సాయి వచనం:-
'నాకు వారసులెవరూ లేరు. నన్ను ఆశ్రయించినవారికి నా సమాధినుండే సమాధానమిస్తాను. సమాధి చెందినప్పటికీ నా సమాధిలోనుండి నా ఎముకలు మాట్లాడుతాయి. అవి మీకు ధైర్యమును, విశ్వాసమును కలిగిస్తాయి.'

'ఎవరికి వారు సాధన చేసుకునేకన్నా అందరూ కలిసి సాధన చేసుకున్నప్పుడు, భక్తుల్లోని ప్రేమ, భక్తి జాగృతమై, ఆ ప్రభావం వల్ల మనలోని బలహీనతలను అధిగమించి, వ్యక్తిత్వపు పరిమితులను దాటి, సాధన చేసుకోవడం సులువవుతుంది' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 677వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:

  1. అడ్డంకులు తొలగించి మా పెళ్లి జరిపించిన శ్రీసాయి
  2. మా అమ్మపై దయ చూపిన బాబా


అడ్డంకులు తొలగించి మా పెళ్లి జరిపించిన శ్రీసాయి

 

ఓం సాయిరామ్! సాయిబంధువులందరికీ నా నమస్కారం. నా పేరు మౌనిక. మన సాయి అనుగ్రహంతో నాకు కలిగిన అనుభవాలలో కొన్నిటిని ఇంతకుముందు ఈ సాయి మహారాజ్ సన్నిధి బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకున్నాను. నేను ఏదైతే నా జీవితంలో జరగాలని సాయిని కోరుకున్నానో, ఆ విధంగానే నా జీవితాన్ని మలచి నేను ఎంతో సంతోషంగా ఉండేలా అనుగ్రహించిన మన సాయి లీల గురించి ఇప్పుడు మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను.


ఒక సంవత్సరం క్రితం నేను నా సహోద్యోగిని వివాహం చేసుకోవాలని అనుకున్నాను. అతనికి కూడా నేనంటే ఇష్టమని తెలుసు. కాకపోతే నేను తనను వివాహం చేసుకోవాలనుకుంటున్న విషయాన్ని అతనికి చెప్పలేదు. ఇంతలో మా ఇంట్లో నాకు వేరే పెళ్లిసంబంధం చూస్తుండటం వల్ల నేను నా అభిప్రాయాన్ని తనకు, మా ఇంట్లోవాళ్ళకు చెప్పాను. అందరూ ఎంతో సంతోషంగా నా ఇష్టాన్ని అంగీకరించారు. కాకపోతే మన తలరాత అనేది ఒకటి ఉంటుంది కదా! దానివల్ల, పెళ్లిదాకా వెళ్ళకుండానే నా ప్రేమ మధ్యలోనే ఆగిపోయింది. ఆ అబ్బాయి గురించి ఎవరో చెడుగా చెప్పడం వల్ల మా ఇంట్లోవాళ్ళు అతనితో నా పెళ్లి చేసే ఆలోచన మానుకున్నారు. కానీ నాకు తెలుసు తను ఏంటి అని. ఈ విషయం గురించి నేను గట్టిగా మాట్లాడితే తనకు, మా ఇంట్లోవాళ్ళకు ఇబ్బందులు కలుగుతాయి. అందుకని, నా వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండకూడదని భావించి నేను తనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. కానీ నాకు అది సాధ్యపడలేదు. ఇంట్లోవాళ్ళకి ఇష్టం లేకపోయినా నేను తనతో మాట్లాడుతున్నానని మా ఇంట్లోవాళ్ళకి తెలిసి చాలా గొడవ జరిగింది. ఆ సమయంలో నేను బాబాకు బాగా దగ్గరయ్యాను. ప్రతిరోజూ శ్రీసాయి సచ్చరిత్ర చదివేదాన్ని. కానీ రోజులు గడిచేకొద్దీ మా ఇంట్లోవాళ్ళు మా పెళ్ళికి ఒప్పుకుంటారనే నమ్మకం పోయింది. చివరికి నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఇంట్లోవాళ్ళను తరువాత ఒప్పించవచ్చని అనుకున్నాను. 


2021, జనవరి 1వ తేదీన మేమిద్దరం కలిసి బాబా గుడికి వెళ్ళాము. నేను, తను జీవితాంతం సంతోషంగా కలిసివుండేలా అనుగ్రహించమని నేను బాబాను కోరుకున్నాను. ఆరోజు సాయంత్రం అనుకోకుండా మా ఇద్దరి గురించి మా ఇంట్లో బాగా గొడవ జరిగింది. నేను మాత్రం, “అంతా బాబా చూసుకుంటారు, ఇది ఆయన ప్రణాళిక” అని భారమంతా బాబాపై వేశాను. మరుసటిరోజు, అంటే జనవరి 2వ తారీఖున తను, తన ఇంట్లోవాళ్ళు మా ఇంటికి వచ్చి మావాళ్ళతో మేము తీసుకున్న నిర్ణయం గురించి మా అమ్మానాన్నలతో చెప్పారు. నా నిర్ణయం విని మా అమ్మానాన్నలు చాలా బాధపడ్డారు. కానీ, చివరికి మా పెళ్లి చేయటానికి అంగీకరించారు. ఆ తరువాత కేవలం అయిదు రోజుల వ్యవధిలోనే మా పెళ్లి గొలగమూడి వెంకయ్యస్వామి గుడిలో చక్కగా జరిగింది. అయితే, నేను నా కుటుంబసభ్యులకి దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ బాబా మాకు తోడుగా ఉన్నారుగా! నేను, నా భర్త తప్పకుండా మా కుటుంబసభ్యులతో మళ్ళీ కలిసే అదృష్టాన్ని ప్రసాదిస్తారనే నమ్మకం ఉంది.


ఇక్కడ రెండు విషయాలు ఖచ్చితంగా మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను.


మొదటి అనుభవం:


మా పెళ్ళికి మూడు రోజుల ముందు మా ఇంట్లోవాళ్ళు నా భర్తని పెళ్లి గురించి ఒకటి అడిగారు. వాళ్ళు అడిగింది అప్పటికప్పుడు సిద్ధం చేయడానికి బాబా చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ కూడా బాబానే దగ్గరుండి చూసుకున్నారు. ఆ ఆందోళన సమయంలో నేను కేవలం బాబా నామస్మరణ మాత్రమే చేశాను. మా పెళ్ళికి ఎదురైన అడ్డంకులన్నిటినీ అధిగమించి ఈరోజు నేను నా భర్తతో సంతోషంగా ఉన్నానంటే అది కేవలం బాబా ఇచ్చిన ఆశీర్వాదమే! “సాయీ! ఎప్పటికీ నేను మీకు బిడ్డగా, నా భర్త, పిల్లలతో కలిసి మీ పాదాల చెంత సంతోషంగా ఉండేలా అనుగ్రహించండి”.


రెండవ అనుభవం:


గొలగముడిలో మా వివాహం జరుగుతున్నప్పుడు, “మా వివాహం బాబా గుడిలో అయితే ఇంకా బాగుండేది కదా” అని మనసులో అనుకున్నాను. మా వివాహమయ్యాక మేము వెంకయ్యస్వామి దర్శనానికి వెళ్ళాము. స్వామిని దర్శించుకుని పైకి చూడగానే అక్కడ చిన్న ఫోటో రూపంలో బాబా దర్శనమిచ్చారు. మామూలుగా అక్కడ బాబా ఫోటో ఉండటం అరుదు. అసలు బాబా ఫోటో అక్కడ ఉండవచ్చనే ఆలోచన కూడా నాకు లేదు. నిజానికి, మా పెళ్లిరోజున బాబా గుడికి (జనవరి 1వ తేదీన మేము వెళ్లిన గుడి) వెళ్లాలని నాకు అనిపించింది. కానీ అక్కడికి వెళ్ళటం వీలుపడదని చెప్పారు. కానీ బాబా నాకు తమ దర్శనాన్ని ఈ విధంగా అనుగ్రహించి ఇంకా ఎక్కువ ఆనందాన్ని ప్రసాదించి నన్ను ఆశీర్వదించారు.


“థాంక్యూ సో మచ్ సాయితండ్రీ! ఎల్లప్పుడూ ఇలాగే నాకు తోడుగా ఉండండి. నా వల్ల కొన్ని తప్పులు జరిగాయి. అమ్మ, నాన్న, అన్నయ్య నా వల్ల ఎంతో బాధపడ్డారు. దయచేసి నన్ను క్షమించండి. అమ్మానాన్నలు, అన్నయ్య అందరూ బాగుండేలా ఆశీర్వదించండి. నేను, నా భర్త మీ చరణాలను ఎల్లప్పుడూ పట్టివుండేలా ఆశీర్వదించండి. నాకు శిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకోవాలని ఉంది సాయీ. త్వరగా మమ్మల్ని శిరిడీకి రప్పించుకుని మీ దర్శనం ప్రసాదించండి సాయీ!”


"నాపై విశ్వాసముంచి, నా నామస్మరణ చేయండి. మిమ్మల్ని చివరికంటా గమ్యం చేరుస్తాను" - ఇది సాయి వచనం. దీనిని నేను స్వయంగా అనుభవించి ఆస్వాదించేలా చేసినందుకు సాయినాథునికి మనసారా పాదాభివందనాలు సమర్పించుకుంటున్నాను.


మా అమ్మపై దయ చూపిన బాబా

సాయిభక్తురాలు షర్మిల తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:


ముందుగా బాబాకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా నమస్సులు. ఇదివరకు నేను నా అనుభవాలను కొన్నిటిని మీతో పంచుకున్నాను. ఇటీవల బాబా ప్రసాదించిన మరో అనుభవాన్ని ఇప్పుడు పంచుకుంటాను. నా పేరు షర్మిల. స్వతహాగా మా అమ్మావాళ్ల ఇంట్లో అందరూ బాబా భక్తులు. సంక్రాంతి పండుగరోజు హఠాత్తుగా మా అమ్మగారికి కళ్లు తిరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. కాసేపటికి స్పృహలోకి వచ్చిన అమ్మ ఎవరినీ గుర్తుపట్టలేదు. దాంతో మాకు చాలా భయం వేసింది. మా తమ్ముడు అమ్మను హాస్పిటల్‌కి తీసుకొని వెళితే, డాక్టర్లు మా అమ్మను ఎమర్జెన్సీ వార్డులో ఉంచి, మెదడుకి MRI స్కాన్ తీశారు. రిపోర్టులో ఏముంటుందోనని మేమంతా చాలా భయపడ్డాము. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, "అమ్మకి ఏమీ కాకూడదు. రిపోర్టులన్నీ నార్మల్‌గా వచ్చేలా అనుగ్రహించమ"ని బాబాను వేడుకున్నాను. బాబా మాపై దయ చూపారు. అమ్మకి చేసిన టెస్టు రిపోర్టులన్నీ నార్మల్ అని వచ్చాయి. అసలు అమ్మకి ఎందుకలా జరిగిందో డాక్టరుకి అర్థం కాలేదు. "బహుశా ఒకవేళ మూర్ఛలా వచ్చి ఉండొచ్చు. మళ్లీ ఎప్పుడైనా ఇలా వస్తే వెంటనే హాస్పిటల్‌కి తీసుకుని రండి. కాస్త జాగ్రత్తగా ఉండండి" అని చెప్పారు. తరువాత ఒక టాబ్లెట్ వ్రాసిచ్చి, "ఒక ఆరునెలల పాటు ఈ టాబ్లెట్ ఖచ్చితంగా వాడండి. ఆరు నెలల తర్వాత మరోసారి స్కానింగ్ చేద్దామ"ని చెప్పి ఇంటికి పంపించారు. ఇదంతా బాబా కృప.



8 comments:

  1. జై సాయిరాం! జై గురుదత్త;

    ReplyDelete
  2. 🙏💐🙏ఓం సాయిరాం🙏💐🙏
    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
    🌺🌟🌺🌟🌺🌟🌺🌟🌺🌟🌺🌟🌺🌟🌺

    ReplyDelete
  3. Om saima baba leelas are very nice.we must trust baba.I love baba Ver much

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. Om sai ram baba ma amma health problem tondarga cure cheyi thandri pleaseeee

    ReplyDelete
  6. Baba enti na parsthithi ardam kavadam ledu sai nannu ne dagariki tisukellu sai

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo