ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా కరుణ - ఊదీ మహిమ
2. కోరుకున్నవి అనుగ్రహించిన బాబా
బాబా కరుణ - ఊదీ మహిమ
ఓం శ్రీసాయినాథాయ నమః. ప్రతిక్షణం నాకు తోడునీడగా ఉండే నా సాయినాథునికి నా నమస్కారములు. నా పేరు శ్వేత. దాదాపు 20 ఏళ్ళ క్రితం మావారు ఈఎస్ఐ హాస్పిటల్ సదుపాయాలు ఉండే కంపెనీలో పని చేసారు. కొంతకాలం ఆయన ఆ ఉద్యోగం మానేసి సొంత వ్యాపారం చేసారు. తర్వాత మళ్లీ ఈఎస్ఐ హాస్పిటల్ సదుపాయాలు ఉన్న ఉద్యోగంలో చేరారు. అంతలో మా అత్తయ్య ఛాతి భాగంలో గడ్డ ఉందని రిపోర్టు వచ్చింది. ఈఎస్ఐ హాస్పిటల్లో చూపించుకోవాలంటే మునుపటి కంపెనీలో ఇచ్చిన ఈఎస్ఐ నెంబర్ ఉండాలి. అది లేదంటే పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు చేయించుకొనే అవకాశం ఉండదు. ఎందుకంటే, సీనియారిటీ బట్టి ఈఎస్ఐలో సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. మావారి దగ్గర పాత కంపెనీ ఈఎస్ఐ నెంబర్ లేదు. కారణం సంబంధిత పేస్లిప్ గాని, మరే ఇతర డాక్యుమెంట్లుగాని లేవు. కంపెనీలో అడిగితే, అంత పాత డేటా లేదని చెప్పారు. మావారు ఈఎస్ఐ నెంబర్ కోసం చాలా విధాలుగా ప్రయత్నం చేసి అలసిపోయారు. ఇక ఈఎస్ఐ నెంబర్ దొరుకుతుందన్న నమ్మకం పోయింది ఆయనకి. ఇలాంటి సమయంలో బాబా ఒక్కరే మాకు అండగా నిలిచేదని, "బాబా! ఎలాగైనాసరే మావారి ఈఎస్ఐ నెంబర్ దొరికేలా చేయండి" అని బాబాను ప్రార్థించాను. మర్నాడు ఉదయం మావారు ఈఎస్ఐ ఆఫీసుకు వెళ్లి మరోసారి ప్రయత్నించారు. వాళ్ళు మళ్ళీ "అంత పాత డేటా లేదు" అన్నారు. చేసేదిలేక మావారు వెనుదిరిగారు. అంతలోనే బాబా ఆయన లీల చూపించారు. వెనక్కి వస్తున్న మావారిని వివరాలు చెప్పమన్నారు. మావారు సదరు వివరాలు చెప్తే, వాళ్ళు ఈఎస్ఐ నెంబర్ వెతికి ఇచ్చారు. "చాలా కృతజ్ఞతలు బాబా. చాలా పెద్ద ఉపకారం చేశారు".
తరువాత ఈఎస్ఐ హాస్పిటల్లో మా అత్తయ్యకి ట్రీట్మెంట్ మొదలుపెట్టి అన్ని రకాల టెస్టులు చేసి క్యాన్సర్ గడ్డగా నిర్ధారించారు. మళ్లీ మాకు టెన్షన్ మొదలైంది. ఎందుకంటే, మా అత్తయ్య వయసు 84 సంవత్సరాలు. ఈ వయసులో ఆపరేషన్ అంటారేమోనని మా అందరికీ భయమేసింది. నేను, "బాబా! ఈ వయసులో ఆవిడకు ఆపరేషన్ వద్దు స్వామి. మందులతో తగ్గిపోయేలా చేయండి దేవా" అని ప్రార్థిస్తూ ఉండగా బాబా నా విన్నపాలు విన్నారు. కేవలం మందులతో నయమయ్యేలా చేశారు. వాటితో మా అత్తయ్య బాగున్నారు.
2024, జూలై 8 రాత్రి ఉన్నట్టుండి నా ఛాతిలో ఏదో రకంగా అనిపించడం మొదలైంది. నేను బాబా ఊదీ నా ఛాతిపై రాసుకొని, "బాబా! ఈ సమస్య నుండి నన్ను కాపాడు స్వామి, 108 ప్రదక్షిణలు చేస్తాన"ని మొక్కుకున్నాను. బాబా దయవల్ల ఆ రాత్రే నా బాధ తగ్గిపోయింది. ఉదయానికి నేను ఏ బాధలేక హాయిగా ఉన్నాను.
2024, జూలై 27 రాత్రి నిద్రపోతుంటే నా చెవిలో ఏదో పురుగు దూరింది. అది ఎంతసేపటికి బయటకు రాలేదు. చెవి విదిలించినా కూడా బయటకు రాలేదు. అప్పుడు నేను, "బాబా! ఈ సమస్య నుండి కాపాడు. నీకు 11 రూపాయలు దక్షిణ సమర్పించి అర్చన చేయిస్తాన"ని మొక్కుకున్నాను. బాబా దయవల్ల మరే సమస్య రాలేదు.
2024, ఆగస్టు 1 రాత్రి 11 గంటలప్పుడు హఠాత్తుగా నాకు చలి జ్వరం మొదలైంది. దాంతోపాటు మూత్ర విసర్జన చేస్తే మంటగా ఉండేది. పైగా మాటిమాటికి వెళ్లాలనిపించేది. అప్పటికి 12 రోజుల ముందే మా నాన్న యూరిన్ ఇన్ఫెక్షన్, చలి జ్వరంతో మరణించినందువలన నా మనసు ఒక్కటే ఆందోళన చెందింది. అంతలో దగ్గు, కఫం చాలా చాలా ఇబ్బందిపెట్టాయి, గుండె కూడా జోరుగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. నేను బాబాను, "నాకు తగ్గించండి. ఉదయానికల్లా ఏ సమస్యా కనిపించకూడదు" అని ప్రార్థించి ఊదీ తీసుకొని ముక్కుకు, ఛాతికి రాశాను. తర్వాత కాసేపటికి మూత్ర విసర్జనకు వెళ్తే మంట లేదు. ఇంకా ఉదయానికి మామూలు అయిపోయాను. ఇదంతా బాబా అమృత సంజీవని ఊదీ మహిమ. "ధన్యవాదాలు బాబా. నా కన్నీళ్లతో మీ పాదాలు కడగాలని ఉంది. ఎల్లవేళలా మాకు తోడు-నీడుగా, నాకు తల్లితండ్రిగా ఉండి రక్షించు స్వామి".
కోరుకున్నవి అనుగ్రహించిన బాబా
నా పేరు ఉమ. మేము USలో ఉంటున్నాము. మా బాబు 12వ తరగతి పూర్తవ్వడంతో కాలేజీలో అడ్మిషన్ కోసం కొన్ని కాలేజీలకి అప్లై చేసాము. బాబు హైస్కూలు USలోనే చదివాడు కానీ, మాకు గ్రీన్ కార్డు ఇంకా రానందున ఇంటర్నేషనల్ స్టూడెంట్ కేటగిరీలో అప్లై చేయాల్సి వచ్చింది. ఆ కేటగిరీలో ఫీజు రెండింతలు ఎక్కువగా ఉంటుంది. నేను బాబాని, "మా బాబుకి మేమున్న స్టేట్‌లోనే సీటు రావాలి. మేము అంత ఫీజు భరించలేము, స్కాలర్షిప్ వచ్చేలా అనుగ్రహించండి బాబా" అని మరీమరీ వెడుకున్నాను. బాబా దయతో బాబుకి మేము ఉన్న స్టేట్‌లోనే సీటు వచ్చింది. అంతేకాదు, మెరిట్ స్టూడెంట్ అని 60% ఫీజు కూడా తగ్గించారు. నాకు చాలా సంతోషమేసింది. బాబు 2024, ఆగష్టు మూడో వారంలో కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఇదంతా బాబా ఆశీర్వాదం వల్లే జరిగిందని నా నమ్మకం. "ధన్యవాదాలు బాబా".