సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1687వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా తమ భక్తులతో ఎప్పుడూ, ఎల్లప్పుడూ ఉంటారనేది సత్యం
2. నమ్మకాన్ని పెంచుతున్న బాబా

బాబా తమ భక్తులతో ఎప్పుడూ, ఎల్లప్పుడూ ఉంటారనేది సత్యం

సాయిభక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు జయలక్ష్మి. ఒకరోజు ఉద్యోగ విధులు ముగించుకొని నేను, మావారు ఇంటికి తిరిగి వస్తుండగా ఎదురుగా ఒక బైకు అడ్డురావడంతో ఇద్దరమూ కింద పడిపోయాము. ఆ ప్రమాదంలో రోడ్డు బలంగా గుద్దుకోవడం వల్ల నా చేయి, మావారి కాలు విరిగిపోయాయి. రక్తం చాలా పోయింది, ఆపరేషన్‌కి నాలుగు గంటల సమయం పట్టింది. ఆ సమయంలో నేను మూడు నెలల గర్భవతినైనందున లోపల బిడ్డకు ఏమైందో అని తొమ్మిది నెలలు నిండేవరకు చాలా భయపడుతూ టెన్షన్‌గా ఉంటుండేదాన్ని. ఆ టెన్షన్ వల్ల నాకు షుగర్ వ్యాధి కూడా వచ్చింది. ఏదేమైనా బాబా తమని నమ్మిన భక్తులకు ఎటువంటి కష్టాలు దరిచేరనివ్వరని, ఆయన దయవలన నా బిడ్డ ఈ లోకంలోకి క్షేమంగా వస్తుందని నమ్మకంతో సాయిని ప్రార్థిస్తూ, మందులు వాడుతుండేదాన్ని. బాబా దయవల్ల 2018, మార్చి 19న ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యవంతమైన పాపకు జన్మనిచ్చాను.

పాప పుట్టిన తర్వాత నేను మరల ఉద్యోగ ప్రయత్నాలు చేశాను. కానీ కరోనా వల్ల కాలేజీలు మూతపడటంతో ఉద్యోగం దొరకలేదు. కానీ బాబా దయతో ఉద్యోగం ఉంటే ఎంత సంపాదన ఉండేదో అంత సంపాదన ట్యూషన్ల రూపంలో నాకు అందించారు. కరోనా లాక్‌డౌన్ ముగిసిన తర్వాత మంచి కాలేజీలో ఉద్యోగం వచ్చేలా ఆశీర్వదించారు. రెండు సంవత్సరాలపాటు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఉద్యోగం చేసుకున్నాను. తర్వాత మా ఇంటి దగ్గర నుండి కాలేజీ చాలా దూరంలో ఉండటం వలన ప్రయాణానికి ఇబ్బందికరంగా ఉందని వేరే కాలేజీకి మారుదామని బాబాను ప్రార్థించి ఇంటర్వ్యూకి వెళ్లాను. వాళ్లు డెమో క్లాసుతోపాటు వ్రాతపరీక్ష కూడా వ్రాయాలని, క్వాలిఫై అయితే ఉద్యోగం ఇస్తామని చెప్పారు. నేను అప్పటివరకు ఎలాంటి పరీక్షలూ వ్రాయలేదు. అందువల్ల బాబాని తలచుకొని డెమో క్లాస్ ఇచ్చి, పరీక్ష వ్రాశాను. కానీ నా మీద నాకే నమ్మకం లేదు. అలాంటిది బాబా దయవల్ల ఆరోజు సాయంత్రం కాలేజీవాళ్ళు ఫోన్ చేసి,  "మీరు ఉద్యోగానికి రావచ్చు" అని చెప్పారు. అంతేకాదు, నేను అనుకున్నదానికంటే చాలా మంచి జీతం ఇచ్చారు. నేను కొన్నిసార్లు ఏవో కారణాల వల్ల ఆలస్యంగా కాలేజీకి వెళ్లేదాన్ని. అలాంటప్పుడు నేను బాబాను తలచుకొని "ఎటువంటి ఇబ్బందీ కలగకుండా చూడమ"ని ప్రార్థించేదాన్ని. బాబా దయవలన నాకెప్పుడూ ఎటువంటి ఇబ్బందీ కలగలేదు.

నేను దాటలేని కష్టాలను సైతం గట్టెక్కిస్తూ అడుగడుగునా నా వెంట ఉండి నన్ను నడిపించే శక్తి సాయినాథుడు. నేను ఏ పని మొదలుపెట్టినా, ఏం చేసినా సాయినే తలచుకుని చేస్తాను. ఆయనని తలచుకోగానే ఆ పని చేయలేని స్థితిలో ఉన్న నాకు తెలియని శక్తి వస్తుంది. రెండు, మూడుసార్లు నా బంగారం వస్తువులు కనపడకుండా పోవడం, నేను భయంతో నిలువెల్లా వణికిపోవడం, 'బాబా, బాబా' అని అనుకుంటూ అన్నిచోట్లా వెతకడం జరిగింది. బాబాని తలచిన తర్వాత కష్టం తీరకుండా ఉంటుందా? పోయిన బంగారం వస్తువులను బాబా ఎంతో దయతో మాకు తిరిగి అందించారు. ఇలా బాబా నిత్యమూ ఏదో విధంగా చిన్న కష్టాల నుండి పెద్ద కష్టాల వరకు నన్ను కాపాడుతూనే ఉన్నారు. బాబా తమ భక్తులతో ఎప్పుడూ, ఎల్లప్పుడూ ఉంటారనేది సత్యం. బాబా అంటే తండ్రి అని కదా! "ధన్యవాదాలు బాబా. మీరు ప్రసాదించిన గొప్ప వరం మా అబ్బాయి. తొమ్మిదో తరగతి చదువుతున్న తనకి ఈమధ్య మొండితనం పెరిగి చదువు మీద శ్రద్ధ తగ్గుతోంది. వాడికి సద్బుద్ధిని ప్రసాదించి చదువులో ముందు ఉండేలా ఆశీర్వదించు తండ్రీ. నన్ను నడిపిస్తున్న మార్గదర్శి మీరు. కరుణతో మంచి నడవడి కలిగివుండేలా చూడు తండ్రీ. ఎల్లప్పుడూ మీ నామస్మరణలో, భక్తి, ప్రేమలతో ఉండేలా ఆశీర్వదించు బాబా. మా కుటుంబం మీద, నా తల్లిదండ్రుల మీద, అలాగే మీ భక్తులందరి మీద మీ కరుణ, ప్రేమలు ఎల్లప్పుడూ ఉండేలా చూడు తండ్రీ".


నమ్మకాన్ని పెంచుతున్న బాబా

నేను ఒక సాయిభక్తురాలిని. నేను మొదటినుండి బాబానే ప్రార్థించేదాన్ని. కానీ ఈమధ్య బాబా మీద ఎక్కువగా నమ్మకం కలుగుతోంది. ఏ పని చేసినా బాబాని తలచుకొని చేస్తే అది జరుగుతుందని నాకు బాగా నమ్మకం వచ్చింది. ఒకరోజు మా రెండేళ్ళ బాబు చెవినొప్పి ఎక్కువగా ఉందని ఏడుస్తూ ఒక అరగంటసేపు బాధతో బాగా విలవిలాడిపోయాడు. అప్పుడు నేను బాబాని తలచుకొని బాబుకి పెడదామని ఊదీ తీసుకొచ్చాను. బాబు అంత నొప్పిలో కూడా ఊదీ పొట్లం చూడగానే నోరు తెరిచి, "నోట్లో వేయమ"ని అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే, నేను అంతకుముందెప్పుడూ ఊదీని తన నోట్లో వేయలేదు. అలాంటిది ఊదీని తన నోట్లో వేస్తానని తనకి ఎలా అర్థమైందా అని నాకు అనిపించింది. ఊదీ నోట్లో వేశాక బాబుకి నొప్పి తగ్గి కొంచెంసేపు నిద్రపోయాడు. కానీ కొంతసేపటి తర్వాత మళ్ళీ నొప్పి వచ్చిందని ఏడ్చాడు. నేను మళ్ళీ బాబానే తలచుకొని, "బాబుకి నొప్పి తగ్గిపోవాల"ని అనుకున్నాను. తర్వాత మందు తీసుకొచ్చి, కొన్ని డ్రాప్స్ బాబు చెవిలో వేశాము. బాబా దయవల్ల వెంటనే బాబుకి ఉపశమనం కలిగి నిద్రపోయాడు. ఈ అనుభవం ద్వారా బాబా మమ్మల్ని ఎప్పుడూ చూస్తూ ఉంటారన్న నమ్మకం బాగా వచ్చింది నాకు. "ధన్యవాదాలు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1686వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1.కోరింది అనుగ్రహించిన బాబా
2.వేడుకున్నంతనే ఉద్యోగం ప్రసాదించిన బాబా

కోరింది అనుగ్రహించిన బాబా

అందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. ఒకసారి మేము కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో వైజాగ్ నుండి సికింద్రాబాద్ వస్తున్నాం. ఆ సమయంలో హైదరాబాద్‌లో సైక్లోన్ నడుస్తుంది. పెద్ద వర్షం కారణంగా ఉదయం మేము దిగవల్సిన స్టేషన్ కంటే ముందు స్టేషన్‌లో ట్రైన్ ఆగిపోయింది. ఒక గంటసేపు వేచి ఉన్నా ట్రైన్ కదలలేదు. మరోపక్క ఆఫీసుకి టైమ్ అయిపోతుంది. అందువల్ల బయట పెద్ద వర్షం కురుస్తున్నప్పటికీ ఆ స్టేషన్‌లో దిగేసి ఆటోలో ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాము. మాతో పాటు రైలులో సగం మంది దిగిపోయారు. పెద్ద వర్షం పడుతుంది. చిన్న స్టేషన్ అయినందున లగేజీతో నిల్చోడానికి షెల్టర్లు లేవు. బయట ఆటోలు కూడా లేవు. ఓలా, ఉబెర్ యాప్‌ల్లో ట్రై చేసినా ఏమీ బుక్ అవ్వలేదు. అలా ఒక 30 నిమిషాల సమయం నడిచింది. ఇక అప్పుడు మావారు, "మెయిన్ రోడ్డుకి వెళ్లి ఆటో తీసుకొస్తాన"ని అంత పెద్ద వర్షంలోనూ అలానే వెళ్ళారు. నేను బాబాని తలుచుకొని, "బాబా! తొందరగా మాకు ఆటో దొరకాలి. అలానే 300 రూపాయల లోపు ఛార్జ్ చేసేలా చూడండి బాబా" అని వేడుకున్నాను. అలా ఎందుకు వేడుకున్నానంటే, మా ఇల్లు ఉండేది మణికొండలో, మేము రైలు దిగింది మల్కాజ్గిరిలో, బయట పెద్ద వర్షం, వాహనాలు అందుబాటులో లేవు. వీటన్నిటి దృష్ట్యా ఆటోకానీ, క్యాబ్‌కానీ కనీసం 1000 రూపాయలకు తక్కువ కాకుండా ఛార్జ్ చేస్తారు. అదే మేము మాములుగా దిగాల్సిన స్టేషన్‌లో దిగితే, అక్కడ ఆటోలు ఉంటాయి. 300-350 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారు. అందువల్ల బాబాని అలా ఒక 10 నిమిషాలు ప్రార్థించాక, "నేను కోరుకున్నట్లు జరిగితే మీ అనుగ్రహం గురించి బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకున్నాను. వెంటనే మావారు ఫోన్ చేసి, "ఆటో దొరికింది. రోడ్డు మీదకి వచ్చేయి" అని అన్నారు. నేను మా లగేజీ మోసుకుంటూ వెళ్లి ఆటో ఎక్కేసి, "మేము ఇంటికి వెళ్ళేలోపు మీరు కనిపించండి బాబా" అని బాబాను అడిగాను. ఒక్క నిముషంలో బస్సు మీద దర్శనమిచ్చారు బాబా. మేము వెళ్లే దారంతా ఒకటే వర్షం. రోడ్లన్నీ జలమయమయ్యాయి. అయినప్పటికీ ఆటో అతను డబ్బులు ఎక్కువ అడగలేదు. 300 రూపాయలే తీసుకున్నాడు. అలా నేను కోరుకున్న విధంగా అనుగ్రహించి మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చారు బాబా. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

ఒకసారి మావారు గంటలో వస్తానని బయటకి వెళ్లారు. కానీ గంట అయినా ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్ చేసినా తీయలేదు. అలా 3 గంటల సమయం గడిచింది. ఇంకా నాకు ఏడుపు వచ్చి, "బాబా! మా ఆయన కాల్ చేసేలా చూడండి. మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. వెంటనే మా ఆయన దగ్గర నుండి నాకు ఫోన్ వచ్చింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

నేను ఒక మల్టీ నేషనల్ కంపెనీలో పని చేశాను. ఒకసారి కొన్ని సమస్యలు కారణంగా నా ఉద్యోగం ప్రమాదంలో పడింది. రోజూ మా మేనేజర్ నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టారు. అటువంటి స్థితిలో నేను ఈ ఉద్యోగం పోవడమే సబబని నిర్ధారించుకొని అదే విషయంగా బాబాతో, "ఈ టార్చర్ నేను తట్టుకోలేను బాబా. ఈ ఉద్యోగం ఉండేటట్టు అయితే నాకు ఏ సమస్యలు రాకుండా చూడండి. ఉద్యోగం ఉండదన్నట్లైతే మేనేజర్ లేని సమయంలోనే హెచ్ఆర్ నన్ను ఉద్యోగం నుండి తొలగించేలా చూడండి" అని చెప్పుకున్నాను. ఒక వారం తర్వాత నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నపుడు నా మేనేజర్ లేని సమయంలో హెచ్ఆర్ నన్ను ఉద్యోగం నుండి తొలగించారు. నేను బాధపడలేదు. ఎందుకంటే, నాకు కావాల్సింది కూడా అదే. అదీకాక, సాయి ప్రశ్నావళిలో అడిగితే, 'నాకు ఇంకో ఉద్యోగం వస్తుంది' అని బాబా చెప్పారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

వేడుకున్నంతనే ఉద్యోగం ప్రసాదించిన బాబా

సాయిబాబాకు సాష్టాంగ ప్రణామాలు. సాయిభక్తులకు నమస్కారం. నా పేరు గిరిజ. మేము ఉద్యోగరీత్యా ముందు యూకే వెళ్ళాము. తర్వాత బాబా ఆశీస్సులతో అక్కడినుండి యుఎస్ వెళ్లే అవకాశం మాకు వచ్చింది. ప్రస్తుతం మేము యుఎస్‌లో నివసిస్తున్నాము. మేము యుఎస్ వచ్చి కొన్ని నెలలవుతున్నా యుఎస్‌లో మాంద్యం(రిసెషన్) వల్ల మావారికి ఉద్యోగం దొరకడం చాలా కష్టమైంది. చివరికి ఇంకొక నెలలో ఉద్యోగం రాకుంటే మేము స్వదేశానికి తిరిగి రావలసిన పరిస్థితి వచ్చింది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నేను బాబాకి నమస్కరించి ఆయన్ని వేడుకున్నాను. అంతే, ఒక్క వారంలో మావారికి ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు మావారు ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా". బాబా ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.


సాయిభక్తుల అనుభవమాలిక 1685వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • దయతో అక్కున చేర్చుకొని సహాయం అందిస్తున్న బాబా

సాయిబాబాను నమ్మి ఆరాధించే అందరికీ నమస్సుమాంజలులు. నా పేరు కావ్య. నిజానికి నేను 2023, సెప్టెంబర్ నెల ముందువరకు సాయి భక్తురాలిని కాదు. చిన్నప్పుడు బాబా గుడికి వెళ్ళి ఉన్నప్పటికీ అది కేవలం ప్రసాదం కోసమే. అంతేగానీ, మనకు కావాల్సింది అడిగితే బాబా ఇస్తారాన్న ఊహ కూడా నాకు అప్పట్లో లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పాలి. అలాంటిది నాకు ఇప్పుడు అంతా బాబానే. ఆయన నా జీవితంలోకి ప్రవేశించి తమపట్ల నమ్మకాన్ని ఎలా బలపరిచారో మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. 

2009లో నేను ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ సమయంలో నా రూమ్మేట్ నాకు శిరిడీ సాయిబాబా ఊదీ ఇచ్చింది. నేను రోజూ ఆ ఊదీ నా నుదుటన పెట్టుకొని పరీక్షలకు వెళ్లాను. తర్వాత ఆ పరీక్షలు ఫలితాలు వెలువడినప్పుడు ఊదీ మహిమ ఏమిటో బాబా నాకు తెలియజేశారు. నిజానికి నేను పరీక్షలు సరిగా వ్రాయనందున ఫెయిల్ అవుతానని ఫిక్స్ అయిపోయాను. అలాంటి నేను బాబా మహిమ వల్ల పాసయ్యాను. కానీ అప్పట్లో నేను ఆ క్రెడిట్ బాబాకి ఇవ్వలేదు. ఎందుకంటే, నాకు అప్పుడు బాబా మీద అంత దృష్టి లేదు. అప్పుడే నేను బాబాని గుర్తించి వుంటే ఇన్ని సంవత్సరాలు నేను బాబాకి దూరంగా వుండి కష్టాలు పడేదాన్ని కాదు. నా జీవితం చాలా బాగుండేది అనుకుంటున్నాను. "నన్ను క్షమించండి బాబా".

నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలకు బాబా మళ్ళీ నా మీద దయ చూపారు. దయతో నన్ను తమ భక్తుల్లో చేర్చుకున్నారు. ఇంత ఆలస్యమైనందుకు నేను బాధపడుతున్నాను. అసలు విషయానికి వస్తే..  2023, సెప్టెంబర్ నెలలో ఒకరోజు నేను ఫేస్బుక్ చూస్తుండగా ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' పోస్ట్ ఒకటి నా కంటపడింది. అదేమిటంటే, "నువ్వు నా దగ్గరకి రాలేనందున నేనే నీకు ఊదీ ప్యాకెట్ పంపాను. దాన్ని తీసుకున్నావా, లేదా?" అని. అది చదివి నేను నా మనసులో, "ఎలా వస్తుంది? ఎవరు ఇస్తారు? నిజంగా అలా జరిగితే ఎంత బాగుండు?" అని అనుకున్నాను. ఎందుకంటే, నేను అప్పుడు గర్భవతిని. తర్వాత ఆ విషయం వదిలేసాను. ఒక రెండు వారాల తర్వాత ఒకరోజు మధ్యాహ్నం నా భర్త మధ్యాహ్న భోజనానికి వచ్చినప్పుడు, "ఇదిగో!" అంటూ తన షర్ట్ జేబులో నుంచి ఒక చిన్న ప్యాకెట్ తీసి నాకు ఇచ్చారు. నిజం చెప్తున్నాను, మావారి ఇచ్చిన ప్యాకెట్ చూసి నేను షాకై నోటిలో నుండి మాట రాలేదు. అది శిరిడీ బాబా ఊదీ ప్యాకెట్. మావారు అసలు ఇవన్నీ నమ్మరు. అలాంటి ఆయనకి ఊదీ తెచ్చి నాకు ఇవ్వాలన్న అలోచన ఎలా వచ్చిందో నాకు అర్దం కాలేదు. ఆనందంగా అరుస్తూ "ఎవరు ఇచ్చారు?" అని అడిగితే, "తెలిసిన అతను ఇచ్చాడు" అని చెప్పారు. నా ఆనందానికి అవధులు లేవు. వెంటనే మనసులో బాబాకి దణ్ణం పెట్టుకుని రోజూ ఊదీ పెట్టుకుంటుండేదాన్ని. తర్వాత నేను చాలా విషయాల గురించి బాబాని అడగడం, ఆయన నాకు సహాయం చేయడం పరిపాటి అయిపోయింది. నేను బాబాని పూర్తిగా నమ్ముతూ 'సాయి సచ్చరిత్ర' పారాయణ కూడా చేశాను.

2023, అక్టోబర్ నెల రెండో వారంలో టిఫ్ఫా స్కాన్ చేయించుకోవడానికి నేను, మావారు హాస్పిటల్‌కి వెళ్ళాం. డాక్టరు స్కాన్ చేస్తూ, "బిడ్డ చాలా కిందకి వుంది. బోర్లపడి మొత్తం కవర్ చేసుకొని వుంది. అందువల్ల ముఖం తప్ప శరీర అవయవాలేవీ కనపడట్లేదు. ఈ పొజిషన్‌లో స్కాన్ కష్టం. నువ్వు వెళ్లి జ్యూస్ తాగి గంటన్నర వాక్ చేయి. అప్పుడు చూద్దాం. అప్పుడు కూడా రాకపోతే రేపు లేదంటే ఎల్లుండి మళ్ళీ రావాలి" అన్నారు. అసలే నా భర్తది బిజీ షెడ్యూల్. సెలవు పెట్టి మరీ నాకోసం ఉన్నారు. కాబట్టి మళ్ళీ మళ్ళీ అంటే ఆయనకి కష్టం. విషయం చెప్తే, ఆయన కూడా అదే అన్నారు. తర్వాత ఇద్దరం టెన్షన్‌గా గడిపాము. నేను వాక్ చేస్తూ, 'బిడ్డ కదిలితే నాకు తెలుస్తుంది. కాబట్టి అప్పుడే స్కాన్ కోసం లోపలికి వెళదాం. లేదంటే ఇంటికే' అనుకుంటూ బాబాని తలచుకుంటూ ఉన్నాను. హఠాత్తుగా అక్కడున్న ఒక గది లోపల బాబా ఫోటో కనిపించింది. నేను బాబాని చూసి 'హమ్మయ్య..' అనుకొని ఇంక వాక్ చేయడం ఆపేసి ప్రశాంతంగా కూర్చున్నాను. మావారు, "బిడ్డ కదిలేవరకు కూర్చోకుండా కాస్త వాక్ చేయి ప్లీజ్" అన్నారు. సరిగ్గా అప్పుడే డాక్టర్ పిలిచారు. బాబా తోడుగా వున్నారు కదా అని నేను లోపలికి వెళ్ళాను. బిడ్డ కదిలిక తెలియకపోయినప్పటికీ స్కానింగ్‌లో అన్ని క్లియర్‌గా తెలిసాయని డాక్టర్ చెప్పారు. బాబా కడుపులో బిడ్డను కూడా చేతితో పట్టుకుని కదపగలరని నాకు అర్థమైంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీకు వేల కోట్ల వందనాలు బాబా. ఇలాగే తోడుగా ఉండి మా అందరినీ కాపాడండి బాబా. మీకు తెలియంది ఏమీ లేదు. నా కన్నీళ్లను మీరు మాత్రమే తుడవగలరు బాబా. నా కోరికలు మన్నించి ఇదేవిధంగా నా అనుభవాలను తోటి భక్తులతో పంచుకునే భాగ్యాన్ని నాకు కలిగించు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1684వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఉన్నారు
2. బాబా మనతోనే ఉన్నారు అనడానికి ఇదే నిదర్శనం

బాబా ఉన్నారు

సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మిపద్మజ. సాయి నాతోనే ఉన్నారని నా నమ్మకం. అందువల్ల నాకు ఏ సమస్య వచ్చినా బాబాకి చెప్పుకోవడం నాకు అలవాటు. నా తమ్ముడు మావారి దగ్గర పని చేస్తున్నాడు. ఒకసారి నా భర్త చాలా కోపంగా తనని తిట్టి, "ఉద్యోగం నుండి తీసేస్తాన"ని అన్నారు. నాకు చాలా భయమేసి, "బాబా! నువ్వు ఉన్నావు. మావారి కోపాన్ని తగ్గించి, తమ్ముడితో మామూలుగా ఉండేటట్లు చూడు తండ్రీ" అని అనుకున్నాను. బాబా దయవల్ల మర్నాడు మావారు ఏమీ జరగనట్లు తమ్ముడితో మామూలుగా ఉన్నారు. బాబా ఉన్నారని నాకు ఆనందంగా అనిపించింది.

ఒకసారి నేను బాగా విరోచనాలతో బాధపడ్డాను. అప్పుడు నేను, "బాబా! నువ్వు ఉన్నావు. విరోచనాలు తగ్గేలా చూడు" అని అనుకున్నాను. బాబా దయవల్ల విరోచనాలు వెంటనే తగ్గిపోయాయి.

ఒకసారి మా ఫ్రిడ్జ్ ఉన్నట్టుండి పనిచేయడం మానేసింది. అప్పుడు నేను, "బాబా! ఫ్రిడ్జ్ పని చేసేలా చూడు" అని ఊదీ పెట్టాను. బాబా దయవల్ల అది దానంతట అదే పని చేసింది. అది నాకు ఒక అద్భుతంలా అనిపించింది. నా సాయికి వేలవేల నమస్కారాలు.


బాబా మనతోనే ఉన్నారు అనడానికి ఇదే నిదర్శనం

సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. ఈమధ్య ఒకరోజు మా అన్నయ్య, వదినల మధ్య వాగ్వివాదం జరిగింది. గొడవ చిన్నదే అయినా రెండు రోజుల వరకు అది పెరుగుతూ ఆ ప్రభావం ఇటు మా కుటుంబంపై, అటు మా వదినవాళ్ళ కుటుంబంపై పడింది. అంతా నావల్ల, మా అమ్మవల్లే అని మమ్మల్ని చాలా నిందించారు. నిజానికి మేము మా వదినని చాలా బాగా చూసుకున్నాము. అయినప్పటికీ వాళ్ళు మమ్మల్ని లేనిపోని మాటలన్నారు. అవి విన్నాక సమస్య ఇంకా పెద్దదై ఎంత దూరం వెళ్తుందో అని నాకు చాలా బాధేసింది. మా అమ్మానాన్న అయిందేదో అయిందని అన్నయ్యని వదినతో మామూలుగా మాట్లాడమని చెప్పారు. కానీ ఆమె మాట్లాడటం మానేసి, కావాలని ఫోను స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంది. మేము ఎంత తగ్గినా ఆ అమ్మాయి అలా ఉంటే మాకు ఏం చేయాలో అర్థమేకాక రెండురోజులు నరకం అనుభవించాము. ఇక అప్పుడు నేను సాయిని తలుచుకొని, "మా తప్పు లేకపోయినా మాటలుపడిందేకాక ఇది ఇంకా ఎంత దూరం వెళుతుందో అర్థం కావడం లేదు సాయి. ఏదో రకంగా పరిష్కారం చూపించి అంతా చక్కబడేటట్లు సహాయం చేయి తండ్రీ. మీరే మాకు సహాయం చేయాలి" అని వేడుకున్నాను. అంతే, ఒక గంటలో ఆ సమస్యకు పరిష్కారం చూపించారు బాబా. మేము మా అన్నయ్యని వెళ్లి, "మనమిద్దరం వేరు ఉందామని చెప్పి రమ్మ"ని పంపించాము. అలా ఎందుకంటే, మేము ఉంటే వాళ్లకు కుదరదట. అన్నయ్య వెళ్లేసరికి వాళ్ళు కూడా అదే నిర్ణయానికి వచ్చినట్లు ఉన్నారు. అన్నయ్య చెప్పగానే ఓకే అన్నారు. ఏదేమైనా ఆ ఒక్క ఆలోచనతో సమస్య అక్కడితో ఆగింది. బాబా మనతోనే ఉన్నారు అనడానికి ఇదే నిదర్శనం. "ధన్యవాదాలు సాయినాథా! మీరు ఎల్లప్పుడూ వాళ్లకు తోడుగా ఉండి ఇంకెప్పుడు ఇలాంటి సమస్యలు వారిద్దరి మధ్య రాకుండా సంతోషంగా ఉండేటట్లు సహాయం చేయ తండ్రీ. సదా రక్షించి కాపాడు సాయితండ్రీ".

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1683వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా కృప
2. అడిగినంతనే అందిన బాబా సహాయం

బాబా కృప

సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు చల్లా గురుమూర్తి. ఒకరోజు నా చేతికి ఉండాల్సిన ఉంగరం కనిపించలేదు. అది ఒక సందర్భంలో మా అమ్మాయి నాకు బహుమతిగా ఇచ్చినదైనందున నాకు చాలా బాధేసి, "బాబా! ఉంగరం దొరికేలా అనుగ్రహించమ"ని సాయిదేవుని వేడుకున్నాను. వెంటనే నా మనసుకి బిస్కెట్లు వగైరా ఉండే ఒక గుడ్డ బ్యాగులో వెతకాలని అనిపించింది. చూస్తే, ఆశ్చర్యకరంగా ఉంగరం ఆ బ్యాగులో కనిపించింది. బహుశా ఆరోజు ఉదయం బిస్కెట్ల కోసం ఆ బ్యాగులో చేయి పెట్టినప్పుడు ఉంగరం జారీ పడిపోయి ఉంటుందని నాకు అనిపించింది. ఏదేమైనా బాబాని తలుచుకోగానే ఆ బ్యాగులో చూడాలనే ప్రేరణ కలిగి, ఉంగరం దొరికినందుకు నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. "ధన్యవాదాలు సాయినాథా! ఇలాగే మిమ్మల్ని వేడుకున్నంతనే మిగతా విషయాలలో కూడా మంచి జరుగుతుందని పూర్తిగా నమ్ముతున్నాను తండ్రీ".

ఒకసారి మాకు హైదరాబాదులో ఒక అపార్ట్మెంట్ నచ్చి కొనాలని నిశ్చయించుకున్నాము. అప్పుడు ఆ అపార్ట్మెంట్ విషయంలో ఇబ్బందులు ఏమైనా ఉంటాయేమోననిపించి, "సరియైన నిర్ణయం తీసుకునే విధంగా దీవించమ"ని సాయిదేవుని వేడుకొని ముందుకుసాగాం. అంతా అయిపోతుందని అనుకున్న దశలో కొన్ని కారణాల వల్ల ఆ డీల్ క్యాన్సిల్ అయింది. తర్వాత ఆ అపార్ట్మెంట్‌కి సంబంధించి కొన్ని సమస్యలున్నాయని మాకు తెలిసింది. అలా సమస్యల్లో చిక్కుకోకుండా బాబా మమ్మల్ని కాపాడారు. "ధన్యవాదాలు సాయినాథా! నాకున్న మిగతా సమస్యలను కూడా త్వరలో తీరేలా దయచూపండి సాయి దేవా".

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
సర్వం సాయినాథార్పణమస్తు!!!

అడిగినంతనే అందిన బాబా సహాయం

సాయి పాదపద్మములకు నమస్కారాలు, నా పేరు మణి. నాకు 20 సంవత్సరాలుగా బాబా తెలుసు. 15 సంవత్సరాల కిందట నాకు 33 సంవత్సరాల వయస్సున్నప్పుడు నా భర్త చనిపోయారు. దాంతో ఇద్దరు పిల్లలతో, అప్పులతో నా జీవితం ఎటు పోతుందో నాకు అర్థం కాలేదు. అటువంటి సమయంలో బాబా నన్ను అక్కున చేర్చుకుని నాకు తల్లి, తండ్రై అండగా నిలిచారు. ఆయన దయతో నేను టైలరింగ్ చేసి, ఇతరులకి నేర్పుతూ అప్పులు తీర్చి, పిల్లల్ని చదివించి వాళ్ళను వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగేలా చేశాను. అలా ఎవరితోనూ మాటపడకుండా బాబా నన్ను నా కాళ్ళ మీద నిలబెట్టారు. మా అమ్మాయి పెళ్లి నా తమ్ముడుతో జరిగింది. పాప ఫార్మసి పూర్తి చేసినందువల్ల భార్యాభర్తలిద్దరూ సొంతంగా మెడికల్ షాప్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. 2023, మే నెలలో తమ్ముడు ఇల్లు కొనుక్కుందామని అనుకుంటే మాకు తెలిసిన ఒక పూజారిగారు ఒక ఇల్లు చూపించి, అనుకున్న దానికంటే లక్ష రూపాయలు తక్కువలో అగ్రిమెంట్ వ్రాయించారు. కానీ మా పాప, తమ్ముడికి లోన్ ప్రక్రియల గురించి తెలియక గందరగోళంలో పడ్డారు. ఏదోలా ప్రయత్నించినా అగ్రిమెంట్ సమయం పూర్తైయ్యేలోగా బ్యాంకు పనులు, లోన్ పనులు పూర్తయ్యేలా కనిపించలేదు. అవి ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ పోతుండేవి.  అందువల్ల మా పాప, తమ్ముడు చాలా ఆందోళన చెందారు. అప్పుడు నేను బాబాని, "సాయీ! పిల్లల ఆందోళన తగ్గించు" అని వేడుకున్నాను. అంతే, ఒకరు తనకు తెలిసినవాళ్ల ద్వారా పిల్లలకు సహాయం చేశారు. వెంటనే లోన్ వచ్చి చెక్కు రిలీజ్ అయింది. కొంచెం ఆలస్యమైనా ఆ ఇంటి యజమాని అర్థం చేసుకొని రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. మొదట ఇల్లు మాట్లాడి పెట్టింది భాస్కర్ గారు, తెలిసిన వాళ్ళని పంపించి లోన్ పూర్తి చేయించింది బాలకృష్ణగారు, లోన్ ఇప్పించింది బలరాంగారు. వీళ్ళందరూ బాబా స్వరూపులే. బాబా వాళ్ళ ద్వారా పని పూర్తి చేయించారు. నేను పెద్దగా చదువుకోలేదు. కానీ కేవలం బాబా అనుగ్రహంతో ఈ అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

రక్ష రక్ష సాయిరక్ష!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1682వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. ఎప్పుడు చెప్పుకున్నా వెంటనే సమస్య నుండి కాపాడుతున్న బాబా
  2. లాప్టాప్ సమస్యని పరిష్కరించిన బాబా

ఎప్పుడు చెప్పుకున్నా వెంటనే సమస్య నుండి కాపాడుతున్న బాబా

సాయిబాబా భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక బాబా భక్తురాలిని. కొన్నినెలల ముందు మా ఆఫీసులో సీనియర్ ఎగ్జిక్యూటివ్స్‌కి నేను ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు నేను, "బాబా! ఈ ప్రెజెంటేషన్ అంతా బాగా అయ్యేలా చూడు. నేను ధైర్యంగా బాగా ప్రెజెంట్ చేసేలా చూసి నా పరువుపోకుండా కాపాడు తండ్రీ. మీ అనుగ్రహం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాని కోరుకున్నాను. బాబా దయవల్ల ప్రెజెంటేషన్ చాలా బాగా జరిగింది. మా మేనేజర్ నన్ను బాగా మెచ్చుకున్నారు కూడా. ధైర్యంగా మాట్లాడలేని నేను ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు బాగా మాట్లాడగలిగానంటే అంటే అది బాబా దయే.

ఒకసారి మా ఆఫీసులో కొన్ని మార్పులు జరిగాయి. ఆ మార్పుల కారణంగా నేను వేరే మేనేజర్ కిందకి పోవలసి వస్తుందని మా మేనేజర్ చెప్పి, "ఆ విషయం టీమ్ మీటింగ్‌లో చెప్తాన"ని అంది. టీమ్ మీటింగ్ గురువారంనాడు ఉంటుంది. నేను ఆరోజు బాబాని, "బాబా! ఈరోజు ఆమె(మేనేజర్) ఆ విషయం చెప్పకుండా చూడండి. అలాగే ఆ మార్పు కూడా లేకుండా చూడండి. ఈరోజు ఆ విషయం చెప్పకుంటే ఇంకా ఆ మార్పు ఉండదు. ఈరోజు ఆమె ఆ మార్పు గురించి చెప్పకుండా ఉంటే మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. బాబా దయవలన ఆరోజు మా మేనేజర్ టీమ్ మీటింగ్‌లో ఆ విషయం గురించి ఏమీ చెప్పలేదు. నేను చాలా సంతోషించాను. కానీ, ఆ మార్పు మాత్రం జరిగింది. "బాబా! ఆ మార్పు నాకు ఏ మాత్రమూ ఇష్టం లేదని మీకు తెలుసు. మళ్ళీ మునపటిలాగానే ఉండేలా చూడు బాబా ప్లీజ్". 

ఇంకోసారి ఆఫీసులో కొత్తగా వచ్చిన ఒక ఎగ్జిక్యూటివ్ విషయంలో చిన్న అపార్థం జరిగింది. నేను అంతకుముందు కూడా ఆ ఎగ్జిక్యూటివ్‌‌తో పని చేశాను. అయితే అప్పుడు అతని జాబ్ రోల్ వేరు. అప్పట్లో అతను నాకు చాలా గౌరవం ఇచ్చేవాడు. పనిలో ఏ సహాయం తీసుకున్న మంచిగా స్పందించేవాడు. అతను ఈమధ్య పైస్థాయి జాబ్ రోల్ కూడా తీసుకున్నందువల్ల నేను నేరుగా అతనితో ఇంకా ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చింది. అప్పుడు తను ఒక వర్క్ అడిగితే నేను చేసి పెట్టాను. తర్వాత తను వేరే ఇంకో వర్క్ అడిగాడు. అయితే అది చేసి ఇచ్చేలోపు మా మేనేజర్ మాట్లాడి, "ఇప్పుడే ఆ వర్క్ పంపొద్దు. నేను మాట్లాడాక పంపుదువులే" అని అంది. 'అంత పెద్ద ఎగ్జిక్యూటివ్ ఒకటి అడిగితే, నేను రెస్పాన్స్ ఇవ్వకపోతే బాగుండదు' అని నేను అప్పుడే అనుకున్నాను. కానీ రెస్పాన్స్ ఇస్తే మా మేనేజర్ ఏమంటుందో అని రెస్సాన్స్ ఇవ్వలేదు. దాంతో నేను ఎంత వర్క్ చేసినా అతను నాకు కనీసం థాంక్స్ కూడా చెప్పలేదు. మామూలుగా అయితే అతని స్వభావం అది కాదు. అందరినీ చాలా గౌరవిస్తాడు. అలాంటి అతను అలా ప్రవర్తిస్తుంటే, చేతులారా చేసుకున్నానని నాకు చాలా బాధేసింది. అసలే తనతో నేను ఎక్కువ వర్క్ చేయాల్సి ఉన్నందున, "బాబా! అంతా మంచిగా అయ్యేలా చూడండి. ఆ ఎగ్జిక్యూటివ్ మళ్ళీ మంచిగా ఉండేలా చూడండి ప్లీజ్ బాబా. మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. తర్వాత అపార్థాలన్నీ తొలగిపోయి ఇప్పుడు అతను నాకు మంచి గౌరవమిచ్చి మాట్లాడుతున్నాడు. అంతా బాబా దయ. ఇలా నేను ఎప్పుడు బాబాకి నా సమస్య చెప్పుకున్నా వెంటనే ఆ సమస్య నుండి కాపాడుతున్నారు బాబా. "ధన్యవాదాలు బాబా. మీ దయలేకుంటే నేను అసలు ఇన్ని సమస్యల నుండి బయటపడేదానినే కాదు. ప్రేమతో అడుగడుగునా నన్ను కాపాడుతున్నావు. ఇలానే మీ దయ మా మీద ఎప్పుడూ ఉండాలి బాబా. మీరు ప్రసాదించిన అనుభవాలను ఆలస్యంగా పంచుకున్నందుకు నా మీద కోపగించుకోకు. ఇంకెప్పుడు ఆలస్యం చేయను. నన్ను క్షమించు బాబా. మీరు తప్ప నాకెవరు వున్నారు బాబా, ఎన్నోసార్లు మీ బ్లాగు తెరవగానే మీ మాటగా "నన్ను విడిచి పెట్టన"ని మాట ఇచ్చావు. ప్రస్తుతమున్న సమస్య నుండి నన్ను గట్టెక్కించి నాకు మనస్సుకి శాంతిని కలుగజేయి బాబా. నా వలన ఒకరికి, ఒకరి వలన నాకు ఏ సమస్యలు రాకుండా చూడు బాబా. నేను ఏమైనా తప్పులు చేస్తే నన్ను క్షమించండి బాబా"

సర్వం సాయినాథార్పణమస్తు!!! 


లాప్టాప్ సమస్యని పరిష్కరించిన బాబా

ముందుగా తోటి సాయిభక్తులకు నమస్కారం. నేను ఒక సాయిభక్తుడిని. నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఒకరోజు  అనుకోకుండా నా లాప్టాప్ పని చేయలేదు. నేను పరిష్కారం కోసం యూట్యూబ్ మొదలైన వాటిలో చూసానుగానీ పరిష్కారం ఏమీ దొరకలేదు. మా కంపెనీ పాలసీ చూస్తే, లాప్టాప్ రిపేర్‌కి అయ్యే ఖర్చులో 80% ఉద్యోగి చెల్లిస్తే, ఆ డబ్బులు ఒక సంవత్సరం తర్వాత వెనక్కి వస్తాయన్నట్టుగా వుంది. కానీ సొంత డబ్బు అంత పెట్టి రిపేర్ చేయంచాలంటే నావల్ల అయ్యే పని కాదు. నాకు చాలా కష్టం అవుతుంది. అందువల్ల నేను బాబాని, "బాబా! ఏ సమస్యా లేకుండా లాప్టాప్ పని చేస్తే, మీ అనుగ్రహం తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని వేడుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజు ఉదయం లాప్టాప్ మామూలుగా పని చేసింది. "థాంక్యూ సో మచ్ బాబా" అనుకున్నాను. అయితే కాసేపయ్యాక మళ్ళీ అదే సమస్య వచ్చింది. ఇక అప్పుడు నేను కంపెనీవాళ్ళని సంప్రదిస్తే, వాళ్ళు ఆ సమస్యని పరిష్కరించారు. "బాబా! సదా నా తండ్రి స్థానంలో వుండి నన్ను కాపాడుతున్నావు తండ్రీ. థాంక్యూ సో మచ్ బాబా".


శ్రీనానాసాహెబ్ చందోర్కర్ - తొమ్మిదవ భాగం



బాబా వల్ల ప్రాపంచిక విషయాలలో నానాకు చేకూరిన ప్రయోజనాలు కేవలం అతనికి, అతని కుటుంబానికి మాత్రమే కాకుండా అతనితో అనుబంధం ఉన్న వ్యక్తులకు కూడా అందాయి. బాబా ఎవరైతే అడువులలో, కొండగుట్టలపై నానా ఆకలిదప్పికలను తీర్చి ఆదుకున్నారో ఆయన తన శిష్యుడు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వదిలిపెట్టరు. 1912లో ఒకరోజు నానాసాహెబ్ చందోర్కర్, లేలేశాస్త్రి పూణే నుంచి టాంగాలో బయలుదేరినప్పుడు అటువంటి పరిస్థితి తటస్థించింది. వాళ్ళు పూణే నుండి కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసాక అకస్మాత్తుగా గుర్రం వెనుక కాళ్లపై నిలబడటంతో టాంగా బోల్తా పడింది. సాధారణంగా అటువంటి ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ ప్రాణాలకు ముప్పు వాటిల్లడంగాని, తీవ్రమైన గాయాల పాలవడంగాని జరుగుతుంది. పైగా టాంగాలో ఉన్న ఇద్దరూ స్థూలకాయులు, వయసుపైబడిన వాళ్లు. అంటే అదెంతో ప్రమాదకరమైన పరిస్థితి. అయితే నానా ఎక్కడికి వెళ్ళినా అతనిని గమనిస్తూ ఉండే బాబా అక్కడ ఆ ప్రమాదం జరిగిన క్షణంలోనే తమ చేతులు శంఖు ఆకృతిలో నోటి దగ్గర పెట్టి 'బం బం'(మరణ సంకేతం) అని శబ్దం వచ్చేలా చేసి, "అయ్యో! నానా చావనున్నాడు. కానీ, నేను అతనిని చావనిస్తానా?" అని అన్నారు. మరుక్షణంలో అక్కడ కిందపడ్డ నానా, లేలేశాస్త్రిలు వాళ్ళంతట వాళ్లే లేచి తమకు ఎలాంటి గాయాలు కాలేదని గుర్తించారు. ఎనిమిది రోజుల తర్వాత వాళ్ళు ఇరువురూ శిరిడీ చేరుకొని తాము ప్రమాదంలో పడ్డ సమయంలోనే బాబా పైమాటలని తమ ప్రాణాలు కాపాడారని తెలుసుకున్నారు. నానా ఆనందంతో ఉబ్బితబ్బిబై కృతజ్ఞతాపూర్వకముగా బాబాకు నమస్కారాలు అర్పించాడు. బాబా తమ భక్తులు ఎక్కడ ఉన్న వారిని ఎల్లవేళలా ఎంతో శ్రద్ధగా కనిపెట్టుకొని ఉంటారు. వారికి స్థలం, కాలం వంటి పరిమితులు లేవు. ‘పూలమాలలోని దారం పూల పరిమళాన్ని అరువు తెచ్చుకుంటుంద’ని ఒక సామెత. అదేవిధంగా బాబాకి దృఢమైన భక్తుడుకాని లేలేశాస్త్రి నానా చందోర్కర్‌తో సహవాసం వల్ల రక్షణను పొందాడు. బాబా ఈ లీల ద్వారా "భక్తుడు పడి(పతనమై)పోతుంటే నేను నా చేతులు చాచి, ఒకేసారి నా నాలుగు చేతులతో అతనికి మద్దతునిస్తాను. నేను అతన్ని పడిపోనివ్వను(పతనం కానివ్వను)" అన్న తమ మాటలు సత్యమని నిరూపించారు.


మొదట ఎవరి దగ్గరా ఎట్టి దక్షిణాలూ స్వీకరించని బాబా, ఒకప్పుడు భక్తులు సమర్పించిన దానిలో అతిస్వల్పంగా మాత్రమే తీసుకోనారంభించారు. భక్తులసంఖ్య పెరిగేకొద్దీ వారినుండి ఆయన దక్షిణ అడిగి తీసుకుంటుండేవారు. నానాను గూడ తరచుగా దక్షిణ అడిగి తీసుకొనేవారు. అదీకాక బాబా కొంతమంది వ్యక్తులు మరియు మార్వాడీల వద్ద నుంచి డబ్బు తెచ్చి దానం చేయడానికి లేదా తమ భక్తులు అడిగినవి ఇవ్వడానికి ఖర్చు పెట్టేవారు. తర్వాత నానాసాహెబ్ శిరిడీ వచ్చినప్పుడు ఆ మొత్తాన్ని ఆయా వ్యక్తులకు ఇవ్వమని అతనితో చెప్పేవారు. అతను సణుగుకోకుండా, ఒక్క మాటైనా మాటాడకుండా తాను మునుపు వచ్చి, వెళ్లినప్పటి నుండి బాబా ఎవరెవరి దగ్గర ఎంత మొత్తం తీసుకున్నారో లెక్కగట్టి, ఎవరి డబ్బులు వాళ్ళకి తిరిగిచ్చి రశీదులు తీసుకొని, వాటిని బాబా పాదాల చెంత సమర్పించేవాడు. ఆ సందర్భంలో బాబా అతనికి పలు రకాల ఉపదేశాలు చేసి అనేక అనుభవాలను ప్రసాదించేవారు. అతను శిరిడీ సందర్శించినప్పుడల్లా తనతో పాటు పెద్ద మొత్తంలో(300 లేదా 400) డబ్బులు తెచ్చి బాబాకోసం, శిరిడీకోసం ఎంతో మక్కువతో, అపరిమితమైన ప్రేమతో ఖర్చు పెట్టేవాడు. ఆ విధంగా అతను  కనీసం పది వేల రూపాయల దాకా ఖర్చు పెట్టాడు. అలా తరచూ బాబాకు డబ్బు ఇవ్వడం సహజంగానే సంపదపట్ల అతనికున్న అనుబంధాన్ని తగ్గిస్తుంది. కానీ నానా, ‘బాబాకు కావాల్సినవన్నీ సమకూరుస్తున్నానని, సహాయం చేస్తున్నానని, ఆయన ధనం కోసం తనపై ఆధారపడుతున్నారన్న’ భ్రమలో పడ్డాడు. అతనికున్న ఆ భ్రమను బాబా తీసేయాలి. అందుకోసం ఆయన M.B.రేగే అనే భక్తుని ఒక మిషగా ఉపయోగించుకున్నారు.


1912లో రేగే జేబులో వంద రూపాయలతో శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకున్నాడు. అప్పుడు బాబా అతనిని రూ.40/- దక్షిణ అడిగారు. అతను వెంటనే సమర్పించాడు. కొంతసేపైన తరువాత మరలా రూ.40/- దక్షిణ అడిగారు బాబా. అతను ఆనందంగా సమర్పించాడు. చివరికి బాబా అతని వద్ద మిగిలిన రూ.20/-లను కూడా దక్షిణగా అడిగారు. అతను ఎటువంటి సంకోచం లేకుండా దానిని కూడా బాబాకు సమర్పించుకున్నాడు. తన వద్ద ఒక్క పైసా కూడా లేకపోయినప్పటికీ, డబ్బంతా బాబాకు దక్షిణగా సమర్పించినందుకు అతను చాలా సంతోషించాడు. కాసేపటికి బాబా మరలా అతనిని పిలిచి దక్షిణ అడిగారు. "నా దగ్గర ఇచ్చేందుకు ఏమీలేద"ని చెప్పాడు రేగే. "నీ వద్ద డబ్బు లేకుంటే ఎవరినైనా అడిగి తెచ్చివ్వు" అని అన్నారు బాబా. అందుకతను అంగీకరించి, "ఎవరి వద్దకు వెళ్ళమంటారో చెప్పండి బాబా. సంతోషంగా వెళ్ళి, వారిని అడుగుతాను" అని అన్నాడు. "షామా వద్దకు వెళ్ళమ"ని చెప్పారు బాబా. దాంతో అతను శ్యామా వద్దకు వెళ్ళి మసీదులో జరిగిన విషయమంతా చెప్పి డబ్బు అడిగాడు. పేదవాడైన షామా అతనితో, “నీవు బాబాను సరిగా అర్థం చేసుకోలేదు. బాబాకు డబ్బు గడ్డిపోచతో సమానం. నీ మనస్సు, బుద్ధి, సమయం, ఆత్మలను బాబాకు సమర్పించాలని వారి ఉద్దేశ్యం" అని తన నమస్కారాలర్పించాడు. రేగే మసీదుకు తిరిగి వెళ్లి శ్యామా చెప్పినదంతా బాబాకు వివరించాడు. బాబా చిరునవ్వు నవ్వి, “దీక్షిత్ దగ్గరకు వెళ్ళి అతన్ని అడుగు” అని అన్నారు. అతను దీక్షిత్ వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని, బాబా ఆదేశాన్ని తెలిపాడు. ఆ సమయంలో దీక్షిత్ వద్ద డబ్బు లేదు. అతను, "బాబా మిమ్మల్ని నా దగ్గరకు ఎందుకు పంపించారోనన్నది పరిస్థితుల దృష్ట్యా అర్థం చేసుకుని దాన్ని మీరొక ఉపదేశంగా తీసుకోవాలి" అని అంటూ, "డబ్బు లేకపోవడం, డబ్బు లేదా మరేదైనా యాచించవలసిరావడం అవమానంగా తలచరాదు. యాచించాల్సివస్తే తనకు తాను గొప్పవాడినన్న భావన రాకూడదు" అని చెప్పాడు. రేగే బాబా వద్దకు వెళ్ళి దీక్షిత్ చెప్పినదంతా వివరంగా చెప్పాడు. బాబా చిరునవ్వు నవ్వి, "నానా వద్దకు వెళ్లి అప్పుగా అడిగి డబ్బులు తీసుకురమ్మ"ని చెప్పారు. వెంటనే నానాసాహెబ్ చందోర్కర్ కోసం ఖండోబా ఆలయానికి వెళ్ళాడు రేగే. అక్కడ ఉపాసనీశాస్త్రితో కలిసి ఆధ్యాత్మిక గ్రంథాల పారాయణ చేస్తున్నాడు నానాసాహెబ్. రేగే మసీదులో జరిగినదంతా నానాతో చెప్పి, బాబా ఆదేశానుసారం డబ్బుకోసం వచ్చినట్లు చెప్పాడు. అంతా విన్న నానాసాహెబ్ లౌక్యంగా, “బాబా దక్షిణ అడిగినప్పుడు మన దగ్గర డబ్బు లేకుంటే ఎంత బాధగా ఉంటుందో నేను ఊహించగలను. అందుకే నేను శిరిడీ వచ్చేటప్పుడు సగం డబ్బు కోపర్గాఁవ్‌లో దాచి ఉంచుతాను. ఇప్పుడు కూడా అలాగే చేశాను. ఇంటినుండి రెండువందల రూపాయలు తీసుకొచ్చి, వంద రూపాయలు కోపర్గాఁవ్‌లో ఉంచి వంద రూపాయలతో శిరిడీ వచ్చాను. బాబా అడిగినప్పుడల్లా దక్షిణ సమర్పిస్తూ, చేతిలో డబ్బు అయిపోగానే కోపర్గాఁవ్ నుండి మిగిలిన డబ్బు తెప్పించుకుంటాను. నువ్వు కూడా ఇలాగే చేస్తుండు" అని చెప్పాడు. రేగే మశీదుకు వెళ్ళి నానా చెప్పినదంతా బాబాతో చెప్పి అక్కడే కూర్చున్నాడు. నానాకు కబురు పంపించారు బాబా. అతను రాగానే రూ.40/- దక్షిణ అడిగారు. అతను సంతోషంగా బాబా అడిగిన దక్షిణ సమర్పించి వెళ్ళిపోయాడు. మరలా బాబా అతనికి కబురు పంపించి మరో రూ.40/- దక్షిణ అడిగి తీసుకున్నారు. కొద్దిసేపట్లోనే మళ్ళీ అతనిని మసీదుకు పిలిపించి అతని వద్ద మిగిలిన మొత్తాన్ని కూడా దక్షిణగా అడిగి తీసుకున్నారు. నానాసాహెబ్ వెంటనే కోపర్గాఁవ్‌లో దాచిపెట్టిన డబ్బు తీసుకురమ్మని ఒక మనిషిని పంపించాడు. ఆ డబ్బు వచ్చేలోగానే నానాను మళ్ళీ దక్షిణ అడిగారు బాబా. ఇక తన వద్ద డబ్బు లేదని చెప్పవలసివచ్చినందుకు నానా చిన్నబుచ్చుకున్నాడు. అతని మొహానికి పెద్ద దెబ్బ తగిలింది. ఈ సంఘటన ద్వారా, ‘బాబా అవసరాలన్నీ తీర్చగలమని, వారడిగినవన్నీ ఇవ్వగలమని’ ఎవరైనా అనుకుంటే అది కేవలం భ్రమేనని నానాసాహెబ్‌కి, రేగేకి, ఇంకా అక్కడున్న అందరికీ తెలియజేశారు బాబా. అంతేకాదు, దక్షిణ అడగటాన్ని ఒక్కో భక్తుడు ఒక్కో విధంగా ఎలా అర్థం చేసుకుంటాడో కూడా బాబా ఆ విధంగా తెలియజేశారు.

ఒకసారి బాంద్రా పట్టణంలో ఉండగా ఒక భక్తునికి వేరే ఊరిలో ఉన్న తన కుమార్తె గ్రంథి జ్వరంతో బాధపడుతుందని తెలిసింది. అకస్మాత్తుగా ఆ వార్త చేరేసరికి అతను తన వద్ద ఊదీ లేనందున ఏం చేయాలని చింతించసాగాడు. చివరికి ఒక వ్యక్తి ద్వారా నానాకు, "మీరు బాబాను ప్రార్థించి నా బిడ్డ దుఃఖాన్ని దూరం చేయండి. ఊదీ ప్రసాదాన్ని పంపండి" అని వేడుకుంటూ కబురు పంపండి. ఆ కబురు తీసుకుని వెళ్లిన వ్యక్తికి నానా దారిలోనే ఠాణా స్టేషను వద్ద కలిసాడు. అప్పుడు నానా తన భార్యతో కళ్యాణ్ వెళుతున్నాడు. ఆ సమయంలో అతని వద్ద ఊదీ లేకపోవడంతో నేలపై మట్టిని తీసుకొని అక్కడే నిలబడి, సాయి సమర్థుని ప్రార్థించి, వెనుకకు తిరిగి తన భార్య నొసటన ఒక చిటికెడు రాశాడు. ఇక్కడ ఆ భక్తుడు తన కుమార్తె ఉన్న ఊరికి వెళ్లగా ఆమె మూడురోజులుగా అత్యంత తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ బాగా నీరసించిపోయిందని, ఆ ముందురోజే కొంచెం నయమైందని తెలిసింది. చూడగా నానా బాబాను ప్రార్థించి మట్టిని ఊదీగా భావించి తన భార్య నొసటన అద్దినప్పటినుండే తన కుమార్తెకు నయమైందని తెలిసి అతను చాలా ఆనందించి బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

1913-14లో నానాసాహెబ్ చందోర్కర్ అస్వస్థతకు గురై దీర్ఘకాలం సెలవు పెట్టి ఒక సంవత్సరం పాటు తన కుటుంబంతో శిరిడీలో గడిపాడు.

సాధారణంగా బాబా వద్దకు వచ్చే వారిలో కొద్దిమంది మాత్రమే కోరికలు లేనివారు. మిగిలిన వాళ్ళు కోరికలను త్యాజించలేకపోయారు. ఆ విషయం గురించి బాబా తమాషాగా నానాతో, "నానా! వీళ్ళలో ఒక్క హంస కూడా లేదు? అందరూ కాకులే!" అని అన్నారు. బహుశా తమ భక్తులు కోరికలకు ఎంతవరకు లోబడి ఉన్నారో పరీక్షించడానికే బాబా దక్షిణ అడగనారంభించారు. ఆయన డబ్బు లేని భక్తులను కూడా దక్షిణ అడిగి వాళ్ళను ఆ మొత్తాన్ని భాగ్‌చంద్ మార్వాడి దగ్గర అప్పుగా తీసుకొని రమ్మనేవారు.

ఒకసారి ఒక వ్యక్తి బాబాను దర్శించి, "బ్రహ్మము యొక్క స్వభావం ఏమిటి?" అని అడిగాడు. అందుకు బాబా నేరుగా సమాధానమివ్వకుండా “భాగ్‌చంద్ మర్వాడీని అడిగి 100 రూపాయలు దక్షిణగా సమర్పించమ”ని అన్నారు. ఆ వ్యక్తి భాగ్‌చంద్ మార్వాడీ వద్దకి వెళితే, అతను డబ్బు ఇవ్వడానికి బదులు తన నమస్కారాలే బాబాకు సమర్పించమని చెప్పాడు. అదే విషయం ఆ వ్యక్తి బాబాకు చెప్పగా బాబా ఆ వ్యక్తిని దక్షిణ తీసుకురావటానికి వేరొక స్థలానికి పంపించారు. వాళ్ళు కూడా అలానే బదులు చెప్పారు. అందువలన అక్కడనుండి కూడా ఆ వ్యక్తి ఖాళీ చేతులతోనే తిరిగి వచ్చాడు. చివరిగా బాబా నానాసాహెబ్ చందోర్కర్‌‌ను భాగ్‌చంద్ మార్వాడీ వద్ద నుండి 100 రూపాయలు తెమ్మని చెప్పారు. నానాసాహెబ్ స్వయంగా వెళ్ళకుండా భాగ్‌చంద్ మార్వాడీకి ఒక చీటీ వ్రాసి పంపాడు. అది అందిన వెంటనే 100 రూపాయలు పంపించాడు భాగ్‌చంద్ మార్వాడీ. అప్పుడు బాబా, "ఈ ప్రపంచంలో అంతా ఇలానే ఉంటుంది" అన్నారు. జరిగినదంతా గమనిస్తున్న ఆ వ్యక్తికి అందులోని అంతరార్థం ఏమిటో తెలియక దాసగణు మహరాజ్‌ని వివరం అడిగాడు. అప్పుడు దాసగణు, "చూసావా? ఇతరులు డబ్బు అడిగినప్పుడు వారు దాన్ని పొందలేకపోయారు. కానీ నానాసాహెబ్ స్వయంగా వెళ్లకుండా కేవలం చీటీ వ్రాసి పంపి డబ్బు పొందగలిగాడు. అలా పొందగలిగే శక్తి, సామర్థ్యం, అధికారం అతనికి ఉన్నాయి. నువ్వు కేవలం ఉత్సుకతతో బ్రహ్మం గురించి అడిగావుగాని, నీకు నిజంగా దానిపట్ల ఆసక్తి లేదు. అలాంటి పనికిమాలిన విచారణను సంతృప్తి పరుచుకోవడానికే అయితే నువ్వు వారి నుండి సమాధానాన్ని ఎలా ఆశించగలవు?" అని చెప్పాడు.

బాబా ఎప్పుడూ ఇలా అనేవారు, "నానా, చాలా ధనాన్ని ఇచ్చే పుష్కల జనులు మన దగ్గరకు వస్తారు. కానీ ఎవరూ మనకు రెండు కాణీలు(అణాలో నాల్గవ వంతు లేదా 1.5 పైసా) ఇవ్వరు" అని. నానాసాహెబ్ బాబా ఆ మాటలను అనేక ఇతర విషయాలతో అనుసంధానించి ఆలోచించి, చింతించిన మీదట ఆ రెండు కాణీలు 'శ్రద్ధ', 'సబూరీ' అని గుర్తించాడు.

బాబా అనేక బోధలు చేసినప్పటికీ భక్తులు ప్రాపంచిక విషయాల వైపే ఆకర్షితులతుండేవారు. అది చూసి బాబా నిరాశ చెందారు. ఒకసారి ఆయన కన్నీళ్లు పెట్టుకొని నానాతో, "నానా! నా భక్తులకు చాలా ముఖ్యమైనది ఇవ్వడానికి నేను ఇక్కడ ఉన్నాను. కానీ నేను దేనినైతే విస్తారంగా ఇవ్వదలచానో దానిని తీసుకునేవారే లేరు. నేను ఇవ్వలేనటువంటిదే వారు కోరుతున్నారు!".

ఇంకొక సందర్భంలో బాబా కాకాసాహెబ్‌‌, నానాసాహెబ్‌లతో, "నేను ఇప్పుడు వెళ్లి, నాకు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు తిరిగి వస్తాను" అని అన్నారు. "గురువు అలాంటి రహస్య సంకేతాలను అర్హత గల శిష్యులకు మాత్రమే చెప్తారు" అని బాలాసాహెబ్ దేవ్ అన్నారు.

1916వ సంవత్సరంలో బాబా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో నానాసాహెబ్ బాబా చెంతనే ఉన్నాడు. అతను బాబా ఆరోగ్యం గురించి, ఆయన ఆ అనార్యోగం నుంచి క్షేమంగా బయటపడే అవకాశాలు గురించి ఆందోళన చెంది ప్రముఖ భక్తులందరికీ సమాచారం పంపి, వాళ్ళను శిరిడీకి రప్పించాడు. వాళ్ళు బాబా ఆరోగ్యం మెరుగుపడాలని జప అనుష్ఠానాలు, వేదమంత్ర పఠనాలు, లఘు రుద్రం, చండీ హవనం వంటి వివిధ మతపరమైన కార్యక్రమాలు మొదలుపెట్టారు. అంత చేస్తున్నప్పటికీ  ఒకరోజు బాబా పరిస్థితి విషమించింది. దాంతో బాబా తమని విడిచి వెళ్లిపోతారని అందరూ భావించారు. కాకాసాహెబ్ దీక్షిత్, మాధవరావు దేశ్‌పాండే, బాలాసాహెబ్ బాటే, బాపుసాహెబ్ జోగు, తాత్యాపాటిల్ వంటి భక్తులు దీక్షిత్ వాడాలో సమావేశమయ్యారు. వాళ్లలో కొందరు ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించడం మొదలుపెట్టారు. వాళ్లలో కొంతమంది బాబా భౌతికదేహాన్ని ఎక్కడ ఉంచాలన్న విషయం గురించి బాబా అభిప్రాయం తప్పనిసరిగా తీసుకోవాలని, బాబా స్పష్టమైన దిశానిర్దేశం లేకపోతే హిందూ, ముస్లింల మధ్య పెద్ద ఘర్షణ జరుగుతుందని వాళ్ళు అభిప్రాయపడ్డారు. కానీ అలాంటి విషయం గురించి బాబాని ఎవరు అడుగుతారు? ఆఖరికి ఆ కష్టమైన పని నానాసాహెబ్ మీద పడింది. కానీ అతను కూడా అలాంటి సున్నితం, ఇబ్బందికరం అయినా విషయం గురించి బాబాని అడగడానికి ఇష్టపడలేదు. సరిగ్గా అప్పుడే ఒక ఆశ్చర్యకర సంఘటన జరిగింది. వాళ్లంతా సమావేశమైన దీక్షిత్ వాడాకి ఒక అపరిచిత వ్యక్తి వచ్చి నానాసాహెబ్‌ని, "మీరు నానాసాహెబా? బాబా మీకు ఒక సందేశం పంపారు" అని ఇలా చెప్పాడు: "నా మరణం గురించి ఇంత త్వరగా చర్చించుకోకండి. నేను ఇప్పుడే మరణించట్లేదు. కానీ మీరు ప్రారంభించిన మతపరమైన అనుష్ఠానాలను కొనసాగించండి. చింతించకండి, నేను ఎక్కడికి వెళ్తాను?" అని. అది విని భక్తులందరూ తమ పరిమిత జ్ఞానానికి, స్వల్ప మేధస్సుకి జాలిపడ్డారు. వాళ్ళ కళ్ళు ప్రేమ, ఆప్యాయతలతో కన్నీటి పర్యంతమయ్యాయి.

నానాసాహెబ్ ద్వారా బాలాసాహెబ్ దేవ్ సందేహనివృత్తి

బాలాసాహెబ్ దేవ్ బాబాకి అనన్య భక్తుడు. సాయితో తనకు గల అనుభవాలను వర్ణించేటప్పుడు అతని శరీరం రోమాంచితమయ్యేది. అలాగే నానాసాహెబ్ గురించి మాట్లాడేటప్పుడు అతను ఆనందంతో ఉప్పొంగిపోయేవాడు. ఎందుకంటే, అతను బాబా వైపు ఆకర్షితుడవ్వడంలో నానాసాహెబ్ కీలక పాత్ర పోషించాడు. అందుచేతనే అతనికి నానాసాహెబ్ అంటే చాలా గౌరవం. అతను నానాసాహెబ్ గురించిన తన ఆలోచనలను, అనుభవాలను చాలా విస్తారంగా వ్రాశాడు. దేవ్‌కు తొలిసారి బాబాను దర్శించే అవకాశం రావడానికి పూర్వం అతనికి ఒక అందమైన కల వచ్చింది. ఆ కలలో అతను ఇద్దరు వ్యక్తులను చూసాడు. అతను శిరిడీ వచ్చిన తర్వాత తనకి కలలో కనిపించిన ఇద్దరు వ్యక్తులు మరెవరోకాదు బాబా, నానాసాహెబ్‌లని గ్రహించాడు. ఆ క్షణం నుండి అతను నానాపట్ల ప్రేమ, ఆప్యాయత, గౌరవాలను, స్నేహబంధాన్ని పెంచుకొని తరచూ నానాను కలవడానికి కళ్యాణ్ వెళ్తుండేవాడు. వేదాంతం మరియు దైనందిన జీవితాన్ని అనుసరించి కలలు భ్రాంతిపూరితమైనవని దేవ్‌కి తెలుసు. కానీ అతనికొచ్చే చాలా కలలు అలా లేవు. అవి తరువాత నిజాలయ్యాయి. అందుచేత తనకొచ్చే కలల విషయంలో దేవ్‌కి సందిగ్ధత ఉండేది. ఆ విషయం గురించి ఒకసారి దేవ్ కళ్యాణ్‌లోని నానాసాహెబ్‌ను అతని స్వగృహమందు కలిసినప్పుడు అడిగాడు. దానికి నానా, "మామూలుగా నాకు అలాంటి కలలు రావు. నాకు వచ్చే కలలను నిద్రలేచాక నేను గుర్తు తెచ్చుకోలేను, ఒకవేళ గుర్తుతెచ్చుకున్నా అవి వాస్తవమవ్వడం గురించి నాకు ఎలాంటి అనుభవాలు లేవు. కానీ నీకు జరిగిన అటువంటి అనుభవాల గురించి మనం భోజనం చేసిన తరువాత విచారిద్దాం" అని అన్నాడు. తర్వాత వాళ్లిద్దరూ భోజనం చేసి, అనంతరం మొదటి అంతస్తులో ఉన్న పడకగదికి వెళ్ళారు. ఆ గదిలో ఒక టేబుల్ మీద పెద్ద బాబా ఫోటో ఉంది. దాని ముందు దీపం వెలుగుతుంది. "బాబా మీ ప్రశ్నకు ఎలా సమాధానమిస్తారో చూద్దాం. అందాక మనం నిద్రపోదాం" అని అన్నాడు నానాసాహెబ్. తరువాత ఇద్దరూ తమ తమ పడకలపై నిద్రపోయారు. తెల్లవారుజామున 4 - 4:30 ప్రాంతంలో నానాసాహెబ్ మేల్కొని, "బాలాసాహెబ్! నీ ప్రశ్నకు సమాధానం దొరికింది. బాబా నాకు స్వప్న దర్శనమిచ్చి, 'ఇందులో అంత కష్టం ఏముంది? అడవిలో రకరకాల చెట్లు ఉంటాయి. కానీ వాటిలో ఎక్కువ భాగం కేవలం అడవి చెట్లే - వాటికి సువాసన గల పువ్వులు లేదా పండ్లు ఉండవు. అయితే, ఆ అడవి చెట్ల మధ్య కూడా కొన్ని మినహాయింపులు ఉంటాయి. అవి సువాసన వెదజల్లె పువ్వులు, పండ్లు ఇస్తాయి. అదేవిధంగా చాలా కలలు కేవలం కలలు మాత్రమే. కొన్ని మాత్రమే వాస్తవాలవుతాయి. కానీ అవి మినహాయింపుల'ని చెప్పారు" అని అన్నాడు.

నానాసాహెబ్ తన జీవితాంతం బాబా సేవ చేసి 1921, ఆగస్టు 21న శ్రావణమాసంలో కళ్యాణ్‌‌లోని తమ స్వగృహమందు శ్రీసాయి చరణాలలో ఐక్యమయ్యాడు. అతని చిన్న కుమారుడు బాపూరావు 1936లో బి.వి.నరసింహస్వామితో ఇలా చెప్పాడు: 1913-14లో మా నాన్న అనారోగ్య కారణంగా చాలాకాలం సెలవుపెట్టారు. నాన్న ఆ సెలవులు శిరిడీలో గడిపారు. మా అమ్మ కూడా నాన్నతో పాటు ఉంది. ఒకసారి వాళ్ళిద్దరు బాబా ముందు కూర్చొని ఉన్నారు. నేను బాబాను పూజిస్తున్నాను. అప్పుడు బాబా "నేనిప్పుడు వెళ్ళిపోయి బాపూ బిడ్డగా జన్మిస్తాను. అప్పుడు నానా మెడ ఇలా వణుకుతూ ఉంటుంది! (మీ అతాఁ జాఈన్ బాపూచే పోరీఁ జన్మ ఘేఈన్! త్యావేళీ నానాచీ మాన్ (ఘట్) ఆషి ఆషి హలత్ అసేల్)" అని చెప్పి, ముసలివాళ్ళ తల ఎలా వణుకుతూ ఉంటుందో అలా తమ చేతిని ఊపి చూపించారు. ఇది విని మా నాన్న, నాకు కొడుకు పుట్టేవరకు తాను జీవించి ఉంటానని తలచాడు. కానీ దురదృష్టవశాత్తు మా నాన్న 1921లోనే మరణించాడు. నాన్న మరణించడానికి ముందు తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు, బాబా అంతకుముందు చెప్పిన విషయం నాకు గుర్తొచ్చి మా నాన్న కోలుకుంటారని అనుకున్నాను. ఎందుకంటే, నాకు అప్పటికింకా వివాహం కాలేదు. కొడుకు పుట్టలేదు. కానీ విధి నిర్ణయం మరోలా ఉంది. మా నాన్న మరణించారు. తర్వాత 1922లో నాకు వివాహమయ్యింది. మా నాన్న తల ఎన్నడూ వణకలేదు.(కానీ, నానా చేయి మాత్రం వణుకుతుండేది - బి.వి.నరసింహస్వామి.)

అతను ఇంకా ఇలా చెప్పాడు: “1913 తరువాత భక్తులు అసంఖ్యాకంగా బాబా చెంత గుమిగూడేవారని, దీనివలన వారి ప్రశాంతతకు భంగం వాటిల్లిందని మా నాన్న చెప్పారు. బాబా 'మహావాక్యాలు' వల్లించేవారని మా నాన్న నాతో ఎప్పుడూ చెప్పలేదు. బాబా అద్వైతవాది అని మా నాన్న చెప్పారు. కానీ వారు బోధించిన అద్వైత సిద్ధాంతమేదో నాకు చెప్పలేదు. బాబా ఎప్పుడూ అద్వైతాన్ని గురించి గానీ, వేదాంతానికి సంబంధించి సుదీర్ఘ ధర్మోపన్యాసాలుగానీ చేసినట్లు నాకు కూడా గుర్తులేదు. వారు సాధారణమైన విషయాల గురించి మాట్లాడేవారు. ఉదా: దానం చేయండి. మంచిపనులు చేయండి. సత్యాన్నే పలకండి మొదలైనవి! నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు "నీ తల్లిదండ్రుల మాటలు విను. మీ అమ్మకు పనులలో సహాయం చేస్తూ వుండు. ఎప్పుడూ నిజం మాత్రమే చెప్పు" అని చెప్పేవారు. అంతేగానీ వారెప్పుడూ నాతో మంత్రాల గురించి, భగవంతుని గురించి మాట్లాడలేదు. బాబా చేసిన చమత్కారాలు, చెప్పిన భవిష్యవాణి, ప్రవచనాలు మొదలైనవి స్వయంగా విన్నాము, చూసాముగానీ తత్త్వం గురించి పెద్దగా పట్టించుకోలేదు. బాబా ఎన్నో ప్రవచనాలు చెబుతుండేవారు. అవేమీ నాకిప్పుడు గుర్తులేవు. నాకు తెలిసినంతవరకు బాబా వల్లించే మంత్రాలన్నీ సంస్కృతంలో కాక అరబిక్, పర్షియన్ భాషల్లో ఉండేవి. బాబా, కొండాజీ ‘ఫత్యా’ చదివేవారు. భక్తులు తెచ్చిన కేసరి (శీరా) నైవేద్యం మశీదు గూటిలో(నింబారులో) పెట్టినప్పుడు, బాబా మరియు కొండాజీ అరబిక్లో గానీ, పర్షియన్లో (నాకు తెలియని భాషలో) ఏదో ఉచ్ఛరిస్తుండేవారు. బాబానే నా రక్షకులని నా అచంచల విశ్వాసం! నా జీవితమంతా వారి రక్షణలోనే గడుస్తుంది. నేను ఉదాహరణలు ఇవ్వలేకపోయినా నా అవసరాలు తీరుస్తూ శ్రేయస్సు చేకూరుస్తూ, తమ మార్గదర్శకత్వంతో నన్ను ముందుకు నడిపిస్తూ నన్ను సదా కాపాడుతున్నారన్నది నా అనుభవం”.

సమాప్తం..


source: లైఫ్ ఆఫ్ సాయిబాబా(రచన: శ్రీబి.వి.నరసింహస్వామి)
 సాయిలీల మ్యాగజైన్స్  - 1986 మరియు 2009.
సాయిబాబా(రచన: శ్రీసాయి శరణానంద)

బాబాస్ వాణి, బాబాస్ అనురాగ్(రచన: విన్నీ చిట్లురి).


 

  ముందు భాగం కోసం బాబా పాదుకలు తాకండి. 


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo