సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

పునర్జన్మని ప్రసాదించిన బాబా




గత మూడు సంవత్సరాలుగా నేను బాబా భక్తురాలిని. బాబా మా నాన్నగారికి పునర్జన్మను ఎలా ప్రసాదించారో ఇప్పుడు మీతో పంచుకుంటాను. 2017 అక్టోబర్ 12, గురువారంనాడు మా నాన్నగారు చనిపోయినట్లుగా నాకొక కల వచ్చింది. ఆ కలలోనే నేను, "ఎందుకు బాబా‌, మాకు, మా కుటుంబానికి ఇంత కష్టం కలిగించారు?" అని గట్టిగా ఏడుస్తున్నాను కూడా. ఆ పీడకలతో నా నిద్ర చెదిరి, మెలకువ వచ్చింది. లేచిన తరువాత మావారిని పట్టుకొని గట్టిగా ఏడ్చేసాను. అదేరోజు సాయంత్రం నాన్నకి గుండెకు సంబంధించిన స్ట్రెస్ పరీక్ష చేయాల్సి వచ్చింది.

ఆరోజు నాన్నని హాస్పిటల్‌‌కి తీసుకునివెళ్లేముందు దత్తాత్రేయ మందిరానికి, బాబా మందిరానికి వెళ్లి,  "నాన్నకేమీ కష్టం లేకుండా చూడండి" అని ప్రార్థించాను. తర్వాత నాన్నని తీసుకుని హాస్పిటల్‌కి వెళ్ళాను. డాక్టరు నాన్నని పరీక్షించి, "ఆంజియోగ్రాఫీ చేయాల"ని చెప్పారు. డాక్టరు సూచన మేరకు ఆంజియోగ్రాఫీ చేయిస్తే ఆ రిపోర్టులో నాన్నగారి గుండెకు సమస్య ఉందని తెలిసింది. డాక్టరు, "ఆయనకు శస్త్రచికిత్స తప్పనిసరిగా చేయాలి. నవంబర్ నెలలో ఆంజియోప్లాస్టీ చేద్దామ"ని చెప్పారు. డాక్టరు చెప్పినట్లుగానే నవంబరులో ఆపరేషన్ జరిగింది. కానీ, ఆరోజునుండి మూడు రోజులపాటు నాన్న వాంతులు, గ్యాస్టిక్ సమస్యలతోపాటు ఆపరేషన్ జరిగిన చేతికి విపరీతమైన నొప్పితో బాధపడ్డారు. డాక్టర్స్, "కంగారుపడాల్సింది ఏమీలేదు, ఇది సాధారణమైన విషయమే, ఇటువంటి ఆపరేషన్ జరిగిన తరువాత సైడ్ ఎఫెక్ట్స్ గా ఇలాంటి సమస్యలు వస్తాయి. కొన్నిరోజుల్లో అంతా నార్మల్ అయిపోతుంద"ని చెప్పారు.

తరువాత ఐదవరోజు నాన్నని డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చిన రెండురోజుల తర్వాత నాన్న పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. ఆగకుండా వాంతులవుతూ ఆయన శరీరం  డీహైడ్రేట్‌కి గురైంది. సోడియం లెవెల్స్ కూడా పడిపోయాయి. గురువారంనాడు నాన్నని మళ్లీ సీరియస్ కండిషన్లో హాస్పిటల్‌కి తీసుకుని బయలుదేరాం. హాస్పిటల్‌కి వెళ్తూ మార్గంలో నేను, "బాబా! మీరు నాన్నతో ఉన్నట్లైతే, దర్శనమివ్వండి" అని ప్రార్థించాను. మరుక్షణంలో అందమైన బాబా చిత్రం ఒక బస్సుపై ఉండటం చూశాను. దాంతో 'నాన్నకి తోడుగా బాబా ఉన్నారు' అని నాకు ధైర్యం కలిగింది. నాన్నను హాస్పిటల్‌లో అడ్మిట్ చేశాం. సమయం గడుస్తున్నకొద్దీ ఆయన పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. మూత్రం ద్వారా సోడియం చాలా ఎక్కువగా పోయింది. క్రమంగా ఆయన తన జ్ఞాపకశక్తి కోల్పోతున్నారు. చిన్నపిల్లల్లా ప్రవర్తించడం మొదలుపెట్టారు. కంటిచూపు కూడా మందగించింది. ఆ విషాదకరమైన స్థితిలో నేను, మా సిస్టర్ చాలా ఏడ్చాము. అసలు మొదట్లో డాక్టర్లకి కూడా ఏమీ అర్థం కాలేదు. మొత్తానికి బాబా దయవల్ల కొంతసేపటి తరువాత ఆయన శరీరంలో సోడియం లెవల్స్ బాగా పడిపోవడమే ఆ పరిస్థితికి కారణమని తెలిసింది. ఆ రాత్రి మా జీవితాలలో చాలా బాధాకరమైన రాత్రి. రాత్రంతా నేను బాబా భజనలు, పాటలు, సచ్చరిత్రలోని అధ్యాయాలు, ఇంకా ఇతర దేవతల పాటలు వింటూ అస్సలు నిద్రపోలేదు.

మరుసటిరోజు శుక్రవారంనాడు నాన్న ఆరోగ్యపరిస్థితి చాలా దిగజారిపోవడంతో డాక్టర్లు ఆయనను 'ఎంఐసీయూ'లో పెట్టి, "48 గంటల్లో ఆయన కోలుకోవాలి, లేదంటే మేము చేయడానికి ఏమీ లేద"ని చెప్పేసారు. ఆ సమయంలో నాకు అక్టోబర్ నెలలో వచ్చిన కల గుర్తుకు వచ్చి, "సాయిదేవా! నేనేదైతే ఆరోజు కలలో చూసానో, ఇప్పుడు ఆ స్థితిలో నేనున్నాను. హాస్పిటల్‌‌కి వస్తున్న సమయంలో మీరు నాన్నతో ఉన్నానని మీ దర్శనంతో నాకు సూచించారు కదా,  ప్లీజ్...రండి. నాన్నని కాపాడండి బాబా!" అని ప్రార్థించాను. మా సిస్టర్, బావ హాస్పిటల్‌‌లో నాన్నవద్ద ఉండగా, నేను, అమ్మ ఆ రాత్రి ఇంటికి బయలుదేరాము. దారంతా భారమైన హృదయంతో కన్నీళ్లు ఆగలేదు. ఇంటికి చేరిన వెంటనే దేవుడు ముందు దీపం పెట్టి బిగ్గరగా ఏడుస్తూ, "రేపు ఉదయం ఏదైనా అద్భుతాన్ని చూపించండి" అని ప్రార్థించాను. తరువాత ఏం జరిగిందో తెలుసా? మన దైవం పట్ల పూర్ణమైన విశ్వాసముంటే ప్రతి చీకటిరాత్రి తర్వాత  అందమైన ఉదయం ఉంటుంది. మా విషయంలో కూడా అదే జరిగింది. ఉదయానికల్లా నాన్న శరీరం మందులకు అనుకూలంగా స్పందించడం మొదలుపెట్టింది. నేనొక చిన్న బాబా ఫోటో తీసుకుని వెళ్లి నాన్న మంచం పక్కన పెట్టి, "బాబా! నాన్న ఆరోగ్యం కుదుటపడేలా చూడండి" అని ప్రార్థించి, మా బాధనంతా ఆయన పాదాలచెంత పెట్టాను. నిదానంగా ఆయన పరిస్థితి మెరుగుపడుతూ వచ్చింది. ఏడురోజుల తరువాత ఆయన పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.

ఆరోజు ఆ భయానక కల ద్వారా కొద్దిరోజుల్లో నాన్నకు రాబోయే ప్రమాదాన్ని బాబా ముందుగానే సూచించారు. నిజంగా బాబా మా నాన్నని మృత్యుముఖంనుంచి కాపాడి, ఆయనకు పునర్జన్మనిచ్చారు. ఆయన కృప అపారం. "కోటి కోటి ప్రణామాలు బాబా! ఎప్పుడూ ఇలాగే మా కుటుంబంపై మీ చల్లని ఆశీస్సులు కురిపిస్తూ ఉండండి!"

ఓం సాయి.. శ్రీ సాయి.. జయ జయ సాయి

సర్వేజనా సుఖినోభవంతు!

3 comments:

  1. గంగాధరMarch 20, 2024 at 5:31 AM

    మా జీవితాల్లో మీరు చూపించిన మీ అపారమైన ప్రేమకి కోటి కోటి ప్రణామాలు బాబా .
    ఓం సాయిరాం 🙏🙏🙏🙏🙏🙏
    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Baba nanna ni kapadinanduku thanks baba 🙏.. Amma nanna ki etuvanti apada ra Kunda sampoorna ayurarogyalu prasadinchu tandri.. neede bharam.. saranu saranu.. Raksha Raksha sai.. ma intillipadiki, ma puttintivariki andaraiki Sakalasubhalu, ayurarogyalu prasadinchu deva 🥲🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo