1. బాబా దయవలన కంటిచూపు
2. బాబా దయ
బాబా దయవలన కంటిచూపు
బాబా, గురువుగారి(సాయినాథుని శరత్ బాబూజీ) పాదపద్మములకి నా సాష్టాంగ నమస్కారములు. సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు ధనలక్ష్మి. 2009లో హఠాత్తుగా మావారి కంటిచూపులో తేడా వచ్చింది. 'చూపు మందగించడంతోపాటు గీతలు కనిపిస్తున్నాయ'ని మావారు అన్నారు. మేము మాకు దగ్గరలో ఉన్న ఒంగోలు వెళ్లి, అక్కడ అరవింద్ కంటి హాస్పిటల్‌లో చూపిస్తే, డాక్టరు చెక్ చేసి, "కంటిలో సమస్య ఉంది. అర్జెంట్‌గా మధురై వెళ్ళండి" అన్నారు. అది విని నాకు చాలా భయమేసి, "బాబా! మాకేంటి ఈ పరిస్థితి? మాకు చిన్నపిల్లలున్నారు. ఈ సమయంలో ఇలా అయిందేంటి?" అని ఏడ్చాను. మా నాన్నకి ఫోన్ చేసి, విషయం చెప్తే, "బాబా, గురువుగారు ఉన్నారు. ఏమీ కాదు" అని నాకు ధైర్యం చెప్పి, "నేను మధురై తీసుకెళ్తాను" అని అన్నారు. తర్వాత ఒకరోజు నాన్న మావారిని తీసుకొని ముందుగా అరుణాచలం వెళ్లి, అక్కడ గురువుగారి దర్శనం చేసుకొని, గిరిప్రదక్షిణ కూడా చేసుకొని ఆపై మధురై వెళ్లారు. అక్కడ డాక్టర్ చెక్ చేసి లేజర్ చికిత్స చేసి, మందులిచ్చి పంపించారు. తరువాత కూడా 3 సార్లు మధురై వెళ్లొచ్చారు. కానీ అక్కడికి వెళ్లి రావడం ఇబ్బందిగా ఉండేది. ముఖ్యంగా భాష సమస్యగా ఉండేది. మాకు ఏం చేయాలో అర్దం కాలేదు. అటువంటి స్థితిలో తెలిసినవాళ్ళు ఒకరు, "హైదరాబాద్‌లో ఎల్‌వి ప్రసాద్ కంటి హాస్పిటల్ వుంది. రేషన్ కార్డు ఉంటే అక్కడ ఉచితంగా చూస్తారు" అని అన్నారు. బాబా అనుగ్రహం ఏమిటంటే, నెల రోజుల ముందే మాకు రేషన్ కార్డు వచ్చింది. ఒకరోజు మా తమ్ముడిని తీసుకొని మావారు హైదరాబాద్ వెళ్లారు. అక్కడ డాక్టర్లు చెక్ చేసి నెల రోజులకి మందులిచ్చారు. అలా నాలుగు నెలలు వెళ్ళటం, మందులు తీసుకొని రావటం జరిగాక మర్నాడు మళ్ళీ చెకప్ కోసం వెళ్లాల్సి ఉన్నప్పుడు మావారు, "కంట్లో ఏదో తేడాగా ఉంది" అని అన్నారు. నేను, "ఎలాగూ రేపు వెళ్తున్నారు కదా! మీరేమీ టెన్షన్ పడకండి. మనకి బాబా, గురువుగారు ఉన్నారు" అని చెప్పాను. సరేనని మరుసటిరోజు హాస్పిటల్‌కి వెళ్ళారు .అక్కడ చెక్ చేసి, "వెంటనే ఆపరేషన్ చేయాలి" అన్నారు. మా తమ్ముడు నాకు ఫోన్ చేసి, "బావకి అర్జంట్‌గా ఆపరేషన్ చేయాలన్నారు" అని చెప్పాడు. అయితే ఆపరేషన్ చేసినా చూపు గ్యారంటీ లేదని, చేయించకపోతే భవిష్యత్తులో ఇబ్బంది వస్తుందని కూడా డాక్టర్లు అన్నారు. అయినా మనకి బాబా, గురువుగారు ఉన్నారు, ఏమీ కాదని ఆపరేషన్ చేయించాము. బాబా, గురువుగారు దయవలన అపరెషన్ బాగా జరిగి మర్నాడు మావారిని ఇంటికి పంపించారు. ఆయన ఇంటికి వచ్చాక, ఆయనకి చేసింది చాలా పెద్ద ఆపరేషన్ అని తెలిసింది. ఎలా అంటే, ఆయన 25 రోజులు బోర్లా పడుకుని ఉండాలి. బాత్‌రూమ్‌కి వెళ్ళడానికి, ఆహారం తినడానికి, మందులు వేసుకోవడానికి మాత్రమే లేవాలి. మిగతా సమయమంతా మంచం మీద పడుకొనే ఉండాలి. ఊహించుకుంటే భయమేసింది, చాలా బాధేసింది. కానీ ఏం చేస్తాం? మన ప్రారబ్ధం మనమే అనుభవించాలి అనుకున్నాము. మావారిని చూడటానికి వచ్చిన వాళ్ళలో ఒక ఆమె, "ఇది చాలా పెద్ద ఆపరేషన్. ఎంత ఖర్చు అయింది" అని అడిగింది. మేము, "ఆపరేషన్ ఉచితంగా చేశారు. మందులు, చార్జీలకు 10 వేలదాకా ఖర్చు అయింది" అని చెప్పాము. అప్పుడు ఆమె, "ఇదే ఆపరేషన్ మా వియ్యంకుడికి చేశారు. బెడ్ మీద లక్ష రూపాయలు తీసుకున్నారు. పైన కూడా చాలా ఖర్చు అయింది" అని చెప్పింది. ఆ మాట వినటంతో నా కళ్ళ నుండి నీళ్ళు ఆగలేదు. నిజంగా బాబా, గురువుగారు మాయందు లేకపోతే మా పరిస్థితి ఎలా ఉండేదో అనుకున్నాము. ఎందుకంటే, ఒక్క నెల రోజుల ముందే మాకు రేషన్ కార్డు వచ్చింది. అదేగనక రాకపోయుంటే మాకు కూడా చాలా ఖర్చయ్యేది.
ఆ కష్ట సమయంలో మా పిల్లలు చిన్నవాళ్ళు. వాళ్ళని స్కూలుకి పంపటం, మావారిని చూసుకుంటూ సమయానికి ఆహారం పెట్టటం, మందులు వేయించటం, మాకున్న షాపుకి వెళ్లి బిజినెస్ చూసుకోటం అన్నీ ఓపికగా చేసుకొనేదాన్ని. ఇంట్లో ఒక మనిషికి బాగాలేకపోతే వాళ్ళని చూసుకోవడానికి భయమేస్తుంది. అలాంటిది నాకు ధైర్యాన్ని, ఓపిక, సహనం అన్నీ ఇచ్చి బాబా, గురువుగారు నా కుటుంబాన్ని నిలబెట్టారు. కొన్నిరోజులకి మావారు చెకప్‌కి హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్, "మీ యందు దైవం ఉన్నారు. లేకుంటే నీకు చూపు రావటం చాలా కష్టం. నీ చూపుకి ఇక ఎటువంటి ఇబ్బందీ లేదు. సంతోషంగా ఉండు" అని అన్నారు. ఆ తరువాత ఒకసారి మాకు దగ్గరలో ఉన్న ఒంగోలు వెళ్లినప్పుడు హాస్పిటల్‌కి వెళ్లి చెక్ చేయిస్తే, 'ఆపరేషన్ చేసిన కన్ను ఏది?' అని వాళ్ళు అడిగారు. అంటే అంతలా కంటిచూపు వచ్చింది(2018లో అదే కంటికి శుక్లం వచ్చింది. మళ్లీ హైదరాబాద్ వెళ్లి ఆపరేషన్ చేయించాము. అప్పుడు కూడా ఉచితంగానే ఆపరేషన్ చేశారు). బాబా, గురువుగారి దయవలనే మావారికి చూపు బాగా వచ్చింది. ఇంక ఏ సమస్య లేదు. ఇప్పటికి 15 సంవత్సరాలైంది. బాబా, గురువుగారి దయవలన సంతోషంగా ఉన్నాము. ఇంతగా మా కుటుంబాన్ని కనిపెట్టుకొని ఉన్న మా సద్గురుదేవులు, మాకు తల్లి, తండ్రి అయినటువంటి శ్రీసాయినాథ్ మహారాజ్ కి జై! శ్రీసాయినాథుని శరత్ బాబూజీ కి జై!!!
బాబా దయ