సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1195వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయి చల్లని చూపు
2. ఎమ్.ఆర్.ఐ రిపోర్టులో అంతా బాగుండేలా అనుగ్రహించిన బాబా

సాయి చల్లని చూపు 

సాయి మహారాజ్ కి జై!!! నా పేరు కుమార్. నేను ఒక సాయి బిడ్డను. నాకు నా సాయి మీద చాలా నమ్మకం. ఆ నమ్మకంతోనే నేను బ్రతుకుతున్నాను. ఈ బ్లాగును అనుగ్రహించిన సాయి దేవునికి నా శతకోటి వందనాలు. ఇందులోని తోటి భక్తుల అనుభవాలను చదువుతుంటే సాయిపై ఎంతో విశ్వాసం పెరుగుతుంది. "సాయీ! మీ పాదాల వద్ద నాకు కాస్త చోటు ఇవ్వండి తండ్రి". ఇక నా అనుభవానికి వస్తే...

ఒకసారి నాకు, నా భార్యకి మధ్య చాలా చాలా గొడవలు జరిగాయి. నేను నా సహనాన్ని కోల్పోయి నా భార్యను, నా కొడుకుని వదిలి మా సొంత ఊరికి వెళ్ళిపోయాను. నా తల్లిదండ్రులు నాతో, "కొన్నిరోజులు ఇక్కడే ఉండు, తరువాత నీ ఇంటికి వెళ్ళు" అన్నారు. నా జీవితం ఇలా అయిపోయిందేమిటని నాకు చాలా బాధగా ఉండేది. ఆ బాధను నేను తట్టుకోలేకపోయేవాడిని. కానీ తిరిగి నా ఇంటికి వెళ్ళాలని నాకస్సలు అనిపించలేదు. కానీ మా అమ్మకి నా జీవితం ఇలా అయిపోయినందుకు చాలా కష్టంగా ఉండి బాధపడుతూ ఉండేది. అమ్మ బాధని చూసి తట్టుకోలేక నా తల్లిదండ్రులతో కలిసి నేను, నా భార్య కలిసి ఉండిన అద్దె ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటి పక్కనే మా అత్తగారి ఇల్లు ఉంది. నేను నా సొంత ఊరు వెళ్లిపోతూనే నా భార్య నా కొడుకుని తీసుకుని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. మాకు నా భార్య వైపు వాళ్ళకి అస్సలు మాటలు లేవు. అందువల్ల మా అత్తగారితో పెద్ద గొడవ అవుతుందని చాలా టెన్షన్ పడ్డాను. అయితే బాబా నాకు, "ఏం భయపడకు. అంతా సవ్యంగా జరుగుతుంది" అని మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ ఇచ్చిన దైర్యంతో నేను మాట్లాడటానికి ముందుకు వెళ్ళాను. బాబా దయవల్ల గొడవేమీ లేకుండా మాట్లాడుకున్నాం. కానీ నా భార్య నాతో ఉండటానికి ఇష్టపడేలేదు. దాంతో నేను నా సామాను సర్దుకుని అద్దె ఇంటిని ఖాళీచేసి మా సొంత ఊరుకి బయలుదేరాను. మా ప్రయాణం సురక్షితంగా జరిగి క్షేమంగా ఇంటికి చేరుకున్నాము. "బాబా! మీ దయవల్లే గొడవేమీ జరగలేదు. కానీ 'ఏమిటీ పరిస్థితి' అని నేను చాలా గందరగోళంలో ఉన్నాను సాయి. అయితే, 'ఈ కష్టం వెనుక చాలా సంతోషాలు దాగి ఉన్నాయి' అన్న మీ మెసేజ్ నాకు గుర్తు ఉంది బాబా".

మేము మా సొంత ఊరుకి వచ్చేమందు ఇంట్లోని సామాన్లన్నీ ఒక ట్రాన్స్పోర్టేషన్ వాళ్లకిచ్చి మా సొంతూరుకి చేర్చమని అందుకుగానూ మొత్తం డబ్బులు చెల్లించాను. అయితే, వాళ్ళు వారం రోజులైనా సామాను పంపలేదు. నేను రోజూ వాళ్ళకి ఫోన్ చేసి "సామాను ఎప్పుడు పంపిస్తారు?" అని అడుగుతుంటే, వాళ్ళు ఏ రోజుకారోజు, "ఈరోజు పంపిస్తామ"ని చెప్తుండేవాళ్ళు. ఇక నాకు అనుమానమొచ్చి ఒకరోజు సాయంత్రం ఫోన్ చేస్తే, వాళ్ళు లిఫ్ట్ చెయ్యలేదు. సరేలే, అని రాత్రి మళ్ళీ చేశాను. వాళ్ళు నా కాల్ లిఫ్ట్ చెయ్యకుండా కట్ చేస్తూపోయారు. సుమారు 20 సార్లు కాల్ చేసాక ఇక కట్ కూడా చెయ్యలేదు. 'ఇక్కడికి, అక్కడికి 400 కిలోమీటర్ల దూరం. నా సామాన్లను మరియు వాటి తరలింపుకోసం ఇవ్వాల్సిన మొత్తం డబ్బులను ఇచ్చేసాను. ఇప్పుడు చూస్తే, వీళ్ళు స్పందిచట్లేదు' అని చాలా టెన్షన్ పడి సాయితో చెప్పుకుని చాలా బాధపడ్డాను. రాత్రి చాలాసేపు నిద్రలేదు. మర్నాడు ఉదయం లేవగానే మళ్ళీ వాళ్ళకి కాల్ చేశాను. మామూలే, వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా 'నా సామాన్లు, డబ్బు పోయినట్లేన'ని నేను ఒక నిర్ధారణకు వచ్చి, 'బాబా!' అని మనసులో అనుకున్నాను. కాసేపటికి వాళ్లే ఫోన్ చేసి, "మీ సామాను గురించి ఏమీ భయపడకండి, ఈరోజు ఉదయమే తరిలిస్తాము" అని చెప్పి, "ఇంకో 5000 రూపాయలు కావాలి" అని అన్నారు. నాకు మరో ఆప్షన్ లేక వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చాను. బాబా దయవల్ల వాళ్ళు నిజంగానే నా సామాను తరలించారు. రాత్రికి మా ఇంటికి చేరుకున్నాయి. "బాబా! నన్ను క్షమించు. నా మనసులో వేరే ఉద్దేశంతో బాధపడ్డాను. కానీ మీ మీద నమ్మకంలేక కాదు తండ్రి".

నేను, నా తల్లిదండ్రులతో కలిసి నా అద్దె ఇంటికి వెళ్లేరోజు అమ్మ మా ఇంట్లో ఉన్న మొక్కలకు ఎండ తగలకుండా నీడలో పెట్టింది. కానీ ఐదు రోజుల వరకు మొక్కలకు నీళ్లు పోయకుండా ఉంటే ఎలా అని అమ్మ బాధపడింది. అప్పుడు నేను, "బాబా! మేము తిరిగి వచ్చేవరకు మొక్కలను మీరు బాగా చూసుకోండి" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల మంచి ఎండలు కాసే మే నెలలో వర్షాలు వచ్చి మొక్కలన్నీ ఏమీ కాకుండా బాగున్నాయి. "ధన్యవాదాలు బాబా. నేను బాధపడినా పర్లేదుకానీ నా తల్లిదండ్రులకి నావల్ల ఎప్పుడూ బాధ కలుగకూడదు బాబా. వాళ్ళ సంతోషానికి నేను కారణం కావాలి కానీ బాధకి కాదు. నేను వాళ్ళని సంతోషంగా చూడాలి. దయచేసి వాళ్ళు సంతోషంగా ఉండేలా దీవించు తండ్రి. ప్లీజ్ సాయి, ప్లీజ్. వాళ్ళు సంతోషంగా ఉంటే, అందుకు మీరే కారణమని నమ్మి ఆ అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను బాబా".

2022, మే 11 మధ్యాహ్నం 2 గంటలకు గాలివాన వల్ల మా ఇంట్లో కరెంట్ పోయి 4:30 వరకు రాలేదు. మా పక్కింటివాళ్లకి, కిందింటివాళ్ళకి ఉంది. పోల్ మీద వైర్ లూజ్ కనెక్షన్ అయి మాకు మాత్రమే కరెంట్ పోయింది. నేను పవర్ స్టేషన్‌కి ఫోన్ చేసి కంప్లైంట్ పెడితే, సర్వీసువాళ్ళు వచ్చారుకానీ వర్షంలో నిచ్చెనేసి కరెంట్ పోల్ ఎక్కడం మంచిది కాదని వెళ్ళిపోయారు. నేనైతే, 'పవర్ ఇంకా రేపే వస్తుంది. దేవుడి గుడిలో వెలుగు లేద'ని అనుకున్నాను. తరువాత బాబా లీలలు చదువుతూ, "బాబా! పవర్ వస్తే, మీ అనుగ్రహాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల వాళ్ళు మళ్లీ వచ్చి వైర్ కనెక్ట్ చేసి వెళ్లారు. "చాలా చాలా సంతోషం సాయి. మీరు నాకు తోడుగా ఉన్నారు. మీ అనుగ్రహం ఇంత అని చెప్పలేము. నాకున్న కష్టం మీకు తెలుసు, దయచేసి నాకు సహాయం చెయ్యండి సాయి. మీ అనుగ్రహాన్ని మళ్లీమళ్లీ మీ భక్తులతో పంచుకునే అవకాశం నాకు ఇవ్వండి సాయి".

ఎమ్.ఆర్.ఐ రిపోర్టులో అంతా బాగుండేలా అనుగ్రహించిన బాబా

నేను ఒక సాయి భక్తుడిని. ప్రప్రధమంగా నా సాయికి ప్రణామాలర్పిస్తూ నేను నా అనుభవం మీ అందరితో పంచుకుంటున్నాను. ఇలా బాబా ప్రసాదించిన అనుభవాలను పంచుకోవడం నా మనస్సుకు ఎంతో ఆనందాన్నిస్తుంది. ఒకరోజు సాయంత్రం నేను, నా శ్రీమతి నడుస్తూ ఉండగా ఉన్నట్టుండి హఠాత్తుగా విపరీతమైన కాలునొప్పితో నా శ్రీమతి నడవలేకపోయింది. వెంటనే దగ్గర్లో ఉన్న హాస్పిటల్‍కి వెళ్ళాము. డాక్టర్ చూసి, "మరుసటిరోజు ఎమ్.ఆర్.ఐ చేయించి ఎక్స్-రే కూడా తీయించండి" అని చెప్పారు. సుమారు 2 సంవత్సరాల ముందు నా శ్రీమతి వెన్నెముకకు కొద్దిగా ఫ్రాక్చర్ అయ్యింది. దానికి సంబంధించి ఇప్పుడేమైనా మార్పులు వచ్చాయేమోనని నాకు భయమేసి, "బాబా! ఎమ్.ఆర్.ఐ రిపోర్టు బాగుండాలి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఎమ్.ఆర్.ఐ చేసాక రిపోర్టులో అంతా బాగుందని వచ్చింది. "ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ మీ దయ మా మీద ఇలాగే ఉండాలి. ఇంకా మా కుటుంబాన్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచాలని మిమ్మల్ని ప్రార్ధిస్తున్నాను". చివరిగా ఒక మాట, 'మాకున్న అన్ని సమస్యలు తీరిపోవాలని ఆ సాయిబాబాను మాకోసం ప్రార్థించండి'.

సాయిభక్తుల అనుభవమాలిక 1194వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయినాథుని విశేషానుగ్రహం
2. 'బాబా' అని తలుచుకుంటే చాలు ప్రేమతో పరిష్కార మార్గం చూపే బాబా
3. సాయిబాబా ఉండగా భయపడాల్సిన పనిలేదు

శ్రీసాయినాథుని విశేషానుగ్రహం


ఓం శ్రీసాయినాథాయ నమః!!!

సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


నమ్ముకున్నవారి కోరికలను తీర్చే సాయినాథునికి నా ప్రణామాలు. సాయిభక్తులకు నా నమస్కారాలు. నా పేరు శ్రీవాణి. మావారి పేరు శ్రీకాంత్. మాది మహబూబ్ నగర్ జిల్లా. నాకు ఏ భాద వచ్చినా నేను సాయినాథునితో చెప్పుకుంటాను. ఆయన నన్ను చాలా విషయాలలో అనుగ్రహించారు. ఈమధ్యనే మాకు శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకునే భాగ్యం లభించింది. ఆ సద్గురుని దయవలన మా కుటుంబంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. ఇక నా అనుభవానికి వస్తే... ఇటీవల నా కూతురుకి ఇంటర్ సెకండియర్ పరీక్షలు రేపు మొదలవుతాయనగా ముందురోజు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. మేము ముందు మామూలు గ్యాస్ నొప్పేమో అనుకున్నాము. కానీ మరుసటిరోజే పరీక్ష ఉన్నందున ఎందుకైనా మంచిదని పాపని సమీపంలో ఉన్న హాస్పిటల్‍కి తీసుకెళ్ళాము. డాక్టర్ పరీక్షించి, "ఇది అపెండిక్స్ నొప్పి, ఆపరేషన్ చేయాలి. ఇన్ఫెక్షన్ ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. తొలిదశ కాబట్టి నొప్పి తీవ్రంగా లేదు" అని చెప్పారు. తరువాత ఇంకో హాస్పిటల్‍కి వెళ్ళాం. అక్కడ సర్జరీ చేసే డాక్టరు ఉన్నారు. ఆ డాక్టర్ కూడా అది అపెండిక్స్ నొప్పేనని, తొలిదశలో ఉందని, స్కానింగ్ తీయించమని చెప్పారు. మేము "రేపటి నుండి పాపకి పరీక్షలున్నాయ"ని చెప్తే, 3 రోజులకు మందులు రాసిచ్చి, "రోజూ ఉదయం, సాయంకాలం గ్లూకోజ్ ఎక్కించాల"ని చెప్పారు. పరీక్ష రేపనగా పాప అలా అనారోగ్యానికి గురి కావడం నాకు, మారికి చాలా బాధను కలిగిచింది. మేమిద్దరమూ చాలా నిరుత్సాహానికి గురయ్యాము. ఆపరేషన్ గురించి తీవ్రంగా ఆలోచించడం వల్ల మా ఆరోగ్యాం కూడా దెబ్బతింది. వెంటనే మేమిద్దరమూ ఆ సాయినాథుని పాదాలకు నమస్కరించుకుని, "బాబా! మా కూతురుకి ఎలాంటి ఆపరేషన్ లేకుండా నొప్పి తగ్గేలా చేసి, ఇంటర్మీడియట్ పరీక్షలు మంచిగా వ్రాసేలా చూడండి" అని బాబాను వేడుకున్నాము.


మరుసటిరోజు ఉదయం 9 గంటలకి పాపకి పరీక్ష ఉండగా 6 గంటలకే గ్లూకోజ్ ఎక్కించుకుంది. నేను, "బాబా! పాపకి ఆపరేషన్ చేయించాల్సి ఉంది. కానీ తనకి ఈ రోజే పరీక్షలు మొదలవుతున్నాయి. మీ మీద భారమేసి తనని పరీక్షకు పంపుతున్నాము. మీరే నా బిడ్డను కాపాడాలి సాయి. తనకి కడుపునొప్పి రాకుండా, ఆపరేషన్ అవసరం లేకుండా మందులతో తగ్గిపోయేలా చేయండి" అని వేడుకున్నాను. బాబా దయవలన పాపకి కడుపునొప్పి రావడం తగ్గింది. పాప తెలుగు, ఇంగ్లీష్ పరీక్షలు బాగా వ్రాసింది. తరువాత ఆదివారం వచ్చింది. ఆరోజు సెలవు దినం కనుక డాక్టరు, "పాపని వనపర్తికి తీసుకెళ్ళి, అక్కడ కలర్ స్కానింగ్ చేయించండి. సమస్య ఏమిటో స్పష్టంగా కనబడుతుంది" అని చెప్పారు, సరేనని అక్కడికి వెళ్ళాము. వనపర్తిలోని డాక్టర్ ముందు తన దగ్గర ఉన్న చిన్న స్కానింగ్ తీశారు. ఆ స్కానింగ్‍లో అసలేమీ కనపడలేదు. దాంతో డాక్టరు, "చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నట్టు ఉంది, పెద్ద కలర్ స్కానింగ్‍లో స్పష్టంగా కనబడుతుంద"ని స్కానింగ్ సెంటర్ వాళ్ళకి ఫోన్ చేసారు. అయితే వాళ్ళు ఆరోజు స్కానింగ్ సెంటర్ తొందరగా మూసేసారు. దాంతో డాక్టరు మూడు రోజులకు మందులు వ్రాసిచ్చారు. పాప ఫిజిక్స్, మేథమేటిక్స్ పరీక్షలు రాసింది. తరువాత రోజు పరీక్షకి వెళ్ళేటప్పుడు నాబిడ్డ, "అమ్మా! నా నోరు చేదుగా ఉంది, కడుపు తిప్పుతున్నట్లు ఉంది, ఏమీ తినాలనిపించట్లేదు" అని కొబ్బరిబోండం త్రాగి పరీక్షకి వెళ్ళింది. తీరా అక్కడికి వెళ్ళాక తన ఒళ్ళు చల్లబడిపోయి, చెమటలు పెట్టేసి నీరసంగా ఉందని ఏడ్చింది. నేను ఇంట్లో బాబా ఫోటో ముందు నిలబడి, "బాబా! మీరే నా బిడ్డను కాపాడాలి. తనకి ఎలాంటి అపెండిక్స్ కడుపునొప్పి రాకుండా చూడాలి. నా బిడ్డ ఎలాంటి ఇబ్బంది పడకుండా పరీక్ష మంచిగా వ్రాసేలా చేయండి బాబా" అని పాప ఇంటికి వచ్చేవరకు బాబాని వేడుకుంటూ ఉన్నాను. 12:30కి పరీక్ష అయిపోయిన వెంటనే పాపని వనపర్తికి తీసుకెళ్ళి కలర్ స్కానింగ్ చేయిస్తే, 'ఎప్పుడు నొప్పి వస్తుందోనని భయపడాల్సిన' టెన్షన్ ఉండదని అనుకున్నాము. అనుకున్నట్లే అక్కడికి వెళ్లేముందు నేను, "బాబా! పెద్ద స్కానింగ్ తీసిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా, ఎప్పటికీ కడుపునొప్పి రాకుండా చూడండి. అలాగే ఆపరేషన్ అవసరం లేకుండా చేయండి బాబా. డాక్టరు ఆపరేషన్ అవసరం లేదని చెప్పాలి బాబా" అని బాబాని వేడుకున్నాను. అక్కడికి వెళ్ళాక కలర్ స్కానింగ్ తీయించి, రిపోర్టు డాక్టరుకి చూపించాము. డాక్టర్, "అపెండిక్స్ సమస్య చాలా మైల్డ్‌గా ఉంది. చెప్పుకోదగ్గ అంతగా లేదు. దీనికి భయపడాల్సిన పనిలేదు. మందులతో తగ్గించొచ్చు. తగ్గిపోయే అవకాశం ఉంది" అని చెప్పి మందులు వ్రాసిచ్చారు. మేము అమిత ఆనందానికి లోనయ్యాము. వెంటనే ఆ సద్గురు సాయినాథునికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాము. "ధన్యవాదాలు బాబా!! ఉన్న ఆ కొద్దిపాటి సమస్యను కూడా లేకుండా చేసి నా బిడ్డను రక్షించండి. ఎలాంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉండేలా మా కుటుంబాన్ని అనుగ్రహించు తండ్రి. నా కొడుకు, కూతురులకు సద్బుద్ది, సద్భక్తి, మంచి విద్యను ప్రసాదించమని వేడుకుంటూ మీకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాను తండ్రి".


సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


'బాబా' అని తలుచుకుంటే చాలు ప్రేమతో పరిష్కార మార్గం చూపే బాబా


నా పేరు ధనలక్ష్మి. మాది హైదరాబాద్. నేను మొదటిసారి నా అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. నేను చాలారోజులుగా నా అనుభవాలను ఎలా పంచుకోవాలో తెలియక చాలా బాధపడ్డాను. చివరికి బాబా నాకు దారి చూపించారు. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నేను బాబాను దాదాపు 1997 నుండి నమ్ముతున్నాను. మా పెళ్ళైన కొత్తలో మేము పంజాగుట్టలో ఉండేవాళ్ళము. అక్కడున్న బాబా గుడికి మావారు నన్ను తీసుకుని వెళ్లారు. నేను అదే మొదటిసారి బాబా గుడికి వెళ్లడం. నేను బాబాని దర్శించుకుని "నన్ను ఆశీర్వదించండి బాబా" అని అడిగాను. అప్పటినుండి బాబా నన్ను వదల్లేదు. ఆయన నా ప్రతి అడుగులో తోడుగా ఉంటూ నా కుటుంబాన్ని నడిపిస్తున్నారు. నాకు చిన్న, పెద్ద ఏ కష్టమొచ్చినా నేను 'బాబా' అని తలచుకుంటాను. ఆయన ప్రేమతో నాకు పరిష్కార మార్గం చూపిస్తారు. అటువంటి ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.


దాదాపు పది సంవత్సరాల క్రితం నాకు ఇరవై వేల రూపాయలు అత్యవసరంగా కావాల్సి వచ్చింది. అప్పుడు నేను, "బాబా! నేను ఎవ్వరినీ అడగలేను. మీరే నాకు దిక్కు" అని చెప్పుకుని నా డ్యూటీ పూర్తయిన తర్వాత పంజాగుట్ట బాబా గుడికి వెళ్లి చాలా బాధతో బాబాను ప్రార్థించాను. తరువాత ఇంటికి వచ్చి పడుకుని లేచాక నా ఫోన్‍లో మెసేజ్ చూస్తే, నా అకౌంటులో సరిగ్గా 20 వేల రూపాయలు జమై ఉన్నాయి. అవి ఎలా వచ్చాయని నాకు చాలా ఆశ్చర్యమేసింది. మా బ్యాంకులో కనుక్కుంటే, ఏదో అకౌంట్ నుండి ట్రాన్స్‌ఫర్ అయ్యాయని చెప్పారు. నాకు ఎవరు పంపారో అర్థం కాలేదు. ఆలోచిస్తే, ఒక రెండు నెలల క్రితం నా సహోద్యోగి ఒకరు చెప్పిన మాట గుర్తు వచ్చింది. తను తనకు రావాల్సిన డబ్బుని నా అకౌంటులో జమచేయమని ఒకరితో చెప్పిన విషయం నేను పూర్తిగా మర్చిపోయాను. వెంటనే ఆమెకు ఫోన్ చేసి, "డబ్బులు వచ్చాయి, నాకు అవసరం ఉంది వాడుకుంటాను" అని అన్నాను. అందుకు తను, "తీసుకో" అని చెప్పింది. ఇక నా ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఇలా బాబా నన్ను ఎన్నో విధాల కాపాడుతున్నారు. ఇలాంటి అనుభవాలు నాకు చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి మీ అందరితో పంచుకుంటాను. నాకు ఈ అదృష్టాన్ని ఇచ్చిన మీ అందరికి నా వందనాలు.


ఓం శ్రీసాయినాథాయ నమః!!!


సాయిబాబా ఉండగా భయపడాల్సిన పనిలేదు


ఓం శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీసాయినాథాయ నమః!!!


సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తుడిని. 2022, మే 9 రాత్రి నేను నా డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తున్నప్పుడు వర్షంలో తడిచాను. దాంతో బాగా జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి వచ్చి సీరియస్ అయింది. మూడు రోజులు చాలా ఇబ్బందిపడ్డాను. ఆ సమయంలో రోజూ చదివే బ్లాగులోని తోటి భక్తుల అనుభవాలు చదవలేకపోయాను. తరువాత గురువారంనాడు బ్లాగులోని అనుభవాలు ఎలాగైనా చదవాలని చదివాను. అప్పుడు, 'నా తండ్రి(బాబా) ఉండగా నాకు భయమెందుకు?' అనిపించి, "బాబా! నేను ఈ బాధ భరించలేకున్నాను తండ్రి. రేపటి ఉదయానిల్లా నా కష్టం తీరాలి తండ్రి" అని సాయితండ్రిని వేడుకున్నాను. అంతే, మన తండ్రి ఉదయానికి 80% నయమయ్యేలా దీవించారు. నిజంగా మన సాయిబాబా ఉండగా మనం భయపడాల్సిన పనిలేదు. ఇలా మొదటిసారి నా అనుభవం మీ అందరితో పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. "ధన్యవాదాలు బాబా. నా తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి బాబా".


సాయినాథ్ మహరాజ్ కి జై!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1193వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబానే మనకు రక్ష
2. సాయి ఆశీర్వాదం
3. సమస్యను తీర్చిన బాబా

బాబానే మనకు రక్ష


సాయి బంధువులకు నమస్కారము. నేను ఒక సాయి భక్తురాలిని. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ఒకసారి నేను కొంతమందితో కలిసి ఒక టూర్‌కి వెళ్ళినప్పుడు మాతోపాటు వచ్చిన ఒక అమ్మాయికి నెలసరి వచ్చింది. వేరేవాళ్ళు ఈ అమ్మాయిని తమతో దర్శనానికి రమ్మన్నారు. ఆ రాత్రి నేను నా మనసులో 'ఈ అమ్మాయి మా వాహనంలో వస్తుందేమో! అయినా తెలిసి ఈ సమయంలో ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందో' అని అనుకున్నాను. అయితే ఆ అమ్మాయి వేరే కారులో వచ్చింది. కానీ మనసులో నేను ఆమె గురించి అనుకున్నదానికి శిక్ష నాకు మరునాడు పడింది. ఎప్పుడో రెండేళ్ల క్రిందట ఆగిపోయిన నెలసరి హఠాత్తుగా నాకు మళ్ళీ వచ్చింది. దాంతో నేను, "బాబా! ఆ అమ్మాయి విషయంలో నేను అలా అనుకోవడం తప్పు. నన్ను క్షమించండి. నాకు బ్లీడింగ్ అవ్వకుండా చూడండి. బాబా దయవలన నాకు మూడవరోజు బ్లీడింగ్ ఆగిపోయింది. ఆ అమ్మాయిని అలా మనసులో అనుకున్నందుకే నాకు అలా జరిగింది. మనం ఏదైనా ఎవరినైనా అనే ముందు ఆలోచించాలని బాబా నాకు  ఈ అనుభవం ద్వారా తెలియజేసారు.


బాబా మా పిల్లలందరినీ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. యు.ఎస్.ఏలో ఉంటున్న మా పిల్లలు ఇదివరకు వేరే స్టేట్‍లో దక్షిణ సింహద్వారం ఉన్న ఒక పెద్ద ఇల్లు కొన్నారు. దాన్ని అమ్మాలని అమ్మకానికి పెడితే, అందరూ చూసి వెళుతుండేవారుకానీ ఎవరూ కొనడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఆ సమయంలో ఒకరోజు నేను నా మనసులో, "బాబా! మాకు ఏది మంచిదో అది చేయండి" అని అనుకున్నాను. మరునాడు ఇండియాకి చెందినవాళ్ళు ఇల్లు చూడటానికి వచ్చి, ఆ ఇంట్లో ఉన్న బాబాను చూసి, "ఇది బాబా మాకు ఇస్తున్న ఇల్లు. ఇంకెవరికీ చెప్పకండి. మాకే ఇచ్చేయండి" అని అన్నారు. పిల్లలు నాకు ఆ విషయం చెపితే, నేను వాళ్లతో, "మన ఇంట్లో బాబాని పూజిస్తే, మనకి మంచిది. వాళ్ళకే ఇచ్చేయండి" అని అన్నాను. వాళ్ళు చాలా ఆనందించారు. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. బాబా ఉండగా మనకి భయమేల? తరువాత పిల్లలు బాబా ఆజ్ఞతో యు.ఎస్.ఏలో మరో ఇల్లు కొన్నారు. మేము కూడా బాబా దయతో మా ఊరిలో ఒక ఇల్లు కట్టుకున్నాము. ఈమధ్య ఆ ఇంటి గృహప్రవేశం వేడుక బాగా జరిగింది. ఊరిలో అన్ని చోట్ల వర్షం కురుస్తున్నప్పటికీ మేముండే చోట వర్షం లేకుండా బాబా చేసారు.


నేను ఈ మధ్య మావారికి టెస్టులు చేయించి రిపోర్టలన్నీ నార్మల్ రావాలని అనుకున్నాను. అంతే, బాబా దయవల్ల రిపోర్టులు నార్మల్ వచ్చాయి. బాబానే మనకు రక్ష.


సాయి ఆశీర్వాదం


సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నాపేరు లక్ష్మి. నేను బాబా భక్తులందరూ అదృష్టవంతులని  భావిస్తాను. బాబా ఒక్కరు తోడుగా ఉంటే చాలు, ఆయనే మన దైర్యం. నాకు 30 సంవత్సరాల వయసొచ్చాక పెళ్లి నిశ్చయమైంది. అబ్బాయివాళ్ళది మంచి కుటుంబం, అబ్బాయి కూడా మంచివాడు. నేను అంతా బాబా దయ అనుకున్నాను. ఎందుకో తెలీదుకానీ నా ఇష్టాయిష్టాలు కాదని బాబానే ఆ బంధం కలిపారని నాకు అనిపిస్తుంటుంది. కానీ ఎందుచేతనో పెళ్ళైన తరువాత మా జీవితంలో ఊహించని కష్టాలు, ఆపార్దాలు వస్తున్నాయి. "సాయీ! మీరే అన్నిటినీ ఎదురుకునే ధైర్యాన్ని ఇస్తావని నమ్ముతున్నాను. మీరే నాకు అన్నీ. ఏ కష్టమొచ్చినా నేను మీ వైపే చూస్తున్నాను తండ్రి. నాకు తోడు ఉండవా బాబా?".


ఒకసారి నేను నా రెండు జతల చెవి కమ్మలు ఇంట్లో ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఎంత వెతికినా కనిపించలేదు. అప్పుడు 'అవి దొరికాల'ని బాబాకి చెప్పుకున్నాను. తరువాత అమ్మ మళ్ళీ వెతికితే బాబా దయవల్ల ఆ చెవి కమ్మలు కనిపించాయి. "ధన్యవాదాలు బాబా. మీ కృపకు పాత్రురాలినైన నేను ఎప్పటికీ మీ భక్తురాలిని తండ్రి. జీవితంలో నాకు చాలా చేశావు, చాలా ఇచ్చావు. నాకు చాలా మంచి ఉద్యోగ జీవితాన్ని అందించావు. ఇకపోతే ఈ భూమి మీద నాకంటూ ఉన్న ఏకైక వ్యక్తి మా అమ్మ. తను లేకుంటే నా మనసులో మాట చెప్పుకోడానికి నాకు ఎవరూ లేకుండా పోతారు సాయి. తనకి కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి, అవి విషమించకుండా చూడండి బాబా".


సమస్యను తీర్చిన బాబా


సాయి భక్తులకు నమస్కారం. నా పేరు సృజన హర్ష. నేను చెన్నై నివాసిని. మా పాప 'అనఘ' పుట్టినప్పుడు మావారి అమ్మమ్మగారు బంగారు మురుకులు చేయించారు. 2022, మే మొదటి వారంలో ఒకరోజు మా పాప ఆ గాజులతో ఆడుకుంటూ ఒక గాజుని ఎక్కడో పడేసింది. ఆ గాజు పడేసిందని రెండో గాజు‌ తీసి వేరేచోట భద్రపరిచాను. కాసేపైన తరువాత నేను ఆ రెండు గాజుల గురించి పూర్తిగా మర్చిపోయాను. రాత్రి పది గంటలప్పుడు ఆ గాజులు గురించి నాకు గుర్తు వచ్చింది. మొదటి గాజు పాప ఎక్కడ పడేసింది ఎలాగూ తెలియదు, రెండో గాజుని ఎక్కడ పెట్టానో గుర్తు చేసుకుందామంటే ఎంత ప్రయత్నించినా నాకు గుర్తుకు రాలేదు. అర్ధరాత్రి 12:30 వరకు ఇల్లంతా వెతికానుకానీ ఆ గాజులు కనిపించలేదు. అప్పుడు ఇంకా, "గాజులు గనక దొరికాల"ని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. తరువాత మళ్ళీ వెతకడం మొదలుపెడితే ఒక గాజు మాత్రమే కనిపించింది, ఇంకొకటి కనిపించలేదు. ఒక పక్క ఆనందం, మరోపక్క భయంతో, "ఆ గాజు కూడా ఎక్కడున్నా దొరకాల"ని బాబాకి మనస్ఫూర్తిగా దణ్ణం పెట్టుకుని నిద్రకి ఉపక్రమించాను. మరుసటిరోజు ఉదయం నిద్రలేచాక మళ్ళీ వెతకడం ప్రారంభిస్తే బాబా దయవల్ల రెండో గాజు కూడా దొరికింది. ఇక నా ఆనందానికి అవధులు లేవు. సమస్యను తీర్చినందుకు బాబాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.


శ్రీసాయినాథ్ మహారాజ్ కీ జై!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1192వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఊదీ మహిమ
2. ఆలస్యం జరిగినా బాబా న్యాయమే చేస్తారు, అన్యాయం చేయరు - ఆలస్యం వెనుక అధ్భుతాలు జరుగుతాయి
3. తల్లికి ఆరోగ్యం ప్రసాదించిన బాబా
4. స్నేహితుని కుమార్తెకు పూర్ణాయుష్షుని ప్రసాదించిన బాబా

ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయి బంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేనొక వికలాంగ సాయి భక్తుడిని. బాబా నా జీవితంలో చేసిన అధ్భుత లీలలను ఎల్లప్పుడూ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా సాయి భక్తులతో పంచుకుంటానని నేను బాబాకు మాట ఇచ్చాను. అలాగే 2022, మార్చ్ 9వ తేదీన ప్రచురితమైన సాయిభక్తుల అనుభవమాలిక 1073వ భాగంలో కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడూ మరికొన్ని అనుభవాలను మీతో పంచుకుందామని వచ్చాను.


ఊదీ మహిమ:


ప్రతిరోజు బాబా ఊదీ నుదుటన ధరించడం నాకలవాటు. ఒకసారి నా వద్ద ఉన్న ఊదీ అయిపోవస్తుండటంతో బాబాను తలుచుకుని, "బాబా! నన్ను మీ దర్శనానికి శిరిడీకి రప్పించుకుని మీ ఊదీ ప్రసాదాన్ని నాకు అనుగ్రహించండి"  అని వేడుకున్నాను. అక్కడికి రెండో రోజున గ్లోబల్ మహాపారాయణ వాట్సప్ గ్రూప్ ద్వారా నాకు అప్పుడే పరిచయమైన ఒక అక్క మా ఇంటికి వచ్చి బాబా ఊదీ ప్యాకెట్ నాకు ఇచ్చారు. ఆ మరుసటిరోజు ఉదయం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో ఆసక్తికరమైన ఒక పోస్ట్ నా కంటపడింది. దాని ఆంతర్యం ఏమిటంటే, "నువ్వు ఇక్కడికి రాలేనందున నేను నీకు ఊదీ ప్యాకెట్ పంపించాను. దాన్ని తీసుకున్నావా, లేదా?" అని. అది చదివాక, "బాబా! మీరు సర్వాంతర్యాములు" అని అనుకున్నాను.


ఆలస్యం జరిగినా బాబా న్యాయమే చేస్తారు, అన్యాయం చేయరు - ఆలస్యం వెనుక అధ్భుతాలు జరుగుతాయి:


నేను ఫేస్బుక్ ద్వారా పరిచయమైన పక్క రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తిని నమ్మి చాలాకాలం స్నేహం చేశాను. అతను నాతో చాలాసార్లు లాక్‍డౌన్ వల్ల జీవనం సాగించడం, తన కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉందని చెప్పేవాడు. అప్పుడు నేను అతనికి బ్రతుకుతెరువు చూపిద్దామని కొంత డబ్బిచ్చి మా ఊరికి వలస రప్పించి, ఇల్లు అద్దెకు ఇప్పించి, బత్రకడానికి చేయబోయే పనికోసం పెట్టుబడిగా అవసరమైన డబ్బు అప్పుగా ఇచ్చాను. సరిగ్గా నెల గడిచేసరికే ఆ వ్యక్తి తన మీద నేను పెట్టిన నమ్మకాన్ని వమ్ముచేసి ఊరు వదలి వెళ్ళిపోయాడు. ఆ తరువాత నేను అతనికి ఫోన్ చేసి నా వద్ద తీసుకున్న డబ్బును తిరిగి ఇమ్మని చాలాసార్లు ప్రాధేయపడ్డాను. తను మాత్రం వికలాంగుడై కూడా నాకు బ్రతుకుతెరువు చూపించాడన్న విశ్వాసం, జాలి, దయ, కనికరం వంటివేమీ లేకుండా నాతో ప్రవర్తించాడు. నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడు. నాకు ఏమి చేయాలో పాలుపోక, "బాబా! ఆ వ్యక్తికి నీవే జ్ఞానోదయం అయ్యేలా చేసి సద్భుద్ధిని ప్రసాదించి నా డబ్బులు నాకు ఇప్పించు తండ్రి. మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. ఒక సంవత్సర కాలం గడిచిపోయింది. ఒకరోజు మనశ్శాంతికోసం శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుందామని కొద్దిగా డబ్బులు అప్పుచేసి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాను. తరువాత ఒకరోజు సచ్చరిత్ర పారాయణ చేస్తూ "పండగలకు, పబ్బాలకు, తీర్థయాత్రలకు అప్పు చేయొద్దు"  అన్న బాబా మాటను గుర్తు చేసుకుని, "బాబా నన్ను క్షమించండి, మీ దర్శనానికి ఇంకా మూడు నెలలు సమయం ఉంది. మీ వద్దకు వచ్చేలోపు ఆ వ్యక్తి వద్ద నుండి నా డబ్బు నాకు తిరిగి ఇప్పించండి. అది జరిగితే నేను వెంటనే నా అనుభవాన్ని, 'సాయి మాహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. వారం, పది రోజులు గడిచాయి. ఆ రోజు గురువారం. నేను పారాయణ చేస్తుండగా నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ మరెవరిదో కాదు. ఒక సంవత్సరం క్రిందట చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిన ఆ వ్యక్తి ఫోన్ అది. అతను మా ఊరు వస్తున్నానని చెప్పాడు. నేను వెంటనే అతని వద్దకు వెళ్లి కలిసాను. తక్షణమే అతను నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేశాడు. నేను ఆనందంతో, "బాబా! నిజంగా మీరు నా మొర ఆలకించారు. మీ దర్శనానికి వచ్చేలోపే నా సమస్యను తీర్చి మీపై నాకున్న నమ్మకం మరింత హెచ్చేలా చేసారు. మీరు చేసిన ఈ మేలును నేను ఎప్పుడూ జ్ఞప్తి యందు ఉంచుకుంటాను" అని బాబా ఫొటో ముందు దణ్ణం పెట్టుకున్నాను.


తల్లికి ఆరోగ్యం ప్రసాదించిన బాబా:


2021, ఆగష్టు 20వ తేదిన మా అమ్మ ఉన్నట్టుండి బాత్రూమ్‍లో కళ్ళు తిరిగి పడిపోయింది. నేను వికలాంగుడినైనందున ఏమీ చేయలేని నిస్సహాయస్థితి. కాబట్టి పక్కింటి వాళ్ళను పిలిస్తే, అమ్మని తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టారు. అమ్మకి అస్సలు స్పృహ లేదు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆసుపత్రికి తీసుకువెళ్ళే స్తోమత లేనందున నాకు తెలిసిన ఆర్.ఎం.పి డాక్టరుకి ఫోన్ చేస్తే, అతను వచ్చి టెస్ట్ చేసి, "ప్లేట్లెట్ కౌంట్ పడిపోయింది. ఈమెకు డెంగ్యూ జ్వరం ఉంది. పరిస్థితి చేయిదాటితే హాస్పిటల్లో అడ్మిట్ చేసి ప్లెట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది" అన్నారు. నాకు కాళ్ళుచేతులు ఆడలేదు. ఏమి చేయాలో పాలుపోలేదు. వెంటనే నా వద్ద ఉన్న బాబా ఊదీని అమ్మ నుదుటిపై పెట్టి, "బాబా! మీరే నా తల్లి ఆరోగ్యం బాగు చేయగల సమర్డులు" అని మనసులో బాబాకి చెప్పుకున్నాను. చాలాకాలం క్రితం 'సంకల్ప విస్మయ సాయి' అనే వాట్సప్ గ్రూప్ ద్వారా నాకు పరిచయమైన ఒక అక్క మా అమ్మ ఆరోగ్య విషయం తెలుసుకుని బాధపడి వెంటనే నిత్య పారాయణ గ్రూపులో అమ్మ పేరు మీద రెండు రోజులు 48 మంది సాయిభక్తులతో పారాయణ పెట్టించింది. ఆ భక్తులందరి ప్రార్దనలు ఫలించి పారాయణ పూర్తయిన రోజు సాయంత్రం ప్లేట్లెట్లు ఎక్కించకుండానే కేవలం బాబా ఊదీ నీళ్లలో కలిపి తాగించడంతో అమ్మ ఆరోగ్యం క్రమక్రమంగా కుదుటపడింది. ఆర్ఎంపీ డాక్టర్ రూపంలో బాబానే అమ్మకు ఆరోగ్యం చేకూర్చారు. "ధన్యవాదాలు బాబా! నిజంగా నీవు మా పాలిట దైవానివి. మీరు అనుగ్రహిస్తే, అమ్మ, నేను శిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకుంటాం".


స్నేహితుని కుమార్తెకు పూర్ణాయుష్షుని ప్రసాదించిన బాబా:


నాలుగు సంవత్సరాలు క్రితం అనారోగ్యం వల్ల మా అమ్మని తరచూ హాస్పిటల్‍కి తీసుకెళ్లి, వస్తుండేవాడిని. ఆ సమయంలో పరిచయమైన ఒక ఆటోడ్రైవర్ నాకు అత్యంత సన్నిహితుడయ్యాడు. అతను మృదుస్వభావి. మా మధ్య ఏ రక్త సంబంధమూ లేకపోయినా నన్ను ఆప్యాయంగా అన్నా అని పలకరించేవాడు. ఆ తమ్ముడు పేరు జయరామ్. అతను పదకొండు ఏళ్ల క్రితం ఒక యువతిని ప్రేమించి ఎంతో ఇష్టంగా వివాహం చేసుకున్నాడు. ఏళ్ళు గడిచినా పాపం ఆ దంపతులకు పిల్లలు కలుగలేదు. తిరగని ఆసుపత్రులు, గుళ్ళు, గోపురాలు లేవు. తిరిగితిరిగి వేసారి అలసిపోయిన వాళ్ళిద్దరి మొరను భగవంతుడు ఆలకించాడు. నా తమ్ముడికి పరిచయస్తుడైన మరో స్నేహితుడికి ఇద్దరు సంతానం ఉన్నారు. అతని భార్యకి ఇటివల మూడో కాన్పు జరిగి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రిలో ఉండగానే ఆ బిడ్డను చూసిన నా తమ్ముడు ఆ తల్లిదండ్రులతో, "బిడ్డ ముద్దొస్తుంది, మాకు ఇవ్వండి పెంచుకుంటాము" అని భావోద్వేగంతో అడిగాడు. వాళ్ళు నా తమ్ముడి ఆవేదనను అర్థం చేసుకుని మంచి మనసుతో ఆ బిడ్డను నా తమ్ముడికి ఇచ్చారు. నా తమ్ముడు ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు. ఐదు నెలలు గడిచాక ఒకరోజు ఉన్నట్టుండి ఆ పాప రక్త వాంతులు చేసుకుంటూ కళ్లుతేలేసింది. డాక్టర్లు ఐదునెలల ఆ పాపకు ఎండోస్కోపి చేయాలన్నారు. కానీ ఏ డాక్టరు అందుకు సాహసించలేదు. పాపను ఎన్నో హాస్పిటల్స్‌కి తీసుకుని వెళ్లారు. కానీ ప్రయోజనం లేకపోయింది. నా తమ్ముడి బాధ వర్ణణాతీతం. ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిద్రాహారాలు మాని, "నా బిడ్డను ఎలాగైనా బ్రతికించు దేవుడా" అని ఒకటే ఏడుపు. విషయం తెలుసుకున్న నేను వెంటనే మా అక్కను సంప్రదించి బాబా వాట్సప్ గ్రూపులో సాయి భక్తులచేత పాప పేరు మీద ప్రత్యేక పారాయణ చేయించి, "బాబా! ఎన్నో ఏళ్లుగా సంతానం కలగక నా తమ్ముడు చేసిన ఆర్తనాదాలు విని మీరే తన స్నేహితుని రూపంలో కరుణించి నా తమ్ముడికి ఒక బిడ్డను ప్రసాదించారు. ఆ ఆనందంలో ఉన్న ఆ తల్లిదండ్రులు ఇంతలోనే ఆ బిడ్డకు ఇలా జరగడంతో తల్లడిల్లిపోతున్నారు. అభం శుభం తెలియని ఆ చిట్టితల్లిని కాపాడగల సమర్థులు మీరే బాబా. దయచేసి ఆ బిడ్డకు పూర్ణాయుష్షును ప్రసాదించి ఆ తల్లిదండ్రుల పుత్రశోకాన్ని తీర్చండి. మీరు అనుగ్రహిస్తే, ఆ బిడ్డ కోలుకోగానే శిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకుని మీ పేరిట కలకండ పంచి పెడతాము" అని మొక్కుకున్నాను. సాయి భక్తులందరి ప్రార్దనలు ఫలించి రోజులు గడుస్తున్న కొద్దీ నెమ్మదిగా ఆ పాప ఆరోగ్యం కుదుటపడుతూ ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. అంతా బాబా దయ. "బాబా! నిజంగా మీరు దయామయులు. మీ కృప అపారం. ఇంతటి అనుగ్రహాన్ని చూపినందుకు, ఈ అధ్బుత లీలలను 'సాయి మాహరాజ్ సన్నిది' బ్లాగులో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తండ్రి".


సాయిభక్తుల అనుభవమాలిక 1191వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. చిన్న చిన్న విషయాల్లో కూడా ఎంతో ప్రేమని చూపే బాబా
2. కోరుకున్నట్లే వారంలో దమ్ము, ఆయాసం తగ్గేలా అనుగ్రహించిన బాబా

చిన్న చిన్న విషయాల్లో కూడా ఎంతో ప్రేమని చూపే బాబా

ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః!!! 

సాయి బంధువులకు నమస్కారం. మనం ఎంత ఒత్తిడిలో ఉన్నా మన ఈ బ్లాగులోని తోటి సాయి భక్తుల అనుభవాలు చదివితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను ఒక సాయి భక్తురాలిని. 2022, ఫిబ్రవరి నెలలో మా ఇంట్లో అందరికీ జ్వరాలు వచ్చాయి. జ్వరం మొదట మా మరదలికి వచ్చి తర్వాత మిగతా అందరికీ వచ్చింది. జ్వరం మరదలికి రాగానే కరోనా థర్డ్ వేవ్ వార్తల వల్ల మొదట కొంచెం భయమేసినా మరుక్షణమే బాబా మీద భారం వేసి భయాన్ని వదిలేసాను. బాబా ఎంతలా మమ్మల్ని అనుగ్రహించారంటే, మాలో ఎవరికీ రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు జ్వరం లేదు. అది కూడా ఒకరికి తగ్గాక ఒకరికి వచ్చింది. అదే అందరికీ ఒకేసారి జ్వరం వస్తే చాలా ఇబ్బంది అయ్యేది. అంతా బాబా దయ. ఆయన కృపవలన మేము అందరమూ చాలా త్వరగా కోలుకున్నాము. "అన్నిటికీ చాలా చాలా ధన్యవాదాలు బాబా".

ఇంకో అనుభవం మీతో పంచుకోవాలనిపించి పంచుకుంటున్నాను. ఎందుకంటే, మన సాయి చిన్న చిన్న విషయాల్లో కూడా ఎంత ప్రేమని చూపిస్తారో మీకు చెప్పాలనిపించింది. ఇది అవ్వటానికి చిన్న విషయమే అయినా బాబా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చారు. 2021, జూన్ లేదా జూలైలో మావాళ్ళు ద్వారకాతిరుమల వెళ్ళారు. వాళ్ళు వెళ్ళాక అక్కడినుంచి ఆకుపచ్చరంగు మట్టి గాజులు తెమ్మని చెప్పాలని నాకు అనిపించింది. ఆ విషయం చెప్పటానికి ఫోన్ చేతిలోకి తీసుకున్నాక ఎందుకో సరదాగా బాబాతో, "నేను వాళ్ళకి ఏం చెప్పను. నువ్వే నాకు ఆకుపచ్చ రంగు మట్టి గాజులు పంపించు" అని చెప్పాను. అంతే, ఇక ఫోన్ చేయలేదు. కాసేపటికి తమ్ముడు కాల్ చేసి, "ఏం ప్రసాదం తెమ్మంటావు?" అని అడిగి, అక్కడి ప్రసాదాల లిస్ట్ ఫోటో తీసి పంపాడు. వాళ్ళు ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళారు కానీ, ఇలా ఎప్పుడూ ఫోన్ చేయలేదు. నేను కావాల్సినవి చెప్పాను. కాసేపటికి వాళ్ళు వచ్చారు. నేను అడిగిన ప్రసాదం తెచ్చారు కానీ, నేను అనుకున్న గాజులు తేలేదు. "అదేంటి బాబా, గాజులు పంపలేదు" అని బాబాను అడిగాను. వెంటనే, 'నేను గాజుల గురించి చెప్పాలని ప్రసాదం వంకతో బాబా కాల్ చేయించారేమో! కానీ నేను అడగలేదు. అయ్యో.." అని నవ్వుకున్నాను. తర్వాత ఆ విషయం పూర్తిగా మర్చిపోయాను. కానీ నా సాయి మర్చిపోరు కదా! తర్వాత శ్రావణ పౌర్ణమి రోజు తమ్ముడికి, మేనల్లుడికి రాఖీలు తయారుచేసి, రమ్మని వాళ్ళతో చెప్పాను. వాళ్ళు రాఖీ కట్టించుకోడానికి వచ్చారు. నేను, నా మేనకోడలు రాఖీలు కట్టాం. తర్వాత తమ్ముడు పని ఉందని బయటకు వెళ్లి కాసేపటికి వచ్చి స్వీట్స్ తోపాటు ఒక కవర్ నా చేతిలో పెట్టాడు. ఆ కవరులో ఏముందో మీకు అర్థమై ఉంటుంది కదా. నేను ఆరోజు బాబాని అడిగి మర్చిపోయిన ఆకుపచ్చ రంగు మట్టిగాజులు. వాటిని చూశాక బాబాను అడిగిన గాజుల విషయం గుర్తుకొచ్చి ఎంత సంతోషించి ఉంటానో మీకు చెప్పక్కర్లేదు అనుకుంటా. అతి పవిత్రమైన రాఖీపౌర్ణమి రోజున నేను కోరుకున్నది నాకు ఇచ్చారు బాబా. ఇంకొక విషయమేమిటంటే, మా తమ్ముడు అలా గాజులు నాకోసం తెచ్చి చాలా సంవత్సరాలు అయింది. తను కాలేజీలో చదివే రోజుల్లో తెస్తే, మళ్ళీ ఇన్నాళ్ళకి తెచ్చాడు. అది కూడా నేను కోరుకున్నవి. ఇదంతా బాబా అనుగ్రహం కాకుంటే మరేమిటి. "థాంక్యూ అనేది చాలా చిన్నమాట బాబా. ఎల్లప్పుడూ మమ్మల్ని ఇలాగే ప్రేమగా చూస్తుండండి బాబా".

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!
శుభం భవతు!!!

కోరుకున్నట్లే వారంలో దమ్ము, ఆయాసం తగ్గేలా అనుగ్రహించిన బాబా
 
ఓం శ్రీసాయినాథాయ నము:!!!

నేను ఒక సాయి భక్తురాలిని. ప్రతిరోజు బ్లాగులో ప్రచురితమయ్యే భక్తుల అనుభవాలు చదవడం వల్ల బాబాపట్ల నమ్మకం, భక్తి, ప్రేమలు వృద్ధి చెందుతున్నాయి. నేను ఒక హృద్రోగిని. అయినా నేను దాదాపు అన్ని పనులు సక్రమంగానే చేస్తాను. నేను రోజూ వాకింగ్ కూడా చేస్తాను. అయితే కొన్నిరోజుల నుండి నేను ఏ పని చేసినా దమ్ము, ఆయాసం వస్తున్నాయి. ఈ దమ్ము వల్ల కాసేపు వాకింగ్ చేసినా అది ఇంకా ఎక్కువ అయిపోతుండేది. అప్పుడు నేను, "బాబా! ఒక వారం రోజులలో నాకు ఆయాసం, దమ్ము తగ్గిపోతే, మీకు కిచిడి నైవేద్యంగా సమర్పిస్తాను" అని బాబాతో చెప్పుకున్నాను. సరిగ్గా వారం రోజుల్లో ఆయాసం, దమ్ము తగ్గాయి. "ధన్యవాదాలు బాబా. నామనసులో ఉన్నది జరిగేలా చూడండి, ప్లీజ్ బాబా. నా జీవితంలో ప్రతీది మీవల్లే జరగాలని కోరుకుంటున్నాను తండ్రి".

సాయిభక్తుల అనుభవమాలిక 1190వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అడిగిన వెంటనే కోరికలు నెరవేరుస్తున్న బాబా
2. బాబా రక్షణలో
3. నొప్పి తగ్గేలా అనుగ్రహిస్తున్న బాబా

అడిగిన వెంటనే కోరికలు నెరవేరుస్తున్న బాబా


సాయి బంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. బాబా నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. నేను ఒకసారి అన్నం తింటుంటే నోటిలో దంతాల మధ్య నోటిలోని చర్మం చిక్కి నొప్పి వచ్చింది. మరుసటిరోజుకి నొప్పి ఎక్కువైంది. నేను ఆ నొప్పి వలన సరిగా అన్నం తినలేకపోయేదాన్ని. 5, 6 రోజులైన నొప్పి తగ్గలేదు. పైగా రోజురోజుకి నొప్పి పెరుగుతుండటంతో మందులు వేసుకుని బాబాకి దణ్ణం పెట్టుకుని, "నొప్పి తగ్గేలా దయ చూపండి బాబా" అని వేడుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజుకి కొంత నొప్పి తగ్గి, ఆ మరుసటిరోజుకి చాలావరకు తగ్గిపోయింది.


ఈమధ్య చాలారోజుల నుండి మా అక్కకి ఛాతి పక్కన ఒక గడ్డ ఉంది. మందులు వాడినా తగ్గలేదు. పెద్ద హాస్పిటల్‌కి వెళ్తే ఆపరేషన్ చెయ్యాలి అని చెప్పారు. బాబా దయవల్ల ఆపరేషన్ మంచిగా జరిగింది. తరువాత అది ఏమి గడ్డో తెలుసుకోవడానికి ఆ గడ్డను టెస్టులకోసం ల్యాబ్‌కి పంపి, రిపోర్టు 10 రోజులలో వస్తుంది అన్నారు. మేము చాలా భయపడ్డాము. "రిపోర్ట్ నార్మల్ రావాలని, నార్మల్ రావాల"ని బాబాకి మొరపెట్టుకున్నాను. ఆ మరుసటిరోజు 2022, ఏప్రిల్ 24, ఉదయం మన 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో "అల్లామాలిక్ మన తండ్రి. ఏ జ్వరమైనా, ఎటువంటి గడ్డ అయినా దానంతట అదే తగ్గిపోయి తప్పక హాయి కలుగుతుంది" అన్న సాయి వచనం వచ్చింది. అది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. సరిగా 10 రోజులుకి రిపోర్ట్ వచ్చింది. మా బావగారికి ఫోన్ చేస్తే, "రిపోర్ట్ నార్మల్ వచ్చింద"ని చెప్పారు. నాకు చాలా ఆనందమేసింది.


ఒకరోజు ల్యాండ్ రిజిస్ట్రేషన్ విషయంగా స్లాట్ బుక్ చేసుకోవటానికి పట్టా పాస్‌బుక్ అవసరమై వెతికితే కనబడలేదు. అప్పుడు నేను, 'శ్రీసాయి సూక్ష్మాయ నమః' అని స్మరిస్తూ, "పాస్ బుక్ దొరికేలా చూడండి బాబా" అని అనుకున్నాను. బాబా దయవల్ల వెంటనే దొరికింది. "ధన్యవాదాలు బాబా. అడిగిన వెంటనే మీరు మా కోరికలు నెరవేరుస్తున్నారు బాబా. మమ్మల్ని ఎల్లప్పుడు రక్షించే బాధ్యత మీదే సాయినాథా. అన్నవదినలకి తరుచు గొడవలు వస్తున్నాయి బాబా. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎలాంటి గొడవలు లేకుండా అన్నవదిన, ఇంకా మా కుటుంబమంతా అన్యోన్యంగా, ప్రేమగా, కలిసిమెలిసి ఆనందంగా ఉండేలా చూడండి బాబా. భూ వివాదాలతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా సులభంగా సమస్యను పరిష్కారించండి బాబా. ప్లీజ్ బాబా. నేను పూర్తిగా మీ మీదనే ఆధారపడ్డాను. నాకు సర్వమూ మీరే సాయినాథా".


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!

సర్వేజనా సుఖినోభవంతు!!!


బాబా రక్షణలో

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!! 

సాయి భక్తులందరికీ నమస్కారం. నా పేరు శిరీష. నేను ఇప్పుడు పంచుకోబోయే అనుభవం చిన్నదే అయినా బాబా మీద పూర్తి నమ్మకముంచి మనం ఏ పని చేసినా అది పూర్తిగా సఫలీకృతమవుతుందని తెలియజేసే అనుభవం. కరోనా మొదటిసారి వచ్చినపుడు బాబా పారాయణ గ్రూపులోని ప్రతిఒక్కరూ 108సార్లు సాయి నామజపం చేసి, గోధుమపిండిని వాకిలి ముందు చల్లమని మెసేజ్ పెట్టారు. నేను బాబా మీద పూర్తి నమ్మకంతో వారం రోజులు సాయి నామజపం చేసి గోధుమపిండిని మా గుమ్మం ముందు చల్లాను. అలాగే రెండవసారి, మూడవసారి కరోనా విజృంభించినప్పుడు కూడా నేను గోధుమపిండిని గుమ్మం ముందు చల్లాను. మొదటి వేవ్‍లో మా అపార్ట్మెంట్‍లో ఎవ్వరికీ కరోనా రాలేదు కానీ, రెండో వెవ్‍లో మా ప్రక్క ఇంట్లో వాళ్లకి, పైన ఉన్న వాళ్లందరికీ కూడా కరోనా వచ్చింది. అసలే మావారు మెడికల్ డిపార్ట్మెంట్‍లో పని చేస్తున్నందువల్ల నాకు చాలా భయమేసింది. కానీ బాబా మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన నిజం చేశారు. మూడు వేవ్‍ల్లోనూ కరోనా మా ఇంటి దరిచేరకుండా చేసి బాబా మమ్మల్ని కాపాడారు. గోధుమపిండి చల్లి బాబా నామజపం చేయడం వల్లనే కరోనా నుండి మేము రక్షించబడ్డామని నా నమ్మకం. "ధన్యవాదాలు బాబా".

నేను రెండో డోస్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఒకరోజు తరువాత నాకు బాగా జ్వరం వచ్చింది. వాసన కూడా తెలియలేదు. అప్పుడు నేను, "బాబా! మీరే నన్ను రక్షించాలి" అని అనుకుని సాయి సచ్చరిత్ర పుస్తకం దగ్గర పెట్టుకుని, బాబా ఊదీ నీళ్ళలో కలుపుకుని త్రాగి విడిగా ఒక గదిలో పడుకున్నాను. తెల్లవారుఝామున 3గంటలకి కూడా 103 డిగ్రీల జ్వరం, ఒళ్ళునొప్పులు అలాగే ఉన్నాయి. నేను 'సాయిరామ్ సాయిరామ్' అని బాబా నామజపం చేసుకుంటూ పడుకున్నాను. తెల్లవారేసరికి జ్వరం, ఒళ్ళునొప్పులు పూర్తిగా తగ్గిపోయాయి. అది బాబా దయేనని నా నమ్మకం. "ఇలాగే మా కుటుంబాన్నీ సదా మీ రక్షణలో ఉంచుకుని కాపాడు సాయి". చివరిగా చిన్న చిన్న అనుభవాలను కూడా ప్రచురిస్తూ బాబాపట్ల శ్రద్ధ, సబూరీలను పెంచుతున్న ఈ బ్లాగు నిర్వాహకులకు నా కృతజ్ఞతలు.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కి జై!!!

నొప్పి తగ్గేలా అనుగ్రహిస్తున్న బాబా

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

సాయి పాదారవిందాలకు శతకోటి వందనాలు. నా పేరు శ్రీదేవి. ఒకరోజు గాలివాన ప్రారంభమై గాలికి తలుపులు కొట్టుకోసాగాయి. అమ్మ తలుపులు వేయడానికని వెళ్లి కింద పడిపోయి మోకాళ్ళ దగ్గర బాగా నొప్పి వచ్చింది. ఆ కారణంగా అమ్మ బాత్రూమ్‌కి వెళ్ళాలన్నా చాలా కష్టపడేది. ఆమె వయస్సు 75 సంవత్సరాలు. నేను అమ్మతో, "బాబా ఊదీ రాసుకో, నొప్పి తగ్గుతుంది" అని చెప్పాను. అమ్మ అలాగే చేసింది. బాబా దయవల్ల ఊదీ రాసిన తర్వాత అమ్మ కొంచెం కొంచంగా నడవగలిగింది. నేను, "బాబా! అమ్మకి ఎటువంటి ఫ్రాక్చర్ లేకుండా చూడండి" అని బాబాను ప్రార్థించాను. తరువాత అమ్మని హాస్పిటల్‌కి తీసుకుని వెళితే, డాక్టర్ ఎక్స్ రే తీసి ఎటువంటి ఫ్రాక్చర్ లేదని, కొన్ని మందులిచ్చి పంపించారు. వాటితో ఇంకాస్త నొప్పి తగ్గింది. "ధన్యవాదాలు బాబా. అమ్మకి పూర్తిగా నయమయ్యేలా అనుగ్రహించండి తండ్రి".

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!

సాయిభక్తుల అనుభవమాలిక 1189వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయతో ఏదైనా సజావుగా సాగుతుంది
2. సమస్య నుంచి గట్టెక్కించిన బాబా
3. కంటిచూపు తిరిగిచ్చిన సాయితండ్రి

బాబా దయతో ఏదైనా సజావుగా సాగుతుంది

"బాబా! మీకు శతకోటి వందనాలు". 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు సభ్యులకు నా ప్రణామాలు. నాపేరు కృష్ణవేణి. నేను ఇదివరకు కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. నేను ఇదివరకు పంచుకున్న ఒక అనుభవంలో నా భర్త రెండేళ్ళుగా కంటి సమస్యతో ఇబ్బందిపడుతున్నారని, చికిత్సకోసం హాస్పిటల్‍కి వెళ్తే, అక్కడ "నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడ ఉంటాన"ని బాబా దర్శనం ఇచ్చారని, ఆయన కృపతో 2022, మార్చి రెండో వారంలో మావారి ఒక కంటికి సర్జరీ అయిందని పంచుకున్నాను. ఇటీవల మావారి రెండో కంటి సర్జరీ కూడా బాబా దయవల్ల మంచిగా జరిగింది. "థాంక్యూ సో మచ్ బాబా".

ఈమధ్య మా బాబుకి పరీక్షలు ఉండగా నేను, "బాబా! బాబుకి పరీక్షల్లో మంచి మార్కులు వస్తే, బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అయితే బాబు మొదటి పరీక్ష రోజే మావారి కంటికి సర్జరీ జరిగే రోజు అయింది. అందువలన మేము బాబుని సరిగా చదివించలేకపోయాము. వాడు ఆరోజు పరీక్షకి వెళ్లనని బాగా ఏడ్చాడు. అప్పుడు నేను, "బాబు మనసు మార్చండి బాబా" అని బాబాను ప్రార్థించాను. ఆశ్చర్యంగా బాబు పరీక్షకి వెళ్ళడానికి సరే అన్నాడు. బాబా దయవల్ల బాబుకి పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి. "థాంక్యూ సో మచ్ బాబా. మీకు శతకోటి వందనాలు తండ్రి".

నేను ఈమధ్య మా కజిన్ పెళ్లికి వెళ్లాలని బయలుదేరినప్పుడు హఠాత్తుగా నాకు కడుపునొప్పి వచ్చింది. అప్పుడు నేను, "బాబా! మీ దయతో నొప్పి తగ్గి, ఏ ఇబ్బందీ లేకుండా నేను పెళ్ళికి వెళ్లి రాగలిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయతో నొప్పి తగ్గింది. దాంతో సంతోషంగా పెళ్ళికి వెళ్లి వచ్చాను. "పెళ్ళికి వెళ్లేలా చేసినందుకు థాంక్యూ సో మచ్ బాబా".

సమస్య నుంచి గట్టెక్కించిన బాబా

ఓం సమర్ధ సద్గురు శ్రీసాయినాథాయ నమః!!! 

'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు, సాటి సాయి బంధువులకు ననమస్కారాలు. నా పేరు రమాదేవి. ఒకసారి మావారి ఏ.టి.ఎమ్ కార్డు కనపడలేదు. ఎంత వెతికినా దొరకలేదు. అప్పుడు నేను, "ఏ.టి.ఎమ్ కార్డు కనపడితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. అంతకుముందు ఎంత వెతికినా దొరకనిది బాబాకి చెప్పుకోగానే దొరికింది. కానీ నేను నా అనుభవాన్ని పంచుకోలేదు.

తరువాత మా వారికి మోషన్ ప్రాబ్లమ్ వచ్చి రెండు రోజులైనా విరోచనం కాలేదు దాంతో మావారు నరకం అనుభవించారు. ఒళ్ళంతా చెమటలు పట్టేసి, నీరసంతో నోట మాట కూడా రాలేదు. అసలే మావారికి న్యూరలాజికల్ ప్రాబ్లమ్ ఉంది. అందువల్ల ఆయనని హాస్పిటల్‍కి తీసుకుని వెళదామనుకున్నాను. అయితే పిల్లలు ఎవరూ మా దగ్గర లేనందున హాస్పిటల్‍కి వెళ్ళడానికి భయమేసి చిట్కా వైద్యాన్ని ప్రయత్నించాను. కానీ ఎటువంటి లాభమూ లేకపోయింది. ఇప్పుడెలా అని బాబా దగ్గరకెళ్ళి, "స్వామీ! గతంలో నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని పంచుకోలేదు. అందుకు నన్ను క్షమించి మావారికి ఏ సమస్య లేకుండా మోషన్ అయ్యేలా అనుగ్రహించండి. అది జరిగితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని దణ్ణం పెట్టుకున్నాను. తరువాత బాబా దయవల్ల నాకు ఒక విషయం గుర్తు వచ్చింది. నా చిన్నప్పుడు ఒకసారి అమ్మకి ఇలాగే ఐతే కాఫీలో ఆముదం కలుపుకుని త్రాగితే సమస్య తీరింది. వెంటనే నేను మావారికి కాఫీలో ఆముదం వేసి ఇచ్చాను. ఒక్క గంటకల్లా మావారికి మోషన్ అయ్యింది. బాబా దయవల్లే సమస్య నుంచి మావారు గట్టెక్కారు. "ఈ సమస్య నుంచి కాపాడినందుకు ధన్యవాదాలు బాబా. అలాగే మా కష్టాలన్నీ తీర్చు స్వామి. ఇంకెప్పుడూ ఇదేముందిలే, ఇది వ్రాస్తే బాగుండదేమో అని అనుకోకుండా 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో నా అనుభవాలను పంచుకుంటాను. తప్పులుంటే క్షమించండి బాబా".

కంటిచూపు తిరిగిచ్చిన సాయితండ్రి
 
'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగును నిర్వహిస్తున్న బృందానికి, సాటి సాయిభక్తులకు నా హృదయపూర్వక నమస్కారం. నేనొక సాయిభక్తురాలిని. నా పేరు స్వాతి. మాది ఏలూరు. నేను మొట్టమెదటిసారిగా బాబా నాకు ప్రసాదించిన నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటున్నాను. సంవత్సరంన్నర క్రితం నా కళ్ళు సరిగ్గా కనబడట్లేదని అనుమానం వచ్చి హాస్పిటల్‍కి వెళ్ళాను. డాక్టరు, "కళ్లకి ఇన్ఫెక్షన్ ఉంది. శుక్లాలు కూడా ఉన్నాయి" అని ఐ డ్రాప్స్ ఇచ్చారు. వాటిని వాడినా నా కంటిచూపులో ఏ మార్పులేదు. అయినా ఆ ఐ డ్రాప్స్ తోపాటు రోజూ కళ్ళకి బాబా ఊదీ కూడా రాసుకుంటూ ఇంకో హాస్పిటల్‍కి వెళ్ళాను. ఆ డాక్టరు కూడా, "ఇన్ఫెక్షన్ ఉంది" అని రెండు కళ్ళకి ఇంజక్షన్ చేసారు. అయినాసరే, కంటిచూపులో మార్పులేదు. బాబా నాకు పెడుతున్న పరీక్ష అనుకుని ఇంకో హాస్పిటల్‌కి వెళితే, టెస్టులు చేసి, "పవర్ఫుల్ స్టెరాయిడ్స్ లేదా క్యాన్సర్‌కి వాడే మెడిసిన్ వాడాలి" అన్నారు. అయితే ఈసారి నేను ఆ మందులు ఏవీ వాడలేదు. ఎందుకంటే, నా సాయితండ్రి మీద 'ఆయన నాకు అన్యాయం చేయడన్న' పూర్ణ విశ్వాసం. అయితే రోజురోజుకు కంటిచూపు క్షీణిస్తూ వచ్చింది. సాయి సచ్చరిత్ర కూడా చదవలేకపోయేదాన్ని. ఇలా కొన్నిరోజులు గడిచాక నాకు 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు గురించి తెలిసింది. దాంట్లోని కంటిచూపుకు సంబంధించిన ఒక భక్తుని అనుభవం గురించి విన్నాక, "బాబా! నాకు కంటిచూపు వస్తే, నా అనుభవాన్ని మీ ఈ బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను ప్రార్థించాను. కొన్నిరోజులకి ఊహించని విధంగా మా చుట్టాలలో ఒక ఆయన మాఇంటికి వచ్చారు. నా పరిస్థితిని చూసి నన్ను హైదరాబాద్‌లోని ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్‌కి వెళ్ళమని సలహా ఇచ్చారు. ఇంకా ఆయనే 2022, ఏప్రిల్ 9కి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. ఎక్కడికి వెళ్లినా సచ్చరిత్ర తీసుకుని వెళ్లడం నాకలవాటు. ఆరోజు కూడా సచ్చరిత్ర తీసుకుని హైదరాబాద్‌కి ప్రయాణమయ్యాను. దారిలో హఠాత్తుగా సచ్చరిత్ర చదవాలనిపించి, పుస్తకం తెరిస్తే, 19వ అధ్యాయం వచ్చింది. నేను ఆ అధ్యాయం అంతా చదవగలిగాను(నేను సచ్చరిత్ర చదివి అప్పటికి సంవత్సరంపైనే అవుతుంది). నా కళ్ళ నిండా నీళ్లు కమ్ముకున్నాయి. బాబా నాతోనే ఉన్నారన్న విశ్వాసం మరింత బలపడింది. హాస్పిటల్‌కి వెళ్ళాక డాక్టరు పరీక్షించి, "ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోయింది. ఒక కన్నుకి ఆపరేషన్ చేయాలి" అన్నారు. తరువాత గురువారం ఆపరేషన్ అనడంతో బాబాపై నాకున్న విశ్వాసం ధృఢపడింది. బాబా ఆశీస్సులతో ఆపరేషన్ బాగా జరిగింది. తర్వాత కన్ను బాగా నొప్పి వచ్చినప్పుడు నేను ఎక్కువ సమయం సాయి నామస్మరణలో ఉన్నాను. నా నొప్పి అంతా బాబా తీసుకున్నారు. నాకు నొప్పి తగ్గింది. వారం తర్వాత మళ్ళీ గురువారంనాడు నా రెండవ కన్నుకి ఇంజక్షన్ ఇచ్చారు. నా కంటిచూపు కొంచం కొంచంగా మెరుగుపడసాగింది. చూపు వచ్చాక నేను వ్రాసిన మొదటి అక్షరాలు ఈ అనుభవమే. దీని ద్వారా ఈ బ్లాగుకున్న శక్తిని బాబా నాకు తెలియచేసారు. ఆయన నాకు ప్రసాదించిన అనుభవాలు ఒకటా, రెండా! వాటిలో నుండి ఏది ఈ బ్లాగులో పంచుకోవాలో అర్ధం కావట్లేదు. ఆ భారాన్ని బాబా మీదే వేసాను. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు తండ్రి".

సాయిభక్తుల అనుభవమాలిక 1188వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి అనుగ్రహాశీస్సులు
2. మనసు పెట్టి అడగాలేకాని అన్నీ ఇస్తారు బాబా
3. తెల్లజిల్లేడు పాలు కంట్లో పడినా ఏ సమస్య లేకుండా కాపాడిన సాయి

శ్రీసాయి అనుగ్రహాశీస్సులు


ఈ బ్లాగు నిర్వాహకులకు మరియు బ్లాగుని ప్రతిరోజు చదువుతున్న వారికి నా నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. మేము యూరప్‌లో నివాసముంటున్నాము. ఇటీవల రెండు సంవత్సరాల తొమ్మిది నెలల వయస్సున్న మా సాయికి జ్వరం వచ్చింది. ఒకే నెలలో జ్వరం రావడం తనకది మూడోసారి కావడం వల్ల నాకు భయమేసి, "బాబా! మీ దయవల్ల బాబుకి జ్వరం తగ్గితే, మీ బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. తరువాత బాబా దయవల్ల మా సాయికి జ్వరం తగ్గింది. ఆ తరువాత కొన్నిరోజులకు నాకు జ్వరం వచ్చింది. అప్పుడు నేను బాబాను తలుచుకుని, "నాకు కూడా జ్వరం తగ్గితే, బ్లాగులో పంచుకుంటాను తండ్రి" అని అనుకున్నాను. బాబా దయవల్ల నాకు కూడా జ్వరం తగ్గింది. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".


ఒకరోజు మాబాబు మా ఇంట్లోని బెడ్ రూమ్ తాళం ఎక్కడో పెట్టేశాడు. దాని అవసరం చాలా ఉంది. పైగా ఆ తాళం చాలా ఖరీదైనది. అది పోతేగనక ఆ మొత్తాన్ని మేము ఇంటి యజమానికి చెల్లించాల్సి వస్తుంది. నేను అన్నిచోట్లా చాలాసేపు వెతికానుకానీ, ఆ తాళం కనిపించలేదు. అదింక దొరకదేమో అని బాధగా అనిపించి, "బాబా! తాళం దొరికితే, బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. అలా చెప్పుకున్న పది నిమిషాల్లో మావారికి ఆ తాళం దొరికింది. అలాగే ఇంకోసారి బాబు ఆ తాళం ఎక్కడ పడేసాడో తెలియలేదు. నేను మరలా బాబాకి, "మీ దయతో ఈసారి కూడా తాళం దొరికితే, బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పికున్నాను. బాబా దయవల్ల వెంటనే నాకు ఆ తాళం మా ఇంటి గార్డెన్‍లో కనిపించింది. మామూలుగా అయితే గడ్డిలో తాళం అంత సుళువుగా కనపడదు. అలాంటిది అంతా త్వరగా కనపడిందంటే అది కేవలం బాబా అనుగ్రహం వల్లే. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ దయ నాపై, భక్తులందరిపై ఉండాలని కోరుకుంటున్నాను బాబా".


ఈమధ్య ఒకరోజు నేను, మావారు, మా బాబు సాయి ముగ్గురమూ కలిసి ఒక షాపుకి వెళ్ళొచ్చాము. తరువాత మావారు మాతో చెప్పకుండా మళ్లీ బయటకి వెళ్ళారు. సాయంకాలం కదా, కాసేపు అలా బయటకి వెళ్లుంటారని ప్రశాంతంగా ఉన్నాను. కానీ కొంత సమయం అయినా ఆయన తిరిగి రాకపోయేసరికి టెన్షన్‍గా అనిపించింది. ఫోన్ చెద్దామంటే, ఆయన తన మొబైల్ ఇంట్లోనే వదిలేశారు. కాస్త భయమేసి, "బాబా! మీ దయవల్ల ఎలాంటి సమస్య లేకుండా మావారు త్వరగా ఇంటికి వస్తే, బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల తొందరగానే మావారు ఇంటికి వచ్చారు. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".


ఇంకోసారి 2022, మే 1న నా భర్త కూరగాయల మార్కెట్‍కి వెళ్ళారు. మామూలుగా మార్కెట్‍కి వెళ్లి రావడానికి రెండు గంటల సమయం పడుతుంది. అలాంటిది ఆరోజు 4 గంటల సమయమైనా ఆయన తిరిగి రాలేదు. ఫోన్ ఇంటి దగ్గరే వదిలేసినందున ఆయనని సంప్రదించడానికి కూడా లేదు. నాకు చాలా టెన్షన్‍గా అనిపించి, "బాబా! నా భర్త ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా త్వరగా ఇంటికి వస్తే, బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల కాసేపటికి మావారు ఇంటికి వచ్చారు. ఆయనకి ఎలాంటి ప్రాబ్లమ్ కాలేదు. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".


బాబా అనుగ్రహంతో ఇటీవల నా ప్రెగ్నెన్సీ నిర్థారణ అయింది. మేము ఉండే చోట ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని టెస్టులు చేస్తారు. అలా టెస్టులు చేసినప్పుడు నేను, 'టెస్టు రిపోర్టులన్నీ నార్మల్ అని వస్తే, బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల రిపోర్టులు నార్మల్ అని వచ్చాయి. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్. మీ ఆశీస్సులు మాకు ఎల్లపుడూ ఉండాలని కోరుకుంటున్నాను సాయి".


మేము ఇటీవల బెల్జియం నుంచి ఇండియాకి ప్రయాణం చేయాల్సి వచ్చింది. గతంలో ప్రయాణ సమయంలో మేము చాలా సమస్యలు ఎదురుకున్నందున నేను, "ఈసారి ప్రయాణమంతా ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటే, బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా మా ప్రయాణం సాగింది. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".


మనసు పెట్టి అడగాలేకాని అన్నీ ఇస్తారు బాబా


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!! శ్రీసాయినాథుని పాదపద్మములకు నా ప్రణామాలు. సాయి బంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు ఇంకో రెండు అనుభవాలతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను. 2022, ఏప్రిల్ 11వ తారీకున మా పాపని కొత్త కాపురానికి పంపించాలని 10వ తారీఖున అన్ని సర్దుకుంటున్నాము. నగలు కూడా సర్దుదామని బీరువా తీసి పాప వస్తువులన్నీ సర్దుతుంటే, ఒకే చోట పెట్టిన రెండు చెవి బుట్టలలో ఒకటి కనిపించలేదు. నేను 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అనే నామాన్ని స్మరిస్తూ ఇల్లంతా చాలాసేపు వెతికినా ఆ చెవిబుట్ట కనిపించలేదు. దాంతో మావారికి ఫోన్ చేసి, "లాకర్‍‍‍‍లో పెట్టామా?" అని అడిగితే, ఆయన "లేదు" అన్నారు. అప్పుడు, "సాయినాథా! చెవిబుట్ట దొరికితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకుని మరోసారి వెతుకుదామని బీరువా దగ్గరకు వెళ్ళాను. చాలా ఆశ్చర్యంగా బీరువా దగ్గరే ఆ చెవిబుట్ట దొరికింది. పొద్దుటినుండి చాలాసార్లు వెతికినా దొరకనిది, బాబాకి చెప్పుకోగానే దొరికింది. "చాలా చాలా ధన్యవాదాలు సాయి".


2022, ఏప్రిల్ నెల మూడో వారంలో నా ఫోన్ పని చేయలేదు. టచ్ పోయిందేమో అనుకున్నాను. ఈ మధ్యనే కొన్న ఫోన్ అలా అయ్యేసరికి ఏమి చేయాలో అర్థంకాక సాయిబాబాని తలుచుకుని బాబా ఊదీ ఫోన్‍కి పెట్టి, "బాబా! ఈ ఫోన్ మళ్ళీ పనిచేస్తే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల సాయంత్రానికి ఫోన్ మళ్ళీ మామూలుగానే పని చేసింది. మనం మనసు పెట్టి సాయినాథుని అడగాలేకాని వారు అన్నీ మంచిగా చేస్తారు. "సాయినాథా! మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే కాపాడుతూ ఉండండి. మమ్మల్నే కాదు, అందరినీ చల్లగా చూడండి సాయినాథా. నా అనుభవాలను ఆలస్యంగా పంచుకున్నందుకు క్షమించండి బాబా".


ఓం శ్రీసాయినాథాయ నమః!!!


తెల్లజిల్లేడు పాలు కంట్లో పడినా ఏ సమస్య లేకుండా కాపాడిన సాయి


నేనొక సాయి భక్తురాలిని. ముందుగా సాయి భక్తులకు, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నమస్కారం. ఒకరోజు నేను తెల్లజిల్లేడు పూలు కోస్తున్నప్పుడు అనుకోకుండా ఆ చెట్టు పాలు నా కంట్లో పడ్డాయి. దాంతో కన్ను నుండి నీరు కారటం, మసక బారటం జరిగింది. తెలిసినవాళ్ళు 'తెల్లజిల్లేడు పాలు కంట్లో పడితే ప్రమాదమని, కంటిచూపు పోతుందని' చెప్పారు. నాకు భయమేసి, "బాబా! నా కంటికి ఏమీ కాకూడదు. మామూలుగా తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల మరునాటికల్లా సమస్య తగ్గింది. "సాయి మహరాజుకు దన్యవాదాలు".


సాయిభక్తుల అనుభవమాలిక 1187వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. థాంక్యూ బాబా
2. బాబాకి నా మీద ఎంత ప్రేమో! 
3. బాబా కృప అనంతమైనది

థాంక్యూ బాబా


సాయి భక్తులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. ఒకసారి నేను ఈ బ్లాగులో ఒక అనుభవం చదివాను. ఆ అనుభవంలో ఒక భక్తురాలు తన బిడ్డకి తలనొప్పి వస్తే, టాబ్లెట్ ఇచ్చి, బాబా ఊదీ పెట్టి నిద్రపుచ్చింది. తెల్లవారిలేచేసరికి ఆ పిల్లాడి తలనొప్పి తగ్గిపోయింది. అది చదివాక నేను అజ్ఞానం కొద్ది నా మనసులో, 'టాబ్లెట్ వేస్తే, ఎలాగూ తగ్గిపోతుంది కదా!' అని అనుకున్నాను. అక్కడికి రెండు, మూడురోజులకి నాకు తలనొప్పి వచ్చింది. ఎంతకూ తగ్గలేదు. చివరికి టాబ్లెట్ వేసిన తగ్గలేదు. అప్పుడు ఆ భక్తురాలి అనుభవం విషయంలో నేను నా మనసులో అనుకున్న మాట గుర్తొచ్చి, "బాబా! నా అజ్ఞానాన్ని క్షమించు. ఇంకెప్పుడూ ఇలాంటి బుద్ధినివ్వకు తండ్రి. మీ దయతో నా తలనొప్పి తగ్గిపోవాలి" అని బాబాతో చెప్పుకున్నాను. అక్కడికి కొద్దిసేపటికి నా తలనొప్పి తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా". మనం సాయి భక్తులం అయినప్పటికీ ఒక్కోసారి బాబా యందు సందేహం తలెత్తుతుంది. అది బాబా మనకి పెట్టే పరీక్షేమో!


2022, ఏప్రిల్ 30, శనివారంనాడు నేను నా ఆఫీసు లాప్టాప్‍ను ఇంటికి తీసుకొచ్చాను. తరువాత 2022, మే 2, సోమవారంనాడు ఆఫీసుకి వెళ్లేప్పుడు ఆ లాప్టాప్ తీసుకుని వెళ్ళాను. ఆఫీసుకి చేరుకున్నాక హడావుడిలో బైక్‍కి ఉన్న లాప్టాప్ బ్యాగును తీసుకోవడం మర్చిపోయి రెండు అంతస్తుల పైకి ఎక్కేసాను. అప్పుడు లాప్టాప్ గుర్తుకు వచ్చి పార్కింగ్ ప్రదేశానికి పరుగెత్తాను. వెళ్తూ దారిలో, "బాబా! మీ గుడికి వస్తాను, లాప్టాప్‍తో ఉన్న బ్యాగు పోకుండా చూడు తండ్రి" అని బాబాకి మొక్కుకున్నాను. కిందికి వెళ్లి చూస్తే, బ్యాగు బండికి అలాగే ఉంది. ఇది బాబా ప్రసాదించిన అధ్భుతమైన అనుభవం. నేనైతే ఆ బ్యాగు పోతుందనుకున్నాను. ఎందుకంటే, అక్కడ చాలా జనం ఉన్నారు. నేను పైకి వెళ్లి కిందకి వచ్చేంతవరకు బ్యాగు అక్కడే ఉందంటే అది కేవలం బాబా కృపే. నేను మా ఆఫీసులో ఏ డాక్యుమెంట్ కనిపించకపోయినా బాబానే తలచుకుంటూ ఉంటాను. ఆయన కృపతో అవి వెంటనే దొరుకుతున్నాయి. కొన్నిరోజుల క్రితం ఒక ముఖ్యమైన ఫైల్ దొరకలేదు. నేను, "బాబా! ఆ ఫైల్ దొరికాలి" అని బాబాకి చెప్పుకున్నాను. వెంటనే ఆ ఫైల్ దొరికింది. ఇలా నా జీవితంలో బాబా కార్తవీర్యార్జునునిలా పోయినవన్నీ తిరిగి దొరికేలా చేస్తున్నారు. "థాంక్యూ బాబా".

 

మనకోసం మాత్రమే కాదు, పక్క వారికోసం కోరుకున్న వాటిని కూడా బాబా తీరుస్తారు. ఇటీవల నా స్నేహితురాలు ఒక పరీక్ష వ్రాసింది. తను ఆ పరీక్ష పాస్ అయితే, తనకి ఉద్యోగం వస్తుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి కొంచెం బాగుపడుతుంది. అందువలన నేను బాబాని ప్రార్థించి, "నా స్నేహితురాలికి ఉద్యోగం రావాల"ని వేడుకున్నాను. బాబా అద్భుతం చేశారు. నా స్నేహితురాలు ఆ పరీక్షలో పాస్ అయ్యి మంచి ఉద్యోగం తెచ్చుకుంది. "ధన్యవాదాలు బాబా".


బాబాకి నా మీద ఎంత ప్రేమో! 


అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!


సాయి బంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. మొదటిసారి మీ అందరితో నా అనుభవాలను పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కొన్నిరోజుల క్రితం రోజూ పడుకునే సమయంలో, "బాబా! నిన్ను చూడాలని ఉంది. నన్ను శిరిడీకి రప్పించుకోండి, ప్లీజ్ బాబా" అని బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఇలా ఉండగా ఒకరోజు మా బంధువైన ఒక ఆంటీ మా ఇంటికి వచ్చారు. నేను ఆ సమయంలో పని చేసుకుంటున్నాను. ఆవిడ టీ తాగుతూ మా అమ్మతో మాట్లాడుతుంది. ఆ మాటల మధ్యలో ఆవిడ, "రేపు మేము శిరిడీ వెళ్తున్నాము" అని చెప్పింది. ఆ మాట వింటూనే నేను ఆవిడతో, "నేను కూడా మీతో శిరిడీ వస్తాను" అని అడిగాను. అందుకు ఆవిడ, "సరే, నువ్వు కూడా మాతో రా, నిన్ను మేము శిరిడీ తీసుకెళతాము" అన్నారు. 'బాబా నాకోసం ఆవిడను మా ఇంటికి పంపించారు. ఆయనకి నా మీద ఎంత ప్రేమో!' అని నాకు చెప్పలేనంత ఆనందమేసింది. వెంటనే నేను బాబా ఫోటో దగ్గరకి వెళ్ళి బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు సాయి. ఐ లవ్ యు సో మచ్ బాబా. మా అమ్మానాన్నలకు అన్ని విషయాలలో తోడుగా ఉండండి బాబా".


మా నాన్నగారు సౌదీలో ఉంటారు. 2022, మే నెల ఆరంభంలో నాన్న వారం రోజులుగా తను దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నానని చెప్పారు. అప్పుడు నేను బాబా పాదాల వద్ద ఉన్న విభూది తీసుకుని నా నుదుటన పెట్టుకుని, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని 108 సార్లు స్మరించి, "బాబా! నాన్నగారి దగ్గు, జలుబు, జ్వరం మీరే తగ్గించండి" అని బాబాతో చెప్పుకున్నాను. తరువాత నాన్న ఫోన్ చేసి తనకి జ్వరం తగ్గిందని చెప్పారు. "థాంక్యూ సో మచ్ బాబా. ఎల్లప్పుడూ నాన్నకి తోడుగా ఉండి అన్ని విషయాలలో సహాయం చేయండి సాయి".


ఇంకోరోజు మా అమ్మ తనకు బాగా తలనొప్పిగా ఉందని నాతో చెప్పింది. నేను బాబా దగ్గరకి వెళ్లి, కొద్దిగా ఊదీ నీళ్లలో కలిపి బాబా చేతికి తాకిచ్చి ఆ ఊదీ తీర్థాన్ని అమ్మతో త్రాగించాను. ఉదయం లేచేసరికి తలనొప్పి తగ్గిపోయింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


బాబా కృప అనంతమైనది


నేను ఒక సాయి భక్తురాలిని.  నేను అంటే గిట్టని కొంతమంది నా బట్టలకు ఏదో మందు రాశారు. ఆ విషయం తెలియని నేను బయటికి వెళ్లాల్సిన పని పడటంతో ఆ బట్టలు వేసుకుని వెళ్లి, బస్సు ఎక్కాను. కాసేపటికి దురద మొదలైంది. ఎంతటి దురద అంటే ఎంతకీ తగ్గలేదు. దారిలో సాయిబాబా గుడి కనిపిస్తే, "సహాయం చేయమ"ని బాబాను అడిగాను. తరువాత బస్టాండ్‍లో ఒక పౌడర్ డబ్బా కొనుక్కుని, దురద ఉన్న చోట పౌడర్ రాసాను. అయినా దురద తగ్గలేదు. తరువాత మంచినీళ్లకోసం బస్టాండ్ నుంచి బయటికి వస్తుంటే, సాయిబాబా బండి కనపడింది. వాళ్లకు ఒక అయిదు రూపాయలు ఇచ్చి, దణ్ణం పెట్టుకున్నాను. వాళ్లలో ఒకతను ఒక విభూది ప్యాకెట్ ఇచ్చాడు. నేను అది తీసుకుని వెళ్లి బస్సు ఎక్కాను. ఆ విభూది రాసుకోగానే దురద మాయమైంది. మాటల్లో చెప్పలేనంత దురద ఇట్టే పోవడంతో నేను ఆశ్చర్యపోయాను. బాబా కృప అనంతమైనది. "బాబా! మీ ప్రేమకు నా ధన్యవాదాలు".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo