సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1876వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శ్రీసాయి కృప


సాయిభక్తులకు నమస్కారం. నా పేరు సూర్య. నేను ఈమధ్యనే ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగుకి సంబంధించిన ఫేస్బుక్ పేజీ చదవడం మొదలుపెట్టాను. అందులో ప్రతిరోజూ షేర్ చేసే సాయిభక్తుల అనుభవాలు చదువుతూ తోటి భక్తుల సమస్యలను బాబా ఎలా తీరుస్తున్నారో తెలుసుకొంటూ ఎంతో ఆనందిస్తున్నాను. ఇలాంటి అనుభవాలు నాకు కూడా బాబా కొన్ని ప్రసాదించారు. వాటిలో ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2023, అక్టోబర్ నెలలో మా నాన్న ఆయాసంతో చాలా బాధపడ్డారు. అప్పుడు నేను బాబాని తలచుకొని, ఊదీ నాన్నకి పెట్టి, "తొందరగా నయం కావాల"ని బాబాని ప్రార్ధించాను. బాబా దయవల్ల కొంతసేపటికి ఆయాసం తగ్గి నాన్న బాగా నిద్రపోయారు. కానీ రెండు రోజుల తర్వాత ఆయాసం మళ్ళీ రావడంతో రాత్రి 11 గంటలప్పుడు నాన్నని హాస్పిటల్లో అడ్మిట్ చేసాం. నేను ఆ సమయంలో భయపడి బాబాని తలచుకొని, "తండ్రీ! నువ్వే నాన్నని కాపాడాలి" అని ప్రార్ధించాను. తర్వాత హాస్పిటల్ సిబ్బంది మందులు తీసుకుని రమ్మని అక్కడున్న మెడికల్ షాపుకి నన్ను పంపితే వెళ్ళాను. ఆ షాపు ప్రక్కనే చక్కని పాలరాతి విగ్రహా రూపంలో బాబా నాకు దర్శనం ఇచ్చారు. ఆ రాత్రివేళ బాబాని చూడగానే, "బాబా! నాన్నని కాపాడాల్సిన బాధ్యత నీదే. ఆయన తొందరగా ఇంటికి క్షేమంగా వస్తే మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకొంటాను" అని అనుకున్నాను. సాయి అద్భుతం చేశారు. ఆయన దయవలన నాన్న త్వరితగతిన కోలుకొని ఇంటికి వచ్చారు. అయితే నవంబర్‌‌లో మళ్ళీ నాన్నకి తీవ్రంగా ఆయాసం వచ్చింది. అప్పుడు నాన్నని హార్ట్ స్పెసలిస్ట్‌కి చూపిస్తే, "హార్ట్ ప్రాబ్లెమ్ వలన ఆయాసం వస్తుంది. వెంటనే ఆపరేషన్ చేయాల"ని చెప్పి చాలా పెద్ద మొత్తం ఖర్చవుతుందని కూడా చెప్పారు. మాకు హెల్త్ ఇన్సూరెన్స్ వుందికాని అది సగం ఖర్చులకే సరిపోతుంది. అందువల్ల మిగత డబ్బు ఎలా సర్దుబాటు చేయాలో తెలియక ఆందోళనపడుతూ సాయిబాబాను తలచుకొని, "మీరే ఏదైన చేయాలి బాబా. మీ గుడిలో అన్నదానం చేయిస్తాన"ని దణ్ణం పెట్టుకున్నాను. మరుసటిరోజు సెకండ్ ఒపీనియన్ కోసం మాకు ముందు నుండి పరిచయమున్న ఒక డాక్టరుకి చూపించాము. ఆమె కూడ ఆపరేషన్ చేయాలని, ఒకసారి బ్లడ్ టెస్టు చేద్దామని చేసారు. ఆ టెస్టులో హిమోగ్లోబిన్ 4 పాయింట్లు వుంది. డాక్టర్, "అందువల్లే ఆయాసం వస్తుంది. వెంటనే బ్లడ్ ఎక్కించాల"ని చెప్పి నాన్నని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని 3 యూనిట్ల బ్లడ్ ఎక్కించారు. నాన్నకి ఆయాసం పూర్తిగా తగ్గింది. అప్పుడు డాక్టరు, "వెంటనే ఆపరేషన్ చేయాల్సిన ఆవశ్యకత లేదు. కాని భవిష్యత్తులో చేయించాల"ని చెప్పి, ఆపరేషన్ తమ హాస్పిటల్లోనే చేస్తామని డబ్బులు కూడ మొదటి డాక్టరు చెప్పిన దానికంటే 30% తక్కువ చెప్పారు. పైగా బాబా దయవలన ఆపరేషన్ వెంటనే చేయాల్సిన ఆవశ్యకత లేకపోవటంతో డబ్బులు సర్దుబాటు చేసుకొని, తర్వాత డిసెంబర్లో నాన్నకి ఆపరేషన్ చేయించాము. ఆరోజు మేము నాన్నని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తుంటే మా కారు ముందు ఒక బస్సు హాస్పిటల్ వరకు వచ్చింది. ఆ బస్సు వెనుక బాబా పోస్టర్ వుంది. ఎంతో ధైర్యంగా హాస్పిటల్‌కి వెళ్ళాం. బాబా దయతో ఆపరేషన్ చక్కగా జరిగి నాన్న కేవలం రెండు రోజులలో కోలుకొని క్షేమంగా ఇంటికి వచ్చారు. తర్వాత ఒక గురువారం బాబా గుడిలో నాన్న పేరిట అన్నదానం చేయించాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

ఇకపోతే, నాన్నకున్న యూరిన్ ప్రాబ్లెమ్ వలన ఆయనకు తెలియకుండానే మూత్రవిసర్జన జరిగిపోతుంది. అందువల్ల తరచుగా మూత్ర విసర్జన చేయమని చెప్పి పంపవలసి వస్తుంది. 2024, జూన్ 22 ఉదయం 6 గంటలప్పుడు నాన్న తనకి తెలియకుండానే హాల్లోనే మూత్ర విసర్జన చేసారు. దాన్ని శుభ్రం చేస్తూ 76 సంవత్సరాల మా అమ్మ బాత్రూం గట్టు మీద జారి పడిపోయారు. ఆమె ఎలాగో లేచి నాన్న బట్టలు మార్చి విపరీతమైన బాధతో పడుకున్నారు. ఆమె 8 గంటలప్పుడు నొప్పిని భరించలేక నాకు ఫోన్ చేసి, విషయం చెప్పి నన్ను రమ్మన్నారు. ముందు వీధిలో ఉండే నేను భయపడి వెంటనే బాబాని తలుచుకుంటూ గాబరాగా అమ్మవాళ్ళింటికి వెళ్లాను. అమ్మకి దెబ్బ బలంగా తగలడం వలన మంచం మీద నుంచి లేవలేక బాధతో విలవిలలాడుతూ కనిపించేసరికి నేను ఫ్రాక్చర్ ఏమైనా అయిందేమోనని మరింత భయపడిపోయాను. ఆమెని కూర్చోబెట్టి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఇచ్చి, ఆయింట్మెంట్ రాసాను. బాబాని తలచుకొని అమ్మ నొప్పి తగ్గాలని, ఫ్రాక్చర్ ఏమీ అవ్వకుండా మందులతో తగ్గితే శ్రీసాయినాథ మూలబీజ మంత్రాక్షరీ స్తోత్రం 11 సార్లు చదువుతానని సాయి మీద భారం వేశాను. సాయంత్రం అమ్మని డాక్టరుకి చూపిస్తే, ఫ్రాక్చర్ అవ్వలేదని చెప్పి వారం రోజులకు మందులు ఇచ్చారు. బాబా కృపవలన మరుసటిరోజుకు నొప్పి కొంచెం తగ్గి అమ్మ నెమ్మదిగా తన పనులు తాను చేసుకోసాగింది. వెంటనే నేను శ్రీసాయినాథ మూలబీజ మంత్రాక్షర స్తోత్రం 11 సార్లు పఠించాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. నేను చేసిన తప్పులు అన్నింటిని మన్నించు దేవా. ఎప్పటికీ నీ పాదాల దగ్గర శ్రద్ధ, సబూరితో ఉండే అదృష్టాన్ని ప్రసాదించు సాయీ".

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo