సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1178వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఉన్నారు
2. బిడ్డ ఆరోగ్య సమస్య సమసిపోయేలా అనుగ్రహించిన బాబా
3. భరించలేని నొప్పి ఉన్నప్పటికీ ఫ్రాక్చర్ కాకుండా చూసిన బాబా

బాబా ఉన్నారు


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!! ముందుగా సాయి బంధువులకు నా నమస్కారాలు. నాపేరు లక్ష్మి. నేను సామాన్య సాయి భక్తురాలిని. మా పాపకి తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ఐ సైట్ ప్రాబ్లమ్ వచ్చింది. దాంతో తాను కళ్ళజోడు పెట్టుకుంటూ ఉండేది. కళ్ళజోడు అవసరం లేకుండా ఉండేందుకుగానూ 2022, ఏప్రిల్ 22న పాప కళ్ళకు ఒక చిన్న బేసిక్ సర్జరీ చేయించాం. ఆ సమయంలో నేను, "బాబాతండ్రి, సాయినాథా! ఏ ప్రాబ్లమ్ లేకుండా సర్జరీ జరిగేలా చూడండి" అని బాబాని వేడుకున్నాను. ఆ సాయినాథుడు దయతో మా పాపకి చక్కటి కంటిచూపుని ప్రసాదించారు. ఇంకా నా సంతోషానికి అవధులు లేవు. "బాబాతండ్రి! నువ్వు ఉన్నావు తండ్రి. నువ్వే మా బిడ్డకు మంచి కంటిచూపును  ప్రసాదించావు" అని మనసులో బాబాకు ఎన్నోసార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నాను


2022లో నేను ఒక ఆపరేషన్ చేయించుకుని మా అమ్మవాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్న సమయంలో మా పెళ్లిరోజు వచ్చింది. మేము ప్రతి సంవత్సరం పెళ్లిరోజునాడు అన్నవరం వెళ్లి వ్రతం చేసుకుని వస్తాము. అందుచేత నేను, "బాబా! ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా మేము వ్రతం చేయించుకోగలిగేల అనుగ్రహించండి" అని బాబాను మనసులోనే  ప్రార్థించుకున్నాను. బాబా దయవలన మేము అన్నవరం వెళ్లి వ్రతం చేయించుకున్నాము, స్వామి దర్శనం బాగా జరిగింది. నేను ఎంతో ఆనందపడ్డాను. "సాయీశ్వరా, తండ్రీ! నువ్వు ఉన్నావయ్యా. తలచిన వెంటనే పలికే దైవం మీరు తండ్రి".


2022లో మా అమ్మకు ఉన్నట్టుండి ఛాతి మీద పెద్ద సెగ్గడ్డలా వచ్చింది. అమ్మకు షుగర్ ఉన్నందున మేమంతా చాలా భయపడిపోయాము. అప్పుడు నేను, "బాబా! ఇది మామూలు సెగ్గడ్డే, ఏమీ కాదని డాక్టరు చెప్పేలా దయ చూపండి" అని బాబాను వేడుకున్నాను. తరువాత అమ్మని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్లి, డాక్టర్‌కి చూపిస్తే, బాబా దయవల్ల డాక్టరు, "ఏమీ కాదు. ఇది మామూలు సెగ్గడ్డే" అని చెప్పారు. "బాబాతండ్రి! నువ్వున్నావు" అని మనసులోనే బాబాకు ఎన్నోసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. "ఇలాగే మమ్మల్ని సదా కాపాడు తండ్రి. మీ దయవల్ల అమ్మకి చాలావరకు తగ్గింది. ఇంకా కొద్దిగా ఉంది. అది కూడా త్వరగా మానిపోయేలా చూడు తండ్రి. నాకున్న కొన్ని ఆరోగ్య సమస్యలకు కూడా పరిష్కారం చూపించు తండ్రి. అలాగే మాకున్న కొన్ని వ్యాపార సమస్యలను పరిష్కరించి, ఆర్థిక సమస్యలు చక్కదిద్దు నాయనా. ఇంకా పిల్లలు మంచి ఉద్యోగాలలో స్థిరపడేలా చేయి తండ్రి".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


బిడ్డ ఆరోగ్య సమస్య సమసిపోయేలా అనుగ్రహించిన బాబా


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!! నా పేరు రఘు. మాది హైదరాబాద్. 2022, ఏప్రిల్ నెల మూడో వారంలో ఒకరోజు ఉదయం నా కూతురు తలనొప్పి అని నిద్ర లేవలేదు. హాలిడేసే కదా అని నేను కూడా లేపలేదు. తరువాత ఉదయం పది గంటలకి తనని నిద్రలేపితే, "తల తిరుగుతుంది" అంది. నేను తనకి నిద్ర సరిపోలేదేమో, అందుకే అలా ఉందేమో అనుకుని, "లేచి బ్రష్ చేసుకుని, టిఫిన్ చేస్తే తగ్గుతుంది రా" అని అన్నాను. అయితే టిఫిన్ చేసిన తరువాత కూడా తనకి తగ్గలేదు. తను మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ పడుకుంటే రెండుగంటల తరువాత తనకి వాంతి అయింది. నేను వెంటనే బాబాని ప్రార్థించి, మా ఫ్యామిలీ డాక్టరుకి ఫోన్ చేశాను. డాక్టరు కొన్ని మందులు సూచిస్తే, వెళ్లి ఆ మందులు తెచ్చి పాపకి వేసాను. వాంతులు కాలేదు కానీ తల అలాగే తిరుగుతుంది. ఆ రోజు ఆదివారం అయినందున మరుసటిరోజు వరకు చూసి డాక్టరు దగ్గరకు వెళదామని అనుకున్నాము. అనుకున్నట్లే సోమవారం డాక్టరు దగ్గరకి వెళ్తే, చెక్ చేసి బిపి తక్కువ ఉందని, అన్ని టెస్టులు చేసి మరుసటిరోజు రమ్మన్నారు. నేను తొమ్మిది సంవత్సరాల పాపకి బిపి సమస్య ఏమిటని బాధపడి "రిపోర్టులు నార్మల్ రావాలి, పాపకి నయమవ్వాలి బాబా" అని బాబాని ప్రార్థించాను. బాబాకు దణ్ణం పెట్టుకుని కొంచెం ఊదీ నీళ్ళలో కలిపి పాప చేత త్రాగించి, మరికొంత ఊదీ తన నుదుటన పెట్టాను. ఇంకా డాక్టరు దగ్గరకు వెళ్ళేవరకు 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని స్మరించసాగాను. బాబా దయవల్ల నేను కోరుకున్నట్లే రిపోర్టులన్నీ నార్మల్ వచ్చాయి. డాక్టరు నన్ను పిలిచి రిపోర్టులన్నీ నార్మల్‍గా ఉన్నాయని చెప్పి బలానికి సిరప్ రాసిచ్చారు. బాబా దయవల్ల మరుసటిరోజు పాపకి తలనొప్పి, ఆ మరుసటిరోజుకి తల తిరగడం కూడా తగ్గిపోయాయి. "బాబా! మీకు వందనాలు. మీరే నాకు తల్లి, తండ్రి మరియు గురువు. మీ ఆశీస్సులు మా మీద ఎప్పుడూ ఇలాగే ఉండాలి తండ్రి. నాకున్న ఆరోగ్య సమస్య తగ్గేలా చేయండి బాబా. ఇంకా నాకున్న రెండు కోరికలను కూడా తీరుస్తారని ఆశిస్తున్నాను బాబా".


శ్రీసాయినాథార్పణమస్తు!!!


భరించలేని నొప్పి ఉన్నప్పటికీ ఫ్రాక్చర్ కాకుండా చూసిన బాబా


సాయి బంధువులకు నమస్కారం. నా పేరు గీత. 2021 చివరిలో నా కాలి వేళ్ళు ఫ్రాక్చర్ అయితే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడంతో బాగైంది. కానీ అప్పుడప్పుడు కొద్దిగా నొప్పి వస్తుండేది. 2022, ఏప్రిల్ నెల మూడో వారంలో నేను వంట చేస్తూ చూసుకోకుండా అటు ఇటు తిరుగుతున్నప్పుడు అరుగు కిందభాగం నా కాలికి బలంగా తగిలి ప్రాణం పోయినంత బాధ కలిగింది. ఆ భాదకి చిటికెన వేలు పక్కకు జరిగిపోయిందనిపించి, 'బాబా!' అని బిగ్గరగానే అరిచేసాను. వెంటనే మందు రాసుకుని కాలుని గట్టిగా బ్యాండేజ్‍తో చూట్టేసి, "తండ్రీ! నా కాలు మళ్ళీ ఫ్రాక్చర్ కాకుండా చూడండి" అని బాబాను వేడుకున్నాను. భరించలేని నొప్పి ఉన్నప్పటికీ ఆ సాయినాథుని దయవల్ల ఫ్రాక్చర్ కాలేదు. "ధన్యవాదాలు సాయీ. మాకు అడుగడుగునా తోడునీడగా ఉంటూ మీరే నడిపించాలి".


సాయిభక్తుల అనుభవమాలిక 1177వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా కరుణ చాలా అపారమైనది
2. వచ్చింది బాబానే ఏమో!
3. ఆపదలో ఉన్నప్పుడు బాబా స్మరణ ఎంతో మేలు చేస్తుంది

బాబా కరుణ చాలా అపారమైనది


ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా ధన్యవాదాలు. నా పేరు శివకుమార్. మాది పాలకొల్లు ప్రక్కన చిన్న గ్రామం. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. 1999లో నేను10వ తరగతి పరీక్షలు వ్రాసేటప్పుడు ఇంగ్లీష్, మాథ్స్ పేపర్లు సరిగా రాయలేదు. అప్పుడు నేను రోజూ బాబా గుడికి వెళ్తూ, "బాబా! మీదే భారం" అని అనుకుంటూ ఉండేవాడిని. బాబా దయవల్ల నేను పదవ తరగతి ఫస్ట్ క్లాసులో పాసయ్యాను. ఇది నేను బాబా ద్వారా పొందిన మొదటి అనుభవం.


ఇక రెండో అనుభవం విషయానికి వస్తే, నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ఒకరోజు మా తమ్ముడు మా నాన్నగారితో గొడవపడి ఇంట్లో నుండి బయటకి వెళ్ళిపోయాడు. రాత్రైనా ఇంటికి తిరిగి రాలేదు. మాకు భయమేసి బాబాను ప్రార్ధించాము. పది నిమిషాలలో తమ్ముడి వద్ద నుండి మాకు ఫోన్ వచ్చింది, "నేను ఇంటికి వచ్చేస్తున్నాను" అని. మాకు చాలా సంతోషాన్నిచ్చిన బాబాకు ధన్యవాదాలు.


మూడవ అనుభవం: 2021లో మా నాన్నగారు కాలం చేశారు. ఆయన మీద బెంగతో నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తి ఏమి తిన్నా అరిగేది కాదు. హాస్పిటల్‍కి వెళితే, ఎండోస్కోపి మొదలు అన్ని టెస్టులు చేసి, "అంతా బాగానే ఉంది, ప్రాబ్లమ్ ఏమీ లేదు" అన్నారు. కాని నాకు వికారంగా ఉండటంతో మరలా హాస్పిటల్‍కి వెళితే, రేడియాలజీ చేశారు. ఆ రిపోర్టు ఆధారంగా, "కిడ్నీలో రాళ్లున్నాయి. నీళ్లు ఎక్కువగా త్రాగండి" అని అన్నారు. అదలా ఉంటే, 2022, శివరాత్రి నుండి నాకు నిద్రపట్టేది కాదు. హాస్పిటల్‍కి వెళితే, నిద్రపట్టడానికి టాబ్లెట్లు ఇచ్చారు. 'నాకు ఏమిటి ఈ పరిస్థితి?' అనుకుంటూ ఉండగా మా పిన్నిగారు ఫోన్ చేసి నా ఆరోగ్యం గురించి వాకబు చేసి, "బాబాని ప్రార్ధించు" అని సలహా ఇచ్చారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇంటర్ తర్వాత 2021 వరకు నేను సాయిబాబాకు పూజ చేసేవాడిని కాదు, ఆయనను స్మరించేవాడిని కూడా కాదు. అయినా మా పిన్నిగారి సలహామేరకు నేను బాబాని శరణువేడి, 'సాయి లీలామృతం', 'సచ్చరిత్ర' పారాయణ మొదలుపెట్టాను. ఆ రోజు నుండి నిద్రమాత్రలు వేసుకోకుండానే నాకు నిద్ర బాగా పడుతుంది. అంతేకాదు, ఆరోజు నుండి ప్రతిరోజూ వేసుకునే గ్యాస్ టాబ్లెట్ వేసుకోవడం పూర్తిగా మానేసాను. నాకు ఇప్పుడు అంతా బాగానే ఉంది. బాబా కరుణ చాలా అపారమైనది. "ధన్యవాదాలు బాబా. తెలిసీతెలియక ఏవైనా తప్పులు చేస్తే క్షమించు బాబా".


వచ్చింది బాబానే ఏమో!


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!! సాయి బంధువులకు నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి అభినందనపూర్వక ధన్యవాదాలు. నేను ఒక సాయి భక్తుడిని. నేను వేసే ప్రతి అడుగు సాయి ప్రేరణతోనని నా ప్రగాఢ విశ్వాసం. అది 1986 - 87వ సంవత్సరం అనుకుంటా. నేను ఒక ప్రైవేటు సైంటిఫిక్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‍గా పని చేస్తూ ఉండేవాడిని. నేను నా ఉద్యోగరిత్యా మహారాష్ట్ర టూర్‍‍కి వెళ్లాను. 'మజల్‌గావ్' అనే ఊరిలో నేను నా పని ముగించుకుని పూణే వెళ్ళడానికి బయల్దేరాను. నేను ప్రయాణిస్తున్న బస్సు 40 నిమిషాల తర్వాత ఒక ఊరిలో ఆగింది. ఆ బస్టాండులో ఒక రకమైన మనసుని ఆహ్లాదపరిచే చక్కటి వాతావరణం నెలకొని ఉంది. నాతోపాటు ప్రయాణిస్తున్న ప్రయాణికులలో చాలామంది బస్సు దిగి ఒక ఇరవై నిమిషాల తర్వాత తిరిగి వచ్చారు. వాళ్ళ చేతుల్లో ప్రసాదం ప్యాకెట్లు ఉన్నాయి. నేను బస్సు కండక్టరుని, "అయ్యా! ఇంత ఆహ్లాదంగా ఉంది. ఏమిటి ఈ ఊరు విశేషం?" అని అడిగాను. అందుకతను, "అయ్యో! మీకు తెలియదా? ఇది శిరిడీ" అని చెప్పారు. నేను అతన్ని, "ఎంత దూరం ఉంటుంది సాయి మందిరానికి" అని అడిగాను. అతను, "దగ్గర్లోనే" అనే బదులిచ్చాడు. నేను అతన్ని, "అయ్యా! నేను బాబాని దర్శించుకుని వస్తాను" అని అర్థించాను. కాని సమయాభావం వలన నేను ఆశించింది జరగని పరిస్థితి. పోనీ, ఆ బస్సు దిగిపోయి బాబా దర్శనం చేసుకుని వేరే బస్సు పట్టుకుని పూణే వెళదామంటే నా దగ్గర డబ్బులు సరిపడా లేవు. అందువలన బాబా దర్శనం చేసుకోకుండానే నేను పూణే వెళ్ళిపోయాను. తర్వాత సాయి సచ్చరిత్ర పారాయణ చేసినప్పుడు, "నా అనుమతి లేనిదే శిరిడీలో అడుగుపెట్టలేరు" అన్న బాబా మాటలు చదివి 'ఆనాడు బస్సు దిగలేనిది నేను కాదు. బాబానే నన్ను తమ దర్శనానికి అనుమతించలేదు' అని చాలా చాలా బాధపడ్డాను. 'అయ్యో.. అయ్యో..' అని కొన్ని వేలసార్లు అనుకుని ఉంటాను. ఇక ఎప్పుడెప్పుడు శిరిడీ వెళదామా అని నాకు ఉండేది. చివరికి బాబా అనుగ్రహంచారు. నేను, నా శ్రీమతి, మా బాబు, అత్తమామలతో కుటుంబసమేతంగా 1992లో నేను మొట్టమొదటిసారి శ్రీ సాయినాథుని దర్శనం చేసుకున్నాను. దర్శనమైతే బాగా జరిగింది కానీ, సంసారఝంజాటం వల్ల పిల్లవాడికి పాలు, పెద్దవాళ్లకు టిఫిన్లు, వసతి వగైరాలతో మనసు నిలకడలేదు. ఏదో తెలియని అసంతృప్తి. అసలే నా పరిస్థితి అలా ఉంటే, మా మామగారు 'అన్నమో రామచంద్ర' అంటూ గోల. యువకుడినైన నాకు విసుగు, కోపం. ఇప్పుడు  ఆలోచిస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. సరే, స్నానాలు కానించుకుని సమాధి మందిరానికి బయలుదేరాము. ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఒక అద్భుతం జరిగింది. ముమ్మూర్తులా సాయిబాబాను పోలిన(బాబానే ఏమో!)  వ్యక్తి నా ముందుకు వచ్చి, చాలా దగ్గరగా నిలబడి, "పైసా దేవ్, పైసా దేవ్" అన్నారు. సంభ్రమాశ్చర్యాలలో ఉన్న నేను, "పైసా నహి హై" అన్నాను. ఆయన, "ఆహా.. పైసా నహి హై అపకే పాస్" అని పెద్దగా నవ్వుతూ, "పైసా నహి హై. ఆహా... ఆహా.. ఠీక్ హై. పైసా జాయేగా" అని వెళ్ళిపోయారు. నేను కాస్త తేరుకుని ఆయనకోసం అటు ఇటు చూసాను కానీ, ఆయన మళ్లీ కనపడలేదు. 'బాబా బాబా' అని నిరంతరం తలుస్తాం, తీరా ఆయన ఎదురుగా వస్తే, మాయలో పడిపోతాము. అసలు విషయం ఏమిటంటే, నేను, 'పైసా నహి హై' అని బాబాతో చెప్పినప్పుడు, ఆయన "ఓహో... పైసా నహి హై. ఠీక్ హై, పైసా జాయేగా" అని అన్నారు కదా! మా తిరుగు ప్రయాణంలో డబ్బులు, శిరిడీలో కొన్న ప్రసాదాలు, ఇతరత్రా వస్తువులు ఉన్న సూట్కేస్ పోయింది. కానీ బాబా ఎంత దయామయులు అంటే, తిరుగు ప్రయాణంలో మాకు ఎటువంటి కష్టం లేకుండా, తిండికి ఏ లోటూ లేకుండా చూసి క్షేమంగా మా ఇంటికి చేర్చారు. తరువాత నా శ్రీమతి గుడిలో ప్రశ్నించగా, "ఆ డబ్బులు చేరవలసిన చోటుకే చేరాయి" అని జవాబు వచ్చింది. ఇలా లెక్కకు మించి అనుభవాలు బాబా నాకు ప్రసాదించారు. సాయి కృపతో వాటిని మీతో ముందుముందు పంచుకుంటాను. బాబా మన అందరి సొంతం. 'ఐ లవ్ బాబా. వి అల్ లవ్ బాబా'.


ఆపదలో ఉన్నప్పుడు బాబా స్మరణ ఎంతో మేలు చేస్తుంది


ముందుగా ఆ సాయినాథుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఒక సాయి భక్తుడిని. బాబా నా జీవితంలోకి వచ్చి ఇప్పటికి 5 సంవత్సరాల పైమాటే. ఈ 5 సంవత్సరాలలో బాబా నాకు ఎన్నో అనుభవాలిచ్చారు. వాటిలో నుండి కొన్ని అనుభవాలను నేను ఇంతకుముందు ఈ బ్లాగు ద్వారా తోటి సాయి బంధువులతో పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలను పంచుకుంటున్నాను. నేను చదువుకున్న చదువుకి తగ్గ ఉద్యోగం కాకపోయినా నా కుటుంబాన్ని పోషించటం కోసం ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాను. అది కూడా బాబా ఆశీర్వాదమని అనుకుంటున్నాను. ఈ సమయంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు కారణంగా మా కుటుంబంలో గొడవలు జరుగుతుండేవి. అందుకు కారణమేమిటా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే, నా తమ్ముడు అని తెలిసింది. అప్పుడు నేను నా మనసులో, "బాబా! నా తమ్ముడి బుద్ది మారి ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుంటే బాగుంటుంది" అని అనుకొన్నాను. అదే సమయంలో నా భార్య కూడా మనసు బాగాలేక చీటికిమాటికి గొడవపడుతూ ఉండేది. నేను, "వీళ్ళిద్దరూ మారితే 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకు మొక్కుకున్నాను. కొన్ని రోజుల తరవాత నా తమ్ముడు తనంతట తానే ఒక ఉద్యోగంలో చేరాడు. బాబా వాణ్ణి మార్చారు అనుకున్నాను. తర్వాత నా భార్య కూడా ఎటువంటి గొడవ చేయకుండా సంతోషంగా ఉండసాగింది.


ఒకరోజు రాత్రి నా భార్య పంటినొప్పితో బాధపడుతూ విషయం నాకు చెప్పింది. అపుడు సుమారు అర్థరాత్రి 12 గంటలు అయింది. నేను తనకొక టాబ్లెట్ ఇచ్చి వేసుకోమని చెప్పాను. తర్వాత బాబా ఊదీ తన నుదిటన పెట్టి, మరికొంచెం ఊదీ తన నోటిలో వేసి 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే బాబా నామాన్ని స్మరించాను. ఆశ్చర్యం! కొన్ని నిమిషాలకే నొప్పి తగ్గి, తను హాయిగా నిద్రపోయింది. ఇలాంటి అనుభవాలు బాబా నాకు ఎన్నో ప్రసాదించారు. ఆపదలో ఉన్నప్పుడు బాబా నామస్మరణ మనకు ఎంతో మేలు చేస్తుంది. మనమంతా బాబా సేవలో నిత్యం తరించాలని కోరుకుంటున్నాను.


సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1176వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అడుగడుగునా బాబా మనకి తోడుంటారు
2. ఎక్కిళ్ళ బాధను తీర్చడానికి వచ్చిన సాయినాథుడు

అడుగడుగునా బాబా మనకి తోడుంటారు


నేను ఒక సాయి భక్తురాలిని. నా జీవితంలో బాబా నాకు ఎన్నో అనుభవాలను ఇచ్చి ఆయన మీద నమ్మకాన్ని వృద్ధి చేస్తున్నారు. నేను ఆయన్ని మరిచిపోయినా ఆయన నన్ను ఎన్నడూ మరిచిపోలేదు. ప్రతిక్షణం బాబా నేనున్నానంటూ నాకు నిదర్శనమిస్తున్నారు. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మా ఆఫీసులో నాతోపాటు పనిచేసే ఒక సహోద్యోగి కొడుకు ఒకరోజు సైకిల్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. ఎక్స్-రే తీస్తే ఆ అబ్బాయి తొడ భాగంలో ఎముక విరిగి మూడు ముక్కలైందని తెలిసింది. డాక్టరు సర్జరీ చేయాలి అని అన్నారు. ఆ విషయం వినగానే, 'అంత చిన్నపిల్లాడికి ఎందుకలా అయింద'ని నాకు చాలా బాధగా, భయంగా అనిపించింది.  అప్పుడు 'బాబా మనకు ఏదైనా మంచి చేయాలనుకున్నప్పుడు మన దుష్కర్మల చెడు ప్రభావాన్ని ముందుగా తీసేస్తారు. ఇది కూడా అలాంటిదే అయుంటుంది' అని భావించి, "బాబా! ఆ బాబుకి బాగుండాలి. బాబుకి ఏ ప్రాబ్లం లేకుండా చూడండి" అని బాబాతో చెప్పుకుని 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రాన్ని జపించసాగాను. ఇలా ఉండగా మరుసటిరోజే ఆపరేషన్ చేస్తామని డాక్టరు చెప్పారు. నేను నా సహోద్యోగితో, "బాబు విషయంలో అంతా మంచిగా ఉండాలని బాబాని కోరుకుని, బాబా ఊదీ బాబుకి పెట్టమ"ని చెప్పాను. కానీ తను వెళ్లేసరికి బాబుని ఆపరేషన్ థియేటర్ లోపలకి తీసుకుని వెళ్లారు. తను, "ఒకసారి లోపలికి వెళ్లి, బాబుకి ఊదీ పెట్టి వస్తాన"ని అక్కడ స్టాఫ్‍ని అభ్యర్థిస్తుండగా అక్కడికి ఒక నర్సు వచ్చి, "నేనూ బాబా భక్తురాలినే. నేను బాబుకి ఊదీ పెడతాను" అని ఊదీ తీసుకుని వెళ్లి బాబుకి పెట్టింది. ఇలా అడుగడుగునా బాబా మనకి తోడుగా ఉంటారు. బాబా దయవల్ల సర్జరీ ఏ ప్రాబ్లం లేకుండా బాగా జరిగింది. కానీ తరువాత ఎక్స్-రే తీస్తే, ముక్కలైన మూడు ఎముకలను కలిపిన చోట ఒక ఎముక కొంచం బయటకి వచ్చినట్లుగా కనిపించింది. అయితే డాక్టరు పిల్లలు పెద్దవుతూ ఉంటే అది దానంతట అదే సెట్ అయిపోతుంది అని అన్నారు. "బాబా! బాబు మంచం మీద కష్టపడుతున్నాడు. డాక్టర్లు ఏం చెప్పినా, ఏం చేసినా నమ్మకం మరియు ఓపిక ఉంటే మీరు దేనినైనా, ఎటువంటి పరిస్థితినైనా మంచిగా మార్చగలరన్న నమ్మకం నాకు ఉంది బాబా. మళ్ళీ ఎక్స్-రే తీసేసరికల్లా ఆ ఎముక సెట్ అయి అంతా నార్మల్ అయ్యేలా చూడండి బాబా. ఆక్సిడెంట్ జరిగినప్పటినుంచి ప్రతిక్షణం ఎవరో ఒకరిని బాబు పక్కన ఉంచి ఏ పెద్ద ప్రాబ్లం లేకుండా ఇక్కడివరకు తీసుకు వచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఎప్పటికీ మీకు ఋణపడి ఉంటాను బాబా".


ఒకసారి మా అమ్మ బాగా కాళ్లనొప్పులతో తన ఆరోగ్యం బాగుండట్లేదు అంటుండేది. కొన్ని సంవత్సరాల క్రితం అమ్మ కిడ్నీ దగ్గర ఒక బుడగలా ఉందని, తరచూ చెకప్ చేయించుకుంటూ ఉండమని డాక్టరు చెప్పారు. అయితే ఈమధ్య చాలాకాలంగా చెకప్ చేయనందువల్లే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయేమోనని అమ్మ భయపడుతూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు మా బ్రదర్ అమ్మని చెకప్ కోసం హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాడు. అప్పుడు నేను, "బాబా! అమ్మకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా  చూడండి" అని బాబాను వేడుకున్నాను. డాక్టరు టెస్టు చేసి, "సమస్యేమీ లేదు. వయసు పైబడటం వల్ల కాళ్ళనొప్పులు వస్తున్నాయి" అని చెప్పి క్యాల్షియం టాబ్లెట్లు ఇచ్చి పంపించారు. అంతా బాబా దయ. "చాలా ధన్యవాదాలు బాబా. అమ్మానాన్నలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చూడండి బాబా".


నా మరదలు ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఒకరోజు తను మా ఇంటికి వచ్చింది. అప్పుడు తను తీసుకున్న ఆహారం పడక వాంతులు చేసుకుని అసౌకర్యంగా ఉందని ఏమీ తినకుండా పడుకుంది. అప్పుడు నేను, "బాబా! తనకి నార్మల్ అయ్యి ఆరోగ్యం బాగుండేలా చూడండి" అని బాబాతో చెప్పుకుని కొద్దిగా ఊదీ తన నుదుటన పెట్టాను. కాసేపటికి తను నిద్రపోయింది. మరుసటిరోజు ఉదయం నేను తనని, "ఇప్పుడు ఎలా ఉంది?" అని అడిగాను. అందుకు తను, "రాత్రి అస్సలు మెలుకువ రాలేదు. బాగా నిద్రపట్టింది" అని చెప్పింది. "బాబా! తనకి ఏ ఇబ్బందీ లేకుండా ప్రశాంతంగా నిద్రపోయేలా అనుగ్రహించి తనని నార్మల్ చేసినందుకు మీకు ధన్యవాదాలు".


ఇంకోరోజు ఇంట్లో ఏదో వండితే, అది తిన్న మా మరదలు, ఆ ఆహారం పడక తనకి కడుపునొప్పి వస్తుందని వెళ్లి పడుకుంది. మా ఇంట్లో అందరికీ చాలా భయమేసింది. అప్పుడు నేను తనకి బాబా ఊదీ పెట్టి, మేడపైకి వెళ్లి నా ఫోన్‌లో బాబా లైవ్ దర్శన్ ఓపెన్ చేసి, "బాబా! నేను కిందకి వెళ్లేసరికి తనకి కడుపునొప్పి తగ్గి, తను భోజనం చేయాలి" అని బాబాతో చెప్పుకుని 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రాన్ని108 సార్లు స్మరించాను. ఆపై బాబాని తలుచుకుని కిందకి వెళ్లేసరికి నా మరదలు లేచి తనంతటతానే భోజనం కూడా చేసింది. నిజంగా ఇది బాబా చేసిన అద్భుతం. నేను మా ఇంట్లోవాళ్ళతో, "నేను బాబాను తలుచుకున్నాను, తనకి తగ్గింది" అని చెపితే, అందరూ చాలా సంతోషించారు. "చాలా చాలా థాంక్స్ బాబా".


మనం రోజూ ఎన్నో మెసేజ్లు చూస్తాం. కానీ కొన్ని మనసుకి బాగా కనెక్ట్ అవుతాయి. ఒకరోజు ఉదయం నేను నిద్రలేవగానే ఈ బ్లాగులో,  "బావూ! ఈరోజు నేను మీ ఇంటికి భోజనానికి వస్తాను" అన్న బాబా మెసేజ్ చూసాను. నాకెందుకో ఆ మెసేజ్ బాగా కనెక్ట్ అయి, 'మా ఇంటికి ఎవరు వస్తారు? సరే, ఈరోజు మధ్యాహ్నం ఎవరైనా వస్తారేమో చూద్దాం' అని అనుకున్నాను. ఉదయం 11 గంటలకి నా మీటింగ్ అవగానే మా ఇంటి గుమ్మం దగ్గరికి ఎవరో భిక్షకోసం వచ్చారు. అదివరకు మా ఊరిలో ఒకతను భిక్షకోసం వచ్చి ఇచ్చిన దానితో తృప్తి చెందక బలవంతంగా అందరి వద్ద నుండి డబ్బులు తీసుకుంటుండేవాడు. ఆ అబ్బాయే వచ్చాడని మా అమ్మ అనుకుంటుండగా నేను వెళ్లి, "ఎవరో పిలుస్తున్నారు. ఎవరమ్మా" అని అమ్మను అడిగాను. అప్పుడు అమ్మ నా చేతికి కొంచెం డబ్బులిచ్చి, "వీటిని దూరం నుంచి అతనికిచ్చి వచ్చేయి, అతనేమన్నా పట్టించుకోకు" అని చెప్పింది. కానీ వచ్చింది ఆ అబ్బాయి కాదు, వేరే అతను. నాకు ఎందుకో అతన్ని చూడగానే ఉదయం చదివిన బాబా మెసేజ్ గుర్తుకు వచ్చి, 'బాబానే వచ్చారా?' అని అనిపించి, 'ఆయనకి ఏమి ఇవ్వాలి?' అని అనుకున్నాను. కానీ ఎవరో అనుకుని అప్పటికే అపార్థం చేసుకున్న అమ్మని ఏదైనా అడిగితే, ఏమంటుందోనని ఆలోచిస్తుంటే, అప్పుడే మా డాడీ తెచ్చిన పళ్ళు కనిపించాయి. వాటిని తీసుకుని అతని దగ్గరకి వెళ్లాను. అతని చేతిలో ఉన్న డబ్బులు చూసి, ఇతను డబ్బులు తీసుకునే వ్యక్తి కాబోలు, పళ్ళు తీసుకోరేమో అనుకున్నాను. కానీ నేను పండ్లు ఇస్తే, అతను సంతోషంగా వాటిని తీసుకుని 'జై సాయిరామ్' అని వెళ్ళిపోయాడు. నాకైతే అతని రూపంలో బాబానే వచ్చారనిపించి చాలా చాలా సంతోషించాను. తరువాత పొద్దున్న బ్లాగులో వచ్చిన బాబా మెసేజ్ గురించి అమ్మకి చెప్తే, "అయ్యో! నేను అతన్ని గుర్తుపట్టలేనందున ఏమీ ఇవ్వలేకపోయాను" అని చాలా బాధపడింది. అతన్ని వెనక్కి పిలిచి ఏదైనా ఇద్దామని మా వీధిలో, వెనక వీధిలో వెతికాము కానీ, ఆయన అప్పటికే ఏటో వెళ్ళిపోయారు. ఈ అనుభవం ఎందుకు పంచుకున్నాను అంటే, 'బాబా ఏదో ఒక రూపంలో మీ ముందుకు కూడా రావచ్చు. ఆయన వచ్చినప్పుడు మీరు ఆయన్ని గుర్తుపట్టి, ఆయనపట్ల మీ ప్రేమను వ్యక్తపరుస్తార'ని.


ఎక్కిళ్ళ బాధను తీర్చడానికి వచ్చిన సాయినాథుడు

నా పేరు రవికిరణ్. నేను మెడికల్ షాపులో పనిచేసే రోజుల్లో ఒకసారి ఉదయం ఎనిమిది గంటలకు షాపు తెరవడానికి వెళ్తుంటే, అనుకోకుండా నాకు ఎక్కిళ్ళు మొదలయ్యాయి. అలాగే వెళ్లి షాపు తెరిచాను. తరువాత సూపర్వైజర్, మేనేజర్ తదితరులందరూ వచ్చారు. నీళ్లు త్రాగిత్రాగి నా పొట్టంతా నిండిపోయింది. కానీ 9 గంటలైనా ఎక్కిళ్ళు ఆగలేదు. అందరూ తమకు తోచిన సలహా ఇచ్చి, ఆపై మూడు, నాలుగు రకాల టాబ్లెట్లు కూడా ఇచ్చారు. కాని ఎక్కిళ్ళు తగ్గలేదు. నాకు తెలిసిన వారికి ఫోన్లు చేసి వారి సలహా తీసుకున్నాను. అయినా ఏ ఉపయోగం లేకపోయింది. ఇలా రెండు గంటలపాటు ఎక్కిళ్ళతో బాధపడుతుండగా 10 గంటల సమయంలో పైజామా వేసుకున్న ఒక పెద్దాయన మా షాపుకి వచ్చి, నన్ను తమ దగ్గరకి రమ్మని సైగ చేశారు. నేను ఆయన దగ్గరకి వెళ్తే, "నీళ్లు తెచ్చుకో" అన్నారు. సరేనని, నేను నీళ్లు తీసుకుని వెళితే ఆయన, తమ ముందుకు వంగి, ఒక ప్రత్యేకమైన పద్ధతిలో గ్లాసు నోటికి ఆనించుకుని నీళ్ళు త్రాగమన్నారు. నేను ఆయన చెప్పినట్లే నీళ్ళు త్రాగుతుంటే, ఆయన నా ముందు నిలుచుని, అంతసేపూ 'ఓం నమః శివాయ' అని అంటూ ఉన్నారు. నేను నీళ్ళు త్రాగి లేచేసరికి రెండుగంటలుగా నన్ను బాధిస్తున్న ఎక్కిళ్ళు ఆగిపోయాయి. గ్లాసు వెనకకు పెట్టి చూసేసరికి ఆయన మరి కనిపించలేదు. షాపు నుండి బయటికి వెళ్లి, చుట్టూ చూసాను. కానీ ఆయన ఎక్కడా లేరు. మెడికల్ షాపులో పనిచేస్తున్న నా దగ్గరకి ఆయన మందులకోసం రాలేదు. మరెవ్వరినీ ఆయన పలకరించలేదు. కేవలం నా బాధ తీర్చడానికి వచ్చిన ఆయన ఎవరు? మన అందరి దైవం అయిన ఆ సాయినాథుడే కదా! ధన్యవాదాలు బాబా.

సాయిభక్తుల అనుభవమాలిక 1175వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయతో ఇట్టే తీరిపోయిన సమస్యలు
2. భయంకరమైన నొప్పిని, రెడ్ క్లాట్‌ని తొలగించిన బాబా
3. బాబా అనుగ్రహంతో పూర్తిగా తగ్గిపోయిన ఇన్ఫెక్షన్

బాబా దయతో ఇట్టే తీరిపోయిన సమస్యలు
 
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!! సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు ప్రీతి. నేను హైదరాబాదులో నివాసముంటున్నాను. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు మీతో పంచుకోబోయే ముందు ఆలస్యంగా ఈ అనుభవాలను పంచుకుంటున్నందుకు బాబాకి క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఇక నా అనుభవాల విషయానికి వస్తే...
 
నా భర్త ఉద్యోగరిత్యా వేరే దేశంలో ఉంటున్నారు. ఆయన ప్రతినెలా మొదటి వారంలో మా నెలవారీ ఖర్చులకోసం డబ్బులు పంపుతుంటారు. అయితే ఒక నెల సరైన సమయంలో నాకు డబ్బులు అందలేదు. ఎందుకంటే, ఆ నెల మావారి కంపెనీలో జీతాలు చెల్లించడం ఆలస్యమైంది. దాంతో ఇక్కడ నేను నెలవారీ ఖర్చులకి డబ్బులు చెల్లించడంలో సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది. అప్పుడు నేను, "బాబా! నాకు డబ్బులు అందితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాని ప్రార్థించాను. బాబా దయవల్ల నా అకౌంటులో డబ్బులు క్రెడిట్ అయ్యాయని మరోసటిరోజు నాకు మెసేజ్ వచ్చింది. "థాంక్యూ సో మచ్ బాబా".    

2022, సంక్రాంతి సెలవులకి మా అత్తయ్య మమ్మల్ని తమ గ్రామానికి రమ్మని పిలిచారు. కానీ అక్కడికి వెళ్లడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే, మా పిల్లలిద్దరికీ ఫిబ్రవరి నెల మధ్యలో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అందుకోసం వాళ్ళు చదువుకోవాల్సింది చాలా ఉంది. ఒకవేళ మేము ఊరికి వెళితే, వాళ్ళ ధ్యాస చదువు మీద నుండి మళ్ళుతుంది. అందువలన నేను బాబాను, "సెలవులకు రమ్మని మా అత్తమామలు బలవంతపెట్టకుండా ఉండేలా చూడండి" అని ప్రార్థించాను. బాబా దయవల్ల వాళ్ళు మమ్మల్ని రమ్మని ఒత్తిడి చేయలేదు. "ధన్యవాదాలు బాబా".

ఇటీవల నేను తీవ్రమైన నొప్పితో చేయి కదపలేక రెండురోజులు చాలా బాధపడ్డాను. డాక్టరుని సంప్రదించి మందులు తీసుకొని రెండు రోజులు వాడినప్పటికీ ఆ చేయినొప్పి నుండి నాకు ఎటువంటి ఉపశమనం కలగలేదు. తరువాత గురువారం నాడు నేను బాబాకి అభిషేకం చేసి, ఆ అభిషేక తీర్థాన్ని త్రాగాను. బాబా దయవల్ల అదేరోజు నాకు చేయినొప్పి నుండి పూర్తిగా ఉపశమనం లభించింది. "థాంక్యూ సో మచ్ బాబా. నా బ్రదర్ తన దగ్గర బంధువుల నుండి చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాడని మీకు తెలుసు బాబా. దయచేసి నా బ్రదర్‍ని ఇబ్బందిపెట్టకుండా వాళ్ళ మనసును మార్చండి. అలాగే తనకి తోడుగా ఉంటూ సమస్యలను ఎదుర్కొనే మానసికబలాన్ని ఇవ్వండి బాబా".

భయంకరమైన నొప్పిని, రెడ్ క్లాట్‌ని తొలగించిన బాబా

నా పేరు శివ. నేను నర్సాపురంలో నివసిస్తున్నాను. కొద్దిరోజుల క్రితం (2022, ఏప్రిల్ నెల రెండవ వారంలో) బాబా ఒక గొప్ప అద్భుత లీలని నా విషయంలో చూపారు. ఆ లీలనే ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. “ఈ అనుభవాన్ని పంచుకోవడంలో చాలా ఆలస్యమైనందుకు నన్ను క్షమించు బాబా”. కొద్దిరోజుల క్రితం నేను ఆఫీస్ పనిమీద ముంబయి వెళ్ళాల్సి వచ్చింది. నా పర్యటన ప్రణాళిక ప్రకారం ముందుగా నేను ముంబయికి వెళ్ళి, అక్కణ్ణించి సూరత్‌కి, ఆ తరువాత హైదరాబాదుకి, అక్కణ్ణించి తిరిగి ఇంటికి (నర్సాపూర్) రావాల్సి ఉంది. కంపెనీవాళ్ళు నాకోసం విజయవాడ నుండి ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. ఆరోజు 12.30 గంటలకి నేను ఫ్లైట్ ఎక్కాను. అంతకుముందే నా ఎడమచెవికి ఆపరేషన్ అయింది. కుడిచెవికి కూడా కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ అది ఇంతకుముందు నన్నెప్పుడూ ఇబ్బందిపెట్టనందువల్ల, ‘ఇప్పుడు కూడా ఏమీ కాదులే, ఎన్నిసార్లు ఫ్లైట్ జర్నీ చేయలేదు?’ అని నిర్లక్ష్యంతో ఏ టాబ్లెట్స్ గానీ, కాటన్ గానీ దగ్గర ఉంచుకోలేదు. ఫ్లైట్‌లో కూర్చుని, నా ఫోనులో డౌన్లోడ్ చేసుకుని ఉంచుకున్న ‘సాయి డివోటీ స్పీక్స్’ (Sai Devotee speaks) అనే వీడియోలు చూస్తూ ఉన్నాను. కుడిచెవి కొంచెం ఇబ్బందిపెడుతున్నా నేను అదేమీ పట్టించుకోకుండా వీడియోలు చూస్తూ ఉన్నాను. ఉన్నట్టుండి విపరీతమైన నొప్పి తలలో మొదలై కుడిచెవి, కుడికన్ను వరకు వ్యాపించింది. నొప్పి ఎంత తీవ్రంగా ఉందంటే, ఆ నొప్పికి కుడికన్ను బద్దలైపోతుందేమో అనిపించింది. నాకు ఏమి చేయాలో తెలియలేదు. ఫ్లైట్ అటెండెంట్‌కి చెబుదామంటే వాళ్ళు ఏమనుకుంటారో అని ఒకప్రక్క భయం. మరోప్రక్క భరించలేని బాధ. జీవితంలో ఇదే నాకు ఆఖరిరోజు అన్నట్టుగా ఉంది. వెంటనే నేను బాబాని స్మరించుకుని, “బాబా, నువ్వే దిక్కు. నేను ఏమైనా తప్పులు చేసివుంటే క్షమించి, నన్ను కాపాడు” అని ఆర్తిగా వేడుకున్నాను. ఒక పావుగంట పాటు నొప్పి అలానే పెరుగుతూ ఉంది. నేను కళ్ళుమూసుకుని బాబాను ప్రార్థిస్తూనే ఉన్నాను. బాబా దయవల్ల ఆ భయంకరమైన నొప్పి నుదుటిలో నుండి కుడికన్నులోకి వచ్చి అక్కడితో అదృశ్యమైంది. మొత్తానికి బాబా నన్ను ఆ భయంకరమైన నొప్పి నుండి రక్షించారు. ఫ్లైట్ దిగి హోటల్ రూముకి వచ్చి చూసుకుంటే, కుడికంటిలో పెద్ద రెడ్ క్లాట్(ఎర్రని గడ్డ) కనిపించింది. అది చూసి నేను చాలా భయపడి మనసులోనే బాబాకు నమస్కరించుకుని, “బాబా! నా ప్రాణాలను కాపాడి నాకు పునర్జన్మను ప్రసాదించావు. అదేవిధంగా, నేను ఇంటికి వెళ్ళేలోపు నా కంటిలోని ఈ రెడ్ క్లాట్‌ని కూడా తొలగించు” అని ఆర్తిగా వేడుకున్నాను. తరువాత మా ఆఫీసుకి దగ్గరలో ఉన్న సాయి మందిరానికి వెళ్ళి బాబాను దర్శించుకున్నాను. 

నా పర్యటనలోని నాలుగు రోజులూ కంటిలోని ఆ రెడ్ క్లాట్‌ని పరీశీలిస్తూనే ఉన్నాను. అది ఏమాత్రం తగ్గలేదు. ఆశ్చర్యంగా, ఇంటికి వచ్చిన మరుసటిరోజు నిద్రలేచిన తరువాత చూసుకుంటే నా కంటిలో క్లాట్ ఏమీ కనిపించలేదు. “బాబా! మీరు నన్ను కాపాడి నాకు పునర్జన్మను ప్రసాదించారు. ఇలాగే నా జీవితాంతం నాకు ఇలాగే సహాయం చేయండి బాబా. మీ ఋణం తీర్చుకోలేనిది, థాంక్యూ సో మచ్ బాబా”.

బాబా అనుగ్రహంతో పూర్తిగా తగ్గిపోయిన ఇన్ఫెక్షన్

నేను ఒక సాయి భక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవం నేనిప్పుడు మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకరోజు అకస్మాత్తుగా నాకు వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. నీళ్ళ విరోచనాల కారణంగా నేను చాలా నీరసించిపోయాను. అందుచేత హాస్పిటల్‌కి వెళ్లి సెలైన్ ఎక్కుంచుకున్నాను. తరువాత డాక్టరు కొన్ని టాబ్లెట్లు ఇచ్చి డిశ్చార్జ్ చేసారు. అయితే ఆ టాబ్లెట్ల పవర్ ఎక్కువగా ఉండటం వల్ల ఎప్పుడూ కడుపులో తిప్పేస్తున్నట్టుగా ఉండేది. అప్పుడు మా ఫ్యామిలీ డాక్టరుని సంప్రదిస్తే, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో తెలుసుకోవడం కోసం బ్లడ్ టెస్టు చేసారు. రిపోర్టులో ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉందని వచ్చింది. డాక్టరు 2 వారాలకి యాంటిబయోటిక్స్ రాసి పంపారు. నేను ఆ మందులు వాడుతూ, బాబా ఊదీ తీసుకుంటూ, మరికొంత ఊదీ పొట్ట మీద రాసుకుంటూ ఉండేదాన్ని. రెండు వారాల తరువాత మళ్లీ హాస్పిటల్‍కి వెళితే, టెస్టు చేసి, "ఇన్ఫెక్షన్ ఇంకా ఉంది" అని టాబ్లెట్లు రాసి, "ఈసారి వచ్చేసరికి కూడా తగ్గకపోతే, గాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరకి పంపుతాను" అన్నారు. నాకు చాలా భయమేసి బాబాని తీవ్రంగా ప్రార్ధించాను. కానీ ఇన్ఫెక్షన్ తగ్గలేదు. దాంతో మా ఫ్యామిలీ డాక్టరు ఒక గాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరకి నన్ను పంపించారు. ఆ డాక్టరు అవసరమైన కొన్ని వివరాలు అడిగి రెండు వారాలకి మందులిచ్చి, "తగ్గకపోతే 'కోలన్ స్కోపీ' చేస్తాను" అన్నారు. నేను, 'వామ్మో, ఇదేమిటీ దేవుడా?' అని చాలా ఏడ్చి ప్రతిరోజూ బాబాను గట్టిగా ప్రార్థిస్తూ, ఊదీ నీళ్లు త్రాగి, పొట్టకి కూడా రాసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా, 'బాబా! నాకు ఏ టెస్టులు వద్దు, దయతో అవేమీ లేకుండా నాకు గనక ఇన్ఫెక్షన్ తగ్గిస్తే, మీ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. ఆ బాబా దయవల్ల మందులు అయిపోయాక నాకు ఏ సమస్య రాలేదు. పూర్తిగా తగ్గిపోయింది. "థాంక్యూ బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1174వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. మ్రొక్కుకున్నంతనే ప్రతి సమస్యని పరిష్కరిస్తున్న బాబా
2. బాబా అనుగ్రహం
3. కనిపించకుండాపోయిన రెండు ఉంగరాలను తిరిగి అప్పగించిన బాబా

మ్రొక్కుకున్నంతనే ప్రతి సమస్యని పరిష్కరిస్తున్న బాబా

సాయిభక్తులందరికీ నమస్కారం. నేనొక సాయిభక్తురాలిని. నా జీవితంలో వచ్చిన ప్రతి సమస్యలోనూ బాబా నాకు తోడుగా ఉన్నారు. నాకు ఏ సందేహం వచ్చినా బాబా నాకు ఏదో రూపంలో సమాధానమిస్తారు. ఒకరోజు నేను స్కూటీపై వెళుతుండగా అనుకోకుండా స్కూటీతో సహా క్రింద పడిపోయాను. స్కూటీ రిపేరుకు వచ్చింది. మెకానిక్ దగ్గర చూపిస్తే, ‘రిపేర్ చేయడానికి 15,000 రూపాయలు ఖర్చవుతుంద’ని అన్నాడు. దాంతో నాకు చాలా బాధవేసి, “బాబా! ఇప్పటికే అప్పులతో సతమతమవుతున్నాము. ఇప్పుడు స్కూటీ రిపేర్ కోసం 15 వేల రూపాయలు ఎక్కడినుండి తీసుకురావాలి బాబా?” అంటూ బాబా ముందు కూర్చుని చాలా ఏడ్చాను. తరువాత, “బాబా! మీ దయవల్ల 5 వేల రూపాయల లోపు స్కూటీ రిపేరవ్వాలి” అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల 2,500 రూపాయలకే స్కూటీ రిపేర్ అయింది. “థాంక్యూ బాబా!”

2022, మార్చ్ నెల మధ్య నుండి సుమారు నెలరోజుల వరకు నా భుజాలు, చేతులు చాలా నొప్పి పెడుతుండేవి. ఆ కారణంగా నాకు పడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ‘ఎందుకిలా ఇంతలా నొప్పిపెడుతున్నాయి?’ అని ఆలోచిస్తే, ‘ఫోన్లో గేమ్ ఎక్కువగా ఆడటం వల్లనేమో’ అని నా మనసులో అనుమానం వచ్చింది. నాకు వచ్చిన అనుమానం నిజమో కాదో తెలుసుకుందామని నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా, నాకు వచ్చిన అనుమానం నిజమే అయితే ఈరోజు శేజ్ ఆరతిలో మీరు గ్రీన్ కలర్ డ్రెస్సులో దర్శనమివ్వండి” అని అనుకున్నాను. ఆరోజు బాబా గ్రీన్ కలర్ డ్రెస్సులో దర్శనమిచ్చారు. దాంతో, నా అనుమానం నిజమేనని బాబా చెబుతున్నారని రూఢి చేసుకుని, బాబాకు నమస్కరించుకుని, “బాబా! మీ దయవల్ల నేను ఫోనులో గేమ్ ఆడడం తగ్గించాలి. చేతులు, భుజాలు నొప్పి తగ్గి నేను హుషారుగా పనిచేసుకోవాలి” అని బాబాను వేడుకున్నాను. ఆ తరువాత బాబా దయవల్ల నేను ఫోన్ చూడటం, గేమ్ ఆడటం తగ్గిపోయింది. చేతులు, భుజాల నొప్పులు కూడా చాలావరకు తగ్గిపోయాయి. “ధన్యవాదాలు బాబా”

మావారికి ఇదివరకు ఒకసారి కంటికి కురుపు రావడంతో తనకు ఆపరేషన్ అయింది. ఇటీవల మళ్ళీ ఇంకొక కురుపు వచ్చింది. దాంతో, మళ్ళీ తనకు ఆపరేషన్ చేయాల్సివస్తుందేమోనని భయపడి నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! మీ దయవల్ల ఏ సమస్యా లేకుండా కురుపు పగిలిపోవాలి” అని బాబాను వేడుకున్నాను. నేను అలా బాబాకు వేడుకున్నరోజు సాయంత్రం ఆ కురుపు పగిలిపోయింది. బాబా చూపిన కరుణకు ఎంతో ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. 

నాకు చాలా సంవత్సరాలనుండి మూత్రాశయం దగ్గర దురద వస్తోంది. ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఎంతోమంది డాక్టర్లను సంప్రదించాను. వాళ్ళిచ్చిన మందులు వాడాను. అయినా దురద తగ్గలేదు. పైగా ఒళ్ళంతా కూడా దురద వస్తుండేది. ఆ దురద భరించలేక ఒకరోజు బాబాకు నమస్కరించుకుని, “బాబా! మీ దయవల్ల దురద తగ్గిపోవాలి” అని చెప్పుకున్నాను. అంతే! బాబా అనుగ్రహంతో దురద చాలావరకు తగ్గిపోయింది. “ధన్యవాదాలు బాబా! మీ దయవల్ల ఇప్పుడు దురద అంతగా లేదు. మిగిలిన ఆ కొంచెం దురద కూడా తగ్గేలా చేయి తండ్రీ!”.

సర్వేజనాః సుఖినో భవంతు!!!

బాబా అనుగ్రహం

సాయి బంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేనిప్పుడు బాబా నాపై వర్షించిన అనుగ్రహాన్ని మీతో పంచుకుంటాను. 2022లో నా సర్టిఫికెట్స్ కోసమని నేను అదివరకు చదివిన కాలేజీకి వెళితే, కాలేజీవాళ్ళు కొన్నిరోజుల తర్వాత రమ్మన్నారు. నేను మళ్లీ 20 రోజుల తర్వాత వెళ్ళాను. అప్పుడు అక్కడ బాబా ఫోటో రూపంలో నాకు దర్శనం ఇచ్చారు. నేను బాబాకి నమస్కరించుకుని, "బాబా! ఏ ఇబ్బంది పెట్టకుండా నా సర్టిఫికెట్స్ నాకు ఇచ్చేలా అనుగ్రహించండి" అని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల కాలేజీవాళ్ళు వెంటనే నా సర్టిఫికెట్స్ నాకు ఇచ్చేసారు. "థాంక్యూ సో మచ్ బాబా. మమ్మల్ని ఎల్లవేళలా కాపాడు తండ్రి".

కనిపించకుండాపోయిన రెండు ఉంగరాలను తిరిగి అప్పగించిన బాబా

నా పేరు మాలతి. నేను సాయినాథునికి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ నా అనుభవం ఒకటి తోటి సాయిబంధువులతో పంచుకుంటున్నాను. 2022, ఏప్రిల్ 26న నా ఉంగరాలు రెండు కనిపించలేదు. ఇళ్ళంతా వెతికినా ప్రయోజనం లేకపోయింది. వాటిలో ఒకటి నా పెళ్లి ఉంగరం కాగా ఇంకొకటి మా అమ్మ ఇచ్చిన ఉంగరం. అమ్మ ఇప్పుడు లేరు. ఆమె బాబా చరిత్ర పారాయణ చేస్తూ వారి సన్నిధికి చేరుకుంది. ఆమె గుర్తుగా నాకు మిగిలింది ఆ ఉంగరం ఒక్కటే. అలాంటిది ఆ రెండు ఉంగరాలు కనిపించకపోయేసరికి నాకు చాలా బాధగా అనిపించింది. అయినప్పటికీ బాబా నేను వాటిని ఎక్కడ పెట్టానో, నాకు గుర్తు చేసి నాకు అప్పజెప్తారనే నమ్మకంతో "అవి దొరికేలా చూడమ"ని బాబాతో చెప్పుకున్నాను. తరువాత విచిత్రంగా ఆ రెండు ఉంగరాలు బాబా పాదాల చెంతనే కనిపించాయి. "ధన్యవాదాలు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1173వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయ ఉంటే ప్రతి సమస్య ఇట్టే తొలగిపోతుంది
2. బాబా దయతో కనబడనివి కనిపించాయి
3. బాబాకి చెప్పుకున్నంతనే దొరికిన చెవిరింగు

బాబా దయ ఉంటే ప్రతి సమస్య ఇట్టే తొలగిపోతుంది

అందరికీ నమస్తే. నా పేరు అంజలి. నేనిప్పుడు బాబా నాపై చూపిన ప్రేమను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈమధ్య ఒకరోజు నాకు, మావారికి మధ్య చిన్న మనస్పర్థ వచ్చింది. నా తప్పేమీ లేనందున నేను, "మావారే వచ్చి నాకు సారీ చెప్పేలా చేసి సమస్యను తొలగించండి బాబా" అని బాబాకి చెప్పుకున్నాను. ఆయన దయవల్ల కొంతసేపటికి మావారు వచ్చి, నాకు సారీ చెప్పారు. అంతటితో మా మధ్యనున్న సమస్య తొలిగిపోయింది. 

ఒకరోజు మా కుటుంబం, మా తమ్ముడు కలిసి బయటకు వెళ్ళాము. మా పాప తమ్ముడి బైక్ తాళంతో ఆడుకుంటూ దాన్ని ఎక్కడో పెట్టేసింది. అక్కడంతా వెతికినా తాళం కనిపించలేదు. అప్పుడు నేను, "బాబా! బైక్ తాళం దొరికితే, బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల ఆ తాళం మా కారులోనే దొరికింది.

మేము 2022, ఏప్రిల్ 5న తిరుపతి వెళ్ళాము. అప్పుడు నేను 'బాబా దయవల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనమైతే, బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. మొదట మాకు తిరుమలలో రూమ్ దొరకక చాలా ఇబ్బంది పడినప్పటికీ బాబా దయవల్ల తరువాత రెండురోజులకి మంచి రూమ్ దొరికింది. దర్శనం కూడా బాగా జరిగి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాము.

2022, ఏప్రిల్ 12న మళ్ళీ మేము మా ఫ్రెండ్ వాళ్ళకోసం తిరుపతి వెళ్లాల్సి వచ్చింది. ఏప్రిల్ 13న దర్శనానికి మా అందరికీ టిక్కెట్లు ఉన్నాయి. కానీ ఏప్రిల్ 12న దర్శనానికి పెద్దవాళ్లకు టిక్కెట్లు ఉన్నప్పటికీ మా బాబుకు టికెట్ బుక్ చేయలేదు. మేము ఏప్రిల్ 12న తిరుపతి చేరుకున్నాము. బాబా దయవల్ల మాకు రూమ్ దొరికింది. ఆ రాత్రి పదిగంటల దర్శనానికి మేము వెళ్తూ టికెట్ లేకపోయినా బాబా మీద భారం వేసి మా బాబుని కూడా తీసుకుని వెళ్ళాము. దర్శనానికి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ పాయింట్‍లో ఐ.డి. ప్రూఫ్ చెక్ చేస్తారు. 12 సంవత్సరాలలోపు పిల్లలకి టికెట్ అవసరం లేదు. కానీ మా బాబు వయసు 13 సంవత్సరాలు. కాబట్టి టికెట్ ఉండాలి. నేను, "బాబా! బాబుని దర్శనానికి అనుమతిస్తే, బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అలా చెప్పుకుంటే నేరుగా బాబాతో చెప్పుకున్నట్లే అని నా నమ్మకం. నిజంగా బాబా అద్భుతం చేసారు. అక్కడ ఐ.డి ప్రూఫ్స్ పరిశీలించే అతను మా బాబు ఐడి ప్రూఫ్ చూడకుండానే దర్శనానికి అనుమతించాడు. బాబా దయవల్ల వెంకన్నస్వామి దర్శనం చాలా బాగా జరిగింది. నేను అనుకున్నట్లుగా ఏప్రిల్ 13న శ్రీవారి పాదాలు దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యాము. దారిలో మా కారు టైరు బ్లాస్ట్ అయింది. కానీ బాబా దయవల్ల ఎవరికీ ఏమీ కాలేదు. క్షేమంగా ఇల్లు చేరుకున్నాము. "ధన్యవాదాలు బాబా".

మా బాబు మాకు చెప్పకుండా ఎక్కడికీ వెళ్ళడు. అలాంటిది ఒకరోజు నేను ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి మా బాబు ఇంట్లో లేడు. నాకు చాలా టెన్షన్‍గా అనిపించి, "బాబా! బాబు తొందరగా ఇంటికి వస్తే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల కొద్దిసేపట్లో బాబు వచ్చాడు. నాకు చాలా ఉపశమనంగా అనిపించింది. అలాగే ఇటీవల ఇంకోసారి నా మనసులో ఉన్న కోరిక ఒకటి తీరితే బ్లాగులో పంచుకుంటాను అనుకున్నాను. దయామయుడైన బాబా నా కోరిక తీర్చారు. "బాబా! మీకు చెప్పుకున్న వెంటనే మా కోరికలు తీరుతాయి తండ్రి. మీకు చాలా చాలా కృతజ్ఞతలు బాబా". మరికొన్ని అనుభవాలతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. 

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

బాబా దయతో కనబడనివి కనిపించాయి

ముందుగా ఈ బ్లాగు నిర్వాహకులకు మరియు సాటి సాయి బంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. బాబా అనుగ్రహ ప్రసాదమైన మా పాపకి ఇప్పుడు ఐదు నెలల వయసు. తనకి పుట్టుకతోనే హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. ఆపరేషన్ చేస్తే నయమవుతుందని డాక్టరు చెప్పారు. నేను రోజూ బాబా ఊదీ మంత్రం చదువుతూ పాప నుదిటిపై, గుండెలపై ఊదీ రాస్తూ ఉంటాను. అయితే ఈమధ్య ఒకరోజు ఊదీ డబ్బా కనపడలేదు. నాకు చాలా బాధేసి ఇల్లంతా వెతికాను. చివరికి, "బాబా! ఊదీ డబ్బా దొరికితే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవలన మరుసటిరోజు ఆ ఊదీ డబ్బా దొరికింది. "థాంక్యూ సో మచ్ బాబా".

ఒకసారి మావారికి తన ఆఫీసులో ఒక స్మార్ట్ వాచ్ గిఫ్ట్ గా ఇస్తే, ఆయన దాన్ని నాకు ఇచ్చారు. సాధారణంగా నేను ఖరీదైన వస్తువులు వాడను. ఎందుకంటే, వాటిని చాలా రఫ్‍గా వాడి చెడగొడతానని నాకు భయం. ఒకరోజు శ్రీమంతం ఫంక్షన్‍కని మా కాలనీలోని ఒకరి ఇంటికి మావారిచ్చిన స్మార్ట్ వాచ్ పెట్టుకుని వెళ్ళాను. మరుసటిరోజు ఆ స్మార్ట్ వాచ్ కోసం చూస్తే, అది ఎక్కడా కనిపించలేదు. నాకు భయమేసి బాబాకి దణ్ణం పెట్టుకుని, "వాచ్ దొరికితే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజు వాచ్ దొరికింది. "థాంక్యూ సో మచ్ బాబా. నా పాపకి ఆపరేషన్ అవసరం లేకుండా తన హార్ట్ ప్రాబ్లమ్‌ని నయం చేసి దీర్ఘాయుష్షు ప్రసాదించండి బాబా. నా కుటుంబాన్ని సదా సంరక్షించండి బాబా. నా తప్పులు ఏవైనా ఉంటే క్షమించండి బాబా".

ఓం శ్రీసచ్చిదానంద సమర్ధ సద్గురు శ్రీసాయినాథాయ నమః!!!

బాబాకి చెప్పుకున్నంతనే దొరికిన చెవిరింగు
 
సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నాకు ఇటీవల బాబా ప్రసాదించిన ఒక అనుభవం గురించి నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఒకరోజు మా పాప చెవిరింగు కనిపించలేదు. దాదాపు ఒక రోజంతా ఆ చెవిరింగు కోసం నేను ఇంట్లో, బయట అంతా వెతికినప్పటికీ అది కనిపించలేదు. నాకు నీరసమొచ్చి, "బాబా! చెవిరింగు కనపడితే, నా అనుభవాన్ని తప్పకుండా బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. అప్పటివరకు ఎంత వెతికినా కనపడని చెవిరింగు మా ఇంట్లో డబల్ కాట్ మంచం దగ్గర దొరికింది. బాబా ప్రేమ అనంతం. "ధన్యవాదాలు సాయి. మీకు మాటిచ్చినట్లు నా అనుభవాన్ని పంచుకున్నాను తండ్రి".

సాయిభక్తుల అనుభవమాలిక 1172వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి అనుగ్రహ జల్లులు
2. బాబా అనుగ్రహిస్తే అద్భుతాలే
3. మొర ఆలకించిన బాబా

శ్రీసాయి అనుగ్రహ జల్లులు


సాయిబంధువులకు నమస్కారం. ముందుగా, ఈ బ్లాగును క్రియేట్ చేసిన సాయికి ఎంతో కృతజ్ఞతలు. బాబా ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు అరుణ. ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలతో మీ ముందుకు వచ్చాను. 


మా అక్కకూతురు 7 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఒకరోజు తనకి ఉన్నట్టుండి కడుపునొప్పి, నడుమునొప్పి రావడంతో తనను హాస్పిటల్‌కి తీసుకెళ్ళారు. తనను పరీక్షించిన డాక్టర్ తను రెండు రోజులు హాస్పిటల్లో అబ్జర్వేషన్‌లో ఉండాలని చెప్పారు. మా అక్కకూతురికి వివాహమైన చాలాకాలం తరువాత ప్రెగ్నెన్సీ రావటం వల్ల తనకేమైనా సమస్యవుతుందేమోననే భయంతో మా ఇంట్లోవాళ్ళంతా చాలా టెన్షన్ పడ్డాము. తను హాస్పిటల్లో ఉన్న రెండు రోజులూ నేను తన ఆరోగ్యం కోసం బాబాను ప్రార్థిస్తూ, ‘శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః’ అని జపిస్తూనే ఉన్నాను. అంతేకాదు, ‘అంతా నార్మల్ అయి అక్కకూతురు క్షేమంగా ఇంటికి వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన’ని బాబాకి చెప్పుకున్నాను. బాబా ఆశీస్సులతో ఇప్పుడు ఆ అమ్మాయి ఆరోగ్యంగా ఉంది.


మా మావయ్యగారికి ఆరోగ్యం తరచూ ఇబ్బందిపెడుతుంటుంది. ఇటీవల దగ్గు, గొంతునొప్పి మొదలై ఆయన చాలా ఇబ్బందిపడ్డారు. డాక్టర్ని సంప్రదించి ఆయన ఇచ్చిన మందులు ఒక వారంరోజుల పాటు వాడినా తగ్గలేదు. రాత్రిపూట దగ్గు ఎక్కువై చాలా ఇబ్బందిపడ్డారు. నేను మామయ్యగారి ఆరోగ్యం గురించి బాబాను ప్రార్థించి, ‘మామయ్యగారికి దగ్గు తగ్గిపోతే ఆ అనుభవాన్ని బ్లాగ్ ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకుంటాన’ని బాబాకు మ్రొక్కుకున్నాను. మ్రొక్కుకున్నరోజు నించి మామయ్యగారికి దగ్గు తగ్గడం ప్రారంభించి, రెండు రోజుల్లో పూర్తిగా తగ్గిపోయింది. ఇదంతా కేవలం బాబా దయవల్ల మాత్రమే జరిగింది.  


బాబా ఆశీస్సుల వల్ల మాకు బాబు పుట్టాడు. బాబు మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉండేదాన్ని. పుట్టినరోజు తేదీ సమీపిస్తుండగా మా ఇంటిపేరు ఉన్నవాళ్ళెవరో చనిపోవటంతో వేడుకలకు ఆటంకం ఏర్పడింది. మా అత్తయ్య, మామయ్య ఊళ్ళో ఉండటం వల్ల వాళ్ళకి ఇలాంటి పట్టింపులు చాలా ఎక్కువ. అందువల్ల, పుట్టినరోజు వేడుకలను జరుపుకునే రోజును బాబు పుట్టినతేదీన కాకుండా వేరే తేదీకి మార్చుకుందామని అన్నారు. నేను, మావారు ఏమీ చెప్పలేని పరిస్థితి. అందువల్ల వాళ్ళు చెప్పినదానికి ఒప్పుకుని నిర్ణయించిన తేదీన పుట్టినరోజు వేడుకలు జరుగుతాయని తెలియజేస్తూ తెలిసినవారినందరినీ ఆ వేడుకులకు ఆహ్వానించాము. తీరా అందరినీ ఆహ్వానించిన తరువాత, ‘మన గోత్రీకులలో ఒక పెద్దావిడకి ఆరోగ్యం బాగలేక మంచం పట్టారట’ అని అత్తయ్య చెప్పారు. అందరినీ ఆహ్వానించిన తరువాత ఇలా అవుతుందేమిటా అని మరలా మాకు టెన్షన్ మొదలైంది. నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! అన్నిటికీ నువ్వే ఉన్నావు, నీదే భారం తండ్రీ. నిన్నే నమ్ముకున్నాను బాబా. నన్ను మాత్రం బాధపడేలా చేయకు. పుట్టినరోజు వేడుకలు చక్కగా జరిగేలా అనుగ్రహించు బాబా” అని వేడుకున్నాను. అలాగే, నా స్నేహితురాలి కోసం కూడా నేను బాబాను ప్రార్థించాను. నా స్నేహితురాలు బాబాకి భక్తురాలు. మా బాబు పుట్టినరోజు వేడుకకు రావాలని నా స్నేహితురాలి కుటుంబం ఎప్పటినుంచో అనుకుంటున్నారు. వాళ్ళు మాకు చాలా దూరంలో ఉంటారు. పుట్టినరోజు వేడుకల కోసం వాళ్ళు మా ఊరు రావాలనుకుంటున్నప్పుడు తన భర్తకు ఒక ఆరోగ్య సమస్య వచ్చింది. అయినప్పటికీ నా స్నేహితురాలు నా కోసం తన కుటుంబంతో కలిసి కారులో మా ఊరికి బయలుదేరింది. వాళ్ళకు ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా కాపాడమని బాబాను ప్రార్థించి, ‘వాళ్ళు క్షేమంగా వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన’ని బాబాకు చెప్పుకున్నాను. బాబా దయవల్ల వాళ్ళంతా క్షేమంగా మా వద్దకు చేరుకున్నారు. ఆ ప్రయాణంలో నా స్నేహితురాలి భర్తకి ఎలాంటి ఇబ్బందీ రాలేదు. ఆ తరువాత బాబా అనుగ్రహంతో ఆత్మీయులందరి సమక్షంలో బాబు పుట్టినరోజు వేడుక చాలా చక్కగా జరిగింది. “బాబా! నీ దయవల్ల బాబు పుట్టినరోజు వేడుక బాగా జరిగింది. చాలా సంతోషం బాబా. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలి బాబా. ఎప్పటినుంచో నాకు రెండు కోరికలు ఉన్నాయి. అవేమిటో మీకు తెలుసు బాబా. మీ మీదే భారం వేశాను. సాధ్యమైనంత తొందరగా నా కోరికలు నెరవేర్చండి. అలాగే, నా కోపాన్ని కూడా అదుపులో ఉంచండి బాబా”.


బాబా అనుగ్రహిస్తే అద్భుతాలే


ఓం శ్రీసాయినాథాయ నమః!!! అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, రాజాధిరాజు, యోగిరాజు, పరబ్రహ్మ అయిన శ్రీసాయినాథునికి వేల వేల పాదాభివందనాలు. సాయిభక్తులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు విజయ. నేను ఈ అనుభవాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినందుకు, బాబా మహిమను అందరికీ తెలిపే అవకాశం ఇచ్చినందుకు శ్రీసద్గురు సాయినాథునికి నా పాదాభివందనాలు. నేనొక కాంట్రాక్ట్ ఉద్యోగినిని. అందువల్ల నేను ఆరు నెలలు ఉద్యోగంలో ఉండటం, ఆరు నెలలు ఇంట్లో ఖాళీగా ఉండటం జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితులలో నేను నా తల్లిదండ్రుల సహకారంతోనూ, నా భర్త సహకారంతోనూ ఉద్యోగ బాధ్యతలను, ఇంటి బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను. నేను సుమారు 16 సంవత్సరాల నుండి ఈ ఉద్యోగం చేస్తున్నాను. శాశ్వత ఉద్యోగులు వచ్చినప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇలా రెండుసార్లు కంపెనీవాళ్ళు నన్ను ఉద్యోగం నుండి తొలగించారు, మరలా బాబా దయవల్ల తిరిగి విధుల్లోకి కూడా తీసుకున్నారు. ఒకసారి ఇలాగే నన్ను ఉద్యోగం నుండి తొలగించినప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! నాకు పోయిన ఉద్యోగం తిరిగి అదే చోటులో దక్కితే ఈ అనుభవాన్ని బ్లాగులో సాటి సాయిభక్తులతో పంచుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. ఇక్కడ బాబా నాకు రెండు అద్భుతాలు చేశారు. అసలు ఖాళీ లేకపోయినప్పటికీ, నేను పనిచేస్తున్న అదే చోటులో, అదే పాత స్థానంలోనే నన్ను కొనసాగించేలా చేసి నా ఉద్యోగాన్ని నిలబెట్టారు. అది చూసి అధికారులు, నా సహోద్యోగులు కూడా ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. అంతేకాదు, నేను ఉద్యోగం చేసే చోట ఒక సహోద్యోగిని నా స్థానాన్ని దక్కించుకునే ప్రయత్నం ఎల్లప్పుడూ చేస్తూ ఉన్నప్పటికీ బాబా దయతో కంపెనీవాళ్ళు నన్ను అదే స్థానంలో కొనసాగించారు. అందుకే, బాబాకు మ్రొక్కుకున్నట్లుగా ఈ అనుభవాన్ని మీతో పంచుకుంటూ బాబాకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే, ఇప్పుడు నాతోపాటు పనిచేసే ఉద్యోగిని వల్ల నాకు చిన్నపాటి ఇబ్బంది వచ్చింది. బాబా దయవల్ల ఈ ఇబ్బంది కూడా తొలగిపోతుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే, ఆ సహోద్యోగిని కూడా బాబా భక్తురాలే. బాబా ఆమె మనసు మార్చి ఉద్యోగంలో నా యథాస్థానంలో నన్ను కొనసాగించేలా చేస్తారని కోరుకుంటున్నాను. అలా జరగకపోతే నేను చంటిబిడ్డతో అడవులలో ఒక నెలరోజుల పాటు పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఆపదను కూడా సాయినాథుడు తప్పించి, ఈ బ్లాగులో మళ్ళీ నా అనుభవాన్ని పంచుకునే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను.


మొర ఆలకించిన బాబా


శ్రీసాయి పాదపద్మములకు నా శతకోటి వందనాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నా పేరు అర్చన. నేను శ్రీసాయికి ఒక చిన్న భక్తురాలిని. నా స్నేహితురాలు ఎప్పటినుండో ఒక ల్యాండ్ అమ్ముదామని ప్రయత్నిస్తుంటే, ఏవేవో అవాంతరాలు వస్తుండేవి. అప్పుడు నేను, "బాబా! నా స్నేహితురాలి ల్యాండ్ అమ్మకం జరిగితే, ఆ అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మాట ఇచ్చాను. తరువాత 20 రోజుల్లో ల్యాండ్ అమ్ముడైపోయిందని నా స్నేహితురాలు నాతో చెప్పింది. బాబా నా మొర ఆలకించినందుకు నేను చాలా సంతోషించాను. "ధన్యవాదాలు బాబా. కొన్ని సమస్యల వల్ల ఈ అనుభవాన్ని బ్లాగులో ఆలస్యంగా పంచుకున్నందుకు నన్ను క్షమించండి బాబా. నాకు కొంత మొత్తం డబ్బులు రావాల్సి ఉన్నాయి. అవి త్వరలో వచ్చేలా చేయండి సాయి. నేను అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా జరిగేలా చూడండి. మీరెప్పుడూ మాకు తోడుగా ఉండండి సాయి".


సాయిభక్తుల అనుభవమాలిక 1171వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయుంటే ఇబ్బందులుండవు
2. బాబా ఉండగా ఏ కష్టమొచ్చినా భయపడాల్సిన పనిలేదు
3. స్మృతిమాత్ర ప్రసన్నులు సాయి

బాబా దయుంటే ఇబ్బందులుండవు


సాయిబంధువులకు నమస్కారం. నా పేరు హేమ. మేము విజయవాడలో ఉంటాము. కోవిడ్ సెకండ్ వేవ్‌లో మేము మా అమ్మగారిని, అత్తయ్యగారిని. మావయ్యగారిని, ఆడపడుచుని కోల్పోయాము. 2022, ఏప్రిల్ నెలలో వాళ్ళ సంవత్సరీకాలు జరపాల్సి ఉండగా నాకు నెలసరి రావడం ఆలస్యమవుతూ వచ్చింది. ఏప్రిల్ నెల మొదటివారంలో రావలసిన నా నెలసరి రెండవవారం పూర్తయినా కూడా రాలేదు. దాంతో, సంవత్సరీకాల సమయంలో నెలసరి వస్తుందేమోనని నేను చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే, జరగాల్సిన అన్ని కార్యక్రమాలకి నేను ఉండాలి. ఆ సమయంలో నెలసరి వస్తే నేను వాళ్ళకి ఏమీ చెయ్యలేనేమోనని నాకు చాలా ఏడుపు వచ్చేసింది. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా, నాకు గురువారం లోపు నెలసరి వచ్చేలా అనుగ్రహించండి” అని వేడుకున్నాను. అయితే గురువారం వచ్చినా కానీ, నాకు నెలసరి రాలేదు. దాంతో నాకు బాబా మీద కొంచెం కోపంతో పాటు ఏడుపు కూడా వచ్చేసింది. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. నెలసరి రావడం కోసం నా ప్రయత్నాలన్నీ నేను చేశాను. ఇంక ఏదైతే అదే అవుతుందని అనుకుని బాబాపై భారం వేసి పడుకున్నాను. పడుకునేముందు బాబాకు నమస్కరించుకుని, “బాబా, అనుకున్న సమయానికి నాకు నెలసరి వస్తే 5 వారాలు నీ దివ్యపూజ చేస్తాను” అని మ్రొక్కుకున్నాను. మరుసటిరోజు ఉదయానికి, అంటే శుక్రవారం ఉదయానికి నాకు నెలసరి వచ్చింది. బాబా దయవల్ల ఇక ఇప్పుడు నేను మా ఇంట్లో జరిగే అన్ని కార్యక్రమాలకీ హాజరు కావచ్చని ఎంతో సంతోషించాను. “థాంక్యూ సో మచ్ బాబా!”


కోవిడ్ సెకండ్ వేవ్‌ సమయం‌లో మా ఇంట్లో అందరికీ కోవిడ్ వచ్చింది. అయితే, బాబా దయవల్ల అందరికీ తగ్గిపోయింది. ఆ తరువాత కొన్ని రోజులకే మావారి డిస్ట్రిబ్యూటర్‌గారి తల్లి మరణించారు. వాళ్ళు కర్నూలులో ఉంటారు. వాళ్ళ పాప మా ఊరిలో చదువుకుంటోంది. ఆ డిస్ట్రిబ్యూటర్ మావారిని సంప్రదించి, వాళ్ళ పాపని తీసుకొచ్చి వాళ్ళ ఊరిలో దించమని అడిగారు. అప్పుడే కోవిడ్ నుండి కొంచెం కోలుకుంటున్న మాకు మావారు ఊరు వెళ్ళడం అసలు ఇష్టం లేదు. కానీ, వెళ్ళక తప్పదు. మావారితో మా బాబు కూడా వెళ్తానన్నాడు. నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, “బాబా! మావారు, బాబు ఎలాంటి ఇబ్బందీ రాకుండా ఊరికి వెళ్ళి వచ్చేలా అనుగ్రహించండి” అని చెప్పుకున్నాను. నేను కోరుకున్నట్లే బాబా దయవల్ల మావారు, బాబు కలిసి ఎలాంటి ఇబ్బందీ లేకుండా డిస్ట్రిబ్యూటర్‌గారి పాపని వాళ్ళ ఊళ్ళో దింపి వచ్చారు. “బాబా! మీ ప్రేమ, కరుణ మా అందరిపైనా ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను బాబా. త్వరగా ఈ కరోనాని నాశనం చేయండి బాబా. అది కేవలం మీవల్ల మాత్రమే సాధ్యమవుతుంది బాబా. ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి బాబా!”


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


బాబా ఉండగా ఏ కష్టమొచ్చినా భయపడాల్సిన పనిలేదు


ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా నా జీవితంలో అడుగడుగునా అండగా ఉంటూ పిలచినంతనే 'నేనున్నాను' అని అభయమిచ్చే మన సాయినాథునికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే సాయిబంధువులందరికీ, సచ్చరిత్రకు మరో రూపమైన ఈ బ్లాగుకు నమస్కారాలు. నేనొక సాయి బిడ్డను. నా పేరు శ్రీదేవి. బాబా ప్రసాదించిన ప్రతి అనుభవాన్ని ఈ బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మా అమ్మ ఆరోగ్య విషయంలో బాబా అనుగ్రహానికి ఆనందిస్తూ వారి కృపను మీతో పంచుకుంటున్నాను. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నప్పటి నుండి మా అమ్మ ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. తన తలలో నరాలు వీక్ అయి, ఆ కారణంగా కంటికి సంబంధించిన నరాల సమస్య వచ్చి కంటిచూపు మసకగాను, ఒకటే వస్తువు రెండుగా కన్పించటం, నీరసం, ఇలా ఎన్నో సమస్యలతో అమ్మ చాలా బాధపడింది. అమ్మను 'శంకర్ కంటి ఆసుపత్రి'లో చూపిస్తే, కంటికి సంబంధించి టెస్టులు చేశారు. అప్పుడు నేను, "రిపోర్టులు నార్మల్ రావాల"ని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల డాక్టరు, "కంటి నరాలలో ఏ సమస్య లేదు. తల నుండి కంటికి అనుసంధానమయ్యే నరాలలో సమస్య ఉంది. ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేయండి" అని చెప్పారు. దాంతో, "బాబా! అమ్మను హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చే విషయంలో ఎలాంటి సమస్యా లేకుండా చూడు తండ్రి. నీవే మాకు రక్ష బాబా. అమ్మను రక్షించు తండ్రి. తనకి తలలోని నరాల వల్ల, కళ్ళకి వచ్చిన సమస్యలను పూర్తిగా తొలగించు తండ్రీ" అని బాబాకి చెప్పుకుని 2022, ఏప్రిల్ 18న అమ్మని హాస్పిటల్‍‍లో అడ్మిట్ చేసాము. అమ్మకి సెలైన్ పెట్టారు. అరగంట గడిచేసరికి అమ్మకు విపరీతమైన వణుకుతో 103 డిగ్రీల జ్వరం వచ్చింది. అమ్మ తట్టుకోలేక బాబా నామాన్ని స్మరించసాగింది. నాకు చాలా బాధగా అనిపించి, "బాబా! అమ్మకు వెంటనే జ్వరం, చలి తగ్గిపోయేలా అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. ఆయన దయవల్ల కొద్దిసేపటికి అమ్మకి జ్వరం తగ్గి నార్మల్ అయింది. ఆ తరువాత అమ్మ కళ్ళకి సంబంధించి మందు ఎక్కించారు. బాబా దయవల్ల నెమ్మదిగా అమ్మ కంటిచూపు నార్మల్ స్టేజ్‍కి వచ్చింది. డాక్టర్లు, స్టాఫ్ అమ్మ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుని చికిత్స చేసారు. బాబా ఉండగా ఏ కష్టమొచ్చినా భయపడాల్సిన పనిలేదు. ఆయనకు మన భారం అప్పగించి, ఆయన నామం చేసుకుంటూ మన కర్తవ్యం మనం చేయాలి. అప్పుడు బాబా సర్వమూ తానై మనల్ని రక్షిస్తారు. "ధన్యవాదాలు బాబా. మీ బిడ్డలందరినీ చల్లగా చూడు తండ్రి".


స్మృతిమాత్ర ప్రసన్నులు సాయి


ఓం స్మృతిమాత్ర ప్రసన్న స్వరూప శ్రీసాయినాథాయ నమః!!!


"ఓం సమర్థ సద్గురు సాయినాథా!!! మీ పాదారవిందములకు సంపూర్ణ శరణాగతి వేడుతూ అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటున్నాను తండ్రి". నా పేరు మల్లేశ్వరి. మాది హైదరాబాద్. 2022, ఏప్రిల్ 18, ఉదయం నేను బాబాకి దణ్ణం పెట్టుకుని నిద్రలేచాను. కొంతసేపయ్యాక నా చెవి నుండి ఏదో పడుతున్నట్లుగా అనిపిస్తే, ఏదైనా పురుగేమో అని విసిరికొట్టాను. తీరా చూస్తే, ముందురోజు ఫంక్షన్‌కని నా చెవులకు పెట్టుకున్న బంగారు దిద్దుల తాలూకు శీలం లేదు. ఒక్కసారిగా నా గుండె ఝల్లుమంది. వెంటనే బ్లాగులో ఒకామె, 'బంగారు వస్తువులు కనపడేలా చూడండి అని బాబాను వేడుకున్నాన'ని వ్రాసింది. కానీ నేను సిల్లీ విషయాలకు అలా అనుకోకూడదేమో అనుకుని చెవి శీలం కోసం అన్ని గదుల్లో వెతికివెతికి విసిగిపోయాను. తరువాత నాకు తెలియకుండానే, 'బాబా! నా చెవి దిద్దు శీల కనపడేలా చూడండి' అని అనుకున్నాను. అంతే, అలా బాబాను తలుచుకోగానే, మంచం పక్కనే ఆ శీల పడి ఉండటం నాకు కనిపించింది. నా హృదయం బాబాపట్ల భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. నా సంతోషానికి అవధులు లేవు. "బాబా! మీరు స్మృతిమాత్ర ప్రసన్నులని ఋజువు చేశావు తండ్రి. మీ పాదాలకు శతకోటి వందనాలు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1170వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అనుగ్రహం
2. సాయినాథుని దయవల్ల తప్పిపోయిన గండం 
3. సాయి తీర్చిన కోరిక

బాబా అనుగ్రహం


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయి బంధువులకు నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. ఒకసారి మలబద్ధకంతోపాటు మరికొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు నాకు వచ్చాయి. నాకు తెలిసిన గృహచికిత్సలు పాటించినా ఫలితం కనిపించలేదు. సమస్య ఉధృతంగా ఉండటంతో బాబాను ప్రార్ధించి, ఊదీ సేవిస్తూ. 'నా సమస్యకు ఉపశమనం లభిస్తే, బ్లాగులో పంచుకుంటానని బాబాకి మ్రొక్కుకుందామ'ని నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. కాని మలబద్దకం వంటి సమస్యలను బ్లాగులో చెప్పుకోవాలంటే కొంచెం సిగ్గుగా అనిపించి, వద్దులే మనం బాబాని మన:పూర్వకంగా ప్రార్ధించాము కదా, అది చాలు అనుకున్నాను. 'మన మనసులో మెదిలే ఆలోచనలన్నీ తమకు తెలుస్తుంటాయ'ని బాబా చెప్తారు కదా! ప్రక్కరోజు బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుదామని బ్లాగు ఓపెన్ చేసి, అందులో ఉన్న ఒక భక్తుని అనుభవం చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, ఆ భక్తుడు మలబద్దకం గురించి, మలంలో రక్తం రావటం గురించి పంచుకున్నారు. తద్వారా, 'బ్లాగులో ఎటువంటి సమస్యనైనా పంచుకోవచ్చ'ని బాబా నాకు చెప్తున్నారనిపించింది. నాకు (మనకు) బాబానే సర్వస్వం. ఆయన వైద్యులకే వైద్యుడు. అమ్మ దగ్గర, డాక్టరు దగ్గర మనం అన్నీ చెప్పుకుంటాము కదా! వెంటనే, నేను ఇంకేమీ ఆలోచించకుండా, "నాకు మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల నాకు క్రమంగా మలబద్ధకం నుండి ఉపశమనం లభించింది. త్వరలోనే నాకు నార్మల్ అవుతుందని నమ్మాను. 


నా నెలసరి విషయంలో నాకు కొన్ని సమస్యలు, సందేహాలు ఉండేవి. దానివల్ల నేను నెలలో ఎక్కువ రోజులు పూజ చేసుకోలేకపోయేదాన్ని. ఆ సందేహాలు డాక్టరు దగ్గరకి వెళితే తీరేవికావు. అందుచేత బాబా దగ్గర, "బాబా! నాకు నెలసరి ఎందుకు ఇలా ఉంటుంది? ఇలా ఉంటే పూజ చెయ్యెచ్చా? దయచేసి నెలలో ఎక్కువ రోజులు పూజ చేసుకునేలా అనుగ్రహించండి బాబా" అని మొరపెట్టుకునేదాన్ని. ఇలా ఉండగా ఒక గురువారం నేను బాబా మందిరానికి వెళ్ళాను. మామూలుగా అయితే నేను పల్లకీ సేవ, శేజారతి చూసుకుని ఇంటికి వస్తాను. కానీ ఆరోజు దర్శనం చేసుకున్న వెంటనే నాకు నెలసరి వచ్చినట్లుగా సందేహమొచ్చి ఇంటికి వచ్చేశాను. కానీ మధ్యలోనే వచ్చేసినందుకు చాలా బాధేసింది. ఆరతికి ఉండలేకపోయినందుకు ఏడ్చేసాను కూడా. మరుసటిరోజు బ్లాగులో ఒక భక్తురాలు తమ ఇంటి గృహప్రవేశం సందర్భంలో బాబా అనుగ్రహన్ని పంచుకున్నారు. అందులో ఆమె తన నెలసరి గురించి ప్రస్తావించారు. ఆ అనుభవం ద్వారా బాబా నా నెలసరి సమస్యకు సంబంధించి నాకున్న సందేహలకు సమాధానమిచ్చారు. ఈ బ్లాగులో వచ్చే ఒక భక్తుని అనుభవం మరో భక్తుని సమస్యలకు పరిష్కారం చూపిస్తోంది. "థాంక్యూ సో మచ్ బాబా". 


మేము విదేశాలలోనే ఉంటున్నాము. ఒకసారి నేను, నాభర్త ఇద్దరమూ ఇండియాకి వచ్చాము. మా అమ్మాయి ఒక్కతే అక్కడ ఉంది. మాకు అక్కడ బంధువులు ఎవ్వరూ లేరు. ఉన్న సన్నిహిత స్నేహితులు కూడా చాలా తక్కువ. అయినప్పటికీ బాబా అండగా ఉన్నారనే ధైర్యంతో అమ్మాయిని వదిలి నేను ఇండియాకి వచ్చాను. తరువాత ఒకరోజు మా అమ్మాయికి గొంతునొప్పి, ఒళ్ళునొప్పులు, దగ్గు వచ్చాయి. భయానికి, ఆందోళనకు గురిచేసే లక్షణాలు అవి! అందువల్ల నేను వెంటనే బాబాను ప్రార్ధించాను. బాబా దయవల్ల కోవిడ్ టెస్టులో నెగిటివ్ వచ్చింది. కానీ ఆరోజు అమ్మాయికి 102 డిగ్రీల జ్వరం వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఫ్లూ జ్వరాల సీజన్. అంతకుముందు రెండు సంవత్సరాలు ఆ కాలంలో మా అమ్మాయి ఒకసారి మూడురోజులు జ్వరంతో, మరోసారి విపరీతమైన దగ్గుతో బాగా నీరసించిపోయి చాలా ఇబ్బందిపడింది. ఈసారి మేము లేని సమయంలో తను అనారోగ్యం పాలవడంతో తనకి అక్కడ సహాయం చేసే వాళ్ళెవరూ లేరని నేను ఆందోళన చెంది నా బాబాకి మొరపెట్టుకున్నాను. ఆ కరుణామూర్తి దయవలన మా అమ్మాయి  ఒక్కరోజులోనే నార్మల్ అయింది. "బాబా! నా బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు".


మా అమ్మాయి స్నేహితురాలి తల్లిదండ్రులు చాలా దూర ప్రాంతంలో ఉంటారు. ఒకరోజు అర్థరాత్రి ఆ అమ్మాయికి చెస్ట్ పెయిన్ వచ్చింది. నొప్పి ఎక్కువగా ఉండడంతో తను వెంటనే హాస్పిటల్‍కి వెళ్ళింది. నేను వెంటనే "బాబా! ఆ అమ్మాయికి త్వరగా నార్మల్ అవ్వాల"ని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయ చూపారు. డాక్టరు, "యాసిడ్ రిఫ్లెక్షన్ వల్ల పెయిన్ వచ్చింద"ని చెప్పి మరుసటిరోజు ఇంటికి పంపించారు. ఒక్కరోజులోనే ఆ అమ్మాయి నార్మల్ అయింది. "ధన్యవాదాలు బాబా. ఇలాగే మీ అమగ్రహం నా కుటుంబం మీద, అందరి మీద కుండపోతగా వర్షించాలని వేడుకుంటున్నాను తండ్రి. మా అందరినీ చల్లగా చూడండి బాబా".


సాయినాథుని దయవల్ల తప్పిపోయిన గండం


సాయిబంధువులకు నమస్కారం. నా పేరు గీత. ఒకసారి మా అన్న అంటే చిన్నాన్న కొడుకుకి ఆరోగ్యం బాగాలేకపోయింది. తనను పరీక్షించిన డాక్టర్లు తన పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని చెప్పి, “మా ప్రయత్నం మేము చేస్తాము. కానీ, 48 గంటల వరకు వెంటిలేటర్ అవసరం లేకుండా తను బాగా ఊపిరి తీసుకోవాలి. అప్పుడే మేము ఇస్తున్న చికిత్స ఆయనకు పని చేస్తుంది” అని చెప్పారు. నేను మా వదినతో ఫోన్లో మాట్లాడినప్పుడు తను ఈ విషయం నాకు చెప్పి చాలా బాధపడింది. నేను ఆమెకు ధైర్యం చెప్పి, “అన్నకు ఏమీ కాదు, తను త్వరలోనే బాగవుతారు” అని చెప్పాను. ఆ తరువాత నేను సాయినాథునికి పూజ చేసి, "అన్న ఆరోగ్యం మెరుగుపడేలా అనుగ్రహించమ"ని మనసారా వేడుకుని, "అన్న ఆరోగ్యం మెరుగుపడాల"ని చెప్పుకున్నాను. అప్పటినుండి బాబా కృపాకటాక్షాల వల్ల వైద్యుల పర్యవేక్షణలో అన్న కొద్దిగా కోలుకుంటూ వచ్చారు. స్వయంగా లేచి నిలబడి నడవలేకపోయినా ప్రక్కవారి సహాయంతో లేచి నిలబడి నడగలిగారు. తన పరిస్థితి మరింత మెరుగవడానికి మరికొంత సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు. కానీ సాయినాథుని దయవల్ల తనకు గండం గడిచింది. ఆ సాయినాథుని మనసారా వేడుకుంటే కానిది ఏదీ లేదు కదా?

 

శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయి తీర్చిన కోరిక


ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయి బంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను రోజూ మా ఇంటికి దగ్గరలో ఉండే సాయిబాబా మందిరానికి వెళుతుండేదాన్ని. అక్కడ ప్రతి గురువారం మైకులో బాబా భజన, విష్ణుసహస్రనామ పారాయణ జరుగుతుండేవి. నాకు కూడా అలా మైకులో పాడాలనిపించి, "సాయి గోవిందా! నేను కూడా మైకులో పాడాలి" అని నా కోరికను బాబాతో చెప్పుకున్నాను. కొన్నిరోజుల్లోనే ఆ మందిర పూజారి మైకులో పాడమని నాతో చెప్పారు. బాబా నా కోరిక తీర్చినందుకు నేను చాలా ఆనందించాను. "సాయి గోవిందా! ఇలా ఎప్పుడూ నా వెంట ఉండి నన్ను కాపాడండి. మీ చల్లని ఆశీస్సులు నాకు, అందరికీ ఉండాలి తండ్రి".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo