ఈ భాగంలో అనుభవాలు:
1. కోరుకున్న వారి కోరికలు నెరవేర్చే కల్పతరువు నా సాయిబాబా
2. బాబా ముద్ర
3. డబ్బులు అందేలా చేసిన బాబా
కోరుకున్న వారి కోరికలు నెరవేర్చే కల్పతరువు నా సాయిబాబా
నా పేరు ఫణీంద్ర, మనకి యే కష్టం వచ్చినా సాయిబాబాని తలచుకోగానే, మనసుకు ప్రశంతతను అందజేస్తారు. ఇది నా విషయంలో చాలాసార్లు చేసి చూపించారు నా సాయిబాబా. అలాంటి ఒక అనుభవం నేను ఇప్పుడు సాయిభక్తులందరితో పంచుకుంటున్నాను. 2024, మేలో నేను, నా తమ్ముడు అరుణాచలేశ్వర దర్శనానికి వెళ్ళాము. అప్పుడు మధ్య దారిలో ఎక్కడో నా పర్స్ పడిపోయింది. ఆ విషయం నేను గుడికి చేరాక గమనించాను. నాకు ఎవరిని అడగాలో, ఏం చేయాలో అర్థం కాలేదు. నా బ్యాంక్ కార్డులు, బైక్ సి బుక్, లైసెన్స్, పాన్ కార్డ్ అన్ని దాంట్లోనే ఉన్నాయి. 'ఇప్పుడున్న సమస్యలకి తోడు ఇదేమిటి బాబా?' అని మనసులో బాధపడ్డాను. గుడికి వస్తున్న మధ్య దారిలో ఓ చోట నీళ్లు తాగడానికి అగాము. అక్కడేమైనా పడిపోయి ఉంటుందేమోనని దర్శనంకి వెళ్లకుండా, ఆ అరుణాచలేశ్వరుని మనసులో వేడుకొని తిరిగి 40 కిలోమీటర్లు వెనక్కి మేము అదివరకు అగిన చోటుకి వెళ్లి చూసాము. కానీ అక్కడ నా పర్స్ లేదు. చాలా బాధ, నిరాశలతో ఏం చేయాలో అర్థంకాక మనసులో ఆ సాయినాథుని, "బాబా! నా పర్సు దొరికేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. తర్వాత చేసేదేమీలేక బ్యాంక్ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి అన్ని డెబిట్ అండ్ క్రెడిట్ కార్డులు బ్లాక్ చేయించి మళ్ళీ వెనక్కి వెళ్ళి అరుణాచలేశ్వరుని దర్శించి ఇంటికి ప్రయాణమయ్యాము. సరిగ్గా మధ్యదారిలో తెలియని నంబర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. నేను ఫోన్ ఎత్తి మాట్లాడితే, "మీ పర్స్ ఏమైనా పోగొట్టుకున్నారా?" అని అడిగారు అవతలి వ్యక్తి. ఇంకా మాకు ఫలానా చోట ఒక పర్స్ దొరికిందని చెప్పారు. చిత్రమేమిటంటే, నా పర్స్లో నా ఫోన్ నెంబర్ ఎక్కడుందో నాకైతే తెలీదు. అలాంటిది అతను ఎలా ఫోన్ చేశాడో అని ఆశ్చర్యమేసింది. అప్పుడు నాకు ఇది బాబా లీల అనిపించింది. నేను అతనితో నా పర్స్ పోయిందని చెప్పి, వెళ్లి నా పర్స్ నేను తెచ్చుకున్నాను. నేను ఈ మధ్య ఆఫీసులో కూడా నా టేబుల్ దగ్గర పర్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాను. అందుకే బాబా ఈవిధంగా అజాగ్రత్త తగదని హెచ్చరించారు. "ధన్యవాదాలు బాబా. నాయందు ఇలాగే ఎప్పుడూ మీ అమృతదృష్టి ఉండనీ సాయితండ్రీ".
బాబా ముద్ర
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!! సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. 2024, ఆగస్టు 7వ తేదీన మేము ఏలూరు నుంచి వైజాగ్‌లో కనకమహాలక్ష్మి గుడికి కారులో వెళ్లాలనుకున్నాము. అయితే మాకు సంవత్సరం బాబు ఉన్నందున 5 గంటల ప్రయాణంలో బాబు కుదురుగా ఉంటాడో, లేదోనని ఆందోళనపడ్డాను. అందుచేత ముందురోజు, "బాబా! రేపు ప్రయాణంలో వెళ్లేటప్పుడు కానీ, తిరిగి వచ్చేటప్పుడు కానీ బాబు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా హాయిగా వెళ్లి, రావాలి" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయ చూపారు. మొత్తం ప్రయాణంలో ఒక్క అరగంట తప్ప అస్సలు ఇబ్బంది పెట్టలేదు బాబు. నిజానికి సంవత్సరం పిల్లలు అంతసేపు ప్రయాణం అంటే చాలా విసిగిస్తారు. బాబా దయవల్ల దర్శనం చాలా త్వరగా, చక్కగా జరిగింది. త్వరగా ఇంటికి కూడా చేరుకున్నాం. అసలు అంత దూరం వెళ్ళొచ్చినట్లే అనిపించలేదు. ఇంకో ముఖ్య విషయమేమిటంటే, ఆ కారు డ్రైవర్ బాబా భక్తుడు. కారు ముందు భాగంలో బాబా హ్యాంగింగ్ ఒకటి కట్టారు, కారు వెనకాల 'ద్వారకామాయి' అని వ్రాసుంది. కారు ఎక్కగానే బాబా పాటలు పెట్టారు. బాబా ముద్ర అలా ఉంటుంది. మనం ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే అంతా తామే స్పష్టంగా మనకి తెలియజేస్తారు.
డబ్బులు అందేలా చేసిన బాబా
నా పేరు సాయికుమార్. మాది నిజామాబాద్. ఒకసారి నేను, మా ఇద్దరు బాబులు కలిసి పరీక్ష వ్రాయడానికి బస్సులో వెళ్ళాం. బస్సులో కూర్చున్నాక టిక్కెట్ కోసం 100 రూపాయలు కండక్టర్కి ఇస్తే, అతను చిల్లర లేదని టిక్కెట్ వెనకాల మిగతా డబ్బులు వ్రాశాడు. మేము మా దిగాల్సిన స్టేజ్ వచ్చాక టిక్కెట్ వెనకాల వ్రాసిన డబ్బుల సంగతి మర్చిపోయి బస్సు దిగిపోయాము. బస్సు అక్కడినుండి వెళ్ళిపోయాక ఆ డబ్బుల విషయం గుర్తొచ్చి 'అయ్యో.. డబ్బులు మర్చిపోయాం' అనుకున్నాను. కానీ చేసేది లేక ఒకసారి సాయిబాబాను తలుచుకొని పరీక్షకి వెళ్ళిపోయాం. పరీక్ష అయ్యాక బస్సుకోసం చూస్తుంటే, ఆ బాబా దయవలన మేము అదివరకు డబ్బులు మర్చిపోయిన అదే బస్సు వచ్చింది. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించి బాబా లీల అనుకున్నాను(ఆరోజు అదే బస్సు నేను మూడుసార్లు ఎక్కాను). ఆయన దయవల్ల నా డబ్బులు నాకు అందాయి. "ధన్యవాదాలు బాబా".
