సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 11వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - పదకొండవ భాగం.

బాబా కుదిర్చిన బేరం

శిరిడీ వాస్తవ్యుడైన లక్ష్మణ్‌భట్ వైదీకి బ్రాహ్మణుడు. అతని వద్దనుండి 1910లో నేను(దీక్షిత్) కొంత భూమిని కొన్నాను. ఆ కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలు జరుగుతున్నప్పుడు మొదట లక్ష్మణ్‌భట్ ఆ భూమి ఖరీదు రూ.200/- చెప్పాడు. ఆ భూమి రూ.150/- మించి విలువ చెయ్యదనీ, ఆపైన ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వననీ నేను బేరమాడాను. బేరం తెగలేదు. ఈ బేరసారాలు జరుగుతున్న రోజుల్లోనే, ఒకసారి లక్ష్మణ్‌భట్ మసీదుకు వెళ్ళినపుడు బాబా అతణ్ణి దగ్గరకు పిలిచి, “ఇద్దరూ కలిసి ఒక పరిష్కారానికి రండి. మధ్యేమార్గంగా రూ.175/- తీసుకో! అంతకు తక్కువకు మాత్రం ఒప్పుకోవద్దు!” అన్నారు. అయితే అప్పట్లో లక్ష్మణ్‌భట్ ఈ విషయం ఎవ్వరితోనూ చెప్పలేదు. బేరసారాలు జరిగి జరిగి చివరకు నేనడిగిన రూ.150/- రేటుకే బేరం కుదిరింది. భూమి రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు నేను రిజిస్ట్రార్ ముందే లక్ష్మణ్‌భట్‌కు రూ.150/- చెల్లించాను. కానీ, అదేమి అద్బుతమో, లక్ష్మణ్‌భట్ ఇంటికెళ్ళి మళ్ళీ పైకం లెక్కబెట్టుకొంటే, రూ.175/- ఉన్నది.

అడగ్గానే ఆదుకొనే ఆపద్బాంధవుడు

శ్రీగణపత్ ధోండూ కదమ్ అనే భక్తుడు తనకు కలిగిన ఒక అద్భుతమైన అనుభవాన్ని గురించి నాకు(దీక్షిత్) ఇలా వ్రాశాడు:

“1914లో నేను, నా భార్య కలిసి బాబా దర్శనానికి శిరిడీ బయలుదేరాం. రైలు నాసిక్ లైనులో పోతున్నది. ఇంకో ఒకటి రెండు స్టేషన్లు దాటితేగానీ నాసిక్ రాదు. ఇంతలో ఒక 15, 20 మంది భిల్లులు గుంపుగా నేను కూర్చొని ఉన్న పెట్టెలోకి జొరబడ్డారు. వాళ్ళు కారునలుపు రంగులో చూడ్డానికి భయంకరంగా ఉన్నారు. ఆ పెట్టెలో నేను, నా భార్య, నా కూతురు తప్ప మరింకెవ్వరు ప్రయాణీకులూ లేరు. నేనప్పుడు హరిభక్త పరాయణ శ్రీలక్ష్మణ్ రామచంద్ర పంగార్కర్ రచించిన 'భక్తి మార్గ ప్రదీపిక' అనే పుస్తకం చదువుతూ ఉన్నాను. ఆ భిల్లులు వచ్చి నా ప్రక్కనే కూర్చున్నారు. వాళ్ళు ఆ పుస్తకం వినడానికి వచ్చినట్లుగా భావించుకొని, దాన్లోని కొన్ని అభంగాలను పెద్దగా చదవటం మొదలెట్టాను. ఆ భిల్లులు ఓ ఐదునిమిషాలపాటు నా దగ్గరే కూర్చున్నారు. తరువాత ఉన్నట్టుండి లేచి, రైలు వేగంగా పరుగెడుతుండగానే, రైల్లోంచి దూకేశారు! నేను తలుపు దగ్గరకెళ్ళి  చూస్తే, వారందరూ క్రిందికి దూకి పరుగెత్తిపోతూ కనిపించారు. వెనక్కి తిరిగి చూసేసరికి మా పెట్టెలో ఒక వృద్ధ ఫకీరు కూర్చుని ఉన్నాడు. 'ఆ ఫకీరు మా పెట్టెలోకి ఎట్లా వచ్చాడా?' అని ఆశ్చర్యపోయి నేను చూస్తుండగానే, నా కళ్ళముందే ఆ ఫకీరు అదృశ్యుడయ్యాడు.

హఠాత్తుగా సంభవించిన ఆ అద్భుతానికి నేను సంభ్రమాశ్చర్యాలకు లోనైనాను! కొంతసేపటికిగానీ నేను తేరుకోలేకపోయాను. మర్చిపోలేని విధంగా ఆ సంఘటన నా మనస్సులో హత్తుకుపోయింది. తరువాత మేము శిరిడీ చేరి, బాబా దర్శనం కోసం మసీదు మెట్లమీద కాలు పెట్టామో లేదో, బాబా మమ్మల్ని చూస్తూ, “క్షేమంగా చేరారు కదా?” అని అడిగారు. రైలులో మా పెట్టెలోకి వచ్చిన భిల్లులు మమ్మల్ని దోచుకోడానికే వచ్చారని అర్థమవుతూనే ఉంది. ఆ ఫకీరును చూచి ఎందుకో ఆ భిల్లులు విచిత్రంగా భయపడి పారిపోయారుగానీ, లేకుంటే వాళ్ళు మమ్మల్ని దోపిడీ చేసేవారే. ఆ మొత్తం సంఘటన మనసులో  మెదలి, బాబా భక్తరక్షణాపరతంత్రతకు నా హృదయం భావోద్వేగంతో చలించిపోయింది.”

తరువాయి భాగం రేపు.


సోర్స్ : సాయిపథం - వాల్యూం 1

సాయిభక్తుల అనుభవమాలిక 52వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:

  • పిలిచినంతనే పలికి తన ఉనికిని తెలియజేసిన శ్రీసాయి

సాయిబిడ్డలందరికీ నమస్కారాలు. నా పేరు జ్యోతి. నా నివాసం అనంతపురం జిల్లాలోని తాడిపత్రి. నేను అమెరికా మహాపారాయణ గ్రూపులో సభ్యురాలిని. నాకు ఇంగ్లీష్ సరిగా రాని కారణంగా నాకు కలిగిన అనుభవాలను వారికి ఎలా వివరించాలో తెలియలేదు. 'ఎలా వాటిని తోటి సాయిబంధువులతో పంచుకోవాల'ని నేను ఆరాటపడుతుంటే, బాబా మీ నెంబర్ తెలియజేయడం నాకు చాలా అనందాన్నిచ్చింది. మీ బ్లాగు, గ్రూపుల ద్వారా నా అనుభవాలను అందరితో పంచుకోగలిగే అవకాశాన్ని బాబాయే ఇచ్చారని అనుకుంటున్నాను. నేను నా అనుభవాలను మీకు తెలుపుతాను. అవి మరీ ఎక్కువగా ఉంటే, మీకు కావలసినంతవరకు తీసుకోవాలని నా మనవి. ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు ఆనందంతో బాబాకు నమస్సుమాంజలులు అర్పించుకుంటున్నాను. ముందుగా నేను గత సంవత్సరంలో బాబా నాకిచ్చిన అద్భుతమైన అనుభవాన్ని పంచుకుంటాను.

2018వ సంవత్సరంలో ఒకరోజు నాతో ఊరికే కాసేపు మాట్లాడదామని నాకు తెలిసిన ఒకామె ఫోన్ చేసింది. నేను మాటల మధ్యలో, "శిరిడీ వెళదామా?" అని అడిగాను. వెంటనే ఆమె పట్టరానంత ఆనందంతో, "అంతకన్నానా! నా మొక్కు ఎంత తొందరగా తీర్చుకుంటానా, శిరిడీ వెళ్ళడానికి ఎవరు తోడు దొరుకుతారా? అని చాలారోజులుగా ఎదురుచూస్తున్నాను" అని అంటూ అసలు విషయం ఇలా చెప్పారు: "(2018) జనవరిలో నా భర్త చాలా అనారోగ్యంతో బాధపడ్డారు. హాస్పిటల్లో చేరిస్తే డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉందని, రెండు ఆపరేషన్లు చేయాలని  చెప్పారు. ఆ దిగులుతో నేను, "బాబా! నా భర్తకు నయమైతే, నేను శిరిడీ వచ్చి నిలువుదోపిడీ ఇచ్చుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. నిజంగా బాబా పరమ కృపాళువు, వెంటనే మాపై దయ చూపారు. ఆపరేషన్స్ చెయ్యాలని చెప్పిన డాక్టర్ వెంటనే వచ్చి, "ఆపరేషన్లు అవసరం లేదు, మందులతోనే నయమవుతుంది" అని చెప్పారు. నా ఆశ్చర్యానికి, ఆనందానికి అవధులు లేవు. ప్రమాదకర స్థితిలో ఉన్న నా భర్తని ఆశీర్వదించి, నాకు మాంగల్య భిక్ష పెట్టారు బాబా. ఆయన కరుణకి ఏదీ సాటిరాదు. అప్పటినుండి శిరిడీ వెళ్లేందుకు ఎవరు తోడు దొరుకుతారా అని ఎదురుచూస్తున్నాను".

ఇక మేము ఆలస్యం చేయకుండా వెంటనే తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకుని శిరిడీకి ప్రయాణమయ్యాం. ఆమె తన ఒంటిమీద 10 తులాల వరకు ఉన్న బంగారాన్ని, 70వేల రూపాయలను పసుపుగుడ్డలో కట్టి నా చేతికి ఇచ్చి, భద్రంగా ఉంచమని చెప్పింది. నేను, "దానిని బాబానే కాపాడుకుంటార"ని చెప్పి నా బ్యాగులో పెట్టి ఉంచాను. ప్రయాణంలో, చిన్నప్పటినుండి బాబా నాపై చూపిన ప్రేమ గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి ఆమెతో చెప్తూ ఎంతో సంతోషంగా గడిపాను. మా ఇద్దరికీ ఎప్పుడెప్పుడు శిరిడీ చేరదామా, బాబాను చూద్దామా అని మనసులో ఒకటే ఆరాటం. పుట్టింటికి వెళుతూ ఎప్పుడెప్పుడు తల్లిని చూద్దామా అన్నంత తాపత్రయం. కోపర్గాఁవ్ వచ్చిందనగా నా సంతోషానికింక అవధుల్లేవు. ఆ ఆనందంలో ఒక ఆలోచన - "బాబా! మేము శిరిడీ వస్తున్నాము. మేము మావాళ్ళ ఇంటికి వెళ్తుంటే, వాళ్ళు మాకోసం ఎదురువస్తారు కదా! అలాగే నీవు కూడా మాకోసం రావాలి. నీవు వచ్చావని నాకు తెలియాలి" అని అనుకుంటూ సీటులో పడుకుని బాబానే తలుచుకుంటున్నాను. అప్పుడు సమయం మధ్యాహ్నం 12 గంటలు కావచ్చింది. "కాసేపట్లో శిరిడీ వచ్చేస్తుంది, మరి బాబా ఎలా వస్తారో?" అని మనసులో ఒకటే ఆలోచన. నా ఎదురు సీటులో నాతో వచ్చినామె కూర్చుని ఉంది. నేను మాత్రం బాబా ఆలోచనలలో విహరిస్తున్నాను. మనసునిండా బాబానే. ఇంతలో ఒకాయన నా ఎదురుగా ఉన్న ఆమె దగ్గరకు వచ్చి, ఏదో మాట్లాడుతున్నారు. నేను మాత్రం అదేమీ పట్టించుకోకుండా 'బాబా ఎలా వస్తార'న్న ఆలోచనల్లోనే ఉన్నాను. కాసేపటికి ఆయన ఆమెను హిందీలో ఏమో అడగాలని ప్రయత్నిస్తున్నారు. నేను ఏమిటో చూద్దామని ఆమెను, "ఏమి అడుగుతున్నారు?" అని అడిగాను. ఆయన నావైపు తిరిగి, "నాకు రెండు రూపాయలివ్వు, నేను నీ పేరు మీద శిరిడీలో బాబాకు అందజేస్తాను" అని చెప్పి, తన ఎడమచేయి చాపారు. వెంటనే నేను వేరే ఏ ఆలోచన లేకుండా రెండు రూపాయలు తీసి ఆయన చేతిలో ఉంచాను. ఆమె ఊరికే చూస్తూ ఉంది. నేను పరీక్షగా ఆయనను ఒకసారి చూసాను, కానీ నాకు ఏమీ అనిపించలేదు. మనసులో మాత్రం 'బాబా ఎలా వస్తార'న్న ఆలోచన అలానే కొనసాగుతూ ఉంది. ఆయన ఆ రెండు రూపాయలు తీసుకున్న తరువాత వేరెవరినీ ఏమీ అడగలేదు. మాతోపాటు శిరిడీ వెళ్తున్న చాలామంది ఆడవాళ్లు ఉన్నారు. కానీ ఆయన ఎవరినీ పలకరించలేదు. శిరిడీ స్టేషన్లో ట్రైన్ ఆగగానే, ఆయన దిగి వెళ్ళిపోయారు. తరువాత నాతోపాటు వచ్చినామె, "ఆయన ఖచ్చితంగా బాబానే" అని అనింది. అప్పుడు నేను, "అయ్యో! బాబా వచ్చినా, ఎదురుగా కూర్చుని ఉన్నా, ఆయన ఆలోచనలోనే ఉన్నా ఆయన్ను కనుక్కోలేక పోయానే" అని బాధపడి, బాబా రావాలనుకున్న విషయాన్ని ఆమెతో చెప్పాను. తరువాత ఆయన రూపాన్ని గుర్తుతెచ్చుకుంటే, నిజంగా ఆయన బాబానే అని అర్థమైంది. ఆయన తెలుపు రంగు ప్యాంటు, షర్ట్ వేసుకుని ఉన్నారు. పైన షర్ట్ కాస్త మాసినట్లు ఉన్నా, లోపల కొత్త షర్ట్ ఉంది. చేతిలో ఉన్న పెద్ద కవరులో బొరుగులు(పేలాలు, మరమరాలు) ఉన్నాయి. ఆయన మోము మంచి పసుపు రంగు ఛాయలో చాలా నీట్ గా, ఎంతో కళగా ఉంది. ఆయన ఖచ్చితంగా బాబానే! వేరే ఎవరైనా అడుక్కునే వాడైతే అందరినీ అడగాలి, అలా చేయలేదు. పైగా కేవలం 2 రూపాయలు అడిగారు. అది కూడా నా పేరుమీద శిరిడీలో బాబాకు అందజేస్తానని చెప్పారు. ఆయన ధరించిన బట్టలు పూర్తి పాతవీ కాదు, అలాగని కొత్తవీ కాదు. బొరుగులు అమ్ముకునే వాడైతే తన దగ్గర అమ్ముకోవడానికి కావలసిన వస్తువులు ఉండాలి. అమ్ముకునేవాళ్ళు, అడుక్కునేవాళ్ళు అలా ఉండరు, ఆయన తేజస్సే వేరు. క్రింద ఇచ్చిన ఫోటోలోని బాబాకు తలపాగా తీసివేస్తే ఎలా ఉంటారో అలాగే ఉన్నారాయన. అలా ఖచ్చితంగా బాబానే వచ్చారు. తన బిడ్డలను ఎంతో ఆప్యాయంగా పలకరించి తాను వచ్చినట్టు తెలియజేయడానికి దక్షిణ అడిగారు. నామీద బాబాకు ఎంత ప్రేమ! పిలిచిన వెంటనే పలికి తన ఉనికిని మాకు తెలియజేసారు. ఆ సంతోషాన్ని దేనితోనూ పోల్చలేం. కోట్ల రూపాయల కన్నా విలువైనది. "శరణం సాయి. ఎంతని పొగడగలం మీ ప్రేమను, కృపను?!"

ట్రైన్ దిగాక ఆయన కోసం ఎంత వెతికామో! కానీ ఆ సర్వాంతర్యామి ఎక్కడా కనపడలేదు. బాబా శిరిడీలో మాకు చాలా అద్భుతాలు చూపించి, ఆశీర్వాదాలిచ్చి పంపారు. ఆమె మొక్కుకున్న నిలువుదోపిడీ నా చేతుల మీదుగా హుండీలో వేయించుకుని, అక్కడే ఆయన ముందు కూర్చుని ప్రార్థించుకునే అవకాశాన్ని కల్పించారు. దర్శనమిమ్మని అడిగిన వెంటనే తాను ఉన్నానని నిరూపించి, తన బిడ్డలయందు తన ప్రేమను చాటుకున్నారు. ఇంతకన్నా ఏం కావాలి, మనం ప్రేమతో పిలిస్తే తల్లి కన్నా ఎక్కువగా బాబా పలుకుతారని చెప్పడానికి! చిన్నప్పటినుండి బాబా నాపై కురిపించిన ప్రేమమయమైన ఆశీర్వాదాలను మీతో పంచుకోగలిగే అదృష్టాన్ని బాబానే ఇచ్చారు. నన్ను ఆదరిస్తున్న సాయి సన్నిధికి ధన్యవాదాలు.

సాయి అనుగ్రహసుమాలు - 10వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - పదవ భాగం.

ఇంకా రాలేదా?

నేను శిరిడీలో ఉండగా బొంబాయి నుండి నాకో ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరములో నా సోదరుడు బాలూకాకాకి, నానాసాహెబ్ కరంబేల్కర్ భార్యకు చాలా ప్రమాదకరంగా జబ్బు చేసిందని తెలిపారు. ఆ విషయం నేను బాబాకు నివేదించాను. బాలూకాకా గురించి అడిగితే, “అతడికి బాగవుతుంది” అన్నారు బాబా. శ్రీకరంబేల్కర్ భార్య గురించి అడిగినపుడు, “ఆమె ఇంకా ఇక్కడకు రాలేదా?” అని అడిగారు. నేను 'లేద'ని జవాబిచ్చి, “రమ్మని కబురు చెయ్యమంటారా?” అని అడిగాను. "అలాగే, కబురు చెయ్యి" అన్నారు బాబా. ఇంతలో, బాలూకాకాకు ఆరోగ్యం చక్కబడ్డదనీ, కానీ కరంబేల్కర్ భార్య మరణించిందనే వార్త తెలిసింది!

బాబా ఒక్కమాటంటే చాలు!

హార్దాలో మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న కృష్ణజీ నారాయణ్ అని పిలువబడే శ్రీచోటూభయ్యాసాహెబ్ పరూల్కర్ 1924, ఫిబ్రవరి 11వ తేదీన నాకిలా ఉత్తరం వ్రాశారు :

"బాబా అనుగ్రహం వల్ల నాకొచ్చిన ఒక జబ్బు నయమయింది. నేను ఆమ్లపిత్తవ్యాధి(biliousacidity)తో బాధపడుతూ ఉండేవాడిని. భోంచేస్తే తిన్నదంతా వాంతి అయిపోయేది. ఎంతమంది డాక్టర్ల దగ్గర, ఆయుర్వేద వైద్యుల దగ్గర మందులు తీసుకున్నా, ఏమాత్రం గుణం కనిపించలేదు. కొంతకాలం తరువాత, నా తండ్రిగారి మిత్రుడైన శ్రీసదాశివ రామచంద్ర పట్వర్ధన్‌గారు నాగపూర్ నుండి ఒక గొప్ప వైద్యుణ్ణి నా వద్దకు పంపి, ఆయన దగ్గర చికిత్స చేయించుకొమ్మని సలహా యిచ్చాడు. ఆ వైద్యుడు చాలా వృద్ధుడు. ఆయన హార్దా వచ్చి మందు తయారుచేశాడు. ముందు మూడు పొట్లాలు మందు ఇచ్చాడు. ప్రొద్దునొక పొట్లాం, మధ్యాహ్నం ఒక పొట్లాం వేసుకొన్నాను. అంతే, మధ్యాహ్నం మూడు గంటలకల్లా నాకు విరోచనాలు మొదలయ్యాయి. రాత్రి 8 గంటలయ్యేసరికి ఎన్ని విరోచనాలయ్యాయో నాకే గుర్తులేదు. ఆ దెబ్బకి ప్రక్కమీద నుంచి లేచే శక్తి కూడా నాకు లేకుండా పోయింది. ఆ పరిణామానికి ఆ వైద్యుడు, మా కుటుంబసభ్యులు విపరీతంగా భయపడిపోయారు. ఆ వైద్యుడు మా పూజాగదిలో కూర్చుని, దైవాన్ని ప్రార్థించి, ఆ తరువాత నా విరోచనాలు ఆగేందుకు ఒక మందిచ్చాడు. రాత్రి 11 గంటలకు కానీ విరోచనాలు తగ్గలేదు. ఆ వైద్యుడు నా తండ్రిగారితో, “ఇకమీదట ఆమ్లపిత్తానికి ఏ మందులూ వాడకండి! అది ఒక సత్పురుషుని కృపవల్లనే బాగవుతుంది” అని అన్నాడు. నేను మందులు వాడటం పూర్తిగా మానేశాను. ఆ తరువాత ఐదారు సంవత్సరాలకి నేను బాబా దర్శనం కోసం శిరిడీ వెళ్ళాను. నేనుగానీ, నాతో వచ్చిన మిత్రుడుగానీ నా జబ్బు గురించి బాబాతో ఏమీ చెప్పలేదు. ఆ మరుసటి సంవత్సరం గురుపూర్ణిమకు నేను మళ్ళీ శిరిడీ వెళ్ళాను. ఆ మరుసటిరోజు నేను, నా సోదరుడు నారాయణరావు, ఇంకా ఒకరిద్దరు ముగ్గురు మిత్రులు కలిసి మసీదులో  బాబా వద్ద కూర్చున్నాము. ఇంతలో 'మౌసీబాయి' అనే ఆమె అక్కడికొచ్చింది. “మౌసీ, ఏం ఇంత ఆలస్యమయింది?" అని బాబా ఆమెనడిగారు. దానికామె, 'తాను పుల్లత్రేపుల('ఓక్లా')తో బాధపడుతున్నందువల్ల సమయానికి రాలేకపోయాన'ని జవాబిచ్చింది. దానికి బాబా నవ్వుతూ "నీవు  బాగా ముక్కా మొయ్యా తింటున్నావు. అందుకే నీకీ బాధ!” అన్నారు హాస్యధోరణిలో. వెంటనే మౌసీబాయి తన జబ్బు నయం చెయ్యమని బాబాను ప్రార్థించింది.  బాబా  కొన్నిక్షణాలు మౌనంగా ఉండి, తరువాత నాకేసి చూపుతూ, “అతడు కూడా చాలాకాలంగా ఇదే వ్యాధితో బాధపడుతున్నాడు!” అన్నారు. అప్పుడు నా సోదరుడు నారాయణరావు బాబాతో, “అవును బాబా, ఇతను చాలాకాలంగా ఆ వ్యాధితో బాధపడుతున్నాడు. ఎన్ని వైద్యాలు చేసినా ఫలితం ఉండటంలేదు" అన్నాడు. దానికి బాబా, “ఇక మీదట అన్ని మందులు ఆపెయ్యమను! ఇకపై అతనికి ఆ బాధ ఉండదు” అన్నారు. ఆ తరువాత ఈరోజుకి ఎనిమిదేళ్ళు గడిచాయి. కానీ, ఆరోజునుండి యీనాటి వరకూ నాకా బాధ ఒక్కసారి కూడా రాలేదు. అంతకుమునుపు సుమారు 10, 12 ఏళ్లు నానా రకాల మందులు వాడాను. కానీ ఫలితం లేకపోయింది. కానీ బాబా అన్న ఒకే ఒక్క మాటతో ఆ జబ్బు పూర్తిగా నయమయింది. ఆ సమర్థ సద్గురుని లీలలు ఎంత అద్భుతాలు!"

తరువాయి భాగం రేపు

సోర్స్ : సాయిపథం - వాల్యూం 1

సాయిభక్తుల అనుభవమాలిక 51వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు: 
  1. దయగల తండ్రి
  2. సాయిబాబా కృపతో పరీక్షలో ఉత్తీర్ణత

దయగల తండ్రి

బాబా దివ్యచరణాలకు నా నమస్కారములు. సాయిబంధువులందరికీ వందనం. నేను ఒక సాయిభక్తురాలిని. మాది బెంగుళూరు. నా జీవితంలో ప్రతిక్షణం బాబా కృపతోనే గడుస్తుంది. "నా జీవితంలో మీరున్నందుకు థాంక్యూ సో మచ్ బాబా!". బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

2018 దసరా సెలవులకు మేము మా ఊరు వెళ్లి బెంగుళూరు తిరుగు ప్రయాణమైనరోజు దసరా సెలవులలోని చివరిరోజు కావడంవలన ఆరోజు ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. ఘాట్ రోడ్డులో ప్రయాణం కావడంతో మావారు క్లచ్ మీద చాలా ప్రెజర్ పెట్టి కారు డ్రైవ్ చేశారు. దాదాపు ఘాట్ రోడ్డు టాప్‌కి చేరుకున్నాక హఠాత్తుగా క్లచ్ పనిచేయకపోవడంతో కారు ఆగిపోయింది. ఎలాగో మేం కష్టపడి ఇతర వాహనాలకి అడ్డుకాకుండా కారుని రోడ్డు పక్కకి తీసి పార్క్ చేశాము. ఇతర వాహనాల డ్రైవర్లు మా కారు క్లచ్ చూసి, "క్లచ్ ప్లేట్లు పూర్తిగా పాడైపోయాయి. కాబట్టి బెంగళూరు వరకు తోసుకుంటూ వెళ్లాల్సిందే" అని చెప్పారు. ఆ మాట వింటూనే నా మతిపోయింది. 300 కిలోమీటర్లు తోసుకుంటూ వెళ్లడమంటే ఎవరి ఊహకు అందని విషయం. అటువంటి పరిస్థితిలో, "బాబా! మీరే దిక్కు. మాకు సహాయం చేయండి" అని ప్రార్థించాను. మావారు కూడా ఏం చేయాలో అర్థంకాక కాసేపు షాక్‌లో ఉండిపోయారు. ఇద్దరం నిల్చుని బాబాను ప్రార్థిస్తుండగా అప్పటికే లంచ్ టైం అయినందున పిల్లలు ఏడవడం మొదలుపెట్టారు. దగ్గరలో ఒక హోటల్ కనిపించడంతో మావారు, "ముందు భోజనాలు చేద్దాం" అని అన్నారు. సరేనని హోటల్‌కి వెళ్లి లంచ్ ఆర్డరిచ్చాం. ఈలోగా మావారు హోటల్ యజమానితో, "తాత్కాలికంగా మాకు సాయం చేయడానికి దగ్గర్లో ఎవరైనా మెకానిక్ ఉన్నారా?" అని ఆరా తీశారు. అతను ఒక మెకానిక్‌కి ఫోన్ చేశారు. ఆ మెకానిక్ వస్తానని చెప్పారు కూడా. అయితే మా దురదృష్టంకొద్దీ హెవీ ట్రాఫిక్ జామ్‌లో అతను ఇరుక్కుపోయాడు. గంట దాటినా అతను రాలేకపోయాడు. ఈలోగా మా భోజనాలు కూడా పూర్తై ఆందోళనపడుతూ బాబాను ప్రార్థిస్తూ ఉన్నాము. తరువాత మావారు కారులో కూర్చుని కారు స్టార్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఆశ్చర్యం! మీరు నమ్మండి! వెంటనే కారు స్టార్ట్ అయింది. పూర్తిగా డ్యామేజ్ అయిపోయినా క్లచ్ ప్లేట్లు సవ్యంగా పనిచేశాయి. బాబానే స్వయంగా డ్రైవ్ చేస్తూ మమ్మల్ని తీసుకొచ్చారో ఏమోగానీ, దాదాపు 300 కిలోమీటర్లు ఏ సమస్యా లేకుండా ప్రయాణించి సురక్షితంగా బెంగుళూరు చేరుకున్నాం. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఆరోజు ఉదయమే నాకు ఒక స్వప్నం వచ్చింది. ఆ కలలో కారు డాష్ బోర్డులో నవ్వుతూ ఉన్న బాబా ఫోటో కనిపించింది. నేను కారు బయట నిల్చొని బాబాను చూస్తూ ఉన్నాను. "బాబా! అది మీరు ఇచ్చిన సూచన అని నాకు ఇప్పుడు అర్థం అవుతోంది. కాకుంటే ఇంకేమిటి? మీకన్నీ తెలుసు బాబా, కేవలం మీ అనుగ్రహం వలన మాత్రమే మేం సురక్షితంగా చేరుకున్నాం. ఇదేవిధంగా పూర్వజన్మ చెడుకర్మఫలాల వలన మా కుటుంబమంతా అనుభవిస్తున్న కష్టాలనుండి కాపాడండి. దయగల తండ్రీ! మా జీవితగమ్యాన్ని సురక్షితంగా చేరుకునేలా అనుగ్రహించండి. మీ దివ్యచరణాలకు శతకోటి ప్రణామాలు బాబా!"

సాయిబాబా కృపతో పరీక్షలో ఉత్తీర్ణత

యు.ఎస్. నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాలను పంచుకున్నారు.

మొదటి అనుభవం:

యు.ఎస్. లోని వీసా సమస్యల వలన నేను కెనడా IELTS పరీక్ష వ్రాయాలని చాలా ఆలోచించి పరీక్షకు స్లాట్ బుక్ చేసుకున్నాను. కెనడా ఇమ్మిగ్రేషన్ పొందాలంటే ఆ పరీక్షలో కనీసం 7.5 స్కోర్ తెచ్చుకోవాలి. అయితే వ్యక్తిగత జీవితంలోని, ఉద్యోగ జీవితంలోని సమస్యల కారణంగా నేను చాలా క్రుంగిపోయాను. ఇదేసమయంలో నా పేరెంట్స్ కూడా మూడు నెలల కోసం యు.ఎస్. వచ్చారు. ఇక వాళ్లతో సమయం గడపాల్సి రావడంతో పరీక్ష కోసం చదవడానికి నాకు సమయం దొరకలేదు. పరీక్షకు రెండువారాలు ఉందనగా నేను చదవడం మొదలుపెట్టాను. దాంతో కావాల్సిన స్కోరు సాధించగలనో, లేదోనని చాలా దిగులుగా అనిపించింది. మరోవైపు నా తోటి స్నేహితులందరికీ మంచి స్కోర్ వస్తే, నేను సంపాదించలేకపోతానేమోనని ఆందోళనపడ్డాను. అయితే, నేనెప్పుడూ ఏ ఇబ్బంది కలిగినా బాబానే నమ్ముకుంటాను. ఈసారి కూడా బాబా చరణాలనే నమ్ముకున్నాను. పరీక్షకు వారం ఉందనగా నావంతు పూర్తి కృషి చేస్తూ ఏడువారాల సాయి దివ్యపూజ మొదలుపెట్టాను. గురుపౌర్ణమినాడు మొదటివారం పూజచేసి మరుసటిరోజు పరీక్ష వ్రాసాను. బాబా కృపవలన పరీక్ష బాగా వ్రాయగలిగాను కానీ, మళ్లీ పరీక్ష వ్రాయాల్సి వస్తుందేమో, దానికోసం $250 ఖర్చుపెట్టాల్సి వస్తుందని ఆందోళనపడి, "బాబా! పరీక్షలో నాకు కావలసిన ఫలితం వస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని ప్రార్థించాను. రెండువారాల తర్వాత నా పరీక్షాఫలితాలు వచ్చాయి. బాబా కృపవలన మంచి స్కోరింగ్ అంటే 9 కి 8 పాయింట్స్ వచ్చాయి. చూస్తూనే సంతోషంతో ఎగిరి గంతేసి, "థాంక్యూ సో మచ్ బాబా! కెనడా పి.ఆర్. ప్రక్రియ అంతా సజావుగా సాగేలా చూడండి" అని ప్రార్థించాను.

రెండవ అనుభవం:

నాకు కాబోయే భర్త తన ఉద్యోగానికి చాలా అవసరమైన సర్టిఫికేషన్ పరీక్ష వ్రాయాల్సి ఉంది. అదేసమయంలో తన సిస్టర్ పెళ్లి యు.ఎస్. లో ఉండటంతో, పెళ్లి పనులన్నీ తానొక్కడే చూసుకోవాల్సి వచ్చింది. దాంతో ఆ సమయంలో తను పరీక్షకు అస్సలు ప్రిపేర్ కాలేకపోయాడు. పెళ్ళైన తర్వాత పరీక్షకు ప్రిపేరైనా దురదృష్టంకొద్దీ మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. దాంతో తన ఉద్యోగము, వీసా రెండూ అపాయంలో పడ్డాయి. ఎంత త్వరగా వీలైతే, అంత త్వరగా ఆ పరీక్షలో ఉత్తీర్ణుడు కావాలని మళ్ళీ పరీక్షకు స్లాట్ బుక్ చేసుకున్నాడు. తను కూడా బాబాని నమ్ముతాడు. మేమిద్దరము '108 ప్రదక్షిణలు, 5 వారాల సాయి దివ్యపూజ  చేస్తామ'ని బాబాకు మ్రొక్కుకున్నాము. పరీక్షకు వెళ్ళే రోజు నేను తనతో, "బాబాను ప్రార్థించి, ఊదీ పెట్టుకుని పరీక్షకు వెళ్ళమ"ని చెప్పాను. నేను చెప్పినట్లుగానే తను బాబాను ప్రార్థించి, ఆయనపై పూర్తి విశ్వాసంతో ఊదీ పెట్టుకుని పరీక్షకు వెళ్ళాడు. పరీక్ష పూర్తవుతూనే తనకు అండగా నిలిచినందుకు బాబాకు కోటి కోటి ప్రణామాలు చెప్పుకున్నాడు. తరువాత నాకు ఫోన్ చేసి, "బాబా దయవలన పరీక్ష బాగా వ్రాసాన"ని చెప్పాడు. "థాంక్యూ సో మచ్ బాబా! లవ్ యూ! మీకు ధన్యవాదాలు చెప్పుకోవడానికి నా దగ్గర ఏ పదాలూ లేవు. నేనెప్పుడు విశ్వాసాన్ని కోల్పోయినా మీరు నా చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. ఎప్పుడూ మా చేతులు గట్టిగా పట్టుకుని మాకు సహాయం చేయండి బాబా!" కొన్ని సందర్భాలలో పరిస్థితులు చాలా కఠినంగా కనిపిస్తాయి కానీ, బాబా కృపతో భవిష్యత్తులో అన్నీ సర్దుకుంటాయి. ఆయన యందు విశ్వాసముంచి సహనంతో ఉండండి.


సాయి అనుగ్రహసుమాలు - 9వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - తొమ్మిదవ భాగం.

మహిమ మందులో లేదు!

ఒకసారి మాధవరావు దేశ్‌పాండే(షామా)కి మొలలు (piles) పెరిగి విపరీతంగా బాధపడ్డాడు. అతడు తన బాధ బాబాతో చెప్పుకుంటే, “మధ్యాహ్నం దానికి మందు ఇస్తాలే” అన్నారు బాబా. ఆ తరువాత సోనాముఖి (senna) ఆకులతో బాబానే ఒక కషాయం తయారుచేసి, త్రాగమని షామాకిచ్చారు. ఆ మందు తీసుకోగానే మొలలు తగ్గిపోయాయి. రెండు సంవత్సరాల తరువాత ఒకసారి షామాకి మళ్ళీ మొలలు పెరిగి బాధపెట్టాయి. అంతకు మునుపు ఇలాగే మొలలతో బాధపడితే, బాబా యిచ్చిన సోనాముఖి మందుతో తగ్గిపోవడం గుర్తుకొచ్చి, యీసారి బాబాకి చెప్పకుండా, తానే ఇంట్లో ఆ మందు తయారుచేసుకొని తీసుకున్నాడు. కానీ, యీసారి ఆ మందు తీసుకోగానే మొలలు తగ్గకపోగా, ఇంకా బాధ ఎక్కువయింది. ఇక బాధ భరించలేక వెళ్ళి బాబాతో చెప్పాడు. బాబా ఆశీర్వదించగానే బాధ మాయమయ్యింది. ఈ సంఘటనవల్ల తెలిసిందేమిటంటే - వ్యాధి తగ్గడానికి కారణం బాబా ఆశీర్వాదమేగానీ, మందు కాదని.

దాసగణు అమృతానుభవం

శ్రీజ్ఞానేశ్వర మహరాజ్ రచించిన 'అమృతానుభవం' చాలా ప్రసిద్ధ వేదాంత గ్రంథం. కానీ, ఆ గ్రంథాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందువల్ల చాలా కొద్దిమందే దానిని చదువుతారు. ఆబాలగోపాలానికి సులభంగా అర్థమయ్యే రీతిలో ఆ గ్రంథానికి 'ఓవీల' రూపంతో “టీక' రచించాలని దాసగణు సంకల్పించాడు. సతారాలో ఉంటున్న ప్రఖ్యాత పండితుడు, సాధువు అయిన దాదా మహరాజు కీ తన సంకల్పం తెలియజేసాడు దాసగణు. 'అమృతానుభవాన్ని' గొప్పగా వివరించగల దిట్టగా దాదా మహరాజ్ విఖ్యాతుడు. దాసగణు కోరికను దాదా మహరాజ్ ఏమాత్రం ప్రోత్సహించలేదు. “టీక(వ్యాఖ్యానం) వ్రాయాలంటే ముందు నీకు మూలం క్షుణ్ణంగా అర్థమై ఉండాలి. నావద్ద కొన్ని మాసాలు ఉండి మూలాన్ని బాగా అధ్యయనం చెయ్యి. ఆ తరువాత వివరణ వ్రాస్తువు గాని!” అన్నాడు దాదా మహరాజ్. దానికి దాసగణు “నేను 'టీక' రచించడం సాయిబాబా సంకల్పమే అయితే దానికి అవసరమైన బుద్ధిని (సామర్థ్యం) బాబానే యిచ్చి, ఆ గ్రంథం నాకు అర్థమయ్యేట్లు ఆయనే చేస్తారు. నేను మాత్రం దానికోసం ఇంకెవర్ని ఆశ్రయించదలుచుకోలేదు” అని జవాబిచ్చాడు. దాసగణు ఉద్దేశ్యం దాదా మహరాజ్ కు రుచించలేదు. అయినా దాసగణు తరఫున బాబాకు ప్రార్థన చేసాడు. ఆ తరువాత దాసగణు వ్యాఖ్యానం వ్రాయడం ఆరంభించాడు. రెండు అధ్యాయాలకు 'టీక' వ్రాయడం పూర్తయింది. ఒకసారి మళ్ళీ దాదా మహరాజ్ దగ్గరి కెళ్ళినపుడు, ఆయన 'టీక' రచన ఏమైందని అడిగారు. దాసగణు తాను వ్రాసిన 'టీక' చదివి వినిపించాడు. అది విన్న దాదా మహరాజ్ ఆ వ్యాఖ్యానాన్ని ఎంతో మెచ్చుకొని, “బాబా నిజంగా సమర్థులు! ఆయన అనుగ్రహం వల్లే నువ్వు ఇంత చక్కటి టీక వ్రాయగలిగావు. నీకు ఇంకెవ్వరి సహాయము అక్కరలేదు” అని అన్నారు.

ఊదీ భీమా - పిల్లల ధీమా!


శ్రీదాజీవామన్ చిదంబర్ స్కూలు హెడ్మాష్టరుగా శిరిడీకి బదిలీ మీద వచ్చారు. ఆయన శిరిడీకి వచ్చిన కొంతకాలం తరువాత ఒకసారి మేం(దీక్షిత్ తదితరులు) కలుసుకొన్నాం. మాటల సందర్భంలో ఆయన నాతో “ఈరోజు వరకు ఉపాధ్యాయుడిగా నాకు కొద్దో గొప్పో మంచి పేరుందండీ! కానీ, ఇక్కడికొచ్చింతరువాత అదికాస్తా చెడిపొయ్యేట్లుంది. ఎందుకంటే, ఇక్కడ పిల్లలెవరూ సరిగ్గా చదవరు. 'ఏమిరా, ఇట్లాగైతే రేపు పరీక్షల్లో ఏం చేస్తారు?' అని అడిగితే, 'మేం బాబా దగ్గర ఊదీ తీసుకొని పెట్టుకొనిపోతే తప్పకుండా పాసవుతాము, సార్!' అని సమాధానమిస్తారు” అంటూ వాపోయాడు. అయిదారు నెలల తరువాత పరీక్షలు జరిగాయి. ఆ తరువాత ఒకసారి ఆ హెడ్మాష్టరు నన్ను(దీక్షిత్) కలిసి, తనంతట తానే, “పరీక్షలు అయిపోయాయండీ! పిల్లలు చెప్పినట్టే బాబా దగ్గర ఊదీ తీసుకొని వెళ్ళి పరీక్షలు వ్రాసారు. పాసయ్యారు! స్కూలుకి మంచి రిజల్టు వచ్చింది” అని.

తరువాయి భాగం రేపు


సోర్స్ : సాయిపథం - వాల్యూం 1

సాయిభక్తుల అనుభవమాలిక 50వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. శ్రీపాండురంగనిగా శ్రీసాయి దర్శనం
  2. ఊదీ మహిమలు

శ్రీపాండురంగనిగా శ్రీసాయి దర్శనం

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు సుమ. మా నివాసం నెల్లూరు.  సాయిమహారాజ్ సన్నిధి బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతుంటే బాబా ఎప్పుడూ నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంతకుముందు సాయిమహారాజ్ సన్నిధి బ్లాగులో 'మా ఆర్థిక సమస్యలు బాబా ఎలా తీర్చారో' అనే అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు గతవారంలో బాబా ఇచ్చిన మరో అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటాను.

2019, ఏప్రిల్ 28వ తేదీన నేను క్వశ్చన్&ఆన్సర్ సైటులో ఒక సమస్య గురించి బాబాని అడిగినప్పుడు, "నీ సమస్య అతిత్వరలో తీరుతుంది. వారంరోజుల్లో పాండురంగస్వామి రూపంలో సాయినాథుడు దర్శనమిస్తారు” అని వచ్చింది. 29వ తేదీ నాడు వాట్సాప్ గ్రూపులో అనుభవాలు చదువుతుండగా ఒక సాయిభక్తురాలు తనకి కూడా క్వశ్చన్&ఆన్సర్ సైటులో పాండురంగస్వామిలా దర్శనమిస్తానని బాబా చెప్పినట్టు వచ్చిందని, తరువాత తను తన ఊరి మందిరంలో జరుగుతున్న ధ్వజస్తంభ ఆరోహణ కార్యక్రమానికి వెళ్లానని, అది పాండురంగస్వామి ఆలయం అని, అక్కడ బాబానే ఆ రూపంలో దర్శనమిచ్చారని వ్రాశారు. పాండురంగస్వామి ఫోటోలను కూడా ఆమె తన అనుభవంతో పాటు పెట్టారు. అలా ముందురోజు సూచించినట్లుగానే బాబా పాండురంగస్వామిలా దర్శనమిచ్చారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది.

అదేరోజు శిరిడీలో బాబా సశరీలుగా ఉన్నప్పటి రోజులలో జరిగిన అనుభవాలు చదువుతుండగా, చావడిలో హారతి జరిగే సమయంలో బాలారామ్ ధురంధర్ బాబా ముఖమందు పాండురంగని తేజస్సు చూసిన వర్ణన ఉంది. ఆ అనుభవంలో వారు పంచుకున్న ఫోటోలో సాయిబాబా వెనుకగా పాండురంగస్వామి నిలబడి ఉన్నారు. అలా బాబా, పాండురంగస్వామి కనిపించేసరికి బాబా ఇచ్చిన జవాబు వెంటనే నా మదిలో మెదిలింది. ఆ విధంగా బాబా నన్ను అనుగ్రహించారని చాలా ఆనందించాను.

మరొక నిదర్శనమేమిటంటే, నేను రోజులో ఎక్కువభాగం సాయి టి.వి.నే చూస్తూ ఉంటాను. ఆ వారంరోజుల్లో ఆ ఛానల్‌లో ప్రసారమవుతున్న పాటల్లో అనేకసార్లు పాండురంగస్వామిలా సాయిని చూసాను. ఎన్నోరోజులుగా నేను ఆ ఛానల్ చూస్తున్నా కూడా పాండురంగస్వామి రూపాన్ని గమనించడం ఆ వారంలోనే జరిగింది. ఇలా ఆ వారంరోజుల్లో ప్రతిరోజూ ఏదో ఒకవిధంగా పాండురంగని  రూపంలో సాయినాథుడిని చూడగలిగాను.

కొన్ని ఊదీ మహిమలు:

ఒకరోజు రాత్రి నాకు భరించలేనంత పంటినొప్పి వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో వాళ్ళని నిద్రలేపడం ఇష్టంలేక బాబాను ప్రార్థించి, ఊదీని పంటికి రాసాను. ఒక 10 నిమిషాలకి నా నొప్పి చాలావరకు తగ్గిపోయింది. అప్పటివరకు భరించలేనంత నొప్పితో అల్లాడిపోయిన నేను బాబా ఊదీ పెట్టిన కొద్దిసేపట్లోనే హాయిగా నిద్రపోగలిగాను. మరుసటిరోజు నిద్రలేచేసరికి అసలు నొప్పి అన్న మాటే లేదు. బాబా ఊదీ మహిమ నిజంగా చాలా అద్భుతం!

ఇంకొకసారి భుజంనొప్పి ఎక్కువగా ఉండి నేను కాస్త కూడా చెయ్యి పైకి లేపలేకపోయాను. అప్పుడు కూడా బాబా ఊదీని నొప్పి ఉన్న చోటంతా రాశాను. ఆశ్చర్యంగా కొద్దిసేపటికి నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. "అమోఘమైన ఊదీ మహిమ చూపినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా! ఎల్లప్పుడూ మీ చల్లని నీడలో మేమంతా హాయిగా ఉండాలి. మీ కృప ఎప్పుడూ మీ భక్తుల మీద ఉండాలని మనసారా కోరుకుంటున్నాను". బాబాపై నమ్మకం ఉంచండి. ఆయన మనకి ఏది మంచిదో అది చేస్తారు.

ఊదీ మహిమ

నేను ఒక సాయిభక్తురాలిని. నాకు తరచూ మెడ పట్టేసి తీవ్రమైన నొప్పి వస్తూ ఉంటుంది. ఉదయాన ఆ నొప్పితో నిద్రలేచిన ప్రతిసారీ ఇంటిపని చేసుకోలేకపోయేదాన్ని. కనీసం ఒక వారం వరకూ అలా ఇబ్బందిపడుతూ ఉండేదాన్ని. 2019 ప్రథమార్థంలో ఒకరోజు ఆ నొప్పితో నిద్ర లేచాను. 'ఇంక ఏమీ చేయకుండా మంచం మీద పడుకుని ఉండాల'ని చాలా దిగులుపడ్డాను. అలా పడుకుని బ్లాగులో భక్తుల అనుభవాలు చదువుతూ, బాబా ఊదీ యొక్క అద్భుతశక్తిని, ఆయన మహిమను తలుచుకుని, కొంచెం ఊదీ నా మెడపై రాసుకుని, "బాబా! ఈ నొప్పి త్వరగా తగ్గిపోవాలి" అని చెప్పుకున్నాను. వారంరోజులకు గాని తగ్గని ఆ నొప్పి కేవలం 2 రోజుల్లో బాబా కృపవలన తగ్గిపోయి నేను నా పనులు చేసుకోగలిగాను. "థాంక్యూ సో మచ్ బాబా!" 

సాయి అనుగ్రహసుమాలు - 8వ భాగం



కాకా సాహెబ్ దీక్షిత్ డైరీ - ఎనిమిదవ భాగం

బాబా అడిగిన పైకం వెనుక పరమార్థం

ఒకసారి నేను(నాచ్నే) శిరిడీలో ఉండగా, శంకర్రావు కూడా అక్కడికొచ్చాడు. బాబా అతణ్ణి రూ.16 దక్షిణ అడిగాడు. అతని వద్ద పైకం లేదు. అతడు బాబా అడిగినప్పుడు దక్షిణ ఇవ్వలేకపోయానని క్రుంగిపోతూ వెనక్కి (బసకు) వచ్చాడు. కొంతతడవైన తర్వాత మళ్ళీ అతడు బాబా దర్శనానికెళ్ళినపుడు, బాబా యీసారి రూ.32 ఇవ్వమని అడిగాడు. తన అసహాయతకు సిగ్గుపడుతూ, శంకర్రావు బసకు చేరాడు. విషయం తెలిసి నాకు నవ్వొచ్చింది. “అట్లా ఎందుకు చేసావ్! నీదగ్గర పైకం లేకపోతే 'నాదగ్గర పైకంలేదు' అని బాబాతో చెప్పి ఉండవచ్చుగదా? నీవేం పలక్కుండా ఉన్నావు గనుకే బాబా దక్షిణ అడుగుతున్నారు” అని అతనితో అన్నాను. ఈసారి గనుక బాబా దక్షిణ అడిగితే అదే చెప్తానన్నాడు శంకర్రావు. ఇద్దరం కలసి మసీదుకెళ్ళగానే, బాబా శంకర్రావును రూ.64 దక్షిణ అడిగారు. “అంత డబ్బు మా దగ్గర ఎలా ఉంటుంది బాబా” అని అన్నాం మేము. “మీ దగ్గర లేకపోతే అందరి దగ్గర దండి పంపించండి” అన్నారు బాబా. ఈ సంఘటన జరిగిన కొంతకాలానికి బాబాకు ఒకసారి బాగా జబ్బు చేసింది. బాబా ఆరోగ్యం కోసం భక్తులు సప్తాహం, అన్నదానం నిర్వహించారు. ఆ సందర్భంగా దభోల్కర్ భార్య దహనూకు చెందిన వామన బాలక్రిష్ణ తదితరులు చందాల వసూళ్ళకు బయలు దేరాలనుకొన్నారు. వామనరావు ఆ కార్యం తన తమ్ముడైన శంకర్రావుకు అప్పగించి, ఆ విషయం నాకు కూడా చెప్పాడు. ఆ తరువాత మేము చందాలు వసూళ్ళు చేసాం. అంతా వసూలైన తర్వాత లెక్కపెడితే ప్రోగైన చందాల పైకం సరిగ్గా రూ.64 ఉంది. బాబా కొన్నిరోజుల క్రితం సరిగ్గా అదే మొత్తాన్ని అందరి దగ్గరా దండి వసూలు చేయమన్న విషయం గుర్తుకొచ్చి ఆశ్చర్యపోయాం.

ఆపద్బాంధవుడు

1915 మార్చి 31వ తేదీన నేను(నాచ్నే), శాంతారాం మోరేశ్వర్ ఫన్సే కలసి ఒక ప్రభుత్వ సంబంధమైన పనిమీద  అర్ధరాత్రి ఎద్దులబండిపై, దట్టమైన అడవిదారిగుండా పోవలసి వచ్చింది. దహనూ తాలూకాలోని రాన్ షెట్ అడవి దారిగుండా పోతూ ఉన్నాం. ఎందుకో హఠాత్తుగా మాబండి ఎద్దులు ఆగిపోయి, నెమ్మదిగా వెనక్కి నడవసాగాయి. ఎంత చూసినా కారణం తెలియలేదు. మేము పోతున్నది  చాలా ఎక్కుడురోడ్డు. ప్రక్కనే లోయ ఉన్నది. ఇంతలో మా బండి ఇరుసు చీల ఊడివుండటం గమనించి, దిగి దానిని సరిచేసి, బండిని చక్రాలు పట్టుకొని ముందుకు నెట్టాలను కుంటుండగా, శాంతారాం ఒకవైపు వేలుచూపి అటు చూడమన్నాడు. చూస్తే ఏముంది! ఒక భయంకరమైన పెద్దపులి మాకెదురుగా రోడ్డుప్రక్కన కూర్చుని, మాకేసే చూస్తోంది. వెంటనే బండిదిగి చక్రాలకు పోటుపెట్టి ఆపకపోయినా, యీ లోపల ఎద్దులు ఏమాత్రం బెదిరినా మాబండి తలక్రిందులై లోయలో పడుతుంది. కానీ, బండి దిగితే పులి పైన పడుతుందని భయం. ఫనే స్వతహాగా ధైర్యస్థుడు. అతడు, తాను బండిదిగుతాననీ, యీలోపల నన్ను ఎద్దుల పగ్గాలు గట్టిగా పట్టుకోమనీ చెప్పాడు. కానీ, నాకు పగ్గాలు పట్టుకొని కూర్చునే ధైర్యం కూడా పోయింది. ఇంతలో కాలు విరిగిందేమోనన్నట్లు బండి ఎద్దుల్లో ఒక ఎద్దు కాలు మడతబెట్టి కూర్చున్నది. నాకు భయంతో గొంతు తడారిపోతున్నది. అప్పుడు నా పూర్వపుణ్యం వల్ల బాబా గుర్తుకొచ్చారు. బాబానే ఆ సమయంలో ఆపదనుండి మమ్మల్ని రక్షించగలరనిపించింది. నేను బండిలోనుండే “జయ శ్రీసాయిబాబా, పరుగున రావయ్యా!” అంటూ  అరిచాను. వెంటనే, ఆ పెద్దపులి లేచి రోడ్డుకు ఎడమ వైపునుండి, కుడివైపుకు దూకి, మావైపే చూస్తూ బండి ప్రక్కగా వెళ్ళిపోయింది. నేను మాత్రం బాబాను పెద్దగా పిలుస్తూనే ఉన్నాను. ఆ పులి అటు వెళ్ళగానే మా ఎద్దులు లేచి పరుగు లంఘించుకోవటంవల్ల, ప్రమాదం నుండి బయటపడ్డాము. అలా అనేకంటే సద్గురు నామస్మరణే మమ్మల్ని కాపాడిందనడం సముచితం.

ఆపద మొక్కులవాడు

దహనూలో గుమాస్తా (తలాతీ)గా పనిచేస్తున్న పరశురాం అప్పాజీ నాచ్నేకు ఒకసారి బాగా 'జబ్బు చేసింది. అతను అప్పటికే శిరిడీ వెళ్ళివున్నాడు. అతనికొచ్చింది సన్నిపాతజ్వరం. మా(బల్వంత్ నాచ్నే) అన్నగారితో సహా, డాక్టర్లందరూ కేసు ఇక లాభంలేదని పెదవి విరిచారు. కానీ, పరశురాం ఎప్పుడూ తనప్రక్కన బాబా ఫోటో పెట్టుకొని, ఆ పటం ముందు నెయ్యిపోసి వెలిగించిన దీపం, అగరువత్తి ఎప్పుడూ వెలిగించి పెట్టమని తల్లిని కోరాడు. అతని తల్లి బాబా ఫోటో ముందు దీపం వెలిగించి, “బాబా నా కుమారుడికి జబ్బు నయం చెయ్యి. అతడికి ఆరోగ్యం బాగయిన వెంటనే, అతణ్ణి నీ దర్శనానికి శిరిడీకి పంపిస్తాను” అని మొక్కుకుంది. ఆ మొక్కు బాబాకు చేరింది. అతను కోలుకున్నాడు. ఇప్పుడతడికి పిల్లలు. ఇంతకుముందుకంటే ఆనందంగా ఉన్నాడు కూడా!

ఊదియే ముందు

ఒకసారి దహనూలో ప్లేగువ్యాధి వ్యాపించడంతో, మేము(నాచ్నే) అక్కడనుండి ఓ చిన్నపల్లెకు నివాసం మార్చాము. ఆ ఊరి జాగీర్దారైన రాజీ సఖారాం వైద్యగారి చిన్నకొడుకు మోరూకు, చాలా ప్రమాదంగా జబ్బు చేసింది. మా అన్నగారు డాక్టరవడంతో ఆయన దగ్గర మందుకోసం రాజీగారి పెద్దకుమారుడు మా ఇంటికొచ్చాడు. ఆ సమయంలో మా అన్నగారు ఇంట్లో లేకపోవడంతో, నన్నే మందేమయినా ఉంటే ఇవ్వమని అడిగాడు. “నా దగ్గరమందులేమీ లేవు, ఊదీ మాత్రం ఉంది. పెట్టిచూడు” అంటూ బాబా ఊదీ ఇచ్చాను. మోరూకు ఊదీ పెట్టగానే ఏ మందూ అవసరం లేకుండానే కోలుకున్నాడు.

తరువాయి భాగం రేపు.


సోర్స్ :సాయిపథం వాల్యూం - 1

సాయిభక్తుల అనుభవమాలిక 49వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం: 
  • థాంక్యూ సో మచ్ బాబా! ... మీరు నా మనసుని తెలుసుకున్నారు.

యు.ఎస్. నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

బ్లాగు ద్వారా నాకెంతో మనశ్శాంతి లభిస్తోంది. మీరు చేస్తున్న ఈ మంచి పనికి నా కృతజ్ఞతలు.

నార్త్ అమెరికాలోని బోస్టన్ నగరంలో 2018, అక్టోబర్ నెలలో ఒక సాయి మందిరం ప్రారంభమైంది. ఈ మందిరం నార్త్ అమెరికాలోని మందిరాలలోకెల్లా పెద్దది. దాని ప్రారంభోత్సవానికి బాబా నన్ను కూడా పిలిచారు. అందుకు బాబాకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. బాబా దర్శనానంతరం మా కుటుంబసభ్యులు, స్నేహితులు అందరూ ప్రసాద వితరణ జరుగుతున్న చోటికి వెళ్ళారు. నేను మాత్రం ఆకర్షణీయంగా, అద్భుతంగా వెలిగిపోతున్న బాబాను చూస్తూ అక్కడే నిలబడిపోయాను. మనసులో సరదాగా బాబాతో, "చూడండి బాబా! నేను మీకోసం వచ్చాను.(నాకు తెలుసు నిజానికి బాబా అనుమతి లేకుండా నేను ఎంత ప్రయత్నించినా అక్కడికి రాలేనని. కానీ నేను ఒక తుంటరి బిడ్డని.) నేను ప్రసాదం కోసం కూడా వెళ్లలేదు. ఇప్పుడు మీరు నాపై ఉన్న ప్రేమని  చూపించుకోవాలి. ఎలా అంటే, నాకు చాలా చాలా ప్రీతికరమైన దానిని మీరు నాకిప్పుడు ఇవ్వాలి. దానివలన ఉన్నపళంగా నాకు ఆనందంతో కళ్ళనుండి కన్నీళ్లు రావాలి. నాకేది కావాలో నేను చెప్పట్లేదు. ఎందుకంటే అంతలా కన్నీళ్ళు తెప్పించేటంత ఇష్టమైనది ఏమిటో నాకే తెలియదు. నా మనసు మీకు తెలుసో లేదో చూడాలి. అలాగే మీరు నన్నెలా ఆశ్చర్యపరుస్తారో చూడాలి. మీ బిడ్డలకు ఎన్నో పరీక్షలు పెడతారు. ఇప్పుడు మీరు పరీక్షంపబడుతున్నారు" అని, నవ్వుతూ బాబా వైపు చూసాను. నిజానికి నేనిదంతా సరదాగా బాబాతో మాట్లాడుకున్నాను. అంతేగానీ నా మనసులో ఏమీ లేదు. ఇలా నేను బాబాతో చెప్పుకోవడం పూర్తైన వెంటనే ఒక భజన బృందం లోపలికి వచ్చింది. నాకు బాబా భజనలు వినడం ఎంతో ఇష్టం. అయితే, గతంలో ఆ భజన బృందం వాళ్లు నాకిష్టమైన భజన పాటలెప్పుడూ పాడలేదు. అందువల్ల వాళ్లు రావడం నాకంత ఆసక్తిగా అనిపించలేదు. కానీ బాబాను మధ్యాహ్న ఆరతికి సిద్ధం చేయడానికి పరదాలు వేయడంతో నాకు బాధగా అనిపించి, వెళ్లి భజన బృందం దగ్గర కూర్చున్నాను.

కాసేపటిక్రితం బాబాతో నేను సరదాగా మాట్లాడుకున్నదంతా మర్చిపోయి అక్కడ కూర్చుని ఉన్నాను. ఇంతలో భజన బృందం వాళ్లు "దీవానా తేరా ఆయా బాబా తేరి శిరిడీ మే. మిలో ముఝ్ కో మేరె బాబా భర్నీ తుమ్హే పదెగి - ఝోలీ మే ఖాళీ లాయ రే బాబా - బాబా తేరి శిరిడీ మే" పాటతో భజన మొదలుపెట్టారు. అంతే! ఒక్కసారిగా నా కళ్ళనుండి పట్టరాని ఆనందంతో కన్నీళ్లు వచ్చేసాయి.  కొన్ని సంవత్సరాల క్రితం ఆ పాటంటే నాకు చచ్చేంత ఇష్టం. మొదటిసారి నేను కడుపుతో ఉన్నప్పుడు ప్రతిరోజూ లెక్కలేనన్నిసార్లు ఆ పాట పాడుకుంటూ ఉండేదాన్ని. ఆ ఆనందంలో కాలం గడిచిన తరువాత బాబా నాకు చక్కటి బిడ్డని కానుకగా ఇచ్చారు. అయితే ఐదేళ్ల కాలంలో ఇతర సమస్యలతో సతమతమవుతూ ఆ పాటను పూర్తిగా మర్చిపోయాను. మళ్ళీ ఇన్నాళ్లకు ఆ పాట వింటూ నన్ను నేను మైమరచిపోయాను. వేలాదిమంది భక్తుల ముందు కళ్లనుండి వస్తున్న ఆ కన్నీళ్లను ఎలా ఆపుకోవాలో నాకు తెలియలేదు. అవధులులేని ఆనందంతో, "థాంక్యూ బాబా! మీరు నా మనసుని తెలుసుకున్నారు. నేను మీ ముందు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. బాబా! నా హృదయం ఆనందంతో నిండిపోయింది. కానీ ఇంకా సంతృప్తి లేదు. నాకిష్టమైన మరొక భజన పాటను కూడా నాకు వినిపించండి"  అని ప్రార్థించాను.

తర్వాత భజన బృందం వారు కొన్ని పాటలు పాడిన తర్వాత నాకిష్టమైన "బాబా మై తేరి పతంగ్" పాట మొదలుపెట్టారు. (పాటలోని భావం: "బాబా నేను మీ చేతిలో  గాలిపటాన్ని. మీ నుండి దూరంగా పోకుండా దయచేసి దారాన్ని మీ చేతిలో గట్టిగా పట్టుకోండి.") మళ్లీ ఆనందంలో మునిగిపోయాను. తన్నుకొస్తున్న ఆనందాన్ని ఆపుకోలేక ఏడ్చేసాను. "లవ్ యు సో మచ్ బాబా!".

నేను గత ఐదారు సంవత్సరాలుగా ఎన్నో సమస్యలతో పోరాడుతూ వాటినుండి బయటపడవేయమని, మళ్ళీ తల్లినయ్యే అవకాశాన్ని ఇవ్వమని బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అయితే ఆయనపై తగిన విశ్వాసంతో ఉండలేకపోయేదాన్ని. అది నా దురదృష్టం. కానీ బాబా ఏమీ పట్టించుకోకుండా నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. "బాబా! అన్నిటికీ నా కృతజ్ఞతలు. నాకు అర్హత లేనప్పటికీ మీరు మంచి సౌకర్యవంతమైన జీవితాన్ని, మంచి వ్యక్తులను, విషయాలను ఇచ్చారు. బాబా! మిమ్మల్ని అర్థం చేసుకునే శక్తినివ్వండి. నాకేది మంచిదో అదే నాకివ్వండి."

మరో చిన్ని అనుభవం: మా అబ్బాయి టాబ్లెట్(ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్) 3 నెలల క్రితం కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా ఎక్కడా కనిపించలేదు. ఎక్కడ పెట్టానో ఎంత ప్రయత్నించినా నాకు గుర్తురాలేదు. ఎప్పుడు బాబాను ఆ విషయం అడిగినా, "పోగొట్టుకున్న వస్తువు దొరుకుతుంది" అని వస్తుండేది. అలా మూడు నెలలు గడిచాక ఒక గురువారంనాడు సదా మా కళ్ళముందు కనిపించే చోటులోనే ఆ టాబ్లెట్ దొరికింది. నిజానికి ఆ చోట నేను రెండు, మూడుసార్లు వెతికాను కానీ, అప్పుడు కనిపించలేదు. "బాబా! అద్భుతమైన మీ శక్తియందు నేనెందుకు విశ్వాసాన్ని నిలపలేక పోతున్నాను? దయచేసి అది నా చేతిలో ఉండేలా అనుగ్రహించండి".

source: https://www.shirdisaibabaexperiences.org/2019/04/shirdi-sai-baba-miracles-part-2337.html

సాయిభక్తుల అనుభవమాలిక 48వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. నవ గురువార వ్రతం - బాబా కురిపించిన ప్రేమ వర్షం
  2. బాబా చేసిన సహాయం

నవ గురువార వ్రతం - బాబా కురిపించిన ప్రేమ వర్షం

నేను ఒక సాయిభక్తురాలిని. నేనిప్పుడు పంచుకోబోయే అనుభవం ప్రతిసంవత్సరం నేను చేసే 'సాయి నవగురువార వ్రతా'నికి సంబంధించినది. 2017వ సంవత్సరంలో బాబా నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే మరపురాని అనుభవాన్నిచ్చారు. నేను ఎంతో ప్రేమతో వ్రతాన్ని మొదలుపెట్టాను. బాబా కూడా అంతే ప్రేమగా బిడ్డ  కావాలన్న నా పెద్ద కోరికను నెరవేర్చారు. 2017, జూలై 27న నాకు పాప పుట్టింది. ఆరోజు గురువారం కావడంతో నా సంతోషానికి అవధులు లేవు. పైగా తను పుట్టినతేదీలోని సంఖ్యలను కలిపితే 2+7=9 అవుతుంది.  9 అంకె నవవిధభక్తికి చిహ్నం. ఇలా మా పాపకు సంబంధించిన ప్రతిదీ సాయి ఆశీర్వాదమే. నా ప్రార్థనలను మన్నించి, ప్రెగ్నెన్సీ కాలమంతా సజావుగా సాగేలా చేసినందుకు నేను బాబాకి సదా కృతజ్ఞురాలినై ఉంటాను.

అయితే పాప పుట్టిన తరువాత నా భర్త ఒక్కరి జీతంతో ఇంటి ఖర్చులు, మావారిపై ఉన్న ఇతర బాధ్యతలు తీరడం చాలా కష్టతరమైంది. పైగా మా ఇంటిపై లోన్ తీసుకుని ఉన్నందువల్ల మరొక మార్గంలేక పాప రెండోనెలలో ఉండగానే నేను ఉద్యోగంలో చేరవలసివచ్చింది. కానీ పాపను వదిలి వెళ్లడం నాకు చాలా కష్టంగా ఉండేది. ప్రతిరోజూ నా భర్త నన్ను ఆఫీస్ దగ్గర వదిలి వెళ్లేవారు. ఆ సమయంలో నేను కన్నీటితో, "బాబా! మీ ప్రసాదమైన పాపతో ఎక్కువ సమయం గడపాలని నాకుంది. కానీ ఉద్యోగం చేయకుండా ఉండలేని పరిస్థితి. ఇటువంటి స్థితిలో మనసుపెట్టి ఎలా పని చేయగలను?" అని అనుకునేదాన్ని. ఇదే ప్రశ్నని 'ప్రశ్నలు మరియు సమాధానాలు  సైట్'లో బాబాని అడిగితే, "అంతా మంచే జరుగుతుంది" అని సమాధానం వచ్చింది. ఇక అక్కడితో ఆ విషయం బాబాకి వదిలేసి నేను నా పనిలో నిమగ్నమయ్యాను. తరువాత 2018, ఫిబ్రవరి నెల చివరివారంలో నేను "నవగురువార వ్రతం" మొదలుపెట్టాను. సరిగ్గా ఒక వారంరోజులకి మా ఆఫీస్ యాజమాన్యం వారు ఒక సమావేశం ఏర్పాటుచేసి, వారానికి రెండురోజులపాటు ఇంటినుండి వర్క్ చేసుకునే సదుపాయాన్ని నాకు కల్పించారు. ఇది ఖచ్చితంగా నాకు చాలా ఆశ్చర్యకరమైన, అద్భుతమైన విషయం. ఎందుకంటే మా ఆఫీసులో అంతకుముందెప్పుడూ ఎవరికీ ఇంటినుండి వర్క్ చేసుకునే అవకాశం ఇవ్వలేదు. కేవలం నాకు మాత్రమే ఆ వెసులుబాటు కల్పించారు. అది కూడా నేను వాళ్ళను ఏమీ అడగకుండానే! ఇదంతా బాబా వాళ్ళకిచ్చిన ప్రేరణే! బాబా నా మీద అంత ప్రేమ వర్షాన్ని కురిపించారు. "థాంక్యూ సో మచ్ బాబా!"

బాబా చేసిన సహాయం

సాయిబంధువులందరికీ నమస్కారం. నేను బాబాకు చాలా చిన్న భక్తురాలిని. నేను పనిచేస్తున్న ఆఫీసు మా ఇంటినుండి చాలా దూరంలో ఉండటం వలన అక్కడికి వెళ్లి రావడానికి దాదాపు మూడు, నాలుగు గంటలు పెట్టేది. అంతదూరం ప్రయాణం చేయడం వలన నేను చాలా అలసిపోతూవుండేదాన్ని. ఆఫీసువాళ్లు ల్యాప్‌టాప్ ఏర్పాటు చేస్తే ఇంటినుండే వర్క్ చేసుకోవచ్చని అనుకున్నాను. అందుకోసం చాలా ప్రయత్నించాను కూడా. అయితే ఆఫీసువాళ్ళు, "ఇప్పట్లో ల్యాప్‌టాప్ ఏర్పాటు చేయడం చాలా కష్టం. ఎందుకంటే, మీ పేరు మూడువేలమంది తర్వాత ఉంది. చాలా సమయం పడుతుంది" అని చెప్పారు. దాంతో నేను చాలా నిరాశపడి, "బాబా! నాకు ల్యాప్‌టాప్ వచ్చేలా అనుగ్రహించండి" అని చెప్పుకున్నాను. తరువాత బాబా కృప వలన కేవలం నాలుగు నెలలలో ల్యాప్‌టాప్ నా చేతికి వచ్చింది. నిజానికి అంత త్వరగా రావడం అసాధ్యమైన విషయం. ఇది బాబా వలన మాత్రమే సాధ్యమైంది. "థాంక్యూ సో మచ్ బాబా!"

సాయి అనుగ్రహసుమాలు - 7వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరి - ఏడవ భాగం.

నా బిడ్డల్ని నేను కాక
మరెవ్వరు రక్షిస్తారు?

1914లో శ్రీఎస్.బి.నాచ్నే దహనూలో ట్రెజరీ మాస్టరుగా పనిచేసాడు. అక్కడే శ్రీఫన్సే కూడా ఉద్యోగి. ఫన్సేకు మతిస్థిమితం లేదు. ఒకసారి శ్రీనాచ్నే తమ వంట ఇంట్లో ఉన్న బాబా ఫోటో ముందు కూర్చుని పూజ చేసుకుంటున్నాడు. అతనికేదో శబ్దం వినిపించి వెనుదిరిగి చూచేసరికి వంటింటి గుమ్మం దగ్గర పిచ్చి ఫన్సే నిలుచుని కనిపించాడు. మరునిమిషం, ఫన్సే హఠాత్తుగా నాచ్నే మీదకు దూకి, అతని గొంతు పట్టుకొని పిసుకుతూ, “నీ రక్తం తాగేస్తాను” అంటూ, నాచ్నే మెడ కొరకడానికి ముందుకు వంగాడు. పూజ చేస్తున్న నాచ్నే తన చేతిలో ఉన్న ఉద్దరిణిని అప్రయత్నంగా తెరచిన ఫన్సే నోట్లో గుచ్చాడు. ఫనే వెంటనే నోరు మూసి, దొరికిన నాచ్నే వ్రేళ్ళను కొరికాడు. అతని గోళ్ళు నాచ్నే మెడలో బాగా దిగబడి, రక్తం కారసాగింది. హఠాత్తుగా ఎదురైన ఆ ఉత్పాతానికి నాచ్నే స్పృహ తప్పి పడిపోయాడు. అతనికి తిరిగి స్పృహ వచ్చేసరికి, తన తల్లి, తమ్ముడు, డాక్టరు తన చుట్టూ కూర్చుని కనిపించారు. సమయానికి నాచ్నే తల్లి , తమ్ముడు చూచి ఆ పిచ్చివాడి పట్టునుండి తన్ను విడిపించి ప్రాణం కాపాడారని తెలిసింది.
తరువాత కొన్ని రోజులకు బాబా దర్శనార్థం నాచ్నే శిరిడీ వెళ్ళాడు. మధ్యాహ్నం మసీదు కెళ్ళి బాబా వద కూర్చోగానే, బాబా అక్కడున్న అన్నాచించినీకర్ కు నాచ్నేను చూపిస్తూ, “అన్నా నేనొక్క క్షణం ఆలస్యం చేసివుంటే ఆ పిచ్చివాడు ఇతణ్ణి చంపేసేవాడే. ఆ పిచ్చివాడు ఇతని మెడ పట్టుకొని పిసుకుతుంటే నేనే అతని పట్టు నుండి ఇతణ్ణి విడిపించాను. నా బిడ్డల్ని నేను రక్షించకుంటే మరెవరు కాపాడుతారు?” అన్నారు.

అతి తెలివి

మా పక్కింట్లో నివసించే శ్రీఆనందరావు కృష్ణచౌబాల్ తన తల్లిగారిని తీసికొని, ఒకసారి నాతోపాటు శిరిడి వచ్చాడు. చౌబాల్ తల్లి చాలా సమర్థురాలు, తెలివైనది. ఆమె “బాబాకు 8 అణాలు దక్షిణ ఇద్దాం” అని, తన కుమారుడి ఒక రూపాయకు చిల్లర తెప్పించింది. ఆ వచ్చిన రెండు పావలా కాసులు, ఒక అర్థరూపాయి కాసులలో, దగ్గర కెళ్ళినప్పుడు ఒక్క పావలా కాసు మాత్రం బాబాకిచ్చి  వెనక్కు మళ్ళింది. బాబా ఆమెను వెనక్కు పిలిచి, "మిగతా ఆ పావలా ఇవ్వకుండా ఎందుకమ్మా యీ పేద బ్రాహ్మణుణ్ణి  మోసగిస్తావ్?” అన్నారు. ఆమె సిగ్గు పడి మిగతా దక్షిణ కూడా సమర్పించింది.

శిరిడీ మాఝే పండరిపూర్!

శంకర్రావు తల్లిగారు ఒకసారి శిరిడి "చూచుకొని, అక్కడ నుండి పండరిపురం తదితర పుణ్యక్షేత్రాలు దర్శించునుకొన్నది. అనుకొన్న ప్రకారం ముందు శిరిడీ వెళ్ళింది. ఆమె బాబా దర్శనం చేసుకొన్న తరువాత, బాబా ఆమెను పిలిచి, “ఇంటికి తిరిగి వెళ్ళు! ఊదీ తీసుకొని మరీ  వెళ్ళు! ” అన్నారు. ఆమె దాంతో తన పండరియాత్ర మానుకొని శిరిడీయే తన పండరి అనుకొని మరలింది. ఇంటికొచ్చి, ఇంట్లో వారికి బాబా ప్రసాదం పంచుదామని, పెట్టె తీసి ఊదీ పొట్లాం విప్పేసరికి ఏముంది? ఆ పొట్లాంలో ఊదీ లేదు. దానికి బదులు పండరి క్షేత్రంలో ప్రసాదంగా ఇచ్చే సువాసనతో కూడిన 'బుక్కా' వుంది. ఆమె, “అర్రె, బుక్కా ఎలా వచ్చింది? ఊదీ ఏమైంది?” అని ఆశ్చర్య పోతుంటే “శిరిడీయే నీ పండరి అన్నావు కదమ్మా? అది అక్షరాల నిజం. బాబా నీకు సరైన ప్రసాదమే ఇచ్చారు” అన్నాం మేము.

మాటిచ్చి, అశ్రద్ధ చూపకు!

1915లో ఒకసారి మేము శిరిడీ బయలుదేరాం. అప్పుడు నాతో నా భార్య, అత్తగారు, శంకర్రావు కూడా వచ్చారు. దారిలో మాకు బేసిన్ లో  వెటర్నరీ సానిటరీ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న వాసుదేవ సీతారాం సామంత్ కలిసారు. మేము శిరిడీ వెళ్తున్నామని తెలిసి, నా చేతికి రెండణాలు ఇచ్చి, “ఈ పైకంతో కొబ్బరికాయ, కర్పూరం, అగరుబత్తి కొని నా తరఫున బాబాకు సమర్పించండి” అన్నాడు. సరేనని నేను పైకం తీసుకొన్నాను. మేము శిరిడీ నుండి తిరుగు ప్రయాణమై, బాబా దగ్గర శలవు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు బాబా నాతో, “మంచిది. వెళ్లేటప్పుడు చితలీ మీదుగా  వెళ్ళు! , కానీ ఆ రెండణాలు యివ్వకుండా ఈ పేద బ్రాహ్మణ్ణి ఎందుకు మోసం చేస్తావ్?” అన్నారు. అప్పుడు నాకా రెండణాల విషయం గుర్తొచ్చి, వెంటనే రెండణాలకు టెంకాయ, కర్పూరం, ఊదుబత్తి కొని బాబాకు సమర్పించాను. అప్పుడు బాబా నేను వెళ్ళడానికి శలవిస్తూ, “వెళ్లిరా! కానీ, ఏదైనా ఒకపని చేస్తానని ఒప్పుకుంటే, శ్రద్ధగా చెయ్యి లేకపోతే అసలు మాటివ్వనేవద్దు!” అన్నారు.

తరువాయి భాగం రేపు 

మూలం : సాయిపథం వాల్యూమ్ -1 

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo