సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సమస్యలు చిన్నవైనా, పెద్దవైనా బాబాపై పూర్తి విశ్వాసం ఉంచండి.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

సింగపూర్ నుండి పేరు వెల్లడించని సాయిభక్తురాలు  తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.

మొదటి అనుభవం:

మేము యు.కే. లో ఉన్నప్పుడు మా రెండవ బాబు పుట్టే సమయంలో నాకు చాలా ఆరోగ్యసమస్యలు ఎదురయ్యాయి. దానికి తోడు పుట్టుకతోనే బాబుకి పలురకాల అలర్జీ సమస్యలు. నాకున్న సమస్యలకి, వాడి సమస్యకి అసలు కుదిరేది కాదు. వాడికి ఏ ఫుడ్ పడుతుందో, ఏది పడదో అస్సలు అర్థంకాక, తనకి ఫుడ్ ఇవ్వాల్సిన ప్రతిసారీ చాలా ఆందోళనగా ఉండేది. ఈ ఆందోళనల వలన నా ఆరోగ్యం ఇంకా దెబ్బతింది. దానివలన నాకు చాలా  శస్త్రచికిత్సలు  చేయాల్సి వచ్చింది. నేను రోజూ బాబాని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. కొద్దిరోజుల్లో బాబా కృపవలన తన అలర్జీకి ఏవి కారణం అవుతున్నాయో తెలియడంతో నిదానంగా పరిస్థితులు చక్కబడ్డాయి.  ఇప్పటికీ తనకి పాల ఉత్పత్తులు, గోధుమలు, గుడ్లు,  వేరుశనగ వంటి గింజలు పడవు.  పొరపాటున ఏమాత్రం ఆ పదార్థాలు తనకి అందుబాటులో ఉన్నా చాలా రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. ఆ సమస్య ముందు మృత్యువు చాలా చిన్నది అనిపిస్తుంది. కానీ నాకు బాబాపట్ల పూర్తి విశ్వాసముంది. ఆయన త్వరలోనే నా బిడ్డని ఈ సమస్యలనుంచి బయటపడేస్తారు.

రెండవ అనుభవం:

క్రమంగా నేను డెలివరీ సమస్యలనుండి బయటపడుతూ సంతోషించే సమయంలో, మేము యు.కే. నుండి సింగపూర్‌కి షిఫ్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు మళ్ళీ పెద్ద సమస్య ఎదురైంది. ఒకరోజు మా పెద్దబాబు ముఖంపై తెల్లమచ్చ కనిపించింది. ఆ సమయంలో దానిని నేనంత పెద్ద విషయంగా తీసుకోలేదు. ఎందుకంటే, మావారు ఎలాగూ డాక్టర్ కాబట్టి ఆయన చూసుకుంటారనుకున్నాను. కానీ, మా దురదృష్టంకొద్దీ అది బొల్లిమచ్చగా నిర్ధారణ అయ్యింది.  ఆ వార్త వింటూనే నేను షాకై కుప్పకూలిపోయాను. ఎందుకంటే మా పెద్దబాబే మా కుటుంబంలోని సంతోషానికి కారణం.  తనకేమైనా అయితే మా జీవితాలు అంధకారమే. దిగులుతో నేను పూర్తిగా బాబాకి శరణని, "బాబా! ఆ మచ్చ ఇంకా పెద్దది కాకుండా చూడండ"ని ప్రార్థించాను. కానీ తనకి నయమైపోతుందని డాక్టర్స్ ఎవరూ నిర్ధారణగా చెప్పలేదు. అదే సమయంలో బాబా మమ్మల్ని శిరిడీకి తీసుకుని వెళ్లి, ఆ మచ్చ ఇంకా పెద్దది కాకుండా, పూర్తిగా నయమైపోయేలా చూస్తానని నమ్మకం కలిగించారు. నేను శిరిడీ వెళ్లేముందు, "బాబా! మీరు నాకు గ్రీన్ కలర్ డ్రెస్‌లో దర్శనమిస్తే, అది నా బిడ్డ విషయంలో జాగ్రత్త తీసుకుంటానని మీరు ఇచ్చే భరోసాగా తీసుకుంటాను" అని ప్రార్థించాను.  తర్వాత మేము శిరిడీ చేరుకొని దర్శనానికి క్యూలో ఉన్నప్పుడు టీవీలో చూస్తే బాబా రెడ్ కలర్ డ్రెస్‌లో ఉన్నారు. కాస్త బాధగా అనిపించినా, బాబాపై పూర్తి విశ్వాసంతో, "శిరిడీనుంచి మేము తిరిగి వెళ్లిపోయేలోపల ఖచ్చితంగా బాబా మిరాకిల్ చూపిస్తార"ని నా మనస్సులో నేను అనుకున్నాను.  అప్పటికింకా మధ్యాహ్న ఆరతికి పదినిమిషాలు టైం ఉంది. ఐదు నిమిషాల తరువాత టీవీలో చూస్తే, సమాధిమందిరంలోని పూజారి బాబా కోసం కొత్త బట్టలు తీసుకుని వెళ్తూ కన్పించారు. కొద్దిక్షణాల్లో మేము సమాధిమందిరంలో అడుగుపెట్టాము. అద్భుతం! సాయి పూర్తిగా గ్రీన్ కలర్ డ్రెస్‌లో ఉన్నారు.  అలా బాబాని చూస్తూనే నా కళ్ళలో నీళ్ళు వరదలా తన్నుకొచ్చేసాయి. అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయాను. అలా బాబా నాకు పూర్తి భరోసా కలిగించారు. తర్వాత మేము శిరిడీనుండి సింగపూర్ చేరుకున్నాం. అతికొద్దిరోజుల్లోనే బాబా కృపవలన ఆ మచ్చలు పూర్తిగా మానిపోయాయి. "ఈ ద్వారకామాయిలో కూర్చొని నేనెప్పుడూ అబద్ధం చెప్పన"ని బాబా చెప్పిన మాటలు ఎంత సత్యమో! అలనాడు శ్యామాను పాము కరిచిన సందర్భంలో విషం అతని శరీరంలో విస్తరించకుండా బాబా ఆజ్ఞాపించినట్లుగా, నా బిడ్డ విషయంలో కూడా బహుశా అలాగే ఆజ్ఞాపించి నా బిడ్డను కాపాడారు.

మూడవ అనుభవం:

ఒకసారి మావారికి బహుమతిగా వచ్చిన ఖరీదైన ఆపిల్ వాచ్ కనిపించలేదు. మేమంతా ఇంట్లో ఎంతగా వెతికినా ఎక్కడా కనిపించలేదు. నేను బాబాని ప్రార్థించిన మరుక్షణంలో సూట్‌కేస్ వెనకాల దొరికింది.

మన సమస్యలు చిన్నవైనా, పెద్దవైనా బాబాపై పూర్తి విశ్వాసం ఉంచండి, ఆయన మన ప్రార్థనలకు తప్పక సమాధానం ఇస్తారు. "బాబా! నా జీవితంలో మీరు కురిపిస్తున్న ఆశీస్సులకు నా ధన్యవాదములు. ఎప్పుడూ ఇలాగే మాకు తోడుగా ఉండండి".

సాయిభక్తుల అనుభవమాలిక - 1


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

1. సాయిభక్తురాలు చాందిని దొంతుకుర్తి గారి రీసెంట్ అనుభవం:

సాయిబంధువులందరికీ నమస్కారం. నా జీవితంలో ఇటీవల బాబా ఇచ్చిన అద్భుత అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. గత నెలలో నేను తీవ్రమైన సైనస్ సమస్యతో చాలా బాధపడ్డాను. దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉండి ముక్కు నుండి తీవ్రంగా రక్తస్రావమయ్యేది. దానితోపాటు జ్వరం కూడా రావడంతో చాలా ఇబ్బందిపడ్డాను. నేను హృదయపూర్వకంగా, "బాబా! నా వ్యాధిని నయం చేసినట్లయితే నా అనుభవాన్ని బ్లాగు ద్వారా సాయిబంధువులతో పంచుకుంటాన"ని ప్రార్థించి, బాబా ఊదీని ఔషధంగా తీసుకున్నాను. బాబా కృపవలన 3, 4 రోజుల్లో రక్తస్రావం ఆగిపోయింది. "థాంక్యూ సో మచ్ బాబా!". దయచేసి నా అనుభవాన్ని సాయిబంధువులకు అందేలా పబ్లిష్ చేయండి.

2. ఆస్ట్రేలియానుండి ఒక సాయిభక్తురాలు ఇలా చెప్తున్నారు.

ఒకసారి మా బాబుకి రోజుకు 20 కన్నా ఎక్కువసార్లు విరోచనాలు కావడంతో మేము చాలా బాధపడ్డాము. ఎన్నో మందులు వాడినా ఫలితం లేకపోయింది. ఏమి చేయాలో అర్థంకాని స్థితిలో బాబుని బాబా మందిరానికి తీసుకుని వెళ్ళి, "బాబా! బాబుకి నయం చేయండి" అని ప్రార్థించాను. వెంటనే అద్భుతం జరిగింది. అంతవరకూ ఎన్ని మందులకూ తగ్గనిది ఆ క్షణంనుండి సాయి ఆశీస్సులతో పూర్తిగా మాయమైపోయింది. "ధన్యవాదాలు బాబా!".


3. బెంగళూరునుండి పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా తెలియజేస్తున్నారు..

ఓం సాయిరామ్! బాబాతో నా అనుభవాన్ని పంచుకోవడానికి ముందు, సాయిభక్తుల అనుభవాలను పంచుకునేందుకు బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా ధన్యవాదాలు. నేను బెంగుళూరు నివాసిని. ఇటీవల నా భర్త కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. రోజూ మేము వైద్యుల వెనుక తిరుగుతుండేవాళ్ళము. కానీ ఎటువంటి ఫలితం లేకపోయేది. నేను చాలా ఆందోళనపడుతూ, "బాబా! మా వారి ఆరోగ్య సమస్యలన్నింటినీ పరిష్కరించండ"ని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. నవ గురువార వ్రతం కూడా మొదలుపెట్టాను. చివరగా మేము ఒక వైద్యుని కలవడానికి వెళ్ళాము. OPD (అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్)లోకి ప్రవేశిస్తుండగా, ఒక వ్యక్తి బాబా ఫోటో ఉన్న బ్యాగు పట్టుకొని వెళ్తుండటం నేను గమనించాను. దానితో నాకు బాబా దయవలన మేము సరైన వైద్యుడి దగ్గరకు చేరుకున్నామని నమ్మకం కలిగి, అన్ని రోజులుగా మేము పడుతున్న ఆందోళననుండి కాస్త ఉపశమనంగా అనిపించింది. అప్పటినుండి మావారి ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపించింది. "బాబా! మీకు నా ధన్యవాదాలు. మంచి నడవడి గల వ్యక్తులుగా ఉండటానికి మాకు మార్గనిర్దేశం చేయండి. మీ బిడ్డలందరికీ మీ చల్లని దీవెనలు ఇవ్వండి".

4. పాకిస్తాన్ నుండి శిరిడీ సాయిభక్తురాలు సురియా తన అనుభవాన్నిలా చెప్తున్నారు..

నేను పాకిస్తాన్ లోని కరాచీలో నివసిస్తున్నాను. నేను సాయిబాబాకు అంకిత భక్తురాలిని. ప్రస్తుతం నాకు 84 సంవత్సరాలు. నేను ముగ్గురు పిల్లలకు తల్లిని. బాబా దయవలన అమ్మమ్మని కూడా. అయితే నేను టీచర్‌గా ఉద్యోగం చేసి, ఉద్యోగ విరమణ అనంతరం ఒంటరిగా జీవిస్తున్నాను. ఒకరోజు నా ఎడమచేతి బొటనవేలుకి, అరచేతికి తీవ్రమైన నొప్పి, బాధ కలిగాయి. ఆ నొప్పిని అస్సలు భరించలేకపోయాను. నా కూతురు డాక్టరు వద్దకు తీసుకునిపోయి x-ray తీయిద్దామని అనుకుంది. కానీ నేను, "నా డాక్టరు సాయి. నేనెక్కడికీ రాన"ని తనకి చెప్పాను. నేను పడుకోవడానికి వెళ్లేముందు బాబా పటం ముందు ఉన్న కొంత బూడిద తీసుకుని, బాబాను ధ్యానించుకొన్న తరువాత దానిని బామ్‌ లో కలిపి, నొప్పి ఉన్న ప్రాంతంలో మర్దన చేసి, కట్టు కట్టుకొని నిద్రపోయాను. ఉదయాన కట్టు విప్పేసరికి నొప్పి పూర్తిగా పోయింది. ఆయన నాకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూ ఉన్నారు. "ధన్యవాదాలు బాబా. బాబా! మీ దివ్య పాదాల చెంత నాకు సదా చోటివ్వండి".
-మీ సురియా.

బాబుని వరంగా ప్రసాదించిన బాబా




నా పేరు శ్రీకాంత్. మాది ఒంగోలు. నా భార్య రెండోసారి గర్భవతి అయినప్పుడు మేము ముందు నుంచి అబ్బాయి కావాలని బాబాని ప్రార్థించాము. 2019 జనవరి 23, బుధవారంనాడు సాయంత్రం నా భార్యకి నొప్పులు మొదలు అయ్యాయి. నేను నా భార్యను హాస్పిటల్‌కు తీసుకెళ్ళాను. హాస్పిటల్లో చేరిన వెంటనే బాబా ఊదీ  నీళ్లలో కలిపి నా భార్య చేత త్రాగించాను. నొప్పులు ఎక్కువగా రావడం కోసం వైద్యులు వాకింగ్ చేయమని చెప్పారు. నా భార్య ఎంత వాకింగ్ చేసినా ఆరోజు డెలివరీ కాలేదు. నేను నా ముందు బాబా ఫోటో  పెట్టుకుని, "బాబా! మొదటిసారి లాగానే ఈసారి కూడా నార్మల్ డెలివరీ అయ్యేలా చూడండి" అని చెప్పుకుని, ఆయన స్మరణ చేస్తూ వున్నాను. మరుసటిరోజు నొప్పులు రావడానికి టాబ్లెట్స్ ఇచ్చారు. అయినా కూడా నొప్పులు రాలేదు. అలా మూడుసార్లు టాబ్లెట్స్ ఇచ్చినప్పటికీ నొప్పులు రాలేదు. పాపం, వాకింగ్ చేసి చేసి నా భార్యకు కాళ్ళనొప్పులు కూడా వచ్చాయి. తను పడుతున్న బాధను చూడలేక నేను బాధతో, "ఎందుకు బాబా మమ్మల్ని ఇంతలా పరీక్షిస్తున్నారు? పాపం! తాను చాలా కష్టపడుతోంది. త్వరగా డెలివరీ అయ్యేలా చూడండి" అని వేడుకున్నాను. అంతలో డాక్టర్ పరీక్షించి, "బేబీ బరువుగా ఉంది. అందువలన నార్మల్ డెలివరీ అవడం కష్టం" అన్నారు. నేను చాలా బాధపడి, "ఏమిటి బాబా, ఇలా చేసారు?" అని అనుకున్నాను. ఇక తప్పనిసరై ఆ రాత్రే ఆపరేషన్ చేసారు. ఆపరేషన్ అయిన వెంటనే పిల్లల డాక్టర్ బయటకు వచ్చి, "బిడ్డ అంత వెయిట్ ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ అస్సలు జరగదు. మీరు ఆలస్యం చేయకుండా ఆపరేషన్‌కి సమ్మతించడం మంచిదైంది" అన్నారు. అప్పుడుగానీ మాకు అర్థంకాలేదు, బాబా మా మంచి కోసం ఆపరేషన్ జరిగేలా చేసారని! మేము కోరుకున్నట్లుగానే బాబుని మాకు వరంగా ప్రసాదించారు బాబా. బేబీ బరువు ఎక్కువ ఉండటం వలన ఇతర సమస్యలు కూడా వస్తాయి. కానీ బాబా దయవలన ఎలాంటి సమస్యలు లేకుండా బాబు ఆరోగ్యంగా వున్నాడు. "బాబా! ఆరోగ్యవంతమైన చక్కని బాబుని ఇచ్చారు. మీకు చాలా చాలా ఋణపడి వున్నాను బాబా".

శ్రీ సఖదేవ్ వాఘ్‌‌తో సాయిపథం ఇంటర్వ్యూ.

బాబాను ప్రత్యక్షంగా దర్శించిన ఆ తరం భక్తులను ఎందరినో కలసి 'సాయిపథం' బృందం నిర్వహించిన ఇంటర్వ్యూల నుండి ఈరోజు సాయిపథం వాల్యూమ్ - 4లో ప్రచురించబడిన యావలా వాస్తవ్యులైన శ్రీ సఖదేవ్ తాత్యాబా వాఘ్ గారితో తేది: 15-12-91న చేసిన ఇంటర్వ్యూ విశేషాలు ప్రచురిస్తున్నాం.
                           
శ్రీ వాఘ్ సుమారు 105 - 110 సంవత్సరాల వయసున్న వృద్ధుడు. వయస్సులో ఉన్నప్పుడు ఆయన మంచి పేరున్న పహిల్వాను. శ్రద్దగా సాముగరిడీలు, వ్యాయామం చేసినందువల్ల కాబోలు అంత వయస్సులో కూడా చక్కగా మాట్లాడగలుగుతున్నారు. బాబాతో తనకు గల అనుభవాలను వివరించేటప్పుడు బాబా ఎలా మాట్లాడేవారో, ఆయన హావభావాలెలా ఉండేవో నాటకీయంగా ఆయన చెప్పిన వైనం 'సాయిపథం' బృందాన్ని ముగ్ధులను చేసింది. శ్రీ సఖదేవ్ పూర్వం ఒక చక్కెర ఫ్యాక్టరీలో హెడ్ గార్డుగా పనిచేసి రిటైరైనారు. ప్రస్తుతం శిరిడీకి సమీపంలో ఉండే కానేగాంలో తన కుమారుడు శ్రీ సుధాకర్ ఎస్. వాఘ్ ఇంట విశ్రాంతి తీసుకుంటున్నారు.

సాయి సన్నిధిలో కుస్తీ పట్టిన సఖదేవ్ 

శ్రీసాయిబాబాను సశరీరులుగా ఎన్నో పర్యాయాలు దర్శించిన శ్రీ సఖదేవ్ తనకు బాబాతో గల అనుభవాలను గూర్చి 'సాయిపథం'తో ఇలా చెప్పారు:

“నేను మొట్టమొదట బాబాను శిరిడీకి సుమారు 7 - 8 కి.మీ. దూరంలో గోదావరి నది ఒడ్డున ఉన్న రామ్ టేకడీలో చూసాను. అప్పుడు బాబా అక్కడున్న రామాలయం ప్రక్కన ఒక దిబ్బమీద కూర్చుని ఉన్నారు. ఆ రామాలయం ఇప్పుడు లేదు. అప్పుడు బాబాను చూచి ఆయన పిచ్చివాడనుకొని పిల్లలు ఆయనపై రాళ్ళు విసిరారు. పిల్లల గొడవకు బాబా అక్కడనుండి లేచి గోదావరి అవతల ఒడ్డుకి వెళ్ళి అక్కడ వున్న ఒక వేపచెట్టు క్రింద కూర్చున్నారు.”

“ఆ తరువాత నా 16వ ఏట కుస్తీపోటీలలో పాల్గొనడానికి మొదటిసారి శిరిడీ వెళ్ళాను. బాబాను శిరిడీలో దర్శించడం అదే మొదటిసారి. కుస్తీపోటీలు రెండు రోజులపాటు జరిగాయి. శిరిడీ గ్రామస్థులు మా కుస్తీ క్రీడాకారుల బృందం యొక్క భోజన సౌకర్యాలు మొదలైనవి చాలా చక్కగా చూసుకున్నారు. రాత్రంతా అక్కడ జరిగే 'తమాషాలు' చూచేవాళ్ళం (తమాషాలంటే అశ్లీలమైన సంభాషణలు, పాటలతో కూడిన వీధి నాటకాలు). మధ్యాహ్నం 12 గంటల వరకు కుస్తీ పోటీలు సాగేవి. భోజనాలైన తరువాత మళ్ళీ మొదలై సాయంత్రం వరకు జరిగేవి. కుస్తీ పోటీలలో పాల్గొనేముందు క్రీడాకారులంతా కలిసి బాబా వద్దకు వెళ్ళి బాబా ఆశీస్సులు తీసుకునేవాళ్ళం. బాబా మా నెత్తిమీద చెయ్యిబెట్టి ఆశీర్వదించేవారు. తరువాత ప్రసాదంగా మాకు 'రేవడి' పంచేవారు. (రేవడి' అంటే కుస్తీ పోటీలలో పాల్గొనే వారికి ఆచారంగా ఇచ్చే నువ్వు ఉండల వంటి తినుబండారం). కుస్తీ పోటీలు బాబా ముందే జరిగేవి. పోటీ జరిగే స్థలం దగ్గర ఒక గోనెపట్టాపై బాబా కూర్చునేవారు. ఆయనెప్పుడూ గోదాలోకి అడుగుపెట్టేవారు కాదు.”

“నేను మొదటిసారి శిరిడీ వెళ్ళినపుడు నావద్ద రెండున్నర పైసలు మాత్రం వున్నాయి. ఆ పైకం పెట్టి రేవడికొని మసీదులో బాబా ముందుంచాను. బాబా ఆ రేవడిని అందరికీ పంచారు. మమ్మల్ని “కూర్చోండి! కూర్చోండి!” అన్నారు. మేమందరం కూర్చొనగానే 'ఇక వెళ్ళండి' అన్నట్లు, “ఎప్పుడు బయలుదేరుతున్నారు?” అన్నారు. "ఇంకా కుస్తీపోటీలు మొదలవడానికి చాలా సమయం ఉంది" అని మేం అన్నాం. "అయితే ఉండండి” అని అంటూ, ఆయనే అక్కడినుండి లేచి వెళ్ళిపోయారు.”

“బాబా చాలా తక్కువగా మాట్లాడేవారు. ఎప్పుడయినా ఉన్నట్లుండి కోపంగా కేకవేసేవారు. ముతకమిల్లు 'కోరాగుడ్డ' (మాంచర్ పాట్)తో కుట్టిన కఫ్నీ ధరించేవారు. తలకు ఒక గుడ్డ కట్టుకునే వారు. అయితే అప్పుడప్పుడు తలకట్టు లేకుండా కూడా కనిపించేవారు. తలగుడ్డ లేకుండా కూడా ఆయన్ను నేను చూచాను. నేను చూచినప్పుడు ఆయన తలపై ఒత్తుగా వెంట్రుకలున్నాయి. బాబా చిలిం పీల్చేవారు. ఆ చిలింను అక్కడ ఆయన ప్రక్కనున్న వారందరికీ అందించేవారు.”

“ఎందరో గొడ్రాళ్ళు - ముఖ్యంగా పెద్ద వ్యాపారస్తుల కుటుంబాలకు చెందిన స్త్రీలు - సంతానం కలుగడానికి ఆయన ఆశీస్సుల కోసం వచ్చేవారు. మొదట బాబా వాళ్ళను కసిరి కొట్టేవారు. కొంతసేపైన తరువాత ఆశీర్వదించేవారు. “సంతానం కలుగుతుంది పో!" అని బాబా ఆశీర్వదించిన తరువాత పిల్లలు కలుగకపోవడమంటూ జరిగేది కాదు. ఆయన ఆశీర్వాదం వ్యర్ధమైన (తప్పిన) సందర్భము నాకు తెలిసి ఒక్కటి గూడా లేదు.”

“నేను ఎన్నోసార్లు శిరిడీ వెళ్ళి బాబా ముందు కుస్తీ పోటీలలో పాల్గొన్నాను. ఎన్నిసార్లు వెళ్ళానో అన్న విషయం నాకే జ్ఞాపకం లేదు. అప్పట్లో శ్రీరామనవమి ఉత్సవాలు 9 రోజులు జరిగేవి. ఆ తొమ్మిది రోజులు పెద్ద ఎత్తున ఉత్సవాలు, కుస్తీ పోటీలు నిర్వహించబడేవి.”

“అప్పట్లో నా ధ్యాస అంతా కుస్తీలమీదే వుండేది. ప్రతిసారి కుస్తీ పోటీలకు సంబంధించి మాత్రమే నేను శిరిడీ వెళ్ళేవాడిని. అంతకుమించి బాబాతో నాకెటువంటి అనుభవాలు లేవు.”

('సాయిపథం' అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ... )

“నాకు తెలిసి బాబా ఎప్పుడూ కుస్తీ పోటీలలో పాల్గొనలేదు. శిరిడీలో మొహిద్దీన్ తంబూలీ నాకు తెలుసు. అతనిది ఖాందేష్ జిల్లా. మొహిద్దీన్ తంబూలీ పహిల్వాన్ కాదు. అతనెప్పుడూ కుస్తీలు పట్టలేదు. ఎక్కువగా 'తమాషాలు' నటించేవాడు.”

“బాబా సమాధి చెందినప్పుడు నేను శిరిడీ వెళ్ళలేదు. నేను విన్నంతలో బాబా సమాధియైన తరువాత భక్తులు ఇంగ్లీష్ (ఆంగ్లేయ) వైద్యులను పిలిపించారని, వారు వచ్చి బాబా దేహత్యాగం చేశారని నిర్ధారించిన తరువాతనే ఆయన దేహాన్ని సమాధి చేశారనీ తెలిసింది.”

మూలం: సాయిపథం వాల్యూమ్ - 4

వెళ్లిన ప్రతిచోటా దర్శనమిస్తూ పర్యటనను పూర్తి చేయించిన బాబా




నేను ఒక సాయి భక్తురాలిని. సాయిబంధువులందరికీ నమస్కారం. బాబా కృపతో శిరిడీలో నిర్వహించే దివ్య పారాయణంలో నేను కూడా భాగస్వామినయ్యాను. దివ్య పారాయణ మొదలుపెట్టిన మొదటి గురువారంనాడు రోజా పువ్వులు, చామంతి పువ్వులతో బాబాకి పూజచేసి ముడుపు కట్టాను. మరుసటిరోజు దేవుని వద్ద శుభ్రం చేస్తూ, ముందురోజు పెట్టిన పువ్వులు తీస్తుండగా వేపాకు కనిపించింది. అది అక్కడికెలా వచ్చిందా అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నేను పువ్వులు మాత్రమే ఏరుకొచ్చి బాబాకు పెట్టాను. ఆ పువ్వులలో పొరపాటుగా వేపాకు కలిసి రావడానికి మా ఇంట్లో వేపచెట్టు కూడా లేదు. కాబట్టి అది బాబా చేసిన చమత్కారమే! అప్పుడు నాకర్థమైంది, బాబా వేపాకు కానుకగా ఇచ్చి నా కోరికని ఆమోదించారని. ఇక నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.

తరువాత 2018, డిసెంబర్ నెల మొదటివారంలో మా కుటుంబమంతా కాణిపాకం, తమిళనాడు యాత్రలకి వెళ్ళాము. ముందుగా కాణిపాకంలో వినాయకుడి దర్శనం చేసుకున్నాము. తరువాత అక్కడ షాపింగ్ చేస్తుండగా బాబా పెద్ద విగ్రహరూపంలో దర్శనమిచ్చారు. బాబా మాకు తోడుగా ఉన్నారని ఎంతో ఆనందంగా అనిపించింది. తరువాత అక్కడికి దగ్గరలో ఉన్న అర్ధగిరిలో ఆంజనేయుడి దర్శనం చేసుకొని, అరుణాచలం వెళ్ళాము. కార్తీకమాసం చివరివారం కావడంతో బాగా జనం ఉన్నారు. అందువలన స్వామి దర్శనం మాకు కాలేదు. కానీ, అమ్మవారి దర్శనం, కార్తీక మహాదీప దర్శనం చేసుకున్నాం. తరువాత రూమ్ కోసం ఎంతగా ప్రయత్నించినా రూమ్ దొరకలేదు. కాస్త డబ్బు ఎక్కువైనా పర్వాలేదు అనుకున్నా కూడా దొరకలేదు. ఎక్కడో ఒకటి ఉన్నా కూడా మూడవ అంతస్తులో ఉన్నాయి. పోనీ అక్కడే దిగుదామనుకున్నా  అక్కడ లిఫ్ట్ సదుపాయం లేదు. మా అమ్మ తన మోకాళ్ళ నొప్పులతో మూడు అంతస్తులు ఎక్కలేదు. అందువలన ఆ రాత్రి అక్కడ ఉండటానికి కుదరక కంచి వెళ్ళిపోదామని రాత్రి 11 గంటల సమయంలో బయలుదేరాం. దారిలో ఒకచోట టీ త్రాగడానికి మా కారు ఆపి మా వాళ్ళు కిందకి దిగారు. అప్పుడు సమయం 3 గంటలై ఉండొచ్చు. నేను మంచి నిద్రలో ఉండగా, మా అమ్మ, "చూడు! నీ పక్కన మూడు బాబా ఫోటోలున్నాయి" అంటూ నన్ను లేపింది. వెంటనే నేను ఉలిక్కిపడి లేచి చూస్తే, అభయమిస్తున్న భంగిమలో ఉన్న మూడు పెద్ద బాబా ఫోటోలున్నాయి. నేను ఆశ్చర్యపోయాను. రోడ్డు ప్రక్కన ఆరుబయట బాబా ఫోటోలు ఉండటమేమిటి? సరిగ్గా బాబా ఫోటోల ప్రక్కనే మా కారు ఆపడమేమిటి? పోనీ, మా డ్రైవర్ బాబా ఫోటోలు చూసి అక్కడ ఆపాడనుకుందామంటే, 'అసలు అతను బాబా భక్తుడే కాదు కదా!' అని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏదేమైనా రూమ్ దొరకక మేము పడుతున్న కష్టానికి బాబా 'నేనున్నాన'ని అభయమిస్తున్నారనిపించింది నాకు. కాసేపు అలానే బాబాని చూస్తూ మరలా నిద్రపోయాను.

కొద్దిసేపటికి కంచి చేరుకున్నాము. మావారు, అతని స్నేహితుడు రూమ్ కోసం వెళ్లారు. కానీ, ఎంత వెతికినా కంచిలో కూడా మాకు రూమ్ దొరకలేదు. ఇక మావారు ఈ రాత్రికి సత్రంలో ఐనా ఉందామని నిర్ణయించుకుని అక్కడ మాట్లాడటానికి వెళ్లారు. నాకు మాత్రం సత్రంలో ఉండడం ఏమాత్రం ఇష్టంలేదు. నేను, మా అమ్మ, మా బాబు కారులో ఉన్నాం. మా నాన్న అప్పుడే కారు దిగారు. ఆ మరుక్షణమే ఒకాయన వచ్చి, "మీరు రూమ్ కోసం వెతుకుతున్నారు కదా?" అని అడిగాడు. ఆ మాట వింటూనే నాకు మెలకువ వచ్చింది. 'అవును' అన్నాడు నాన్న. ఆయన, "నాతో రండి, మీకు దేవస్థానం రూమ్ ఇప్పిస్తాను" అన్నాడు. మేము షాక్ అయ్యాం. ఎందుకంటే అంతకుముందే మావారు అక్కడకు వెళ్లి అడిగితే 'రూమ్స్ లేవ'ని చెప్పారు. మావారు రాగానే ఆయన మమ్మల్ని తమ వెంట రమ్మని అన్ని సదుపాయాలు ఉన్న ఒక మంచి రూమ్ చూపించి వెళ్లిపోయారు. తరువాత మళ్ళీ ఆయన కనిపించలేదు. ఆయన బాబానే! కంచి చేరడానికి ముందే ఫోటో రూపంలో కనిపించి అభయమిచ్చారు. మరల ఆ వ్యక్తి రూపంలో రూమ్ చూపించి సహాయం చేసారు. తరువాత మా నాన్న కూడా, "ఆయన ఖచ్చితంగా బాబానే!" అని అన్నారు.

మేము కంచిలో దర్శనం చేసుకున్నాక తిరుత్తణి వెళ్ళాము. అక్కడ కూడా బాబా మాకు చాలా సహాయం చేసారు. ఆరోజు ఆదివారం కావడంతో చాలా జనం ఉన్నారు. దర్శనం ఆలస్యం అవుతుంది, అమ్మ అంతసేపు లైన్లో ఉండలేదని చాలా ఆందోళనపడ్డాం. కానీ బాబా అద్భుతమే చేసారు. అక్కడున్న ఒక పోలీసు ఉద్యోగి తనంత తానుగా మేమెవరో అతనికి తెలియకపోయినా మాతో ఆప్యాయంగా మాట్లాడి, స్టేషన్లో కూర్చోబెట్టి మరీ మాకు మర్యాదలు చేసి మమ్మల్ని నేరుగా గర్భగుడిలోనికి తీసుకుని వెళ్లి కేవలం 5 నిమిషాల్లో దర్శనం చేయించారు. ఆ విషయం తలుచుకుంటే నాకిప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది.

చివరగా మేము తిరువళ్ళూరు వెళ్ళాము. అక్కడ కూడా బాబా ఫోటో రూపంలో దర్శనమిచ్చారు. ఇలా మేము వెళ్లిన ప్రతిచోటా బాబా దర్శనమిస్తూ మా పర్యటనను పూర్తి చేయించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

అల్లా (దైవం) 'ఆయన' యజమానా? లేక, 'ఆయనే' దైవమా?


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

నిగూఢమైన సాయితత్త్వ సాగరగర్భంలో దాగిన ఆణిముత్యాలు
                      - (1990లో పూజ్యశ్రీ బాబూజీ సత్సంగ భాషణకు అక్షరరూపం)

“నా చర్యలు అగాధాలు. ఎవరైతే నా లీలలను మననం చేస్తూ అందులోనే మునిగిపోతారో వారికి జ్ఞానరత్నాలు లభిస్తాయి” అన్నారు శ్రీ సాయిబాబా. సద్గురు వాక్యానికి, వారి చర్యలకు అనంతమైన అర్థాలు, అర్థవంతమైన 'పర'మార్థాలు ఉంటాయి. నిగూఢమైన సాయితత్త్వ సాగరగర్భంలో దాగిన ఆణిముత్యాలెన్నో. అందులోని శ్రీసాయి'పర'మైన తత్త్వం మానవాళికి వరమైన అమృతతత్త్వం. ఆ అమృతతత్త్వాన్ని మనకు అందించిన శ్రీబాబూజీ సత్సంగ భాషణం పాఠకుల ముందుంచటం జరిగింది. ఆ క్రమంలో శ్రీ బాబూజీ 1990వ దశకంలో చేసిన సత్సంగానికి అక్షరరూపమిది. అవధరించండి!

సాయిబాబా అగాధతత్త్వాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వారకామాయిలో కూర్చున్న సాయిబాబా లక్ష్మీబాయిషిండే తెచ్చిన నైవేద్యాన్ని కుక్కకు వేసి, "దాని ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లే" అన్నారు. ఆత్మారాం తర్ఖడ్ భార్య ఎక్కడో కుక్కకు రొట్టెముక్క పెడితే - సాయిబాబా “నాకు రొట్టె పెట్టావమ్మా” అన్నారు. శ్రీమతి ఖపర్డే కుక్కను కొడితే, తమనే కొట్టినట్లు చెప్పారు. వెంటనే మనమేం అనుకుంటాము? సాయిబాబా ఆయా జీవాల రూపం ధరించారనుకుంటాం. ఆయనేమీ ప్రత్యేకంగా కుక్క రూపంగానీ మరేజీవి రూపంగానీ ధరించలేదు. అక్కడ రోజూ తిరుగుతున్న కుక్కే అది. ఉబ్బస వ్యాధిగ్రస్తుడైన హంసరాజ్ పుల్లపెరుగు తినకుండా చేసేందుకు పిల్లి వచ్చి రోజూ పెరుగు తినేది. అక్కడ కూడా సాయిబాబా ఆ పిల్లి రూపం ఎత్తలేదు. అది రోజూ ఆ ఇంట్లో తిరుగుతున్న పిల్లే. మూగజీవాలను కొడితే మసీదులో ఉన్న తన వీపు మీదనే ఆ వాతలను చూపించారు. అలా అన్ని ప్రాణుల రూపంలోనూ నేనే సంచరిస్తూ ఉన్నాను అని అనుభవపూర్వక నిదర్శనం ఇచ్చిన సాయిబాబా స్థితి ఏమై ఉండాలి? అన్ని జీవుల రూపంలో ఉన్నది ఒకే చైతన్యమైతే ఆ విషయాన్ని గుర్తింపు కలిగి ఉండడమెట్లా? నా రూపంలో ఉండి మాట్లాడుతూ, మీ రూపంలో ఉండి వింటూ - రెంటినీ కలిపి సాక్షిగా చూస్తూ ఉన్న ఆ తత్త్వం ఎటువంటిదై ఉండాలి? ఈ విషయం అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. సులభంగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెపుతాను. ఇప్పుడు మనమందరము ఇక్కడ ఇలా కూర్చుని ఉన్నాము. రేపో, ఎల్లుండో ఇంటికి వెళతాము. వెళ్ళిన కొద్దిరోజులకు ఇక్కడ జరిగినదంతా జ్ఞప్తికొస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మనకు? కళ్ళు మూసుకుని ఊహించినట్లయితే ఈ గది, ఇక్కడ కూర్చున్న సాయిభక్తులు, ఈ పరిసరాలు అంతా మనసులో ఓ చలనచిత్రంలాగా కనబడతాయి. ఒక ఘట్టం గురించి, ఒక సందర్భం గురించి - ఇలా చేసాను గదా, అంత బాగుంది, అలా జరిగింది - అని మనము ఊహిస్తున్నాము. ఆలోచన సాగుతోంది. ఆ మనసుకొచ్చిన ఊహాచిత్రంలో మీరూ ఉంటారు. మనసులో మెదిలో ఆలోచనలో మిమ్ములను మీరు చూస్తున్నారు. ఊహలోనిదంతా మనసుకు సంబంధించినదే. ఏదీ బయటనుంచి రాలేదు. అక్కడున్న వ్యక్తుల రూపము, జడపదార్థాల రూపం- అన్నింటినీ మన మనస్సే ధరిస్తూ, దాంట్లో మనమూ ఒక భాగంగా ఉంటూ, ఈ మొత్తాన్ని మనసే మరలా సాక్షిగా చూస్తోంది. కానీ, సామాన్యంగా అలా చూస్తున్న గుర్తింపు ఉండదు. ఆ ఊహల్లో మనము తాదాత్మ్యం చెందుతాము.

అందుకే సాయిబాబా సూక్తులు చూసినట్లయితే, ఒకచోట - "నేను నిష్క్రియుడను, కేవలం సాక్షీభూతుడను” అంటారు. మరొకచోట - "అన్నీ చేసేది నేనే, అన్నీ నేనే” అంటారు. ఒకసారి - “అల్లాయే యజమాని” అంటే మరొకసారి - "నేనే అల్లాను” అంటారు. ఈ పరస్పర విరుద్ధమైన సాయిబాబా మాటల్లోని అంతరార్థమేమిటి?  ఈ విషయాన్నే ఇంకొంచెం విపులంగా పరిశీలిద్దాం.

రచయిత నవల రాస్తున్నాడు - సీరియల్ వస్తోంది. ఇంతవరకూ చదివిన వాడికి ముందేమి జరుగుతుందో అని Tension గా ఉంటుంది. కథ నడిపే రచయితకు Tension ఉండదు. ఎందుకంటే నవల మొత్తం తన కల్పనే కదా? సినిమా చూస్తున్నాము, విలన్ పిస్టల్ తీస్తాడు. వాడు ట్రిగ్గర్ నొక్కుతాడేమో, హీరో చస్తాడేమో - అని చూసే వాళ్లకు టెన్షన్, కాని వాడు ట్రిగ్గర్ నొక్కడనే విషయం డైరెక్టర్‌కు తెలుసు. మధ్యలో ఏదో మెలిక పెడతాడన్నమాట. అందుకే డైరెక్టర్‌కు టెన్షన్ ఉండదు. డైరెక్టర్ ఆజ్ఞ లేకుండా ఏమీ జరగదు. అలా ఈ సృష్టి అంతా ఎవరి రచనో - ఎవరి మనసులో జనించిన ఊహో - ఆయన యొక్క ఆజ్ఞ లేక ఆకు కూడా కదలదు. సాయిబాబా “నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు” అనడంలో గూఢార్థమదే. అలా తానే సృష్టికర్తనని, అంతా నిండివున్న చైతన్యం తానేనని చెప్పకనే చెప్పారు సాయిబాబా.

ఈ సృష్టి అనే నవల సాయిబాబా యొక్క రచన. నవలలోని పాత్రలు, దేశకాల పరిస్థితులు ఆ నవలాకారుని మనసే అయినట్లు, ఈ సృష్టి, మనము అంతా సాయిబాబా అనే నవలాకారుని మనసులోని భాగాలే. ఇంతకుముందు ఉదాహరణ చెప్పుకున్నట్లు ఇపుడు మనమిలా కూర్చుని ఉన్న సంఘటన ఆ తరువాత మీ మనసుకొచ్చినపుడు ఇప్పటి ఈ దేశకాల పరిస్థితులు, ఇక్కడ కూర్చుని ఉన్న వ్యక్తులు, అందులోని మీరు, వీటి అన్నింటిని చూసే సాక్షి మీ మనసే అయినట్లు ఈ సృష్టి అంతా సాయిబాబా మనసులోని సంకల్పమే అవుతుంది. “ఊహించే మీకు, మీ ఊహల్లోని మీకు ఉన్న సంబంధమే అల్లాకు సాయిబాబాకు ఉన్న సంబంధం.”

కాబట్టి శిరిడీలో ఆ ఐదున్నర అడుగుల శరీరంలో ఉంటూనే, అన్ని జీవులలోనూ ఉన్నారాయన. అన్నిజీవుల రూపంలో చరిస్తూ ఉంటారాయన. ఆకు కదలాలన్నా ఆయన సంకల్పం అవసరం. ఈ సూక్ష్మం అర్థం ఐనపుడే పరస్పర విరుద్ధమైనవిగా కనిపించే సాయిబాబా మాటలకు సమన్వయం కుదురుతుంది.

ఈ అవగాహన మనసుకు వచ్చిన తరువాత సాయిబాబా చరిత్ర చదవటం మొదలుపెడితే - ఎంతో కొత్తగా ఉంటుంది. ఇంతకుముందు చేసిన పారాయణకు, ఈ అవగాహనతో, ఈ జిజ్ఞాసతో చేసే పారాయణకు హస్తిమశకాంతము తేడా ఉంటుంది.

చైతన్యానికి ఒక గుణమంటూ లేదు కనుక అది నిర్గుణము. అంతటా నిండిన చైతన్యానికి ఏ రూపమూ లేదు. అందుకే అది నిరాకారం. మరి ఆ చైతన్యం ఎట్లా ఉంటుందంటే చైతన్యం రూపంలోనే ఉంటుంది. చైతన్యానికి రూపమంటూ ఉంటే, ఆ రూపానికి అది పరిమితం కావాలి. ఇంకో రూపం ధరించే అవకాశం లేదు. చైతన్యానికి ఏ రూపమైనా ధరించే శక్తి ఉంది. అది ఏ రూపానికీ పరిమితం కాదు.

మీరు ఇంకో రూపం ధరించండి చూద్దాం. వీలుకాదు. ఈ పుస్తకం కానీ, కలం కానీ, ఏ వస్తువుకైనా ఒక నిర్ణీత రూపముంటుంది. కాబట్టి - అవి మరొక రూపాన్ని ధరించలేవు. మనసుకు ఏ రూపం లేదు. కనుకనే ఏ రూపం పడితే ఆ రూపాన్ని ధరిస్తుంది, నీరు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపం ధరించినట్లు. అలాగే ఏ రూపమూ లేని చైతన్యమే ఏ రూపం కావాలంటే ఆ రూపం సంకల్పానుసారం ధరిస్తుంది.

ఒక స్వప్నం వచ్చిందనుకుందాం - ట్రైన్‌లో వెళుతున్నట్లు, దొంగలు రైలెక్కి దోచుకున్నట్లు. ఆ స్వప్నంలోనే ట్రైన్, దాని కదలిక, దాంట్లో మనం, దొంగలు రావడం, మనలను కొట్టి దోచుకోవడం, భయం, బాధ అన్నీ అనుభవమవుతున్నాయి. అక్కడ మన శరీరానికి నిజంగా దెబ్బ తగిలిందా? ఏ రూపమూ లేని మనసే అన్ని రూపాలు ధరించిందక్కడ. ఎంతగా ధరించిందంటే - మీరు దెబ్బలు తిన్నంత అనుభవం మీకు వచ్చేంతగా. కలలో జరిగిన సంఘటనలకు, మనకు ఎంత సంబంధం ఉన్నదో - అదే సంబంధం - శిరిడీలోని సాయిబాబా రూపానికి, అంతటా నిండిన చైతన్యానికి ఉంది.

కాబట్టి ఏ రూపమూ లేదు కనుకనే, ఆయన అన్ని రూపాలు ధరించారు. అంతటా ఉన్న చైతన్యం అదే కనుక - ఏ రూపంలో చూసినా మనకు సాయిబాబా యొక్క తత్త్వం కనిపించాలి.

అయితే సాయిబాబా రూపానికి మాత్రం ఒక ప్రత్యేకత ఉన్నదని నా అనుభవం. మీరు కూడా గమనించండి. సాయిపూజ, చరిత్ర పారాయణ శ్రద్ధగా చేసేవాళ్ళకు ఇది అనుభవం అవుతుంది. ఏదైనా ఊరికి గాని, ఒక ఇంటికి గాని వెళ్ళామనుకోండి, ఉన్నట్లుండి సాయిబాబా మనసుకు వచ్చి, మనసులో ఒక మార్పు వచ్చి నిశ్చలమవుతుంది. ఏమిటా అని జాగ్రత్తగా గమనిస్తే - ఎక్కడో ఒకచోట కనీసం ఒక స్టిక్కర్ రూపంలోనన్నా సాయిబాబా ఫోటో కనిపిస్తుంది. అట్లా ఎందుకు అవుతుంది అన్నది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది.

ఒక్కటి మాత్రం స్పష్టం. ఈ సృష్టిలో సాయి రూపానికి ఒక ప్రత్యేకత ఉంది. అందుకే సాయిబాబా అన్నారు - “నన్ను కేవలం ఆనందస్వరూపంగా ధ్యానించు. అది చేతగాకపోతే కనబడే నా ఈ రూపాన్ని ధ్యానించు!” అని.

"ఈ జీవితం మాయ, మిథ్య, అసత్యం, నిరుపయోగమైనదని త్రోసిపుచ్చవద్దు. జీవితంలో సంపూర్ణంగా పాలుపంచుకోవడమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక సాధనలో గమ్యం చేరడానికి ప్రాపంచిక జీవితం, అవసరాలు, కోరికలు ఎవరికైనా అడ్డేమో కాని, సాయి భక్తునికి అవి అడ్డుకావు"

- పూజ్యశ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ.

"నన్ను అనన్యంగా ప్రేమించేవారు, నన్నెప్పుడూ తమ ఎదుట దర్శిస్తూనే ఉంటారు. నేను లేనిదే వారికి లోకం ఉండదు. వారి పెదవులపైన కేవలం నా కథలే ఉంటాయి. నిరంతరం వారు నన్నే చింతన చేస్తుంటారు. వారి నాలుకపై నా నామమే ఉంటుంది. నా నామాన్నే జపిస్తుంటారు. వారు నా లీలలను కీర్తిస్తుంటారు. వారు ఎక్కడికి వెళ్ళినా నా కార్యాలనే పాడుతుంటారు. వారు నాలో అలా పూర్తిగా లయించిపోతారు. తమ కార్యకలాపాలన్నింటినీ మరచిపోతారు. నా సేవయందే ఆదరంతో తత్పరులై ఉంటారు. అలాంటి వారుండే చోట నేనుంటాను. నన్ను పూర్తి శరణాగతి చేయాలి. నన్ను నిరంతరం స్మరించాలి. అప్పుడు నేనతనికి ఋణగ్రస్తుడనౌతాను. అతన్ని ఉద్ధరించి నేను ఋణవిముక్తుడనౌతాను. నాకు ముందుగా సమర్పించి ఆ తర్వాతే అన్నపానీయాలు గ్రహించే వారికి నేను బద్ధుడనౌతాను. నన్ను నిరంతరం ధ్యానించే అలాంటి వారి కోరికలు నేను తీరుస్తాను. నా కోసమే పరితపించే నా భక్తుల యోగక్షేమాలను నేనే చూసుకుంటాను. వారికన్నా మించిన భక్తులు నాకెవరూ ఉండరు. నాకు మించిన దైవం కూడా వారికెవ్వరూ ఉండరు. నేను వారి ఆధీనంలో వర్తిస్తాను."

- సాయిబాబా

అండగా ఉంటూ పని పూర్తి చేయించారు బాబా.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

ఒక అజ్ఞాత సాయి భక్తురాలి అనుభవం. 

సాయిబంధువులందరికీ నమస్కారం!

ఒక ముఖ్యమైన విషయంలో ముందుగా బాబా నన్ను హెచ్చరించడమే కాకుండా నాకు తమ సహాయాన్ని అందిస్తూ సకాలంలో మా ప్లాట్స్ అమ్మకం జరిగేలా చేసారు. ఆ అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను.

అసలు అనుభవం చెప్పే ముందు మేము కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఒక సమస్య గురించి చెప్పాలి. మాకు ఒక సిటీలో రెండు ప్లాట్స్ ఉన్నాయి. మేము వాటిని కొనే సమయంలో మధ్యవర్తులు క్రమబద్ధీకరించిన (నియమాలకనుకూలంగా) పత్రాలంటూ నకిలీ పత్రాలు మాకిచ్చి మమ్మల్ని బాగా మోసం చేసారు. అదృష్టంకొద్దీ ఆ సమస్య తప్పితే వేరే ఇతర సమస్యలు లేవు. అసలు పత్రాలు సంపాదించుకోవడానికి మేము చాలా కష్టపడాల్సి వచ్చింది. తరువాత ఆ రెండు ప్లాట్స్ అమ్మివేయాలని నిర్ణయించుకున్నాము. బాబా దయవలన వాటిని కొనేందుకు ఒకరు ఆసక్తి చూపడంతో రిజిస్ట్రేషన్ పని మీద మేము ఆ సిటీకి బయల్దేరాము. ప్రయాణసమయంలో నాకొక దుస్స్వప్నం వచ్చింది. అందులో నేను బాబా మందిరానికి వెళ్ళగా, అకస్మాతుగా అక్కడున్న బాబా విగ్రహం అదృశ్యమైపోయి ఆ స్థానంలో ఒక పాము కనిపించి, నన్ను వెంబడించి కాటు వెయ్యాలని ప్రయత్నిస్తోంది. దాంతో నాకు ఆందోళనగా అనిపించింది. ఆ తరువాత మేము బస చేసిన హోటల్‌లో కూడా మాకు ఒక చేదు అనుభవం ఎదురైంది. తరువాత మేము రిజిస్ట్రేషన్ ఆఫీసుకి వెళ్లి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం. మేము సంతకాలు చేసాక, ప్లాట్స్ కొనే వ్యక్తి మాకు డబ్బులు కూడా ఇచ్చిన తరువాత ప్లాట్స్‌కి సంబంధించిన లింక్డ్ డాక్యుమెంట్స్ లేవని గుర్తించాడు. కానీ మాకు అప్పటికి లింక్డ్ డాక్యుమెంట్స్ గురించి అసలేమీ తెలియదు. నిజానికి మేము ముందుగానే ప్లాట్స్‌కి సంబంధించి మా వద్ద ఉన్న పత్రాలన్నీ వాళ్ళకి ఇచ్చాం కానీ, వాళ్ళప్పుడు సరిగా చూసుకోకపోవడం వలన మాకు సమస్య ఎదురైంది. కొనుగోలు చేసే వాళ్ళలో ఒక వ్యక్తి, "ఇక రిజిస్ట్రేషన్ జరగదు. మీ పత్రాలు మీకు ఇచ్చేస్తాం. మా దగ్గర తీసుకున్న పైకం మొత్తం తిరిగివ్వండి" అని మాకు నేరుగానే చెప్పేసాడు. కొనడానికి వచ్చిన మరో వ్యక్తి మాత్రం ఏమి చేయాలో అర్థంకాక అయోమయంలో పడ్డాడు. మేము అతనితో, "మీరేమీ ఆందోళనపడకండి. మరలా రిజిస్ట్రేషన్ మాపేరు మీద చేసుకొని, మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తామ"ని అతనికి హామీ ఇచ్చాం. దాంతో వాళ్ళు మా పేరుతో రిజిస్టర్ చెయ్యడానికి ముందుకు వచ్చారు. మొదటివ్యక్తికి 60,000 రూపాయలు ఇచ్చి మా పత్రాలు వెనక్కి తీసుకున్నాం. ఇక మా ప్లాట్ తిరిగి మా పేరు మీదకి రావాలంటే కొద్దివ్యవధిలోనే రెండవవ్యక్తికీ మొత్తం పైకం చెల్లించాల్సి వచ్చింది. అంత పెద్దమొత్తం సమకూర్చడానికి మేము చాలానే కష్టపడాల్సి వచ్చింది. బాబా దయవలన తక్కువ సమయంలోనే ఆ మొత్తానికి ఏర్పాటు చేయగలిగాము.

అలా జరిగిన కొంతకాలానికి మళ్ళీ మేము ఆ ప్లాట్స్ అమ్మడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటే, ఇంకోవైపు మా బంధువులు దాన్ని అతితక్కువ ధరకి(దాదాపు సగం ధరకే) తీసుకోవడానికి చూస్తున్నారని మాకు తెలిసింది. మాకెవరి అండా లేనందున అందరూ మమ్మల్ని మోసం చేయాలని చూసారు. దగ్గర స్నేహితులు అనుకున్న వాళ్ళు కూడా అతితక్కువ ధరకే కొనాలని చూస్తుండటంతో నేను చాలా వేదన అనుభవించాను. ఆ అనుభవంతో నాకు స్నేహితులు, బంధువులు అందరిమీదా నమ్మకం పోయింది. బాబా ఒక్కరే నాకు ఉన్న ఒక్కగానొక్క స్నేహితుడు, నా మేలు కోరేవారు.

కొన్ని నెలల తరువాత ఒక్కసారిగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మొదటిసారి రిజిస్ట్రేషన్ వరకు వచ్చి ఆగిపోయిన సందర్భంలో కొనుగోలు చేయదలచిన రెండవవ్యక్తి  స్నేహితుడు ఒకతను నాకు ఫోన్ చేసి మా ప్లాట్స్ కొనడానికి తనకి ఆసక్తి ఉన్నట్లు చెప్పాడు. అతనికి ఆ ప్లాట్స్‌కి సంబంధించిన సమస్యలన్నీ తెలుసు, అయినప్పటికీ అతను ఆసక్తి కనబరచడంతో మేము కూడా అతనికే అమ్మాలని నిశ్చయించుకున్నాం.

రిజిస్ట్రేషన్‌కి ఇంక వారముందనగా నేను సాయి ప్రశ్నావళిలో బాబాని అడిగితే, “బంధువులు, స్నేహితులు ఎవరూ నీకు సహాయం చేయరు. నీ పనిని నీవే సొంతంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అది సాధించాలంటే శ్రీసాయిని గుర్తుంచుకో!” అని వచ్చింది. బాబా నుండి అలా జవాబు రావడంతో ఆ సమయంలో నేను చాలా ఆందోళనపడ్డాను. కానీ నాకు ఎదురు కాబోయే సమస్యల గురించి ముందుగా బాబా సూచిస్తున్నారని నేనప్పుడు తెలుసుకోలేకపోయాను. తరువాత నాకొక స్వప్నం వచ్చింది. కలలో నేను మా మేనేజరుతో, "మా ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం వెళ్లాల్సి ఉంది. అందువలన రెండురోజులపాటు ఇంటి నుండి వర్క్ చేసుకొనేందుకు అనుమతి ఇవ్వండ"ని అడుగుతున్నాను. ఆ స్వప్నం ద్వారా రిజిస్ట్రేషన్ సాఫీగా జరుగుతుందని బాబా హామీ ఇచ్చారు. కానీ ఆ విషయం కూడా నాకప్పుడు అర్థం కాలేదు.

నేను ముందుగా రిజిస్ట్రేషన్ జరగాల్సిన సిటీలో ఆన్లైన్ ద్వారా హోటల్లో రూమ్ బుక్ చేసుకొని ఆరోజు వేకువఝామున ఫ్లైట్ లో సిటీ చేరుకున్నాను. మా అమ్మ, మా బంధువులు కారులో సిటీకి బయల్దేరారు. వాళ్ళు రాత్రికి తిరిగి వెళ్లిపోవాలని ముందుగా నిర్ణయించుకొన్నారు. నేను హోటల్‌కి వెళ్ళే మార్గంలో చుట్టుపక్కల అంతటా బాబా దర్శనమిస్తూనే ఉన్నారు. చివరికి హోటల్‌లో కూడా పెద్ద బాబా ఫోటో ఉంది. కానీ హోటల్‌లో నాకు ఎదురయిన ఒక చేదు అనుభవం వల్ల వెంటనే నేను ఆ హోటల్ నుండి బయటకి వచ్చేసి, దగ్గరలో మరో హోటల్‌కి వెళదామని ఆటో కోసం ఎదురుచూస్తున్నాను. కానీ ఒక్క ఆటో కూడా రాలేదు. నేను కొంతమంది బంధువులకి ఫోన్ చేసినా, ఎందుకోగాని ఫోన్లు కలవలేదు. నిస్సహాయస్థితిలో రోడ్డుపై నిలబడి ఉండగా కొంతసేపటికి ఒక ఆటో అతను నాకు హోటల్ చూపించడానికి ముందుకి వచ్చాడు. కానీ ఎక్కడా రూమ్స్ ఖాళీ లేవు. ఫోటోల రూపంలో బాబా దారంతా కనిపిస్తూనే ఉన్నారు. నేను "బాబా! ఎలా అయినా సహాయం చెయ్యండి" అని వేడుకుంటూనే ఉన్నాను. కానీ సిటీ అంతా తిరిగినా రూమ్ దొరకక మానసికంగా చాలా అలసిపోయాను. చివరికి బాబా దయవలన సిటీ బార్డర్ లో ఒక హోటల్ కనిపించింది. వెంటనే నేను మొదట బుక్ చేసిన హోటల్ రూమ్ కాన్సిల్ చేశాను. అదృష్టం కొద్దీ మొత్తం డబ్బులు రీఫండ్ నాకు వచ్చేసాయి. మా అమ్మ వాళ్ళు సిటీ చేరుకొని, రిజిస్ట్రేషన్ ఆఫీసు వైపు వెళ్తున్నారు. నేను చాలా దూరంలో ఉండడంతో నన్ను వాళ్ళ కారులో తీసుకొని వెళ్లే అవకాశం వాళ్ళకి లేకుండా పోయింది.

నేను ఫ్రెష్ అయ్యి ఆటో లేదా క్యాబ్ కోసం చూస్తున్నాను. ఎందుకో నాకా సమయంలో మొదటిసారి రిజిస్ట్రేషన్ అనుకున్నప్పుడు ఎదురైన సమస్యలు గుర్తుకొచ్చి చాలా ఆందోళనగా అనిపించింది. ఆ ఆందోళనలో నేను రూమ్ తీసుకున్న హోటల్ పేరు మరచిపోయాను. అంతలో గడ్డంతో ఉన్న ఒక ముస్లిం ఆటోడ్రైవర్ వచ్చి, "ఆటో కావాలా?' అని అడిగాడు. ఆటోలో అప్పటికే ఇద్దరు వ్యక్తులు ఉండడంతో నేను 'వద్ద'ని సున్నితంగా చెప్పాను. అయినా కూడా అతను నన్ను ఆటో ఎక్కమని పలుమార్లు బలవంతం చేసాడు. కానీ నేను వద్దని చెప్పడంతో అతనక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక "అతను బాబా ఏమో! నా సహాయార్థం వచ్చారేమో!" అని నా మనసుకి అనిపించి కొంచెం బాధ కలిగింది. కానీ అప్పటికే ఆలస్యం అవుతుండటంతో ఒక ఓలా క్యాబ్ బుక్ చేసుకొని సిటీలో ఒక ప్రదేశం వరకు వెళ్లి అక్కడనుండి రిజిస్ట్రేషన్ ఆఫీసుకి ఆటోలో వెళదామని అనుకుని క్యాబ్ బుక్ చేశాను. అంతలో మొదట వచ్చిన ముస్లిం ఆటోడ్రైవర్ మరలా వచ్చి, "ఆటో ఎక్కమ"ని అడిగాడు. నేను "ఇతను నిజంగా బాబానా? లేకపోతే అతనెవరు? నన్నెందుకు తన ఆటో ఎక్కమని  బలవంతం చేస్తున్నాడు? నేను అతనిని నమ్మవచ్చా?" అని రకరకాల ప్రశ్నలతో గందరగోళంలో పడ్డాను. నిజానికి రిజిస్ట్రేషన్ ఆఫీసు సిటీ నుండి దూరంగా వుంది. అక్కడికే వెళ్లే మార్గం నిర్మానుష్యంగా ఉంటుంది. ఒంటరిగా ఆడవాళ్ళు ప్రయాణం చెయ్యడం అంత శ్రేయస్కరం కాదు. అందువలన నేను ఆటో ఎక్కడానికి అంతలా ఆలోచించాను. కానీ అతను నేను ఆటో ఎక్కేదాకా అక్కడనుండి కదిలేలాలేడని నాకనిపించింది. ఇక 'తను నా బాబానే' అని దృఢంగా విశ్వసించి, "బాబా! నన్ను క్షేమంగా తీసుకొని వెళ్ళు" అని ప్రార్థించి ఆటో ఎక్కాను. ఆటో ఎక్కిన తరువాత బుక్ చేసుకున్న క్యాబ్ రద్దు చేశాను. గమ్యం చేరేదాకా దారిపొడుగునా బాబా ప్రతిచోటా ఫోటో రూపంలో దర్శనమిస్తూనే ఉన్నారు. ఆటోడ్రైవర్ జాగ్రత్తగా నన్ను నా గమ్యం చేర్చాడు. అందువల్ల నేనతనికి 50 రూపాయలు అదనంగా ఇద్దామనుకున్నాను. కానీ ఆశ్చర్యంగా నేను ఆటో దిగిన మరుక్షణం అతను 50 రూపాయలు అదనంగా ఇవ్వమని అడిగాడు. నేను సంతోషంగా అతనికి డబ్బులు ఇచ్చాను. తరువాత అతను, "మీరు ఇక్కడ పని పూర్తయ్యాక ఇంకెక్కడికైనా వెళ్తానంటే, నేను వేచి ఉంటాన"ని అన్నాడు. నేను, "అవసరం లేదు, మీరు వెళ్ళండ"ని చెప్పగా అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్లిన మరుక్షణం “బంధువులు, స్నేహితులు ఎవరూ నీకు సహాయం చేయరు. నీ పనిని నీవే సొంతంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అది సాధించాలంటే శ్రీసాయిని గుర్తుంచుకో!” అన్న బాబా మెసేజ్ గుర్తుకు వచ్చి, ఇలాంటి క్లిష్టపరిస్థితిలో బాబా మాత్రమే నా వెన్నంటి ఉండి నాకు సహాయం చేసారు. పైగా నా పని అయ్యేంతవరకు ఉండి నాకు తన సహాయం అందించేవారు. కానీ నేనే నా కోసం వచ్చిన బాబాని వెనక్కి పంపేసాను. ఏది ఏమైనా బాబా సదా మాతోనే ఉన్నారని ఋజువు చేసారు.

రిజిస్ట్రేషన్ ఆఫీసు లోపలికి వెళ్తున్నపుడు మళ్ళీ నాకు ఆందోళనగా అనిపించింది. డాక్యుమెంట్ ఆఫీసు లోపలికి వెళ్ళగానే పెద్ద ఫోటో రూపంలో బాబా దర్శనమిచ్చి మాకు అభయం ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా అనిపించి, బాబాకి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బాబావలనే మేమంత దూరం రాగలిగాము. బాబా కృపే లేకుంటే మేము ఇంకా చాలా సమస్యలని ఎదుర్కోవాల్సి వచ్చేది. మొత్తానికి బాబా కృపవలన రిజిస్ట్రేషన్ అనే పెద్ద సమస్య తీరిపోయింది. అయితే ఇప్పుడు ఇంకో సమస్య వచ్చింది.

నేను బస చేసిన హోటల్ పేరు మర్చిపోయానని చెప్పాను కదా! అందువలన అక్కడికి ఎలా చేరుకోవాలో అర్థం కాలేదు. ఆలోచించగా కొంచెంగా దారి గుర్తురావడంతో నేను, మా అమ్మ, మా బంధువులు కలిసి కారులో బయలుదేరాము. కొంతదూరం వెళ్ళాక ఎటు వెళ్ళాలో కూడా తెలియలేదు. ఇంకేమీ చేసేది లేక అడ్వాన్సుగా హోటల్ లో చెల్లించిన 2000 రూపాయలు, నా సామాన్లు అలానే వదిలేయ్యాలనే నిర్ణయానికి వచ్చేసాను. ఆ సమయంలో అమ్మ, "హోటల్ ఫోన్ నెంబర్ తీసుకోలేదా?" అని అడగడంతో నాకు ఉదయాన కాన్సిల్ చేసిన ఓలా క్యాబ్ సంగతి గుర్తుకు వచ్చింది. వాళ్ళకి ఫోన్ చేసి ఎలాగో మొత్తానికి కాన్సిల్ చేసిన వివరాల నుండి హోటల్ పేరు తెలుసుకోగలిగాను. ఆ వివరాలతో హోటల్ కి ఫోన్ చేసి అక్కడి సిబ్బంది సహాయంతో హోటల్ చేరుకోగలిగాను. ఈ కారణం చేతనే బాబా ఓలా క్యాబ్ బుక్ చేయించి, కాన్సిల్ చేయించారని నాకర్థమైంది.

అప్పటికే బాగా పొద్దుపోవడంతో అమ్మను నావద్ద వదిలేసి, మా కజిన్ తన బ్రదర్ ఇంటికి వెళ్లారు. అమ్మ, మా కజిన్ వేకువఝామునే ఇంటికి బయలుదేరిపోదామని అనుకున్నారు. నేను మాత్రం హోటల్ నుండే వర్క్ చేసుకొని, ఆ తరువాత సిటీలోని నాకెంతో ఇష్టమైన బాబా మందిరాలు సందర్శించి బెంగళూరు వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. కానీ అమ్మ నన్ను తనతో నేటివ్‌ ప్లేస్‌కి రమ్మని చెప్పడంతో సందిగ్ధంలో పడ్డాను. అయితే మరోవైపు హోటల్ యజమాని ముందుగా నాకు 1700 రూపాయలకి ఒప్పుకొని, తరువాత ఇంకా ఎక్కువ డబ్బులు కావాలని పోరు చేయడంతో అమ్మ వెళ్ళిపోయిన తరువాత నేనింకా అక్కడుంటే ఇంకెన్ని సమస్యలు ఎదురుకోవాల్సి వస్తుందో అని భయపడి నేను కూడా అమ్మతో వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్లే మార్గంలో అంతా బాబా మాతోనే ఉన్నారు. కానీ సిటీలోని బాబా మందిరాలకి వెళ్ళలేకపోయానని బాధపడ్డాను. ఎందుకంటే మా ప్లాట్స్ అమ్మివేయడంతో ఇక ఆ సిటీకి వెళ్ళే అవసరం లేదు. ఏది ఏమైనప్పటికి అంతా బాబా ఇష్టప్రకారమే జరుగుతుంది.

బాబా ఆయన ఛాతీ మీద గుద్ది చికిత్స చేశారు..


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

స్మిత బద్గవాకర్, తన భర్త విశ్వనాథ్‌తో పూనాలో నివసిస్తుండేవారు. అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్నాడనుకున్న ఆమె భర్త, హఠాత్తుగా 2002, జులై 1 న వాంతులు, కడుపునొప్పితో బాధపడసాగాడు. ఆమె అతనికి అల్లం టీ ఇచ్చినా కూడా వాంతులు ఆగలేదు. వెంటనే ఆమె అతన్ని సంజీవనీ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు అతనికి గుండెపోటుగా సందేహించారు. అతనికి నొప్పి తగ్గిన తరువాత, ఇసిజి, ఆంజియోగ్రామ్ చేసారు. ఆంజియోగ్రామ్ రిపోర్టులో గుండెకు సంబంధించిన మూడు పెద్దనాడులు మూసుకుపోయాయని వచ్చింది. దానితో వైద్యులు, "గుండెపోటు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా బైపాస్ సర్జరీ చెయ్యాల"ని సూచించారు. దాంతో స్మిత పెద్ద సమస్యలో పడ్డారు. సర్జరీకి రెండు లక్షలు ఖర్చవుతుంది. ఆమె దగ్గర అంత డబ్బులేదు. పైగా ఎక్కడినుంచైనా తీసుకుని రాగలిగే పరిస్థితి కూడా లేదు. అటువంటి నిస్సహాయస్థితిలో ఆమె పరిష్కారం కోసం బాబాని ప్రార్థించి, భారం బాబా మీద వేశారు.

ఆమె భర్త విద్యుత్తు బోర్డు(M.S.E.B)లో ఇంజనీరుగా పనిచేస్తుండేవారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అతని సహాయార్ధం అతని మిత్రులు ముందుకొచ్చారు. వారు బోర్డునుండి సగం బిల్లు చెల్లించే విధంగా ఏర్పాటు చేసి, ముంబయి హెడ్ ఆఫీస్ నుండి చెక్కు తెచ్చి ఆసుపత్రిలో అందజేసారు. మిగతా డబ్బు స్మిత తను దాచుకున్న సేవింగ్స్ నుండి, మరికొంత అతని సహచరుల వద్దనుండి సేకరించి మొత్తం బిల్లు చెల్లించారు. వెంటనే సర్జరీకి తేదీ నిర్ధారించారు.

సర్జరీకి ముందురోజు ఆమె తన భర్త మంచం ప్రక్కన కూర్చుని ఉండగా, హఠాత్తుగా అక్కడ బాబా కనిపించారు. ఆయన తన భర్త ఛాతీమీద ఏదో మందు రాసి, చిన్నగా ఒక గుద్దు గుద్ది అదృశ్యమైపోయారు. వెంటనే ఆమె భర్త లేచి, "దేనినో కొడుతున్నారు, ఎవరు?" అని అడిగారు. నిజానికి దేనినో కొడుతున్న శబ్దమైతే వినపడుతుంది కానీ, ఆమెకు ఎవరూ కనపడటం లేదు. ఆవిధంగా బాబా తన భర్తకు చికిత్స చేస్తున్నట్లుగా, సర్జరీ విజయవంతం అవుతుందని సూచిస్తున్నట్లుగా ఆమె భావించింది. అదే నిజమైంది. మరుసటిరోజు జరిగిన బైపాస్ సర్జరీ విజయవంతమయ్యింది. వాళ్ళిద్దరూ బాబాకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆ రీతిన స్మిత భర్త ప్రాణాలను బాబా కాపాడారు.

బాబా భక్తుల కర్మను తీసివేసే విధానం కంటికి కనపడదు, అనుభవిస్తేనే తెలుస్తుంది.

మూలం: శ్రీసాయి సాగర్ పత్రిక, 2007

బాబా వల్లే నాకు ఆపరేషన్ లేకుండా నయమైంది.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

పేరు వెల్లడించని ఒక సాయిబంధువు తన అనుభవాన్ని ఇలా మనతో పంచుకుంటున్నారు.

ఆస్తులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బంధుమిత్రులు దగ్గర ఉండొచ్చు, దూరం కావచ్చు. కానీ దేవుడలా కాదు.. ఎప్పటికీ నిలిచే పెన్నిధి. సర్వకాల సర్వావస్థలయందు తోడూ నీడగా ఉండే ఆత్మీయబంధం. నేను సాయిబాబాను త్రికరణశుద్ధిగా నమ్ముతాను. బాబా నన్ను నిరంతరం కనిపెట్టుకుని ఉంటారు. అలాంటి ఉదంతాలకు అంతులేదు. అయితే శాస్త్రీయంగా కూడా ఋజువు చేసిన సంఘటన ఒకటి చెప్తాను. ఇది జరిగి చాలా ఏళ్ళు గడిచినప్పటికీ ఇప్పుడే జరిగినంత తాజాగా జ్ఞాపకం ఉంది.

ఒకప్పుడు నా పొత్తికడుపులో బాగా నొప్పి రావడంతో మా ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదించాను. నేను చెప్పిన లక్షణాలను బట్టి ఆయన ఏవో పెయిన్ కిల్లర్లు ఇచ్చారు. రెండు రోజులు గడిచినా కాస్త కూడా నొప్పి తగ్గకపోవడంతో మళ్ళీ డాక్టర్ వద్దకు వెళ్ళాను. డాక్టర్ కంగారుపడి ఏవో పరీక్షలు చేసి, ''యుటిరస్ ప్రాబ్లం, వెంటనే గైనకాలజిస్టును కలవమ"ని చెప్పారు. డాక్టరు సుమతి ప్రముఖ గైనకాలజిస్టు. నేను ఆవిడను సంప్రదిస్తే, ఆమె అవసరమైన పరీక్షలన్నీ చేసి, మరుసటిరోజు ఆపరేషన్‌కు సిద్ధంగా ఉండమని చెప్పింది. తాత్కాలిక ఉపశమనం కోసం ఆమె ఇచ్చిన మందులు పనిచేసి, నొప్పి తీవ్రత కొంత తగ్గినా, ఉండుండి పోట్లు వస్తూనే ఉన్నాయి. ఆ పోటు వచ్చినప్పుడల్లా ప్రాణం పోతున్నట్లే ఉండేది. ఎంత తమాయించుకుందామన్నా నా వల్ల కాక ఏడ్చేసేదాన్ని. ఇంట్లో అందరూ నా చుట్టూ చేరి ఓదార్చే ప్రయత్నం చేస్తుండేవారు. నాకేమో ఆపరేషన్ అంటే చాలా భయం. మందులతో నయమయ్యే అవకాశం లేదు. ఏం చేయాలో పాలుపోలేదు. ఎక్కువ సమయం కూడా లేదు, తెల్లారితే ఆపరేషన్. విపరీతమైన భయంతో చస్తుంటే, మావారు, పిల్లలు, "ఓపెన్ హార్ట్ సర్జరీలు, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్లు జరుగుతున్న కాలంలో దీనికింత హంగామా చేస్తున్నావా?" అని కాస్త వెటకారంగా మాట్లాడుతూ, "ఆపరేషన్ చాలా తేలిక, కన్ను మూసి తెరిచేలోగా పనైపోతుంది" అంటూ నచ్చజెప్పి, నా భయం పోగొట్టడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ భయపడుతూ, ''ఈ గండం ఎలా గడుస్తుంది? ఏంటి బాబా చోద్యం చూస్తున్నావా? నన్ను రక్షించు నాయనా!'' అంటూ వేడుకున్నాను.

కాసేపటికి నొప్పి భరించలేక అలా వెన్ను వాల్చాను. అంత నొప్పిలోనూ, వేసుకున్న మందుల వలన కాస్త మత్తుగా అనిపించి నిద్రలోకి జారుకున్నాను. కొద్దిసేపట్లో చిత్రమైన కల ..  ఆ కలలో మా వాకిటి ముందు పెద్ద మంచుగోళం. దానిమీద కృష్ణుడి రూపంలో సాయిబాబా నిలబడి ఉన్నారు. నేను, "ఏవండీ! బాబా చూడండి. అమ్మా బుజ్జీ! త్వరగా రా! బాబాను చూడు. అయ్యో! మీరొచ్చేలోగా ఆయన వెళ్లిపోతారేమో! త్వరగా రండి'' అని కేకలు పెడుతున్నాను. ఎవరూ రాలేదు. ఇంతలో గుండ్రంగా ఉన్న ఐసంతా కరిగిపోయి బాబా మాత్రమే మిగిలారు. ఆయన, ''నేనున్నాను కదా! ఎందుకు భయపడుతున్నావు?'' అన్నట్లు సైగ చేసి, అభయహస్తం చూపిస్తూ అంతర్థానమయ్యారు. ఉలిక్కిపడి లేచాను. గుండె వేగంగా కొట్టుకుంటోంది. కానీ కలలో సాయిబాబా దర్శనమెంతో ఆనందాన్నిచ్చింది. ఏమైందో గానీ, అంతకుముందు నేను పడుతున్న బాధలేదు. పైగా ఎంతో హాయిగా ఉంది. తెల్లవారాక, ''నొప్పి తగ్గిపోయింది. ఇక ఆపరేషన్‌తో పనిలేద"ని నేనంటే, అందరూ కోప్పడి, ''చిన్నపిల్లలా మారాం చేయకు. డాక్టరుగారిచ్చిన మందులతో నొప్పి తగ్గి ఉండొచ్చు కానీ, ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం అని డాక్టరు చెప్పలేదా?'' అంటూ నర్సింగ్ హోంకి తీసుకెళ్ళారు.

డాక్టర్‌తో కల గురించి చెప్పాలనిపించక, కలలో సాయిబాబా కనిపించిన సంగతి చెప్పకుండా నొప్పి పూర్తిగా తగ్గిపోయిన విషయం మాత్రమే చెప్పాను. ఆవిడ ఆశ్చర్యపోతూ, ''అలా ఎలా తగ్గిపోతుంది? సరే! మళ్ళీ ఒకసారి స్కాన్ చేయించండి'' అని చెప్పింది. అలాగే స్కానింగ్ చేయించాం. రెండోసారి వచ్చిన రిపోర్టులో గర్భసంచిలో ఏమీ తేడా లేదు. పూర్తి నార్మల్‌గా ఉన్నట్లు వచ్చింది. ఆవిడ నవ్వుతూ, ''నిన్నటి రిపోర్టు కరెక్టు కాదేమో! ఇప్పుడంతా నార్మల్‌గా ఉంది. ఆపరేషన్ అవసరం లేదు'' అన్నారు.

సుమతిగారు డాక్టరు గనుక 'నిన్నటిది రాంగ్ రిపోర్టు' అన్నారు. కానీ, నేను స్కానింగ్ మా బంధువుల డయాగ్నోస్టిక్ సెంటర్లో చేయించాను. వాళ్ళు ఎంతో జాగ్రత్తగా దగ్గరుండి తీయించారు. ఒకరి రిపోర్టు మరొకరికి ఇవ్వడమో, లేక రాంగ్ రిపోర్టు ఇవ్వడమో జరిగే అవకాశమే లేదు. ఇదంతా ఖచ్చితంగా సాయిబాబా మహిమే! బాబా నాకు అభయహస్తం ఇచ్చారు. సాయిబాబా మహిమలు వర్ణించ శక్యమా? బాబా వల్లే నాకు ఆపరేషన్‌తో పని లేకుండా నయమైంది. నాకు సాయిబాబా ప్రసాదించిన దివ్యానుభూతుల్లో ఇదొకటి.

బాబా అనుగ్రహం విశ్వమంతటా వ్యాపించి, ఎక్కడ ఉన్నా తన బిడ్డలను రక్షిస్తుంది.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

1982 అక్టోబర్ 8న, డోంగర్ జీ(జానీ), అతని అల్లుడు వార్ధా నుంచి రాజస్థాన్‌ లోని బస్వాడాకు వెళ్తున్నారు. వాళ్ళు రైలులో రత్లామ్ వరకు ప్రయాణించి, అక్కడనుంచి బస్సులో బస్వాడా వెళ్లాలని బస్ స్టేషన్‌కి వెళ్ళారు. వాళ్ళు బస్సు ఎక్కే సమయానికి ఇద్దరు ప్రయాణీకులు తప్ప బస్సంతా ఖాళీగా ఉంది. అందువల్ల ఇద్దరూ ఒక్కో సీటులో కూర్చున్నారు. బస్సు కదిలే సమయానికి 15 మంది ప్రయాణీకులు పరిగెత్తుకుంటూ వచ్చి గబగబా బస్సు ఎక్కారు. వాళ్ళు జానీని, "దయచేసి మీరిద్దరు వెనకాల కూర్చుంటారా? మేమంతా ఒకే కుటుంబం వాళ్ళం, కాబట్టి అందరం కలసి కూర్చోవాలని అనుకుంటున్నాము" అని అభ్యర్థించారు. జానీ అందుకు అంగీకరించి, తన అల్లుడితో పాటు బస్సులో వెనుకకు వెళ్లి కూర్చున్నారు.

బస్సు ముందుకుసాగుతూ, హైవే మీదకు వెళ్ళగానే వేగం అందుకుంది. రాత్రి 9 గంటల సమయంలో బస్సు ఒక గ్రామం గుండా వెళ్తూ, మధ్యలో ఉన్న వంతెనను దాటుతుండగా అదుపుతప్పి నదిలో పడిపోయింది. ప్రయాణీకులందరికీ ఏం జరిగిందో అర్థమయ్యేలోపు బస్సు వంతెననుంచి 15 అడుగుల లోతులోకి పడిపోయింది. ప్రయాణీకులందరూ ఆర్తనాదాలు చేసారు. అయితే జానీ, అతని అల్లుడు మాత్రం సహాయం కోసం బాబాని ప్రార్థించారు. తరువాత గ్రామస్థులు, పోలీసులు కలిసి బస్సును బయటకు లాగి, ప్రయాణీకులందరినీ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. జానీకి, అతని అల్లుడికి ఎటువంటి దెబ్బలు తగలని కారణంగా వెంటనే డిశ్చార్జ్ చేసారు. మరునాడు వార్తాపత్రికలో వీళ్లిద్దరు తప్ప మిగతా ప్రయాణీకులంతా చనిపోయారని చదివి జానీ నిర్ఘాంతపోయాడు. వెంటనే మనస్సులోనే, ప్రయాణీకుల అభ్యర్థనను మన్నించి బస్సులో వెనుక సీటుకు వెళ్ళే విధంగా చేసి తమ ప్రాణాలు కాపాడినందుకు బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. బాబా అనుగ్రహం విశ్వమంతటా వ్యాపించి, ఎక్కడ ఉన్నా తన బిడ్డలను రక్షిస్తుంది.

మూలం: సాయి ప్రసాద్ పత్రిక 1993 (దీపావళి సంచిక).

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo