సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1960వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. వేడుకున్నంతనే ట్యాబ్ కనపడేలా అనుగ్రహించిన బాబా
2. అంతలా ఉంటుంది బాబా లీల

వేడుకున్నంతనే ట్యాబ్ కనపడేలా అనుగ్రహించిన బాబా

నా పేరు రాణి. మాది కాకినాడ. సాయి లేకుండా నేను ఒక్కరోజు కూడా బ్రతకలేను. నా జీవితంలో సాయి ప్రసాదించిన అనుభవాలు చాలానే ఉన్నాయి. సాయి వద్దని చెప్పినవి చేయడం వల్ల రెండు, మూడుసార్లు నష్టం జరిగింది. అలాంటి అనుభవాలు ఎదురైనప్పటినుండి నా జీవితంలో ప్రతి నిమిషం సాయి నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. ఇక నా అనుభవానికి వస్తే..  2025, జనవరి 12న సంక్రాంతి పండక్కి శిరిడీలో ఉందామని నేను, నా పెద్దకూతురు స్నేహ శిరిడీ వెళ్ళాము. నా చిన్నకూతురు హాస్టల్లో ఉంటూ ఇంజనీరింగ్ చదువుతుంది. మేము శిరిడీలో ఉన్నప్పుడు తను తన పని చేసుకొని లాప్టాప్, ట్యాబ్, ఫోను ఒకచోట పెట్టి తర్వాత లాప్టాప్, ఫోన్ తీసుకుని ట్యాబ్ అక్కడే మర్చిపోయింది. తర్వాత చూస్తే ఆ ట్యాబ్ కనిపించలేదు. దాని ధర 28,000 రూపాయలు. శిరిడీలో నేను, మా పెద్దమ్మాయి బాబా దర్శనం చేసుకొని రూమ్‌కి వచ్చేసరికి చిన్నమ్మాయి నాకు ఫోన్ చేసి ట్యాబ్ కనపడటం లేదని చెప్పి ఏడ్చింది. అది విని నేను "బాబా! ఇదేంటి పండగ సందర్భంగా ఇక్కడికి వస్తే. నాకు విచారం కలగజేస్తున్నావు. మీ దయతో ట్యాబ్ దొరకాలి తండ్రీ" అని అనుకున్నాను. వెంటనే మావారు ఫోన్ చేసి, "ట్యాబ్ బెడ్ షీట్ కింద ఉంది. ఇంతకుముందు చాలాసార్లు వెతికిన కనపడనిది ఇప్పుడు హఠాత్తుగా కనబడింది" అని చెప్పారు. నేను, "సాయిదేవా! కాసేపు ఎంత కంగారుపెట్టావు" అని నమస్కరించుకుని చాలా సంతోషంగా శిరిడీలో గడిపి తిరిగి కాకినాడ వచ్చాము. "ధన్యవాదాలు బాబా. నా స్నేహ అడిగింది కూడా నెరవేర్చు స్వామి. నా తప్పులుంటే క్షమించి కనికరించు బాబా".

అంతలా ఉంటుంది బాబా లీల

ఓం శ్రీసాయినాథాయ నమః. సాయి భక్తులందరికీ నమస్కారం. నా పేరు రాధిక. 2025, జనవరి 22న బాబా నాకు ప్రసాదించిన అద్భుతమైన అనుభవాన్ని నేను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. నా భర్తకి షుగర్ వ్యాధి ఉన్నందున ఆయన జనవరి 21న రెగ్యులర్ చెకప్‌కి వెళ్లి అందులో భాగంగా రెటీనా టెస్టు చేయించుకుంటే, డాక్టరు రిపోర్టు ఆధారంగా, "కంటికి సంబంధించిన గ్లూకోమా వ్యాధి ఉందేమోనని అనుమానంగా ఉంది. ఎల్.వి.ప్రసాద్ కంటి హాస్పిటల్లో చూపించుకోండి" అని అన్నారు. ఆ వ్యాధి నా భర్త నాయనమ్మకు వుంది. అది వంశపారంపర్యంగా వస్తుందని డాక్టర్లు చెప్పడంతో నేను, నా భర్త పడిన టెన్షన్ మాటల్లో చెప్పలేం. ఆ వ్యాధి వల్ల కంటి చూపు మందగించి క్రమంగా అంధత్వంగా పరిణమిస్తుందని మేము చాలా చాలా భయపడ్డాము. నేను సాయిని, "సాయీ! ఆ వ్యాధిని నయం చేయలేమని, పెరగకుండా జీవితాంతం ఐడ్రాప్స్ వేసుకోవాలని డాక్టర్ చెప్పారు. కానీ ఆ వ్యాధి పెరగకుండా డ్రాప్స్‌తో తగ్గేలా చేయండి బాబా" అని వేడుకుని ఆయన నామస్మరణ చేయడం మొదలుపెట్టాను. మర్నాడు 2025, జనవరి 22, తెల్లవారుజామున 5 గంటలకు మేము ఎల్.వి.ప్రసాద్ కంటి హాస్పిటల్‌కి వెళ్లి అపాయింట్మెంట్ తీసుకుంటే, ఎన్నో టెస్టుల అనంతరం సుమారు మధ్యాహ్నం ఒంటిగంటకి డాక్టర్లు, "మీరు భయపడుతున్నట్లుగా ఏమీ లేదు. కంటిలో నరం పెద్దదిగా ఉండటం వలన డాక్టర్ అనుమానం వ్యక్తం చేశార"ని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ క్షణం మేము ఎంత సంతోషపడ్డామంటే మాకు నోట్లో నుండి మాట రాలేదు, కళ్ళనుండి నీళ్లు తప్ప. అప్పటివరకు నేను సాయినామస్మరణ చేస్తూనే ఉన్నాను. నేను సాయితో వ్యాధి పెరగకుండా డ్రాప్స్ తో తగ్గేలా చేయమని చెప్పుకుంటే, ఆయన 'అసలు వ్యాధే లేదని' చెప్పేలా చేశారు. అంతలా ఉంటుంది బాబా లీల మరి. ఆయనకు సర్వస్య శరణాగతి వెడితే ఆయన తప్పకుండా మన ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుస్తారు. ఆయనకు ఇచ్చిన మాట ప్రకారం నేను మ్రొక్కుకున్నవన్నీ తీర్చేశాను. "బాబా! ఇలానే మీ కరుణ మా మీద సదా ఉంచండి".

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo