ల ఆఫీసుకు వెళ్ళిన మొదట్లో, ‘త్వరలోనే డబ్బులు అందుతాయ’ని చెబుతూ డబ్బులివ్వడం వాయిదా వేస్తూ వచ్చారు. కానీ అసలు సమస్య డిసెంబరులో మొదలైంది. డిసెంబరు నుంచి, “మీ డబ్బులు మీకు రావు, మీ రిక్వెస్టుని మేమే క్యాన్సిల్ చేశాము” అంటూ వాళ్లు మమ్మల్ని భయపెట్టడం మొదలుపెట్టారు. దాంతో నేను, నాన్న కలిసి పైఅధికారుల వద్దకు వెళ్దామని నిర్ణయించుకున్నాము. కానీ అమ్మ బాబాను మాత్రమే నమ్ముకొని, మమ్మల్ని వెళ్ళకుండా ఆపేది.


అదే సమయంలో, నేను ఇంకో ఆర్గనైజేషన్‌కి మారుదామనే ఆలోచనతో నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఇంట్లో మొత్తం అలజడి. అటువంటి సమయంలో, ఫిబ్రవరిలో ఒకానొక గురువారంనాడు బాబా గుడికి వెళ్ళి, బాబాను దర్శించుకుని, మా సమస్యను విన్నవించుకుని, తరువాత అమ్మావాళ్ల ఆఫీసుకి వెళ్ళాం. అక్కడ క్రొత్త అధికారి రావడంతో ఆమెను కలిశాము. అప్పుడే తెలిసింది, ‘వాళ్లు ఇప్పటివరకు అమ్మ ఫైల్‌ను పైఅధికారులకు పంపలేదు’ అని. ఆ తరువాత ఆమెకి అన్ని రిపోర్ట్స్ & పర్టిక్యులర్స్ ఇచ్చాము. వాటిని పరిశీలించిన తరువాత ఆమె మాతో, “ఇకపై మీరు ఈ డబ్బు కోసం ఆఫీసుకి రావద్దు, వెంటనే ఆ డబ్బును బ్యాంకులో జమచేస్తాము, మీరు బ్యాంకులో చెక్ చేసుకోండి” అన్నారు. ఆమె మాటలు విని ‘బాబానే ఆ క్రొత్త అధికారి రూపంలో వచ్చార’ని అనుకున్నాం. అయితే ఈ సంఘటన జరిగిన నెలరోజుల వరకు బ్యాంకులో డబ్బు జమకాలేదు. ఆ తరువాత ఈ బ్లాగ్ ద్వారా సమస్యను బాబాకు విన్నవించుకున్నాను. బాబా అనుగ్రహం వల్ల ఆ అనుభవం ప్రచురితమైన కొద్దిరోజులలోనే ఆ డబ్బులు మొత్తం మాకు వచ్చాయి. “ధన్యవాదాలు బాబా!”


నేను నా మొదటి అనుభవంలో చెప్పినట్టు, బాబా మనకేదైనా ఇవ్వదలిస్తే ముందుగా దానిని స్వీకరించేందుకు మనల్ని సిద్ధం చేసి (ఇదే మనకు పరీక్షా సమయం) అప్పుడు ఇస్తారు.


గత 7,8 సంవత్సరాలుగా అమ్మకి మోకాళ్లనొప్పుల సమస్య ఉంది. మోకాళ్ళనొప్పులు తగ్గడానికి ఆమె వాడని మందులు లేవు. అయినా ఆ సమస్య తగ్గలేదు సరికదా పెరుగుతూనే వచ్చింది. ఒకరోజు మా మేనకోడలు అమ్మతో, “అన్ని క్రీములు రాయకుండా బాబా ఊదీ రాయమ”ని చెప్పింది. చిన్నపిల్లలు దేవునితో సమానం అంటారు. అందుకే అమ్మ కూడా ప్రతిరోజూ బాబా ఊదీని నీటిలో కలిపి మోకాళ్లకి రాయడం ప్రారంభించింది. ‘ఊదీ మహిమ వల్ల మోకాళ్ళనొప్పుల నుండి కొంచెం ఉపశమనం వచ్చింది’ అంటోంది అమ్మ. బాబా దయవల్ల ఈ బాధ నుంచి పూర్తిగా ఉపశమనం కలిగాక పూర్తి వివరాలతో ఆ అనుభవాన్ని మీతో పంచుకుంటానని తెలియజేస్తూ.. సెలవు.


మనసు మార్చి అనుగ్రహించిన సాయినాథుడు


సాయిభక్తురాలు శ్రీమతి సునీత తనకు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి


ముందుగా ఈ బ్లాగ్ నిర్వాహకులకు, సాయిభక్తులందరికీ నా ధన్యవాదములు. నా పేరు సునీత. అందరినీ చల్లగా చూసుకొనేది మన తండ్రి సాయినాథుడే. ఆయన నాకు ప్రసాదించిన ఐదు అనుభవాలను ఇదివరకు నేను మీతో పంచుకున్నాను. ఇది నా ఆరవ అనుభవం. 2021, ఉగాది పండుగకు ముందు జరిగిన అనుభవమిది.


మా పెద్దబాబు వేరే ఊరిలో ఉండి చదువుకుంటున్నాడు. తను జనవరిలో ఇంటికి వచ్చి వెళ్ళాడు, మరలా ఈ మధ్యలో ఇంటికి రాలేదు. అందువలన ఒకరోజు తను ఫోన్ చేసి, "అమ్మా! ఇంటికి వస్తాను. అందరినీ చూసి చాలా రోజులైంది" అని చెప్పాడు. ఆ విషయాన్ని నేను మావారికి చెప్పాను. అప్పుడు మావారు, "నేను వెళ్లి చూసి వస్తానులే, ఇప్పుడేం రావద్దు" అని అన్నారు. నేను, బాబు ఇద్దరమూ చాలా బాధపడ్డాము. నేను బాబాకు నమస్కరించుకుని, "మావారి మనసు మార్చి, బాబు ఇంటికి వచ్చేలా చేయమ"ని వేడుకున్నాను. ఆ తరువాత నా స్నేహితురాలు మావారిని ఒప్పించడానికి చాలా ప్రయత్నించింది. నేను కూడా, "మీరు అక్కడికి వెళ్తే మీరొక్కరే బాబుని చూసి వస్తారు. అదే బాబు ఇంటికి వస్తే మనందరం చూస్తాము కదా!" అని అడిగాను. కానీ మావారు మేము చెప్పేవి వినిపించుకోకుండా తనకి, మా చిన్నబాబుకి రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. తెల్లవారితే వాళ్ళు బయలుదేరి వెళ్తారనగా బాబా అద్భుతం చేశారు. మావారు మా పెద్దబాబుకి ఫోన్ చేసి, "నువ్వు ఇంటికి రా. ఈరోజే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకో" అని చెప్పారు. దాంతో అప్పటికప్పుడు మా బాబు టికెట్ బుక్ చేసుకున్నాడు. మావారు తాను బుక్ చేసిన టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నారు. బాబా చేసిన సహాయానికి మేమెంతో ఆశ్చర్యానందాలకు లోనయ్యాము. మనం మంచి మనసుతో ప్రేమగా కోరుకుంటే బాబా ఏదైనా తీరుస్తారు. "ధన్యవాదాలు బాబా. బాబు పరీక్ష బాగా వ్రాసేలా ఆశీర్వదించండి బాబా. పరీక్ష అయిపోగానే శిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకుంటాము. అమ్మానాన్నల ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళు తొందరగా కోలుకునేలా ఆశీర్వదించండి బాబా. ఈ కరోనా నుంచి అందరినీ కాపాడండి బాబా".


సాయి స్మరణతో తగ్గిన నొప్పి


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:


సాయిబంధువులందరికీ నా నమస్కారం. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఇదివరకు మీతో పంచుకున్నాను. ఇప్పుడు బాబాకు ఇచ్చిన మాట ప్రకారం మరో అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. 2021, ఏప్రిల్ నెలలో ఒకరోజు అర్థరాత్రి హఠాత్తుగా నా కుడికాలు విపరీతంగా నొప్పి పెట్టింది. ఆ బాధను భరించలేక నేను వెంటనే నిద్రలేచి కూర్చున్నాను. నొప్పి రాను రానూ పెరగసాగింది. హఠాత్తుగా నొప్పి ఎందుకు వచ్చిందో, ఆ నొప్పి తగ్గటానికి ఏమి చేయాలో తోచక నేను చాలా కంగారుపడ్డాను. వెంటనే బాబాను తలచుకొని, "నొప్పి తగ్గేలా చూడండి బాబా. మీ దయవలన నొప్పి తగ్గితే, మీ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను" అని అనుకున్నాను. తరువాత బాబా నామస్మరణ చేసుకుంటూ మళ్ళీ నిద్రపోవడానికి ప్రయత్నించాను. కాసేపటికి మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. ఉదయం లేచేసరికి నొప్పి ఏ మాత్రమూ లేదు, పూర్తిగా తగ్గిపోయింది. ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఈ అనుభవాన్ని ఆలస్యంగా పంచుకుంటున్నందుకు క్షమించండి బాబా."


ఓం శ్రీ సాయి రక్షక శరణం.



10 comments:

  1. Om Sai ram 🙌🌹🙏🏽🙏🏽🙏🏽👏❤️

    ReplyDelete
  2. Om Sai ram please bless my family.be with us.keep your hand on our head.Om Sai ma.

    ReplyDelete
  3. Kothakonda SrinivasMay 20, 2021 at 9:45 AM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  4. ఓంసాయి శ్రీసాయి జయజయసాయి

    ReplyDelete
  5. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  6. 🌼🏵🌷Om sai ram🏵🌼🌷

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo