ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా కృపాకటాక్షాలు
2. బిడ్డ రూపంలో వచ్చిన బాబా
3. ఎల్లప్పుడూ వెంటుండి కాపాడే బాబా
బాబా కృపాకటాక్షాలు
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం శ్రీసాయినాథాయ నమః. నా పేరు ప్రభాకరరావు. మాది అనకాపల్లి(ఒకప్పటి విశాఖపట్నం జిల్లా). నేను బాబాని నమ్ముకొని 27 సంవత్సరాలు అయింది. ఒకసారి నా తండ్రికి తీవ్రమైన అనారోగ్య సమస్య వస్తే, హాస్పిటల్లో చేర్చాము. డాక్టర్ మందులతో తగ్గకపోవడం వల్ల ఆపరేషన్ చేయాలని అన్నారు. మేము చాలా భయపడ్డాము. నేను మా నాన్న ఆరోగ్యం బాగుపడాలని మొదటిసారి బాబా గుడికి వెళ్లి, "బాబా! మా నాన్న ఆరోగ్యం నయమయ్యేలా చేయండి" అని వేడుకున్నాను. బాబా దయవల్ల ఆపరేషన్ లేకుండానే మందులతో పూర్తిగా నయమై నాన్న ఆరోగ్యంగా ఇంటికి వచ్చారు. అప్పటినుంచి నాకు బాబా మీద నమ్మకం పెరిగింది.
తర్వాత నేను ఉద్యోగం కోసం పరీక్ష వ్రాసి అందులో పాసయ్యాను. తర్వాత కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూలలో కూడా ఉత్తీర్ణత సాధించడంతో తేలికగా నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. కాదు, బాబా ఇచ్చారు. ఆయన కృపాకటాక్షాలతోనే నాకు ఆ ఉద్యోగం వచ్చింది. కొంతకాలానికి నేను పనిచేస్తున్న ఉద్యోగంలో సీనియారిటీ ప్రకారం నాకు సూపరింటెండెంట్‌గా ప్రమోషన్ వస్తుందని అనుకున్నాను. కానీ నాకన్న ముందున్న వారి వరకు ప్రమోషన్ వచ్చి నాకు రాలేదు. నేను చాలా బాదపడి బాబాతో చెప్పుకున్నాను. ఏ కారణం చేతనో నాకన్న ముందున్న ముగ్గురు ప్రమోషన్ తీసుకోకపోవడం వల్ల నాకు సూపరెంటెండెంట్‌గా ప్రమోషన్ వచ్చింది. అంతా బాబా కృపాకటాక్షం. ఆయన దయవలన నేను కోరుకున్న ప్రదేశంలోనే నాకు ప్రమోషన్ ఇచ్చారు. ఇదే విధంగా బాబా నేను కోరుకున్నవన్ని నాకు ఇచ్చారు. ప్రతి విషయంలోను ఆయన నన్ను, నా కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. నా సర్వం బాబా. ఆయన లేకపోతే నేను లేను. నేను ఎప్పుడూ ఆయనకి ఋణపడి ఉంటాను. సదా బాబా అనుగ్రహం మన అందరిపై వర్షించాలని కోరుకుంటున్నాను. "బాబా! మీ పాదాలకు అనంతకోటి నమస్కారాలు. నా యందు దయుంచి మా సొంత ఊరికి బదిలీ అయ్యేలా చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తండ్రీ. నాపై ఎల్లప్పుడూ మీ ప్రేమ, ఆప్యాయత, కృపాకటాక్షాలు కురిపించండి తండ్రీ".
బిడ్డ రూపంలో వచ్చిన బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః. సాయిభక్తులందరికీ నా నమస్కారములు. నా పేరు విజయ. మాది కాకినాడ. నేను ఇదివరకు నా చెల్లెలి కూతురు సాయిసృజన MS చేసేందుకు జర్మనీ వెళ్లాలనుకోవడం, ఆ సాయినాథుని దయవల్ల తనకి జర్మనీలో ఉన్న అబ్బాయితోనే వివాహమై జర్మనీ వెళ్ళిందని పంచుకున్నాను. తర్వాత బాబా అనుగ్రహం వల్ల అమ్మాయి గర్భవతి అయింది. స్కానింగ్ చేసి పాప పుడుతుందని చెప్పారు. వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాన్పు సమయానికి అమ్మాయికి సహాయంగా ఉండేందుకు మా చెల్లి జర్మనీ వెళ్లాలనుకుంది. అయితే తను ఉద్యోగస్తురాలు అయినందున జర్మనీ వెళ్లడానికి అనేక ఇబ్బందులు, అవరోధాలు ఎదురయ్యాయి. బాబా దయవల్ల వాటిని దాటుకొని తను విమానం ఎక్కింది. తను ఒక్కతే ఎన్నడూ ఎక్కడికీ వెళ్లని కారణంగా సాయిని తనకు తోడుగా ఉండమని మనసారా ప్రార్ధించింది. మేమందరం కూడా తనకోసం బాబాను వేడుకున్నాము. ఏదో అద్భుతం జరిగినట్లు బాబా తనకి ఎదురుగా ఉన్న సీటుకున్న స్క్రీన్ మీద దర్శనమిచ్చారు. దాన్ని తను ఫోటో తీసింది. ఆ ఫోటోలో ఉన్న బాబా ఎక్కడి బాబా అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే 'దుబాయ్ కొండ' అన్న ప్రదేశంలోని బాబా అని తెలిసింది. తను తీసిన ఫోటోలోని బాబానే అక్కడ ఉన్నారు. నా చెల్లి చాలా ఆశ్చర్యపోయింది. ఆవిధంగా 'నేను నీతోనే ఉన్నాను' అని బాబా తనకి భరోసా ఇచ్చారు. తను క్షేమంగా జర్మనీలో తన కూతురు ఇంటికి చేరుకుంది. ఇకపోతే, కాన్పుకి కొన్ని రోజుల ముందునుంచి సాయిసృజనకు 'నేను మీ ఇంటికి వస్తున్నాను' అని బాబా మెసేజ్‌లు వస్తుండేవి. వాళ్ళు ఎవరు వస్తారా అని ఆశ్చర్యపోతుండేవారు. నెలలు నిండి సాయిసృజనకి కాన్పు అయింది. అల్ట్రా స్కానింగ్‌లో పాప అని చెప్పినప్పటికీ బాబు పుట్టాడు. అప్పుడు తనకు వచ్చిన మెసేజ్లుననుసరించి బాబానే ఆ బిడ్డ రూపంలో తమ ఇంటికి, తమ ఒడిలోకి వచ్చారని అంతులేని ఆనందం పొందారు వాళ్ళు. ఇదంతా సాయినాథుని అద్భుతమైన, అపూర్వమైన లీల. అందుకు ఆ సాయినాథునికి అనేక ధన్యవాదాలు.
ఎల్లప్పుడూ వెంటుండి కాపాడే బాబా
సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య. 2024, జూలై నె చివరి వారంలో మేము ఊరు వెళ్లాలని బస్సు స్టాండుకి బయలుదేరాము. ట్రాఫిక్ వల్ల బస్సు వచ్చేసే సమయమవుతున్నా మేము బస్సు స్టాండుకి చేరుకోలేకపోయాము. అంతలో వర్షం కూడా మొదలైంది. అప్పుడు నేను, "బాబా! మేము బస్సు స్టాండుకి చేరుకునేవరకు బస్సు రాకుండా ఉండేలా చూడండి" అని ప్రార్థించాను. బాబా ధయవల్ల మేము వెళ్లిన 5 నిమిషాలకి బస్సు వచ్చింది. వర్షం కూడా ఆగిపోయింది. బాబా ఎల్లప్పుడూ మన వెంటే ఉండి మనల్ని కాపాడుతూ ఉంటారు.



