సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1220వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. మొదటిసారి శిరిడీ దర్శనం
2. సాయిని తలచుకోవడం ఆలస్యం - పని జరిగిపోతుంది
3. ఆటంకం లేకుండా శ్రీశైల దర్శనం చేయించిన బాబా

మొదటిసారి శిరిడీ దర్శనం

సాయిభక్తులందరికీ నమస్కారాలు. నా పేరు విజయలక్ష్మి. నేను ఇప్పుడు నా మొట్టమొదటి శిరిడీ దర్శనం గురించి పంచుకోబోతున్నాను. మేము శిరిడీ వెళ్లాలని 2021, డిసెంబరు 3, 4, 5 తేదీలకు ట్రైన్ టికెట్లు, దర్శనం టిక్కెట్లు, రూమ్ బుక్ చేసుకున్నాము. సరిగా అదే సమయంలో మా సిస్టర్ పెళ్లి ఉందని తరువాత మాకు తెలిసింది. దాంతో పెళ్లయ్యాక డిసెంబరు 5న శిరిడీ వెళదామని ముందు బుక్ చేసుకున్న టిక్కెట్లు క్యాన్సిల్ చేసి, మళ్ళీ కొత్తగా టిక్కెట్లు బుక్ చేసుకున్నాము. అయితే అప్పుడు కూడా వేరే కారణం వల్ల టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. తరువాత డిసెంబరు 15, 16, 17 తేదీలకు టిక్కెట్లు బుక్ చేసుకున్నాము. అప్పుడు కూడా ఒక ఫంక్షన్ ఉన్నప్పటికీ ఈసారి ఎలాగైనా శిరిడీ వెళ్లాలని మేము టిక్కెట్లు క్యాన్సిల్ చేయలేదు. డిసెంబరు 14న షాపింగ్ చేసుకుని ఇంటికి వచ్చాక ఒక చిన్న విషయంలో నాకు, మావారికి మధ్య వాదన జరిగింది. దాంతో ఆయన, "నువ్వు శిరిడీ వస్తావా? లేదంటే, టిక్కెట్లు క్యాన్సిల్ చేయాలా?" అని అడిగారు. నేను కోపంలో ఉండి, "నేను శిరిడీకి రాను, నువ్వే వెళ్ళు" అని అన్నాను. కానీ, 'నేనిప్పుడు కోపంలో ఉన్నానని ఆయనకి తెలుసు కదా, టిక్కెట్లు క్యాన్సిల్ చెయ్యరులే' అని అనుకున్నాను. ఎందుకంటే, నాకు శిరిడీ వెళ్లడమంటే చాలా ఇష్టం. పైగా అదే మొదటిసారి శిరిడీ వెళ్ళటం. ఎప్పుడెప్పుడు శిరిడీలో బాబాను చూస్తానో అని తెగ ఆరాటపడుతున్నాను. అంత ఇష్టం. కానీ ఆయన టిక్కెట్లు క్యాన్సిల్ చేసి, స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టారు. ఇంక నాకు ఏడుపు ఆగలేదు. బాబా ఫోటో దగ్గరకి వెళ్లి, "బాబా! నేను శిరిడీ రావడం మీకు ఇష్టంలేదా? 'నా అనుమతి లేనిదే ఎవరూ శిరిడీకి రాలేర'ని అన్నావు కదా! అందుకే ఇలా చేశావా?" అని ఏడ్చాను. ఇంకా, "నాకు మీ దర్శనం రేపే కావాలి. నేను శిరిడీ రావాలి. లేకపోతే మీకు నా మీద ప్రేమ లేనట్టే" అని బాబాతో అన్నాను. వెంటనే మావారి దగ్గరకి వెళ్లి, తను పడుకుని ఉంటే లేపి మరీ "నేను రేపు శిరిడీ వెళ్ళాలి, బస్సులో అయినాసరే వెళ్దాం" అని అన్నాను. తను ఆ అర్థరాత్రే ట్రైన్ టిక్కెట్ల కోసం ప్రయత్నించారు. చాలాసేపటికి బాబా దయవల్ల వెళ్ళడానికి టిక్కెట్లు బుక్ అయ్యాయి. కానీ తిరుగు ప్రయాణానికి బెర్తులు అందుబాటులో లేవు. దర్శనం టిక్కెట్లు కూడా డిసెంబర్ 16కే దొరికాయి. రూమ్స్ కూడా భక్తనివాస్‍లో దొరకలేదు. ప్రైవేట్ హోటల్లో బుక్ చేయాల్సి వచ్చింది. ఇక అంతా బాబా చూసుకుంటారని ఆయన మీద భారమేసి డిసెంబర్ 15 రాత్రి బయలుదేరాము. 16వ తేదీ తెల్లవారుఝామున నాగర్‌సోల్‍లో దిగాము. అక్కడినుండి ప్రైవేట్ వెహికల్‍లో హోటల్‍కి వెళ్లి, స్నానాలు చేసుకుని, టిఫిన్ చేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాము. శిరిడీలో మధ్యాహ్న ఆరతి పాడాలని నా కోరిక. కానీ కోవిడ్ వల్ల భక్తులను ఆరతికి అనుమతించటం లేదు. అందువల్ల ప్రసాదాలయానికి వెళ్లి భోజనం చేసిన తరువాత బాబా దర్శనానికి వెళ్ళాము. క్యూలైన్‍లో వెళ్తుంటే నేను, 'మొదటిసారి బాబాని చూడబోతున్నాను' అని చెప్పలేని ఆనందానికి గురయ్యాను. 'బాబా ఎక్కడున్నారు?' అని ఆత్రంగా చూసుకుంటూ సమాధిమందిరం లోపలికి వెళ్ళాను. బాబాని చూడగానే నాకు కలిగిన సంతోషం మాటల్లో చెప్పనలవి కాదు. ఆ సంతోషంలో నేను ద్వారకామాయికి వెళ్లే లైన్‍లోకి వెళ్ళలేదు. మొదటి లైన్‌లోనే ముందుకి సాగాను. నా చూపు కిందకిగానీ, పక్కకిగానీ ఎటూ పోవట్లేదు. నా దృష్టి అంతా బాబాపైన ఉంది. అలా ఆయన్నే చూస్తూ నడుస్తున్నాను. బాబా కూడా నన్నే చూస్తున్నట్టు అనిపించింది. ఇక బాబా దగ్గరకి వెళ్ళాక బయిటికి వెళ్లబుద్ది కాలేదు. కానీ అక్కడ ఉండనివ్వరు కదా. కాబట్టి తప్పనిసరై బయటికి రావాల్సి వచ్చింది. ఊదీ ప్రసాదం తీసుకుని గురుస్థానం వద్ద కాసేపు కూర్చొని బయటకి వచ్చాము. షాపింగ్ చేసుకుని మారుతి మందిరానికి వెళ్తుంటే, అక్కడ కొంతమంది సమాధిమందిరం లోపలికి వెళ్తూ కనిపించారు. మేము 'మనం ధుని దర్శించుకోలేదు కదా! ఇదే ధుని వద్దకి వెళ్లే దారి అయివుంటుందని అక్కడున్న సెక్యూరిటీ గార్డుని అడిగి లోపలికి వెళ్ళాము. మళ్ళీ ఎదురుగా బాబా ఉన్నారు. ప్రేమతో నా తండ్రి నాకు మరోసారి దర్శనం ఇచ్చారని, సంతోషంగా ఆయనను కాసేపు దర్శించుకుని బయటికి వచ్చాము. అయితే మేము అనుకున్నట్లు లోపలి నుండి ధుని దగ్గరకి వెళ్ళడానికి లేదు. తరువాత ద్వారకామాయి (బయటనుండి), మారుతీ మందిరం అన్నీ దర్శించుకుని హోటల్‍కి వెళ్ళాము. మరుసటిరోజు నాసిక్, త్రయంబకేశ్వరం వెళ్ళాము. ఆంజనేయుని జన్మస్థలం, గోదావరి నది, సీతమ్మ గుహ, పంచవటి దర్శించాము. ఆ మరుసటిరోజు, అంటే డిసెంబర్ 18న ఎల్లోరా గుహలు, సమీపంలో ఉన్న పురాతన శివాలయం చూసుకుని ఆ రాత్రి ఔరంగాబాద్‍లో ట్రైన్ ఎక్కాము. బాబా మాకు మొదటి తరగతి టిక్కెట్లు ఇప్పించగా మేము క్షేమంగా ఇంటికి చేరుకున్నాము. అలా చాలా సంతోషంగా మా శిరిడీ ప్రయాణం పూర్తయింది. ఇదంతా మన తండ్రి బాబా దయ.

సాయిని తలచుకోవడం ఆలస్యం - పని జరిగిపోతుంది

ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథాయ నమః!!! 

నేనొక సాయిభక్తురాలిని. సాయిమహిమ గురించి, సాయిలీలల గురించి, సాయితో మనకున్న అనుభవాల గురించి ఎన్నని పంచుకోగలము? ప్రతిరోజూ ఏదో ఒక కొత్త అనుభవం, అనుభూతి కలుగుతూనే ఉంటుంది. 2022, జూన్ 3వ తేదీన మా కుటుంబం, మా తమ్ముళ్ళ కుటుంబాలు మొత్తం పదిమందిమి కలిసి మొక్కులు తీర్చుకునేందుకు తిరుపతికి బయలుదేరాము. అక్కడికి చేరుకున్నాక, మేము మా సామానంతా కింద కౌంటరులో ఇచ్చి శ్రీవారిమెట్ల మార్గంగుండా కాలినడకన కొండెక్కడం ప్రారంభించాము. సగానికి పైగా దూరం వెళ్ళాక మావారు, "కింద ఇచ్చిన సామాన్ల తాలూకు రిసిప్ట్ కనిపించట్లేదు. ఎక్కడో పడిపోయింది" అని అన్నారు. నిజానికి తను అలాంటి విషయాలలో అస్సలు నిర్లక్ష్యంగా ఉండరు, ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అలాంటిది ఆయన అలా చెప్పేసరికి, 'ఇప్పుడు మొత్తం అందరి షెడ్యూల్ దెబ్బ తింటుంది' అని నాకు విపరీతమైన టెన్షన్ వచ్చింది. కానీ ఆ టెన్షన్ పడింది ఒక్క క్షణమే. ఎందుకంటే, వెంటనే మన బాబాను తలచుకుని, "రిసిప్ట్ దొరకనన్నా దొరకాలి లేదా రిసిప్ట్ లేకపోయినా ఇబ్బంది పెట్టకుండా మా సామాను మాకు ఇచ్చెయ్యాలి. అలా జరిగితే, ఈ అనుభవాన్ని వెంటనే బ్లాగులో పంచుకుంటాను" అని బాబా మీద భారం వేశాను. అంతే, తరువాత మరి నేను టెన్షన్ పడలేదు. నేను సాధారణంగా నాకు బాగా నచ్చిన అనుభవాలు వ్రాసి బ్లాగుకి పంపుతూ ఉంటాను. కానీ ఎప్పుడూ ఇలా 'బ్లాగుకి పంపుతాను' అని మొక్కుకోలేదు. ఎందుకో ఈసారి అలా అనిపించింది. బహుశా ఏ అనుభవాన్ని ఈ బ్లాగు ద్వారా అందరితో పంచుకోవాలన్నది బాబానే నిర్ణయిస్తారేమో!

మేము కొండపైకి ఎక్కాక నేను కోరుకున్నట్లే అక్కడివాళ్ళు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మా సామాను మాకు ఇచ్చేలా బాబా అనుగ్రహించారు. అలా కాకుండా వాళ్ళు సామాను ఇవ్వడానికి ఇబ్బందిపెట్టి ఉంటే మా పరిస్థితి, మా ప్రోగ్రామ్స్ ఏమై ఉండేవో చెప్పలేను, కానీ సాయిని తలచుకోవడం ఆలస్యం, అలా పని జరిగిపోతుంది. ఆయన దయవల్ల మేము ఎంతో ప్రశాంతంగా స్వామిని దర్శించుకుని అన్ని మొక్కులు తీర్చుకుని జూన్ 6 ఉదయానికి క్షేమంగా ఇల్లు చేరుకున్నాం. "ధన్యవాదాలు సాయీ. నేను, నా కుటుంబసభ్యులు మనసా, వాచా, కర్మణా ఎటువంటి తప్పులు చేయకుండా, ఎవరినీ బాధించకుండా ఉండేలా చూడండి సాయీ".

ఆటంకం లేకుండా శ్రీశైల దర్శనం చేయించిన బాబా

సాయిబంధువులకు నా నమస్కారం. నా పేరు రేవతి. మేము 2022, మే 25న శ్రీశైలం వెళ్లేందుకు అప్పటికి 15 రోజుల ముందు మా ప్రయాణానికి టిక్కెట్లు బుక్ చేసుకున్నాము. ఆ మరుసటిరోజు నుండి మా నాన్నమ్మగారి ఆరోగ్యం క్షీణించింది. ఇదేదో ముందే జరిగి ఉంటే అసలు టిక్కెట్లు బుక్ చేసుకోకపోయేవాళ్ళం కదా అని అనుకున్నాను. కానీ అంతలోనే 'బాబానే కదా మా ప్రయాణానికి ఏర్పాటు చేశారు' అనిపించి, "బాబా! మీరే మా ప్రయాణం సంగతి చూసుకోవాలి. ఏ ఆటంకం లేకుండా మా ప్రయాణం చక్కగా జరిగేలా చూడాలి" అని బాబాని వేడుకున్నాను. సాయి దయవలన మేము ముందుగా అనుకున్నట్లే మే 25న బయలుదేరి శ్రీశైలం, మహానంది, అహోబిలం, విజయవాడ, ద్వారకాతిరుమల, సింహాచలం మొదలైన పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నాము. అన్ని చోట్ల దర్శనాలు బాగా జరిగాయి. ప్రయాణం మధ్యలో మా సూట్‍కేసు ఒకటి కనిపించకుండా పోయినప్పటికీ బాబా దయవలన తిరిగి దొరికింది. అలాగే ప్రయాణంలో మా అత్తగారికి, మావారికి వడదెబ్బ తగిలింది కానీ, బాబా దయవలన వెంటనే తగ్గింది. ఈ చిన్న చిన్న ఇబ్బందులు తప్ప మా ప్రయాణమంతా చక్కగా జరిగింది. బాబా దయవల్లనే ఈ ఎండల్లో మా తీర్థయాత్ర అంత చక్కగా జరిగింది. ఇకపోతే మా నాన్నమ్మగారు కూడా ప్రస్తుతానికి బాగున్నారు. అంతా బాబా దయ. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

4 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  3. A carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba

    ReplyDelete
  4. Baba me daya valana Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house problem solve cheyandi pl na health bagu cheyandi pl

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo