సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1824వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా వెంట ఉన్నారనేదానికి ఎన్నో నిదర్శనాలు
2. బాబా దయ అనంతం

బాబా వెంట ఉన్నారనేదానికి ఎన్నో నిదర్శనాలు

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!! నేను ఒక సాయిభక్తురాలిని. నేను ఎన్నోసార్లు ఆ సాయినాథుడు నా మీద చూపిన అనుగ్రహ వీక్షణలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ప్రతి అనుభవం మనపై సాయి ఎంతలా కరుణ చూపిస్తారో, ఎంతలా మన వెంటే ఉండి కాపాడతారో తెలియజేస్తుంది. కానీ మనం మామూలు మనుషులం. కష్టమొస్తే మన అనుకున్నవాళ్ళకి కష్టం చెప్పుకుంటాము, బాధపడతాం, ఆ కష్టం కలిగించినవాళ్ళని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తిట్టుకుంటాము, ఇది అంత మన కర్మ వల్ల జరిగిందని అనుకుంటాం. అయినప్పటికీ ఆ కష్టం కలిగించినవాళ్ళ పట్ల కోపం పోవడానికి కొంచెం సమయం పడుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, గతంలో ఒకసారి మా ఇంట్లో ఉండే ఒక వ్యక్తి వల్ల నాకు ఒక కష్టం వచ్చింది. నా తప్పు ఏమీ లేకపోయినా నేను చాలా చాలా బాధను అనుభవించాను. తట్టుకోలేక నాకు ఆ కష్టం కలిగించిన వ్యక్తి గురించి మా అమ్మ దగ్గర ఫిర్యాదు చేశాను. ఆ వ్యక్తి నేను మా అమ్మతో మాట్లాడిన విషయాలన్నీ మాకు తెలియకుండా ఫోన్‌లో రికార్డ్ చేసి నన్ను ఇంకా బాధపెట్టడానికి సిద్ధమయ్యారు. నిజానికి నేను ఏదీ తప్పుగా మాట్లాడలేదు. ప్రతి ఇంట్లో జరిగే సాధారణ విషయాలలాగే మాట్లాడాను. అయినా కూడా ఆ వ్యక్తి తన గురించి వెనుక మాట్లాడామని నన్ను, మా అమ్మని ఆ కారణంగా అవమానించారు. నేను చాలా మానసిక క్షోభకు గురయ్యాను. అప్పటినుంచి నాకు ఒక రకమైన ఫోబియా(భయం) ఏర్పడింది. ఆ వ్యక్తి గురించి మాట్లాడాలంటేనే నాకు తెలియకుండానే నా మనసులో ఆందోళన వచ్చేస్తుండేది. అలాంటిది ఈమద్య ఒకసారి మా అమ్మ నాతో ఆ వ్యక్తి గురించి ప్రస్తావన తెచ్చి, ఆ వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు నేను గతంలో ఆ వ్యక్తి నన్ను ఎలా బాధపెట్టింది గుర్తు చేసుకొని, నేను కూడా ఆ వ్యక్తి గురించి మాట్లాడాను. తర్వాత గతంలోలా ఆ వ్యక్తి మళ్ళీ రికార్డు చేసి ఉంటారేమోనని నాకు ఆందోళన వచ్చింది. వాస్తవానికి మేము మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఇంట్లో లేరు. అయినప్పటికీ కూడా గతంలో గాయం వల్ల ఇప్పుడు కూడా రికార్డ్ చేస్తున్నారేమోనని చాలా ఆందోళన పడ్డాను. ఆ ఆందోళన నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒక్కసారిగా నాకు చెమటలు పట్టేసాయి. ఇదంతా కేవలం నా భయమేనని తెలుస్తున్న కూడా నన్ను నేను నియంత్రించుకోలేక బాబాని తలుచుకొని, "ఈ ఆందోళన నుండి బయటపడేయండి" అని ప్రార్ధించాను. కానీ ఆ ఆందోళన అలానే కొనసాగింది. నాకు ఏమి చేయాలో పాలుపోక, "ఈ ఆందోళన తగ్గేలా దయ చూపండి" అని బాబాని వేడుకున్నాను. కొద్దిసేపటికి ఆ వ్యక్తి నుండి నాకు ఒక మెసేజ్ వచ్చింది. చూస్తే, అది ఒక బాబా ఫోటో. ఆ ఫోటోని చూడగానే నా ఆందోళనంతా ఒక్కసారిగా చేతితో తీసినట్టుపోయింది. బాబా పిలిస్తే పలుకుతారన్నదానికి ఇంతకన్నా ఋజువు ఏమి కావాలి?.


ఈమద్య నాకు ఒక సంబంధం వచ్చింది. ఆ అబ్బాయి స్థితిగతులు, ఉద్యోగం, కుటుంబం అన్నీ బాగున్నందువల్ల ఆ సంబంధం నా తల్లిదండ్రులకి బాగా నచ్చింది. నేను కూడా నాకు పెళ్లి కుదురుతుందని ఆశపడ్డాను. కాని పెళ్లిచూపుల్లో నేను ఆ అబ్బాయితో మాట్లాడినపుడు నాకు, ఆ అబ్బాయికి మానసికంగా కుదరదనిపించింది. ఎందుకంటే, చాలా విషయాల్లో మా ఇద్దరి అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. అయినప్పటికీ నేను ఆ అబ్బాయికి నచ్చాను. నా తల్లిదండ్రులకి, ముఖ్యంగా మా అమ్మకి ఆ సంబంధం నచ్చింది. అందువల్ల నేను, '"నాకు నచ్చలేదు" అని చెప్తే, వాళ్ళు ఒప్పుకోలేకపోయారు. ఒక రెండు రోజులు నాకు సర్ది చెప్పి ఒప్పించటానికి మా అమ్మ ప్రయత్నించింది. కానీ నా మనసు ఒప్పుకోలేదు. అందువల్ల ఆ సంబంధం నాకు 'ఓకే' అని చెప్పలేకపోయాను. అలాగని 'నో' చెప్తే, మా అమ్మ 'మళ్లీ అన్నీ బాగుండే సంబంధం రాదు' అని బాధపడుతుండేది. నేను ఆ రెండు రోజులు నేను చాలా బాధపడ్డాను. డిప్రెషన్‌లోకి వెళ్లినట్టు కూడా అనిపించింది. అటువంటి సమయంలో, "బాబా! అమ్మానాన్న నన్ను కష్టపెట్టకుండా ఆ సంబంధం వాళ్లతో 'నో' చెప్పాలి. నేను నా రోజువారీ జీవితంలోకి తిరిగి వచ్చేలా అనుగ్రహించమ”ని బాబాను వేడుకున్నాను. బాబా నా ప్రార్థన విన్నారు. మూడో రోజు అమ్మానాన్న నన్ను బలవంతం చేసి ఒప్పించకూడదన్న నిర్ణయానికి వచ్చి, 'మాకు ఈ సంబంధం వద్దు' అని వాళ్లతో చెప్పేశారు. దాంతో నేను హాయిగా నా సాధారణ జీవితంలోకి వచ్చేశాను. ఇలా బాబా నా వెంట ఉన్నారనేదానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. నాకు ఈ జన్మకి కావాల్సింది ఏమీ లేదు. బాబా మీద విశ్వాసమొక్కటి చాలు, జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి. “చాలా చాలా ధన్యవాదాలు బాబా”.


సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


బాబా దయ అనంతం


శ్రీసాయినాథాయ నమః!!! సాయిబంధువులకు నమస్కారాలు. నేను ఒక సాయిభక్తుడిని.  రెండు సంవత్సరాల క్రితం నాకు క్యాన్సర్ వచ్చింది. అది గొంతు క్యాన్సర్ అయినందున ఆహారం తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేది. నేను దాదాపు జీవితం మీద ఆశ వదిలేసుకొని సాయిని ఆశ్రయించాను. ప్రతిరోజూ ఊదీ తీసుకుంటూ కాలం నెట్టుకురాసాగాను. ఇలా ఉండగా మా వాళ్ళు నన్ను తీసుకుని వెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ నాకు అసలైన నరకం మొదలైంది. వారానికి ఒక కీమో, ప్రతిరోజూ రేడియేషన్ చికిత్సలు చేయడం మొదలుపెట్టారు. ఆ వైద్యం కన్నా మరణం ఎంతో మేలు అనిపించింది. అంతటి కష్టంలో నేను బాబాను వేడుకోవడం తప్ప చేయగలిగింది ఏదీ లేదని ఆయన్ని తలుచుకుంటూ ఉండేవాడిని. మొత్తం పది కీమోలు, 42 రేడియేషన్లు చికిత్సలు చేసారు. నేను దాదాపు 15 కిలోలకు పైగా బరువు తగ్గిపోయాను. ఆహారం తీసుకోవడం పూర్తిగా దుర్భరంగా మారింది. అటువంటి దారుణమైన స్థితికి వెళ్లిన నేను బాబా దయవల్ల అనూహ్యంగా కోలుకోనారంభించి అనతికాలంలోనే పూర్తిగా కోలుకున్నాను. అంతా బాగానే ఉందనుకుంటే దాదాపు పది నెలల తర్వాత తిరిగి గొంతునొప్పి మొదలైంది. మళ్ళీ ఆసుపత్రికి వెళ్లాలంటే గత అనుభవం దృష్ట్యా నేను పోదలుచుకోలేదు. ప్రతిరోజూ బాబా ఊదీ తీసుకుంటూ, "గొంతునొప్పి తగ్గి, తేలిగ్గా ఆహారం తీసుకోగలిగేల అనుగ్రహించండి" అని బాబాతో చెప్పుకున్నాను. కేవలం వారం రోజుల్లో బాబా అద్భుతం చేశారు. గొంతునొప్పి తగ్గి ఆహారం తేలిగ్గా తీసుకోగలుగుతున్నాను. బాబా దయ అనంతం. సాయి సమర్థులకు అనేక కోటి నమస్కారాలతో ఈ బాధామయ జగత్తునంతటినీ కాపాడమని వేడుకుంటున్నాను.


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!



సాయిభక్తుల అనుభవమాలిక 1823వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా కృప
2. బాబా ఉన్నారుగా - రక్షిస్తారు

బాబా కృప


సాయిబంధువులకు నమస్కారాలు. నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. మూడు సంవత్సరాల నుంచి నేను ఒక కంపెనీలో పని చేస్తున్నాను. ఆ కంపెనీలో ఎదుగుదల కనపడక కంపెనీ మారుదామని ప్రయత్నాలు చేసినా మొదట్లో ఫలితం కనిపించలేదు. చివరికి 2023, డిసెంబర్ నెలలో ఒక కంపెనీకి ఇంటర్వ్యూ ఇచ్చి, అందులో సెలెక్ట్ అయితే బాగుంటుందని మా అమ్మతో చెప్పాను. కానీ ఒక వారం రోజులైనా ఆ కంపెనీ నుండి నాకు ఏ సమాచారం తెలియలేదు. అప్పుడొక గురువారం నాడు మా అమ్మ తన మనసులో బాబాని తలుచుకొని, "బాబా! ఒక వారం అయిందికానీ, ఏ విషయమూ తెలియలేదు. ఏమైందో! ఏదో ఒక విషయం తెలియజేయండి తండ్రీ" అని ప్రార్థించింది. అదేరోజు నాకు, 'ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యానని, రెండో రౌండ్‌కి సిద్ధంగా ఉండమ'ని నాకు మెయిల్ వచ్చింది. వెంటనే మా అమ్మకి ఫోన్ చేసి విషయం చెపితే, "ఈ ఇంటర్వ్యూ కూడా సెలక్ట్ అయితే తోటి భక్తులతో మీ అనుగ్రహాన్ని పంచుకుంటానని బాబాకి మ్రొక్కుకోమ"ని చెప్పింది. నేను అమ్మ చెప్పిన విధంగా బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల రెండో రౌండ్, హెచ్‌ఆర్ రౌండు అన్ని విజయవంతంగా పూర్తై నాకు ఉద్యోగం వచ్చింది. మే నెలలో జాయిన్ అవ్వమని చెప్పారు. "శతకోటి ధన్యవాదాలు సాయితండ్రి. ఇలాగే మీ కరుణ మాపై చూపు తండ్రీ".


ఇప్పుడు మా అమ్మ అనుభవం ఆమె మాటల్లో: 2024, జనవరిలో నేను బెంగళూరులో మా అమ్మాయి దగ్గర ఉన్నప్పుడు ఒకరోజు హఠాత్తుగా నాకు గొంతునొప్పి, జలుబు, కొద్దిగా జ్వరం వచ్చాయి. అప్పుడు నేను, "బాబా! ఇక్కడ ఏ హాస్పిటల్‌కి వెళ్ళాలో నాకు తెలియదు. నాకు నయమయ్యేలా మీరే చూడండి" అని బాబాను ప్రార్థిస్తూ టాబ్లెట్ వేసుకొని ఊదీ ధరించాను. బాబా నామీద కరుణ చూపించారు. రెండు రోజుల్లోనే నాకు తగ్గింది. కానీ మా అమ్మాయికి మొదలైంది. అప్పుడు నేను, "బాబా! నాకు వచ్చిన పర్వాలేదుకానీ, తనకి ఏదైనా వస్తే తొందరగా తగ్గదు. ఎక్కువ కాకుండా చూడండి" అని వేడుకున్నాను. తనకి జ్వరం, జలుబు, దగ్గు ఎక్కువగానే ఉండటంతో మెడికల్ షాపుకు వెళ్లి టాబ్లెట్స్ తెచ్చి అమ్మాయికి వేసి, "తండ్రీ! ఈ టాబ్లెట్లతో తనకి నయం చేయండి" అని రాత్రంతా బాబాని ప్రార్థించాను. సాయితండ్రి నా మొర ఆలకించారు. మరుసటిరోజుకి జ్వరం తగ్గటం ప్రారంభించి తర్వాత పూర్తిగా తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా".


2024, భోగి రోజున నేను, మా బాబు, మా అమ్మాయి, తన స్నేహితులు అందరం కలిసి బయటకు వెళ్ళాము. తిరిగి వచ్చేటప్పుడు బస్సు దిగుతుంటే మా అమ్మాయి కాలు జారింది. అలా మూడుసార్లు జరగడంతో కాలు బెణికి చిన్నగా వాపు వచ్చింది. వెంటనే నేను, "బాబా! మీరే తనని రక్షించాలి. తనకి ఏమీ కాకుండా చూడు తండ్రీ" అని బాబాను ప్రార్థించాను. మూడు, నాలుగు రోజులకి అమ్మాయికి తగ్గింది. బాబా కృపవలనే ఏమీ కాలేదు. ఆ మరుసటిరోజు ఉదయం నేను స్నానం చేద్దామని బాత్రూంకి వెళ్ళినప్పుడు కాలివేళ్ళు మలబడి కిందపడిపోయాను. బాబా దయవలన ఏమీ కాకుండా చిన్నచిన్న నొప్పులతో బయటపడ్డాను. "ఇలానే మమ్మల్ని కనిపెట్టుకొని ఉండండి సాయితండ్రీ".


బాబా ఉన్నారుగా - రక్షిస్తారు

అందరికీ నమస్కారం. నా పేరు గౌతమి. నేను చిన్నప్పటినుండి బాబా భక్తురాలిని. నాకు ముగ్గురు పిల్లలు. ఒక బాబు, ఇద్దరు పాపలు. బాబుకి మూడేళ్లు. వాడు అస్సలు కుదురుగా ఉండడు. ఎప్పుడూ ఏదో ఒక దెబ్బ తగిలించుకుంటూ ఉంటాడు. చిన్నప్పుడు కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా తన తలకి ఆపరేషన్ జరిగింది. అందువలన తన తలకి దెబ్బ తగిలితే చాలా ప్రమాదం. వాడు 2024, ఫిబ్రవరి 28న ఆడుకుంటూ టేబుల్ మీద నుంచి కింద పడిపోయి నొప్పికి బాగా ఏడ్చాడు. రక్తం అయితే రాలేదుగానీ, చెవిపై బాగా వాచిపోయింది. 2, 3 రోజులైనా తగ్గలేదు. రాత్రి నిద్రలో లేచి దెబ్బ తగిలిన చోట చేయి పెట్టి బాగా ఏడుస్తూ ఉండేవాడు. మేము చాలా కంగారు పడి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే, ఎంఆర్ఐ స్కాన్ తీయించమన్నారు. సరేనని స్కాన్ తీయిస్తే, బ్రెయిన్ దగ్గర బ్లడ్ క్లాట్స్ ఉన్నాయని వచ్చింది. నేను చాలా బాధపడి, "ఇలా అయింది ఏంటి బాబా?" అని ఏడ్చాను. డాక్టర్, "ఆ క్లాట్స్ పెరగకుండా ఉంటే ఒక 2 నెలల్లో వాటంతటవే కరిగిపోతాయి. ప్రమాదమేమీ లేదు.  కానీ మీరు ఒక 2 నెలలు బాబుని గమనిస్తూ ఉండండి. వాంతులైనా, బాబు ప్రవర్తనలో ఏమైనా తేడా కనిపించినా వెంటనే తీసుకొని రండి. ఈ 2 నెలల్లో ఏం తేడా లేకుంటే క్లాట్స్ కరిగిపోయినట్టే” అన్నారు. బాబు ఒక వారం రోజులు నొప్పికి నిద్రపోయేవాడు కాదు. నేను, “బాబా! వాడికి నొప్పి తగ్గి చక్కగా నిద్రపోవాలి” అని బాబా దగ్గర ఏడ్చాను. బాబా నా మొర విన్నారు. ఇప్పుడు బాబుకి నొప్పి బాగా తగ్గి హాయిగా నిద్రపోతున్నాడు. ఇక వాడికి ఏ సమస్యా ఉండదన్న నమ్మకం నాకొచ్చింది. బాబా ఉన్నారుగా వాడిని రక్షిస్తారు. క్లాట్స్ కరిగిపోతాయి. "ధన్యవాదాలు సాయితండ్రీ! బాబుని ఇలాగే కాపాడుతూ ఉండండి".


సాయిభక్తుల అనుభవమాలిక 1822వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
 
  • శ్రీసాయి అనుగ్రహలీలలు - 34వ భాగం

నా పేరు సాయిబాబు. ఒకరోజు నేను, నా భార్య, తన తల్లి ముగ్గురం కలిసి గుంటూరు హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న సాయిబాబా మందిరానికి వెళ్ళాం(ఆ మందిరంలోనే 2005లో మా అమ్మాయి వివాహం, 2018లో మా మనవడి పంచల మహోత్సవం ఘనంగా జరిగాయి). మేము మందిరం లోపలికి ప్రవేశించడానికి ముందు నా భార్య తన ఫోన్‌లోని యూట్యూబ్‌లో ఒక ప్రవచనం చూస్తుంది. అకస్మాత్తుగా తన ఫోన్‌కి మా అమ్మాయి నుండి వీడియో కాల్ వచ్చింది. నేను తనకి బాబాని, మందిరాన్ని చూపించాను. తను చాలా సంతోషించింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఇటు నా భార్యకానీ, అటు మా అమ్మాయికానీ ఆ వీడియో కాల్ చేయలేదు. మరి ఎవరు చేశారు? ఇంకెవరు ఆ బాబానే! ఇకపోతే మందిరంలో స్వాములు అయ్యప్ప ఇరుముడ్లు వేసుకుంటున్నారు. వాళ్ళు, వాళ్ళ బంధువులు, బంధువుల పిల్లలు అందరూ కలిసి 780 మంది ఉంటారు. మేము బాబా మూర్తికి ప్రదక్షిణ చేసుకొని నమస్కరించుకుందామని బాబా పాదుకుల వద్దకు వెళ్ళాము. నా భార్య తన చేతిలో ఉన్న ఫోను పాదుకలు పక్కనపెట్టి రెండు చేతులతో పాదుకలు తాకి, తల ఆనించి నమస్కారం చేసుకుంది. తల ఎత్తేసరికి పూజారి తీర్ధమిచ్చి, "ప్రసాదం తీసుకోండి" అని పక్కనే ఉన్న టేబుల్ దగ్గరకి నడిచారు. ఆయన వెనుక మేము వెళ్లి ప్రసాదం తీసుకుని కొంచెం సేపు బాబా సన్నిధిలో కూర్చున్నాము. తర్వాత అదే ప్రాంగణంలో ఉన్న ఆంజనేయస్వామిని, శివలింగాన్ని, పక్కనే ఉన్న అమ్మవారిని దర్శించుకున్నాము. ఈ లోపల అయ్యప్పస్వామి స్వాములు అందరూ వెళ్ళిపోయారు. ఆలయ గుమస్తా వచ్చి "ప్రసాదం(టిఫిన్) తినేసి వెళ్ళండి" అని స్వాములు కోసం చేయించిన ప్రసాదం పెట్టించారు. ఆ తర్వాత మేము బయటికి వెళ్లి కారు ఎక్కబోతున్నప్పుడు నేను నా భార్య చేతిలో ఫోన్ లేకపోవడం గమనించి, "నీ ఫోన్ ఏది?" అని నా భార్యని అడిగాను. అప్పుడు ఆమెకు గంట క్రితం తన ఫోన్ బాబా పాదాల పక్కన పెట్టానని గుర్తొచ్చింది. వెంటనే గుడి మెట్లు ఎక్కుతూ, "బాబా! మీ సన్నిధిలో వున్న ఫోన్ నాకు తిరిగి లభిస్తుంద"ని అనుకుంది. కానీ వెళ్ళి చూస్తే, అక్కడ ఫోన్ కన్పించలేదు. పూజారిని అడిగితే, "ఆ ఫోన్ మీదా? నేను ఎవరో మర్చిపోయారని గుడి ఛైర్మన్‌గారి అబ్బాయికి జాగ్రత్త చేయమని ఇచ్చాను. అతను, మరికొంతమంది స్వాములు ఇప్పుడే పూజ చేసుకొని శబరిమలైకి బయల్దేరి వెళ్ళారు. అయినా మీరు కంగారుపడకండి. అతను ఫోన్ వాళ్ళింట్లో ఇచ్చి వెళతానని చెప్పాడు" అని చెప్పి గుడి మేనేజర్‌గారికి విషయం చెప్పి, అతన్ని చైర్మన్‌గారి ఇంటికి పంపి నా భార్య ఫోన్ తెప్పించారు. బాబా సమక్షంలో ఏ వస్తువూ పోవటం జరగదు కదా!

2022, జనవరిలో బాబా అనుమతితో నా భార్య హైదరాబాదులో ఉన్న తన చెల్లిలి ఇంటికి వెళ్ళింది. తిరిగి మా ఇంటికి ఎప్పుడు రావాలో బాబానే ఏదో విధంగా సూచిస్తారని తను అనుకుంది. అలవాటు ప్రకారం అక్కడ కూడా తను రోజూ సచ్చరిత్ర చదువుతుండేది. 20వ రోజు రాత్రి 7:30 అప్పుడు తను సచ్చరిత్ర పుస్తకం తెరవగానే ఒక పేజీలో 'నీ ఇంటికి నువ్వు తిరిగి వెళ్ళు. రేపే వెళ్ళు. ఆలస్యం చేయవద్దు' అని కనిపించింది. వెంటనే తను బాబా ఆజ్ఞననుసరించి మరునాడు ఉదయం 7-30కి ఉన్న జన్మభూమి ట్రైన్‌కి టికెట్ రిజర్వ్ చేసుకుంది. మర్నాడు ఉదయం తను ట్రైన్ ఎక్కాక నాకు ఫోన్ చేసి, "గుంటూరు స్టేషనుకు వచ్చి నన్ను రిసీవ్ చేసుకొండి" అని చెప్పి, ట్రైన్ రీచ్ అయ్యే టైం నాకు మెసేజ్ పెట్టింది. 5 నిముషాల తర్వాత టీసీ వచ్చి నా భార్య టికెట్ చూసి, "ఇది జన్మభూమి కాదు. మీరు ఇంటర్సిటీ ట్రైన్ ఎక్కారు" అని చెప్పగానే నా భార్య కొంచెం కంగారుపడి బాబాని తలుచుకొని టీసీతో, "పోర్టరు నా లగేజ్ తెచ్చి ఈ ట్రైన్లో సర్ది, ఈ సీటు చూపించాడు. అతనికి సరిగా తెలిసే వుంటుందిలే అని నేను చెక్ చేసుకోలేదు" అని అంది. టీసీ విషయం అర్ధం చేసుకుని ఏసీ కోచ్ టిక్కెట్టు వున్నందున ఒక సీట్ చూపించి "మీరు ఇక్కడ కూర్చోండి" అని చెప్పి, "మామూలుగా అయితే ఫైన్ వ్రాయాలి కానీ వ్రాయట్లేదు. తప్పు పోర్టర్ది  కాబట్టి" అని వెళ్ళిపోయాడు. అలా బాబా దయవల్ల కరోనా కేసులు కొంచెం ఎక్కువగా ఉన్న సమయంలో నా భార్య క్షేమంగా మా ఇంటికి చేరుకుంది. అప్పుడు నా ఫోన్‌కి, "నీ ప్రయాణంలో నేను నీ వెంటే వున్నాను. ఎన్నో సందర్భాలలో నిన్ను రక్షించాను" అని మెసేజ్ వచ్చింది. ఆ విధంగా ప్రయాణం చేసిన నా భార్యను క్షేమంగా చేర్చమని బాబా తెలియజేసారు. కనుక బాబా మా వెన్నంటే ఉంటారనడంలో మాకు అస్సలు సందేహం లేదు. "వెన్నటుండి ప్రయాణంలో ఎటువంటి ఆటంకం కలగకుండా, ఏ వ్యాధుల బారినపడకుండా క్షేమంగా ఇల్లు చేర్చిన మీకు కృతజ్ఞతలు బాబా".

ఒకరోజు సాయంత్రం నేను ఒక్కడినే టీవీలో సంధ్య హారతి ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాను. కర్పూరంతో బాబా మూర్తికి హారతి ఇచ్చాక చుట్టూ తిరిగి మనందరికీ చూపించి మరలా బాబాకి హారతి ఇస్తారు కదా! అయితే ఆరోజు అలా చేసినప్పుడు నాకు హారతి కనిపించలేదు. వెంటనే నేను బాబాని, "బాబా! నీ హారతి దర్శంపజేయవా?" అని మనసులో అనుకున్నాను. మరుక్షణం పెద్ద టీవీ స్క్రీన్ నిండా హారతి వెలుగు మాత్రమే ఒక నిమషంపాటు కనిపించింది. గర్భగుడిలో లైట్లు లేకుండా హారతి దర్శిస్తే ఎలా ఉంటుందో అంత వెలుగు ఉంది. మాములుగా హారతి వెలుగులో బాబా మూర్తి, సింహాసనం, సమాధి అన్ని కనిపిస్తాయి. కానీ నా కోరిక తీర్చడానికి బాబా హారతి వెలుగు మాత్రమే దర్శనమయ్యేలా చేసారు.

ఒకరోజు మా అమ్మాయి నాకు ఫోన్ చేసి, "సచ్చరిత్ర 108 సార్లు, స్తవనమంజరి 108 సార్లు పారాయణ చేయాలి. చేయగలవా?" అని అడిగింది. నేను, "బాబానే నా చేత అన్నిసార్లు పారాయణ చేయిస్తారు. నేను నిమిత్తమాత్రుణ్ణి" అని చెప్పి ఒక గురువారంనాడు పారాయణ మొదలుపెట్టాను. నేను పారాయణ మొదలుపెట్టిన కొన్ని రోజులకు నా మొబైల్ ఫోన్‌లో, 'భక్తులు పారాయణ చేయాలనుకుంటే, వారికి సచ్చరిత్ర పుస్తకం ఉచితంగా పంపుతామ'ని ఒక సందేశం నాకు కనిపించింది. నేను వెంటనే వారిచ్చిన ఫారంలో అన్ని వివరాలు నింపి ఆ సందేశం పంపినవాళ్ళకి పంపించాను. వాళ్ళు, "ఈ నెల కోటా అయిపోయింది. వచ్చే నెలలో ప్రయత్నించండి" అని బదులిచ్చారు. సరేనని, నేను తర్వాత నెలలో ప్రయత్నిస్తే వాళ్ళిచ్చిన వెబ్సైటు ఓపెన్ కాలేదు. నేను నా మనసులో, 'సచ్చరిత్ర అన్నిసార్లు పారాయణ చేస్తే, పుస్తకం నలిగిపోతుంది కదా బాబా. కాబట్టి మీరే కొత్త సచ్చరిత్ర పుస్తకం నాకు తప్పనిసరిగా పంపుతార'ని అనుకున్నాను. కొన్ని రోజులు గడిచాక ఒకరోజు ఉదయం బాబా పూజ అయిన తర్వాత నేను బాబాని, "బాబా! సచ్చరిత్ర పుస్తకం ఈరోజు నాకు అందిస్తావా?" అని అడిగాను. అదేరోజు మధ్యాహ్న హారతి చూస్తుండగా పోస్ట్మాన్ నన్ను పిలిచి ఒక కవర్ చేతికి ఇచ్చాడు. తెరిచి చూస్తే అందులో సచ్చరిత్ర పుస్తకం ఉంది. అది చూడగానే నా కళ్ళల్లో నీళ్లు తిరగగా బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. అడగ్గానే ఎలా నెరవేర్చారో చూసారా! సచ్చరిత్ర అంటే మామూలు పుస్తకం కాదు. అదొక దైవిక గ్రంథం. అక్షయపాత్ర కన్నా ఎక్కువ. నిస్వార్థ కోరికలు తీర్చే కామధేనువు.

సాయిభక్తుల అనుభవమాలిక 1821వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శ్రీ సాయి అనుగ్రహలీలలు - 33వ భాగం

నా పేరు సాయిబాబు. జీవితంలో ఒకసారైనా కాశీ, రామేశ్వరం దర్శించాలని పెద్దవాళ్ళు చెబుతుంటారు. అందుకని 2020లో నేను కాశీ, శిరిడీ వెళ్లాలనుకొని రిజర్వేషన్ చేయిస్తే, కరోనా వల్ల ప్రయాణం రద్దు అయింది. తర్వాత 2021, అక్టోబర్లో ఒకరోజు నా మనసులో బలంగా కాశీ వెళ్లాలనిపించి, "కాశీయాత్రకు అనుమతిస్తారా బాబా?" అని బాబాను అడిగాను. అదేరోజు నేను సచ్చరిత్ర చదువుతుంటే, అందులో ఓ చోట ‘కాశీ, గయ, ప్రయోగ దర్శించు' అని కనిపించింది. అలా బాబా అనుమతి లభించిందని నేను సంతోషించాను. తర్వాత బెంగళూరులో ఉన్న మా అమ్మాయివాళ్ళకి కూడా బాబా అనుమతి ఇవ్వాలని, "వాళ్ళకి కూడా అనుమతి ఇవ్వండి" అని బాబాను అడిగాను. రెండు రోజుల తర్వాత మా అమ్మాయి నాకు ఫోన్ చేసి, "బాబా అనుమతి ఇచ్చారు. కాశీ వెళ్దాం, వస్తారా" అని నన్ను అడిగింది. నిజానికి నేను కాశీ ప్రయాణానికి బాబా నాకు అనుమతి ఇచ్చిన విషయం, వాళ్ళకి అనుమతి ఇమ్మని బాబాని అడిగిన విషయం వాళ్ళకి చెప్పలేదు. కానీ బాబానే వాళ్ళకి కాశీయాత్ర చేయమని, అది కూడా కారులో అని చెప్పారట. అయితే అంత దూరం కారులో వెళ్లడమంటే భయపడ్డాం. అయినప్పటికీ బాబా ముందుండి ప్రయాణం చేయిస్తారని నేను అక్టోబరు నెల చివరి వారంలో బెంగుళూరు వెళ్ళి, అక్కడినుండి గురువారం ఉదయం మా అమ్మాయివాళ్లతో కలిసి కారులో కాశీయాత్ర మొదలుపెట్టాలని అనుకున్నాము. మా ఇంట్లో బాబాకి నిత్యం అభిషేకం చేయాలని అదివరకే రెండుసార్లు కాశీయాత్ర చేసిన నా భార్య ఇంట్లో ఉండిపోయింది. నేను ముందుగా అనుకున్నట్లు బెంగుళూరు వెళ్ళాను. అక్కడినుండి నేను, మా అమ్మాయి, అల్లుడు, మనవడు కలిసి కాశీయాత్రకు బయలుదేరాము. దారిలో ఉన్న శక్తిపీఠాలు దర్శించుకుంటూ కాశీ చేరుకున్నాము. ఆ రోజు తెల్లవారితే కార్తీకమాసం మొదలవుతున్నందున రాత్రి 2-30 గంటలకే కాశీ విశ్వనాథుని ఆలయం చేరుకున్నాము. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా వచ్చారు. వారి పూజ పూర్తైన తర్వాత చాలా తక్కువ మందిని మందిరం లోపలికి అనుమతించారు. అందువల్ల మేము తనివితీరా విశ్వేశ్వర లింగాన్ని స్పర్శించి ధన్యులమైనాము. మహా హారతి మొదలైన పూజ కార్యక్రమాలు వీక్షించాము. చీఫ్ జస్టిస్ వచ్చినందువల్ల భద్రతారీత్యా ఆరోజు పూజ సామగ్రిగానీ, ఆవుపాలుగానీ లోపలికి అనుమతించలేదు. కానీ నా అదృష్టం కొద్ది మందిరం లోపల నా పక్కనే ఉన్న ఒకరి వద్ద నుండి నాకు బిల్వపత్రం లభించింది. ఆ పత్రాన్ని నేను భక్తితో ఆనందంగా విశ్వేశ్వర లింగం మీద ఉంచాను. అంతా బాబా ఏర్పాటు. ఆయన మమ్మల్ని అంత గొప్పగా అనుగ్రహించారు. నా జన్మధన్యం. కృతజ్ఞతలు బాబా.

కాశీలో చూడవలసిన మందిరాలు, ప్రదేశాలు అన్నీ చూసుకొని కాశీలో మూడు నిద్రలు చేశాము. తర్వాత ప్రయాగ వెళ్ళాము. అక్కడ త్రివేణి సంగమం వద్దకు పడవలో వెళ్ళి, గంగాయమునలు కలిసేచోట మూడుసార్లు నీటిలో మునగడం నాకు ఒక అద్భుతమని చెప్పాలి. ఎందుకంటే, చిన్నప్పటి నుండి నీళ్లన్నా, సముద్రస్నానాలన్నా నాకు భయం. అలాంటిది బాబా ప్రేరణ వల్ల కాశీగంగలో, త్రివేణీ సంగమంలో ఎటువంటి భయం లేకుండా మునిగాను. ఆపై గయలో శక్తిపీఠం వింధ్యాచల్ అమ్మవారిని దర్శించి తిరుగు ప్రయాణమయ్యాము. మా ప్రయాణానికి ముందు బాబా కాశీ, ప్రయోగ, గయకు మాత్రమే అనుమతించారని శిరిడీ దర్శనం లేకుండా రూట్ మ్యాప్ తయారుచేశారు మా అమ్మాయివాళ్ళు. నేను తిరుగు ప్రయాణంలో శిరిడీ వెళదామంటే, మా అల్లుడు "అది వేరే రూటు. ఇంకోసారి వెళ్దాం" అన్నాడు. నాకేమో శిరిడీ వెళ్లాలని, వాళ్లేమో వద్దని. ఈ సమస్యను బాబా ఎలా తీర్చారో చూడండి. తిరుగు ప్రయాణంలో మా అమ్మాయికి బాబా కలలో కనబడి శిరిడీ రమ్మన్నారు. అయితే శిరిడీ వెళ్లాలంటే వేరే రూట్‌లో అదనంగా 500 కిలోమీటర్లు వెళ్లాలి. అదీకాక మా అల్లుడికి ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉందని, అర్జెంట్‌గా రమ్మని ఫోన్ వచ్చింది. ఎలా ఏం చేయాలి? శిరిడీనా? ఆఫీసా? అని ఎటు తేల్చుకోలేని స్థితిలో పడ్డాము. అప్పుడు బాబా ఎలా దారి చూపారో, సమయానికి ఎలా ఆదుకున్నారో చూడండి. బయలుదేరిన కొద్దిసేపటికి కారులో ఉన్న డాష్ బోర్డులో 'కీ' బొమ్మ గల సెన్సార్ లైట్ వెలిగి ఆగింది. దాంతో ఒక టోల్గేట్ దగ్గర కారు పక్కన ఆపి ఇంజన్ కింద చూసేసరికి కూలెంట్ వాటర్ మొత్తం నెలపాలై ట్యాంక్ మొత్తం ఖాళీ అయింది. అంతలో ఒక వ్యక్తి మా దగ్గరకు వచ్చి కారుకి ఏమైందని అడిగి కింద మడుగు చూసి, "ఇక్కడ నుండి ఒక కిలోమీటర్ దూరంలో మెకానిక్ ఉన్నాడు, అతన్ని పిలుచుకొని రండి" అని అడ్రస్ చెప్పి, తన బైక్ కూడా ఇచ్చాడు. మా అల్లుడు ఆ బైక్ మీద వెళ్లి మెకానిక్‌ని తీసుకొచ్చాడు. అతను చూసి, "కూలెంట్ వాటర్ పైపు పగిలిపోయినట్టుంది. ప్రస్తుతానికి నీళ్లు పోసుకుని పది కిలోమీటర్ల వరకు వెళ్తే, ఒక గ్యారేజ్ వస్తుంది. అక్కడ చూపించండి" అని చెప్పాడు. అలాగే అని వాళ్లకు కృతజ్ఞతలు చెప్పి గ్యారేజ్‌కు వెళ్ళాము. అక్కడ మెకానిక్ కారును చూసి, "రిపేర్ ఏమిటో అర్థం కావడం లేదు. కారు ముందు భాగం విప్పి చూడాలి. ఒకరోజు పడుతుంది. దీపావళి కారణంగా షాపులు సెలవు. కాబట్టి స్పేర్ పార్టులు దొరకవు" అని చెప్పి తన దగ్గర ఉన్న కూలెంట్ వాటర్ బాటిల్ ఇచ్చాడు. కానీ అది కారిపోకుండా నిలవాలి కదా! అందుకని మా అమ్మాయి బాబాని ప్రార్థించి ఒక ఊదీ ప్యాకెట్ మొత్తం ట్యాంక్‌లో పోసి, "ఇక బయలుదేరుదాం. ఏ ఆటంకం రాకుండా బాబానే మనల్ని శిరిడీ చేర్చుతారు" అంది. అంతే, శిరిడీ వెళదామని నిర్ణయించుకుని, దర్శన పాసులు బుక్ చేసుకొని, బాబా మీద భారమేసి బయలుదేరాము. రాత్రి 8 గంటలకు శిరిడీ చేరుకున్నాము. మేము ముందుగా ద్వారకామాయిలో బాబాని దర్శించుకొని తర్వాత పదిగంటలకు సమాధి మందిరంలో అడుగుపెట్టాము. బాబా మూర్తిని చూడగానే నా చుట్టూ వున్నవేవీ నాకు కన్పించలేదు. బాబా మాత్రమే నాకు కనిపిస్తున్నారు. అంతలో ఓ అద్భుతమైన ఆశీర్వచనం నాకు లభించింది. బాబా తమ శిరస్సును క్రిందకి, పైకి ఆడించి కనులు మూసి తెరిచారు, 'రమ్మనగానే వచ్చారా'? అన్నట్లుగా. ఒక్క క్షణం నన్ను నేను నమ్మలేకపోయాను, భ్రమ ఏమో అనుకున్నానుగాని ఆ విషయం గురించి నేను మావాళ్లెవరికీ చెప్పలేదు. శేజారతి అనంతరం రూమ్‌కి వెళ్లి విశ్రాంతి తీసుకొని, మర్నాడు ఉదయం కొల్హాపూర్ వెళ్లేందుకు బయల్దేరాము. అప్పుడు మా అమ్మాయి మొబైల్ ఫోన్‌కి, "మీ నాన్నకు నా అనుగ్రహం లభించింది" అని ఒక మెసేజ్ వచ్చింది. ఆ వెంటనే ఒక వీడియో మెసేజ్ కూడా వచ్చింది. ఆ వీడియోలో ఒక గుడిలో అమ్మవారు నెమ్మదిగా కనులు మూసి, మళ్ళీ తెరవడం, అంతేకాక అమ్మకు ఎడమ వైపున బాబా ఉండటం వుంది. వాటిని మా అమ్మాయి నాకు చూపించినప్పుడు రాత్రి నాకు కలిగిన అనుభవం భ్రమ కాదని, బాబా తమ నిజరూప దర్శనమిచ్చామని ఈవిధంగా తెలియజేస్తున్నారనిపించి మా అమ్మాయివాళ్లకు ముందురోజు రాత్రి నాకు కలిగిన అనుభవం గురించి చెప్పాను. బాబా అనుగ్రహానికి మా అందరికీ చాలా సంతోషమేసింది. ముందురోజు ఆ మెకానిక్ చెప్పింది, 'పది కిలోమీటర్లు వెళ్ళవచ్చ'ని. కానీ బాబా శిరిడీ, శిరిడీ నుండి కొల్హాపూర్, అక్కడినుండి బెంగళూరులోని మా ఇంటికి ఏ ఆటంకం లేకుండా చేర్చారు(అంతేకాదు, ఇప్పటివరకు కారుకి ఏ రిపేరూ లేదు). ఇన్ఫెక్షన్ సమయానికి మా అల్లుడు ఆఫీసుకి కూడా వెళ్ళిపోయాడు. అలా రూట్ మ్యాప్‌లో లేని శిరిడీ దర్శనం, అవలీలగా అన్ని కిలోమీటర్ల ప్రయాణం బాబా ఆశీస్సులతో సాద్యమైంది. "ధన్యవాదాలు బాబా. ఎప్పటికీ ఇలాగే మా కుటుంబాన్ని కనిపెట్టుకొని ఉండు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1820వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శ్రీసాయి అనుగ్రహలీలలు - 32వ భాగం

నా పేరు సాయిబాబు. 1995లో బాబా మాకు ఒక ఫిలిప్స్ కలర్ టీ.వీ. 16,000 రూపాయలకు ఇప్పించారు. అప్పటి మా స్థోమతకు అది ఎక్కువే. కానీ బాబా దయవలన చాలా సులువుగా మాకు ఆ టీవీ అమరింది. అప్పటినుండి ఇప్పటివరకూ ఆ టివికి ఏ రిపేరూ లేదు. అయితే ఒకరోజు నా భార్య హారతి చూస్తూ, "స్మార్ట్ టీవీ పెద్ద స్క్రీన్ మీద చూస్తే, శిరిడీలో మీకు ఎదురుగా ఉండి చూసినట్లు మీరు చాలా స్పష్టంగా కనిపిస్తారు బాబా" అని మనసులో అనుకొని హారతి అయ్యాక టీవీ ఆఫ్ చేసి తన పనుల్లో నిమగ్నమైంది. తరువాత నాలుగు రోజులకు నేను పేపరు చదువుతూ 'స్మార్ట్ టీవీలకు దసరా ఆఫర్లు ఇచ్చారు' అని ప్రక్కనే ఉన్న నా భార్యతో అన్నాను. వెంటనే ఆమెకు, 'న్యూస్ పేపరులో కొన్ని వందల వార్తలుంటే, టీవీలకు సంబంధించిన వార్తే ఎందుకు బాబా మావారితో చెప్పించారు?' అనిపించి, 'కొత్త టీవీ తీసుకోవాలా బాబా?' అని బాబాను అడిగింది. 'తీసుకోమ'ని ఆయన సమాధానం వచ్చింది. దాంతో 'చిన్న టీవీ అయినా పరవాలేదు. బాబా హారతి స్పష్టంగా కన్పిస్తే చాలులే' అని నేను, నా భార్య వెంటనే రిలయన్స్ షోరూంకు వెళ్ళాము. తీరా చూస్తే, అక్కడ చిన్న టీవీల ధరలే చాలా ఎక్కువ ఉన్నాయి. దాంతో మేము, 'చిన్న టీవీకి ఇంత రేటా?' అని అసంతృప్తిగా 5 నిమిషాలు నిలబడి, ఇక వెళ్ళిపోదామని వెనక్కి తిరిగాము. అనుకోకుండా ఒక ప్రక్కగా ఉన్న ఒక టీవీ మీద నా భార్య తన చేయి వేసింది. ఎందుకో మేము తీసుకోవాల్సిన టీవీ అదేనేమోననిపించి బాబాని అడిగితే, "తీసుకోమ"ని సమాధానం వచ్చింది. అయితే ఆ టీవీ చాలా పెద్దది. 42 ఇంచుల స్క్రీన్. మేము ఇది ఇంకా ఎక్కువ రేటు ఉంటుందని అనుకుంటూనే అక్కడున్న సేల్స్ బాయ్‌ని రేటు అడిగితే, చాలా చాలా తక్కువ చెప్పాడు. ఒక్క నిముషం అతను చెప్పింది మేము సరిగా వినలేదేమోననుకొని మళ్ళీ రేటు అడిగాము. అతను మళ్ళీ అదే రేటు చెప్పి, నిర్ధారణకోసం స్లిప్ తీసి చూపించాడు. మేము నమ్మలేకపోయాం. ఇదంతా బాబా అనుగ్రహమని సంతోషంగా ఆ పెద్ద టీవీ కొనుక్కొని, కారులో పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి ఫిక్స్ చేసాము. ఇప్పుడు నాలుగు హారతులు ఆ టీవీలో చూస్తుంటే పిక్చర్ చాలా క్లియర్‌గా ఉన్నందువల్ల శిరిడీలో బాబాకి ఎదురుగా వున్న అనుభూతి మాకు కలుగుతుంది. బాబాను నమ్మితే, ఆయన దయ అలా ఉంటుంది.

ఆ టీవీ నాలుగు సంవత్సరాలు బాగా పని చేసిన తర్వాత ఒకరోజు ఉదయం కాకడ హారతి చూస్తుండగా టీవీ స్క్రీన్ ఆగిపోయి, వాయిస్ మాత్రమే వినిపించసాగింది. మెకానిక్‌ని పిలిచి టీవీ చూపిస్తే, "లోపల బ్యాక్ లైట్లు పోయాయి. బాగు చేయడానికి ఆరువేల రూపాయలవుతుంది" అని చెప్పారు. మరో ఇద్దరు మెకానిక్‌లు కూడా అదేమాట చెప్పారు. పైగా గ్యారెంటీ ఇవ్వలేమని, డబ్బులిస్తే వెంటనే అవి తెచ్చి, వేస్తామని తొందరపెట్టారు. కానీ మేము ఏ పని చేయాలన్నా బాబా అనుమతి తీసుకుంటాము. అందుకని, "టీవీ రిపేరు చేయించాలా బాబా?" అని అడిగితే, 'వద్దు' అని బదులిచ్చారు బాబా. రెండునెలల కాలంలో ఎన్నిసార్లు బాబాని అడిగినా 'వద్దు' అనే వచ్చింది. బాబా ఎందుకలా చెపుతున్నారో మాకు అర్థం కాలేదు. వారంటీ ఇస్తారేమోనని కంపెనీవాళ్ళను కూడా సంప్రదించినా ఉపయోగం లేకపోయింది. చివరికి ఒకరోజు నా భార్య బాబాని, "ఒక రూపాయి కూడా ఖర్చు కాకుండా టీవీ బాగు చేయించండి బాబా" అని ప్రార్ధించింది. ఆ తర్వాత ఒకరోజు నా భార్య ఫోన్ నెంబర్లు చెక్ చేసుకుంటుండగా ఒక టీవీ మెకానిక్ నెంబర్ కనిపించింది. అతనికి ఫోన్ చేసి విషయం చెప్తే, అతను, "నేను ఇప్పుడు ఆ పని మానేసి వేరే పని చేస్తున్నాను. నేను ఒక నెంబర్ ఇస్తాను. మాట్లాడి చూడండి" అని చెప్పాడు. నా భార్య అతని వద్ద నెంబర్ తీసుకుని, ఆ నెంబర్‌కి ఫోన్ చేసి విషయం చెప్పింది. అతను, "4,000 అవుతుంది. మూడు నెలలు గ్యారెంటీ. కానీ మీరే టీవీ తీసుకుని షాపుకు రండి" అని చెప్పాడు. అంతపెద్ద టీవీ తీసుకుని వెళ్లాలంటే రిస్క్ అని బాబాని అడిగితే, 'తీసుకెళ్ళమ'ని సమాధానం వచ్చింది. టీవీని కదిలించడం, బయటికి తీసుకెళ్లడం మాకు ఇష్టం లేకపోయినా బాబా చెప్పిన తర్వాత తీసుకెళ్లి తీరాల్సిందేనని నా భార్య కారు వెనక సీటులో కూర్చొని, తన ఒడిలో టీవీ పెట్టుకుంటే నేను కారు డ్రైవ్ చేశాను. మనసులో 'ఏదో కారణం లేనిదే బాబా ఇదంతా జరిపించారు' అని అనుకుంటూ 15 కిలోమీటర్ల దూరంలో తెనాలిలో ఉన్న షాపుకి వెళ్లి, టీవీ రిపేర్ చేసే అతనికిచ్చి మేము వేరే పని మీద వెళ్ళాము. గంట తర్వాత ఆ షాపతను మాకు ఫోన్ చేసి, "టీవీలో ఏ రిపేరూ లేదు. చిన్న వైరు ఊడిపోయి లైట్లు వెలగడం లేదు. సరి చేసాం. ఇప్పుడు టీవీ బాగా వస్తుంది. వచ్చి తీసుకెళ్లండి" అని చెప్పాడు. వెంటనే నా భార్య బాబాకి కృతజ్ఞతలు చెప్పి, అతనికి కూడా చాలా "చాలా థాంక్స్ అండి” అని చెప్పింది. బాబా ఎన్నిసార్లు ఆడిగినా రిపేరు చేయొద్దని ఎందుకన్నారో మాకు అప్పుడు అర్థం అయింది. చూశారా! 4వేలో, 6వేలో ఖర్చు అవుతుందనుకుంటే, ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకుండా టీవీ బాగయ్యేలా చేశారు బాబా. షాపువారికి సర్వీస్ చార్జ్ మాత్రమే ఇచ్చాము. చాలా డబ్బు ఖర్చు అవకుండా చూడడమే కాకుండా మంచి నిజాయితీపరుడైన మెకానిక్‌ని చూపించారు బాబా. ఇప్పుడు అంతకుముందు కంటే టీవీ చాలా బాగా వస్తుంది. తొందరపడకుండా బాబా చెప్పినట్లు సహనంతో వేచి వున్నందుకు చివరికి మంచే జరిగింది.

మనం బాబాని ప్రశ్న అడిగితే, వారి సమాధానం మన మనసుకు నచ్చకపోయినా సరే, బాబా చెప్పినట్లే నడుచుకోవాల్సిందే! అలా నడుచుకోవడం వల్ల మనకి తప్పక మేలు జరుగుతుంది. బాబా సమాధానం వెనక పరమార్ధమేమిటో కూడా మనకు తెలిసి వస్తుంది. అలాంటి అనుభవమే ఇది. 2021 మార్చి నెలలో మా అత్తగారు మా ఇంటికి వచ్చారు. ఆమెని చూడటానికి మా అమ్మాయి బెంగుళూరు నుండి వచ్చింది. అదేరోజు నా భార్యకు చెల్లెలు వరసయ్యే ఒకామె కూడా వచ్చింది. ఆరోజు సాయంత్రం 5 గంటల సమయంలో పోన్నురులోని హాస్పిటల్లో ఉన్న ఒకరిని పరామర్శించటానికి వెళ్ళాల్సి వచ్చి అందరం కలిసి వెళ్ళడానికి బయలుదేరాము. ఆ సమయంలో మా కారు కొంచెం ప్రాబ్లంగా ఉంది. అయినప్పటికీ బాబా అందర్నీ ఆ కారులోనే వెళ్ళమన్నారు. సరే, 17 కిలోమీటర్లే కదా! దగ్గరేనని బయలుదేరి వెళ్ళాము. మేము వెళ్లిన పనయ్యేసరికి చీకటి పడింది. మా అత్తగారికి సముద్రం అంటే చాలా ఇష్టం. పైగా అందరం ఉన్నాం. అందుకని, 'ఈ సమయంలో బాపట్ల దగ్గర సూర్యలంక వెళ్ళొచ్చా?' అని బాబాని అడిగితే, 'వెళ్ళమ'ని అనుమతి ఇచ్చారు. కానీ, 'రానూపోనూ వంద కిలోమీటర్లు. కారు వేడెక్కితే ఎలా? అదీకాక ఈ సమయంలో బీచ్‌లో అనుమతి ఉంటుందో, లేదో, ఉన్నా చాలా చీకటిగా ఉంటుంది, ఎవరూ ఉండరు, ఇబ్బందవుతుందేమో!' అని పలురకాలుగా సందేహించినప్పటికీ బాబా సెలవిచ్చారు కనుక వెళ్లాల్సిందేనని బయలుదేరాము. భయభయంగా వెళ్లినా మాకు అక్కడ అద్భుతం ఎదురైంది. బాబా ఎందుకు వెళ్ళమన్నారో అర్థమైంది. అక్కడ బీచ్ దాకా సిమెంట్ రోడ్లు, పట్టపగల్లా లైట్లు, షాపులు, పెద్ద రిసార్ట్, అందులో జనం, క్యాంటీన్, సకల సౌకర్యాలూ ఉన్నాయి. నాలుగైదు సంవత్సరాల క్రితం మేము అక్కడికి వెళ్ళినప్పుడు మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి. అలాంటిది ఐదేళ్లలో చాలా మార్పు వచ్చింది. వెన్నెల్లో సముద్రం, తెల్లటి నురుగులతో చీకట్లో ఒడ్డుకు వచ్చి చల్లగా మా పాదాలను తాకే సముద్రపు అలలు, దూరంగా నౌకల్లోని లైటింగ్, చల్లటి గాలి, నిశ్శబ్ద వాతావరణం, ఆకాశంలో చంద్రుడు, చుక్కలు మాటల్లో చెప్పలేని మధుర భావనలలో ఎవరికి వారు ఎంజాయ్ చేస్తూ చాలాసేపు బీచ్‌లో మౌనంగా గడిపాము. మనసంతా ఎంతో ఆనందంతో నిండిపోయింది. పగటిపూట ఎన్నోసార్లు సముద్రం దగ్గరకు వెళ్ళాము కానీ. మనసారా నూటికి నూరుశాతం ప్రకృతిని ఆస్వాదించడం అదే మొదటిసారి. సముద్రం చూస్తూ జీవితంలో గొప్ప మధురానుభూతిని ఆస్వాదించేలా చేసిన బాబాకి మనసులోనే మనస్ఫుర్తిగా కృతజ్ఞతలు చెప్పుకొని తిరిగి వచ్చాము.

సాయిభక్తుల అనుభవమాలిక 1819వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • అసాధ్యాల్ని సుసాధ్యం చేసే శక్తి కేవలం బాబాకి మాత్రమే ఉంది

అసాధ్యాల్ని సుసాధ్యం చేసే శక్తి కేవలం బాబాకి మాత్రమే ఉంది


నేను ఒక సాయిభక్తుడిని. 2024, ఫిబ్రవరి 14న విజయనగరంలో నా భార్య పిన్ని కొడుకు పెళ్లి జరిగింది. ఆ పెళ్ళికి వెళ్లి, అక్కడినుండి పలాస వెళ్లి భూమి రిజిస్ట్రేషన్ పని చూసుకొని వద్దామని నేను, నా భార్య ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు వెళ్ళడానికి కుదరని పరిస్థితి వచ్చింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో నా భార్యను సంవత్సరం 5 నెలల వయసున్న మా బాబుతో పంపాలని అనుకున్నాను. షోలాపూర్ నుండి విజయనగరానికి 20 గంటల ప్రయాణం. అందువల్ల నేను బాబాని, "నా భార్యను చిన్నబాబుతో మొదటిసారి అంతదూరం పంపుతున్నాను బాబా. వాళ్లకు ఎవరూ తోడు లేరు. మీరే వాళ్ళకి తోడుగా ఉండి ఎటువంటి ఇబ్బందీ లేకుండా అక్కడికి చేర్చి, అలాగే తిరిగి వచ్చేలా కరుణించండి. వాళ్ళు తిరిగి వచ్చాక గురువారంనాడు మీ మందిరంలో 101 రూపాయల దక్షిణ సమర్పించి, ఒకరికి అన్నదానం చేస్తాను" అని ప్రార్థించాను. బాబా నా కోరిక విన్నారు. నా భార్యబిడ్డలు క్షేమంగా వెళ్ళి, అక్కడ పెళ్లి చూసుకొని తిరిగి షోలాపూర్ చేరుకున్నారు. లేదు, లేదు బాబానే తోడుగా ఉండి క్షేమంగా వెళ్లివచ్చేలా చూశారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


తర్వాత 2024, మార్చ్ 6న నా భార్య అత్త కొడుకు పెళ్లి విశాఖలో జరిగింది. నేను ఆ పెళ్ళికి వెళ్లి, మర్నాడు భూమి రిజిస్ట్రేషన్ పని చూసుకొని వద్దామని అనుకున్నాను. అయితే నేను ఇండియన్ రైల్వేస్ ఆక్సిడెంట్ విభాగంలో పని చేస్తున్నాను. మా సెక్షన్‌లో నేను, నాతోపాటు ఇంకొకతను ఇంచార్జ్ ఇంజనీర్స్‌గా ఉన్నాము. మా ఇద్దరిలో ఎవరో ఒకరు తప్పనిసరిగా విధులలో ఉండాలి. అయితే ఆ వేరే ఇంజనీర్ రెండు వారాల ట్రైనింగ్ పని మీద 2024, మార్చ్ 4న బెంగళూరు వెళ్లడంతో నేను ఆఫీస్ వదిలి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి వల్లే ఫిబ్రవరి 14న పెళ్లికి వెళ్ళలేకపోయాను. దాంతో భూమి రిజిస్ట్రేషన్ పని వాయిదా పడింది. ఈ పెళ్లికైనా వెళ్లి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని వద్దామంటే మళ్ళీ వెళ్లలేని పరిస్థితి వచ్చేసరికి బాబానే నాకు మొదట గుర్తుకు వచ్చారు. ఎందుకంటే, అసాధ్యాల్ని సుసాధ్యం చేసే శక్తి కేవలం ఆయనకి మాత్రమే ఉంది. అందుచేత, "బాబా! గతనెలలో పెళ్లికి వెళ్లాలని రిజర్వేషన్ చేసుకొని కూడా పరిస్థితుల ప్రభావం వల్ల వెళ్ళలేకపోయాను. కనీసం ఇప్పుడైనా పెళ్లికి వెళ్ళేటట్లు చేసి బంధువునల వద్ద ఎటువంటి మాట పడకుండా చేయి తండ్రీ. అలానే రిజిస్ట్రేషన్ పని పూర్తయ్యేలా అనుగ్రహించు బాబా. అలా జరిగితే మీ మందిరంలో 101 రూపాయల దక్షిణ, మీకెంతో ఇష్టమైన పాలకోవా సమర్పించి, 5 గురుకి అన్నదానం చేస్తాను" అని బాబాను ప్రార్థించాను. ఆ తండ్రిని భక్తితో ప్రార్థిస్తే జరగనిది ఏమైనా ఉందా? బాబా దయవల్ల మా ఇంచార్జ్ నా సహోద్యోగి సహకారంతో నా విధులను సర్దుబాటు చేసారు. దాంతో నేను విశాఖపట్నంలో పెళ్లికి వెళ్లి బందువులతో కలిసి సంతోషంగా గడిపి, మరుసటిరోజు విజయనగరంలోని మా అత్తగారింటికి వెళ్లి, అక్కడ నుండి పలాస వెళ్ళాను. బాబా కరుణతో రిజిస్ట్రేషన్ పని పూర్తి చేయించారు. ఆయన దయతో మహాశివరాత్రి రోజున మా నాన్నగారితో కలిసి మా శివాలయంలో శ్రీకపిలేశ్వరస్వామి దర్శనం చేసుకున్నాను. ఆ తర్వాత షోలాపూర్ తిరిగి వచ్చాను. మొత్తం ప్రయాణంలో ఎక్కడా ఎటువంటి ఇబ్బందీ కలగకుండా బాబా కరుణించారు. అలాగే నేను లేని నాలుగు రోజులు షోలాపూర్‌లో ఉన్న నా భార్య, 1.5 సంవత్సరాలు మా బాబుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు బాబా.


ఆ తర్వాత 2024, మర్చి 24న మా బంధువుల పెళ్లి రిసెప్షన్ హైదరాబాద్‌లో జరిగింది. ఆరోజు ఆదివారం అయినందున నాకు, నా భార్యకి ఇద్దరికీ సెలవు, పైగా ఆ ఫంక్షన్‌కి మా అన్నయ్య-వదినలు, అక్క-బావలు, నా భార్య అక్కలు వాళ్ళవాళ్ళ కుటుంబాలతో వస్తున్నారు. అందువల్ల వాళ్ళందర్నీ కలవాలన్న ఉత్సుకతతో ఆ ఫంక్షన్‌కి హాజరవ్వదలచి నాకు, నా భార్యకి ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నాం. అయితే మేము శనివారం రాత్రి 10 గంటలకి ట్రైన్ ఎక్కాల్సి ఉండగా ఆరోజు ఉదయం 03:30కి ఒక ట్రైన్ ఏక్సిడెంట్ అయిందని సైరన్ మోగించారు. దాంతో నేను వెంటనే పునరుద్ధరణ పనుల నిమిత్తం వెళ్లాల్సి వచ్చింది. 2023, మే నెలలో ఇలానే ఆక్సిడెంట్ అయితే డ్యూటీ ముగించుకొని 27 గంటల తర్వాత ఇంటికి వచ్చాను. ఈసారి కూడా అలా అయితే నేను హైదరాబాద్ వెళ్లడం కుదరదు. మా కుటుంబసభ్యులని కలిసే అవకాశం ఉండదు. అందువల్ల నాకు చాలా టెన్షన్ పట్టుకొని, "బాబా! ఈ పునరుద్ధరణ పనులు తొందరగా పూర్తై, తొందరగా ఇంటికి చేరుకునేలా కరుణించండి. అలా కరుణిస్తే మీకు 101 రూపాయల దక్షిణ సమర్పించుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబాని ప్రార్థిస్తే జరగనిదంటూ ఏమైనా ఉంటుందా! బాబా దయవల్ల మేము మొదలుపెట్టిన పునరుద్ధరణ పని ఉదయం 06:20కే పూర్తై పోయింది. వెంటనే పునరుద్ధరణ మెటీరియల్/ఎక్విప్మెంట్ అంతా టూల్ వ్యాన్‌లో 8గంటల వరకు లోడింగ్ చేసాము. వెంటనే తిరుగు ప్రయాణానికి పై అధికారులను అనుమతి అడిగాము. గతసారి లోడింగ్ అయినా తర్వాత మధ్యాహ్నం 03:30కి తిరుగు ప్రయాణానికి అనుమతి అడిగితే, రాత్రి 01:30కి అనుమతి దొరికింది. కానీ ఈసారి బాబాని భక్తితో ప్రార్థించడం వల్ల 08:00కి అనుమతి అడిగితే, 09:00 కల్లా అనుమతి దొరికింది. ఏమని చెప్పను బాబా లీలని? నేను ఉదయం 10:00 కల్లా ఇంటికి వచ్చాను. బ్యాగులు సర్దుకొని రాత్రి 10:00కి ట్రైన్ ఎక్కాము. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో దిగి బంధువులందరితో కలసి సరదాగా గడిపి అదేరోజు రాత్రి తిరుగు ప్రయాణమయ్యాము. ఇదంతా కేవలం సాయినాథుని కృప. ఆ తండ్రికి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. "మీ దీవెనలు ఎల్లప్పుడూ నీ భక్తులపై ఉండాలని కోరుకుంటున్నాను బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1818వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయతో తీరిన సమస్యలు
2. బాబా చెప్పుకుంటే అందిన డబ్బు

బాబా దయతో తీరిన సమస్యలు


సాయిబంధువులకు నమస్కారం. నా పేరు కిషోర్. కొంతకాలం క్రితం నేను విపరీతమైన దగ్గుతో బాధపడ్డాను. నేను నెమ్మదిగా తగ్గుతుందిలే అనుకున్నాను కానీ, రోజురోజుకు ఎక్కువ కాసాగింది. అప్పుడు భరించలేక డాక్టర్ దగ్గరికి వెళితే, కొన్ని మందులు ఇచ్చారు. అవి వాడితున్నా ఉపశమనం కలగలేదు సరికదా దగ్గు మరింత ఎక్కువైంది. అదీకాక శ్వాస అందేది కాదు. భయంతో మళ్ళీ డాక్టర్ని సంప్రదిస్తే, "మరేం పర్వాలేద"ని కొత్త మందులు ఇచ్చారు. అయితే అవి వాడినా కూడా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఒక్కొక్కసారి శ్వాస అందక ప్రాణం పోతున్నట్లనిపించి నాకు ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు. నా పరిస్థితి చూసి నా కుటుంబసభ్యులు చాలా బాధపడ్డారు. నాకు ఏం చేయాలో తెలియక బాబా ఊదీ నీళ్లలో కలిపి తాగడం మొదలుపెట్టాను. 'దగ్గు తగ్గితే, నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాన'ని అనుకుని రోజూ సాయి నామస్మరణ చేస్తూ ఉండేవాడిని. బాబా దయవల్ల నెమ్మదిగా దగ్గు తగ్గి, శ్వాస అందుతూ ఇప్పుడు పూర్తిగా తగ్గింది. "ధన్యవాదాలు సాయిప్రభూ".


నాకు ఆటలంటే పిచ్చి. ఒకరోజు ఆడుతున్న సమయంలో నా కుడిభుజం కండరాలు, అలాగే కాళ్ల మధ్య(గజ్జల్లో)లో కండరాలు వాచిపోయి. చేయి పైకి ఎత్తలేకపోయాను, అలాగే అడుగు తీసి అడుగు వేయలేకపోయాను. నా మనసుకి ఏదైనా ప్రమాదం జరిగిందేమోననిపించి, "బాబా! లోపల పెద్ద సమస్యేమీ లేకుండా వాపు, నొప్పి తగ్గేలా అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల రెండు రోజులు మందులు వేసుకునే పాటికి తగ్గిపోయింది. "బాబా! మీకు అనేక కృతజ్ఞతలు".


నేను ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాను. మా యూనివర్సిటీలో మేము ప్రతి ఆరునెలలకు పిహెచ్‌డి స్కాలర్లను తీసుకోవాల్సి ఉండగా 2023లో సుడాన్ దేశపు విద్యార్థులు చాలామంది మా యూనివర్సిటీలో పిహెచ్‌డి చేయడానికి అప్లై చేసారు. మాపై అధికారులు మమ్మల్ని ఖచ్చితంగా తీసుకోవాలని ఒత్తిడి చేశారు. అందరికీ కనీసం ఒక్క సుడాన్ వ్యక్తినైనా కేటాయిస్తామని కూడా అన్నారు. అయితే వేరే దేశం విద్యార్థులను నా కింద తీసుకోవడం నాకు ఇష్టం లేక "బాబా! నాకు ఏ విద్యార్థినీ కేటాయించకూడదు" అని బాబాతో చెప్పుకున్నాను. సాయినాథుని దయవల్ల నాకు విద్యార్థులను కేటాయించలేదు. "మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే బాబా. నాకున్న కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తీర్చి నన్ను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేయండి సాయిదేవా". ఓపికగా చదివిన ప్రతి భక్తుడికీ నా కృతజ్ఞతలు. సాయినాథుని దివ్య ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.


బాబా చెప్పుకుంటే అందిన డబ్బు

ముందుగా అందరికీ వందనాలు. నా పేరు గురుప్రసాద్. నేను ఆస్ట్రేలియాలో నివాసముంటున్నాను. నేను 5 సంవత్సరాల క్రితం ఒక స్నేహితునికి కొంత డబ్బు ఇచ్చాను. ఒక సంవత్సరం కిందట నాకు చాలా అవసరమై నా డబ్బు నాకు తిరిగి ఇవ్వమని తనని అడిగితే, ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. ఎప్పుడు ఫోన్ చేసినా ఇస్తానని చెప్తూ, చివరికి నాతో గొడవ కూడా పడ్డాడు. డబ్బిచ్చి, మన అవసరాలకి తిరిగి అడిగితే ఇలా చేస్తున్నారని నాకు చాలా బాధేసి, "బాబా! మీరే ఏదో విధంగా తన నుండి డబ్బు తిరిగి వచ్చేలా చేయాలి" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల 2024, మార్చి 24న తను నా డబ్బు నాకు పంపి, క్షమాపణ కూడా చెప్పాడు. బాబా తలచుకుంటే ఏదైనా అవుతుంది. "ధన్యవాదాలు బాబా. మీకు ఋణపడి ఉంటాను".


సాయిభక్తుల అనుభవమాలిక 1817వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • భక్తుడిగా ఆమోదించి కాపాడుతున్న బాబా

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! సాయిబంధువులకు నమస్కారములు. నేను ఒక సాయిభక్తుడ్ని. నేను నా కుటుంబంతో ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్నాను. మేము 2023, సెప్టెంబర్లో ఇండియా వచ్చి తిరిగి 2023, అక్టోబర్లో ఆస్ట్రేలియాలోని మా ఇంటికి చేరుకున్నాము. ఇక్కడకి వచ్చిన రోజు నుంచి మా కుటుంబమంతా అనారోగ్యం పాలయ్యాము. కోవిడ్‌ ఏమోనని పరీక్ష చేయిస్తే, నెగటివ్‌ వచ్చింది. అయితే మరుసటిరోజు మా ఇద్దరబ్బాయిలు మరింత ఎక్కువగా అనారోగ్యం పాలై రాత్రంతా నిద్రపోకుండా చాలా ఇబ్బందిపడ్డారు. మాకు చాలా భయమేసి మందులతో పాటు బాబా ఊదీ పిల్లల నుదటన పెట్టి, మరికొంత ఊదీ నీటిలో కలిపి ఇచ్చి, "ఉదయానికల్లా తగ్గేలా దయ చూపమ"ని బాబాను వేడుకొన్నాము. అంతే! సాయి దయతో ఉదయానికల్లా పిల్లలకు చాలావరకు నయమైంది. సాయిబాబాను నమ్ముకున్న వాళ్ళకు ఎలాంటి ఆపద రానివ్వరు. “ధన్యవాదాలు బాబా”.


2013వ సంవత్సరం ముందు నేను అన్ని గుళ్ళకు వెళ్ళినట్టే సాయి మందిరాలకు కూడా వెళ్ళేవాడిని. కానీ సాయిబాబా గురించి, హారతులు గురించి నాకు ఏమీ తెలియదు. అప్పటికే నాకు పెళ్ళై 2 సంవత్సరాలు అయింది, ఇంకా సంతానం లేదు. మేము సంతానం కోసం డాక్టర్లు సూచించిన మందులు వాడుతున్నాము. అటువంటి సమయంలో మా స్నేహితులు ఇచ్చిన సలహాననుసరించి సాయిబాబా మీద పూర్తి నమ్మకంతో 'నవగురువార' వ్రత్రం మొదలుపెట్టి భక్తిశ్రద్ధలతో ముగించాము. వ్రతం ముగిసిన కొన్నిరోజులకే మేము తల్లితండ్రులం కాబోతున్నామని మాకు తెలిసింది. మేము సంతోషంతో బాబాకు మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకొని బాబాను ప్రతిరోజూ పూజించటం మొదలుపెట్టాము. బాబా దయతో మాకు పండంటి బాబు జన్మించాడు. ఆ తరువాత రెండున్నర సంవత్సరాలకు బాబా దయతో మరో బాబు జన్మించాడు. మేము ఇద్దరికీ చివర 'సాయి' అని వచ్చేటట్టు పేర్లు పెట్టుకున్నాము. బాబా మా జీవితంలో భాగమై మాకు తోడుగా ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మమ్మల్ని నడిపిస్తున్నారు. “ధన్యవాదాలు బాబా”.


పై అనుభవం జరగడానికి ముందు నుంచే బాబా నన్ను తమ భక్తుడిగా ఆమోదించి కాపాడుతున్నారని నేను చాలా ఆలస్యంగా తెలుసుకొని ఆశ్చర్యపోయాను. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నాకు వివాహం జరగడానికి సుమారు రెండు సంవత్సరాలకు ముందు చలికాలంలో నేను కొంతమంది స్నేహితులతో కలసి మంచుకొండల్లో స్నో బోర్డింగ్(snowboarding) ఆడటానికి కొంతదూరం ప్రయాణించి ఓ చోటుకి వెళ్ళాను. అక్కడ అందరూ ఐస్‌(మంచు) మీద పైనుంచి కిందకి టొబొగ్గాన్ అనే బోర్డ్ మీద కూర్చుని జారుతున్నారు. మేము కూడా ఆ టొబొగ్గాన్ బోర్డులు అద్దెకు తీసుకొని జారడం మొదలుపెట్టాలని అనుకున్నాము. అయితే మా అందరికి సరిపడా బోర్డులు దొరకలేదు. కొన్నే దొరికాయి. అందుచేత మేము ఒకరి తర్వాత ఒకరు జారడం మొదలుపెట్టాము. నేను కిందకి జారిన తర్వాత ఆ బోర్డు తీసుకొని పైనున్న నా స్నేహితుడికి ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు సుమారు 70 సంవత్సరాల వయస్సున్న ఒక పెద్దాయన, ఆయనతోపాటు ఒక పెద్దావిడ నాకు కనిపించారు. వాళ్ళు చూడటానికి ఇండియా నుండి వచ్చిన దంపతులలా ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళకి సంబంధించిన వాళ్ళెవరూ లేరు. వాళ్ళు చాలా పలుచని అతి సాధారణ దుస్తులు ధరించి ఉన్నారు. -3 డిగ్రీల మంచు వర్షంలా పడుతున్న ఆ వాతావరణంలో అలాంటి దుస్తులతో ఉండగలగడం చాలా కష్టం. వాళ్ళు నన్ను ఆపి ఇంగ్లీషులో "టొబొగ్గాన్ బోర్డ్ ఇస్తావా? మేము కూడా జారుతాము" అని అన్నారు. నేను వాళ్లతో, "ఇవ్వలేను. మీరు ఏమీ అనుకోవద్దు. అక్కడ నా స్నేహితులు ఈ బోర్డు కోసం ఎదురు చూస్తున్నారు" అని చెప్పి పైకి నడక సాగించాను. అలా నడుస్తూ, 'వీళ్ళు ఈ వయసులో అసలు ఎలా జారగలరు? అసలు వీళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు? ఎవరితో వచ్చారు?' అని ఆలోచిస్తూ కొంతదూరం వెళ్ళి తిరిగి కిందకి చూస్తే, వాళ్ళు కనిపించలేదు. నేను పైకి ఎక్కాక ఆ వృద్ధ దంపతుల గురించి నా స్నేహితులతో చెప్పాను. వాళ్ళు మాకెవ్వరికీ మళ్ళీ కనపడలేదు. అప్పటినుండి నాకు ఆ సంఘటన గుర్తుకు వచ్చినప్పుడల్లా, 'వాళ్ళు ఎవరై ఉంటారా?' అని నేను ఆలోచిస్తుండేవాడిని. రెండేళ్ల తర్వాత 2013 నుండి ప్రతిరోజూ బాబాను దగ్గరగా చూస్తూ, పూజించడం మొదలుపెట్టాక కొన్ని సంవత్సరాలకు 'ఆరోజు మంచుకొండల్లో నాతో మాట్లాడింది ఎవరో కాదు, ఖచ్చితంగా సాయిబాబానే' అని గ్రహించి ఎంతో ఆశ్చర్యపోయాను. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నానంటే, ఆరోజు నేను చూసిన ఆ పెద్దాయన రూపురేఖలు, ఆ వస్త్రధారణ నా మనసులో ఇప్పటికీ నిలిచిపోయాయి. అవి ఖచ్చితంగా బాబా వేషధారణతో సరిపోతాయి. "బాబా! మీరు నన్ను భక్తుడిగా గుర్తించి నాకు ఎదురుగా వచ్చినా నేను మిమ్మల్ని గుర్తించలేకపోయినందుకు నన్ను క్షమించండి. మీ భక్తులు ఎక్కడున్నా పిచ్చుక కాలికి దారంకట్టి లాగినట్టు నన్ను మీ దగ్గరకు లాక్కున్నారు. మీ భక్తులందరికీ తోడుండి ఎల్లవేళలా కాపాడండి. ధన్యవాదాలు సాయినాథా”.


ఓం శ్రీసాయినాథాయ నమః!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1816వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయినాన్నతో ఒక్కరోజులో లక్ష రూపాయలు సర్దుబాటు - ‌‌మంచి ఉద్యోగం  
2. సద్గురుసాయి కృప

సాయినాన్నతో ఒక్కరోజులో లక్ష రూపాయలు సర్దుబాటు - ‌‌మంచి ఉద్యోగం  


ముందుగా సాయినాన్నకి నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. నేను సాయిని నాన్న అని పిలుస్తాను. ఆయన నాకు కన్నతండ్రి కన్నా ఎక్కువ. ఒకసారి మావారి వ్యాపారరీత్యా ఒకరి దగ్గర లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నాము. అయితే ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి కొంచెం కఠిన స్వభావం గలవాడు. అతను ఒక వారం రోజుల్లో మొత్తం డబ్బు తిరిగి ఇచ్చేయాలని మమల్ని బాగా ఇబ్బందిపెట్టాడు. మాకు డబ్బు సర్దుబాటుకాక చాలా టెన్షన్ పడ్డాము. చాలామందిని అడిగాము కానీ, అందరూ లేవన్నారు. అవతల మా అప్పు ఇచ్చినతని టార్చర్ చాలా ఎక్కువగా ఉండేది. రోజులో 50 సార్లు ఫోన్ చేసి అడుగుతుండేవాడు. అతను మా బంధువు కూడా అయినందున మాటపోతుందని మాకు చాలా భయమేసింది. ఏమి చేయాలో తెలియక నేను చాలా బాధతో, "సాయీ! మీరే దారి చూపాల"ని సాయినాన్నని వేడుకొని కన్నీళ్లు పెట్టుకున్నాను. ఒక్క రోజులో చాలామందిని కొంచం కొంచం మొత్తం డబ్బులు అడిగి ఆ రోజు సాయంత్రానికల్లా డబ్బు తిరిగి మా బంధువుకి ఇచ్చేసాం. సాయినాన్మనే మాకు సహాయం చేశారు. "ధన్యవాదాలు సాయి. నేను మీకు ఎప్పటికీ ఋణపడి ఉంటాను సాయినాన్నా". 


నేను ఒక లెక్చరర్‌ని. ఆ ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం. అందువల్ల నాకు వచ్చే జీతం చాలా తక్కువైనప్పటికీ ఆ ఉద్యోగంలో కొనసాగుతూ ఉండేదాన్ని. అలా ఉండగా కోవిడ్ కారణంగా మావారి వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది. పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందంటే ప్రతినెలా 50 వేల రూపాయలదాకా అప్పు చేయాల్సి వచ్చేది. దానివల్ల నేను ప్రతినెలా తెలిసిన వాళ్ళందరినీ డబ్బు అడుగుతుండేదాన్ని. అప్పు ఇచ్చిన వాళ్ళు ప్రతినెలా వడ్డీకోసం ఫోన్ చేస్తూండేవాళ్లు. అదీకాక  EMIలు, క్రెడిట్ కార్డుల వాళ్ళ నుండి చాలా ఇబ్బంది ఎదురు అయ్యేది. మా పరిస్థితి ఎవరికీ చెప్పుకోలేము, అలాగని దాచనూ లేము. నాకు చాలా బాధగా అనిపించేది. ఒక సంవత్సరంపాటు నేను రోజూ బాబా ముందు కూర్చుని, 'సాయి సచ్చరిత్ర' పారాయణం చేస్తూ, "నాకు మీరే దిక్కు సాయి" అని ఏడ్చేదాన్ని. చివరికి ఇలాగే ఉంటే వడ్డీలు కట్టలేము, అప్పులు తీర్చలేమనిపించి నేను ఉద్యోగం మారదామని అనుకున్నాను. కొత్త ఉద్యోగం రావాలంటే పాత ఉద్యోగం మానేయాలి. కానీ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను ఆ దైర్యం చేయలేకపోయాను. ఎందుకంటే. కొత్త ఉద్యోగం వస్తుందో, రాదో ఖచ్చితంగా తెలియదు. దానికోసం ఉన్న ఉద్యోగం వదిలియాలంటే నాకు చాలా భయమేసింది. అలాంటి స్థితిలో నేను బాబా మీద నమ్మకముంచి ముందుకు అడుగు వేసాను. ఒక పక్క ఉన్న ఉద్యోగం చేస్తూ, ఇంటికి వచ్చాక నా పాపని చూసుకుంటూ రాత్రి నిద్రపోకుండా ఒక 3 నెలలు కష్టపడి చదివి వేరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో నేను చాలాసార్లు బాధపడ్డాను. ఇంటర్వ్యూ జరిగే సమయంలో చాలా టెన్షన్ పడేదాన్ని. చాలాసార్లు నాకు నమ్మకం పోయినప్పటికీ సాయి మీద భారమేసి గట్టిగా ప్రయత్నిస్తూ పోయాను. ఆ క్రమంలో నేను మొదట ఒక ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. మంచి జీతం కూడా. కానీ సాయినాన్న నా మీద ఇంకా దయ చూపారు. ఇంకో మంచి కంపెనీ ఇంటర్వ్యూలో ఇంకా మంచి జీతంతో నాకు ఆఫర్ వచ్చింది. "మీ మేలు ఏ జన్మలోనూ మర్చిపోను సాయినాన్నా". 


సద్గురుసాయి కృప


నేను ఒక సాయిభక్తురాలిని. తల్లి, తండ్రి, స్నేహితుడు అన్నీ నాకు సాయే. నేను రోజూ పడుకునేముందు బాబాను తలుచుకుని, 'ఏ రూపంలో అయినా బాబా నాకు కనపడితే బాగుంటుంది' అని అనుకుంటుండేదాన్ని. నేను కోరుకున్నటు బాబా ఒకరోజు నాకు స్వప్న దర్శనమిచ్చారు. ఆయన, "మీ ఇంట్లో పరిస్థితి అసలు బాగాలేదు. ఫలానా రోజు మీ ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ కట్టండి" అని అన్నారు. మేము బాబా చెప్పినట్లే చేసాము. నాలుగు రోజుల తర్వాత మా తమ్ముడు 8 నెలల వయసున్న మా పాపని ఎత్తుకొని కుర్చీలో కూర్చుంటే, ఆ కుర్చీ హఠాత్తుగా విరగడంతో ఇద్దరూ కిందపడిపోయారు. పాప బాగా ఏడ్చింది. నేను చాలా భయపడిపోయాను. బాధతో బాబాని తలుచుకొని, "పాపకి ఏమీ అవ్వకూడదు" అని అనుకున్నాను. బాబా దయవల్ల పాపకి ఏమీ కాలేదు. నిజంగా మన తండ్రి మన వెంట ఉండి మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.


2024, సంక్రాంతి పండుగ ముందు నేను నా బంగారు చెవి బుట్టలు ఎక్కడో పెట్టి మర్చిపోయాను. అస్సలు గుర్తు రాలేదు. ఇంట్లో అంతా వెతికినా దొరకలేదు. క్వశ్చన్&ఆన్సర్స్ సైట్‌లో బాబాని అడిగితే, 'దొరుకుతాయ'ని వచ్చింది. కానీ కనిపించలేదు. ఇంక దొరకవని నేను వాటికోసం మర్చిపోయాను. తర్వాత అనుకోకుండా ఒక రోజు ఆ బంగారం బట్టలు కనిపించాయి. నిజంగా బాబాకి శతకోటి వందనాలు. నా కల, నా భవిష్యత్తు అయినా ఉద్యోగం రావాలన్నా నా కోరికను తొందరగా నెరవేర్చాలని కోరుకుంటున్నాను.


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo