సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1085వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆందోళన నుండి బయటపడేస్తున్న బాబా
2. గొంతునొప్పి తగ్గించిన బాబా
3. బాబా దయవల్ల కోరుకున్నట్లే గురువారం డెలివరీ అయిన కారు

ఆందోళన నుండి బయటపడేస్తున్న బాబా

ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు సౌదామిని. మేము భీమవరంలో నివాసముంటున్నాము. నాకు ఇదివరకు కరోనా వచ్చి బాబా దయవల్ల తగ్గింది. అయితే పోస్ట్ కోవిడ్ ప్రభావం వల్ల ప్రతి చిన్న ఆరోగ్య సమస్యను భూతద్దంలో చూసి ఆందోళన చెందడమేకాక అందరినీ కంగారు పెట్టేసేదాన్ని. బాబా దయవలన 3 నెలలకు ఆందోళన తగ్గి నార్మల్ అయ్యాను. చాలారోజుల తరువాత సంక్రాంతి పండగ ముందు మళ్ళీ నాకు అదే సమస్య వచ్చింది. వరుసగా రెండు రోజులు ప్రతి చిన్న విషయానికి ఒత్తిడిగా అనిపించి ఆందోళన చెందుతూ చాలా బాధపడ్డాను. అప్పుడు నేను బాబాకి నా కష్టం చెప్పుకుని, "బాబా! నా సమస్య తగ్గేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. ఆయన దయవలన రెండు రోజుల్లో నేను నార్మల్ అయ్యాను. నా సాయినాథుడు మనతో ఉంటే మనం ఏ ఒత్తిడినైనా, ఆందోళనైనా జయిస్తాం. ఆయన దయవల్లనే నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. నా క్షేమాన్ని ఆయనే చూసుకుంటారని నా నమ్మకం. "ధన్యవాదాలు బాబా. నేను జన్మజన్మలందు మీకు ఋణపడి ఉంటాను బాబా".

ఇకపోతే 2022, సంక్రాతి పండుగ రోజు సాయంత్రం నాకు విపరీతంగా కడుపునొప్పితోపాటు వాంతులు కూడా అయ్యాయి. నీళ్లు త్రాగినా కూడా వాంతి అయిపోతుండటం, పొట్ట అంతా ఉబ్బరంగా ఉండడంతో నాకు చాలా భయమేసింది. మరుసటిరోజు నేను ఎప్పుడూ చూపించుకునే హోమియో డాక్టరు దగ్గరకు వెళ్ళి మందులు వేసుకున్నాను. మరుసటిరోజుకి నాకు పూర్తిగా తగ్గిపోయింది. ఈ సమస్య నుండి కూడా నా తండ్రి బాబానే గట్టెక్కించారని నా విశ్వాసం. ఇంకా అప్పటినుండి నాకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా బాబా నామజపం చేస్తూ అంతా ఆయన చూసుకుంటారనే నమ్మకంతో ఉంటున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! మీకు ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేము తండ్రి. ఎల్లప్పుడూ నన్ను మీ బిడ్డలా చూసుకుంటున్నావు. మిమ్మల్ని నమ్ముకుంటే చాలు తండ్రి. మా అందరి వెంట ఉండి నడిపిస్తావు. ఆ విషయం నాకు బాగా అర్ధమైంది బాబా". చివరిగా బాబా పాదాలకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ ముగిస్తున్నాను.

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!

గొంతునొప్పి తగ్గించిన బాబా

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!

నేను ఒక సాయి భక్తురాలిని. నేను రోజూ ఉదయం నిద్రలేస్తూనే బాబాని చూసి ఆపై నా నిత్యకృత్యాలు చేసుకుంటాను. నాకు ఏ చిన్న సమస్య వచ్చినా బాబాను తలచుకుంటాను. నాకు తెలియకుండానే ఆ సమస్య తీరిపోతుంది. చాలాసార్లు నేను భయపడుతున్నప్పుడు 'ఏమీ కాదు' అన్న అనుభూతి బాబా కలిగిస్తూ ఉంటారు. 2022, జనవరి నెలాఖరులో నేను మా అక్కయ్యవాళ్ల మనవరాలి పుట్టినరోజు వేడుకకి వెళ్ళాను. ఆ వేడుక అయ్యాక భోజనాలు చేస్తున్నప్పుడు మాంసాహారం తింటుంటే ఒక చిన్న ఎముక నా గొంతుకు రాసుకుపోయింది. దాంతో గొంతు కొంచెం నొప్పిగా అనిపించడంతో నేను తినడం ఆపేసి, లేచి నీళ్లు త్రాగి ఇంటికి వచ్చేసాను. మరుపటిరోజు కూడా నొప్పి ఉంది. నిజానికి నాకు ఎప్పుడయితే ఆ నొప్పి తెలిసిందో అప్పుడే నేను, "బాబా! నాకు ఏమీ కాకూడదు. ఆ ఎముక గీరుకోవడం వల్ల నాకు ఎలాంటి సమస్య రాకూడదు" అని అనుకున్నాను. అయినా మరుసటిరోజు, ఆ మరుసటిరోజు కూడా నొప్పి ఉంది. అప్పుడు, "బాబా! నాకు నొప్పి తగ్గిపోయేలా దయ చూపండి" అని బాబాకి చెప్పుకుని కొంచం ఊదీ గొంతుకు రాసుకున్నాను. అంతే, బాబా దయవల్ల నొప్పి పోయింది. "బాబా! నేను తెలిసీతెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి. సాధ్యమైనంతవరకు నన్ను ఏమైనా అడిగితే ఎవరికీ కాదు అనను, నాకు తోచినంతలో సహాయం చేస్తాను. నాకు ఉన్నంతలో ఇతరులకు సహాయం చేసే అవకాశం కల్పించండి బాబా. సదా మా కుటుంబాన్ని కాపాడండి బాబా".

బాబా దయవల్ల కోరుకున్నట్లే గురువారం డెలివరీ అయిన కారు

సాయి బంధువులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తుడిని. 2021, డిసెంబరు నెలలో మేము ఒక కారు కొనాలనుకుని బాలినో కారుకి అడ్వాన్సు ఇచ్చాము. తరువాత ఒక గురువారంనాడు ఆ కారు డెలివరీ తీసుకోవాలనుకుని అడ్వాన్స్ ఇవ్వగా మిగిలిన మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా బదిలీ చేయదలచాను. అందుకోసం బుధవారంనాడు డబ్బు బ్యాంకులో జమచేసి, ఆపై ఆన్లైన్‍లో షోరూమ్ వాళ్ళకి డబ్బు బదిలీ చేశాను. కానీ షోరూమ్ వాళ్ళు ఆ డబ్బు తమ అకౌంట్లోకి రాలేదని అన్నారు. దాంతో మరుసటిరోజు కారు డెలివరీ తీసుకునేందుకు వీలుకాని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు నేను బాబాని తలుచుకుని, "బాబా! నేను గురువారంనాడు కారు డెలివరీ తీసుకుందామని అనుకున్నాను. కానీ కుదరదేమో సాయి. దయ చూపండి బాబా" అని వేడుకున్నాను. మరుసటిరోజు నేను మళ్ళీ షోరూమ్ వాళ్ళకి ఫోన్ చేస్తే, "డబ్బు మాకు అందింది. 'సాయి' అనే వ్యక్తి మీకు కారు డెలివరీ చేస్తాడ"ని చెప్పారు. మేము చాలా ఆనందించాం. అలా బాబా దయవల్ల మేము కోరుకున్నట్లు గురువారమే కారు మాకు డెలివరీ అయ్యింది. "ధన్యవాదాలు బాబా".


శ్రీమతి భికూబాయి



సాయిభక్తురాలు శ్రీమతి భికూబాయి అహ్మద్‌నగర్‌లో జన్మించింది. అహ్మద్‌నగర్‌లో బాబాసాహెబ్ గణేష్ అనే ప్లీడరుండేవాడు. అతని మనవరాలైన శ్రీమతి రాధాకృష్ణఆయి అతనింట్లోనే ఉండేది. ఆయీ వద్ద సాయిబాబా ఫోటో ఒకటి ఉండేది. ఆయీ ప్రతినిత్యం భక్తిప్రపత్తులతో ఆ ఫొటోకు పూజ, ఆరతి చేస్తూ, ‘ఎప్పుడెప్పుడు శిరిడీలోని బాబా సన్నిధికి చేరుకుంటానా’ అని ఆరాటపడుతుండేది. తరువాత కొంతకాలానికి బాబా అనుగ్రహంతో ఆయీ శిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకుని, వారి ఆజ్ఞానుసారం శిరిడీలోనే నివసిస్తూ బాబా సేవ చేసుకోసాగింది. రాధాకృష్ణఆయీకి భికూబాయి మంచి స్నేహితురాలు. ఆయీ ద్వారానే భికూబాయికి బాబా గురించి తెలిసింది.

భికూబాయికి చిన్నవయస్సులోనే సంగమనేరుకి చెందిన బయ్యాజీ పాటిల్‌తో వివాహమయింది. అతనొక సైనికోద్యోగి. పెళ్ళైన కొంతకాలానికే అతను యుద్ధంలో మరణించడం వల్ల భికూబాయికి నెలకు ఆరు రూపాయల పింఛను వస్తుండేది. ఒకసారి వంజర్‌గావ్‌కు చెందిన శ్రీగంగగిర్ మహరాజ్ శిరిడీలోని వాడాకు సమీపంలో ఉన్న చింతచెట్టు కింద పెద్ద ఎత్తున నామసప్తాహం నిర్వహించారు. ఆ సప్తాహానికి ప్రతిరోజూ ఎంతోమంది యాత్రికులు హాజరయ్యేవారు. ఆ యాత్రికులలో సంగమనేరుకు చెందిన భక్తబృందమొకటి ఉంది. ఆ భక్తబృందం సంగమనేరుకి తిరిగి వెళ్ళేటప్పుడు వారి ద్వారా రాధాకృష్ణమాయి తన స్నేహితురాలైన భికూబాయికి ఒక బాబా ఫోటో, బర్ఫీ ప్రసాదం పంపింది. అంతేకాదు, ఆమెను శిరిడీకి వచ్చి ఉండమని ఆహ్వానం పంపింది. ఆ ఆహ్వానాన్ని అందుకున్న భికూబాయి తన ఆస్తిని, బంగారు నగలను వదిలేసి తన పద్నాల్గవ ఏట (1908లో) శిరిడీ వచ్చి బాబాను దర్శించుకుంది. బాబా ఆమెను ఆశీర్వదించి ఆయీతో ఉండి, సేవ చేసుకోమని ఆదేశించారు.

1916 చివరిలో, అంటే, రాధాకృష్ణఆయి మరణించిన ఒకటి, రెండు నెలల తరువాత భికూబాయి పింఛనుకోసం అహ్మద్‌నగర్ వెళ్ళింది. పింఛను తీసుకొని తిరిగి వస్తూ బాబాకు సమర్పించడానికి ఒక పూలమాల, ఒక పుచ్చకాయ, కొన్ని పేడాలు కొన్నది. కోపర్‌గావ్‍‍లోని గోదావరి తీరానికి చేరుకోగానే తన స్నేహితురాలైన రాధాకృష్ణఆయి అక్కడే దహనం చేయబడిన విషయం గుర్తొచ్చి ఆమె మనసంతా వికలమైపోయింది. తరువాత ఆమె శిరిడీ చేరుకొని నేరుగా మశీదుకు వెళ్ళింది. తనతో తీసుకొని వెళ్లిన పూలమాలను బాబా మెడలో వేయడానికి ప్రయత్నించగా, "అశాంతచిత్తంతో తెచ్చిన ఆ పూలమాల నాకక్కరలేదు!" అంటూ బాబా ఆ పూలమాలను నిరాకరించారు. ఆమె ఎంతో కష్టానికోర్చి అహ్మద్‌నగర్ నుండి ఆ పూలమాలను తెచ్చినందువల్ల దానిని స్వీకరించమని బాబాను అర్థించాడు దీక్షిత్. భికూబాయి మరలా ముందుకెళ్లి ఆ పూలమాలను బాబా మెడలో వేయడానికి చేతులు రెండూ పైకెత్తగానే చిత్రంగా ఆ పూలమాల మూడు ముక్కలై, ఒక చేతిలో ఒక ముక్క, రెండవ చేతిలో మరో ముక్క మిగిలిపోయి, మూడవ ముక్క క్రింద పడిపోయింది. ఆ పూలమాల ఎలా తెగిందో ఆమెకు అర్థం కాలేదు.

తరువాత ఆమె తనతోపాటు తెచ్చిన పుచ్చకాయని ముక్కలుగా కోసి, ఆ పుచ్చకాయ ముక్కలను, పేడాలను బాబా ముందుంచింది. బాబా వాటిని తీసుకొని భక్తులందరికీ పంచారు. ఆమె ఒక పుచ్చకాయముక్క తీసుకొని, దాని చెక్కు తీసి బాబాకు ఇచ్చి తినమని ప్రార్థించింది. కానీ బాబా నిరాకరించారు. దీక్షిత్ కూడా ఆ పుచ్చకాయముక్కను తినమని బాబాను ప్రార్థించాడు. అప్పుడు బాబా అతనితో, "ఈమె గోదావరి ఒడ్డున కూర్చొని విలపిస్తూ కన్నీరు కార్చింది. హృదయవేదనతో తెచ్చిన వీటిని నేను స్వీకరించను" అని అన్నారు. వాస్తవం ఏమిటంటే, ఆమె గోదావరి తీరంలో ఏడుస్తూ రాధాకృష్ణఆయీని అంతటి హేయమైన చావు నుండి కాపాడలేదని బాబాను నిందించింది. ఆమె హృదయవేదన తెలిసినందునే బాబా ఆమె తెచ్చినవాటిని స్వీకరించలేదు.

బాబా ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనం సమయంలో భికూబాయికి ఒక పాత్ర నిండా ఆహారం ఇచ్చేవారు. ఆమె ఆ ప్రసాదాన్ని తన ఇంటికి తీసుకొని వెళ్లి తినేది. బాబా మహాసమాధి చెందినరోజు తాను దిక్కులేనిదానినయ్యానన్న బాధతో భికూబాయి హృదయవిదారకంగా విలపించింది. ఆరోజు రాత్రి పది గంటల సమయంలో ఆమె తన ఇంటిలో, "బాబా! నేను ఇక మిమ్మల్ని చూడలేను కదా?" అని దుఃఖిస్తూ బయటకి వెళ్లగా ఇంటి వాకిలిలో ఆమెకు ఒక పాము కనిపించింది. బాబానే ఆ పాము రూపంలో దర్శనమిచ్చారని తలచి, "బాబా! మిమ్మల్ని ఈ సర్పరూపంలో నేను గుర్తించలేను. కానీ ఈ రూపంలో ఉన్నది మీరేనని నాకు తెలుసు" అని అన్నదామె. వెంటనే ఆ పాము అదృశ్యమైంది. 
(మూలం: డివోటీస్ ఎక్స్పీరియెన్సెస్ ఆఫ్ సాయిబాబా బై శ్రీబి.వి.నరసింహస్వామి).

సాయిభక్తుల అనుభవమాలిక 1084వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. విపత్కర పరిస్థితి నుండి కాపాడిన బాబా - సమాధిమందిరంలో ప్రసాదించిన అద్భుత లీల
2. దర్శనంతో సంతానభాగ్యాన్ని ప్రసాదించిన బాబా
3. పెద్ద సమస్యలో పడకుండా తక్షణమే కాపాడిన బాబా

విపత్కర పరిస్థితి నుండి కాపాడిన బాబా - సమాధిమందిరంలో ప్రసాదించిన అద్భుత లీల


శ్రీసాయి బంధువులకు నా నమస్కారాలు. నా పేరు ఇందిర. మాది హైదరాబాద్. నేనిప్పుడు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటాను. ఒకసారి రోడ్డు ప్రమాదంలో మా నాన్న తలకు పెద్ద గాయమై మెదడులో రక్తం గడ్డకట్టింది. మా అమ్మ డాక్టరుతో మాట్లాడుతుండగా, 'ఆపరేషన్ చేయడం కష్టం' అంటున్న డాక్టర్ మాటలు నేను ఫోనులో విన్నాను. నాకు ఏమి చేయాలో దిక్కుతోచక విపరీతమైన దుఃఖంతో ఇంట్లోని బాబా పాదాల చెంత, "బాబా! మా నాన్నకి ఆపరేషన్ జరగాలి. ఇంతకుముందులా మాతో సంతోషంగా ఉండాలి" అని వేడుకున్నాను. వెంటనే మా అమ్మ నుండి నాకు ఫోన్ వచ్చింది. అమ్మ నాతో, "ఆపరేషన్ చేస్తారు. ఏ ప్రమాదం లేదు" అని చెప్పింది. అది విన్న వెంటనే, "ఏ ఇబ్బందీ లేకుండా సర్జరీ విజయవంతమైతే శిరిడీ వస్తాను బాబా" అని మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల ఎటువంటి ఇబ్బందీ లేకుండా సర్జరీ పూర్తికావడం, నాన్న తొందరగా కోలుకుని నార్మల్ అవడం జరిగాయి. "శతకోటి ధన్యవాదాలు సాయీ".


శిరిడీ ప్రయాణం: ఇప్పుడొక అద్భుతమైన బాబా లీలను పంచుకుంటాను. నాన్నగారి ఆరోగ్యం కుదుటపడుతున్న సమయంలో మా పిన్నీవాళ్ళు తమ శిరిడీ ప్రయాణం గురించి చెప్పారు. నాకు వెంటనే బయలుదేరి వాళ్ళతో శిరిడీ వెళ్ళాలనిపించింది. అలాగే వాళ్ళతో కలిసి శిరిడీ వెళ్ళాను. నేను సమాధిమందిరం దర్శనానికి వెళ్ళేటప్పుడు 'ఒక ఆరెంజ్ రంగు శాలువాను బాబాకి సమర్పించి, తరువాత దాన్ని బాబా ప్రసాదంగా మా నాన్నకి ఇస్తే బాగుంటుంద'ని అనుకున్నాను. కానీ దర్శనానికి వెళ్ళేటప్పుడు నాకు ఆ విషయం గుర్తులేదు. తీరా సమాధిమందిరం లోపలికి వెళ్ళాక చూస్తే, బాబా ఆరంజ్ రంగు శాలువా ధరించి ఉన్నారు. అది చూసి, 'అయ్యో! బాబా కోసం శాలువా కొనడం మర్చిపోయాన'ని ఎంతో బాధపడుతూ ముందుకు కదులుతున్నాను. బాబాను సమీపిస్తుండగా ఒక భక్తుడు కొన్ని ఆరంజ్ కలర్ శాలువాలు పట్టుకుని కనిపించాడు. ఆ భక్తుడు తన వద్దనున్న ఆరు శాలువాలలో ఐదు శాలువాలను బాబాకి సమర్పించుకోదలచి మిగిలిన ఒక శాలువా ఎవరికైనా ఇద్దామని చూస్తూ అక్కడ అంతమంది ఉండగా నాతో, "నీకు శాలువా కావాలా? ఇదిగో తీసుకో" అంటూ ఆ శాలువాను నాకు ఇచ్చేసి వెళ్లిపోయాడు. ఆ సమయంలో నాకు కలిగిన అనుభూతి, ఆనందం నా జీవితంలో మరువలేనిది. "మీకు కోటికోటి ప్రణామాలు సాయీ". ఆ శాలువాను సాయికి సమర్పించి, వారి అనుగ్రహ ప్రసాదంగా తిరిగి తీసుకుని ఇంటికి వచ్చాను. ఇలా నా జీవితంలో మరెన్నో అనుభవాలు, లీలలు బాబా అపార అనుగ్రహం వల్ల జరిగాయి. వాటిని ముందు ముందు మీతో పంచుకుంటాను.


సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


దర్శనంతో సంతానభాగ్యాన్ని ప్రసాదించిన బాబా


సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు సువర్చల. నా వయసు 50 సంవత్సరాలు. నేనిప్పుడు బాబా ప్రసాదించిన అనుగ్రహాన్ని మీతో పంచుకుంటాను. నాకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడే వివాహం అయింది. పెళ్ళైన అయిదేళ్ల వరకు మాకు సంతానం కలుగలేదు. ఎన్నో దేవాలయాలను దర్శించి, ఎన్నో పూజలు చేసినా ఫలితం లేకపోయింది. అటువంటి తరుణంలో మాకు తెలిసిన ఒక సాయిబంధువు ద్వారా మేము సాయిబాబా గురించి తెలుసుకుని మా గ్రామానికి దగ్గరలో ఉన్న ఒక ఊరిలోని సాయిమందిరంలో విగ్రహప్రతిష్ఠ జరుగుతుంటే నేను, మావారు వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాము. బాబా దర్శనంతో మాకు సంతానభాగ్యం కలిగింది. మొదట బాబు, తర్వాత పాప పుట్టారు. ఇంకో విషయమేమిటంటే, అప్పట్లో మావారు దేవుడిని నమ్మేవారు కాదు, నాస్తికుడిగా ఉండేవారు. అలాంటివారు బాబా మహత్యం వల్ల ఆస్తికత్వంలోకి మారారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీరు చేసిన మేలు జీవితంలో నేను మరువను సాయీ".


శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


పెద్ద సమస్యలో పడకుండా తక్షణమే కాపాడిన బాబా


నా పేరు మురళీమోహన్. 2022, ఫిబ్రవరి 1న ఒక పెద్ద సమస్యలో చిక్కుకుపోవలసిన నన్ను బాబా తృటిలో కాపాడారు. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఆరోజు సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూ కాసేపు రిలాక్స్ అవుదామని నేను, నా ఫ్రెండు వెంచర్ గ్రౌండులో కూర్చున్నాము. అప్పుడు సమయం సాయంత్రం 7 గంటలు. కాస్త చీకటిగా ఉంది. హఠాత్తుగా సివిల్ డ్రెస్సులో ఉన్న పోలీసులు కొందరు అక్కడికి వచ్చి, "మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు? మీ మీద కేసు బుక్ చేస్తాం" అన్నారు. కారణం, అక్కడికి కొంచెం దూరంలో ఎవరో డ్రింక్ చేస్తున్నారట, అక్కడ మర్డర్లు జరుగుతుంటాయట, ఇంకా ఆ ప్రదేశంలో బ్లేడ్ బ్యాచ్ కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయట. ఈ విషయాలు గానీ, ఆ చీకటిలో ఎవరు ఎక్కడున్నారో అన్నది గానీ మాకు తెలియదు. అయినా పై కారణాల వల్ల పోలీసులు మమ్మల్ని కూడా అనుమానించారు. అప్పటికీ నేను, "మాకు ఈ ప్రదేశం కొత్త. తెలియక వచ్చాం. సారీ" అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. కానీ వాళ్ళు వినిపించుకోకుండా "ఎస్పీగారు వస్తారు. అప్పుడు చూద్దాం" అని అన్నారు. నేను వెంటనే మనసులో బాబా నామస్మరణ చేస్తూ, "రక్షించు బాబా" అని అదేపనిగా బాబాను ప్రార్థించసాగాను. కాసేపటికి ఎస్పీ తదితర ఆఫీసర్లందరూ వచ్చి అక్కడున్న అందరిమీదా కేసులు బుక్ చేయసాగారు. బాబా దయవల్ల ఒక పోలీసు నాతో, "వెంటనే ఈ చోటు విడిచి వెళ్ళిపోండి" అని చెప్పి మమ్మల్ని మాత్రం విడిచిపెట్టారు. ఒక్క నిమిషంలో ఈ అద్భుతం జరిగింది. లేకుంటే నేను చాలా పెద్ద సమస్యలో  పడేవాడిని. ఇలా సాయినాథుడు అడుగడుగునా మమ్మల్ని కాపాడుతున్నారు. "బాబా! మీకు అనంతకోటి కృతజ్ఞతలు. నిన్నే నమ్ముకున్నాము తండ్రీ. బాబా, నాకు ఒక మంచి ఉద్యోగాన్నిచ్చి ప్రతిక్షణమూ టెన్షన్‌గా ఉండే ప్రస్తుత ఉద్యోగం నుంచి కాపాడు తండ్రీ. మీ అనుగ్రహం కోసం ఎదురుచూస్తున్నాను బాబా".

 

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!



సాయిభక్తుల అనుభవమాలిక 1083వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. పెద్ద సమస్యను ఎటువంటి సమస్యా లేకుండా పరిష్కరించిన బాబా
2. బాబా ప్రసాదించిన కొత్త జీవితం
3. ప్రత్యక్ష అనుభవంతో సంశయాన్ని తీర్చిన బాబా

పెద్ద సమస్యను ఎటువంటి సమస్యా లేకుండా పరిష్కరించిన బాబా


నేనొక సాయిభక్తురాలిని. ముందుగా సాటి సాయిభక్తులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నమస్కారం.  బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. వాటిలో నుండి నేను ఇదివరకే నా అనుభవం ఒకటి పంచుకున్నాను. ఈమధ్యకాలంలో జరిగిన మరో రెండు అనుభవాలను ఇప్పుడు పంచుకుంటున్నాను. కొంతకాలం క్రితం మేము మా స్థలం ఒకటి వేరేవాళ్లకు అమ్మాము. వాళ్ళు ఆ స్థలంలో ఇంటి నిర్మాణం మొదలుపెట్టారు. అంతా బాగానే జరిగి ఇల్లు పూర్తయింది. ఆ తరువాత వేరేవాళ్ళు(బడాబాబులు) వచ్చి, "ఈ స్థలం మాది, నువ్వు ఇల్లు ఎందుకు కట్టావు?" అని ప్రహరీగోడను పడగొట్టి పెద్ద గొడవ చేశారు. దాంతో, మా దగ్గర ఆ స్థలం కొన్న వ్యక్తి మా వద్దకొచ్చి జరిగిందంతా చెప్పారు. మేము డాక్యుమెంట్లు చూపించాం. కానీ వాళ్ళు వినకుండా గొడవ చేశారు. అవతలివాళ్ళు పెద్దమనుషులు అవటంతో మేము ఏం చేయలేని పరిస్థితి. అప్పుడు నేను ఈ విషయం గురించి బాబాను అడిగాను. అందుకు బాబా సమాధానంగా '16వ అధ్యాయం 16 వారాలు చదవమ'ని వచ్చింది. నేను బాబా ఆదేశానుసారం ఆ అధ్యాయం చదవడం మొదలుపెట్టాను. ఆ అధ్యాయంలో చెప్పబడిన జ్ఞానం బహుశా వాళ్లకు కలిగింది కాబోలు! 16 వారాలు పూర్తయ్యేసరికి సమస్య లేదు. ఆ స్థలం గురించి అడిగేవాళ్లెవరూ లేరు. ఇప్పుడు అంతా బాగానే ఉంది. బాబా దయవలన అంత పెద్ద సమస్య ఎటువంటి సమస్యా లేకుండా సమసిపోయింది. "థాంక్యూ బాబా".


నాకు ఈమధ్య గొంతునొప్పి వచ్చినప్పుడు కరోనా ఏమోనని చాలా భయమేసింది. బాబాకి దణ్ణం పెట్టుకుని, "గొంతునొప్పి తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకుని ఊదీ పెట్టుకున్నాను. తెల్లారేసరికి ఏ నొప్పీ లేదు. వెంటనే బ్లాగులో పంచుకుంటానని ఏరోజుకారోజు వాయిదా వేస్తూ ఉండేసరికి మళ్ళీ నొప్పి వచ్చింది. అందుకే ఇంక ఆలస్యం చేయకుండా వెంటనే నా అనుభవాన్ని బ్లాగుకి పంపుతున్నాను. బాబా దయవలన నొప్పి తగ్గిపోతుందని ఆశిస్తున్నాను. "బాబా! రెండు అనుభవాలు పంచుకోవడంలో ఆలస్యమైంది, నన్ను క్షమించండి. ప్లీజ్ బాబా! నొప్పిని తగ్గించి నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. థాంక్యూ బాబా".


శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


బాబా ప్రసాదించిన కొత్త జీవితం


నా పేరు లావణ్య. నాకు పెళ్ళై 19 సంవత్సరాలు అయ్యింది. ఒకప్పుడు మావారు చెడువ్యసనాల వల్ల ఏ పనీ చేసేవారు కాదు. నన్ను, పిల్లలను పట్టించుకోకుండా తిరిగేవారు. ఇలాంటి పరిస్థితులకు తోడు మా తమ్ముడు కూడా మరణించడంతో నేను చాలా డిప్రెషన్‍లోకి వెళ్లిపోయాను. ఆ సమయంలో ఎనిమిది నెలల గర్భిణిని అయిన నాకు ఏం చేయాలో తోచలేదు. పెళ్లికాకముందు నేను ట్యూషన్ చెప్పేదాన్ని. అప్పట్లో ఒక విద్యార్థి నన్ను 'అక్కా' అని పిలిచేవాడు. ఆ పిల్లాడి పేరు 'సాయి కిరణ్'. ఆ సాయిబాబా నాకోసమే ఆ పిల్లాడి రూపంలో వచ్చారని నాకు అప్పుడు తెలీదు. ఒకరోజు నేను ఆ పిల్లాడిని తీసుకుని కొండపై ఉన్న బాబా గుడికి వెళ్లి, "బాబా! నా భర్తకు ఒక ఉద్యోగం చూపించండి. ఆయనకి ఉద్యోగమొస్తే ఐదు వారాలు మీ గుడికి వస్తాను" అని బాబాను వేడుకున్నాను. రెండు వారాలు గడిచేసరికి మావారికి బాబా గుడిలో పూజారిగా పని దొరికింది. మావారు తన చిన్నతనంలో తన తండ్రిగారి దగ్గర కొద్దిగా పౌరోహిత్యం నేర్చుకున్నారు. తన తండ్రితో కొన్ని కార్యక్రమాలలో హాజరయ్యేవారు. కానీ పౌరోహిత్యానికి సంబంధించి మొత్తం రాదు.  అయినా ధైర్యం చేసి మా చెల్లెలి భర్త చూపించిన గుడికి వెళ్ళాము. అక్కడ మావారు ఒక సంవత్సరం తీర్థప్రసాదాలు ఇస్తూ నెమ్మదిగా అన్నీ నేర్చుకుని ఒక మంచి పూజారిగా పేరు తెచ్చుకున్నారు. బాబా దయవల్ల ఇప్పుడు అన్ని చెడు అలవాట్లు వదిలేసి నన్ను, నా పిల్లలను బాగా చూసుకుంటూ బాధ్యతగా ఉంటున్నారు. అంతా అయిపోయిందనుకున్న నా జీవితంలోకి ఆ సాయిబాబా దయవల్ల మళ్లీ సంతోషాలు వచ్చాయి. ఇలా మొదలైన నా కొత్త జీవితంలో ప్రతి అడుగులో బాబా దయవల్ల జరిగిన అద్భుతాలను, అనుభవాలను ముందు ముందు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కానీ బాబా తన భక్తులను ఎలా అనుగ్రహిస్తారో, ఆయన ప్రతి విషయంలోనూ ఒక తండ్రిలా ఎలా ఆదుకున్నారో చెప్పడానికి ఈ జీవితం సరిపోదేమో! ఏమైనా ఇలా తోటి భక్తులతో నా అనుభవం పంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. బాబా దయవల్ల నా అనుభవం బ్లాగులో ప్రచురితమవుతుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.


ఓం శ్రీసాయినాథాయ నమః!!!


ప్రత్యక్ష అనుభవంతో సంశయాన్ని తీర్చిన బాబా


సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా కృతజ్ఞతలు. నా పేరు శిరీష. నేను దాదాపు రెండు సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా ప్రతిరోజూ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతున్నాను. తద్వారా నాకు ఎంతో ఆనందం, తృప్తి కలుగుతున్నాయి. 2022, జనవరి నెల చివరిలో ఒకేరోజు నేను, మా పాప కోవిడ్ బారినపడ్డాము. ఇద్దరికీ మూడు రోజులపాటు చాలా తీవ్రంగా జ్వరం ఉండేది. కానీ నేను, 'బాబా తోడు ఉండగా భయమెందుకు?' అని కొద్దిగా ఊదీని నా నుదుటన ధరించి, పాప నుదుటన పెట్టి, మరికొంత ఊదీని నీళ్లలో కలిపి నేను త్రాగి, పాపచేత త్రాగించేదాన్ని. నాల్గవరోజు జ్వరం తగ్గి బాగుంది అనుకున్నాము, కానీ ఐదవరోజు మళ్ళీ జ్వరం వచ్చింది. దాంతో అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న నాకు చాలా భయమేసి, "బాబా! మాకు ఏమీ కాకుండా ఉంటే, మా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకుని, ఊదీనీళ్లు నేను త్రాగి, పాపకి కూడా ఇచ్చాను. తరువాత బ్లడ్ టెస్టు చేయించుకుంటే పాప విషయంలో చాలా తేడాలు కనిపించాయి. కానీ బాబా దయవల్ల క్రమంగా మేమిద్దరమూ కోలుకుని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాము. అదివరకు నేను భక్తుల అనుభవాలు చదివేటప్పుడు ఎవరైనా భక్తులు 'బ్లాగులో పంచుకుంటానని మ్రొక్కుకున్నాము' అని వ్రాసినప్పుడు 'అలా మ్రొక్కుకుంటే నిజంగా అనుకున్నది జరిగిందా లేక యాదృచ్ఛికంగా జరిగిందా?' అని నాకు అనిపించేది. ఆ సంశయాన్ని బాబా ఈ ప్రత్యక్ష అనుభవాన్ని ఇవ్వడం ద్వారా తీర్చారు. "థాంక్యూ బాబా".



సాయిభక్తుల అనుభవమాలిక 1082వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కోరుకున్నంతనే సహాయం చేసిన బాబా
2. బాబా దయతో పరిష్కారమైన సమస్యలు
3. సమస్య ఏదైనా బాబాకు చెప్పుకుంటే తీరిపోతుంది

కోరుకున్నంతనే సహాయం చేసిన బాబా


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి. సాయి బంధువులకు నమస్కారం. నా పేరు హేమ. మేము విజయవాడలో ఉంటాము. మా అమ్మాయి బి.టెక్ నాల్గవ సంవత్సరం చదువుతున్నప్పుడు క్యాంపస్ ప్లేస్‍మెంట్స్‌లో ఉద్యోగం కోసం తను చాలా ప్రయత్నించింది. కానీ కొన్ని కారణాల వల్ల తన ప్రయత్నాలు విఫలమవుతూ వచ్చాయి. దాంతో తను చాలా బాధపడుతుండేది. నేను ఒక గురువారంనాడు బాబాకి దణ్ణం పట్టుకుని, "బాబా! మా అమ్మాయికి మంచి ఉద్యోగం వచ్చేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. బాబా మా మీద దయ చూపించారు. మరుసటి వారం బుధవారంనాడు మా అమ్మాయి కాలేజీ నుండి వస్తూనే చాలా సంతోషంగా ఇంటికి వచ్చి తనకి ఉద్యోగం వచ్చిందని చెప్పింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. బాబా మంచి కంపెనీలో మా అమ్మాయికి ఉద్యోగాన్ని అనుగ్రహించారు. ఇంకా లొకేషన్ ఇవ్వలేదు. మేము బెంగుళూరులో వస్తే బాగుండు అనుకుంటున్నాము. కానీ బాబాకి తెలుసు కదా మనకేది మంచిదో. "బాబా! మీకు ఎక్కడ మంచిది అనిపిస్తే, అక్కడ వచ్చేలా చేయండి. థాంక్యూ సో మచ్ బాబా. లవ్ యు బాబా".


మా అబ్బాయి బి.టెక్ మూడో సంవత్సరం చదువుతున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ వర్కు ఇచ్చి, దానికి ఒక సార్‌ని గైడ్‍గా పెట్టారు. ఆ సార్ ఏమీ పట్టించుకోకుండా మీకు నచ్చింది చేయండి అని వదిలేసారు. అయితే మా అబ్బాయి చాలా ప్రాజెక్టులు ప్రయత్నించినప్పటికీ ఆ సార్ దేన్నీ ఆమోదించేవారు కాదు. దాంతో మా అబ్బాయి చాలా డిప్రెస్ అయ్యాడు. అప్పుడు నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! బాబుకి మంచి ప్రాజెక్ట్ దొరికేలా చేయండి" అని వేడుకున్నాను. మరుసటిరోజే మా అబ్బాయి ఒక ప్రాజెక్టుని ఎంపిక చేసుకుంటే దాన్ని వాళ్ళ సార్ ఆమోదించారు. అయితే ఆ ప్రాజెక్టు చేయాలంటే కార్పెంటర్‌తో పని ఉంటుంది. ఈ విషయంలో బాబా తమ లీలను చూపించారు. అసలు ఎప్పుడు ఫోన్ చేసినా స్పందించని మా ఇంటికి పనిచేసే కార్పెంటర్ ఒక్క ఫోన్ కాల్‍కే స్పందించి, "నేను వచ్చి మీకు కావాల్సింది చేస్తాను" అని చెప్పారు. మేము చాలా సంతోషించాము. అక్కడితో అయిపోలేదు. ఆ కార్పెంటర్ పని పూర్తి అయ్యేదాక రోజూ వచ్చి అన్ని వివరాలు అడిగి మరి ఆ ప్రాజెక్టు పూర్తి చేసారు. పైగా చేసిన పనికి డబ్బులు కూడా తీసుకోలేదు. బాబానే ఆ కార్పెంటర్ ద్వారా మా అబ్బాయి ప్రాజెక్టుని పూర్తి చేయించారని నా నమ్మకం. కోరుకున్నంతనే సహాయం చేసిన బాబాకు చాలా చాలా ధన్యవాదాలు. "లవ్ యు సో మచ్ బాబా".


బాబా దయతో పరిష్కారమైన సమస్యలు


సాయి భక్తులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఒక చిన్న వ్యాపారం చేస్తున్నాను. ఆమధ్యకాలంలో నా నిర్లక్ష్యం వలన వ్యాపారం కొంచెం డల్ అయింది. అప్పుడు నేను బాబాతో, "బాబా! మీ దయవలన మళ్లీ వ్యాపారం బాగా జరిగేల" అని చెప్పుకున్నాను. తర్వాత బాబా దయవలన వ్యాపారం కొంచెం బాగానే ఉంది. "ధన్యవాదాలు బాబా".


కరోనా సమయంలో ఒకసారి మా నాన్నకి కొంచెం చలిజ్వరం, దగ్గు వచ్చాయి. నాకు భయమేసి బాబాతో, "బాబా! నాన్నకి ఏ ఇబ్బంది లేకుండా త్వరగా తగ్గిపోవాల"ని చెప్పుకున్నాను. బాబా దయతో నాన్నకి చాలా తొందరగా నయం అయింది. "థాంక్యూ బాబా".


మా బాబు పదవ తరగతి చదువుతూ హాస్టల్లో చేరుతానని పట్టుబట్టాడు. అది మాకు ఇష్టం లేకపోయింది. కానీ మేము ఎంత చెప్పినా బాబు వినలేదు. అప్పుడు నేను బాబాతో, "బాబా! బాబు హాస్టల్లో చేరుతానన్న నిర్ణయం మార్చుకోవాల"ని చెప్పుకున్నాను. బాబా దయవలన మా బాబు చాలా తొందరగా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. అందరినీ ఇలాగే దయతో కాపాడు తండ్రి".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సమస్య ఏదైనా బాబాకు చెప్పుకుంటే తీరిపోతుంది


అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయి బంధువులందరికీ 'సాయి మహారాజ్' ఆశీస్సులు ఉండాలి. నేను 'సాయీ' అంటే 'ఓయీ' అనే పలికే దైవం సాయినాథుడి భక్తుడిని. నేను బాబాకి దగ్గరై సుమారు 5 సంవత్సరాలు అయింది. ఈ ఐదు సంవత్సరాలలో నేను బాబా చేసిన ఎన్నో లీలలు చూసాను. ఒకసారి మలబద్దకం సమస్య మొదలై మలంలో రక్తం రావడం నేను చాలారోజులు గమనించాను. మందులు వాడాను కానీ, తగ్గలేదు. నాకు తీరిక సమయంలో ఈ బ్లాగును చదవడం అలవాటు. అలా ఒకరోజు బ్లాగులో కొన్ని అనుభవాలు చదివాక మనసులో బాబాను ధ్యానించి, "నా ఆరోగ్య సమస్యకు పరిష్కారం దొరకాల"ని వేడుకున్నాను. తరువాత బాబా ఊదీ నీళ్లలో కలుపుకుని త్రాగాను. అలా ఊదీ నీళ్లు రెండు రోజులు త్రాగాక గమనించాను. ఆశ్చర్యం! ఊదీ మహిమ వలన నా సమస్య పరిష్కారమైంది. అదివరకు కూడా నా సమస్యలు కొన్నింటిని బాబా ఊదీతో తీర్చారు. తమను నమ్మిన భక్తుల వెన్నంటి ఉంటూ కాపాడే కల్పవృక్షం సాయినాథుడు. ఎలాంటి సమస్య వచ్చినా బాబాకు చెప్పుకుంటే తప్పకుండా పరిష్కారం చూపిస్తారు. 


శుభమస్తు! లోకా సమస్తా సుఖినో భవంతు!!!

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!



సాయిభక్తుల అనుభవమాలిక 1081వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. తామున్నామని నమ్మకమిస్తున్న బాబా
2. ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో బాబాకి చెప్పుకుంటే ఆయన తప్పక తీరుస్తారు
3. తోటి భక్తుల అనుభవాల విషయంలో ఆలోచనను సరిచేసిన బాబా

తామున్నామని నమ్మకమిస్తున్న బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!! నాపేరు సంగీత. మాది నిజామాబాద్. ముందుగా సాయి బంధువులకు, బ్లాగు నిర్వాహకులకు నమస్కారాలు. నేను ప్రతిరోజూ ఈ బ్లాగులో వచ్చే అనుభవాలు చదువుతుంటాను. నేను కూడా ఇదివరకు నా అనాభవాలు చాలా పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను.


ఒకసారి మా ఆడపడుచు కడుపునొప్పితో రాత్రుళ్ళు నిద్రపట్టక వారం రోజుల పాటు చాలా బాధపడింది. హాస్పిటల్‍కి వెళితే, "కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. అందుకే అంతలా నొప్పి వస్తుంది" అని అన్నారు. మా ఆడపడుచు తట్టుకోలేక బాధతో ఏడుస్తుంటే నేను, "బాబా! ఆ నొప్పి నుంచి మా ఆడపడుచుకి ఉపశమనం కలిగిస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల రెండు గంటల్లో నొప్పి తగ్గిపోయింది. "థాంక్యూ బాబా".


నేను ఆరోగ్యం బాగాలేక మందులు వాడుతున్నాను. ఆ మందుల వల్ల నాకు విపరీతంగా ఆకలి వేస్తుంటే తింటూ ఉండేదాన్ని. దాంతో నేను మూడు నెలల్లో మూడు కిలోల బరువు పెరిగాను. అంతకుముందు కూడా ఇలాగే మందులు వాడుతూ చాలా లావైతే, సంవత్సరంపాటు అన్నం తినకుండా డైటింగ్ చేస్తూ చాలా కష్టపడి 8 కిలోల బరువు తగ్గాను. అందువల్ల నేను మళ్లీ ఇలాగే బరువు పెరుగుతూ పోతే సమస్య మొదటికి వస్తుందని భయపడి, "బాబా! నాకు ఆకలి వేయకుండా ఉండేలా చూసి నా బరువు తగ్గేలా చేస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. మనం ఏది కోరినా బాబా తీరుస్తారు. ఆయన దయవల్ల నాకు ఇప్పుడు ఆకలి వేయట్లేదు, సన్నగా కూడా అయ్యాను. "థాంక్యూ బాబా".


ఒకరోజు మా పాప ఆడుకుంటూ కింద పడింది. దాంతో కాలు వాచి నడవడానికి రాలేదు. హాస్పిటల్‍కి వెళ్తే, ఎక్స్-రే తీయించమన్నారు. అప్పుడు నేను, "బాబా! మీ దయవల్ల పాపకి ఫ్రాక్చర్ కాకుండా ఉంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల ఫ్రాక్చర్ కాలేదు. కానీ కాలికి బలంగా దెబ్బ తగలడం వల్ల పట్టి వేసి 15 రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. "ధన్యవాదాలు బాబా".


నేను ఈ మధ్య స్కూటీ నడపడం నేర్చుకున్నాను. అయితే నేను ఒక్కదాన్ని, ఇంకా పిల్లలను తీసుకుని నడపగలిగేదాన్ని గాని, వెనక సీటు మీద ఒకవైపే కూర్చునేవాళ్ళని ఎక్కించుకుని నడపాలంటే భయం వేసేది. ఆ విషయమై నేను, "బాబా! మీ దయవల్ల వెనకాల ఒకవైపు కూర్చునేవాళ్ళని కూర్చోబెట్టుకుని స్కూటీ నడపగలిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. తర్వాత మా అక్కని వెనుక ఎక్కించుకుని బాబా ఉన్నారనే దైర్యంతో స్కూటీ నడిపాను. బాబా దయవల్ల బాగా నడపగలిగాను. అంతా బాబా దయ. "థాంక్యూ బాబా".


మావారు ప్రభుత్వోద్యోగి. మా ప్రాంతంలో జోనల్ ఏర్పాటు చేసి ఉద్యోగస్తులకు బదిలీలు చేస్తుంటే మావారికి ఎంత దూరం బదిలీ అవుతుందో ఏమిటో అని భయమేసి, "బాబా! మావారికి బదిలీ కాకుండా ఉంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల ఇప్పటివరకూ మా వారికి బదిలీ కాలేదు. ఇకముందు కూడా బదిలీ కానివ్వరని నా నమ్మకం. "ధన్యవాదాలు బాబా".


నాకు చాలా సంవత్సరాల నుంచి కళ్ళు తిరగడం, తల తిరగడం జరుగుతుంది. మొదటిసారి హాస్పిటల్‍కి వెళ్ళినప్పుడు డాక్టరు మూడు సంవత్సరాలపాటు మందులు వాడాలని చెప్పారు. తరువాత ఈ మధ్య ఒకసారి నేను హాస్పిటల్‍కి వెళ్తూ, "బాబా! నా ఆరోగ్యం ఎప్పుడూ బాగుండాలి" అని బాబాకి మ్రొక్కుకుని వెళ్ళాను. ఆయన దయవల్ల ఆరునెలలు చికిత్స తీసుకుంటే సరిపోతుంది అన్నారు. "థాంక్యూ బాబా".


మాకు కొన్ని అప్పులు ఉన్నాయి. ఒకసారి మా అన్నయ్య మాకు ఒక ప్లాటు ఇస్తానన్నాడు. అయితే మూడు సంవత్సరాలు అయినా ఇవ్వలేదు. ఈమధ్య ఒకసారి నేను అన్నయ్యతో, "మీరు ప్లాట్ ఇస్తే, అమ్మేసి అప్పులు తీర్చుకుంటాము" అని అన్నాను. అన్నయ్య సరే అన్నారు. కానీ వారం అయినా ఆ విషయం గురించి మళ్లీ ఏమీ మాట్లాడలేదు. నాకు మళ్లీ అడగాలి అనిపించక, "బాబా! మీ దయవల్ల అన్నయ్య వాళ్ళు ప్లాట్ అమ్మేసుకోండి అని చెప్పాలి" అని అనుకున్నాను. అంతే, ఆరోజు సాయంత్రం మా అన్నయ్య ప్లాట్ నెంబర్ చెప్పి అమ్మేసుకోండి అని అన్నారు. ఇలా ఎన్నో అనుభవాల ద్వారా నాకు ఏ సమస్య వచ్చినా తామున్నామని నమ్మకం ఇస్తున్నారు బాబా. "థాంక్యూ బాబా. మా అన్నయ్య, వదినల మధ్య ఉన్న ఒక సమస్యను మీరే పరిష్కరించండి బాబా".


ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో బాబాకి చెప్పుకుంటే ఆయన తప్పక తీరుస్తారు


సమర్ధ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!


సాయి భక్తులందరికీ నా నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఈ బ్లాగులో రెండవసారి నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. నాకు ఏ సమస్య వచ్చినా తీర్చేది బాబానే. ఆయనే నా తండ్రి. 2021, డిసెంబరులో నా రెండు కాళ్ళ నరాలు పట్టేసి చాలా నొప్పి పెట్టాయి. పదిహేను నిమిషాలైనా తగ్గలేదు. ఏమైందోనని నేను చాలా భయపడ్డాను. వెంటనే మనసులో బాబాను తలుచుకుని, "నొప్పి తగ్గితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల వెంటనే నొప్పి తగ్గింది. "ధన్యవాదాలు బాబా. చాలా ఆలస్యంగా నా అనుభవాన్ని పంచుకున్నందుకు నన్ను క్షమించండి బాబా".


2022, జనవరి నెల చివరిలో నాకు జలుబు, జ్వరం వచ్చాయి. బాబా దయవల్ల జ్వరం ఒక్క రోజులోనే తగ్గింది కానీ, నాలుగు రోజులైనా జలుబు తగ్గలేదు. ఏదైనా మింగుతుంటే టాన్సిల్స్ దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉండేది. నాకు ఏం చేయడానికి తోచక, "బాబా! రేపు పొద్దున్నకల్లా నాకు నయం కావాలి. అలా జరిగితే బ్లాగు ద్వారా తోటి భక్తులందరితో నా అనుభవాన్ని పంచుకుంటాను" అని అనుకున్నాను. మరుసటిరోజు(జనవరి 31) ఉదయం లేచేసరికి నాకు చాలా ఉపశమనంగా అనిపించింది. బాబా నా ప్రార్థనను మన్నించారు. జలుబు, జ్వరం అన్నీ తగ్గాయి. ఆయన అనుగ్రహానికి కృతజ్ఞతగా వెంటనే నా అనుభవం  'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగుకి పంపించాను. ఎవరికి ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో బాబాకి చెప్పుకోండి. ఆయన తప్పకుండా తీరుస్తారు. "బాబా అందరినీ చల్లగా చూడు తండ్రీ. ఎప్పుడూ మా వెంటే ఉండి మమ్మల్ని రక్షించు తండ్రీ. మీరే మాకు దిక్కు సాయి. తల్లీ, తండ్రీ, గురువు, దైవం, వైద్యుడు అన్నీ మీరే సాయి. ఐ లవ్ యు సాయి".


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!


తోటి భక్తుల అనుభవాల విషయంలో ఆలోచనను సరిచేసిన బాబా


అందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. 2022, జనవరి 8న నేను ఇంస్టాగ్రామ్‍లో చీరలు ఆర్డరు పెట్టాను. వాళ్ళు 6, 7 రోజాల్లో ఆర్డర్ డెలివరీ చేస్తామని అన్నారు. అయితే రెండు వారాలైనా వాళ్ళ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. నేను మెసేజ్ చేస్తే చూసేవాళ్ళు గాని, సమాధానం ఇచ్చేవాళ్ళు కాదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసే వాళ్ళు కాదు. నేను ఆసమయంలో చాలా టెన్షన్ పడి, "బాబా! నేను పెట్టిన ఆర్డరు డెలివరీ అయితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. ఆయన దయవల్ల 2022, జనవరి 31న నా ఆర్డరు డెలివరీ అయ్యింది. ఇక్కడ నేను ఒప్పుకోవాల్సిన విషయమేమిటంటే, ఈ బ్లాగులో కొంతమంది భక్తులు బాబాకి చెప్పుకోవడం వల్ల వాళ్ల ఆర్డర్లు డెలివరీ అయ్యాయని తమ అనుభవాలు పంచుకున్నప్పుడు వాటిని చదివిన నేను 'ఇలాంటి వాటిని కూడా బాబాని అడగాలా? టెక్నికల్ సమస్యల వల్ల ఆలస్యమై ఉండొచ్చు కదా' అని నవ్వుకున్నాను. తోటి భక్తుల అనుభవాల విషయంలో నేను అలా అనుకోవటం తప్పే కదా. అందుకే బాబా నాకు ప్రాక్టికల్ అనుభవాన్ని ఇచ్చారు. తద్వారా డబ్బులు ఎవరివైనా ఒకటేనని, డబ్బులు కట్టిన తరువాత వస్తువు రాకపోతే అందరి టెన్షన్ ఒకేలా ఉంటుందని నాకు తెలిసేలా చేసారు బాబా. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీకు చెప్పినట్టుగానే నా తప్పుని ఒప్పుకుంటూ నా అనుభవాన్ని బ్లాగ్లులో పంచుకున్నాను. అలాగే నా తప్పుకు మిమ్మల్ని క్షమాపణలు వేడుకుంటున్నాను".



సాయిభక్తుల అనుభవమాలిక 1080వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నిజంగా బాబా ఉన్నారు - వేడుకున్నంతనే అనుగ్రహిస్తున్నారు
2. రానున్న సమస్యకు ముందుగానే సందేశమిచ్చిన బాబా
3. తొందరగా కోలుకునేలా అనుగ్రహించిన బాబా

నిజంగా బాబా ఉన్నారు - వేడుకున్నంతనే అనుగ్రహిస్తున్నారు


ముందుగా ఈ బ్లాగు నిర్వాహకులకు మరియు సాటి సాయిబంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటాను. 2022, జనవరి రెండవ వారంలో ఒకరోజు నేను బాబా ముందు నిలుచుని, "బాబా! మేము ఏమన్నా మొక్కులు మర్చిపోయి ఉంటే, వాటిని గుర్తు చేయండి. అలాగే ఆ మొక్కులు తీర్చుకునే శక్తినివ్వండి. మొక్కులు తీర్చుకోనందుకు అనేకానేక క్షమాపణలు" అని వేడుకున్నాను. మరుసటిరోజు మా అత్తయ్యగారు మాటల్లో తను మొక్కుకున్న ఒక మొక్కు గురించి చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. రెండు రోజుల తర్వాత ఇంకో మొక్కు గురించి చెప్పారు. నాకు పెళ్ళై రెండు సంవత్సరాల రెండు నెలలు అయింది. ఇంతకాలంగా మొక్కుల గురించి ఎప్పుడూ చెప్పని అత్తయ్య హఠాత్తుగా బాబాని వేడుకున్నంతనే చెప్పడం బాబా అనుగ్రహానికి నిదర్శనం. నిజంగా బాబా ఉన్నారు.


2022, జనవరి నెల చివరి వారంలో మా అత్తయ్యగారికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఎప్పుడూ ఉల్లాసంగా ఆఫీసు పని, ఇంట్లో పని చేసుకునే ఆమె ఒక్కసారిగా గృహనిర్బంధంలోకి వెళ్లడంతో ఇల్లంతా బోసిపోయి ఏదో తెలియని ఆందోళన మొదలైంది. ఇంకా ఆపరేషన్ అయి 3 నెలలు కూడా పూర్తి అవ్వని నేను పనులన్నీ చేసుకోవాల్సి వచ్చింది. నా బాబా దయవల్ల నా భర్త, మా మామయ్యగారు మంచివాళ్ళు అవటం వలన నాకు చాలా సహాయం చేసారు. అయితే మా ఇంట్లో వయస్సు పైబడిన మావారి నాన్నమ్మ ఉన్నారు. ఆవిడకి రెండు కళ్ళు కనపడవు. ఆమెకోసం పనిమనుషులు ఉన్నారు. వాళ్ళకి టిఫిన్లు, కాఫీలు చేయడం, మూడు నెలలు కూడా నిండని మా పాపని చూసుకోవడం వంటి వాటివల్ల నాకు కాస్త కష్టంగా అనిపించింది. అప్పుడు 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు గుర్తొచ్చి, 'అత్తయ్యకి కరోనా తగ్గి ఇంకా ఎవరికీ  ఆ మహమ్మారి అంటుకోకుండా ఉంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను' అని అనుకున్నాను. అంతే, ఆ మరుసటిరోజు మా అత్తయ్యగారికి వచ్చింది 'కరోనా కాదు, ఒమిక్రాన్ అని, దానివల్ల అసలు భయమే లేదు' అన్నారు. తరువాత అది కూడా తగ్గిపోయింది. ఇప్పుడు అత్తయ్య మునుపటిలా చక్కగా ఆఫీసుకి వెళ్లొస్తున్నారు. ఇంకా ఇంట్లో ఎవరికీ ఆ ఒమిక్రాన్ అంటుకోలేదు. ఇదంతా బాబా దయవల్లనే.


అత్తయ్యగారికి కరోనా ఉన్న సమయంలో పగలంతా మా పాప పడుకునేది. ఆ సమయంలో నేను ఇంట్లో పని చేసుకునేదాన్ని. అయితే పగలు నిద్రపోవడం వల్ల పాప రాత్రిళ్ళు నిద్రపోయేది కాదు. అందువలన నాకు రాత్రి నిద్ర ఉండక పగలు బాగా అలసటగా ఉంటూ నిద్ర వస్తుండేది. అలా మూడురోజులు గడిచాక నాల్గవరోజు రాత్రి నేను, "బాబా! మీ ఊదీ పాపకి పెడుతున్నాను. పాప కనీసం 4 గంటలైనా నిద్రపోవాలి. అలా జరిగితే నేను కూడా నిద్రపోయి పొద్దున్న ఉల్లాసంగా పని చేసుకోగలుగుతాను. నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకుని కొద్దిగా ఊదీ పాపకి పెట్టాను. అంతే ఆరోజు పాప చక్కగా నిద్రపోయింది. నేను కూడా నిద్రపోయాను. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా. మా పాప ఆరోగ్యం బాగు అయ్యేట్టు చూడండి. నా బిడ్డకు పూర్ణ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును ప్రసాదించండి".


రానున్న సమస్యకు ముందుగానే సందేశమిచ్చిన బాబా


సాయి బంధువులకు నమస్కారం. నా పేరు గోష్టేశ్వరి. నాకు మళ్ళీ ఇంత త్వరగా నా అనుభవాలను పంచుకునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మధ్య ఒకరోజు బ్లాగులో భక్తుల అనుభవాలు చదువుతున్నప్పుడు, "ఆమెకు నయమవుతుంది. నువ్వేమీ దిగులు చెందకు. నా ఊదీ నీళ్లలో కలిపి ఇవ్వు చాలు" అన్న సందేశం కనిపించింది. అయితే అప్పటికి మా ఇంట్లో అందరమూ బాగానే ఉన్నందున నేను ఆ మెసేజ్ నాకు కాదేమో అనుకున్నాను. కానీ ఆ రోజు రాత్రి 2 గంటల సమయంలో మా పాపకు విపరీతమైన జ్వరం వచ్చింది. నాకు భయమేసి బాబాను ప్రార్థించి పాపకి టాబ్లెట్ ఇచ్చాను. మరుక్షణం ఉదయం బ్లాగులో కనిపించిన మెసేజ్ గుర్తుకు వచ్చింది. వెంటనే ధైర్యం తెచ్చుకుని పాపకి ఊదీ కలిపిన నీళ్ళు ఇచ్చాను. అంతే, పాపకి జ్వరం తగ్గి మళ్ళీ రాలేదు. ఇదివరకు చెప్పానుగా 'నా బాబా నన్ను అడుగడుగునా కాపాడుతున్నార'ని. కానీ నాకు టెన్షన్ ఎక్కువని బాబాకి తెలుసు. కాబట్టే ముందుగా "నువ్వేమి దిగులుకు చెందకు" అని చెప్పారు. "ఇలా నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతున్న మీకు ఎంతగా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే బాబా!".


ఈ మధ్య మా ఫోన్ ఒకటి కనిపించలేదు. కాల్ చేస్తే, 'కవరేజ్ ఏరియా'లో లేదని వస్తుండేది. ఆ ఫోన్ కోసం రెండు రోజులు ఎంత వెతికినా అది కనిపించలేదు. అప్పుడు మా పాప, "ఫోన్ దొరికితే, మా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకుంది. తర్వాత బాబా దయవల్ల ఫోన్ దొరికింది. "ధన్యవాదాలు తండ్రీ! ఎన్ని జన్మలైనా నేను మీ బిడ్డగానే పుట్టాలి. ఇంకా నా తప్పులు ఏవైనా ఉంటే మన్నించండి బాబా".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


తొందరగా కోలుకునేలా అనుగ్రహించిన బాబా


సాయిభక్తులకు బాబా ప్రసాదించిన తమ అనుభవాలను సోదర సాయిభక్తులతో   పంచుకునే అద్భుత అవకాశాన్నిచ్చిన సాయికి ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సాయిభక్తులందరికీ నా వినయపూర్వక ప్రణామాలు. నాపేరు బాలాజీ. నేను సాయిభక్తుడిని. ఇదివరకు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకునే అవకాశం నాకు లభించింది. ఇప్పుడు మరో అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇటీవల ఒమిక్రాన్ వైరస్ భయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే, మేము దానికి మినహాయింపు కాదు. భయపడినట్లే మొదట నా కొడుకు తరువాత నేను అనారోగ్యం పాలయ్యాము. మేము ముఖ్యంగా వయసుపైబడిన నా తల్లిదండ్రుల గురించి భయపడి సామాజిక దూరాన్ని పాటిస్తూ ఒంటరిగా గదిలో ఉండసాగాము. అయినప్పటికీ ముందు మా అమ్మ, తరువాత మా నాన్న కూడా అనారోగ్యం పాలయ్యారు. అప్పుడింక ఒమిక్రాన్ లక్షణాలు తెలుసుకుని, మన ప్రియమైన సాయిమహరాజ్‌ని, "ఎక్కువ బాధకలగకుండా తొందరగా నా తల్లిదండ్రులకు ఉపశమనం చేకూర్చండి బాబా. అదే జరిగితే మా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని హృదయపూర్వకంగా ప్రార్థించాను. నా ప్రార్థనను సాయిమహరాజ్ ఆమోదించి నా తల్లిదండ్రులు ఎక్కువ బాధపడకుండా చాలా త్వరగా కోలుకునేలా చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. బాబాకి మాటిచ్చినట్లు నేను ఈ అనుభవాన్ని నా ప్రియ సోదర సాయి భక్తులతో ఇప్పుడిలా పంచుకున్నాను. సాయిమహరాజ్‍కి నా వినయపూర్వక నమస్కారాలు.


శ్రీసమర్థ సద్గురు సచ్చిదానంద సాయినాథ్ మహరాజ్ కీ జై!!!



సాయిభక్తుల అనుభవమాలిక 1079వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయకు ప్రతిరూపమైన అనుభవాలు
2. దయ చూపిన బాబా

బాబా దయకు ప్రతిరూపమైన అనుభవాలు

సాయి బంధువులందరికీ నమస్కారం. బాబాకున్న అనంతకోటి ప్రేమమయ భక్తుల్లో నేను ఒక చిన్న పరమాణువు వంటి భక్తురాలిని. నేను బాబా మీద చూపించే భక్తి, ప్రేమలకన్నా ఆయన నా మీద చూపించే ప్రేమే ఎక్కువ. నేను అప్పుడప్పుడు ఆయనను మరిచినా ఆయన నన్ను మరవరు. నా నీడ నన్ను వదిలినా ఆయన నన్ను వీడరు. అది వారి గొప్పతనం. వారి గొప్పతనాన్ని, ప్రేమను పొగిడే శక్తి నాకు లేదు. అంతటి ప్రేమమూర్తికి కేవలం ధన్యవాదాలు చెప్పటం తప్ప నేనేం చేయగలను? ఈరోజు నేను జీవించి ఉన్నానంటే అది వారు నాకు ప్రసాదించిన ప్రాణభిక్షే. నిత్య జీవితంలో మనం ఎన్నెన్నో విషయాల్లో బాబా మీద ఆధారపడి బతుకుతాము. ఆయా పరిస్థితులను బట్టి అవి ఎంత అవసరమో అనుభవించే వాళ్ళకే అర్థమవుతాయి. అయితే మన అవసరాలు చిన్నవైనా, పెద్దవైనా అడిగిన వెంటనే బాబా వాటిని తీరుస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన జీవితాలలో ప్రతీక్షణం బాబా దయాభిక్షే.

రెండేళ్ళ కిందట మేము మా ఇంటిని మరమ్మత్తు చేసి పునర్నిర్మించాము. ఆ సమయంలో నేను ఒక ఫంక్షన్ కోసమని బంగారు నగలు ఉంచే బ్యాగు తీసి అందులో ఉన్న అవసరమైన నగలు తీసుకునే క్రమంలో ఏ డిజైన్ చెవి కమ్మలు పెట్టుకోవాలని చూస్తుండగా మావాళ్లు ఆలస్యం అవుతుందని కాస్త హడావిడి చేసేసరికి ఒక చెవి కమ్మ ఎక్కడో పడిపోయింది. వెంటనే బ్యాగులో, నేలపై వెతికాను కానీ, అది కనిపించలేదు. ఫంక్షన్ వేరే ఊళ్ళో కావడం, పైగా అప్పటికే ఆలస్యమవడంతో వెతికే సమయం ఎక్కువగా లేదని, తిరిగి వచ్చాక వెతకొచ్చని వేరే డిజైన్ చెవి దిద్దులు పెట్టుకుని వెళ్ళిపోయాను. కానీ నా మనసులో ఒకటే బాధ. ఎందుకంటే, అవి మా మమ్మీ నాకు, మా చెల్లికి ఒకే డిజైన్‍లో ఎంతో ఇష్టంగా చేయించినవి. అవంటే నాకు చాలా ఇష్టం. సరే ఫంక్షన్ నుండి ఇంటికి వచ్చాక ఆ చెవికమ్మ కోసంగా బ్యాగులో ఆణువణువూ గాలించాను, ఇల్లు ఊడిచి మరీ వెతికాను. కానీ ఆ చెవికమ్మ దొరకలేదు. దాంతో నేను, 'ఇంటి మరమత్తు పనులవల్ల రకరకాల పనివాళ్ళు ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. వాళ్లలో ఎవరికి ఆ చెవికమ్మ దొరికినా ఇక అంతే సంగతి' అని దాదాపుగా ఆ చెవికమ్మపై ఆశ వదిలేసాను. కానీ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా దొరుకుతుందేమోనన్న ఆశతో ఆ బ్యాగులో చెవికమ్మకోసం వెతుకుతుండేదాన్ని. కొన్నాళ్ళకి ఆ ఆశ కూడా పోయింది. అయితే నా మనసు అట్టడుగు పొరల్లో ఏదో ఒక మూలన 'బాబా నాకు న్యాయం చేస్తారు. అది కష్టపడి సంపాదించినది కాబట్టి, నాది నాకు దొరుకుతుంది' అనే నమ్మకం ఉండేది. కానీ బయట పరిస్థితి అందుకు భిన్నంగా అంటే దొరకటానికి ఆస్కారమే లేని విధంగా ఉండేది.

కొన్నాళ్ళకి ఇంటి పనులు పూర్తయ్యాక ఆ గదికి రంగులు వేసి, సామానంతా సర్ది గృహప్రవేశం, హోమం చేసాము. ఆ కార్యక్రమాలకి స్నేహితులు, చుట్టాలు వచ్చారు. ఆరోజు ఉదయం నగలు వేసుకునేటప్పుడు కూడా నేను ఆ చెవికమ్మకోసం వెతికానుకానీ, దొరకలేదు. హోమం పూర్తయ్యాక ఆ రాత్రి భోజనానికి ముందు నేను, నా స్నేహితులందరూ బెడ్‍రూమ్‌లో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటున్నాము. ఆ సమయంలో నేను వేసుకున్న నగలు తీసేసి అక్కడే ఉన్న ఒక బ్యాగులోని రోజూ పెట్టుకునే కమ్మలు తీసివ్వమని నా స్నేహితురాలిని అడిగాను. తను, "ఇందులో చాలా ఉన్నాయి కదనే. ఏవి ఇవ్వాలి?" అంటూ ఒక కమ్మ తీసి చూపించింది. దాన్ని చూసి నేను బాధతో, "ఆ జతలోని ఇంకో కమ్మ పోయిందే, వేరేవి ఇవ్వు" అని అన్నాను. అందుకు తను, "నీ తలకాయ. ఇందులో రెండూ ఉన్నాయి కదనే" అంది. "ఏ లేవే, ఒక్కటే ఉందే" అని నేనంటే తనకి కోపమెచ్చి, "ఏంటే, రెండు ఉన్నాయంటే, పోయింది అంటావేంటీ? నా చేతిలో రెండు పెట్టుకుని మాట్లాడుతుంటే, ఒక్కటి ఉందంటావేం?" అని తిట్టింది. నేను ఒక్క క్షణం షాకై, "ఇంకో కమ్మ నీకు ఎక్కడ దొరికింది" అని అడిగాను. అందుకు తను, "ఎక్కడేంటి, రెండూ ఒక దగ్గరే ఉన్నాయి" అంది. అది విని నేను, 'ఐదు నెలల కింద పోయి ఆ రోజు ఉదయం వరకూ నేను, మా ఇంట్లోవాళ్లు చాలాసార్లు వెతికినప్పటికీ దొరకని ఆ చెవికమ్మ ఎప్పుడూ నా నగల బ్యాగుని చూడని నా స్నేహితురాలికి ఆబ్యాగులో రెండు చెవి కమ్మలు ఎలా దొరుకుతాయి? ఇది బాబా దయ కాదా! వారి అద్భుత లీల కాదా!' అని నిర్ఘాంతపోయాను. అప్పుడు వాళ్ళతో జరిగిందంతా చెప్పి నిజంగా ఇది బాబాగారి మిరాకిలే అని సంతోషంగా చెప్పాను. అలా పోయిందనుకున్న బంగారం దొరికేలా అనుగ్రహించిన మన సాయికి అనేకానేక కృతజ్ఞతలు.

2022, జనవరి మూడో వారంలో మా వారికి జ్వరం, దగ్గు వచ్చాయి. ప్రస్తుతమున్న కోవిడ్ పరిస్థితుల్లో భయం కలిగించే లక్షణాలు అవి. వాటి వల్ల మూడు రోజులు బాధననుభవించిన తర్వాత మావారు ఇంక భరించలేక రాత్రి పడుకునే ముందు బాబాని తీవ్రంగా ప్రార్థించి పడుకున్నారు. బాబా దయవల్ల మరుసటిరోజు ఉదయం మావారు నిద్రలేచాక అవి తగ్గుముఖం పట్టి రెండో రోజుకి పూర్తిగా తగ్గిపోయాయి. తర్వాత నాకు కూడా జ్వరం, చలి, జలుబు, పొడిదగ్గు, వాసన తెలియకపోవడం, రుచి కోల్పోవటం మొదలైన లక్షణాలు మొదలై నాలుగైదు రోజులు భాదపడ్డాను. మా అమ్మాయికీ జ్వరం, దగ్గు వచ్చాయి. కోవిడ్ అనుకుందామంటే నెల రోజులుగా మేము ఎవరమూ బయటకు వెళ్ళిందే లేదు. మా ఇంటికి ఎవరూ వచ్చింది లేదు. కనీసం వేరే వాళ్ళను కలిసిందీ లేదు. నేను ఎక్కువగా బాబా ఊదీనే నమ్ముకుంటాను, మరీ తట్టుకోలేననుకున్నప్పుడు మాత్రమే టాబ్లెట్ వేసుకుంటాను. అదే నమ్మకంతో ఊదీ నుదుటన ధరిస్తూ, మరికొంత ఊదీ నీళ్ళలో వేసుకుని తాగుతుండటం వల్ల అన్ని సమస్యలు తగ్గిపోయాయి. కానీ దగ్గు పూర్తిగా తగ్గలేదు, పరవాలేదు తొందరలో అది కూడా తగ్గుతుంది. అంతా బాబా దయ.

ఒకరోజు విద్యుత్ కార్యాలయం నుంచి, 'రేపు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది' అని మెసేజ్ వచ్చింది. మరుసటిరోజు గురువారమైనందున బాబాకి అభిషేకం చేయాల్సి ఉంది. మరి 9 తర్వాత విద్యుత్ సరఫరా లేకపోతే ఎలా అని నేను టెన్షన్ పడుతూ "బాబా! మా స్నానాలు పూర్తయేవరకూ కరెంట్ పోకుండా ఉంటే, ఈ అనుభవం మన బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. ఆశ్చర్యం! ఆరోజు కరెంట్ అస్సలు పోలేదు. మనం అడిగేవి చిన్నవైనా, పెద్దవైనా ఆ స్థాయికి దిగొచ్చి తండ్రివలే మన కోరికలు తీరుస్తారు బాబా. కానీ మనమే ఆయన బోధలు సక్రమంగా పాటించము. నిజానికి బాబా బోధలు వినటానికి ఎంత సులభంగా ఉంటాయో, ఆచరించటానికి అంత కష్టంగా ఉంటాయి. అవి ఆచరణలో పెట్టడమంటే మనస్సుని పూర్తిగా జయించటమే. మనస్సును జయిస్తే ఇంకేంటీ యోగత్వమే కదా. కానీ అదంత సులభమేమీ కాదు. అందుకే బాబా తమ తత్వం గురించి అనుభవాల ద్వారా మనకి అవగాహన కల్పిస్తూ తాము చెప్పిన అలతిఅలతి పదాల లోతెంతో, వాటి నిగూఢత్వమేంతో అనుభవంలోకి తీసుకొస్తారు. కొన్ని అనుభవాలైతే బాబా పర్ఫెక్ట్ టైమింగ్, బ్రాండింగ్ కలగలిపి ఉంటాయి. ఆయనకు ఆయనే సాటి.

దయ చూపిన బాబా

ముందుగా సాయి భక్తులకు నమస్కారం. భక్తులకు తమ అనుభవాలను తోటి భక్తులతో పంచుకునే అవకాశమిచ్చిన బ్లాగు నిర్వాహకులకు కృతజ్ఞతలు. నేను ఒక సాయి భక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన తొలి అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఒకరోజు మా ఇంట్లో నాకు, నా భర్తకి మధ్య చిన్న గొడవ జరిగింది. ఆ కారణంగా మావారు మనస్తాపం చెంది ఇంటి నుండి బయటకి వెళ్ళి సాయంత్రం వరకు రాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్‍లో పెట్టారు. నాకు చాలా భయమేసి బాబాను తలుచుకుని, "మావారు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని ప్రార్థించి బాబా ఊదీ స్వీకరించాను. బాబా నా మీద, నా కుటుంబం మీద దయ చూపించారు. మావారు తిరిగి ఇంటికి వచ్చారు. దాంతో నా మనస్సు శాంతించింది. "ధన్యవాదాలు బాబా". ఇంకా కొన్ని అనుభవాలు త్వరలో పంచుకుంటాను.


సాయిభక్తుల అనుభవమాలిక 1078వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. క్లిష్ట పరిస్థితి నుంచి కాపాడిన బాబా
2. శ్రీసాయినాథుని కృపాకటాక్షాల వలన తగ్గిన బిపి
3. వెర్టిగో నుండి కాపాడిన బాబా

క్లిష్ట పరిస్థితి నుంచి కాపాడిన బాబా


శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


నా పేరు కుమార్. నేను, నా భార్య వృత్తిరిత్యా హైదరాబాదులో స్థిరపడ్డాము. 2022వ సంవత్సరం తొలి నెలల్లో నా భార్య ఒక కొత్త కంపెనీలో జాయిన్ అయ్యింది. ఆ కంపెనీలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మూడునెలలు శిక్షణ ఇచ్చిన తరువాత ప్రాజెక్టులో వేస్తారు. కొన్నిరోజులు శిక్షణ బాగానే జరిగింది. తరువాత నా భార్యకి శిక్షణనిచ్చే కోచ్ ఏదో ఒక వంకతో తన మీద ప్రతిరోజూ నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అంతేకాక శిక్షణ కూడా సరిగా ఇవ్వకుండా ప్రతి చిన్న విషయాన్ని చాలా పెద్దదిగా చేసి వాళ్ళ మేనేజరుతో చెప్తుండేవాడు. అలా రోజురోజుకి ఆ కోచ్ ఆగడాలు మరింత ఎక్కువ అవుతూ ఉండేవి. అందువల్ల నా భార్యపై ఒత్తిడి ఎక్కువైపోయి ప్రతిరోజూ బాధపడుతూ చివరికి ట్రైనింగ్‍కి వెళ్లాలంటేనే భయపడే స్థితికి వచ్చి, 'అసలే కొత్త కంపెనీ, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వల్ల ముందు ముందు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయోన'ని నా భార్య చాలా ఆందోళన చెందసాగింది. ఇలా ఉండగా ఒకరోజు తను తెలియక చేసిన ఒక పొరపాటు వలన ఆ కంపెనీకి 12 లక్షల రూపాయల నష్టం వచ్చే పరిస్ధితి ఏర్పడింది. అదే అదనుగా తీసుకుని ఆ కోచ్ నా భార్యను ఉద్యోగంలో నుంచి తొలగించడానికి చాలా ప్రయత్నించాడు. నిజానికి అదంతా ఆ కోచ్ వల్లనే జరిగింది. అతను సరిగ్గా ట్రైనింగ్ ఇచ్చి ఉంటే ఆ సమస్య వచ్చేదే కాదు. ఇక ఆ రోజు నా భార్య ఇంట్లో గట్టిగా ఏడుస్తూ జరిగినదంతా చెప్పి, "తనని ఉద్యోగంలో నుంచి తీసేస్తార"ని చాలా బాధపడింది. ఏ కష్టం వచ్చినా నా తండ్రి సాయినాథునికి చెప్పుకోవడం ఎప్పటినుండో నాకు అలవాటు. అందుచేత నా భార్య అలా ఏడవడం చూసిన నేను వెంటనే పూజగదిలోకి వెళ్ళి బాబా పటం ముందు నిల్చొని, దణ్ణం పెట్టుకుని సమస్యను ఆయనతో చెప్పి, "ఈ సమస్య నుండి నా భార్యను కాపాడి, ట్రైనింగ్‍లో తనకి సహాయం చేసి ఉద్యోగం నిలబడేలా చేయండి" అని ఆర్తిగా బాబాను వేడుకున్నాను. నా తండ్రి సాయినాథుడు ఎంతో పెద్ద అద్బుతం చేశారు. సరిగ్గా మూడవరోజున మేనేజర్ నా భార్యకి ఫోన్ చేసి, "జరిగిన దాని గురించి ఆలోచించకుండా ట్రైనింగ్‍లో శ్రద్ధగా ఉంటూ అన్నీ సవ్యంగా నేర్చుకో" అని చెప్పారు. ఆ మాటలు విని మేమంతా చాలా ఆశ్చర్యపోయాము. నా తండ్రి సాయినాథుని దయవలన మాత్రమే మేము ఇంత పెద్ద సమస్య నుండి బయటపడ్డాము. అంతేకాదు బాబా ఆశీస్సులతో నా భార్య తన ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రాజెక్ట్‌లో జాయిన్ అయింది. ఇప్పుడు సాయినాథుని దయవలన తన పని తను చక్కగా చేసుకోగలుగుతుంది. అంత పెద్ద క్లిష్ట పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడిన మా సాయినాథునికి కోటానుకోట్ల హృదయపూర్వక కృతజ్ఞతలు సమర్పించుకుంటూ...


అఖిలాండకోటి అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


శ్రీసాయినాథుని కృపాకటాక్షాల వలన తగ్గిన బిపి

ఓం శ్రీసద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

నాపేరు శ్రీకాంత్. 2022, జనవరి నెల మధ్య నుండి సుమారు 15 రోజులపాటు నా గుండె దగ్గర పట్టినట్లు ఉండటం, గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం వంటివి జరుగుతుండేవి. డాక్టరుని సంప్రదిస్తే, "మీకు బిపి వచ్చే లక్షణాలున్నాయి. కొన్నిరోజులపాటు రెగ్యులర్‌గా బిపి టెస్టు చేయించుకోండి" అని సూచించారు. దాంతో ఇక బిపి టాబ్లెట్లు వేసుకోక తప్పదని నేను చాలా భయపడి ఆ సాయినాథునికి నమస్కరించి, "బాబా! నా బిపి నార్మల్‍గా ఉండేటట్లు చేయి తండ్రి" అని వేడుకుని రోజూ బాబా ఊదీ నా ఛాతి దగ్గర పెట్టుకోసాగాను. ఆ సాయినాథుని కృపాకటాక్షాల కారణంగా నా బిపి నార్మల్‍కు వచ్చింది. ప్రస్తుతం నేను ఎలాంటి టాబ్లెట్లు వాడటం లేదు. ఇంతటి కృప చూపిన ఆ సాయినాథునికి సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తున్నాను. 

అదేవిధంగా జనవరి నెల చివరి వారంలో ఒకరోజు అర్థరాత్రి అనుకోకుండా నా భార్యకు గుండెల్లో దడ, ఆయాసం వచ్చాయి. అప్పుడు నేను ఆ సాయినాథుని ఊదీ ఆమెకు పెట్టి, "ఆమెకు తొందరగా తగ్గేటట్లు చూడు తండ్రి. తగ్గిన వెంటనే ఆమెచేత పాలన్నం, పెరుగన్నం మీకు నైవేద్యం పెట్టిస్తాను" అని మొక్కుకున్నాను. ఆ సాయినాథుని కృపాకటాక్షాలు వలన నా భార్య తిరిగి సాధారణ స్థితికి వచ్చింది. నాకు, నా కుటుంబానికి నిత్యం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న ఆ సాయినాథునికి నేను ఎల్లప్పుడూ ఋణపడి ఉంటాను.

సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

వెర్టిగో నుండి కాపాడిన బాబా

నా పేరు విక్రమ్ రెడ్డి. నేను హైదరాబాద్ నివాసిని. నేను సాయిబాబాకు అత్యంత భక్తుడిని. బాబా దయవలన నేను నా జీవితంలో ప్రతిరోజూ ఆయన అనుగ్రహాన్ని చవిచూస్తున్నాను. ఇటీవల ఒకరోజు నా భార్య, కొడుకు ఒక వివాహా వేడుకకు హాజరయ్యేందుకు వెళ్లారు. వయస్సు పైబడిన నా అత్తమామలు ఇంట్లోనే ఉన్నారు. హఠాత్తుగా నేను వెర్టిగోతో బాధపడ్డాను. తల తిరుగుతున్నట్లు అనిపించడంతో వెంటనే నేను నా కొడుకుకు ఫోన్ చేసి, "పెళ్లి నుండి వచ్చేయండి" అని చెప్పాను. వాళ్ళు వచ్చేలోపు నా భార్య మా ఇరుగుపొరుగు వాళ్ళకి ఫోన్ చేసి, 'నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లమ'ని చెప్పింది. వెంటనే ఇరుగుపొరుగు వాళ్ళు వచ్చి నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. నన్ను ఎమర్జెన్సీ వార్డులో ఉంచి చికిత్స మొదలుపెట్టారు. కొద్దిసేపట్లో నా భార్య, కొడుకు వచ్చారు. ఇది బాబా నాపై చూపిన గొప్ప అనుగ్రహం. ఎందుకంటే, మా ఇరుగుపొరుగువారి రూపంలో బాబానే నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన దయతో నేను వెర్టిగో నుండి కోలుకుని ఇప్పుడు బాగున్నాను. "ధన్యవాదాలు సాయిబాబా".

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo