సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1941వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అడిగినంతనే సహాయం చేసే బాబా
2. సాయినాథుని ఊదీ మహిమ



సాయిభక్తుల అనుభవమాలిక 1940వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • సాయితండ్రి దయ

ఓం శ్రీసాయినాథాయ నమః. సాయి బంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, సకల దేవతలు, ఇంకా సర్వమూ బాబాయే. మాకు ఒక బాబు, పాప. పిల్లలిద్దరూ వేరే ఊర్లో ఉండి చదువుకుంటున్నారు. వినాయకచవితి తర్వాత బాబుకి జ్వరం, ఒళ్ళునొప్పులు వచ్చాయి. బాబు నాకు ఫోన్ చేసి, "మెడికల్ షాపులో టాబ్లెట్లు కొని వేసుకుంటున్నా తగ్గట్లేదు" అని చెప్పాడు. అలా రెండు రోజులైనా బాబుకి తగ్గకపోయేసరికి నాకు చాలా ఆందోళనగా అనిపించి, "అలా కాదు, ముందు బ్లడ్ టెస్ట్ చేయించుకో" అని బాబుతో చెప్పి సాయితండ్రికి దణ్ణం పెట్టుకున్నాను. మరుసటిరోజు బాబు టెస్టులు చేయిస్తే, టైఫాయిడ్ ప్రారంభంలో ఉందని రిపోర్టులో తెలిసింది. బాబు ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్తే, "ఏం పర్వాలేదు. మనకు సాయితండ్రి ఉన్నాడు. తేలిగ్గా తగ్గించేస్తాడు. ఏమీ భయపడక్కర్లేదు. నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేయమ్మా. ఇంటి దగ్గరైతే ట్రీట్మెంట్ బాగుంటుంది" అని అన్నాను. బాబు సరేనని అదేరోజు బయలుదేరి రాత్రికి ఇంటికి వచ్చాడు. నేను, "బాబా! వాడికి చిన్నప్పటినుండి ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యమే! ఇప్పటికే వాడికి రెండుసార్లు టైఫాయిడ్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు. నాకు సర్వం నువ్వే తండ్రి. రేపు ఉదయానికి బాబుకి జ్వరం తగ్గి మామూలు చేయ తండ్రి" అని బాబాకి హృదయపూర్వకంగా దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజు ఉదయం జ్వరం చూస్తే, నార్మల్ ఉంది. అయినా బాబుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే, ఐదు రోజులకు మందులు రాసిచ్చారు. బాబుకి జ్వరమైతే మళ్లీ రాలేదు, రోజూ నార్మల్ ఉండేది. కానీ బాగా నీరసంగా ఉండేవాడు. అది కూడా బాబాను ప్రార్థిస్తే, ఆయన దయవల్ల వారం రోజులకు చాలావరకు తగ్గి బాబు కోలుకున్నాడు. ఇక బాబు, 'పరీక్షలు దగ్గరలో ఉన్నాయని, ఇంటి దగ్గర ప్రిపేర్ అవడానికి ఇబ్బందిగా ఉందని, హాస్టల్ అయితే ఇబ్బంది ఉండద"ని వెళ్ళిపోయాడు.

తర్వాత వేరే ఊరిలో ఉన్న మా పాపకి  కూడా జ్వరమొచ్చి ఒళ్ళునొప్పులతో బాధపడితే, తనని కూడా టెస్టులు చేయించుకోమన్నాను. అప్పుడు తనకి కూడా టైఫాయిడ్ అని తెలిసింది. ఇంటి దగ్గరైతేనే సరైన వైద్యం అందుతుందని తనని కూడా ఇంటికి వచ్చేయమన్నాను. ఒకరి తర్వాత ఒకరికి ఇలా వస్తుందేమిటని నాకు చాలా బాధేసి, "తండ్రీ! పాపకు తేలిగ్గా తగ్గేటట్లు చేయండి" అని సాయిబాబానే వేడుకున్నాను. టైఫాయిడ్‌తో బాధపడుతున్నప్పుడు పాపకి బాగా నీరసం, గ్యాస్ నొప్పి ఉంటుండేవి. వాటితో తను బాగా ఇబ్బందిపడుతుంటే నేను బాబాను ప్రార్ధించాను. బాబా దయవల్ల అవి తగ్గి పాప కోలుకుంది. ఇప్పుడు బాగానే ఉంది.

బాబుకి జ్వరం తగ్గిన కొన్నిరోజులకి తన చంకలలో సెగ్గడ్డలు వచ్చి, బాగా నొప్పిగా ఉందని చాలా బాధపడ్డాడు. అదే సమయంలో వేరే ఊరిలో ఉన్న మా పాప కూడా సెగ్గడ్డలు వచ్చి, కూర్చోలేకపోతున్నానని చెప్పి బాధపడింది. నేను మన సాయినాథుని, "ఇద్దరికీ సెగ్గడ్డలు తగ్గించమ"ని వేడుకున్నాను. సాయితండ్రి దయవలన ఇద్దరికీ తగ్గాయి.  "సాయితండ్రీ! నాకు సర్వం నువ్వే. పిల్లలిద్దరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండేటట్లు చూడు తండ్రి".

ఈమధ్య నా నడుము చుట్టూ, ఛాతి కింద దురదలుగా ఉంటుంటే ఆయింట్మెంట్ రాసినా,  కేండీడ్ పౌడర్ రాసినా, వేపాకు పేస్టు, కొబ్బరి నూనె రాయడం ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గినట్లు ఉండి మళ్లీ దురద అనిపిస్తుండేది. అప్పుడు బాబా దగ్గర చీటీలు వేసి అడిగితే, "హాస్పిటల్‌లో చూపించుకోమ"ని బాబా సూచించారు. నేను, "తండ్రీ! తక్కువ డబ్బులతో త్వరగా తగ్గేటట్లు చేయండి" అని బాబాకి చెప్పుకొని హాస్పిటల్‌కి వెళ్ళాను. బాబా దయవల్ల నేను కోరుకున్నట్లే మందులకు తక్కువ డబ్బులయ్యాయి. దురద కూడా త్వరగానే తగ్గుముఖం పట్టింది. "ధన్యవాదాలు బాబా. ఇంకా కొంచెం దురద ఉంటుంది. దాన్ని కూడా తగ్గించు తండ్రీ".

సాయి తమని నమ్మిన వాళ్లందరికీ 'మీ వెంటే ఉన్నాన'ని ఏదో ఒక అనుభవం ద్వారా, 'నేనుండగా భయమెందుకు?', 'నేను నీతోనే ఉన్నాను' అని సందేశాల రూపంలో తెలియజేస్తూ ఉంటారు. ఒకసారి నా ఆరోగ్యం, మనసు బాగోక చాలా బాధపడి ఏడుస్తూ పడుకున్నాను. ఇంకా నిద్రపోలేదు, మెలకువగానే ఉన్నాను. అప్పుడు బాబా దర్శనమైతే అవ్వలేదుగాని, "నేను నీతోనే ఉన్నాను బేటా!" అని ఆయన మాటలు చాలా స్పష్టంగా వినిపించాయి. నేనెంత సంతోషించానో, నాకు ఎంతో ధైర్యం వచ్చిందో సాయి భక్తులకు వేరే చెప్పక్కర్లేదు. ఇంకోసారి నేను సమస్యతో చాలా బాధపడుతూ తట్టుకోలేక, "చిన్నప్పటినుండి నాకు సంతోషకరమైన జీవితం చాలా తక్కువ. అది నీకూ తెలుసు తండ్రీ! నేను ఎందుకింత దురదృష్టవంతురాలిని తండ్రీ? ఇలాంటి జీవితం ఎవరికీ వద్దు తండ్రీ" అని బాబాను అడిగి క్వశ్చన్&ఆన్సర్ సైట్‌లో చూస్తే, 'నువ్వు దురదృష్టవంతురాలివేంటి? సాయి అనుగ్రహం పొందిన నువ్వు అదృష్టవంతురాలివి' అని వచ్చింది. అది చూసి నాకు చాలా చాలా సంతోషమేసింది. అప్పటినుండి 'నేనూ అదృష్టవంతురాలినే. నా బాబా, నా సాయితండ్రి చెప్పారుగా' అని తృప్తిగా ఫీలవుతున్నాను. "ధన్యవాదాలు బాబా. మమ్మల్ని దూరం పెట్టక అక్కున చేర్చుకో తండ్రీ".

ఓం సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహారాజ్ కీ జై!.

సాయిభక్తుల అనుభవమాలిక 1939వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబా ఆంతర్యమేమిటో మనకు తెలియకపోయినా - ఆయన మన మంచికే చేస్తారు!

సాయినాథునికి, సాయి బంధువులకు నా నమస్కారాలు. నా పేరు రమాదేవి. నేనిప్పుడు బాబా మావారి ఉద్యోగ విషయంలో చేసిన లీలను పంచుకుంటాను. దాదాపు 2023, సెప్టెంబర్ నుండి మావారికి, ఆఫీసులో తన హెడ్‌‌కి మధ్య గొడవలు జరుగుతుండేవి. అతను రోజూ ఏదో ఒక కారణంతో మావారిని ఇబ్బంది పెడుతుండేవాడు. దాంతో మావారు మనశ్శాంతితో ఉండలేకపోయారు. 'గురుచరిత్ర', 'సాయి సచ్చరిత్ర' చదివారు. అలా 2 నెలలు గడిచిపోయాయి కానీ, సమస్య పరిష్కారం కాలేదు. అప్పుడొకరోజు నాకు ఈ బ్లాగులో 'సాయి మూల బీజాక్షర మంత్రం' చదవడం వలన సమస్య పరిష్కారం అయిందని భక్తులెవరో పంచుకున్న విషయం గుర్తుకు వచ్చి, దాన్ని చదవమని మావారితో చెప్పాను. ఆయన సరేనని రోజుకొకసారి, గురువారం మాత్రం 9 సార్లు చదివారు. 7 నుంచి 8 వారాలలో ఊహించని విధంగా మావారు ఒక ఇంటర్వూకి హాజరవ్వడంతో మంచి ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. ఆ కంపెనీవాళ్ళు 2024, ఫిబ్రవరిలో జాయిన్ అవ్వమన్నారు. మేము ఆ కొత్త ఉద్యోగంలో చేరడానికి గురువారం కలిసి వచ్చేలా తేదీ ఖరారు చేసుకున్నాము. మేము బాబా ఇచ్చిన ఉద్యోగమని సంతోషంగా 2024, జనవరిలో శిరిడీ వెళ్ళాము. అక్కడ ఎందుకో తెలియదుగాని మావారు సంతోషంగా ఉండటానికి బదులు చాలా చికాకు పడ్డారు. నన్ను, పిల్లల్ని అస్సలు ప్రశాంతంగా ఉండనీయలేదు. "ఉద్యోగం వచ్చింది కదా! సంతోషంగా ఉండండ"ని మేము ఎంత బ్రతిమాలి చెప్పినా ఆయన వినలేదు. సరే, బాబా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చాము.

శిరిడీ నుండి వచ్చాక మావారు పాత ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇక అసలు సమస్య మొదలైంది. ఆఫీసువాళ్ళు మావారిని రిలీవ్ చేయకుండా జీతం పెంచుతామని, హెడ్ నుండి ఇక మీదట సమస్య రాకుండా చూస్తామని మభ్యపెట్టడం మొదలుపెట్టారు. బాబా దగ్గర చీటీలు వేస్తే, 'కొత్త ఉద్యోగానికి వెళ్ళు' అని వచ్చింది. నేను, పిల్లలు, "వాళ్ళ మాటలు నమ్మొద్దు" అని మావారిని బ్రతిమాలుకున్నాము. కానీ మావారు పాత ఉద్యోగంలోనే ఉంటానని ఎవరి మాట వినకుండా కొత్త ఉద్యోగంలో చేరనని సదరు కంపెనీకి మెయిల్ పంపించారు. అదేరోజు నేను బ్లాగులో ఒక భక్తుని అనుభవం చదివాను. అందులో ఆ సాయి బంధువు 'తనకు ఒక కొత్త ఉద్యోగమొస్తే, పాత కంపెనీవాళ్ళు జీతం పెంచుతామని వెళ్లకుండా ఆపారని, 15 రోజుల తరువాత ఏ వ్యక్తి అయితే ఆవిధంగా మాట ఇచ్చి ఆపారో ఆ వ్యక్తి ద్వారానే సమస్య ఎదురుకోవడంతో భరించలేక ఉద్యోగం వదిలేసానని' వ్రాశారు. నా మనసు కీడు శంకించింది. బాబా ఆ సాయి బంధువు అనుభవం ద్వారా మావారు కొత్త ఉద్యోగంలో చేరకపోతే సమస్య అవుతుందని చెపుతున్నారనిపించింది. కానీ ఎంత చెప్పినా మావారు వినకుండా పాత కంపనీలోనే ఉంటానని రాజీనామా వెనక్కి తీసుకున్నారు. నేను భయపడినట్టే 15 రోజుల తరువాత ఎవరైతే మావారిని ఉండమన్నారో ఆ ఆఫీసర్ ద్వారానే  మావారికి సమస్య మొదలైంది. జీతం పెరగడం అటుంచితే ఆ ఆఫీసర్‌కి, మావారికి మధ్య విపరీతంగా గొడవలు జరిగాయి. ఆ గొడవల కారణంగా మావారు ఇంట్లో చికాకు పడుతుండటంతో ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. అప్పుడు "దారి చూపమ"ని బాబాని వేడుకున్నాను. ఆయన దయవల్ల ఒకసారి కొత్త కంపెనీవాళ్ళకి మెయిల్ పెట్టి ఇంకో అవకాశమివ్వమని అడగాలన్న ప్రేరణ కలిగి, అదే విషయం మావారితో చెప్పి కొత్త కంపెనీకి మెయిల్ పెట్టించాను. వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించారు. కాకపొతే, ఒక వారం రోజుల్లో జాయిన్ అవ్వాలని షరతు పెట్టారు. నేను మావారితో, "బాబా దయవలన రెండోసారి అవకాశమొచ్చింది. జాయినవ్వండి" అని ఎంతగానో చెప్పాను. కానీ ఏవో కారణాలతో మావారు రెండో అవకాశాన్ని కూడా వినియోగించుకోకుండా జాయిన్ కాలేదు. నేను, పిల్లలు చాలా బాధపడ్డాము. 'బుద్ధి కర్మానుసారిణి' అంటారు కదా! ఏం చేస్తామని బాబాను "దయ చూపమ"ని వేడుకొని వదిలేసాను. దాదాపు 8 నెలలు నా భర్త ఆఫీసులో విపరీతమైన టెన్షన్లు, అవమానాలు, దగ్గర స్నేహితులనుకున్న వాళ్ళు చేసిన మోసాలు ఎదుర్కొన్నారు. తట్టుకోలేక రాజీనామా చేద్దామన్నా చేతిలో ఇంకో ఉద్యోగం లేని పరిస్థితి. ఇదంతా తప్పించటానికి బాబా రెండు అవకాశాలిచ్చిన సద్వినియోగం చేసుకోలేదు.

మావారు వీలైనప్పుడల్లా బాబా మూల బీజాక్షర మంత్రం చదువుతూ ఉండేవారు. నేను ఆయన చేత 5 వారాలు 'సాయి దివ్యపూజ' చేయించాను, గురువారం బాబా గుడికి పంపించాను. నేను కూడా గుడికి వెళ్ళినప్పుడల్లా సమస్య తీర్చమని వేడుకుంటుండేదాన్ని. ఇలా 8 నెలలు గడిచిపోయాయి. నా భర్త, "బాబా తనపట్ల దయ చూపటం లేదు" అనేవారు. నాకు చాలా కోపమొచ్చి, "ఇది మీ స్వయంకృపరాధం. బాబాను అంటే అసలు ఊరుకోను. ఇక అనుభవించాల్సిన కర్మ పూర్తిగా తీరేదాక ఈ సమస్య తీరదు" అని కోపంగా సమాధానం చెప్పేదాన్ని. చివరకి జాబ్ టెన్షన్ వలన నా భర్త ఆరోగ్యం దెబ్బతింది. అప్పుడు బాబాను అడిగితే, 'ఉద్యోగానికి రాజీనామా చేయమ'ని వచ్చింది. నేను మావారితో, "నాకు నమ్మకముంది. బాబా తప్పక ఉద్యోగమిస్తారు. ఆలస్యం చేయకుండా రాజీనామా చేయండి" అని అన్నాను. ఈసారి నా మాట విని నా భర్త నేను చెప్పినట్లే చేసారు. నా మాట వమ్ము కాలేదు. పాత కంపెనీలో నోటీసు పీరియడ్ నెల రోజులుండగా ఆలోపే బాబా దయవల్ల మావారికి ఒకేసారి మూడు ఉద్యోగాలొచ్చాయి. దాంతో ఏ ఉద్యోగంలో చేరాలన్న ఆలోచన వచ్చింది. మావారు, "బాబా ఎందులో చేరమని చెప్తే, అందులో జాయిన్ అవుతాను" అన్నారు. బాబా ఆ మూడింటిలో తక్కువ ప్యాకేజీ ఇచ్చే ఉద్యోగంలో చేరమన్నారు. బాబా ఆంతర్యం ఏమిటో మనకు తెలియదు కానీ, ఆయన మన మంచికే చేస్తారు కదా! మావారు మనస్ఫూర్తిగా బాబా చెప్పిన ఉద్యోగంలో 2024, అక్టోబర్ 3, గురువారంనాడు జాయిన్ అయ్యారు. తర్వాత బాబా దయవలన ఎన్నో సంవత్సరాల నుండి తీర్చుకోలేకపోయిన మా ఇంటి దైవం మొక్కు కూడా తీర్చుకోగలిగాం. "శతకోటి నమస్కారాలు బాబా. కష్టకాలంలో మా వెంట ఉండి నడిపించారు. మీకు చాలా ధన్యవాదాలు". సాయి బంధువులారా! బాబాను అడిగాక ఆయన ఆజ్ఞను శిరసా వహించండి. ఆయన మాట వమ్ము కాదు.

మరికొన్ని చిన్నచిన్న అనుభవాలు చెప్పి ముగిస్తాను. కొన్నిరోజులుగా నా రెండు కాళ్ళ చీలమండల దగ్గర దురదగా ఉంటుంది. అది ఇన్ఫెక్షన్‌లా మారి రోజురోజుకి పెరుగుతూ ఉంటే బాబాని తలుచుకొని ఊదీ రాసుకున్నాను. కొద్దిగా తగ్గినట్టు అనిపించింది కానీ మళ్ళీ పెరిగింది. బాబా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ కింద పడి ఉన్న అగరబత్తి పొడిని ఊదీగా భావించి, ఊదీ మంత్రం జపిస్తూ ఇన్ఫెక్షన్ ఉన్నా ప్రాంతంలో రాసుకొని బాబాని తగ్గించమని వేడుకున్నాను. అప్పుడు బాబా తమ అభిషేక జలం రాయాలన్న ప్రేరణ నాకు కలిగించారు. దాంతో నేను అదివరకు ఒక సీసాలో సేకరించి పెట్టుకున్న అభిషేక జలం దురద, ఇన్ఫెక్షన్ ఉన్న చోట రాశాను. బాబా దయవల్ల ఇన్ఫెక్షన్, దురద తగ్గాయి. ఇంకోసారి విరేచనాలతో రెండు రోజులు ఇబ్బందిపడ్డాను. అప్పుడు ఊదీ తీసుకున్నాను. బాబా ఊదీ మహత్యం వల్ల ఏ మందు తీసుకోకుండా తగ్గిపోయింది. మరోసారి నా కాలు కండరం పట్టేసి నడవడానికి ఇబ్బందిపడ్డాను. అప్పుడు బాబాను తగ్గించమని వేడుకుంటే, ఆయన దయవలన రెండు రోజులలో తగ్గిపోయింది.

నేను ఒకసారి రెండు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల విషయంలో సరిగా జరగాలని, కోరుకుంటున్నట్లు జరిగితే బాబా నామం 216 సార్లు వ్రాస్తానని అనుకున్నాను. బాబా దయవల్ల బాగా జరిగింది. బాబా నామం వ్రాసి ఆయనకు కృతజ్ఞత చెప్పుకున్నాను.

ఒక వారం ఆదివారంనాడు కూడా నేను ఆఫీసుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే నాకు వెళ్లాలని లేదు. ఆ వారం చాలా వర్క్ చేసి ఉన్నందున విశ్రాంతి కావాలనిపించింది. అందువల్ల బాబాను "ఎలాగైనా డ్యూటీ తప్పిపోవాలి" అని కోరుకున్నాను. బాబా దయ చూపారు. డ్యూటీ వేరే వాళ్లకు ఇచ్చారు. నా తల్లి, తండ్రి, గురువు, దైవం నా తోడు నీడ.  

ఒక సమస్య వలన నేను, మా అమ్మ రెండు రోజులు చాలా మానసిక వేదన అనుభవించాము. అప్పుడు నేను బాబా గుడికి వెళ్లి, "ఈ బాధను తప్పించమ"ని వేడుకున్నాను. అంతే, బాబా దయవలన ఆ రోజు సాయంత్రం వరకు సమస్య పరిష్కారం అయింది. ఏం చెప్పను బాబా దయ గురించి? చిన్నదదైన, పెద్దదైన బాబాకి మొర పెట్టుకుంటే ఆయన తప్పక నెరవేరుస్తున్నారు. "మీకు శతకోటి ధన్యవాదాలు బాబా. మీరు ఎన్నిసార్లు నన్ను ఆదుకున్నారో లెక్కలేదు". చివరిగా ఇంతసేపు ఓపికగా చదివిన మీకు ధన్యవాదాలు.

సాయిభక్తుల అనుభవమాలిక 1938వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబా దృష్టి మనపై ఎప్పుడూ ఉంటుంది


సాయిభక్తుల అనుభవమాలిక 1937వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కలలో బాబా ఇచ్చిన నిజ దర్శనం
2. సాయి మంత్రంలో ఎంతో మహిమ ఉందో!

కలలో బాబా ఇచ్చిన నిజ దర్శనం

నా పేరు లక్ష్మి. నేను వైజాగ్‌లో ఉంటాను. తోటి భక్తుల అనుభవాలు చదువుతుంటే, 'చిన్న వాటికి అందరూ  ఎంతలా అనుభూతి చెందుతున్నారు. నేను బాబా నాకు చేసిన మేలు పంచుకోకపొతే నాకు కృతజ్ఞత లేనట్లే' అనిపిచింది. అందుకే నేను ఇప్పుడు కలలో బాబా నాకిచ్చిన నిజ దర్శనం గురించి పంచుకుంటాను. 2015లో మేము ఒక ఇల్లు కొందామని బిల్డర్‌తో బేరం మాట్లాడుకున్నాం. ఒక వారం తరువాత నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో మా ఇంట్లో ఉన్న ఉయ్యాలలో బాబా కనిపించారు. ఆయన ఉత్తరం వైపు కూర్చొని తమ తలను తూర్పు వైపు తిప్పుతూ ఇద్దరు వ్యక్తుల చేతులు కవర్లు మార్చుకుంటుంటే చూస్తున్నారు. బాబా ఒరిజినల్ ఫొటోలో ఎలా ఉంటారో అచ్చం అలానే ఉన్నారు. నేను ఉదయం నిద్రలేచిన వెంటనే ఆ కల గుర్తు చేసుకొని కలలో బాబా దర్శనమిచ్చారని చాలా అంటే చాలా ఆనందించాను. వెంటనే మావారికి ఆ కల గురించి చెప్పాను. అది వింటూనే మావారు "సరే! ఆయన చూస్తున్నారన్న మాట" అన్నారు. నేను, "నాకు అర్ధం కాలేదు" అని అన్నాను. అప్పుడు మావారు, "బిల్డర్ 36 లక్షల రూపాయలు నెట్ క్యాష్ ఇస్తే, కొంత తగ్గిస్తానన్నాడు. అందుకని ఈరోజు డబ్బులు తీసుకొని వెళ్లి అతనికి ఇస్తాను" అని చెప్పారు. 'అవునా? అందుకే కాబోలు! బాబా దగ్గరుండి చూస్తున్నారు' అని అనుకున్నాను. ఆ డబ్బుల వ్యవహారం పక్కన పెడితే బాబా మా ఇంట్లోని ఉయ్యాలలో నిజరూప దర్శనమిచ్చినందుకు నాకు చాలా సంతోషమేసింది. ఇకపోతే, డబ్బు తీసుకున్నా బిల్డర్ వెంటనే మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి కదా! చేయకుండా రెండు నెలలు గడిచినా రిజిస్ట్రేషన్ చేయడానికి ముందుకు రాలేదు. మేము ఫోన్ చేస్తే తీసేవాడు కాదు. మాకు విపరీతంగా భయమేసి వాళ్ళ ఇంటికి వెళ్లి గొడవ చేసాం. తర్వాత ఇంకా అగ్రిమెంట్ గడువు ముగియడానికి పదిహేను రోజులు మాత్రమే ఉందని నేను, నా భర్త బాబాకి దణ్ణం పెట్టుకుంటూ, "స్వామీ! మేము కష్టపడి సంపాదించిన దాని గురించి మీకు తెలియనిది కాదు. ఇలా అన్యాయం జరిగితే మా పరిస్థితి ఏమిటి?" అని వేడుకుంటూ ఉండేవాళ్ళము. బాబా ఏం చేసారో తెలియదుకాని, ఆ బిల్డర్ మనసు మార్చుకొని మాకు ఫోన్ చేసి "మీరు కావాల్సినవన్నీ తీసుకొని రిజిస్టర్ ఆఫీసుకి రండి" అని చెప్పి గడువు ముగియడానికి ఒక వారం ఉందనగా మా పేరున రిజిస్ట్రేషన్ చేసాడు. అది బాబా లీల. ఆయన ముందే నేను చూస్తున్నాని సందేశమిచ్చారు. అయినా ఇల్లు మాట ఏమో గాని, బాబా తమ నిజరూప దర్శనం ఇచ్చారు. నాకు మహా భాగ్యం దక్కింది. నేను ధన్యురాలిని. ఒక్కోసారి బాబాని కోరిక కోరితే, కోరింది ఇస్తారేమోగాని, మనం ఆయన తోడు ఉండాలని చెప్పుకుని పని చేసుకుంటూ పొతే అన్నీ ఆయనే చూస్తారు, చేస్తారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

సాయి మంత్రంలో ఎంతో మహిమ ఉందో!
  
సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు మిథున్. నా జీవితంలో సాయిబాబా నాకు ఎన్నోసార్లు సహాయం చేసారు. అందుకు ఎన్ని జన్మలెత్తినా నేను బాబాకి ఋణపడి ఉంటాను. నేనిప్పుడు పంచుకునే అనుభవం చాలా ముఖ్యమైనది. సాయి మంత్రంలో ఎంతో మహిమ ఉందో నాకు తెలియజేసింది. నేను నా భార్య, పిల్లలతో యుఎస్ఏలో ఉంటున్నాను. ఒకసారి మా అమ్మానాన్న యుఎస్ఏ వచ్చి మా పిల్లలతో సరదాగా గడిపారు. అందరం చాలా ఆనందంగా ఉన్న సమయంలో హఠాత్తుగా ఒకరోజు మా నాన్నకి మూత్రంలో రక్తం వచ్చింది. మనసులో ఎన్నో ఆలోచనలతో మా నాన్న భయపడ్డారు. నేను కూడా నాన్నకేమవుతుందోనని చాలా భయపడ్డాను. యుఎస్ఏలో డాక్టరు అపాయింట్మెంట్ దొరకడం కష్టం. అందువల్ల అమ్మానాన్న ఇండియాకి తిరిగి ప్రయాణమయ్యారు. నేను వాళ్ళు వెళ్లి అక్కడ డాక్టర్ని సంప్రదించి టెస్టులు చేయించుకొనేదాకా సాయి నామం జపిస్తూ ఉన్నాను. ఆ సమయంలో ఒకరోజు సాయి భక్తుల అనుభవాలు చదువుతూ ఒక భక్తుడు పంచుకున్న, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదయ నమః' అనే మంత్రం జపించడం వల్ల రిపోర్టులు నార్మల్ వచ్చాయి, నాన్న ఆరోగ్యం బాగుందని చదివాను. ఆ క్షణం నుంచి నేను ఆ మంత్రాన్ని జపించాను. చివరికి బాబా దయవల్ల మా నాన్న రిపోర్టులన్నీ నార్మల్ వచ్చాయి. నా ఆనందానికి హద్దులు లేవు. "ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ ఇలాగే మా కుటుంబంపై మీ కృపను చూపించండి. కష్ట సమయంలో అండగా ఉండండి బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1936వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శిరిడీ ప్రయాణ అనుభవం
2. డాక్టరు దగ్గరకి వెళ్లకుండానే బాగు చేసిన బాబా

శిరిడీ ప్రయాణ అనుభవం

నా పేరు చైతన్య. మేము 2024, సెప్టెంబర్‌లో మా బాబుకి పరీక్షలు అయిపోయాక మూడు రోజులు సెలవులు ఉంటాయని, ఆ వారాంతంలో శిరిడీ వెళ్ళడానికి ప్లాన్ చేసి, టికెట్లు బుక్ చేసాము. అయితే పరీక్షలు జరుగుతున్నప్పుడు వర్షాల కారణంగా ఒకరోజు పరీక్ష వాయిదా వేశారు. 'ఏంటిది బాబా?' అని మేము చాలా టెన్షన్ పడ్డాం. ఎందుకంటే, వాయిదా వేసిన పరీక్ష శనివారంగాని, సోమవారంగాని పెడతారు. మేమేమో శుక్రవారం చివరి పరీక్ష అవుతూనే అదేరోజు రాత్రి శిరిడీ వెళ్ళడానికి టికెట్లు బుక్ చేసుకుని, మంగళవారం తిరుగు ప్రయాణానికి బుక్ చేసుకున్నాము. అందువల్ల మేము ఇంకా శిరిడీ వెళ్లలేమేమోనని మాకు చాలా బాధేసింది. బాబాను, "ఎలాగైనా శుక్రవారంలోపే పరీక్ష పెట్టేలా చూడండి" అని ప్రార్థించాం. బాబా అద్భుతం చేశారు. అద్భుతమని ఎందుకన్నానంటే, మామూలుగా పరీక్ష వాయిదా వేస్తే, పరీక్షలన్నీ అయిపోయాక ఆ పరీక్ష పెడతారు. కానీ బాబా దయవల్ల ఆ పరీక్ష పరీక్షల‌ మధ్యలోనే పెట్టారు. మేము సంతోషించాం. మేము అలా సంతోషంగా ఉండగా మరో ఉపద్రవం వచ్చింది. మా అత్తయ్య కాలు కొంచం ఫ్రాక్చర్ అయింది. హాస్పిటల్‌కి వెళితే ఎక్ష్ రే తీసి, నడవకుండా విశ్రాంతి తీసుకుంటే కాలు సర్దుకుంటుంది, లేదంటే కాలుకి పిండి కట్టు వేయాలి, ఆపై విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పారు. దాంతో మేము ఆవిడను చూసుకోవడానికి మేమే ఉండాల్సి వస్తుందని చాలా టెన్షన్ పడ్డాం. కానీ బాబా దయవల్ల మా అత్తయ్య చెల్లెలు ఆవిడ దగ్గరుండి 15 రోజులు చూసుకున్నారు. మామూలుగా అయితే చిన్న దెబ్బకి కాలు ఫ్రాక్చర్ అవుతుందా? కానీ బాబా పెద్ద ప్రమాదాన్ని చిన్న దెబ్బతో తీసేసారనిపిస్తుంది. ఇకపోతే, మరో రెండు, మూడు రోజుల్లో మా శిరిడీ ప్రయాణం ఉందనగా వర్షాల కారణంగా కొన్ని రైళ్లు రద్దు చేశారు. అప్పుడు, "ఏంటి బాబా, మేము శిరిడీ రావటానికి ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి? ఏ ఆటంకాలూ లేకుండా మా ప్రయాణం సజావుగా సాగేలా చూడండి" అని అనుకున్నాను. బాబా దయవల్ల ఏ ఆటంకాలు లేకుండా మా ప్రయాణం బాగా జరిగింది. బాబా అనుమతి ఉంటేనే మేము శిరిడీ ప్రయాణమవ్వగలం. బాబా అనుమతి ఉంది కాబట్టే ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆయన వాటిని పరిష్కరించి మాకు వారి దర్శన భాగ్యం ప్రసాదించారు." మీకు వేల కోటి ప్రణామాలు సాయినాథా":

మేము శిరిడీకి ప్రయాణమయ్యేటప్పుడు నేను బాబాని, "బాబా! నేను శిరిడీ వస్తున్నాను కదా, ఏదో ఒక రూపంలో మాకు మీ దర్శన భాగ్యం, ఆశీర్వాదం ఇవ్వండి" అని అనుకుంటూ ఉండగా నేను సాధారణంగా అనుసరించే ఒక గ్రూపులో 'నువ్వు శిరిడీ వచ్చినప్పుడు నేను ఏదో ఒక రూపంలో(ప్రసాదం, ఫోటో) నీ దగ్గరికి వస్తాను' అని, ఇంకా 'నువ్వు ఆరతికి వచ్చినప్పుడు నేను పసుపు రంగు వస్త్రాల్లో దర్శనమిచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను' అని బాబా సందేశాలు వచ్చాయి. శిరిడీ వెళ్ళాక ఒకరోజు బాబా ఆరతికి వెళ్ళినప్పుడు బాబా పసుపు రంగు వస్త్రంలో మాకు దర్శనమిచ్చారు. ఆరతి పూర్తైన తర్వాత బాబా తీర్థప్రసాదాలు మాకు లభించాయి. ఇంకోసారి ముఖ దర్శనానికి వెళ్ళినప్పుడు బాబా పంచలోహ విగ్రహం నాకు దర్శనమిచ్చింది. ఇదంతా బాబా అనుగ్రహం.

మాతోపాటు శిరిడీ వచ్చిన మా అమ్మ తిరిగి ఇంటికి వెళ్ళాక జ్వరం, జలుబు, దగ్గు వచ్చి చాలా ఇబ్బందిపడింది. అప్పుడు నేను, "బాబా! మామూలు జ్వరమే అయి త్వరగా తగ్గేలా చూడండి" అని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల తనకి జ్వరం తగ్గింది. తర్వాత మా బాబుకి కూడా జ్వరం, జలుబు, దగ్గు వచ్చాయి. తను మాకు దూరంగా హాస్టల్లో ఉంటాడు. ఆ సమయంలో తనకి పరీక్షలు కూడా జరుగుతున్నాయి. తను అక్కడ చాలా బాధపడుతుంటే మాకు చాలా బాధేసింది. అప్పుడు నేను బాబా ఊదీ తీసుకొని, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని జపించి "బాబుకి జ్వరం తగ్గిపోవాలి" అని నా నుదుటన పెట్టుకున్నాను. బాబా దయవల్ల బాబుకి జ్వరం తగ్గింది. "చాలా ధన్యవాదాలు బాబా. ఇలాగే మీ కృపాదృష్టి మీ బిడ్డలందరి మీద ఉండేలా చూడండి. అందరికీ మంచి బుద్ధిని, జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించండి".


సాయిభక్తుల అనుభవమాలిక 1935వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా కరుణ
2. నమ్మితే మనల్ని వదిలిపెట్టరు నా సాయి


నమ్మితే మనల్ని వదిలిపెట్టరు నా సాయి  

ఓం శ్రీసాయినాథాయ నమః. సాయినాథునికి నమస్కారాలు. నా పేరు సుబ్బమ్మ. ఒకసారి ఉన్నట్టుండి నా మొబైల్ ఆఫ్ అయింది. బటన్స్ ఏవీ పని చేయలేదు. అప్పుడు నేను "రిపేర్‌కు ఇవ్వకుండా బాగా అవ్వాలి బాబా" అని అనుకున్నాను. తర్వాత మా మనవడు ఏదో చేస్తే ఆన్ అయింది.

మా మనవరాలికి సైనస్ బాగా ఎక్కువై అదంతా కుడికన్ను వెనకకు చేరి విపరీతమైన మాడు నొప్పి, కన్నునొప్పితో కొన్నేళ్లు బాధపడింది. కానీ మాకెవరికీ చెప్పలేదు. చివరికి 2024, జూలైలో మాకు చెప్పింది. వెంటనే ఒక డాక్టర్‌కి చూపిస్తే మందులు వ్రాసిచ్చి వాడమని, తగ్గకపోతే సర్జరీ చేయాలన్నారు. అయితే మందులతో తగ్గలేదు. అప్పుడు ఇంకో డాక్టర్ని సంప్రదిస్తే, ఆపరేషన్ చేయాలని సెప్టెంబర్‌లో ముక్కు ద్వారా ఆపరేషన్ చేసారు. 3 గంటల సమయం పట్టింది. అమ్మాయి ఒక 2, 3 రోజులు చాలా బాధపడింది. నేను సాయి నామస్మరణ చేస్తూ, "పాపకి తగ్గిపోయావాలి. నేను స్తవనమంజరి 48 రోజుల పారాయణ చేస్తాన"ని బాబాకి మ్రొక్కుకొని పారాయణ మొదలుపెట్టాను. బాబా దయవల్ల నొప్పి చాలావరకు తగ్గింది. అప్పుడప్పుడు తలనొప్పి మాత్రం వస్తుంది. బాబా దయవల్ల తొందర్లో అది కూడా తగ్గుతుందని అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా అర్థించి తప్పకుండా కాపాడతారని గట్టిగా నమ్మితే మనల్ని వదిలిపెట్టరు నా సాయి. "ధన్యవాదాలు బాబా. ఇలాగే అందరినీ కాపాడు తండ్రీ".

సాయిభక్తుల అనుభవమాలిక 1934వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. టెన్షన్స్ చిన్నవైనా, పెద్దవైనా తండ్రికి చెప్తే ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది - ఆ తండ్రే మన సాయినాథుడే
2. ఎంత పుణ్యం చేసుకుంటే ఇలాంటి నాన్న(బాబా) లభిస్తారు?

టెన్షన్స్ చిన్నవైనా, పెద్దవైనా తండ్రికి చెప్తే ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది - ఆ తండ్రే మన సాయినాథుడే 

సాయి బంధువులకు నమస్కారములు. నా పేరు ఝాన్సీ. మాది నెల్లూరు. నేను బీఈడీ చేశాను. తర్వాత స్కూల్ టీచర్ అర్హతకోసం టెట్ పరీక్షకు అప్లై చేస్తే హైదరాబాద్ సెంటర్ వచ్చింది. నా భర్త తనకి సెలవు దొరకదని, నన్ను ఒక్కదాన్నే వెళ్లమన్నారు. నేను అంతదూరం ఒక్కదాన్నే వెళ్లి పరీక్ష ఎలా వ్రాయాలని టెన్షన్ పడ్డాను. మనసులో, "ఎలాగైనా నేను ప్రశాంతంగా వెళ్లి పరీక్ష వ్రాసొచ్చేలా చేయండి బాబా" అని బాబాని అర్థించాను. బాబా అద్భుతం చేసారు. నా భర్త తన స్నేహితునికి చెప్తే, అతను నా ప్రయాణానికి టిక్కెట్లు బుక్ చేసారు. అదే ట్రైన్‌లో నా భర్త ఫ్రెండ్, అతని కొడుకు తిరుపతి నుంచి హైదరాబాద్‌కి బయలుదేరారు. కాకపోతే, వాళ్ళది వేరే కోచ్. నేను ఎక్కిన కోచ్‌లో ప్రశాంతంగా ఉండటంతో సంతోషంగా పరీక్షకి ప్రిపేరయ్యాను. ట్రైన్ ఆలస్యమై ఉదయం 2 గంటలకి హైదరాబాద్ చేరుకుంది. నా భర్త ఫ్రెండ్, అతని కొడుకు ట్రైన్ దిగి, నాకోసం వేచి ఉండి నన్ను క్యాబ్‌లో వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ఉదయం పరీక్ష నేనున్న ప్రాంతానికి చాలా దూరంగా ఎల్‌బినగర్‌లో ఉండగా మావారి ఫ్రెండ్ భార్య తన ఆఫీసుకి సెలువుపెట్టి, మెట్రో రైలులో నన్ను తీసుకెళ్లి పరీక్షా కేంద్రం వద్ద వదిలిపెట్టారు. ఆమె నేను పరీక్ష జరిగే హాల్‌లోకి వెళ్ళేవరకు ఉండి తిరిగి వెళ్లారు. నేను పరీక్ష వ్రాసి మెట్రోస్టేషన్‌కు వెళ్ళాను. అక్కడికి నా భర్త ఫ్రెండ్ వచ్చారు. అతను నన్ను సికింద్రాబాద్ స్టేషన్కు చేర్చారు. దసరా సెలవులు పూర్తైనందున స్టేషన్‌లో చాలా రద్దీగా వుంది. మేము ఒక చోట కూర్చున్నాము. నేను ఎక్కాల్సిన ట్రైన్ స్పెషల్ ట్రైన్ అయినందున అది బయలుదేరడానికి బాగా ఆలస్యమైంది. నా భర్త ఫ్రెండ్ చాలాసేపు వేచి ఉన్నాక, "కాసేపట్లో చివరి మెట్రో రైలు వెళ్ళిపోతుంది" అన్నారు. నేను అతనితో సరే మీరు వెళ్ళండి. నేను ట్రైన్ ఎక్కేస్తాను అని చెప్పి పంపించాను. తర్వాత నేను ఎక్కాల్సిన ట్రైన్ కాసేపట్లో వస్తుందని అనౌన్స్ చేసారు. తర్వాత నేను ఎక్కాల్సిన కోచ్ నేను ఎక్కడ అయితే కూర్చున్నానో అక్కడికే వచ్చింది. నేను చాలా ప్రశాంతంగా రైలు ఎక్కి మర్నాడు ఉదయం 11 గంటలకి నెల్లూరు చేరుకున్నాను. హైదరాబాద్ వెళ్లి రావడం చాలా సామాన్యమైన విషయం. కానీ ఒక్కదాన్నే తెలియని వూరు, అది కూడా పరీక్షకోసం అని టెన్షన్ పడ్డాను. కానీ మన టెన్షన్స్ చిన్నవైనా, పెద్దవైనా తండ్రికి చెప్తే ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. ఆ తండ్రే మన సాయినాథుడు. ఆయన నాకు ఏ మాత్రమూ కష్టం లేకుండా హైదరాబాద్ తీసుకెళ్లి తెచ్చారు. "బాబా! చాలా చాలా ధన్యవాదాలు. పరీక్షలో 90 మార్కులు వస్తే గాని క్వాలిఫై అవ్వలేను. పోయినసారి 2 మార్కుల తక్కువ వచ్చి క్వాలిఫై అవ్వలేదు. ఈసారైనా నన్ను క్వాలిఫై అయ్యేలా ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను బాబా".

ఎంత పుణ్యం చేసుకుంటే ఇలాంటి నాన్న(బాబా) లభిస్తారు?  

సాయి బంధువులకు నమస్కారం. నా పేరు స్వాతి. నా జీవితంలో బాబా చాలా అద్భుతాలు చేశారు. వాటి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు ఇటీవల జరిగిన కొన్ని అనుభవాలు చెప్తాను. నా గ్రహచరమేమోగాని ఈ మధ్యకాలంలో ప్రతి పండక్కి నాకు నెలసరి సమస్య వస్తుండేది. 2024, అక్టోబర్‌లో వచ్చిన దసరా పండుగకు కూడా అదే ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి వచ్చింది. అప్పుడు నేను బాబాకి దణ్ణం పెట్టుకొని, 'ఓం శ్రీసాయి అసహాయ సహాయాయ నమః' అనే నామాన్ని జపించాను. నా దేవుని దయతో పండుగ సంతోషంగా జరుపుకున్నాను.

ఈమధ్య మా కారులో ఏదో సమస్య వచ్చి ఏసీ సరిగా పని చేసేది కాదు. అటువంటి సమయంలో ఒకరోజు మధ్యాహ్నం మేము  ప్రయాణం చేయవలసి వచ్చింది. ఏసీ పని చేయకపోవడం, బయట ఎండ వేడి వల్ల నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. బాబా పుస్తకం చదువుతూ అలా కళ్లు మూసుకొని, "బాబా! ఈ వేడి తాళలేకున్నాను. ఏసీ బాగుచేయి నాన్నా" అని అనుకుంటూ ఉండగానే ముఖానికి చల్లటి గాలి తగిలింది. కళ్లు తెరిచి చూస్తే, మావారు ఆశ్చర్యానికి గురవుతూ, "ఏసీ పని చేస్తోంది" అన్నారు. ఇక నా ఆనందం ఏమని చెప్పను?

మేము అపార్టుమెంట్‌లో ఉంటున్నాము. మా క్రింది అంతస్తులో వుండే ఆంటీకి, నాకు మంచి స్నేహం ఏర్పడింది. దాన్ని చూసి ఓర్వలేని మా పక్కింటి ఆమె ఆంటీకి నా మీద చాడీలు చెప్పింది. ఆంటీ వాటిని నమ్మి నాతో సరిగా వుండేవారు కాదు. నేను చాలా బాధపడ్డాను. కానీ ఏమీ చేయలేక బాబాతో నా బాధ చెప్పుకొని ఆయననే శరణువేడాను. కొన్ని రోజులకి ఆంటీ తనకి తానే విషయం అర్థం చేసుకొని నాతో మునపటిలా వుండడం మొదలుపెట్టారు. ఇదంతా సాయినాన్న వల్లనే. ఎంత పుణ్యం చేసుకుంటే ఇలాంటి నాన్న లభిస్తారు? "ధన్యవాదాలు బాబా. నా మీద పడిన ఇంకో అపనింద కూడా తొలగించండి బాబా. నాన్న ఆరోగ్యం బాగు చేయి నాన్న".

సాయిభక్తుల అనుభవమాలిక 1933వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. చిన్న చిన్న విషయాలలోనూ తోడుగా ఉన్నానని గుర్తు చేస్తున్న బాబా
2. చదరంగంలో రాణించేలా అనుగ్రహించిన బాబా



సాయిభక్తుల అనుభవమాలిక 1932వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. తరుగులేని బాబా అనంత కరుణ
2. శ్రీసాయి కృప
3. నమ్మినవారి వెన్నంటే నిలిచి సదా కాపాడే సాయినాథుడు

తరుగులేని బాబా అనంత కరుణ

ఓం శ్రీసాయినాథాయ నమః. శ్రీసాయిబాబా అనంతకోటి భక్తులకు నమస్కారం. నేను గత 20  సంవత్సరాలుగా బాబా పాదాలను ఆశ్రయించిన పాదరేణువును. నా పేరు ఆంజనేయులు. శ్రీసాయిబాబా నన్ను, నా కుటుంబాన్ని ఎన్నో బాధలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించారు. వారి కరుణతో మా అబ్బాయి సాయి చరణ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి మంచి సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. 2024, మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఒకనాటి అర్ధరాత్రి నా ఎడమ కాలు నడుము నుండి అరికాలు వరకు భరించలేనంత నొప్పి పెట్టింది. నా అవస్థను చూడలేక మా ఇంట్లోవాళ్ళు చాలా బాధపడ్డారు. అర్ధరాత్రి కావడం వలన ఏ డాక్టరూ అందుబాటులో ఉండని పరిస్థితి. అటువంటి సమయంలో మనందరి డాక్టరైన శ్రీసాయిబాబా, వారి ఊదీ నాకు గుర్తుకు వచ్చాయి. వెంటనే బాబాని శరణువేడి ఊదీ నా కాళ్ళంతా పూసుకున్నాను. ఇంకా బాబా నామస్మరణ చేశాను. అరగంట తర్వాత నెమ్మదిగా ఉపశమనం కలిగి ఉదయానికి 90% తగ్గింది. అయినా డాక్టర్ దగ్గరకి వెళ్తే, 'ఏ సమస్యా కనిపించడం లేద'ని చెప్పి మూమూలుగా ఏదో టాబ్లెట్ వ్రాశారు. ఎంత వ్రాసిన బాబా అనంత కరుణ తరగనిది. ఆ సాయిబాబా వారి కరుణ అందరి మీద ఉండాలని ఆశిస్తున్నాను

శ్రీసాయి కృప

ముందుగా సాయి భగవానుని పాదపద్మములకు ప్రణామాలు. నా పేరు గోపాలకృష్ణ. నేను నిత్యం బాబా సంరక్షణలో ఉన్నాను. ఆయన నన్ను, నా కుటుంబాన్ని విధాలా కాపాడుతూ వస్తున్నారు. 2024, సెప్టెంబర్ నెలలో ఒకరోజు నా భార్యకి, మా పాపకి జ్వరం వచ్చింది. మందులు వాడుతూ రెండురోజులు చూసినప్పటికీ ఇద్దరికీ తగ్గలేదు. అప్పుడు నాకు బాబా గుర్తొచ్చి ఆయనతో చెప్పుకొని కొద్దిగా ఊదీ తీసుకొని నీళ్లలో కలిపి పాపకి పట్టించాను. కొద్దిగా జ్వరం తగ్గనారభించింది. తర్వాత నేను మాకు దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్ళి, "పాపకి, నా భార్యకు జ్వరం తగ్గాల"ని బాబాను ప్రార్థించాను. కానీ నాకు కొంచెం భయమేసి దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరకి వెళ్తే, పాపకి బ్లడ్ టెస్ట్ చేసి, టెస్ట్ రిజల్ట్ కోసం 3 గంటల తర్వాత రమ్మన్నారు. సరేనని మేము మా ఇంటికి వచ్చాము. నేను మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటివేమైనా వస్తాయేమోననుకున్నాను. 3 గంటల తర్వాత హాస్పిటల్‌వాళ్ళు ఫోన్ చేసి, "మీ పాప బ్లడ్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. వాట్సాప్ చేశాము చూడండి" అని అన్నారు. అద్భుతం! టెస్ట్ రిజల్ట్‌‌లో అంతా నార్మల్‌గానే ఉంది. నేను భయపడినట్లు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటివేమీ లేవు. కొద్ది రోజుల్లో ఇద్దరికీ నయమైంది. "మీ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు ధన్యవాదాలు బాబా. ఇలాగే ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించండి".

నమ్మినవారి వెన్నంటే నిలిచి సదా కాపాడే సాయినాథుడు
  
సాయిభక్తులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నా జీవితంలో ఎన్నోసార్లు సాయినాథుడి లీలలు నాకు అనుభవం. ప్రతి విషయంలోనూ నా వెన్నంటుండి నడిపించే బాబాకి నేను ఎప్పటికీ ఋణగ్రస్థురాలినే. ఈమధ్య ఒకసారి మా రెండు సంవత్సరాల పాపకి ఆరోగ్య సమస్య వచ్చి, ఎన్ని మందులు వాడినా నయం అవలేదు. నాకు, మావారికి పాపకి తగ్గిపోతే బాగుండు అన్న ఆలోచనే. కానీ నాకు పాపని హాస్పిటల్‌కి తీసుకెళ్లడం ఇష్టం లేదు. నాకు తెలిసిందల్లా బాబాకి చెప్పుకోవడం, ఆయన్ని వేడుకోవటం మాత్రమే. కాబట్టి ఆయన్నే ప్రార్థించి, "పాపకి తగ్గాలి. సచ్చరిత్ర ఒక వారం పారాయణ చేస్తాను బాబా" అని అనుకున్నాను. అన్నట్టుగానే వారంలో పారాయణ పూర్తి చేసాను. ఆ వారం రోజుల్లో ఎప్పుడు బాబాని అడిగినా 'వారం రోజుల్లో బాగవుతుంది' అని సమాధానం వచ్చేది. కానీ వారమైన పాపకి తగ్గలేదు. ఇక అప్పుడు పాపని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని అనుకున్నాము. కానీ బాబా ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నారని బాధపడ్డాను. మరుసటిరోజు డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే హాస్పిటల్ ఎదురుగా ఉన్న గోడ మీద బాబా కనపడ్డారు. ఆయన్ని చూడగానే నాకు చాలా ధైర్యంగా అనిపించింది. డాక్టర్ చూసి "పాపకి పర్లేదు. సమస్యేమీ లేదు" అని మందులు ఇచ్చారు. అవి వేస్తే, అదే రోజు నుండి పాపకి తగ్గడం మొదలైంది. నేను చాలా సంతోషపడి బాబాకి పరిపరివిధాల కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నమ్మినవారి వెన్నంటే నిలిచి సదా కాపాడే సాయినాథుని చరణాలకు సాష్టాంగ ప్రణామములు.

సాయిభక్తుల అనుభవమాలిక 1931వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శ్రీసాయి కరుణామృత తరంగాలు

నేను ఒక సాయి భక్తుడిని. 2024, ఆగస్టు 30న మా బాబు 2వ జన్మదిన వేడుకలు ఇంట్లోనే ఘనంగా చేయాలనుకుని కేటరింగ్, డెకరేషన్, కేక్ బుకింగ్ అన్నీ మాట్లాడాం. అయితే నాది రైల్వే ఎమర్జెన్సీ సెక్షన్లో ఉద్యోగం అవ్వడం వల్ల పుట్టినరోజు ఏర్పాట్లకు ఎక్కడ ఏదైనా సమస్య వస్తుందోనని టెన్షన్ పడ్డాను. ఎందుకంటే, ఒకవేళ నాకు ఎమర్జెన్సీ డ్యూటీ పడి నేను డ్యూటీకి వెళ్ళిపోతే ఏర్పాట్లన్నీ దెబ్బ తింటాయి. ఆ వేడుకకోసం చాలా దూరం నుండి వచ్చిన మా అమ్మ, నాన్న, నా భార్య అక్కలకు ఇబ్బందవుతుంది. అందువల్ల నేను బాబాని తలుచుకొని, "బాబా! మీ అనుగ్రహంతో పుట్టినరోజు వేడుక ఎటువంటి ఆటంకాలు లేకుండా ఘనంగా జరిగేలా చూడండి. మీ మందిరంలో గురువారంనాడు పాలకోవా సమర్పించి అందరికీ పంచుతాను. అలాగే 101 రూపాయల దక్షిణను సమర్పించుకుంటాను" అని అనుకున్నాను. బాబాని ప్రార్థిస్తే కాని పని అంటూ ఉంటుందా? బాబా దయ చూపారు. పుట్టిన రోజు చాలా ఘనంగా జరిగింది. పిలిచిన అతిధులు అందరూ వచ్చారు. డెకరేషన్, కేక్ మరియు విందు చాలా బాగున్నాయని అందరూ మెచ్చుకున్నారు. భోజనం అందరికీ సరిగ్గా సరిపోయింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మమ్మల్ని ఎప్పుడూ ఇలానే కరుణించండి బాబా".

మా ఇంట్లో పనిమనిషి, మా 2 సంవత్సరాల బాబుని చూసుకొనే ఆమె హఠాత్తుగా పని మానేసింది. దాంతో నేను, నా భార్య ఉద్యోగరీత్యా ఇంట్లో ఉండలేక చాలా అంటే చాలా కష్టం ఐపోయింది. బాబుకి సమయానికి తిండి, నిద్ర ఉండేవి కావు. గర్భవతిగా ఉన్న నా భార్య ఇంటి పనులు, బాబుని చూసుకోలేక చాలా ఇబ్బందిపడింది. ఇటువంటి స్థితిలో నేను బాబాని తలుచుకొని, "బాబా! మాకు తొందరగా కొత్త పనిమనిషి దొరికి, ఈ సమస్య తొలగిపోయేలా చూడండి. ముగ్గురికి అన్నదానం చేస్తాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల రెండు రోజుల్లో తెలిసినవాళ్ల బంధువు పనికి కుదిరారు. నేను బాబాకి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకున్నాను. అయితే ఆ సమయంలో ఆరు నెలల గర్భవతిగా ఉన్న నా భార్యకి పనులు పెరగడంతో తన ఆరోగ్యం కాస్త క్షీణించింది. ఆరు నెలలప్పుడు మామూలుగా చేయాల్సిన చెకప్ మరియు స్కానింగ్‌కోసం హాస్పిటల్‌కి వెళితే, డాక్టర్ కడుపు చూసి కాస్త కిందకి వచ్చిందని, అల్ట్రాసోనిక్ స్కానింగ్ చేస్తే కానీ విషయమేమిటన్నది చెప్పలేమని కంగారు పెట్టారు. మేము కాస్త టెన్షన్ పడ్డాం కానీ. 'మనకు బాబా తోడున్నారు కదా!' అని బాబాని తలుచుకొని, "స్కానింగ్ రిపోర్టు నార్మల్ అని వస్తే ఒకరికి అన్నదానం చేస్తాను" అని ప్రార్థించి స్కానింగ్ జరిగే సమయమంతా 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః', 'శ్రీసాయి అసహాయసహాయాయ నమః', 'శ్రీసాయి సులభ దుర్లభయ నమః' అని జపించాను. బాబా దయ చూపారు. స్కానింగ్ రిపోర్ట్ నార్మల్ అని వచ్చింది. కానీ డాక్టరు, 15 రోజులు రెస్ట్ చాలా అవసరం అని చెప్పారు. అయితే బెడ్ రెస్ట్ అన్న మాటేగానీ ఆ 15 రోజులు కూడా నా భార్యకు విశ్రాంతి లేకుండా పోయింది. కారణం ఏంటంటే, కొత్త పని ఆమెకు బాబు అలవాటుపడలేకపోవడం, ఇంకా ఆమె మతిమరుపు. ఆమె ప్రతిదీ మర్చిపోతూ ఉండేది. గీజర్ స్విచ్ ఆన్ చేసి మర్చిపోయేది, బాబుకోసం స్టవ్ మీద అన్నం పెట్టి మర్చిపోయేది, వాడికి మందులు వేయడం మర్చిపోయేది. దానితో నేను బాబాని, "మీ దయతో పనిమనిషి+కేర్ టేకర్ ఐతే దొరికారు కానీ, ఆమె సరిగా చేయలేకపోతుంది. బాబు కూడా అలవాటు పడలేకపోతున్నాడు. కావున ఎలా అయినా పాత పని ఆమె పనికి రావడానికి, బాబుని చూసుకోవడానికి ఒప్పుకునేలా చేయండి. అలాగే ఈ కొత్త ఆమెని పనిలో నుంచి తీసేసేటప్పుడు ఆమె ఎటువంటి గొడవ పెట్టకుండా చూడండి తండ్రీ" అని ప్రార్థించాను. తర్వాత మేము పాత పనిమనిషి ఇంటికి వెళ్లి ఆమెతో మాట్లాడాము. ఆమె మళ్ళీ రావడానికి ఒప్పుకుంది. అలాగే కొత్త పనిమనిషి మానేయడానికి ఒప్పుకుంది. ఆమె ఎటువంటి ఇబ్బందీ పెట్టలేదు, ఎక్కువ డబ్బులు కూడా డిమాండ్ చేయలేదు. తర్వాత బాబా భక్తులకు పవిత్ర దినమైన దసరా నాడు నా భార్య చెకప్ కి వెళితే, ఆ తండ్రి దయవల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యం బాగుందని డాక్టర్ చెప్పారు. అదేరోజు కొత్త పనిమనిషికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి గౌరవంగా సాగనంపాము. మరుసటిరోజు నుండి పాత పనిమనిషి పనికి రావడం మొదలుపెట్టింది. అంతా బాబా దయ.

మేము ఉంటున్నది మహారాష్ట్రలోని సోలాపూర్‌లో. ఇక్కడ తెలుగు సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. నా భార్య 8 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఒక ఆదివారం ఒక మంచి తెలుగు సినిమాకి తీసుకెళ్లండని అడిగింది. ఆడవాళ్లు గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం అడిగితే, అది చేయాలని పెద్దవాళ్ళు చెప్తుండేవాళ్ళు. అందుచేత నేను తనని సినిమాకి తీసుకొని వెళ్లాలనుకున్నాను. అయితే మేము వెళ్ళాల్సిన థియేటర్‌కి వెళ్లే రోడ్ గతుకులమయంగా ఉంటుంది. ఎలా లేదన్న 20-25 నిమిషాల సమయం పడుతుంది. నేనేమో రైల్వే ఎమర్జెన్సీ విభాగంలో ఇంజనీరుగా పని చేస్తున్నాను. ఎక్కడైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే 15 నిముషాల్లో మా ఆక్సిడెంట్ ట్రెయిన్ బయలుదేరాలి. ఆలస్యమైతే ఏదో ఒక పనిష్మెంట్ ఉంటుంది. అదీకాక ఆదివారం బయటకి వెళ్ళాలంటే ముందురోజే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటిది ఆదివారం ఉదయం నా భార్య హఠాత్తుగా అడిగింది. ఇంకా నేను నా పైఅధికారులు వద్ద నుండి అనుమతి తీసుకోకుండానే బాబా మీద భారమేసి నా భార్యను తీసుకొని బయల్దేరాను. బాబాకి దణ్ణం పెట్టుకొని, "బాబా! మేము సినిమాకి వెళ్ళొచ్చేవరకూ ఎటువంటి ఎమర్జెన్సీ కాల్ రాకుండా, అత్యవసర విధులు పడకుండా కాపాడు తండ్రీ" అని అనుకున్నాను. బాబా దయవల్ల ఎటువంటి ఇబ్బందీ కలగలేదు.  ఒకవేళ కాల్ వచ్చునంటే గర్భవతి అయిన నా భార్యతో బైక్ మీద ఆ గతుకుల రోడ్డుపై ప్రయాణం చాలా కష్టం అయ్యుండేది. "ధన్యవాదాలు బాబా. నా భార్యకి డెలివరీ చక్కగా అయ్యేలా చూడండి తండ్రీ".

సాయిభక్తుల అనుభవమాలిక 1930వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • సాయి అనుగ్రహ జల్లులు

నేను ఒక సాయి భక్తుడిని. నేను రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాను. ఒకసారి మా ఆఫీసర్ బీహార్‌‌లో ఉన్న జమల్పూర్‌లో ఒక వారం రోజుల ట్రైనింగ్‌కోసం నా పేరు సిపారసు చేసి, నన్ను వెళ్ళమన్నారు. అయితే ఆ సమయంలో నా భార్య 7 నెలల గర్భవతి. మాకు 2 సంవత్సరాల బాబు ఉన్నాడు. ఇంట్లో నేను తప్ప వాళ్ళని చూసుకొనే వాళ్ళు లేరు. అదీకాక అప్పటికే డాక్టర్ నా భార్యని తేలికపాటి పనులు మాత్రమే చేయమని చెప్పారు. ఇంట్లో ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే నేను వెంటనే రాలేను. కారణం జమల్పూర్ నుండి సోలాపూర్ రావడానికి రెండు, మూడు ట్రైన్లు మారాల్సి ఉన్నందున ఎలా లేదన్న 2 రోజులు పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో 10 రోజులు వాళ్ళని వదిలి ట్రైనింగ్‌‌కి వెళ్ళడమంటే కుదరనే కుదరదు. విషయం మా ఆఫీసర్‌కి చెప్పినప్పటికీ, ట్రైనింగ్‌కి వెళ్లాల్సిందే అన్నారు. మా ఇన్చార్జికి చెప్తే, "ఆఫీసర్ చెప్పాక కాదనలేం" అన్నారు. ఆ సమయంలో నేను బాబాకి నమస్కరించి, "బాబా! రేపు ఉదయం నేరుగా వెళ్లి మరోసారి నా సమస్య ఆఫీసర్‌‌తో చెప్తాను. ఆయన నన్ను పంపకుండా ఉండడానికి ఒప్పుకున్నట్లయితే ముగ్గురికి అన్నదానం చేస్తాను" అని ప్రార్థించాను. మర్నాడు ఆఫీసుకి వెళ్లి మా ఆఫీసర్‌కి నా సమస్య చెప్పాను. ఏదో అద్భుతం జరిగినట్టు మారుమాట్లాడకుండా ఆఫీసర్ ఒప్పుకొని, నా బదులు ఇంకెవరినైనా పంపుతానన్నారు. బాబాకి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. "ఎప్పుడూ కష్టాల్లో ఇలానే కాపాడుతూ ఉండండి తండ్రీ".

నాకు ఒకరోజు రైల్వే ADRM ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. విషయమేమిటంటే, ADRM పిఏకి బదిలీ అవ్వడంతో ఆ పోస్టు ఖాళీగా ఉందని నన్ను వచ్చి ఆ స్థానంలో చేరమన్నారు. దాంతో నేను ఆ ఉద్యోగంలో చేరాలా, వద్దా అన్న సందిగ్ధంలో పడిపోయాను. ఆ విషయమై చాలామందిని అడిగాను. కొందరు 'మంచి హోదా గల పదవి, అవసరమైనపుడు సెలవులు దొరుకుతాయి, నచ్చిన చోటుకి బదలీ ఇట్టే ఆమోదం పోతుంది' అని, మరికొందరు  'అది ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం, చాలా పనులు ఉంటాయి, కొన్నిసార్లు ADRM ఇంటి పనులు కూడా చేయాల్సి వస్తుంది, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లాల్సి ఉంటుంది' అని చెప్పారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తూండేసరికి నాకు ఏం చేయాలో అర్థంకాక బాబా మీద భారమేసాను. నాకెందుకో బాబా 'వద్ద'ని అంటున్నట్టు అనిపించింది. అందుచేత బాబాని తలుచుకొని 'నాకు ఆసక్తి లేద'ని వాళ్లతో చెప్పేశాను. తర్వాత, "బాబా! నన్ను ఆ పోస్టులో జాయినవ్వమని ఒత్తిడి చేయకపోతే మీ మందిరంలో పాలకోవా నివేదించి అందరికీ పంచిపెడతాను" అని అనుకున్నాను. బాబా దయ చూపారు. ఆ పోస్టు కోసం వేరేవాళ్ళని సంప్రదించారు. వాళ్ళ నుండి నాకు కాల్ కూడా రాలేదు. బాబా ఏమి చేసినా అది మన మంచికే అవుతుంది. "ధన్యవాదాలు బాబా".

నేను కొన్నిరోజులు దంతాల నొప్పితో బాధపడ్డాను. అక్కడ కాస్త వాపు కూడా ఉండింది. నేను మా రైల్వే హాస్పిటల్లో ఉన్న ఫార్మసిస్ట్‌ని కలిస్తే 3 రోజుల కోసం మందులు ఇచ్చారు. అయితే మూడు రోజులు వాడినా తగ్గలేదు. దాంతో మరో 2 రోజులు వాడమన్నారు. అయినా తగ్గలేదు. ఇక అప్పుడు హాస్పిటల్‌కి వెళ్లి మెడికల్ ఆఫీసరుని కలిస్తే, చెక్ చేసి ప్రైవేటు ఆసుపత్రిలో ఉన్న ప్రొఫెషనల్ డెంటిస్ట్‌ని కలవమన్నారు. సరేనని అదేరోజు ఆ డెంటిస్ట్ దగ్గరకు వెళితే, అంతా చెక్ చేసి స్కేలింగ్ చేయాలి, ఇంకా  నొప్పిగా ఉన్న దంతానికి ఇంటర్నల్ ఇన్ఫెక్షన్ ఉందేమో తెలుసుకోవడానికి ఎక్స్-రే తీయాలి. ఇప్పుడు వెళ్లి, మళ్ళీ రండి" అని చెప్పి పంపించారు. ఎక్స్-రే అనగానే నాకు భయమేసింది. ఎందుకంటే, ఇంటర్నల్‌గా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే మొత్తం దంతం తీసేసి ఆర్టిఫీషియల్ దంతం పెట్టుకోవాలి. అది ఒక నొప్పితో కూడుకున్న ప్రక్రియ. నేను ఆపద్భాందవుడైన బాబాని తలుచుకొని, "బాబా! ఎక్స్-రేలో ఎటువంటి సమస్య లేకుండా ఉండేలా చూడండి. అలాగే కొన్ని రోజుల్లో ఈ దంతం సమస్య సమసిపోయేలా చూడండి తండ్రీ. ఒకరికి అన్నదానం చేస్తాను" అని ప్రార్థించాను. తర్వాత మా ఆఫీసర్ వద్ద అనుమతి తీసుకొని ముందుగా అనుకున్న రోజు డెంటిస్ట్ దగ్గరకి వెళ్ళాను. ఎక్స్-రే తీస్తున్నప్పుడు నేను బాబాని తలుచుకొని 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని అనుకుంటూ ఉన్నాను. బాబా దయ చూపారు. ఎక్స్-రే నార్మల్ అని వచ్చింది. అందువల్ల డాక్టర్ కేవలం స్కేలింగ్ చేశారు. స్కేలింగ్ చేస్తున్నప్పుడు రక్తం కారుతూ నొప్పి వేసింది. ఆ సమయంలో నేను శిరిడీలో కొలువున్న బాబా రూపం తలుచుకుంటూ ఉంటే నొప్పి తెలియలేదు. డాక్టరు ఒక టూత్ పేస్ట్ రాసి పంపించేశారు. కానీ ఇంకా కాస్త ఇన్ఫెక్షన్ ఉండి అప్పుడప్పుడు కాస్త నొప్పి వస్తూ రక్తం కారుతుంటే వేరెవరినీ నమ్మక బాబా మీదే నమ్మకముంచి రోజూ పవిత్రమైన ఊదీ పూస్తుంటే మూడు రోజుల్లో పూర్తిగా తగ్గిపోయింది. బాబాకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే. నేను ముందుగా అనుకున్నట్లు ఒకరికి అన్నదానం చేశాను.  

ఒక శుక్రవారం ఉదయం నా భార్య అక్క కుటుంబంతో సహా మా ఇంటికి వచ్చారు. ఆఫీస్ వర్క్ వల్ల నేను, నా భార్య వాళ్ళతో సమయాన్ని గడపడానికి ఆరోజు కుదరలేదు. నేను బాబాని, "కనీసం శని, ఆది వారాలైనా ఎటువంటి అత్యవసర విధులు పడకుండా చేసి బంధువులతో గడిపేందుకు సమయం కేటాయించేలా చూడండి బాబా" అని అడిగాను. బాబా దయవల్ల శని, ఆది వారాలు ఎటువంటి అత్యవసర విధులు పడలేదు. రోజువారీ విధులలో కూడా ఎటువంటి ఇబ్బందిలేకుండా సమయాన్ని సర్దుబాటు చేసుకొని వాళ్ళకి సమయాన్ని కేటాయించగలిగాను. వాళ్ళు సంతృప్తిగా బెంగళూరులో ఉన్న వాళ్ళింటికి తిరిగి వెళ్ళారు. బాబాకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే!

ఒకసారి మా బాబుకి జలుబు, దగ్గు బాగా ఎక్కువగా ఉంటే నేను బాబా ఊదీ బాబు నుదిటిపై పెట్టి, "బాబా! బాబుకి త్వరగా నయమయ్యేలా చూడండి" అని ప్రార్థించాను. బాబా దయవల్ల హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేకుండా 4-5 రోజుల్లో బాబుకి మాయమైపోయింది. "ధన్యవాదాలు తండ్రీ".

సాయిభక్తుల అనుభవమాలిక 1929వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా మీద భారమేస్తే చాలు - అంతా సవ్యంగా ఉంటుంది
2. శ్రీసాయి అనుగ్రహం
3. ఊదీతో పని చేసిన టీవీ


శ్రీసాయి అనుగ్రహం

నేను ఒక సాయి భక్తురాలిని. 2022లో మేము శిరిడీ వెళ్ళాము. మేము అక్కడినుండి శనిసింగణాపూర్, ఇంకా పేరు గుర్తులేదుగానీ దగ్గర్లో ఉన్న ఒక శివుడి గుడికి కూడా వెళదామనుకున్నాము. కానీ వెళ్లలేకపోయాము. అందువల్ల నా మనసులో తీరని బాధగా వుండింది. అయితే శిరిడీలో ఒక అద్భుతం జరిగింది. శిరిడీలో ఎక్కడన్నది నాకు సరిగా తెలీదు కానీ, ఓ చోట హాల్‌లా ఉంది. అందులో వరుసగా చిన్నచిన్న విగ్రహాలు చాలా ఉన్నాయి, శివలింగం కూడా ఉంది. ముందు మా అమ్మాయి, అల్లుడు వెళ్తుంటే వెనుక నేను, నా వేలు పెట్టుకొని నా 3 సంవత్సరాల మనవరాలు నడుస్తున్నాము. ఒక పూజారి నీళ్లు దగ్గర పెట్టుకొని, చెంబుతో కొంతమందికి ఇస్తున్నారు. అతను నా ముందున్న మా అమ్మాయి, అల్లుడికి ఇవ్వకుండా నా ముఖం వైపు చూసి, చెంబుతో నీళ్లు ఇచ్చి, 'శివలింగంకి పోయమ్మా' అన్నారు. నేను అలాగే చేశాను. మా అల్లుడు ఆశ్చర్యంగా "ఆ పూజారి మీకు నీళ్ళు ఇచ్చారా? మేము మీ ముందేగా వచ్చాము. మాకు ఇవ్వలేదు, మీకు ఇచ్చారు. అద్భుతం!" అని అన్నారు. నాకు ఆరోజు అర్ధం కాలేదు కానీ, తర్వాత సాయితండ్రి నా చేత శివయ్యకు అభిషేకం చేయించారని అనుకున్నాను.

2024, అక్టోబర్ 24, గురువారం మధ్యాహ్నం నుండి నాకు వీపు, కుడిభుజం బాగా నొప్పిగా వుండింది. మర్నాడు కూడా అలానే ఉంది. టాబ్లెట్ వేసుకున్నా తగ్గలేదు. ఇక నొప్పి భరించలేక, "బాబా! నొప్పి తగ్గించండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఒక గంటలో తగ్గింది. "ధన్యవాదాలు బాబా".

ఊదీతో పని చేసిన టీవీ

నా పేరు శాంతి. మాది విశాఖపట్నం. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలు చాలా ఉన్నాయి. అందులో నుండి ఒక అనుభవాన్ని ఇప్పుడు సాయి బిడ్డలతో పంచుకుంటున్నాను. 2019లో మేము స్మార్ట్ టీవీ కొన్నాము. అది బాగానే పని చేసేది కానీ, ఈమధ్య సరిగా పని చేయడం మానేసింది. ఎన్నిసార్లు మెకానిక్‌కి ఫోన్ చేసి వచ్చి చూడమని చెప్పినా కొన్నిరోజులు రాలేదు. చివరికి ఒకరోజు వచ్చి చూసి, "రిపేర్ చేయాలి. 1800 రూపాయలు అవుతుంది. తర్వాత కూడా పని చేయకపోతే 6,000 రూపాయలు అవుతాయ"ని చెప్పారు. "అయితే తర్వాత చేయిద్దాం. మెకానిక్‌ని పంపించేయడ"ని నేను మా ఆయనతో చెప్పి టీవీకి బాబా ఊదీ పెట్టాను. బాబా అద్భుతం చేశారు. హఠాత్తుగా టీవీ పని చేయడం మొదలుపెట్టింది. మా ఇంట్లో వాళ్ళందరూ "ఎలా పని చేస్తుంది?" అని అడిగారు. నేను గర్వంగా, "బాబా దయవల్ల ఇది సాధ్యపడింది" అని చెప్పుకున్నాను. "కష్టం అనగానే మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వేల వేల కృతజ్ఞతలు సాయిదేవా. ఏమిచ్చినా మీ ఋణం తీర్చుకోలేనిది తండ్రీ".

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo