సాయి వచనం:-
'నాకు రాత్రంతా నిద్రలేదు. నా పడక చుట్టూ ‘బాబా, బాబా’ అన్న ఇతడి కేకలే!'

'సద్గురు చరణాలను ఆశ్రయించి, వారిని శ్రేయోభిక్ష పెట్టమని అర్థించిన చేతులను హస్తసాముద్రికుల ముందు దేబిరిస్తూ చాచడం - మనం ఆశ్రయించిన సద్గురువును అవమానించి, కించపరచడం కాదా?' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1204వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నాతోనే వచ్చిన బాబా
2. సాయి కృపతో ఆరోగ్యం - బాబా ఇచ్చిన నిదర్శనం
3. నష్టం జరగకుండా కాపాడిన బాబా

నాతోనే వచ్చిన బాబా


సాయి బంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. 2022, ఫిబ్రవరిలో మా ఆడపడచు తన భర్త అస్థికలు కాశీలోని గంగానదిలో నిమజ్జనం చేయదలచి కుటుంబసభ్యులందరినీ కాశీకి తీసుకుని వెళ్లాలనుకుంది. మా కుటుంబసభ్యులందరూ వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఎప్పటినుండో అందరితో కలిసి ప్రయాణం చేయాలని నాకు కూడా కోరికగా ఉన్నప్పటికీ ఏదైనా అనవసరపు గొడవ అవుతుందేమోనని భయపడి వద్దులే అనుకున్నాను. ఆ విషయమై నేను, "బాబా! మీరు దగ్గరుండి తీసుకెళ్తే తప్ప నేను వెళ్లన"ని బాబాతో చెప్పుకున్నాను. తరువాత మావారితో కూడా, "నేను రాను. నాకు టికెట్లు తీసుకోకండి" అని చెప్పాను. కానీ మావారు, 'అందరూ వస్తున్నప్పుడు నేను మాత్రమెందుకు రాకూడద'ని నాకు కూడా టికెట్ తీసుకున్నారు. అయితే, "బయలుదేరే సమయం వరకు నాకు రావాలనిపించకపోతే మాత్రం నా టికెట్ క్యాన్సిల్ చేయండి" అని నేను మావారితో చెప్పాను. ఏప్రిల్ మూడో వారంలో వెళ్లాల్సి ఉండగా సమయం దగ్గర పడుతున్న కొద్ది నాకు అస్సలు వెళ్లాలనిపించలేదు. మా పిల్లలు కూడా వద్దనే చెప్పారు. కానీ మావారు బలవంతంగా నన్ను తీసుకెళ్లారు. కాశీలో ట్రైన్ దిగి ఆశ్రమానికి వెళ్తుంటే దారిలో ఓ చోట 'సాయిబాబా బుక్ స్టాల్' అని కనిపించింది. ఆ బోర్డు చూడగానే, 'బాబా నాకోసం ఇక్కడికి వచ్చార'న్న భావం నాలో కలిగి ఒక్కసారిగా నాకు ప్రాణం వచ్చినట్లు అనిపించింది. మరుసటిరోజు గంగాఘాట్‍లో స్నానానికి వెళ్ళాము. అక్కడినుండి తిరిగి వచ్చేటప్పుడు బంగారు వర్ణంలో ఉన్న పెద్ద బాబా విగ్రహం దర్శనమిచ్చింది. ఆ బాబాను అలాగే కొన్ని క్షణాలు చూస్తూ ఉండిపోయాను. తరువాత అక్కడినుండి మేము అలాహాబాద్ వెళ్ళాం. అక్కడ కూడా బాబా నాకు దర్శనమిచ్చారు. అక్కడనుండి మేము వింధ్యాచల్ వెళ్లి టైమ్ అవుతుందని చాలా వేగంగా నడుస్తూ హఠాత్తుగా తలతిప్పితే, ఒక షాపులో ఫోటో రూపంలో బాబా కనపడ్డారు. "బాబా! ఇక్కడికి కూడా వచ్చావా తండ్రి" అని అనుకున్నాను. తరువాత గయ వెళితే, అక్కడ కూడా బాబా దర్శనమిచ్చారు. చిన్న చిన్న సమస్యలు వచ్చినా బాబా దయవల్ల పెద్దగా ఇబ్బంది పడలేదు. తరువాత తిరుగు ప్రయాణమయ్యాము. ట్రైన్‍లో ఒక సంచిపై బాబా కనిపించారు. అప్పుడు 'బాబా నాతోనే వచ్చారు. నాకు తోడుగా ఉన్నార'ని అనిపించింది. "ధన్యవాదాలు బాబా. ఈ అనుభవం నేనెప్పటికీ మర్చిపోను తండ్రి". 


నేను ఈ అనుభవాన్ని బ్లాగుకి పంపుదామని ఒక పేపర్ మీద వ్రాసి కూడా పంపడం మర్చిపోయాను. తరువాత ఆ పేపర్ కనిపించలేదు. వెంటనే బాబాకి క్షమాపణలు చెప్పుకుని, "పేపరు దొరికితే, ఈ అనుభవాన్ని కూడా బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. మరుసటిరోజే పేపర్ దొరికింది. వెంటనే ఈ అనుభవాన్ని కూడా జతపరిచి బ్లాగుకి పంపాను. "బాబా! కొన్ని అత్యవసర సమస్యల నుండి నా కుటుంబాన్ని బయటపడేయి తండ్రి. మీరు ఆ సమస్యలను పరిష్కరించినంతనే తోటి భక్తులతో పంచుకుంటాను".


సాయి కృపతో ఆరోగ్యం - బాబా ఇచ్చిన నిదర్శనం


ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా సాయినాథునికి నా శతకోటి ప్రణామాలు. నా పేరు యశోద. మాది అనంతపురం. 2022, మే 11న నేను ఒక పెళ్ళికి వెళితే అక్కడ నాకు చాలా జలుబు చేసింది. జలుబుతోపాటు జ్వరం కూడా వచ్చింది. ఆ కారణంగా నేను పెళ్లి కూడా చూడలేకపోయాను. అక్కడినుండి ఇంటికి వచ్చాక కూడా జ్వరం తగ్గలేదు. తరువాత నెమ్మదిగా జ్వరం తగ్గుతుండేసరికి విరేచనాలయ్యాయి. నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే, నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను. నా వయస్సు 59 సంవత్సరాలు. ఆ రాత్రి 10 గంటల సమయంలో జ్వరం చాలా ఉంది. అలాగే విరేచనాలు కూడా ఎక్కువగా అయ్యాయి. అటువంటి స్థితిలో హాస్పిటల్‍కి వెళ్లడానికి తోడు ఎవరూ లేక చాలా భయపడి ఈ రాత్రికి టాబ్లెట్ వేసుకుని, ఉదయమే హాస్పిటల్‍కి వెళ్లి జాయిన్ అవుదామని అనుకున్నాను. తరువాత నేను నా సాయినాథుని పాదాలపై పడి, "బాబా! నువ్వు తప్ప నాకు ఎవరూ లేరయ్యా. నువ్వు తప్ప నన్ను ఎవరు చూసుకుంటారు. నువ్వే నన్ను కాపాడాలి" అని ఏడ్చాను. అప్పుడు ఎంత అద్భుతం జరిగిందో చూడండి! మా ఎదురింట్లో ఉన్న మాకు తెలిసినవాళ్ళు నా పరిస్థితి చూసి వాళ్లకు తెలిసిన ఒక డాక్టరుకు ఫోన్ చేశారు. ఆ సమయంలో డాక్టరు ఇంటికి వస్తారన్న నమ్మకం ఎంత మాత్రమూ లేదు. కానీ బాబా దయవలన ఆ డాక్టరు కూడా సాయి భక్తులైనందున మా ఇంటికి వస్తానని చెప్పారు. అయితే ఆ సమయంలో ఇంటికి రావడానికి ఎక్కువ ఫీజు తీసుకుంటానని చెప్పారు. ఆ సమయంలో డాక్టర్ రావడమే గొప్ప. కాబట్టి ఫీజు ఎక్కువైనా పర్వాలేదు రండి అని చెప్పాను. వెంటనే ఆయన ఒక నర్సుని వెంటబెట్టుకుని మా ఇంటికి వచ్చారు. ఇంజక్షన్స్ చేసి, సెలైన్ బాటిల్ ఎక్కించి ఇంటిలోనే చికిత్స చేసారు. అలా మూడు రోజుల వరకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సెలైన్ బాటిల్స్ ఎక్కించడం, ఇంజక్షన్ వేయడం ఇంటి వద్దే జరిగింది. ఇదంతా బాబా దయవల్లనే జరిగింది. కానీ నేను ఆ సమయంలో అదంతా బాబా దయతో జరిగిందని నమ్మలేదు. అందుచేత నేను ఆ రాత్రి పడుకునే ముందు, "బాబా! ఈ డాక్టరు రావడం, ట్రీట్మెంట్ చేయడం మీ కృపేనని నాకు నమ్మకం కలగాలంటే ఈ రాత్రి మీరు నాకు దర్శనం ఇవ్వండి. అప్పుడే నేను అది మీ కృప అని నమ్ముతాను, లేకపోతే ఆ డాక్టరు రాక యాధృచ్ఛికమని అనుకుంటాను" అని బాబాతో చెప్పుకుని పడుకున్నాను. ఆ రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను ఒక్కదాన్నే శిరిడీలో ఉన్నాను. ఇంకెవరూ కనపడట్లేదు. నేను ఒక్కదాన్నే రోడ్లపై పిచ్చిదానిలాగా 'బాబా బాబా' అంటూ ఏడుస్తూ తిరుగుతున్నాను. ఎటు చూసినా బాబా ఫోటోలే కనిపిస్తున్నాయి. ప్రతి ఫొటోలో 'నేను ఉండగా భయమేల?' అన్న వాక్యం ఉంది. ఇంకా బాబా ఒక చిన్న సింహాసనంపై కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తమ వేలు చూపిస్తూ, "నేను చేస్తే, నువ్వు నమ్మవా? నీ విషయంలో జరిగే ప్రతిదీ నేనే చేస్తున్నాను. ఇంకొకసారి ఇలా అనుమానిస్తే జాగ్రత్త!" అని నన్ను హెచ్చరిస్తున్నారు. తర్వాత ద్వారకమాయిలో ధుని దగ్గర బాబా నా పక్కన నిలబడి నా చేతికి కొబ్బరికాయలందిస్తూ ధునిలో వేయమని చెప్తుంటే, నేను అలాగే చేస్తున్నాను. అంతటితో కల ముగిసింది. ఆ విధంగా నేను కోరుకున్నట్లే నాకు నిదర్శనం ఇచ్చారు బాబా. ఇంతకన్నా నాకు ఏం కావాలి? బాబా దయతో నాకు జ్వరం, విరోచనాలు అన్నీ తగ్గిపోయి బాగున్నాను. అంతటి మహాద్భుతాన్ని చూపించిన సాయినాథునికి నేను ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను? శతకోటి ప్రణామాలర్పించడం తప్ప ఏమీ చేయలేని ఈ నిస్సహాయ భక్తురాలిని ఎప్పటికీ ఇలాగే కాపాడమని ప్రార్థిస్తూ... ఓం శ్రీసాయినాథాయ నమః!!!


నష్టం జరగకుండా కాపాడిన బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు రేవతి. ఒకరోజు నేను మాపాప పుట్టినరోజుకోసమని షాపింగ్ చేయడానికి వెళ్లి నాలుగైదు షాపులు తిరిగి షాపింగ్ పూర్తి చేసుకుని బయటకు వచ్చాక యధాలాపంగా నా చెవి మీద చేయి వేస్తే చెవి దుద్దులకు వెనక ఉండాల్సిన శీల లేదు. అది లేకపోయినప్పటికీ చెవిదిద్దు ఎక్కడా పడిపోలేదు. వెంటనే వాటిని తీసి నా హ్యాండ్ బ్యాగులో వేసేసాను. కానీ చాలా చిన్నదైనా ఆ శీలను ఎక్కడ వెతకాలో తెలియక, "బాబా! ఆ శీల దొరకాలని ఉంటే దొరికేలా చేయండి. లేదంటే, పెద్ద వస్తువు(దిద్దు) పోకుండా చిన్న శీల పోయేలా చేసారని అనుకుంటాను" అని బాబాకి చెప్పుకొని 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అనే మంత్రాన్ని జపించాను. ఇంటికి వచ్చాక దేవుడు గది దగ్గర నా పాదాలకు ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది. చూస్తే, అది పోయిందనుకున్న శీలనే. అంటే నేను షాపింగ్‌కి వెళ్ళకముందే ఆ శీల అక్కడ పడిపోయింది. అయినా నా చెవిదిద్దులు ఎక్కడా పడిపోకుండా, పెద్ద నష్టం జరగకుండా బాబా కాపాడారు. అదే రద్దీగా ఉండే షాపింగ్ ఏరియాలో ఆ శీల ఎక్కడ పడిపోయినా అది నాకు మళ్ళీ దొరికేది కాదు. "ధన్యవాదాలు బాబా".


ఒకసారి మా పెద్ద ఆడపడుచుకి, మా నానమ్మకి చాలా సీరియస్ అయింది. డాక్టర్ లాస్ట్ స్టేజ్ అని చెప్పేసారు. అప్పుడు నేను వాళ్ళిద్దరికోసం 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని జపించాను. బాబా దయవల్ల ఆడపడుచు కోలుకున్నారు. నానమ్మ పరిస్థితి కూడా పరవాలేదు. "ధన్యవాదాలు బాబా".


ఓం శ్రీసమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!



FacebookWhatsAppXFacebook SendGmailYahoo! MailLinkedInSMSBloggerEmailSumoMe

4 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. ఓం శ్రీ సాయి బాబా నువ్వు అన్ని రూపాలలో వున్నావు. నా కుటుంబ సభ్యులను కాపాడు.సంపూర్ణ ఆయుష్షు ప్రసాదించు.నన్ను దీర్ఘ సుమంగళిగ దీవెనలు ప్రసాదించు. సుమంగళిగ నీలో ఐక్యం చేసుకో నా కోరిక తీరేలాగ ఆశీస్సులు అందించు

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo
 
FacebookWhatsAppXFacebook SendGmailYahoo! MailLinkedInSMSBloggerEmailSumoMe