సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1711వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. జాగ్రత్తగా చూసుకున్న బాబా
  2. బాబాకి చెప్పుకున్నంతనే అందిన డబ్బులు

జాగ్రత్తగా చూసుకున్న బాబా

ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయిబంధువులకు నా నమస్కారాలు. నాపేరు సంధ్య. శ్రీసాయినాథుని దివ్య పాదాలకు శిరస్సు వచ్చి నమస్కరిస్తూ నా అనుభవాలను పంచుకుంటున్నాను. 2023, సెప్టెంబర్ నెలలో మావారు గోవా వెళదామని నిర్ణయించి, అక్టోబర్ 2న వెళ్ళడానికి మా పిలలతో కలిసి ప్లాన్ చేసి విమాన ప్రయాణానికి టికెట్లు బుక్ చేశారు. అప్పుడు నేను బాబా ఫోటో ముందు నిల్చోని, "బాబా! గోవా టూరు, విమాన ప్రయాణం. మీరు మాకు తోడుగా ఉండి విజయవంతం చేయండి. అలాగే సర్వాంతర్యామి అయిన మీరు మా ఇల్లు కూడా చూసుకోండి" అని ప్రార్థించాను. తర్వాత అక్టోబర్ 2వ తేదీ రానే వచ్చింది. ఆ రోజు ఉదయం నేను మెలకువలో ఉండగానే బాబా నాతో ఏదో మాట్లాడుతున్నట్లు దర్శనమిచ్చారు. బాబా ఏం మాట్లాడారో నాకు వినపడలేదుగానీ ఆయన దర్శనమే పెద్ద శుభసూచకమని సంతోషించాను. ఆ ఆనందంలోనే నేను బ్యాగులు సర్దాను. తర్వాత అందరం సంతోషంగా బాబాకి నమస్కరించి ఆయన కూడా మాతోపాటు వస్తున్నారన్న భావనతో విమానాశ్రయానికి బయలుదేరాం. తర్వాత నేను 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ఓపెన్ చేస్తే, అక్కడ "ఏమనుకుంటున్నావు? ఈ ఇంటికి యజమాని నేనే" అని సాయి వచనం వచ్చింది. అది చూసి బాబా ప్రేమకు ఆనందభరితురాలినయ్యాను.

విమానాశ్రయలో అడుగుపెట్టగానే సాయితండ్రికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఎందుకంటే, విమానాశ్రయాన్ని, విమానాన్ని దగ్గర నుండి చూడటం అదే మొదటిసారి. విమానంలో కూర్చున్నప్పుడు నా పిల్లలు, నేను, మావారు చాలా సంతోషించాము. ఆ సంతోషంలో మరోసారి బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. కారణం విమాన ప్రయాణం చేసే అర్హత బాబా ఆశీర్వాదమే కనుక. మా పక్క సీటు ఖాళీగా ఉండటంతో అందులో బాబా కూర్చున్నారని భావించాను. బాబా దయతో మొదటిసారి విమాన ప్రయాణం చేసి ఎంతో ఆనందంగా సురక్షితంగా గోవా చేరుకున్నాము. ఆ రాత్రి రూమ్ కోసం వెతకగా బాబా దయవల్ల చక్కటి లగ్జరీ రూమ్ దొరికింది. రాత్రి పది గంటల వరకు సముద్రతీరాన సరదాగా గడిపి రూముకు చేరుకున్నాము. ఉదయానే ‘రాత్రి సముద్రం చూసాను, ఉదయం ఎలా ఉంటుందో’ అని సంతోషంగా మళ్ళీ బీచ్‌కి వెళ్లి నేను, మావారు, పిల్లలు ఎంతో సరదాగా, ఆనందంగా గడిపాము. మొదటిసారి సముద్రాన్ని చూసిన ఆనందంలో నేను బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. తర్వాత అదేరోజు అక్కడ చూడాల్సిన ప్రదేశాలు కొన్ని చూసాం. 

మర్నాడు బ్రహ్మీముహూర్తంలో మెలకువలో ఉండగా బాబా నాకు ఒక దృశ్యం చూపించారు. ఆ దృశ్యమందు నేను సముద్రతీరాన నిల్చొని సముద్రాన్ని చూస్తుంటే, అక్కడ సముద్రం లేదు. సముద్రానికి బదులుగా ఒక అందమైన శిరిడీసాయి మందిరం పైనున్న బంగారు శిఖరం నాకు కనిపిస్తుంది. అది చూసి నేను ఎంతో ఆనందం పొందాను. ఆ దృశ్యం ద్వారా 'బాబా నాతోనే ఉన్నారు, అణువణువునా నిండి ఉన్నారు. అంతటా ఉన్నారు. అన్నిట్లోనూ ఉన్నారు. విశ్వమంతా వ్యాపించిన ఉన్న ఆ విశ్వేశ్వరుడే సాయి' అని భోదించారని అనిపించింది. ఆ దృశ్యాన్ని చూపిన సాయితండ్రికి వేలవేల కృతజ్ఞతలు తెలుపుకున్నాను. తర్వాత గోవా నుండి తిరుగు ప్రయాణమయ్యే రోజున బాబా మళ్ళీ ఒక దృశ్యాన్ని చూపారు. ఆ దృశ్యంలో ఒక బాబా గుడి ఉంది, బాబా ఏదో మాట్లాడుతున్నారు. నేను బాబాను చూస్తూ గుడి దాటేశాను. అంతటితో ఆ దృశ్యం పూర్తైంది. శుభశకునంగా భావించి గోవా ప్రదేశాలకి థాంక్స్ చెపుతూ గోవా విమానాశ్రయానికి బయలుదేరాను. బాబా ఆశీర్వాదంతో సురక్షితంగా, ఆనందంగా తిరిగి మా ఇంటికి చేరుకున్నాము. గోవా వెళ్లేముందు నేను చేసిన ప్రార్థనలను కరుణతో విన్న బాబా అక్కడ గోవాలో మాకు ఇబ్బంది లేకుండా చేసుకోవడంతోపాటు ఇక్కడ మా ఇంటిని జాగ్రత్తగా చూసుకున్నారు. "బాబా! మీ ప్రేమకు ఎలా కృతజ్ఞత తెలుపుకోవాలో తెలియట్లేదు. ఆర్థికంగా చితికిపోయి అనారోగ్యం పాలైన మమ్మల్ని అక్కున చేర్చుకుని పూర్వం కన్నా వైభవంగా మా జీవితాలను మార్చిన మీకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం? మీ ప్రేమను అనుభవించటం తప్ప మాటలకందని ఆ అనుభూతి గురించి ఎలా వ్రాయగలం? ఇప్పుడు మేము జీవిస్తున్న జీవితం మీరు పెట్టిన భిక్ష. అందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. వేలవేల కృతజ్ఞతలు. మీ పాదాలే మాకు శరణం సాయి”.

సద్గురు చరణం భవభయ హరణం సాయినాథ శరణం!!!


బాబాకి చెప్పుకున్నంతనే అందిన డబ్బులు

నేను ఒక సాయి భక్తురాలిని. ఒక సంవత్సరం నుండి మేము ఆర్ధికంగా చాలా బాధల్లో ఉండగా మాకు ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వకుండా ఒకరు మమ్మల్ని చాలా ఇబ్బందిపెట్టారు. ఆ సమయంలో ఈ బ్లాగు నా కంటపడింది. అప్పటినుండి మేము రోజూ ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతూ ఉండేవాళ్ళము. చివరికి ఒకరోజు నేను, "మాకు రావలసిన డబ్బులు వచ్చేలా అనుగ్రహించండి బాబా" అని అనుకున్నాను. అంతే, మాకు రావలసిన డబ్బులు వచ్చాయి. బాబా నిజంగా వెంట ఉండి కాపాడుతారు. "కృతజ్ఞతలు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1710వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. డ్రైవరుని పంపి సమయానికి ఎయిర్పోర్టుకి చేర్చిన బాబా
2. బాబా అనుగ్రహం

డ్రైవరుని పంపి సమయానికి ఎయిర్పోర్టుకి చేర్చిన బాబా

ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!! శ్రీసాయిబాబా భక్తకోటికి మా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు డాక్టర్ కృష్ణనాయక్. మేము హైదరాబాదులో ఉంటాం. 2023, అక్టోబర్ నెల 21వ తేదీన మేము మా కుటుంబంతో శ్రీ శిరిడీ సాయి దర్శనార్థం శిరిడీ వెళ్ళాము. అక్కడినుండి పండరీపురం వెళ్లి విఠలుని దర్శించుకొని తిరిగి హైదరాబాద్ వచ్చాము. తర్వాత రోజు అక్టోబర్ 24, బుధవారంనాడు మా కుటుంబమంతా విమానంలో హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నాము. మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు విమానం బయలుదేరుతుందనగ ఒక గంట ముందు మేము ఎయిర్పోర్టులో ఉండాలి. అలా కానీ పక్షంలో కనీసం ఒక అరగంట ముందైనా ఉండాలి. ఏదో కారణం వల్ల ఆలస్యమై నేను ఉదయం 11 గంటలకి క్యాబ్ బుక్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఐతే ఒక్క క్యాబ్ కూడా బుక్ కాలేదు. ఒకవేళ బుక్ అయినా కొంత దూరం వరకు వచ్చి తిరిగి వెళ్ళిపోతుండేవి. అలా 3 క్యాబ్‌లు రిజెక్ట్ అయ్యాయి. అప్పటికి సమయం 12:50 అయింది. కారు రాలేదు. ఫ్లైట్ మిస్ అవుతుందేమోనని మేము చాలా భయపడి బాబాను వేడుకున్నాము. అంతే, ఎవరో కారు డ్రైవరు మాకు ఫోన్ చేసి, "నా గిరాకీ రద్దు అయింది. మీకు కావాలంటే నేను వస్తాను" అని అన్నాడు. నేను వెంటనే రమ్మన్నాను. కానీ అప్పుడు ఒంటిగంట అయింది. ట్రాఫిక్‌లో సికింద్రాబాద్‌లోని మౌలాలి నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్పోర్ట్‌కి వెళ్ళడానికి కనీసం 90 నిమిషాల సమయం పడుతుంది. ఎంత డబ్బిచ్చినా ట్రాఫిక్‌లో తొందరగా తీసుకెళ్లేవాళ్ళు ఎవరూ దొరకరు. అయినా మేము బాబా మీద భారమేసి కారులో కూర్చొని, "మమ్మల్ని సమయానికి ఎయిర్పోర్టుకి చేర్చు బాబా" అని బాబాను వేడుకున్నాం. కారు డ్రైవర్, "మీరు చాలా పొరపాటు చేశారు. మీరు వెళ్ళేది ఆర్టీసీ బస్సులో కాదు,  విమానంలో. చెకింగ్ ఉంటుంది, ఒక గంట ముందు ఎయిర్పోర్టులో ఉండాలి" అని లోలోపల ఏదో గుణిగి మళ్లీ, "మీరు ఏం బాధపడవద్దు, టెన్షన్ పడవద్దు. నాకు షార్ట్ కట్ మార్గం తెలుసు. నేను ఉన్నాను, సమయానికి తీసుకొని వెళ్తాను" అని అన్నాడు. అన్నట్లే మమ్మల్ని విమానాశ్రయానికి చేర్చాడు. బాబా దయవల్ల విమానాశ్రయం అయితే చేరుకున్నాం. కానీ సరిగ్గా అప్పుడే టికెట్ కౌంటర్ క్లోజ్ చేశారు. పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడ అందరినీ రిక్వెస్ట్ చేసాము. వాళ్ళు, "సారీ అండి. మీరు చాలా ఆలస్యంగా వచ్చారు. మేము ఏమీ చేయలేము" అన్నారు. మేము బాబాని వేడుకొని మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేసాము. వాళ్ళ పైఆఫీసర్ మా వంక, మాతో పాటు ఉన్న చిన్నపిల్లల వంక, 75 సంవత్సరాలు పైబడిన తల్లిదండ్రుల వంక చూసి, "సరే, ఏదో విధంగా వీళ్ళని పంపించండి" అని చెప్పాడు. బాబా దయవల్ల మేము విమానం ఎక్కి కూర్చున్నాం. కనీసం 90 నిమిషాల సమయం పట్టాల్సి ఉండగా కేవలం ౩౦-40 నిమిషాల్లో మమ్మల్ని ఎయిర్పోర్టుకి చేర్చిన ఆ కారు డ్రైవరు నిజంగా బాబా మాకోసం పంపిన మనిషి అని మేము భావిస్తున్నాం. బాబా ఆశీస్సులు లేకపోతే, ఆయన దయతో ఆ కారు డ్రైవరు రాకపోయుంటే మేము సరైన సమయానికి చేరుకొని ప్రయాణమయ్యే వాళ్ళం కాదు, కష్టాలు పడాల్సి వచ్చేది, గమ్యం చేరుకునేసరికి రాత్రి అయ్యేది. మేము ఈ అనుభవం ద్వారా ఇంకోసారి ముందుగానే బయలుదేరాలని తెలుసుకున్నాము. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఇలాగే సాయిభక్తులందరికీ మీరు సదా తోడు-నీడగా ఉండాలని కోరుకుంటూ మీకు మా సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తున్నాను తండ్రీ".

ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః!!!


బాబా అనుగ్రహం


నేను ఒక సాయి భక్తుడిని. ఒకసారి నేను రైల్వే డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ కోసంగా 2 వారాలు బెంగళూరు వెళ్ళవలసి వచ్చింది. నేను ఎప్పుడూ అన్నిరోజులు నా భార్య, బిడ్డని వదిలి ఎక్కడికీ వెళ్ళలేదు. నేను వెళితే ఇంట్లో వాళ్లిద్దరే ఉంటారు. నా భార్య రోజంతా తన ఆఫీసులోనే ఉంటుంది. ఆ సమయంలో బాబుని చూసుకోవడానికి ఒక ఆయా ఉన్నప్పటికీ రాత్రి మాత్రం నా భార్య ఒక్కతే బాబుని చూసుకోవాలి. వీటన్నిటి దృష్ట్యా నేను ట్రైనింగుకి వెళ్లేముందు, "బాబా! నేను ట్రైనింగుకి వెళ్తున్నాను. సంవత్సరం వయసున్న బాబుని నా భార్య ఒక్కతే చూసుకోవడం కష్టం. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే రావడానికి నాకు కుదరదు. కాబట్టి నేను వచ్చేవరకు నా భార్య, బిడ్డలకి తోడుగా ఉండి వాళ్ళని సంరక్షిస్తూ ఉండు తండ్రీ. అలానే బెంగళూరులో ఉన్నప్పుడు వారం రోజుల్లో నేను ఎటువంటి ఆటంకం లేకుండా శ్రీసాయి సచ్చరిత్ర పారాయణ పూర్తిచేసేలా అనుగ్రహించు తండ్రీ" అని బాబాని ప్రార్థించాను. ఆ తండ్రి దయవల్ల నా భార్య, బిడ్డలకు ఎటువంటి ఇబ్బందీ కలగలేదు. నేను కూడా సచ్చరిత్ర పారాయణ గురువారం మొదలుపెట్టి తర్వాత గురువారానికి పూర్తి చేయగలిగాను. నా తిరుగు ప్రయాణమప్పుడు దీపావళి సమయమైనందున నా టికెట్ కన్ఫర్మ్ అవుతుందో, అవ్వదో అని అనుకున్నాను. కానీ బాబాను ప్రార్థించినంతనే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇలా బాబా నాకు అన్ని విధాల సహాయం చేశారు. "ధన్యవాదాలు బాబా. మా బాబుకి దంతాలు ఇంకా రాలేదు, తొందరగా వచ్చేలా చూడు తండ్రీ". 


సాయిభక్తుల అనుభవమాలిక 1709వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. పక్కనే ఉన్నానని తెలియజేసిన బాబా
2. ఉద్యోగంలో సాయి చేసిన సహాయం

పక్కనే ఉన్నానని తెలియజేసిన బాబా


అందరికీ నమస్తే. నా పేరు కిరణ్మయి. నేను ఇప్పుడు పంచుకోబోయే అనుభవం చిన్నదే అయినప్పటికీ నిజంగా బాబా నా పక్కనే ఉన్నారని, కష్టకాలంలో నాకు అండగా ఉన్నారని తెలియజేసింది. దీన్ని బ్లాగులో పంచుకుంటానని బాబాని ప్రార్థించలేదు. అయినా ఆయన ప్రేమను మీ అందరితో పంచుకోవాలనిపించింది. ఇక విషయానికి వస్తే.. నేను ఒక రకమైన వ్యక్తిని. దేన్నీ సానుకూలంగా తీసుకోలేను, ప్రతిదీ ప్రతికూలంగానే చూస్తాను. ప్రతికూలంగా ఆలోచిస్తే నాకు నేను నచ్చజెప్పుకోవడం చాలా కష్టమైపోతుంది. అయినా నేను ఒక రకమైన మొండి పట్టుదల గల వ్యక్తినైనందున ఎలాంటి సానుకూలతను అంగీకరించలేను. అలాంటి నా జీవితం ఒకసారి చాలా నిరుత్సాహంగా మారింది. ఆ పరిస్థితి నన్ను తీవ్రంగా ప్రభావితం చేయడంతో నేను నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాను. ఇలాంటి స్థితిలో 2023, నవంబర్ 10న నేను బాబాను, "ఈరోజు మీరు ఫోటో రూపంలో నా వద్దకు రావాల"ని కోరాను. అయితే నేను విదేశాలలో ఉంటున్నందున ఎవరి ద్వారానైనా ఏదైనా బాబా ప్రసాదంగా పొందే అవకాశం అంతగా లేదు. ఎవరైనా భారతదేశానికి వెళ్ళొస్తేనే బాబా ప్రసాదం లేదా ఫోటో లభించే అవకాశం ఉంది. అందుచేత నేను అదివరకు విరాళమిచ్చిన ఏదైనా బాబా మందిరంవాళ్ళు ఆ మందిరానికి సంబంధించి ఏదైనా పేపర్ వంటిది పంపారేమోనని నా పోస్ట్ బాక్స్‌ చెక్ చేశాను. అందులో బాబాకి సంబంధించి నాకు ఏమీ కనిపించలేదు. తర్వాత నేను నా భర్తని కూరగాయల కోసం నన్ను ఏదైనా భారతీయ కిరాణా దుకాణానికి తీసుకెళ్లామని అడిగాను. నేను అక్కడ 'సాయి ఫ్లోరా' అగర్బత్తి తీసుకుందామని, తద్వారా బాబా నా వద్దకు వస్తారని అనుకున్నాను. కానీ, నేను షాపుకి వెళ్లలేకపోయాను. ఇక నేను నా పనుల్లో నిమగ్నమయ్యాను. కొంతసేపటికి నేను నా వద్ద ఉన్న ఒక బాబా పుస్తకం తీస్తే, అందులో పాస్‌పోర్ట్ సైజు బాబా ఫోటో దర్శనమిచ్చింది. నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను. అప్పటికి 4 నెలల క్రితం మేము భారతదేశానికి వెళ్ళినప్పుడు నేను, నా మేనకోడలి ద్వారా అమెజాన్ మరియు కొన్ని ఇతర వెబ్‌సైట్‌ల ద్వారా కొన్ని బాబా పుస్తకాలు తెప్పించుకున్నాను. వాటిలోని ఒక పుస్తకంలో 4X5 సైజులో చాలా అందమైన ఒక బాబా ఫోటో వుంది. నేను ఆ ఫోటోని, శిరిడీ నుండి తెచ్చుకున్న ఒక సాయి లాకెట్‌ని నా సోదరికి ఇచ్చాను. తర్వాత నేను ఆ పుస్తకాన్ని చాలాసార్లు చెక్ చేశాను. అందులో వేరే ఫోటో ఏమీ కనిపించలేదు. అలాంటిది నాలుగు నెలల తర్వాత నవంబర్ 10న ఆ పుస్తకాన్ని తీస్తే అందులో ఆ ఫోటో కనిపించింది. అది చూసాక నేను పొందిన ఆనందాన్ని మీరు ఊహించగలరనుకుంటున్నాను. మనలని రక్షించడానికి బాబా ఎప్పుడూ మనకంటే ఒక అడుగు ముందే ఉంటారు. "ధన్యవాదాలు బాబా".


ఉద్యోగంలో సాయి చేసిన సహాయం


ఓం శ్రీసాయినాథాయ నమః!!! అందరికీ నమస్కారాలు. నా పేరు గోపిశాంతిశ్రీ. నేను ఒక ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేసున్నాను. కారు లోన్స్ సెక్షన్‌లో పని చేస్తున్న మాకు ప్రతినెలా టార్గెట్స్ ఉంటాయి. అయితే ప్రతినెలా మంచిగా చేసే నేను 2023 మేలో నా టార్గెట్ పూర్తి చేయలేకపోయాను. దాంతో మా మేనేజర్ నాకు జీతం రాదని అన్నారు. కానీ ఆ నెలాఖరులో ఒక ఫైల్ రావడంతో నా టార్గెట్ రీచ్ అయి జీతం వచ్చింది. ఆ నెల అలా గడిచిపోయింది కానీ, తరువాత జూన్, జూలై నెలల్లో కారు లోన్‌కి సంబంధించిన ఫైల్స్ రాలేదు. అందువల్ల నేను చాలా బాధపడుతుండేదాన్ని. ఆ బాధతో నాకు రాత్రిళ్ళు నిద్రపట్టేది కాదు. అలాంటి సమయంలో ఒకరోజు నేను నా ఫోన్ చూస్తుంటే, 'సాయిభక్తుల అనుభవమాలిక' అని కనిపించింది. అది ఓపెన్ చేసి బాబా భక్తుల అనుభవాలు చదివిన తరువాత మనసులో, "బాబా! నాకు మంచిగా లోన్స్ ఫైల్ అయి జీతంతోపాటు ఇన్సెంటివ్ కూడా మంచిగా వచ్చేలా అనుగ్రహించండి" అని బాబాతో చెప్పుకున్నాను. అప్పటినుంచి బాబా భక్తుల అనుభవాలు చదువుతూ ఉండేదాన్ని. బాబా దయతో మంచిగా లోన్స్ ఫైల్ అయి ఇన్సెంటివ్ కూడా వచ్చింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1708వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • సాయి దరికి చేర్చిన జీసెస్

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


అందరికీ నమస్కారాలు. నా పేరు మమత. ఇదివరకు 'సాయిభక్త అనుభవమాలిక' 1540వ భాగంలో నేను మొదటిసారి ఈ బ్లాగులో నా అనుభవం పంచుకున్నాను. నిజానికి నేను ఆ అనుభవంతోపాటు సాయినాథుని ద్వారా నేను పొందిన నా మొదటి అనుభవాన్ని కూడా పంచుకోవాలనుకున్నాను. కానీ ఆ సమయంలో నా మనసు చాలా బాధలో ఉంది. అదీకాక ఎక్కువ మేటరు వ్రాయకూడదేమో, అనుభవం పెద్దగా అవుతుందేమో అని చిన్నగా పంచుకున్నాను. తర్వాత బ్లాగులో అనుభవాన్ని అన్ని వివరాలతో చాలా వివరంగా వ్రాసి పంచుకోవచ్చని చూసాను. సరే, ఇక సాయితండ్రితో నాకు అనుబంధం ఏర్పడిన తీరు గురించి, ఆయన నాకు ప్రసాదించిన మొదటి అనుభవం గురించి ఇప్పుడు చెప్తాను.


మాది క్రైస్తవ కుటుంబం. మా తాతయ్య ఉన్నప్పుడు మాకు చిన్న చర్చి ఉండేది. పండగలప్పుడు తాతయ్య ప్రార్థనలు చేస్తుండేవారు. తాతయ్య చనిపోయాక అమ్మ ప్రార్థన చేయించడం మానేసింది. తర్వాత మేము వేరే ఊరికి మారాము. అన్నయ్య, నేను ఎదిగేకొద్దీ వేరేవాళ్లతో కలిసి అన్ని గుడ్లకి వెళ్తుండేవాళ్ళం. అన్నయ్య హిందూ దేవుళ్ళనే నమ్మేవాడు. జీసెస్‌కి ప్రార్థన చేసేవాడు కాదు. నేను మాత్రం ఇంటర్ వరకు చర్చికి వెళ్లకపోయినా, రెగ్యులర్‌గా కాకపోయినా అప్పుడప్పుడు జీసెస్‌ని ప్రార్థిస్తుండేదాన్ని. కానీ నాకు జీసస్‌తో అనుబంధం ఏర్పడలేదు.


నేను డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు హాస్టల్లో ఒక అక్క దగ్గర సాయి లీలామృతం పుస్తకం ఉండేది. ఆ అక్క, "ఈ పుస్తకం 11 రోజులు పారాయణం చేస్తే, కోరిన కోరికలు నెరవేరుతాయ"ని చెప్పింది. 'కోరికలు నెరవేరుతాయంటే, చేద్దాం. కోరిక నెరేవేరుతుందేమో' అనిపించడం సహజమే కదా! అందుచేత నేను నా చదువు గురించి కోరిక కోరుకొని ఆ పుస్తకం చదవాలనుకొని అక్కతో, "అక్కా! సెలవులు ఉన్నాయి కదా, నువ్వు ఆ పుస్తకం ఇస్తే ఇంటికి తీసుకెళ్లి పారాయణ చేస్తాను" అని అన్నాను. అక్క, "తీసుకు వెళ్ళు" అని అంది. అయితే క్రైస్తవ మతస్థురాలినైన నాకు పూజ విధానాలు, పారాయణ ఎలా చేయాలి అన్నవి తెలియదు. కాబట్టి మామూలుగానే నేను ఆ పుస్తకం చదివసాగాను. చదివే కొద్ది చదవాలనిపించేది, చాలా ఆనందమేసేది, దేవుడు, గురువు అంటే ఏంటి, జన్మ-పునర్జన్మ వంటి చాలా విషయాలు తెలుసుకోగలిగాను. అసలు చెప్పాలంటే సాయితండ్రి పరిచయంతో నాకు దేవుడంటే ఏంటనేది తెలిసింది. తర్వాత హాస్టల్లో ఉన్నప్పుడు కూడా అక్క దగ్గర నుంచి ఆ పుస్తకం తీసుకొని చదువుతూ అక్కవాళ్ళతో కలిసి మా హాస్టల్‌కి దగ్గరలో ఉన్న తేనే సాయి మందిరంకి వెళ్తుండేదాన్ని. నాకు చాలా ఆనందంగా, ప్రశాంతంగా ఉండేది.


మా హాస్టల్ నుండి కొంచం దూరంలో ఉన్న వేరే ఊరిలో సాయిబాబా నెమలి మందిరమని ఒక గుడి ఉంది. ఒకరోజు అక్క, నేను ఆ గుడికి వెళదామని బస్టాండుకి వెళ్ళాము. అక్కడ అక్కకి తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. కానీ అతను అక్కతో ఏమీ మాట్లాడలేదు. మేము బస్సు కోసం వేచి చూడసాగాం. బస్సు రావడం ఆలస్యమయ్యేసరికి ఆ ఊరు వెళ్లే జనం చాలా ఎక్కువయ్యారు. కొంతసేపటికి ఒక బస్సు వచ్చింది. చీమ దూరడానికి కూడా చోటు లేనంత రద్దీగా ఉన్నందున మేము ఆ జనంలో తోసుకుంటూ ఎక్కే సాహసం చేయలేక బస్సు ఎక్కకుండా అలాగే నిలబడిపోయి, "బాబా! ఆలస్యం అవుతుంది. ఇప్పుడు ఎలా? మీరే మాకు సహాయం చేయాలి" అని నేను, అక్క బాబాను అడిగాము. అంతలో అక్కకు తెలిసిన అబ్బాయి మమ్మల్ని పిలిచి, "బస్సులో చోటు ఉంది. లోపలికి రండి" అని అన్నాడు. అక్క, నేను ఒక్కసారిగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాం. ఇలా బాబాని తలుచుకొని బాధపడ్డామో, లేదో మరుక్షణంలో అప్పటివరకు మాట్లాడని ఆ అన్నయ్య వచ్చి చోటు ఉందని చెప్పడం, అదీకాక అంత రద్దీలో రెండు సీట్లు ఉండటం మమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. నాకైతే చాలా ఆనందమేసింది. ఇది సాయితండ్రితో నా మొదటి అనుభవం. మేము మంచిగా సాయితండ్రి దర్శనం చేసుకుని సంతోషంగా హాస్టల్‌కి తిరిగి వచ్చాము.


ఒకరోజు నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను ఒక గదిలో ఇరుక్కుపోయాను. ఆ గదిలో మంటలు చెలరేగుతున్నాయి. ఆ గదికి ఉన్న ఒక కిటికీ వద్ద జీసస్ కనిపించి ఆయన నన్ను ఆ కిటికీ గుండా బయటకు తీసుకొచ్చి నా చేయి పట్టుకొని గాల్లో తేలుతూ నన్ను ఎక్కడికో తీసుకొని వెళ్తున్నారు. నేను అప్పుడు 'సాయి' అని అనుకుంటూ ఆనందంతో జీసస్‌ని, "మీకు సాయి తెలుసా?" అని అడిగాను. అందుకు జీసస్, "నాకు తెలుసమ్మా, నిన్ను అక్కడికే తీసుకు వెళుతున్నాను" అని అన్నారు. తర్వాత నన్ను సాయి దగ్గర విడిచిపెట్టారు. అంతటితో ఆ కల ముగిసిందనుకుంటున్నాను. ఎందుకంటే, నాకు మరేమీ గుర్తులేదు. తర్వాత సాయితండ్రితో అనుబంధం పెరుగుతున్న కొద్దీ నాకు అర్థమైంది ఏంటంటే, 'సాయి గురించి నాకు తెలియనంతవరకు అంటే ఇంటర్ వరకు జీసెస్ నన్ను కాపాడి, నేను సాయి గురించి తెలుసుకున్నాక నన్ను ఆయనకు అప్పజెప్పారు. అన్ని రూపాలు సాయితండ్రివే. అందరూ ఒకటే. నా తండ్రి నన్ను ఎప్పటినుంచో రక్షిస్తూ వస్తున్నారు. అది నేను తెలుసుకోలేకపోయాను అంతే' అని. అప్పుడు 'తండ్రీ సాయీ! ఇంకా ముందే మిమ్మల్ని తెలుసుకునుంటే బాగుండేది కదా!' అని నాకు ఏడుపొచ్చింది.


2022లో నాకు మరొక కల వచ్చింది. ఆ కలలో నేను ఏదో గుడికి వెళుతూ దారిలో ఓ చోట ఆగాను. అక్కడ సాయి మందిరం ఉంటే సంతోషంగా లోపలికి వెళ్లాను. అక్కడ సాయి విగ్రహరూపంలో కాషాయ వస్త్రాల్లో దర్శనమిచ్చారు. ఆయన్ని చూడగానే నాకు చాలా ఆనందమేసింది. సాయితండ్రి ఏదో మాట్లాడుతున్నారుగాని నాకు వినిపించలేదు. అప్పుడు, "సాయీ! నాకు వినిపించట్లేదు. నాకు వినిపించట్లేదు సాయీ" అని అనుకుంటే వినిపించాయి. అది ఏమనంటే, "నన్ను తండ్రి అని కాదు, అన్నయ్య అని పిలు" అని. తర్వాత నేను నా చదువు గురించి సాయితో ఒక మాట చెప్పాను. ఆయన సరేనన్నారు. అంతటితో ఆ కల ముగిసి నాకు మెలకువ వచ్చి చాలా ఆనందంగా అనిపించింది. సాయి నన్ను తమని అన్నయ్య అని పిలవమనడానికి కారణం లేకపోలేదు. 2020, ఫిబ్రవరిలో మా అన్నయ్య చనిపోయాడు. తర్వాత ఎవరైనా నా కుటుంబం గురించి అడిగినప్పుడు అన్నయ్య లేడని చెప్తున్నాను. అందువల్ల సాయితండ్రి అన్నయ్య లేడని బాధపడవద్దు, నీకు అన్నయ్య లేడనకు, నేనే నీ అన్నయ్యనని చెప్పారనిపించింది.


ఇంకా బాబా నా పోస్టు గ్రాడ్యుయేషన్‌కి సంబంధించి ఉండిపోయిన పరీక్షలు వ్రాయడంలో, ఇంకా చాలా చాలా లెక్కలేనన్ని చిన్న, పెద్ద అనుభవాలు ఇచ్చి నన్ను సంరక్షిస్తూ వస్తున్నారు. సాయితండ్రే నాకన్నీ, ఆయన లేకుండా నేను ఉండలేను. "సాయితండ్రీ! మీరు నన్ను కన్న తల్లిదండ్రుల్లా, అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అమ్మానాన్న ఆరోగ్యం బాగుండేలా, వాళ్ళు సంతోషంగా ఉండేలా చూడు తండ్రీ. నేను మిమ్మల్ని విడవకుండా మీ సాంగత్యంలో సదా ముందుకు వెళ్లేలా, ప్రతిక్షణం మిమ్మల్ని తలుచుకొంటూ మీరు చూపించే మార్గంలో మంచి బుద్ధికుశలతతో నడుచుకునేలా, సదా మీరు నా వెంటే, నా దగ్గరే ఉన్నారని ప్రతిక్షణం నేను గమనించేలా అనుగ్రహించండి సాయితండ్రీ. నా తప్పులు ఏవైనా ఉంటే క్షమించండి". 


సద్గురు శ్రీ సాయినాథార్ఫణమస్తు!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1707వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ప్రసాదించిన చిన్న చిన్న అనుభవాలు
2. కుదరదన్న సెలవులు లభించేలా అనుగ్రహించిన బాబా

బాబా ప్రసాదించిన చిన్న చిన్న అనుభవాలు


నా పేరు సంధ్య. ఎన్నోసార్లు కష్టకాలంలో బాబా నేనున్నానని నన్ను ఆదుకున్నారు. మా ఇంట్లో మా బావగారు, అత్తమ్మ ఎంతో ఆప్యాయంగా ఉంటారు. అలాంటిది అనుకోకుండా వారిరువురి మధ్య చిన్న గొడవ జరిగింది. అప్పుడు నేను, "బాబా! రేపు ఉదయానికల్లా వాళ్ళు కలిసిపోతే, మీ అనుగ్రహం తోటి భక్తులతో పంచుకుంటానని మొక్కుకున్నాను. బాబా దయవల్ల మర్నాడు ఉదయం వాళ్ళు ముందురోజు జరిగిన సంఘటనను మర్చిపోయి మామూలుగా మాట్లాడుకున్నారు. "థాంక్యూ బాబా".


మా బాబుకి వీక్లీ టెస్టుల్లో చాలా తక్కువ మార్కులు వస్తుండేవి. అప్పుడు నేను 'సాయి దివ్యపూజ' చేసి బాబాను వేడుకున్నాను. అంతే, నేను ఉహించలేనంతగా మరుసటివారంలో బాబుకి మంచి మార్కులు వచ్చాయి. నాకు చాలా ఆశ్చర్యమేసింది. బాబా మహిమలు అనంతం. "థాంక్యూ బాబా".


మా సిస్టర్ కూడా బాబా భక్తురాలు. మేమిద్దరమూ ప్రతిరోజూ బ్లాగులో ప్రచురితమయ్యే అనుభవాలు చదువుతుంటాం. ఒకరోజు రాత్రి హఠాత్తుగా తన ఫోన్ ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా ఆన్ కాలేదు. మంచి ఫోన్ అలా ఆఫ్ అయ్యేసరికి తనకి భయమేసి, "బాబా! ఇప్పుడు నా దగ్గర కొత్త ఫోన్ కొనేంత డబ్బులు లేవు. దీన్ని ఎలాగైనా బాగు చేయండి" అని బాబాతో చెప్పుకొని ఫోన్‌కి కొంచెం ఊదీ పెట్టి, "తెల్లారేసరికి ఆన్ అయ్యేలా చేయండి" అని వేడుకొని పడుకుంది. బాబా దయవల్ల మరుసటిరోజు ఉదయం నిద్రలేచి ప్రెస్ చేస్తే, ఫోన్ ఆన్ అయింది. తను ఆనందంగా నాకు ఫోన్ చేసి నా అనుభవాన్ని బ్లాగుకి పంపమని చెప్పింది. "థాంక్యూ బాబా". 


కుదరదన్న సెలవులు లభించేలా అనుగ్రహించిన బాబా


నేను ఒక సాయి భక్తురాలిని. ప్రతి ఒక్క అమ్మాయి జీవితంలో తల్లి కావడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. 2022, డిసెంబరులో బాబా కృపతో మాకు ఒక పాపని అనుగ్రహించారు. నేను ఉద్యోగస్థురాలిని. కాన్పు తర్వాత 6 నెలల సెలవులు ఉన్నప్పటికీ అవి ఎలా గడిచిపోయాయో తెలియలేదు. మరో ఒకటి, రెండు వారాల్లో నేను తిరిగి డ్యూటీలో చేరాల్సిన సమయం వచ్చింది. అప్పుడే పాపకు అన్నప్రాసన చేసాము కానీ, ఇంకా మామూలుగా తినే ఘన పదార్థాలు అలవాటు చేయలేదు. అలాంటి స్థితిలో నేను ఆఫీస్ వర్క్ మొదలుపెట్టాలంటే పాపని చేసుకోవడానికి ఎవరైనా ఉండాలి. కానీ పాపని చూసుకునే సహాయం చేసే వాళ్ళెవరూ లేరు. అలాగని ఉద్యోగం మానేద్దామంటే కుటుంబ పరిస్థితుల వల్ల నేను ఉద్యోగం చేయక తప్పదు. అందువల్ల నాకు ఏం చేయాలో తోచలేదు. మా మేనేజరుతో మాట్లాడి సెలవు పొడిగించమని అభ్యర్థించాను కానీ, కుదరదు అన్నారు. అయ్యో.. అని బాధపడుతూ రాత్రి నిద్రపట్టక ఫేస్బుక్ చూస్తుంటే, ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగుకి సంబంధించిన 'సాయి మహారాజ్ సన్నిధి' ఫేస్బుక్ పేజీ కనిపించింది. అప్పుడు నేను నా మనసులో, 'ఎలాగైనా సెలవు పొడిగిస్తే, బాబా అనుగ్రహాన్ని తోటి భక్తులతో పంచుకుంటాన'ని అనుకోని పడుకున్నాను. మరుసటిరోజు సెలవులు పొడిగించినట్లు నాకు మెయిల్ వచ్చింది. అది చూసి, 'ఇది కలా?, నిజమా?' అని నాకు అనిపించింది. ఇది చాలా చిన్న విషయంలా అనిపించవచ్చుగాని నాకు సెలవులు లభించడం సాయి కృపే. ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, నేను పనిచేసే కార్పొరేట్ కంపెనీలో కొన్ని కారణాల వల్ల, నేను అంతకుముందు తీసుకున్న సెలవుల వల్ల ఎక్కువ సెలవులు తీసుకునే అవకాశం నాకు లేదు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ దర్శనార్థం శిరిడీ వచ్చే ప్రణాళిక ఉంది. ఎప్పుడు అనుగ్రహిస్తావో తండ్రీ!".



సాయిభక్తుల అనుభవమాలిక 1706వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయికి చెప్పుకుంటే ఏ సమస్య అయినా పరిష్కారమవ్వాల్సిందే!
2. అడిగినంతనే స్థలం అమ్ముడైపోయేలా దయ చూపిన బాబా

సాయికి చెప్పుకుంటే ఏ సమస్య అయినా పరిష్కారమవ్వాల్సిందే!

ముందుగా అందరికీ వందనాలు. నా పేరు గురుప్రసాద్. నేను ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని. నేను ఇదివరకు 'సాయి భక్తుల అనుభవమాలిక 1579 & 1642లలో నా అనుభవాలు పంచుకున్నాను. సాయి దయవల్ల నాకు చాలా సంతోషంగా వుంది. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను. 

2023, సెప్టెంబరు 15న నేను నా కారు పార్క్ చేస్తున్నప్పుడు పొరపాటున నా కారు వేరే కారు వెనక వైపు గుద్దింది. నేను వెంటనే కారు దిగి అతనికి సారీ చెప్పి, "రిపేర్ చేయిస్తాన"ని చెప్పాను. అతను నా కారు ఫోటో, ఫోన్ నంబర్ తీసుకొని ఒక రెండు రోజులు తర్వాత 2000 డాలర్లు(ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 1 లక్ష రూపాయలు) ఖర్చు అవుతుందని చెప్పాడు. నేను అది విని నిర్ఘాంతపోయి, "అంత మొత్తం అంటే నాకు చాలా కష్టం. నాకు వచ్చే జీతం నా కుటుంబానికి సరిపోతుంది" అని చెప్పాను. అందుకతను, "నాది కొత్త కారు. రిపేర్ చేయించు" అని అన్నాడు. నేను ఇంకేమీ చెప్పలేక సరేనని నా మనసులో, "బాబా! ఈ కష్టం నుండి బయటపడే మార్గం నువ్వే చూపు తండ్రీ. మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని అనుకున్నాను. సుమారు 45 రోజుల తర్వాత 2023, నవంబర్ ౩న అతను 'నేను ఒక షాపులో కారు పెయింట్ కొన్నాను. నేనే వేసుకుంటాను. అంతా సెట్ అయిపోతుంది' అని మెసేజ్ పెట్టాడు. కాసేపు నాకు అసలు అది నిజమో, మాయో అర్దం కాలేదు. తర్వాత బాబానే అతని మనసు మార్చారనుకొని, 'నేను ఏమైన సహాయం చేయనా?' అని మెసేజ్ చేసాను. తను 'ఏమీ వద్దు అండి. నేను చూసుకుంటాను. ఇవన్నీ మామూలే. డోంట్ వర్రీ' అని బదులిచ్చాడు. అప్పుడు నేను, 'పెయింట్ కొన్నారు కదా! ఎంతైంది?' అని అడిగితే, '23 డాలర్ల'ని బదులిచ్చాడు. 'మీకు కలిగిన అసౌకర్యానికి క్షమించండి. నేను ఆ డబ్బులు చెల్లిస్తాను' అని అన్నాను. అతను, 'నో ప్రాబ్లమ్ అండి. ఆల్ గుడ్' అని బదులిచ్చాడు. ఎక్కడా 2000 డాలర్లు? ఎక్కడా 23 డాలర్లు? ఇది అంత బాబా నా మీద చూపిన ప్రేమ. ఆయనకి చెప్పుకుంటే ఏ సమస్య అయినా పరిష్కారమవ్వాల్సిందే!

2022, ఆగస్టులో నేను ఒక అతనికి కొంత డబ్బిచ్చాను. తర్వాత నేను ఎన్నిసార్లు అడిగినా అతను ఇస్తానని చెప్తుండేవాడు కానీ, నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వలేదు. అలా ఒక సంవత్సరం దాటింది. ప్రతినెలా వడ్డీ చెల్లించడానికి నాకు కష్టంగా ఉండటంతో, "బాబా! మీరే ఆ  డబ్బు నాకు తిరిగి ఇప్పించాలి" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా చేసిన అద్భుతం చూడండి. 2023, నవంబర్ 4న అతను మొత్తం డబ్బు నాకు పంపించాడు.

గత సంవత్సరమొకసారి, ఈ సంవత్సరమొకసారి మొత్తం రెండుసార్లు నాకు ఫిస్టులా ఆపరేషన్ అయింది. 2023, సెప్టెంబర్ 29న వేడి చేసి ఆ ప్రదేశంలో ఏదో చిన్న గడ్డలా వచ్చింది.  అప్పుడు నేను బాబాతో, "ఇది తొందరగా తగ్గిపోవాలి బాబా" అని చెప్పుకొని ఆయన మీద భారమేసి మందు తీసుకున్నాను. కొన్ని రోజులకి ఆ గడ్డ తగ్గిపోయింది. తర్వాత ఈమద్య నా ఆరోగ్యం సరిగ్గా లేకుంటే బాబాతో, "నా ఆరోగ్యం బాగుండేలా చూడండి" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. మనం బాబాని అడగటం ఆలస్యం అన్నీ ఇస్తారు. "ధన్యవాదాలు బాబా. నా తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి బాబా".

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


అడిగినంతనే స్థలం అమ్ముడైపోయేలా దయ చూపిన బాబా


నేను ఒక సాయి భక్తురాలిని. మాది విజయవాడ. నా చిన్నతనం నుండి శ్రీసాయి నాతో ఉన్నారు. ఆయన ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నందుకు నాకు సంతోషంగా ఉంది. మాకు చాలా ఆర్ధిక సమస్యలు ఉన్నాయి. వాటినుంచి బయటపడటానికి మేము చాలా నలిగిపోతుండేవాళ్ళము. మా ఇంటి ముందు మాకున్న ఒక స్థలం అమ్మేస్తే మా పరిస్థితి మెరుగు పడుతుందని చాలామంది చెప్పారు. దాంతో నేను ఆ స్థలం అమ్మటానికి 4, 5 సంవత్సరాలుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాగాని ఏదీ కలిసి రాలేదు. దానికి తోడు నా భర్త కూడా ఆ స్థలం అమ్మటానికి ఇష్టపడేవారు కాదు. అడగందే అమ్మైనా పెట్టదంటారు కదా! అందుచేత నేను చివరికి నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్ని అయిన బాబాను శరణువేడాను. ఆయన క్వశ్చన్ & ఆన్సర్ సైటు ద్వారా నాకు ధైర్యం చెప్పి నాకు అండగా నిలిచారు. బాబా దయతో మా స్థలం అమ్ముడైపోయింది. కానీ నా సమస్యలు ఇంకా తీరలేదు. అయినా నా సాయి ఉన్నారు. ఆయన సమస్యలన్నీ తొలగిస్తారు. సర్వకాల, సర్వ అవస్ధలందు నాతోనే ఉండి నన్ను నడిపిస్తారు. "తండ్రీ సాయినాథా! నువ్వే నా సర్వం".


సాయిభక్తుల అనుభవమాలిక 1705వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అంతా సవ్యంగా జరిగేలా అనుగ్రహించిన బాబా
2. బాబా దయతో కనిపించిన భార్యాపిల్లలు

అంతా సవ్యంగా జరిగేలా అనుగ్రహించిన బాబా

సాయినాథాయ నమః!!! ముందుగా బాబాకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను నా గత అనుభవంలో భూసంబంధిత సమస్యను బాబా ఎలా పరిష్కరించారో పంచుకున్నాను. తర్వాత ఆ భూమి రిజిస్ట్రేషన్ దసరా మరుసటిరోజు చేయాలని నిశ్చయించారు. అందువల్ల మేము దసరాకి మా ఊరు వెళ్లి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని వద్దామని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. అయితే మాకు ఒక చిన్న పప్పీ(కుక్కపిల్ల) ఉంది. అది మా దగ్గర తప్ప ఇంకెవరి వద్ద ఉండదు. అందువల్ల దాన్ని కూడా మాతో తీసుకొని వెళ్లాలని అనుకున్నాము. అయితే ప్రైవేట్ బస్సులో దాన్ని తీసుకెళ్లడానికి అనుమతించరేమోనని, "బాబా! ఎలాగైనా దాన్ని తీసుకెళ్లాలి. బస్సువాళ్ళు అనుమతించాలి. అలాగే మా ప్రయాణం సాఫీగా జరిగేలా చూడు తండ్రీ. అంతా మంచిగా జరగాలి బాబా" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల బస్సువాళ్ళు స్లీపర్ బస్సులో పప్పీని అనుమతించారు. మేము బస్సు ఎక్కిన దగ్గర్నుండి బయట ఎటు చూసినా నామం, ఫోటోలు, ప్రతిమల రూపాలలో చీకట్లో అంతటా దర్శనమిస్తూ అడుగడుగునా మా వెంట ఉండి, మా పప్పీ బస్సులో గొడవ చేయకుండా మౌనంగా ఉండేలా చేసి మా ప్రయాణం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగేలా అనుగ్రహించారు నా బాబాతండ్రి. అలాగే దసరా మరుసటిరోజు రిజిస్ట్రేషన్ ఆఫీసుకి వెళితే, అక్కడ మెయిన్ ఎంట్రన్స్‌లో నా బాబా ఫోటో రూపంలో దర్శనమిచ్చి రిజిస్ట్రేషన్ మంచిగా జరిపించారు. "ధన్యవాదాలు బాబా. మా పాపకి బీటెక్ మొదటి సెమిస్టర్‌లో మంచి మార్కులు వచ్చేలా దీవించండి. నా బిడ్డ భవిష్యత్తు మీ చేతుల్లో పెడుతున్నాను. మా అన్ని పనుల్లో పెద్ద దిక్కుగా ముందుండి నడిపించండి బాబా. కస్టమర్లు బాగా వచ్చి నా బిజినెస్ మంచిగా జరిగేలా చూడు తండ్రీ. రెండోసారి సాయి దివ్యపూజ చేస్తున్నాను. నేను అనుకున్నవి జరిగేలా చూడు బాబా. ఎప్పుడూ మేము మీ బిడ్డలుగా బతికేలా చూడు బాబా".

బాబా దయతో కనిపించిన భార్యాపిల్లలు

సాయిభక్తులందరికీ నమస్కారాలు. నా పేరు వెంకటేశ్వరరావు. నేను 2011 నుండి సాయిబాబా భక్తుడిని. బాబా నా జీవితంలో ఎన్నెన్నో సహాయాలు చేసారు. నాకు పెళ్ళైన 5 ఏళ్ల వరకు పిల్లలు లేరు. ఆ తర్వాత బాబా కరుణ వల్ల మాకు ఒక పాప పుట్టింది. "ఇలాగే మాకు ఇంకో బాబు పుడితే బాగుంటుంద"ని బాబాని రోజూ ప్రార్థిస్తుండేవాడిని. అలా 8 ఏళ్ళు గడిచాయి. ఇక మాకు బాబు పుట్టాడులే అనుకున్న సమయంలో నా భార్య మళ్ళీ గర్భవతి అయింది. నేను రోజూ బాబాని, "బాబు కావాల"ని ప్రార్థిస్తూ ఉండేవాడిని. బాబా దయవల్ల నేను కోరుకున్నట్లు మాకు బాబు పుట్టాడు. బాబుకి 11వ నెల వచ్చాక పుట్టు వెంట్రుకలు తీయించదలచి 2023, నవంబర్ 5న తిరుపతి వెళ్లాలని అనుకున్నాం. అప్పుడు, "బాబా! స్వామివారి దర్శనం టికెట్లు, గదులు దొరికేలా దయచూపు తండ్రీ" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవలన దర్శనం టికెట్లు, గదులు దొరకడంతో, "బాబా! మీ దయవలన తిరుపతి ప్రయాణం బాగా జరగాలి" అని అనుకొని తిరుపతికి ప్రయాణమయ్యాం. నవంబర్ 5, ఆదివారం మధ్యాహ్నం దర్శనానికి వెళ్ళినప్పుడు క్యూలో చెక్ చేసే చోట ముందు ఆడవాళ్ళని చెక్ చేసి, తరువాత మగవాళ్ళని చెక్ చేసారు. నా చెకింగ్ అయినా తర్వాత చూస్తే నా భార్యాపిల్లలు కనిపించలేదు. నా భార్యకి తిరుమలలో ఎలా వెళ్ళాలో, ఎటు వెళ్లాలో తెలియదు. అలాంటి తను మా పాప, బాబుని తీసుకొని ముందుకు వెళ్ళిపోయింది. అందువల్ల నేను, 'అయ్యో.. వాళ్ళకి ఏమీ తెలియదు. ఇప్పుడు ఎలా?' అని అనుకుంటూనే దర్శనం అయినా తర్వాత చూద్దామని క్యూలో వెళ్ళాను. దర్శనానంతరం గుడి లోపల అంతా చూసానుగాని నా భార్యాపిల్లలు కనిపించలేదు. "బాబా! బాగా రద్దీగా వుంది. చిన్న పిల్లలు గుడి లోపల కనిపించలేదు. మీ దయవలన వాళ్ళు నాకు కనిపిస్తే, మీ అనుగ్రహం తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. నా మనసుకి గుడి బయట చూస్తే బాగుంటుదనిపించి బయటకు వెళ్లి చూసాను. బాబా దయవలన నా భార్యాపిల్లలు కనిపించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1704వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అయ్యగారి రూపంలో బాబా సహాయం
2. పెద్ద కష్టం నుండి కాపాడిన బాబా

అయ్యగారి రూపంలో బాబా సహాయం


నేను ఒక సాయి భక్తురాలిని. మాది ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట. గత సంవత్సరం నేను చాలా బాధల్లో, ఇబ్బందుల్లో ఉండి మానసిక వేదనను అనుభవిస్తూ తట్టుకోలేక 2022, సెప్టెంబర్ 28న ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేమిటంటే, నేను మా అత్తింటిలో ఉండకుండా మా అమ్మవాళ్ళింటికి గానీ, ఇంకెక్కడికైనా వెళ్లి ఆధ్యాత్మిక జీవనం సాగిద్దామని. అటువంటి సమయంలో ఒక అయ్యగారు వచ్చి నాకు అన్ని విషయాలు చెబుతూ, ముందు చూపుతో జరగబోయే వాటిని కూడా చెప్పారు. నేను, "మీరు చెప్పేవి నమ్మాలంటే నాకు మీరు ఏదైనా సహాయం చేయాలి" అని చెప్పి, నేను తీసుకున్న నిర్ణయం గురించి తెలియజేసి నేను ఇంత బాధల్లో ఉన్నానని అన్నాను. అప్పుడు ఆయన, "నేను ఆ బాధను తీర్చడానికే వచ్చానమ్మా! నా మాట నమ్ము" అని అన్నారు. ఆ రోజు మొదలు ఈరోజు వరకు ఆయన ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకి మా ఇంటికి వస్తున్నారు. ఆయన నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా సమస్యలన్ని ఒక్కొక్కటిగా నేను ఊహించని విధంగా పరిష్కారమయ్యాయి. నేను, నా భర్త చాలా సంతోషంగా ఉన్నాము. ఆ అయ్యవారి రూపంలో బాబానే నాకు సహాయం చేస్తున్నారని నా నమ్మకం.


ఇకపోతే, 18 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఏ గుడికి గానీ, పుణ్యక్షేత్రాలకు గానీ వెళ్లే అవకాశం మాకు రాలేదు. ఎందుకంటే, మాది ట్రాన్స్పోర్ట్ వ్యాపారం. దాన్ని వదిలేసి వెళ్ళడానికి కుదిరేది కాదు. అదీకాక మా అత్తగారు, మామగారు, మా పెద్ద మామగార్ల బాధ్యతలన్నీ చూసుకుంటూ మేము ఎక్కడికీ వెళ్లలేకపోయేవాళ్ళం. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా మా వ్యాపారం వల్ల ఎటూ వెళ్లలేకపోతుండేవాళ్ళము. అయ్యగారు నా జీవితంలోకి వచ్చాక మమ్మల్ని మొదటగా దగ్గర్లో ఉన్న ముక్తేశ్వరపురం, వేలాద్రి, గరుడాచలము వంటి గుళ్లకు వెళ్లి రమ్మన్నారు. అయితే నేను వికలాంగురాలిని. నాకు నడిచే స్తొమత లేదు. మా పెళ్లయిన కొత్తలో మా అత్తగారువాళ్ళు మమ్మల్ని శిరిడీ తీసుకొస్తామని బాబాకి దణ్ణం పెట్టుకున్నారు. కానీ 18 సంవత్సరాలుగా శిరిడీ వెళ్లే అవకాశం దొరకలేదు. ఒకవేళ వెళదామన్నా నాకు వెళ్లాలంటే భయం. నడక, ఆ ప్రయాణాలు నేను చేయలేను. అందువల్ల అవన్నీ పెట్టుకోవద్దని అనుకున్నాను. ఈ విషయాలన్నీ అయ్యగారికి తెలిసి, "నీకు ఎటువంటి భయం లేదు. నేను దగ్గరుండి మిమ్మల్ని శిరిడీ తీసుకెళ్లి, తీసుకొస్తాను" అని ధైర్యం చెప్పి నన్ను, మావారిని, మాతోపాటు మరో 22 మందిని శిరిడీకి పంపించారు. మంచిగా బాబా దర్శనం చేసుకొని తిరిగి వచ్చాము. అప్పుడు అయ్యగారు, "అమ్మా! దర్శనం బాగా అయిందా?" అని అడిగారు. నేను, "అంతా బాగా జరిగింది కానీ, ద్వారకామాయి లోపలికి వెళ్ళలేదు, కొబ్బరికాయ ధునిలో వేయలేదు, ఊదీ తెచ్చుకోలేదు స్వామి" అని చాలా బాధతో అన్నాను. అప్పుడాయన, "నువ్వు శిరిడీ నుండి చిన్న బాబా విగ్రహాలు తెచ్చుకున్నావు కదా! రావి ఆకులో బాబా విగ్రహాన్ని పెట్టి నీ పూజ మందిరంలో పెట్టుకో. ఒక అద్భుతం జరుగుతుంది" అని చెప్పారు. మేము ఆయన చెప్పినట్లుగా రావి ఆకు తెచ్చుకొని, దానిమీద చిన్న బాబా విగ్రహం పెట్టి దణ్ణం పెట్టుకున్నాం. ఒక్క గంటలో ఊదీ వచ్చింది. ధుని వద్దకి వెళ్ళలేదని బాధపడుతున్నందుకు బాబానే స్వయంగా మాకు ఊదీ ప్రసాదించారని బాబాకి దణ్ణం పెట్టుకొని చాలా సంతోషించాం. ఆ రోజు అంటే 2023, ఏప్రిల్ 6 నుంచి ఈరోజు వరకు ఊదీ వస్తూనే ఉంది. ఆ ఊదీ ఔషధంలా పనిచేస్తుందని అయ్యవారు చెప్పినందువల్ల మేము ఆ ఊదీ అంతా భద్రంగా భద్రపరుచుకుంటున్నాము. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

పెద్ద కష్టం నుండి కాపాడిన బాబా


సాయిబంధువులందరికీ నమస్కారాలు. నా పేరు వెంకటేష్. మాది నంద్యాల. నా జీవితంలో నాకు ఎదురైన పెద్ద కష్టం నుండి బాబా నన్ను ఎలా కాపాడారో నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఒకసారి మేము ఒకరి స్థలాన్ని తాకట్టు పెట్టుకొని కొంత డబ్బు వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు ఒక సంవత్సరం తర్వాత మా డబ్బు మాకు  వెనక్కి ఇచ్చి, వాళ్ళ స్థలం వాళ్ళు విడిపించుకున్నారు. అక్కడితో అంతా అయిపోయింది. మా డబ్బు మాకు వచ్చినందుకు మేము సంతోషంగా ఉన్నాము. తర్వాత పది నెలలకి హఠాత్తుగా నాకు పోలీస్ స్టేషన్ నుండి వాళ్ళు నా మీద కేసు పెట్టారని ఫోన్ వచ్చింది. అది విని నేను హడలిపోయాను. కాస్త ధైర్యం తెచ్చుకొని అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసుకొని పోలీసు స్టేషన్‌కి వెళ్లి మొత్తం డాక్యుమెంట్లన్నీ పోలీసులకు చూపించాను. వాళ్ళు అన్ని చూసి సరిగానే ఉన్నాయి అన్నారు కానీ, అవతలివాళ్ళ తరఫున సాక్షి సంతకం పెట్టినవాళ్ళను తీసుకొని రమ్మన్నారు. అసలు వాళ్ళ తరుఫు సాక్షిదారులను మేము ఎలా తీసుకొచ్చేది అని అనిపించింది. అయినా వాళ్ళకోసం విచారిస్తుంటే, ఇద్దరు సాక్షుల్లో ఒకరు మరణించారని తెలిసింది. రెండో అతనికి కాల్ చేస్తే, లిఫ్ట్ చేయలేదు. అప్పుడు నాకు ఏమీ చేయాలో అర్థంకాక, "బాబా! నన్ను ఈ కేసు నుండి ఎలా అయినా బయటపడేయండి" అని బాబాను బ్రతిమాలుకున్నాను. బాబా దయవల్ల సిఐగారు ఆ సాక్షిని తీసుకొని రమ్మని ఒక కానిస్టేబుల్‌ని అతని ఇంటికి పంపారు. అతను వచ్చి మూడు నిమిషాల్లో నాకు ఫెవర్‌గా చెప్పాడు. దాంతో ఆ కేసు నుంచి నా పేరు తొలగించారు. "ధన్యవాదాలు బాబా. నాకెంతో ఇష్టమైన మా అమ్మ ఆరోగ్యం క్షిణించింది. దయచేసి తన ఆరోగ్యం బాగుండేలా చేయి తండ్రీ".


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.


సాయిభక్తుల అనుభవమాలిక 1703వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయతో ఆరోగ్యం
2. పెద్దగా నొప్పి లేకుండా అనుగ్రహించిన బాబా 

బాబా దయతో ఆరోగ్యం


సాయిబంధువులందరికీ నమస్కారాలు. నా పేరు దీప. నేను నా చిన్నతనం నుంచి సాయి భక్తురాలిని. మామూలుగా పిల్లలకు చిన్న జ్వరం వచ్చినా ఎందుకో భయమేస్తుంది. అలాంటిది ఎటువంటి జ్వరమైనా తొందరగా తగ్గట్లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరోజు మా బాబుకి జ్వరం వచ్చింది. నేను బాబుకి మందులు వేసి, రోజూ బాబా ఊదీ పెడుతూ మూడు రోజులు చూశాను. జ్వరం తగ్గుతూ మళ్ళీ వస్తుండేదికానీ పూర్తిగా తగ్గలేదు. ఇక అప్పుడు నేను బాబుని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్లాను. డాక్టర్, "5 రోజులు వరకు తగ్గకపోతే, బ్లడ్ టెస్ట్ చేయించాల"ని అన్నారు. అప్పుడు నేను, "బాబా! బాబుకి జ్వరం తగ్గేలా చేసి, టెస్టుల అవసరం లేకుండా చూడు తండ్రి. మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాన"ని బాబాను వేడుకున్నాను. వెంటనే బాబా అనుగ్రహించి తొందరగా బాబుకి జ్వరం తగ్గేలా చేశారు. "ధన్యవాదాలు. బాబా. నా అనుభవం పంచుకోవడం కాస్త ఆలస్యమైంది, క్షమించండి బాబా".


తర్వాత ఒకరోజు మా నాన్న, "నాకు కొంచెం బాగాలేదు. హాస్పిటల్‌కి వెళ్లొస్తాన"ని వెళ్లారు. నాకెందుకో చాలా భయమేసి, "బాబా! టాబ్లెట్లతో తగ్గాలి, ఏ టెస్టులూ వద్దు. అంతా బాగుంటే మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాని వేడుకొని నాన్న ఇంటికి తిరిగి వచ్చేవరకు 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని మనసులో అనుకుంటూ ఉన్నాను. నాన్న వచ్చి, "సమస్యేమీ కాదంట, టాబ్లెట్స్ ఇచ్చారు" అని చెప్పగానే మనసులో బాబాకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. "ఇంట్లో అందరి ఆరోగ్యం బాగుండాలి బాబా. ఇంట్లోనే కాదు, అందరూ బాగుండాలి. అందులో మేమూ ఉండాలి".


మరోసారి నాకు బాగా జలుబు చేసి ఒక పది రోజులు చాలా ఇబ్బందిపడ్డాను. అంతలో మోకాళ్ళ నొప్పి, పాదాల నొప్పులు కూడా మొదలవడంతో, 'ఇంత చిన్న వయసులో నాకేంటి ఈ ఇబ్బందులు' అనిపించి రెండురోజులు చాలా బాధపడ్డాను. ఇక అప్పుడు నొప్పులు ఉన్న చోట ఊదీ రాసాను. మరుసటిరోజుకి నొప్పులు చాలావరకు తగ్గాయి. ఆ రోజు గురువారం. బాబా మందిరానికి వెళ్లి బాబాను దర్శించుకొని వచ్చాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. "ధన్యవాదాలు బాబా. నాకు ఏమి కావాలో నీకు తెలుసు. సమయానికన్నీ ఇస్తావని తెలిసినా ఎందుకో తెలియని బాధగా ఉంది. నాకు కాలం కలిసి రావట్లేదు, సహకరించట్లేదో అర్థం కావడం లేదు. నాకు నా కాళ్ళపై నిలబడాలని ఉంది. నా బాధని అర్థం చేసుకొని నాకు ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించు తండ్రీ. నా ఆరోగ్యం కూడా అన్ని రకాలుగా సహకరించేలా చూడయ్యా".


పెద్దగా నొప్పి లేకుండా అనుగ్రహించిన బాబా 

సాయినాథ్ మహారాజ్ కి జై!!! సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య. 2023, నవంబర్ 5, ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసాక మావారు పని ఉందని బయటికి వెళ్లారు. ఆయన వెళ్తూ వెళ్తూ మా మూడు సంవత్సరాల బాబుని, "నాతో వస్తావా?" అని అడిగారు. వాడు వస్తానని ఆయనతో బయలుదేరాడు. వాడు మెట్ల మీద గెంతుతూ దిగుతుంటే హఠాత్తుగా కాలుజారి కిందపడిపోయాడు. వాడి ఏడుపు వినగానే నేను బాబాని, "బాబా! బాబుకి  పెద్ద దెబ్బ తగలకుండా చూడండి" అని వేడుకున్నాను. మావారు బాబుని హత్తుకొని ఇంట్లోకి తీసుకొచ్చారు. బాబుని చూసాక నాకు చాలా టెన్షన్ వచ్చింది. బాబు కనుబొమ్మకి, కనురెప్పకి దెబ్బలు తగిలాయి. కనుబొమ్మ వద్ద పచ్చగా అయి వాపు వచ్చింది. నేను మనసులో బాబాని తలుచుకుంటూ బాబుకి గాయమైన చోట ఐస్ క్యూబ్ పెట్టి, "చిన్న బాబు బాబా. వాడికి నొప్పి లేకుండా చేయండి. అలాగే జ్వరం ఏమీ రాకుండా మీరే చూడాలి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల బాబుకి నొప్పి స్వల్పంగా ఉండి రాత్రి ఇబ్బంది పడకుండా నిద్రపోయాడు. "ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడుతున్నందుకు శతకోటి ధన్యవాదాలు బాబా".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo