1. ఏదైనా బాబా చూసుకుంటారు!
2. మనము మరచినా బాబా మరువరు!
3. బాబా దయ
ఏదైనా బాబా చూసుకుంటారు!
సాయిబంధువులకు నమస్కరం. నా పేరు శ్రీదేవి. నాకు బాబా అంటే చెప్పలేనంత ఇష్టం, ప్రేమ, నమ్మకం, భక్తి. ఎంత అంటే ఒక్క మాటలో చెప్పేవి కావు. తండ్రి తన బిడ్డ గురించి ఎలా ఆలోచిస్తారో, ఇది నీకు మంచిది, ఇది నీకు చాలు అని ఎలా చెప్తారో అలా బాబా మనకు ప్రాప్తం ఉంటే తప్పకుండా ఇస్తారు. అయన నాకు ఇచ్చిన నిదర్శనాలు కొన్ని వేలు. మేము మా చిన్నమ్మాయి పుట్టినరోజుకు శిరిడీ వెళ్లాలని అనుకొని మాతోపాటు మా మావయ్య, అత్తయ్యలని కూడా తీసుకొని వెళ్లాలని అనుకున్నాము. ఎందుకంటే, వాళ్ళు పదేళ్ల క్రితం మేము ఇల్లు కట్టుకుంటే అందరం శిరిడీ వస్తామని అనుకున్నారు. తర్వాత మేము, మా పిల్లలు, మా అత్తగారు రెండు, మూడుసార్లు శిరిడీ వెళ్ళొచ్చాము. కానీ మా మావయ్యవాళ్ళు అనుకున్నట్లు మావారిని తీసుకొని వెళ్ళలేదు. ఆ సమయంలో మావారి ఆరోగ్యం బాగోలేదు. అందుకని వాళ్ళు వాళ్ళ అమ్మాయిని, వాళ్ళ పిల్లలని తీసుకొని వెళ్లారు. నాకు ఆ మొక్కు అలా ఆగిపోతుందని భయం పట్టుకుంది. అందుకని ఒకరోజు ఆగష్టు 10న శిరిడీ వెళదామని అడిగితే, మా మావయ్య సరేనన్నారు. కానీ ఆయన్ని ఎలా తీసుకెళ్తామని భయమేసింది. ఎందుకంటే, రోజురోజుకి మా మావయ్యగారి కాళ్ళు నడవటానికి సహకరించడం లేదు. కానీ ఇప్పుడు తప్పితే ఇంకా వెళ్ళలేరు. అదీకాక టిక్కెట్లు బుక్ చేసిన తర్వాత చూసుకుంటే, అది నా నెలసరి సమయం అయింది. అప్పుడు, "అన్ని నువ్వే చూసుకో తండ్రీ" అని బాబాతో చెప్పుకున్నాను. నా స్నేహితురాలు అప్పుడప్పుడు ఈ బ్లాగు లింక్స్ పంపిస్తూ ఉంటుంది. అలా తాను పంపించినప్పుడు, "అంతా నేను చూసుకుంటాను" అని వచ్చింది. అలాగే బాబా దయవల్ల మేము క్షేమంగా శిరిడీ వెళ్లి బాబాని దర్శించుకొని వచ్చాము. నిజానికి నేను నా స్నేహితురాలు పంపిన బ్లాగు లింక్స్ ఓపెన్ చేసి భక్తుల అనుభవాలు చదువుతూ 'వీళ్లేంటి మరీ ఇలా చిన్న కోరికలు తీరినందుకు కూడా ఇలా పెడుతున్నారు, అవి పంచుకుంటేనే బాబా తీరుస్తారా? లేకపోతే మన మాట ఆయన వినరా?' అని అనుకునేదాన్ని, నవ్వుకునేదాన్ని. కానీ పంచుకుంటే బాబా ఇచ్చిన ఆనందం ఇంకా పెరుగుతుందని తెలిసింది. నాకు దొరికిన బాబా సన్నిహితం మీకు దొరకాలని కోరుకుంటున్నాను.
మనము మరచినా బాబా మరువరు!
నా పేరు ఝాన్సీ. మాకు ఒక పొదుపు సంఘం ఉంది. వైఎస్ఆర్ ఆసరా పధకం కింద పొదుపు సంఘాలకి ఫండ్స్ రావాల్సి ఉండగా చాలా గ్రూపులకి ఫండ్ రిలీజ్ చేసారు కానీ, మా గ్రూపుకి చేయలేదు. ఇంతలో ఆంధ్రప్రదేశ్‌లో 2024, ఎన్నికల తేదీ దగ్గర పడింది. ప్రభుత్వం మారితే మాకు ఫండ్ రాదు. అందువల్ల నేను, "ఫండ్ రిలీజ్ అయ్యేలా అనుగ్రహించమ"ని బాబాకి చెప్పుకున్నాను. తర్వాత ఎన్నికలు కూడా అయిపోయాయి. కానీ మాకు ఫండ్ రిలీజ్ కాలేదు. దాంతో బాబా మర్చిపోయారేమో అనుకున్నాను. కానీ ఎన్నికలు ఐన 5 రోజులకి ఫండ్ రిలీజ్ చేసారు. అప్పుడు మనము మరచినా బాబా మరువరని గ్రహించాను. "చాలా ధన్యవాదాలు బాబా. నాకున్న సమస్య, దానివల్ల నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలుసు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి. నన్ను కాపాడు సాయిదేవా. నేను ఎప్పుడూ ఇంత బాధ పడలేదు. నేను ఏమైనా తెలియక తప్పులు చేసుంటే క్షమించి నన్ను నా కర్మకు వదిలియకండి బాబా"
బాబా దయ
నా పేరు తేజశ్రీ. ఒకరోజు నా భర్త, మా బాబు ఒక పని మీద బయటకి వెళ్లారు. ఆ పని పూర్తవడానికి ఒక గంట పడుతుంది. అయితే వాళ్ళు వెళ్లి నాలుగు గంటలవుతున్న ఇంటికి తిరిగి రాలేదు. అదీకాకుండా నా కుడికన్ను అదిరినందున నాకు చాలా భయమేసింది. మావారికి మెసేజ్ పెడితే బదులు ఇవ్వలేదు. అప్పుడు నేను, "బాబా! మీ దయవల్ల వాళ్ళిద్దరికీ ఏమీ కాకుండా ఉండాలి" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల వాళ్ళు వెంటనే వచ్చారు. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".

