సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తి సాధన రహస్యం - ఆలయ నిర్మాణంలో అసలైన ఆగమసూత్రాలు!


ఆలయ నిర్మాణంలో అసలైన ఆగమసూత్రాలు!

సమాజంలో ఆస్తికత అడుగంటి పోతున్నదని, దైవభక్తి క్షీణిస్తున్నదని ఒకప్రక్కన దైవచింతనగలవారు మహామథనపడిపోతుంటే, మరోప్రక్క పల్లెపల్లెలా దేవాలయాలు, వాడవాడలా మందిరాలు లెక్కకుమించి పుట్టుకొస్తూండడం, వాటిలో కొన్ని మరీ మహిమగల దేవాలయాల ఆదాయం అంతులేకుండా పెరిగిపోతూండడం చూస్తుంటే, ‘నిజంగా సమాజంలో దైవభక్తి క్షీణించడంలేదేమో!’ ౼ నన్న అనుమానం రాకమానదు.

తనకు ఆలయాలు కట్టించమని దేవుడు దేబిరించలేదు! దేవాలయాల నిర్మాణం ముక్తికి తిరుగులేని మార్గమని శాస్త్రాలు ఘోషించడమూలేదు. అయినా క్రొత్త దేవాలయాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. పాత దేవాలయాలు దీపం పెట్టే దిక్కులేక పాడుపడిపోతూనే ఉన్నాయి. ఆలయనిర్మాణానికి ఖర్చుపెట్టిన డబ్బు చిత్రగుప్తుని చిట్టాలో పుణ్యం క్రింద (పెద్ద అక్షరాలతో) జమ అవుతుందనే విశ్వాసం, తాము పెట్టుబడి పెట్టిన దేవాలయం నిలిచి ఉన్నంతవరకు అజరామరమైన కీర్తితో పాటుగ జమ అయిన పుణ్యం తాలుకు వడ్డీ కూడా తమకు ముట్టుతూంటుందనే ఆశ – సామాన్యంగా దేవాలయనిర్మాణానికి ప్రేరకాలు. తన ఇష్టదైవం మీద ప్రీతితోకానీ ఆ దైవం ఏవో తన కోరికలు తీర్చినందుకు కృతజ్ఞతతోగానీ ఎవరైనా మనఃస్ఫూర్తిగా ఆలయనిర్మాణానికి సంకల్పించినా, ఆ ఆలయనిర్మాణానికి ధనకనకవస్తురూపంలో వచ్చిపడే సహకారం వెనుకైనా పైచెప్పిన ప్రేరణ సామాన్యంగా దర్శనమిస్తుంది. అటువంటి ప్రేరణలో నుండి ఉద్భవించి, ధనికస్వాములు (తమ ఆదాయపు పన్ను మినహాయింపు కోసం) విదిలించిన నల్లడబ్బుతో కట్టబడ్డ అలాంటి దేవాలయాలు ఈ కలిలోని పాపాల రూపాలుగా మన కళ్ళముందు నిలుస్తున్నాయి!

ఆలయనిర్మాణంవల్ల ఒనగూడే పుణ్యాన్ని మాత్రమే వాటి నిర్మాతలు చూస్తున్నారు కానీ, ప్రజలలో సరైన ధార్మికచింతన, దైవభక్తి (భయంకాదు!) సరైన జీవితపు విలువల సాధన, అలా కట్టిన దేవాలయాల నిర్వహణ ధర్మబద్ధంగా జరుగకపోతే అది యెంత ఘోరమైన దోషమోనన్న విషయం మనం గుర్తించడం లేదు. అతిథిని ఇంటికి ఆహ్వానించి, ఆ అతిథి రాగానే అతడ్ని పట్టించుకోక అశ్రద్ధచేయడం వంటి అకృత్యమిది. ఆలయంలోకి దైవాన్ని ఆవాహనచేసి (ప్రాణప్రతిష్ఠచేసి) ప్రతిష్ఠించి, తరువాత ఆ దైవకార్యంపట్ల శ్రద్ధవహించకపోవడం దైవధిక్కారమే అవుతుంది; ‘దేవాలయంలో దీపం ఆర్పడమే’ అవుతుంది!

ఈ అనర్థానికి అసలు కారణం దేవాలయమంటే కేవలం దేవునికి కట్టించిన నివాసమేననే దురవగాహన, దేవాలయాతత్త్వాన్ని గురించి మహాత్ములు చెప్పిన సత్యాలు మరుగున పడడమూ కారణాలని తోస్తుంది. స్థూలమైన విశ్వానికి (macrocosm) సూక్ష్మరూపం (microcosm) వ్యక్తి. అయితే, యీ స్థూల-సూక్ష్మరూపాల ‘స్వ’రూపం మాత్రం ఒక్కటే. ఈ ‘అద్వైత’ స్వరూపాన్ని మనచే దర్శనం చేయించేవి ఋషిప్రోక్తాలయిన నిగమాగమాలు. వ్యష్ఠి రూపుడైన (individual consciousness) జీవుని, సమిష్ఠి రూపుడయిన (collective consciousness) ఈశ్వరునితో అనుసంధానంచేసే ప్రక్రియే యజ్ఞం. వేదసంస్కృతిలో ప్రధానపాత్రవహించిన యజ్ఞవాటికలు కాలాంతరంలో దేవాలయాలుగా రూపుదిద్దుకున్నాయి. పైన వివరించిన యజ్ఞానికి దేవాలయం సంజ్ఞారూపం. మానవుని మూలప్రకృతి ఏ కాలంలోనయినా ఒక్కటే. కనుక వ్యక్తి తన ప్రకృతిని ఏ విధంగా సంస్కరించుకొని బాహ్యజగత్తుతో సామరస్యంగా మనగలడో నిర్దేశించే మౌళికసూత్రాలు కూడా మారనివే.

ఈ అంతర్దర్శనాన్ని సాధించడానికి అవసరమైన మానవధర్మాలను, సాధనాలను ప్రబోధించే కేంద్రాలుగా దేవాలయాలు ఏర్పడ్డాయి. అందుకనే మునుపు ఆచార్య పీఠాలుగా, ఘటికాస్థానాలుగా (universities), ధర్మజిజ్ఞాసకు వేదికలుగా దేవాలయాలు వెలుగొందాయి. కాలక్రమేణా సమాజంలో తాత్త్విక జిజ్ఞాస అవగాహన కొరవడడంతో, దేవాలయాలు ఆయా ఆలయ అధిష్ఠాన దేవతలకు కేవలం అర్చనాకేంద్రాలుగా మారిపోయాయి. ఆచార్యులు అర్చకులయ్యారు. ఆచార్యపీఠాలు దేవతార్చన ‘పీటలు’గా మారిపొయ్యాయి. జిజ్ఞాసువులకు ముముక్షువులకు ‘ఆశ్రమాలు’ గా వెలుగొందిన దేవాలయాలు క్రమంగా కేవలం ఆర్తులకు అర్థార్థులకు ఆశ్రయాలయ్యాయి.

ఆలయనిర్మాణం చేబట్టే ముందు, ఆలయం నిర్మించబోయే ప్రదేశంలో మహాత్ముల చరిత్రల పఠనము, పవిత్ర ఆధ్యాత్మిక ధార్మిక గ్రంథాల అధ్యయనము, మహాత్ముల ఆశీస్సులు, సామూహిక జపధ్యానాలు కొంత కాలం పాటు జరగాలి. నిత్య సత్సంగ స్వాధ్యాయ ప్రవచనాలపట్ల ఆ ప్రాంతంలోని స్థానిక ప్రజలకు శ్రద్ధాసక్తులు కలగాలి. అలా జరుగుతూంటే క్రమంగా ఆ కేంద్రమే దేవాలయంగా పరిణతి చెందుతుంది. ఇది సాధించకుండా, దేవాలయ నిర్మాణానికి పూనుకొని, చందాలు దండిగా దండి, దండగజేయడం నిషిద్ధకార్యమే అవుతుంది. ఇదే ఆగమశాస్త్రాల్లో ఆలయనిర్మాణానికి ముందు చేయవలెనని చెప్పబడ్డ ‘స్థలశోధన’ ‘స్థలశుద్ధి’ లలోని ఆంతర్యం.

స్థూలమైన విశ్వానికి (macrocosm) అంటే విరాట్ స్వరూపానికి సూక్ష్మరూపం (microcosm) వ్యక్తియనీ, యీ రెండింటి యొక్క సమన్వయస్వరూపాన్ని దర్శింపజేసే సాధనం దేవాలయమనీ ఇంతకు మునుపు చెప్పుకున్నాం. అందువల్లనే వ్యక్తియొక్క దేహము, జీవప్రకృతికి ప్రతీకగా ఆలయనిర్మాణం కూడా సాగింది. “దేహోదేవాలయప్రోక్తః జీవోదేవస్సనాతనః” 'దేహమే దేవాలయం; అందులోని జీవుడే దేవుడు అని భావించి పూజించు' అని తమ ‘ఆత్మపూజ’ గ్రంథంలో శ్రీఆదిశంకరులు ప్రవచించారు. మానవ దేహనిర్మాణానికి ప్రకృతికి ప్రతీకగా దేవాలయాన్ని ఎలా నిర్మించాలనే సూత్రాలను చెప్పేందుకు దేవాలయ వాస్తు పుట్టింది. ఈ సత్యాన్నే “నరప్రాస్తారమితి తద్వాస్తు ప్రస్తార మిత్యపి” అని ఆ శాస్త్రమే చెబుతున్నది.

వ్యక్తి తనలోని రాగద్వేషాదులను శోధించి, అలా శుద్ధిచేయబడ్డ అంతరంగంలో అస్తవ్యస్తంగా పడివున్న తన హృదయవాసనలనే చంద్రశిలలను ఆగమసూత్రాల కనుగుణంగా తీర్చి పేర్చి నిర్మించిన హృదయమందిరంలో భగవంతుడు ఆనందంతో నర్తిస్తాడు. మనం నిర్మింప తలపెట్టిన బాహ్యమందిరం ఈ హృదయమందిరాన్ని ప్రతిబింబించే తత్త్వమయ నిర్మాణం కావాలి! అప్పుడే, “బింబాన మాభిరూపాచ్చ దేవాః సాన్నిధ్యమిచ్ఛతి” (అంటే, ‘బింబ సౌందర్యానికి, లక్షణాలకు అనుగుణంగా దేవతలు తమ సాన్నిధ్యాన్ని ఇవ్వగోరుతారు’) అన్న ఆగమశాస్త్రప్రామాణ్యం ౼ ఆధ్యాత్మికార్థంలో ౼ సిద్ధిస్తుంది.

తనపట్ల, దైవంపట్ల, సాటి మానవులపట్ల సరైన అవగాహనను సమాజంలో కల్పించడానికి ప్రయత్నించక ఆలయాలు నిర్మిస్తే ఆ దేవాలయ రాతి కట్టడాలు స్వార్థంతో కరుడు గట్టిన మనిషి హృదయాలకు ప్రతీకలుగా మాత్రమే నిలుస్తాయి. ఉన్నతసంస్కారాలనే విద్యాప్రణాళికతో ఆత్మవిద్యకు బళ్ళుగా మన పెద్దలు రూపొందించిన యీ గుళ్ళు, కులాల కుళ్ళుకు మతాల మళ్ళకు లోగిళ్ళు కారాదు! మేలుకొలుపు-బాలభోగం దగ్గరనుండి, ఆరగింపు-పవళింపు సేవలదాకా షోఢశోపచారాలు ‘జరిపించడం’ మాత్రమే కాదు దైవంపట్ల శ్రద్ధ వహించడమంటే! దైవం ధర్మస్వరూపం. స్వాధ్యాయప్రవచనాలతో కూడిన ధర్మప్రచారానికి సంస్కరణకు దేవాలయం సాధనం కావాలి.

లేకపోతే, యీనాడు మనం చూస్తున్నట్లు, దేవాలయాలు ధనికస్వాముల అధికారపాటవ ప్రదర్శనశాలలుగా, కుళ్ళు కులతత్వపు కురుక్షేత్రాలుగా, అసంతృప్త ముఠారాజకీయవాదుల అధికార పునరావాస కేంద్రాలుగా, వినోదయాత్రాస్థలాలుగా, మూఢాచారాల మత్తుమందునందించే ‘మతం’ బ్రాండు పానశాలలుగా, శృంగార సినీగీతాల ‘జ్యూక్ బాక్సులు’గా, పెళ్ళిమంటపాలుగా, మొక్కుబళ్ళు తీర్చే క్షౌరశాలలుగ మారక తప్పవు! అందుకే అన్నాడు వేమన: “దేవళములోను తీర్థంబులందును మూలమెరుగకున్న ముక్తి లేదు!” ౼ అని. వేమన యోగీంద్రుని యీ మాట ౼ ఆగమశాస్త్రాల తేట!

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 573వ భాగం.....


ఈ భాగంలో అనుభవం:

  • బాబా ప్రసాదించిన కొన్ని మధురానుభవాలు

సాయిభక్తురాలు శ్రీమతి లలిత తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

నా మొదటి అనుభవం:

మా ఆఫీసులో ఒకరోజు గీత అనే సాయిభక్తురాలు శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకుని, తిరిగి వచ్చేటప్పుడు శిరిడీ నుండి ‘సాయిలీలామృతం’ పుస్తకం తీసుకొచ్చి నాకు ఇచ్చింది. అంతకుముందే నేను శ్రీగురుచరిత్ర పారాయణ చేశాను. సాయిలీలామృతం మొదటిసారి చదివినప్పుడు నేను పూర్తిగా గందరగోళంలో పడ్డాను. ఎందుకంటే, నేను ఆంజనేయస్వామి భక్తురాలిని. సాయిలీలామృతం చదివాక ‘నేను బాబాను పూజించాలా? లేక ఆంజనేయస్వామిని పూజించాలా?’ అనే సమస్యతో తికమకపడ్డాను. ఆ తరువాత ఒకరోజు నేను మా చెల్లెలింటికి వెళ్ళినప్పుడు రెండవసారి సాయిలీలామృతం పారాయణ చేశాను. పారాయణ చేస్తుండగా, “ఇంకా నన్ను నమ్మవా? నేను వేరు, ఆంజనేయస్వామి వేరు కాదు” అని ఆ పుస్తకంలో వ్రాతపూర్వకంగా ఉండటం కనిపించింది. ఆ తరువాత నేను మళ్ళీ సాయిలీలామృతం చదివాను. కానీ ఆ ఉదయం ఏ పేజీలోనైతే ఆ వాక్యాలు చదివానో ఆ వాక్యాలు ఈసారి చదువుతున్నప్పుడు అక్కడ కనిపించలేదు. నా కోసమే ఆరోజు ఉదయం బాబా ఆ వాక్యాలను నాకు కనిపించేలా చేశారని భావించాను. అప్పటినుండి నా జీవితం బాబాకు అంకితమైంది. నేను పూర్తిగా బాబా భక్తురాలినయ్యాను. ఇంకా బాబా నాకు ఎన్నోచాలా లీలలు చూపించారు.

రెండవ అనుభవం:

ఒకసారి నేను శ్రీసాయిసచ్చరిత్ర పారాయణ చేస్తున్నాను. ఆరోజు పారాయణ చివరిరోజు. ఆరోజు కలలో నేను చూసిన ప్రదేశం ఎక్కడో ఏమో తెలియదుగానీ నాకు మాత్రం అది నాకు బాగా తెలిసిన ప్రదేశమని అనిపించింది. ఆ ప్రదేశంలో బాబా గుడి ఉంది. ఆ గుడిలోని బాబా విగ్రహం అచ్చం శిరిడీ సమాధిమందిరంలోని బాబా విగ్రహంలానే ఉంది. ఆ గుడి ప్రక్కన నేను మట్టి త్రవ్వుతూ ఉన్నాను. మట్టి త్రవ్వుతూ ఉంటే బంగారునాణేలు వస్తూనే ఉన్నాయి. ‘ఆ బంగారునాణేలను ఎవరికివ్వాలా?’ అని ఆలోచించాను. ముందు మావారికి ఇవ్వాలనుకున్నాను. తరువాత మా అన్నయ్యకు ఇవ్వాలని అనుకున్నాను. చివరికి ‘ఎవరికీ ఇవ్వద్దు’ అనుకుని అన్ని బంగారునాణేలనూ తీసుకెళ్ళి బాబా గుడిలో ఉన్న హుండీలో వేశాను.

మూడవ అనుభవం:

బాబాతో నా అనుబంధాన్ని మొదట నేను గుర్తించలేదు. అయితే ఒకరోజు నన్ను పారాయణ చేయమని మా ప్రక్కింటి ఆంటీ శ్రీసాయిసచ్చరిత్ర పుస్తకం ఇచ్చింది. సరేనని సచ్చరిత్ర పారాయణ ప్రారంభించాను. మధ్యలో ఒకరోజు ఆంటీ నన్ను, ‘సచ్చరిత్ర చదువుతున్నావా?' అని అడిగింది. ‘చదువుతున్నాన’ని చెప్పాను. ఆవిడ, “రెండు రూపాయల దక్షిణ లీల చదివావా?” అని అడిగింది. చదివానని చెప్పాను. అప్పుడు ఆవిడ, “అది చదివినప్పుడు బాబా నాకు కలలో రెండు రూపాయలు ఇచ్చారు. అప్పటినుండి నేను రెండు రూపాయలు పూజలో పెట్టుకుని ప్రతిరోజూ పూజించుకుంటున్నాన”ని చెప్పింది. అదేరోజు నేను, మా చిన్నబ్బాయి హాస్పిటల్ కి వెళ్ళేటప్పుడు బాబా గుడికి వెళ్ళి బాబాకు నమస్కరించుకున్నాము. నేను బాబాను, “బాబా! మీరు నాకెందుకు రెండు రూపాయలు ఇవ్వలేదు? నేను సరిగా పారాయణ చేయట్లేదా?” అని ఆర్తిగా అడిగాను. మా అబ్బాయి దేవుడ్ని నమ్మడు. మేమిద్దరం బస్టాప్ కి వెళ్ళాము. అంతలో నా మనసు చెప్తోంది, ‘అక్కడ రెండు రూపాయలు ఉన్నాయ’ని. నేను మా బాబుతో, “అక్కడ మట్టి తీయి, రెండు రూపాయలు ఉంటాయ”ని చెప్పాను. మా బాబు అక్కడి మట్టిని తీశాడు. అక్కడ రెండు రూపాయల నాణెం ఉంది. ఆ నాణేన్ని తీసి నాకు ఇచ్చాడు. నేను ఆ నాణేన్ని జాగ్రత్తగా ఉంచమని మా అబ్బాయి జేబులో వేసి ఉంచాను. దానిని బాబా ప్రసాదంగా భావించి ఇంటికి వచ్చిన తర్వాత బాబా పూజలో పెట్టి రోజూ పూజ చేస్తున్నాను.

నాలుగవ అనుభవం:

నేను మా ఇంటి దగ్గరున్న బాబా గుడికి ప్రతిరోజూ వెళ్తుంటాను. బాబా నా చేత ప్రతిరోజూ సేవ చేయించుకుంటున్నారు. నాతో పాటు మరో ముగ్గురు కూడా బాబా సేవకు వచ్చేవాళ్ళు. ఒకరోజు వాళ్ళు నాతో, “బాబా మాకు తరచూ కలలో కనిపించి మాట్లాడుతుంటార”ని చెప్పారు. బాబా నాకు కూడా కలలో కనిపించినప్పటికీ, కూర్చుని నన్ను చూస్తారే తప్ప నాతో ఎన్నడూ కలలో మాట్లాడలేదు. దాంతో నాకు చాలా బాధగా అనిపించి బాబాను చూస్తూ, “బాబా! మీరు నాతో ఎందుకు మాట్లాడట్లేదు? నేనేం పాపం చేశాను?” అని అడుగుతూ గుడిలోనే ఏడ్చేశాను. అదేరోజు రాత్రి 3 గంటలకు మా చిన్నబాబుకి కలలో బాబా కనిపించి,అభిలాష్! మీ మమ్మీకి నేను మాట్లాడానని నా మాటగా చెప్పు!” అని చెప్పారట. వాడు వెంటనే లేచి, “మమ్మీ, మమ్మీ, బాబా నాకు కలలో కనిపించారు. తాను మాట్లాడినట్లు నీతో చెప్పమన్నారు” అని నాతో చెప్పాడు. మా బాబు ఆ విషయం చెప్పగానే నేను వాడితో, “చూశావా? నేను ఈరోజు ప్రొద్దున గుడిలో బాబా నాతో మాట్లాడటం లేదని ఏడ్చాను. బాబా నీకు కనిపించి నీతో మాట్లాడారు” అన్నాను. ఆరోజు నుంచి మా బాబు బాబా భక్తుడయ్యాడు.

ఐదవ అనుభవం:

బాబా మమ్మల్ని ఇప్పటివరకు సర్వకాల సర్వావస్థలయందు కాపాడుకుంటూ వస్తున్నారు. 2020, ఆగస్టు నెలలో జరిగిన ఒక అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను. మా ఇంటి ప్రక్కన ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు. వాళ్ళ టాయ్ లెట్, మా టాయ్ లెట్ ప్రక్కప్రక్కనే ఉంటాయి. మా టాయ్ లెట్ కి వెళ్ళటానికి మేము వాళ్ళ ఇంటిముందు నించే వెళ్ళాలి. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ విషయం వాళ్ళు మాకు చెప్పలేదు. కానీ తెలిసాక మాకు చాలా భయమేసింది. అయినప్పటికీ మాకు తోడుగా బాబా ఉన్నారనే ధైర్యంతో ఉన్నాము. బాబా మనల్ని ఎప్పుడూ కనిపెట్టుకొనే ఉంటారు. రానున్న కష్టాన్ని ముందుగానే పసిగట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటారు. కరోనా పాజిటివ్ రావటానికి 15 రోజుల ముందు నుండి మా పక్కింటి వాళ్ళు ఎందుకోగాని మాతో మాట్లాడటం మానేశారు. ఒకవేళ వాళ్ళు మాతో మాట్లాడుతూ ఉండుంటే గనక ప్రతిరోజూ ఆయన ఫోన్ గురించి తెలుసుకోవడానికి మా అబ్బాయి దగ్గరకు వచ్చేవారు. అలా వచ్చినప్పుడు ఆయన మా అబ్బాయితో చాలా సన్నిహితంగా ఉండి ఫోన్ గురించి అన్నీ అడుగుతుండేవారు. అసలే కరోనా రోజులు. అయినప్పటికీ ఆయన ఎప్పుడూ మాస్క్ పెట్టుకోకుండానే మాట్లాడుతుండేవారు. ముందుజాగ్రత్తగా మాస్క్ పెట్టుకుని మాట్లాడమని ఎన్నోసార్లు ఆయనకు చెప్పాలనిపించేది కానీ, మొహమాటంతో చెప్పలేకపోయేదాన్ని. ఆయనకి కరోనా వచ్చే 15 రోజుల ముందు నుంచి మా దగ్గరకు రావడం మానేశారు. బాబా దయవల్ల మాకు చాలా మేలు జరిగింది. అందుకే మనం చేసే ప్రతి చర్యా బాబా ఆజ్ఞతోనే జరుగుతుందని మేము అనుకుంటాము. బాబా మాకు ఏది మంచో అదే చేస్తారు. అంటే, ఏ కారణం లేకుండా ఎదుటివాళ్ళు మాతో మాట్లాడకపోవటం వలన కూడా మాకు మంచే జరిగింది. మేమంతా బాబా మీదనే భారం వేశాము. మాకు తల్లి, తండ్రి, గురువు, దైవము, తోడు, నీడ, సర్వం సాయియే.

ఆరవ అనుభవం:

ఇది జరిగిన 5 రోజుల తరువాత మా ఊరిలో ఒక వారం రోజుల పాటు ప్రతిరోజూ వర్షం పడింది. ఆ వర్షానికి మా ఇంటి గోడలు మొత్తం తడిసిపోయి గోడలన్నీ తేమగా అయ్యాయి. మా ఇంట్లో మాత్రమే అలా జరిగిందేమో అనుకున్నాము. కానీ, మా పొరుగింటివాళ్ళు కూడా వాళ్ళింటి గోడలు కూడా వర్షాలకు తడిసి తేమగా అయ్యాయనీ, ఆ ప్రభావం వల్ల వాళ్ళింట్లో కరెంట్ ఫ్యూజు ఎగిరిపోయిందనీ, ఎన్నిసార్లు కరెంట్ ఫ్యూజ్ పెట్టినా ఉండట్లేదనీ, గోడలు ముట్టుకుంటే షాక్ కొడుతోందనీ చెప్పారు. నేను ప్రతిరోజూ బాబా నామం జపిస్తూనే ఉంటాను. బాబా మాకు ఏ సమస్యా రాకుండా కాపాడారు. ఎల్లప్పుడూ ఇలాగే మమ్మల్ని కాపాడుతూ ఉండాలని బాబాను మనసారా వేడుకుంటున్నాను. సాయిరాం, సాయిరాం, సాయిరాం. బాబా గురించి ఎంత చెప్పినా తనివితీరదు. ఆనందమే ఆనందం. నేను బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత బాబా చెప్పిన పలుకులను మననం చేసుకుంటూ ఉండటం వలన నాకు కష్టాలు వచ్చినా నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటున్నాను. బాబా నాకు శక్తిని, మనశ్శాంతిని, ధైర్యాన్ని ఇచ్చారు.



సాయిభక్తి సాధన రహస్యం - ధ్యానానికి ఏ ఆసనం మంచిది? అసూయను జయించడం – అంత సులువా?




ధ్యానానికి ఏ ఆసనం మంచిది? 
అసూయను జయించడం – అంత సులువా?

శ్రమలేకుండా ఎక్కువసేపు స్థిరంగా ఏ పద్ధతిలో కూర్చొనటానికి అనుకూలమో, ఆ కూర్చొనే పద్ధతే ఆసనమంటే! ధ్యానానికి ‘ఫలానా’ ఆసనం శ్రేష్ఠమైనదనో, ‘ఫలానా’ ఆసనంలో కూర్చొని జపధ్యానాలు చేస్తే ‘ఫలానా’ సిద్ధి వస్తుందనో, ‘వెన్నెముక, మెడ, తల ఒకే సమరేఖలో వుండాలి’ అనే యోగశాస్త్రనియమాన్ని సాధించాలనో, ధ్యానం చేసుకునేప్పుడు ఆసనం మార్చకూడదనే భావంతోనో ౼ ఆసనాభ్యాసం పేర శరీరాన్ని బలవంతపెట్టడం మంచిదికాదు! శరీరం గూనిగా వంగిపోకుండా, పట్టు బిగింపు శ్రమ లేకుండా ఎక్కువసేపు ఎలా కూర్చొనగలమో చూచుకొని, ఆ ఆసనాన్ని (కూర్చునే పద్ధతిని) మన ధ్యానానికి ఎంపిక చేసుకోవాలి. మరోవిధంగా చెప్పాలంటే ఫలానా పద్ధతిలో కూర్చుని వున్నామనిగాని, అసలు కూర్చుని వున్నామని గాని స్ఫురణకు రాకుండా వుండే ఆసనమే అన్నింటిలోకి ఉత్తమమైన ఆసనం. ధ్యానం మధ్యలో ఒకవేళ ఆసనం మార్చాలని అనిపిస్తే హాయిగా మార్చుకోవచ్చు. ఆర్తి ఆర్ధ్రతలతో అభ్యాసం చేస్తూ చేస్తూ పోగా, ధ్యానంలో చిత్తచాంచల్యం తగ్గి, మనస్సు అంతర్ముఖమైతే, ఆసనసిద్ధి సహజంగా సునాయాసంగా సిద్ధిస్తుంది. ధ్యానం చేసుకొని లేవగనే దేహంలో ఎక్కడా ఏ మాత్రం బిగింపు లేకుండా హాయిగా, తేలిగ్గా వుండాలి. అదే మనం కూర్చున్న ఆసనం, చేసిన ధ్యానం సరైనదని చెప్పడానికి గుర్తు. యోగశాస్త్రగ్రంధాలలో మనం కూర్చొనే పద్ధతికి ఏ పేరు పెట్టివున్నా అది మనం పట్టించుకోనవసరం లేదు. ఏ రకంగా (ఆసనంలో) కూర్చుంటే దేహానికి మనస్సుకు సుఖంగా శ్రమరహితంగా వుండి ధ్యానం హాయిగా చేసుకోగలమో – అదే మన సంస్కారానికి సరిపడే ఆసనం. అదే ‘సుఖాసనం’! అందుకే అన్ని ఆసనాలలోకి ‘సుఖాసనం’ శ్రేష్ఠమైనదని అంటారు భగవాన్ శ్రీరమణమహర్షి!

అసూయను జయించడం – అంత సులువా?

ఆనందమయ జీవితానికి, ఆత్మజ్ఞానానికి అడ్డుగోడలైన అరిషడ్వర్గాలలో – కామ క్రోథ లోభ మోహ మద మాత్సర్యాలలో – చివరిది మత్సరం. మత్సరమంటే ఈర్ష్య-అసూయల కలగలుపు రూపమని చెప్పుకోవచ్చు. ఈర్ష్యాసూయలనే పదాలను రెంటినీ సామాన్యంగా మనం సమానార్థంలోనే వాడుతూ వుంటాం. కానీ, ఆ రెంటికీ సూక్ష్మమైన భేదం వుంది. తనకు చెందవల్సింది ఇతరులకు పోయిందేనన్న కించ, బాధ -ఈర్ష్య. ఏదో ఒక విషయం కోసం ఇద్దరు పోటీపడి, వారిలో ఒకరికి ఆ ఫలితం దక్కి, మరొకడికి రాకపోయినపుడు ఆ రెండోవాడు పడే బాధ ఈర్ష్య. తాను ఆశించింది పొందలేకపోయానేనన్న బాధకంటే, అది పక్కవాడు పొందాడేనన్న దుగ్ధ –ఈర్ష్య యొక్క స్వరూపం. దీనివల్ల ఒకవేళ ఇద్దరకూ ఆ ఫలితం లభించకపోతే, తనకు రాలేదని బాధ మరచిపోయి, పక్కవాడికి కూడా అది లభించలేదని లోలోపల సంతోషించడం జరుగుతుంది! ఇక అసూయ విషయం అలా కాదు. తనకెంతమాత్రం సంబంధించినది కాకపోయినా, తానేమాత్రం దానికోసం ప్రయత్నించకపోయినా, అది లేకపోవడం వల్ల తనకే మాత్రం నష్టం లేకపోయినా, ఇతరులకు ఏదైనా మేలు లాభం కలిగితే మనసులో ఊరకే కించపడే స్వభావం అసూయ!

పైన పేర్కొన్న అరిషడ్వర్గాలలో మిగిలిన వాటికి – మనలోని అహం, కోరికలు, వాసనలు, వ్యక్తిగతమైన లాభనష్టాలు, సుఖదుఃఖాలు మొదలయిన వాటి నేపథ్యంలో – కొంచెమయినా కారణం, ప్రాతిపదిక ఉంది. కనుక వాటిని కేవలం వివేకంతో జయించి పోగొట్టుకోవడం కొంచెం కష్టం. కానీ, అసూయ విషయం అలా కాదు! అది కేవలం అకారణంగా కలిగేది! ఏదైనా కారణమంటూ ఉంటే అది మిగిలిన వికారాల ఉనికిని ఆధారం చేసుకొని, వాటి నీడలా ఉంటుంది. మనలో చాలామంది ఈ వికారం (అసూయ) మనలో లేదని భ్రమపడతాం. కానీ, జాగ్రత్తగా మన మనస్సును తరచి చూస్తే – ముఖ్యంగా ఇతరులు లాభపడుతున్న వార్త వింటున్న సమయంలో – దాని ఉనికి మనకు అవగతమవుతుంది. అలా అది మన అంతరంగంలో తళుకుమన్న ప్రతిసారీ దాన్ని గుర్తిస్తూ పోతే, క్రమంగా ఆ వికారం అంతరిస్తుంది. మొదట తేలికగా పోగొట్టుకోగలిగే వికారాన్ని జయిస్తే, అభ్యాసబలంతో క్రమంగా మిగిలిన ఇతర వికారాలను గూడా గుర్తించి వదిలించుకొనే పట్టు చిక్కుతుంది.

అసూయను గూర్చి శ్రీసాయిబాబా తనదైన రీతిలో ఏం చెప్పారో చూద్దాం. ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్‌తో బాబా ఇలా అన్నారు:

“అరిషడ్వర్గాలలో అసూయను జయించడం అతి తేలిక! దీనిలో మనకు వచ్చేది కానీ, పొయ్యేది కానీ ఏమీ ఉండదు. ఇతరుల మేలు, సుఖం చూసి ఓర్వలేకపోవడమే అసూయ. ఇతరులకు ఏదైనా మంచి స్థాయిగానీ ఐశ్వర్యంగానీ వస్తే, అది చూచి ఓర్వలేక వారినిగూర్చి లేనిపోని మాటలు కల్పించి దూషిస్తాం. వారికేమయినా కష్టం కలిగితే ఆనందిస్తాం. ఇది సరైనదేనా? వాడికెవడికో మేలు జరిగితే, అందువల్ల నీకొచ్చిన నష్టమేముంది? కానీ మనుషులు ఈ విషయం ఆలోచించనే ఆలోచించరు. పక్కవాడికి మేలు జరిగితే సంతోషించగలగాలి. లేదు, అది మనమూ పొందేందుకు ప్రయత్నించాలి. అంతేకాని, ఆ బాగుపడ్డవాడు మనదేం లాక్కోలేదుకదా? వాడి కర్మ ఫలితంగా అది వాడికి లభించింది. దానికి ఊరకే మనం వగచినందువల్ల లాభమేముంది? అందువల్ల, మొదట అసూయను జయించాలి!”.

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 572వ భాగం...


ఈ భాగంలో అనుభవాలు:
  1. తల్లిలా బాధనుండి విముక్తి కలిగించి విశ్వాసాన్ని ప్రసాదించిన బాబా
  2. సాయికృపతో నార్మల్‌గా వచ్చిన రిపోర్ట్స్
  3. బాబా కృపతో కోలుకున్న నాన్న

తల్లిలా బాధనుండి విముక్తి కలిగించి విశ్వాసాన్ని ప్రసాదించిన బాబా


కాకినాడ నుండి సాయిభక్తురాలు విజయ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


ఓం శ్రీ శిరిడీ సాయినాథాయ నమః.

ఈ బ్లాగ్ నిర్వాహకులకు, సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు విజయ. మాది కాకినాడ. సాయిభక్తులు తమ అనుభవాలను పంచుకునే ఇలాంటి బ్లాగ్ ఒకటుందని నాకు ఈమధ్యనే మా చెల్లి ద్వారా తెలిసింది. “‘ఈ బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను’ అని బాబాకు చెప్పుకుంటే మన సమస్య తీరుతుంది” అని తనే నాకు చెప్పింది. అప్పటినుంచి ఈ బ్లాగును చదవడం మొదలుపెట్టాను. చదివినకొద్దీ చదవాలనే ఆరాటం ఇంకా ఇంకా ఎక్కువైంది. “అయినా బ్లాగులో పంచుకుంటే సమస్య ఎలా తీరుతుంది? బాబాకు ఇలాంటివేమీ అక్కర్లేదు. ఆయన పరమ వైరాగ్యమూర్తి” అని అనిపించింది. మళ్ళీ అంతలోనే, “ఇంతమందికి ఇన్ని అనుభవాలు జరుగుతున్నాయి కదా, అది నిజమేనేమో!” అనిపించింది. కానీ స్వానుభవం ఉంటేనే కదా మనకి పూర్తి విశ్వాసం కలిగేది! నాకూ అలాంటి అనుభవమే కలిగింది. అదే మీతో పంచుకోబోతున్నాను.

నా వయస్సు 53 సంవత్సరాలు. 20 సంవత్సరాల క్రితం నాకు ఫిస్టులా ఆపరేషన్ జరిగింది. ఇప్పటివరకు నాకు దానివల్ల ఎటువంటి నొప్పీ కలగలేదు. కానీ ఈమధ్యన మళ్లీ నొప్పి మొదలైంది. రోజురోజుకీ నొప్పి తీవ్రమై బాధ భరించలేకపోయాను. దానివల్ల నేను కూర్చోలేను, వేడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంటర్నెట్లో చూసి, ఇది మళ్లీ తిరగబెడుతుందని, కొంతమందికి రెండు లేదా మూడుసార్లు ఆపరేషన్ జరిగిందని తెలుసుకున్నాను. దాంతో నాకు చాలా భయం వేసింది. అసలే కరోనాతో లాక్‌డౌన్ అమలులో ఉన్న సమయం. ఇలాంటి పరిస్థితిలో ఆసుపత్రికి వెళ్లడం, డాక్టరుకి చూపించుకోవడం, ఆపరేషన్ చేయించుకోవడం చాలా కష్టం. అప్పుడే మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. బాబాకు నమస్కరించుకుని, “బాబా! ఆసుపత్రికి వెళ్లకుండా, ఆపరేషన్ అవసరం లేకుండా మీ అనుగ్రహంతో నాకు ఈ నొప్పి తగ్గిపోవాలి. అలా నా నొప్పి తగ్గిపోతే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని అనుకున్నాను. తరువాత ఫేస్‌బుక్‌లో చూస్తే 'సాయి వచనాలు'లో, “నా చరిత్ర పఠనం చేస్తూ ఊదీ రాస్తూ ఉండు, నీకు నయమగును” అనే బాబా సందేశం కనిపించింది. బాబా సూచించినట్లే చేశాను. ఇంకా కొన్ని ఇంటి చిట్కాలు పాటించాను. బాబా అనుగ్రహంతో ప్రస్తుతం చాలావరకూ నొప్పి తగ్గిపోయింది. ఇంకా లోపల కొద్దిగా ఏమైనా ఉందేమో తెలీదు. ఆ సాయినాథుని దయవలన 100% పూర్తిగా తగ్గిపోతుంది. బాబా తమ కటాక్షాన్ని నాపై పూర్తిగా చూపించారు. కానీ ఆయన ఆ మహిమను తనపై వేసుకోరు. మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ కూడా తన ఉనికిని మనకు తెలియనివ్వరు. మనమే ఆయన అనుగ్రహాన్ని అనుభూతి చెందవలసి ఉంటుంది. మనం ఆయనపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని అంతగా పెంచుకోవాలి. “సాయీ! మీరు తల్లిలా నన్ను కాపాడి ఇంతటి బాధనుండి విముక్తి కలిగించారు. చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు బాబా!” నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకున్నందుకు, మీ (సాయి) కుటుంబంలో ఒకదాన్ని అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.


సాయికృపతో నార్మల్‌గా వచ్చిన రిపోర్ట్స్

ఓం సాయిరాం! సాయిబంధువులకు నమస్కారం. నా పేరు చంద్రకాంత్. ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు. నా రక్తపరీక్ష రిపోర్టులు నార్మల్‌గా వస్తే నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటానని సాయికి చెప్పుకున్నాను. ఆ అనుభవాన్నే నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

నేను ఈమధ్య రక్తపరీక్షలు చేయించుకుంటే రిపోర్టులు అసాధారణంగా వచ్చాయి. దాంతో నాకు చాలా భయమేసింది. బాబాని తలచుకొని క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైటులో చూస్తే, "అంతా బాగానే ఉంటుంది" అని బాబా సమాధానమిచ్చారు. అప్పుడు బాబా మీద నమ్మకంతో స్కానింగ్ చేయించుకుంటే రిపోర్టు నార్మల్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ రక్తపరీక్షలు కూడా చేయించుకున్నాను. బాబా దయవలన ఈసారి రిపోర్టులు నార్మల్ వచ్చాయి. సాయిని మనస్ఫూర్తిగా నమ్మితే ఆయన మనల్ని సొంత బిడ్డల్లా చూసుకుంటారు. అందులో ఎటువంటి సందేహమూ లేదు. మనకి కావాల్సింది ఆయన యందు పూర్ణమైన భక్తి మాత్రమే.

బాబా కృపతో కోలుకున్న నాన్న

సాయిభక్తురాలు శ్రీమతి లలిత తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరాం! నేను ఇదివరకు చాలా అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మా నాన్నగారి అనుభవాన్ని పంచుకుంటాను. 2020, సెప్టెంబరు 13న మా నాన్న ఒక యక్సిడెంట్‌కి గురయ్యారు. నాన్నకి చాలా ఆయాసం ఉండటంతో పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉందని డాక్టర్ చెప్పారు. నేను బాబా మీద నమ్మకముంచి, "బాబా! నాన్న ఆరోగ్యం కుదుటపడేలా చూడండి. మీ దయతో నాన్న కోలుకుంటే ఈ అనుభవాన్ని సాయి మహారాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా ఎంతో కృప చూపించారు. ఇప్పుడు నాన్న ఆరోగ్యం బాగుంది. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఎప్పుడూ ఇలాగే మాపై మీ అనుగ్రహాన్ని చూపించండి".


సాయిభక్తుల అనుభవమాలిక 571వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:

  1. ఆటంకాలు లేకుండా నవగురువార వ్రతం పూర్తైయ్యేలా అనుగ్రహించిన బాబా
  2. తలచిన వెంటనే పోయిన ఉంగరాన్ని కనిపించేలా చేసిన బాబా

ఆటంకాలు లేకుండా నవగురువార వ్రతం పూర్తైయ్యేలా అనుగ్రహించిన బాబా

ముందుగా బాబా పాదపద్మాలకు నా సాష్టాంగ నమస్కారాలను అర్పిస్తున్నాను. నా పేరు సుజాత. నేను టీచరుగా పనిచేస్తున్నాను. కరోనా రాకముందు వరకు అసలు ఇలాంటి బ్లాగ్ ఒకటుందని నాకు తెలియదు. మాకు సాయిబాబా గురించి తెలియచేసిన మా పెద్దసార్ ఒకరోజు ఈ బ్లాగ్ లింకును మాకు షేర్ చేశారు. దాంతో ఈ బ్లాగ్ ఓపెన్ చేసి సాయిభక్తుల అనుభవాలను చదవడం ప్రారంభించాను.

దీనికి కొన్నిరోజుల ముందు నేను పూజగది సర్దుతుంటే ‘సాయి దివ్యపూజ’ మరియు ‘సాయి తొమ్మిది గురువార వ్రత కథ’ పుస్తకాలు కనిపించాయి. కరోనా కారణంగా స్కూల్ కూడా లేదు కదా అని 2020, జూన్ 18, గురువారం నాడు మా పెళ్లిరోజు కావటంతో ఆరోజు సాయి తొమ్మిది గురువారాల పూజ ప్రారంభించాను. ఎంతో శ్రద్ధగా బాబాకు పూజ చేసుకున్నాను. ఆ తర్వాతి గురువారం నాకు నెలసరి సమయం. ‘పూజ ప్రారంభించిన రెండవ వారమే ఆటంకం వస్తోందే’ అని బాధపడ్డాను. ఆరోజు రాత్రి మన బ్లాగులో భక్తుల అనుభవాలను చదువుతూ, “ఈ తొమ్మిది వారాలు ఏ ఆటంకమూ లేకుండా వ్రతం పూర్తయితే నేను కూడా నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటే బాగుంటుంది” అని అనుకున్నాను. ఆశ్చర్యంగా, ఒక్క వారం కూడా ఏ ఆటంకమూ ఎదురవలేదు. అన్ని వారాలూ ఏ ఆటంకాలూ లేకుండా పూజ చేసుకున్నాను. ఆఖరి గురువారం పూజకు ఆటంకం కలుగుతుందేమో అనుకున్నాను. ఎందుకంటే, ఆ ముందు సోమవారం మా పెద్దమ్మగారు చనిపోయారు. కానీ సరిగ్గా గురువారంనాడు మాకు శుద్ధి జరిగి ఆ గురువారం కూడా ఏ ఆటంకమూ లేకుండా పూజ పూర్తయింది. అలా బాబా అనుగ్రహంతో ఆగస్టు 13వ తారీఖుతో తొమ్మిది గురువారాలు నిరంటంకంగా పూర్తయ్యాయి. ఇంతటితో నా అనుభవం పూర్తయింది. ఇక నా మనోభిప్రాయన్ని పంచుకుంటాను.

ఆరోజు సెప్టెంబరు 19. తొమ్మిది గురువారాలు పూర్తయి అప్పటికి నెలరోజుల పైనే అయింది. ఆరోజు నేను బాబా దగ్గర కూర్చుని, “బాబా! మీ గురించి నేను ఎందుకలా అనుకున్నాను? ఏ ఆటంకాలు లేకుండా తొమ్మిది గురువారాల పూజ పూర్తయితేనే మీ కృప ఉన్నట్లు, లేకపోతే లేనట్లు అని నేనెందుకు అనుకున్నాను? ఇలా తప్పుగా నేనెందుకు ఆలోచించాను? సాయీ! నన్ను క్షమించండి!” అని చాలా బాధపడ్డాను. అంతేకాదు, “‘అందరికీ ఎన్నో అనుభవాలు కలుగుతున్నాయి, మాకు ఏ అనుభవాలూ కలగడం లేదు’ అని నేను ఎప్పుడూ అనుకోకూడదు బాబా!” అని ఎంతో బాధపడుతూ బాబాకు చెప్పుకున్నాను. ఆ తర్వాత బాబానే నాకు సమాధానం తెలియచేశారు. అందరి అనుభవాలు తెలియడం వల్లనే కదా సాయినాథుని సర్వజ్ఞత, వారి అపార కరుణ, వారి మార్గం తెలిసేది. హేమాడ్ పంత్ సాయి సచ్చరిత్ర రచించడం వల్లనే కదా మనం బాబాను, వారి ప్రేమను తెలుసుకున్నాము. అందువల్లనే ఈ బ్లాగ్ అనే సాయిభక్తుల అనుభవమాలికా సచ్చరిత్ర ద్వారా మనమందరమూ తనను అనుసరించాలని బాబా సంకల్పం కావచ్చు. నా ఆలోచనలలోని దోషాలనన్నిటినీ సరిచేయమని బాబాను మనసారా వేడుకుంటూ, మళ్లీ త్వరలోనే మరో అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలని ఆశిస్తూ...

సాయిభక్తురాలు
సుజాత

తలచిన వెంటనే పోయిన ఉంగరాన్ని కనిపించేలా చేసిన బాబా

నేను గత పదేళ్ళుగా సాయిబాబా భక్తురాలిని. మాది హైదరాబాద్. 2020, సెప్టెంబరు 15వ తేదీన నా పెద్ద కూతురు తన వ్రేలికున్న ఉంగరాన్ని పోగొట్టుకున్నది. మేము ఆ విషయాన్ని రాత్రి 9 గంటలకు గమనించాము. ఆ ఉంగరం కోసం ఇల్లంతా వెతికాము. కానీ, ఎక్కడా దొరకలేదు. 16వ తేదీ ఉదయం నేను నిద్రలేచి బాబాను తలచుకొని, “బాబా! మీ దయవల్ల ఈరోజు ఉంగరం దొరకాలి” అని ప్రార్థించాను. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, నేను అలా బాబాను తలచుకొని వెతికానో లేదో, వెంటనే ఆ ఉంగరం నా ఎదురుగానే కనబడింది. “చాలా చాలా ధన్యవాదాలు బాబా!”


సాయిభక్తి సాధన రహస్యం - మనోనిగ్రహానికి మరికొన్ని మార్గాలు!



మనోనిగ్రహానికి మరికొన్ని మార్గాలు!

సాయిభక్తులకు జపధ్యానాలలో ఉపయోగపడే సుళువులను గూర్చి ముందు వ్యాసాలలో కొంత తెలుసుకున్నాం. మరికొన్ని సుళువులు, జాగ్రత్తలు తెలుసుకుందామా?

వైరాగ్యలక్షణమనే భావంతో కొందరు చెప్పులు లేకుండా నడవటం మనం చూస్తుంటాము. కానీ, చెప్పులు లేకుండా నడవడం, కటికనేలమీద కూర్చొనడం పండుకొనడం సాధనకు అంత మంచిది కాదు! ధ్యానానికి కూర్చొనబోయే ముందు తప్పనిసరిగా నేలపైన చాపకాని, గుడ్డకాని, కొయ్యపీటకానీ ఆసనంగా వేసుకొని కూర్చోవాలి. దానివల్ల భూమ్యాకర్షణశక్తి యొక్క విక్షేపప్రభావం మనస్సుపై తగ్గి తేలికగా మనసు ధ్యానస్థమవుతుంది.

ఏ కారణం చేతనయినాసరే, ధ్యానానికి కూర్చున్నప్పుడు మనస్సు మరీ గజిబిజిగా వుంటే, నిటారుగా కూర్చొని ఊపిరితిత్తుల నిండా నెమ్మదిగా గాలిపీల్చి, నెమ్మదిగా వదలాలి. అలా అయిదారుసార్లు చెయ్యాలి. అలా చేసేటప్పుడు, శ్వాసను బలవంతంగా అదుపుచెయ్యడంగానీ, గాలి పీల్చేటప్పుడు వదిలేటప్పుడు శ్రమ తీసుకోవడం గానీ ఎంత మాత్రం చేయకూడదు. ఉచ్ఛ్వాసనిశ్వాసాలు (బలవంతంగా కాకుండా) క్రమబద్ధంగా, లయబద్ధంగా వుండేట్లు చూచుకోవడమే ఒక సాధన.

మహాత్ములు, ఉత్తమసాధకులు, సన్నిహిత గురుబంధువులు తప్ప ఇతరులు - ఎవరైనా సరే - ఇచ్చిన వస్తువులు ఏవీ తీసుకోకూడదు! వారు పెట్టినదేదీ తినకపోవడం మంచిది. ఇతరులు ఉపయోగించిన వస్తువులు (చెప్పులు, గుడ్డలు, ఆసనాలు, జపమాలలు మొదలైనవి) ఏ పరిస్థితులలోను వాడకూడదు. ఇతరులనుండి మనం ఏ వస్తువునుగానీ, ఆహారాన్నిగానీ స్వీకరించినప్పుడు, ఆ పదార్థాలతో బాటు వారి మనోవృత్తుల ప్రభావాన్ని గూడా మనం గ్రహిస్తున్నామన్న విషయం గుర్తుంచుకోవాలి. నిత్యజీవితంలో ఈ నియమాన్ని ఆచరణలో పెట్టడం కష్టసాధ్యమైనప్పటికీ, ఆధ్యాత్మిక సాధనలో ఈ నియమం యొక్క అవసరం ప్రయోజనం అంత ఇంత అని చెప్పనలవి కాదు. ‘ఎవరి వద్దనుండి ఏదీ పుచ్చుకోకపోవడం’ తన నియమమని సున్నితంగా, నమ్రతగా, మర్యాదగా (ఎదుటివారు నొచ్చుకోకుండా) చెబితే సామాన్యంగా ఎదుటివారు బలవంతం చెయ్యరు. ఈ నియమం అంత అత్యుత్తమమైనది గనుకనే, అద్వైతసాధనను బోధించిన ఆదిశంకరుల వంటివారు కూడా ఈ ‘అపరిగ్రహ’ నియమపాలనకు ఎంతో ప్రాముఖ్యాన్నిచ్చారు. మనస్సుకు పదార్థం మీదా, పదార్థానికీ మనసు మీద ఉండే ఈ ప్రభావాన్ని ఇటీవల శాస్త్రీయపరిశోధనలలో కూడా గుర్తించడం జరిగింది! అయితే, యీ నియమపాలన వెనుకనున్న సూత్రాలకు, కులమత వివక్షతలకు (అంటరానితనం, మడి మొదలగునవి) ఎటువంటి సంబంధం లేదని సాయిభక్తులు గుర్తించాలి. ఈ ‘అపరిగ్రహ’ నియమాన్ని కొంతకాలం శ్రద్ధగా పాటిస్తూ పోతే, ఆ తరువాత ఎప్పుడైనా తప్పనిసరై ఈ నియమాన్ని ఉల్లంఘించవలసి వచ్చినపుడు మనకే అనుభవానికి వస్తుంది – విచక్షణా రహితమైన పరిగ్రహం వల్ల మనం ఎంత నష్టపోతామో!

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 570వ భాగం.....


ఈ భాగంలో అనుభవం:

  • అసాధ్యమనుకున్నది సాధ్యం చేసి చూపించిన బాబా


నేను ఒక సాయి భక్తురాలిని. నా మనసులో వచ్చే ఎన్నో ప్రశ్నలకు బాబా ఈ బ్లాగులో నిత్యం నాకు సమాధానాలు ఇస్తూ ఉన్నారు. నేను బెంగళూరులో ఒక కార్పొరేట్ స్కూల్లో ఉద్యోగం చేస్తున్నాను. కరోనా కాలంలో మా స్వస్థలానికి వెళ్లి ఇంటి నుంచే పని చేస్తుండేదాన్ని. కొన్నిరోజులకు నాకు బెంగళూరు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మా స్కూలువాళ్ళు మీటింగ్ పెట్టి, నన్ను ఖచ్చితంగా బెంగళూరు బ్రాంచికి రావాలని చెప్పారు. కానీ బెంగళూరులో కరోనా కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా, కరోనాకి భయపడి మా ఇంట్లోవాళ్ళు నన్ను 6 నెలలపాటు ఇంటి గేటు కూడా దాటనివ్వలేదు. మేమందరం అంత స్ట్రిక్ట్‌గా, జాగ్రత్తగా ఇంట్లోనే ఉన్నాము. అందువలన, ‘మావాళ్లు నన్ను ఇంటి గేట్ కూడా దాటినివ్వరు, ఇంక బెంగళూరుకి పంపడం అసాధ్యం’ అనుకున్నాను. ‘సరే, బాబా ఏం చెబితే అదే చేద్దాం’ అనుకుని, బాబాను ప్రార్థించి, “బెంగళూరు వెళ్ళనా, వద్దా’ అని బాబా ముందు చీటీలు వేశాను. బాబా నన్ను బెంగుళూరుకి వెళ్ళమన్నారు. బాబా సమాధానం చూసి, “నాకేమీ అర్థం కావట్లేదు బాబా! ఈ పరిస్థితుల్లో ఇంట్లోవారిని ఒప్పించి సాహసించి బెంగుళూరుకి వెళ్లడం నావల్ల కాదు. కానీ మీరెందుకు ఇలా చెబుతున్నారు?” అని బాబాను అడిగాను. ఇంట్లోవారికి నా ప్రయాణం గురించి చెప్పే ధైర్యం లేక ఆరోజంతా బాధపడుతూ గడిపి చివరికి ధైర్యం చేసి మా తాతయ్యతో, “నేను బెంగళూరుకి వెళ్లాలనుకుంటున్నాను” అన్నాను. మా తాతయ్య ఒకే మాట – “రిజైన్ చెయ్యి!” అన్నారు. నాకు ఏడుపు వచ్చేసింది. ఏడుస్తూ బాబా దగ్గరకు వెళ్ళి, “బాబా! మీరేమో వెళ్లమంటారు, వీళ్లేమో వద్దంటారు, నేనేం చేయాలి? ఎందుకు మళ్ళీ నాకు ఇంకో పరీక్ష పెడుతున్నారు?” అని బాధపడ్డాను. తరువాత ధైర్యం చేసి ఇంకోసారి బాబా ముందు చీటీలు వేశాను. కానీ బాబాది ఒకే మాట – “బెంగళూరుకి వెళ్లు!” అని. ఇంక నేను బాబా చెప్పినట్టు చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. “నువ్వు చెప్పింది నేను చేస్తాను బాబా! కాదు, నువ్వే చేయించాలి. నేను నీ మాటే వింటాను” అని మనసులో అనుకుని మా తాతయ్యతో మళ్ళీ చెప్పాను. ఆయన, “నీ ఇష్టం, ఏమైనా చేసుకో, నన్ను అడగకు” అన్నారు. దాంతో నాకు విపరీతమైన తలనొప్పి వచ్చింది. మూడురోజులైనా తలనొప్పి తగ్గలేదు. ఒకప్రక్క బాబా, ఇంకొకప్రక్క ఇంట్లోవాళ్లు. కానీ, ‘నా బాబా నిర్ణయమే నా నిర్ణయం’ అనుకున్నాను. చివరికి మా తాతయ్య నా పరిస్థితి చూసి నేను బెంగళూరుకి వెళ్లడానికి ఒప్పుకున్నారు. నా తండ్రి బాబా నా విశ్వాసాన్ని గెలిపించారు. నేను ఎప్పుడు ఏ సందేహం వచ్చినా చీటీల ద్వారానే బాబా అనుమతి పొందుతాను. దాన్ని కూడా నిజమని నిరూపించారు, అసాధ్యమనుకున్నది సుసాధ్యం చేసి చూపారు నా సాయి. “బాబా! మీకు ఏమి ఇచ్చినా, ఎంత చేసినా మీ ఋణం తీర్చుకోలేను తండ్రీ! ఎప్పుడూ మీ పాదధూళి క్రింద నాకు చోటివ్వండి. ఈ జన్మకి నాకు అంతే చాలు బాబా!”.

నేను ఒక కార్పొరేట్ స్కూల్లో ఉద్యోగం చేస్తున్నానని చెప్పాను కదా! అక్కడ పని చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, నేను ఉద్యోగం చేసే చోటు మా ఇంటికి చాలా దూరంలో ఉంటుంది. కాబట్టి మా ఇంట్లోవారికి నేను అక్కడ ఉద్యోగం చేయడం సుతరామూ ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడు చూసినా ‘అక్కడ ఉద్యోగానికి రాజీనామా చేయి’ అని అంటూ ఉంటారు. ఎందుకంటే అంత కష్టంగా ఉంటుంది అక్కడి పని. కానీ నాకు మాత్రం ఆ ఉద్యోగ వాతావరణం బాగా అలవాటయిపోవటం వల్ల వాళ్లకు నచ్చజెబుతూ ఉద్యోగం కొనసాగించేదాన్ని. కానీ ఒకరోజు మా ఇంట్లోవాళ్ళు నాతో ఖరాఖండీగా, “వచ్చే సంవత్సరం నుండి నువ్వు అక్కడ ఉద్యోగం చేయడానికి వీల్లేదు. ఇంటికి దగ్గరగా ఏదైనా ఉద్యోగం చూసుకో, లేదంటే ఇంట్లో ఉండాల్సిందే” అన్నారు. కానీ, నా మనసుకు మాత్రం ఆ ఉద్యోగాన్ని వదులుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఇంక చేసేది లేక బాబా ముందు చీటీలు వేశాను. ఇంటి దగ్గరగా వున్న బ్రాంచికి బదిలీ చేయించుకోమని బాబా సమాధామనిచ్చారు. కానీ ఆ బ్రాంచిలో ఆదివారాలలో, పండుగల సమయంలో కూడా సెలవులు ఉండవు. పైగా పని ఒత్తిడి చాలా ఎక్కువగా కూడా ఉంటుంది. కానీ చేసేది లేక ఇంట్లోవారి మాట కోసం అయిష్టంగానే బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నాను. నేను అప్పటివరకు పనిచేస్తున్న బ్రాంచివాళ్ళు నాకు కాల్ చేసి, “ఇక్కడే ఉండండి, ఆ బ్రాంచి బాగలేదు, మీకు ఇంకా కష్టం అవుతుంది” అన్నారు. నేను, “లేదు, నేను ఉండలేను” అని చెప్పాను. ఆ బ్రాంచి నుంచి నా స్నేహితురాలు కాల్ చేసి, “ప్లీజ్! మీరు ఇక్కడే ఉండండి. మీరు లేకుండా ఇక్కడ నాకు ఏం బాగోదు” అని బ్రతిమాలింది. “మా ఇంట్లోవాళ్ళు నూరుశాతం పంపించరు, నేను ఏమీ చెయ్యలేను. నేను అక్కడికి రావాలని అంతగా నీకు ఉంటే బాబాను వేడుకో!” అని చెప్పాను.

ఇక మరుసటిరోజు బదిలీ విషయం తెలుస్తుందనగా నేను బాబా ముందు చీటీలు వేశాను. బాబా నన్ను అంతకుముందు పనిచేసిన బ్రాంచిలోనే ఉద్యోగం చేయమన్నారు. అంతే! నా ఆనందానికి అవధులు లేవు. కానీ అంతలోనే, “బాబా! నువ్వు అనుమతి ఇచ్చావు. కానీ ఇంట్లోవారు నన్ను అక్కడికి అస్సలు పంపరు” అని బాబా ముందు ఏడ్చాను. ఏదైతే అదవుతుందని బాబా మీద ఉన్న నమ్మకంతో బదిలీని రద్దు చేయించుకున్నాను. తరువాత నా నిర్ణయాన్ని ఇంట్లోవారికి చెప్పాను. దానికి వాళ్ళు, “సరే అయితే, నువ్వు ఇంట్లోనే వుండు, నువ్వక్కడ ఉద్యోగం చెయ్యడం అస్సలు కుదరదు” అన్నారు. నేను బాబా ఇచ్చిన సందేశంపై నమ్మకంతో “నేను అక్కడే ఉద్యోగం చేస్తాన’ని చెప్పాను. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ తరువాత ఒక అంకుల్ మా తాతయ్యకు కాల్ చేసి, నేను వర్క్ చేస్తున్న బ్రాంచి చాలా బాగుందని చెప్పి, “ఎందుకు మీరు అమ్మాయిని అక్కడ ఉద్యోగం చేయొద్దంటున్నారు? అలా చెయ్యకండి” అని చెప్పి మా తాతయ్యను ఒప్పించారు. నాకైతే బాబానే ఆయన రూపంలో వచ్చి మా ఇంట్లోవారిని ఒప్పించినట్టు అనిపించింది. దాంతో నాకు పాత బ్రాంచిలోనే ఉద్యోగం చేయడానికి ఇంట్లోవారి నుండి అనుమతి వచ్చింది. అసాధ్యమనుకున్నది సాధ్యం చేసి చూపించారు నా బాబా. నా స్నేహితురాలు కూడా, “నిజమే! నీ బాబా చాలా గ్రేట్!” అని చాలా ఆనందించింది.

బాబా ప్రణాళికలను అర్థం చేసుకోవడానికి మనకు చాలా సమయం పడుతుంది. కానీ, ఆయన ప్రణాళికలు మాత్రం చాలా పక్కాగా ఉంటాయి. చివరివరకు ఆయన ప్రణాళిక మన గమ్యానికి చాలా వ్యతిరేకంగా ఉంటుంది, కానీ చివరకు ఆయన మనలను మన గమ్యానికి సురక్షితంగా చేరుస్తారు.

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!



సాయిభక్తుల అనుభవమాలిక 569వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:

  1. సకల వ్యాధులను నయం చేసే బాబా ఊదీ
  2. బాబా నెరవేర్చిన కోరికలు

సకల వ్యాధులను నయం చేసే బాబా ఊదీ

సాయిభక్తులందరికీ నమస్కారం. ఈ బ్లాగుని నిర్వహిస్తున్న సాయి అన్నయ్యకు నా కృతజ్ఞతలు. బాబా మనందరికీ మాట ఇచ్చినట్టు, ఆయన ఊదీ సకల వ్యాధులను నయం చేస్తుంది. మనకు బాబాపై నమ్మకం ఉండాలి, అంతే. నేను ఎల్లప్పుడూ బాబా ఊదీని నాతో ఉంచుకుంటాను. నాకు ఏ కొంచెం బాధకలిగినా, ఏదైనా నొప్పి కలిగినా ఊదీని రాసుకుంటాను. ఈమధ్యకాలంలో ఊదీ మహిమతో నాకు కలిగిన అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. 

నాకు ఈ నెలలో (సెప్టెంబరు) ఉన్నట్టుండి కీళ్ళనొప్పులు వచ్చాయి. రాత్రి సమయంలో ఆ నొప్పులు నన్ను చాలా ఇబ్బందిపెట్టాయి. కొన్ని కారణాల వల్ల నేను ఆసుపత్రికి వెళ్లలేకపోయాను. బాబాపై నమ్మకం ఉంచి, బాబాను ప్రార్థించి, నాకు నొప్పి ఉన్నచోట ఊదీ రాయటం మొదలుపెట్టాను. ప్రతిరోజూ అలా చేస్తూ వస్తుంటే ఊదీ మహిమతో మెల్లగా నా కీళ్ళనొప్పులు తగ్గుతూ వచ్చాయి. ఇప్పటికి 80 శాతం నొప్పులు తగ్గిపోయాయి. ఇంకా అప్పుడప్పుడు చాలా కొద్దిగా నొప్పులు వస్తున్నా అవి కూడా బాబా ఊదీ మహిమతో తగ్గిపోతాయి.

అలానే ఒకరోజు నాకు విపరీతమైన తలనొప్పి వచ్చింది. అది కూడా తలలో ఒకవైపు నొప్పి. ఆ నొప్పికి కడుపులో వికారంగా కూడా ఉంది. నాకు ఏం చేయాలో తెలియలేదు. వెంటనే బాబా ఊదీని నొప్పి ఉన్నచోట రాసుకుని, “బాబా! త్వరగా ఈ తలనొప్పి తగ్గితే బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను” అని బాబాకు మ్రొక్కుకున్నాను. ఆశ్చర్యంగా పదినిమిషాల్లో నా తలనొప్పి తగ్గిపోయింది. సాధారణంగా అలాంటి తలనొప్పి వస్తే కనీసం గంటసేపు ఉండేది, కానీ బాబా ఊదీ మహిమతో కేవలం పదినిమిషాల్లోనే తగ్గిపోయింది. “థాంక్యూ సో మచ్ బాబా! నాకు మానసికమైన బలాన్ని ఇవ్వు బాబా. సదా నీ బిడ్డలందరికీ తోడుగా ఉండు. మేము చేసిన తప్పులన్నీ తల్లిలా కాచి మమ్మల్ని కాపాడు బాబా!”


బాబా నెరవేర్చిన కోరికలు

విజయవాడ నుండి సాయిభక్తురాలు శ్రీమతి నర్మద తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

సద్గురు సాయినాథుని దివ్య చరణకమలాలకు నా నమస్కారాలు. బ్లాగులోని సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగులో సాటి సాయిభక్తుల అనుభవాలు చదివాక, “బాబా! నా కోరిక తీరితే నేను కూడా ఈ బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను” అని బాబాకు మ్రొక్కుకున్నాను. ఆ అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను.

మా అమ్మాయికి వివాహమై 3 సంవత్సరాలైనా సంతానం కలగలేదు. నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! మాకు పిల్లలంటే చాలా ఇష్టం. మా అమ్మాయికి పిల్లలు కలిగేలా ఆశీర్వదించండి” అని ఎంతో ఆర్తిగా ప్రార్థించాను. బాబా కరుణించారు. మా అమ్మాయి ఇప్పుడు ఆరవ నెల గర్భవతి. మా అమ్మాయికి సుఖప్రసవమై తను పండంటిబిడ్డకు జన్మనివ్వాలని బాబాను ప్రార్థిస్తున్నాను.

ఇంకొక అనుభవం: 

మా అబ్బాయి సాయికుమార్ చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. 2020, మే 17వ తేదీన ఈ కరోనా సమయంలో చెన్నై నుండి విజయవాడకు రైల్లో వచ్చాడు. తనను క్వారంటైన్లో ఉంచి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. “కోవిడ్ పరీక్షల్లో మా అబ్బాయికి నెగిటివ్ వస్తే నవగురువార వ్రతం చేస్తాను బాబా. వాడు త్వరగా ఇంటికి వచ్చేలా అనుగ్రహించండి” అని నేను బాబాను ప్రార్థించాను. బాబా అనుగ్రహంతో మా అబ్బాయికి కోవిడ్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. బాబా తనను నాలుగు రోజుల్లో ఇంటికి పంపారు. ఎంతో ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బాబాకు మ్రొక్కుకున్న ప్రకారం ఎంతో సంతోషంతో నేను నవ గురువార వ్రతం చేసుకున్నాను. ఈ అనుభవాలను సాటి సాయిభక్తులతో పంచుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది.



సాయిభక్తుల అనుభవమాలిక 568వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • మొట్టమొదటి శిరిడీ దర్శనం

సాయిభక్తురాలు జ్యోతి తన మొదటి శిరిడీ దర్శనానుభవాలను ఇలా పంచుకుంటున్నారు:

సాయిరామ్! సాయి బిడ్డలందరికీ నమస్కారములు. నేను 1979లో పుట్టాను. మూడేళ్ళ వయస్సులో నేను మా ఇంటికి ఎదురుగా జరుగుతుండే సత్సంగం ద్వారా బాబాకి ఆకర్షితురాలినయ్యాను. ఆ వయసులో బాబా వైపుకి మళ్ళిన నా దృష్టి ఇంకే దేవతల వైపుకి మళ్లలేదు. నాకు దైవం అంటే బాబానే. బాబా కన్నా ఎక్కువగా నా ఆలోచనల్లో ఎవ్వరూ ఉండరు. బాధ కలిగినా, సంతోషం కలిగినా నేను ఆయనతోనే చెప్పుకుంటాను. తల వంచాల్సి వస్తే  అది నా సాయి ముందే వంచుతాను, ఇతరుల ముందు కాదు. కన్నీరు కారిస్తే అది నా బాబా ముందే కార్చాలిగానీ, ఇంకొకరి దృష్టిలో ఒక్క కన్నీటి బొట్టైనా కనపడకూడదు. ఏ స్థితిలో అయినా అలా జరగడానికి కూడా నేను ఇష్టపడను. ఇంతవరకూ నా జీవితంలో అటువంటి సందర్భాన్ని బాబా కల్పించలేదు. ఇకపై ఇవ్వడు కూడా. నా అవసరాలన్నీ నా తండ్రి సాయి కన్నతల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. అమ్మ అయినా అడగందే అన్నం పెట్టదేమోగానీ మన బాబా మనకోసం అన్నీ ముందుగానే సిద్ధం చేసి పెడతారు. జీవితంలో మనకేది అవసరమో, శ్రేయస్కరమో దానిని తండ్రి తప్పకుండా ఇస్తాడు. అనుగ్రహం కోసం దేవతలనైనా ఆరాధించాలేమోగానీ మన సద్గురు సాయి తండ్రి మాత్రం తలచినంతనే పలుకుతాడు, అవసరమైతే ప్రత్యక్షమవుతాడు కూడా. ఎంతని వర్ణించను సాయి గొప్పతనాన్ని? అందుకు ఎన్ని జన్మలైనా సరిపోవు. సాయిబాబా అంటే సాయిబాబానే. ఆయనకెవరూ సాటిరారు. ఇక నా మొదటి శిరిడీ దర్శనం గురించి మీతో పంచుకుంటాను.

2011లో మా అమ్మ చనిపోయింది. ఆ తర్వాత శిరిడీ వెళ్లి బాబా ఆశీర్వాదం పొందాలని నాకు బలంగా అనిపించి, "బాబా! మీరు నన్ను శిరిడీకి రప్పించుకోండి" అని బాబాని అడిగాను. నన్ను ఎంతగానో ప్రేమించే బాబా నా కోరిక మన్నించకుండా ఉంటారా? 2012లో మా అత్తమామల ద్వారా నా శిరిడీ ప్రయాణానికి ఏర్పాటు చేశారు. 'అడిగినంతనే తమ దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు నా బాబా' అని నేను చాలా సంతోషించాను. ఇక ఎప్పుడెప్పుడు శిరిడీ ప్రయాణమవుతానా అని ఎదురుచూస్తూ, క్షణమొక యుగంలా రోజులు గడిపాను. ఆరోజు రానే వచ్చింది. బాబాకు ఏమైనా తీసుకొని వెళదామని నాకు తెలిసినంతలో కొన్ని తినుబండారాలు ఇంట్లో తయారుచేశాను. బాబా కోసమని ఒక ప్యాకెట్టు, మేము తినడానికని ఒక ప్యాకెట్టు వేర్వేరుగా సిద్ధం చేశాను. అయితే మరుసటిరోజు మధ్యాహ్నం ప్రయాణమనగా ఆ రాత్రి నుంచి నాకు ఒకటే కడుపునొప్పి, రక్తవిరోచనాలు కూడా. రాత్రంతా నిద్రలేదు. ప్రతిక్షణం బాత్రూం వచ్చినట్టే అనిపిస్తూ చాలా బాధపడ్డాను. ఎప్పుడూ ఎరుగని రక్తవిరోచనాలతో తెల్లవారేసరికి చాలా నీరసించిపోయాను. నా పరిస్థితి చూసి నా భర్త, "నీ ఆరోగ్యం ఏమీ బాగాలేదు. శిరిడీకి మరోసారి ఎప్పుడైనా వెళ్ళవచ్చు. టికెట్ వేస్ట్ అయితే కానీలే" అన్నారు. నేను మావారితో, "శిరిడీ వెళ్లాలని ఎంతగానో నిరీక్షించిన నేను బాబా ఇచ్చిన అవకాశాన్ని ఎలా వదులుకుంటాను? శిరిడీలో చావనైనా చస్తాను కానీ శిరిడి వెళ్ళకుండా మాత్రం ఉండను" అని చెప్పాను. ఉదయమంతా నా పరిస్థితి అలానే ఉంది. ఇంకో గంటలో ప్రయాణం కావాల్సి ఉండగా అప్పుడు నేను, "బాబా! నేను డాక్టర్ దగ్గరకు వెళ్ళొస్తాను. ప్రయాణంలో ఎటువంటి కష్టం కలగకుండా మీరే చూసుకోవాలి" అని బాబాతో చెప్పుకొని, డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. డాక్టర్ టాబ్లెట్స్ ఇచ్చారు. అప్పుడు నేను డాక్టరుతో, "నేను శిరిడీ వెళ్తున్నాను. ప్రయాణంలో ఏ ఇబ్బందీ లేకుండా మంచి మందులు ఇవ్వండి" అని అన్నాను. దానికి డాక్టర్, "ఇంత బలహీనంగా ఉన్నావు. కడుపునొప్పి కూడా ఎక్కువగా ఉంది. ఈ స్థితిలో ప్రయాణమవడం మంచిది కాదు. అందులోనూ శిరిడీ ఏమీ దగ్గర కాదు, చాలా దూరం కదా!" అని అన్నారు. అవేమీ పట్టించుకొనే స్థితిలో లేని నేను బాబా మీద భారం వేసి ప్రయాణమయ్యాను. నిలబడడానికి శక్తి కూడా లేని నేను నా కూతుర్ని తోడుగా తీసుకొని ఎలాగో ఒకలాగా ట్రైన్ ఎక్కాను. తీరా ట్రైనులో కూర్చున్నాక శిరిడీలో దీపాలు వెలిగించడానికి, బాబాకు ఒక లేఖ సమర్పించుకోవడానికి అవసరమైన వాటిని మర్చిపోయానని గుర్తొచ్చింది. నిజానికి వాటి గురించి ముందుగా ప్రణాళిక చేసుకొని అన్నీ సిద్ధంగా పెట్టుకున్నాను. కానీ ఆరోగ్యం బాగాలేని కారణంగా ఆ సంగతే మర్చిపోయాను. ఆ విషయం మా అత్తగారితో చెప్పి, ఒత్తులు, నెయ్యి, ప్రమిదలు మర్చిపోయానని చెప్పుకొని శిరిడీ చేరుకొనేవరకూ బాధపడుతూనే ఉన్నాను. ఎందుకంటే, శిరిడీ మొదటిసారి వెళ్తుండటంతో అక్కడ దీపాలు పెట్టడం గురించి, వాటికి అవసరమయ్యేవి ఎక్కడ దొరుకుతాయో తెలియదు.

అదలా ఉంచితే, నేను శిరిడీలో బాబాను తొలిసారి దర్శించుకోబోతున్నానని మనసులో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ, "బాబా! మీరు నడయాడిన పుణ్యభూమి శిరిడీలో మొదటిసారి అడుగుపెడుతున్నాను. అమ్మ పోయింది. కాబట్టి ఇక మీ శిరిడియే నాకు పుట్టిల్లు, మీరే నాకు తల్లి. దయచేసి మీ ప్రేమను నాకు పంచండి సాయి. నా ఆరోగ్యాన్ని బాగా చూడండి, శిరిడీలో నేను ఏ రకంగా ఇబ్బందిపడకుండా సంతోషంగా ఉండేలా అనుగ్రహించండి. మీ ఆశీస్సులతో క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకోవాలి" అని బాబాని వేడుకున్నాను. ట్రైన్లో ఏ ఆహారం తీసుకోకుండా కేవలం నీళ్లు మాత్రమే త్రాగి టాబ్లెట్ వేసుకున్నాను. ఉదయం లేచేసరికి బ్రష్ చేసుకోడానికి కూడా ఏ మాత్రం శక్తిలేదు. అయినా 'బాబా ఉన్నారు, ఆయన చూసుకుంటారు' అన్న మొండి ధైర్యం. శిరిడీ వెళ్తున్నానన్న సంతోషం ముందు నాకున్న నీరసం నాకు కనిపించలేదు. అంతలో శిరిడీ రానే వచ్చింది.

శిరిడీ నేలపై కాలు పెట్టగానే ఎంతో శక్తి వచ్చినట్లు అనిపించింది. 'బాబా దగ్గరకు వచ్చాము. మా అమ్మ దగ్గరకు వచ్చాను. ఎప్పుడెప్పుడు బాబా దర్శనం చేసుకుందామా?" అన్న ఆలోచనలతో నాలో కొత్త శక్తి పుంజుకుంది. ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. లాడ్జిలో రూమ్ తీసుకొని, స్నానాలు చేసి అందరమూ దర్శనానికి వెళ్ళాము. ముందుగా గురుస్థాన్‌కు వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే అక్కడున్న పూజారి అంతమంది జనంలో నన్ను పిలిచి బాబా పాదాలపై ఉన్న పూలమాల తీసి నాకిచ్చారు. బాబా ఆశీర్వాదానికి ఆనందంతో పొంగిపోయాను.

తర్వాత సమాధిమందిరంలోకి వెళ్ళాము. నాతోపాటు బాబా కోసం తెచ్చిన తినుబండారాల పార్సిల్ తీసుకెళ్ళాను. దాన్ని ఒక బ్లూ కలర్ బ్యాగులో పెట్టి, దానిపై మా అడ్రస్ కూడా రాసిపెట్టాను. నేను క్యూలో నడుస్తూ, "బాబా! ఇది మీరు స్వీకరించాలి. మీరే తీసుకున్నారన్న ఋజువు కూడా నాకు కావాలి" అని బాబాకు చెప్పుకొని ఆయన్ని స్మరిస్తూ బాబా పాదాల దగ్గరకు చేరుకున్నాను. అక్కడ పూజారులు భక్తులిస్తున్న ప్రసాదాలు తీసుకొని, వాటిని బాబాకు తాకించి, మళ్ళీ ఎవరివి వారికి తిరిగి ఇస్తున్నారు. అది చూసి, నేనిచ్చే ప్రసాదాన్ని కూడా నాకు తిరిగి ఇస్తారని భయమేసింది. దాంతో నేను వాటిని బాబా తీసుకోవాలనే ఉద్దేశ్యంతో వాళ్ల చేతికి ఇవ్వకుండా బాబా పాదాల దగ్గరకు తోసేశాను. తరువాత వాళ్ళెక్కడ నన్ను పిలిచి నా ప్యాకెట్ నాకు తిరిగి ఇస్తారోనని పాపను తీసుకుని గబగబా బయటికి వచ్చేశాను. కానీ, "బాబా తీసుకున్నారో లేదో? వేరే వాళ్ళకేమైనా ఇచ్చారేమో!" అని ఆలోచించుకుంటూ వచ్చిపోయే జనాన్ని చూస్తూ నిలబడ్డాను. కొద్దిసేపటికి మా అత్త, మామ బయటికి వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతూ అక్కడే నిలబడి ఉన్నాను. అంతలో ఎరుపురంగు దుస్తులు ధరించిన సమాధిమందిరంలోని పూజారి నా ముందునుంచి వెళుతూ కనపడ్డారు. వారి చేతిలో నేను బాబాకు సమర్పించిన ప్యాకెట్ ఉంది. ఇక చూడండి నా ఆనందం! "బాబా! నా ప్రసాదం మీరు స్వీకరించారని నాకు తెలుస్తోంది. ఖచ్చితంగా మీరు స్వీకరించారు" అనుకుంటూ సమాధిమందిరంలో అర్చకులు ఎందరు ఉన్నారని చూశాను. నేను దర్శనానికి వెళ్లినప్పుడు నలుగురు ఉన్నారు. నేను చూస్తున్నప్పుడు కూడా నలుగురే ఉన్నారు. మరి ఆ వ్యక్తి బాబా కాక మరెవరు చెప్పండి! ఆనందంతో నా ప్రక్కన ఉన్నవాళ్లతో, "చూడండి.. చూడండి.. బాబా నా ప్రసాదం స్వీకరించారు. దాన్ని తీసుకుని వెళుతున్నారు. ఆయన చేతిలో ఉన్న బ్యాగుపై మా ఆడ్రస్ కూడా ఉంది, చూడండి" అని చెప్పాను. వాళ్ళకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. అలాగే చూస్తూ ఉండిపోయారు. ఇంక నా సంతోషం ఎలా ఉంటుంది మీరే చెప్పండి. బాబా నాపై ఎంత ఆప్యాయత కనబరుస్తున్నారో అని మురిసిపోయాను.

తరువాత ఎంతో సంతోషంతో లెండీబాగ్‌లో అడుగుపెట్టాను. నా వెంట మా అత్తగారు, నా కూతురు కూడా ఉన్నారు. లెండీలోకి అడుగుపెడుతూనే దీపాల గురించి నా మదిలో ఆలోచనలు మొదలయ్యాయి. కానీ ఏం చేయను? బాబా ఆశీర్వాదం లభించిందిలే అని మనసును సమాధానపరుచుకొని లెండీవనమంతా చూసుకొని బాబా నాటిన వేప, రావి చెట్ల దగ్గరకు వెళ్ళాము. దీపాలు పెట్టాలన్న నా కోరికను నెరవేర్చడానికి బాబా అక్కడ ఏర్పాటు చేసి ఉండటం చూసి నాకెంత సంతోషం కలిగిందో మాటల్లో చెప్పలేను. 'నా సాయి తండ్రి ఎంతలా నావెంట ఉంటున్నారో కదా!' అని అనుకున్నాను. అసలు విషయమేమిటంటే, అక్కడ పిండితో తయారుచేసిన రెండు ప్రమిదలు, వాటిలో ఒత్తులు వేసి ఉన్నాయి. నేను ఆశ్చర్యంగా వాటివైపు చూస్తూ మా అత్తగారితో, "చూడండి! బాబా దీపాలు వెలిగించే అవకాశం నాకిచ్చారు. బాబాకు ఎంత కరుణ! తన బిడ్డలు కోరుకున్న కోరికలను ఆయన సదా నెరవేరుస్తుంటారు" అని అంటూ బహుశా ఎవరైనా వాటినక్కడ పెట్టి నూనె తేవడానికి వెళ్ళారేమో అనుకున్నాను. అక్కడే పది నిమిషాల పాటు ఎదురుచూస్తూ నిలబడ్డాను. కానీ ఎవరూ రాలేదు. మనసులో దీపాలు ఎప్పుడు వెలిగిస్తానా అని ఎంతో ఆత్రంగా ఉంది. బాబా ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని వదులుకోవాలని అనిపించలేదు. ఇంక ఎదురు చూడలేకపోయాను. అయితే నూనె లేదు. నూనె తేవడానికి వెళితే, 'తిరిగి వచ్చేలోపు ఆ ప్రమిదలు కనపడకపోతే?' అనే భయం. ప్రక్కనే ఉన్న పెద్ద ప్రమిద నిండా నూనెతో దీపం వెలుగుతోంది. దాన్ని చూసి అందులో నూనె కొద్దిగా తీసి ఆ రెండు ప్రమిదలలో పోసి దీపాలను వెలిగించాను. అలా బాబా నా చేత దీపాలు వెలిగించేసరికి నా కళ్ళు ఆనందభాష్పాలతో నిండిపోయాయి. ఆ సంతోషాన్ని, అనుభూతిని ఏమని చెప్పేది? మరుసటిరోజు బాబాకు ఒక లేఖ వ్రాసి సమర్పించుకున్నాను. ద్వారకామాయిలో కూడా బాబా ఆశీస్సులు చాలా లభించాయి. అలా నా మొదటి శిరిడీ దర్శనం బాబా కృపతో ఎప్పటికీ గుర్తుండిపోయేలా అద్భుతంగా జరిగింది.

మూడు సంవత్సరాల వయస్సులో వచ్చీరాని మాటలతో సాయి ఆరతులు పాడటం మొదలుపెట్టిన నేను 2019 జనవరిలో మహాపారాయణలో భాగస్వామినయ్యేవరకు ఒక్కసారి కూడా సాయి చరిత్ర పారాయణ చేయలేదు. ఏనాడూ అష్టోత్తరం చదవలేదు. కనీసం 'సాయి' అనే స్మరణ కూడా ఏకధాటిగా చేసింది లేదు. కానీ నా మనసు నిండా ఆయన ఆలోచనలే. ఆయన గుర్తొచ్చారా, నాకు నిద్ర కూడా పట్టదు. ఆయన ఊహల్లోనే నాకు తెల్లారిపోతుంది. నా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ప్రతిక్షణం నా మనసు నిండా ఆయననే నింపుకుంటాను. అంతటి అదృష్టాన్ని బాబా నాకు ప్రసాదించినందుకు నేను ఎంతో ధన్యురాలిని. "ఇంతటి భాగ్యాన్ని ప్రసాదించిన మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా! ఏ సేవా చేయని నన్ను మీరు సదా కనిపెట్టుకొని ఎంతో ప్రేమను పంచుతున్నా అప్పుడప్పుడు తోటి సాయిభక్తులతో పోల్చుకుంటున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను బాబా!"

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


సాయిభక్తుల అనుభవమాలిక 567వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. మానసిక, శారీరక ఉపశమనాన్ని ప్రసాదించిన బాబా
  2. ప్రతి కష్టం నుండి ప్రేమతో ఉపశమనం ప్రసాదిస్తున్న బాబా

మానసిక, శారీరక ఉపశమనాన్ని ప్రసాదించిన బాబా

సాయిబంధువులందరికీ సాయిరాం! ముందుగా ఏమీ ఆశించకుండా ఈ బ్లాగును నిర్వహిస్తూ సాయిభక్తులందరికీ ప్రతిరోజూ సాయిలీలామృతాన్ని ఆస్వాదించే సువర్ణ అవకాశాన్ని ఇస్తున్న అన్నయ్యకు ధన్యవాదాలు. 'బాబా అనుగ్రహం మీపై పూర్ణంగా ఉన్నందువలనే ఇంతటి ఘనమైన కార్యాన్ని మీరు చేయగలుగుతున్నారు. బాబా ఆశీస్సులు మీకు సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్యా!'

నా పేరు మంగళ. నేను బాబా భక్తురాలిని. నాకు బాబా చాలా అనుభవాలు ప్రసాదించారు. నాకు బాబా అంటే చాలా చాలా ఇష్టం. నా వరకు నాకు అంతా బాబానే. ఈ ప్రపంచంలో నాది అంటూ ఏమైనా ఉంటే అది బాబానే. ఆయనతో అనుబంధం ముందు వేరే బంధాలన్నీ నాకు శూన్యం. ఆయనను తలచుకోని క్షణం నాకు వ్యర్థం. ఆయన కన్నా అద్భుతం, ఆయన కన్నా అమూల్యం ఈ సృష్టిలో ఏమీ లేదు. సముద్రం యొక్క లోతునైనా కనుక్కోవచ్చు కానీ, బాబా ప్రేమను వివరించడం అసాధ్యం. ఆయన ద్వారకామాయిలో కొలువైన మాతృసాయి. ఆయన మనల్ని ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేరు. ప్రేమకు ప్రతిరూపమే నా సాయి. నా కోపాన్ని, ప్రేమని తల్లిలా భరించేది నా బాబానే. ఆయన ప్రేమలో, నీడలో ప్రశాంతమైన జీవనాన్ని ప్రసాదించిన బాబాకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. బాబా జననమరణాలకు అతీతుడు. ఎవరైతే బాబాను హృదయపూర్వకంగా ప్రేమిస్తారో వారెక్కడ ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి సమయం, సందర్భం అయినా బాబా సమాధానాన్ని పొందుతారు. ఏదో ఒక రూపంలో దర్శనమిచ్చి తన భక్తుల ప్రశ్నలకు సమాధానమిచ్చి వారి కోరికలు నెరవేరుస్తారు బాబా. అలా ఎల్లప్పుడూ ఆయన తన ఉనికిని చాటుతూనే ఉంటారు. కానీ, మనం మన అజ్ఞానం వల్ల గుర్తించలేకపోతున్నాము. "నేను నీతోనే ఉన్నాను, భయపడకు!" అని ఆయన ఇచ్చే సూచనలను గ్రహించలేకపోతున్నాము. బాబాకి ఇచ్చిన మాటననుసరించి అలాంటి అనుభవాన్ని నేను ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.  "బాబా! ఇదే నేను ఈ బ్లాగులో పంచుకుంటున్న మొదటి అనుభవం. కావున, నా భావాన్ని సరిగ్గా వ్యక్తపరిచేలా అనుగ్రహించండి తండ్రీ!"

2020, ఆగస్టు 17న ఉదయం గం. 9:30 నిమిషాల సమయంలో నేను వంటింట్లో పని చేస్తుండగా ఆకస్మాత్తుగా నా కాళ్ళుచేతులు, తొడభాగాలలో నొప్పులు మొదలయ్యాయి. ఆ నొప్పి భరించలేక, "ఏంటి బాబా! ఉన్నట్టుండి ఇలా అయిపోతోంది?" అనుకుంటూ వెళ్లి పడుకున్నాను. కాస్త జ్వరంగా కూడా అనిపించి, డోలో-650 టాబ్లెట్ వేసుకున్నాను. ధర్మామీటర్ కోసం వెతికాను కానీ, అది ఎక్కడా దొరకలేదు. రాత్రి పడుకునేముందు మళ్ళీ వెతికితే దొరికింది. అప్పుడు చెక్ చేసుకుంటే 101 డిగ్రీల జ్వరం ఉంది. అంత జ్వరం ఉన్నా నాకు ఎలాంటి భయం లేదు. ఎందుకంటే, బాబా నాతో ఉన్నారనే ధైర్యం. అయితే మరుసటిరోజు టాబ్లెట్ వేసుకున్నాక కూడా 101 డిగ్రీల జ్వరం ఉండటంతో నా మనసున కలవరం మొదలైంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో హాస్పిటల్‌కి వెళ్లి చూపించుకునేలా లేదు. ఎందుకంటే, నార్మల్ జలుబు, జ్వరాలను కూడా కోవిడ్ అంటారేమోనని భయం. ఆరోజు రాత్రి భయంతో, "బాబా! నాకు కరోనా వచ్చిందేమోనని మనసంతా చాలా ఆందోళనగా ఉంది. నాకు కరోనా కాకుంటే మీరు స్వప్నదర్శనమిచ్చి కరోనా లేదని ఏదైనా నిదర్శనం చూపించమ"ని బాబాని అడిగాను. ఆ రాత్రి సుమారు రెండున్నర తర్వాత నాకొక కల వచ్చింది. కలలో నేను, నా స్నేహితురాలు బాబా గుడిలో ఉన్నాము. మేము ఆరతిలో పాల్గొని, బాబాకు ఆరతికి ఇస్తున్నాము. ఆ ఆరతి దర్శనంతో నాకే ఆపదా లేదని బాబా నిదర్శనమిచ్చినట్లుగా అనిపించింది. అయినప్పటికీ నా మనసులో ఏదో తెలియని భయం. కారణం, తర్వాత రోజు కూడా జ్వరం తగ్గలేదు. పైగా నా శరీరం డీహైడ్రేషన్‌కి లోనవుతోందని తెలుస్తోంది.

తన బిడ్డ బాధలో ఉంటే బాబా చూస్తూ ఊరుకుంటారా? ఏదో ఒక రూపంలో ఆ బాధను తీసేస్తారు. సరిగ్గా అదే జరిగింది. నేను బాధపడుతున్న సమయంలో, ఒక సాయిబంధువు శిరిడీలోని బాబా మ్యూజియంకి సంబంధించిన వీడియో పంపించారు. అది చూడగానే నా దిగులంతా పోయి నా మనసు తేలికపడి చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే ఆ సాయిబంధువుతో మాట్లాడాను. తన మాటలు నాకెంతో ఓదార్పునిచ్చాయి. తను, "డీహైడ్రేషన్ పోవడానికి బాబా ఊదీ నీటిలో వేసుకుని, బాబా తీర్థంగా భావించి రెండురోజులు త్రాగండి. అంతా బాబా చూసుకుంటార"ని చెప్పింది. ఆరోజునుండి బాబాను తలచుకొని ఊదీనీళ్లు త్రాగడం మొదలుపెట్టాను. ఊదీ ప్రభావంతో రోజురోజుకీ జ్వరం తగ్గుతూ నా శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి చేరుకొని జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. బాబా నాకు కలలో (ని)దర్శనం ఇవ్వడమే కాకండా, ఒక భక్తురాలిని మిషగా చేసుకొని ఊదీతీర్థాన్ని సేవించమని సూచించారు. ఆవిధంగా తమ సహాయాన్ని అందించి నాకు మానసిక, శారీరక ఉపశమనాన్ని ప్రసాదించారు బాబా. సాయిలీలలు ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడే అద్భుతాలుగా జరగవు. మన చుట్టూ ఉన్న వ్యక్తుల, సంఘటనల ద్వారానే బాబా యొక్క దయ, కరుణ, రక్షణ అత్యంత సహజంగా మనకి అందుతుంది. ఆయన లీల ఎందుకు అలా ఉంటుందంటే, అన్నింటిలోనూ, అందరిలోనూ ఉండేది, మాట్లాడేది తామేనని గుర్తింపు మనకు కలగజేయడానికే. "థాంక్యూ బాబా! మీ సహాయానికి నా పాదాభివందనాలు. నేను సదా మీ స్మరణలోనే ఉండేలా అనుగ్రహించండి బాబా! నా కుటుంబ బాధ్యత మీదే. ఈ కరోనా బారినుండి మమ్మల్ని, ఇంకా అందరినీ రక్షించండి సాయీ!"

ఓం సాయిరాం!

ప్రతి కష్టం నుండి ప్రేమతో ఉపశమనం ప్రసాదిస్తున్న బాబా

సాయిభక్తురాలు లలిత ఇటీవల బాబా తనకు ప్రసాదించిన అనుభవాలను ఇలా పంచుకుంటున్నారు:
 
ఓం సాయిరామ్! సాయిబంధువులకు నా శతకోటి వందనాలు. బాబా నాకు ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. ఇటీవల నాకు గుండె నరాలలో చాలా నొప్పి కలిగింది. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, "ఈ బాధనుండి విముక్తి కలిగించండి బాబా, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. మరుసటిరోజు ఉదయానికల్లా నా భాధ తగ్గిపోయింది

మరోసారి తలనొప్పి మరియు కడుపునొప్పితో నేను చాలా ఇబ్బందిపడ్డాను. అప్పుడు కూడా బాబాను తలచుకొని కొద్దిగా ఊదీ నుదుటన పెట్టుకొని, మరికొంత ఊదీని నీటిలో కలుపుకొని త్రాగాను. అంతే, కొద్దిసేపటిలో నాకు ఆ బాధనుండి ఉపశమనం లభించింది. అంతా బాబా దయ. ఆయన కరుణ అపారమైనది. "ఎప్పుడూ మాతోనే ఉంటూ మమ్మల్ని ఆశీర్వదించండి బాబా. ఐ లవ్ యు బాబా".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo