ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా చేసిన చమత్కారం
2. బాబా ఉండగా ఏమీ కాదు - అన్ని ఆయన చూసుకుంటారు
బాబా చేసిన చమత్కారం
నా పేరు మానస. బ్లాగులో అనుభవాలు పంచుకుంటున్న సాయిభక్తులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీరు పంచుకునే అనుభవాల వల్ల బాబాపై భక్తి, నమ్మకం ఎక్కువవుతున్నాయి. బాబా దయవల్ల మాకు రెండు సంవత్సరాల బాబు ఉన్నాడు. ఒకరోజు నేను తనని ఎత్తుకొని తిప్పుతుంటే హఠాత్తుగా నా చేతులోనుండి జారీ బాత్రూమ్ గడపపై పడిపోయాడు. పడింది తక్కువ ఎత్తు నుండి అయినప్పటికీ బాత్రూమ్ గడప గ్రానైట్దైనందువల్ల బాబు తల వెనక దెబ్బ తగిలి వాపు కూడా వచ్చింది. వెంటనే నేను, "బాబా! బాబు తలకి దెబ్బ తగిలింది. దయచేసి తనకి ఏ సమస్యా రాకుండా చూడండి" అని బాబాని ఆర్తిగా వేడుకొని వాపు వచ్చిన చోట ఊదీ పెట్టి 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని 108సార్లు జపించాను. అయినా ఒక రోజంతా గమనించాను. వాడికి ఏమీ కాలేదు. బాగున్నాడు. అంతా బాబా దయ. వాడు బాబా మాకిచ్చిన ప్రసాదం. వాడిని ఎన్నో సందర్భాలలో బాబా కాపాడారు. "బాబా! మీరు నా బాబుని చల్లగా చూసి నా మానసికక్షోభను తగ్గించారు. నేను జన్మజన్మలకి మీకు ఋణపడి ఉంటాను. మీ దివ్యకృప మాపై ఎల్లవేళలా వర్షిచండి".
మేము 38వ అంతస్తులో ఉంటాం. ఒకసారి అల్లరివాడైన మా బాబు కిటికీలో నుండి నా ఐఫోన్ కిందకి విసిరేసాడు. మా బాబు పుట్టినప్పటినుండి తీసిన ఫోటోలన్నీ ఆ ఫోన్లోనే ఉన్నాయి. మేము వాటిని క్లౌడ్ స్టోరేజ్లో సేవ్ చేసుకోలేదు. అందువల్ల నేను, "బాబా! ఫోన్ పాడవకూడదు. చిన్న మరమ్మత్తుతో అది మాములుగా పని చేసేలా చూడండి ప్లీజ్" అని బాబాని వేడుకున్నాను. వెంటనే మావారు నా ఫోన్కి కాల్ చేస్తే రింగ్ అయింది. కిందకి వెళ్లి చూస్తే ఫోన్ స్క్రీన్ పాడైంది కానీ, ఫోన్ రింగ్ అవుతుంది. మరుసటిరోజు మావారు ఆ ఫోన్ రిపేర్ చేయించి తీసుకొచ్చారు. ఇదొక గొప్ప చమత్కారమని చెప్పొచ్చు. ఎందుకంటే, అంత ఎత్తు(38వ అంతస్తు) నుండి పడితే ఫోన్ తుక్కుతుక్కు అవుతుంది. నేను అలాగే అనుకున్నాను కూడా. కానీ బాబా దయవల్ల చిన్న నష్టమే జరిగింది. ఆ ఫోన్ లోని మా మధుర స్మృతాలన్నీ అలాగే ఉన్నాయి. మేము వాటిని ఇప్పుడు క్లౌడ్ స్టోరేజ్లో భద్రపరుచున్నాము. "ధన్యవాదాలు బాబా. నేను మిమ్మల్ని ఎప్పుడూ మరచిపోను తండ్రీ".
బాబా ఉండగా ఏమీ కాదు - అన్ని ఆయన చూసుకుంటారు
నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఒకరోజు బాబా ఫోటో ముందు కూర్చొని నా బాధలు, నా కోరికలు బాబాతో చెప్పుకొని, "బాబా! నేను అనుకున్నవి జరుగుతాయి అంటే ఏదో ఒక రూపంలో మీ దర్శనం ఇవ్వండి" అని అనుకున్నాను. తర్వాత కూడా బాబాని అలా చూస్తూ ఉంటే నా మనసుకి, 'బాబా స్కై బ్లూ రంగు వస్త్రాల్లో దర్శనమిస్తార'ని అనిపించింది. నిజంగానే శిరిడీలో మధ్యాహ్న ఆరతి సమయంలో బాబా స్కై బ్లూ రంగు వస్త్రాలలో దర్శనమిచ్చారు. బాబా ఎంతటి లీల చేసారో చూసారా! నేను ఎప్పటికీ ఈ అనుభవాన్ని మర్చిపోలేను. బాబా భక్తుల చిన్న చిన్న కోరికలను నెరవేరుస్తారు.
బాబా అనుగ్రహంతో మాకు ఒక పాప పుట్టింది. తనకిప్పుడు తొమ్మిది నెలలు. తాను ఇంకా సరిగా కూర్చోలేదు, నడవలేదు. ఒకరోజు తను కింద పడిపోయి బాగా ఏడ్చింది. నాకు తన తలకి ఏమైనా దెబ్బ తగిలిందేమోనని చాలా భయమేసి, "బాబా! పాపకి ఏమీ కాకూడద"ని బాబాను ప్రార్థించాను. పాప తల వెనక చిన్నగా తగిలినప్పటికీ బాబా దయవల్ల పర్వలేకపోయింది.
ఒకసారి మా పాపకి బాగా జ్వరమొచ్చింది. హాస్పిటల్‌కి వెళ్లినా, చాలా మందులు వాడినా తగ్గలేదు. అప్పుడు, "బాబా! నాకు దారి చూపించండి. ఏదైనా మంచి హాస్పిటల్ చూపండి" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల వేరే వాళ్ళ ద్వారా మంచి హాస్పిటల్ గురించి తెలిసింది. అక్కడికి వెళ్తే పాపకి జ్వరం తగ్గింది. బాబా ఉండగా మనకు ఏమీ కాదు. అన్ని ఆయన చూసుకుంటారు. సాయినాథుని దయతో అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను.
