సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1910వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శ్రీసాయి అనుగ్రహధారలు

సాయి భక్తులందరికీ నమస్కారం. ఎలాంటి పరిస్థితిల్లో అయినా 'బాబా' అని తలుచుకోగానే వెన్నంటే నిలిచి నేను తోడుగా ఉన్నానని దైర్యాన్నిచ్చే బాబా మన జీవితంలో ఉండటం మన అందరి అదృష్టం. ఒకసారి నా ఆరోగ్యం బాగాలేదని చెకప్ చేయించుకుంటే డాక్టరు, 'హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయని, రక్తం తక్కువగా ఉందని' మందులిచ్చి, వాటితోపాటు మంచి ఆహారం తీసుకోవాలని, ముఖ్యంగా ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తినాలని చెప్పారు. డాక్టర్ చెప్పినట్లు మంచి ఆహారం తీసుకోవడం నేను ఆఫీసుకి వెళ్తే కుదరదు, ఇంట్లో ఉంటేనే చేయగలనని మా మేనేజరుని ఒక రెండు వారాలు WFH(వర్క్ ఫ్రమ్ హోమ్) అడుగుదామనుకున్నాను. కానీ ఆమె ఒప్పుకుంటుందో, లేదోనని టెన్షన్ వేసింది. ఎందుకంటే, అప్పటికే 2 వారాల నుండి నేను WFH చేస్తున్నాను. అందువల్ల నేను, "ఎలాగైనా ఒప్పుకునేలా చేయమ"ని బాబాని ప్రార్థించి మా మేనేజర్‌కి రిపోర్టులన్నీ పెట్టి WFH అడిగాను. ఆమె ఆ రిపోర్టులు చూసిన వెంటనే 'హిమోగ్లోబిన్ లెవెల్ చాలా తక్కువ ఉంది. మందులు, ఆహారం మంచిగా తీసుకోమని' చెప్పి WFHకి అనుమతి ఇచ్చింది. నిజానికి ఆమె ఏదో ఒకటి అంటుందనుకున్నాను. కానీ ఏమీ అనకుండా ఒప్పుకునేలా చేసింది బాబానే అని నా నమ్మకం. ఇకపోతే, ఇంకో వారం WFH పొడిగించుకుందామనిపించి ఆ విషయం గురించి  మా మేనేజర్‌తో ఏమీ చర్చించకుండా నేరుగా ఆమెకి మెయిల్ పెట్టి అనుమతి అడిగాను. దానికి ఆమె ఏమంటుందోనని భయమేసి, "బాబా! ఏమీ అనకుండా అనుమతి ఇచ్చేలా చేయండి" అని బాబాని ప్రార్థించాను. బాబా దయవల్ల ఆమె నన్ను ఏమీ అనలేదు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ దయను నేను ఎప్పటికీ మార్చిపోలేను. దయచేసి నా ఆరోగ్యం బాగుండేలా చేసి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రీ".

ఈమద్య మా ఆఫీసులో కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి చాలా పని ఉంటుందని, చాలా మందిని ఆ ప్రాజెక్ట్‌లో వేస్తున్నారని మా ఆఫీసులో అందరూ అనుకున్నారు. ఇలా ఉండగా మా మేనేజర్ నా ప్రాజెక్టుల గురించి మాట్లాడాలని నాకు మెసేజ్ చేసింది. దాంతో నన్ను కూడా ప్రాజెక్ట్ మారుస్తారేమో అని చాలా భయమేసింది. అసలే నాకు ఆరోగ్యం బాగాలేదు. పగలూరాత్రీ పని అంటే నేను చేయలేనని నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. అప్పుడు నేను, "ఎలా అయినా నన్ను ప్రాజెక్ట్ మార్చకుండా ప్రస్తుత ప్రాజెక్ట్‌లోనే ఉంచేలా చేయండి" అని బాబాను ప్రార్థించాను. ఎందుకంటే, నేను అప్పటికి చేస్తున్న ప్రాజెక్ట్స్ కొంచం ప్రశాంతంగా ఉంటాయి. పైగా వాటి గురించి నాకు అంతా తెలుసు. బాబా దయవల్ల నన్ను ప్రాజెక్ట్ మార్చలేదు, ప్రస్తుత ప్రాజెక్ట్లోనే ఉంచారు. మా మేనేజర్ కూడా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడటానికి నాకు మళ్ళీ మెసేజ్ పెట్టలేదు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఇదంతా మీ వల్లే జరిగింది తండ్రీ, ఇక ముందు కూడా ప్రాజెక్ట్ మార్పు చేయకుండా ప్రశాంతంగా పని చేసుకొనే వాతావరణం ఉండేలా చేయండి తండ్రీ, ప్లీజ్!".

నేను పని చేస్తున్న ప్రాజెక్ట్ లైవ్‌కి వెళ్ళాక చాలా సమస్యలు వచ్చాయి. 2 రోజులు పని అయి పడుకునేసరికి దాదాపు రాత్రి ఒంటిగంట అయింది. ఇంకోరోజు అంతకంటే ఎక్కువ సమయం అయింది. అటువంటి పరిస్థితిల్లో నేను, "బాబా! క్రిటికల్ సమస్యలు వచ్చినప్పుడు ఏదో ఒక దారి చూపించి, అవి పరిష్కారమయ్యేలా చేయమ"ని బాబాని ప్రార్థించాను బాబా ఎన్నోసార్లు సమస్యలను పరిష్కారం అయ్యేలా చేసారు. "ధన్యవాదాలు బాబా. ఇక ముందు ఏ సమస్యలు రాకుండా ప్రశాంతంగా ఉండేలా చేయండి తండ్రీ".  

ఒకరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత మా నాన్న హఠాత్తుగా తన చేయి నొప్పిగా ఉందని అన్నారు. అప్పటినుంచి ఆ నొప్పి తగ్గలేదు. నేను, "ఎలా అయినా నాన్నకి నొప్పి తగ్గాలి" అని బాబాను ప్రార్థించి నాన్న చేతికి ఆయింట్మెంట్ రాయసాగాను. అప్పుడు కూడా బాబాని తలుచుకుంటూ ఆయనే నాన్నకి ఆయింట్మెంట్ రాస్తున్నట్లు, నయం చేస్తారని అనుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజు నాన్న నొప్పి తగ్గిందన్నారు. అయినా ఆరోజు రాత్రి కూడా నాన్నకి ఆయింట్మెంట్ రాసాను. కానీ నాన్న నొప్పి మళ్ళీ వచ్చిందన్నారు. అప్పుడు నేను ఇలా కాదని, "బాబా! ఎలా అయినా ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం ఇచ్చి నొప్పి పూర్తిగా తగ్గేలా చేయండి" అని బాబాని ప్రార్థించాను. మా సిస్టర్ ఒకరు డాక్టర్. నాన్న తనకి కాల్ చేసి విషయం చెప్తే, "నరం పట్టినా, నరం మీద నరం ఎక్కినా అలా నొప్పి వస్తుంది" అని తను చెప్పి మాత్రలు, ఒక ఆయింట్మెంట్ ఇచ్చి తగ్గిపోతుంది అని చెప్పింది. ఆ మాత్ర వేసుకొని, ఆయింట్మెంట్ రాసుకోగానే నాన్న నొప్పి తగ్గిందని చెప్పారు. నేను ఆనందంగా, "చాలా థాంక్స్ బాబా. హాస్పిటల్‌కి వెళ్ళకుండా సమయానికి మా సిస్టర్‌కి కాల్ చేసే ఆలోచననిచ్చి నొప్పి తగ్గేలా చేసారు. ఇకపై ఆ నొప్పి రాకుండా ఉండేలా చూడు తండ్రీ" అని బాబాకి చెప్పుకున్నాను. తర్వాత రెండు రోజులకి నాన్న ఏ చేయికైతే ముందు నొప్పి వచ్చిందో అదే పక్క కాలు నరం పట్టి నొప్పి వచ్చింది. నాకు చాలా భయం వేసింది, 'అసలు ఈ నొప్పి ఏంటి? మొన్న చేతికి, ఇప్పుడు కాలుకి వచ్చింది' అని. నాన్న ఆయింట్మెంట్ రాసుకొని పడుకున్నారు. నేను, "బాబా! ఎలాగైనా నాన్నకి చేయి, కాలు నొప్పులు లేకుండా పూర్తిగా తగ్గించి, దానివల్ల ఏ ప్రమాదం లేకుండా చేయండి. అలా తగ్గితే నా అనుభూతిని తోటి సాయి భక్తులతో వెంటనే పంచుకుంటాను" అని చాలా బాధతో బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల రెండు రోజులకి నాన్నకి పూర్తిగా తగ్గింది. ఇప్పుడు నాన్న నొప్పి అని అనట్లేదు. "చాలా చాలా ధన్యవాదాలు తండ్రీ. ఇక ముందు ఈ నొప్పి మళ్ళీ రాకుండా, ఏ సమస్య లేకుండా చూడండి బాబా".

ఒకసారి మా అమ్మ తన ఐ సైట్ పెరిగిందని, హాస్పిటల్‌కి వెళ్లాలని అంది. నిజానికి ఆమె రోజూ నాకు అస్సలేం కనపడట్లేదు అంటుండేది. నాకు చాలా భయమేసింది. అప్పటికి చాలారోజుల ముందు డాక్టర్, 'అమ్మ కిడ్నీ దగ్గర బుడగలా ఉందని, దానివల్ల సమస్య ఏం లేదు. అదే తగ్గుతుందని' చెప్పారు. అది చెక్ చేసి చాలా రోజులు అయినందున కళ్ళు, కిడ్నీ ఒకేసారి చెక్ చేయిద్దామని నేను, మా తమ్ముడు అమ్మని తీసుకుని హాస్పిటల్‌కి వెళ్ళాము. నేను బాబాని, "అమ్మ కళ్ళకి, కిడ్నీకి ఏ సమస్య లేకుండా అన్నీ బాగుండేలా చేయండి" అని ప్రార్థించాను. బాబా దయవల్ల ఐ సైట్ కొద్దిగా పెరిగిందని, కిడ్నీకి బుడగలు ఉన్నాయి కానీ, వేరే ఏ లక్షణాలు లేవు కాబట్టి ఏ సమస్య లేదని చెప్పారు డాక్టర్. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఆ బుడగలు పూర్తిగా తగ్గి అమ్మకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి బాబా ప్లీజ్. సదా మాకు తోడు ఉండి జీవితంలో ధైర్యంగా ముందుకు వెళ్లేలా చేస్తున్న మీకు ఏం చెప్పినా, ఏం ఇచ్చినా తక్కువే తండ్రీ. జన్మజన్మలకి మీకు ఋణపడి ఉంటాము బాబా.  మీరు మా మీద చూపించే దయకి ఇంతకు మించి ఏం చెప్పగలను? ఎప్పుడూ మా చేయి వదలకుండా ఇలాగే పట్టుకొని మా జీవితంలో ముందుకు వెళ్లేలా చేయమని కోరుకుంటున్నాను తండ్రీ.

సర్వేజన సుఖినోభవంతు.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo