సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా తన భక్తులకు పెట్టిన కొన్ని ముద్దు పేర్లు.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

భక్తవత్సలుడైన శ్రీసాయిబాబా తన అనుంగుభక్తులను వారి మామూలు పేర్లతో గాక, తాను మాత్రమే పిలిచే ముద్దుపేర్లతో ప్రేమగా పిలుచుకునేవారు. చాలా సందర్భాలలో ఆ పేర్లకు గల అర్థాలు, అలా పిలవడానికి గల కారణాలు మనకు తెలిసినా, కొందరి విషయంలో మాత్రం కారణం అనూహ్యంగా ఉండేది. బాబా తన భక్తులకు పెట్టిన ముద్దుపేర్లలో కొన్నింటిని ఇక్కడ ముచ్చటించుకుందాం.

బాబాకు అత్యంత సన్నిహిత భక్తుడుగా చెప్పబడే 'షామా' అసలు పేరు - శ్రీ మాధవరావు దేశ్‌పాండే. 'షామా' అన్నది అతనికి బాబా పెట్టిన ముద్దుపేరు. 'శ్యామా' అన్న నామానికి వ్యవహార రూపమే 'షామా'. శ్రీమాధవరావును బాబా “శ్యామా” అనీ, “భఠాచా షామా” అనీ ఎందుకు వ్యవహరించేవారో అన్న దానికి సరైన కారణం తెలియడం లేదు. అతడు తన పూర్వజన్మలో బృందావనంలో శ్రీకృష్ణుని చెలికాళ్ళలో ఒకడైన శ్యాముడనీ, అందుకే బాబా అతడిని ఆ పూర్వజన్మ నామంతో పిలిచేవారనీ కొందరి భక్తుల విశ్వాసం. ఐతే ఈ విషయం బాబా చెప్పినట్లు ఎక్కడా ఆధారం లేదు. మరికొందరు (మరాఠీలో) 'షా' అంటే స్కూలు అనీ, 'మా' అంటే మాస్టరుకు సంకేతమనీ, 'షామా' అంటే స్కూలు మాస్టరనీ నిర్వచించారు. ఎందుకంటే మాధవరావు కొంతకాలం శిరిడీలో స్కూలు మాస్టరుగా పనిచేశారు.

మహల్సాపతి (మొదట్లో) వృత్తిరీత్యా కంసాలి. విశ్వబ్రాహ్మణుడు. అందుకే అతన్ని బాబా 'సోనార్ డా' (కంసాలీ!) అని పిలిచేవారు. మహల్సాపతి ఖండోబా ఆలయంలో పూజారి కనుక, తన పట్ల అచంచలమైన భక్తి శ్రద్ధలు కలవాడు కనుక తరువాత తరువాత అతన్ని 'భగత్' (-భాగవతుడు, భక్తుడు) అని కూడా వ్యవహరించేవారు.

దామోదర్ రస్నేది గాజుల వ్యాపారం. అందుచేత అతడిని బాబా 'కాసార్ డా'  (గాజుల వ్యాపారీ!) అని పిలిచేవారు. అలానే పిలాజీ గురవేని 'గుర్‌వడా!' (- మంగలీ!) అని పిలిచేవారు.

పైన పేర్కొన్న పేర్లన్నీ వారి వారి వృత్తులకు సంబంధించినవే! బాబా మరికొంతమందిని వారి రూపురేఖలను ఉద్దేశించి సరదాగా పిలిచేవారు. తాత్యాపాటిల్ కోతేని 'కొతేచా గోడ్ ముఖ్య' (గుఱ్ఱం మొహం వాడా!) అని, డాక్టర్ పిళ్ళేని (...సాధారణంగా 'భావూ' (సోదరుడా!) అని సంబోధించినా-) అప్పుడప్పుడూ 'అండాచీ పిళ్ళే'  (కోడిగుడ్డు ముఖం వాడా!) అని తమాషాగా ఆట పట్టిస్తూ పిలిచేవారు.

మరికొంతమందిని బాబా వారి వారి స్వభావాలకు తగ్గట్టు పిలిచేవారు. మాధవరావు ఫస్లేని 'అర్ధగుండూ' (పిరికోడా!) అనీ, సుగుణమేరు నాయక్‌ను 'ఠకీ' (టక్కరీ!) అనీ, రాధాకృష్ణఆయిని 'ఔదశ' (దుర్బుద్ధీ!) అనీ వ్యవహరించేవారు.

అలానే శ్రీ బి.వి.దేవ్‌ను 'చిందీచోర్' (పాత గుడ్డపేలికలు దొంగిలించేవాడా!) అని పిలిచేవారు. ఒకసారి దేవ్ శిరిడీ దర్శించి, అక్కడ బాబా భక్తులను బాబా ద్వారా వారికి కలిగిన అనుభవాలను గూర్చి అడుగుతున్నాడు. బాబా అతన్ని పిలిపించి, “పాతగుడ్డపేలికలు దొంగిలిస్తావేం?” అని కోపంగా కేకలేసారు. కాసేపు అలా అతన్ని తిట్టిన తరువాత అనునయంగా, “నేను నీకు పట్టువస్త్రం బహూకరిద్దామనుకుంటే చింకిపేలికల కోసం పాకులాడతావేం?” అని అన్నారు. ఇతరులకు కలిగిన అనుభవాల స్మృతులు వాడి విడిచేసిన పాత చింకిపేలికల వంటివనీ, స్వయంగా అలాంటి అనుభవాన్ని పొందడానికి ప్రయత్నించాలనీ బాబా భావం. ఆ సంఘటన జరిగిన తరువాత నుండీ బాబా దేవ్‌ని 'చిందీ చోర్' అని సరదాగా పిలిచేవారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, బాబా మహాసమాధి అనంతరం బి.వి.దేవ్ భక్తుల అనుభవాలను సేకరించి, 'సాయిలీలా మాసిక్' (మరాఠీ) పత్రికలో 'మహారాజ్ కా అనుభవ్' అన్న శీర్షికన ధారావాహికంగా ఎన్నో వ్యాసాలు ప్రచురించాడు. అలా 'సాయిలీలా మాసిక్'లో 'బాబాంచా బాల్' అన్న కలంపేరుతో ప్రచురింపబడ్డ వ్యాసాలన్నీ శ్రీబి.వి.దేవ్ వ్రాసినవే. అంతేకాదు, శ్రీహేమాడ్‌పంత్ అసంపూర్ణంగా విడిచిన 'శ్రీసాయిసచ్చరిత్ర' లోని 52, 53 అధ్యాయాలు శ్రీబి.వి.దేవ్ రచించి ప్రచురించారు. 'సాయంత్ర ఆరతి'లో భావగాంభీర్యంతోనూ, ఆర్ద్రతతోనూ, శబ్దసౌందర్యంతోనూ తొణికిసలాడే 'రుసోమమ' ('రుసో మమప్రియా...' అనే ఆరతి పాట) రచించింది కూడా శ్రీబి.వి.దేవే.

ఇక బాబాసాహెబ్ బూటీని 'బూటయ్యా' అనీ,
బాబాసాహెబ్ ధుమాళ్‌ను  'భావూ' అనీ,
దాదాసాహెబ్ ఖపర్దేని 'తావూన్ దాదా!' అనీ వ్యవహరించేవారు.
దాసగణుమహారాజ్‌గా ప్రఖ్యాతుడైన శ్రీగణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధేని బాబా ప్రేమగా “గణూ” అని పిలిచేవారు.

మరికొంతమంది విషయంలో, బాబా వారిని పిలిచే పేర్లకు వారికి కలిగిన ఏదో సాయిలీలకో, వారు చేయబోయే సాయిసేవా కార్యక్రమానికో (-హేమాద్‌పంత్, బి.వి.దేవ్ విషయం లోలాగా) సంబంధం ఉండేది. అన్నాసాహెబ్ ధబోల్కర్‌ను 'హేమాడ్ పంత్' అనీ, కాకాసాహెబ్ దీక్షిత్‌ను 'లంగ్‌డా కాకా!' (కుంటిమామా)అనీ, అబ్దుల్‌ను 'కాకి' అనీ, రాంగిర్‌బువాను 'బాపూగిర్ బువా' అనీ బాబా పిలిచేవారు. అలా ఆయన పిలవడానికి గల కారణాలు 'శ్రీసాయిసచ్చరిత్ర' పఠిస్తే అవగతమవుతాయి.

- పూజ్యశ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ.

మూలం: సాయిపథం వాల్యూం - 3.

బాబా ఆశీర్వాద ఫలితమే మా బిడ్డ.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

బాబా భక్తురాలు చరిష్మా ఇలా చెప్తున్నారు:

ఓం సాయిరామ్. నా పేరు చరిష్మా. నేను మహాపారాయణ గ్రూపు MP - 101లో ఉన్నాను. నేను, నా భర్త సెప్టెంబర్ 2017 నుండి పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్నాము. 2018, జనవరి వరకు ప్రతినెలా గర్భనిర్ధారణ పరీక్షా ఫలితం ప్రతికూలంగానే వచ్చింది. ఫిబ్రవరి నెలలోని చివరి మంగళవారం నేను బాబా మందిరానికి వెళ్ళి, "బాబా! మీకెప్పుడు మంచిదనిపిస్తే అప్పుడు మాకు చక్కటి బిడ్డను ప్రసాదించండి" అని ప్రార్థించాను. దానితోపాటు, "బాబా! బాబైనా, పాపైనా తను కూడా మిమ్మల్ని, మీ బోధనలని అనుసరించాల"ని ప్రార్థించాను.

ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నా భర్త, "రేపు ఉదయం పరీక్ష చేసుకో!" అని గుర్తుచేసారు. కానీ నేను ఆ సంగతి మరుసటిరోజు మర్చిపోయాను. ఆ మరుసటిరోజు మార్చి 1 ఉదయాన పరీక్ష చేసుకుంటే ఫలితం అనుకూలంగా వచ్చింది. ఆరోజు గురువారం కావడం మాకెంతో ఆనందాన్నిచ్చింది. ఆ తరువాత స్నానం చేసి ఆరోజు నాకు కేటాయించిన 14, 15 అధ్యాయాలు చదవడం మొదలుపెట్టాను. అందులో బాబా నాందేడుకు చెందిన రతన్‌జీ కి బిడ్డను ప్రసాదించిన లీల ఉంది. ఆ లీల ద్వారా నా ప్రెగ్నెన్సీ తమ అనుగ్రహమేనని బాబా సూచిస్తున్నారని అనిపించింది. ఇక నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. పై అనుభవం బాబా సర్వజ్ఞుడు అనడానికి నిదర్శనం.

బాబా వరదహస్తం నా మీద, నా కుటుంబం మీద ఉన్నది. అందుకు నేనెప్పటికీ బాబాకు ఋణపడి ఉంటాను. ఆయన అనుగ్రహంతో 2018 అక్టోబరులో సునాయాసంగా ఆరోగ్యమైన బిడ్డకు జన్మనిచ్చాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

-చరిష్మా.

బాబా తోడు ఉండగా, విధి ఏం చేయగలదు?


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

పూనా నివాసి పద్మావతి వెయిద్ తన అనుభవాన్ని ఇలా చెప్తున్నారు.

"నా జీవితం మొత్తం సాయినాథుని చుట్టూ తిరుగుతూ ఉంది. నేను ఆయన లేకుండా ఒక్కక్షణం కూడా జీవించలేను. కొంతకాలం క్రితం మా అబ్బాయిని చూడటానికి ముంబాయి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన మరుసటిరోజు నేను జబ్బుపడ్డాను. మా అబ్బాయి తనకి తెలిసిన వైద్యుడి చేత చికిత్స చేయించాడు. రెండురోజులకి నేను చాలావరకు కోలుకున్నాను. ఆ రెండురోజులు నేను బాబా మందిరానికి వెళ్ళలేకపోవడంతో, కోలుకున్న వెంటనే ఇక ఆగలేక దగ్గరలో ఉన్న బాబా మందిరానికి వెళ్ళాను. బాబా దర్శనం చేసుకున్నాక చాలా సంతోషంగా అనిపించింది. మరుసటిరోజు నడుస్తుండగా జారి క్రింద పడబోయాను. అంతలో నేను చూస్తుండగా తెల్లని కఫ్నీ ధరించిన ఒక చేయి నా భుజాన్ని పట్టుకుంది. ఆ చేయి నేను నేలమీద కూర్చునేదాకా నాకు సహాయం చేసింది. ఆ తరువాత, క్రింద పడకుండా నాకు సహాయం చేసింది ఎవరా అని వెనక్కు తిరిగి చూసాను. కానీ, అక్కడ ఎవరూ లేరు! నిజానికి నేనే క్రింద పడుతున్నప్పుడు నా చేతులు ఉపయోగించవచ్చు. కానీ, 80 ఏళ్ళ వయస్సులో నాకేమన్నా ఫ్రాక్చర్ అవుతుందేమోనని భయపడ్డాను. ఎందుకంటే, నా వయస్సున్న నా స్నేహితురాలు ఒకామె ఇదివరకు క్రింద పడినప్పుడు తన మణికట్టు ఎముకలు విరిగి పోయాయి. దానివలన ఆమె ఎంత బాధపడిందో నాకు తెలుసు. ఇప్పుడు బాబా నన్ను క్రింద పడకుండా కాపాడినందువల్ల నాకు ఆ నొప్పి, బాధ రెండూ లేవు. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత నేను వైద్యుడి వద్ద పరీక్ష చేయించుకోవడానికి వెళ్ళాను. ఆయన పరీక్షించిన తరువాత, "క్రింద పడినప్పటికీ మీకేమీ జరగలేదు. అంతా బాగుంది. నిజంగా ఇది అద్భుతం! ఎముకలు ఏమైనా విరిగి ఉంటే తప్పనిసరిగా శస్త్రచికిత్స అవసరం అయ్యేది" అని చెప్పారు. నా మనస్సులోనే, "బాబా నాతో ఉండగా విధి నన్నేం చేయగలదు? నేను క్రింద పడాలని విధి నిర్ణయించినా, బాబా ఆ విధిని తప్పించి నన్ను కాపాడారు" అని అనుకుని బాబా దయకు నేను కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నేను రోజూ, "నేను చనిపోయిన తరువాత నన్ను నీ చెంతకు చేర్చుకో! ఎప్పుడూ నన్ను వదిలిపెట్టకు" అని బాబాను ప్రార్థిస్తూ ఉంటాను".

మూలం: సాయిప్రసాద్ పత్రిక, దీపావళి సంచిక 1996.

భక్తుల బాధలు తానే భరించే భక్తవత్సలుడు శ్రీ సాయినాథుడు.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

విజయవాడ నుండి సాయిబంధువు సునీతగారు తమ అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. 

అందరికీ నమస్కారం. నా పేరు సునీత. 2016 వ సంవత్సరంలో మా జీవితంలో జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీకు చెప్తాను.

అది 2016, నవంబరు 22,  మంగళవారం. ఆరోజు పూజ చేసిన తరువాత నేను, మావారు పనిమీద బయటకు వెళ్ళి వచ్చాము. ఇంటి తలుపులు తెరిచేసరికి మందిరంలో ఉన్న బాబా పటం, విగ్రహం రెండూ క్రింద పడిపోయి, బాబా విగ్రహం మోకాలి దగ్గర విరిగిపోయి ఉంది. అదిచూసి నేను తట్టుకోలేక ఏడుస్తూ కూర్చుండిపోయాను. దాదాపు పదిహేను సంవత్సరాలుగా ఆ విగ్రహంలోనే బాబాని చూసుకుంటూ నా కుటుంబం గడుస్తుంది. "స్వామీ, ఏమిటి ఈ ఆపద?" అని చాలా విలపించాను. కొంతసేపటికి ఏమైనా సలహా ఇస్తారని నాకు తెలిసిన సాయిబంధువులకు ఫోన్ చేసాను. కానీ ఒక్కరి ఫోన్ కూడా కలవలేదు. ఒక్కరితోనైనా మాట్లాడేందుకు బాబా నాకవకాశం ఇవ్వలేదు. 'ఏమి ఆపద ముంచుకొస్తుందో' అని భయంతో బాబా నామస్మరణ చేస్తూ ఒకరోజు గడిపాము. మరుసటిరోజు సాయిసురేష్ గారి నుండి ఫోన్ వచ్చింది. ఆయన తిరుపతిలో ఉన్నందున ఫోన్ కలవలేదని, మిస్డ్ కాల్ చూసి ఫోన్ చేస్తున్నానని చెప్పారు. ఆయనకు జరిగినదంతా చెప్పాను. వారి మాటలతో కొంచెం ఓదార్పు కలిగింది. అదేరోజు సాయంత్రం ఇంకో సాయిబంధువు కూడా ఫోన్ చేసారు. వారికి కూడా జరిగినదంతా చెప్తే, ఆయన వెంటనే, "ఆ విగ్రహం యొక్క ఫోటో తీసి పంపించు తల్లీ!" అని చెప్పారు. వెంటనే రెండు ఫోటోలు తీసి ఆయనకు పంపించాను. ఆయన, "బాబాని అడిగి చెబుతానమ్మా!" అని అన్నారు.

తరువాత ఒక పెద్ద షాకింగ్ న్యూస్. మళ్ళీ ఆయన ఫోన్ చేసి, "మీ ఇంట్లో ఎవరికైనా ఏదైనా చిన్నదో, పెద్దదో ప్రమాదమేమైనా తప్పిపోయిందా?" అని అడిగారు. అప్పటికే నాకు పూజలో ఉన్నప్పుడు అలాగే తోచింది. మా ఇంటికి దీపం మా బాబు, బాబా వరప్రసాదం. వెంటనే మా బాబుని, “నిన్న నీకు స్కూల్లో ఏమైనా జరిగిందా?” అని అడిగాను. వాడు, "నిన్న స్కూల్లో యోగా(spiritual games) నిర్వహించారు. అందులో పాల్గొన్నప్పుడు కాలు విరిగే పరిస్థితి అవుతుందేమో అన్నట్లు పడబోతుంటే ఎలాగో తెలియదుగాని ఎవరో ఆపినట్లు ఆగిపోయాను" అని చెప్పాడు. మా బాబా విగ్రహానికి కూడా ఎక్కడా ఏమీ అవలేదు. కాలు మాత్రమే విరిగిపోయింది. ఆ విషయం తెలిసాక నాకు కన్నీళ్ళు ఆగలేదు. వెంటనే ఆ సాయిబంధువుకి ఫోన్ చేసి చెప్పాను. ఆయన, "మీ అబ్బాయికి జరగబోయే ప్రమాదాన్ని బాబా స్వీకరించి, మీ అబ్బాయిని కాపాడారు" అని చెప్పారు. తన భక్తులను రక్షించడానికి, వాళ్ళకి రాబోయే ఆపదలను తనమీదకు తీసుకున్న ఆ కరుణమూర్తికి ఎలా కృతజ్ఞతలు తెలుపుకోగలము? అవధులు లేని ఆ ప్రేమను ఎలా కీర్తించగలం?

తరువాత సాయిసురేష్ గారు పూజలో ఉన్నప్పుడు మాకు ఒక విగ్రహాన్ని అందజేయమని బాబా సూచించారు. అలా కొద్దిరోజుల్లోనే పెద్ద విగ్రహం రూపంలో బాబా మళ్ళీ మా ఇంటికి వచ్చారు. బాబా మన ఇంటి పెద్ద దిక్కుగా ఉంటూ, మన బాధలను పంచుకుంటూ తన బిడ్డలకి రక్షణ ఎలా ఇస్తూ ఉంటారో అన్నదానికి ఈ లీల ఒక ప్రత్యక్ష నిదర్శనం. మధురమైన బాబా లీలలను వర్ణించడం మన తరమా?

బాబా విగ్రహానికి కాలు విరిగింది - భక్తురాలికి నయమైంది.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

ఒక అతిశీతల చలికాలపు సాయంకాల సమయాన మేఘాకాక్రేకు అధికజ్వరంతో చలి, వణుకు మొదలయ్యాయి. ఆమె దుప్పటి కప్పుకొని నిద్రపోవడానికి ప్రయత్నించారు కానీ, ఎంతకీ నిద్ర పట్టలేదు. ప్రతిరోజూ నిద్రపోయే ముందు నుదుటికి, శరీరానికి ఊదీని పెట్టుకొని పడుకోవడం ఆమె అలవాటు. అమెకు ఆ విషయం గుర్తుకువచ్చి వెంటనే లేచి ఊదీ పెట్టుకొని, బాబా నామం చెప్పుకుంటూ నిద్రకు ఉపక్రమించింది. మరుసటిరోజు ఉదయానికి కూడా జ్వరం అలానే ఉంది. ఆ రోజంతా ఏమాత్రం తగ్గుముఖం పట్టకుండా జ్వరం అలానే ఉంది. తన కుటుంబసభ్యులు వైద్యుడి వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకోమని చెబుతున్నా ఆమె పట్టించుకోలేదు. ఈ పృథ్విపై ఉన్న వైద్యులమీద కన్నా, ఆమెకు బాబా ఊదీమీద అపారమైన నమ్మకం. కానీ పదేపదే వాళ్ళు వైద్యుడిని సంప్రదించమని ఒత్తిడి చేస్తుండటంతో, చివరికి ఆమె వాళ్ళ కోరిక మేరకు పరీక్ష చేయించుకోవడానికి, మందులు తీసుకోవడానికి అంగీకరించింది. అయినప్పటికీ ముందుగా ఊదీ తీసుకున్న తర్వాతే మందులు వేసుకునేది. అయితే జ్వరం మొండిగా తిష్ఠవేసుకుని కూర్చుంది.

ఇలా ఉండగా ఒకరోజు రాత్రి 9 గంటల సమయంలో ఆమె ఎడమకాలికి విపరీతమైన నొప్పి వచ్చింది. అదేసమయంలో ఆమెకు విపరీతమైన దాహం వలన నీళ్ళు త్రాగాలనిపించింది. కానీ ఆమె మంచం మీద నుంచి లేవలేకపోయింది. ఐనా ఎవరినీ నిద్రలేపడం ఇష్టంలేక మళ్ళీ నిద్రపోయింది. కొద్దిసేపటికి భరించలేనంతగా నొప్పి ఎక్కువైంది. అప్పుడు మళ్ళీ నీళ్ళు త్రాగాలనిపించి ఆమె లేవడానికి ప్రయత్నించింది. పాదం నేలమీద పెట్టగానే, దానిమీద (శరీర)బరువు మోపలేక పోయింది. దానితో ఆమె మళ్ళీ నిద్రపోవడానికి ప్రయత్నించింది. మొత్తానికి ఆమె గాఢనిద్రలోకి జారుకుంది.

మర్నాడు ఉదయం లేచేసరికి ఆమెకు జ్వరంగాని, కాలునొప్పిగాని లేవు. అంతలో ఆమె మనవరాలు అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి, "బామ్మా! బాబా కాలుకు ఏమైందొ చూడు" అని చెప్పింది. ఆమె నిదానంగా మంచం మీద నుంచి దిగి బాబా విగ్రహం ఉన్న గదికి వెళ్ళింది. చూస్తే, బాబా విగ్రహానికి ఎడమ మోకాలు దగ్గర విరిగిపోయి ఉంది. అది చూస్తూనే ఆమె నిర్ఘాంతపోయింది.

బాబా కరుణతో ఆమె అనారోగ్యాన్ని తన మీదకు తీసుకున్నారు. ఆమె అనారోగ్యం నుంచి కోలుకున్నారు. ఆమె తన మనసులోనే బాబా చూపిన దయను తలుచుకుంటూ చివరిసారిగా ఆ విగ్రహానికి కృతజ్ఞతలు చెప్పుకుని నమస్కరించుకుంది. తరువాత విరిగిన విగ్రహాన్ని ఒక సంచిలో పెట్టి తన ఇంటి పరిసరాలలో ఉన్న బావినీటిలో వేసింది. సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి అయిన బాబా తన భక్తుల ప్రారబ్ధాన్ని తీసుకుంటారు.

రీసెంట్ గా 2016లో జరిగిన ఇలాంటి మరో అనుభవం రేపటి భాగంలో.... 

మూలం: సాయి ప్రసాద్ పత్రిక 1993 (దీపావళి సంచిక).

'నాకు నా ఫొటోకు భేదమేలేద'ని బాబా చెప్పిన వాక్యాలు ఎంత సత్యమో!


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

నా పేరు సాయిస్వరూప్. మనం బాబా ఫోటోను చూస్తున్నామంటే, ఆయన ఫోటోని చూస్తున్నట్లు కాదు, సాక్షాత్తూ బాబాను చూస్తున్నట్లే! ఆయన తన ఫోటోలో జీవించే ఉంటారని నాకు క్రింది అనుభవం ద్వారా తెలియజేసారు.

నేను మైసూరులో ఇన్ఫోసిస్ కంపెనీలో శిక్షణ పొందుతున్న సమయమది. ఒకరోజు రాత్రి నాకొక కల వచ్చింది. ఆ కలలో నేను మా ఇంట్లోని నా గదిలో ఉన్నాను. తరువాత నేను అక్కడున్న బాబా ఫోటోని చూసాను. అది పూర్తిగా దుమ్ముతో కప్పబడిపోయివుంది. అలా బాబా ఫోటోని చూసాక నాకు చాలా బాధగా అనిపించి, ఫోటో మీద దుమ్ము శుభ్రపరచకుండా వదిలేసినందుకు బాబాకు క్షమాపణలు చెప్పుకున్నాను. వెంటనే పరుగున వెళ్లి, ఒక గుడ్డముక్క తీసుకొచ్చి బాబా ఫోటోను శుభ్రపరిచాను. అంతటితో కల ముగిసింది!

ఉదయం లేచాక ఆ కల గుర్తుకు తెచ్చుకున్నాను. అప్పుడు ఖచ్చితంగా చెప్పలేను కానీ, "అచ్చం కలలో నేను చూసిన బాబా ఫోటోలాంటి ఫోటో నా గదిలో వుండి ఉండాలి కదా!" అనిపించింది. వెంటనే నేను మా నాన్నకు ఫోన్ చేసి, నా కల సంగతి చెప్పకుండా, "నా గదిలో ఉన్న అలమరాలో ఫోటో ఏదైనా ఉందేమో చూడమ"ని చెప్పాను. నేను ముందుగా ఫోటో నిజంగా ఉందా లేదా అని నిర్ధారించుకుందామనుకున్నాను. నాన్న అంతా వెతికి, "బాబా ఫోటో ఒకటి పూర్తిగా దుమ్ముతో నిండి ఉంది" అని చెప్పారు. ఆ మాట వింటూనే నేను షాక్ అయ్యాను. అప్పుడు నాన్నకి నా కల గురించి చెప్పాను. అది చెప్పాక,  అక్కడ వాళ్ళకి దొరికిన బాబా ఫోటో అచ్చం నేను కలలో చూశానని చెప్తున్న ఫోటోలాగానే ఉందని నా తల్లిదండ్రులద్వారా తెలుసుకొని ఆశ్చర్యపోయాను. వెంటనే ఆ ఫోటోని శుభ్రం చెయ్యమని వాళ్ళకి చెప్పాను. మా నాన్న దాన్ని శుభ్రపరిచి, బాబా నుదుటిపై చందనమద్ది, నా అలమరాలోని అదే స్థలంలో ఉంచారు. దీన్నిబట్టి, "నాకు నా ఫొటోకు భేదమేలేద"ని బాబా చెప్పిన వాక్యాలు ఎంత సత్యమో అర్థమయ్యింది.

నెలసరి సమస్య - బాబా పరిష్కారం.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

బాబాభక్తురాలు దివ్య తన శారీరక సమస్యనుండి బాబా తననెలా రక్షించారో ఇప్పుడు మనతో పంచుకుంటున్నారు.

నా పేరు దివ్య. నాకు వివాహమై ఒక పాప ఉంది. నేను ఉద్యోగస్థురాలిని. నేను బాబా భక్తురాలిని. బాబా కృపతో చాలాసార్లు శిరిడీ దర్శించాను. ముందుగా బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. నిజానికి మీరు చేస్తున్న ఈ మంచిపని వలన మా భక్తివిశ్వాసాలు రెట్టింపు అవడమే కాకుండా అవసరమున్న సమయంలో  ధైర్యం కూడా చేకూరుతుంది. దృఢమైన విశ్వాసంతో రోజుకు కనీసం ఒక్కసారైనా సాయి నామస్మరణ చేసిన వారికి ఖచ్చితంగా ఆయన సహాయం అందుతుంది. బాబా నాకు తల్లితో సమానం. తల్లి తన బిడ్డకి జీవితంలో సరైన మార్గం చూపుతుంది. నిజానికి తల్లిపాత్ర చాలా కష్టమైనది. కొన్నిసార్లు ఆమె ప్రవర్తన తన బిడ్డ బాధపడేలా ఉన్నా భవిష్యత్తులో ఆ బిడ్డ ఈ ప్రపంచంలో అన్ని పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. ఇది బాబా తన భక్తులపై చూపే తల్లిప్రేమకు కూడా వర్తిస్తుంది. నేను మొదటిసారి నా అనుభవాన్ని వ్రాస్తున్నాను. అది కూడా ఎలాంటి అనుభవమంటే బాబా తప్పితే ఆ పరిస్థితిలో ఎవరూ సహాయం చెయ్యలేరు. నేను చెప్పేది చాలామందికి విడ్డూరంగా అనిపించవచ్చు. కానీ ఇది నా స్వీయ అనుభవం.

నాకు వివాహమైన తరువాత నాలుగవ సంవత్సరంలో నేనొకసారి మా అత్తవారింటికి వెళ్ళాను. అప్పటికి మాకు ఇంకా పిల్లలు లేరు. అది చాలా చిన్న గ్రామం, అక్కడి ప్రజలు ఇప్పటికీ సనాతన ఆచారాలు పాటిస్తుంటారు. అక్కడ ”గణ్‌‌గొర్"(గణ - శివ, గొర్ - పార్వతి) అనే ఒక సాంప్రదాయ పండుగని 16 రోజులపాటు ప్రతిసంవత్సరం చేసుకుంటారు. ఈ పండుగను ప్రధానంగా రాజస్థాన్ ప్రాంతంలో మార్చి నెలలో హోలీ పండుగ తరువాత చేసుకుంటారు. పెళ్లికాని అమ్మాయిలు మంచి భర్త రావాలని, పెళ్ళైన మహిళలు తమ భర్త ఆరోగ్యం మరియు పూర్ణాయుష్షు కోసం ఈ పండగను చేసుకుంటారు. అందరూ కలిసి ప్రాంతీయ జానపదగీతాలు పాడుకుంటూ శివపార్వతులను పూజిస్తారు. అలా కొన్ని సంవత్సరాలు చేశాక ఉద్యాపన చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేనా ఉద్యాపన కోసమే మా అత్తగారింటికి వెళ్ళాను. మా ఆడపడుచు కూడా ఉద్యాపన చెయ్యడానికి తన భర్త, అత్త మామలతో ఆ సమయంలో అక్కడికి వచ్చింది. ఒకేసారి ఉద్యాపన చేసుకుంటే అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందని అలా ప్లాన్ చేసుకున్నాము. మేమిద్దరం ఒకేసారి ఉద్యాపన చేసుకుంటుండటంతో మా అత్తగారు చాలా సంతోషంగా ఉన్నారు.

నేను ఇప్పటివరకు చెప్పినదంతా నా సమస్యయొక్క నేపథ్యం మాత్రమే. అసలు సమస్య ఏమిటంటే, పండుగకి ఒక్కరోజు ముందు నాకు నెలసరి మొదలైంది. అలా జరుగుతుందని నేనసలు ఊహించలేదు. సాధారణంగా అటువంటి సమయంలో ఆడవాళ్ళను ఇంటిలోనికి రానివ్వకుండా బయట ఉంచుతారు. ఆ సమయంలో స్త్రీలను ఏమీ తాకనివ్వరు. రోజువారీ పనులకి దూరంగా ఉంచుతారు. వంటగది ఛాయల్లోకి కూడా రానివ్వరు. అలాంటిది ఇంక పండుగ, పూజ గురించి చెప్పాలా? చదువుతున్న ఆడవాళ్లందరికీ ఇదంతా తెలిసే ఉంటుంది. నాకు ఈ సమస్య మొదలైందని గుర్తించగానే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. దిక్కుతోచక స్నానాలగదిలోనే మౌనంగా కూర్చుండిపోయాను. రెండు భయాలు నా మనస్సును చుట్టుముట్టాయి. ఒకటి - ఇది నేను చేయాల్సిన ఉద్యాపన, ఇప్పుడు నేను కనుక చెయ్యలేకపోతే మొత్తం వృధా అయిపోతుంది. రెండు - ఇప్పుడిలా జరిగినందుకు మా అత్తగారు కోపంతో, "నెలసరి ఆలస్యమయ్యేందుకు మాత్రలు వేసుకొని ఉండొచ్చు కదా?" అని తిట్టిపోస్తూ తన ప్రవర్తనతో నన్ను చంపినంత పని చేస్తుంది. ఇది మనసులో పెట్టుకొని రాబోయే కొన్నినెలలపాటు సూటిపోటి మాటలతో నన్ను నిందిస్తూనే ఉంటుంది. ఒకవేళ నా భర్త నా తరపున మాట్లాడినా ఆయన్ని కూడా విడిచిపెట్టదు. పైగా కోపంతో నాతో మాట్లాడడం కూడా మానేస్తుంది. ఇలా జరగబోయేదంతా ఆలోచించేసరికి భయంతో నా రక్తం గడ్డకట్టుకుపోయింది. ఈ విషయం గురించి ఎవరితోనూ చెప్పుకోలేను. పొరపాటున ఒకవేళ మా ఆడపడుచుకి తెలిసిందా, ఇక అంతే! ఆమె నన్నింక ప్రశాంతంగా ఉండనివ్వదు. ఈ సమస్య ఒకటి, రెండు రోజుల్లో తీరిపోయేదికాదన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అప్పటికి సూర్యాస్తమయ సమయం కావడంతో నేను నెమ్మదిగా స్నానాలగది నుండి బయటకొచ్చి ఎవరికీ కనపడకుండా నేరుగా మేడమీదకి వెళ్లి ఒక మూల కూర్చొని ఏడవసాగాను. "నేను ఎంత పాపాత్మురాలినో ఇటువంటి సమస్య వచ్చిపడింది. ఈ విషయాన్ని అత్తగారితో చెప్పుకోలేను. అయినా నేనేమి చేయగలను? ఇటువంటి విషయాలు మనచేతిలో ఉండవు కదా!" అని అనుకున్నాను. ఈ పరిస్థితిలో నాకున్న ఒకేఒక్క ఆశ నా బాబా. ఆయన్ను తలచుకొని ఏడుస్తూ ఆకాశం వైపు చూస్తూ గుండెలోతుల్లో నుండి ఆర్తిగా ప్రార్థించడం మొదలుపెట్టాను. "బాబా! తల్లిలా మీరే నన్ను అర్థం చేసుకోగలరు. మీకంతా తెలుసు. నేను ఇది కావాలని ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదు. బాబా! ఇప్పుడంతా నీ చేతుల్లోనే ఉంది. నువ్వు తప్ప నన్ను ఈ సమస్యనుండి ఎవరూ బయటపడవేయలేరు. దయచేసి నాకు సహాయం చెయ్యండి, టెంకాయ సమర్పించుకుంటాను" అని బాబాని వేడుకున్నాను. తరువాత మేడపై నుండి క్రిందకు వచ్చానే గాని, ఎవరికీ ఎదురుపడలేక నిద్రపోతునట్టు నటిస్తూ కొన్నిగంటలపాటు ఎవరికంటా పడకుండా ఏడుస్తూనే ఉన్నాను. అలా ఏడుస్తూ ఏ రాత్రో నిద్రలోకి జారుకున్నాను. తెల్లవారితే పండుగ కాబట్టి నేను వేకువనే లేచాను. కానీ మనస్సులో చాలా ఆందోళన, ఏమి చేయాలో అర్థం కావట్లేదు. నేరుగా స్నానాలగదికి వెళ్ళాను. లోపలకి వెళ్ళాక నన్ను నేనే నమ్మలేకపోయాను. నెలసరి సమస్యతో వచ్చేది ఏదీ నన్ను అంటలేదు. నేను చాలా పరిశుభ్రంగా ఉన్నాను. ఒక చిన్న మచ్చకూడా లేదు. అసలు నేనా సమస్యకు గురికానట్లే ఉంది. నాకెంత సంతోషం కలిగిందంటే చెప్పలేనసలు. 'బాబా నన్ను కాపాడారు' అనే ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. నాకు కన్నీరు ఆగలేదు. ఇప్పుడు నేనెవరి దగ్గరా ఏ విషయం దాచనక్కర్లేదు. ఎవరితోనూ అబద్ధం చెప్పనక్కర్లేదు. నా ఉద్యాపనకు కూడా ఏ ఆటంకం లేదు. ఇక ఆనందంగా తలస్నానం చేసి నేను అందరితో పాటు పండుగలో పాల్గొన్నాను. అనుకున్నట్టుగా అంతా బాగా జరిగింది. ఆ రోజంతా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉన్నాను. రాత్రి పడుకోబోయేముందు కూడా ఒకసారి చెక్ చేసుకున్నాను. అప్పుడు కూడా నేను శుభ్రంగా ఉన్నాను. "థాంక్యూ, థాంక్యూ సో మచ్ బాబా! ఒక్క తల్లి మాత్రమే తన బిడ్డల బాధని అర్థం చేసుకోగలుగుతుంది" అని బాబాకి చెప్పుకున్నాను. మరుసటిరోజు నేను మామూలుగా నిద్రలేచి టీ, టిఫిన్ అయ్యాక స్నానాలగదికి వెళ్ళినప్పుడు ఆ సమస్య కనిపించింది. నన్ను మామూలుగా చేసినందుకు మరలా బాబాకి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అప్పుడు మా అత్తగారికి జరిగిన సంగతి చెప్పాను. ఏ ఆటంకం లేకుండా పండుగ అయిపోవడంతో తను సంతోషంగా స్వీకరించారు. ఇప్పుడు ఏ బాధాలేదు. చూశారా! సాయిబాబా ఎలా నా నెలసరిని ఒక్కరోజుకి ఆపి మరలా యథావిధిగా చేసారో! హృదయపూర్వకంగా చెప్తున్నాను.. "లవ్ యు సో మచ్ బాబా!"

సాయిభక్తుడు శ్రీ రావుసాహెబ్ వి.పి.అయ్యర్.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!
శ్రద్ధ  -  సబూరి

శ్రీరావుసాహెబ్ వి.పి.అయ్యర్ సాయిబాబాకు గొప్పభక్తుడు. అతడు చక్కెరకి సంబంధించిన సాంకేతిక నిపుణుడు. అతనికి అనేక చక్కెర కర్మాగారాలలో పనిచేసిన అనుభవముంది. అతని భార్య శ్రీమతి హీరాబాయి అయ్యర్. తమ పిల్లల విద్యాభ్యాసం కొరకు వారు లక్నోలో స్థిరపడ్డారు. అయ్యర్ తను చేస్తున్న పనికి సంబంధించిన ఒప్పందం ముగిసిన తరువాత మళ్ళీ ఇంకొక చక్కెర కర్మాగారంలో ఉద్యోగం వచ్చేవరకు లక్నోలో ఉంటుండేవాడు. 1943-44 చక్కెర సీజన్లో అతనికి ఉద్యోగం లేకపోవడంతో లక్నోలో ఉన్నాడు. బాబాపై అతనికి ఉన్న పూర్తి నమ్మకం కారణంగా ఉద్యోగం లేకపోయినా దిగులుపడకుండా, బాబా తనకు ఏది ఉత్తమమో అది చేస్తారని, కనుక తాను ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్తుండేవాడు. పైగా ఉద్యోగం లేని కారణంగా తనకిప్పుడు సాయిబాబాను ప్రార్థించుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం దొరికిందని చాలా సంతోషించేవాడు. అంతటి స్థిరమైన భక్తివిశ్వాసాలు గలవాడతను. భోజనం చేసేముందు ఆహారాన్ని బాబాకు సమర్పించడం అతనికి అలవాటు. వివిధరకాల వంటకాలు, పచ్చి ఉల్లిపాయలు మరియు సలాడ్‌లతో సహా అన్నీ పళ్లెంలో వడ్డించి బాబాకు నైవేద్యంగా సమర్పించి, కొన్ని నిమిషాలపాటు కళ్ళు మూసుకుని, తర్వాత తినడం ప్రారంభించేవాడు. ఒకసారి ఎవరో 'పచ్చి ఉల్లిపాయలు పెట్టకూడద'ని చెప్పినప్పుడు, "బాబాకు ఉల్లిపాయలంటే చాలా ఇష్టం. అందుకే నేను వాటిని బాబాకు సమర్పిస్తున్నాన"ని బదులిచ్చాడు.

1944 నవంబరులో అతనికి కోపర్గాఁవ్ సమీపంలో లక్ష్మీవాడి వద్ద ‘లక్ష్మీవాడి షుగర్ మిల్స్’లో కాంట్రాక్టు ఉద్యోగం వచ్చింది. అతను ఆ అపాయింట్‌మెంట్ లెటర్ చూస్తూనే, "బాబా అనుగ్రహం చాలా గొప్పది, ఆయన నన్ను తన దగ్గరకు పిలుచుకున్నారు" అని ఎగిరి గంతేసాడు. తరువాత ‘లక్ష్మీవాడి’ వెళ్లి ఉద్యోగవిధులలో చేరాడు. ఖాళీసమయం దొరికినప్పుడల్లా శిరిడీ వెళ్లిరావడానికి అవకాశం ఉన్నందువల్ల అతను ఎంతో ఆనందంగా ఉండేవాడు. తరచూ సాయంత్రం వేళల్లో శిరిడీ వెళ్లి, అర్థరాత్రి సమయంలో తిరిగి వస్తుండేవాడు. అతను బాబా సమాధి వద్ద నిల్చొని బాబాను ప్రార్థిస్తూ తనను తాను మర్చిపోయి అలాగే నిలబడి ఉండిపోయేవాడు. అలాంటి సందర్భాలలో అక్కడున్న భక్తులు, “ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇక ఇంటికి తిరిగి వెళ్ళండ”ని గుర్తుచేస్తే, అతికష్టంమీద అతను మందిరం వదిలి ఇంటికి తిరిగి వెళ్ళేవాడు. నిరంతరం బాబా సన్నిధిలో ఉండిపోవాలనేదే అతని ఏకైక కోరిక.

బాబా సన్నిధిలో ఉండాలనే అతని కోరిక ఎంత బలీయంగా ఉండేదంటే, అతను తన భార్యకు వ్రాసిన లేఖలలో, తనకు శిరిడీలోనే ఉండాలని ఉందనీ, శిరిడీ విడిచిపెట్టడం తనకు ఇష్టం లేదని వ్రాస్తుండేవాడు. అతని స్నేహితులు మాత్రం అతని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, "పిల్లలు పెద్దవారై, తమ కాళ్లపై తాము నిలబడేవరకైనా కుటుంబం కొరకు పనిచేస్తుండాలి” అని అతనికి సలహా ఇస్తుండేవారు. దానికి అతని జవాబు మాత్రం ఒక్కటే - “నాకు బాబాను విడిచి వెళ్లాలని లేదు, శిరిడీలోనే ఉండిపోవాలని ఉంది” అని. 1945, మే నెలలో చక్కెర సీజన్ అయిపోవడంతో అతని కాంట్రాక్టు పని ముగిసింది. అయ్యర్ ఒక నివేదిక తయారుచేసి, మే 26న ఫ్యాక్టరీ యాజమాన్యానికి సమర్పించి, మే 27న కోపర్గాఁవ్ విడిచి లక్నో వెళ్ళాలని అనుకున్నాడు. ఆ సమయంలో తమ తండ్రితో కలిసి వేసవి సెలవుల్లో గడపడానికి అతని ఇద్దరు కుమారులు లక్ష్మీవాడికి వచ్చి ఉన్నారు.

26వ తేదీ సాయంత్రం అతను బాబా దర్శనం కోసం శిరిడీ వెళ్ళాడు. అప్పట్లో మందిరం అంత పెద్దది కాదు.  సమాధిమందిరంలో సాయిబాబా సమాధి మాత్రమే ఉండేది. అప్పటికి ఇంకా సాయిబాబా విగ్రహం ప్రతిష్ఠించలేదు. అతను తన కళ్ళు మూసుకుని సమాధి ఎదుట ఒక స్తంభానికి సమీపంలో నిలబడి, కళ్ళనుండి ఆనందాశ్రువులు జాలువారుతుండగా తన చుట్టూ వున్న పరిసరాలను మరచి తన్మయత్వంలో మునిగిపోయాడు. కొంతమంది భక్తులు అతనితో మాట్లాడటానికి ప్రయత్నించారు. కానీ అతను స్పందించలేదు. సుమారు 9 గంటలకు అతను బాహ్యస్మృతిలోకి వచ్చాడు. అతను మందిరం వదలి వెళ్ళలేక వెళ్ళలేక ఇంటికి బయలుదేరాడు. అతనికి ధనవంతులు, పేదవారు అనే వ్యత్యాసం ఏమాత్రం ఉండేది కాదు. అందరూ అతనికి సమానమే. అతను శిరిడీ నుండి వెళ్తూ, తెలిసిన వారందరికీ వీడ్కోలు చెప్పాడు. అలా వీడ్కోలు చెప్తున్నప్పుడు అతనితోపాటు అందరూ కన్నీళ్లపర్యంతమయ్యారు. అతను సుమారు రాత్రి 11 గంటలకు ఇంటికి చేరుకుని భోజనం చేసి పడుకున్నాడు. అర్థరాత్రి సుమారు 2 గంటల సమయంలో లేచి తన కుమారులను నిద్రలేపి, తనకు అనారోగ్యంగా ఉందని చెప్పాడు. వాళ్ళు పొరుగువారికి సమాచారం అందించి, తరువాత వైద్యుడిని పిలిపించారు. వైద్యుడు వచ్చి పరీక్షించి, కలరావ్యాధిగా నిర్ధారించి ఔషధం ఇచ్చాడు. ఉదయానికల్లా అయ్యర్ చాలా బలహీనంగా తయారయ్యాడు. మధ్యాహ్నానికి అతడు స్పృహలేకుండా కళ్ళు మూసుకుని పడుకొని ఉన్నాడు. కానీ మధ్యమధ్యలో అతడు కళ్ళు తెరిచి, ఎదురుగా గోడపై ఉన్న బాబా ఫోటోను చూస్తున్నాడు. అతని దృష్టి అంతా కేవలం బాబా మీదనే ఉన్నది. సాయంత్రం సుమారు 4.30 ప్రాంతంలో అతను కళ్ళు తెరచి తన దగ్గర నిలబడివున్న వ్యక్తికేసి చూడగా, ఆ వ్యక్తి దగ్గరగా వెళ్ళి “ఏమి కావాల”ని అడిగితే, గోడపై ఉన్న సాయిబాబా ఫోటో తనకి ఇవ్వమన్నట్లుగా సైగ చేశాడు. బాబా ఫోటోను తన దగ్గరకు తీసుకురాగానే, అతడు తన చేతులు చాచి, బాబా ఫోటోను తన హృదయంపై ఉంచమని కనుసైగలతో సూచించాడు. అలా అతను బాబా ఫోటోను గట్టిగా కౌగిలించుకొని, చిరునవ్వుతో "బాబా, సాయిబాబా, బాబా" అని బాబా నామాన్ని స్మరిస్తూ తన తుదిశ్వాసను విడిచాడు.

అయ్యర్ హఠాన్మరణం గురించి విన్న ప్రజలు తీవ్రదిగ్భ్రాంతి చెందారు. ముందురోజు రాత్రి వరకు ఆరోగ్యంగా ఉన్న అయ్యర్, ఇప్పుడు తమ మధ్య లేనందుకు ఎంతో విచారించారు. అతనిపై గల ప్రేమతో, దూరాన్ని సైతం లెక్కచెయ్యకుండా, శిరిడీ నుండి పెద్దసంఖ్యలో ప్రజలు కాలినడకన అక్కడికి వచ్చారు.

ఆ సమయంలో లక్నోలో ఉన్న అతని భార్యకు అతని మరణవార్త టెలిగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఆమె తన భర్తను చివరిసారిగా చూడాలన్న కోరికతో వెంటనే బయలుదేరి, అతను మరణించిన నాలుగవరోజుకి లక్ష్మీవాడి చేరుకున్నది. అయ్యర్ భార్య లక్ష్మీవాడికి వచ్చినట్లు తెలుసుకుని, శిరిడీ ప్రజలలో చాలామంది అయ్యర్ గురించి ఆమెతో మాట్లాడుతూ ఆమెను ఓదార్చారు. అదేరోజు రాత్రి అయ్యర్ పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

వి.పి.అయ్యర్ మరణించిన తరువాత కూడా అతని భార్యాపిల్లల యోగక్షేమాలు బాబా చూసుకున్నారు. వారంతా చక్కగా విద్యాభ్యాసం చేసి జీవితంలో స్థిరపడ్డారు. అందరికీ వివాహాలు జరిగి పిల్లలు కలిగారు. వారంతా కూడా సాయిబాబా భక్తులే.

శిరిడీ ప్రజలు సంస్థాన్‌వారిని సంప్రదించి, అయ్యర్‌కు ఒక సమాధి నిర్మించమని కోరారు. దానికి సంస్థాన్‌వారు అంగీకరించి, అయ్యర్ అస్థికలను ఖననం చేసి, సమాధి నిర్మించి, దానిపై అయ్యర్ పేరు, జనన-మరణ వివరాలను పొందుపరిచారు. బాబా తన భక్తుని యొక్క ప్రార్థన మన్నించి, అతని కోరికను నెరవేర్చి, తన ప్రియమైన భక్తుని ఎప్పటికీ శాశ్వతంగా తమ చెంతనే ఉంచుకున్నారు. వి.పి.అయ్యర్ సమాధి నానావలి సమాధికి వెనుక లెండీగార్డెన్‌లో ఉంది.


నాకు మనిషిరూపంగా దర్శనమిస్తే మీ పాదాలే నమ్ముకుంటా...


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

నా పేరు బి.నాగమల్లేశ్వరి. గుంటూరు, వికాస్‌నగర్, 9వ లైనులో మా నివాసం. నాకు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని సాయిబంధువులతో పంచుకునే అవకాశమిచ్చిన బాబాకి నా హృదయపూర్వక నమస్కారములు.

7, 8 సంవత్సరాల క్రిందట విద్యానగర్ 3వ లైనులో భీష్మఏకాదశి సందర్భంగా 42 రోజులపాటు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకున్నాము. అదేసమయంలో ఒక గురువారంనాడు “సాయిచరితామృతం" వారంరోజులు పారాయణ చేయాలన్న ఉద్దేశ్యంతో పూజ మొదలుపెట్టాను. పూజ ప్రారంభిస్తూ, "బాబా! కొంతమందికి మీ దర్శనం ద్వారా, మరికొంతమందికి ఆచరణ ద్వారా ఇలా రకరకాలుగా ఎన్నో నిదర్శనాలు చూపారు. నాకు మీరు 'మానవరూపం'గా దర్శనమిస్తే, నేను మీ పాదాలే నమ్ముకుంటాను" అని సంకల్పం చేసుకున్నాను. తరువాత 108 తెల్లనిపూలతో అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజచేసి,  పరమాన్నం నివేదన చేసి, పండు, తాంబూలం, 2 రూపాయలు దక్షిణ సమర్పించి, బాబాకి హారతి ఇస్తున్న సమయంలో “ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి" అని ఒక క్రొత్త గొంతు వినిపించడంతో నేను ప్రసాదం, దక్షిణ తాంబూలంతో క్రిందికి వచ్చి చూస్తే, దూరంగా బాబా కాషాయబట్టలు ధరించి, భుజానికి జోలె తగిలించుకొని, కాళ్ళకు చెప్పులు లేకుండా నిదానంగా నడుచుకుంటూ వస్తూ కనిపించారు. ఆయన నేరుగా మా వాకిలి వద్దకు వచ్చి నిలబడ్డారు. నేను తీసుకొచ్చిన ప్రసాదంతో ఆయన ముందు నిలబడగానే, ఆయన జోలెలో పెట్టమని జోలె చూపించారు. మా ఇంట్లో అద్దెకున్నావిడ నీళ్ళ ట్యాంకర్ కోసం నా వెనుకే నిలబడి అంతా చూస్తోంది. నేనెప్పుడైతే ప్రసాదం జోలెలో పెట్టానో  వెంటనే ఆయన 'కొత్త అమ్మా' అని రెండుసార్లు నాతో అన్నారు. కానీ నేనొక రకమైన తన్మయత్వంలో ఉండటం వలన ఆ మాటలు నా చెవిన పడలేదు. నా వెనుకనున్న ఆవిడ 'ఆయన క్రొత్తంటండీ!' అని నాకు చెపితే, "ఔను బాబా, మీరు నిజంగా క్రొత్తే. నాకు మనిషిరూపంగా దర్శనమివ్వాలని వచ్చిన ఆ బాబాయే మీరు" అని మనస్ఫూర్తిగా ఆయన పాదాలకు నమస్కరించుకున్నాను. పైకి లేచాక ఆయన నన్ను చేయి చాపమని అడిగారు. అది కూడా నాకు వినిపించకపోతే మళ్ళీ నా వెనకున్నావిడ చెప్పింది. అప్పుడు నేను చేయి చాపితే, ఆయన నా చేతిలో “విభూది” వేసి వెళ్లిపోయారు.

మరుసటిరోజు పసుపుపూలతో అష్టోత్తర శతనామ పూజ చేసి, పులిహోర నైవేద్యం పెట్టాను. ఆరోజు కూడా బాబా వస్తారని ఎదురుచూశాను కానీ, రాలేదు. తరువాత నేను రెండు బాక్సులలో పులిహోర ప్రసాదం పెట్టుకుని గుడికి వెళ్ళాను. అక్కడ విష్ణుసహస్రనామ పారాయణ పూర్తైన తరువాత మధ్యాహ్న హారతి ప్రారంభించే ముందు నేను తల త్రిప్పి బయటకు చూస్తే, ముందురోజు మా ఇంటికి వచ్చి ప్రసాదం, దక్షిణ తాంబూలం తీసుకున్న ఆయన త్వరత్వరగా నడుచుకుంటూ గుడివైపే వస్తున్నట్లు కనిపించారు. హారతి పూర్తైన తరువాత భక్తులు బాబా పాదాలకు నమస్కరించుకుని ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోయారు. నేను, ఆ గుడి కోశాధికారి రాణి, పూజారిగారు మాత్రమే మిగిలాము. తరువాత గుడికి తాళాలు వేసి మేము కూడా మా ఇళ్ళకి వెళదామని బయటకు  వచ్చేసరికి. గుడి మెట్లపై ఆయన కూర్చొని, కాళ్ళు చాపుకుని ధ్యానం చేసుకుంటున్నారు. రాణి ఆయన చేతిలో కమలాపండు తొనలను పెట్టింది. నేను అప్పటికే నాతో తెచ్చిన పులిహోర బాక్సులలో ఒకటి అందరికీ గుడిలో పంచిపెట్టాను. వేరొకటి మా అమ్మాయికి ఇవ్వడానికి సంచిలో పెట్టాను. అక్కడ బాబాని చూచిన వెంటనే నా వద్ద ప్రసాదం ఉందని నాకు తెలుసు కానీ, అది తీసి ఆయనకు ఎందుకో ఇవ్వలేకపోయాను. నా పర్సులో నుంచి  11 రూపాయలు తీసి ఆయన చేతిలో పెట్టి, నా బిడ్డ 'రాజశ్రీ' ఇంటికి బయలుదేరాను. కానీ  బయలుదేరినప్పటి నుండి "నా దగ్గర ప్రసాదం ఉన్నా, నేనెందుకు బాబాకు ఇవ్వలేకపోయాన"ని నన్ను నేనే తిట్టుకుంటూ మా అమ్మాయి ఇంటికి చేరాను. మా అమ్మాయి, "కాళ్లు కడుక్కొని రామ్మా! భోజనం పెడతాను" అన్నది. ముందురోజునుండి ఆరోజువరకు జరిగినదంతా పూసగుచ్చినట్లు మా అమ్మాయికి చెప్పాను. దానికి తను, "ఎందుకమ్మా బాధపడతావు? మొదటిరోజు నీ వద్దనుండి ప్రసాదం, రెండవరోజు దక్షిణ తీసుకున్నారు బాబా. అంతకన్నా కావల్సింది ఏముంది?" అని చెప్పింది. తన మాటలకు తృప్తిపడి అప్పుడు భోజనం చేశాను. ఆ తర్వాత ఈనాటివరకు ఆయన మళ్ళీ ఎప్పుడూ రాలేదు, ఎక్కడా కనిపించలేదు. ఆవిధంగా మానుషరూపాన నాకు దర్శనమిచ్చిన నా తండ్రి నా జీవితంలో అణువణువునా చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ అనుభవం మచ్చుకకు ఒకటి మాత్రమే. ఇవికాక ఎన్నెన్నో అనుభవాలిచ్చారు నా తండ్రి సాయి.

బాబా చిత్రపటం రూపంలో భక్తుని గృహానికి ఏతెంచిన లీల!


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

నా పేరు రాయపాటి సాంబశివరావు, రామకృష్ణా అని కూడా అంటారు. మా ఊరు ఉలవపాడు మండలం, చాగల్లు. 1977 వ సంవత్సరం, మే నెలలో ఒకనాడు కేలండర్ సైజు ఫొటో ఒకటి మా ఇంటి పూజామందిరంలోకి గాలికి వచ్చి, వెల్లకిలా పడకుండా పటం నిలబెడితే ఎలా నిలబడుతుందో అలా పూజా మందిరంలోని పటాలవద్ద నిలబడింది. ఆ ఫొటోలో బాబా రూపం పెద్దగా ఉండగా, శివలింగం మాత్రం దానిపై సర్పము ఉన్నట్లు చిన్నగా ఉంది. అప్పటికి నాకు బాబా గురించి అస్సలు తెలియదు. శివలింగాన్ని పూజించుకుంటూ, తిరుపతి, శ్రీశైలం మొదలైన పుణ్యక్షేత్రాలు తిరిగాను కానీ శిరిడీ వెళ్ళలేదు.

మా ఇంటిలోకి బాబా ఫొటో వచ్చిన సమయంలోనే ఒంగోలులో సాయిబాబా మందిరం కడుతున్నారు. ఆ ఫొటో గురించి మా ఇంటి చుట్టుప్రక్కల వారిని "మీరేమైనా ఫొటో పోగొట్టుకున్నారా?" అని అడిగాను. వాళ్లంతా 'మాది కాద'ని చెప్పారు. బాబా గురించి చుట్టుప్రక్కల వారిని అడిగితే, కొందరు ఆయన ముస్లిమని, కొందరు హిందువని చెప్పారు. కొందరు మాత్రం భరద్వాజ మాష్టరుగారి దగ్గరకి వెళ్ళమని చెప్పారు.

సరేనని ఒంగోలు వెళ్లి మాష్టరుగారిని కలిశాను. ఆయన, "ఫొటో రూపంలో బాబానే నీ దగ్గరకు వచ్చారు. నువ్వు అదృష్టవంతుడివి. మేఘశ్యాముడు కూడా ఈశ్వరుడిని పూజించేవాడు. అతనికి శివలింగాన్ని ఇచ్చి బాబా ఆశీర్వదించారు. సద్గతి కలుగజేశారు" అని చెప్పి, సాయిలీలామృతం, గురుచరిత్ర పుస్తకాలు నాకిచ్చారు. తరువాత, "నువ్వు  శిరిడీకి వెళ్ళిరా!" అని ఆశీర్వదించారు. "నాకు హిందీ, మరాఠీ రాదు. నేను ఒక్కడినే పోలేను" అని నేనన్నాను. అందుకు ఆయన, "అన్నీ బాబా చూసుకుంటారు" అని చెప్పారు.

1987వ సంవత్సరంలో గురుపూర్ణిమకి శిరిడీ వెళ్ళడానికి బాబా ఆజ్ఞ లభించింది. నాతో పాటు మా తమ్ముడికి కూడా బాబా అవకాశం ఇచ్చారు. అలా నేను, మా తమ్ముడు మొదటిసారి శిరిడీ వెళ్ళినప్పుడు ఒక అద్భుతమైన లీల జరిగింది. ఉదయాన్నే హైదరాబాదులో మా తమ్ముడు మొహం కడుక్కుంటూ వాచీ వాష్‌బేసిన్ వద్ద పెట్టి మర్చిపోయాడు. కొంతసేపటికి గుర్తొచ్చి వెళ్లి చూస్తే అక్కడ వాచీ లేదు. కాసేపు దానిగురించి బాధపడినా, ఎవరో తీసుకుపోయి ఉంటారని ఊరుకున్నాము. తరువాత మేము రైలులో ప్రయాణిస్తుండగా ఒక సాధువు మా దగ్గరకు వచ్చి, "నీ వాచీ పోయిందా? ప్రక్కస్టేషన్‌లో కాలికి ఆరు వేళ్ళు ఉండే ఆయన్ను అడుగు, ఇస్తాడు" అని చెప్పి వెళ్ళిపోయాడు. మేము ఆశ్చర్యపోయాము. ఎందుకంటే మా వాచీ పోయిన సంగతి మేము ఎవరికీ చెప్పలేదు. వచ్చిన ఆ సాధువు ఎవరో కూడా మాకు తెలియదు. కొంతసేపటికి ప్రక్కస్టేషన్‌లో రైలు ఆగింది. సాధువు చెప్పినట్లు ఫ్లాట్‌ఫారం మీద చూడగా ఒకాయన కాలికి ఆరువేళ్ళు ఉన్నాయి. ఆయన దగ్గరకు పోయి, "వాచీ ఇవ్వండి" అని అడిగాము. ఆయన వాచీ ఇచ్చాడు. ఇంతలో ట్రైన్ కదిలింది. ఆయనతో మాట్లాడే టైము కూడా లేదు. ఆయన్ని చూస్తూ, నమస్కరిస్తూ, ఆయనలో బాబాను దర్శించాము. తరువాత శిరిడీ చేరుకుని మొదటిసారి బాబా దర్శనంతో పులకించిపోయాను. చెప్పలేనంత ఆనందాన్ని అనుభవించాను. 1977లో బాబా నా జీవితంలోకి వచ్చినప్పటినుండి ఇప్పటివరకు బాబానే నమ్ముకున్నాను. ఆయన్నే పూజిస్తున్నాను. ఆయన ద్వారా ఎన్నో లీలలను పొందాను.

- రామకృష్ణ ఉలవపాడు మండలం, చాగల్లు, ప్రకాశం జిల్లా.

మూలం: సద్గురులీల మాసపత్రిక, ఆగస్టు - 2007.

పెద్ద తప్పిదం నుండి కాపాడిన బాబా




నేను ఒక సాయి భక్తురాలిని. నేను బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాను. నేను బాబాని పూజించడం ఈమధ్యనే(2018) ప్రారంభించాను. నేను బాబా గురించి ఇలాంటి బ్లాగులు, యూట్యూబ్‌‌ల ద్వారా తెలుసుకున్నాను. సచ్చరిత్ర చదవడం కూడా కొద్దిరోజుల క్రితం ప్రారంభించాను. ఇప్పుడు నేను చెప్పబోయే నా అనుభవం నా ఉద్యోగంలో నేను చేసిన ఒక పెద్ద తప్పిదం నుండి బాబా నన్ను ఎలా రక్షించారో తెలుపుతుంది.

ఒకరోజు ఉదయం నేను పూజ పూర్తిచేసి, తరువాత సచ్చరిత్రలోని కొన్ని అధ్యాయాలు పారాయణ కూడా చేసి ఆఫీసుకి బయలుదేరాను. వెళ్ళేదారిలో, "ఈ ఆధునిక ప్రపంచంలో కొత్త టెక్నాలజీల గురించి సాయికి ఏం తెలిసి ఉంటుంది?" అని ఆలోచన వచ్చింది. ఆ విషయంపై మనసులో అనేక ప్రశ్నలు, సందేహాలు తలెత్తాయి. ఈ ఆలోచనలతోనే ఆఫీసు చేరుకుని, వెంటనే పనిలో నిమగ్నమయ్యాను. కొద్దిసేపటికే నా వర్కులో పెద్ద తప్పు చేశానని గుర్తించాను. అది మా మేనేజరుకి నాపై చెడు అభిప్రాయం కలిగిస్తుందని నాకు ఖచ్చితంగా తెలుసు. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా 9 సంవత్సరాల అనుభవంలో నేనెప్పుడూ ఇంత పెద్ద తప్పు చెయ్యలేదు. ఇదే మొదటిసారి. నాకు దుఃఖం తన్నుకొచ్చింది. అందరిముందు బయటపడలేక బాత్రూంలోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చి, "బాబా! నన్ను ఈ సమస్యనుండి రక్షించండి. ఈ సమస్యనుండి బయటపడితే నా అనుభవాన్ని బ్లాగు ద్వారా సాయిబంధువులతో పంచుకుంటాను" అని ప్రార్థించాను. అంతలా ఏడవడంతో కళ్ళు ఎర్రబడిపోయి నా మొహమంతా వాడిపోయినట్లయిపోయింది. తరువాత నా సీట్ లోకి వెళ్ళి కూర్చున్నాను. ఆశ్చర్యం! ఎవరూ కూడా నా తప్పుని గుర్తించలేదు. అంతా యథావిధిగా కొనసాగుతోంది. నిజానికి నేను చేసిన తప్పు ఎవరైనా ఇట్టే గుర్తుపట్టొచ్చు. అంత పెద్ద తప్పు నావల్ల జరిగింది. అలాంటిది, మా బృందంలో ఒక్కరు కూడా గుర్తించలేక పోయారు. నాకంతా ఒక వింతలా అనిపించింది. అప్పుడు నాకర్థమయ్యింది, బాబా గురించి నేను చేసిన ఆలోచన సరి కాదు అని. ఇది ఆధునిక ప్రపంచమే, కానీ బాబాకి ప్రతిదీ తెలుసు. ఆయనకు తెలియనిదంటూ ఏమీలేదు. నా సన్నిహిత స్నేహితులతో సహా ఆయనకి తెలుసు. ఇంకో విషయం, నేను బాగా ఏడవడం వలన నా ముఖం వాడిపోయి, కన్నులు ఎర్రబారిపోయిన చిహ్నాలు నా ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నా ఎవరూ గమనించలేదు. ఇదంతా బాబా చేసిన చమత్కారమే. నాకు వచ్చిన సందేహానికి ఆయన ఇచ్చిన చక్కటి అనుభవమిది. తరువాత బాబాకి కృతజ్ఞతలు తెలుపుకుని మరలా తనివితీరా కన్నీళ్లు పెట్టుకున్నాను. కానీ ఈసారి అవి సంతోషంతో వచ్చిన ఆనందభాష్పాలు. "థాంక్యూ, థాంక్యూ సో మచ్ బాబా!"

దామోదర్ సావల్‌రాం రస్నే


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

ఈరోజు దామోదర్ సావల్‌రాం రస్నే వర్ధంతి సందర్భంగా ఆ మహాభక్తుని గురించి స్మరించుకొనే ప్రయత్నంలో ఈ ఆర్టికల్  ప్రచురిస్తున్నాము.
దామూ అన్నా
అసలు పేరు    :    దామోదర్ సావల్‌రాం రస్నే

వాడుక పేరు     :    దామూ అన్నా

వృత్తి                 :    గాజుల వ్యాపారి

నివాస స్థలం    :    అహ్మద్‌‌ నగర్

బాబా దర్శనం :  1893

మరణం            :    20-01-1941

విశేషాలు   :   ప్రతి ఏటా ఉరుసు ఉత్సవానికి (శ్రీరామనవమి) ఒక జెండాను కానుకగా ఇచ్చేవాడు.

బాబా ద్వారా విశిష్ట అనుభవాలను, పవిత్రమైన బోధనలను, లీలలను మూటగట్టుకున్న అదృష్టవంతుడు దామోదర్ సావల్రాం రస్నే. బాబా ఇతనిని "దామూ" అని పిలిచేవారు. మిగతా వారు 'దామూ అన్నా' అని పిలుచుకునేవారు.

అహ్మద్‌నగర్‌‌కు చెందిన దామూ కడు బీదవాడు. గాజుల వ్యాపారం చేసుకుంటూ పొట్టపోసుకొనేవాడు. తరువాత అదృష్టం కలిసివచ్చి వ్యాపారంలో రాణించి ధనికుడయ్యాడు. అయితే ఇతను రెండు వివాహాలు చేసుకున్నప్పటికీ సంతానం కలగలేదు. ఆ బాధ ఇతనిని ఎంతగానో క్రుంగదీస్తుండేది. ఇతని స్నేహితుడు 'గోపాలరావు గుండు' కోపర్‌గాఁవ్‌‌లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌‌గా పనిచేసేవాడు. ఇతనికి ముగ్గురు భార్యలున్నా సంతానం లేదు. ఇతను బాబాకు గొప్పభక్తుడు. సాయి ఆశీర్వాదబలంతో ఒక కొడుకు పుట్టాడు. ఆ ఆనందంలో గోపాలరావు బాబా అనుమతితో శిరిడీలో ఉరుసు ఉత్సవాన్ని ప్రారంభించాడు. గోపాలరావు సిఫారసుతో దామూ 1893 లో శిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకొని, ఆయన ఆశీస్సులతో సంతాన భాగ్యాన్ని పొందాడు. అందుకు కృతజ్ఞతగా ఉరుసు ఉత్సవంలో ప్రతి ఏటా ఒక జెండాను కానుకగా ఇవ్వాలని గోపాలరావు దామూకు పురమాయించాడు. అలాగే నానాసాహెబు నిమోన్కర్‌‌ను మరో జెండా కానుకగా ఇవ్వమని పురమాయించాడు. ఈ రెండు జెండాలను ఉత్సవం జరిగే వేళలో మసీదు రెండు మూలలా నిలబెట్టి ఎగురవేసేవారు. శిరిడీలో 1897 సంవత్సరంలో శ్రీరామనవమినాడు ఉరుసు ఉత్సవం ప్రారంభమైంది. ఆనాటి ఉత్సవానికి హాజరైన దామూ ఆనాటి నుంచి పతాకాన్ని కానుకగా ఇవ్వటాన్ని సంప్రదాయంగా పెట్టుకున్నాడు. ఉత్సవానికి వచ్చే బీదలకు దామూ అన్నదానం చేసేవాడు. ఈ సంప్రదాయం ఇప్పటికీ శిరిడీలో అమలులో ఉంది.

ఒకసారి బొంబాయికి చెందిన ఓ స్నేహితుడు ప్రత్తి వ్యాపారంలో తనతో భాగస్వామిగా చేరి, రెండు లక్షల రూపాయల లాభం ఆర్జించవచ్చని దామూకు ఆశ పెట్టాడు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుందని, ఎంతమాత్రం నష్టానికి అవకాశం లేదని, కనుక అవకాశాన్ని పోగొట్టుకోక వెంటనే భాగస్వామిగా చేరమని దామూకు ఉత్తరం రాశాడు. దాము ఆ బేరంలోకి దిగాలా? వద్దా? అని సందేహపడ్డాడు. వెంటనే ఏ నిర్ణయం తీసుకోలేకపోయాడు. కానీ, లాభం వస్తుందనగానే అతని మనసు అటువైపు లాగింది. అయినా తాను బాబాకు భక్తుడు కావటంవల్ల ఈ విషయమై శ్యామాకు వివరంగా ఒక లేఖ రాసి బాబా సలహాను అడిగి తెలుసుకొమ్మన్నాడు. మర్నాడు ఆ ఉత్తరం శ్యామాకు అందింది. శ్యామా దానిని తీసుకుని మసీదుకు వెళ్లి బాబా ఎదుట పెట్టాడు. బాబా ఆ కాగితం ఏమిటని శ్యామాను అడిగారు. అహ్మద్‌నగర్ నుంచి దామూ అన్నా ఏదో విషయమై సంశయం తీర్చుకునేందుకు లేఖ రాశాడని శ్యామా చెప్పాడు.

“దామూ ఏమి రాశాడు? ఏం ఎత్తులు వేస్తున్నాడు? భగవంతుడు ఇచ్చిన దానితో సంతుష్టి చెందక ఆకాశానికి ఎగరాలని చూస్తున్నట్టున్నాడు. వాడు రాసిన ఉత్తరం చదువు” అన్నారు బాబా. శ్యామా ఆశ్చర్యపోయాడు. ఆ ఉత్తరంలో ఉన్న దానికే బాబా సమాధానమిచ్చారు. ఇక చదవటానికి ఏముంది కనుక? అప్పుడు శ్యామా బాబాతో, “దేవా! నువ్విక్కడే కూర్చుని భక్తులను ఆందోళనలపాలు చేస్తావు. వారు వ్యాకులపడితే ఇక్కడకు ఈడ్చుకుని వస్తావు. కొందరిని ప్రత్యక్షంగా, మరికొందరిని ఉత్తరముల రూపంలో తీసుకువస్తావు. ఉత్తరంలోని సంగతులు తెలిసి మళ్లీ నన్నెందుకు చదవమంటావు?” అన్నాడు. బాబా “శ్యామా! దయచేసి ఉత్తరంలో ఏముందో చదువు. నా నోటికి వచ్చినది నేను మాట్లాడతాను. నన్ను విశ్వసించే వారెవరు చెప్పు?” అన్నారు.

అప్పుడు శ్యామా ఉత్తరాన్ని చదివాడు. బాబా దానిని జాగ్రత్తగా విని ఇలా అన్నారు: "సేఠుకు పిచ్చెక్కినట్టుంది. 'అతనింట ఏ లోటూ లేద'ని సమాధానం రాయి. తనకున్న సగం రొట్టెతో సంతుష్ఠి చెందమను. లక్షలార్జించాలని ఆయసపడవద్దని చెప్పు”. శ్యామా అదే విషయాన్ని దామూకు సమాధానంగా రాశాడు.

బాబా సమాధానం కోసమే ఆతృతతో ఎదురుచూస్తున్న దామూ ఆ ఉత్తరాన్ని చదివి నిరాశకు గురయ్యాడు. తన ఆశ అడియాస అయిందని నిరాశ చెందాడు. బాబాను లేఖ ద్వారా సమాధానం కోరటానికి, స్వయంగా కలిసి విజ్ఞప్తి చేయటానికి తేడా ఉంటుందని భావించి దామూ శిరిడీకి బయల్దేరాడు. బాబాకు నమస్కారం చేసి, పాదాలు వత్తుతూ కూర్చున్నాడు. అయితే తన వ్యాపారం విషయాన్ని బహిరంగంగా బాబా ఎదుట ప్రస్తావించటానికి అతనికి ధైర్యం సరిపోలేదు. "ఈ విషయంలో బాబా తనకు సహాయం చేస్తే ప్రత్తి వ్యాపారంలో వచ్చే లాభంలో సగం బాబాకు ఇస్తాను" అని దామూ మనసులో అనుకొన్నాడు. అయితే, బాబా అందరి అంతరంగాలను చదివే సర్వజ్ఞులు కదా! అందరి భూత, భవిష్యత్తులు బాబాకు అరచేతిలో ఉసిరికాయ వంటివి. దామూ అన్నా మనసులోని ఆలోచనను బాబా కనిపెట్టారు. బిడ్డలు తీపి మాత్రలే కోరుకుంటారు. కానీ బిడ్డల ఆరోగ్యాన్ని కోరి తల్లి వారికి చేదు మాత్రలనిస్తుంది. తీపివస్తువులు ఆరోగ్యానికి చేటు తెస్తాయి. చేదుమాత్రలు ఆరోగ్యాన్ని నయం చేస్తాయి. తల్లి తన బిడ్డ మేలు కోరి బుజ్జగించి చేదు మాత్రలనే మింగిస్తుంది. బాబా దయగల తల్లి వంటివారు. తన భక్తుల భూత, భవిష్యత్, వర్తమానముల లాభముల గురించి బాబాకు తెలియనిది లేదు. దామూ అన్నా మనసును కనిపెట్టిన బాబా ఇలా అన్నారు: "ప్రపంచ విషయాల్లో తగుల్కొనటానికి నాకిష్టం లేదు”. తను మనసులో అనుకున్నది బాబా గ్రహించారని ఆశ్చర్యపోయిన దామూ ఇక తన వ్యాపార ప్రస్తావనను విడిచి పెట్టాడు.

మరోసారి దామూ అన్నా ధాన్యముల వ్యాపారం చేయాలని తలచాడు. ఈ ఆలోచనను కూడా బాబా కనిపెట్టి, “దామూ! నువ్వు అయిదుసేర్ల చొప్పున కొని ఏడుసేర్ల చొప్పున అమ్మాల్సి ఉంటుంది. కనుక ఈ వ్యాపారాన్ని కూడా మానుకో!" అని సలహా ఇచ్చారు. కొన్నాళ్ల వరకు ధాన్యం ధర బాగానే ఉంది. కానీ, ఒకటి రెండు నెలల తరువాత వర్షాలు  విస్తారంగా కురిసి ధరలు పడిపోయాయి. ధాన్యం నిల్వ చేసిన వారంతా నష్టాల పాలయ్యారు. ఈ అవస్థ నుంచి బాబా దామూను కాపాడారు. అనంతరం కొద్దిరోజులకు ప్రత్తి వ్యాపారం కూడా పడిపోయింది. దామూకు ఇంతకుముందు వ్యాపారంలో లాభాన్ని ఆశ పెట్టిన మిత్రుడు ఇంకొక మిత్రుని సాయంతో వ్యాపారంలోకి దిగాడు. ఆ వ్యాపారంలో వారిద్దరు తీవ్రంగా నష్టపోయారు. బాబా తనను రెండుసార్లు వ్యాపారంలో గొప్ప నష్టాల నుంచి కాపాడారని భావించిన దామూ బాబాపై మరింత విశ్వాసాన్ని పెంచుకున్నాడు. అప్పటినుంచి బాబా మహాసమాధి చెందేవరకు దామూ బాబాకు నిజమైన భక్తుడిగానే మసలుకొన్నాడు. దురాశపడక, ఉన్నదానితోనే తృప్తిచెందటం నేర్చుకొన్నాడు.

ఇంతకుముందు దామూకు బాబా సంతానభాగ్యం కలిగించారని తెలుసుకున్నాం కదా! ఆ లీలను బాబా ఎంతో చమత్కారంగా నడిపారు. "శ్రీసాయి సచ్చరిత్ర"లో ఈ ఉదంతం 'ఆమ్రలీల'గా వర్ణింపబడింది. దామూ అన్నాకు ఇద్దరు భార్యలు. కానీ సంతానం మాత్రం కలగలేదు. ఎందరో జ్యోతిష్కులను కలిశాడు. అతను కూడా స్వయంగా తనకు సంతాన యోగం ఉందో లేదో తెలుసుకోవటానికి జ్యోతిష శాస్త్రాన్ని చదివాడు. తన జాతకంలో దుష్టగ్రహ ప్రభావం ఉండటంవల్ల సంతానం కలిగే అవకాశం లేదని తెలుసుకొన్నాడు. ఈ క్రమంలో గోపాలరావుగుండు ద్వారా బాబా గురించి తెలుసుకున్న దామూ అతని సూచన మేరకు 1893-94 ప్రాంతంలో శిరిడీ వచ్చాడు. అతను శిరిడీలో అడుగు పెట్టటానికి కొద్దిక్షణాల ముందు బాబాకు రాళే అనే భక్తుడు గోవా నుంచి మామిడిపండ్లను పార్శిలు ద్వారా పంపాడు. వాటిని రాళే శ్యామా పేరున పంపాడు. శ్యామా వాటిని బాబాకు అందచేశాడు. బాబా పార్శిలు బుట్టలోని మామిడిపండ్లను మసీదులో ఉన్న భక్తులందరికీ పంచారు. నాలుగు పండ్లను మాత్రం తీసి ప్రక్కన పెట్టారు. ఆ నాలుగు పండ్లను తన కొలంబా (కుండ)లో భద్రపరచి, "ఈ నాలుగూ దామూవి. అవి ఇక్కడే ఉండాలి” అన్నారు. ఇంతలో దామూ మసీదులో అడుగుపెట్టాడు. బాబా అతనిని చూస్తూనే, “రావయ్యా దామూ! అందరి కళ్లూ ఈ మామిడిపండ్ల పైనే ఉన్నాయి. కానీ అవి నీ కోసమే ఉంచాను.  వాటిని నీవే తిని చావాలి" అన్నారు. బాబా మాటలు వినటంతోనే దామూ ఉలిక్కిపడ్డాడు. బాబా ముఖ్యభక్తుడు మహల్సాపతి వెంటనే అందుకుని, “బాబా 'చావాలి' అన్నది అహంకారం గురించి. అదొక ఆశీర్వాదం వంటిది” అని దామూకు సర్దిచెప్పాడు. అప్పుడు బాబా దామూతో, “ఈ మామిడిపండ్లను నీ చిన్న భార్యకివ్వు. ఈ ఆమ్రలీల (మామిడిపండ్ల చమత్కారం) వల్ల ఆమెకు నలుగురు కొడుకులు, నలుగురు కుమార్తెలు పుడతారు” అని చెప్పారు. దామూ ఆ నాలుగు మామిడిపండ్లను తన చిన్న భార్యకిచ్చాడు. కొంతకాలానికి బాబా మాటలు నిజమయ్యాయి. జ్యోతిష్కుల మాటలు ఉత్తవయ్యాయి. అప్పుడే కాదు, ఇప్పటికీ బాబా వాక్కు, ఆశీర్వాదాలు భక్తులను కాచి కాపాడుతున్నాయి.

ఈ సందర్భంలో బాబా దామూకు అమూల్యమైన అభయాన్నిచ్చారు. “సమాధి చెందినప్పటికీ నా సమాధినుంచే నా ఎముకలు మాట్లాడతాయి. అవి మీకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తాయి. మనఃపూర్వకంగా నన్ను శరణుజొచ్చిన వారితో కూడా నా సమాధి మాట్లాడుతుంది. వారి వెన్నంటి కదులుతుంది. నేను మీ వద్ద ఉండనేమోనని భయంవద్దు. నా ఎముకలు మాట్లాడుతూ మీ క్షేమాన్ని కనుగొంటాయి. ఎల్లప్పుడూ నన్నే గుర్తుంచుకోండి. నాయందే హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా నమ్మకం ఉంచండి. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందుతారు” అని బాబా పలికారు. ఇది జరిగాక దామూకు బాబాపై భక్తి, విశ్వాసాలు మరింత స్థిరమయ్యాయి. ఒకసారి అతనికి బాబా సమక్షంలో కలిగిన రెండు సందేహాలు ఎలా పటాపంచలయ్యాయో అతను డైరీలో రాసుకున్నాడు. దాని ప్రకారం...

ఒకసారి దామూ అన్నా బాబా పాదాలు వత్తుతూ మసీదులో కూర్చున్నాడు. ఆ సమయంలో దామూకి రెండు సందేహాలు కలిగాయి. ఒకటి- బాబాను నిత్యం ఎందరో దర్శించుకుంటున్నారు కదా! వారందరూ నిజంగా మేలు పొందుతున్నారా? రెండవది దామూ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సందేహం. అది- బాబా భౌతిక శరీరం విడిచాక నా జీవితం ఏం కాను? నా జీవితమనే ఓడను ఎలా నడుపగలను? అది ఎటో అటు కొట్టుకుపోవాల్సిందేనా? అలా అయితే నా గతేం కాను? బాబా దామూలో కలిగిన రెండు సందేహాలను తన సర్వజ్ఞతతో గ్రహించారు. వాటినిలా తీర్చారు. “దామూ! పూర్తిగా పూత పూసి ఉన్న మామిడిచెట్ల వైపు చూడు. ఆ పువ్వులన్నీ పండ్లయితే ఎంత మంచి పంట అవుతుంది! కాని అలా జరుగుతుందా? పువ్వు పుట్టగానే చాలామటుకు సహజంగానే రాలిపోతుంది. కొంత గాలికి రాలిపోతుంది. చివరికి కొన్ని పిందెలు మాత్రమే మిగులుతాయి”. బాబా చూపిన ఉదాహరణతో దామూలో కలిగిన మొదటి సందేహం తీరిపోయింది.

అంటే, ఎందరో ఎన్నో కోరికలతో భగవంతుడిని దర్శిస్తారు. నిజంగా భగవంతునిపై నిజమైన భక్తి, విశ్వాసాలు గలవారు మాత్రమే తుదకంటూ భగవన్నామ స్మరణతో తరిస్తారు. అలాంటి నిజ భక్తులే భగవంతుని వల్ల మేలు పొందుతారు. తమపై, భగవంతునిపై సరైన విశ్వాసం లేని భక్తులు పూత, పిందెల్లా తొలిదశలోనే రాలిపోతారని బాబా చెప్పిన దానికి భావం.

ఇక, రెండవ సందేహాన్ని బాబా ఇలా తీర్చారు. “ఎక్కడైనా, ఎప్పుడైనా నా గురించి చింతిస్తే నేను అక్కడే ఉంటాను”.

దామూ బాబా పాదాలను మరింత స్థిరంగా వత్తుతూ తన్మయుడయ్యాడు. ఆ తరువాత తనకు కలిగిన అనుభవాన్ని, తన జీవితంలోని ముఖ్య సంఘటనలను కూడా తన డైరీలో ఇలా రాసుకున్నాడు.

"1918కి ముందు బాబా వాగ్దానం ప్రకారం తన వాక్కులను నెరవేర్చారు. 1918 తరువాత కూడా నెరవేరుస్తున్నారు. ఇప్పటికీ బాబా నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుతున్నారు. ఈ సంఘటన 1910-11 మధ్య కాలంలో జరిగింది. కాలక్రమంలో నా సోదరులు వేరుపడ్డారు. నా సోదరి కాలధర్మం చెందింది. నా ఇంట్లో దొంగతనం జరిగింది. పోలీసుల విచారణ జరిగింది. ఈ సంఘటలన్నీ నన్ను కలవరపరిచాయి. నా సోదరి మరణంతో నా మనసు వికలమైంది. నేను జీవితంలోని సుఖాలను లక్ష్యపెట్టలేదు. అన్నిటినీ వదిలేసి ఆ సమయంలో నేను బాబా వద్దకు వెళ్లి నమస్కరించాను. వారు మంచి ఉపదేశంతో నా మనసును శాంతింపచేశారు. అప్పా కులకర్ణి ఇంట్లో నాకు బొబ్బట్లతో విందు చేయించారు. నా నుదుట చందనం పూశారు. అనంతరం కొంతకాలానికి నా ఇంట్లో దొంగతనం జరిగింది. నాకు ముప్పై  సంవత్సరాలుగా ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడే మిత్రద్రోహంతో నా భార్య నగలపెట్టెను అపహరించుకుపోయాడు. అందులో శుభకరమైనదైన నత్తు (నాసికాభరణం) ఉంది. బాబా చిత్రపటం ముందు జరిగిన దానికి చింతిస్తూ ఏడ్చాను. ఆ మరుసటిరోజే నా స్నేహితుడే స్వయంగా వచ్చి నగలపెట్టెను నాకు అందచేసి, తను చేసిన పనికి క్షమాపణ కోరాడు”.

తనకు సంతానం కావాలనే కోరికతో దామూ బాబాను దర్శించుకున్నాడు. బాబా దయవల్ల ఆ కోరిక తీరగానే అతను బాబాపై భక్తి, విశ్వాసాలను కుదుర్చుకున్నాడు. ఆ తరువాత మెల్లగా బాబా అతనికి లౌకిక విషయాలపై విరక్తి కలిగించి పునీతుడ్ని చేశారు. ఈ మహాభక్తుడు 20-01-1941న సాయిలో ఐక్యమైనారు.

శ్రీ సాయినాథాయనమః

సోర్స్ : కుమార్ అన్నవరపు గారు రచించిన "సాయి భక్త సుధ"

దామూ అన్నా కుటుంబం

బాబా దయ!


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

నా పేరు శివకుమారి. మా నివాసం గుంటూరు. బాబా ఇచ్చిన అనుభవాలను ఇలా బ్లాగు ద్వారా సాయిబంధువులతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా మా అబ్బాయి విషయంలో బాబా ఇచ్చిన అనుభవాన్ని చెప్తాను.

మా అబ్బాయి చదివింది ఫార్మసీ. కానీ సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాడు. తనకి విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చింది. ఐతే వీసా విషయంలో స్టడీస్ గురించి ప్రశ్నలు వస్తాయేమో, అది సమస్య అవుతుందేమోనని మేమంతా చాలా భయపడ్డాము. "బాబా! మీకు ఇష్టమైతే తనకి వీసా వచ్చేలా చేయండి, లేకపోతే లేదు" అని చెప్పుకుని పూర్తిగా భారం బాబాపై వేశాం. బాబా కరుణామయుడు. ఆయన తన బిడ్డల కోరికలు నెరవేరుస్తారు కదా! ఆయన దయవలన స్టడీస్ గురించి కాకుండా వేరే చిన్న చిన్న ప్రశ్నలిచ్చి వీసా ఆమోదించారు.

ఇక మా మనుమరాలి విషయంలో కూడా బాబా దీవెనలు అద్భుతం ...

పుట్టుకతోనే పాప గుండెలో రంధ్రం ఉంది. అది దానంతటదే మూసుకుపోవడం కష్టం. కాబట్టి 6వ నెలలో పాపకి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. మేము బాబానే నమ్ముకున్నాము. "పాపని కాపాడమ"ని బాబాను ప్రార్థించి, రోజూ పాపకి ఊదీ పెట్టి, తన దగ్గరే కూర్చొని సచ్చరిత్ర పారాయణ చేసాము. 8వ నెలలో వైద్యులను సంప్రదిస్తే, మళ్ళీ ఈకో(echo) టెస్ట్ చేయించమన్నారు. రిపోర్ట్స్ చూసిన కార్డియాలజిస్ట్, "రంధ్రం(హోల్) మూసుకుపోయింది, శస్త్రచికిత్స అవసరంలేదు, నిజంగా ఇది మిరాకిల్" అన్నారు. ఇదంతా బాబా కరుణే! "బాబా! చాలా చాలా ధన్యవాదాలు బాబా!".

కొత్త సంవత్సరంలో బాబా ఇచ్చిన బహుమతి...


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

నా పేరు మౌనిక. రీసెంట్‌గా జరిగిన సంతోషకరమైన నా అనుభవాన్ని మీతో పంచుకుంటాను. నేను మొదటినుంచి అమ్మవారికి, సుబ్రహ్మణ్యస్వామికి భక్తురాలిని. నా స్నేహితురాలు సుమ బాబాకి గొప్ప భక్తురాలు. ఒకరోజు నేను తనతో, "సాయిభక్తుల గ్రూపులో జాయిన్ అవ్వాలని ఉంది, ఏదైనా అవకాశం ఉందా?" అని అడిగాను. వెంటనే తను కొన్ని బాబా గ్రూపుల లింక్స్ పంపించింది. నేను కూడా వెంటనే ఆ గ్రూపుల్లో జాయిన్ అయ్యాను. అయితే, "సుబ్రహ్మణ్యస్వామి భక్తురాలినైన నేను సాయిని పూజించడం సరైనదేనా?" అనే సందేహం నాకు వచ్చింది. ఇదే విషయంగా రోజూ ఆందోళనపడుతూ ఉండేదాన్ని. ఇలా ఉండగా డిసెంబర్ 23న సాయి టివి వాళ్ళు నిర్వహించిన సాయినాథోత్సవానికి వెళ్ళినప్పుడు సుమను కలిశాను. ఆ సమయంలో సుమ నాతో, "మా చెల్లి శివునికి, వెంకటేశ్వరస్వామికి భక్తురాలు. కానీ సాయిని తన గురువుగా ఆమోదించింది" అని చెప్పింది. దానితో నా మనస్సులో ఉన్న ఆందోళనకు సమాధానం దొరికిందని నాకర్థమైంది. ఈ విధంగా సుమ ద్వారా బాబాయే నా అనుమానాలు తొలగించారని అనుకుని ఆ క్షణాన బాబాని నా గురువుగా నిర్ధారించుకున్నాను. అప్పటినుండి ఆయన ప్రభావం నా జీవితంలో రోజూ కనిపిస్తూ ఉండేది.

2018, డిసెంబరులో అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫికేషన్ కోసం నేను నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ వ్రాసాను. అది చాలా కఠినమైన పరీక్ష. ఎందుకంటే దేశమంతటా ఆ పరీక్షకి లక్షలాదిమంది హాజరైతే, కేవలం 6 శాతం ఉత్తీర్ణత ఉంటుంది. అందులో నేను ఉత్తీర్ణురాలిని అయ్యేలా అనుగ్రహించమని దేవుడిని ప్రార్థించాను. తద్వారా నాకు మానసికధైర్యం చేకూరుతుందని నా ఆశ. నేను డిసెంబర్ 20 గురువారంనాడు పరీక్ష వ్రాసాను. అదేరోజు నేను మూడవసారి బాబాకి శనగలతో మాల సమర్పించాను. నాకెందుకో బాబా నన్ను ఆశీర్వదించినట్లుగా అనుభూతి కలిగింది. అమ్మవారు, సుబ్రహ్మణ్యస్వామి, బాబా ఆశీస్సులతో నాకంతా అనుకూలంగా ఉంటుందని నమ్మకం కలిగింది. తుదిఫలితాలు కూడా గురువారంరోజే వస్తాయని నోటిఫికేషన్‌లో ప్రస్తావించారు. అది కూడా నా నమ్మకాన్ని దృఢపరిచింది. పదిరోజుల తరువాత ఆ పరీక్షకి సంబంధించిన 'కీ' విడుదలైంది. కానీ నాకెందుకో 'కీ' చూడాలనిపించలేదు. తుదిఫలితాలు విడుదలైనప్పుడే తెలుసుకోవాలనిపించింది.

అదృష్టవశాత్తూ డిసెంబర్ 31న ఒక సాయిభక్తుడిని కలిసాను. అంతకుముందు ఎప్పుడూ అతనితో పరిచయం లేదు, అదే మొదటిసారి. కొంతసేపు మాట్లాడిన తరువాత నేను వెళ్లిపోతుండగా అతను కాస్త ఆగమని, ఒక బాబా ఫోటో నా చేతిలో పెట్టి, "హ్యాపీ న్యూ ఇయర్" అని చెప్పారు. అవే నేనందుకున్న మొదటి నూతనసంవత్సర శుభాకాంక్షలు. పైగా సాయిభక్తుని ద్వారా సాయి ఫొటోతో పాటు! కాసేపు ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. కానీ బాబా నాకోసం వచ్చారు, నాకంతా మంచి చేస్తారని ఆనందం పట్టలేకపోయాను. తరువాత జనవరి 5న ఫలితాలు వచ్చాయి. 60.67% తో నేను ఉత్తీర్ణురాలినయ్యాను. ఇది నిజంగా భగవంతుడిచ్చిన అద్భుతమైన బహుమతి. 2019లో ఈ మొదటి బహుమతితో బాబా నాచేత కొత్త జీవితాన్ని మొదలుపెట్టించారు. నేను ఎంత ఆనందాన్ని పొందానో మాటల్లో వివరించలేను. సాయికి నేనొక అనుమానపడే భక్తురాలినైనప్పటికీ, ఆయన దాన్నేమీ పట్టించుకోకుండా డిసెంబర్ 31న ఫోటో రూపంలో "నేను నీ కోసం వచ్చాన"ని చేసిన వాగ్దానాన్ని ఈ సంతోషం ద్వారా నిరూపించారు. తరువాత నేను సాయిలీలామృతం సప్తాహపారాయణ చేశాను. ఆ సమయంలో కూడా ఆయన కృపవలన అన్ని అడ్డంకులు దాటి పూర్తి చేయగలిగాను. ఏదో మామూలుగా బాబాను ప్రార్థించినా, ఆయన నాకు అండగా నిలిచి, నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. "బాబా! దయచేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా కోరికలన్నీ తీర్చండి. తెలిసి, తెలియక చేసిన నా తప్పులను మన్నించండి".

నమ్ముకున్న వాళ్లకి బాబా ఎప్పుడూ రక్షణ కవచమే.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

దీపా సావంత్ ముంబైలో నివసిస్తూ కంప్యూటర్ ఆపరేటర్‌‌గా పనిచేస్తూ ఉండేవారు. ఆమె కుటుంబమంతా బాబా భక్తులు. వాళ్లంతా వారి నుదుటిపై బాబా ఊదీ పెట్టనిదే ఇంటి నుండి బయటికి వెళ్లరు. ఊదీని వాళ్ళ జీవితానికి కవచంగా, చీడపీడలన్నింటి నుండి రక్షణగా భావించి వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ వారి పర్సులో ఒక ఊదీ ప్యాకెట్ ను ఉంచుకునేవారు. ఇప్పుడు చెప్పబోయే లీల వర్షాకాలంలో జరిగింది. అది 1996, జూన్ 15. ఆరోజు సాయంత్రం పని పూర్తి చేసుకొని ఆఫీసు నుండి దీప తన ఫ్రెండ్‌‌తో కలిసి బస్టాప్‌‌కి వెళ్తున్నారు. ఆ సమయంలో తుఫాను కారణంగా వర్షపు నీరు రోడ్డుమీద నదిలా ప్రవహిస్తూ ఉంది. అందువలన వాళ్ళు రోడ్డుకు ఒక చివర్లో నడుస్తూ ఉన్నారు. అంతలో ఎదురుగా వస్తున్న బస్సును చూసి బస్సు ప్రక్కనుండి పోతుందన్న ఉద్దేశ్యంతో దీప తన కుడివైపుకు ఒక అడుగువేసింది, హఠాత్తుగా ఆమె లోతైన గొయ్యిలో పడిపోయింది. రహదారి మరమ్మత్తు పనుల కోసం రోడ్డు త్రవ్వబడి ఉందన్న విషయం ఆమెకు తెలియక పోవడంతో అంతపెద్ద ప్రమాదం సంభవించింది. వెంటనే తన స్నేహితురాలు దీపని కాపాడటానికి దీప చేతిని పట్టుకుంది. కానీ, దీప పడిపోతున్న ఫోర్స్ లో ఆమెను కూడా గొయ్యిలోకి లాగుతుండటంతో ఆమె దీప చేతిని విడిచిపెట్టేసింది.

దీప ఆ గొయ్యి లోతుల్లోకి జారిపోతూ ఒక వేలితో ఒక చెట్టు వేరు గట్టిగా పట్టుకొని సహాయం కోసం గట్టిగా అరవసాగింది. అంతలో అటుగా వస్తున్న ఆమె సహోద్యోగులు ముగ్గురు మగవాళ్ళు ఆమె అరుపులు విన్నారు. వెంటనే వాళ్ళు పరుగున వచ్చి ఎలాగో మొత్తానికి కష్టపడి ఆమెను బయటకు తీశారు. జరిగిన దుర్ఘటనకు ఆమె భయభ్రాంతురాలైంది. ఇంటికి చేరుకున్నాక జరిగిన దాని గురించి తన తల్లికి చెప్తూ, "నేను చెట్టు వేరు పట్టుకొన్న వేలికి బాబా ఉంగరం ఉంది. నా పర్సులో ఊదీ ఉంది. అందువల్ల నేను  నీళ్లలో సమాధి కాకుండా బాబా కాపాడారు" అని చెప్పింది. నిజంగా అది బాబా మహిమే! లేకపోతే ఒక్క వేలితో చెట్టు వేరు పట్టుకోవడం సాధ్యమేనా?

కొన్నిరోజుల తరువాత నీరు ఎండిపోయాక, ఆమె ఆ గోతిని చూసింది. అది దాదాపు 20 అడుగుల లోతు ఉంది. పైగా దాని దిగువన కొన్ని ఇనుప కడ్డీలు ఉన్నాయి. నిజంగా వాటిపై పడి ఉంటే ఏమి జరిగేదో? బాబా కృపవలన చిన్న చిన్న గాయాలతో ఆమె బయటపడింది.

రైలు ప్రమాదం నుండి ఆమెను ఒక వృద్ధుడు కాపాడాడు.

కొంతకాలానికి దీప కుటుంబం కుర్లాకు మారారు. ఆమె తన ఉద్యోగ విధులకు హాజరు కావడానికి రోజూ రైలులో వెళ్ళాల్సి వచ్చేది. ఒకరోజు ఉదయం ఆమెకు ఆలస్యమై కండివాలి స్టేషన్ లో ప్రవేశించేసరికి ఆమె ఎక్కాల్సిన రైలు కదులుతోంది. ఆమె పరుగున ఒక బోగీలో ఎక్కడానికి ప్రయత్నించింది, కానీ బోగీ ప్రవేశ ద్వారం వద్ద ప్రయాణికులు అడ్డంగా ఉన్నారు. అయినప్పటికీ ఆమె తొందరలో డోర్ వద్ద ఉన్న హేండిల్ పట్టుకుని ఒక అడుగు బోగీలో పెట్టింది. అప్పటికే రైలు ప్లాట్ ఫారం దాటింది. ఏమాత్రం అదుపుతప్పినా ఆమె ట్రాక్ పై పడిపోతుంది అటువంటి భయంకర పరిస్థితి అది.

ఆ సమయంలో ఎక్కడనుండి ప్రత్యక్షమయ్యాడో తెలియదు గాని ఒక వృద్ధుడు హఠాత్తుగా ఆమె ఎదుట కనిపించి ఆమెను బోగీ లోపలకి లాగి ఆమె జీవితాన్ని కాపాడాడు. ఆమె అతనికి కృతజ్ఞతలు చెప్పాలని చూసేసరికి అతను అదృశ్యమైపోయాడు.

ఆ సాయంత్రం ఆమె, జరిగిన ఆ అసాధారణ ప్రమాదం గురించి తీవ్రంగా ఆలోచించగా ఆమెకు ఒక విషయం అర్థమయ్యింది. ప్రతినెలా వచ్చే అమావాస్య రోజే తనకిటువంటి ప్రమాదాలు ఎదురవుతున్నాయని గ్రహించింది. ఆరాత్రి ఆమె బాబాకు ఒక కొబ్బరికాయ కొట్టి, ప్రతి అమావాస్యకి తనకు సంభవించే ఇటువంటి ప్రమాదాల నుండి తనను కాపాడమని ప్రార్థించింది. అలా బాబా సహాయం అర్థించిన తరువాత బాబా దయవలన ఆమెకు ఎటువంటి ప్రమాదం ఎదురుకాలేదు.

మూలం: శ్రీ సాయి సాగర్ పత్రిక, దీపావళి ఇష్యూ 1996, విన్నీ చిట్లూరు గారి రచించిన బాబా'స్ డివైన్ సింఫొనీ.

శ్రీసాయిని సజీవంగా దర్శించిన సఖాజీ.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

1918లో మహాసమాధి చెందిన శ్రీసాయిబాబాను, వారు సజీవులై ఉండగా దర్శించుకున్న భక్తులు 1988 నాటికి ఎందరో ఉన్నారు. అప్పటికి సజీవులైవున్న ఆ తరం సాయిభక్తుల వద్ద - అందరివద్దా కాకపోయినా, కొందరివద్దనైనా - శ్రీసాయిచరిత్రకు సంబంధించి ఎన్నో అమూల్యమైన విశేషాలు లభించగలవన్న ఉద్దేశ్యంతో అత్యవసర ప్రాతిపదికపై, ఎంతో వ్యయప్రయాసలకోర్చి శ్రీసాయిచరిత్రను సమగ్రవంతం చేయాలన్న బృహత్తర కార్యక్రమాన్ని సాయిపథం చేపట్టింది. ఆ బృహత్తర ప్రణాళికలో భాగంగా సాయిపథం వారు చేసిన ఇంటర్వ్యూల నుండి ముందుగా సాయిపథం వాల్యూమ్-1 లో ప్రచురింపబడిన శ్రీసఖాజీ గారితో జరిపిన ఇంటర్వ్యూను ఈరోజు మీకు అందిస్తున్నాం.

శ్రీసాయిబాబా సజీవులై ఉన్నప్పుడు దర్శించిన శ్రీసఖాజీ పుణతంబాకు సుమారు 15, 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న 'సాయిఖేడ్ గంగ' అనే గ్రామంలో నివసించేవారు. ఈ పుణతంబా సమీపంలోనే బాబాను మొదటిరోజుల్లో దర్శించుకున్న మహాత్ముడు శ్రీగంగగిర్ మహరాజ్ ఆశ్రమం ఉంది. సాయిఖేడ్ గంగ చిన్న మారుమూల పల్లె. సాయిపథం బృందం ఆయనను ఇంటర్వ్యూ చేయడానికి 1988 జనవరిలో వెళ్ళేటప్పటికి ఆయనకు సుమారు 95 సంవత్సరాల వయసుంటుంది. నిరక్షరాస్యుడు. వృత్తి వ్యవసాయం. కాయకష్టం చేసినందువల్ల కాబోలు అంత వయస్సులోనూ దృఢంగా, ఆరోగ్యంగా ఉన్నారు. మరో రాష్ట్రంనుండి, అంతదూరం ఎంతో ప్రయాసతో శ్రీసాయిబాబా గురించి తెలుసుకోవడానికి వచ్చిన బృందాన్ని చూచి ఆయనెంతో ఆనందించారు. సుమారు రెండు గంటలసేపు అడిగిన ప్రశ్నలకు అన్నింటికీ ఓపికగా సమాధానం చెప్పారు. ఎన్నో ప్రశ్నలకు - తనకు సమాధానం తెలియకపోతే - తెలియదనీ, గుర్తులేదనీ నిష్కపటంగా, నిజాయితీగా జవాబిచ్చారు. శ్రీసాయి చరిత్రకు సంబంధించి ఆసక్తికరమైన విశేషాంశాలేవీ ఆ ఇంటర్వ్యూలో లభించలేదు గాని, శ్రీసఖాజీ తాము బాబాను దర్శించిన వైనాన్ని, తమ అనుభవాలను గూర్చి చెప్పిన దాని సారాంశం ఇది:

“నేను బాబాను మొదటిసారి దర్శించినప్పుడు చాలా చిన్నవాణ్ణి. 14, 15 సంవత్సరాల వయస్సుంటుందేమో! మా ఊర్లో చాలాకాలంగా వర్షాలు లేక పంటలు బొత్తిగా పాడైపోయినాయి. అప్పుడు మా ఊరినుండి కొంతమంది పెద్దలు శిరిడీ వెళ్ళారు - వర్షాలు కురవడానికి బాబా ఆశీస్సుల కోసం ప్రార్థించడానికి. నేనూ, మరికొంతమంది పిల్లలమూ వారితో పాటు శిరిడీ వెళ్ళాము. బాబాకు తమ కష్టసుఖాలు నివేదించుకుని కొంతమంది పెద్దలు తిరిగి మా ఊరు వెళ్ళారు. అక్కడ బాబా దగ్గర భోజనం వగైరాలకు ఇబ్బంది లేకపోవడంతో మాలో కొంతమందిమి అక్కడే ఉండిపోయాము. శిరిడీలో అప్పుడు రమారమి మూడునెలలపాటు ఉన్నాము. బాబా మసీదు (ద్వారకామాయి)కు ప్రక్కనే ఒక గుర్రపుశాల ఉండేది. నేను రాత్రిళ్ళు అందులోనే పడుకునేవాడిని. రోజంతా తోటి పిల్లలతో ఆటపాటలతో గడిచిపోయేది. అప్పట్లో ఆటపాటలే మా లోకంగా ఉండేది. కానీ, సాధన, వేదాంతంలాంటి విషయాలు మాకేమీ తెలియవు. బాబా చాలా గొప్పవాడనీ, ఎంతో మహిమగలవాడనీ మాత్రమే మాకు తెలుసుగానీ, ఆయన గురించి, ఆయన తత్త్వం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అప్పట్లో మా వయస్సు పిల్లలకెలా ఉంటుంది - చెప్పండి?"

"బాబాకు పిల్లలంటే భలే ఇష్టం. పిల్లలు కనిపిస్తే మిఠాయిలో, ఏదో ఒక తినుబండారమో పంచేవారు. ఒక్కోసారి జేబులో ఊరకే అలా చెయ్యిపెట్టి పిడికిళ్ళతో చిల్లర డబ్బులు మాపై విసిరేవారు. అంత చిల్లర ఆయన జేబులో ఉండే అవకాశం లేదు. బాబాకు ఆ డబ్బు దేవుడు ఇస్తాడని మేము అనుకునేవాళ్ళం. కొన్నిసార్లు అలా పేడా (పాలకోవా బిళ్ళలు) కూడా పంచేవారు".

"అలాంటి దివ్యశక్తులను చూస్తుంటే పిల్లలైన మీకు భయమేసేది కాదా?” అన్న ప్రశ్నకు సమాధానంగా, "మహారాష్ట్ర దేశంలో మహాత్ముల గురించి, వారి దివ్య మహిమల గురించి చాలా చిన్ననాటినుండి వింటుంటాము. కనుక మాకు ఎటువంటి భయము వేయదు” అన్నారు.

"ఆ తర్వాత ఏదైనా ముఖ్యమైన పండుగ రోజుల్లో జరిగే ఉత్సవాలకు శిరిడీ వెళ్తుండేవాడిని. అయితే, బాబా మహాసమాధి చెందినప్పుడు మాత్రం శిరిడీ వెళ్ళడానికి నాకు వీలుపడలేదు. నా దృష్టిలో బాబా అంటే భగవంతునితో సమానమే! ('బాబా భగవాన్ కే సమాన్ హై!')" అన్నారు సఖాజీ.

పూర్తిగా తమ భక్తురాలిగా మార్చేసిన బాబా




నా పేరు అనురాధ. నేను హైదరాబాదులోని అంబర్‌పేట నివాసిని. ఒకసారి నేను నా స్నేహితురాలితో కలిసి దిల్‌సుఖ్‌నగర్ బాబా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా జనం ఉన్నారు. నేను నా స్నేహితురాలితో, "దర్శనానికి దాదాపు రెండుగంటల సమయం పట్టేలా ఉంది. అంతసేపు లైన్లో ఎవరుంటార"ని అన్నాను. మొదట్లో నా స్థితి అది. కానీ ఇప్పుడు బాబా నా ప్రాణం. ఇంతటి మార్పుకి కారణం ఒకే ఒక్క అనుభవం. దాన్నే నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

నా స్నేహితురాలు మంచి సాయిభక్తురాలు. నేను కూడా తనలా బాబా తత్త్వంలోకి రావాలని ఆశిస్తూ, ఎప్పుడూ "అనురాధకి ఒకసారి కనిపించండి బాబా. తను మిమ్మల్ని నమ్మాలి" అంటూ బాబాని ప్రార్థిస్తూ ఉండేది. తనతోటే నేను బాబా గుడికి వెళ్తూ ఉండేదాన్ని. తను ఒకసారి నాతో, "ఇంకో వారంరోజుల్లో గురుపౌర్ణమి వస్తుంది కదా, బాబా నాకు గులాబీమాల ఇస్తారు" అని చెప్పింది. 'అది నీకెలా తెలుస'ని నేను అడిగితే, "నాకు తెలుసు. ఆయన ఇస్తారు. నేను మనసులో కోరుకుంటున్నానుకదా!" అని అంది. నాకు వింతగా అనిపించింది. తరువాత గురుపౌర్ణమిరోజు ఇద్దరం కలిసి బాబా గుడికి వెళ్ళాం. బాబా దర్శనానంతరం పూజారిగారు గులాబీమాల నాకిచ్చారు. నేను దాన్ని మా ఫ్రెండ్‌కి అందిస్తూ, "బాబా మాల కావాలని బాబాని అడుగుతున్నావు కదా, ఇదిగో తీసుకో!" అన్నాను. ఇక తన ఆనందానికి అవధులు లేవు. అయితే, నా మనసులో నాకొక గులాబిపువ్వు కావాలని ఉంది. కానీ నేను తనంత భక్తురాలిని కానని, బాబాకి నా కోరిక తీర్చాలని ఉండదని అనుకున్నాను. వాస్తవానికి గులాబీమాల బాబా నాకే ఇచ్చారు. కానీ నా మనసుకి ఎందుకో అప్పట్లో అది అర్థం కాలేదు. అది అర్థంకాక గులాబిపువ్వు ఇవ్వమని అడిగాను. అయితే, బాబా అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చారు.

తరువాత కొన్నిరోజులకి ఇంట్లోని కొన్ని విషయాలవలన నా మనస్సు ఏమీ బాగాలేదు. ఆ సమయంలో, "ఏమిటి బాబా! 'నాపై నీ దృష్టి నిలుపు .. నేను నీపై నా దృష్టి నిలుపుతాను' అన్నావు. మరి నన్నెందుకు చూడట్లేదు? నాకెందుకు ఇన్ని బాధలు కలిగిస్తున్నావు?" అని అనుకున్నాను. తరువాత నా మనసుకెందుకో దిల్‌సుఖ్‌నగర్ బాబా మందిరానికి వెళ్ళాలనిపించి వెళ్ళి క్యూలో నిల్చున్నాను. క్యూలో నాకన్నా ఇద్దరిముందు ఆ మందిర కమిటీ మెంబర్ భార్య ఉన్నారు. ఆమెకి పూజారిగారు గులాబీమాల ఇచ్చారు. నేను వెంటనే బాబాతో, "నాకెందుకు ఇస్తావులే బాబా! కమిటీవాళ్లకు, డబ్బున్నవాళ్లకు ఇస్తావు" అనుకుని ఒక పక్కకి వెళ్ళి కూర్చున్నాను. మనసులో మాత్రం "ఏం బాబా! ఇవ్వవా?" అని బాబాని అడుగుతున్నాను. నా ముందు గులాబీమాల తీసుకున్న ఆవిడ ఉంది. తన జడలో పువ్వు కింద పడిపోతే, "చూసుకోండ"ని ఆమెకు చెప్పాను. తను వెనక్కి తిరగకుండా ఒక గులాబీపువ్వు నాకు అందించింది. నాకు ఆశ్చర్యంగా అనిపించి, "బాబా! తను నావైపు కనీసం తిరిగి చూడకుండా గులాబిపువ్వు ఇస్తుంది. నువ్వు నా మాటలు వింటున్నావని అర్థమయింది" అని మనసులో అనుకున్నాను. మరుక్షణం తను వెనక్కి తిరిగి నన్ను చూస్తూ ఒక అందమైన గులాబిపువ్వు ఇచ్చింది. నేను తన కళ్ళలోకి చూస్తే, ఆ కళ్ళు విగ్రహరూపంలో ఉన్న బాబా కళ్ళలాగా కనపడుతున్నాయి. నాకు మతిపోయింది. ఆశ్చర్యంతో ఒక 5 నిమిషాలపాటు ఏమి జరుగుతోందో అర్థంకాని ఒక తన్మయస్థితిలో ఉండిపోయాను. బాబా నా కోరిక తీర్చడానికి ఆమె రూపంలో వచ్చి నాకు గులాబీ ఇచ్చారు. ఆ సన్నివేశంతో బాబా నన్ను పూర్తిగా మార్చేశారు. అప్పటినుండి బాబాకి అంకిత భక్తురాలిగా మారిపోయాను. అంతా బాబా దయ. ఈ సన్నివేశాన్ని నేను నా జీవితంలో మర్చిపోలేను.

మా అబ్బాయిపై బాబా కురిపించిన ఆశీస్సులు.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

కడప నుండి మాలతిగారు తమ అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. 

ఓం సాయిరామ్.
బాబా నాకిచ్చిన అనుభవాలను నేను జీవించి వున్నంతవరకు మరువలేను. అంతలా బాబా మమ్మల్ని ఆశీర్వదించారు. ఆయన నాకు చాలా అనుభవాలు ఇచ్చారు. వాటిలో ఒకటి ఇప్పుడు మీతో పంచుకుంటాను.

2012 లో మా చిన్నబాబు ఇంటర్మీడియట్‌తో పాటు IIT కోచింగ్ తీసుకుంటూ ఉండేవాడు. నేను మా అబ్బాయి చదువు విషయం బాబాకు అప్పగించి, "తనకి ర్యాంకు వచ్చేవిధంగా చదివించుకోండి బాబా!" అని చెప్పుకున్నాను. అలా భారం ఆయన మీదే వేసి నేను నిశ్చింతగా ఉండేదాన్ని. మొదటి సంవత్సరం మామూలుగానే చదివేవాడు. రెండవ సంవత్సరం నవంబర్ నాటికి మాబాబు మీద బాబా ఆశీస్సుల ప్రభావం స్పష్టంగా కనిపించింది. అంతవరకు తరగతిలో సాధారణ స్థాయిలో ఉన్న తనకి చాలా మంచి ర్యాంకు వచ్చేది. తను కూడా బాబా ఆశీస్సులతో మంచి ర్యాంకు వస్తుందనే నమ్మకంతో కష్టపడి చదివేవాడు. మన ప్రయత్నం మనం చేస్తూ బాబా మీద భారం వెయ్యాలి కదా! చివరిగా మేము ఊహించని విధంగా బాబుకి మొదటి ప్రయత్నంలోనే బాబా ఆశీస్సులతో 251వ ర్యాంకు వచ్చింది. ఢిల్లీ IIT లో EE బ్రాంచిలో సీట్ వచ్చింది. చదువు పూర్తైన వెంటనే 23 లక్షల ప్యాకేజీతో జాబ్ కూడా వచ్చింది. అదే సమయంలో యు.ఎస్.ఏ. లోని కొలంబియా యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది. ప్రస్తుతం తను యు.ఎస్.ఏ. లో ఉద్యోగం చేస్తూ మంచి స్థితిలో ఉన్నాడు. ఇదంతా బాబా ఆశీర్వాద ఫలితమే. ఇది ఒక అనుభవం మాత్రమే. ఇలాంటి అనుభవాలు నా జీవితంలో చాలానే వున్నాయి. బాబా మా మీద చూపిన కృపను ఇప్పుడిలా బ్లాగు ద్వారా పంచుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం బాబా మాకివ్వడం నిజంగా మా అదృష్టం. సాయినాథునికి నమస్సుమాంజలులు అర్పిస్తూ... "బాబా! మీ బిడ్డలందరినీ ఎల్లవేళలా కాపాడుతూ ఉండండి" అని ప్రార్థిస్తున్నాను.

నా జీవితాన్ని సంతోషంగా మార్చిన బాబా నాతో ఉన్నా గుర్తించలేని మూర్ఖుడిని.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

గుంటూరు నుండి వై.శ్రీనివాసరావుగారు తమ మరో అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

2013 అక్టోబర్ నెల దసరా సెలవుల్లో నేను నా భార్య, మా అబ్బాయిలు మరియు అత్తమామలతో కలిసి మొదటిసారి శిరిడీ వెళ్ళాను. శిరిడీ చేరుకున్నాక, ఆరోజు సాయంత్రం మేము బాబా దర్శనానికి వెళ్ళాము. బాబా మాకు చక్కటి దర్శనాన్ని అనుగ్రహించారు. ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ సమాధిమందిరం నుండి బయటకు వచ్చాక, మేము లక్ష్మీబాయిషిండే  ఇల్లు, ఆమెకు బాబా ఇచ్చిన 9 నాణెములు, ఇంకా బాబా తిరిగిన ప్రదేశాలు చూడాలని అనుకున్నాము. అంతలో నా భార్య, అత్తమామలు ఏదో పనిమీద అలా ప్రక్కకు వెళ్లారు. ఆ సమయంలో ఒక ముసలాయన చేతిలో ఒక చిన్నకర్ర పట్టుకొని, దాన్ని అటు ఇటు ఊపుతూ మా వద్దకు వచ్చి, మరాఠీలో, "బాబా తిరిగిన ప్రదేశాలు చూపిస్తాను" అని చెప్పారు. మాకు మరాఠీ భాష రాకపోయినా ఆయనను చూస్తూ తన వెనకే నేను, మా అబ్బాయిలు నడుచుకుంటూ వెళ్ళాము. ఆయన చేతిలోని కర్ర ఊపుతూ నడిచే తీరు అచ్చం బాబాలాగే ఉంది. చుట్టుప్రక్కల బాబా తిరిగిన ప్రదేశాలన్నీ ఆయన చూపించారు. తరువాత నేను ఆయన చేతిలో 10 రూపాయలు పెట్టాను. ఆయన నావైపు చూస్తూ ఒక నవ్వు నవ్వారు. తరువాత ఆయన కొంచెం దూరంగా వెళ్ళి అదే చూపు, అదే నవ్వుతో నిలుచున్నారు. కొద్దిసేపటికి నా భార్య, అత్తమామలు వచ్చారు. జరిగిన విషయం వాళ్ళకి చెప్పగా, వాళ్ళు కూడా ఆయన్ని చూస్తామని అడిగారు. చూస్తే ఆయన ఆ చుట్టుప్రక్కల ఎక్కడా కనపడలేదు. అప్పుడు బాబా తానే స్వయంగా వచ్చి అక్కడి ప్రదేశాలు చూపించినట్లు నాకర్థమై ఆనందాశ్చర్యాలకు లోనయ్యాను. నా ఆనందానికి అవధుల్లేవు. కానీ, నేనెంత మూర్ఖుడినో, స్వార్థపరుడినో, లోభినో తలచుకుంటే నామీద నాకే అసహ్యం వేసింది. ఎందుకంటే, ఇంతకుముందు నా అనుభవంలో మీకు చెప్పినట్లు బాబా నా ఆర్థిక బాధలు తీర్చి, నా భార్యకు ఉద్యోగం ఇచ్చి, మా అబ్బాయిలలో ఒకరిని ఇంజనీరుగా, మరొకరిని డాక్టరు చదువుకునేలా చేసి, ఎప్పుడూ నాతో వుంటూ, నా బాధలు తీరుస్తూ, నాకెన్నో ఇచ్చిన బాబా చేతిలో కేవలం పదిరూపాయలు పెట్టి నా స్వార్థబుద్ధిని చూపించాను. అది గుర్తుకొచ్చినప్పుడల్లా నామీద నాకే అసహ్యం వేస్తుంది. ఇప్పటికీ ఆయన రూపం, ఆయన చూసిన చూపు, నవ్విన నవ్వు నా కళ్ళముందు కదలాడుతున్నాయి. కానీ, బాబా నా నుండి ఏమీ ఆశించకుండా  ఇప్పటికీ నా బాధలు తీరుస్తూ, మా కుటుంబాన్ని ఆదుకుంటూనే ఉన్నారు. ఇది నా జీవితంలో మరచిపోలేని ఘటన.

"నేను ఇక్కడ ఉండగా అతనెందుకు మరణాన్ని కోరుకుంటాడు?"


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

1964వ సంవత్సరంలో నరహరి కదమ్ క్షయవ్యాధి బారినపడి చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చాలామంది వైద్యులు అతనికి చికిత్స చేసారు కానీ, అతని పరిస్థితిలో ఏ మార్పూ లేదు. సరికదా, రోజురోజుకీ ఆ వ్యాధి వృద్ధి చెందుతూ వచ్చింది. దానితో అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. ఆ బాధ భరించలేక అతడు ఒక రాత్రి, "బాబా! ఈ బాధనుండి కొంతైనా ఉపశమనం కలిగించండి. నా పాపకర్మల కారణంగా అలా కుదరక పోయినట్లైతే నాకు మరణాన్ని ప్రసాదించండి" అని బాబాను ప్రార్థించాడు.

మరుసటి ఉదయం అతని భార్య అతనితో, "రాత్రి నాకు బాబా కలలో దర్శనమిచ్చి,  "నేను నీ భర్తకు నయంచేస్తాను. 'తనని చూసుకోవడానికి నేను ఇక్కడుండగా అతడెందుకు మరణాన్ని కోరుకుంటాడు?' అని అడిగానని నీ భర్తతో చెప్పు" అని చెప్పారు. తరువాత ఆయన దుప్పటినుండి ఒక ఉన్నిపోగు తీసి తమ బొటనవ్రేలికి కట్టి, 'అతడు ఖచ్చితంగా కోలుకుంటాడు' అని హామీ ఇచ్చారు. అంతటితో కల ముగిసింది" అని చెప్పింది. బాబా తన భక్తులను ప్రేమతో రక్షిస్తానని, పోషిస్తానని తాము చేసిన వాగ్దానాన్ని నిర్ధారించి చెప్పడానికి ఉన్నిదారంతో కంకణంలా కట్టుకున్నారు. బొటనవ్రేలు వద్దనుండి అన్ని నరములు ప్రారంభమై, మళ్ళీ అక్కడే అంతమవుతాయి. మొత్తం నరాల వ్యవస్థకు జీవనరేఖగా బొటనవ్రేలు ఉంటుంది.

అదేరోజు నరహరి ఒక స్నేహతుడిని కలుసుకున్నాడు. ఆ స్నేహితుడు అతనిని డాక్టర్ పాటిల్‌‌ని కలవమని, అతనితో వైద్యం చేయించుకోమని సూచించాడు. నరహరి అతని సలహా ప్రకారం డాక్టర్ పాటిల్‌‌ను సంప్రదించాడు. డాక్టర్ "మీ వ్యాధి చివరిదశలో ఉన్నప్పటికీ, ఉత్తమమైన మార్గంలో చికిత్స చేస్తాను" అని చెప్పాడు. ఆశ్చర్యకరంగా ఒక వారంలోపల నరహరి పరిస్థితిలో మంచి మార్పు కనిపించింది. ఆరునెలలు పూర్తయ్యేసరికి అతనికి పూర్తిగా నయమయ్యింది. చాలామంది ప్రజలు, "ఇందులో అద్భుతమేముంది? ఈ రోజుల్లో క్షయవ్యాధి అంత ప్రాణాంతకమైన వ్యాధేమీకాదు. ప్రస్తుతం దానికి చికిత్స ఉంది" అన్నారు. వారికి నరహరి, "నిస్సందేహంగా మెడికల్ సైన్స్ విశేషమైన అభివృద్ధిని సాధించింది. అయితే నా విషయంలో నాకు, బాబాకు మధ్య ఉన్న సంబంధం అద్భుతమైనది. ఆయన నా రక్షకుడు. త్వరగా నాకు చికిత్సనందించి మృత్యువునుండి రక్షించిన ఆయనకు నేను ఋణపడివున్నాను. రోగంతో బాధపడుతున్న వ్యక్తికి మాత్రమే తాను పడ్డ బాధ ఏమిటో తెలుస్తుంది" అని బదులిచ్చాడు.

సోర్స్: శ్రీసాయి సాగర్ జూలై - ఆగష్టు సంచిక 2005.

దర్శనమిచ్చి ధన్యుణ్ణి చేసిన బాబా!!


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

అవినాష్ పాద్య ముంబాయి నివాసి. అతను సాయిబాబా భక్తుడు. అతనెప్పుడూ, "బాబా! ఒక్కసారైనా మీరు నాకు కలలో దర్శనమిస్తే నేను ధన్యుడనవుతాన"ని ప్రార్థిస్తుండేవాడు. అదృష్టం కొద్దీ అతను 1991లో చాలాసార్లు శిరిడీ దర్శించాడు. ఒకసారి శ్రీరాంపూర్‌లో ఉన్న బంధువులను కలవాలని నిశ్చయించుకుని, ఫిబ్రవరి 27న వేకువఝామునే నిద్రలేచాడు. తెల్లవారి గం. 3:50 నిమిషాలకు బస్టాండుకి వెళ్లేసరికి అక్కడ చాలా తక్కువమంది ప్రయాణీకులు ఉండటంతో అతను చాలా సంతోషించాడు. కానీ బస్సు వచ్చాక, బస్సెక్కి చూస్తే సీట్లన్నీ నిండుగా ఉన్నాయి. అతనికి తప్పనిసరై మన్మాడ్ వరకు నిల్చొని ప్రయాణం చేయాల్సి వచ్చింది. మనస్సులో "ఏ కష్టం లేకుండా ప్రయాణం సాగేలా సహాయం చేయండ"ని బాబాను ప్రార్థిస్తూ బాబా నామం నిశ్శబ్దంగా చెప్పుకుంటున్నాడు. అలా నామం చెప్పుకుంటూ, 'ఎప్పటికైనా బాబా కలలో కనిపిస్తారా' అని ఆలోచించుకుంటూ ఉన్నాడు. కొంతసేపటికి బస్సు కోపర్‌గాఁవ్ వైపు వెళ్తుండగా, యాదృచ్ఛికంగా అతను బస్సు డోర్ వైపు తిరిగి చూసాడు. డోరు ప్రక్కగా ఒక ఫకీరు నిలుచుని ఉండటం చూసి తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఆ ఫకీరు పొడుగాటి కఫ్నీ ధరించి, తలకు గుడ్డ చుట్టుకుని, ఎడమ భుజానికి జోలె వేసుకుని, కుడిచేతిలో రెండు ఇనుప పట్టీలు పట్టుకొని ఉన్నారు. ఆయన అచ్చం తన ఇంట్లో పూజించే పటంలోని బాబాలాగే ఉన్నారు. ఆయన నేరుగా అతన్ని చూసి నవ్వారు. 'ఆయన నిజంగా బాబా అయితే కోపర్‌గాఁవ్‌లో దిగి శిరిడీ వైపు వెళ్లాల'ని అతను మనస్సులో అనుకున్నాడు. తాను అనుకున్నట్లుగానే ఆ ఫకీరు కోపర్‌గాఁవ్‌లో దిగాడు. ఆయన్ని అనుసరిస్తూ అతను కూడా బస్సు దిగాడు. ఆయన కొన్ని అడుగులు వేసిన తరువాత అతని వైపు తిరిగి, "బిడ్డా! ఇక నేను వెళ్ళాలి. రేపు గురువారం కనుక నాకు శిరిడీలో చాలా పని ఉంది" అని చెప్పారు. ఆశ్చర్యంతో అతను ఆ ఫకీరుకి సాష్టాంగనమస్కారం చేసాడు. అంతలో బస్సు కదిలింది. వెంటనే అతను కదులుతున్న బస్సెక్కి ఆలోచనలో పడ్డాడు. "ఎంతోకాలంగా నేను బాబా కలలో కనిపిస్తే ధన్యుణ్ణవుతానని అనుకుంటూ ఉన్నాను. ఈరోజు నా కోరిక నెరవేరింది. ఆ ఫకీరు బాబాయేనని నాకు ఋజువైంది. ఈరోజు నేను బాబాను ప్రత్యక్షంగా చూశాను. అంతేకాదు, ఆయన నాతో మాట్లాడారు కూడా. ఇప్పుడు నేను వెయ్యిరెట్లు ధన్యుణ్ణి!" అని అనుకున్నాడు.

మూలం: సాయిప్రసాద్ పత్రిక, దీపావళి సంచిక 1997.

బాబా ప్రవేశంతో సుఖాంతమైన ప్రేమకథ


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

 shirdisaideva.com
సాయిబంధువు సబాఖాన్ తన ప్రేమని బాబా ఎలా గెలిపించారో తెలియజేస్తున్నారు.

2009వ సంవత్సరంలో నేను ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం చదువుతుండగా, అదే కాలేజీలో నా బాయ్‌ఫ్రెండ్ చివరి సంవత్సరం చదువుతుండేవాడు. ఆ సంవత్సరమే కాలేజీ ఫ్రెషర్ పార్టీలో మేము మొదటిసారి కలుసుకున్నాం.  అప్పుడు మా ఇద్దరి మధ్య కేవలం పరిచయం మాత్రమే జరిగింది.

నాకు చిన్నప్పటినుంచి కాస్త సిగ్గు ఎక్కువ. పెద్దయిన తరువాత కూడా నా స్వభావంలో అది అలానే ఉండిపోయింది. అందువలన నేనెవరితోనూ అంత త్వరగా కలిసిపోలేను. ఫ్రెండ్లీగా మెలగడానికి చాలా సమయం పట్టేది. మా కాలేజీలో ర్యాగింగ్ చాలా ఎక్కువగా ఉండేది. మా సీనియర్స్ ఎటువంటి కారణం లేకుండానే చిన్న చిన్న విషయాలకి చాలా ఆట పట్టించేవారు. నేను తట్టుకోలేక ఏడ్చేసేదాన్ని. అలా ఒకరోజు నేను ఏడుస్తుండగా ఒకతను నా ప్రక్కన వచ్చి కూర్చుని నన్ను ఓదార్చబోయాడు. నేను అతన్ని సరిగ్గా గుర్తించలేదు గాని, నా సీనియర్ అని మాత్రం అర్థమయ్యింది. 'ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు?' అని తను అడిగాడు. దాంతో నేను నా బాధనంతా  చెప్పుకున్నాను. అలా మేము దాదాపు రెండు గంటలసేపు మాట్లాడుకున్నాం. ఆ రోజు మేము క్లాసెస్ కూడా మిస్ అయ్యాం. కుటుంబవిషయాలు, అలవాట్లు, ఎంబీబీఎస్ తర్వాత ఏం చేయాలనుకుంటున్నదీ... ఇలా అన్నీ ఒకరి విషయాలు ఒకరం షేర్ చేసుకున్నాం. ఆరోజునుండి మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. కాలేజీలో నా కళ్ళు అతనికోసం వెతికేవి. అతని పరిస్థితి కూడా అంతే. ఇలా ఒక సంవత్సరం తెలియకుండానే గడిచిపోయింది. చివరిగా తనకి వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చింది. అయితే ఆ వీడ్కోలు కేవలం అప్పటికి మాత్రమే! ఎందుకంటే మేము ఎంబిబిఎస్ పూర్తయిన తర్వాత పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాం. అయితే మా కుటుంబసభ్యులను ఒప్పించడం మాత్రం అంత తేలిక కాదని కూడా మా ఇద్దరికీ తెలుసు. ఎందుకంటే మా మతాలు వేరు. నేను ఒక ముస్లిం యువతిని. తను హిందూ మతస్థుడైన పంజాబీ. అయినా దానిని మేము పెద్ద సమస్యగా ఎప్పుడూ అనుకోలేదు. మా మనసుల మధ్యలోకి ఎప్పుడూ మతం అడ్డురాలేదు.

తర్వాత అతను తన పీ.జీ. స్టడీస్ కోసం యూ.ఎస్.ఏ వెళ్ళాడు. నేను అదే కాలేజీలో నా యంబిబిఎస్ కంటిన్యూ చేశాను. ఆ రోజుల్లో యు.ఎస్.ఏ కి కాల్ చేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అందువలన మేము ఎక్కువగా ఒకరికొకరు మెయిల్స్ పంపుకుంటూ, వారంలో ఒకసారి లేదా మరీ అవసరమైతే రెండుసార్లు మాట్లాడుకునేవాళ్ళం. ఇలా సాఫీగా రోజులు గడిచిపోయాయి. 2012లో నా ఎంబీబీఎస్ పూర్తై  పీజీ కోసం నేను కూడా యు.ఎస్.ఏ వెళ్ళాను. ఇద్దరం ఒకే స్టేట్‌లో ఉండటం వలన, ఒకే అపార్ట్‌మెంట్ అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తూ ఉండేవాళ్ళం. ఈ విషయం మా కుటుంబసభ్యులకు అస్సలు తెలియదు. తన పక్కనుంటే జీవితమెంతో అందంగా ఉండేది. ఇద్దరం సంతోషంగా ఉండేవాళ్ళం. ఇలా ఉండగా ఒకరోజు ఇండియానుండి, తన తండ్రికి ఒంట్లో బాగాలేదని, హాస్పిటల్లో జాయిన్ చేసామని, ఉన్నఫళాన ఇండియాకు రమ్మని తనకు ఉత్తరం వచ్చింది. అది చదివి తను చాలా కంగారుపడి, "నేను నా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకుని, కాబట్టి నేను వెళ్ళక తప్పదు. వెళ్లి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చేస్తాను. మనం ఎప్పటిలానే మామూలుగా ఉండొచ్చు" అని నాకు ప్రామిస్ చేసి తను ఇండియా వెళ్ళాడు. కానీ అలా జరగలేదు. ఇండియా వెళ్లి 20 రోజులైనా తన నుండి ఫోన్ కాల్ రాలేదు. కనీసం నేను పంపిన మెయిల్స్‌కి బదులు కూడా లేదు. నాకేమీ అర్థం కాలేదు. అక్కడ తనకేం జరిగింది? తనెందుకు నాతో మాట్లాడట్లేదు?.. ఈ ఆలోచనలతో నేను చాలా ఆందోళనపడుతూ ఉండేదాన్ని.

హఠాత్తుగా ఒకరోజు రాత్రి 2 గంటల సమయంలో నా ఫోన్ రింగ్ అయింది. చూస్తే నా బాయ్‌ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడు. నేనెంతో ఆత్రంగా ఫోన్ లిఫ్ట్ చేశాను కానీ, తన మాటల్లో నాకేదో ఆందోళన కనిపించింది. దానితో నేను భయపడుతూ, 'ఏం జరిగింద'ని అడిగాను. అప్పుడు తను, "అసలు నాన్నకేమీ జరగలేదు. నన్ను ఇండియాకు రప్పించడానికి హాస్పిటల్లో జాయిన్ చేసామని నాటకమాడారు. ఎందుకంటే, నేను యు.ఎస్.ఏలో ముస్లిం అమ్మాయితో కలిసి ఉంటున్నానని వాళ్ళకి తెలిసిపోయింది. మా కుటుంబీకులు బాగా చదువుకున్న వాళ్ళైనప్పటికీ పాతకాలపు ఆలోచనలు కలవారు. వాళ్ళు వాళ్ల ఒక్కగానొక్క కొడుకు ఒక ముస్లిం యువతితో కలిసి ఉంటున్నాడంటే అసలు ఒప్పుకునే రకంకాదు. వాళ్ళు నాకు పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారు. నేను అన్నిరకాలుగా ఒప్పించడానికి ప్రయత్నించాను కానీ, నా వల్ల కాలేదు. ముఖ్యంగా మా అమ్మని అసలు ఒప్పించలేక పోయాను. కాబట్టి నువ్వు నన్ను మర్చిపో!" అని చెప్పాడు. ఆ మాటలు వింటూనే నా పాదాలకింద భూమి కంపించినట్టయింది. ఆ షాక్‌లో ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాను. చివరిగా తను, "నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. కానీ, ఇప్పుడు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను" అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. నేను చాలాసేపు ఏడ్చాను. తరువాత నన్ను నేను తమాయించుకొని, "నేను ఒకటి రెండు రోజుల్లో ఈ అపార్ట్‌మెంట్ విడిచిపెట్టి వేరే చోటుకు వెళ్ళిపోతాను. నువ్వు నీ పెళ్లి తర్వాత నీ భార్యతో ఈ అపార్ట్‌మెంటులో సంతోషంగా ఉండొచ్చు. నేను నిన్ను మర్చిపోవడమంటూ ఎప్పటికీ జరగదు. కానీ, నా వంతు ప్రయత్నం చేస్తాను. నీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నీ సంతోషమే నేను కోరుకునేది" అని తనకు ఒక మెయిల్ పంపాను.

కానీ ఆ తరువాత నా పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారయింది. రోజుల తరబడి ఎంతగా ఏడ్చానో చెప్పలేను. కాలేజీకి వెళ్లడం మానేసాను. అసలు కొన్నిరోజులపాటు ఇంటినుండి బయటికి వెళ్ళలేదు. మా ప్రేమ చిహ్నంగా ఉన్న ఫోటోలు, గ్రీటింగ్ కార్డులు, లెటర్స్ చూసుకుని కుమిలిపోతూ రోజంతా ఏడుస్తూనే ఉండేదాన్ని. ఇక నా జీవితంలో సంతోషమన్నది లేదని ఒకానొక సమయంలో నా జీవితాన్ని అంతం చేసుకోవాలని కూడా అనుకున్నాను. ఒక నెలరోజులు నా కుటుంబసభ్యులతో కూడా మాట్లాడలేదు. 45 రోజుల తర్వాత మా పేరెంట్స్‌కి ఫోన్ చేసి జరిగినదంతా చెప్పేసాను. మా కుటుంబసభ్యులు నాకు ధైర్యం చెప్పి, "భగవంతునియందు నమ్మకముంచు. అంతా మంచే జరుగుతుంద"ని చెప్పి నాకు అండగా నిలిచారు. "తొందరపాటు నిర్ణయాలు ఏమీ తీసుకోన"ని నా వద్దనుండి మాట కూడా తీసుకున్నారు. ఆ సమయంలో నాకు సాయిబాబా గురించి తెలిసి ఇంటర్నెట్ లో సాయిబాబా గురించి చదవడం మొదలు పెట్టాను. విడిపోయిన తన భక్తులను కలిపే ఆయన ప్రత్యేకశైలి గురించి తెలుసుకున్నాను. బాబా గురించి ఉన్న సైట్లన్నీ చదువుతూ ఉండేదాన్ని. ఆ ప్రయత్నంలోనే అనుకోకుండా ఒకరోజు http://www.shirdisaideva.com సైట్ చూసాను. ఆ సైట్ హెడ్ ప్రియాంకగారిని సాయి సచ్చరిత్ర, బాబా ఊదీ పంపమని అడిగాను. ఆమె కూడా ఆలస్యం చేయకుండా వెంటనే పంపారు. తనకి నేనెప్పటికీ కృతజ్ఞురాలినై ఉంటాను.

సచ్చరిత్ర నా దగ్గరకు రావడంతోనే, 'నా ప్రేమ నాకు దక్కాలి' అన్న ఒకే ఒక కోరికతో శ్రద్ధగా పారాయణ చేయడం మొదలుపెట్టాను. పారాయణ మొదలుపెట్టానో లేదో, మనసుకి ప్రశాంతత చేకూరడం మొదలైంది. అలా సచ్చరిత్ర పారాయణతో సాయి ధ్యాసలో నాలుగునెలలు గడిచేటప్పటికి మానసికంగా ధైర్యం పెరిగింది. ఆ సమయంలో ఒకరోజు ఇండియానుండి కాల్ వచ్చింది. ఆశ్చర్యంగా కాల్‌లో అవతలివైపు ఉన్నది నా బాయ్‌ఫ్రెండ్. తను, "నువ్వు ఉంటున్న కొత్త అడ్రస్ ఏమిటి?" అని అడిగి, నేను చెప్పిన వెంటనే ఫోన్ కట్ చేసాడు. నాకేమీ అర్థం కాలేదు. 'అడ్రస్ ఎందుకు అడిగాడా?' అని ఆలోచించి, 'బహుశా తన పెళ్ళిపత్రిక పంపడానికై ఉండొచ్చున'ని అనుకున్నాను. తర్వాత ఆ విషయం మర్చిపోయి, బాబాపై దృష్టి నిలిపి ఆయన పారాయణలో కాలం గడుపుతున్నాను.

కొన్నిరోజులు గడిచిన తర్వాత 2015 ఫిబ్రవరి 20న నా ఇంటి డోర్‌ బెల్ మోగింది. నేను వెళ్ళి తలుపు తెరిచి చూస్తే, ఎదురుగా చేతిలో పెద్ద ఫ్లవర్ బొకే, చాక్లెట్స్ పట్టుకుని నా బాయ్‌ఫ్రెండ్ నిల్చుని ఉన్నాడు. చాలారోజుల తరువాత చూసిన ఆనందంలో అమాంతంగా ఒకరినొకరం కౌగిలించేసుకున్నాం. నిజానికి మేము ప్రేమికులమైనా అంతకుముందు ఎప్పుడూ అలా చనువు తీసుకోలేదు. మా హద్దుల్లో మేముండేవాళ్ళం. తర్వాత నేను, "నీ పెళ్లి ఎలా జరిగింది? నీ భార్య ఎక్కడ?" అని అడిగాను. అందుకు తను, "అసలు నాకు పెళ్లయితే కదా!" అన్నాడు. 'అదేమిటి?' అని నేను ఆశ్చర్యంగా అడిగాను. "నేనెంతగా నచ్చచెప్పడానికి ప్రయత్నించినా మా వాళ్ళు ఒప్పుకోలేదు. ప్రతిరోజూ మా మధ్య చాలానే నాటకీయ యుద్ధం జరిగేది. చివరిగా నేను, "మన ఇంటి కోడలిగా తనని ఒప్పుకోకపోతే నేనెప్పటికీ ఇలాగే ఒంటరిగా ఉండిపోతాన"ని గట్టిగా చెప్పాను. ఐనా సరే వాళ్ళు అంగీకరించలేదు. ముఖ్యంగా అమ్మ అస్సలు ఒప్పుకోలేదు. తరువాత ఒకరోజు మా ఆంటీతో కలిసి అమ్మ సాయిబాబా గుడికి వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందో తెలియదుగాని గుడినుండి ఇంటికి వస్తూనే అమ్మ నాతో, "వెంటనే అమెరికా వెళ్లి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీ ఫ్రెండ్‌ని ఇక్కడికి తీసుకుని రా! నువ్వు వచ్చేలోపల నేనిక్కడ అందర్నీ ఒప్పిస్తాను" అని చెప్పింది. ఆ మాట వింటూనే నేను షాక్ అయ్యాను. ఎందుకంటే, మన పెళ్ళి విషయంలో అమ్మ ఒక్కతే పూర్తి వ్యతిరేకంగా ఉండేది. అలాంటిది తనలో హఠాత్తుగా వచ్చిన ఆ మార్పుకి అవాక్కయిపోయాను" అని చెప్పాడు. నేను అసలు నమ్మలేకపోయాను.

తరువాత నేను ఈమధ్యలో నాకు బాబాపట్ల ఏర్పడిన భక్తివిశ్వాసాల గురించి చెప్పాను. అప్పుడు ఈ పరిణామాలన్నిటికీ బాబాయే కారణం అని మేము గ్రహించాం. ఆయన తన చల్లని ఆశీర్వాదాలతో పరిస్థితులను ఇట్టే మార్చేశారని మాకర్థమై బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాం. ఇక మా సంతోషానికి అవధుల్లేవు. బాబా దయవలన మళ్లీ మేము కలుసుకున్నాము. మరుసటిరోజే మేము 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాబా గుడికి వెళ్లి, ఎవరూ ఊహించని అనూహ్యమైన రీతిలో మా ఇద్దరినీ కలపడంలో ఆయన చేసిన సహాయానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నాము. ఆ తర్వాత మేమిద్దరం ఇండియా వచ్చి తన ఇంటికి వెళ్ళాము. వాళ్ళ అమ్మగారు ఎంతో ప్రేమగా నన్ను దగ్గరకు తీసుకున్నారు. 'అప్పటివరకు నన్ను  అసహ్యించుకున్నది ఈమేనా!' అని నేను ఆశ్చర్యపోయాను. నేను కూడా వాళ్ళ ఇంట్లో బిడ్డను అన్నట్లుగా అందరూ నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. రెండురోజుల తరువాత వాళ్ళ కుటుంబమంతా నాతోపాటు ముజఫర్‌నగర్‌లోని మా ఇంటికి వచ్చారు. అంతా మాట్లాడుకుని మా పెళ్లి నిశ్చయించారు. మా పెళ్లి రెండు మతాచారాల ప్రకారం ఎంతో ఘనంగా జరిగింది. విడిపోయామనుకున్న మేము కేవలం బాబా అనుగ్రహంవలన తిరిగి ఒక్కటయ్యాం. బాబాకు మేమెంత కృతజ్ఞతలు చెప్పుకున్నా సరిపోదు.

తర్వాత మేమిద్దరం బాబాకు ఎంతో అంకితభక్తులుగా మారిపోయాము. 2017 మే నెలలో బాబా ఆశీస్సులతో మాకు ఒక అందమైన పాప కూడా పుట్టింది. ఇక్కడ యు.ఎస్.ఏ లో ఇండియన్స్ కాకపోయినా బాబాపట్ల భక్తివిశ్వాసాలు ఉన్న మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ప్రతి ఆరునెలలకొకసారి మా ఇంట్లో సాయిబాబా భజన చేసుకుంటున్నాము. ఇండియా వచ్చినప్పుడు పేదవాళ్లకి వైద్య, ఆర్థిక సహాయాలు అందిస్తున్నాం. ఇప్పుడు ఏదైతే మేము అనుభవిస్తున్నామో అదంతా బాబా కృపే! నేను ఎదుర్కొన్న ఆ బాధాకరమైన సమయంలో సాయిభక్తుల అనుభవాలు నాకెంతో బలాన్నిచ్చాయి. అందుకే నా అనుభవాన్ని పంచుకోవడం కూడా నా బాధ్యతగా భావించి మీతో పంచుకుంటున్నాను. తద్వారా నాకు కలిగినట్లే ఎవరైనా సాటి సాయిభక్తులకు ధైర్యం చేకూరుతుందని నా విశ్వాసం. బాబాపట్ల నమ్మకం ఉంచండి, ఆయన మీకు అండగా ఉంటారు.

అల్లామాలిక్!

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo