సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1872వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా మీద పూర్తి భారమేసి మనస్ఫూర్తిగా నమ్ముకుని వుంటే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తారు
2. మనసులోని ఆలోచనను గ్రహించి దర్శనభాగ్యం ప్రసాదించిన బాబా

బాబా మీద పూర్తి భారమేసి మనస్ఫూర్తిగా నమ్ముకుని వుంటే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తారు


శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిభక్తులందరికీ నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. బాబా అనుగ్రహం వల్ల 2023, జూన్ 15న నాకు ఒక బాబు పుట్టాడు. బాబుకి 5వ నెలలో ఒంటి నిండా ఎర్రటి పొక్కులు వచ్చి వాటంతవే తగ్గుతుంటే, 'ఎందుకు అలా వస్తున్నాయో!' నాకు అర్థంకాక చాలా కంగారుపడ్డాను. రోజంతా అదే ఆలోచనతో ఆందోళనగా అనిపించింది. ఇంకా భయం తట్టుకోలేక నెల రోజుల తర్వాత బాబా పటం ముందు నిలబడి, "నేను ఇంకా ఈ భయాన్ని తట్టుకోలేను. రేపటి నుంచి బాబుకి ఆ పొక్కులు రాకూడదు" అని దణ్ణం పెట్టుకున్నాను. అంతే, ఆశ్చర్యం!! ఆ మరుసటిరోజు నుంచి పొక్కులు రావడం ఆగిపోయాయి. తర్వాత బాబుకి 12వ నెల వచ్చాక సుమారు రెండో వారం నుంచి మళ్ళీ ఆ పొక్కులు రావడం మొదలైంది. నేను మొదట వస్తు, పోతున్నాయి కదా అని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఒక రోజు పొద్దున్నే బాబు నిద్రలేవగానే చూస్తే, తన ఎడమ చేతి ఉంగరం వేలు మీద పెద్ద పొక్కు, దానితోపాటు చేయి భాగమంతా వాపు వచ్చాయి. నాకు భయమేసి వెంటనే మా ఇంటికి  దగ్గరలో ఉన్న హోమియోపతి హాస్పటల్‌కి బాబుని తీసుకొని బయలుదేరాను. అలా వెళ్తున్నపుడు బాబాకి దణ్ణం పెట్టుకుంటూ, "మీరే ఆ డాక్టర్ రూపంలో మాట్లాడి నాకు దైర్యం ఇవ్వాలి. మీరే ఆ డాక్టర్ చేతి మీదుగా మందు ఇవ్వాలి. బాబుకి తగ్గిపోవాలి" అని చెప్పుకుంటూ వెళ్ళాను. డాక్టర్ పరీక్షించి, అలర్జీ అని చెప్పి మందులిచ్చారు. అప్పుడు నా భయం కాస్త తగ్గింది. ఆ రోజు నుంచి మందులు వేయడం మొదలుపెడితే మరుసటిరోజుకి వాపు చాలావరకు తగ్గింది. కానీ రెండు రోజులు గడిచినా పూర్తిగా తగ్గలేదు. 2024, జూన్ 10, పొద్దున్న నేను బాబా పటం ముందు నిల్చుని, "బాబా! ఇప్పుడు బాబు పడుకోబోతున్నాడు. వాడు పడుకున్నాక నేను మీ ఊదీ వాడి చేతి మీద వాపు వున్న చోట రాస్తాను. వాడు లేచేసరికి వాపు పూర్తిగా తగ్గిపోయి ఉండాలి" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. తర్వాత బాబుని ఉదయం 10.15కి పడుకోబెట్టి, వాడి చేతి మీద వాపు వున్న చోట బాబా నామం చెప్తూ ఊదీ రాశాను. బాబు 12:15కి నిద్రలేచాడు. ఎంత ఆశ్చర్యం అంటే వాడి చేతి మీద వాపు పూర్తిగా తగ్గిపోయి వుంది. అది చూసి నాకు ఆనందభాష్పాలు రాగా మనస్ఫూర్తిగా బాబాకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఈ అనుభవం ద్వారా బాబా నాకు 'ఆయన మీద పూర్తిగా భారమేసి మనస్ఫూర్తిగా నమ్ముకుని వుంటే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తారు. అది సత్యం' అని తెలియజేసింది.


మనసులోని ఆలోచనను గ్రహించి దర్శనభాగ్యం ప్రసాదించిన బాబా


నేను ఒక సాయిభక్తురాలిని. నాకు ఇద్దరు పిల్లలు. మేము చెన్నైలో ఉంటాం. ఒకసారి దసరా సెలవులకి నేను, మావారు, పిల్లలు అందరం కలసి పళని,  కొడైకెనాల్, మధురై యాత్రకు వెళ్లాలని అనుకున్నాం. విజయదశమి రోజున మేము ముందుగా పళని వెళ్లి కుమారస్వామి దర్శనం చేసుకున్నాము. తర్వాత కారులో వెళ్తున్నప్పుడు నాకు, 'ఈరోజు విజయదశమి, పైగా గురువారం. సాయిబాబా గుడికి వెళ్లి సాయి దర్శనం చేసుకుంటే ఎంతో బాగుంటుంది' అనిపించింది. అలా అనుకుంటూ కారులో నుంచి బయటకు చూస్తే, 'సాయిబాబా టెంపుల్ 2 కిలోమీటర్లు' అని బోర్డు కనిపించింది. నేను చాలా ఆనందాశ్చర్యాలకు లోనయ్యాను. ఎంతో ఆనందంగా  వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకున్నాను. అలా బాబా నా ఆలోచన గ్రహించి తమ దర్శన భాగ్యం నాకు కలిగించారు. మా యాత్ర కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగా జరిగింది. సాయిబాబాకు ధన్యవాదాలు.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo