సాయి వచనం:-
'ఈ విశాలవిశ్వంలో మీరు ఎక్కడున్నా నేను మీతోనే ఉంటాను. మీ హృదయమే నా నివాసం. మీరు సప్తసముద్రాలకు ఆవల ఉన్నా నా అనుగ్రహదృష్టి మీ మీదనే ఉంటుంది.'

'బాబా తలచుకొంటే మనమెక్కడున్నా సమాధానమివ్వగలరు' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1262వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సర్వస్యశరణాగతి వేడితే, అన్నీ అనుకూలంగా మార్చి ఆనందాన్నిస్తారు బాబా
2. ఇల్లు విడిచి వెళ్ళిన పెద్దాయన్ని తిరిగి ఇల్లు చేర్చిన బాబా
3. బాబా దయవుంటే ఏదైనా సాధ్యమే

సర్వస్యశరణాగతి వేడితే, అన్నీ అనుకూలంగా మార్చి ఆనందాన్నిస్తారు బాబా


సాయిభక్తులకు నమస్సులు. నా పేరు మణి. నేనొక ఉపాధ్యాయురాలిని. సాయికృపతో నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయని చెప్పడానికి నేను ఆనందిస్తూ ఒక రెండు అనుభవాలు ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. నా ప్రాణస్నేహితుని కుమారుని మానసిక ఎదుగుదల కాస్త వెనుకబడి ఉన్నందున ఆ అబ్బాయి తల్లిదండ్రులు తమ బిడ్డ పదవ తరగతి ప్రధాన పరీక్షలు వ్రాస్తే పాస్ అవడేమోనని చాలా బాధపడుతూ, ఆ బాధను వారిరువురు నాతో చెప్పుకుంటుండేవాళ్లు. 2020-21 సంవత్సరంలో ఒకరోజు నేను ఆ అబ్బాయిని, వాళ్ల అమ్మను మా ఇంటికి పిలిచి, మా పూజగదిలో బాబా విగ్రహం ముందు ఆ అబ్బాయికి బాబా ఊదీ పెట్టి, బాబాను తీవ్రంగా ప్రార్థించాను. తరువాత వాళ్ళకి బాబా లీలలు ఎన్నో చెప్పాను. ఇంకా ఒక ఫ్రెండ్‍లా ఆ అబ్బాయితో ఊరట కలిగేలా నాలుగు మాటలు చెప్పి, తన తల్లిదండ్రులతో నమ్మకంతో ఓపికగా ఉండమని చెప్పాను. బాబాని మనస్ఫూర్తిగా అడిగితే జరగనిదంటూ ఉండదు కదా! కరోనా కారణంగా ఆ సంవత్సరం పరీక్షలు లేకుండానే అందరినీ పాస్ చేశారు. అది బాబా చేసిన ఒక అద్భుతం! మా ఆనందానికి అవధులు లేవు. 2022లో ఆ అబ్బాయి ఇంటర్ 73%తో పాస్ అయ్యాడని తెలిసి సంతోషంతో సాయికి మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎల్లప్పుడూ ఆ అబ్బాయికి రక్షగా ఉండమని మనస్పూర్తిగా బాబాను వేడుకుంటున్నాను. 


2009లో నా వెన్నుపూసకు సర్జరీ అయింది. సాయి దయతో నేను అప్పుడు ప్రాణహాని జరగకుండా తప్పించుకున్నాను. తర్వాత ఈ మధ్యకాలంలో అంటే 2022లో నేను నడుమునొప్పి, మెడనొప్పి మరియు చెయ్యినొప్పితో విపరీతంగా బాధపడ్డాను. ఒక్కోసారి ఆ బాధ తట్టుకోలేక 'ఇక జీవితం చాలు' అనిపిస్తుండేది. అటువంటి సమయంలో ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతూ, 'ఈ నొప్పులు 2022, గురుపౌర్ణమి నాటికి తగ్గితే, నేను కూడా నా అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాల'ని అనుకున్నాను. గురుపౌర్ణమికి రెండురోజుల ముందు నొప్పి భరించలేక హైదరాబాద్‍లోని హాస్పిటల్‍కి వెళ్లాలని అనుకొని జులై 12, అంటే గురుపౌర్ణమి ముందురోజు మధ్యాహ్నం బాబా ఊదీ రాసుకుని ఆయన విగ్రహం ముందు కన్నీటితో, "నొప్పులు తగ్గించమ"ని బాబాను వేడుకున్నాను. అంతే, చాలా విచిత్రంగా నొప్పి తగ్గుతున్నట్టుగా నా మనస్సుకి ఏదో తెలియని అనుభూతి కలిగింది. అంతేకాదు, నొప్పి పూర్తిగా తగ్గిపోయింది కూడా. శ్రద్ధ, సబూరీలతో అన్ని సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుందని సాయి ఋజువు చేశారు. మరుసటిరోజు గురుపౌర్ణమినాడు మేము ఎప్పటిలాగే గుడికి వెళ్ళి, సాయికి అభిషేకం చేసుకున్నాము. వరంగల్ శ్రీభద్రకాళిమాత సాయిమందిరంలో అయ్యగారు, "మీరు పిలిస్తే సాయి లేచి వస్తారు" అని అన్న మాట నా మనసుకి ఎంతో ఆనందం కలిగించింది. ఎంత అదృష్టమో అనిపించి ఆనందంతో నా కళ్లలో నీళ్లు తిరిగాయి. నేను గురుపౌర్ణమినాడు మూడు సాయిమందిరాలలో అభిషేకం, పల్లకీ సేవ, అన్నదానాలలో పాల్గొని ఆనందంగా ఇంటికి చేరి ఈ అనుభవాన్ని బ్లాగుకి పంపాను. సాయిని సర్వస్యశరణాగతి వేడితే, ఆయన అన్నీ మనకు అనుకూలంగా మార్చి ఆనందాన్ని ఇస్తారు. మనలోనేకాక అందరి హృదయాల్లో కొలువై ఉన్న సాయికి జయమగుగాక!


ఇల్లు విడిచి వెళ్ళిన పెద్దాయన్ని తిరిగి ఇల్లు చేర్చిన బాబా


ముందుగా సాయిబంధువులకు నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. బాబా నాకు చాలా విషయాలలో సహాయం చేశారు. మా చుట్టాల్లో ఒక పెద్దాయన తన తమ్మునికి కొంచెం ఆస్తి ఇచ్చి, వారి వద్ద నుండి వడ్డీ తీసుకుని జీవనం సాగిస్తుండేవాడు. కొన్నేళ్ళ తర్వాత తమ్ముడు డబ్బులు ఇవ్వడం మానేశాడు. దాంతో వీళ్ళకి ఇల్లు గడవడం కొంచెం కష్టమైంది. 'నేను సంపాదించి ఇంటి అవసరాలు చూసుకుంటాన'ని కూతురు చెప్పినా ఆ పెద్దాయన వినిపించుకోలేదు. ఆయన మనసుకు చాలా కష్టమై ఇల్లు విడిచి వెళ్లిపోయారు. నాకు ఈ విషయం తెలిసి, "బాబా! ఆ పెద్దాయనని తిరిగి ఇంటికి తీసుకొని రండి" అని బాబాని వేడుకున్నాను. ఆ పెద్దాయన పాపం ఎక్కడెక్కడో తిరిగి చివరికి శిరిడీ చేరుకున్నారు. అక్కడ ఆయన ఆర్యవైశ్య సత్రానికి వెళ్లి పని అడిగితే, వాళ్ళు ఈయన్ని ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ అడిగారు. అందుకు ఈయన వాటిని రైలులో పోగొట్టుకున్నానని చెప్పారు. కానీ వాళ్ళకు ఏదో అనుమానం వచ్చి, ఏదైనా ఫోన్ నెంబర్ ఇమ్మని అడిగారు. ఈయన పొరపాటున తన భార్య నెంబరు ఇచ్చారు. ఆ సత్రంవాళ్ళు ఆయన భార్యకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆవిడ, "మీరు ఆయన్ని అక్కడే ఉండేలా చేయండి. మేము ఇప్పుడే బయలుదేరి వస్తామ"ని చెప్పింది. వెంటనే ఆవిడ, ఆ పెద్దాయన తమ్ముడు, తండ్రి ముగ్గురూ కలిసి శిరిడీ వెళ్లి ఆయన్ని తీసుకుని వచ్చారు. అలా బాబా దయవల్ల ఆ పెద్దాయన ఇంటికి చేరుకున్నారు. "ధన్యవాదాలు బాబా".


బాబా దయవుంటే ఏదైనా సాధ్యమే


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

సద్గురు శ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ కీ జై!!!


నేను సాయిభక్తురాలిని. నా ప్రతి విషయంలో బాబా, గురువుగారు(శరత్‌బాబూజీ) తోడుగా ఉంటారు. నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే వారిరువురే కారణం. ఒక్కోసారి అనుకున్న పని ఎలా జరుగుతుందా అని టెన్షన్ పడతాను. కానీ బాబా దయవల్ల ఆ పని ఎంతో బాగా, సుళువుగా జరిగిపోతుంది. మావారు ఒక బిజినెస్ చేస్తున్నారు. ఆ బిజినెస్‍లో పని నిమిత్తం మనిషి అవసరం. అందువలన మా చుట్టాలబ్బాయి మా దగ్గర ఉంటున్నాడు. ఒకసారి తను ఏదో పని ఉందని ఊరు వెళ్లి, 'నేను ఇంక రాను' అన్నాడు. తను రాకపోతే ఇక్కడ పని ఆగిపోయే పరిస్థితి. అంతలో నేను ఈ బ్లాగులో తోటి భక్తులు పంచుకునే అనుభవాలు చూసి, "బాబా! ఆ అబ్బాయి తిరిగి వచ్చేలా చేయండి" అని అనుకున్నాను. అంతే, నాలుగో రోజుకి ఆ అబ్బాయి తిరిగి వచ్చాడు. మాకు ఎంతో సంతోషమేసింది. ఇలా బాబా దయవల్లే మా ఆయన బిజినెస్, పిల్లల చదువులు అన్నీ బాగున్నాయి. ఒకప్పుడు నాకు శ్రీఅరుణాచలం గిరిప్రదక్షిణ చేయాలని కోరిక ఉండేది. కానీ అంత దూరం నడవలేనని భయపడ్డాను. అయితే బాబా అనుగ్రహం వల్ల నా కోరిక నెరవేరింది. పిల్లలు కూడా ఆ గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. అంతా బాబా దయ. "ధన్యవాదాలు బాబా. ఎల్లవేళలా మాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను బాబా, గురువుగారూ".


5 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  3. Eapcet web options lo seat ravali thadri.please baba

    ReplyDelete
  4. సమర్ధ sadgru sai nath maharaj ki jai🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo