ఈ భాగంలో అనుభవం:
- బాబా సర్వాంతర్యామి - ఏదో ఒక రూపంలో సహాయం చేస్తారు
సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు పద్మావతి. బాబా ఎన్నో సందర్బాల్లో నాకు తోడుగా ఉండి నన్ను ముందుకు నడిపించారు, చాలా విషయాల్లో ఆయన నా కోరికలను మన్నించి నాకు సహాయం చేసారు. అలాంటి కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ఒకసారి మా చిన్నబాబుకి విపరీతమైన జ్వరం వచ్చింది. రాత్రంతా 6 గంటలకు ఒకసారి సిరప్ వేసినా తగ్గలేదు. మామూలుగా సిరప్ వేస్తే కొంచెం తగ్గి, మళ్లీ పెరిగేది. కానీ ఈసారి నిరంతరాయంగా బాబు తీవ్రమైన జ్వరంతో బాధపడ్డాడు. మరుసటిరోజు సాయంత్రం బాబుని హాస్పిటల్‌కి తీసుకెళ్తే, డాక్టర్ సిరప్లు ఇచ్చి, డెంగ్యూ మరియు రక్త పరీక్షలు కూడా చేయించమని చెప్పారు. నేను బాబాని రిపోర్టులో డెంగ్యూ, తదితర అన్నీ నెగిటివ్ రావాలని ప్రార్ధించాను. బాబా దయవల్ల రిపోర్టులన్నీ నెగిటివ్‌గానే వచ్చాయి. కానీ జ్వరం తీవ్రత మాత్రం తగ్గలేదు. మరుసటిరోజు సాయంత్రం బాబుని మళ్ళీ డాక్టర్ దగ్గరకి తీసుకెళ్తే, యాంటీబయాటిక్స్ ఇచ్చి, "మూడు, నాలుగు గంటల్లో తగ్గకపోతే అడ్మిట్ చేయాలి" అని చెప్పారు. తర్వాత హాస్పిటల్లోనే బాబుకి సిరప్ వేస్తే, బాబు వాంతి చేసుకున్నాడు. డాక్టర్, "ఎందుకైనా మంచిది బాబుని అడ్మిట్ చేయండి. లేదంటే, ఇంటికి వెళ్లి వేరే సిరప్ వేసి చూడండి. తగ్గకపోతే బాబుని తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేయండి" అని చెప్పారు. మేము ఇంటికి వెళ్లి అర్ధరాత్రి వరకు చూద్దామనుకున్నాము. అలాగే ఇంటికి వెళ్లి బాబుకి సిరప్ వేసాము. కానీ జ్వరం తగలేదు. రాత్రి 11:30 అప్పుడు మావారు, "బాబుని హాస్పిటల్లో అడ్మిట్ చేద్దాం పదండి" అన్నారు. నేను పూజగదిలోకి వెళ్లి బాబాకి దణ్ణం పెట్టుకొని, "బాబా! బాబుకి జ్వరం తగ్గించండి. మీ 'నవగురువార వ్రతం చేస్తాన"ని మ్రొక్కుకొని ఊదీ నీళ్లలో కలిపి బాబుచేత తాగించాను. ఆశ్చర్యం! అరగంటలో జ్వరం జ్వరం తీవ్రత తగ్గి నార్మల్ టెంపరేచర్‌కి వచ్చింది. నిజంగా బాబా మహత్యం అద్భుతం.
మేము ప్రస్తుతం మావారి ఉద్యోగరీత్యా అహ్మదాబాద్‌లో ఉంటున్నాము. ఇక్కడ చదువు మా పెద్దబాబుకి నచ్చకపోవడం వల్ల తనని హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చాలని కొన్ని స్కూళ్ళు చూసి, వాటిలో నుండి రెండు స్కూళ్ళు సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత నేను ఒక గురువారం బాబా గుడికి వెళ్లి, బాబా ముందు కూర్చొని ఆయన్ని ప్రార్ధించి చీటీలు వేసాను. అప్పుడు బాబా ఆ రెండు స్కూళ్లలో ఒక స్కూలు సూచించారు. ఆ స్కూల్లోనే బాబుని చేర్పించాలని ప్రయత్నించాను కానీ, ఆ స్కూల్లో అడ్మిషన్ దొరకలేదు. ఈలోపు వేసవి సెలవులు రావడంతో వేరే స్కూల్లో అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకొని మా సొంత ఊరికి వెళ్లిపోయాం. మొదట అనుకున్న స్కూల్ మీద ఆశలు వదిలేసుకున్నాం. అయితే బాబా తాము చెప్పిన ఆ స్కూల్లో అడ్మిషన్ ఇప్పిస్తారని ఊహించలేదు. అనుకోకుండా మా ఆయనకి ఒక వాట్సప్ గ్రూపులోని ఒకతను ఫ్రెండ్ అయ్యారు. ఆశ్చర్యమేమిటంటే, అతను ఒక పదేళ్ల క్రితం ఒక పని మీద మావారిని కలిసారట. అతని ద్వారా ఆ స్కూల్లో పనిచేసే ఒక వ్యక్తి సహాయంతో మళ్ళీ అడ్మిషన్ కోసం మరోసారి ప్రయత్నం చేస్తే చాలా ఆశ్చర్యకర సంఘటనల అనంతరం మా బాబుకి అడ్మిషన్ లభించింది. అతని రూపంలో బాబానే మా బాబుకు ఆ స్కూల్లో అడ్మిషన్ వచ్చేలా సహాయం చేసారు.
ఒకసారి మా పెద్దబాబు సెలవులకి హైదరాబాద్ నుంచి మా దగ్గరకి రావడానికి ఫ్లైట్ బుక్ చేసాం. వాడికి 12 ఏళ్లు. అదివరకు ఫ్లైట్ జర్నీ చేసాడు కానీ పెద్దవాళ్ళు లేకుండా ఫ్లైట్ ఎక్కడం ఇదే మొదటిసారి. మేము వీడియో కాల్లో గైడ్ చేస్తూ ఉంటే, రాగలడని టికెట్ బుక్ చేసాం. ఆరోజు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల మా బాబు, మా మరిదిగారు సమయానికి ఎయిర్పోర్ట్ చేరుకోలేకపోయారు. మేము ఫోన్ చేస్తే, ఇంకా చాలా దూరంలో ఉన్నామని చెప్పారు. దాంతో నేను చల్లా టెన్షన్ పడ్డాను. ఒకపక్క ఫ్లైట్‌కి సమయం అయిపోతోంది, వాళ్లేమో ఇంకా ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోలేదు. ఫ్లైట్ మిస్ అయితే ఇంకో ఫ్లైట్‌కి టికెట్ తీసుకోవాలంటే చాలా ఖర్చవుతుంది. నాకు ఏం చేయాలో అర్థంకాక, "బాబా! బాబు ఎలాంటి ఆటంకం లేకుండా మా దగ్గరకు వచ్చేలా చూడండి" అని బాబాను ప్రార్థించాను. మా బాబు సెక్యూరిటీ చెక్ ఇన్ దగ్గరకి వెళ్లేసరికి ఫ్లైట్ వెళ్లిపోయింది. కానీ బాబా ఆ ఫ్లైట్ కంపెనీ(ఇండిగో) స్టాఫ్ రూపంలో మాకు సహాయం చేసారు. మా బాబు సెక్యూరిటీ చెక్ ఇన్ దగరకి వెళ్లి అడిగితే, ఇండిగో స్టాఫ్ ఒకతను చెక్ చేసి, "ఫ్లైట్ వెళ్ళిపోయింది" అని చెప్పి ఆపై మాకు, మా మరిదికి ఫోన్ చేసి, "ఏం పర్లేదు. ఇంకో గంటలో మరో ఫ్లైట్ ఉంది. అందులో సీట్లు ఖాళీ ఉన్నాయి. మీరు 2,500 రూపాయలు చెల్లిస్తే తర్వాత ఫ్లైట్‌లో పంపిస్తాం" అని చెప్పారు. మేము వెంటనే ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపాము. అతను దగ్గరుండి ఒక స్టాఫ్‌ని మా బాబుకోసం కేటాయించి మరీ తదుపరి ఫ్లైట్ ఎక్కించి సీటులో కూర్చోబెట్టేవరకు సహాయం చేసారు. అలా బాబా మాకు తక్కువ ఖర్చుతోనే బాబుని సురక్షితంగా మా దగ్గరికి వచ్చేలా చేసారు. నిజంగా బాబా సర్వాంతర్యామి. ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి మనకు సహాయం చేస్తారు. "ధన్యవాదాలు బాబా. మీరు చాలా సందర్బాల్లో మాకు తోడుగా నిలిచారు, కష్టాల్లో ఆదుకున్నారు. మీ కృపా ఎల్లప్పుడూ ఇలాగే నాపై, నా కుటుంబంపై ఉండాలని ప్రార్ధిస్తున్నాను. అలాగే ఈ విశ్వం అంతటిని మీరు చల్లగా చూస్తారని ఆకాంక్షిస్తున్నాను. మీకు సదా నా ధన్యవాదాలు బాబా".
సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!
