ఈ భాగంలో అనుభవాలు:
1. చిన్న చిన్న విషయాలలోనూ తోడుగా ఉన్నానని గుర్తు చేస్తున్న బాబా
2. చదరంగంలో రాణించేలా అనుగ్రహించిన బాబా
చిన్న చిన్న విషయాలలోనూ తోడుగా ఉన్నానని గుర్తు చేస్తున్న బాబా
సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు మహేశ్వరరెడ్డి. నా జీవితంలో అనేక సందర్భాల్లో బాబా నాకు సహాయం చేశారు. 2021లో నేను ఒక కారు కొన్నాను. కానీ నేను దానిని పార్కింగ్ సమస్యలు, ట్రాఫిక్ జామ్‌ల కారణంగా ఎక్కువగా ఉపయోగించలేకపోయాను. చివరికి 2024లో నేను ఆ కారును అమ్మేయాలని నిర్ణయించుకొని వెల కట్టేందుకుగానూ రెండు కంపెనీలలో బుక్ చేయదలిచాను. ముందుగా ఒక కంపెనీలో బుక్ చేస్తే, 5,85,000 ఆఫర్ చేసారు. కానీ నేను 6,00,000లకు పైగా ఆశించాను. అందుచేత మరో కంపెనీలో బుక్ చేసేటప్పుడు హృదయపూర్వకంగా బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల ఆ కంపెనీ 6,22,000 ఆఫర్ చేసింది. దాంతో నేను కారు వాళ్ళకి అమ్మడానికి నిశ్చయించాను. తర్వాత 2024, సెప్టెంబర్ 21న నేను NOC, ఫారం 35 కోసం బ్యాంక్‌కు వెళ్లాను. అక్కడొక వ్యక్తి నా పనికి కొంచెం సమయం పడుతుందని చెప్పాడు. దాంతో నేను టీ తాగొద్దమని బయటకు వెళ్లి టీ షాపుకోసం చూస్తే, సమీపంలో ఎక్కడా కనిపించలేదు. అప్పుడు నేను, "బాబా! టీ షాప్ దొరకాలి, దానిలో మీ ఫోటో కూడా ఉండాలి" అని బాబాని కోరాను. 500 మీటర్ల దూరం నడిచాక, ఒక చిన్న టీ షాప్ కనిపించింది. ఆశ్చర్యంగా ఆ టీ షాపులో సాయిబాబా ఫోటో కూడా ఉంది. ఈ చిన్న ఆశీర్వాదం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. టీ తాగిన తర్వాత నేను తిరిగి బ్యాంక్‌కి వెళ్లాను. అప్పుడు కూడా నా పని పూర్తవడానికి సమయం పడుతుందనిపించి మనసులోనే బాబాను ప్రార్థించాను. అద్భుతం! బ్యాంక్ మేనేజర్ కేవలం 30 నిమిషాల్లో నాకు NOC, ఫారం 35 ఇచ్చారు. నేను కారు అమ్మిన తర్వాత 20 మందికి ఆహారం ఇవ్వాలనుకున్న కారణంగా సెప్టెంబర్ 21న 10 మందికి ఆహారం ఇవ్వాలని నిర్ణయించి నేను ఎవరికైతే ఇవ్వాలనుకున్నానో వాళ్లతో ఉదయం ఆహారం ఆర్డర్ చేసి, 1:15కి అందిస్తానని చెప్పాను. ఆరోజు బ్యాంక్ పనివల్ల కొంచెం ఆలస్యమైనప్పటికీ బాబా కృపతో వాళ్ళకి ఆహారం అందించగలిగాను. బాబా ఆశీస్సులతో అంతా సజావుగా జరిగి ప్రతి దశలోనూ ఆయన కృప నా వెంట ఉందని నేను స్పష్టంగా అనుభూతి చెందాను. "ధన్యవాదాలు బాబా".
2024, అక్టోబర్ 13న మా పనిమనిషి మామూలుగా రావాల్సిన సమయానికి రాలేదు. దాంతో ఆమె రాదేమోనని నేను ఆందోళన చెంది బాబాను ప్రార్థించాను. కొద్దిసేపటి తర్వాత బయటకి వెళ్లి చూస్తే, ఆమె మా ఎదురింట్లో పని చేస్తూ కనిపించింది. ఆమె అక్కడ పని ముగిసిన తర్వాత మా ఇంటికి రాబోతుందని తెలిసి బాబా నా ప్రార్థనకు స్పందించారనిపించి నా హృదయం ఆనందంతో నిండిపోయింది.
అక్టోబర్ నెల రెండో వారం చివరిలో నాకు రాత్రివేళల్లో నిద్ర పట్టడం చాలా కష్టమై నిద్రలేమితో బాధపడ్డాను. అలసటతో బాగా ఇబ్బందిపడ్డాను. ఇక అప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉండేందుకు, అలాగే మంచి నిద్రకోసం బాబాను ప్రార్థించాను. బాబా ఆశీస్సులతో ఆ రాత్రి నుంచే నా మనసు ఎంతో ప్రశాంతంగా మారి తేలికగానే నిద్రలోకి జారుకున్నాను. మర్నాడు రాత్రి కూడా మంచిగా నిద్రపోయాను. నా మనసులోని అన్ని ఆందోళనలు ఆవిరైపోయాయి.
సాధారణంగా నేను పని చేస్తున్న కంపెనీ నెలలో చివరి పనిదినం నాడు పే-స్లిప్ జనరేట్ చేస్తుంది. ఆ విషయం తెలిసి కూడా 2024, సెప్టెంబర్ 27న నేను బాబా వద్దకు వెళ్లి, "ఈ నెల ముందుగానే పే-స్లిప్ జనరేట్ అయ్యేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. నేను ఆశ్చర్యపోయేలా అదేరోజు అంటే మూడురోజులు ముందు పే-స్లిప్ జనరేట్ అయింది. అది చూసి నాకు ఎంతో సంతోషమేసింది. ఇది సాయిబాబా ఆశీర్వాదంతోనే జరిగిందని నా నమ్మకం. ఈ అనుభవాలన్నీ చిన్న చిన్న విషయాలలోనూ బాబా నాకు తోడుగా ఉన్నారని గుర్తు చేస్తున్నాయి. ఎల్లప్పుడూ వరాలు కురిపిస్తూ, నన్ను కాపాడుతున్న బాబాకు ఎంతలా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.
చదరంగంలో రాణించేలా అనుగ్రహించిన బాబా
సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. మేము కర్ణాటకలో ఉంటాము. మా బాబు తన స్కూల్లో జరిగే చదరంగం క్లాసులకి హాజరై ఆట నేర్చుకున్నాడు. కానీ వాడు ఆ ఆటలో గెలవడం కంటే ఓడిపోవడమే చాలా సార్లు జరిగింది. ఆ విషయంగా తను మొదట్లో ఏడ్చేవాడు. నేను తనతో, "లేదు నాన్నా! ప్రయత్నిస్తుంటే వస్తుంది. ఓడిపోతేనే మనం నేర్చుకుంటాం" అని చెప్పేదాన్ని. ఇంకా నేను బాబాని, "ఓడిపోయినా పర్లేదు కానీ, వాడు బాధపడకుండా చూడు సాయి. మీరే వాడికి ఆట నేర్పించాలి" అని అనుకునేదాన్ని. బాబా దయవల్ల రోజురోజుకు బాబు ఆటలో మెరుగు పడుతూ వచ్చాడు. అన్నీ స్కూళ్ల పిల్లలకి చదరంగం పోటీలు నిర్వహించినప్పుడు మా బాబుని తన స్కూల్ నుండి ఎంపిక చేశారు. అప్పుడు నేను బాబుతో, "ఓడిపోయినా పర్లేదు, పోటీలో పాల్గొను" అని చెప్పాను. బాబాతో కూడా ఒక్కటే చెప్పాను, "బాబా! మీరు ఏం చేసిన మా మంచికే అనుకుంటాను" అని. బాబా చాలా దయ చూపారు. మా బాబుకి రాష్ట్ర స్థాయిలో 6వ క్షణం వచ్చింది. నాకు సంతోషంగా అనిపించింది. మొదటి 5 స్థానాలు వచ్చిన వాళ్లని నేషనల్ స్థాయి పోటీకి ఎంపిక చేసారు. నేను కొంచెంలో తప్పిందనుకున్నాను. అయితే మన సాయి బాధపడే అవకాశం మనకి ఎప్పుడూ ఇవ్వరు. ఆయన తమ లీల చూపించారు. మొదటి 5 స్థానాల్లో ఉన్న ఒక బాబు, "నేను నేషనల్స్‌కి వెళ్ళను. నాకు పరీక్షలున్నాయి" అనడం వల్ల తరువాత స్థానంలో ఉన్న మా బాబుని నేషనల్స్‌కి ఎంపిక చేసారు. నేను చాలాసార్లు బాబాకి థాంక్స్ చెప్పుకున్నాను. బాబా దయవల్ల మా బాబుకి నేషనల్స్‌లో 2వ స్థానం వచ్చింది. "చాలా చాలా థాంక్స్ సాయి. ఎప్పుడూ ఇలాగే మాకు సంబంధించిన అన్నీ విషయాలలో తోడుగా ఉండండి".