సాయి వచనం:-

- శ్రీబాబూజీ.
Showing posts with label Baba’s Divine Symphany by Vinny Chitluri.. Show all posts
Showing posts with label Baba’s Divine Symphany by Vinny Chitluri.. Show all posts

బాబా సంరక్షించే తల్లిలా తన బిడ్డల చిన్న కోరిక సైతం నెరవేరుస్తున్నారు.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

నెదర్లాండ్స్ నివాసి సుష్మా M.పవార్ గారు తన అనుభవాన్నిలా చెప్తున్నారు:

"చిన్నప్పటినుండి నేను బాబా భక్తురాలిని. రోజూ ఆయనను పూజిస్తూ ఉండేదాన్ని. ఆయన నా ఇష్టదైవం. గతంలో నేను కూపరేజ్ ఎక్స్‌ఛేంజ్ లో పనిచేసేదాన్ని. నేను రోజూ ఆఫీసుకు వెళ్ళాలంటే వి.టి. స్టేషన్లో బస్సు ఎక్కాలి. ఒకరోజు ఉదయం బస్సు ఆలస్యమైనందున నేను వేచి చూస్తూ, అటూ ఇటూ గమనిస్తూ ఉన్నాను. ఇంతలో ఒక వ్యక్తి తన స్నేహితుడి దగ్గరకు వచ్చి, "నేనిప్పుడే శిరిడీ నుంచి వస్తూ బాబా ప్రసాదం తీసుకొచ్చాను" అని చెప్తూ తన స్నేహితుడికి కొంచెం ప్రసాదం ఇచ్చాడు. "నాకు కూడా కొంచెం ప్రసాదం ఇస్తే బాగుండు" అని అనిపించింది. కానీ ఆ వ్యక్తి నాకు తెలియనందున, అతను నాకిస్తాడని నేను అనుకోలేదు. కాసేపట్లో బస్సు వస్తే ఎక్కి ఆఫీసుకు వెళ్ళిపోయాను.

మధ్యాహ్నం భోజనం తరువాత నా స్నేహితురాలు సీమ చిన్న బఠానీగింజంత కోవాబిళ్ళ ముక్క నా చేతిలో ఉంచింది. నాకెంతో ఆనందంగా అనిపించి, ఉదయం బాబా ప్రసాదాన్ని కోరుకున్న విషయం తనతో చెప్పాను. ఆమె చెప్పిన సమాధానంతో నేను ఆశ్చర్యపోయాను. తను, "మా చెల్లెలికి తన స్నేహితురాలు చిన్న కోవాబిళ్ళ ముక్క ఇస్తూ, "నేను ఇప్పుడే శిరిడీ నుంచి తిరిగివచ్చాను. ఈ కొంచెం ప్రసాదం తీసుకో!" అని చెప్పింది. నేను దాన్ని బాబా ముందర ఉంచాను. ఈరోజు ఉదయం నేను స్నానం చేసిన తరువాత దానిని నోటిలో వేసుకోబోతూ బాబా చిత్రపటంవైపు చూస్తే నీ ముఖం ఆ చిత్రపటంలో కనిపించింది. దానితో బాబా ఈ ప్రసాదం నీకు ఇవ్వమని అంటున్నారని నాకనిపించింది" అని చెప్పింది. ఆ మాటలు వింటూనే ఆనందభాష్పాలతో ఆ బఠానీగింజంత బాబా ప్రసాదాన్ని నేను స్వీకరించాను. "ఎంత దయ బాబాకు, సంరక్షించే తల్లిలా తన బిడ్డల చిన్న కోరిక సైతం నెరవేరుస్తున్నారు".

మూలం: శ్రీసాయిలీల పత్రిక, అక్టోబర్ - నవంబర్ 1952.

Baba's Divine Symphony,
రచన: విన్నీ చిట్లూరి.

నమ్ముకున్న వాళ్లకి బాబా ఎప్పుడూ రక్షణ కవచమే.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

దీపా సావంత్ ముంబైలో నివసిస్తూ కంప్యూటర్ ఆపరేటర్‌‌గా పనిచేస్తూ ఉండేవారు. ఆమె కుటుంబమంతా బాబా భక్తులు. వాళ్లంతా వారి నుదుటిపై బాబా ఊదీ పెట్టనిదే ఇంటి నుండి బయటికి వెళ్లరు. ఊదీని వాళ్ళ జీవితానికి కవచంగా, చీడపీడలన్నింటి నుండి రక్షణగా భావించి వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ వారి పర్సులో ఒక ఊదీ ప్యాకెట్ ను ఉంచుకునేవారు. ఇప్పుడు చెప్పబోయే లీల వర్షాకాలంలో జరిగింది. అది 1996, జూన్ 15. ఆరోజు సాయంత్రం పని పూర్తి చేసుకొని ఆఫీసు నుండి దీప తన ఫ్రెండ్‌‌తో కలిసి బస్టాప్‌‌కి వెళ్తున్నారు. ఆ సమయంలో తుఫాను కారణంగా వర్షపు నీరు రోడ్డుమీద నదిలా ప్రవహిస్తూ ఉంది. అందువలన వాళ్ళు రోడ్డుకు ఒక చివర్లో నడుస్తూ ఉన్నారు. అంతలో ఎదురుగా వస్తున్న బస్సును చూసి బస్సు ప్రక్కనుండి పోతుందన్న ఉద్దేశ్యంతో దీప తన కుడివైపుకు ఒక అడుగువేసింది, హఠాత్తుగా ఆమె లోతైన గొయ్యిలో పడిపోయింది. రహదారి మరమ్మత్తు పనుల కోసం రోడ్డు త్రవ్వబడి ఉందన్న విషయం ఆమెకు తెలియక పోవడంతో అంతపెద్ద ప్రమాదం సంభవించింది. వెంటనే తన స్నేహితురాలు దీపని కాపాడటానికి దీప చేతిని పట్టుకుంది. కానీ, దీప పడిపోతున్న ఫోర్స్ లో ఆమెను కూడా గొయ్యిలోకి లాగుతుండటంతో ఆమె దీప చేతిని విడిచిపెట్టేసింది.

దీప ఆ గొయ్యి లోతుల్లోకి జారిపోతూ ఒక వేలితో ఒక చెట్టు వేరు గట్టిగా పట్టుకొని సహాయం కోసం గట్టిగా అరవసాగింది. అంతలో అటుగా వస్తున్న ఆమె సహోద్యోగులు ముగ్గురు మగవాళ్ళు ఆమె అరుపులు విన్నారు. వెంటనే వాళ్ళు పరుగున వచ్చి ఎలాగో మొత్తానికి కష్టపడి ఆమెను బయటకు తీశారు. జరిగిన దుర్ఘటనకు ఆమె భయభ్రాంతురాలైంది. ఇంటికి చేరుకున్నాక జరిగిన దాని గురించి తన తల్లికి చెప్తూ, "నేను చెట్టు వేరు పట్టుకొన్న వేలికి బాబా ఉంగరం ఉంది. నా పర్సులో ఊదీ ఉంది. అందువల్ల నేను  నీళ్లలో సమాధి కాకుండా బాబా కాపాడారు" అని చెప్పింది. నిజంగా అది బాబా మహిమే! లేకపోతే ఒక్క వేలితో చెట్టు వేరు పట్టుకోవడం సాధ్యమేనా?

కొన్నిరోజుల తరువాత నీరు ఎండిపోయాక, ఆమె ఆ గోతిని చూసింది. అది దాదాపు 20 అడుగుల లోతు ఉంది. పైగా దాని దిగువన కొన్ని ఇనుప కడ్డీలు ఉన్నాయి. నిజంగా వాటిపై పడి ఉంటే ఏమి జరిగేదో? బాబా కృపవలన చిన్న చిన్న గాయాలతో ఆమె బయటపడింది.

రైలు ప్రమాదం నుండి ఆమెను ఒక వృద్ధుడు కాపాడాడు.

కొంతకాలానికి దీప కుటుంబం కుర్లాకు మారారు. ఆమె తన ఉద్యోగ విధులకు హాజరు కావడానికి రోజూ రైలులో వెళ్ళాల్సి వచ్చేది. ఒకరోజు ఉదయం ఆమెకు ఆలస్యమై కండివాలి స్టేషన్ లో ప్రవేశించేసరికి ఆమె ఎక్కాల్సిన రైలు కదులుతోంది. ఆమె పరుగున ఒక బోగీలో ఎక్కడానికి ప్రయత్నించింది, కానీ బోగీ ప్రవేశ ద్వారం వద్ద ప్రయాణికులు అడ్డంగా ఉన్నారు. అయినప్పటికీ ఆమె తొందరలో డోర్ వద్ద ఉన్న హేండిల్ పట్టుకుని ఒక అడుగు బోగీలో పెట్టింది. అప్పటికే రైలు ప్లాట్ ఫారం దాటింది. ఏమాత్రం అదుపుతప్పినా ఆమె ట్రాక్ పై పడిపోతుంది అటువంటి భయంకర పరిస్థితి అది.

ఆ సమయంలో ఎక్కడనుండి ప్రత్యక్షమయ్యాడో తెలియదు గాని ఒక వృద్ధుడు హఠాత్తుగా ఆమె ఎదుట కనిపించి ఆమెను బోగీ లోపలకి లాగి ఆమె జీవితాన్ని కాపాడాడు. ఆమె అతనికి కృతజ్ఞతలు చెప్పాలని చూసేసరికి అతను అదృశ్యమైపోయాడు.

ఆ సాయంత్రం ఆమె, జరిగిన ఆ అసాధారణ ప్రమాదం గురించి తీవ్రంగా ఆలోచించగా ఆమెకు ఒక విషయం అర్థమయ్యింది. ప్రతినెలా వచ్చే అమావాస్య రోజే తనకిటువంటి ప్రమాదాలు ఎదురవుతున్నాయని గ్రహించింది. ఆరాత్రి ఆమె బాబాకు ఒక కొబ్బరికాయ కొట్టి, ప్రతి అమావాస్యకి తనకు సంభవించే ఇటువంటి ప్రమాదాల నుండి తనను కాపాడమని ప్రార్థించింది. అలా బాబా సహాయం అర్థించిన తరువాత బాబా దయవలన ఆమెకు ఎటువంటి ప్రమాదం ఎదురుకాలేదు.

మూలం: శ్రీ సాయి సాగర్ పత్రిక, దీపావళి ఇష్యూ 1996, విన్నీ చిట్లూరు గారి రచించిన బాబా'స్ డివైన్ సింఫొనీ.

ద్వారంవద్ద కూర్చుని మరణాన్ని తరిమిమేసిన బాబా




నా పేరు వసంతరావుగారు. ఒకప్పుడు మా నాన్నగారు తీవ్ర అనారోగ్యంతో మృత్యుద్వారంవద్ద ఉన్నారు. ఆయన్ని పరీక్షించిన డాక్టర్, "ఇంక ఆశలు లేవు. ఎవరైనా దగ్గర బంధువులను పిలిపించుకోవాలంటే పిలిపించుకోండి" అని చెప్పారు. మేము మా మామయ్య యశ్వంత్‌రావుగారిని పిలిపించాం. ఆ రాత్రి నాన్న పరిస్థితి మరింత క్షీణించింది. తను అధిక జ్వరంతో బాధపడుతున్నారు. రాత్రంతా మా అమ్మ, మామయ్య ఆయన మంచం ప్రక్కనే కూర్చొని ఉన్నారు. మధ్యరాత్రిలో నాన్న లేచి, తలుపువైపు చూస్తూ తన చేతులు జోడించి నమస్కరించారు. ఆ తరువాత తనెంతో ప్రశాంతంగా నిద్రపోయారు. సుమారు తెల్లవారుఝామున 5 గంటల సమయంలో నిద్రలేచి తనకు తినడానికి ఏదైనా కావాలని అమ్మని అడిగారు. అమ్మ అన్నం కలిపి ముద్దలు పెడితే తిన్నారు. తరువాత ఆయన, "మీరు నా మంచం ప్రక్కన ఎందుకున్నారు? నేను బాగున్నాను" అని అన్నారు. ఆ మాటలు చెప్తూనే తను తలుపువైపు చూస్తున్నారు. నాన్న ఎందుకు అటువైపు చూస్తున్నారా అని నేను కూడా అటువైపు చూసాను. అక్కడ తలుపు దగ్గర ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు. ఆయన ఒక వెండి సట్కాను చేతిలో పట్టుకొని ఉన్నారు. ఆయన ఆ సట్కాను ఊపుతూ, "నేను ఇక్కడ ఉండగా ఎవరు ఈ గది లోపలికి ప్రవేశిస్తారో చూస్తాను" అన్నారు. నేను వెంటనే ఆయనకు నమస్కరించాను. ఆ వృద్ధుడు అచ్చం నేను నా చిన్నవయస్సులో చూసిన సాయిబాబాలాగానే ఉన్నారు. యమదూతలను తరిమివేయడానికి ఆయన ద్వారంవద్దనే కూర్చొని ఉన్నారు. తన భక్తులపై ఆయన చూపే కరుణ ఎనలేనిది.

ఆ తరువాత తొందరలోనే నాన్న పూర్తిగా కోలుకున్నారు. మళ్లీ ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడలేదు. కారుణ్యంతో అంతలా నా తండ్రిని సంరక్షించిన బాబాకు మా కుటుంబమంతా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకున్నాం. ఈ సంఘటన బాబాపట్ల నాకు భక్తి, విశ్వాసాలను పెంపొందింపజేసింది.

మూలం: శ్రీ సాయిలీలా మ్యాగజైన్, ఫిబ్రవరి 1985. (విన్నీ చిట్లూరి రచించిన 'డివైన్ సింఫనీ ఆఫ్ బాబా')

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo