సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1240వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శిరిడీయాత్ర అనుభవం
2. చిరు చిరు కోరికలకు కూడా విలువనిచ్చే బాబా

శిరిడీయాత్ర అనుభవం


'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగుని పరిపూర్ణంగా అనుగ్రహించాలని బాబాను కోరుకుంటున్నాను. సాయి భక్తులందరికీ నమస్కారాలు. నా పేరు నవీన్. నేనిప్పుడు నా శిరిడీయాత్ర అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. నేను చాలా చిన్న వయసులో శిరిడీ వెళ్ళాను కానీ, తర్వాత వెళ్ళలేకపోయాను. అందువలన నేను ఎప్పుడెప్పుడు శిరిడీ వెళ్తానా అని ఎంతగానో ఎదురు చూస్తుండేవాడిని. చివరికి 2022లో బాబా మాకు ఆ అవకాశం ఇవ్వడంతో నేను చాలా సంతోషించాను. మేము మా శిరిడీయాత్రను ప్లాన్ చేసుకుని ముందుగా ఆరతి, అభిషేకం పూజ టిక్కెట్లు బుక్ చేయాలని చూస్తే, నాకు మాత్రమే దొరికాయి. తరువాత మా కుటుంబంలోని నలుగురికోసం వసతి ద్వారవతిలో రూమ్ బుక్ చేద్దామని చూస్తే,  మేము నలుగురం ఉంటే ఆన్లైన్‍లో ముగ్గురికి మాత్రమే బుక్ చేయడానికి అనుమతించింది. నేను బాబా మీద భారం వేసి ముగ్గురికే రూమ్ బుక్ చేశాను. తరువాత మేము ఒక శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం ఏడు గంటలకు శిరిడీ చేరుకున్నాము. శిరిడీలోకి ప్రవేశిస్తూనే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ద్వారవతి వసతి గృహానికి చేరుకున్నాక, 'నేను బుక్ చేసింది ముగ్గురికి కదా, నలుగురిని అనుమతిస్తారో, లేదో' అని నేను కొంచెం భయపడ్డాను. కానీ బాబా దయవల్ల ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా రూమ్ ఇచ్చారు. వెంటనే స్నానం చేసి, సంతోషంగా శిరిడీలో సచ్చరిత్ర పారాయణ చేసుకున్నాను.


ఆరోజు మధ్యాహ్న ఆరతికి నాకు టికెట్ ఉండగా కొన్ని కారణాల వల్ల క్యూ దగ్గరకి వెళ్లేసరికి ఆలస్యమైంది. పరిగెత్తుకుంటూ వెళ్లేటప్పటికి సుమారుగా 11:40 అయి ఉంటుంది. అయితే నాకు ఊహ తెలిసిన తర్వాత శిరిడీ వెళ్ళడం అదే మొదటిసారి కావడం వల్ల  తెలియక నేను 200 రూపాయల దర్శనం క్యూ లైన్ దగ్గరకి వెళ్ళిపోయాను. అక్కడున్న సెక్యూరిటీని అడిగితే, "ఇదే లైన్, వెళ్ళు" అన్నారు. ఇంకా నేను అదే ఆరతికి వెళ్లే లైన్ అనుకుని ఆ లైన్‍లో ఉండగా ఆరతి మొదలైపోయింది. బాబా ఆరతికి లోపలకి వెళ్ళలేకపోయినందుకు నాకు చాలా బాధేసింది. కళ్లల్లో నుంచి నీళ్లు వచ్చాయి. కొంతసేపటికి ఇది బాబా నిర్ణయమనుకుని కొంచెం సర్దుకున్నాను. ఆరతి పూర్తయ్యాక నేను సమాధి మందిరంలోకి వెళ్లి బాబాను చూస్తూనే సంతోషం పట్టలేకపోయాను. కళ్ళ నుంచి ఆనందభాష్పాలు వచ్చాయి. నిజంగా బాబా దర్శనం అద్భుతంగా జరిగింది. దర్శనానంతరం నేను బయటకు వచ్చాను. ద్వారకామాయి దగ్గర ఉన్న అమ్మ, నాన్న, చెల్లిని కలుసుకుని, "సమాధి మందిరంలో బాబా ఆరతికి హాజరు కాలేకపోయాను" అని చెప్పి బాధపడ్డాను. వాళ్ళు, "అంతా మన మంచికే" అని సర్దిచెప్పారు. ఇంకా నేను ఆరతికి వెళ్ళినప్పుడు నాన్నని ఎవరో దర్శనం పేరు మీద మోసం చేయబోయారని, బాబా దయవల్ల తప్పించుకున్నామని, లేకపోతే వాళ్ళు చాలా డబ్బులు తీసుకునేవాళ్ళు అని చెప్పారు.


తరవాత నేను అప్పటికే దర్శనానికి వెళ్లొచ్చినందున నన్ను వదిలేసి వాళ్ళ ముగ్గురికి 200 రూపాయల దర్శనం టికెట్లు తీసుకుందామని నాన్న అనుకున్నారు. కానీ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైందో తెలియదుగాని నాన్న నాలుగు టికెట్లు తీసుకున్నారు. దాంతో మేము అందరం కలిసి దర్శనానికి వెళ్ళాము. ఈసారి బాబా మునుపటికంటే చక్కటి దర్శనం ఇచ్చారు. మేము సమాధి మందిరంలో బాబాను చూస్తూ ఒక ఇరవై నిమిషాలు ఉన్నాము. మునుపు ఆరతి మిస్సయ్యాను కాబట్టి అక్కడే బాబా సమక్షంలో ఆరతి పాడుకున్నాను. తర్వాత సంతోషంగా బయటకు వచ్చి గురుస్థానం, లేండీబాగ్ దర్శించుకుని తర్వాత ద్వారకామాయికి వెళ్ళాము. 60 సంవత్సరాలు బాబా తిరిగిన నేల, ఎన్నో మహిమలు చూపిన ప్రదేశం అని మాకు చాలా సంతోషంగా అనిపించింది. కానీ కరోనా ప్రభావం వల్ల  ద్వారకామాయిలో పైకి పోనివ్వటం లేదు. కింద సభామండపంలో అది కూడా క్యూలైన్ల గుండా బయటకు పంపుతున్నారు. అది కొంచెం బాధగా అనిపించింది. తర్వాత మేము చావడి దర్శించుకుని బాబా ప్రసాదాలయానికి వెళ్ళాము. నిజంగా బాబా ప్రసాదం నాకు చాలా బాగా అనిపించింది, బాబా హండి నుంచి తిన్నట్టు. 


నేను ఆ రాత్రంతా ద్వారకామాయి దగ్గరే ఉండాలనుకున్నాను కానీ, ప్రయాణ బడలికతో ఉన్నాము. అయినా ఎలాగోలా వెళ్లాలనుకున్నాను. కానీ మా పేరెంట్స్ అస్సలు ఒప్పుకోలేదు. వాళ్ళు, "మరలా నువ్వు చాలా దూరప్రయాణం చేసి బెంగుళూరు వెళ్ళాలి. నిద్రపోకపోతే ప్రాబ్లం అవుతుంద"ని నన్ను పడుకోమన్నారు. ఇంకా సరేనని బాబాని తలుచుకుని నిద్రపోయాను. తర్వాత రోజు ఉదయం నాకు అభిషేకం టికెట్ ఉంది. ముందురోజు ఆరతికి మిస్ అయినట్లు అభిషేక పూజకి మిస్ కాకుడదని 5 గంటలకే నిద్రలేచి 5:30 కల్లా మందిరంకి వెళ్ళిపోయాను. అభిషేక పూజ చాలా బాగా జరిగింది. తరువాత ఇంకోసారి రెండు వందల రూపాయల దర్శనానికి వెళదామనుకున్నాము కానీ, ఆరోజు ఆదివారం అవ్వడం వల్ల జనం బాగా ఉన్నారు. దర్శనానికి కనీసం నాలుగైదు గంటలు పడుతుందన్నారు. పైగా ఆ సాయంత్రం మా తిరుగు ప్రయాణానికి బస్సు ఉంది. కాబట్టి దర్శనానికి వెళితే బస్సు తప్పిపోతుందేమోనని దర్శనానికి వెళ్లకుండా ఆగిపోయాము. నాకు అప్పుడు ముందురోజు నాన్న నాకోసం నాలుగో టికెట్ తీసుకోవడం బాబా అనుగ్రహమనిపించింది.


మేము అలానే ద్వారకామాయి దగ్గర కూర్చున్నాము. అంతలో మధ్యాహ్న ఆరతి మొదలైంది. అక్కడున్న జనులంతా ఎంతో భక్తిశ్రద్ధలతో ఆరతి పాడటం చూసి నేను చాలా సంతోషించాను. అప్పుడు నాకు శిరిడీ ప్రవేశం ఎంతో అదృష్టమని, పుణ్యమని అనిపించగా, 'నేను అదృష్టవంతుడిని, శిరిడీకి రాగలిగాను. చాలామంది భక్తులు రావాలనుకున్నా పాపం రాలేకపోతున్నారు. కాబట్టి నేను అనవసరంగా బాధపడకూడదు. బాబా చూపిన అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని, ఇంకా ఆరతిలో పాల్గోవడానికి భక్తి ముఖ్యం. మందిరం లోపల ఉన్నామా, బయట ఉన్నామా అన్నది ముఖ్యం కాదు. శిరిడీ అంతా బాబా మందిరమే, ఇక్కడ ఎక్కడ ఆరతి పాడినా ఆయన మందిరంలో పాడినట్లేనని, ఈ విషయం నాకు తెలియజేయడానికి బాబా ముందురోజు నేను ఆరతి మిస్ అయ్యేలా చేసార'ని అనుకున్నాను.


ఆరతి పూర్తయిన తర్వాత మేము భోజనం చేసి ఖండోబా మందిరం దర్శిద్దామనుకుని ఆటో మాట్లాడితే, అతను శిరిడీకి కాస్త దూరంలో ఉన్న ఒక గణపతి మందిరం, ఇంకా బాయిజాబాయి ఇల్లు చూపిస్తానని అన్నారు. మేము సంతోషంగా సరేనని ఆ గణపతి, ఖండోబా మందిరాలు దర్శించి ఆపై బాయిజాబాయి ఇంటికి వెళ్ళాము. ఆ ఇంట్లో తాత్యాపాటిల్ మునిమనవడు ఉన్నారు. ఆయన మమ్మల్ని ఇంటి లోపలికి తీసుకెళ్లి బాబా తమ స్వహస్తాలతో తాత్యాకిచ్చిన డబ్బులు, బాబా పాదుకలు చూపించి, ఊదీ పెట్టుకోమని ఇచ్చారు. మేము బాబాకి థాంక్స్ చెప్పుకుని అక్కడి నుండి వచ్చాము. చివరిగా నేను ముఖ దర్శనానికి వెళ్లి, బాబాకి 'బాయ్' చెప్పి "తొందరగా మమ్మల్ని మళ్ళీ శిరిడీకి పిలుచుకోండి" అని చెప్పుకుని వచ్చాను. నాకు ఇంకా ఒకరోజు శిరిడీలో ఉండాలని అనిపించింది కానీ, బాబా ఆదేశం ఇంతవరకే ఉందనుకున్నాను. తిరుగు ప్రయాణంలో నేను మా శిరిడీ యాత్రను గుర్తుచేసుకుంటుండగా నాకు తెలిసిన ఒక సాయి భక్తురాలు గుర్తొచ్చారు. తను చాలా సంవత్సరాలుగా శిరిడీ వెళ్లాలని అనుకుంటున్నారుగాని వెళ్లలేకపోతున్నారు. "తనలాగే శిరిడీ వెళ్లాలనుకునే భక్తులందరికీ శిరిడీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించండి బాబా".


శిరిడీ నుంచి వచ్చిన కొన్నిరోజుల తర్వాత ఒకరోజు రాత్రి నేను శేజారతి చూస్తూ, "శిరిడీ వచ్చాను కానీ, మీ సమాధిని తాకలేకపోయాను బాబా" అని కొంచెం బాధపడ్డాను. ఆరోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను శిరిడీ సమాధి మందిరంలో ఉన్నాను. బాబాకి అభిషేకం జరుగుతుంది. నేను బాబా సమాధిని తాకి, అక్కడ కాసేపు కూర్చున్నాను. అంతటితో కల ముగిసింది. "ధన్యవాదాలు బాబా".


చిరు చిరు కోరికలకు కూడా విలువనిచ్చే బాబా


సాయి మహరాజు తండ్రికి నమస్కారం. నా పేరు గీత. మాది చిత్తూరు జిల్లా. మా అబ్బాయి సివిల్ సర్వీసు పరీక్షలు వేస్తుండగా ఆలోపు ఆర్‌బిఐ పరీక్షకు సంబంధించి మొదటి దశ పూర్తయి 2022, జూన్ 25న రెండవ దశ పరీక్షలు వ్రాయడానికి వెళ్ళాడు. నేను ఆరోజు ఉదయం, "బాబా! బిడ్డ పరీక్ష బాగా వ్రాసానని చెప్పాలి" అని బాబాను వేడుకున్నాను. ఆరోజు సాయంత్రం బాబు ఫోన్ చేసి, "పరవాలేదు, అనుకున్న దానికంటే బాగానే వ్రాసాను" అని చెప్పాడు. "ధన్యవాదాలు బాబా. అడుగడుగునా మాకు తోడుగా ఉంటూ నడిపించు తండ్రి".


మా అమ్మాయి బి.టెక్ చదువుతున్నప్పుడు పరీక్షలు ముగిసాక స్నేహితులందరూ కలిసి ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళాలని అనుకున్నారు. దూర ప్రదేశాలకు వెళ్లే అవకాశం లేనందున బెంగుళూరు వెళదామని అనుకున్నారు. అనుకున్నట్లే 2022, జూన్ 24 ఉదయం బయలుదేరి బెంగుళూరు వెళ్ళారు. నేను అప్పుడు, "బాబా! వాళ్ళ ప్రయాణం మంచిగా జరిగి పిల్లలందరూ క్షేమంగా తిరిగి రావాలి" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజు సాయంత్రం పిల్లలందరూ క్షేమంగా తిరిగి హాస్టల్‌కి చేరారు. ఇది చిన్న అనుభవంగా అనిపించినా 'సాయి మన చిరు చిరు కోరికలకు కూడా విలువ ఇస్తార'ని చెప్పడానికి నిదర్శనం. "ధన్యవాదాలు తండ్రి. మేము మాట తప్పినా మీరు మాట తప్పరు. ఎల్లవేళలా మమ్ములను కాపాడుతూ ఉంటారు". 


అభయప్రదాత శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


6 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Jagadguru sai nath maharaj ki jai🙏🙏🙏

    ReplyDelete
  5. Baba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house lo problem solve cheyandi pl house rent ki ippinchu thandri pl

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo