ఈ భాగంలో అనుభవాలు:
1. శిరిడీయాత్ర అనుభవం
2. సాయిబాబానే పాపని కాపాడారు!
శిరిడీయాత్ర అనుభవం
సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య. నాకు దేవుడు అంటే బాబా మాత్రమే. 'సాయి సాయి' అని రోజుకి 1000 సార్లు అయినా అనుకుంటాను. 2025, జనవరి 24న నేను, నా భర్త, మా ఇద్దరు చిన్నపిల్లలు, ఇంకా నలుగురు పెద్దవాళ్ళు మొత్తం 8 మందిమి శిరిడీకి ప్రయాణమయ్యాం. మర్నాడు మధ్యాహ్నం 3:15కి మేము శిరిడీ చేరుకున్నాము. మేము ఆరోజు ఉదయం రైలులో టిఫిన్ తిన్నాం అంతే, మధ్యాహ్నం భోజనం చేయలేదు. అందువల్ల శిరిడీ చేరేసరికి అందరం చాలా ఆకలితో ఉన్నాం. మన సాయితండ్రి తమ బిడ్డలని ఆకలితో ఉంచారు కదా! మేము బసకోసం అఖిల భారత ట్రస్ట్‌కి వెళ్తూనే అక్కడ రిసెప్షన్లో ఉన్న ఆమె, "సామాను ఇక్కడ పెట్టి ముందు భోజనం చేసి రండి" అని చెప్పింది. భోజనశాల మూసేసి వేళకు వెళ్లినా మాకు మంచి భోజనం పెట్టారు. ఆకలితో ఉన్న మాకు చాలా సంతృప్తిగా అనిపించింది. తిన్న తర్వాత గది తీసుకొని స్నానాలు చేసి సాయంత్రం దర్శనానికి వెళ్ళాం. నేను మనసులో బాబా బ్లూ రంగు వస్త్రాల్లో ఉండాలనుకొని వెళ్ళాను. అయితే మేము బాబా దగ్గరికి వెళ్లేసరికి ఆయన పసుపు రంగు వస్త్రాల్లో ఉన్నారు. అయినప్పటికీ నేను చాలా భావావేశానికి లోనయ్యాను. దర్శనానంతరం మేము ప్రసాదాలయంకి వెళ్లి భోజనం చేసి మేము బస చేసిన ట్రస్ట్‌కి వెళ్లి బయట కుర్చీలలో కూర్చున్నాం. నేను కూర్చున్న చోట కాస్త పైన టీవీ ఉంది. అందులో బాబా శేజారతి ప్రత్యక్ష ప్రసారం వస్తుంది. నా ఎదురుగా కూర్చున్న ఒక అమ్మ నన్ను పిలిచి, "ఆరతి వస్తుంది చూడు" అని చెప్పింది. నేను చూసి చాలా ఆనందానికి లోనయ్యాను. ఎందుకంటే, బాబా బ్లూ రంగు వస్త్రాల్లో ఉన్నారు. సాయంత్రం దర్శనానికి వెళ్ళినప్పుడు పసుపు రంగు వస్త్రాల్లో ఉన్నా ఇప్పుడు నేను కోరుకున్న బ్లూ రంగు వస్త్రాల్లో బాబా దర్శనమిచ్చి నా కోరిక నెరవేర్చారని సంతోషించాను.
మరుసటిరోజు మేము మొదట సాయి తీర్ట్కి వెళదామనుకున్నప్పటికీ తర్వాత త్రయంబకేశ్వరం వెళ్లాలనుకున్నాము. అయితే టాక్సీవాళ్ళు, "6 నుండి 7 గంటల సమయం పడుతుంది, దర్శనం కాకపోవచ్చు" అన్నారు. దాంతో చిన్న పిల్లలతో కష్టమని ఆగిపోయాము. కానీ మా అమ్మ, అత్తమ్మ వెళదామన్నారు. ఇంకా వాళ్ళకోసం అప్పటికే ఉదయం 10:30 అయినగాని బయలుదేరాము. మేము త్రయంబకేశ్వరం వెళ్ళేసరికి మధ్యాహ్నం 2 గంటలైంది. క్యూలైన్ చాలా పెద్దగా ఉండటంతో పిల్లలు ఏడుస్తారేమో అని నాకు భయమేసింది. కానీ వాళ్ళు చక్కగా ఆడుకుంటూ వాళ్ళంతటవాళ్లే నడిచారు. దర్శనానికి 4 గంటల సమయం పట్టినప్పటికీ పిల్లలు ఇబ్బంది పెట్టనందువల్ల దర్శనం సంతోషంగా అయింది. అంతా సాయినాథుని దయ. తిరిగి కారులో వస్తున్నప్పుడు నేను నా భర్తతో, "బాబా దయవల్ల మనకి ఆనందకరమైన దర్శనమైంది. నేను ప్రతి సంవత్సరం ఖచ్చితంగా శిరిడీ వస్తాను" అని చెప్పాను. దానికి మా ఆయన, "అలా మొక్కులు పెట్టుకోకు. మనకి కుదిరినప్పుడు వద్దాం. బాబా దయ ఉంటే పిలుచుకుంటారు" అని అన్నారు. నేను, "బాబా ఎప్పుడూ మన నీడలా మన వెంటే ఉంటారు" అని చెప్పాను. ఆశ్చర్యంగా నేను అలా అన్న మరుక్షణం ఒక కారు మా కారుని ఓవర్టేక్ చేస్తూ వెళ్ళింది. దాని వెనుక పెద్ద సాయిబాబా ఫోటో ఉంది. బాబాని చూసి మావారు షాకై, "మనం తప్పకుండ ప్రతి సంవత్సరం శిరిడీ వచ్చి దర్శనం చేసుకుందాం" అని అన్నారు. అంతా బాబా లీల..
మర్నాడు మేము దర్శనానికి వెళ్ళినప్పుడు నేను బాబాకి ఎదురుగా కూర్చుంటే, లేచి వెళ్ళమని అక్కడున్న సెక్యూరిటీ హడావిడి చేసాడు. కానీ నేను 2 నిమిషాలని అక్కడే నిలబడి వేడుకుంటుంటే, అదే సెక్యూరిటీ నా చేతికి ఒక పువ్వు ఇచ్చాడు. నన్ను అక్కడినుండి వెళ్లిపొమ్మన్నతనే బాబాకి సమర్పించిన పువ్వు తీసుకొచ్చి మరీ నా చేతిలో బాబా సమక్షంలో పెట్టడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. తర్వాత ద్వారకామాయిలో కొంత సమయం గడిపి బాబాకి మళ్లీ వస్తానని వీడ్కోలు చెప్పి వచ్చేశాం. ప్రయాణంలో పిల్లలుకానీ, పెద్దవాళ్లుకానీ ఎలాంటి ఇబ్బంది పడలేదు. ఇదంతా సాయిబాబా దయ. "ధన్యవాదాలు బాబా".
సాయిబాబానే పాపని కాపాడారు!
నేను ఒక సాయి భక్తురాలిని. నాకు పెళ్ళైన తర్వాత మేము చెన్నైలో ఉండేవాళ్ళం. అప్పుడు నేను రోజూ కారులో నా ఇద్దరు కూతుర్లను, మా బావగారి కూతుర్లను స్కూలుకు తీసుకెళ్లేదాన్ని. అప్పుడు నా చిన్న కూతురు వయస్సు ఒక సంవత్సరం ఉంటుంది. ఒకరోజు వర్షం అధికంగా కురిసింది. ఆ మర్నాడు స్కూలుకి వెళ్ళినప్పుడు బాగా బురదగా ఉన్నందు వల్ల డ్రైవర్ కారుని కొంచెం దూరంలో ఆపాడు. నేను నా చిన్న కూతుర్ని ఎత్తుకొని మిగతా ముగ్గురు పిల్లల్ని స్కూలుకి తీసుకొని వెళ్తుండగా బురదకి నా కాలుజారింది. హఠాత్తు పరిణామంతో నేను నా చేతిలో ఉన్న పాపని వదిలేసాను. కింద చూస్తే, పెద్ద రాయి ఉంది. నేను నా పాప నేరుగా ఆ రాయి మీద పడుతుందనుకొని కళ్ళు మూసుకుని పెద్దగా అరిచేసాను. కానీ కళ్ళు తెరిచి చూస్తే, పాప రాయి మీద కాకుండా పక్కన బురదలో పడింది. తనకి ఎటువంటి దెబ్బ తగలలేదు. ఇది నాకు ఒక అద్భుతమైన అనుభవం. ఆ రోజు గురువారం. సాయిబాబానే మా పాపని కాపాడారు. నేను పిల్లల్ని స్కూలులో వదిలేసి పాపను తీసుకొని నేరుగా గుడికి వెళ్లి బాబాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఆయనకి ఎన్నిసార్లు ధన్యవాదాలు తెలిపినా తక్కువే.
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteBaba please baba .. Meenakshi ki tondaraga Pelli kudirinchi, manchiga Pelli jarigela Anni nuvve chey baba.. ni Krupani mapai chupu tandri.. nee Leelalni , ma paina nee Premani ee blog lo Andaritho panchukuntanu tandri🙏 Amma nanna ki Raksha ga undu.. Amma nanna ki ayurarogyalu ivvu deva..
ReplyDeletena puttinintini,Mettinintini kapaduthu undu Sai Prabhu🙏🙏🙏🙏🙏
Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me