|
సాయి వచనం:-
|
|
|
సాయిభక్తి సాధన రహస్యం - ఆలయ నిర్మాణంలో అసలైన ఆగమసూత్రాలు!
సాయిభక్తుల అనుభవమాలిక 573వ భాగం.....
- బాబా ప్రసాదించిన కొన్ని మధురానుభవాలు
సాయిభక్తురాలు శ్రీమతి లలిత తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
నా మొదటి అనుభవం:
మా ఆఫీసులో ఒకరోజు గీత అనే సాయిభక్తురాలు శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకుని, తిరిగి వచ్చేటప్పుడు శిరిడీ నుండి ‘సాయిలీలామృతం’ పుస్తకం తీసుకొచ్చి నాకు ఇచ్చింది. అంతకుముందే నేను శ్రీగురుచరిత్ర పారాయణ చేశాను. సాయిలీలామృతం మొదటిసారి చదివినప్పుడు నేను పూర్తిగా గందరగోళంలో పడ్డాను. ఎందుకంటే, నేను ఆంజనేయస్వామి భక్తురాలిని. సాయిలీలామృతం చదివాక ‘నేను బాబాను పూజించాలా? లేక ఆంజనేయస్వామిని పూజించాలా?’ అనే సమస్యతో తికమకపడ్డాను. ఆ తరువాత ఒకరోజు నేను మా చెల్లెలింటికి వెళ్ళినప్పుడు రెండవసారి సాయిలీలామృతం పారాయణ చేశాను. పారాయణ చేస్తుండగా, “ఇంకా నన్ను నమ్మవా? నేను వేరు, ఆంజనేయస్వామి వేరు కాదు” అని ఆ పుస్తకంలో వ్రాతపూర్వకంగా ఉండటం కనిపించింది. ఆ తరువాత నేను మళ్ళీ సాయిలీలామృతం చదివాను. కానీ ఆ ఉదయం ఏ పేజీలోనైతే ఆ వాక్యాలు చదివానో ఆ వాక్యాలు ఈసారి చదువుతున్నప్పుడు అక్కడ కనిపించలేదు. నా కోసమే ఆరోజు ఉదయం బాబా ఆ వాక్యాలను నాకు కనిపించేలా చేశారని భావించాను. అప్పటినుండి నా జీవితం బాబాకు అంకితమైంది. నేను పూర్తిగా బాబా భక్తురాలినయ్యాను. ఇంకా బాబా నాకు ఎన్నోచాలా లీలలు చూపించారు.
రెండవ అనుభవం:
ఒకసారి నేను శ్రీసాయిసచ్చరిత్ర పారాయణ చేస్తున్నాను. ఆరోజు పారాయణ చివరిరోజు. ఆరోజు కలలో నేను చూసిన ప్రదేశం ఎక్కడో ఏమో తెలియదుగానీ నాకు మాత్రం అది నాకు బాగా తెలిసిన ప్రదేశమని అనిపించింది. ఆ ప్రదేశంలో బాబా గుడి ఉంది. ఆ గుడిలోని బాబా విగ్రహం అచ్చం శిరిడీ సమాధిమందిరంలోని బాబా విగ్రహంలానే ఉంది. ఆ గుడి ప్రక్కన నేను మట్టి త్రవ్వుతూ ఉన్నాను. మట్టి త్రవ్వుతూ ఉంటే బంగారునాణేలు వస్తూనే ఉన్నాయి. ‘ఆ బంగారునాణేలను ఎవరికివ్వాలా?’ అని ఆలోచించాను. ముందు మావారికి ఇవ్వాలనుకున్నాను. తరువాత మా అన్నయ్యకు ఇవ్వాలని అనుకున్నాను. చివరికి ‘ఎవరికీ ఇవ్వద్దు’ అనుకుని అన్ని బంగారునాణేలనూ తీసుకెళ్ళి బాబా గుడిలో ఉన్న హుండీలో వేశాను.
మూడవ అనుభవం:
బాబాతో నా అనుబంధాన్ని మొదట నేను గుర్తించలేదు. అయితే ఒకరోజు నన్ను పారాయణ చేయమని మా ప్రక్కింటి ఆంటీ శ్రీసాయిసచ్చరిత్ర పుస్తకం ఇచ్చింది. సరేనని సచ్చరిత్ర పారాయణ ప్రారంభించాను. మధ్యలో ఒకరోజు ఆంటీ నన్ను, ‘సచ్చరిత్ర చదువుతున్నావా?' అని అడిగింది. ‘చదువుతున్నాన’ని చెప్పాను. ఆవిడ, “రెండు రూపాయల దక్షిణ లీల చదివావా?” అని అడిగింది. చదివానని చెప్పాను. అప్పుడు ఆవిడ, “అది చదివినప్పుడు బాబా నాకు కలలో రెండు రూపాయలు ఇచ్చారు. అప్పటినుండి నేను రెండు రూపాయలు పూజలో పెట్టుకుని ప్రతిరోజూ పూజించుకుంటున్నాన”ని చెప్పింది. అదేరోజు నేను, మా చిన్నబ్బాయి హాస్పిటల్ కి వెళ్ళేటప్పుడు బాబా గుడికి వెళ్ళి బాబాకు నమస్కరించుకున్నాము. నేను బాబాను, “బాబా! మీరు నాకెందుకు రెండు రూపాయలు ఇవ్వలేదు? నేను సరిగా పారాయణ చేయట్లేదా?” అని ఆర్తిగా అడిగాను. మా అబ్బాయి దేవుడ్ని నమ్మడు. మేమిద్దరం బస్టాప్ కి వెళ్ళాము. అంతలో నా మనసు చెప్తోంది, ‘అక్కడ రెండు రూపాయలు ఉన్నాయ’ని. నేను మా బాబుతో, “అక్కడ మట్టి తీయి, రెండు రూపాయలు ఉంటాయ”ని చెప్పాను. మా బాబు అక్కడి మట్టిని తీశాడు. అక్కడ రెండు రూపాయల నాణెం ఉంది. ఆ నాణేన్ని తీసి నాకు ఇచ్చాడు. నేను ఆ నాణేన్ని జాగ్రత్తగా ఉంచమని మా అబ్బాయి జేబులో వేసి ఉంచాను. దానిని బాబా ప్రసాదంగా భావించి ఇంటికి వచ్చిన తర్వాత బాబా పూజలో పెట్టి రోజూ పూజ చేస్తున్నాను.
నాలుగవ అనుభవం:
నేను మా ఇంటి దగ్గరున్న బాబా గుడికి ప్రతిరోజూ వెళ్తుంటాను. బాబా నా చేత ప్రతిరోజూ సేవ చేయించుకుంటున్నారు. నాతో పాటు మరో ముగ్గురు కూడా బాబా సేవకు వచ్చేవాళ్ళు. ఒకరోజు వాళ్ళు నాతో, “బాబా మాకు తరచూ కలలో కనిపించి మాట్లాడుతుంటార”ని చెప్పారు. బాబా నాకు కూడా కలలో కనిపించినప్పటికీ, కూర్చుని నన్ను చూస్తారే తప్ప నాతో ఎన్నడూ కలలో మాట్లాడలేదు. దాంతో నాకు చాలా బాధగా అనిపించి బాబాను చూస్తూ, “బాబా! మీరు నాతో ఎందుకు మాట్లాడట్లేదు? నేనేం పాపం చేశాను?” అని అడుగుతూ గుడిలోనే ఏడ్చేశాను. అదేరోజు రాత్రి 3 గంటలకు మా చిన్నబాబుకి కలలో బాబా కనిపించి, “అభిలాష్! మీ మమ్మీకి నేను మాట్లాడానని నా మాటగా చెప్పు!” అని చెప్పారట. వాడు వెంటనే లేచి, “మమ్మీ, మమ్మీ, బాబా నాకు కలలో కనిపించారు. తాను మాట్లాడినట్లు నీతో చెప్పమన్నారు” అని నాతో చెప్పాడు. మా బాబు ఆ విషయం చెప్పగానే నేను వాడితో, “చూశావా? నేను ఈరోజు ప్రొద్దున గుడిలో బాబా నాతో మాట్లాడటం లేదని ఏడ్చాను. బాబా నీకు కనిపించి నీతో మాట్లాడారు” అన్నాను. ఆరోజు నుంచి మా బాబు బాబా భక్తుడయ్యాడు.
ఐదవ అనుభవం:
బాబా మమ్మల్ని ఇప్పటివరకు సర్వకాల సర్వావస్థలయందు కాపాడుకుంటూ వస్తున్నారు. 2020, ఆగస్టు నెలలో జరిగిన ఒక అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను. మా ఇంటి ప్రక్కన ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు. వాళ్ళ టాయ్ లెట్, మా టాయ్ లెట్ ప్రక్కప్రక్కనే ఉంటాయి. మా టాయ్ లెట్ కి వెళ్ళటానికి మేము వాళ్ళ ఇంటిముందు నించే వెళ్ళాలి. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ విషయం వాళ్ళు మాకు చెప్పలేదు. కానీ తెలిసాక మాకు చాలా భయమేసింది. అయినప్పటికీ మాకు తోడుగా బాబా ఉన్నారనే ధైర్యంతో ఉన్నాము. బాబా మనల్ని ఎప్పుడూ కనిపెట్టుకొనే ఉంటారు. రానున్న కష్టాన్ని ముందుగానే పసిగట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటారు. కరోనా పాజిటివ్ రావటానికి 15 రోజుల ముందు నుండి మా పక్కింటి వాళ్ళు ఎందుకోగాని మాతో మాట్లాడటం మానేశారు. ఒకవేళ వాళ్ళు మాతో మాట్లాడుతూ ఉండుంటే గనక ప్రతిరోజూ ఆయన ఫోన్ గురించి తెలుసుకోవడానికి మా అబ్బాయి దగ్గరకు వచ్చేవారు. అలా వచ్చినప్పుడు ఆయన మా అబ్బాయితో చాలా సన్నిహితంగా ఉండి ఫోన్ గురించి అన్నీ అడుగుతుండేవారు. అసలే కరోనా రోజులు. అయినప్పటికీ ఆయన ఎప్పుడూ మాస్క్ పెట్టుకోకుండానే మాట్లాడుతుండేవారు. ముందుజాగ్రత్తగా మాస్క్ పెట్టుకుని మాట్లాడమని ఎన్నోసార్లు ఆయనకు చెప్పాలనిపించేది కానీ, మొహమాటంతో చెప్పలేకపోయేదాన్ని. ఆయనకి కరోనా వచ్చే 15 రోజుల ముందు నుంచి మా దగ్గరకు రావడం మానేశారు. బాబా దయవల్ల మాకు చాలా మేలు జరిగింది. అందుకే మనం చేసే ప్రతి చర్యా బాబా ఆజ్ఞతోనే జరుగుతుందని మేము అనుకుంటాము. బాబా మాకు ఏది మంచో అదే చేస్తారు. అంటే, ఏ కారణం లేకుండా ఎదుటివాళ్ళు మాతో మాట్లాడకపోవటం వలన కూడా మాకు మంచే జరిగింది. మేమంతా బాబా మీదనే భారం వేశాము. మాకు తల్లి, తండ్రి, గురువు, దైవము, తోడు, నీడ, సర్వం సాయియే.
ఆరవ అనుభవం:
ఇది జరిగిన 5 రోజుల తరువాత మా ఊరిలో ఒక వారం రోజుల పాటు ప్రతిరోజూ వర్షం పడింది. ఆ వర్షానికి మా ఇంటి గోడలు మొత్తం తడిసిపోయి గోడలన్నీ తేమగా అయ్యాయి. మా ఇంట్లో మాత్రమే అలా జరిగిందేమో అనుకున్నాము. కానీ, మా పొరుగింటివాళ్ళు కూడా వాళ్ళింటి గోడలు కూడా వర్షాలకు తడిసి తేమగా అయ్యాయనీ, ఆ ప్రభావం వల్ల వాళ్ళింట్లో కరెంట్ ఫ్యూజు ఎగిరిపోయిందనీ, ఎన్నిసార్లు కరెంట్ ఫ్యూజ్ పెట్టినా ఉండట్లేదనీ, గోడలు ముట్టుకుంటే షాక్ కొడుతోందనీ చెప్పారు. నేను ప్రతిరోజూ బాబా నామం జపిస్తూనే ఉంటాను. బాబా మాకు ఏ సమస్యా రాకుండా కాపాడారు. ఎల్లప్పుడూ ఇలాగే మమ్మల్ని కాపాడుతూ ఉండాలని బాబాను మనసారా వేడుకుంటున్నాను. సాయిరాం, సాయిరాం, సాయిరాం. బాబా గురించి ఎంత చెప్పినా తనివితీరదు. ఆనందమే ఆనందం. నేను బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత బాబా చెప్పిన పలుకులను మననం చేసుకుంటూ ఉండటం వలన నాకు కష్టాలు వచ్చినా నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటున్నాను. బాబా నాకు శక్తిని, మనశ్శాంతిని, ధైర్యాన్ని ఇచ్చారు.
సాయిభక్తి సాధన రహస్యం - ధ్యానానికి ఏ ఆసనం మంచిది? అసూయను జయించడం – అంత సులువా?
సాయిభక్తుల అనుభవమాలిక 572వ భాగం...
- తల్లిలా బాధనుండి విముక్తి కలిగించి విశ్వాసాన్ని ప్రసాదించిన బాబా
- సాయికృపతో నార్మల్‌గా వచ్చిన రిపోర్ట్స్
- బాబా కృపతో కోలుకున్న నాన్న
తల్లిలా బాధనుండి విముక్తి కలిగించి విశ్వాసాన్ని ప్రసాదించిన బాబా
కాకినాడ నుండి సాయిభక్తురాలు విజయ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
ఓం శ్రీ శిరిడీ సాయినాథాయ నమః.
ఈ బ్లాగ్ నిర్వాహకులకు, సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు విజయ. మాది కాకినాడ. సాయిభక్తులు తమ అనుభవాలను పంచుకునే ఇలాంటి బ్లాగ్ ఒకటుందని నాకు ఈమధ్యనే మా చెల్లి ద్వారా తెలిసింది. “‘ఈ బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను’ అని బాబాకు చెప్పుకుంటే మన సమస్య తీరుతుంది” అని తనే నాకు చెప్పింది. అప్పటినుంచి ఈ బ్లాగును చదవడం మొదలుపెట్టాను. చదివినకొద్దీ చదవాలనే ఆరాటం ఇంకా ఇంకా ఎక్కువైంది. “అయినా బ్లాగులో పంచుకుంటే సమస్య ఎలా తీరుతుంది? బాబాకు ఇలాంటివేమీ అక్కర్లేదు. ఆయన పరమ వైరాగ్యమూర్తి” అని అనిపించింది. మళ్ళీ అంతలోనే, “ఇంతమందికి ఇన్ని అనుభవాలు జరుగుతున్నాయి కదా, అది నిజమేనేమో!” అనిపించింది. కానీ స్వానుభవం ఉంటేనే కదా మనకి పూర్తి విశ్వాసం కలిగేది! నాకూ అలాంటి అనుభవమే కలిగింది. అదే మీతో పంచుకోబోతున్నాను.
నా వయస్సు 53 సంవత్సరాలు. 20 సంవత్సరాల క్రితం నాకు ఫిస్టులా ఆపరేషన్ జరిగింది. ఇప్పటివరకు నాకు దానివల్ల ఎటువంటి నొప్పీ కలగలేదు. కానీ ఈమధ్యన మళ్లీ నొప్పి మొదలైంది. రోజురోజుకీ నొప్పి తీవ్రమై బాధ భరించలేకపోయాను. దానివల్ల నేను కూర్చోలేను, వేడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంటర్నెట్లో చూసి, ఇది మళ్లీ తిరగబెడుతుందని, కొంతమందికి రెండు లేదా మూడుసార్లు ఆపరేషన్ జరిగిందని తెలుసుకున్నాను. దాంతో నాకు చాలా భయం వేసింది. అసలే కరోనాతో లాక్డౌన్ అమలులో ఉన్న సమయం. ఇలాంటి పరిస్థితిలో ఆసుపత్రికి వెళ్లడం, డాక్టరుకి చూపించుకోవడం, ఆపరేషన్ చేయించుకోవడం చాలా కష్టం. అప్పుడే మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. బాబాకు నమస్కరించుకుని, “బాబా! ఆసుపత్రికి వెళ్లకుండా, ఆపరేషన్ అవసరం లేకుండా మీ అనుగ్రహంతో నాకు ఈ నొప్పి తగ్గిపోవాలి. అలా నా నొప్పి తగ్గిపోతే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని అనుకున్నాను. తరువాత ఫేస్బుక్లో చూస్తే 'సాయి వచనాలు'లో, “నా చరిత్ర పఠనం చేస్తూ ఊదీ రాస్తూ ఉండు, నీకు నయమగును” అనే బాబా సందేశం కనిపించింది. బాబా సూచించినట్లే చేశాను. ఇంకా కొన్ని ఇంటి చిట్కాలు పాటించాను. బాబా అనుగ్రహంతో ప్రస్తుతం చాలావరకూ నొప్పి తగ్గిపోయింది. ఇంకా లోపల కొద్దిగా ఏమైనా ఉందేమో తెలీదు. ఆ సాయినాథుని దయవలన 100% పూర్తిగా తగ్గిపోతుంది. బాబా తమ కటాక్షాన్ని నాపై పూర్తిగా చూపించారు. కానీ ఆయన ఆ మహిమను తనపై వేసుకోరు. మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ కూడా తన ఉనికిని మనకు తెలియనివ్వరు. మనమే ఆయన అనుగ్రహాన్ని అనుభూతి చెందవలసి ఉంటుంది. మనం ఆయనపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని అంతగా పెంచుకోవాలి. “సాయీ! మీరు తల్లిలా నన్ను కాపాడి ఇంతటి బాధనుండి విముక్తి కలిగించారు. చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు బాబా!” నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకున్నందుకు, మీ (సాయి) కుటుంబంలో ఒకదాన్ని అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.
సాయిభక్తుల అనుభవమాలిక 571వ భాగం.....
- ఆటంకాలు లేకుండా నవగురువార వ్రతం పూర్తైయ్యేలా అనుగ్రహించిన బాబా
- తలచిన వెంటనే పోయిన ఉంగరాన్ని కనిపించేలా చేసిన బాబా
సాయిభక్తి సాధన రహస్యం - మనోనిగ్రహానికి మరికొన్ని మార్గాలు!
సాయిభక్తుల అనుభవమాలిక 570వ భాగం.....
అసాధ్యమనుకున్నది సాధ్యం చేసి చూపించిన బాబా
నేను ఒక సాయి భక్తురాలిని. నా మనసులో వచ్చే ఎన్నో ప్రశ్నలకు బాబా ఈ బ్లాగులో నిత్యం నాకు సమాధానాలు ఇస్తూ ఉన్నారు. నేను బెంగళూరులో ఒక కార్పొరేట్ స్కూల్లో ఉద్యోగం చేస్తున్నాను. కరోనా కాలంలో మా స్వస్థలానికి వెళ్లి ఇంటి నుంచే పని చేస్తుండేదాన్ని. కొన్నిరోజులకు నాకు బెంగళూరు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మా స్కూలువాళ్ళు మీటింగ్ పెట్టి, నన్ను ఖచ్చితంగా బెంగళూరు బ్రాంచికి రావాలని చెప్పారు. కానీ బెంగళూరులో కరోనా కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా, కరోనాకి భయపడి మా ఇంట్లోవాళ్ళు నన్ను 6 నెలలపాటు ఇంటి గేటు కూడా దాటనివ్వలేదు. మేమందరం అంత స్ట్రిక్ట్‌గా, జాగ్రత్తగా ఇంట్లోనే ఉన్నాము. అందువలన, ‘మావాళ్లు నన్ను ఇంటి గేట్ కూడా దాటినివ్వరు, ఇంక బెంగళూరుకి పంపడం అసాధ్యం’ అనుకున్నాను. ‘సరే, బాబా ఏం చెబితే అదే చేద్దాం’ అనుకుని, బాబాను ప్రార్థించి, “బెంగళూరు వెళ్ళనా, వద్దా’ అని బాబా ముందు చీటీలు వేశాను. బాబా నన్ను బెంగుళూరుకి వెళ్ళమన్నారు. బాబా సమాధానం చూసి, “నాకేమీ అర్థం కావట్లేదు బాబా! ఈ పరిస్థితుల్లో ఇంట్లోవారిని ఒప్పించి సాహసించి బెంగుళూరుకి వెళ్లడం నావల్ల కాదు. కానీ మీరెందుకు ఇలా చెబుతున్నారు?” అని బాబాను అడిగాను. ఇంట్లోవారికి నా ప్రయాణం గురించి చెప్పే ధైర్యం లేక ఆరోజంతా బాధపడుతూ గడిపి చివరికి ధైర్యం చేసి మా తాతయ్యతో, “నేను బెంగళూరుకి వెళ్లాలనుకుంటున్నాను” అన్నాను. మా తాతయ్య ఒకే మాట – “రిజైన్ చెయ్యి!” అన్నారు. నాకు ఏడుపు వచ్చేసింది. ఏడుస్తూ బాబా దగ్గరకు వెళ్ళి, “బాబా! మీరేమో వెళ్లమంటారు, వీళ్లేమో వద్దంటారు, నేనేం చేయాలి? ఎందుకు మళ్ళీ నాకు ఇంకో పరీక్ష పెడుతున్నారు?” అని బాధపడ్డాను. తరువాత ధైర్యం చేసి ఇంకోసారి బాబా ముందు చీటీలు వేశాను. కానీ బాబాది ఒకే మాట – “బెంగళూరుకి వెళ్లు!” అని. ఇంక నేను బాబా చెప్పినట్టు చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. “నువ్వు చెప్పింది నేను చేస్తాను బాబా! కాదు, నువ్వే చేయించాలి. నేను నీ మాటే వింటాను” అని మనసులో అనుకుని మా తాతయ్యతో మళ్ళీ చెప్పాను. ఆయన, “నీ ఇష్టం, ఏమైనా చేసుకో, నన్ను అడగకు” అన్నారు. దాంతో నాకు విపరీతమైన తలనొప్పి వచ్చింది. మూడురోజులైనా తలనొప్పి తగ్గలేదు. ఒకప్రక్క బాబా, ఇంకొకప్రక్క ఇంట్లోవాళ్లు. కానీ, ‘నా బాబా నిర్ణయమే నా నిర్ణయం’ అనుకున్నాను. చివరికి మా తాతయ్య నా పరిస్థితి చూసి నేను బెంగళూరుకి వెళ్లడానికి ఒప్పుకున్నారు. నా తండ్రి బాబా నా విశ్వాసాన్ని గెలిపించారు. నేను ఎప్పుడు ఏ సందేహం వచ్చినా చీటీల ద్వారానే బాబా అనుమతి పొందుతాను. దాన్ని కూడా నిజమని నిరూపించారు, అసాధ్యమనుకున్నది సుసాధ్యం చేసి చూపారు నా సాయి. “బాబా! మీకు ఏమి ఇచ్చినా, ఎంత చేసినా మీ ఋణం తీర్చుకోలేను తండ్రీ! ఎప్పుడూ మీ పాదధూళి క్రింద నాకు చోటివ్వండి. ఈ జన్మకి నాకు అంతే చాలు బాబా!”.
నేను ఒక కార్పొరేట్ స్కూల్లో ఉద్యోగం చేస్తున్నానని చెప్పాను కదా! అక్కడ పని చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, నేను ఉద్యోగం చేసే చోటు మా ఇంటికి చాలా దూరంలో ఉంటుంది. కాబట్టి మా ఇంట్లోవారికి నేను అక్కడ ఉద్యోగం చేయడం సుతరామూ ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడు చూసినా ‘అక్కడ ఉద్యోగానికి రాజీనామా చేయి’ అని అంటూ ఉంటారు. ఎందుకంటే అంత కష్టంగా ఉంటుంది అక్కడి పని. కానీ నాకు మాత్రం ఆ ఉద్యోగ వాతావరణం బాగా అలవాటయిపోవటం వల్ల వాళ్లకు నచ్చజెబుతూ ఉద్యోగం కొనసాగించేదాన్ని. కానీ ఒకరోజు మా ఇంట్లోవాళ్ళు నాతో ఖరాఖండీగా, “వచ్చే సంవత్సరం నుండి నువ్వు అక్కడ ఉద్యోగం చేయడానికి వీల్లేదు. ఇంటికి దగ్గరగా ఏదైనా ఉద్యోగం చూసుకో, లేదంటే ఇంట్లో ఉండాల్సిందే” అన్నారు. కానీ, నా మనసుకు మాత్రం ఆ ఉద్యోగాన్ని వదులుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఇంక చేసేది లేక బాబా ముందు చీటీలు వేశాను. ఇంటి దగ్గరగా వున్న బ్రాంచికి బదిలీ చేయించుకోమని బాబా సమాధామనిచ్చారు. కానీ ఆ బ్రాంచిలో ఆదివారాలలో, పండుగల సమయంలో కూడా సెలవులు ఉండవు. పైగా పని ఒత్తిడి చాలా ఎక్కువగా కూడా ఉంటుంది. కానీ చేసేది లేక ఇంట్లోవారి మాట కోసం అయిష్టంగానే బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నాను. నేను అప్పటివరకు పనిచేస్తున్న బ్రాంచివాళ్ళు నాకు కాల్ చేసి, “ఇక్కడే ఉండండి, ఆ బ్రాంచి బాగలేదు, మీకు ఇంకా కష్టం అవుతుంది” అన్నారు. నేను, “లేదు, నేను ఉండలేను” అని చెప్పాను. ఆ బ్రాంచి నుంచి నా స్నేహితురాలు కాల్ చేసి, “ప్లీజ్! మీరు ఇక్కడే ఉండండి. మీరు లేకుండా ఇక్కడ నాకు ఏం బాగోదు” అని బ్రతిమాలింది. “మా ఇంట్లోవాళ్ళు నూరుశాతం పంపించరు, నేను ఏమీ చెయ్యలేను. నేను అక్కడికి రావాలని అంతగా నీకు ఉంటే బాబాను వేడుకో!” అని చెప్పాను.
ఇక మరుసటిరోజు బదిలీ విషయం తెలుస్తుందనగా నేను బాబా ముందు చీటీలు వేశాను. బాబా నన్ను అంతకుముందు పనిచేసిన బ్రాంచిలోనే ఉద్యోగం చేయమన్నారు. అంతే! నా ఆనందానికి అవధులు లేవు. కానీ అంతలోనే, “బాబా! నువ్వు అనుమతి ఇచ్చావు. కానీ ఇంట్లోవారు నన్ను అక్కడికి అస్సలు పంపరు” అని బాబా ముందు ఏడ్చాను. ఏదైతే అదవుతుందని బాబా మీద ఉన్న నమ్మకంతో బదిలీని రద్దు చేయించుకున్నాను. తరువాత నా నిర్ణయాన్ని ఇంట్లోవారికి చెప్పాను. దానికి వాళ్ళు, “సరే అయితే, నువ్వు ఇంట్లోనే వుండు, నువ్వక్కడ ఉద్యోగం చెయ్యడం అస్సలు కుదరదు” అన్నారు. నేను బాబా ఇచ్చిన సందేశంపై నమ్మకంతో “నేను అక్కడే ఉద్యోగం చేస్తాన’ని చెప్పాను. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ తరువాత ఒక అంకుల్ మా తాతయ్యకు కాల్ చేసి, నేను వర్క్ చేస్తున్న బ్రాంచి చాలా బాగుందని చెప్పి, “ఎందుకు మీరు అమ్మాయిని అక్కడ ఉద్యోగం చేయొద్దంటున్నారు? అలా చెయ్యకండి” అని చెప్పి మా తాతయ్యను ఒప్పించారు. నాకైతే బాబానే ఆయన రూపంలో వచ్చి మా ఇంట్లోవారిని ఒప్పించినట్టు అనిపించింది. దాంతో నాకు పాత బ్రాంచిలోనే ఉద్యోగం చేయడానికి ఇంట్లోవారి నుండి అనుమతి వచ్చింది. అసాధ్యమనుకున్నది సాధ్యం చేసి చూపించారు నా బాబా. నా స్నేహితురాలు కూడా, “నిజమే! నీ బాబా చాలా గ్రేట్!” అని చాలా ఆనందించింది.
బాబా ప్రణాళికలను అర్థం చేసుకోవడానికి మనకు చాలా సమయం పడుతుంది. కానీ, ఆయన ప్రణాళికలు మాత్రం చాలా పక్కాగా ఉంటాయి. చివరివరకు ఆయన ప్రణాళిక మన గమ్యానికి చాలా వ్యతిరేకంగా ఉంటుంది, కానీ చివరకు ఆయన మనలను మన గమ్యానికి సురక్షితంగా చేరుస్తారు.
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సాయిభక్తుల అనుభవమాలిక 569వ భాగం.....
- సకల వ్యాధులను నయం చేసే బాబా ఊదీ
- బాబా నెరవేర్చిన కోరికలు
సకల వ్యాధులను నయం చేసే బాబా ఊదీ
సాయిభక్తులందరికీ నమస్కారం. ఈ బ్లాగుని నిర్వహిస్తున్న సాయి అన్నయ్యకు నా కృతజ్ఞతలు. బాబా మనందరికీ మాట ఇచ్చినట్టు, ఆయన ఊదీ సకల వ్యాధులను నయం చేస్తుంది. మనకు బాబాపై నమ్మకం ఉండాలి, అంతే. నేను ఎల్లప్పుడూ బాబా ఊదీని నాతో ఉంచుకుంటాను. నాకు ఏ కొంచెం బాధకలిగినా, ఏదైనా నొప్పి కలిగినా ఊదీని రాసుకుంటాను. ఈమధ్యకాలంలో ఊదీ మహిమతో నాకు కలిగిన అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను.
నాకు ఈ నెలలో (సెప్టెంబరు) ఉన్నట్టుండి కీళ్ళనొప్పులు వచ్చాయి. రాత్రి సమయంలో ఆ నొప్పులు నన్ను చాలా ఇబ్బందిపెట్టాయి. కొన్ని కారణాల వల్ల నేను ఆసుపత్రికి వెళ్లలేకపోయాను. బాబాపై నమ్మకం ఉంచి, బాబాను ప్రార్థించి, నాకు నొప్పి ఉన్నచోట ఊదీ రాయటం మొదలుపెట్టాను. ప్రతిరోజూ అలా చేస్తూ వస్తుంటే ఊదీ మహిమతో మెల్లగా నా కీళ్ళనొప్పులు తగ్గుతూ వచ్చాయి. ఇప్పటికి 80 శాతం నొప్పులు తగ్గిపోయాయి. ఇంకా అప్పుడప్పుడు చాలా కొద్దిగా నొప్పులు వస్తున్నా అవి కూడా బాబా ఊదీ మహిమతో తగ్గిపోతాయి.
అలానే ఒకరోజు నాకు విపరీతమైన తలనొప్పి వచ్చింది. అది కూడా తలలో ఒకవైపు నొప్పి. ఆ నొప్పికి కడుపులో వికారంగా కూడా ఉంది. నాకు ఏం చేయాలో తెలియలేదు. వెంటనే బాబా ఊదీని నొప్పి ఉన్నచోట రాసుకుని, “బాబా! త్వరగా ఈ తలనొప్పి తగ్గితే బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను” అని బాబాకు మ్రొక్కుకున్నాను. ఆశ్చర్యంగా పదినిమిషాల్లో నా తలనొప్పి తగ్గిపోయింది. సాధారణంగా అలాంటి తలనొప్పి వస్తే కనీసం గంటసేపు ఉండేది, కానీ బాబా ఊదీ మహిమతో కేవలం పదినిమిషాల్లోనే తగ్గిపోయింది. “థాంక్యూ సో మచ్ బాబా! నాకు మానసికమైన బలాన్ని ఇవ్వు బాబా. సదా నీ బిడ్డలందరికీ తోడుగా ఉండు. మేము చేసిన తప్పులన్నీ తల్లిలా కాచి మమ్మల్ని కాపాడు బాబా!”
బాబా నెరవేర్చిన కోరికలు
విజయవాడ నుండి సాయిభక్తురాలు శ్రీమతి నర్మద తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
సద్గురు సాయినాథుని దివ్య చరణకమలాలకు నా నమస్కారాలు. బ్లాగులోని సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగులో సాటి సాయిభక్తుల అనుభవాలు చదివాక, “బాబా! నా కోరిక తీరితే నేను కూడా ఈ బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను” అని బాబాకు మ్రొక్కుకున్నాను. ఆ అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను.
మా అమ్మాయికి వివాహమై 3 సంవత్సరాలైనా సంతానం కలగలేదు. నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! మాకు పిల్లలంటే చాలా ఇష్టం. మా అమ్మాయికి పిల్లలు కలిగేలా ఆశీర్వదించండి” అని ఎంతో ఆర్తిగా ప్రార్థించాను. బాబా కరుణించారు. మా అమ్మాయి ఇప్పుడు ఆరవ నెల గర్భవతి. మా అమ్మాయికి సుఖప్రసవమై తను పండంటిబిడ్డకు జన్మనివ్వాలని బాబాను ప్రార్థిస్తున్నాను.
ఇంకొక అనుభవం:
మా అబ్బాయి సాయికుమార్ చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. 2020, మే 17వ తేదీన ఈ కరోనా సమయంలో చెన్నై నుండి విజయవాడకు రైల్లో వచ్చాడు. తనను క్వారంటైన్లో ఉంచి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. “కోవిడ్ పరీక్షల్లో మా అబ్బాయికి నెగిటివ్ వస్తే నవగురువార వ్రతం చేస్తాను బాబా. వాడు త్వరగా ఇంటికి వచ్చేలా అనుగ్రహించండి” అని నేను బాబాను ప్రార్థించాను. బాబా అనుగ్రహంతో మా అబ్బాయికి కోవిడ్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. బాబా తనను నాలుగు రోజుల్లో ఇంటికి పంపారు. ఎంతో ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బాబాకు మ్రొక్కుకున్న ప్రకారం ఎంతో సంతోషంతో నేను నవ గురువార వ్రతం చేసుకున్నాను. ఈ అనుభవాలను సాటి సాయిభక్తులతో పంచుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది.
సాయిభక్తుల అనుభవమాలిక 568వ భాగం....
- మొట్టమొదటి శిరిడీ దర్శనం
సాయిభక్తుల అనుభవమాలిక 567వ భాగం....
- మానసిక, శారీరక ఉపశమనాన్ని ప్రసాదించిన బాబా
- ప్రతి కష్టం నుండి ప్రేమతో ఉపశమనం ప్రసాదిస్తున్న బాబా









