ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా సహాయం
2. ఆందోళనలను తొలగించిన బాబా
బాబా సహాయం
నా పేరు రాంప్రసాద్. సాయి ద్వారా నేను పొందిన ఒక సహాయాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. నేను హైదరాబాద్‌లోని ఒక హాస్టల్లో ఉంటున్నాను. నేను ఉండే గదిలోని ప్రకాష్ అనే అతనితో నాకు పరిచయమై మా ఇద్దరికీ స్నేహం కుదిరింది. తను ఎన్నో రోజుల నుండి తన తమ్ముడికోసం ఒక ల్యాప్‌టాప్ తీసుకోవాలని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో చూస్తున్నాడు. తను నేను సాఫ్ట్‌వేర్‌లో పని చేస్తునందువల్ల నాకు ల్యాప్‌టాప్ గురించి బాగా తెలుసు అనుకున్నాడు. నిజానికి నాకు లాప్టాప్ గురించి అంతగా తెలీదు. అందరిలాగే మామూలుగా తెలుసు. నాకు తెలిసినంతవరకు సికింద్రాబాద్ CTCలో తక్కువకి దొరుకుతాయని మాత్రం తెలుసు. అది కూడా తెలిసినవాళ్లతో వెళ్తేనే తక్కువలో దొరుకుతాయి. అదే విషయం నా స్నేహితుడు నన్ను అడిగినప్పుడు చెప్పాను. ఒక శనివారంనాడు నాకు, తనకి సెలవు ఉండడం వల్ల నేను తనతో, "ఈరోజు CTCకి వెళ్లి ఒక నాలుగు, ఐదు షాపుల్లో రేట్లు కనుక్కోని రా. ఆ రేట్లతో ఆన్లైన్ రేట్లు పోల్చి చూసుకోవచ్చు" అని చెప్పాను. తను సరేనంటే, నేను కూడా రానా అని అడిగాను. తను రమ్మంటే ఇద్దరం కలిసి వెళ్ళాము. అక్కడ షాపువాళ్ళు కాన్ఫిగరేషన్ అడిగితే, నేను నాకు తెలిసినంతవరకు 'లాప్టాప్ – పర్సనల్ యూజ్, 16 GB RAM, 512 SSD, i5 కన్ఫిగరేషన్, ఫింగర్ ప్రింట్' అని వ్రాసి HP, Dell బ్రాండ్స్ మాత్రమే చూసాము. అక్కడవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రేటు చెప్పారు. ఒక షాపతను చాలా తక్కువ 41,000 రూపాయలు చెప్పాడు. అది విని నా స్నేహితుడు చాలా సంతోషించాడు. నేను కూడా ఓకే అన్నాను. కానీ ఆ షాపతను ల్యాప్‌టాప్ తెప్పిస్తున్నప్పుడు నాకు అనుమానమొచ్చి ఒకసారి మా అన్నకి ఫోన్ చేసి ఇలా ల్యాప్‌టాప్, ఈ కాన్ఫిగరేషన్‌తో ఇంత తక్కువకి వస్తుందని చెప్పాను. అప్పుడు మా అన్న కాష్ మెమరీ గురించి కనుక్కో, అది 1.3mb ఉంటే అది నార్మల్ లాప్టాప్, 41,000 రూపాయలు దానికి మరీ ఎక్కువ అని చెప్పి, 12mb కాష్ మెమరీ ఉంటే అది తీసుకోవచ్చు అని చెప్పాడు. వెంటనే నేను ఆ షాపతనిని కాష్ మెమరీ గురించి అడిగితే, 1.3 mb అని చెప్పాడు. అప్పుడు ఎందుకు తక్కువకి ఇస్తున్నాడో అర్దమై 12mb కాష్ మెమరీ రేటు చెప్పమన్నాను. అతను కాన్ఫిగరేషన్ మారుతుందని, ఫింగర్ ప్రింట్ ఉండదని 51,000 రూపాయలు చెప్పి, మాకు 48.000కి ఇస్తానని అన్నాడు. మేము ఆలోచించుకొని తక్కువకే ఇస్తున్నాడు కదా అని, సరే ఇవ్వండి అన్నాము. నా స్నేహితుడు తన క్రెడిట్ కార్డ్ ఇచ్చి డిస్కౌంట్ అన్ని పోను, EMI వంటివన్నీ చూసుకున్నాడు. ఆ షాపతను EMI కన్వర్షన్ చేసి పిన్ ఎంటర్ చేయమని మాకు ఇచ్చాడు. అందులో మేము చూస్తే EMI 48,000కి బదులు 44,000 పడింది. మేము సరేలే, అంతా మన మంచికే అనుకోని మౌనంగా ఉన్నాము. ఆ తర్వాత ల్యాప్‌టాప్ సీల్ తీసి మమ్మల్ని పైకి వెళ్లి సాఫ్ట్వేర్లన్నీ ఇన్స్టాల్ చేయించి చెక్ చేసుకోమన్నాడు ఆ షాపతను. నేను నా స్నేహితునితో ఆకడికి వెళ్లి చూడమని చెప్పాను. తను, "నాకు ఏం తెలీదు. అంతా నువ్వు చూసుకో" అని అన్నాడు. నేను సరేనని నా మనసులో 16gb Ram, i5 కాన్ఫిగరేషన్, 12mb కాష్ మెమరీ, 512 ssd అని ఉన్నప్పటికీ ప్రధానంగా నా దృష్టి అంతా కాష్ మెమరీపై ఉన్నందున 12 mb కాష్ మెమరీ, 512 ssd మాత్రమే చూసాను.
ల్యాప్‌టాప్‌తో పాటు ఒక బ్యాగ్, మౌస్, లాప్టాప్ క్లీనర్ ఫ్రీగా ఇచ్చారు. మేము వాటిని తీస్కోని హాస్టల్‌కి వచ్చేశాము. నా స్నేహితుడు ఛార్జింగ్ పెట్టి వాడటం మొదలుపెట్టాడు. నేను ఒకసారి ల్యాప్‌టాప్ తీస్కొని మామూలుగా సిస్టం కన్ఫిగరేషన్ చూస్తే 8GB RAM మాత్రమే ఉంది. అది చూసి నేను షాకయ్యాను. నాకు ఏం చెయ్యాలో, నా స్నేహితునికి ఏం చెప్పాలో అర్దం కాలేదు. ఎందుకంటే, తను నన్ను గుడ్డిగా నమ్మి, నేను కన్ఫర్మ్ చేస్తే చాలు తీసుకుంటానని తీసుకున్నాడు. వెంటనే నేను ఆ ల్యాప్‌టాప్ మోడల్ ఆన్లైన్లో సెర్చ్ చేస్తే 55,000 రూపాయలు ఉంది. అది కూడా 8GB RAM. మా అన్నయ్యకి ఫోన్ చేసి విషయం చెప్తే, "నువ్వు ఏం బాధపడొద్దు. ఆ కన్ఫిగరేషన్కి ఆ రేటు పెట్టొచ్చు. మీరు నష్టపోలేదు. చాలా లాభపడ్డారు. నీ స్నేహితునికి నువ్వు నిజం చెప్పేయి. ఏం కాదు" అని అన్నాడు. కానీ నాకు ధైర్యం సరిపోలేదు. నేను నా మనసులో నష్టపోలేదు కానీ అనుకున్న కాన్ఫిగరేషన్ కాదని విషయం తనకి చెప్పకూడదనుకున్నాను. తనకి ల్యాప్‌టాప్ గురించి తెలీదు కాబట్టి ఒకేగానీ, తన తమ్ముడికి తెలిస్తే ఎలా అని చాలా భయపడ్డాను. ఎందుకంటే, తన తమ్ముడు అప్పటికే 6 సంవత్సరాల నుండి ల్యాప్‌టాప్ వాడుతున్నాడు. కాబట్టి తనకి మొత్తం అవగాహనా ఉంటుందనుకున్నాను. అందువల్ల నా స్నేహితునికి తెలియకుండా మిగిలిన RAM వేయించేద్దామని షాపతనికి ఫోన్ చేస్తే 2500 రూపాయలు అడిగి, మీకు చెప్పే ఆ కాన్ఫిగరేషన్ ఇచ్చానని అన్నాడు. నాకు ఏం చేయాలో అర్దం కాలేదు. ఇది ఇలా ఉండగా నా స్నేహితుడు ల్యాప్‌టాప్ కాకినాడలో ఉన్న తన తమ్ముడికి పంపాలనుకున్నాడు. కాని కొరియర్వాళ్ళు 3,000 అడిగేసరికి తను పంపలేదు, అలా 3 వారాలు గడిచాయి. నేను విషయం బాబాకి చెప్పుకొని, "నేను కావాలని ఏదీ చేయలేదు, స్నేహితుని మోసం చేయలేదు, తనకి నష్టం జరగలేదు. పైగా ఒక 7,000 లాభపడ్డాడు. అదనంగా ఉపకరణాలు కూడా వచ్చాయి" అని చెప్పుకొని నా డబ్బులతో 8 జీబి RAM వేయిద్దామని అనుకున్నా ను. ఎందుకంటే, విషయం తెలిస్తే మా స్నేహం చెడిపోతుంది. తను నన్ను నమ్మి వచ్చాడు. అందుకని చాలా బాధపడి నా బాధ బాబాతో చెప్పుకున్నాను. తర్వాత ఒకరోజు ఉదయం నేను నిద్రలేచేసరికి నా స్నేహితుని తమ్ముడు హాస్టల్లో ఉన్నాడు. తనని చూసి నాకు చాలా భయమేసింది. నాకు ఏం చేయాలో అర్ధం కాలేదు. ఎందుకంటే, తనకి 16gb RAM అని తెలుసు. కానీ నేను సరిగా చేసుకోకపోవడం వల్ల 8జీబీ RAM మాత్రమే ఉంది. ఏదేమైనా ఇక పరిస్థితి ఎదుర్కోవాలని నేను అనుకున్నాను. కానీ బాబా దయవల్ల ఆ అబ్బాయి
ల్యాప్‌టాప్ అంతా చూసుకొని, "అంతా బాగానే ఉంది. నాకు నచ్చింది" అని నిర్ధారణ చేసి నాకు థాంక్స్ చెప్పాడు. ఊరికి వెళ్ళాక కూడా అన్నీ చెక్ చేసుకొని, ల్యాప్‌టాప్ బాగా నచ్చిందని చెప్పాడు. అప్పుడు నేను బాబాకి చాలా ధన్యవాదాలు చెప్పుకొని సాయిమహారాజ్ సన్నిధి బ్లాగు ద్వారా తోటి భక్తులతో బాబా అనుగ్రహాన్ని పంచుకుంటాననుకొని ఇలా మీ అందరితో పంచుకున్నాను.
ఆందోళనలను తొలగించిన బాబా
సాయిబంధువులకు నమస్కారం. నా పేరు రేవతి. ఒకసారి మావారు, అత్తయ్యవాళ్ళతో కలిసి ఒక కార్యక్రమం నిమిత్తం హైదరాబాద్ వెళ్ళారు. నేనెప్పుడూ పాపతో ఒంటరిగా ఇంట్లో ఉండలేదు. పైగా నేను రోజూ నా డ్యూటీకి వెళ్ళాలి. సాయంత్రం పాపని ట్యూషన్‌కి దిగబెట్టాలి. అందువల్ల నాకు కొంచెం దిగులుగా ఉండి నా ఆందోళనంతా బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల మావారు ఊరు వెళ్ళినప్పుడు మా పనిమనిషి పడుకోవడానికి వచ్చింది. ఇంకా పాప స్నేహితురాలి తల్లి పాపని ట్యూషన్‌కి తీసుకెళ్లింది. మావారు లేని సమయంలో మా అమ్మ ఒళ్ళంతా వాపు వచ్చింది. డాక్టర్ వద్దకు తీసుకెళ్లి చెకప్ చేయిస్తే, థైరాయిడ్ మరియు కొలెస్ట్రాల్ ప్రోబ్లం అని చెప్పారు. నేను అమ్మకి తగ్గాలని బాబాని ప్రార్ధించాను. బాబా దయవల్ల అమ్మకి తగ్గింది. ఇంకా మావారు, అత్తయ్యవాళ్ళు(అత్తయ్య వయసు 80కి పైనే ఉంటుంది) ఎటువంటి ఇబ్బంది లేకుండా హైదరాబాద్ వెళ్లి, తిరిగి వచ్చేశారు. బాబా దయవల్ల నా ఆందోళనాలన్నీ తొలగిపోయాయి. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ కృప ఎల్లప్పుడూ అందరిపై ఇలాగే ఉండాలి తండ్రీ".

