సాయి వచనం:-
'నన్ను ప్రేమతో పిలుచువారి వద్దకు నేను పరుగెత్తిపోయి ప్రత్యక్షమవుతాను. నా భక్తుల నుండి నేను కోరుకునేది హృదయపూర్వకమైన ప్రేమ మాత్రమే!'

'సాయిపథం అంటే - శ్రీసాయిబాబా చూపిన మార్గం, బాబా నడిచిన బాట, 'సాయి' అనే గమ్యానికి రహదారి. ఏ ఒక్క మతసాంప్రదాయానికీ చెందక, ప్రపంచంలోని అందరు మహాత్ములు ఆచరించి బోధించిన విశ్వజనీన ఆధ్యాత్మిక సాంప్రదాయమే ఈ సాయిమార్గం. మరో మాటలో, సాయిపథం అంటే సద్గురు పథం' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1250వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అడిగినవన్నీ అనుగ్రహించే బాబా
2. ప్రేమతో వీసా - శిరిడీ దర్శనం అనుగ్రహించిన బాబా 
3. బాబా దయతో తగ్గిన ఎక్కిళ్ళు, చేయినొప్పి

అడిగినవన్నీ అనుగ్రహించే బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా సాయితండ్రికి నా శతకోటి వందనాలు. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న సాయికి, సాయి భక్తులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. బాబా ఎల్లప్పుడూ మా కుటుంబాన్ని కాపాడుతూ వస్తున్నారు. ఆయన ఆశీర్వాదం ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. చాలా ఆలస్యంగా నా అనుభవాలను పంచుకుంటున్నందుకు బాబాను క్షమించమని వేడుకుంటూ నేను మొదటిసారి నా అనుభవాలు పంచుకుంటున్నాను. ఒకసారి నాకు గ్యాస్ట్రిక్ సమస్య, అల్సర్ వచ్చి పెద్ద పేగుకి చిన్నచిన్న కురుపులు అయ్యాయి. డాక్టరు టెస్టు చేసి బయాప్సీకి పంపించారు. నాకు చాలా భయమేసి, "బాబా! రిపోర్టు నార్మల్ వస్తే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో నా అనుభవం పంచుకుంటూను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. నేను కోరుకున్నట్లే రిపోర్టు నార్మల్ వచ్చింది. అంతా బాబా దయ. "ధన్యవాదాలు బాబా. మీ దయవలన అల్సర్ పూర్తిగా తగ్గుతుందనే నమ్మకంతో ఉన్నాను తండ్రి".


నాకు అప్పుడప్పుడు మెడనొప్పి వస్తుండేది. నేను బాబా ఊదీ పెట్టుకుని, కొద్దిగా ఊదీ నీళ్ళల్లో కలుపుకుని త్రాగుతూ, "బాబా! మీ దయతో మెడనొప్పి తగ్గితే, బ్లాగులో నా అనుభవం పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవలన నాకు మెడనొప్పి తగ్గిపోయింది. కానీ చాలారోజుల తరువాత ఈమధ్య మళ్ళీ మెడనొప్పి వస్తుంది. ఊదీ పెట్టుకుంటే తగ్గుతుంది. అప్పుడు నాకు నా అనుభవం బ్లాగులో పంచుకోవడం ఆలస్యం చేసినందు వల్లే  మెడనొప్పి మళ్ళీ వస్తుందనిపించి వెంటనే నా అనుభవాన్ని ఇలా మీతో పంచుకున్నాను. "నన్ను క్షమించండి బాబా".


మా అమ్మాయి ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతుంది. ప్లేస్‍మెంట్స్ లో తనకి ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చింది. తను మూడునెలలు ఇంట్లో నుండి ఇంటర్న్ షిప్ చేసిన తరువాత కంపెనీవాళ్ళు తనని కంపెనీకి రమ్మన్నారు. కానీ తను కంపెనీకి వెళితే, ఆఖరి సంవత్సరం చదువుతున్న తనకి చదువుకోవడానికి ఎక్కువ సమయం ఉండదని నేను బాబాను, "బాబా! అమ్మాయికి పరీక్షలు అయ్యేంతవరకు ఇంట్లో నుండే వర్క్ చేసేలా అనుగ్రహించండి" అని బాబాను ప్రార్ధించాను. మూడు రోజుల్లో కంపెనీవాళ్ళు ఫోన్ చేసి, మా అమ్మాయిని వేరే టీమ్లోకి మార్చమని చెప్పారు. ఆ టీమ్ మేనేజరు, 'ఇప్పుడే మా అమ్మాయిని కంపెనీకి రావద్దని, వేరే వాళ్ళు వస్తున్నారు' అని చెప్పారు. నాకు చాలా సంతోషమేసింది. "బాబా! మీకు వేలవేల ధన్యవాదాలు. మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. మీ అనుగ్రహం అందరిపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా నా కోరికలు కొన్ని మీ అనుగ్రహంతో నెరవేరాలి తండ్రి".


ప్రేమతో వీసా - శిరిడీ దర్శనం అనుగ్రహించిన బాబా 


శ్రీసాయినాథాయ నమః!!!

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!


ముందుగా సాయి భక్తులకు నమస్కారం. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నాపేరు లలిత. బాబా అనుగ్రహంతో నేను ఇంతకుముందు నా జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలను మీ(నా సాయి కుటుంబం)తో పంచుకున్నాను. ఇప్పుడు ఇంకొక అనుభవం పంచుకుంటున్నాను. 2022, మే 13న మా కుటుంబం శిరిడీ వెళ్ళాము. నేను, మా చిన్నబాబు మనసు తృప్తిగా హారతులకు హాజరై, దర్శనాలు చేసుకున్నాము. మే 15న మా బాబు పారాయణ హాల్లో కూర్చుని ఒక్కరోజులో సచ్చరిత్ర అంతా పారాయణ చేశాడు. ఆ సమయంలో నేను కూడా ఒకరోజు పారాయణ చేసి ఆపై దర్శనాలు, ప్రదక్షిణాలు చేసుకున్నాను. రోజంతా పారాయణ వల్ల బాబు అలసిపోయి ఆ రాత్రి నిద్రపోయాడు. మే 16, పొద్దున్న మా బాబుకి తన ఫ్రెండ్ ఫోన్ చేసి యు.ఎస్.ఏకి వీసా స్లాట్ బుక్ చేసానని చెప్పాడు. మావారు, "బాబా అనుగ్రహంతో బాబుకి వీసా వస్తే, వచ్చే నెల 16కి శిరిడీలో ఉందామ"ని అన్నారు. మావారి మాటకి నేను కూడా చాలా సంతోషంగా, "తప్పకుండా వద్దామ"ని అన్నాను. తరువాత అదేరోజు మేము హైదరాబాద్‍కి మా తిరుగు ప్రయాణమయ్యాము. బాబా దయవలన మా బాబుకి వీసా వచ్చింది. మావారు జూన్ మొదటివారంలో పిఠాపురం వెళ్లి శ్రీపాద శ్రీవల్లభస్వామి దర్శనం చేసుకుని వచ్చారు. తరువాత మావారు, "శిరిడీకి ఇప్పుడు వద్దు, తర్వాత వెళదాం" అని అన్నారు. మా బాబు తనకి వీసా స్టాంపింగ్ ఉందని, తను కూడా శిరిడీ రాలేనని అన్నాడు. నాకు మాత్రం ఎలాగైనా శిరిడీ వెళ్లాలని ఒకటే కోరికగా ఉంది. కానీ వెళ్ళడానికి తోడు ఎవరూ లేరు. ఏం చేయాలో అర్ధంకాక మా ఇంటి దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్ళాను. మనసులో శిరిడీ ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాను. అప్పుడు నా ఫ్రెండ్(సాయిబంధువు) గుడికి వచ్చింది. తను, "అక్కా! శిరిడీ వెళదామా?" అని నాతో అంది. ఆ మాటలు వింటూనే నాకు ప్రాణం లేచొచ్చినట్లు అయి వెంటనే, "సరే వెళదాము. మా బాబుని తత్కాల్ టిక్కెట్లు బుక్ చేయమంటాను" అని అన్నాను. అలా చెప్పడమైతే చెప్పానుగాని టిక్కెట్లు దొరుకుతాయో, లేదో అని బెంగపడ్డాను. కానీ బాబా దయవల్ల టిక్కెట్లు దొరికాయి. కానీ ముందురోజు రాత్రి నుండి నాకు వాంతులు అవుతూ ఏదీ తినాలని అనిపించలేదు. తిండి లేకపోవడం వల్ల నీరసంగా ఉంది. అందువలన మావారు, "ఆరోగ్యం బాగాలేదు ఈ స్థితిలో శిరిడీ వెళ్లొద్దు" అన్నారు. నేను, "బాబా దగ్గరకి అందరూ ఆరోగ్యం బాగాలేనప్పుడు వెళ్తారు. ఆయన దగ్గరకి వెళ్తే, బాబా వాళ్ళకి స్వస్థత చేకూరుస్తారు" అని అన్నాను. కానీ మావారు నా మాట వినిపించుకోలేదు. నాకు ఏం చేయాలో అర్థంకాక బాబా ముందర కూర్చుని, "బాబా! రేపటికల్లా నా ఆరోగ్యం బాగై, నేను శిరిడీకి రాగలిగితే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల మరోసటిరోజు తెల్లవారేసరికి నాకు పూర్తిగా నయమై మంచిగా తిన్నాను. ఇంకేముంది ఆనందంగా శిరిడీకి ప్రయాణమయ్యాను. అలా నేను ఏ రోజైతే శిరిడీలో ఉండాలనుకున్నానో, ఆరోజు శిరిడీలో ఉండేలా బాబా నన్ను అనుగ్రహించారు. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. భక్తులపై మీకుండే ప్రేమను మాటల్లో చెప్పలేం తండ్రి. మీ బిడ్డలందరినీ సదా చల్లగా చూసుకోండి బాబా".


బాబా దయతో తగ్గిన ఎక్కిళ్ళు, చేయినొప్పి


సాయి భక్తులందరికీ నమస్కారం. సాయినాథుడు మాకు ప్రసాదించిన అనుభవాలను పంచుకోవడానికి అనువుగా ఈ వేదికను(బ్లాగు) ఇచ్చిన అన్నయ్య ఎప్పుడూ బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఒకరోజు భోజనం చేస్తున్నప్పుడు మావారికి హఠాత్తుగా ఎక్కిళ్ళు మొదలయ్యాయి. తను కొంచం నీళ్లు త్రాగి అన్నం తినడం కంటిన్యూ చేద్దామనుకున్నారు. కానీ ఎన్ని నీళ్లు తాగినా ఎక్కిళ్ళు తగ్గలేదు సరికదా, ఇంకా బిగ్గరగా రాసాగాయి. మామూలుగా వచ్చే ఎక్కిళ్ల కంటే రెండు, మూడు రెట్లు అధికంగా రావడం వల్ల నాకు చాలా భయమేసింది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే, "బాబా! మావారికి ఎక్కిళ్ళు తగ్గితే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని మనసులో బాబాకి చెప్పుకున్నాను. అలా బాబాకి చెప్పుకున్న ఐదు నిమిషాల్లో మావారు నార్మల్ అయ్యారు. "థాంక్యూ సో మచ్ బాబా".


ఇంకోరోజు మావారు, "నా ఎడమ చేయి నొప్పిగా ఉంది. కొంచెం అసౌకర్యంగా ఉంద"ని నాతో చెప్పారు. వెంటనే నేను బాబా ఊదీ మావారి నుదుటన పెట్టి, మరికొంత ఊదీ ఆయనకి నొప్పి ఉన్నచోట రాసి, "బాబా! మావారి చేయినొప్పి తగ్గితే బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మాటిచ్చాను. ఉదయానికల్లా చేయి నొప్పి తగ్గిపోయిందని మావారు చెప్పారు. "థాంక్యూ సో మచ్ బాబా. మీ భక్తులమైన నన్ను, నా భర్తను సదా మీ చల్లని దృష్టితో చూడండి. నా మానసిక స్థితిని సరిగా ఉంచు తండ్రి. అలాగే నాకు సద్భుద్ధిని ప్రసాదించండి తండ్రి".


8 comments:

  1. Om Sri Sai Ram 🙏🏼🙏🏼🙏🏼🌸

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. బాబా తండ్రి నా మానసిక పరిస్థితి బాగుండేలాగ ఆశీస్సులు అందించు.నా భర్త పై కోపం వస్తుంది. ఆయన చాలా మంచి వారు కొన్ని కారణాల వల్ల పట్టరాని కోపం వస్తుంది. చాలా రోజులు ఓపిగ్గా భరించాను.చెప్పి చూశాను విన లేదు. నిరాశతో జీవితాన్ని గడిపిన తర్వాత యిలా గ తయారు అయిన తర్వాత అలవాటు అయిపోయింది

    ReplyDelete
  5. A carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba

    ReplyDelete
  6. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo