సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 126వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. బాబా మనకు సదా సర్వదా రక్ష.
  2. సాయి ఆశీస్సులతో మా పాప ఆరోగ్యం వృద్ధి

బాబా మనకు సదా సర్వదా రక్ష.

నాపేరు మాధవి. నేను భువనేశ్వర్ నివాసిని. ఇదివరకు ఈ బ్లాగులో నేను చాలా అనుభవాలు పంచుకున్నాను. 2019, జులై 29న బాబా నన్నొక పెద్ద కష్టం నుంచి బయటపడేసారు. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. గత ఏడు నెలలుగా మేము చాలా కష్టాన్ని అనుభవిస్తున్నాము. ఇప్పుడిప్పుడే ఆ కష్టం నుండి కొంచంగా బయటపడుతున్నాము. కొత్త ఇంటికి మారితే పరిస్థితులు మారతాయనే ఉద్దేశ్యంలో భువనేశ్వర్ లో మాకున్న వేరే ఇంటికి మారుదామని అనుకున్నాము. ఆ వాస్తు చాలా బాగుటుంది. వంటగదిలో చిన్న చిన్న పనులు ఉంటే అవి చేయిస్తున్నాము. జులై 29న సన్మయిక్ సెలక్షన్ కోసం మా ఇంటి దగ్గరలో ఉన్న షాపుకి వెళ్ళాను. అక్కడినుండి తిరిగి వస్తుండగా ఒక వ్యక్తి నా వద్దకి వచ్చి, "ఇక్కడ ఏదన్నా ఇల్లు ఖాళీగా ఉందా?" అని అడిగాడు. నేను, "నాకు తెలీదు" అని చెపుతున్నాను. అంతలో అతను నా మెడలో ఉన్న బంగారు మంగళ సూత్రం కట్ చేసాడు. నేను గట్టిగా "చోర్... చోర్,,, 'బాబా .. బాబా' " అని అరిచాను. అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. అందరూ వచ్చారు. ఈలోగా అతడు నా చైన్ కట్ చేసి లాగుతున్నాడు. జనాలు రావడం చూసి అతను పరుగు తీసాడు. నేను అతను నా చైన్ తీసుకుని పారిపోయాడు అనుకుని, మంగళసూత్రాలు పోవడం శుభసూచకం కాదని చాలా బాధతో, "బాబా! నా మంగళసూత్రం నాకు ఇప్పించు" అని బాబాను వేడుకున్నాను. అంతలో జనం మధ్యలో నుంచి ఒక కారు డ్రైవర్ వచ్చి, "మేడం, మీ చైన్ పోలేదు. చూసుకోండి!" అన్నాడు. బాబా దయవల్ల చైన్ చీరలోనే పడిపోయి ఉంది. మంగళసూత్రాలు, బాబా లాకెట్ చైన్ తోపాటు ఉన్నాయి. రెండు పూసలు మాత్రమే పోయాయి. బాబా నన్ను ఎలా రక్షించారోగాని, అన్నీ నా చీరలోనే పడి ఉన్నాయి. ఆయన దయవలన ఆ కష్టం నుంచి బయటపడ్డాను. "ధన్యవాదాలు బాబా". బాబా మనకు సదా సర్వదా రక్ష అనేదానికి ఇదే ఒక పెద్ద ఉదాహరణ.

సాయి ఆశీస్సులతో మా పాప ఆరోగ్యం వృద్ధి

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను చాలా ఏళ్ళుగా సాయిబాబా భక్తురాలిని. నేనెప్పుడూ ఆయన దివ్యపాదాల చెంత ఉండాలని కోరుకుంటాను. నేనెన్నో పొరపాటు ఆలోచనలు చేశాను. కరుణామూర్తి అయిన తల్లిలాంటి సాయి నన్ను క్షమిస్తారని అనుకుంటున్నాను. నేను చాలా సందర్భాలలో ఆయన ఉనికిని అనుభూతి చెందాను. నా బిడ్డ ఆరోగ్యం వృద్ధి చెందడంలో బాబా ఆశీస్సులను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

మాకు పెళ్ళైన చాలాకాలం వరకు సంతానం కలగలేదు. కానీ ఆలస్యంగా అయినా సరే బాబా ఆశీస్సులతో నేను గర్భం దాల్చాను. మా పాప పుట్టుక కూడా సాయి చేసిన అద్భుతం వలనే సాధ్యమైంది. తనకు రెండేళ్లు వచ్చాక మేము హఠాత్తుగా తన పెరుగుదలలో, మాట్లాడటంలో లోపం గమనించాము. తను చేయి పైకి ఎత్తలేకపోయేది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేది కాదు. ఇంకా ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. ఒక తల్లిగా నేను తనతో ఎక్కువ సమయం గడపకుండా చాలా పెద్ద తప్పు చేశాను. అందుకే సమస్య మాకు ఆలస్యంగా తెలిసింది. మేము పిల్లల డాక్టరుని సంప్రదించాము. తన ప్రవర్తనకు సంబంధించిన వివరాలన్నీ తెలుసుకున్నాక డాక్టరు తన సమస్యను 'ఆటిజం' అంటారనీ, ఆ సమస్య వలన వయసుకు తగినట్లు ఎదుగుదల ఉండక ఆలస్యం అవుతుందని చెప్పారు. ఆ మాటలు వింటూనే నాకు, మావారికి నోట మాట రాలేదు. నా గుండె పగిలిపోయింది. ఎడతెరిపి లేకుండా ఏడుస్తూనే ఉండేదాన్ని. ఆ స్థితిలో ఒకరోజు క్వశ్చన్ & ఆన్సర్ సైట్ లో బాబాని అడిగితే, "నిదానంగా నీ బాధలు సమసిపోతాయి. మీరు ఇబ్బందులు మరియు వ్యాధుల నుండి విముక్తి పొందుతారు" అని వచ్చింది. ఆ వాక్యాలు చదివాక బాబా చెప్పింది ఎప్పుడూ సత్యమై తీరుతుందన్న నమ్మకంతో ఏడవటం ఆపేశాను.

తరువాత డాక్టరు చికిత్స మొదలుపెట్టారు. మేము తనని ప్రీ-స్కూలులో జాయిన్ చేశాము. మేము కూడా తనతో ఎక్కువ సమయం గడుపుతూ, "బాబా! తనకు జరుగుతున్న చికిత్స బాగా పని చేయాలి" అని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. నవ గురువారవ్రతం కూడా చేశాను. తనకిప్పుడు మూడేళ్లు వచ్చాయి. తన పరిస్థితిలో చాలా వృద్ధి కనిపిస్తుంది. తనిప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం చేస్తోంది. తన అవసరాలను అడగలేక పోతున్నప్పటికీ చాలా మాటలు మాట్లాడుతుంది. తను సాయిబాబా నామం, ఇంకా ఇతర దేవతల పేర్లు పలుకుతూ ఉంటే మాకెంతో ఆనందంగా ఉంది. ఇదంతా బాబా ఆశీస్సులతోనే సాధ్యమైంది. ఆయన చెప్పేది ఎప్పుడూ సత్యమై తీరుతుంది. త్వరలోనే బాబా ఆశీస్సులతో తను పెద్ద పెద్ద వాక్యాలు మాట్లాడుతూ, తన అవసరాలను కూడా అడుగుతుందని నేను ఆశిస్తున్నాను. పూర్వకర్మానుసారం ఎవరైతే ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారో వాళ్లందరికీ బాబా ఆశీస్సులు అందుగాక! ఆయన ఆశీస్సులతో భక్తులందరూ ఆనందకరమైన జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను.
source: http://www.shirdisaibabaexperiences.org/2019/06/shirdi-sai-baba-miracles-part-2388.html

పని విలువ


1946వ సంవత్సరం మే నెలలో ఒకరోజు వసంత్ ప్రధాన్, అతని స్నేహితుడు శిరిడీ సందర్శించారు. ఆ సాయంత్రం వేడి తగ్గుతూ ఆహ్లాదకరమైన గాలి వీస్తోంది. 'వయస్సు పైబడివుండి, బాబాను కలిసిన వ్యక్తి ఎవరైనా కనపడతారా?' అనే ఆశతో స్నేహితులిద్దరూ గ్రామంలో నడుస్తున్నారు. బాబాకి సంబంధించిన లీలలు, ఆసక్తికరమైన విషయాలు ఆ వ్యక్తి చెప్తారేమోనని వారి ఉద్దేశ్యం.

చిన్నచిన్న వీధులలో వారిరువురు నడుస్తుండగా ఒక ముస్లిం పెద్దమనిషి కనపడ్డారు(దురదృష్టవశాత్తు ఆ పెద్దమనిషి పేరు తెలియపరచలేదు). అతను ఒక రాయిమీద కూర్చుని బీడీ తాగుతున్నాడు. వసంత్ అతనిని, "బాబా, మీరు శిరిడీ గ్రామస్థులా?" అని అడిగాడు. అతను ఆతురతగా తల ఆడించాడు. అప్పుడు వసంత్ అతనితో, "బాబా గురించి, మీకు జరిగిన ఏదైనా అనుభవం గురించి మాకు చెప్పండి" అని అభ్యర్థించాడు. అందుకతను ఇలా చెప్పడం మొదలుపెట్టాడు: 

"నేను బాబా దగ్గర కూర్చునేవాడిని. ఆయన ఇచ్చిన చిలుం పీల్చేవాడిని. ప్రతిరోజూ నేను ఆయన దర్బారుకు వెళ్ళి, ఆయన చెప్పేవి జాగ్రత్తగా వినేవాడిని. బాబా వింతగా మాట్లాడేవారు. ఎప్పుడైనా ఏ భక్తునికైనా ఏదన్నా చెప్పాలని అనుకుంటే, ఆయన వేరెవరివైపో చూస్తూ సందేశం లేదా సలహా చెప్పేవారు. ఆయన చూపు ఎవరిపై ఉందో ఆ వ్యక్తి గాభరాపడేవాడు. కానీ ఏ వ్యక్తిని ఉద్దేశించి ఆయన చెప్తున్నారో ఆ వ్యక్తి మాత్రం చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా ఆ సందేశాన్ని వినేవాడు. తరువాత ఆ వ్యక్తి ఆయన పాదాలమీద పడి ఆ సలహాను పాటించేవాడు. ప్రతిరోజూ బాబా విస్తారంగా డబ్బులు పంచేవారు. ఆయన 5, 10, 50 మరియు 100 రూపాయలు అక్కడ కూర్చుని ఉన్న భక్తులకు ఇచ్చేవారు. అయితే నాకు మాత్రం ఆయనెప్పుడూ డబ్బులు ఇవ్వలేదు. నాకు ఒక చిన్న పొలం ఉండేది. దానిద్వారా వచ్చిన దాంతోనే నేను నా జీవితాన్ని సర్దుబాటు చేసుకునేవాడిని. ఒకరోజు నేను, "బాబా! మీరు మీ భక్తులందరికీ విరివిగా డబ్బులు పంచిపెడతారు. నేను చాలా పేదవాడిని, అయినప్పటికీ మీరు నాకెప్పుడూ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు" అని అన్నాను. అప్పుడు బాబా, "అరె! నీకెందుకు డబ్బులు కావాలి? నీ పొలంలో బంగారుకుండ ఉంది" అని అన్నారు. మరుసటిరోజు నేను జాగ్రత్తగా పొలం దున్ని, సరిపడేంత ఎరువు వేసి, గింజలు నాటాను. బాబా మాటలు నా చెవిలో మారుమ్రోగుతుండగా ప్రతిరోజూ జాగ్రత్తగా పనిచేసేవాడిని. సమయం దొర్లిపోయింది కానీ బంగారుకుండ కనపడలేదు. అయినా నా శ్రమవలన ప్రతిసారీ విస్తారమైన పంట వచ్చేది. తొందరలో నేను ప్రక్కనున్న మూడు పొలాలు కొనగలిగాను. నా దగ్గర సరిపడా ధనం చేరింది. కొన్ని సంవత్సరాల తరువాత నేను బాబాతో, "నేనింకా బంగారుకుండను కనుగొనలేకపోయాను" అని అన్నాను. ఆయన నవ్వుతూ, "ప్రయత్నం చేస్తూ ఉండు" అని అన్నారు. తరువాత బాబా మాటలు నిజమయ్యాయి. నేనిప్పుడు ఐశ్వర్యవంతుడిని. చాలా సంతోషంగా ఉన్నాను. నా శ్రమ, ఆయన అనుగ్రహం రెండూ కలిస్తే బ్రహ్మండమైన పంట పండుతుందని ఆయన నాకు తెలియజేశారు". ఆ క్రమంలో నేను నేర్చుకున్నది ఏమిటంటే, బాబాను ఎల్లవేళలా జ్ఞప్తియందు ఉంచుకుని శ్రద్ధగా పని చేసినట్లయితే తప్పక విజయం సాధిస్తాము అని.

వసంత్ కూడా ఈ కథ వల్ల పాఠం నేర్చుకున్నాడు. శ్రీసాయిసచ్చరిత్ర 19వ అధ్యాయంలో హేమాడ్‌పంత్ ఇలా వ్రాసారు: "మీరు మీ సామర్థ్యాన్నంతా పెట్టి కష్టపడి పనిచేయండి. నేను గిన్నెడు పాలతో మీ ప్రక్కనే నిలబడి ఉంటాను. మీరు కష్టపడక పోయినట్లైతే నేను గిన్నెడు పాలతో మీ ప్రక్కన నిలుచుంటానని ఆశించవద్దు".

బాబా చదువుకున్న, చదువుకోని భక్తులకు సుళువైన పద్ధతిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్పుతారు. ఆయన అంతటా, అన్నిచోట్లా ఉన్నారు. ఆయన సర్వాంతర్యామి.

Ref : సాయి ప్రసాద్ మ్యాగజైన్, దీపావళి సంచిక, 1992.
Source: Baba’s Divine Manifestations  compiled by Vinny Chitluri.

సాయిభక్తుల అనుభవమాలిక 125వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. ఇండియా ట్రిప్పులో అనుభవాలు
  2. ఊదీ ఇచ్చిన మానసిక ప్రశాంతత

ఇండియా ట్రిప్పులో అనుభవాలు

నేను గత కొన్ని సంవత్సరాలుగా సాయిబాబా భక్తురాలిని. మేము యుఎస్ఏలో నివాసముంటున్నాము. ఒకసారి నేను వీసా స్టాంపింగ్ కోసం పదిరోజులు సెలవు పెట్టి, మా అమ్మాయిని మావారి వద్ద వదిలిపెట్టి ఇండియా వెళ్ళాను. ఒక్కరోజులో H4 స్టాంపింగ్ పూర్తి ఐపోతుందన్న ఆలోచనతో వీసా ఆఫీసుకు వెళ్ళాను. కానీ వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ కోసం పంపించారు. ఆ ప్రక్రియ పూర్తికావటానికి చాలారోజులు పడుతుంది. అన్నిరోజులు మావారు ఒక్కరే మా అమ్మాయిని చూసుకోవడం కష్టమైపోతుందని ఆందోళనపడి బాబాను ప్రార్థించాను. నా తిరుగుప్రయాణం బుధవారంనాడు ఉందనగా సోమవారమే వీసా వచ్చేలా బాబా అనుగ్రహించారు.

ఆ సమయంలోనే నేను నా కజిన్స్‌తో కలిసి శిరిడీ వెళ్ళాను. మేము గురువారం శిరిడీ చేరుకుని బాబా దర్శనానికి వెళ్ళాము. బాబా కృపతో చక్కటి దర్శనమైంది. అక్కడి పూజారి సచ్చరిత్రను బాబా పాదాలవద్ద పెట్టి పువ్వులతోపాటు నాకు తిరిగిచ్చారు. మరుసటిరోజు ఉదయం మేము కాకడ ఆరతికి వెళ్ళాము. బాబా సమక్షంలో దాదాపు గంట సమయం ఉండే భాగ్యం దక్కింది. నా మనస్సులో కొన్ని వేపాకులు కావాలని ఆశపడ్డాను. రెండురోజులు ఎంతగానో వెతికాను కానీ, ఒక్క ఆకు కూడా దొరకలేదు. "ఏమిటి బాబా, నాకు వేపాకు దొరకలేదు" అనుకున్నాను. బాబా తన భక్తులని నిరాశపరచరు. ఆయన నన్ను ఆశీర్వదించారు. మేము బాబా విగ్రహం తీసుకోవడానికి దగ్గరలో ఉన్న షాపులకు వెళ్ళాము. మేము వెళ్లిన రెండో షాపతను కొన్ని వేపాకులు, బాబా కోసం ఉపయోగించిన ఒక క్లాత్ ఇచ్చాడు. నా ఆనందాశ్చర్యాలకు అంతులేదు. బాబా ఎంత గొప్పగా అనుగ్రహిస్తారో కదా! ప్రెగ్నెన్సీతో ఉన్న నాకు ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా బాబా చూసుకున్నారు.

నా తిరుగుప్రయాణానికి సంబంధించిన టిక్కెట్లను తక్కువధర ఉందని ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్‌లో బుక్ చేయడానికి ప్రయత్నించాను. నేను అన్ని వివరాలు పూర్తి చేసి కన్ఫర్మ్ బటన్ నొక్కేసరికి అప్పుడే ధరలో మార్పు జరిగిందని టికెట్ బుకింగ్ కాలేదు. తరువాత బ్యాంకు ట్రావెల్ వెబ్‌సైటు నుండి టికెట్ బుక్ చేయడానికి ప్రయత్నించాను, కానీ సాధ్యపడలేదు. చివరికి బాబా అనుగ్రహం వలన నేను ముందు అనుకున్న అదే ధరకి ట్రావెల్ వెబ్‌సైట్ ద్వారా టికెట్ బుకింగ్ అయింది. కానీ నా పాస్‌పోర్టు రావడంలో ఆలస్యమై నా ప్రయాణం గురువారానికి మార్పు చేసుకోవలసి వచ్చింది. టికెట్స్ మార్పు చేసుకోవడానికి అయ్యే ఖర్చు ఎయిర్‌లైన్ వెబ్‌సైట్‌తో పోల్చితే ట్రావెల్ వెబ్‌సైట్‌లో చాలా తక్కువగా ఉంది. బాబా నాకు తెలియకుండానే అన్నీ అనుకూలంగా మలిచారు. ఒకవేళ నా మొదట ప్రయత్నంలో ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ అయుంటే నేను డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వచ్చేది. బాబా తన బిడ్డలకు ఏది మంచిదో అది ఇస్తారు. బాబా కృప లేకుంటే నా ఇండియా ట్రిప్ ప్రశాంతంగా జరిగేది కాదు. నేను చాలాసార్లు నాకు కావలసిన వాటికోసం ఆయనతో పోరాడినప్పటికీ ఆయనెప్పుడూ నాకేది మంచిదో అదే ఇస్తున్నారు.

source: http://www.shirdisaibabaexperiences.org/2019/06/shirdi-sai-baba-miracles-part-2389.html

ఊదీ ఇచ్చిన మానసిక ప్రశాంతత

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి. నేను బాబా భక్తురాలిని. నేను డిల్లీ నివాసిని. నాకు జరిగిన ఒక అద్భుతమైన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను చాలా సున్నిత మనస్కురాలిని. నేను ఏ మరణవార్త విన్నా చాలా బలహీనపడిపోతాను. అలాంటి పరిస్థితులలో ఒంటరిగా ఉండడానికి చాలా భయపడతాను. ఒకసారి మా సంఘంలోని నిర్వాహకులు ఒకరు మరణించారు. ఆ వార్త విన్న నేను, "బాబా! ఈ పరిస్థితి నుండి బయటపడే ధైర్యాన్ని ఇవ్వండి" అని ప్రార్థించాను. నిద్రపట్టేలోపు ప్రతి గంటకోసారి టానిక్, మెడిసిన్, ఊదీ తీసుకుందామని అనుకున్నాను. కేవలం 2 సార్లు తీసుకునేసరికి నా మనస్సు చాలా ప్రశాంతమైపోయింది. అంతకుముందు ఎప్పుడూ అలా జరగలేదు. నిజానికి నేను అలాంటి వార్తలు విన్నట్లైతే కనీసం 2 రోజులు అందులోనుండి బయటకు రాలేను. అంతా బాబా దయ, ఆయన ఊదీ మహిమ. ఊదీకి సమానమైన ఔషధం వేరేదీ లేదు. మన బాబాను మించిన వైద్యుడు లేడు. కేవలం మనకు బలమైన విశ్వాసం ఉండాలి అంతే.

జై బోలో సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబాకు లేని కులం - బాబా బిడ్డలకెక్కడిది?


కులతత్వాన్ని, కులాభిమానాన్ని, అంటరానితనాన్ని మహాత్ములంతా నిరసించారు. శ్రీసాయి సంప్రదాయంలో కులానికి ఇసుమంతైనా చోటులేదు. తానో అగ్రకులస్థుడను అనిన  అహంకారం తలకెక్కిన ఒక భక్తుని, “నీ శరీరంలోనే ఒక హీనజాతి వాడున్నాడు. ముందు వాణ్ణి బయిటకు వెళ్లగొట్టు!” అంటూ మందలించారు. తమ కులమతాలేమిటని బాబాను ప్రశ్నించిన ధూలియా కోర్టు ప్రతినిధితో, తమది 'కబీరు మతమని, తమ కులం 'దైవం' (“పర్వర్డిగర్") అనీ సమాధామిచ్చారు బాబా. బాబాకే లేని 'కులం' బాబా బిడ్డలైన సాయి భక్తులకెక్కడిది?

“ఆ తండ్రికి తగ్గ బిడ్డలు కండి!” అని బాబా మనకుద్బోధించారు. కులం, కులతత్వం, కులాభిమానం మన హృదయాంతరాళాల నుండి వీడనంతవరకు మనం సాయిభక్తులము ఎన్నటికీ కాలేము. మన "కులాన్ని మనం విడిచిన నాడే ఆ సమర్థ సద్గురు కులం” లో స్థానం సంపాదించగలం.

కులాభిమానాన్ని తమ భక్తుల మనస్సుల నుండి తుడిచెయ్యడానికి బాబా ఎలా యత్నించేవారో తెలిపే సంఘటన - మచ్చుకు ఒకటి ఇక్కడ తెలుసుకుందాం:

ఒకసారి దామోదర్  రస్నే అనే భక్తుడు ఒక సందర్భంగా తన ఇంట్లో చిన్న విందు ఏర్పాటు చేసాడు. బాబా వద్దకెళ్ళి బాబా తరఫున, బాబా సేవకుడైన బాలాపాటిల్ ను భోజనానికి పంపమని వేడుకొన్నాడు. బాలాపాటిల్ తక్కువ కులానికి చెందినవాడు.  రస్నే  అభ్యర్థనను బాబా ఒక షరతు మీద అంగీకరించారు. “బాలాపాటిల్ అలాగే మీ ఇంటికి భోజనానికొస్తాడు! కానీ, అక్కడ అతణ్ణి ధూత్ ధూత్' (దూరం, దూరం!) అని కేకలేస్తూ, మీరు భోంచేసే చోట కాకుండా, దూరంగా భోజనం వడ్డించకూడదు” అని హెచ్చరించారు బాబా. బాబా ఆదేశానుసారం  రస్నే బాలాపాటిల్ ను తన ఇంటికి సగౌరవంగా తోడ్కొనిపోయి, తన భోజనాల గదిలో తన ప్రక్కనే కూర్చొనబెట్టుకొని, అతనితో బాటే భోజనం చేసాడు.

సోర్సు : సాయిపథం వాల్యూం  - 1

సాయి అనుగ్రహసుమాలు - 83వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 83వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం -146

శ్రీ కృష్ణారావ్ పారుళ్ కర్ గారి ఇంకొక అనుభవం

శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ గారి పుత్రుడు చిరంజీవి బాబు యొక్క వివాహం ఖండ్వాలో జరిగింది. లగ్నం యొక్క తిథి షష్టి లేదా అష్టమి అనుకుంటాను. వివాహానికి ఇక్కడ అందరికీ ఆహ్వానం అందింది. కాని, ఆ రోజులలోనే శ్రీ సదాశివరావు ఘండీరాజ్ నాయక్ గారి తల్లిగారు తీవ్రంగా అస్వస్థులై ఉన్నారు. ఆమె ఏ క్షణంలో పోతారో తెలియని పరిస్థితి నెలకొంది. వివాహానికి హాజరు కావాల్సిన వారిలో నాయిక్ కుటుంబం ఉంది. వివాహానికి 4-5 రోజులే ఉంది. ఒకరోజు సాయంకాలం మేమందరం కూర్చొని ఉండగా, శ్రీ కృష్ణారావు లక్ష్మణ్ నాయిక్ “కాకాసాహెబ్ గారి ఇంట్లో వివాహానికి వెళ్లాలని  చాలా కోరికగా ఉంది. కానీ సాధూభయ్యా, మీ తల్లిగారి విషయం అడ్డు వస్తుందేమోనని చాలా భయంగా ఉంది” అని అన్నారు. అప్పుడు సాధూభయ్యా “ఆమె పరిస్థితి చూస్తే అలాగే ఉంది” అని అన్నారు. తరువాత తెల్లవారుఝామున బాబా వచ్చి నా ముందు నిలబడ్డారు (దృష్టాంతం). ఆ సమయంలో నేను సగం మేల్కొనే ఉన్నాను. అప్పుడు బాబా నాతో “సాధుతో చెప్పు, తన తల్లిగారి విషయం కాకా ఇంట్లో వివాహానికి అడ్డురాదు. తాను ఏకాదశి నాడు పోతుంది” అని చెప్పారు. మరుసటి రోజు ఉదయం నేను ఆ కలను సాధూభయ్యా ఇత్యాది మండలికి చెప్పాను. బాబాపై విశ్వాసముంచి అందరం వివాహానికి వెళ్ళాము. చమత్కారమేమిటంటే, వివాహ సమారంభం పూర్తయ్యాక, శ్రీ సాయి సమర్థులు చెప్పిన విధంగానే, సాధూభయ్యా గారి తల్లిగారు ఏకాదశి రోజు 12 గంటలకు నిర్యాణం చెందారు.

శ్రీ హరి సీతారాం దీక్షితకు వచ్చిన అనుభవం

ఒకసారి నేను బాబా వద్ద కూర్చొని ఉండగా బాబా విపరీతమైన దగ్గుతో బాధపడసాగారు. బాబా పడుతున్న అవస్థ చూసి నేను మనసులో ఒకటే ఆందోళన పడసాగాను. చివరకు నేను బాబాతో “బాబా, మీరు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మేము మీకు ఏ విధంగాను ఉపయోగపడలేకపోతున్నాము” అని అన్నాను. అప్పుడు బాబా “నేను నీకు బాగా ఉపయోగపడతాను” అని మాత్రమే అన్నారు. మరుసటిరోజు నేను ముంబాయికి వెళ్ళడానికి ఆజ్ఞ లభించడంతో నేను ముంబాయికి వచ్చాను. నేను ముంబాయికి వచ్చేటప్పటికి నా జ్యేష్ఠ సోదరుడు అనారోగ్యానికి గురయ్యారని నాగపూర్ నుండి ఉత్తరం వచ్చింది. తనను చూడటానికి నేను నాగపూర్ కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక బాబా మాటలలోని అర్థం బోధపడింది. ఆ విషయమంతా నేను నాగపూర్ నుండి ఒక స్నేహితునికి వ్రాసిన ఉత్తరం ద్వారా పాఠకులకు స్పష్టంగా అర్థమవుతుందని ఆ ఉత్తర సారాంశాన్ని క్రింద ఇస్తున్నాను. శ్రీ హరి సీతారాం దీక్షిత్ గారు ఒక స్నేహితునికి వ్రాసిన ఉత్తరంలోని సారాంశం వ్రాయడానికి చాలా ఆనందంగా ఉంది. నిన్నటి నుండి భాయీజీ (కాకాసాహెబ్ గారి జ్యేష్ఠసోదరుడు) గారి ఆరోగ్యం కొంచెం కొంచెం కుదుటపడసాగింది. ఆదివారం రోజు భాయిజీ ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. నాకు టెలిగ్రాం ఇవ్వమని భాయీజీ చెప్పారు. కాని ఆ రోజు డాక్టర్ త్వరగా వచ్చి ఇంతలోనే టెలిగ్రాం ఇవ్వద్దని చెప్పారు. ఇంతలో పరమదయాళువు అయిన బాబా దర్శనం ఇచ్చారు. అదేరోజు రాత్రి భాయీజీ స్నేహితునికి ఒకరికి అదే అర్థంతో దృష్టాంతం ప్రసాదించారు. “నేను నీకు చాలా ఉపయోగపడతాను” అని ఏ రోజయితే నాతో అన్నారో, ఆయన దృష్టాంతం ప్రసాదించింది కూడా ఆ రోజే! ఎంతటి కరుణ, ఎంతటి అగాథ శక్తి. "అనంతా ముఖాఛ శిణే శేషగాత” అనేది ఏమీ అబద్దం కాదు. మనలాంటి మూఢజీవులకు ఆయన దగ్గుతో బాధపడుతూ కనపడతారు. కానీ అదే సమయంలో ఆయన ఎక్కడ ఏమి చేస్తారో ఆయనకే ఎరుక. ఆయన చరణాల వద్ద ఆశ్రయం లభించడమే నాకు కలిగిన పరమభాగ్యం. జన్మజన్మలకు ఆ పరమభాగ్యం దూరం కాకూడదని నా ప్రార్థన. నా జ్యేష్ఠ సోదరునికి ఇంట్లో తిరగడానికి ఇంకో ఐదు, ఆరు రోజులు పడుతుంది. నేను ఇంకా ఇక్కడ ఎనిమిది రోజులు ఉంటాను అని అనుకుంటున్నాను.

సమాప్తం.

గమనిక: ఈరోజుతో దీక్షిత్ డైరీ ముగిస్తున్నాము. అయితే విజయ్ కిషోర్ గారి దీక్షిత్ డైరీ పుస్తకం నందు ఇంకా చాలా సమాచారం ఉంది. ఆయన వ్రాసిన బుక్స్ క్రింద ఇవ్వబడిన అడ్రస్సు నందు లభ్యమవుతాయి.


పి. విజయ్ కిషోర్.
ప్లాట్ నెంబర్: 202, ప్లాట్ నెంబర్: 97,
ధనుంజయ నెస్ట్,
హైదరాబాద్ -500045.
ఫోన్ నెంబర్: 040 - 23831510.


శిరిడీలో ద్వారకామాయికి ఎదురుగా ఉన్న ద్వారకామాయి ఎంపోరియంలో కూడా బుక్స్ లభిస్తాయి.

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

సాయిభక్తుల అనుభవమాలిక 124వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. నా కల నెరవేర్చిన సాయి
  2. ఒక్క టాబ్లెట్ కూడా అవసరం లేకుండా నా సమస్యకు పరిష్కారం చూపారు బాబా

నా కల నెరవేర్చిన సాయి

ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను విదేశాల్లో ఉద్యోగం కోసం అన్నిరకాలుగా ప్రయత్నించాను. కానీ నా ప్రయత్నాలేవీ ఫలించలేదు. నా జీవితంలో ముఖ్యమైన ఈ కల నెరవేరే మార్గం కనపడక నేను బాధతో చాలా ఏడ్చాను. నా భార్య నన్ను ఓదార్చి 'సాయిసచ్చరిత్ర' నాకిచ్చి, పూర్తి విశ్వాసంతో చదవమని చెప్పింది. అప్పటికి సాయిపై నాకు ఏమాత్రం నమ్మకం ఉండేదికాదు. కానీ సచ్చరిత్ర చదవడం మొదలుపెట్టాక నా అనుభవం వేరేలా ఉంది. చదువుతూ ఉంటే నా చెంపలపైనుంచి జలజలా కన్నీళ్లు జారిపోతూ ఉండేవి. బాబా నన్ను గమనిస్తూ ఉన్నారనే అనుభూతి కలగసాగింది. అప్పటినుండి నా జీవితంలో బాబా మిరాకిల్స్ మొదలయ్యాయి.

మొదటి అనుభవం:

మేము శిరిడీ వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము. అయితే మా తిరుగు ప్రయాణం టిక్కెట్లు కన్ఫర్మ్ కాలేదు. అయినప్పటికీ నేను నా కుటుంబంతో శిరిడీ వెళ్ళాను. తిరిగి రావడానికి కావాల్సిన టిక్కెట్లను బాబా అనూహ్యరీతిన ఏర్పాటు చేసారు. ట్రైన్ డోర్ దగ్గర నిల్చొని ఉన్నప్పుడు సచ్చరిత్రలోని, "నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను" అన్న వాక్యం గుర్తుకు వచ్చి నాకు కన్నీళ్లు వచ్చేసాయి. "థాంక్యూ సో మచ్ బాబా!"

రెండవ అనుభవం:

శిరిడీనుండి వచ్చిన నెల తరువాత ఒకరోజు నేను ఏజెంటుని కలవడానికి వెళ్తుంటే దారిలో ఒక స్నేహితుడు కలిసాడు. మాటల్లో ఏజెంట్ ప్రస్తావన రాగా తను, "ఆ ఏజెంట్ నా స్నేహితుడే" అని చెప్పాడు. మేము చాలాకాలంగా స్నేహితులమైనప్పటికీ మా మధ్య ఎప్పుడూ ఏజెంటుకి సంబంధించిన ప్రస్తావన రాలేదు. అలా నా స్నేహితుడి ద్వారా ఉద్యోగానికి సంబంధించిన నా కల నెరవేరింది.

అక్కడితో సాయి చేసే అద్భుతాలు ఆగలేదు. ఉద్యోగం వచ్చిన తరువాత కేవలం రెండు సంవత్సరాలలో ఆరు ప్రమోషన్లతో నన్ను ఆశీర్వదించారు బాబా. అదీ నా సాయి అంటే! ఆయన ఏదైనా చేయగలరు. "లవ్ యూ సాయీ! దయచేసి అందరికీ మీ సహాయాన్ని అందించండి. అన్నిటికీ మీకు నా కృతజ్ఞతలు బాబా!"

ఒక్క టాబ్లెట్ కూడా అవసరం లేకుండా నా సమస్యకు పరిష్కారం చూపారు బాబా

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! నేను నా చిన్ననాటినుండి సాయిబాబా భక్తురాలిని. పరిస్థితులు ఎంత కఠినమైనవైనా నేను ఆయనపైనే ఆధారపడి ఉంటాను. నాకు చాలా అనుభవాలున్నాయి. వాటిలో ఒకటి నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

నేను నా తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ పూణేలో ఉద్యోగం చేస్తున్నాను. నేను చాలా చాలా సన్నగా ఉంటాను. నాకు ప్రతినెలా నెలసరి రాక చాలా ఇబ్బందిపడుతున్నాను. చాలా సంవత్సరాలుగా నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను. ఈ విషయమై పరిష్కారం కోసం ఎవరిని సంప్రదించినా ప్రయోజనం లేకుండా పోయింది. వాళ్లంతా 'సరైన ఆహారం తీసుకుంటే అంతా సరైపోతుంది' అని చెప్తుండేవారు. ఇటీవల మళ్ళీ ఒకసారి ఈ సమస్య మూడునెలలపాటు నన్ను కలవరపెట్టింది. దానివలన నేను ఆఫీసులో పనిచేయలేక చాలా అలసిపోతుండేదాన్ని. డాక్టరు దగ్గరకు వెళితే, అతను నాకు టాబ్లెట్లు ఇచ్చి, "రోజుకు మూడుపూటల చొప్పున మూడునెలలపాటు వాటిని వాడమ"ని సూచించారు. నేను మరుసటిరోజు నుండి ఆ టాబ్లెట్లను వాడటం మొదలు పెడదామని అనుకున్నాను. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం బాబా ముందు దీపాలు వెలిగించి, ఆయనను ప్రార్థించడం నాకు అలవాటు. అంతేకాదు, బాబాకు పెట్టిన నైవేద్యాన్ని స్నేహితులతో పంచుకొని తినడం కూడా అలవాటు. ప్రతిరోజులాగే ఆరోజు సాయంత్రం హాస్పిటల్ నుండి వచ్చి, ఫ్రెషప్ అయ్యి బాబా పూజ మొదలుపెట్టాను. "బాబా! నా సమస్యను పరిష్కరించండి. నా నెలసరి సక్రమంగా వచ్చేటట్లు చేసి నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించండి" అని ప్రార్థించి, ఉదయం బాబాకు పెట్టిన ఆపిల్ తీసుకుని, ఎవరికీ పంచిపెట్టకుండా మొత్తం నేనే తిన్నాను. నేను ఆశ్చర్యపోయేలా ఉదయం నిద్రలేవగానే బాబా నా సమస్యను పరిష్కరించేసారు. కనీసం ఒక్క టాబ్లెట్ కూడా అవసరం లేకుండా నా సమస్యకు పరిష్కారం చూపారు. పట్టలేని ఆనందంతో బాబా ముందు ఏడ్చేశాను. భక్తులకు అత్యవసరమైనప్పుడు రక్షణనివ్వడానికి బాబా పరుగున వస్తారు.


సాయిభక్తుల అనుభవమాలిక 123వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. అమ్మకి కంటిచూపు ప్రసాదించిన సాయి
  2. ఇష్టంలేని వివాహంనుండి బాబా నన్ను రక్షించారు

అమ్మకి కంటిచూపు ప్రసాదించిన సాయి

సాయిభక్తులకు నమస్కారం. నా పేరు గాయత్రి. నా నివాసం మంగుళూరు. బాబా మాపై చూపుతున్న కరుణను బ్లాగు ద్వారా సాయిభక్తులతో పంచుకోవాలని అనుకుంటున్నాను.

మా కుటుంబసభ్యులందరికీ సాయిబాబా అడుగడుగునా అండగా ఉంటూ ఆపదలనుండి కాపాడుతున్నారు. పది సంవత్సరాల క్రితం 2009లో మా అమ్మగారు తీవ్రమైన షుగర్ వ్యాధితో, వీపుమీద పెద్ద పుండుతో చాలా అస్వస్థతకు గురయ్యారు. దానివలన రకరకాల ఆపరేషన్లు జరిగి ఆమె చాలా కష్టాన్ని అనుభవించారు. అంతటి కష్టంనుండి కేవలం బాబా దయతోనే మా అమ్మగారు మాకు తిరిగి దక్కారు. అప్పటినుండి మా అమ్మకి, అత్తయ్యకి ఏ చిన్న ఆరోగ్యసమస్య వచ్చినా మాపై దయతో బాబానే అన్నిటినీ తగ్గిస్తూ మాకు తోడుగా నిలబడుతున్నారు.

ఇటీవల మా అమ్మగారికి కంటి రెటీనా సమస్య వచ్చి కంటిచూపు మందగించింది. ఆ కారణంగా ఆమెకు ఏదీ సరిగా కనపడక చాలా ఇబ్బంది పడుతుండేవారు. 'ఆమె మళ్లీ స్పష్టంగా చూడగలదా?' అని మేమంతా చాలా భయపడ్డాము. అటువంటి సమయంలో మా అన్నయ్య మాతో, "ఈ వయసులో, పైగా షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్న అమ్మకి వచ్చిన రెటీనా సమస్యను తగ్గించడం కేవలం బాబా వల్ల మాత్రమే అవుతుంది. ఆయన దయతోనే వేసిన మందులు సరిగా పనిచేసి అమ్మకి చూపు తిరిగి రాగలదు" అని చెప్పాడు. తనలా చెప్పాక మేమంతా, "బాబా! ఎలాగైనా అమ్మకి కంటిచూపును తిరిగి ప్రసాదించండి" అని హృదయపూర్వకంగా ప్రార్థించాము. అప్పటినుండి ప్రతిరోజు మందులతోపాటు బాబా ఊదీ అమ్మ కంటికి రాస్తూ వస్తున్నాము. ఊదీ మహిమ ఎంతని చెప్పగలం! ప్రతి గురువారానికి ఆమె దృష్టిలో కొంత మార్పు కనబడుతూ ఇప్పటికి 80 శాతం వరకు కంటిచూపు తిరిగి వచ్చింది. బాబా చల్లని దయతో మిగిలిన ఆ చూపు కూడా త్వరలోనే వచ్చేస్తుందని మా నమ్మకం. బాబాని నమ్మి, ఆయన పాదాల చెంత మన సమస్యను సమర్పించుకుని సర్వమూ ఆయనకే వదిలేస్తే, ఆయన మనల్ని తప్పక కాపాడతారు. ఇలాంటి అనుభవాలు మా జీవితాల్లో చాలా ఉన్నాయి. ఆయనెప్పుడూ మా కుటుంబంపై అపారమైన కరుణ చూపుతున్నారు. నా వివాహం సక్రమంగా జరిగి ఈరోజు నేను ఇంత ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తున్నానంటే అది బాబా కరుణే! అయితే కొన్ని కారణాల వల్ల మా అన్నయ్య వివాహం ఆలస్యమవుతూ వస్తోంది. త్వరలోనే బాబా దయతో తనకి మంచి సంబంధం కుదిరి వివాహమవుతుందని నా ఆశ. బాబా ఎప్పుడూ నాకు, మా అన్నయ్యకి, అమ్మకి, అత్తకి తోడుగా ఉండి ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే, తనను నమ్మినవాళ్లకి బాబా సదా అండగా ఉంటూ, వాళ్ల కర్మలని నివృత్తి చేసి, వారి జీవితాలని సరైన మార్గంలో  నడిపిస్తారని నాకు తెలుసు.

ఇష్టంలేని వివాహంనుండి బాబా నన్ను రక్షించారు

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఓం శ్రీసాయినాథాయ నమః.

నేనిప్పుడు చెప్పబోయే అనుభవం జరగడానికి ముందు నేను సాయిభక్తురాలిని కాదు. ఈ అనుభవంతో ఆయన ఉనికిపట్ల నాకు గట్టి నమ్మకం ఏర్పడింది.

కొన్నినెలల క్రితం నాకు మా బంధువుల తరఫు నుండి వివాహ ప్రతిపాదన వచ్చింది. అన్నీ బాగున్నప్పటికీ నాకు ఆ అబ్బాయి నచ్చలేదు. నేను పెరిగిన వాతావరణంలో నా అభిప్రాయం గురించి గొంతెత్తి మాట్లాడేందుకు నాకు అవకాశం లేదు. ఆ కారణంగా నా ఇష్టానికి వ్యతిరేకంగా నా వివాహం నిశ్చయమయింది. అది నా మనస్సును చాలా అస్థిరపరచింది. అందరిలాగే నేను వివాహం గురించి చాలా కలలు కన్నాను. కానీ జరిగిన పరిణామాలతో నా మనస్సు ముక్కలైపోయింది.

అలాంటి సమయంలో ఒకరోజు నా ఫ్రెండ్ నాతో బాబా గురించి చెప్పింది. అప్పుడు నేను బాబా గురించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ఆ ప్రయత్నంలో నాకు హేతల్ గారి ఇంగ్లీష్ బ్లాగు కనిపించింది. ఆ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతుంటే సాయిబాబా పట్ల నాకు విశ్వాసం ఏర్పడి సచ్చరిత్ర పారాయణ చేయాలని నిర్ణయించుకున్నాను. అప్పటి నా పరిస్థితి నుండి బయటపడే మార్గం చూపినట్లైతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని బాబాను ప్రార్థించి పారాయణ మొదలుపెట్టాను. రోజులు గడుస్తూ సచ్చరిత్ర ముగింపుదశకు వచ్చేసరికి బాబా అద్భుతం చూపించారు. కొన్ని కారణాల దృష్ట్యా నా తల్లిదండ్రులు వివాహాన్ని రద్దు చేశారు. జీవిత సమస్య నుండి బాబా నన్ను బయటపడేసారు. నా ఆనందానికి అవధుల్లేవు. శ్రద్ధ, సహనం కలిగి స్వచ్ఛమైన మనస్సుతో బాబాను ప్రార్థిస్తే మన కోరిక తప్పక నెరవేరుతుందని తెలుసుకున్నాను. "చాలా ధన్యవాదాలు బాబా! నా అనుభవాన్ని ఎలా వివరించాలో తెలియక చాలా ఆలస్యంగా తోటి సాయిభక్తులతో పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాబా! ఎల్లప్పుడూ మీరు నాకు తోడుగా ఉండి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఎదుర్కోవటానికి అవసరమైన ధైర్యం, బలం ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా జీవితంలో మీరు చూపే అద్భుతాలు అనేకం అనుభవించాలని ఆశిస్తున్నాను". బ్లాగు ద్వారా అనుభవాలు పంచుకుంటున్న వారందరికీ నా ధన్యవాదాలు.


సాయి అనుగ్రహసుమాలు - 82వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 82వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 145

శ్రీ కృష్ణారావ్ నారాయణ్ పరూల్కర్, ఆనరరీ మెజిస్ట్రేట్ గారు  (హార్ద ) 1-9-1925 న వ్రాసిన ఉత్తరంలోని సారాశం. 

మాకు ఇక్కడ మా తండ్రిగారి కాలం నుండి, ప్రతి సంవత్సరం శ్రీ దత్త మహారాజ్ గారి ప్రీత్యర్థం వందమంది బ్రాహ్మణులకు అన్నసంతర్పణ చేయడం పరిపాటి. ఆ విధంగా ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఏదైనా సంవత్సరం, ఏదైనా సమస్య వలన అన్నసంతర్పణ చేయలేకపోతే, మరుసటి సంవత్సరం రెండువందల మంది బ్రాహ్మణులకు అన్నసంతర్పణ చేస్తాము. శ్రీ సమర్థ సాయిబాబా సమాధి చెందిన మరుసటి సంవత్సరం రెండువందల మంది బ్రాహ్మణులకు అన్నసంతర్పణ చేయవలసి ఉంది. దానికి సంబంధించిన ఆలోచన చేసి, ఒక శనివారం రెండు వందల మంది బ్రాహ్మణులకు అన్నసంతర్పణ చేసేందుకు నిర్ణయించుకున్నాము. నిర్ణయం సోమవారం తీసుకున్నాము. మరుసటిరోజు మంగళవారం ఉదయం ఐదు గంటలకు నిత్యనియమం ప్రకారం లేచి నామస్మరణ చేసుకుంటూ ఉండగా, ఒక్కసారిగా హృదయం నుండి ఏమని మాటలు వినిపించాయంటే “బ్రాహ్మణ పంక్తిలో నేను కూడా వచ్చి భోజనం చేయాలని నీ కోరిక అయితే, ముంబాయి నుండి కాకాను (శ్రీ హరి దీక్షిత్ ను  బాబా కాకా అని పిలిచేవారు) పిలువు” అని! కానీ, కేవలం భోజనం కోసం శ్రీ కాకాను ఇంత దూరం ఎలా పిలవాలి? అని మనసులో అనిపించసాగింది. ఈ ఆలోచనే మధ్యాహ్నం 12 గంటల వరకు నా మనసులో కదలాడసాగింది. 12 గంటలకు పూజ చేసుకుంటుండగా “అరే, నీవు అంత గందరగోళానికి ఎందుకు గురవుతున్నావు? నీవు కాకాకు ఉత్తరం వ్రాసావంటే, నా ఆజ్ఞతో తాను వస్తాడు. తనకు బ్రాహ్మణులందరితో కలిపి భోజనం పెట్టు. తాను భోజనం చేసాడంటే, నేను వచ్చి భోజనం చేసినట్లుగా అర్థం చేసుకో” అనే స్ఫూర్తిని  బాబా కలిగించారు. ఆ విధంగానే మధ్యాహ్నం కాకాసాహెబ్ కు జరిగిన విషయమంతా ఉత్తరం వ్రాసి, ఆహ్వానించాను. కానీ మనసులో ఒకటే ఆందోళన. “ఒకవేళ కాకాసాహెబ్ రాకపోతే ఈ బ్రాహ్మణ భోజనమంతా వ్యర్థమవుతుంది” అని అనిపించసాగింది. శనివారం ఉదయం వరకు కాకాసాహెబ్ వద్ద నుండి ఎటువంటి కబురు రాకపోవడంతో మనసులో ఒకటే బాధ కలుగసాగింది. బాబా చిత్రపటం ముందుకు వెళ్ళి బాబాను ప్రార్థించసాగాను. “బాబా, నేను పాపిని. మా ఇంట్లో మీరు అడుగుపెట్టి భోజనం చేయడం నా నుదిటిపై వ్రాసి లేదు” అని బాధపడసాగాను. కన్నులనుండి అశ్రుధారలు కారసాగాయి. సాష్టాంగనమస్కారం చేసుకుని అనన్యభావంతో శరణు వేడుకున్నాను. ఇంట్లో ఏర్పాట్లు పూర్తయి, పీటలపై ముగ్గులు వేయసాగారు. నేను స్నానం చేసి, సంధ్య వార్చుకోవడానికి కూర్చొన్నాను. ఇంతలో పోస్టుమాన్ టెలిగ్రామ్ తీసుకొని వచ్చాడు. టెలిగ్రామ్ చింపి చూస్తే, అందులో కాకాసాహెబ్ దీక్షిత్ గారు “నేను మరియు మాధవరావు దేశ్ పాండే ఢిల్లీ ఎక్సప్రెస్ లో  వస్తున్నాము” అని వ్రాసారు. ఆ టెలిగ్రామ్ చదివాక నాకు కలిగిన ఆనందాన్ని వ్యక్తపరచడానికి నా వద్ద మాటలు లేవు. వెనువెంటనే శ్రీ సాయిబాబా చిత్రపటానికి సాష్టాంగనమస్కారం చేసుకున్నాను. స్నేహితులందరితో కలిసి స్టేషన్ కు వెళ్ళి కాకాసాహెబ్ ను మరియు మాధవరావును ఇంటికి తీసుకువచ్చాము. ఆయనతో పాటుగా బ్రాహ్మణ భోజన సమారంభం పూర్తి కావడంతో, "శ్రీ సమర్థ సాయిమహారాజ్ మా ఇంటికి వచ్చి భోజనం చేసారు” అనే భావనతో మనసుకు సమాధానం కలిగింది. శ్రీ సాయిబాబా ఆజ్ఞతోనే కాకాసాహెబ్ ఇంతదూరం వచ్చారు.

తరువాయి భాగం రేపు

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

సాయిభక్తుల అనుభవమాలిక 122వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. నెలసరి విషయంలో బాబా చేసిన సందేహ నివృత్తి
  2. సాయి నేర్పిన పాఠం

నెలసరి విషయంలో బాబా చేసిన సందేహ నివృత్తి

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
మా అమ్మాయి నెల్లూరులో M.B.B.S చదువుతోంది. మేము తనని చూడడానికి వెళ్తూ, అక్కడికి దగ్గరలోనే ఉన్న గొలగమూడిలోని వెంకయ్యస్వామి సన్నిధిని దర్శించాలని ప్రణాళిక చేసుకున్నాము. తీరా మేము అక్కడికి వెళ్ళాక మా అమ్మాయికి నెలసరి సమస్య వచ్చింది. దానికి వారం, పది రోజుల ముందు "మనసులో ఉన్న నెలసరి అడ్డంకిని తొలగించిన బాబా" అనే టైటిల్‌తో బ్లాగులో ఉన్న ఒక భక్తురాలి అనుభవాన్ని మేము చదివాము. అయినా నా మనసు సమాధానపడక గొలగమూడి వెళ్లే ప్రోగ్రాం మరోసారి పెట్టుకుందామని నేను అన్నాను. ఆ విషయమై నేను, మా అమ్మాయి చాలా వాదించుకున్నాము. చివరికి తను, "అంత చక్కటి అనుభవాన్ని చదివి ఏం ప్రయోజనం?" అని‌‌ అంది. తరువాత నేను బాబాతో, "బాబా! ఆ భక్తురాలికి మీరిచ్చిన అనుభవాన్ని చదివి కూడా నన్ను నేను సమాధానపరుచుకోవాలంటే ఇబ్బందిగా వుంది. దీనికి మీరే ఏదో పరిష్కారం చూపించండి" అని అనుకున్నాను. ఇంతలో ఆ నెలసరి సమస్య కాస్తా నాకే వచ్చింది. నేను రెండు నిత్యపారాయణ గ్రూపులలో ఉన్నాను. అందువలన నేను సచ్చరిత్ర పారాయణ చేయాల్సి ఉంది. మరి ఇలాంటి సమయంలో పారాయణ చేయవచ్చో లేదో తెలియక ఆ గ్రూపు వాళ్లకు మెసేజ్ పెట్టాను. వాళ్లు నాకు ఫోన్ చేసి, "శిరిడీ సంస్థాన్ వాళ్లు ఒప్పుకోరు, మీ పారాయణ మీరే చెయ్యాలి" అని చెప్పారు. బాబా నా సమస్యకు వాళ్ళ ద్వారా అంత గొప్ప సమాధానం చెప్పించారు. "నా సందేహాన్ని నివృత్తి చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా!"


"మనసులో ఉన్న నెలసరి అడ్డంకిని తొలగించిన బాబా" అనుభవం చదవాలనుకునే వారికోసం క్రింద లింకు ఇస్తున్నాను.
https://saimaharajsannidhi.blogspot.com/2019/01/blog-post_4.html

సాయి నేర్పిన పాఠం

సాయిభక్తుడు రవి తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరాం! నేను గత ఒకటిన్నర సంవత్సరం నుండి భగవాన్ సాయికి భక్తుడిని. నేను సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నాను. ఆ ఉద్యోగం సాయి నాకిచ్చిన బహుమతి. ఇక నా అనుభవానికి వస్తే....

ఈమధ్య ఒకసారి మా నాన్న ఏటీఎం నుంచి 10,000 రూపాయలు విత్‌డ్రా చేసే ప్రయత్నం చేశారు. ఏటీఎంలో డబ్బులు రాలేదు గాని, ఖాతా నుండి డబ్బులు తొలగించబడ్డాయి. ఆయన వేరే ఏటిఎంకు వెళ్లి ప్రయత్నిస్తే 10,000 రూపాయలు వచ్చాయి. కానీ ఖాతా నుండి మొత్తం 20,000 తొలగించబడినట్లు స్లిప్పులో ఉంది. వెంటనే నాన్న ఏటిఎం సంబంధిత బ్యాంకుకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు, 'మీ ఖాతా ఎక్కడ ఉందో ఆ బ్యాంకును సంప్రదించమ'ని చెప్పారు. నాన్న అక్కడికి వెళ్లి లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. 2-3 రోజులు వేచి ఉండమని బ్యాంకు అధికారులు చెప్పారు. ఆ సమయం గడిచాక కూడా డబ్బులు తిరిగి జమ కాలేదు. నాన్న ప్రతి 2-3 రోజులకు ఒకసారి బ్యాంకు అధికారులను సంప్రదిస్తూ ఉండేవారు. అలా ఒక నెల పైగా గడిచింది. ఆ సమయంలో నేను మా ఊరికి వెళ్ళాను. నేను, నాన్న బ్యాంకుకు వెళ్లి బ్యాంకు మేనేజర్ మరియు ఇతర సంబంధిత ఉద్యోగులను కలిసాము. బ్యాంక్ మేనేజర్ మాటల మధ్యలో, 'ఏటిఎం లావాదేవీ విజయవంతమైంది, కాబట్టి మేము ఏమీ చేయలేమ'ని చెప్పారు. తరువాత మేము బ్యాంకులోని మరో ఉద్యోగితో మాట్లాడితే, అతను ఏటిఎం సంబంధిత అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించి 2-3 రోజులు వేచి ఉండమని చెప్పాడు. 3 రోజుల తరువాత మళ్ళీ మొదటికొచ్చింది పరిస్థితి. నాన్న తిరిగి తిరిగి చిరాకుతో విసుగు చెందారు. నిజానికి నేను కూడా మొదట్లో డబ్బులు వాటంతటవే కొన్నిరోజుల్లో ఖాతాలో జమ అవుతాయని తేలికగానే తీసుకున్నాను. ఆ కారణంచేత నేను సాయిని కూడా ప్రార్థించలేదు. తీరా చూస్తే దాదాపు 40 రోజులు గడిచిపోయింది కానీ సమస్య అలానే ఉంది. అప్పుడు నేను, "బాబా! మా డబ్బులు మాకు వచ్చేలా చూడండి. అలా జరిగితే నేను నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. నేను ప్రార్థించిన నాలుగురోజుల్లో డబ్బులు నాన్న ఖాతాలో జమ అయ్యాయి.

ఈ అనుభవంతో సాయి నాకు మంచి పాఠం నేర్పించారు. అసలు విషయం ఏమిటంటే, ఇటువంటి సమస్యలకు సంబంధించిన అనుభవాలను భక్తులు పంచుకున్నప్పుడు నేను వాటిని సిల్లీగా తీసుకునేవాడిని. నా ఈ అనుభవం ద్వారా బాబా దృష్టిలో చిన్న, పెద్ద అనేది ఏమీ లేదని తెలుసుకున్నాను. ఇతర భక్తుల అనుభవాలను చిన్నచూపు చూడడం తప్పు అని తెలుసుకున్నాను. దానితో భక్తుల అనుభవాలను జడ్జ్ చేయడం మానేశాను. సమస్య మనకు ఎదురైనప్పుడు మాత్రమే దానిలో ఉండే కష్టం మనకు తెలుస్తుంది. "సాయీ! నాకు ఏది ఉత్తమమో వాటిని మీరు ఇచ్చినందుకు, నాకు మంచిది కాదని ఇవ్వని వాటికి నా ధన్యవాదాలు. సాయీ(గురు, తండ్రి)! ఇప్పటికీ నేను మీ బోధనలను అనుసరించలేకపోతున్నాను. దయచేసి మీ బోధనలను అనుసరించగలిగేలా నాకు మార్గనిర్దేశం చేయండి".

నాకు సమస్యలు వచ్చినప్పుడు సమాధానాల కోసం నేను క్వశ్చన్ & ఆన్సర్ సైట్‌లో అడుగుతాను. కానీ నాకు లభించే సమాధానాలను నా పరిస్థితులకు అన్వయించుకోలేక పోతున్నాను. గురువుకి(సాయి), శిష్యునికి(నాకు) మధ్య కొంత అంతరం ఉందని నేను భావిస్తున్నాను. "సాయీ! దయచేసి ఈ అడ్డంకులను తొలగించి నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి. నాకు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో తెలియదు. కానీ మీమీద నమ్మకంతో జీవితాన్ని గడుపుతున్నాను. నేను త్రికరణశుద్ధి(మనసా, వాచా, కర్మణా)గా మీ పవిత్రపాదాలకు లొంగిపోతున్నాను. నన్ను సరైన మార్గంలో నడిపించండి". ఈ భావాలన్నీ పూర్తిగా నావి కావు, బాబా చెప్పినవే. వాటితో ప్రేరణ పొంది పై వాక్యాలను నేను వ్రాశాను. "శిరిడీ సాయీ! దయచేసి నాపై మీ అనుగ్రహ వీక్షణాలను ప్రసరించి నన్ను ఉద్ధరించండి". బాబా ఆశీస్సులతో భవిష్యత్తులో మరెన్నో అనుభవాలను మీతో పంచుకుంటానని ఆశిస్తున్నాను.

ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి.

అనంతకోటి బ్రహ్మండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సాయి అనుగ్రహసుమాలు - 81వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 81వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 144

శ్రీ అబ్దుల్  భాయ్ కి వచ్చిన అనుభవం.

అబ్దుల్ నాందేడ్ నివాసి. బాబా సమాధి చెందడానికి సుమారు 9-10 సంవత్సరాల ముందు శిరిడీకి బాబా సేవకోసమై వచ్చి నివసించసాగాడు. బాబా సమాధి చెందిన తరువాత కూడా, జీతం వంటివి తీసుకోకుండా కేవలం అన్నవస్తాల వంటివి తీసుకొని సమాధికి సేవ చేసుకోసాగాడు. బాబా దేహధారిగా ఉన్న రోజులలో తనపై చాలా పని భారం ఉండేది. ఆ పనంతా తాను ఎంతో ప్రేమగా, భక్తిగా చేసుకొనేవాడు. తాను ఎప్పుడు చావడిలో ఉండేవాడు. ప్రస్తుతం సమాధికి దగ్గరగా ఒక గదిలో ఉంటున్నాడు. రాత్రిపూట కూడా విశ్రాంతి తీసుకోకుండా ఖురాన్ చదువుకుంటూ చాలా సమయం గడిపేవాడు. ప్రస్తుతం కూడా అదే కార్యక్రమం కొనసాగుతూ ఉంది. కానీ, ఇంట్లో వాళ్లందరినీ వదలి తాను శిరిడీలో ఉండసాగాడు. వాళ్ళ తల్లిగారు మరియు కొడుకు అప్పుడప్పుడు శిరిడీకి వచ్చేవారు. తన భార్య కూడా ఒకసారి శిరిడీకి వచ్చింది. కానీ, తాను ఎటువంటి మోహానికి లోనుకాకుండా సేవ చేసుకుంటూ, శిరిడీలోనే ఉండేవాడు. అబ్దుల్ బాబా కొడుకు వివాహం గురించి చింత తన తల్లిగారికి ఉండేది. తాను ఒక చోట వివాహం కుదర్చడానికి ప్రయత్నించింది, కాని అబ్బాయి తండ్రి ఫకీరుగా మారడం వలన మా అమ్మాయిని ఇచ్చే ప్రసక్తి లేదని వాళ్ళ తల్లిగారు తేల్చి చెప్పేసారు. ఆ తరువాత ఆమె వచ్చి బాబా దగ్గర ఫిర్యాదు చేసింది. అప్పుడు బాబా ఆమెతో "కొంచెం ఓపిక పట్టు. ఆందోళన చెందవద్దు. అబ్బాయికి మంచి అమ్మాయి దొరుకుతుంది. వాళ్ళకై వాళ్ళే వెతుక్కుంటూ వస్తారు” అని చెప్పారు. తరువాత కొన్ని రోజులకు బాబా చెప్పిన విధంగానే జరిగింది.  ఒకసారి అబ్దుల్ యొక్క తల్లిగారు మరియు కుమారుడు ఒక గ్రామానికి వెళ్ళారు. అక్కడ ఒక గృహస్తుని కలవడం జరిగింది. ఆ గృహస్థు “మీరు మా అమ్మాయిని వివాహం చేసుకోండి” అని విన్నవించాడు. తనకు కొంతమంది “అబ్బాయి తండ్రి ఫకీరుగా మారాడు” అని చెప్పారు. దానికి తాను “అబ్బాయి తండ్రి ఫకీరు అయినా, నాకు అభ్యంతరం లేదు. మా అమ్మాయిని ఆ అబ్బాయికి ఇస్తున్నాను” అని తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఆ విధంగానే వివాహం కూడా వెనువెంటనే జరిగిపోయింది. ఆ గృహస్థుకు వివాహం జరగాల్సిన పెద్దకూతురు ఉంది. ఆమె వివాహం కూడా నిశ్చయమైంది. ఆమెకు కాకుండా చిన్న కూతురికి చేస్తే, పెద్ద అమ్మాయి సంబంధం రద్దయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆ గృహస్థు ఆగకుండా, వాళ్ళ చిన్నమ్మాయిని అబ్దుల్ కుమారునికి ఇచ్చి వెనువెంటనే వివాహం చేసాడు.

తరువాయి భాగం రేపు

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo