ఈ భాగంలో అనుభవాలు:
1. అద్భుతమైన బాబా ప్రేమను వివరించడానికి పదాలు లేవు
2. తలచుకున్న రెండు నిముషాల్లో నల్లపూసలు కనిపించేలా అనుగ్రహించిన బాబా
అద్భుతమైన బాబా ప్రేమను వివరించడానికి పదాలు లేవు
నేను ఒక సాయిభక్తురాలిని. ఒక ఆదివారం సాయంత్రం నా కొడుకు హోవర్ బోర్డు మీద నుండి పడి గాయపడ్డాడు. మేము మొదట తనకి ఏం కాలేదు, ఫర్వాలేదలే అనుకున్నాము. కానీ ఏదో అనుమానమొచ్చి బాబుని హాస్పిటల్కి తీసుకెళ్లాము. డాక్టర్ చూసి మోచేతి ఎముక విరిగిందని చెప్పారు. అది విని నేను చాలా బాధపడి చాలా ఆందోళన చెందాను. మరునిమిషంలో నాకు బాగా కళ్లు తిరిగి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. నా బిడ్డను చూస్తూ నేను తనని ఎలా చూసుకోవాలని ఆలోచనలో పడి 'ఓం సాయిరామ్' అని జపించాను. బాబా దయవల్ల కొన్ని నిమిషాల్లో నేను సాధారణ స్థితికి వచ్చాను. కానీ ఒంట్లో ఏదో నలతగా ఉంది. మరుసటిరోజు కూడా నా కళ్లు తిరగడం, బిపి ఎక్కువ కావడం వల్ల ఆందోళనగా అనిపించసాగింది. వాటన్నిటితో నా కొడుకును జాగ్రత్తగా చూసుకోవాలని చాలా ఒత్తిడి అనుభవించాను. ఆ రోజు రాత్రి నిద్రపోయేముందు బాబా ముందు కూర్చొని, "నేను ఇదంతా ఎందుకు అనుభవిస్తున్నాను. దయచేసి నాకు నయం చేయండి. అప్పుడు నేను నా బిడ్డను జాగ్రత్తగా చూసుకోగలను" అని ప్రార్థించాను. ఆ రాత్రంతా నేను చాలా ఆత్రుతగా ఉన్నాను. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నాకు ఒక కల వచ్చింది, ఆ కలలో నేను, నా స్నేహితురాలు కలిసి ఉన్నప్పుడు బాబా వచ్చారు. మేమిద్దరం ఆయన్ని ఆహ్వానించాము. బాబా లోపలికి వచ్చి తమ ఫోటో కింద కూర్చున్నారు. ఎందుకో తెలీదుగాని ఆ సమయంలో నా నోటిలో చాలా నీళ్లు ఉన్నాయి. నేను నా కొడుకు మోచేతి ఫ్రాక్చర్ గురించి బాబాని అడిగితే, ఆయన తమ తల ఆడించారు. తర్వాత నేను పురిటిలో కోల్పోయిన నా మరో బిడ్డ గురించి అడిగాను. అప్పుడు కూడా బాబా తల ఆడించారు. నేను ఆ బిడ్డ వల్ల నా జీవితం చాలా కఠినంగా ఉండేదని బాబా చెబుతున్నారని అర్థం చేసుకున్నాను. అప్పుడు ఏదో శబ్దం వినిపించి నేను నిద్ర లేచాను. ఆ సమయంలో నా నోరు ఎండిపోయి ఉందని గమనించి 'బాబా నేను డీహైడ్రేషన్లోనయ్యాన'ని సూచనా ప్రాయంగా చెప్పారనుకున్నాను. వెంటనే కొంచెం నీళ్ళు తాగి, 'ఇలా ఎవరు చూసుకుంటారు? బాబా మనల్ని తల్లిదండ్రుల్లా చూసుకుంటున్నారు' అని అనుకోని, "కోటి కోటి ప్రణామాలు బాబా" అని అనుకున్నాను. మర్నాడు ఉదయం కలలో నాతోపాటు కనిపించిన నా స్నేహితురాలికి ఫోన్ చేసి, "బాబా నీకు ఏమైనా స్వప్నదర్శనమిచ్చారా?" అని అడిగాను. ఆమె, "హా, కల వచ్చింది. కలలో బాబా వాటర్ బాటిల్ అడిగారు. నేను ఇచ్చి, ఆయన పక్కన చాలా ప్రశాంతంగా కూర్చున్నాను. బాబా నీళ్లు ఎందుకు అడిగారో నాకు అర్థం కాలేదు" అని చెప్పింది. అది విని నేను చాలా ఆశ్చర్యపోయాను, నా ఒళ్ళు గగుర్పాటుకు గురైంది, బాబా ప్రేమకు నా కళ్ళ నుండి నీళ్ళు వచ్చాయి. అప్పటి నుంచి నీళ్లు ఎక్కవగా తాగడం వల్ల 2 రోజులకి నాకు చాలా బాగుందనిపించింది. డాక్టరు కూడా నా కొడుకు మోచేయి ఫ్రాక్చర్కి సర్జరీ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. అద్భుతమైన బాబా ప్రేమను వివరించడానికి పదాలు లేవు, "కోటి కోటి ప్రణామాలు బాబా.
చాలా ధన్యవాదాలు బాబా. దయచేసి నా బిడ్డని ఆశీర్వదించండి. నా తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి బాబా".
బాబా శరణం భవ భయ హరణం...
తలచుకున్న రెండు నిముషాల్లో నల్లపూసలు కనిపించేలా అనుగ్రహించిన బాబా
అందరికీ నమస్కారం. నేను బాబా భక్తురాలిని. నేను ఎప్పుడు కష్టాల్లో ఉన్నా బాబా ఏదో ఒక రూపంలో నాకు సహాయం అందిస్తున్నారు. మేము ఈమధ్య మా తాతగారిని చూడటానికి వెళ్ళాము. రెండురోజుల తర్వాత ఆయన కాలం చేసారు. ఆయన్ని చూడటానికి వచ్చినవాళ్లు ఇంట్లో ఉండటం వల్ల అందరూ ఉన్నారు కదా అని నేను నా హ్యాండ్ బాగ్, నల్లపూసలు బీరువాలో పెట్టి పది రోజుల వరకు వాటిని మళ్ళీ పట్టించుకోలేదు. తర్వాత నల్లపూసల కోసం వెతికితే కనిపించలేదు. మొత్తం అన్ని చోట్ల చూసినా కనపడలేదు. దాంతో వాటిని ఎక్కడ పెట్టానో నాకు అర్థంకాక 'ఇప్పుడు ఏం చేయాలనుకుంటూ' 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అని "బాబా! ఆ నల్లపూసలు దొరికేలా చేయి తండ్రీ" అనుకొని బీరువా తెరిచాను. ఎదురుగా ఒక బాక్స్ ఉంటే దాన్ని తెరిచి చూస్తే, అందులో నల్లపూసలు ఉన్నాయి. అప్పటికి రెండు రోజులుగా బీరువా తెరిచి, వెతికి తాళం వేస్తున్నాను కానీ, ఆ బాక్స్ ఓపెన్ చేయలేదు. అలాంటిది బాబాని తలచుకున్న రెండు నిమషాల్లో ఆయన ఆ బాక్స్ తెరిచేలా చేసి, నా నల్లపూసలు నాకు చూపించారు. బాబా దయ ఉంటే సాధ్యం కానిదంటూ లేదు. "ధన్యవాదాలు బాబా. సదా మమ్మల్ని రక్షించు తండ్రీ".
