సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1377వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి అనుగ్రహం
2. నాతోనే ఉన్నారు బాబా
3. 'బాబా' అంటే చాలు - బాధలు తీరుస్తారు

శ్రీసాయి అనుగ్రహం


ముందుగా సాయిబంధువులకు నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. మా పాపకి 11 నెలల వయసున్నప్పుడు డైపర్ వల్ల తనకి రాషెస్ వచ్చాయి. డైపర్ వేయడం మానేసినా, డైపర్ క్రీం రాసినా ఆ రాషెస్ తగ్గలేదు. నాకు చాలా భయమేసి, బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! పాపకి పెద్ద సమస్య కాకుండా రాషెస్ తగ్గేలా దయచూపండి" అని అనుకున్నాను. బాబా దయవల్ల కొన్ని రోజులకి రాషెస్ తగ్గుముఖం పట్టాయి. "పెద్ద సమస్య కాకుండా పాపని కాపాడినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఇలాగే మచ్చలు కూడా తగ్గిపోవాలి తండ్రీ".


ఒకరోజు మా కజిన్ సీమంతం ఫంక్షన్ ఉండగా మా పాప బాగా ఏడ్చింది. అలాగే పాప ఏడుస్తుంటే ఫంక్షన్‌లో అందరికీ ఇబ్బందవుతుంది, అలాగని దగ్గర బంధువుల ఫంక్షన్‌కి వెళ్లకుండా ఉండలేము. అందువలన, "బాబా! పాప వల్ల ఫంక్షన్‌కి ఇబ్బంది కాకూడదు. పాప ఎక్కువగా అలసిపోకూడదు. అలాగే నేను మంచిగా నవ్వుతూ అక్కడ వాళ్ళకి సహాయం చేయగలగాలి. ఇంకా సంతోషంగా మేము ఫంక్షన్ నుండి ఇంటికి తిరిగి రావాలి" అని బాబాను ప్రార్థించి ఫంక్షన్‌కి వెళ్ళాను. బాబా దయవల్ల పాప ఫంక్షన్‌లో పెద్దగా ఏడవలేదు. నేను కోరుకున్నట్లే చక్కగా సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాము. "థాంక్యూ సో మచ్ బాబా".


నేను కడుపుతో ఉన్న తొమ్మిది నెలలూ పూర్తి బెడ్‌రెస్ట్‌లో ఉన్నందువల్ల నాకు సోమరితనం బాగా ఎక్కువైంది. ఆ విషయంగా నేను, "బాబా! మీ దయతో నా సోమరితనం తగ్గాలి" అని అనుకున్నాను. ఎందుకంటే, నాకున్న అతిపెద్ద కోరికల్లో ఈ సోమరితనం పోవడం ఒకటిగా ఉండేది. దాన్ని బాబా తీసేశారు. ఆయన దయతో సోమరితనం నాకు చాలావరకు తగ్గింది. "థాంక్యూ బాబా".


ఒకరోజు రాత్రి నా కుడిచేతి బొటనవేలు చాలా నొప్పిగా ఉండి ఏ పనీ చేసుకోలేకపోయాను. మా పాపకి అన్నం పెట్టాలన్నా వీలుకాక చాలా బాధపడ్డాను. అప్పుడు నేను బాబా ఊదీ మంత్రం చదువుకుని ఊదీ బొటనవేలికి రాసి, "నొప్పి తగ్గాల"ని అనుకున్నాను. బాబా దయవల్ల నొప్పి చాలావరకు తగ్గింది. "థాంక్యూ సో మచ్ బాబా. ఈ 11 నెలల్లో మా పాపని మీరే జాగ్రత్తగా చూసుకుంటూ ఎన్నో అనుభవాలు పంచుకునేలా అనుగ్రహించారు. పుట్టుకతోనే గుండె సమస్య ఉన్న తనకి ఇంకో 15 రోజుల్లో ఆపరేషన్ జరగనుంది. ఇది అత్యంత ముఖ్యమైన ఘట్టం. అది విజయవంతం అయ్యేలా చూడండి బాబా. నిజానికి మీకు మొక్కుకున్నాకే అబార్షన్ అవ్వాల్సిన నా ప్రెగ్నెన్సీ నిలబడింది. డాక్టర్లే ఆశ్చర్యపోయారు. అలాంటి మీ బిడ్డని ఇప్పుడు కూడా కాపాడండి ప్లీజ్. మీ మీద నాకు పూర్తి నమ్మకముంది. ఏదన్నా తప్పుగా రాసి ఉంటే క్షమించండి బాబా". త్వరలోనే మా జీవితంలో జరగబోతున్న అతిపెద్ద అనుభవంతో మీ ముందుకు వస్తాను.


ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథాయ నమః!!!


నాతోనే ఉన్నారు బాబా


ముందుగా సాయిబంధువులకు నా అభినందనలు. నా పేరు ప్రసూన. మేము హైదరాబాదులో నివసిస్తున్నాము. ఈ బ్లాగ్ ద్వారా మన వేదనలు, అనుభూతులు, ఆనందాలు పంచుకుంటూ ఉంటే 'మనమందరం సాయిబిడ్డలం' అని స్పష్టమవుతున్నది. ప్రతి కష్టంలో, ప్రతి సమస్యలో, ప్రతి ఆనందంలో మా సాయితండ్రి మాతో ఉన్నారనడానికి మాకెన్నో అనుభూతులు ఉన్నాయి. వాటిలోనుండి, కొద్దిరోజుల క్రితం మాకు బాబా ప్రసాదించిన అనుభూతిని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ప్రతిరోజూ బాబాకు పాదాభివందనంతో నా దినచర్య మొదలవుతుంది. బాబాకి చెప్పకుండా ఏ పనీ చేయాలని అనిపించదు. ఆరోజు గురువారం. ఎప్పటిలానే ఆరోజు కూడా బాబా పూజకి కూర్చున్నాను. కానీ అస్సలు పూజ చేయలేకపోయాను. ఉన్నట్టుండి గొంతులో చాలా అసౌకర్యంగానూ, ఆయాసంగానూ అనిపించింది. ఎప్పుడూ అంత తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళనిదాన్ని, ఆరోజు మాత్రం 'అసలు ఆలస్యం చేయవద్ద'ని బాబా చెప్పినట్టనిపించి, వెంటనే మావారితో కలిసి హాస్పిటల్‌కి వెళ్ళి ఫిజీషియన్‌ని కలిశాము. నాకున్న లక్షణాలను బట్టి చేయవలసిన పరీక్షలు చేసి, వాటి ఫలితాలు చూసి, "కొలెస్ట్రాల్ చాలా ప్రమాదకరమైన స్థాయిలో ఉంది. వెంటనే కార్టియాలజిస్ట్‌ని సంప్రదించమ"ని చెప్పి, నన్ను యశోద హాస్పిటల్‌కి వెళ్ళమని సూచించారు. మామూలుగా కూడా నాకు సాయి నామస్మరణ ఊపిరి. అది ఎల్లప్పుడూ నా మనసులో నడుస్తూనే ఉంటుంది. అప్పుడు కూడా బాబాకి చెప్పి యశోద హాస్పిటల్‌కి బయలుదేరాము. నేను ధైర్యంగానే ఉన్నానుగానీ, మావారు చాలా టెన్షన్ పడి బీపీ పెంచేసుకున్నారు. నాకు తన గురించి టెన్షన్. యశోద హాస్పిటల్‌కి వెళ్ళి, డాక్టర్ని కలిశాము. సాయి నామస్మరణ చేసుకుంటూ, "మందులతో నా సమస్య తగ్గితే చాలు బాబా" అని బాబాను వేడుకున్నాను. కానీ డాక్టర్, 'ఒకసారి TMT (ట్రెడ్‌మిల్ టెస్ట్) చేయించమ'ని చెప్పారు. మళ్ళీ బాబాకి చెప్పి టెస్ట్‌కి వెళ్ళాను. కానీ 2 నిమిషాలు కూడా ట్రెడ్‌మిల్‌‌‌పై నడవలేకపోయాను. డాక్టర్ TMT రిజల్ట్ చూసి, "యాంజియోగ్రామ్ చేస్తే మంచిది, వీలైనంత త్వరగా చేయించుకోండి" అని చెప్పారు. ఈసారి కూడా బాబాని వేడుకొని, 'నవరాత్రుల పూజ తరువాత యాంజియోగ్రామ్ చేయించుకుంటాన'ని డాక్టరుకి చెప్పాను. నా వేదన తెలుసుకొన్న బాబా, ఒక వారంరోజుల తరువాత యాంజియోగ్రామ్‌కి స్లాట్ ఇచ్చేలా చేశారు. ఈ వారంరోజులూ మందులు వాడమని, అక్టోబరు 6, గురువారంనాడు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవమని చెప్పారు డాక్టర్‌గారు. ఈ అన్ని పరిస్థితులలోనూ బాబా నాతోనే ఉన్నారు. ఈ వారంరోజుల్లో మాకు రైల్వే రిఫరల్ కూడా దొరికింది. గురువారంనాడు బాబా ఆశీర్వాదం తీసుకొని హాస్పిటల్‌కి వెళ్ళి జాయినయ్యాను. "బాబా, ఎందుకు ఈ పరీక్ష పెట్టావు?" అని బాబాను అడుగుతూనే ఉన్నాను. మా అబ్బాయి యు.ఎస్.ఎలో ఉంటాడు. తను అప్పటికప్పుడు అక్కడినుండి రాలేని పరిస్థితి. మాకు మేమే ధైర్యం చెప్పుకొని బాబా మీద భారం వేసి, బాబా నామస్మరణ చేసుకుంటూ, సాయిచాలీసా చేసుకుంటూ గడిపాము. ఉదయం 9 గంటలకు యాంజియోగ్రామ్ చేస్తామని చెప్పిన డాక్టర్లు, హాస్పిటల్లో వేరే ఎమర్జెన్సీ కేసులు ఉండటం వల్ల ఆరోజు సాయంత్రం చేస్తామన్నారు. అక్కడ బాబా నాకొక సందేశం ఇచ్చారనిపించింది. సాయంత్రం 6.30కి నన్ను ల్యాబ్‌కి తీసుకొని వెళ్ళారు. అక్కడ నర్స్ నాతో, "బాబాకి దణ్ణం పెట్టుకోండి, అంతా క్లియర్‌గానే ఉంటుంది" అని అన్నప్పుడు నాకు మళ్ళీ బాబా సందేశం ఇచ్చారనిపించింది. టెస్ట్ పూర్తవుతూనే, 'అంతా బాగుంది' అన్నట్టుగా డాక్టర్ తన చేతి బొటనవ్రేలిని పైకెత్తి చూపుతుంటే అది నాకు బాబా చూపించినట్లే అనిపించింది. డాక్టర్ మావారిని కూడా పిలిచి మానిటర్ చూపించి, "అంతా బాగుంది, ఏ సమస్యా లేదు" అని అన్నప్పుడు మాకు కలిగిన అనుభూతి, ఆనందం మాటల్లో వర్ణించలేనిది. సాయిభక్తులైన మీ అందరూ కూడా బాబా అనుగ్రహంతో ఆ అనుభూతి, ఆనందాలను మీ మీ జీవితాలలో చూసే ఉంటారు. "బాబా! మొదట మా జీవితాలలో తుఫాను రేపి, మళ్ళీ నువ్వే దాన్ని శాంతపరుస్తావు. అందరినీ చల్లగా చూడు తండ్రీ. అందరూ ఆనందంగా మీ అనుభూతులు పంచుకుంటూ ఉండేలా అనుగ్రహించు".


'బాబా' అంటే చాలు - బాధలు తీరుస్తారు


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


నేను ఒక సాయిభక్తురాలిని. నా పేరు సుభాషిణి. శ్రీసాయి దయవల్ల మా అమ్మాయికి బాబు పుట్టాడు. ఆరోజు గురువారం కావడంతో బాబానే మా ఇంటికి వచ్చారని మాకు చాలా సంతోషమేసింది. అయితే బాబు పుట్టిన నాలుగో రోజు తనకి కామెర్లు వచ్చి ఇంక్యుబేటర్‌లో పెట్టారు. నేను ఆరోజు బాబాని తలచుకుంటూ అలాగే కూర్చున్నాను. బాబా దయవల్ల ఒక్కరోజులోనే బాబు క్షేమంగా మా దగ్గరకి వచ్చాడు. బాబుకి శాంతి చేయించి, నామకరణం చేశాము. నేను బాబా పేరు బాబుకి పెట్టమని అడిగితే, మా అమ్మాయి, తన అత్తగారు అందుకు అంగీకరించి బాబుకి 'చార్విక్ సాయి' అని పేరు పెట్టారు. "ధన్యవాదాలు బాబా. అప్పుడప్పుడు బాబుకి ఆరోగ్యం సరిగా ఉండటం లేదు తండ్రీ. నీవే తనని రక్షించు బాబా".


ఒకరోజు నేను ఉంగరం మా ఇంట్లో ఒకచోట పెట్టాను. తర్వాత చూస్తే కనపడలేదు. బాబాను తలచుకుని అంతటా వెతికినా కనపడలేదు. నాకు చాలా బాధేసి మరలా వెతికితే, మొదట చూసిన చోటే ఉంగరం నా చేతికి తగిలింది. ఇది బాబా మహిమ. 'బాబా' అంటే చాలు, మన బాధలు తీరుస్తారు. "ధన్యవాదాలు బాబా".


శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!



సాయిభక్తుల అనుభవమాలిక 1376వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయితండ్రి కరుణ
2. తల్లిదండ్రులమయ్యే అదృష్టాన్ని ప్రసాదించిన బాబా
3. విన్నవించుకున్నంతనే జ్వరం నుండి ఉపశమనం ప్రసాదించిన బాబా

సాయితండ్రి కరుణ


ముందుగా, ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయిబంధువులకి నా నమస్కారాలు. నా పేరు సరిత. నేను ఇంతకుముందు నాలుగుసార్లు నా అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటాను. ముందుగా నా జీవితంలో జరిగిన చాలా గొప్ప సాయిలీలను చెప్తాను. రెండేళ్ళ క్రితం కరోనా ప్రభావం వలన మావారి ఉద్యోగం పోయింది. అప్పటివరకు మావారు చేసిన ఉద్యోగాలన్నీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలే. అయితే, ఈసారి కరోనా కారణంగా తను దాదాపు రెండు సంవత్సరాలు ఉద్యోగం లేకుండా ఉన్నారు. అసలు ఉద్యోగం లేకుండా రెండేళ్ళ పాటు మేము పడిన బాధ వర్ణించలేనిది. ఆ రెండు సంవత్సరాలు నేను ఎంతో మధనపడుతూ, “బాబా! మాపై దయచూపి, మావారికి ఒక పర్మినెంట్ ఉద్యోగాన్ని ప్రసాదించు” అని బాబాకి చెప్పుకునేదాన్ని. ఆ సమయంలోనే నేను మావారి ఉద్యోగం కోసం ‘సాయి దివ్యపూజ’ చేశాను. తరువాత శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకుని, మా బాధను విన్నవించుకున్నాను. చివరికి నా సాయితండ్రి నన్ను కరుణించి మావారికి చాలా మంచి కంపెనీలో పర్మినెంట్ రోల్‌తో మంచి ఉద్యోగాన్ని ప్రసాదించారు. మా ఇద్దరి ఆనందానికి అవధుల్లేవు. మాపై ఇంత కరుణను కురిపించిన నా సాయితండ్రిని కీర్తించడానికి నాకు మాటలు సరిపోవట్లేదు. అంతా సాయి కృప.


ఈమధ్య నేను బతుకమ్మ ఆడుతుంటే నా మెడ, భుజం పట్టేసి చాలా ఇబ్బందిపడ్డాను. అప్పుడు నేను, “నా నొప్పి తగ్గిస్తే నా అనుభవాన్ని బ్లాగులో షేర్ చేసుకుంటాను” అని బాబాను వేడుకున్నాను. బాబా దయతో మూడు రోజుల తరువాత నొప్పి తగ్గిపోయింది. ఇలా నా జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు చేసిన నా తండ్రి సాయినాథునికి నా శతకోటి నమస్కారాలు.


ఈమధ్య మా అమ్మ ఆరోగ్యం చాలా పాడైపోయింది. ఒకసారి హార్ట్ బీట్ ఎక్కువవడంతో తనను రెండు రోజుల పాటు ICUలో ఉంచారు. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! అమ్మని మీరు ఆరోగ్యంగా ఇంటికి తీసుకొస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల అమ్మ పూర్తిగా కోలుకుంది. ఎన్నో సంవత్సరాల నుండి మా అమ్మావాళ్ళు స్వంతిల్లు కట్టుకోవాలని అనుకుంటుండేవారు. కానీ డబ్బు సమస్య కారణంగా చాలాకాలం పాటు తమ కలను నెరవేర్చుకోలేకపోయారు. చివరికి బాబా దయవల్ల కొంచెం పొలం అమ్మి ఇల్లు కట్టుకుని, బాబా కృపతో గృహప్రవేశం కూడా చేసుకున్నారు. ఇదంతా కేవలం సాయినాథుని మహిమ. “థాంక్యూ బాబా!”


తల్లిదండ్రులమయ్యే అదృష్టాన్ని ప్రసాదించిన బాబా


సాయి బంధువులకు నమస్కారాలు. బ్లాగు నిర్వాహకులకు కృతఙ్ఞతలు. నేను ఒక సాయి భక్తురాలిని. నా పేరు శ్రీలక్ష్మి. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. కానీ మాకు పిల్లలు లేరు. ఎన్నో హాస్పిటళ్ళ చుట్టూ తిరిగాము. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. నేను బాబాను, "నాకు సంతాన భాగ్యం ప్రసాదించండి" అని ఎంతగానో అడుగుతుండేదాన్ని. మా ఆయన ఏ పిల్లల్ని చూసినా, "మనకెప్పుడు పుడతారో!" అని చాలా బాధపడేవాళ్ళు. చుట్టాలు, పక్కింటివాళ్ళు "మనవడినో, మానవరాలినో ఎప్పుడు ఇస్తావు?" అని అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక నేను మౌనంగా అక్కడ నుంచి వెళ్లిపోయేదాన్ని. బాబా మందిరానికి వెళ్లి అక్కడ కూర్చొని, "నేను ఎంతలా బాధపడుతున్నానో మీకు తెలుసు బాబా" అని ఒంటరిగా ఏడ్చుకునేదాన్ని. ఒకసారి బాబా మందిరం నుండి ఇంటికొచ్చి ఏడుస్తూ పడుకుని, "వాళ్ళు, వీళ్ళు, చుట్టాలు అనే మాటలకి సగం చచ్చిపోయాను బాబా. ఇంకా నన్ను ఎందుకు ప్రాణాలతో ఉంచుతున్నావు తండ్రి" అని మనసులో అనుకుంటూ నిద్రపోయాను. ఆ మర్నాడు పొద్దుపొద్దున్నే వాంతులు అయ్యాయి. అదికాక నెలసరి రాలేదు. వాటిని బట్టి 'బాబా నాకు వరమిస్తున్నారేమో!' అనుకుని, ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్టు చేసుకుందామనుకుని, టెస్టు చేసుకునే ముందు బాబా ఆశీస్సులు తీసుకుందామనుకున్నాను. ఎందుకంటే, అదివరకు ఒకసారి ఇలాగే నెలసరి రాలేదు. అప్పుడు ప్రెగ్నెన్సీ టెస్టు చేసుకుంటే నెగెటివ్ వచ్చింది. "ఎందుకు ఇలా చేశావు తండ్రి?" అని బాబాని అడిగి చాలా ఏడ్చాను. అందుకే ఈసారి బాబా మందిరానికి వెళ్లి, "బాబా! ఈసారి ప్రెగ్నెన్సీ టెస్టులో పాజిటివ్ రావాలి, అలా వస్తే గనక పుట్టబోయే పాప లేదా బాబుకి 'సాయి' అని కలిసి వచ్చేలా పేరు పెట్టుకుంటాను తండ్రి" అని బాబాను ప్రార్థించాను. తరువాత టెస్టు చేసుకున్నాను. మావారు నా పక్కనే ఉన్నారు. ఏదో తెలియని భయంతో నేను మనసులో 'సాయి సాయి' అని బాబా నామం జపించాను. ఐదు నిమిషాల్లో బాబా దయవల్ల టెస్టు రిజల్ట్ పాజిటివ్ వచ్చింది. మా ఆనందానికి హద్దులు లేవు. సంతోషంతో నాకు కన్నీళ్లు ఆగలేదు. నన్ను నేను చాలా నియంత్రించుకోవాల్సి వచ్చింది. నేను బాబాను తప్ప ఏ దైవాన్ని 'నాకు సంతానం కావాల'ని అడగలేదు. అంతలా బాబాను నమ్ముకున్నందుకు నా బాధ చూడలేక ఆ తండ్రి కరుణించారు. ఇన్ని రోజులకు తల్లిదండ్రులమయ్యే అదృష్టం మాకు దక్కింది. అంతా బాబా దయ. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. నాకు నేను, మావారు, నా కడుపులోని బిడ్డ ముగ్గురం ఒకసారి శిరిడీ దర్శనం చేసుకోవాలని ఉంది. వీలైనంత త్వరగా నా కోరికను నెరవేర్చు తండ్రి. నా కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చూడండి తండ్రి. మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇలాగే  మాపై ఉండాలి బాబా".


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!


విన్నవించుకున్నంతనే జ్వరం నుండి ఉపశమనం ప్రసాదించిన బాబా


సాయిబంధువులందరికీ నమస్కారం. నాపేరు భారతి. చాలా సంవత్సరాల నుంచి దివ్యస్వరూపుడైన శ్రీసాయినాథుడు నాకు అన్ని విషయాలలో తోడుగా ఉండి నన్ను నడిపిస్తున్నారు. ఈమధ్య బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవం గురించి తెలియజేయాలనుకుంటున్నాను. ఒకరోజు మా చిన్నబ్బాయికి విపరీతమైన జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఇంజక్షన్ చేసి, టాబ్లెట్లు ఇచ్చారు. ఆ టాబ్లెట్లు వేసుకున్నా చాలాసేపటివరకు బాబుకి జ్వరం తగ్గలేదు. నాకు చాలా భయమేసింది. అర్ధరాత్రి వరకు వేచి చూశాక ఆ సాయినాథుడే బాబుకి జ్వరం నుంచి ఉపశమనం కలిగించగలరని విశ్వసించి, "బాబా! బాబుకి జ్వరం తగ్గితే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు విన్నవించుకున్నాను. ఆ తండ్రి దయవల్ల కొంత సమయం గడిచేసరికి బాబుకి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. "వేల వేల వందనాలు బాబా".                                                                                           


సాయిభక్తుల అనుభవమాలిక 1375వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:


1. అనుక్షణం వెన్నంటే ఉండి మనకోసం ఎన్నో చేసే బాబా
2. బాబా ప్రసాదించిన మధుర క్షణాలు

అనుక్షణం వెన్నంటే ఉండి మనకోసం ఎన్నో చేసే బాబా


సదా నింబవృక్షస్య మూలాధివాసాత్|

సుథాస్రావిణం తిక్తమప్య ప్రియంతం|

తరుం కల్పవృక్షాధికం సాధయంతం|

నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్||


నా పేరు శ్రీదేవి. మా ఊరు నాగార్జునసాగర్ దగ్గర హాలియా. ముందుగా తోటి సోదర, సోదరీమణులకు నమస్కారాలు. నేను ఇంతకుముందు నా అనుభవం వ్రాసినప్పుడు బ్లాగు నిర్వాహకులు, 'మీ అనుభవం ఇంకొంచెం వివరంగా వ్రాస్తే బాగుంటుంది. అప్పుడే బాబా ప్రేమ స్పష్టంగా తెలుస్తుంది. చదివేటప్పుడు మంచి అనుభూతి కలుగుతుంది' అని చెప్పారు. వారు ప్రేమ పూర్వకంగానే చెప్పినప్పటికీ నాలో ఉన్న అహంకారం వలన అపార్థం చేసుకుని, 'నేను జీవితంలో ఇంకే అనుభవాలు ఈ బ్లాగుకి వ్రాయను" అని అనుకున్నాను. అందుచేత మా బాబు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు బాగా వ్రాసి, ఉత్తీర్ణుడైతే తనతోనే అనుభవం వ్రాయించి, తన ఫోన్ నుండి బ్లాగుకు పంపిద్దాం అనుకున్నాను. కానీ బాబు ఫెయిల్ అయ్యాడు. 'తప్పు నేను చేస్తే, శిక్ష వాడికి పడింది' అని బాధపడి, బాబాని ఎంతగానో వేడుకుని క్షమాపణ చెప్పాను. బాబా బాబుకోసం నవగురువార వ్రతం చేయమని సూచించారు. నేను అలాగే చేశాను. బాబు సప్లిమెంటరీ వ్రాశాడు. ఈసారి సప్లిమెంటరీ వ్రాసిన వాళ్లకు స్టార్ గుర్తులేదని చెప్పారు. అది తెలిసి నేను, 'బాబా! ఏమి లీల తండ్రి నీది?' అని అనుకున్నాను. ఆయన దయతో బాబు మంచి మార్కులతో పాస్ అయ్యాడు. తనకి గురునానక్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సీటు వచ్చింది. "బాబా! మీ దయతో బాబు మంచిగా చదువుకోవాలి. మీ దీవెనలు సదా వాడికి ఉండాలి".


నేను చిరుధాన్యాల వ్యాపారం చేస్తున్నాను. 2023లో ఒక పాత పిండి మిల్లు తీసుకుని షాపులో పెట్టాము. ఒక వర్కర్ వచ్చి ఆ మిల్లు మరమ్మత్తు చేసి వెళ్ళాడు. అయితే అతను సరిగా మరమ్మత్తు చేయలేదు. దాంతో పిండి మాడిపోయి పొగలు రావడం, మాడిన వాసన రావడం జరుగుతుండేది. నాకు చాలా బాధేసి, "నాకు ఈ పరీక్ష ఏమిటి బాబా? నేను పెట్టమన్నాని మావారు ఈ మిల్లు పెట్టించారు. కానీ నాకు పిండి పట్టడం రావడం లేదు. నా మనసు మనసులా ఉండటం లేదు. చాలా చికాకుగా ఉంటుంది" అని బాబాతో మొరపెట్టుకున్నాను. రోజూ ఉదయం లేవగానే అదే గుర్తుకు రావటంతో, "ఇంత చేసినా ఏ ఫలితం లేదా బాబా. దయచేసి ఏదైనా మార్గం చూపండి" అని రోజూ బాబాను వేడుకుంటూ ఉండేదాన్ని. అలా నాలుగు రోజులు గడిచాయి. ఆరోజు ఉదయం నేను, "బాబా! ఇలా అయితే వ్యాపారం ఎలా? నా యందు దయ ఉంచి మమ్మల్ని నవ్వులపాలు చేయకు బాబా, ప్లీజ్. మిల్లు మంచిగా అయ్యేలా ఆశీర్వదించండి" అని బాబాతో చెప్పుకున్నాను. మధ్యాహ్నం ఒక వర్కర్ వచ్చి పిండి శుభ్రంగా వచ్చేలా మిల్లు బాగు చేసి, "ముందు మరమత్తు చేసిన అతను రాయి సరిగా పెట్టకపోవడం వల్ల అలా అయింద"ని చెప్పాడు. "థాంక్యూ సో మచ్ బాబా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. థాంక్యూ థాంక్యూ సో మచ్ బాబా".


మావారు ధాన్యం, పత్తి వ్యాపారం చేస్తారు. 2020 నుండి మూడు సంవత్సరాలు ఆ వ్యాపారం సరిగా లేదు. అందువలన 2023లో కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలని మావారు ఆలోచించారు. కానీ పెట్టుబడి పెట్టే పరిస్థితులు లేకపోవటం వల్ల ఏం చేయాలని మావారు చాలా బాధపడుతూ నిద్ర కూడా సరిగా పోయేవారు కాదు. అలాంటి సమయంలో బాబా నాకు ఒక సందేశం ఇచ్చారు. నేను ప్రతిరోజు ఉదయం యూట్యూబ్‍లో సాయి సందేశం వింటుంటాను. అలా ఒకరోజు విన్నప్పుడు, "నూతన వ్యాపారం ప్రారంభించు. అంతా సవ్యంగా ఉంటుంది" అని బాబా సందేశం వచ్చింది. నాకు చాలా సంతోషమేసింది. బాబా దయ చూడండి. అనుకోకుండా ఒక దుకాణం ఖాళీ అయి మావారి పరిశీలనలోకి వచ్చింది. ఆరోజు గురువారం. మా ఊరి గుడిలో ప్రతి గురువారం సచ్చరిత్ర పారాయణ, భజన, పల్లకిసేవ జరుగుతాయి. నేను ఆ గుడిలో బాబా పారాయణలో ఉండగా మావారు నాకు ఫోన్ చేసి, "షాప్ యజమానికి అడ్వాన్స్ ఇవ్వాలి. ఫోన్ పే చేయి" అని చెప్పారు. కానీ ఆ షాప్ యజమాని, "ఈరోజు అమావాస్య, ఇప్పుడు డబ్బులు ఇవ్వకండి. రేపు ఇవ్వండి" అని అన్నారు. మేము అలాగే చేసాము. మావారు ఆ షాపులో టెంట్ హౌస్ పెట్టాలని అనుకున్నారు. కానీ ఆయనకి షాపు తను ఒక్కరే నడపడం ఇష్టంలేక వేరొకరు ఉంటే బాగుంటుందని భాగస్వామికోసం వెతికారు. కానీ ఎవరూ దొరకలేదు. దాంతో మావారు తీవ్రమైన ఆలోచనలో పడ్డారు. నేను ఆయనతో, "ఏం భయం లేదు. మీరు గుడికి వెళ్లి బాబాను దారి చూపమనండి. అంతా అదే సవ్యంగా జరుగుతుంది" అని అన్నాను. కానీ షాపు ఓపెన్ చేయడానికి రెండు రోజులే ఉన్నాయి. తరువాత మంచి రోజులు లేవు. ఆ సమయంలో మావారు గుడికి వెళ్లి, బాబాకి దణ్ణం పెట్టుకుని వచ్చారు. అదేరోజు ఒకరు వచ్చి, "మేము భాగస్వామ్యం ఉంటాము" అన్నారు. దాంతో చివరిరోజున మేము షాపు ఓపెన్ చేసాము. అలా బాబా తమ కృపను చూపారు. షాపు ఓపెన్ చేయడమైతే చేసాం కానీ తగినంత పెట్టుబడి లేదు. పైగా షాపుకి కావలసిన సామాను దొరకలేదు. ఒకటి, రెండు చోట్ల సామాను చూసినప్పటికీ బేరం కుదరలేదు. ఆలోగా భాగస్వామ్యం ఉంటానని వచ్చిన వ్యక్తి, "నేను ఉండను" అని వెళ్లిపోయారు. అతను వెళ్లిన రెండు గంటలకే మావారికి, "సామాను ఇస్తాము, రండి" అని ఫోన్ వచ్చింది. దాంతో మావారు వెళ్లి సామాను తెచ్చుకుని ఒక్కరే షాపు చూసుకుంటున్నారు. "బాబా! మీకు ఎంత దయ తండ్రి. అనుక్షణం వెన్నంటే ఉండి మాకోసం ఎన్నో చేసే మీకు శతకోటి ప్రణామాలు".


సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


బాబా ప్రసాదించిన మధుర క్షణాలు


నేను ఒక సాయి భక్తురాలిని. సాయి బంధువులందరికీ నమస్కారం. ఎక్కడెక్కడో ఉన్న భక్తులందరినీ ఒకచోట చేర్చి మన సమస్యలకు బాబా చూపే పరిష్కారాలను ఒకరితో ఒకరు పంచుకునేందుకు అనువుగా ఈ బ్లాగు ఉండటం సంతోషంగా ఉంది. నేను ఈ బ్లాగు ద్వారానే బాబా గురించి చాలా తెలుసుకున్నాను. ఇప్పుడు నేను బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. మా చిన్నమ్మాయికి మైగ్రేన్ తలనొప్పి ఉంది. అప్పుడప్పుడు తను ఆ నొప్పిని తట్టుకోలేక చాలా బాధపడుతూ ఏడుస్తుంటుంది. 2023లో తనకి పరీక్షలు జరుగుతున్నప్పుడు తెల్లవారితే పరీక్ష అనగా తలనొప్పితో ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు నేను, "బాబా! మీ దయతో అమ్మాయి తలనొప్పి తగ్గి, చక్కగా చదువుకుని తెల్లవారి పరీక్ష మంచిగా వ్రాసేలా దయ చూపండి" అని బాబాతో చెప్పుకుని 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని చాలాసేపటివరకు జపించాను. అమ్మాయి కాసేపు పడుకుని ఒక గంటన్నర తర్వాత లేచి చదువుకుని, మరునాడు పరీక్షకు వెళ్ళి బాగా వ్రాసింది.


మా పెద్దమ్మాయి తనకి ఉద్యోగం వస్తే, మొదట జీతం బాబాకి ఇస్తానని మ్రొక్కుకుంది. బాబా దయతో తనకి ఉద్యోగం వచ్చింది. తను మ్రొక్కుకున్నట్లే మొదటి జీతం అందగానే ఆ డబ్బులు మా ఇంట్లో దేవుడి దగ్గర పెట్టింది. తను, నేను ఆ డబ్బులు మా ఊరిలోని బాబా గుడిలో ఇవ్వాలని అనుకున్నాం. కానీ మావారు శిరిడీ వెళ్లి, ఆ డబ్బులు అక్కడ సమర్పిద్దాం అన్నారు. ఆయన ఎంత చెప్పినా మేము మా ఊరి గుడిలోనే ఇద్దామని నాలుగు నెలలు వేచి చూసాము. అంతలో హఠాత్తుగా మావారు శిరిడీ ప్రయాణానికి టికెట్లు తీసుకున్నారు. దాంతో మేము, మా అమ్మానాన్న, మా ఇద్దరు చెల్లెల్లు, వాళ్ళ కుటుంబాలు, మా చిన్నమ్మ కుటుంబం శిరిడీ వెళ్ళాము. నేను ఎక్కడికి వెళ్లినా బాబా తన పేరుతో లేదా ఫోటో రూపంలో నాకు దర్శనమిచ్చి నా వెంటే ఉంటారు. శిరిడీలో ఎటువైపు చూసినా బాబా పేరుతో ఉన్న నేమ్ బోర్డులే దర్శనమిస్తుంటే వాటిని చూస్తూ నేను చుక్కల లోకంలో విహరించాను. ఆ తరువాత మేమందరం సంతోషంగా బాబా దర్శనం చేసుకున్నాం. మా అమ్మాయి జీతం డబ్బులు డొనేషన్ కౌంటరులో కడితే శేజారతికి టికెట్లు ఇచ్చారు. చాలా దగ్గర నుంచి బాబాను చాలాసేపు దర్శించుకున్నాం. ఆరోజు ఆరతి సమయంలో బాబా వేసుకున్న ఎర్రటి డ్రస్సు, ఆ సంగీత వాయిద్యాల ధ్వని నన్ను ఒక అద్భుత లోకంలోకి తీసుకెళ్లాయి. ఆ మధుర క్షణాలు నా మనసులో ఎప్పటికీ సజీవంగా ఉండిపోతాయి. చివరి రోజున మా నాన్న దారి తప్పిపోయినప్పటికీ బాబా దయవల్ల తొందరగానే దొరికారు. అలా కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినా అందరం క్షేమంగా ఇంటికి తిరిగి చేరుకున్నాం. మేము వద్దన్నా మావారు శిరిడీకి తీసుకెళ్లడం, మాకు ఆరతి దర్శనం లభించటం అంతా ఆ సాయితండ్రి దయే. ఆయన దయతో లభించిన ఈ శిరిడీ దర్శనం నా జీవితంలో మరిచిపోలేని ఒక సజీవ జ్ఞాపకంగా మిగిలిపోయింది. "తండ్రీ! మీకు వేలవేల నమస్కారాలు. ఎల్లప్పుడూ ఇలాగే నాకు తోడుగా ఉండండి బాబా".


ఓం శ్రీసాయినాథాయ నమః.


సాయిభక్తుల అనుభవమాలిక 1374వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • శ్రీసాయి అనుగ్రహ లీలలు - పదహారవ భాగం

సాయిబాబుగారు తమకు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలు గతవారం పంచుకున్నారు. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నారు.


దైవ దర్శనాలు - తీర్థయాత్రలు :


ఒకసారి నా భార్య బాబాయ్ స్వామి ఉత్తర భారత దేశ యాత్రకు వెళ్లడానికి నాకు, నా భార్యకు టిక్కెట్లు రిజర్వేషన్ చేయించారు. కాని బాబా నాకు అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే, బాబాకు భవిష్యత్తు తెలుసు, మా ఇంట్లో నేను తప్పనిసరిగా ఉండవలసిన పరిస్థితి ఉంది గనుక. అదేమిటంటే, నా భార్య వెళ్ళిన రోజు నుండి రెండు రోజులు ఆగకుండా పెద్ద వర్షం కురిసింది. నీళ్ల కోసం మోటరు ఆన్ చేస్తే, ఒక నిమిషం పనిచేసి ఆగిపోయింది. పాతికేళ్లలో అలా ఎప్పుడూ జరగలేదు. ఫ్యూజు పోయిందేమోనని చూస్తే, బాగానే ఉంది. కానీ మోటార్ చాలా వేడెక్కిపోయింది. ఎలక్ట్రీషియన్‍ని పిలిచి చూపిస్తే, లోపల వైర్లు కాలిపోయాయి అని తెలిసి వెంటనే బాగు చేయించాను. నేను యాత్రకి వెళ్లి ఉంటే అద్దెకున్న వారు మోటార్ వేసినప్పుడు వైర్లు కాలి ఏదైనా ప్రమాదం జరిగేదేమో! వాళ్ళు ఇబ్బంది పడేవారేమో! అందుకే బాబా నన్ను యాత్రకి వెళ్ళకుండా ఆపి, ప్రమాదం జరగకుండా కాపాడారు. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఒకసారి ఇలాగే మా ప్రక్క ఇంట్లో వైర్లు కాలి ప్రమాదం జరిగింది. కానీ మనకు బాబా ఉన్నారు కదా!


ఒకసారి నాకు, నా భార్యకు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం వచ్చింది. కానీ ఇద్దరమూ యాత్రకు వెళ్తే ఇంట్లో బాబా పూజ ఎలాగని నేను వెళ్ళకుండా ఆగిపోయాను. అందువలన నా భార్య మాత్రమే ఆ తీర్థయాత్రకు వెళ్ళింది. అప్పుడొక గురువారం నాటి ఉదయం నేను యధావిధిగా ఆవుపాలతో బాబాకి అభిషేకం చేసి పూజ చేశాను. అదే రోజు నా భార్య తన యాత్రలో భాగంగా శిరిడీలో బాబా దర్శనం చేసుకుంది. ఆమె అక్కడ ధూప్ హారతికి హాజరవ్వగా, నేను ఇక్కడ ఇంట్లో భక్తి టీవీలో ప్రసారమయ్యే ధూప్ హారతి చూసాను. మామూలుగా భక్తి టీవీలో పాత సిడిలు ప్లే చేసి బాబా హారతులు ప్రసారం చేస్తుంటారు. కానీ ఆ రోజు శిరిడీ నుండి ధూప్ హారతి ప్రత్యక్ష ప్రసారమైంది. అలా నాకు, నా భార్యకు ఒకే సమయంలో ధూప్ హారతి వీక్షించే భాగ్యాన్ని బాబా ప్రసాదించారు. ఇంకోసారి నా భార్య తన యాత్రలో భాగంగా గుజరాత్‍లోని ద్వారకలో ఉన్న శ్రీకృష్ణ మందిరానికి వెళ్ళింది. సరిగ్గా అదే సమయానికి ఇంట్లో ఉన్న నాకు టీవీలో అదే మందిరంలోని పూజా విధానమంతా కళ్ళకు కట్టినట్లు చూపించారు బాబా. మరోసారి యాత్రలో భాగంగా చార్‍ధామ్, కాశీ, శిరిడీ, అయోధ్య మొదలైన ప్రదేశాలను నా భార్య దర్శించిన అదే సమయంలో బాబా నాపై కృపతో నా కళ్ళకు కట్టినట్టు టీవీలో ఆయా క్షేత్ర దర్శనాలు చేయిస్తుండేవారు. నిజమైన సాయి భక్తులకు సాయే 33 కోట్ల దేవతలు, దేవుళ్ళు, సకల పుణ్యక్షేత్రాలు. అందుకే 'శిరిడీయే మా పండరిపురము' అన్నారు అప్పటి పెద్దలు. అది ముమ్మాటికీ సత్యం. "వందనం సాయిదేవా!". 


2013లో నేను, నా భార్య, మనవడు ముగ్గురం కలిసి మధురై, కన్యాకుమారి, రామేశ్వరం యాత్రకు వెళ్ళాము. కన్యాకుమారిలో మధ్యాహ్నం కొన్ని దేవాలయాలు చూసిన తర్వాత, “బాబా! ఈరోజు గురువారం కదా, నీ దర్శనం ఇప్పించావా?" అని మనసులో అనుకున్నాము. తరువాత అన్నీ చూసుకుని బస్సు ఎక్కబోతుండగా మాకు బాబా హారతి వినిపించింది. అంతే, మేము డ్రైవర్ పిలుస్తున్నా వినిపించుకోకుండా, "ఇప్పుడే వస్తామ"ని చెప్పి హారతి వినిపిస్తున్న వైపు వెళ్ళాము. అక్కడ ఒక బాబా మందిరం ఉంది. లోపలికి వెళ్ళి హారతి అయ్యేదాకా ఉండి, ప్రసాదం తీసుకుని వచ్చాము. మనసులో అనుకోగానే బాబా తమ దర్శనం ఎలా ఇప్పించారో చూశారా!


2015లో మేము విజయవాడ శ్రీకనకదుర్గమ్మ దర్శనానికని పాత మెట్ల దారి గుండా కొండెక్కాము. తీరా పైకి వెళ్ళాక అక్కడి సెక్యూరిటీ గార్డు, “మీరు ఇలా దర్శనానికి వెళ్లడానికి వీలులేదు. క్యూలైన్‍లో రావాలి” అని అన్నాడు. అతని ప్రక్కనున్న పూజారి కూడా అలాగే అన్నారు. ఎంత బతిమిలాడినా ఒప్పుకోలేదు. క్యూలైనులోకి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి చాలా దూరం నడవాలి. కానీ మేము అలవాటులేని కారణంగా మెట్లు ఎక్కి బాగా ఆయాసపడుతున్నాము. పైగా కాళ్లు బాగా లాగుతున్నాయి. మాకు ఏం చేయాలో తోచక, "సహాయం చేయమ"ని బాబాని తలుచుకుని ఒక్క నిమిషం అక్కడే నిలబడ్డాము. అంతలో ప్రక్క గదిలో నుండి ఆ ఆలయ అధికారి ఒకరు బయటికి వచ్చి, మమ్మల్ని చూసి, విషయం తెలుసుకుని, ఒక వ్యక్తిని పిలిచి, “వీళ్ళని తీసుకెళ్లి, నేను చెప్పానని చెప్పి, నేరుగా అమ్మవారి దర్శనం చేయించు" అని అతనితో మమ్మల్ని పంపి అమ్మవారి దర్శనం చేయించారు. తరువాత వెంట వెంటనే మేము మరో రెండుసార్లు అమ్మవారిని దర్శించుకున్నాము. 2016లో ఇంకోసారి మేము అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. అప్పుడు మేము ఉచిత దర్శనం లైనులో వెళ్తుంటే, ఓ చోట ఒక వ్యక్తి ప్రక్కనున్న చిన్న గేటు తీసి మమ్మల్ని వంద రూపాయల లైనులో నుండి పంపించాడు. మేము అమ్మవారిని దగ్గరగా, తృప్తిగా దర్శించుకున్నాము. పై రెండు సందర్భాలలో ఆయా వ్యక్తుల రూపంలో చాలా సులభంగా అమ్మవారి దర్శనం మాకు చేయించింది బాబానే.


ఒకసారి మేము మైసూరు శ్రీచాముండేశ్వరి గుడికి వెళ్ళాము. మేము వెళ్లిన బస్సువాళ్ళు అమ్మవారి దర్శనం చేసుకుని రావడానికి ఒక గంట సమయమే ఇచ్చారు. ఆ గుడి కొండ మీద ఉంటుంది. పైగా దర్శనానికి చాలా జనం ఉన్నందువల్ల చాలా సమయం పట్టేటట్లు ఉంది. అందువల్ల 'అమ్మవారి దర్శనం చేసుకోకుండా తిరిగి ఎలా వెళ్ళడం?' అని బాబాని ప్రార్ధించి, గుడి ప్రాంగణంలో ఒక ప్రక్కన నిల్చున్నాము. అంతలో ఎవరో ఒక వి.ఐ.పి. దర్శనానికి వచ్చారు. వారిని గర్భ గుడి వరకు తీసుకుని వెళ్తుంటే, వారితో పాటు మమ్మల్ని కూడా అక్కడున్న సెక్యూరిటీ గార్డు లోపలికి పంపించాడు. బాబా దయవల్ల ఆ వి.ఐ.పితో పాటు మేము అమ్మవారిని దగ్గరగా దర్శించుకుని, పూజ చేయించుకుని అరగంటలోనే బస్సు దగ్గరకు తిరిగి వచ్చాము.


2016, మే నెల చివరిలో నా భార్య బాబా అనుమతి తీసుకుని కొంతమందితో కలిసి నెలరోజులు ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్ళింది. ఆ యాత్రలో భాగంగా వాళ్ళు 29వ తేదీన హరిద్వార్ చేరుకున్నారు. వాళ్లలో కొంతమంది వాళ్లలోవాళ్లే మాట్లాడుకుని కేదార్‌నాథ్, బద్రినాథ్ కూడా దర్శిద్దామని నిర్ణయించుకుని, స్వెటర్లు సిద్ధం చేసుకుని బయలుదేరుతున్నారు. భక్తిప్రపత్తులు గల నా భార్య కూడా వాళ్లతో కలిసి కేదార్‌నాథ్ వెళ్ళాలనుకుంది. అయితే ఆ విషయంలో తనకు బాబా అభిప్రాయం కూడా తెలుసుకోవాలనిపించి, నాకు ఫోన్ చేసి ‘బాబాను అడగమని చెపుదామనుకుని’ నాకు ఫోన్ చేసింది. కానీ నా ఫోన్ కలవలేదు. తను దాదాపు 10-15 సార్లు ప్రయత్నించాక ఫోన్ ఎంతకీ కలవట్లేదని ప్రక్కనున్న ఇద్దరు, ముగ్గురిని ఫోన్లు అడిగి, ఆ ఫోన్లతో నాతో మాట్లాడడానికి ప్రయత్నించింది. కానీ ప్రయోజనం లేకపోయింది. కారణం ఆ సమయంలో నాకెందుకో ఫోన్ స్విచ్ఛాఫ్ చేయాలనిపించి, స్విచ్చాఫ్ చేశాను. నిజానికి మేము రోజూ 2, 3 సార్లు ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం. సరే, అందరూ బయలుదేరి వెళ్ళిపోయాక నా ఫోన్ కలిసింది. నా భార్య నాతో విషయం చెప్పాక నేను తనతో, "ఇది బాబా లీల. వద్దంటే నువ్వు బాధపడతావని, ఒకవేళ వెళ్ళమంటే నువ్వు అక్కడ కష్టపడతావని, నిన్ను కష్టపెట్టకూడదని, నిన్ను పంపడం ఇష్టంలేని బాబా అసలు ప్రశ్న అడగకుండా చేశారు"  అని అన్నాను. ఆ తర్వాత ఒక గంటకి చార్‌ధామ్‍లో వరదలు అని, తెలుగువారు కష్టాలు పడుతున్నారని టివిలో వార్తలు వచ్చాయి. అదే విషయం నేను నా భార్యకు ఫోన్ చేసి చెప్పాను. అప్పుడు ఆమె, "బాబాకు భవిష్యత్తు తెలుసు కనుక నన్ను వెళ్ళకుండా ఆపారు. వెళ్ళినవాళ్ళు సగం దూరం నుండే తిరిగి వస్తున్నారు" అని చెప్పింది. అలా సమయం, డబ్బు వృధా కాకుండా, ఆపదలో చిక్కుకోకుండా బాబా నా భార్యను రక్షించారు. అంతేకాదు మరుసటి సంవత్సరం బాబా నా భార్య చేత గంగోత్రి, యమునోత్రి, శ్రీకేదార్నాథ్, శ్రీబద్రీనాథ్ యాత్రలు ఏ ఇబ్బందీ లేకుండా చేయించారు.


2016లో నా భార్య మొట్టమొదటిసారి కాశీ వెళ్ళి ఉదయాన్నే శ్రీవిశ్వేశరుని దర్శించుకుంది. దర్శనానంతరం బయటికి వస్తుండగా ఎవరి ద్వారానో 'ఉదయం 4 నుండి 4-30 వరకు మన స్వహస్తాలతో శివలింగాన్ని తాకి నమస్కరించుకోవచ్చు' అనే విషయం తెలిసింది. దాంతో నా భార్య, "అయ్యో! ఒక గంట ముందే వచ్చి ఉంటే బాగుండేది. స్పర్శ దర్శనం చేసుకునేదాన్ని" అని ఆ రోజంతా బాధపడింది. ఇలా ఉండగా మరుసటిరోజు తెల్లవారుఝామున 3 గంటలకు అయోధ్య, ప్రయోగ వెళ్ళాలని కొందరు బస్సు మాట్లాడుకున్నారు. నా భార్య కూడా వాళ్లతో వెళ్లాలని అనుకుని, మరుసటిరోజు అందరికన్నా ముందే తయారై, క్రిందకు వచ్చి ఆ కాంపౌండులోనే ఉన్న చిన్న శివుని గుడిలో కూర్చుని వాళ్ళకోసం ఎదురు చూసింది. కానీ ఎవరూ గదుల్లో నుండి బయటికి రాలేదు. అంతలో బాబా దయవల్ల నా భార్యకి, “ఇప్పుడే కాశీ విశ్వనాథుని స్పర్శ దర్శనానికి వెళ్ళి, క్యూలైన్‍లో నిలబడితే, శివలింగాన్ని తాకి నమస్కరించుకోవచ్చు కదా!' అని ఒక ఆలోచన వచ్చింది. వెంటనే తను గేటు వద్దకు వెళ్ళి, "గేటు తీయమ"ని, వాచ్మెన్‍ని అడిగింది. అందుకతను, “ఈ సమయంలో ఒక్కరే ఎలా వెళ్తారు? నేను గేట్ తీయను" అని అన్నాడు. నా భార్య తన మనసులో, 'ఒక్కదాన్నే ఏమిటి, బాబా తోడు ఉన్నారుగా' అని అనుకుని, అతన్ని మళ్ళీ, “గేటు తీయమ”ని అడిగింది. కానీ అతను హిందీలో, “ఎవరినైనా తోడు తెచ్చుకోండి" అని తాళం తీయలేదు. నా భార్యకు ఏమి చేయాలో పాలుపోలేదు. వివరంగా అతనికి చెప్పాలంటే, తనకి హిందీ రాక, 'ఇప్పుడెలా?' అని అనుకుంది. రెండు నిమిషాల్లో ఒక గది తలుపులు తెరుచుకున్నాయి. ఇద్దరు ఆడవాళ్ళు బయటికి వచ్చి గేటు దగ్గరకు వచ్చారు. నా భార్య వాళ్ళని, “గుడికి వెళ్తున్నారా?” అని అడిగింది. వాళ్ళు “అవునని” చెప్పడంతో వాచ్‍మెన్ గేటు తీయడం, ముగ్గురూ కలిసి గుడికి వెళ్ళి స్పర్శ దర్శనం చేసుకోవడం జరిగాయి. అయితే వీళ్ళు గుడికి వెళ్లిన అరగంటకి అయోధ్య, ప్రయోగ వెళ్లే వాళ్ళందరూ బస్సులో వెళ్లిపోయారు. గుడి నుండి వచ్చాక నా భార్యకి ఆ విషయం తెలిసినా తను వెళ్ళలేకపోయానని బాధపడకుండా, 'అంతా నా మంచికే జరిగింది. వాళ్ళతో వెళ్లుంటే స్పర్శ దర్శన భాగ్యం నాకు దక్కేది కాదు కదా' అని ఆనందంతో బాబాకి కృతజ్ఞతలు చెప్పుకుంది. తర్వాత రోజు నా భార్య నాకు ఫోన్ చేసి, "ఆడవాళ్లు పితృకార్యం చేయవచ్చా అని బాబాని అడిగి, సమాధానం నాకు చెప్పండి" అని అడిగింది. నేను బాబాని అడిగితే, “చేయవచ్చు” అని సమాధానం వచ్చింది. నేను ఆ విషయం నా భార్యకి చెప్తే తను కొంతమందితో కలిసి గంగ నది తీరాన ఉన్న ఒక ఘాట్ వద్దకు వెళ్ళి, పితృకార్యం చేసింది.


తర్వాత నా భార్య శ్రీవిశ్వేశ్వరుని దర్శించుకుని అక్కడికి కొంచెం దూరంలో ఉన్న ఒక మఠంలో కోటి శివలింగాలు ఉన్నాయని తెలిసి అచ్చటికి వెళ్ళింది. అక్కడ తను తన చెప్పులు బయట విడిచి లోపలికి వెళ్ళి అరగంట తర్వాత బయటికి వచ్చి చూస్తే చెప్పులు కన్పించలేదు. కొత్త చెప్పులు కావడంతో తను వాటికోసం చాలాసేపు వెతికింది. కానీ అవి కన్పించలేదు. దాంతో నా భార్య, "బాబా! బాగా ఎండగా ఉంది. కాళ్ళు కాలుతున్నాయి. కొత్త చెప్పులు కొనుక్కుంటే, అవి కూడా వేరే చోట పోవచ్చు, నేను ఇంకా ఈ కాశీలో వారం రోజులు ఉండాలి" అని అనుకుని తన రూముకు వెళ్ళిపోయింది. మరుసటిరోజు తను ఏదో గుడికి వెళ్ళి, దర్శనమయ్యాక, బయటికి వచ్చి ఆటో మాట్లాడుకుని తానుండే రూముకి బయలుదేరింది. ఆటోవాడు ఆటోని తిన్నగా ముందురోజు చెప్పులు పోయిన మఠం ముందుకి తీసుకెళ్లి ఆటో అపి నా భార్యని దిగమన్నాడు. "ఇదేంటి, మా రూము ఇక్కడ కాదు. నువ్విక్కడ ఆటో అపావేంటి?" అని నా భార్య ఆ ఆటోవాడిని అడిగింది. వాడు హిందీలో ఏదో చెప్పాడు. వాడికి తెలుగు రాదు, ఈమెకు హిందీ అంతగా రాదు. ఒకరు చెప్పేది ఒకరికి అర్ధంకాక నా భార్య ఆ ఆటోవాడికి డబ్బులిచ్చి ఆటో దిగేసింది. అంతలో తనకి, “ఏదో కారణం లేనిదే బాబా ఈ మఠం ముందే ఎందుకు ఆటో ఆపిస్తారు. లోపల చెప్పులున్నాయేమో!” అనిపించి లోపలికి వెళ్ళి చూస్తే, ముందురోజు అంతసేపు వెతికినా కనబడని చెప్పులు ఒక్క సెకనులో కన్పించాయి. తరువాత తను, 'ఇన్ని యాత్రలు చేసినా ఎక్కడా పోని చెప్పులు, ఇక్కడే పోయాయంటే ఏదో కారణం ఉండే ఉంటుంది' అని ఆలోచిస్తుంటే, 'కాశీలో చెప్పులు వేసుకుని నడవకూడదు' అనే విషయం గుర్తొచ్చి, "థాంక్యూ బాబా" అని మనసులోనే బాబాకి చెప్పుకుని ఆ చెప్పులు కవరులో పెట్టుకుని తన రూముకి వెళ్ళింది. మనం ఎంత దూరం వెళ్ళినా బాబా కృపాదృష్టి మనపై ఉండి తీరుతుంది.


కాశీలో శ్రీవిశ్వేశ్వరుని దర్శనమయ్యాక మొత్తం వందమంది రిజర్వేషన్ చేయించుకుని ట్రైన్‍లో ఉదయం ఆరు గంటలకు మన్మాడ్ చేరుకున్నారు. అప్పటికే శిరిడీ వెళ్ళే రైలు వేరే ప్లాట్‍ఫారం నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. టిక్కెట్లు తీసుకుని ఆ రైలు ఎక్కుదామంటే టికెట్ కౌంటర్ వద్ద క్యూలైన్ చాలా ఉంది. ఆ రోజు గురువారం కావడంతో నా భార్య త్వరగా శిరిడీ చేరుకుని బాబా దర్శనం చేసుకోవాలన్న ఆతృతతో పక్కనున్న వారితో, "నేను ఈ రైలులో శిరిడీ వెళ్ళి త్వరగా బాబా దర్శనం చేసుకుంటాను” అని చెప్పి టికెట్ లేకుండానే గబగబా ఒక బోగి లోకి ఎక్కేసింది. తన వెనకే మరో నలుగురు ఆడవాళ్ళు కూడా ఎక్కేసారు. అంతే రైలు బయలుదేరింది. కంగారుగా ఇంకో ఆరుగురు ఆడవాళ్లు వేరే బోగీలో ఎక్కారు. మిగిలిన వాళ్ళంతా ఆ రైలు తప్పిపోయి ఎక్కువ డబ్బులిచ్చి వ్యాన్‍లో శిరిడీకి బయలుదేరారు. నా భార్య ఒక సీటులో కూర్చుని, “బాబా! మీరే నన్ను క్షేమంగా శిరిడీ చేర్చి, మీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించండి" అని వేడుకుంది. అయితే టిక్కెట్టు లేకుండా ప్రయాణించడం నేరం. కాబట్టి నా భార్య, తనతో ఉన్న నలుగురు టీసీ వస్తే జరిమానా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ టీసీ  వాళ్ళ వద్దకు రాలేదు. వాళ్లలో బాబాను త్వరగా దర్శించాలనే తపన తప్ప ఏ స్వార్ధం లేదు. అందుకే బాబా వాళ్ళను పైసా ఖర్చు లేకుండా, ఏ ఇబ్బందీ లేకుండా శిరిడీ చేర్చారు. ఇకపోతే ప్రక్క బోగీలో ఎక్కిన ఆరుగురికీ ఒక్కొక్కరికి 100 రూపాయలు చొప్పున టీసీ జరిమానా విధించాడు. వాళ్ళు ముందుకు, వెనుకకూ ఊగిసలాడారు కాబట్టి వారికి జరిమానా పడింది. బాబా విషయంలో నమ్మకం ముఖ్యం. కళ్ళు మూసుకుని నీళ్ళల్లో దూకమన్నా, దూకడానికి సిద్ధంగా ఉండాలి.


తరువాయి భాగం వచ్చేవారం... 



 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 


 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 


సాయిభక్తుల అనుభవమాలిక 1373వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అడగాలేగాని మనకు మంచిదైతే బాబా ఇవ్వనిదంటూ ఏదీ ఉండదు
2. ఎన్నో విధాలా కాపాడుతున్న సాయితల్లి

అడగాలేగాని మనకు మంచిదైతే బాబా ఇవ్వనిదంటూ ఏదీ ఉండదు


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


ఈ బ్లాగు ద్వారా బాబా మాకు ప్రసాదించిన అనుభవాలను తోటి భక్తులతో పంచుకునేందుకు మార్గం చూపిన సాయికి నమస్కారాలు. నేను సాయి భక్తురాలిని. సాయే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం. సాయితో నాకున్న అనుభవాలు లెక్కలేనన్ని. మూడు సంవత్సరాల నుంచి నాకు బ్లీడింగ్ సమస్య ఉంది. ఈమధ్య డాక్టరు దగ్గరకి వెళ్తే MRI స్కాన్ చేయించమని "రిపోర్టులో గడ్డ లాంటిది ఏమైనా ఉన్నట్టు వస్తే, బయాప్సీ చేయాలి" అని చెప్పారు. నాకు చాలా భయమేసింది. MRI చేస్తున్నంతసేపు నేను 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని జపించాను. సాయి దయవలన రిపోర్టు నార్మల్ వచ్చింది. "ధన్యవాదాలు బాబా. మాపై ఎల్లప్పుడూ మీ దయ ఇలానే ఉండాలి తండ్రి".


మా పెద్దపాప నిట్ పరీక్షల ప్రిపరేషన్ కోసం లాంగ్ టర్మ్ కోచింగ్‍కి వెళ్ళింది. కోచింగ్‍లో ఉన్నప్పుడు తను నాకు ఫోన్ చేసి, "నాకు సీటు వస్తుందో, రాదో అని భయంగా ఉంద"ని  బాధపడేది. ఆ విషయమై నేను ఎప్పుడు సాయిబాబా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సైట్ ఓపెన్ చేసినా, "విజయం సాధిస్తావు" అని బాబా మెసేజ్ వచ్చేది. నేను బాబా మీద నమ్మకం ఉంచాను. పరీక్ష జరగడానికి ముందు ఒకరోజు రాత్రి టెన్షన్‍తో పాప చాలా ఏడ్చింది. ఆ మరుసటిరోజు ఉదయం 'సద్గురు సాయి' వాట్సాప్ గ్రూపులో, "జాతకాలను నమొద్దు. నా మీద విశ్వాసముంచి కష్టపడి చదువు. నువ్వు తప్పకుండా ఉత్తీర్ణత సాధిస్తావు. సాయిబాబాను స్మరించుకో" అని మెసేజ్ వచ్చింది. దాన్ని చూస్తూనే నాకు ధైర్యం వచ్చింది. పాప పరీక్ష వ్రాసింది. రిజల్టు వచ్చాక చూస్తే, బాబా దయవల్ల అనుకున్న దానికన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి. నేను, "పాపకి ఏ కాలేజీలో బాగుంటుందంటే అదే కాలేజీలో సీటు ఇవ్వు తండ్రి" అని బాబాను ప్రార్థించాను. బాబా, "మీకు ఏ కోరిక ఉన్నా, మీకు ఏది మంచిదో అదే నేను చేస్తాను" అని మెసేజ్ ఇచ్చారు. బాబా దయవల్ల ఫస్ట్, సెకండ్ ఫేజ్‍ల్లో పాపకి ఒకే కాలేజీలో సీటు వచ్చింది. బాబా చెప్పినట్టు ఆ కాలేజీ చాలా బాగుంది. "బాబా! పాపకి ఎంబీబీస్ సీటు ప్రసాదించినందుకు ధన్యవాదాలు. మీ పాదపద్మాలకు శతకోటి వందనాలు బాబా. తనకి తోడుగా ఉండి మంచి ఆరోగ్యాన్ని, చదువుని ప్రసాదించి గొప్ప డాక్టరుని చేసి ఉజ్వల భవిష్యత్తుని అనుగ్రహించండి". 


ఒకసారి మా బావగారి కొడుకుకి డెంగ్యూ ఫీవర్ వచ్చి ఏమి తిన్నా వాంతులు చేసుకునేవాడు. ప్లేట్లెట్లు 20వేలకు పడిపోయాయి. వాళ్ళ అమ్మ బాధతో నాకు ఫోన్ చేసి పరిస్థితి వివరించింది. నేను తనతో, "ఏం భయం లేదు, బాబా ఉన్నారు. ఆయనపై విశ్వాసముంచి ఆయన ఊదీ బాబు నుదుటన పెట్టి, మరికొంత ఊదీ నీటిలో కలిపి తన చేత త్రాగించండి" అని చెప్పాను. ఆమె నేను చెప్పినట్లే ఊదీ నీళ్లలో కలిపి బాబు చేత త్రాగించింది. ఆరోజు నుండి వాంతులు తగ్గి కొంచెం కొంచెం తినడం ప్రారంభించాడు. రెండు రోజుల్లో జ్వరం కూడా తగ్గి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. ప్లేట్లెట్లు 20వేల నుండి రెండు లక్షలకు పెరిగాయి. ఇప్పుడు బాబు ఆరోగ్యంగా ఉన్నాడు. బాబా దయవలన ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కూడా వచ్చింది.


బాబాని అడగాలేగాని మనకు మంచిదైతే ఆయన ఇవ్వనిదంటూ ఏదీ ఉండదు. 'సాయీ' అని ఒక్కసారి స్మరిస్తే నేనున్నానంటూ 'ఓయీ' అని పలుకుతారు నా బాబా. ఆయన నేను మొదలుపెట్టిన ఏడు శనివారాల పూజకు ఎటువంటి ఆటంకం లేకుండా చూసి, పూజ పూర్తయిన రోజు రాత్రి బయలుదేరి తిరుమల వెళ్లేలా అనుగ్రహించి, శ్రీ శ్రీనివాసుని కళ్యాణం చేయించి, ఆ దేవదేవుని దర్శన భాగ్యం అయ్యేటట్లు చేశారు. ఈమధ్య మా మోటార్ పని చేయక నీరు రాలేదు. ప్లంబర్ చూసి "లోపల పైపులు పగిలాయి. వాటిని తీసి కొత్త పైపులు వేయాల"ని చెప్పాడు. అప్పుడు నేను, "పైపులు మార్చే అవసరం లేకుండా చూడు బాబా" అని బాబాను ప్రార్థించాను. వాళ్ళు ఏం చేశారో తెలియదు కానీ, బాబా దయవల్ల పైపులు మార్చే అవసరం లేకుండా నీళ్లు వచ్చాయి. "థాంక్యూ బాబా. మా ఇంటి స్లాబ్ లీకేజ్ లేకుండా చూడండి బాబా. శిరిడీ వచ్చి మీ మొక్కు తీర్చుకుంటాం. నా అనుభవాలు పంచుకోవడంలో ఆలస్యమైనందుకు క్షమించు సాయి".


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!


ఎన్నో విధాలా కాపాడుతున్న సాయితల్లి


సాయి భక్తులకు నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్న అన్నయ్యకి బాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తురాలిని. ఎటువంటి ఆపద వచ్చినా బాబా అనుకోగానే ఆయన తమ ఆశీస్సులు మనతో ఉన్నాయని సదా తెలియజేస్తుంటారు. అందుకే నేను నిరంతరమూ సాయి నామస్మరణ చేసుకుంటూ, సాయి నాతోనే ఉన్నారని భావిస్తాను. సాయితల్లి నన్ను ఎన్నో విధాలా కాపాడుతున్నారు. అటువంటి కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఒకరోజు మా చిన్నబాబు ఆడుకుంటూ హఠాత్తుగా మెట్ల మీద పడిపోయాడు. ఆ ఘటనలో మెట్టుకి బాబు తల గుద్దుకుని చీల్చుకుపోయి బాగా రక్తస్రావం జరగడంతో నాకు చాలా భయమేసింది. వెంటనే హాస్పిటల్‍కి తీసుకెళ్తే కుట్లు వేశారు. బాబు నొప్పి తట్టుకోలేక బాగా ఏడుస్తుంటే నాకు భయమేసి బాబా నామస్మరణ చేసాను. నర్స్, "నొప్పి తగ్గడానికి రెండు రోజులు పడుతుంద"ని చెప్పి సిరప్ ఇచ్చింది. నేను ఆ రాత్రి బాబు నిద్రపోడని భయపడ్డప్పటికీ బాబా దయవల్ల బాబు నొప్పని అస్సలు అనలేదు. బాబా మనతో ఉన్నప్పుడు బాధ ఎందుకు ఉంటుంది. రెండు రోజుల తర్వాత కుట్లు తీసేశారు. అంతా సాయితల్లి దయ.


నేను ఒక సంవత్సరం పాటు స్కిన్ అలర్జీతో బాధపడ్డాను. ఎన్నో మందులు వాడినప్పటికీ ఫలితం కనపడలేదు. అలా ఉండగా ఒకసారి బ్లాగులో, "ఊదీ రాస్తూ ఉండు. ఎంతటి వ్యాధి అయినా తగ్గుతుంది" అన్న బాబా వచనం చూసాను. ఇంక నేను బాబా చెప్పినట్లు చేయడం మొదలుపెట్టాను. ఆశ్చర్యంగా కొన్ని రోజుల్లో ఆ అలర్జీ నుండి నాకు ఉపశమనం లభించి చాలా ఆనందంగా ఉన్నాను. ఒకరోజు ఉదయం గ్యాస్ట్రిక్ సమస్య వచ్చి గుండెల్లో మంటతో నేను చాలా బాధపడ్డాను. టాబ్లెట్లు వేసుకున్నా తగ్గలేదు. ఆ రాత్రి సాయి తల్లి ఊదీ నీటిలో వేసుకుని త్రాగి, మరికొంత ఊదీ గుండెకు రాసుకుని పడుకున్నాను. బాబా దయవలన మరుసటిరోజుకి అంతా నార్మల్ అయింది. 


మా తమ్ముడికి చాలాకాలం వరకు పెళ్లి కాలేదు. ఆ విషయం గురించి నేను సాయితల్లికి చెప్పుకుని నవగురువార వ్రతం మొదలుపెట్టాను. ఆయన దయతో మూడో గురువారమే తమ్ముడికి మంచి అమ్మాయితో సంబంధం కుదిరింది. నేను చాలా ఆనందించి, "ఇలాగే నిశ్చితార్థం, పెళ్లి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిపించండి బాబా" అని బాబాను వేడుకున్నాను. బాబా నా ప్రార్థనను మన్నించి 2022, ఆగస్టు 10న తమ్ముడి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు. అలాగే ఎలాంటి ఆటంకాలు లేకుండా నాతో నవగురువారాలు పూజ పూర్తి చేయించి, తొమ్మిది మందికి అన్నదానం చేసేలా బాబా అనుగ్రహించారు. సాయి భక్తులందరూ బాబాయందు భక్తితో, ఆయన చెప్పినట్లు శ్రద్ధ, సబూరీలతో ఉంటే ఎంతటి కష్టమైనా బాబా చూసుకుంటారు. "శతకోటి వందనాలు సాయితల్లి".



సాయిభక్తుల అనుభవమాలిక 1372వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అన్ని విధాలా అండగా ఉంటున్న బాబా
2. అడిగిన రీతిన అనుగ్రహించిన బాబా
3. బాబా అవాజ్యమైన ప్రేమ

అన్ని విధాలా అండగా ఉంటున్న బాబా


సాయి బంధువులందరికీ నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. 2022లో మా అమ్మకి కిడ్నీ ఇన్ఫెక్షన్ అయింది. నేను 'ఆర్థికంగా చాలా ఇబ్బందులు వస్తాయి, మావారు సహకరిస్తారో లేదో' అని భయపడి నా బాబాని, అమ్మవారిని తలచుకున్నాను. ముందు హాస్పిటల్ సిబ్బంది ట్రీట్మెంట్‍కి క్రెడిట్(ట్రీట్మెంట్‍కి అవసరమైన ఖర్చు భరించేలా ఆఫీసువాళ్ళు ఇచ్చే కాగితం) రాదు అన్నారు. కానీ బాబా దయవల్ల అమ్మ ఆపరేషన్‍కి, డయాలసిస్‍కి ఇన్సూరెన్స్ కవర్ అయింది. మావారు కూడా మా పుట్టింటితో ఉన్న ఇబ్బందులన్నీ మర్చిపోయి నాకు నైతిక మద్దతు ఇచ్చారు. ఇంకో ముఖ్యమైన విషయం, అమ్మ ఆపరేషన్ విషయంలో ఒక ఉద్యోగి కొన్ని డాక్యుమెంట్లు ఇచ్చి, గ్యారంటీ సంతకం చేస్తేనే అమ్మకి డబ్బులు రావడం, సర్జరీ చేయడం జరుగుతాయి. అయితే ఆ అబ్బాయి ఒక బంధువు చెప్పుడు మాటలు విని హాస్పిటల్‍కి, మా ఇంటికి రావడం మానేశాడు. 2022, సెప్టెంబర్ 15న నేను హాస్పిటల్ నుండి వస్తూ అతనికి ఫోన్ చేస్తే, అతను ఎత్తలేదు. అతను తప్ప మాకు సహాయం చేయడానికి ఎవరూ లేనందున నేను టెన్షన్ పడి, "బాబా! అతను మళ్లీ మామూలుగా ఉండి ఆ డాక్యుమెంట్స్ పని పూర్తి చేసేలా చూడండి" అని వేడుకున్నాను. నేను అలా వేడుకున్న పది నిమిషాల్లో అతను డాక్యుమెంట్స్ తెచ్చి హాస్పిటల్లో ఇచ్చాడు. బాబా ఆశీస్సుల వల్ల లక్షల్లో ఖర్చు అవ్వాల్సిన సమస్య నుండి వేలల్లో బయటపడ్డాము. "ధన్యవాదాలు బాబా".


తరువాత అక్టోబర్ నెల మొదటి వారంలో అమ్మని చూడటానికి మా పిన్ని వచ్చింది. ఆవిడ, మావారు మామూలుగా మంచివాళ్ళే కానీ, ఇద్దరికీ కోపం ఎక్కువ. అందువల్ల వాళ్లిద్దరూ గొడవ పడితే అమ్మ ఇబ్బందిపడుతుందని నేను భయపడ్డాను. అయితే సరిగ్గా మా పిన్ని వచ్చిన సమయంలో నేను ఫోన్‍లో చూస్తే, బాబా ఫోటోతో "అంతా సవ్యంగా జరుగుతుంది, భయపడకు" అని మెసేజ్ వచ్చింది. అది చూసి నేను, "బాబా! మీదే భారం" అనుకున్నాను. బాబా దయవల్ల మా పిన్ని, మావారు చాలా మామూలుగా ఉన్నారు. "ధన్యవాదాలు బాబా".


అమ్మకి బాగోలేనందున నేను ఆగస్టు నుండి ఏలూరులో ఉండగా మావారు మా పిల్లల్ని చూసుకుంటూ హైదరాబాద్‍లో ఉండేవారు. అక్టోబర్ నెల మొదటి వారంలో మా ఏడేళ్ల చిన్నపాప చేతికి ఫ్రాక్చర్ అయ్యి కట్టు వేశారు. అయినా తను ఎడవకుండా తన పని తను చేసుకుంటూ, "నువ్వు బెంగపడకు అమ్మా" అని ఫోన్‍లో చెప్తుండేది. అమ్మ మంచం మీదే ఉంది, అక్కడ పాపకి అలా అయింది, మరోపక్క మావారి ఆరోగ్యం బాగా లేకుండా పోయింది. ఆయనకి హెర్నియా ఆపరేషన్ చేయాలన్నారు. ఇటువంటి స్థితిలో సాయి లీలామృతం చదువుదామన్న నా మనసు లగ్నం అయ్యేది కాదు. కానీ రోజూ మన బ్లాగు చదువుతూ బాబాను స్మరిస్తూ, "బాబా! తమ్ముడు మొండితనం వదిలి అమ్మని ఇబ్బందిపెట్టకుండా ఉండేలా, మా పాప ఆరోగ్యం, మావారి ఆరోగ్యం బాగుండేలా దీవించండి. ఆయనకి ఆపరేషన్ తప్పనిసరైతే మీరే ఆయన్ని కాపాడాలి తండ్రి" అని బాబాతో చెప్పుకున్నాను. ఆయన దయతో మావారికి హెర్నియా ఆపరేషన్ మంచిగా జరిగి బాగానే ఉన్నారు. కానీ ఇంకా ఆయనకి కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి. నేను బాబానే నమ్ముకుని ఉన్నాను.


అడిగిన రీతిన అనుగ్రహించిన బాబా


శ్రీసాయి పాదపద్మములకు శతకోటి వందనాలు. నేనొక చిన్న సాయి భక్తురాలిని. నాపేరు అర్చన. 2022, సెప్టెంబర్ 5వ తేదీన నేను మా గురువుగారితో మాట్లాడుతూ అనుకోకుండా ఒక అబద్ధం చెప్పాను. నిజానికి నాకు తెలియకుండానే ఆ అబద్ధం నా నోటివెంట వచ్చేసింది. కానీ ఆ విషయం కనిపెట్టిన మా గురువుగారు, "నాతో అబద్ధం చెప్తావా?" అని చాలా గట్టిగా తిట్టారు. నేను చాలా బాధపడి, "బాబా! మా గురువుగారి కోపానికి కారణమయ్యాను. నేను ఇకమీదట ఎట్టి పరిష్టితుల్లో అబద్ధం చెప్పను. నా తప్పును క్షమించి గురువుగారు నాతో మామూలుగా మాట్లాడేటట్లు చేయండి బాబా" అని బాబాకు మాటిచ్చాను. బాబా దయవల్ల గురువుగారి కోపం తగ్గి సెప్టెంబర్ 10వ తేదీ నుండి మామూలుగా మాట్లాడసాగారు. "థాంక్యూ సో మచ్ బాబా".


2022, సెప్టెంబర్ మూడో వారంలో నాకు తెలియకుండానే ఒక పెద్ద తప్పు జరిగింది. దాని కారణంగా మా అక్క నాతో మాట్లాడటం మానేసింది. నేను తప్పు చేయకపోయినా అందరూ నాదే తప్పు అన్నారు. నేను ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను. తర్వాత బాబా దగ్గర ఎంత ఏడ్చానో ఆయనకే తెలుసు! అప్పటినుండి, "నేను చేసిన తప్పును క్షమించి, అక్క నాతో మాట్లాడేలా చూడండి బాబా" అని బాబాను ఎంతో ఆర్తిగా ప్రార్థిస్తుండేదాన్ని. ఆయన నా బాధను విన్నారు. అక్టోబర్ 7వ తేదీన మా అక్క నాతో మాట్లాడింది. నా అందానికి అవధులు లేవు. వెంటనే బాబాకు శతకోటి ధన్యవాదాలు చెప్పుకున్నాను.


2022, అక్టోబర్ 2, శనివారం నాడు మా గురువుగారు, "మీ ఊరు వస్తాము, వచ్చి కలవండి" అన్నారు. సరిగా అది నా నెలసరి సమయం అయినందున "ఏంటి బాబా ఇలా చేశారు? మీరు, గురువుగారు ఒక్కటేనని ప్రార్థిస్తాను. అటువంటిది మా ప్రాంతానికి గురువుగారు వచ్చినప్పుడు కలవడం కుదరకపోతే ఎలా?" అని చాలా బాధపడ్డాను. అంతేకాదు, "బాబా! గురువుగారు ఆలస్యంగా వచ్చేటట్లైతే, నెలసరి ముందుగా రావాలి. లేదా ఆయన ముందుగా వస్తే, నెలసరి ఆలస్యంగా రావాలి" అని బాబాను వేడుకున్నాను. గురువుగారు అక్టోబర్ 2న రాలేదు. అక్టోబర్ 11న నాకు నెలసరి వచ్చింది. ఇదేమిటి ఇలా జరిగింది అని నేను బాధపడే లోపే గురువుగారు 'నెల ఆఖరున వస్తార'ని కబురు తెలిసింది. అంతా బాబా దయ. "ధన్యవాదాలు బాబా. మీ కృపాకటాక్షాలు మా అందరి మీద ఉండాలి సాయి".


బాబా అవాజ్యమైన ప్రేమ


ముందుగా శ్రీసాయి బంధువులకు నమస్కారాలు. నా పేరు భారతి. 2022 చివరిలో ఎంతో  క్లిష్టమైన సమస్య విషయంలో సాయితండ్రి మమ్మల్ని అనుగ్రహించారు. ఆ అనుభవాన్ని నేనిప్పుడు పంచుకుంటాను. అప్పటికి మా అమ్మాయికి వివాహమై నాలుగు సంవత్సరాలైంది. రెండు సంవత్సరాల నుండి సంతానం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న మాకు నిరాశే ఎదురవుతుండేది. ఈ విషయం గురించి బాబాని, శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామిని వేడుకోని రోజు ఉండేది కాదు. చివరికి, "సాయితండ్రీ! మా ప్రార్ధనలు, ప్రయత్నాలు ఫలించి త్వరలో మేము శుభవార్త వినేలా అనుగ్రహించండి" అని అనుకున్నాను. అలా అనుకున్నంతనే బాబా పలికారు, శుభవార్త వినిపించారు. ఏమిచ్చినా సకల దేవతా స్వరూపమైన సాయి ఋణం తీర్చుకోలేనిది. ఆయన బిడ్డల్ని ఆయనే చూసుకుంటారు. కొన్నిసార్లు మనం అనుకున్నది నెరవేరడానికి ఆలస్యమవుతుంది. మనం శ్రద్ధ, సబూరీలతో ఉండాలి. అదే బాబా చూపిన మార్గం. కాబట్టి కష్టమైనా అలా ఉండడానికి ప్రయత్నిస్తూ మనం ఆయనకి సర్వస్య శరణాగతి చెంది, 'ఇక భరించలేను తండ్రీ' అంటే బాబా పలుకుతారు. ఇది సత్యం. ఎన్నో విషయాలలో ఇది నా అనుభవం. "ధన్యవాదాలు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1371వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అంతటా తోడుగా ఉన్న బాబా
2. “నేను నీ వెనుకనే ఉన్నాను, నువ్వే నన్ను చూసుకోవట్లేదు” అని తెలియజేస్తున్న బాబా
3. సమస్యలను తొలగించిన బాబా

అంతటా తోడుగా ఉన్న బాబా


సాయిభక్తులందరికీ నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయి అన్నయ్యకి చాలా చాలా కృతజ్ఞతలు. నేను ఒక సాయిభక్తురాలిని. ఏ దారీ లేనివాళ్ళకి బాబానే దిక్కు. ఆ విషయాన్ని ఎన్నోసార్లు బాబా నా జీవితంలో నిరూపించారు. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా. మీరు చేసిన ఏ ఒక్క ఉపకారాన్నీ నేను ఎప్పటికీ మర్చిపోలేను తండ్రీ". ఇక నా అనుభవానికి వస్తే.. కొన్ని నెలల క్రితం నేను కాలినడకన తిరుమల కొండెక్కి శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుంటానని మ్రొక్కుకున్నాను. ఆలస్యం చేయొద్దని ఒకరోజు టికెట్లు బుక్ చేద్దామని టిటిడి వెబ్‌సైట్ ఓపెన్ చేశాను. ఒక నెల తర్వాత దర్శనం టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంకేమీ ఆలోచించుకోకుండా వెంటనే టిక్కెట్లు బుక్ చేశాను. ఎందుకంటే, దర్శనం టికెట్లు లేకుండా తిరుపతి వెళ్తే, దర్శనానికి చాలా సమయం పడుతుంది. తరువాత తిరుపతి వెళ్లేరోజు రానే వచ్చింది. నేను చాలా సంవత్సరాల క్రితం కాలినడకన కొండెక్కాను కానీ, ఈమధ్య ఎప్పుడూ ఎక్కలేదు. అందువల్ల నడవగలనా, లేదా అని చాలా భయమేసి, "బాబా! ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుమల కొండెక్కి శ్రీస్వామి దర్శనం చేసుకునేలా చూడండి" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఏ ఆటంకం లేకుండా కొండపైకి నడిచి వెళ్లగలిగాను. తొందరగా దర్శనమైతే అదేరోజు హైదరాబాదుకి తిరుగు ప్రయాణమవ్వాలని మేము ప్లాన్ చేసుకున్నాము. కానీ అది వారాంతమైనందున దర్శనానికి ఎంత సమయం పడుతుందో, అసలు టిక్కెట్లు ఉంటాయో, లేదో అని చాలా భయమేసింది. సరే, ఆరోజు రాత్రి ఎనిమిది గంటలకి దర్శనం టికెట్లు బుక్ చేసివున్నప్పటికీ సాయంత్రం 5:30కే మేము దర్శనం క్యూలోకి వెళ్ళాం. బాబా దయవల్ల అభ్యంతరం చెప్పకుండా మమ్మల్ని దర్శనానికి అనుమతించారు. క్యూలైన్లో చిన్న సమస్య ఎదురైనప్పటికీ అది పెద్దది కాకుండా చక్కటి దర్శనాన్ని బాబా అనుగ్రహించారు. దర్శనానంతరం బస్సు టిక్కెట్లు బుక్ చేయడానికి ఫోన్ తీసి, "ఏ ఆటంకం లేకుండా టిక్కెట్లు దొరకాలి బాబా" అని అనుకున్నాను. ఆయన దయవల్ల టికెట్లు దొరికాయి. అయితే అప్పటికి రాత్రి 8.30 అయింది. మేము ఇంకా కొండపైనే ఉన్నాము. అదీకాక, కిందికి వెళ్ళాక రూముకి వెళ్లి బ్యాగులు సర్దుకుని, ఫ్రెషప్ అయి బస్సు అందుకోవాల్సి ఉంది. అందరూ కొండపైనుంచి కిందకు బస్సులో లేదా ప్రైవేట్ వాహనంలో వెళ్ళడానికి చాలా సమయం పడుతుందని అన్నారు. దాంతో బస్సు అందుకోగలమో, లేదో అనిపించి, "బాబా! ఎలాగైనా బస్సు అందుకునేలా చూడు తండ్రీ" అని బాబాను వేడుకున్నాను. తరువాత ఒక ప్రైవేట్ వెహికిల్ మాట్లాడుకున్నాము. అతను చాలా తొందరగా మమ్మల్ని కిందకు చేర్చాడు. మేము ఫ్రెష్ అయి సరైన సమయానికి బస్సు అందుకుని సురక్షితంగా హైదరాబాద్‍కి తిరిగి వచ్చాం. ఇదంతా బాబా దయవల్లే జరిగింది. "అంతటా మాకు తోడుగా ఉన్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు బాబా. నేను ఈ అనుభవాన్ని ఆలస్యంగా పంచుకున్నందుకు నన్ను క్షమించు బాబా. నిజానికి ఇటీవల బ్లాగులో ఒక భక్తురాలు పంచుకున్న తిరుపతి ప్రయాణం గురించి చదివాకే నేను నా అనుభవం పంచుకోలేదని నాకు గుర్తుకొచ్చింది. అలా మీరే గుర్తుచేశారు. ఇంకా ఏదైనా అనుభవం పంచుకోవడం మర్చిపోయివుంటే దయచేసి గుర్తుచేయండి బాబా. ఎందుకంటే, నేను ఎన్నో సమస్యల్లో పడి చాలా విషయాలు మర్చిపోతున్నాను. కానీ మిమ్మల్ని మరిచిపోలేదు బాబా".   


సైకిల్ మీద వెళ్తుంటే నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందని, బాబా దయతో తనకి ఆపరేషన్ జరిగిందని నేను ఇదివరకు ఈ బ్లాగులో పంచుకున్నాను. అప్పుడు నేను, "బాబా! ఆ బాబుకి త్వరగా తగ్గిపోవాల"ని బాబాని వేడుకున్నాను. ఈమధ్య ఆ బాబు కాలికి ఉన్న కట్లు విప్పేసి స్కాన్ చేసి, "చాలా త్వరగా నయమైంది" అని డాక్టర్లు చెప్పి, ప్రస్తుతం ఫిజియోథెరపీ చేస్తున్నారు. బాబా దయవల్ల ఇదంతా బాగానే ఉంది కానీ, ఆపరేషన్ సమయంలో బోన్ సెట్ చేసేటప్పుడు బోన్ యొక్క కొద్ది భాగం పక్కకి వచ్చింది. అది రోజులు గడిచే కొద్దీ సెట్ అవుతుందని డాక్టర్ చెప్పారు. అప్పుడు నేను, "బోన్ తొందరగా సెట్ అయి బాబు నడవగలిగేలా చేయండి బాబా" అని బాబాని కోరుకున్నాను. ఆరునెలలకి తన కాలు నయమైందిగానీ బాబు సరిగా నడవలేకపోతున్నాడు. డాక్టర్లు స్కాన్ చేసి, "అదనంగా ఉన్న బోన్ సరిగా అటాచ్ అవలేదు. ఒక నెలలోపు బోన్‍లో గ్రోత్ వస్తే సరే, లేకపోతే మళ్లీ సర్జరీ చేసి ఏదో ఒక బోన్ తాలూకు యాక్టివ్ సెల్స్ ఉన్న చిన్న భాగం తీసి అక్కడ పెట్టాలి. అప్పుడు గ్రోత్ వస్తుంది" అని చెప్పారు. "సర్జరీ వల్ల ఆరునెలలుగా బాధపడుతున్న చిన్నపిల్లాడికి మళ్ళీ సర్జరీ అంటే నాకు చాలా బాధగా ఉంది బాబా. ఎలాగైనా దయతో ఆ బాబు బోన్‍లో గ్రోత్ వచ్చేలా చూసి ఆపరేషన్ అవసరం లేకుండా చేయండి ప్లీజ్. ఇప్పటివరకు నువ్వే దగ్గరుండి ఏ సమస్య లేకుండా తగ్గేలా చేసావు. ఇకమీదట కూడా తనని ఇలాగే చూసుకుంటూ తనకి తొందరగా తగ్గి, నడిచేలా చేయండి బాబా. చిన్నపిల్లాడు, చాలా భవిష్యత్తు ఉంది కదా బాబా". బాబాను ప్రార్థించే సమయంలో ఆ బాబుని తలచుకోమని సాటి సాయిభక్తులందరికీ విన్నవించుకుంటున్నాను.


“నేను నీ వెనుకనే ఉన్నాను, నువ్వే నన్ను చూసుకోవట్లేదు” అని తెలియజేస్తున్న బాబా


సాయిభక్తులందరికీ నమస్కారం. నేను సాయిభక్తురాలిని. బాబా తరచూ నాకు స్వప్నంలో దర్శనమిచ్చి, “నేను నీ వెనుకనే ఉన్నాను, నువ్వు నన్ను చూసుకోవట్లేదు” అని చెబుతూ ఉంటారు. ఇటువంటి స్వప్నదర్శనం ప్రథమంగా బాబా నాకు 2012వ సంవత్సరంలో ప్రసాదించారు. ఆ ప్రథమ స్వప్నదర్శనం గురించి నేనిప్పుడు మీతో పంచుకుంటాను. మా పాప పుట్టిన సంవత్సరం తరువాత నాకు ఈ స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో నేను, మావారు, మా బాబు, మా పాప నలుగురం కలిసి బండి మీద ఒక బాబా గుడికి వెళ్ళాము. ఆ గుడి ప్రాంగణమంతా ఒక కొండ ప్రాంతం. ఆ గుడి ప్రాంగణాన్ని నేను అంతకుముందెప్పుడూ చూడలేదు, కేవలం స్వప్నంలోనే చూశాను. అసలు ఆ గుడి నిజంగా ఉందో, లేదో అనే విషయం కూడా నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బండి దిగి మా పాపని ఎత్తుకుని నిలబడ్డాను. మావారు, మా బాబు బండిని పార్కింగ్ ప్లేస్‌లో పెట్టడానికి వెళ్లారు. అప్పుడే నా స్నేహితురాలు నాకు కనిపించింది. నిజానికి నేను, నా స్నేహితురాలు కలుసుకొని అప్పటికి 7 సంవత్సరాలు అయింది. తను ఆరోజు నాకు స్వప్నంలోనే కనిపించింది. తను నన్ను చూసి, “హాయ్, ఏంటి ఇక్కడున్నావ్?” అని అడిగింది. “మావారు, మా బాబు బండి పార్క్ చేయడానికి వెళ్లారు. వాళ్ళు వచ్చాక లోపలికి వెళదామని వాళ్ళ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను” అని చెప్పాను. దాంతో నా స్నేహితురాలు, “సరే, మనం వెళ్దాం రా, వాళ్లు వస్తారులే” అని అంది. నేను సరేనని నా స్నేహితురాలితో కలిసి గుడి లోపలికి వెళ్దామనుకున్నాను. అయితే అక్కడ చాలామంది జనం ఉన్నారు. నేను ఆ జనాన్ని చూసి, ‘నా చెప్పులు ఎక్కడ పెట్టాలి? ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఈ రద్దీలో అవి పోతాయేమో’ అనుకుని, మళ్ళీ అక్కడే ఒక ప్రక్కగా పెట్టి బాబా గుడిలోకి వెళ్లాను. ఆ గుడిలో ఉన్నది బాబా విగ్రహమో, ఫోటోనో కాదు, అచ్చంగా ఫకీరు రూపంలో ఉన్న బాబానే! నేను బాబాను చూసిన వెంటనే నిర్ఘాంతపోయి ఆయన వైపే చూస్తూ ఉన్నాను. బాబా కూడా నా వైపు చూస్తున్నారు. నా స్నేహితురాలు నన్ను చూసి, “ఏంటి అలా చూస్తున్నావ్? రా, బయటికి వెళ్దాం” అని అంది. “అదేంటి, అప్పుడే వెళ్ళిపోదామంటున్నావ్? కాసేపు ఉందాం” అన్నాను నేను. అందుకు తను, “ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు” అని అంది. “ఎందుకు ఉండకూడదు?” అని అడిగాను నేను. దానికి తను, “ఇక్కడ మనం ఎక్కువసేపు ఉంటే బాబాను బాధపెట్టినవాళ్ళం అవుతాం. మనల్ని చూసి ‘నా భక్తులు ఇన్ని కష్టాల్లో ఉన్నందుకే నా దగ్గరకి వస్తున్నారు’ అని బాబా బాధపడతారు” అని చెప్పి, నా చేయి పట్టుకుని నన్ను బయటకు తీసుకుని వెళ్ళింది. నేనలాగే తన వెనుకనే వెళ్ళిపోయాను. బయటకు వెళ్లిన తర్వాత నేను అనుకున్నట్టుగానే నా చెప్పులు కనిపించలేదు. చుట్టుప్రక్కలంతా వెతికాను. చాలాసేపటి తరువాత చెప్పులు కనిపించాయి. చెప్పులు వేసుకుని నేను, మా పాప, నా స్నేహితురాలు ముగ్గురం నడుచుకుంటూ వెళ్తున్నాం. అప్పుడు మా పాప వయసు రెండు సంవత్సరాలు. నేను మా పాపని నా ఎడమవైపు ఎత్తుకున్నాను. అలా వెళ్తూ ఉండగా నా వెనకాల ఆ ఫకీరు(బాబా) రావడం కనిపించింది. నేను వెనక్కి వెనక్కి చూసుకుంటూ నడుస్తున్నాను. నా స్నేహితురాలు నాతో, “నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వెందుకు అటు చూస్తున్నావు?” అని అంటోంది. “నీకు నా ఎడమవైపున ఎవరూ కనిపించట్లేదా?” అని అడిగాను. తను, “నాకెవ్వరూ కనిపించడం లేదు” అని అంది. నేను నా ఎడమవైపుకి తిరిగాను. బాబా నా వెనుకనే ఉన్నారు. ఆయన మా పాప బుగ్గ పట్టుకుని ముద్దుపెట్టుకున్నారు. నేను ఆయన వైపు చూస్తూ, “ఏమైంది, లోపల ఉండాల్సిన ఈ ఫకీరు ఇలా వచ్చేశారు?” అని అనుకుంటున్నాను. అప్పుడు బాబా నాతో, “నేను నీ వెనుకనే ఉన్నాను, నువ్వే నన్ను చూసుకోవట్లేదు” అని అన్నారు. బాబా మాటలు విని, నేను బాబాను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నానో అర్థం చేసుకున్నాను. ‘ఎంత ప్రేమ ఉంటే ఆయన మన వెనకాలే ఉంటారు?’ అన్న విషయం నేనప్పుడు గ్రహించాను. ఇలా ‘బాబా నా వెనకాలే ఉన్నారు’ అనేటువంటి నిదర్శనాలు నా జీవితంలో చాలా జరిగాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా త్వరలోనే ఈ బ్లాగ్ ద్వారా సాయిబంధువులందరితో పంచుకుంటాను. అలాగే, మావారు చేసే పనిలో తనకు ప్రమోషన్ రావాలని బాబాను మనస్ఫూర్తిగా వేడుకుంటూ, మావారికి ప్రమోషన్ వస్తే ఆ అనుభవాన్ని కూడా ఈ బ్లాగులో పంచుకుంటానని బాబాకు మాటిస్తున్నాను. స్వార్థంతో కాకుండా భక్తిశ్రద్ధలతో బాబాకు దగ్గర కావాలని ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నాను.


సమస్యలను తొలగించిన బాబా


సాటి సాయి బంధువులకు, బ్లాగు నిర్వాహకులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. ఈమధ్య నా ఉంగరం ఒకటి కనపడలేదు. బీరువాలో, ఇంకా ఇల్లంతా వెతికినా ప్రయోజనం లేకపోయింది. అప్పుడు నేను, "బాబా! మీ కృపతో ఉంగరం దొరికితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను తండ్రి" అని బాబాను వేడుకున్నాను. అప్పటివరకు చాలాసార్లు వెతికినా కనిపించని ఉంగరం అలా బాబాను వేడుకున్నంతనే కనిపించింది.


ఇంకోసారి మా పిల్లలిద్దరికీ ఒకేసారి జ్వరం వచ్చింది. ఎన్ని మందులు వాడినా, రెండు రోజులు గడిచినా జ్వరం తగ్గలేదు. మేము చాలా భయపడ్డాము. అప్పుడు నేను, "బాబా! పిల్లలకి జ్వరం తగ్గితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల వెంటనే పిల్లలకి జ్వరం తగ్గింది. "ధన్యవాదాలు బాబా. మీ అనుగ్రహాన్ని పంచుకోవడంలో ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి. ఎల్లప్పుడూ మీ అనుగ్రహాన్ని మాపై వర్షించండి బాబా".


ఓం సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo