1. నమ్మకం, ఓర్పు ఉంటే బాబా మనల్ని కాపాడుతారు
2. బాబా దయతో తగ్గిన కాలినొప్పి - దొరికిన డాక్యుమెంట్
3. నా డబ్బు నాకు తిరిగి వచ్చేలా సహాయం చేసిన బాబా
నమ్మకం, ఓర్పు ఉంటే బాబా మనల్ని కాపాడుతారు
నా పేరు జ్యోతి. నా జీవితంలో ప్రతిదీ బాబా అనుగ్రహమే. 2020, డిసెంబరు నెలలో మా ఇంట్లో మనస్పర్థలు ఎక్కువై నేను చాలా బాధలో ఉన్నాను. "మనస్పర్థలన్నీ తొలగిపోయి, అంతా బాగుండాల"ని నేను రోజూ బాబాను వేడుకుంటుడేదాన్ని. సరిగా అలాంటి సమయంలో మా నాన్నకు ఆరోగ్యం దెబ్బతింది. ఆయనకు షుగర్, బిపి ఎక్కువయ్యాయి. అది కరోనా సమయమైనందున మేము చాలా భయపడ్డాము. డాక్టరుని సంప్రదిస్తే, "మూడురోజులు జాగ్రత్తగా చూసుకోవాలి" అని అన్నారు. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! నాన్న ఆరోగ్యం కుదుటపడేలా అనుగ్రహించండి" అని వేడుకుని, భారం ఆయన మీదే వేశాను. బాబా దయతో నాన్న కోలుకున్నారు. "చాలా చాలా ధన్యవాదాలు సాయీ".
2021, మే నెల రెండోవారంలో ఒకరోజు నాకు జలుబు, దగ్గులతో నీరసంగా అనిపించింది. కరోనా సమయమైనందున నాకు చాలా భయం వేసింది. అదేరోజు రాత్రి 4 గంటల సమయంలో గొంతునొప్పి కూడా మొదలయ్యింది. గొంతునొప్పి బాగా ఎక్కువగా ఉండటంతో నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు. లేచి వెళ్లి, బాబా ఊదీని నుదుటన పెట్టుకుని, కాస్త ఊదీని గొంతుకి కూడా రాసుకుని బాబాను స్మరించుకుంటూ, "తెల్లవారేసరికి గొంతునొప్పి తగ్గాలి" అని అనుకున్నాను. ఆశ్చర్యం! తెల్లవారి లేచేసరికి గొంతునొప్పి కొంచెం కూడా లేదు. బాబా అద్భుతాలు ఎన్నో, ఎన్నెన్నో లెక్కకు అందనివి. నమ్మకం, ఓర్పు ఉంటే బాబా మనల్ని కాపాడుతారు. నా అనుభవం పంచుకునే అవకాశం ఇచ్చిన బాబాకు శతకోటి వందనాలు.
బాబా దయతో తగ్గిన కాలినొప్పి - దొరికిన డాక్యుమెంట్
సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు అంజలి. బాబా లీలలను చదవడంతో నేను నా దినచర్యను ప్రారంభిస్తాను. నేనిప్పుడు 2021, మే12న బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఆరోజు ఉదయం నేను ఆఫీసుకు వెళ్ళే హడావిడిలో అన్నం తిని, ప్లేటును సింకులో పడేసి చేయి కడుక్కుందామని సింక్ దగ్గరికి వెళ్లాను. చేయి కడుక్కుని తిరిగి హాల్లోకి వస్తుండగా ఫ్రిడ్జ్ దగ్గర బండల మీద పడివున్న నీళ్ళను చూసుకోకుండా అడుగువేశాను. అంతే, నా కుడికాలు జారి, మరలబడి, మనిషిని మొత్తం అమాంతంగా క్రిందపడిపోయాను. అసలు ఏం జరిగిందో క్షణకాలంపాటు నాకు అర్థం కాలేదు. ఇద్దరు పట్టుకుని లేపితేగానీ లేవలేకపోయాను. కుడికాలితో నడవడానికి అస్సలు వీలుకాలేదు. దాంతో, కాలికి ఏమైందోనని నాకు చాలా భయం వేసింది. వెంటనే బాబా ఊదీని కాళ్లకు రాసుకుని, "ఎలాగైనా కాలినొప్పి తగ్గించి, మామూలుగా నడిచేలా చేయమ"ని బాబాను శరణువేడాను. అది కరోనా సమయమైనందున మేముండే చోట ఉదయం 6 నుండి 10 వరకు మాత్రమే అన్నీ తెరచి ఉంటాయి. ఆపై పూర్తి లాక్‌డౌన్. కనీసం హాస్పిటల్‌కి వెళ్లే పరిస్థితి కూడా లేదు. అందుచేత, "బాబా! నన్ను నువ్వే కాపాడాలి. నువ్వే నాకు దిక్కు నాయనా" అని కన్నీళ్లతో బాబాను ప్రార్థించి, దయగల తండ్రి నన్ను తప్పక కాపాడతాడని ఆయనపై నమ్మకముంచాను. తర్వాత అమ్మ దగ్గర పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఉంటే వేసుకున్నాను. మళ్ళీ బాబా ఊదీని కాలికి రాసుకున్నాను. అంతే, బాబా చేసిన అద్భుతాన్ని చూడండి! ఆ సాయంత్రానికల్లా నొప్పి చాలావరకు తగ్గి నేను నడవగలిగాను. అంతా బాబా దయ. హాస్పిటల్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా నా సాయితండ్రి నన్ను కాపాడారు. కొద్దిగా నొప్పి ఉన్నప్పటికీ బాబా దయవల్ల తొందరలోనే అది కూడా తగ్గిపోయింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
మరుసటిరోజు నేను యథావిధిగా ఆఫీసుకి వెళ్ళాను. అక్కడ ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ కనబడలేదు. దాంతో నాకు చాలా టెన్షన్‌గా అనిపించింది. 'అసలే క్రొత్త ఆఫీసు, ఏమంటారోన'ని చాలా భయపడ్డాను. అప్పుడు నేను, "బాబా! ఆ డాక్యుమెంట్ కనపడేలా చూడండి" అని బాబాకు చెప్పుకున్నాను. కొద్దిసేపట్లోనే ఆ డాక్యుమెంట్ కనిపించింది. అది కనిపించకపోయుంటే చాలా సమస్య అయ్యేది. అంతా బాబా దయ. "థాంక్యూ బాబా! ఎప్పుడూ ఇలాగే నన్ను, నా కుటుంబాన్ని, అలాగే అందరినీ కాపాడండి".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!
డబ్బు తిరిగి వచ్చేలా సహాయం చేసిన బాబా
ఓం శ్రీ సాయినాథాయ నమః.
ఓం సద్గురువే నమః.
సాయిబంధువులకు నా నమస్కారాలు. నేను గత ఐదు సంవత్సరాలుగా సాయిబాబా భక్తుడిని. 2021, మే 13న సాయినాథుడు నాకు చేసిన సహాయం గురించి మీతో పంచుకుంటాను.
నేను ఒక ఊరిలో కొంత పొలాన్ని కొనాలని ఒక దళారి ద్వారా ఒక పొలాన్ని చూశాను. ఆ పొలం రోడ్డుకు ఆనుకుని బాగానే ఉంది. అది నాకు బాగా నచ్చింది. దాని యజమాని హైదరాబాదులో ఉంటారు. దళారి నాతో, "పొలం తాలూకు పేపర్లన్నీ క్లియర్‌గా ఉన్నాయి. నేను దగ్గరుండి మీకు అన్నీ ఇప్పిస్తాను" అని చెప్పాడు. నేను అతని మాటలు నమ్మి, ఆ పొలం యజమానిని కలవడానికి వెళ్లాను. యజమాని ఎకరానికి నాలుగు లక్షల 80 వేల రూపాయలకు ఒక్క పైసా కూడా తగ్గలేదు. నాకు ఆ పొలం బాగా నచ్చినందున అతను చెప్పినదానికి ఒప్పుకుని అడ్వాన్సుగా 50 వేల రూపాయలు ఇచ్చి, పొలానికి సంబంధించిన పేపర్లు అడిగాను. అందుకు ఆ యజమాని, "25% డబ్బులిచ్చి అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఇస్తాన"ని అన్నాడు. "మీరు పేపర్లు ఇస్తేనే నేను లీగల్ ఒపీనియన్ తీసుకోవడానికి వీలుంటుంది" అని గట్టిగా అడిగాను. అందుకతను ఒప్పుకుని కేవలం భూమి పట్టా, పాస్ బుక్ మరియు రిజిస్ట్రేషన్ పేపర్లు మాత్రం ఇచ్చాడు. నేను వాటిని తీసుకుని అడ్వకేట్ దగ్గరికి వెళ్లాను. అడ్వకేట్ అవి చూసి, "ఈ పేపర్లు సరిపోవు. ఇంకా 1954 ROR, పహాని అడంగల్, 30 సంవత్సరాలు ఈ.సి.ఎస్ కావాలి" అని అన్నారు. నేను దళారికి ఫోన్ చేసి అవన్నీ కావాలని అడిగాను. అంతే, అప్పటినుండి ఆ దళారి ముఖం చాటేశాడు. ఇక చేసేదిలేక నేనే రిజిస్ట్రేషన్ ఆఫీసుకి వెళ్లి ఈ.సి. కాపీ ఒకటి తీయించాను. అప్పుడు బాబా నాకు నిజం చూపించారు. ఆ భూమి సరిగా లేదు. ఈ యజమానికి ఒకరు అమ్మారు, వారికి ఇంకొకరు అమ్మారు, వారికి ఎవరు అమ్మారు అనేది అందులో లేదు. నాకు ఏం చేయాలో అర్థంకాక, "సాయీ! నేను నష్టపోకుండా నాకు సహాయం చేయండి. నేను ఇచ్చిన డబ్బు నాకు తిరిగి వచ్చేలా చూడండి" అని బాబాను వేడుకున్నాను. ఆ దళారికి మళ్ళీ ఫోన్ చేస్తే, అతను సమాధానం ఇవ్వలేదు. ఇక నేను నేరుగా ఆ యజమానికి ఫోన్ చేసి, "నేను మీ భూమి కొనడం లేదు. నేను ఇచ్చిన అడ్వాన్సు డబ్బులు నాకు తిరిగి ఇవ్వండి" అని అడిగాను. అందుకతను, "డబ్బులు తిరిగి ఇవ్వడం కుదరదు" అని చెప్పి వారం రోజులు నన్ను వేధించాడు. అప్పుడు నేను, "సాయీ! అతని మనసు మార్చి, నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేలా చేయండి" అని బాబాను వేడుకున్నాను. అలా వేడుకున్న రెండోరోజే ఆ యజమాని తనంతట తానే నాకు ఫోన్ చేసి, "మీరు వచ్చి మీ డబ్బులు తీసుకెళ్లండి" అని అన్నాడు. అది విని నాకు చాలా సంతోషంగా అనిపించి అక్కడికి వెళ్లాను. అతను ఐదు వేల రూపాయలు తగ్గించి, 45 వేల రూపాయలు నాకు తిరిగి ఇచ్చాడు. నేను సరేనని, ఆ డబ్బు తీసుకుని నా సాయికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. నా సాయి సహాయం చేయకపోతే మొత్తం డబ్బులు పోయేవి. ఇలా సాయి నన్ను ప్రతి ఆపద నుండి రక్షిస్తూ వస్తున్నారు. "చాలా చాలా ధన్యవాదాలు సాయీ"
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!


ఓం సాయిరాం!
ReplyDeleteOm Sri Sai Ram ��������
ReplyDeleteom sairam
ReplyDeleteom sairam
om sairam
Om sai ram❤❤❤
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundali thandri pleaseeee
ReplyDeleteBaba ee gadda ni tolginchu thandri
ReplyDeleteSai santosh ki day shifts vachi salary hike kavali thandri
ReplyDeleteఅఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm sri sairam 🙏🙏
ReplyDelete