సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1899వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శ్రీసాయి అనుగ్రహ వీచికలు

నేను ఒక సాయి భక్తుడిని. ఒకసారి గొంతులో ఇన్ఫెక్షన్ వల్ల నొప్పి ఎక్కువై నాకు మాట్లాడడానికి కూడా ఇబ్బంది అయింది. అప్పుడు నేను బాబా ఊదీ నోట్లో వేసుకొని, "బాబా! ఈ సమస్యని తొందరగా తగ్గించు తండ్రి. నేను ఇద్దరికి అన్నదానం చేస్తాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల రెండు, మూడు రోజుల్లో సమస్య చాలావరకు తగ్గింది.

ఒకసారి నేను పని మీద వేరే ఊరు వెళ్ళినపుడు ఇంట్లో ఉన్న మా బాబుకి విరోచనాలు మొదలయ్యాయి. మరుసటిరోజు నేను వచ్చాక విషయం నా భార్య నాతో చెప్పింది. నేను వెంటనే మా రైల్వే డాక్టరుకి కాల్ చేసి, ఆయన చెప్పిన మందులు వాడటం మొదలుపెట్టాను. వాటితోపాటు బాబా ఊదీ బాబు నుదుటన పెట్టి, కొంచం నోట్లో వేసి, "బాబా! బాబుకొచ్చిన ఈ సమస్య తగ్గితే మందిరంలో పాలకోవా సమర్పించుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల ఒక్క రోజులో బాబుకి నయం అయింది.

ఇంకోసారి బాబుకి జలుబు బాగా ఎక్కువై ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బందిపడ్డాడు. సరిగా తినేవాడు కాదు, పాలు తాగలేకపోయాడు. రెండు రాత్రులైతే ముక్కు దిబ్బడ వల్ల నిద్రపోలేక రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. అప్పుడు నేను బాబాని ప్రార్థించి, "బాబా! బాబుకి త్వరగా నయమయ్యేలా చూడు తండ్రీ" అని ప్రార్థించి కొద్దిగా ఊదీ తన నోట్లో వేసి, నుదుటన కూడా పెట్టాను. ఇంకా 'బాబుకి నయమై ఆరోగ్యంగా ఉంటే ముగ్గురికి అన్నదానం చేస్తాన'ని అనుకొని మందులు వాడాను. బాబా దయ చూపారు. బాబుకి నెమ్మదిగా నయమవ్వడం మొదలై పూర్తిగా కోలుకున్నాడు. బాబాకి ఇచ్చిన మాట ప్రకారం అన్నదానం చేసి, పాలకోవా మందిరంలో బాబాకి నివేదించి భక్తులకి పంచాము.
 
మా అమ్మానాన్నలు అపార్ధాలతో మాతో గొడవలుప డుతూ కొంతకాలం మాట్లాడడం మానేశారు. నా భార్య రెండోసారి గర్భవతి అవ్వడంతో అమ్మానాన్నలని మా ఇంటికి పిలిచాము. వాళ్ళు చూస్తామన్నారు కానీ, ఎప్పుడు వస్తారో చెప్పలేదు. తర్వాత ఒకరోజు ఉదయం 6:30కి హఠాత్తుగా తలుపు తట్టిన శబ్దం వినిపిస్తే, 'ఎవరా!' అని చూసేసరికి ఎదురుగా మా అమ్మ, నాన్నలు ఉన్నారు. వాళ్ళని చూసి మాకు ఆనందమేసినప్పటికీ దాంతోపాటు 'ఏ గొడవపడతారో' అని భయం కూడా వేసింది. నేను, "బాబా! ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి. వాళ్ళు ఉన్నంతవరకు నాకు ఎటువంటి అత్యవసర విధులు పడకుండా చూడండి. ఒకరికి అన్నదానం చేస్తాను" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల అంతా బాగానే గడిచింది.

నా భార్య ఐదు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు అనోమోలీ స్కాన్‌కోసం స్కానింగ్ సెంటర్‌కి వెళ్ళాం. చాలా సమయం తర్వాత నా భార్యను పిలిచి స్కాన్ చేశారు కానీ, బిడ్డ పొజిషన్‌లో లేదని కొంతసేపు బయట తిరిగి మళ్ళీ రమ్మన్నారు. సరేనని, వాళ్ళు చెప్పినట్లు చేసి వెళితే, మళ్ళీ అదే సమస్య వచ్చింది. మరోసారి బయటకి వెళ్లి తిరిగి వచ్చినా కూడా అదేవిధంగా పొజిషన్‌లో లేదని తిరిగి పంపారు. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నా భార్య తన ఆఫీసుకి వెళ్ళింది. గంట తర్వాత మళ్ళీ మేము స్కానింగ్ సెంటర్‌కి వెళ్ళాము. నేను 'బాబా'ని తలుచుకొని, 'ఓం శ్రీసాయి సులభదుర్లభాయ నమః', 'శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః', 'శ్రీసాయి అసహాయసహాయాయ నమః' అని స్మరిస్తూ, 'స్కానింగ్ బాగా వస్తే, ఇద్దరికి అన్నదానం చేస్తాన'ని అనుకున్నాను. బాబా దయవల్ల ఈసారి బిడ్డ పొజిషన్‌లో ఉండటంతో స్కానింగ్ బాగా వచ్చింది. అదేరోజు రాత్రి డాక్టర్‌కి రిపోర్ట్ చూపిస్తే, "అంతా బాగానే ఉంది" అని అన్నారు. అంతా సాయి ఆశీర్వాదం. బాబాకి చెప్పుకున్నట్టు గురువారంనాడు ఐదుగురికి అన్నదానం చేశాను. "ధన్యవాదాలు బాబా. మీ కృప మీ భక్తులందరిపై ఉండేలా అనుగ్రహించండి".

ఇంకోసారి ట్రిపుల్ మార్కర్ టెస్ట్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ చెక్ చేసి "బిడ్డ కదలిక తెలియట్లేదు బీపీ డౌన్ అయింది. వెంటనే అడ్మిట్ అవ్వాలి" అని అన్నారు.  మేము కాస్త టెన్షన్ పడ్డాం కానీ, 'బాబా ఉన్నార'న్న ధైర్యంతో నా భార్యను హాస్పిటల్లో అడ్మిట్ చేసి, "బాబా! నా భార్య బీపీ నార్మలై బిడ్డ కదిలికలు తెలిసేటట్లైతే మీ మందిరంలో పాలకోవా సమర్పించుకుంటాను" అని అనుకున్నాను. నా భార్యకి రెండు సలైన్లు ఎక్కించారు. ఆ రోజు రాత్రి నా భార్య బీపీ నార్మల్ అయింది. అప్పుడు చెక్ చేస్తే బిడ్డ కదలికలు తెలిసాయి. దాంతో బ్లడ్ టెస్ట్ కూడా చేశారు. "ధన్యవాదాలు బాబా".
 
మరోసారి నా భార్యకి నడుంనొప్పి బాగా వచ్చింది. రెండోరోజుకి కూడా తగ్గకపోవడంతో ఉదయం తనని హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేశాను. ఆ సమయంలో డాక్టర్ లేకపోవడంతో సిస్టర్ ఇంజెక్షన్ వేసింది. డాక్టర్ ఫోన్లో మాట్లాడి మధ్యాహ్నం వరకు హాస్పిటల్లో ఉండమన్నారు. నేను వెంటనే, "బాబా! మధ్యాహ్నం వరకు నా భార్యకు తగ్గితే ముగ్గురికి అన్నదానం చేస్తాను" అని బాబాను ప్రార్థించాను. తరువాత డాక్టర్ చెక్ చేసి తగ్గిందని చెప్పి జెల్ వ్రాసి ఇచ్చారు. బాబాకి ఇచ్చిన మాట ప్రకారం ముగ్గురికి అన్నదానం చేసి ఈ అనుభవాన్ని ఆధునిక సచ్చరిత్ర అని పిలువబడే ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో ఇలా పంచుకున్నాను. "ధన్యవాదాలు బాబా. మీ కృప మీ భక్తులందరిపై ఉండేలా అనుగ్రహించండి".

సాయిభక్తుల అనుభవమాలిక 1898వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కృపతో తిరుమలలో స్వామి సన్నిధిలో సేవాభాగ్యాన్నిచ్చిన బాబా
2. సాయి కృపవల్ల తీరిన సమస్య

కృపతో తిరుమలలో స్వామి సన్నిధిలో సేవాభాగ్యాన్నిచ్చిన బాబా
 
సాయిబంధువులందరికీ నమస్కారాలు. నా పేరు నీలవేణి. గత రెండు సంవత్సరాలుగా నేను బాబాను కొలుస్తున్నాను. 2022లో నేను, నా కుమార్తె ట్రావెల్స్ ద్వారా చారుదాం యాత్రకు వెళ్ళాము. అక్కడ ట్రావెల్స్‌వాళ్ళు మాకు సమయానికి అన్ని సౌకర్యాలు సమకూర్చినా మా అమ్మాయి చాలా అసౌకర్యానికి గురై కోపంగా, అమర్యాదగా ప్రవర్తించింది. అప్పుడు నేను 'అనవసరంగా ఈ పిల్లతో యాత్రకు వచ్చాను' అని ఇబ్బందిపడ్డాను. అయినా ఎలాగో ఓర్చుకొని తిరిగి ఇంటికి చేరుకున్నాను. తర్వాత 2024, మే నెలలో తిరుమలలో వారం రోజుల సేవకి నాకు, నా కుమార్తెకి అవకాశం వస్తే, ఇద్దరమూ ప్రయాణానికి సిద్ధమయ్యాము. కానీ నా మనసులో ఒకటే బెంగ, 'ఈ పిల్లతో నేను సేవా కార్యక్రమం చేయగలనా? ఈ పిల్ల కూడా ఓర్పుతో సేవా చేయగలదా? ఏమైనా ఇబ్బందులొస్తే భరిస్తుందా? ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయ'ని. ఆ బెంగవల్ల సాయినాథునికి దణ్ణం పెట్టుకొని, "బాబా! ఈ యాత్ర అంతా దివ్యంగా, ప్రశాంతంగా, సవ్యంగా జరిగేటట్లు చూడు తండ్రీ" అని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల అనుకున్న యాత్రేకాక అనుకోకుండా అరుణాచలం, మదురై, శ్రీరంగం, తిరుత్తుణి, గోల్డెన్ టెంపుల్, కాణిపాకం, శ్రీకాళహస్తి దర్శించుకొని తర్వాత సేవకి తిరుమల చేరుకున్నాము. తిరుమల సేవకు వెళ్లిన రెండో రోజు లక్కీ డిప్‌లో మా బృందం టెంపుల్ డ్యూటీకి సెలెక్ట్ అయింది. 'టెంపుల్ డ్యూటీ' అని మా బృందమందరికీ ఒకటే ఆనందమేసింది. నేను బాబాని, "మాకు గుడిలో డ్యూటీ వేయమ"ని ప్రార్థించాను. తర్వాత బాబా నాకు, నా కుమార్తెకు ఆకాశంలోని మబ్బుల్లో దర్శనమిచ్చారు. మా అమ్మాయికి వైకుంఠ ద్వారం దగ్గర, నాకు కాస్త దూరంగా, మా టీమ్ లీడరుకి స్వామి సన్నిధిలో డ్యూటీ పడింది. బాబా దయవలన ఆరోజు డ్యూటీలో ఉండగా నేను, మా అమ్మాయి నాలుగైదు సార్లు వెంకటనాథుని దర్శనం చేసుకున్నాము. కానీ నా మనసులో నాకు స్వామి సన్నిధిలో డ్యూటీ వేయలేదు, బాబా దయ లేదని కాస్త బాధపడ్డాను.

మొత్తానికి వారం రోజుల సేవ పూర్తైంది. మా అమ్మాయి ఆ వారం రోజులు చిరాకు పడకుండా సౌమ్యంగా వుంది. నచ్చినా, నచ్చకపోయినా సర్దుకొని ఆ వారం రోజులు వెంగమాంబ అన్నప్రసాదం తింటూ సేవా పూర్తి చేసాము. సేవ పూర్తయ్యాక సేవకులకు టీటీడీవారు ఒక దర్శనం ఇస్తారు. ఆ దర్శనంకోసం మా బృందంలోని 15 మందిమి సేవా వస్త్రాల్లో తెల్లవారుజామున మూడు గంటలకు వెళ్ళాము. ఆ సమయంలో సుప్రభాత సేవ, అంగప్రదక్షిణ పూర్తై ఆయా భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. జనం చాలా ఎక్కువగా ఉన్నారు, ఒకరి మీద ఒకరు పడుతున్నారు. సేవ చేస్తున్నవాళ్ళు ఆ భక్తులను అదుపు చేయలేకపోతున్నారు. అటువంటి సమయంలో మా బృందం స్వామి దర్శనము కోసం లోపల ఉంది. ఒక టీటీడీ ఉద్యోగి నన్ను, మా అమ్మాయిని పిలిచి, "మీరు ద్వారం వద్ద ఉండి భక్తులను నెట్టగలరా?" అని అడిగారు. నేను, మా అమ్మాయి కోటి రూపాయలు లాటరీ తగిలినంత ఆనందంతో, "ఉంటామండి" అని చెప్పి సుమారు రెండు గంటలు స్వామి సన్నిధిలో ద్వారం వద్ద నిల్చొని స్వామిని చూస్తూ 'గోవిందా' అనుకుంటూ గడిపాము. గర్భగుడిలో నుండి వచ్చిన మూడు రకాల ప్రసాదాలు తిని స్వామి సేవ తృప్తిగా చేసుకొని ఆరు గంటలకు బయటకు వచ్చాము. మా బృందం అందరిలో నాకు, నా కుమార్తెకు మాత్రమే ఆ భాగ్యం దక్కింది. అంతా బాబా కృప అని నా నమ్మకం. ఈ అవకాశం కల్పించిన బాబాకి కోటి నమస్కారాలు. అంతటితో అయిపోలేదు. మేము క్షేమంగా ఇంటికి చేరుకున్నాక మా ఫ్రెండ్ ఫోన్ చేసి, "నేను మిమ్మల్ని శిరిడీ తీసుకొని వెళ్తాను. ఆగస్టులో వెళ్ళడానికి రిజర్వేషన్ చేయిస్తున్నాను" అని చెప్పింది. అనుకోకుండా నా ప్రమేయం లేకుండా బాబా నాకు తమ దర్శనం కల్పిస్తున్నారు. "థాంక్యూ సాయినాథా".

సాయి కృపవల్ల తీరిన సమస్య

అందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. ఒకసారి నేను మా ఆఫీసు ఐడి కార్డు పోగొట్టుకున్నాను. ఆఫీసు క్యాబ్‌లో పడిపోయిందేమోనని డ్రైవర్‌ని అడిగితే, ఐడి కార్డు ఏమీ కనిపించలేదని చెప్పారు. కార్డు లేకపోవడం వలన 4-5 రోజులు నాకు చాలా సమస్య అయింది. సెక్యూరిటీ గార్డుల అనుమతి తీసుకోవడం, వేరేవాళ్ళ కార్డు వాడటం, క్యాబులు ఆలస్యమవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అడ్మిన్ టీమ్‌వాళ్ళు కొత్త కార్డు కోసం 700 రూపాయలు చెల్లించాలని అన్నారు. అప్పుడు ఇలా సమస్య అవుతుందని మా అమ్మతో చెప్తే, బాబాకి దణ్ణం పెట్టుకోమని చెప్పింది. అమ్మ ముందు కూడా అదే మాట చెప్పింది. కానీ నేను అమ్మ మాటలు సీరియస్‌గా తీసుకోలేదు. చిన్నవాటికి బాబాని అడగకూడదనుకున్నాను. కానీ సమస్య ఎక్కువ అయ్యేసరికి బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. తర్వాత రెండు రోజులకి సెక్యూరిటీ ఆఫీసులో మళ్ళీ అడిగితే, ఒక డ్రైవర్ నా ఐడి కార్డు తెచ్చి ఇచ్చినట్లు చెప్పారు. అది విని నాకు చాలా సంతోషమేసి వెంటనే బాబాకి థాంక్స్ చెప్పుకున్నాను. చూస్తే, ఆ డ్రైవర్ పేరు 'దత్త' అని ఉంది. సాయి కృపవల్ల నా సమస్య తీరిపోయింది అనుకున్నాను.

సాయిభక్తుల అనుభవమాలిక 1897వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అనుగ్రహధారలు
2. అనుకూలమైన ఉద్యోగం ప్రసాదించిన బాబా

బాబా అనుగ్రహధారలు

నా పేరు దివ్య. బ్లాగులో వచ్చే అనుభవాలు చదవడం వల్ల జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా బాబా ఉన్నారని, సాయం చేస్తారని అనిపిస్తుంది. నేను ఐదు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు మా అమ్మవాళ్ళింట్లో ఉండగా జామకాయలు తినాలని చాలా అనిపించడం వల్ల తిన్నాను. అది కొంచెం గట్టిగా ఉంది. పైగా గింజలతో తినడం వల్ల చాలా కడుపునొప్పి వచ్చింది. వెంటనే నేను ఊదీ నీళ్లు తీసుకుని, నొప్పి తగ్గాలని బాబాకి చెప్పుకున్నాను. ఆ రాత్రంతా కూడా నేను బాబాని ప్రార్థిస్తూ గడిపాను. బాబా దయవల్ల తెల్లారేసరికి నొప్పి తగ్గింది. అలానే మరొకరోజు కూడా కారణమేంటో తెలీదుగాని చాలా కడుపునొప్పి వచ్చింది. అప్పుడు కూడా నేను మా అమ్మవాళ్ళింట్లో ఉన్నాను. గర్భవతిగా ఉన్న నా ట్రీట్మెంట్ అంతా హైదరాబాద్‌లో జరుగుతుంది. అందువల్ల ఎలాంటి సమస్య లేకుండా నొప్పి తగ్గాలని బాబాను వేడుకున్నాను. కానీ సాయంత్రం వరకు తగ్గలేదు. అప్పుడు డాక్టర్ని సంప్రదించి మందులతోపాటు ఊదీ నీళ్లు తీసుకుంటే రెండు రోజుల్లో తగ్గిపోయింది.

నేను 7 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు 2024, జూలై నెల చివరి వారంలో నాకు గొంతు నొప్పి వచ్చింది. ఏది తిన్నా మండటం, పడుకుందామంటే అస్సలు నిద్రపట్టకపోవడం, గొంతులో ఏదో అడ్డం అడ్డుపడుతున్నట్లు ఉండటం జరిగింది. హాస్పిటల్‌కి వెళ్తే, డాక్టర్ మందులు ఇచ్చారు. ఆ మందులు నాలుగు రోజులు వాడితే తగ్గింది. అయితే 2024, జూలై 30న మళ్ళీ అదే సమస్య మొదలైంది.  అప్పుడు నేను రేపు మధ్యాహ్నానికల్లా నొప్పి తగ్గాలని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల నేన్ను కోరుకున్నట్లే మర్నాడు మధ్యాహ్నానికి నొప్పి తగ్గింది.

ఒకసారి మా రెండో అక్కకి అన్నం తిన్న వెంటనే కనీసం పది నిమిషాలు కూడా కాకముందే మళ్ళీ తీవ్రంగా ఆకలి వేయటం, కడుపులో తిప్పటం, వాంతి వస్తున్నట్లు ఉండటం జరిగింది. అక్కకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అలా కొన్ని రోజులు గడిచాక మా పెద్దక్క, 'ఇలాంటి సమస్యే ఉన్న ఒక భక్తురాలు సమస్య తగ్గితే, బ్లాగులో తమ అనుగ్రహాన్ని పంచుకుంటానని బాబాకి చెప్పుకుంటే సమస్య తగ్గిందట" అని రెండో అక్కతో చెప్పింది. అప్పుడు తను కూడా ఆ భక్తురాలిలానే బాబాని వేడుకొని హాస్పిటల్‌కి వెళ్ళింది. బాబా దయవల్ల కొన్ని రోజులకు సమస్య తగ్గింది. "థాంక్యూ బాబా. పిచ్చి ఆలోచనలు, మానసిక భయాలు చాలా ఎక్కువవుతున్నాయి బాబా. దయచేసి నన్ను కాపాడండి. నాకున్న గుండె సమస్య వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా కాన్పు సాఫీగా అవ్వాలి తండ్రీ. అలాగే బిడ్డకు అనారోగ్య సమస్యలు లేకుండా చూడండి బాబా".

అనుకూలమైన ఉద్యోగం ప్రసాదించిన బాబా

నా పేరు సత్యసాయి. 2023, దసరా పండుగ తర్వాత నాకు మా ఆఫీసు నుంచి ఒక మెయిల్ వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే, లే ఆఫ్ కారణంగా నా ఉద్యోగం పోయిందని. అక్కడికి మరో 50 రోజుల్లో నా పెళ్లి ఉన్నందున బాబా లీల ఏంటో తెలియని నేను 'ఇలాంటి సమయంలో ఇలా అయ్యిందేంటి?' అని చాలా బాధపడ్డాను. అదేరోజు రాత్రి బాబా నాకు కలలో కనిపించి, "రేపటినుంచి కార్తీకమాసం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతిరోజూ శివాలయంకి వెళ్లి పూజ చేసి రా. అలానే ప్రతిరోజూ హనుమాన్ గుడికి కూడా వెళ్ళు. ఇంకా నా ప్రయత్నాలు నువ్వు చేయి" అని చెప్పారు. నేను నిద్రలేచి అమ్మకి బాబా చెప్పింది చెప్పాను. ఆమె బాబా ఆదేశం పాటించమని ప్రతిరోజూ ఉదయం మర్చిపోకుండా నన్ను గుడికి పంపింది. నేను రోజూ గుడికి వెళ్ళడం, వచ్చాక అన్ని కంపెనీలకు నా రెజ్యుమ్ పంపి బాబా మీద భారమేసి రిప్లైకోసం వేచి చూస్తుండేవాడిని. అలాగే ఒక సోమవారంనాడు గుడి నుంచి వచ్చాక ఒక కంపెనీకి నా రెజ్యుమ్ మెయిల్ చేశాను. అదేరోజు సాయంత్రం నా మెయిల్‌కి రిప్లై వచ్చింది. అక్కడినుంచి మూడు వారాల్లో ఆ కంపెనీలో నాకు ఉద్యోగం కన్ఫర్మ్ అయింది. అక్కడికి 3 వారాల్లో నా పెళ్లి బాబా దయతో ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. 3 వారాల తర్వాత నేను కొత్త ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత నాకు అర్థమైంది బాబా లీల ఏంటో? నేను ముందు పనిచేసిన కంపెనీలో 2 సంవత్సరాల 5 నెలలు పని చేశాను. ఈ కాలంలో కంపెనీ షిఫ్ట్ టైమింగ్ సరిగా లేక నా ఆరోగ్యం కొంచం పాడైంది. జీతంలో కూడా ఎటువంటి పెరుగుదల లేదు. అదీకాక రెండో సంవత్సర ప్రారంభంలో ఆఫీసుకి రమ్మంటే నేను వెళ్లని కారణంగా నాకిచ్చే అలవెన్స్ కూడా తగ్గించారు. అందువలన నేను ఆ కంపెనీలో జాయిన్ అయినప్పుడు అందుకున్న జీతం కంటే తక్కువ జీతం నాకు వస్తుండేది. బాబా నా ఆరోగ్యం కోసం మంచి టైమింగ్, మంచి వర్క్ కల్చర్, మునుపటికంటే ఎక్కువ జీతం ఉన్న మంచి కంపెనీలో నాకు ఉద్యోగం అనుగ్రహించారు. ఈ అనుభవం ద్వారా బాబా మీద శ్రధ్ధ, ఆయన మనకు మంచి చేస్తారన్న సబూరి మనకు ఉంటే చాలు, మొత్తం బాబా చూసుకుంటారని నాకు అర్థమైంది. "ధన్యవాదాలు బాబా. మీ పట్ల శ్రద్ధ-సబూరి ఎప్పుడూ కలిగి ఉంటూ ప్రశాంతంగా ఉండేలా ఆశీర్వదించండి బాబా".

సర్వం సాయినాథార్పణమస్తు.

సాయిభక్తుల అనుభవమాలిక 1896వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయినాథుని దయ
2. బాబాని కోరుకుంటే కానిది ఏమీ ఉండదు 

శ్రీసాయినాథుని దయ

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి. నా పేరు లలిత. రోజూ ఈ బ్లాగులోని అనుభవాలు చదివితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మా నాన్నకి మే నెలలో చాలా నడుం నొప్పి వస్తే వైజాగ్ డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లారు. ఆ డాక్టరు స్కాన్ చేసి వెన్నుపూస కొంచెం సైడ్ అయ్యింది, ఆపరేషన్ చేయాలి అన్నారు. 60 సంవత్సరాల వయసులో నాన్నకి ఆపరేషన్ అంటే కష్టమని నేను మన సాయికి, "నాన్నకి మందులతో తగ్గిపోవాలి. ఆపరేషన్ వద్దు తండ్రీ" అని దణ్ణం పెట్టుకున్నాను. డాక్టర్ కొన్ని మందులిచ్చి అవి వాడాక మళ్ళీ రండి అని చెప్పారు. నాన్న ఆ మందులు వాడి జూన్ నెలలో డాక్టర్ దగ్గరకి మళ్ళీ వెళితే, "ఆపరేషన్ ఇప్పుడు అవసరం లేదు. మందులుతో తగ్గుతుంది" అని అన్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇదంతా నా సాయితండ్రి దయ.

2024, వేసవి సెలవుల్లో నేను మా అమ్మ వాళ్ళింటికి వెళ్ళాలని అనుకున్నాను. కానీ మా ఇంట్లోవాళ్ళు ఒప్పుకుంటారో, లేదోనని చాలా భయపడ్డాను. అప్పుడు, "ఇంట్లోవాళ్ళు ఒప్పుకోవాల"ని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయవల్ల వాళ్ళు ఒప్పుకున్నారు. దాంతో నేను నా కన్నవారింటికి వెళ్ళాను. అయితే మా తోడికోడలు బయట ఉందని నన్ను వెనక్కి వచ్చేయమన్నారు. కానీ నేను ఆ సమయంలో నా కన్నవారింట్లో ఉండకపోతే మళ్ళీ ఎన్నో నెలలకిగాని వెళ్లడం కుదరదు. అందుకని బాబా మీద భారమేసి తిరిగి మా ఇంటికి వెళ్ళలేదు. వారం రోజులు తర్వాత వెళ్ళాను. బాబా దయవల్ల ఇంట్లో వాళ్ళెవరూ నన్ను ఏమీ అనలేదు.

2024, జూలై 17న మా ఇంటిలో కర్కాటక సంక్రమణం పెట్టుకున్నాము. ఆ రోజు నా నెలసరి సమయం. అందుకని నేను నెలసరి రాకుండా మాత్రలు వేసుకున్నాను. అయినా నెలసరి వచేస్తుందేమోనని చాలా భయపడి బాబా ఊదీ నోట్లో వేసుకుని, మరికొంత ఊదీ కడుపుకి రాసుకున్నాను. అలా మూడు రోజులు చేశాను. బాబా దయవలన ఆ కార్యక్రమం అయిపోయాక మర్నాడు నాకు నెలసరి వచ్చింది.

నా భర్త ఆరోగ్యం బాగా లేకపోతే 'సూర్య నమస్కారాలు', హామం', 'అభిషేకం' చేయించుకోమని పంతులు చెప్పారు. ఆ కార్యక్రమాలన్నీ మా ఇంటి దగ్గర పెట్టుకున్నాం. సరిగ్గా అదే సమయంలో నా తోడికోడలు బయట చేరింది. అందువలన నేను ఒక్కదాన్నే మొదటిరోజు ఆరుగురు బ్రాహ్మణులకి, మా ఇంట్లోని ఎనిమిది మందికి వంట చేయాల్సి వచ్చింది. "చేసేందుకు కావలసిన శక్తిని ఇమ్మ"ని సాయిని ప్రార్థించాను. బాబా దయవల్ల వంటలన్నీ చాలా బాగా వచ్చాయి. అందరూ తృప్తిగా భోజనం చేశారు. మరుసటిరోజు నేను కూడా పూజలో కూర్చోవాలని అన్నారు. నేను పూజలో కూర్చుంటే వంట ఎలా అని ఆలోచించి మా బంధువుల్ని రమ్మని పిలిచాను. కానీ ఎవరూ రాలేదు. దాంతో మావారు వంట బ్రాహ్మ ణుని బుక్ చేశారు. సరిగ్గా హామం జరిగే సమయంలో మేఘం కమ్మి చిన్న జల్లు పడింది. నేను వెంటనే, "బాబా! వాన తగ్గాలి" అని దణ్ణం పెట్టాను. మా వాళ్ళు టార్పాలిన్ కట్టాలని ప్రయత్నించారు కానీ ఆలోపు వర్షం తగ్గింది. హోమం చాలా బాగా జరిగింది. అంతా నా సాయి మహిమ.

మా పెద్దపాపకి ఎంసెట్ లో తొంభై వేల ర్యాంకు వచ్చింది. నేను తనకి మాకు దగ్గరలో ఉన్న జి.యమ్.ఆర్ కాలేజీలో సీటు రావాలని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయవల్ల తనకి సివిల్ ఇంజినీరింగ్ సీటు వచ్చింది. "థ్యాంక్యు సాయితండ్రీ. ఎప్పుడూ నా యందు మీ దయ ఇలాగే ఉండాలని వేడుకుంటున్నాను. నేను ఎప్పుడూ మిమ్మల్ని మరువకుండ చూడు తండ్రీ. మీ పాదాల యందు స్థిరమైన నమ్మకం, భక్తి నాకు కలిగేటట్లు చేయి తండ్రీ".

బాబాని కోరుకుంటే కానిది ఏమీ ఉండదు

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. సాయి పాదపద్మములకు నమస్కారం. నా పేరు అమర్నాథ్. 2022, ఆగస్టులో చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా ఆ బాబా దయతో సరైన సమయంలో ఆర్థిక వనరులు సమకూరడంతో నా కుమారుడు ఉన్నత విద్యకోసం ఆనందంగా అమెరికా వెళ్ళాడు. వాడు అక్కడ మంచి ర్యాంకుతో ఎమ్మెస్ పూర్తి చేశాడు. కానీ తనకి భవిష్యత్తు మీద చాలా టెన్షన్ మొదలైంది. కారణం, ఆర్థిక మాంద్యం వల్ల ఉద్యోగాలు దొరకక చాలామంది చాలా ఇబ్బందిపడుతున్నారు. ఇక్కడి నుండి వాడికి ఆర్థిక సహాయం అందిద్దామంటే నాకు అంతటి స్థాయి లేదు. అందువల్ల మేము బాబానే, "బాబుకి ఒక దారి చూపించమ"ని వేడుకున్నాము. బాబా దయవల్ల కొద్ది రోజుల్లోనే ఏ ఇబ్బంది లేని పార్ట్ టైం ఉద్యోగం బాబుకి దొరికింది. తను ఒకపక్క చక్కగా ఉద్యోగం చేసుకుంటూ మరోపక్క పిహెచ్‌డి చేసేందుకు ప్రయత్నాలు చేసాడు. మా మోర ఆలకించిన బాబా బాబుకి రోచెస్టర్ యూనివర్సిటీలో సీటు ఇప్పించారు. నిజానికి మొదట బాబు పిహెచ్‌డికి అప్లై చేసినప్పుడు సీట్లన్నీ అయిపోయాయని చెప్పారు. తర్వాత కొద్దిరోజులకి ఇంటర్న్షిప్ ఇస్తామని చెప్పారు. మేము బాబాని, "వాడికి ఇష్టమైన పిహెచ్‌డిలో చేర్పించామ"ని వాడుకున్నాము. బాబాని కోరుకుంటే కానిది ఏమీ ఉండదు కదా! అంతకు ముందు చేరిన అతను డ్రాప్ అవ్వడంతో ఆ సీటు మా బాబుకి ఆఫర్ చేశారు. పేపర్ వర్క్ అంతా రెండు రోజుల్లో అయిపోవడం, సీటు కన్ఫర్మ్ అవ్వడం, ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవడం అంతా ఒక మాయలా మూడు రోజుల్లో జరిగిపోయింది. 2024, ఆగస్టు 22న బాబులో పిహెచ్‌డి కోసం కాలేజీలో చేరబోతున్నాడు. ఇదంతా ఆ బాబా ప్రసాదం. "ధన్యవాదాలు బాబా. అలాగే మా పాప భవ్యకు మెడికల్ నీట్ పీజీ ఎంట్రన్స్ పరీక్షలో మొదటి ర్యాంకు ఇవ్వు తండ్రీ. మీ చల్లని చూపు నా కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలి బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1895వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయి అనుగ్రహమున్న బిడ్డలపై ప్రకృతి నియమాలు పనిచేయవు
2. బాబా దయ

సాయి అనుగ్రహమున్న బిడ్డలపై ప్రకృతి నియమాలు పనిచేయవు

నా పేరు సాయి ఈశ్వర్. నా చిన్న వయసులో మా ఊరిలో ప్రతి ఆదివారం సాయినాథుని సత్సంగాలు జరుగుతుండేవి. ఆ సత్సంగంలో సాయినాథుని కథాశ్రవణం, భజనలు, ధ్యానం, ఆయన మహిమలు పంచుకోవడం వంటివి జరుగుతుండేవి. వాటికి మేము హాజరవుతూ ఉండేవాళ్ళము. సాయినాథుని చింతనలో ఆయన కరుణాకటాక్ష వీక్షణాలతో సత్సంగానికి హాజరయ్యే ప్రతి ఒక్కరి కాలం ఆ వారం రోజులు ఆనందంగా గడిచేది. మళ్లీ ఆదివారం జరిగే సత్సంగంతో సాయినాథుని శక్తి రీఛార్జ్ అయ్యేది. నేను నా చిన్ననాటినుండి శ్రీసాయిని ఎటువంటి కోరికలు లేకుండా ఆయనే నాకు సర్వం అనే నిష్కామ భక్తి, ప్రేమలతో ఉండేవాడిని. ఆయనను నేను తలుచుకోకుండా ఒక గంట కూడా గడిచేది కాదు. నా తల్లి కూడా సాయినాథుని పరమ భక్తురాలు. ఆమె ఏ పని చేస్తున్నా నిరంతరం సాయినాథుని పాదాలు, ఆయన యొక్క దివ్యమైన రూపం ధ్యానిస్తుండేవారు. మనం సాయినాథుని నిష్కామ భక్తి, ప్రేమలతో నీవే మాకు దిక్కు, సర్వం అని నమ్మినప్పుడు ఆయన మన జీవితంలో చేయని మహిమ ఉండదు. ఆయన అనుగ్రహమున్న వారిపై ప్రకృతి నియమాలు కూడా పని చేయవని చెప్పే లీలను నేను ఇప్పుడు పంచుకోబోతున్నాను.

నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడు విజయదశమికి ముందు పరీక్షలు పూర్తై సెలవులు ఇచ్చారు. పిల్లలమంతా బస్సులో ఆనందంగా ఎవరింటికి వాళ్ళం తిరుగు ప్రయాణమవుతున్నాము. టీచర్ ఏ పిల్లల ఇల్లు దగ్గరకు వస్తుందో వాళ్ళని బస్సు డోర్ దగ్గర నిలబడమన్నారు. నేను మా ఇల్లు దగ్గరకి రావడంతో బస్సు డోరు వద్దకి వెళ్లి చివరి మెట్టుపై నిల్చున్నాను. ఆరోజు ఎప్పుడూ వచ్చే డ్రైవర్ సెలవు పెట్టడంతో బస్సు నడుపుతున్న కొత్త డ్రైవర్ బస్సు మా ఇంటి దగ్గర ఆపలేదు. ఈలోగా నా వెనక పిల్లల గలాటా వల్ల నేను జారీ కదులుతున్న బస్సులో నుంచి కింద పడిపోయాను. ఆ క్రమంలో నా ఎడమ కాలికున్న బూట్ ఊడిపోయింది. నా కాలు వెళ్లి బస్సు వెనక చక్రాలు వస్తున్న మార్గంలో పడింది. అంతే, బస్సు వెనక చక్రాలు నా ఎడమ కాలు పాదం మీద నుంచి వెళ్ళాయి. అంత పెద్ద బస్సు కాలిపై నుంచి వెళితే కాలికి ఏమీ కాలేదు. కేవలం పాదంపై చర్మం చిన్నగా లేచింది. కనీసం చిన్న బొట్టు రక్తం రావడం గానీ, నొప్పి గానీ లేవు. నా పాదం మాత్రం తిమ్మిరి ఎక్కినట్లుగా అయ్యింది. అయినా నేను వెంటనే లేచి నిల్చొని మిత్రుని సహాయంతో ఇంటికి నడుచుకుంటూ వెళ్లిపోయాను. అంత ప్రమాదం జరిగినా నా కాలికి, పాదానికి ఏమీ కాకపోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నేను ఇంటికి వెళ్లిన కాసేపటికి సాఫీగా మామూలుగా నడవగలిగాను. ఇంటిలో విషయం చెప్తే అంగవైకల్యం రాకుండా పెద్ద ప్రమాదం నుంచి ఆ సాయినాథుడు నన్ను రక్షించారని ఆయన అనుగ్రహానికి అందరూ అనందశ్చర్యాలకు లోనయ్యారు.

తర్వాత ఒకసారి నేను ఊరు వెళ్ళినప్పుడు అక్కడ రోడ్డుపై నాకు జరిగినట్టే ఒక ఆమె కాలిపై నుంచి బస్సు వెళితే ఆమె కాలు చితికిపోయి ఎముక, కండరాలు అన్నీ బయటకి వచ్చేసాయి. అంబులెన్స్ వచ్చేలోపే నోప్పి భరించలేక ఆమె మరణించింది కూడా. ఆ సంఘటనని చూసినప్పుడు ఆరోజు సాయిబాబా రక్షణ నాపై ఉండి ఉండకపోతే ఆమె కాలువలే నా కాలు కూడా చితికిపోయి అంగవైకల్యం ఏర్పడుండేది లేకుంటే నా ప్రాణం పోయుండేదనిపించింది. అటువంటి యాక్సిడెంట్లు చూసినప్పుడు, వాటి గురించి విన్నప్పుడు సాయినాథుడు నాకు చేసిన ఉపకారం గుర్తుకు వస్తుంది. ఆయన మనకు చేసే ఉపకారాలకి మనం ఏమిచ్చినా ఆయన ఋణం తీర్చుకోలేము. అందరికీ అన్నీ ఇచ్చే ఆయనకి మనం ఏమి ఇవ్వగలం అసలు? కేవలం నిష్కామంగా, నిష్కల్మషంగా, భక్తి,ప్రేమలతో ఆయనను సేవించడం తప్ప. లారీలు, బస్సులు వంటి భారీ వాహనాలు మన కాలిపై నుంచి వెళితే కాలు చితికిపోవడం ప్రకృతి ధర్మం. కానీ సాయి అనుగ్రహమున్న బిడ్డలపై ప్రకృతి నియమాలు పనిచేయవని నాకు జరిగిన ఈ సంఘటన ఒక నిదర్శనం.

బాబా దయ

సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు వెంకటేష్. మేము ఆరేళ్లపాటు మూడో అంతస్తులోని ఒక ఇంటిలో అద్దెకు ఉన్నాము. ఆ ఇల్లు బాగా మాకు కలిసి వచ్చింది. అయితే ఈమధ్య నాకు మోకాళ్ళ నొప్పులు ఉండటంతో ఇల్లు మారాలా, వద్దా అని చీటీలు వేసి బాబాని అడుగుదామని అనుకున్నాము. అనుకున్నట్లే ఒకరోజు బాబా ముందు చీటీలు వేస్తే, ఇల్లు మారమని వచ్చింది. దాంతో కొత్త అద్దె ఇంటికోసం ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఆ క్రమంలో ఒక ఇంటి యజమాని తమ ఇల్లు మాకు అద్దెకి ఇస్తామని అన్నారు. కానీ తరువాత వేరే వాళ్లకి ఇచ్చాను అన్నారు. సరే బాబానే మాకు మార్గనిర్దేశం చేస్తారని నేను అనుకున్నాను. నా భార్య మాత్రం ఆ ఇల్లు మనకే ఇస్తారని నాకనిపిస్తోందని అంటుండేది. అందుచేత మేము బాబాని, "బాబా! ఆ ఇల్లు మాకు అద్దెకి ఇచ్చేలా చూడు" అని ప్రార్థించాము. బాబా దయవలన మేము కోరుకున్నట్లే ఆ ఇల్లు మాకు అద్దెకి ఇచ్చారు. ఇకపోతే, 2024, జూలైలో నేను నా స్నేహితులతో కలిసి శబరిమల వెళ్లాలని ప్రణాళిక చేశాను. తదనుగుణంగా ఆ రోజు ప్రయాణానికి బయల్దేరాము. అప్పుడు మా పాప, బాబు వెళ్లోద్దని ఏడ్చారు. 'వీళ్లు ఇలా ఏడుస్తున్నారేంటి?' అని నాకు భయమేసి, "బాబా! నా ప్రయాణంలో, శబరిమల కొండ ఎక్కడంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడండి. అలాగే స్వామి దర్శనం బాగా జరిగేటట్టు చూడు తండ్రీ" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల అంతా బాగా జరిగింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1894వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • యాదృచ్చికం కాదని, తామే ఇచ్చామని నిదర్శనమిచ్చిన బాబా

నా పేరు కుమారి. వయసు 30 సంవత్సరాలు. నాకు 8 ఏళ్ళ వయసున్నప్పుడు మా నాన్న క్యాన్సర్‌తో మంచం పట్టారు. మా అమ్మ, నానమ్మ, తాతయ్య ఎప్పుడూ హాస్పిటళ్ళ చుట్టూ తిరుగుతుండేవారు. చివరికి నాన్న చనిపోవడం ఆ చిన్నవయసులోనే నేను చూశాను. తర్వాత మా అమ్మ చాలా కష్టపడి నన్ను, మా చెల్లిని చదివించింది. నేను కాలేజీ చదువుతున్నప్పుడు ఒక స్నేహితురాలు నువ్వు ప్రతి గురువారం ఉపవాసం ఉంటే, బాబాకి పూజ చేస్తే నీకు చాలా మంచి జరుగుతుందని చెప్పింది. అప్పుడు నేను కొన్నాళ్లు తను చెప్పినట్లు చేసి, తర్వాత చేయలేక ఆపేశాను. నిజానికి బాబా ఒక సద్గురువని నాకు అప్పుడు తెలీదు. ఏదో స్నేహితురాలు చెపితే ఆసక్తిగా అనిపించి చేశాను. కానీ బాబాకి సంబంధించిన కొన్ని విషాద గీతాలు విన్నాక నేను ఆనందాన్ని ఆస్వాదించాలి గాని ఇలా ఈ విషాద గీతాలు వింటే నాకు జీవితం మీద అదే అనుభూతి కలుగుతుందనిపించి బాబాని పూజించడం మానేసాను. నాకప్పుడు బాబానే నా జీవితం అవుతారని తెలియలేదు.

నేను గ్రాడ్యుయేషన్ పూర్తైన తర్వాత ఒక 2 సంవత్సరాలు వేరే టౌన్‌లో పీజీ చేశాను. ఒకసారి నా క్లోజ్ ఫ్రెండ్ తన పుట్టినరోజునాడు గుడికి వెళదామని నన్ను బాబా గుడికి తీసుకెళ్ళింది. అప్పుడు కూడా నేను బాబాకి కనెక్ట్ అవ్వలేదు. తర్వాత ఒకసారి అదే గుడిలో వేరే ఫ్రెండ్‌ని కలవాల్సి వచ్చి కలిసాను. అప్పుడు కూడా ఏదో నామమాత్రంగా బాబాకి దణ్ణం పెట్టుకొని వచ్చేసాను. నాకు 22 సంవత్సరాలు వచ్చాక ఉద్యోగం, కుటుంబం మరియు వ్యక్తిగత సమస్యలు కారణంగా నేను చాలా ఒత్తిడికి లోనయ్యాను. తట్టుకోలేక ఆహారం ముందు పెట్టుకొని ఏడ్చేదాన్ని. చాలా రోజులు ఒంటరిగా గదిలో ఉండిపోయాను. జాతకాలు, గుడులు, పూజలు మీద మక్కువ పెరిగి అదే పనిగా ఉండేదాన్ని. అలా ఒక సమయంలో వేరే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ అన్నీ గుడులకు వెళ్ళినట్లే బాబా గుడికి వెళ్ళాను. తర్వాత నాకు ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అది బాబా వల్లే వచ్చిందని నేను గుర్తించనప్పటికీ ఉద్యోగరీత్యా వేరే సిటీకి వెళ్లేముందు ఏదైనా గుడికి వెళ్లాలని తయారై హాస్టల్ ఫ్రెండ్‌ని రమ్మని అడిగితే తను, "ఎందుకిప్పుడు గుడికి? అక్కడికి వెళ్లాకే నీకు ఉద్యోగం వచ్చిందని సెటిమెంటా?" అనింది. నేను ఏమో తెలీదు అన్నాను. కానీ ఆ సెంటిమెంట్ వల్లనే ఏమో నేను వేరే రోజు ఆ ఉద్యోగంలో చేరాలని వచ్చినా "గురువారం జాయిన్ అవుతాన"ని చెప్పాను. సరే, తర్వాత నేను హాస్టల్ ఖాళీ చేసి ఇంటికివెళ్ళిపోయి, 2018, అక్టోబరు 21న మా ఇంటి నుండి మూడు గంటల ప్రయాణ దూరంలో ఉన్న టౌన్ నుంచి నేను ఉద్యోగం చేయాల్సిన సిటీకి వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకున్నాను. నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్లినా దారిలో 2 సార్లు దాబా దగ్గర టాయిలెట్ కోసం బస్ ఆపేవాళ్ళు. అలాగే ఆపుతారనుకుంటూ నేను వెళ్లి బస్సు ఎక్కాను. మొదటిసారి దూర ప్రయాణం కాబట్టి నాకు టాయిలెట్ కోసం బస్సులు ఎక్కువగా ఆపరని నాకు తెలీదు. బస్సు బయలుదేరాక ఎక్కడో ఒక బహిరంగ ప్రదేశంలో బస్సు ఆపారు. మగవాళ్ళు వెళ్లి వచ్చారు. ఆడవాళ్లు అందరూ నిద్రపోతున్నారు. నేను ఇక్కడ కేవలం మగవాళ్లకోసం ఆపి ఉంటారు, తర్వాత ఎక్కడైనా దాబా దగ్గర ఆడవాళ్లకోసం ఆపుతారు కాబోలు అనుకున్నాను. ఒక గంట అయ్యేసరికి నాకు టాయిలెట్ అర్జెంట్ అయి కడుపునొప్పి మొదలైంది. ఆ సమయంలో నేను అనుభవించిన నరకం బాబాకే తెలుసు. ఏం చేయాలో తెలియలేదు. వెళ్లి, డ్రైవర్‌ని బస్సు ఆపమంటే, "ఇంకో గంట, రెండు గంటల వరకు టౌన్ ఏదీ లేదు. అప్పటివరకు ఆపము. అయినా ఇందాకా ఆపాము కదా!" అని అన్నాడు. కానీ వాళ్ళప్పుడు కనీసం టాయిలెట్ కోసం ఆపామని చెప్పను కూడా చెప్పలేదు. ఇప్పుడేమో అలా అన్నారు. ఇంకా అడిగితే అందరి ముందు తిడితే అల్లరిపాలవుతానేమోనని వచ్చి నా సీటులో కూర్చొని ఏడ్చాను. మద్యలో ఏదైన చిన్న ఊరు వస్తే దిగిపోదామని అనిపించింది. కానీ అప్పుడు సమయం సుమారు రాత్రి 12 గంటలు. ఈ బస్సు దిగితే వేరే బస్సులు ఆపరు. పోనీ కారు ఏదైనా ఎక్కుదామంటే నా దగ్గర అంత డబ్బులు లేవు. అమ్మ కేవలం ఖర్చులవరకు ఇచ్చి అక్కడికి వెళ్ళాక నా అకౌంటులో వేస్తానని చెప్పింది. ఎవరైనా తెలిసినవాళ్ళకి కాల్ చేసినా వాళ్ళు కారు తీసుకొని రావడానికి కనీసం 3 గంటల సమయం పడుతుంది. అంతవరకు ఈ అర్ధరాత్రి వేళ ఎక్కడని వేచి ఉండాలన్న ఆలోచనలతో నాకు చాలా ఏడుపొచ్చి బాగా ఏడ్చేశాను. తర్వాత మళ్ళీ వెళ్లి డ్రైవరుని బ్రతిమాలితే, "ఏదైనా అనుకూలమైన ప్రదేశం వస్తే చెప్తాన"ని అన్నారు. పర్లేదు, రోడ్డు పక్కన అయినా ఆపండి అందమంటే బస్సులో కిటికీ పక్క సీట్లలో అందరూ నా వయసు మగవాళ్లే. ఆ సమయంలో నేను గుర్తు తెచ్చుకోని దేవుడు లేడు. ఆ క్రమంలో హఠాత్తుగా నా ఫ్రెండ్ 'ఆయన(బాబా) వల్లే నీకు ఉద్యోగం వచ్చిందా?' అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. నాకు అప్పటికి బాబా ఎవరో సరిగా తెలీదు. ఆయన మిరాకిల్స్ చేస్తారని కూడా నాకు తెలియదు. అయినా వేరే దారి లేకపోయినా, జరగదని తెలిసినా బాబాని "మీరు ఇప్పుడు నన్ను రక్షిస్తే నేను ఈ జన్మంతా మిమ్మల్ని మార్చిపోను" అని అనుకున్నాను. అంతే, ఒక్క నిమిషంలో బస్సు ఆగింది. క్లీనర్ నన్ను పిలిచి, "ఒక టోల్ గేట్ వచ్చింది. లేడీ సెక్యూరిటీ నైట్ డ్యూటీ చేస్తుంది. ఆమెకోసం ఒక తాత్కాలిక టాయిలెట్ రేకులతో ఏర్పాటు చేసార"ని దాన్ని చూపించి, "వెళ్లి తొందరగా రండి" అని అన్నాడు. నన్ను నేను నమ్మలేకపోయాను. ఒకవైపు ఆనందం, ఇంకోవైపు షాకులో ఉన్న నేను టాయిలెట్‌కి వెళ్లొచ్చి బస్సు ఎక్కుతుంటే నా ఒళ్ళంతా రోమాంచితమై 'ఇలా సినిమాల్లోనే జరుగుతుంది గాని, బయట జరుగుతుందా? నిజంగా దేవుడు ఉన్నాడా? మన మాటలు వింటాడా? ఇలా రక్షిస్తాడా? సాయిబాబా దేవుడా? ఎవరు ఈ సాయిబాబా? నిజముగా నాకు ఉద్యోగం ఇచ్చింది ఆయనేనా? ఇదంతా కేవలం యాదృచ్చికమా?" అని అనుకుంటూ కిటికీ పక్కనున్న నా సీటులో కూర్చొని బాబాని మళ్ళీ, "బాబా! ఇది కనుక మీరే చేస్తే, మళ్ళీ ఇలాంటి మిరకిల్ చేసి మీరే చేసారని నిరూపించండి. అప్పుడు జరిగినది యాదృచ్చికం కాదని నమ్ముతాను" అని అడిగాను. ఒక్క నిమిషం లోపల నా పక్కకి ఒక లారీ వచ్చి ఆగింది. ఆ లారీ మీద అచ్చమ్ మా ఇంట్లో ఉండేటటువంటి కాషాయ వస్త్రాల్లో ఆశీర్వదిస్తున్నట్లు ఉండే బాబా పెయింటింగ్ ఉంది. 2, 3 నిమిషాలు ఆ లారీ నా కళ్ళముందు ఆగి ముందున్న వాహనాలు వెళ్ళిపోగానే వెళ్ళిపోయింది. నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. ఆ తర్వాత ఇలాంటి కొన్ని వందల అనుభవాలు బాబా నాకు ప్రసాదించారు.

2024, జూలై నెల మూడోవారం మొదలు నుండి ఒక 10 రోజులు కడుపులో మంటగా ఉండి ఏమీ తినలేకపోయాను. ఈ సమస్య నాకు ఎప్పటినుంచో ఉంది. సాయంత్రం 6 నుంచి బాగా మంటలా రావడం చల్లనివి తినాలన్న కూడా భయమేసేది. అంత తీవ్రంగా ఉండేది పరిస్థితి. ఈ బ్లాగులో అనుభవాలు చదివి బాబాకి మొక్కుకొని ఊదీ నీళ్లలో కలిపి తాగాను. అంతే, 2 రోజుల్లో ఆ సమస్య తగ్గిపోయింది. ఆ 10 రోజులు నేను కేవలం పుచ్చకాయ, మజ్జిగ మీద ఆధారపడ్డాను. అలాంటిది బాబా నాకు ఆ బాధ నుండి ఉపశమనం ప్రసాదించారు. "ధన్యవాదాలు బాబా. మీ దర్శనానికి రాలేకపోయాను, మీ మొక్కు తీర్చుకోలేకపోయాను. మీరే ఎలాగైనా సాధ్యం అయ్యేలా చూడండి. నాకు మీరు ఉన్నారన్న ఆనందంతో, ధైర్యంతో ఉన్నాను. నన్ను వదలకు బాబా ప్లీజ్".

సాయిభక్తుల అనుభవమాలిక 1893వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా కృపాకటాక్షాలు
2. బిడ్డ రూపంలో వచ్చిన బాబా
3. ఎల్లప్పుడూ వెంటుండి కాపాడే బాబా

బాబా కృపాకటాక్షాలు

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం శ్రీసాయినాథాయ నమః. నా పేరు ప్రభాకరరావు. మాది అనకాపల్లి(ఒకప్పటి విశాఖపట్నం జిల్లా). నేను బాబాని నమ్ముకొని 27 సంవత్సరాలు అయింది. ఒకసారి నా తండ్రికి తీవ్రమైన అనారోగ్య సమస్య వస్తే, హాస్పిటల్లో చేర్చాము. డాక్టర్ మందులతో తగ్గకపోవడం వల్ల ఆపరేషన్ చేయాలని అన్నారు. మేము చాలా భయపడ్డాము. నేను మా నాన్న ఆరోగ్యం బాగుపడాలని మొదటిసారి బాబా గుడికి వెళ్లి, "బాబా! మా నాన్న ఆరోగ్యం నయమయ్యేలా చేయండి" అని వేడుకున్నాను. బాబా దయవల్ల ఆపరేషన్ లేకుండానే మందులతో పూర్తిగా నయమై నాన్న ఆరోగ్యంగా ఇంటికి వచ్చారు. అప్పటినుంచి నాకు బాబా మీద నమ్మకం పెరిగింది.

తర్వాత నేను ఉద్యోగం కోసం పరీక్ష వ్రాసి అందులో పాసయ్యాను. తర్వాత కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూలలో కూడా ఉత్తీర్ణత సాధించడంతో తేలికగా నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. కాదు, బాబా ఇచ్చారు. ఆయన కృపాకటాక్షాలతోనే నాకు ఆ ఉద్యోగం వచ్చింది. కొంతకాలానికి నేను పనిచేస్తున్న ఉద్యోగంలో సీనియారిటీ ప్రకారం నాకు సూపరింటెండెంట్‌గా ప్రమోషన్ వస్తుందని అనుకున్నాను. కానీ నాకన్న ముందున్న వారి వరకు ప్రమోషన్ వచ్చి నాకు రాలేదు. నేను చాలా బాదపడి బాబాతో చెప్పుకున్నాను. ఏ కారణం చేతనో నాకన్న ముందున్న ముగ్గురు ప్రమోషన్ తీసుకోకపోవడం వల్ల నాకు సూపరెంటెండెంట్‌గా ప్రమోషన్ వచ్చింది. అంతా బాబా కృపాకటాక్షం. ఆయన దయవలన నేను కోరుకున్న ప్రదేశంలోనే నాకు ప్రమోషన్ ఇచ్చారు. ఇదే విధంగా బాబా నేను కోరుకున్నవన్ని నాకు ఇచ్చారు. ప్రతి విషయంలోను ఆయన నన్ను, నా కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. నా సర్వం బాబా. ఆయన లేకపోతే నేను లేను. నేను ఎప్పుడూ ఆయనకి ఋణపడి ఉంటాను. సదా బాబా అనుగ్రహం మన అందరిపై వర్షించాలని కోరుకుంటున్నాను. "బాబా! మీ పాదాలకు అనంతకోటి నమస్కారాలు. నా యందు దయుంచి మా సొంత ఊరికి బదిలీ అయ్యేలా చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తండ్రీ. నాపై ఎల్లప్పుడూ మీ ప్రేమ, ఆప్యాయత, కృపాకటాక్షాలు కురిపించండి తండ్రీ".




సాయిభక్తుల అనుభవమాలిక 1892వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. చిన్న బిడ్డ తల్లి మీద ఆధారపడే విధంగా బాబా మీద ఆధారపడాలి
2. ఒక్కోసారి తుఫాన్ రేపినా మళ్ళీ ప్రశాంతతను కలిగించేది బాబానే



సాయిభక్తుల అనుభవమాలిక 1891వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా సహాయం
2. ఆందోళనలను తొలగించిన బాబా


ఆందోళనలను తొలగించిన బాబా

సాయిబంధువులకు నమస్కారం. నా పేరు రేవతి. ఒకసారి మావారు, అత్తయ్యవాళ్ళతో కలిసి ఒక కార్యక్రమం నిమిత్తం హైదరాబాద్ వెళ్ళారు. నేనెప్పుడూ పాపతో ఒంటరిగా ఇంట్లో ఉండలేదు. పైగా నేను రోజూ నా డ్యూటీకి వెళ్ళాలి. సాయంత్రం పాపని ట్యూషన్‌కి దిగబెట్టాలి. అందువల్ల నాకు కొంచెం దిగులుగా ఉండి నా ఆందోళనంతా బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల మావారు ఊరు వెళ్ళినప్పుడు మా పనిమనిషి పడుకోవడానికి వచ్చింది. ఇంకా పాప స్నేహితురాలి తల్లి పాపని ట్యూషన్‌కి తీసుకెళ్లింది. మావారు లేని సమయంలో మా అమ్మ ఒళ్ళంతా వాపు వచ్చింది. డాక్టర్ వద్దకు తీసుకెళ్లి చెకప్ చేయిస్తే, థైరాయిడ్ మరియు కొలెస్ట్రాల్ ప్రోబ్లం అని చెప్పారు. నేను అమ్మకి తగ్గాలని బాబాని ప్రార్ధించాను. బాబా దయవల్ల అమ్మకి తగ్గింది. ఇంకా మావారు, అత్తయ్యవాళ్ళు(అత్తయ్య వయసు 80కి పైనే ఉంటుంది) ఎటువంటి ఇబ్బంది లేకుండా హైదరాబాద్ వెళ్లి, తిరిగి వచ్చేశారు. బాబా దయవల్ల నా ఆందోళనాలన్నీ తొలగిపోయాయి. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ కృప ఎల్లప్పుడూ అందరిపై ఇలాగే ఉండాలి తండ్రీ".

సాయిభక్తుల అనుభవమాలిక 1890వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబా తమ భక్తుల కష్టాలు తీరుస్తారన్నది నిజం

సాయిబందువులకి నమస్కారం. నా పేరు భవాని. కొన్నిరోజుల క్రితం మావారికి చాలా దగ్గు వచ్చి చాలా ఇబ్బందిపడ్డారు. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఏమైనా తిన్నా, తాగినా కూడా దగ్గు బాగా ఎక్కువగా వచ్చేది. అప్పుడు మేము ఈఎన్‌టి డాక్టర్ దగ్గరకి వెళితే, ఆయన కొన్ని మందులిచ్చి, "వీటిని వాడండి. తగ్గకపోతే కొన్ని టెస్టులు చేయాలి" అన్నారు. ఆ మందులు వాడినా దగ్గు తగ్గలేదు. దాంతో డాక్టర్ CT స్కాన్ చేయించమన్నారు. స్కాన్‌లో ఏ సమస్యా లేదని వచ్చింది. కానీ మావారికి దగ్గు తగ్గలేదు అదీకాక మావారికి ఛాతీ నొప్పి కూడా వచ్చింది. డాక్టర్, "పల్మనాలజిస్ట్‌కి చూపించండి. ఊపిరితిత్తుల సమస్య ఉండి ఉంటుంది" అన్నారు. అప్పుడు నాకు చాలా భయమేసింది. ఎందుకంటే, కోవిడ్ సెకండ్ వేవ్‌లో మావారికి కోవిడ్ అటాక్ అయి బాగా సీరియస్ అయింది. ఒక వారం హాస్పిటల్లోనే ఉన్నారు. దాని ప్రభావమేమోనని నాకు చాలా భయమేసి, "బాబా! మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఆయనకి దగ్గు తగ్గాలి" అని బాబాతో చెప్పుకున్నాను. డాక్టర్ ఒక వారానికి మందులిచ్చి, ఇది వాడండి. ఊపిరితిత్తుల సమస్యలా లేదు కానీ, ఒక వారంలో తగ్గకపోతే పరీక్షలు చేద్దాం" అని అన్నారు. ఆ మందులు వాడినా తగ్గలేదు. పైగా ఇంకా ఎక్కువ ఐపోయింది. అప్పటికి దగ్గు చాలా ఎక్కువగా వస్తు రెండు నెలలు అయింది. నేను, "ఏంటి బాబా, ఇలా చేస్తున్నారు?" అని బాధపడ్డాను. హఠాత్తుగా మావారు "నేను ఈ మందులు వాడను. దగ్గు తగ్గకపోయిన పర్లేదు. నేను ఈ మందులు వాడలేకపోతున్నాను" అని మందులు వాడటం మానేశారు. రెండు రోజుల్లో మందులు వాడకుండానే మావారికి దగ్గు తగ్గి, మామూలు అయిపోయారు. అలా ఎలా తగ్గిందని మాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పటికీ మావారు "అన్ని మందులు వాడినా తగ్గనిది మందులు వాడకుండా ఎలా తగ్గింది?" అని అంటుంటారు. అంతా బాబా దయ. "మీకు శతకోటి వందనాలు తండ్రీ".

మేము చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున నేను కూడా ఉద్యోగం చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. కానీ నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. తెలుగు తప్పా వేరే భాష రాదు. కాబట్టి నేను ఏ ఉద్యోగం చేయలేననుకున్నాను. కానీ మన బాబా ఉన్నారు కదా! ఆయన్ని ఒక మాట అడుగుదామనుకొని, "బాబా! మీరు నిజంగా మా కష్టాలు విని తీరుస్తారనేది నిజమైతే, నాకొక ఉద్యోగం వచ్చేలా చేయగలరా?" అని అడిగాను. అలా అడిగిన తర్వాత బాబా చేయకుండా ఉంటారా! కానీ నేను మాత్రం నాకు ఉద్యోగం రాదని నిశ్చయానికి వచ్చేసాను. అందుకే నేను ఎక్కడా ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టలేదు. ఏ ప్రయత్నాలూ చేయలేదు. ఒక 5 రోజులు గడిచాయి. నేను 'నాకు ఉద్యోగం ఎందుకు వస్తుంది? నాకు తెలుగు తప్పా మరో భాష రాదు. పైగా ఎక్కడా ప్రయతించట్లేదు' అని అనుకున్నాను. అయితే ఒకరోజు ఉదయం మావారు గుడిలో నుండి నాకు ఫోన్ చేసారు. ఆయన గుడిలో వుండగా ఒక ఆమె వచ్చి గుడికి ఎదురుగా వున్నా బిల్డింగ్ చూపించి, "అందులో కొత్తగా స్కూల్ ఓపెన్ చేసాము. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు వుంటే చెప్పండి" అని అన్నారట. మావారు ఆమెతో నా శ్రీమతి ఎమ్.కామ్ చేసింది అని చెప్పారట. అప్పుడు ఆమె, ఆమెని తీసుకొని మధ్యాహ్నం రండి అని చెప్పి ఆమె ఫోన్ నెంబర్ మావారికి ఇచ్చి, మావారి నెంబర్ ఆమె తీసుకున్నారట. ఆ వివరాలు అన్నీ మావారు నాకు చెప్పారు. ఆరోజు మధ్యాహ్నం ఆమెనే కాల్ చేసి, "వస్తున్నారా?" అని అడిగారు. అప్పుడు మేము వెళ్లి ఆమెని కలిసాం. నేను ఆమెతో "నాకు ఏమీ రాదు. నాకు కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది" అని చెప్పాను. ఆమె "మరేం పర్వాలేదు. నేను చూసుకుంటాను. మీరు వచ్చి ఉద్యోగంలో చేరండి" అని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల నేను ఆ ఉద్యోగంలో వెంటనే చేరలేదు. తర్వాత వేరేవాళ్లు అకౌంటెంట్‌గా జాయిన్ అయ్యారని నాకు తెలిసింది. దాంతో నేను ఇంకా నాకు ఉద్యోగం రాదులే అని వదిలేశాను. 15రోజులు తర్వాత ప్రిన్సిపాల్ మేడం కాల్ చేసి, "ఇంకా రాలేదు ఏంటి?" అని అడిగారు. నేను, "మేడం! మీరు వేరే వాళ్లకి జాబ్ ఇచ్చారని ఎవరో చెప్పారు" అని అంటే, "లేదు. అది మీ ఉద్యోగం. మీకోసం మాత్రేమే, వచ్చి జాయిన్ అవ్వండి" అని అన్నారు. నేను షాకయ్యాను. ఇంకా విచిత్రమేమిటంటే, ప్రిన్సిపాల్ మేడం తర్వాత అత్యధిక జీతం నాదే. ఇప్పుడు ఆ స్కూల్లో సెకండ్ హయ్యర్ అధారిటీ నేనే. నాకు ఏదైన సమస్య ఉంటే ప్రిన్సిపాల్ మేడమే చూసుకుంటున్నారు. ఆమెనే నాకు అన్నీ నేర్పుతున్నారు. ఇంకో విషయమేమిటంటే, నా తర్వాత ఉద్యోగంలో చేరిన వాళ్లందరికీ జీతాలు తక్కువ, పైగా కమ్యూనికేషన్ తప్పనిసరి. ఒకరోజు నేను ప్రిన్సిపాల్ మేడంని, "నాలో ఏం ప్రత్యేకత ఉంది. నాకు ఉద్యోగం ఇచ్చారు" అని అడిగాను. అందుకామె, "ఏమో నాకు తెలియదు. మిమ్మల్ని చూడగానే ఈ ఉద్యోగం మీదే అనిపించింది" అని అన్నారు. ఆమె నేను ఆ ఉద్యోగంలో చేరే లోపు ఒక 10, 15 సార్లు నాకు ఫోన్ చేసారు. ఒక నెల రోజులు వేచి చూసారు. నాకు తర్వాత తెలిసింది ఏమిటంటే, ఆ ఉద్యోగం కోసం చాలామంది వచ్చారని, వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, అనుభవం ఉన్న కూడా వాళ్లలో ఎవరికీ ఆ ఉద్యోగం ఇవ్వాలనిపించలేదని, ఆ విషయమై ఎందుకో నాకు కూడా తెలీదంటారు మేడం. నాకు మాత్రం ఇదంతా బాబా దయ అని అర్దమైంది. "బాబా! మీరు ఉన్నారు. మా కష్టాలు వింటున్నారు, పరిష్కారం చూపిస్తున్నారని అర్దమైంది. చాలా చాలా ధన్యవాదాలు బాబా".

ఇన్ని చేసిన బాబా ఒక విషయంలో మాత్రం నన్ను బాధపెట్టారు. నేను రోజూ మా నాన్నతో ఫోన్‌లో మాట్లాడతాను. ఒక్కరోజు మాట్లాడకపోయినా ఫోన్ చేసి నువ్వు నాతో ఈరోజు మాట్లాడలేదని చిన్నపిల్లాడిలా అలుగుతారు నాన్న. ఇంట్లో జరిగే ఏదన్నా ఫంక్షన్‌కి వెళ్లకపోతే ఫోన్ చేసి, 'నీకు నేను అంటే ఇష్టం లేదా? నన్ను చూడటానికి రావా?' అని కోప్పడతారు. అలాంటిది మా వూరి గుడిలో అమ్మవారి ప్రతిష్ట కోసం మా అత్తయ్యలు అందరూ వస్తుంటే నాన్న నాకు ఫోన్ చేసి, 'ఇప్పుడు నువ్వు రాకు. నువ్వు, పిల్లలు ఇబ్బందిపడతారు. వేసవి సెలవుల్లో వచ్చి నా దగ్గర ఒక నెల రోజులు వుండాలి' అని అన్నారు. నేను సరేనన్నాను. తర్వాత నాన్న గుడి కార్యక్రమాల్లో బిజీగా ఉండి నాకు ఫోన్ చేయలేదు. నేను చేస్తే లిఫ్ట్ చేసి, "బిజీగా ఉన్నాను" అని 4 రోజులు నాతో మాట్లాడలేదు. నా పెళ్ళైన తర్వాత 10 ఏళ్లలో నాన్న ఎప్పుడూ నాతో మాట్లాడకుండా అన్నిరోజులు ఉండలేదు. తర్వాత రోజు ఉదయం నాన్నకి జ్వరం వస్తే, ఇంజక్షన్ చేసారు. తర్వాత నాన్న నీరసంగా ఉందంటే డాక్టరు సెలైన్ పెట్టారు. అప్పుడు నాన్న పడుకొని మాట్లాడుతూ ఉంటే అమ్మ, "అమ్మాయికి ఫోన్ చేయనా? మాట్లాడతారా" అని అడిగితే, "వద్దు. నేను నీరసంగా మాట్లాడితే అది కనిపెట్టేస్తుంది, కంగారుపడుతుంది. నాకేమీ లేదు కదా! నీరసం అంతే! రేపు ఉదయం మాట్లాడతాను" అని అన్నారట. అలా అన్న కాసేపటికి ఎక్కిళ్లు వచ్చినట్టు అయి నాన్న 63 సంవత్సరాలకే చనిపోయారు. డాక్టరు కార్డియాక్ అరెస్ట్(గుండె ఆగిపోయింది) అని అన్నారు. నాన్న చివరి 5 రోజులు నాతో మాట్లాడలేదు. అందుకు ఆరోజు నేను ఎంతో ఏడ్చి, "నిన్ను ఇంత నమ్మాను. ఎందుకిలా చేసారు బాబా" అని అనుకున్నాను. కొన్ని రోజులకి ఫేస్బుక్‌లో "అతని ఆయుస్సు తీరిపోయింది.  నేనేమి చెయ్యగలను?' అని బాబా సందేశం వచ్చింది. కానీ అది నాకు ఇప్పటికీ తీరని బాధ. అందువల్ల ఒకసారి "బాబా! నేను ప్రతిష్టకు వెళ్లుంటే మా నాన్నని కలిసేదాన్ని, మాట్లాడేదాన్ని. నాకు ఆ అవకాశం లేకుండా పోయింద"ని అని అనుకున్నాను. తర్వాత నాకు మరో బాబా సందేశం వచ్చింది, "నేను నీ తండ్రిని. ఇక్కడే వున్నాను. ఎందుకు అంత బాధపడుతున్నావు?" అని. అప్పుడు, "బాబా! నా తండ్రి ఎక్కడ వున్నా బాగుండాలి. ఇక నుండి మీరే నా తండ్రి" అని అనుకున్నాను.

సమర్ద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.

సాయిభక్తుల అనుభవమాలిక 1889వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆటంకం లేకుండా కార్యక్రమం జరిపించిన బాబా
2. బాబా దయతో తగ్గిన కడుపునొప్పి
3. రాషెష్ తగ్గేలా దయచూపిన బాబా


బాబా దయతో తగ్గిన కడుపునొప్పి

సాయినాథునికి సాష్టాంగ నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. ఒకరోజు ఉదయం నిద్రలేచాక మలవిసర్జనకు వెళ్లేముందు నాకు కడుపునొప్పి మొదలైంది. రెండో రోజుకి కడుపునొప్పితోపాటు విరోచనాలు కూడా ప్రారంభమై రోజంతా విరోచనాలు అవుతూనే ఉన్నాయి. దాంతో ఆ రాత్రి విరోచనాలు కట్టడానికి టాబ్లెట్ వేసుకున్నాను. మూడవరోజుకి విరోచనాలు తగ్గాయి కానీ, కడుపునొప్పి మాత్రం తగ్గలేదు. అందువల్ల నేను, "బాబా! హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన అవసరం రాకుండా చూడండి" అని బాబాకి చెప్పుకొని ఇంకోరోజు వేచి చూసాను. కానీ నాల్గవ రోజుకి కూడా కడుపునొప్పి తగ్గలేదు. క్వశ్చన్&ఆన్సర్ సైట్‌లో బాబాని అడిగితే 'హాస్పిటల్‌కి వెళ్ళమ'ని వచ్చింది. దాంతో వెంటనే నేను  హాస్పిటల్‌కి వెళ్ళాను. డాక్టర్ చూసి స్టమక్ ఇన్ఫెక్షన్ అని మందులిచ్చారు. బాబా దయవల్ల ఆ మందులు వాడితే సమస్య తగ్గిపోయింది. తర్వాత వేరే ఆరోగ్య సమస్యకోసం ఆయుర్వేద మందులు వాడుతుంటే ఒకరోజు మలవిసర్జనకు ముందు మళ్ళీ కడుపునొప్పి మొదలైంది. అప్పుడు నేను, "బాబా! మళ్ళీ వచ్చిందేమిటి? మరల ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చిందా? దయచూపండి బాబా" అని వేడుకున్నాను. అయితే ఆ మరుసటిరోజు కూడా కడుపునొప్పి వచ్చింది. "బాబా! దయచేసి నా ఇబ్బందిని తగ్గించండి. నాకు భయంగా ఉంది" అని అనుకున్నాను. బాబా దయవల్ల ఇబ్బంది తగ్గింది. దాంతో ఆది ఆయుర్వేద మందులు వల్ల వచ్చిందని ఊపిరిపీల్చుకున్నాను. "ధన్యవాదాలు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1888వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా మార్గనిర్దేశం
2. అడిగినంతనే బాడుగ ఇప్పించిన బాబా

బాబా మార్గనిర్దేశం

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!! 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగ్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. ఈ బ్లాగులో ప్రచురించిన అనుభవాలు చదవడం నా నిత్య జీవితంలో ఒక భాగమై పోయింది. పుస్తకం పారాయణ ఎలా అయితే చేస్తానో అలాగే ఫోన్ లో ఈ బ్లాగ్ కూడా పారాయణం చేస్తాను. నేను ఇదివరకు పంచుకున్న నా  అనుభవాలన్నీ, అలాగే తోటి సాయి భక్తులు పంచుకునే అనుభవాలు ఆ సాయినాథుడు ఎంతోమందిని ఎలా కనిపెట్టుకొని ఉన్నారో తెలియజేసే సరికొత్త సాయి సచ్చరిత్ర అధ్యాయలుగా నేను భావిస్తాను. ఇకపోతే, నేను ఈరోజు మీతో రెండు అనుభవాలు పంచుకోబోతున్నాను. వాటిలో ఒకటి అనుభవం అనేదానికన్నా బాబా మార్గనిర్దేశనం అనడం సమంజసంగా ఉంటుంది. నేను ఒక జూనియర్ అడ్వకేట్‌ని. నాకు ఎలాగైనా జేసీజే(సివిల్ జడ్జి)పరీక్షకి బాగా చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆశ. అయితే పని చేస్తూ(ఒక సీనియర్ దగ్గర పని చేస్తుండేదాన్ని) పరీక్షకి ప్రిపేర్ అవ్వలేకపోయేదాన్ని. అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా నాకు అవగాహన లేదు. అయినా ఆ పరీక్షని క్లియర్ చేయాలని నాకు పట్టుదలగా ఉండేది. అందువల్ల కొంతమంది సీనియర్స్ సూచననుసరించి కోచింగ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ కోచింగ్‌కి హైదరాబాద్ వెళ్ళాలి. అయితే నేను ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్ వెళ్లడం కొంచెం కష్టమైన పనే. అయినా నేను మా అమ్మానాన్నని ఒప్పించి కోచింగ్ ఇన్స్టిట్యూట్‌లో రిజిస్టర్ చేసుకున్నాను. తర్వాత అసలు తలనొప్పి ఏమిటంటే, హాస్టల్ వెతకడం. నాకు ఇమ్యూనిటీ సమస్యలున్నాయి. ఊరికే జలుబు, జ్వరం, గొంతునొప్పి వస్తుంటాయి. అందువల్ల పరిశుభ్రమైన మంచి ఆహారం లభించే హాస్టల్ నాకు కావాలి. అది కూడా నేను భరించగలిగేంత అద్దెలో. అది నాకు పెద్ద ఆలోచన అయిపొయింది. సరైన హాస్టల్ కుదరకపోతే నేను ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలి. కానీ ఆన్లైన్ కోచింగ్‌తో అంత శ్రద్ధగా చదువుకోలేము. పైగా ఇంట్లో ఉంటే ఏదో ఒక పని వల్ల చదువు మీద దృష్టి పెట్టడం కష్టం అవుతుంది. సరే, ఒక నెల ముందే నేను, నాన్న కలిసి హాస్టల్ వెతకడానికి హైదరాబాద్ వెళ్ళాము. అదే సమయంలో మాకు తెలిసిన ఒక అన్న హైదరాబాద్ వచ్చారు. మామూలుగా అతను ఒంగోలులో ఉంటారు. ఏదో పని మీద అప్పుడు హైదరాబాద్ వచ్చారు. కాదు, బాబానే నాకోసం పంపించారు. ఆ అన్న హాస్టల్ వెతకడంలో నాకు చాలా సహాయం చేసారు. మొదట మేము గూగుల్‌లో సెర్చ్ చేసి కొన్ని హాస్టళ్లకు వెళ్ళాము, కానీ అవి బాగాలేవు..పగలంతా తిరిగినగాని ఎక్కడ కూడా ఇక్కడ ఉండొచ్చనేలా కనపడలేదు. దాంతో నాకు చాలా నిరాశగా అనిపించింది. అయితే నేను నిరుత్సాపడినా బాబా పంపిన ఆ అన్న నిరుత్సాహపడలేదు. ఎవరు కనిపిస్తే వాళ్ళని అడిగి మంచి హాస్టళ్లు ఎక్కడ ఉన్నాయో కనుక్కోసాగాడు. ఆ క్రమంలో ఆరోజు సాయంత్రం మళ్ళీ హాస్టల్ వెతకడానికి వెళ్ళినప్పుడు ఆ అన్న ఒక అమ్మాయిని అడిగి ఒక హాస్టల్ గురించి కనుక్కున్నారు. నేను ఆ హాస్టల్ వైపు వెళ్తూ, "బాబా! నేను హైదరాబాద్ రావడం నీ సంకల్పమే అయితే నాకు మంచి హాస్టల్ చూపించు" అని అనుకున్నాను. అప్పటిదాకా చూసిన వాటిల్లోకెల్లా ఆ హాస్టల్ బాగుందనిపించింది. కాకపోతే, ఆ వార్డెన్ నాకు చూపించిన గదిలో వెంటిలేషన్ అంతగా లేదు. కానీ గది బాగానే ఉంది. అదే విషయం ఆ వార్డెన్‌తో అంటే ఆమె, "ఆలాగైతే వేరే గది ఉంది. అక్కడ వెంటిలేషన్ బాగుంటుంది. కాకపోతే ఆ గది నెలాఖరులో ఖాళీ అవుతుంది" అని చెప్పింది. నేను, "నాకు క్లాసులు మొదలయ్యేది కూడా అప్పటినుంచే. కాబట్టి ఆ గది చూపించమ"ని అడిగాను. అయితే ఆ సమయంలో కరెంటు పోయి చీకటిగా ఉండటం వల్ల పక్క రోజు వచ్చి చూస్తానని చెప్పి వచ్చేసాను. నా మనసులో ఈ గది కూడా బాగుండదేమో అన్న ప్రతికూల ఆలోచనతో రాత్రంతా 'అది కూడా బాగాలేకపోతే నాకు ఆన్లైన్ తప్ప వేరే దారి లేదు' అనుకున్నాను. సరే, పొద్దున్నే వెళ్లి ఆ గది చూసాను. ఆ గది చాలా బాగుంది. నేను ఎలా ఉండాలనుకున్నానో అలానే ఉంది. నాకు చాలా సంతోషంగా అనిపించి వెంటనే డబ్బులు కట్టి ఆ గది నాకోసం బ్లాక్ చేయించుకున్నాను. బాబా ఆ అన్న ద్వారా నాకు మార్గనిర్దేశనం చేసారు. అతను నేను వెళ్లిన సమయానికి హైదరాబాద్‌లో లేకున్నా, అతను అందర్నీ అడిగి తెలుకోకపోయినా, నేను ఆ వార్డెన్‌ని అడగకపోయినా ఆ గది నాకు దొరికి ఉండేది కాదు. ఏదేమైనా పొద్దున్నుంచి నుంచి తిరిగితే దొరకనిది బాబాని వేడుకోగానే దొరికింది. బాబా పిలిస్తే పలుకుతారన్నదానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి? ఆయన నా వెనకనే(చుట్టూ) ఉంటూ నన్ను నడిపిస్తున్నారు. ఈరోజు నేను అదే గదిలో సంతోషంగా ఉంటూ, పరీక్షకి చదువుకుంటూ ఈ అనుభవాన్ని మీతో పంచుకున్నాను. ఇంకో విషయం, బాబా కొత్త ప్రదేశంలో హాస్టల్‌లో నాకు తోడును కూడా ఏర్పాటు చేసారు. నేను చేరిన ఇన్స్టిట్యూట్‌లోనే కోచింగ్ తీసుకుంటున్న ఒక అమ్మాయి నేను ఉన్న హాస్టల్లోనే చేరింది. ఇలా అన్నీ విధాలా నాకేం అవసరమో నేను అడగకనే బాబా తీరుస్తున్నారు.

ఇంకో చిన్న అనుభవం చెప్పి సెలవు తీసుకుంటాను. మా అమ్మానాన్న నన్ను హాస్టల్లో చేర్పించి, వాళ్ళు వారం రోజులు శిరిడీలో ఉందామని వెళ్లారు. నేను లేకుండా వాళ్ళు శిరిడీ వెళ్లడం ఇదే మొదటిసారి. అందువల్ల నాకు వాళ్ళు అక్కడ ఎలా ఉంటారో అని దిగులుగా అనిపించింది. అయినా వాళ్ళు వెళ్ళింది ఎక్కడికి? బాబా తండ్రి దగ్గరికి. అందుకని, "వాళ్ళ శిరిడీ యాత్ర ఏ ఇబ్బందులు లేకుండా వారం రోజులు హాయిగా గడిపి క్షేమంగా ఇంటికి చేరుకునేలా చూడమ"ని బాబాని వేడుకున్నాను. బాబా అనుగ్రహంతో వాళ్ళు శిరిడీలో వారం రోజులు మంచిగా పారాయణ చేసుకొని క్షేమంగా ఇల్లు చేరారు. శిరిడీ నుండి వచ్చిన రెండు రోజులు తర్వాత నాన్నకి గాణ్గాపూర్ వెళ్లి గురుచరిత్ర పారాయణ చేసుకోవాలనిపించి ట్రైన్ టికెట్లు బుక్ చేసారు. నాకు వాళ్ళు శిరిడీయాత్రతో అలసి ఉంటారేమో! మళ్ళీ ఇప్పుడు గాణ్గాపూర్ ఎలా వెళతారనిపించింది. అంతలోనే బాబానే వాళ్ళకి ఆ ప్రేరణ ఇచ్చినపుడు, వాళ్ళ ఆరోగ్యం, బాగోగులు ఆయనే చూసుకుంటారనినుకొని వాళ్ళ గాణ్గాపూర్ యాత్ర కూడా బాగా జరిగి క్షేమంగా ఇల్లు చేరాలని సాయినాథుడ్ని వేడుకున్నాను. బాబా నా ప్రార్ధనలను మన్నించి వాళ్ళ గాణ్గాపూర్ యాత్ర బాగా జరిపించి క్షేమంగా ఇల్లు చేర్చారు. "బాబా! మీ మార్గనిర్దేశనంలో జీవితంలో ప్రతిదీ ఇలాగే జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తండ్రీ".

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!

అడిగినంతనే బాడుగ ఇప్పించిన బాబా

నా పేరు జ్యోతిర్మయి. మాది నెల్లూరు. మాకు ఒక కారు ఉంది. దాన్ని ట్రావెల్స్‌కి తిప్పుతాము. 2024, జూలై 11 నుంచి ఒక వారం బాడుగలు రాలేదు. దిష్టి తగిలిందని దిష్టి తీసాము. అయినా బాడుగలు రాలేదు. జూలై 18, గురువారంనాడు నేను బాబాకి పూజ చేస్తూ, "బాబా! ఈరోజు బాడుగ రావాలి తండ్రీ" అని బాబాకి చెప్పుకున్నాను. ఒక గంట తరువాత మా వారికీ, "నెల్లూరు వెళ్లాల"ని ఫోన్ వచ్చింది. బాబాకి మన ఆలోచనలన్నీ తెలుసు. మనకి ఏది మంచిదో అది ఇస్తారు. "ధన్యవాదాలు బాబా. నాకు చాలా కోపం ఉండేది. మీకు దగ్గరయ్యాక 60% తగ్గింది. మిగిలిన ఆ కోపాన్ని కూడా తగ్గించు బాబా". 

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo