సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1898వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కృపతో తిరుమల స్వామి సన్నిధిలో సేవాభాగ్యాన్నిచ్చిన బాబా
2. సాయి కృపవల్ల తీరిన సమస్య

కృపతో తిరుమల స్వామి సన్నిధిలో సేవాభాగ్యాన్నిచ్చిన బాబా
 
సాయిబంధువులందరికీ నమస్కారాలు. నా పేరు నీలవేణి. 2022 నుండి నేను బాబాను కొలుస్తున్నాను. 2022లో నేను, నా కుమార్తె ట్రావెల్స్ ద్వారా చారుదాం యాత్రకు వెళ్ళాము. అక్కడ ట్రావెల్స్‌వాళ్ళు మాకు సమయానికి అన్ని సౌకర్యాలు సమకూర్చినా మా అమ్మాయి చాలా అసౌకర్యానికి గురై కోపంగా, అమర్యాదగా ప్రవర్తించింది. అప్పుడు నేను 'అనవసరంగా ఈ పిల్లతో యాత్రకు వచ్చాను' అని ఇబ్బందిపడ్డాను. అయినా ఎలాగో ఓర్చుకొని తిరిగి ఇంటికి చేరుకున్నాను. తర్వాత 2024, మే నెలలో తిరుమలలో వారం రోజుల సేవకి నాకు, నా కుమార్తెకి అవకాశం వస్తే, ఇద్దరమూ ప్రయాణానికి సిద్ధమయ్యాము. కానీ నా మనసులో ఒకటే బెంగ, 'ఈ పిల్లతో నేను సేవా కార్యక్రమం చేయగలనా? ఈ పిల్ల కూడా ఓర్పుతో సేవా చేయగలదా? ఏమైనా ఇబ్బందులొస్తే భరిస్తుందా? ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయ'ని. ఆ బెంగవల్ల సాయినాథునికి దణ్ణం పెట్టుకొని, "బాబా! ఈ యాత్ర అంతా దివ్యంగా, ప్రశాంతంగా, సవ్యంగా జరిగేటట్లు చూడు తండ్రీ" అని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల అనుకున్న యాత్రేకాక అనుకోకుండా అరుణాచలం, మదురై, శ్రీరంగం, తిరుత్తుణి, గోల్డెన్ టెంపుల్, కాణిపాకం, శ్రీకాళహస్తి దర్శించుకొని తర్వాత సేవకి తిరుమల చేరుకున్నాము. తిరుమల సేవకు వెళ్లిన రెండో రోజు లక్కీ డిప్‌లో మా బృందం టెంపుల్ డ్యూటీకి సెలెక్ట్ అయింది. 'టెంపుల్ డ్యూటీ' అని మా బృందమందరికీ ఒకటే ఆనందమేసింది. నేను బాబాని, "మాకు గుడిలో డ్యూటీ వేయమ"ని ప్రార్థించాను. తర్వాత బాబా నాకు, నా కుమార్తెకు ఆకాశంలోని మబ్బుల్లో దర్శనమిచ్చారు. మా అమ్మాయికి వైకుంఠ ద్వారం దగ్గర, నాకు కాస్త దూరంగా, మా టీమ్ లీడరుకి స్వామి సన్నిధిలో డ్యూటీ పడింది. బాబా దయవలన ఆరోజు డ్యూటీలో ఉండగా నేను, మా అమ్మాయి నాలుగైదు సార్లు వెంకటనాథుని దర్శనం చేసుకున్నాము. కానీ నా మనసులో నాకు స్వామి సన్నిధిలో డ్యూటీ వేయలేదు, బాబా దయ లేదని కాస్త బాధపడ్డాను.

మొత్తానికి వారం రోజుల సేవ పూర్తైంది. మా అమ్మాయి ఆ వారం రోజులు చిరాకు పడకుండా సౌమ్యంగా వుంది. నచ్చినా, నచ్చకపోయినా సర్దుకొని ఆ వారం రోజులు వెంగమాంబ అన్నప్రసాదం తింటూ సేవా పూర్తి చేసాము. సేవ పూర్తయ్యాక సేవకులకు టీటీడీవారు ఒక దర్శనం ఇస్తారు. ఆ దర్శనంకోసం మా బృందంలోని 15 మందిమి సేవా వస్త్రాల్లో తెల్లవారుజామున మూడు గంటలకు వెళ్ళాము. ఆ సమయంలో సుప్రభాత సేవ, అంగప్రదక్షిణ పూర్తై ఆయా భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. జనం చాలా ఎక్కువగా ఉన్నారు, ఒకరి మీద ఒకరు పడుతున్నారు. సేవ చేస్తున్నవాళ్ళు ఆ భక్తులను అదుపు చేయలేకపోతున్నారు. అటువంటి సమయంలో మా బృందం స్వామి దర్శనము కోసం లోపల ఉంది. ఒక టీటీడీ ఉద్యోగి నన్ను, మా అమ్మాయిని పిలిచి, "మీరు ద్వారం వద్ద ఉండి భక్తులను నెట్టగలరా?" అని అడిగారు. నేను, మా అమ్మాయి కోటి రూపాయలు లాటరీ తగిలినంత ఆనందంతో, "ఉంటామండి" అని చెప్పి సుమారు రెండు గంటలు స్వామి సన్నిధిలో ద్వారం వద్ద నిల్చొని స్వామిని చూస్తూ 'గోవిందా' అనుకుంటూ గడిపాము. గర్భగుడిలో నుండి వచ్చిన మూడు రకాల ప్రసాదాలు తిని స్వామి సేవ తృప్తిగా చేసుకొని ఆరు గంటలకు బయటకు వచ్చాము. మా బృందం అందరిలో నాకు, నా కుమార్తెకు మాత్రమే ఆ భాగ్యం దక్కింది. అంతా బాబా కృప అని నా నమ్మకం. ఈ అవకాశం కల్పించిన బాబాకి కోటి నమస్కారాలు. అంతటితో అయిపోలేదు. మేము క్షేమంగా ఇంటికి చేరుకున్నాక మా ఫ్రెండ్ ఫోన్ చేసి, "నేను మిమ్మల్ని శిరిడీ తీసుకొని వెళ్తాను. ఆగస్టులో వెళ్ళడానికి రిజర్వేషన్ చేయిస్తున్నాను" అని చెప్పింది. అనుకోకుండా నా ప్రమేయం లేకుండా బాబా నాకు తమ దర్శనం కల్పించారు. "థాంక్యూ సాయినాథా".

సాయి కృపవల్ల తీరిన సమస్య

అందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. ఒకసారి నేను మా ఆఫీసు ఐడి కార్డు పోగొట్టుకున్నాను. ఆఫీసు క్యాబ్‌లో పడిపోయిందేమోనని డ్రైవర్‌ని అడిగితే, ఐడి కార్డు ఏమీ కనిపించలేదని చెప్పారు. కార్డు లేకపోవడం వలన 4-5 రోజులు నాకు చాలా సమస్య అయింది. సెక్యూరిటీ గార్డుల అనుమతి తీసుకోవడం, వేరేవాళ్ళ కార్డు వాడటం, క్యాబులు ఆలస్యమవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అడ్మిన్ టీమ్‌వాళ్ళు కొత్త కార్డు కోసం 700 రూపాయలు చెల్లించాలని అన్నారు. అప్పుడు ఇలా సమస్య అవుతుందని మా అమ్మతో చెప్తే, బాబాకి దణ్ణం పెట్టుకోమని చెప్పింది. అమ్మ ముందు కూడా అదే మాట చెప్పింది. కానీ నేను అమ్మ మాటలు సీరియస్‌గా తీసుకోలేదు. చిన్నవాటికి బాబాని అడగకూడదనుకున్నాను. కానీ సమస్య ఎక్కువ అయ్యేసరికి బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. తర్వాత రెండు రోజులకి సెక్యూరిటీ ఆఫీసులో మళ్ళీ అడిగితే, ఒక డ్రైవర్ నా ఐడి కార్డు తెచ్చి ఇచ్చినట్లు చెప్పారు. అది విని నాకు చాలా సంతోషమేసి వెంటనే బాబాకి థాంక్స్ చెప్పుకున్నాను. చూస్తే, ఆ డ్రైవర్ పేరు 'దత్త' అని ఉంది. సాయి కృపవల్ల నా సమస్య తీరిపోయింది అనుకున్నాను.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo