సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1028వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. తలచినంతనే పలికే దైవం సాయినాథుడు
2. బాబా దయతో ప్రెగ్నెన్సీ
3. టెన్షన్ తొలగించిన బాబా

తలచినంతనే పలికే దైవం సాయినాథుడు


రాజాధిరాజాయ విద్మహే

యోగిరాజాయ ధీమహే

తన్నో సాయి ప్రచోదయాత్!!!


నా పేరు రఘు. సాయిబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. తలచినంతనే పలికే దైవం సాయినాథుడు. ఆయన నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2021, అక్టోబర్ నెల రెండవవారం ఆరంభంలో మా అమ్మ నా దగ్గరకి వచ్చింది. తనకి ఎప్పటినుంచో కన్ను ప్రాబ్లమ్ ఉంది. 2021లో కేటరాక్ట్ ఆపరేషన్ చేయాలని చెప్పినప్పటికీ కరోనా వలన ఆపరేషన్ చేయించలేకపోయాము. కాబట్టి 2022, అక్టోబర్ రెండవవారంలో నేను అమ్మని ఒక హాస్పిటల్‍కి తీసుకుని వెళ్ళాను. డాక్టరు చెక్ చేసి, "కేటరాక్ట్ సమస్య రెండు కళ్ళకీ ఉంది. ఇంకా ఒక కంటి రెటీనాలో హోల్ పడింది. రెటినా డాక్టర్ వచ్చిన తరువాత చెక్ చేసి సర్జరీ ఎస్టిమేషన్ చెప్తారు" అని చెప్పారు. తరువాత రెటీనా డాక్టర్ స్కాన్ చేసి రెండు కళ్ళ రెటీనాలో హోల్ ఉంది. రెండు కళ్ళకి కేటరాక్ట్ అండ్ రెటీనా హోల్ ఫిల్లింగ్‍కి సర్జరీ చేయాలి" అని చెప్పారు. తరువాత మేము వేరే హాస్పిటల్‍కి వెళ్ళాము. వాళ్ళు గూడా అదే చెప్పారు. తరువాత మేము ఎల్.వి.ప్రసాద్ హాస్పిటల్‍కి వెళితే, వాళ్ళు 15 రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్పారు. బాబా దయవల్ల మేము డిఫరెంట్ శాఖలలో ట్రై చేసి ఆపరేషన్‍కి డేట్ తీసుకున్నాము. డాక్టరు కుడికన్నుకి సర్జరీ చేసేముందు బీపీ అండ్ షుగర్ చెక్ చేసి రిపోర్ట్ పంపమన్నారు. మేము ఒక క్లినిక్‍లో టెస్ట్ చేస్తే షుగర్ ఎక్కువ ఉందని వచ్చింది. అప్పుడు నేను బాబాని ప్రార్ధించి మరుసటిరోజు వేరే క్లినిక్‍లో మళ్లీ టెస్టు చేయించాను. బాబా దయవల్ల షుగర్ నార్మల్ వచ్చింది. దాంతో డాక్టర్ సర్జరీ చేసారు. నేను ఆపరేషన్ బాగా జరగాలని బాబాను ప్రార్థించాను. ఆయన దయవల్ల ఆపరేషన్ బాగా జరిగి అమ్మకి బాగా కనపడుతుంది. ఇదంతా బాబా దయవల్లే జరింగింది.


2019 చివరిలో లేదా 2020 ఆరంభంలో నేను షుగర్ టెస్టు చేయించుకుంటే షుగర్ బోర్డర్ లైనులో ఉందని, ఫుడ్ అండ్ హెల్త్ విషయంలో కేర్ తీసుకోమని డాక్టర్ చెప్పారు. అప్పటినుండి నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేవాడిని. కానీ కరోనా వల్ల ఆహారం ఎక్కువగా తీసుకోవడంతో నేను బరువు పెరిగాను. ఇంకా ఇంట్లో ఉంటూ వర్క్ చేయటం వల్ల శారీరక శ్రమ కూడా లేదు. అప్పుడప్పుడు కాళ్ళు, వేళ్ళు నొప్పులుగా ఉంటుంటే నాకు షుగర్ వచ్చిందేమోనని భయపడ్డాను. దాంతో షుగర్ టెస్ట్ చేయుచుకుందామని క్లినిక్‍కి వెళ్లాను. అయితే వెళ్లేముందు బాబాని, "రిపోర్టు నార్మల్‍గా రావాల"ని ప్రార్ధించాను. బాబా దయవలన షుగర్ రిపోర్ట్ నార్మల్‍గా వచ్చింది. "ధన్యవాదాలు బాబా! ఇలాగే మీ కరుణ, దయ, ప్రేమానురాగాలు ఎప్పుడూ మాపై చూపించండి తండ్రి. మీరే మాకు దిక్కు, మమ్మల్ని ఎల్లప్పుడూ అనుగ్రహించండి బాబా".


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!


బాబా దయతో ప్రెగ్నెన్సీ


నా పేరు మానస. ముందుగా సాయిభక్తులందరికీ నా వందనాలు. ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం గురించి మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. పెళ్ళైన తర్వాత మొదటి నాలుగు సంవత్సరాలు మేము పిల్లలు వద్దు అనుకున్నాము. తరువాత మేము పిల్లులు కావాలనుకున్నా కొన్ని కారణాల వల్ల ఒక సంవత్సరానికి గానీ నాకు ప్రెగ్నెన్సీ నిర్ధారణ కాలేదు. చివరికి బాబా దయవల్ల ప్రెగ్నెన్సీ నిర్థారణ అయ్యిందనుకున్నప్పటికీ 9వ వారంలో నాకు అబార్షన్ అయ్యింది. ఆ సమయంలో నాకు బాబాపై చాలా కోపం వచ్చింది. మళ్ళీ రెండు నెలలకి నేను ప్రెగ్నెంట్ అయ్యాను. అయితే అప్పుడు కూడా అబార్షన్ అయ్యింది. డాక్టర్లు బేబీ గుండె కొట్టుకోవట్లేదు అని చెప్పారు. నాకు చాలా బాధేసింది. మానసికంగా చాలా అలసిపోయినందున ఒక సంవత్సరంపాటు విరామం తీసుకున్నాను. ఆపై హైదరాబాదులోని మంచి గైనకాలజిస్ట్‌ని కలిసి సమస్యలు పరిష్కరించుకున్న తరువాత బాబా దయవల్ల మళ్ళీ గర్భవతినయ్యాను. కానీ నాకు ప్రెగ్నెన్సీ నిర్థారణ అయ్యిందన్న సంతోషం కన్నా చాలా భయంగా ఉంటుండేది. అలా భయంభయంగా ఉన్నా బాబా దయవల్ల మూడు నెలలు జయప్రదంగా ముగిశాయి. తరువాత 4వ నెలలో బ్లీడింగ్ అయ్యి చాలా భయమేసింది. బాబాని గట్టిగా ప్రార్ధించి, సాయిసచ్చరిత్ర తీసుకుని హాస్పిటల్‍కి వెళ్లి, "స్కాన్ రిపోర్టు బాగుండాల"ని బాబాని వేడుకున్నాను. డాక్టరు స్కాన్ చేసి అంతా బాగుందని, కొన్ని మందులిచ్చారు. బాబా దయవల్ల ఇప్పుడు నాకు బాగానే ఉంది. ఏ సమస్యా లేకుండా బాబా ఈ ప్రెగ్నెన్సీని కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా ఆశపడుతున్నాను. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు భక్తులందరూ కూడా నన్ను  ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మంచి  ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చాక మళ్లీ నా అనుభవాన్ని మీతో పంచుకుంటాను.


టెన్షన్ తొలగించిన బాబా


సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నాపేరు శిరీష. 2021, డిసెంబర్ 7, మంగళవారంనాడు మావారు మీటింగ్ ఉందని విజయవాడ, డి.ఐ.జి(ఫైర్) ఆఫీసుకు వెళ్ళారు. ఆయన నాతో, "మీటింగ్‍కి వెళ్తున్నానని కాకుండా, విజయవాడ క్యాంప్‍కి వెళ్తున్నాను, వీలైతే మధ్యాహ్నం భోజనానికి వచ్చేస్తాను" అని చెప్పారు. నేను ఆరోజు మధ్యాహ్నం 12.30 నుండి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు. మధ్యాహ్నం 2గంటల వరకు నాకు టెన్షన్ లేదు కానీ, ఆపై 'ఎంత బిజీగా ఉన్నా, ఫోన్ సైలెంట్‍లో పెట్టుకున్నా లంచ్ బ్రేక్‍లో అయినా ఫోన్ చూసుకుని, కాల్ చేస్తారు. కానీ 2.30 అయినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేద'ని కంగారుగా అనిపించి, "బాబా! మావారి గురించి ఏదైనా విషయం తెలియజేయండి" అని ప్రార్ధించాను. వెంటనే ప్రేరణ కలిగి మావారి కారు డ్రైవరుకి ఫోన్ చేశాము. తను, "సార్ గంటలో వస్తానని ఆఫీసు లోపలికి వెళ్ళారు. నేను ఫోన్ చేస్తున్నా సార్ లిఫ్ట్ చేయడం లేదు. నేను కూడా సార్ కోసం వెయిట్ చేస్తున్నాను" అని చెప్పాడు. వెంటనే బాబాను తలుచుకుని విజయవాడ A.E గారికి ఫోన్ చేసాము. ఆయన, "మేడమ్, సార్ డి.ఐ.జి ఆఫీసులో మీటింగ్‍లో ఉన్నారు. అక్కడకు వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకుని వెళ్ళకూడదు. ఫోన్ క్రింద అంతస్తులోనే పెట్టేస్తారు. నేను మీటింగుకు వెళ్ళలేదు" అని చెప్పారు. మరుక్షణంలో మా డ్రైవరు ఫోన్ చేసి, "మేడమ్, సార్ మీటింగులో ఉన్నారు. నేను వెళ్ళి కనుక్కొని వచ్చాను" అని చెప్పాడు. అప్పటికి సమయం 3.30 అయింది. ఇది చిన్న విషయమే కావొచ్చు. కానీ బాబా నన్ను ఆ టెన్షన్ నుండి కాపాడి నాకు ధైర్యాన్నిచ్చారు. "ధన్యవాదాలు బాబా".


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!



సాయిభక్తుల అనుభవమాలిక 1027వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా చూపిన అనుగ్రహం
2. బాబా కృపతో ఆరోగ్యం
3. ఎప్పుడూ మనతోనే ఉంటూ బాధల నుండి గట్టెక్కిస్తారు బాబా

బాబా చూపిన అనుగ్రహం


ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయిబంధువులందరికీ నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వాహకులకి కృతజ్ఞతలు. నా పేరు హరిత. నాకు నా చిన్నవయసు నుండి బాబా తెలుసు. మా అమ్మకు సాయిబాబా అంటే నమ్మకం. ఆవిడ నా చిన్నవయసు నుండే నాచేత బాబాచరిత్ర పారాయణ చేయించేది. రెండు నెలల క్రితం నా మొబైల్‍లో ఏ లింక్ ద్వారా ఈ బ్లాగు ఓపెన్ అయ్యిందో నాకు గుర్తులేదుకానీ అప్పటినుండి ఈ బ్లాగు గురించి తెలుసు. నేను ఇప్పుడు బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను మొదటిసారి పంచుకుంటున్నాను.


నేను, నా భర్త ఉద్యోగస్థులము. చాలాకాలంగా నా భర్త సైనస్ సమస్యతో బాధపడుతున్న కారణంగా 2021, సెప్టెంబర్ 8న నేను, నా భర్త ముందునుండి మాకు పరిచయమున్న ENT డాక్టరుని కలిసాము. ఆవిడ నా భర్త ముక్కు స్కాన్ చేయించి, "అంతగా భయపడవలసిన అవసరం లేద"ని చెప్పారు. కానీ మరుసటిరోజు ఆవిడ రిపోర్ట్ చూసి, మాకు ఫోన్ చేసి "ఈరోజు మీరు హాస్పిటల్‍కి రండి, రిపోర్టులో మీ వారి తలలో ఎదో సమస్య ఉన్నట్టు ఉంది" అని చెప్పారు. అది వింటూనే నేను చాలా కంగారుపడి ఏడ్చేసాను. తరువాత మావారికి MRI స్కాన్ చేసారు. అందులో మావారికి బ్రెయిన్ ట్యూమర్ అని, తప్పకుండా ఆపరేషన్ చేయాలన్నారు. అలా అనుకోకుండా మావారి బ్రెయిన్‍కి రెండు ఆపరేషన్లు చెయ్యవలసి వచ్చింది. చిన్న వయసులోనే ఆయనకి ఇలా రావడం చాలా బాధాకరం. నాకు చాలా భయమేసింది. మా వారికి ఆపరేషన్ జరిగే సమయంలో మా మేనమామ మరియు అత్తయ్యవాళ్ళ సహాయంతో నేను మహాపారాయణ గ్రూప్ ద్వారా బాబా పారాయణ చేయించాను. డాక్టరు ట్యూమర్ తీసిన తరువాత, "బ్రెయిన్ స్టెమ్‍కి తగిలి ఉన్న కారణంగా ట్యూమర్ మొత్తం తీయలేకపోయాము. ఇంకా 20% మిగిలి ఉంది. దానికి రేడియోథెరపీ చేయించాలి" అని అన్నారు. తరువాత డిసెంబర్ 2వ తారీఖున రేడియోథెరపీ జరిగింది. ఈ మొత్తం ప్రక్రియకు చాలా డబ్బు ఖర్చవుతున్న తరుణంలో నేను బాబాను ప్రార్ధించి, "నేను ఎక్కువ డబ్బులు పెట్టుకోలేను బాబా. 20,000 రూపాయలకు మించి ఖర్చు చేసే సామర్ధ్యం మాకు లేదు. మాపై దయచూపండి బాబా" అని వేడుకుని, "నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. బాబా నా పరిస్థితిని అర్ధం చేసుకున్నారు. మొత్తం ట్రీట్మెంట్‍కి 10 లక్షలదాక ఖర్చు అయితే, కేవలం 10,000 రూపాయలు మేము కట్టేలా అనుగ్రహించారు బాబా. ఆయన దయవలన ఇన్స్యూరెన్స్ చాలావరకు కవర్ అయ్యింది. అయితే ఇన్స్యూరెన్స్ నుండి ఇంకా అప్రూవల్ రాలేదు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మావారి ఆరోగ్యానికి సంబంధించి చాలా పెద్ద సమస్యతో పోరాడుతున్నామని మీకు తెలుసు. ఈ సమస్య నుండి త్వరగా మమ్మల్ని బయటపడేస్తే నేను నా అనుభవాన్ని ఈ బ్లాగులో మళ్లీ పంచుకుంటాను". చివరిగా సాయిబంధువులందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మమ్మల్ని ఆ సమస్య నుండి బయటకి లాగమని బాబాని మా తరపున వేడుకోమని అర్థిస్తున్నాను. ఇలా అడగటం తప్పైతే నన్ను క్షమించండి.


2021, నవంబర్ 26వ తేదిన రెండు సంవత్సరాల మా పాపకి జ్వరం, గొంతునొప్పి వచ్చాయి. చాలా హుషారుగా ఉండే పాప మూడు రోజులపాటు జ్వరం, గొంతునొప్పితో బాధపడుతుంటే నేను చూడలేకపోయాను. కనీసం నీళ్ళు, పాలు తాగడానికి కూడా పాప చాలా ఏడ్చేది. అప్పుడు నేను బాబా ఊదీ పాపకిచ్చి, మరికొంత ఊదీ తన గొంతుకు, పొట్టకి రాసుకోమని పాపతో చెప్పాను. ఆపై బాబాని, "పాపని ఈ బాధ నుండి తప్పించండి బాబా. ఇప్పటికే నా భర్త అనారోగ్యం వలన అందరూ బాధపడుతున్నారు. నేను ఈ సమస్య నుండి బయటపడితే బ్లాగులో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. అప్పటినుండి పాపకి జ్వరం తగ్గిపోయింది. ఆ రోజు సాయంత్రం ENT డాక్టరుని కలిస్తే, ఆవిడ ఒక టాబ్లెట్ ఇచ్చారు. ఆరోజు రాత్రి పాప ఆ టాబ్లెట్ వేసుకున్నాక మరుసటిరోజు ఉదయానికి పాప పూర్తిగా నార్మల్ అయ్యింది. మేము చాలా సంతోషపడ్డాము. "మీ అనుగ్రహం సదా మా మీద ఇలాగే ఉండాలి బాబా. నా అనుభవం పంచుకోవడంలో మూడురోజులు ఆలస్యం అయ్యినందుకు నన్ను క్షమించండి తండ్రి". 


శ్రీసాయినాథ్ మహారాజ్ కి జై!!!


బాబా కృపతో ఆరోగ్యం


అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీసచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథుని పాదపద్మాలకు ముందుగా నమస్కరిస్తున్నాను. సాయితండ్రిని చూస్తూ, ఆయన బాటలో నడుస్తూ, ఆయన లీలలకు పరవశించిన అప్పటి భక్తులకు వలే ఇప్పటి భక్తుల పిలుపుకు కూడా పిలిస్తే పలికే దైవంలా తమ లీలలను చూపిస్తున్నారు బాబా. వాటిని అందరితో పంచుకునే అవకాశం కల్పించిన సాయినాథునికి, ఈ బ్లాగ్ నిర్వాహకులకి ఎన్ని ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే. ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగును ఆధునిక సాయిచరిత్ర అనడంలో ఏ సందేహం లేదు. నాకు చిన్నప్పటినుండి బాబా అంటే చాలా ఇష్టం. బాబా నా జీవితానికి తోడుగా ఉండి ఎన్నో అమూల్యమైన వరాలనిచ్చారు. మా కుటుంబమంతా కోవిడ్ సెకండ్ వేవ్ బారినపడ్డ సమయంలో నా సాయితండ్రి నా కుటుంబానికి తోడుగా నిలిచారు. ఆ కష్టకాలంలో మాకు సహాయం చేసిన ప్రతీ ఒక్కరిని బాబానే మా వద్దకు పంపినట్టుగా నేను భావించి, 'వారికి ఏమీ కాకుండా ఆరోగ్యంగా ఉండాల'ని బాబాను కోరుకున్నాను. బాబా ఊదీ ధరిస్తూ, వారి చరిత్ర, హారతులు వింటూ ఇంటి వద్దే ట్రీట్మెంట్ తీసుకుంటూ మేము కోలుకున్నాం. 4 నెలల తర్వాత నాకు మళ్ళీ ఒళ్ళునొప్పులు, జ్వరం వచ్చాయి. జ్వరం తగ్గిపోయింది. కాని ఒళ్ళునొప్పులు, దగ్గు, జలుబు, నీరసం 15 రోజులు వరకు తగ్గలేదు. దాంతో నాకు చాలా భయమేసి టెస్టులకు వెళ్ళినపుడు, "రిపోర్టులో ఏ సమస్య లేకుండా చూడండి బాబా. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి నమస్కరించుకుని వెళ్ళాను. బాబా దయవల్ల డాక్టరు వైరల్ ఫీవర్ వలన నాకు ఆ లక్షణాలు ఉన్నాయని చెప్పారు. దాంతో ఆనందంగా బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇంతలో నాకు మరో ఆరోగ్య సమస్య ఎదురైంది. అప్పుడు కూడా "పెద్ద సమస్య కాకుండా కాపాడు తండ్రి. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను వేడుకున్నాను. తరువాత డాక్టరు రూపంలో బాబాయే నాకు ట్రీట్మెంట్ చేస్తున్నట్టు భావించాను. డాక్టరు టెస్టులు చేశాక నాకు ఎలాంటి పెద్ద సమస్య లేదని చెప్పారు. బాబాయే డాక్టరు ద్వారా అలా చెప్పినట్లు నాకు అనిపించింది. సమస్యలు ఎదురైనపుడు బాబా నా పూర్వకర్మను ఆ రూపంలో తొలగిస్తున్నట్టుగా నేను భావిస్తాను. ఇటీవల కాలంలో కొన్ని ఆరోగ్య సమస్యలు నాకు ఎదురవుతున్నాయి. వాటిని తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదించమని బాబాను వేడుకుంటున్నాను. అలాగే సాయినాథుని పాదపద్మాలయందు నిరంతరం భక్తితో ఉంటూ ఆయన సేవలో తరించిపోవాలని కోరుకుంటున్నాను. "అనుభవాలను పంపించడం ఆలస్యమైనందుకు క్షమించండి బాబా".


ఎప్పుడూ మనతోనే ఉంటూ బాధల నుండి గట్టెక్కిస్తారు బాబా


నేను ఒక సాయిభక్తురాలిని. సాయిబాబా ఎప్పుడూ మనతోనే ఉంటూ బాధల నుండి మనలను గట్టెక్కిస్తారు అని చెప్పడానికి నా జీవితంలో జరిగిన మరొక విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. కరోనా వలన మొత్తం అంతా లాక్ డౌన్ అయ్యిందని అందరికీ తెలిసిన విషయమే. ఆ లాక్ డౌన్ కాలంలో స్కూళ్లు లేనందున నేను, నా భర్త పని లేకుండా ఉండవలసి వచ్చింది. దాంతో ఇంట్లో ఇబ్బందిగా ఉండి మా బంగారం బ్యాంకులో పెట్టి కొంత డబ్బు తెచ్చుకున్నాము. దానికి ఒక సంవత్సరం తరువాత వడ్డీ కట్టవలసి ఉండగా మేము ఆ వడ్డీ చెల్లించడానికి కావలసిన మొత్తాన్ని పోగు చేసాము. అయితే బ్యాంకువాళ్ళు, "వడ్డీ మాత్రమే కట్టడం కుదరదు. ఇంకో 50,000 రూపాయలు అదనంగా కడితే మీ బంగారం వేలానికి వెళ్లకుండా ఉంటుంద"ని చెప్పారు. అసలే ఇబ్బందుల్లో ఉన్న మాకు ఏం చేయాలో తెలియక చాలా ఆందోళనపడ్డాము. అప్పుడు బాబాని, "మమ్మల్ని ఈ కష్టం నుండి గట్టెక్కించమ"ని వేడుకున్నాము. ఆశ్చర్యంగా బాబాని వేడుకున్న తరువాత బ్యాంకుకి వెళితే వాళ్ళు మొదట చెప్పిన వడ్డీ మొత్తానికే మా బంగారాన్ని రెన్యువల్ చేసారు. మాకు చాలా సంతోషం కలిగింది. బాబా దయవల్లనే ఇదంతా. థాంక్యూ బాబా.


సాయిభక్తుల అనుభవమాలిక 1026వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయి ఆదేశంతో కాశీలో వ్రతాలు - వారి అనుగ్రహం
2. కేవలం బాబా ఊదీతో కరోనా లక్షణాల నుండి ఉపశమనం

సాయి ఆదేశంతో కాశీలో వ్రతాలు - వారి అనుగ్రహం

 

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


నా పేరు సూర్యనారాయణమూర్తి. నా శ్రీమతిచే నిర్వహించవలసిన కొన్ని వ్రతాలను ఎలా చేయించాలి, ఎప్పుడు చేయించాలి, ఎక్కడ చేయించాలి అనే విషయాలపై నేను చాలాకాలం నుండి సద్గురు శ్రీసాయిబాబా ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాను. ఆ విషయంలో బాబా నాకు కొన్ని సూచనలు ఇచ్చినప్పటికీ ఆలస్యం జరుగుతూ వచ్చింది. అయితే, 2021, అక్టోబరు 15, విజయదశమినాడు మధ్యాహ్నం 1.30 గంటలకు బాబా నాకు చాలా చక్కటి సూచనలు చేశారు. అది - 'తాము కాశీలో దత్తుడిగా ఉన్నామ'నే విషయంగా “ప్రతిరోజూ ఆరతిలో 'కాశీ స్నాన జప ప్రతి దివసీ' అని పాడుతూ కూడా కాశీలో చేయడానికి అనుమతి ఇవ్వాలా?” అని బాబా ప్రశ్నించారు. అప్పుడు నాకు అర్థమైంది, ఈ వ్రతాలన్నీ కాశీలోనే జరపాలని బాబా నన్ను ఆదేశించారని. వెంటనే కాశీలో నాకు తెలిసిన ఒక మిత్రుడిని సంప్రదించాను. ఆయన కూడా దత్తభక్తుడే అనే విషయం కాశీ చేరుకునేవరకు నాకు తెలియదు. కాశీలో ఈ వ్రతాలకి కావలసిన అన్ని విషయాలు తాను చూసుకుంటాననీ, అన్నీ బాగా జరిగాక డబ్బు చెల్లించమనీ ఆయన నాతో చెప్పారు. నేను, నా శ్రీమతి నవంబరు 5వ తేదీ సాయంత్రం బయలుదేరి కాశీకి వెళ్ళాము. 9 రోజులు అక్కడ నిద్రచేసి, నా శ్రీమతి చేయవలసిన వ్రతాలను పూర్తిచేశాము. ఆ వ్రతాలను నేను నవంబరు 7, 8 తేదీలలో గణపతి హోమంతో ప్రారంభించాలనుకున్నాను. అనుకోకుండా మా కాలనీ మిత్రులొకరు కాశీలో నన్ను కలిసి, 8వ తారీఖున తాను కాశీలో చింతామణి గణపతి దేవాలయంలో గణపతి హోమం చేస్తున్నాననీ, మమ్మల్ని కూడా తమతో కలిసి ఆ హోమంలో పాల్గొనమని ఆహ్వానించారు. అది ఖచ్చితంగా మన సాయిగణపతి చేసిన ఉపకారమే. తరువాత కాశీలో 11, 12 తేదీలలో లక్షవత్తుల నోము, 13వ తేదీన అనంతపద్మనాభవ్రత ఉద్యాపన, మహామృత్యుంజయ హోమాలను మన విశ్వనాథుడైన సాయినాథుడు దగ్గరుండి జరిపించినట్లు ఎంతో చక్కగా జరిపించారు. ఈ యాత్రలో బాబా మా పట్ల చూపిన అనుగ్రహ విశేషాలను ఈ క్రింద పొందుపరుస్తున్నాను.


1) మేము కాశీలో విమానం దిగిన తరువాత కారు కోసం రోడ్డుపైకి రాగానే ‘శ్రీసాయి జ్యూస్ సెంటరు’ అనే బోర్డు, బాబా పెద్ద పటము మాకు దర్శనమిచ్చాయి.


2) కాశీలో మేము బసచేసిన ఆశ్రమం పేరు శ్రీకాశీగాయత్రి ఆశ్రమం. దాని నిర్వాహకులైన హరిహరశాస్త్రిగారు, వారి గురువులు కూడా దత్తభక్తులు. ఆ ఆశ్రమంలో అడుగుపెట్టగానే పెద్ద దత్తుడు, చిన్న బాబాల దర్శనం అద్భుతం!


3) మా శ్రీమతి చేసిన అనంతపద్మనాభ వ్రత ఉద్యాపన పురోహితులందరూ కాశీకి చెందినవారే అయినప్పటికీ వారంతా సాయిభక్తులే.


4) లక్షవత్తుల వ్రతంనాడు రాత్రి జాగరణ సమయంలో సుమారు 8 గంటల పాటు రామనామం పలుకుతూ ఉంటే చాలా మంచిదని ఆ వ్రత పురోహితులు చెప్పారు. అద్భుతంగా, శ్రీసాయిసచ్చరిత్రలో హేమాడ్‌పంత్‌కి బాబా రామనామాన్ని గుర్తుచేసినట్లు వేరే ఆశ్రమం నుండి మైకులో రాత్రి 11 గంటల నుండి తెల్లవారుఝామున 4 గంటల వరకు మాకు శ్రీరామనామ సంకీర్తన వినబడేలా బాబా అనుగ్రహించారు. 


5) అదేవిధంగా, కాశీలో సచ్చరిత్ర పారాయణ పూర్తికాగానే బాబా నాకు స్వప్నదర్శనమిచ్చి, తమకు కాశీ అంటే ప్రాణమనీ, తామే విశ్వనాథ, దత్త, శక్తి రూపాలనీ నాకు తెలియపరచి, ఇంతకుముందు 1994లో నేను కాశీయాత్రలో చేసిన ‘జై విశ్వనాథ.. జై సాయినాథ’ నామం తమ చెవులలో ఇంకా మారుమ్రోగుతోందని చెప్పడం నా పూర్వజన్మ సుకృతం, శ్రీసాయికి నా పట్ల గల అపారమైన దయ.


6) ఆ 9 రోజులలో ఏ రోజూ కూడా ఎటువంటి ఆందోళనగానీ, విఘ్నాలుగానీ, ఆరోగ్యపరమైన ఇబ్బందులుగానీ లేకుండా బాబా మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుని, కాశీనుండి తిరిగి నవంబరు 14న క్షేమంగా హైదరాబాదు చేర్చారు. అట్టి సద్గురు సాయివిశ్వనాథునికి వేలకోట్ల నమస్కారములతో..


సూర్యనారాయణమూర్తి నిట్టల

విజయనగర్ కాలనీ, హైదరాబాదు.


కేవలం బాబా ఊదీతో కరోనా లక్షణాల నుండి ఉపశమనం


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


ముందుగా సాయిబంధువులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు లక్ష్మి. 2021, ఫిబ్రవరి 27, శనివారంనాడు నాకు ఈ బ్లాగు గురించి తెలిసేలా బాబా అనుగ్రహించారు. ఆపై 2021, మార్చి 6, శనివారంనాడు నేను ఈ బ్లాగుకి సంబంధించిన వాట్సప్ గ్రూపులో చేరాను. నేను 1995 నుండి సాయిబిడ్డను. కానీ ఆ సాయినాథుడు తమ అమృతహస్తాన్ని అందించి, 'నీకు నేనున్నాను' అని నాకు తెలిసేలా చేసింది మాత్రం 2020, డిసెంబర్ 17న. ఈ సంవత్సరకాలంగా బాబా నాపై చూపిన ప్రేమను, 'నేనున్నాన'ని ఆయన నాకు ప్రసాదించిన నిదర్శనాలను నేను నా జీవితంలో మరిచిపోలేను. సాయినాథుడు ప్రసాదించిన ఆ దివ్యానుభూతులను మన 'సాయి మహారాజ్ సన్నిధి' ద్వారా తోటి సాయిబంధువులతో మొదటిసారి పంచుకోదలచి ముందుగా ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.


2021, జూన్ 10న నాకు, మావారికి విపరీతమైన జ్వరం, కళ్ళుమంటలు, దగ్గు, జలులు, ముక్కుదిబ్బడ, గొంతునొప్పి, ఊపిరి అందని పరిస్థితి మొదలైన కరోనా లక్షణాలన్నీ చాలా స్పష్టంగా కనిపించాయి. కానీ ఆర్ధికంగా చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నందువల్ల హాస్పిటల్‍కు వెళ్ళలేని పరిస్థితి అయినందున మాకు ఏమి చేయడానికి తోచక, "బాబా! ఇదేమిటి తండ్రీ, ఉన్న సమస్యలు చాలవన్నట్లు ఇలా ప్రాణాల మీదికి తెచ్చావు. ఆర్థిక సమస్యల నుండి బయటపడేసి మమ్మల్ని కాపాడు తండ్రి. మా భారమంతా మీకే అప్పగిస్తున్నాను. ఏం చేస్తావో నీ ఇష్టం. నీ ఊదీ తప్ప నాకు వేరే మార్గం కనపడటం లేదు. మందులు, డాక్టర్లు, టెస్టులు, హాస్పిటల్ మొదలైనవన్నీ మీ ఊదీయే మాకు" అని పరిపరి విధాల బాబాను పదేపదే ప్రార్థిస్తూ, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రం పఠిస్తూ, ఊదీ నుదుటన ధరించి, అలాగే నీళ్ళ బిందెలోనూ, అన్నం, కూరలు, టిఫిన్లు వంటి తినే, త్రాగే పదార్థాలలో అన్నిటిలో చిటికెడు ఊదీ వేసి వాటినే తీసుకునేవాళ్ళం. అలాగే సాయి సచ్చరిత్ర సప్తాహ పారాయణ చేసి, "బాబా! హాస్పిటల్‍కి వెళ్ళే పరిస్థితి మాకు రాకుండా ఇంట్లోనే, అది కూడా కేవలం మీ ఊదీతో మాకు నయమవ్వాలి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల పదిరోజుల్లో జ్వరం, దగ్గు, జలుబు తగ్గాయి. కానీ ముక్కు, కళ్ళ మంటలు, నోటి వాసన మాత్రం 3 నెలల వరకు ఉన్నాయి. 3 నెలల తరువాత అవి కూడా తగ్గాయి. బాబా దయ, కరుణల వల్లే మాకు ఇంట్లోనే బాబా ఊదీతో పూర్తిగా నయమైంది. నిజంగా ఇది బాబా మాకు ప్రసాదించిన పునర్జన్మ. "ధన్యవాదాలు బాబా. మా సమస్యలన్నీ తీర్చండి బాబా".


సర్వం శ్రీసాయిపాదారవిందార్పణమస్తు!!!



సాయిభక్తుల అనుభవమాలిక 1025వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  1. శ్రీ సాయి సచ్చరిత్ర ద్వారా బాబా సందేశాలు
  2. గాజు కనిపించేలా అనుగ్రహించిన బాబా 

నేను ఒక సాయి భక్తురాలిని. నేను బాబాను అనుక్షణమూ స్మరిస్తూ ఉంటాను. ఆయన నాకు ఒక స్నేహితునిలా కనిపిస్తారు. నేను ప్రతిరోజు నిత్యపూజతోపాటు విష్ణుసహస్రనామ పారాయణ చేస్తాను. 2020, జూన్ 26న నేను మహా పారాయణ గ్రూపులో చేరాను. అప్పటినుండి ప్రతి గురువారం సాయి సచ్చరిత్రలోని నాకు కేటాయించబడిన అధ్యాయాలను చదవడం నా జీవితంలో భాగమైంది. నాకు ఏదైనా సమస్య వస్తే సచ్చరిత్ర పుస్తకం చేతిలోకి తీసుకుని బాబాకు నమస్కరించి, కళ్ళు మూసుకుని నా సమస్య ఆయనకు విన్నవించుకుంటాను. తరువాత యథాలాపంగా సచ్చరిత్రలోని ఒక పేజీ తీసి, ఆ పేజీలోని ఏ అక్షరాల మీద నా చూపు పడితే దానిని బాబా నా సమస్యకు ఇచ్చిన సమాధానంగా విశ్వసిస్తాను. ఈ ప్రక్రియ నాకు, నా కుమార్తెకు అలవాటు. ఏ సమస్య వచ్చినా బాబా తీరుస్తారని తనకి ఒక నమ్మకం. అందుచేత తనకి ఏదైనా సమస్య వస్తే, "అమ్మా! నా సమస్యను బాబాకి చెప్పి, పరిష్కారం అడుగు" అనటం తనకు అలవాటు. తను గ్రాడ్యుయేషన్ (BDS) ఫైనల్ పరీక్షలు వ్రాస్తున్నప్పుడు బాగా టెన్షన్ పడుతుంటే నేను బాబాను తన గురించి అడిగాను. అప్పుడు  బాబా "విష్ణుసహస్రనామ పారాయణ చేయమ"ని, ఇంకా సచ్చరిత్రలోని 29వ అధ్యాయం నందు గల టెండూల్కర్ కథని చూపించారు. ఇక్కడో ఒక విషయం చెప్పాలి. అదేమిటంటే నేను ఎప్పుడు యథాలాపంగా సచ్చరిత్ర తెరిచినా 29వ అధ్యాయమే వచ్చేది. అంటే మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ మాత్రమే కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేస్తుందని బాబా సూచిస్తుండేవారన్న మాట. అదే నిజమైంది. మా జీవితంలో బాబా లీలలు ఇంతటితో ఆగలేదు ఇంకో అనుభవం చెప్తాను.

పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత మా అమ్మాయికి మంచి సంబంధం వస్తే, పెళ్లి చేసాము. తనిప్పుడు డెంటిస్ట్‌గా ఒక క్లినిక్‌లో ఉద్యోగం చేస్తోంది. కోవిడ్ కాలంలో ఒకరోజు మా అమ్మాయి క్లినిక్ నుండి నాకు ఫోన్ చేసి, "అమ్మా! నా బంగారు గాజుల జత ఒకటి కనిపించడం లేదు" అని చెప్పింది. కోవిడ్ సమయములో ఒక డాక్టరుగా తను క్లినిక్‌లో ఉన్నప్పుడు 'పీపీఈ' సూటు, డబుల్ మాస్క్, గ్లాస్సెస్ ధరిస్తుంది. కాబట్టి తను తన బంగారు గాజులు తీసి హ్యాండ్ బ్యాగులో పెట్టి, దాన్ని డాక్టర్స్ గదిలోని లాకర్‌లో పెడుతుంది. అందువలన ఆ గాజులు ఎప్పుడు పోయాయో, ఎలా పోయాయి, ఎవరు తీశారో మాకు ఏమాత్రమూ అర్థం లేదు. మా అమ్మాయి తను పని చేస్తున్న క్లినిక్ హెడ్‌కి, తన సహద్యోగులకి, అసిస్టెంట్స్‌కి గాజులు పోయిన విషయం చెప్పింది. కానీ ఏమీ లాభం లేకపోయింది. ఎవరి మీద అనుమానం లేదు, ఎటువంటి సూచన, సమాచారం గాని లేవు. అయితే ఆ బంగారు గాజులు మా అమ్మాయికి పెళ్లప్పుడు తన అత్తమామలు ఇచ్చినవి అయినందున అవి అంటే మాకు చాలా సెంటిమెంట్. అందువలన మేము చాలా బాధపడ్డాము. మా మనసు వికలమైపోగా నేను బాబాకు చెప్పుకుని ఏడ్చాను. అలా రోజులు గడుస్తూ నెల రోజులు అయిపోయింది. ఒకరోజు మా అమ్మాయి ఇంట్లో పని చేస్తున్న పనమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి, "నన్ను అనుమానిస్తున్నారా?" అని గొడవ పెట్టుకుని పని మానేసి వెళ్ళిపోయింది. తను అలా పని మానేసి వెళ్లిపోవడంతో ఆ అమ్మాయే గాజులు తీసుంటుందని మేము ఒక నిర్ధారణకు వచ్చాము. కానీ ఆధారం లేనందువల్ల మేము ఏమీ చేయలేకపోయాం.

నేను రోజూ బాబా దగ్గర బాధపడుతూ ఉండేదాన్ని. ఎప్పటిలానే ఒకరోజు బాబా దగ్గర సమస్యను చెప్పి, "మార్గం చూపించమ"ని వేడుకుని చేతిలోకి సచ్చరిత్ర తీసుకున్నాను. బాబాకు నమస్కరించి కళ్ళు మూసుకుని ఒక పేజీ తీశాను. 29వ అధ్యాయం వచ్చింది. అందులో ఉన్న దాన్నిబట్టి 'విష్ణు సహస్రనామ పారాయణ చేయమ'ని బాబా సూచిస్తున్నట్లు నాకు అనిపించింది. మళ్లీ యథాలాపంగా పేజీలు తిప్పాను. ఈసారి నా చూపు క్రింది వాక్యంపై పడింది.

బాబా 'రాజారామ్'యను మంత్రమును ఎల్లప్పుడూ జపించమనుచు నిట్లనియె, "నీవిట్లు చేసినచో నీ జీవితాశయమును పొందెదవు. నీ మనసు శాంతించును. నీకు మేలు కలుగును".

వెంటనే నేను బాబా సూచించినట్లు 40 రోజులు(మండలం)పాటు విష్ణుసహస్రనామ పారాయణ, 'రాజారామ్' అనే నామస్మరణ చేయ సంకల్పించి, దాన్ని ఆచరణలో పెట్టాను. మండల దీక్ష మొదలుపెట్టి 15 రోజులు గడిచాయి. రోజులు మామూలుగానే గడిచిపోతున్నాయి. మామూలుగానే పోయిన గాజుల గురించి ఎటువంటి సూచన, సమాచారం రాలేదు. అందరూ మెల్లగా ఆ విషయం గురించి మర్చిపోతున్నారు. మా కుటుంబసభ్యులందరూ ఆశ వదులుకున్నారు. నేను మాత్రం బాబా మార్గం చూపిస్తారని నమ్మకంతో ఉన్నాను.

ఒకరోజు నేను, "బాబా! దయ చూపండి" అని ప్రార్థించి, సచ్చరిత్ర చేతిలోకి తీసుకుని బాబాకు నమస్కరించి, కళ్ళు మూసుకుని యథాలాపంగా సచరిత్రలోని ఒక పేజీ తీశాను. ఈసారి 36వ అధ్యాయం వచ్చింది. పేజి నెంబర్ 309లో ఒక బ్రాహ్మణ వంటమనిషి తన యజమాని ద్రవ్యమును దొంగిలించిన కథ ఉంది.  ఆ కథ ద్వారా బాబా నాకు ఏదో సూచన ఇస్తున్నారనిపించి బాగా ఆలోచించాను. క్లినిక్‌లో మా అమ్మాయి కింద పనిచేసే వాళ్లెవరో దొంగతనం చేసి ఉంటారని అనిపించింది. సరే, అదలా ఉంచితే, 'దొంగలించినవారే తిరిగి సొమ్ము ఇస్తార'ని ఆ కథ సూచిస్తుంది. 'మరి, మాకు అంత అదృష్టం ఉందా? ఈ కాలంలో దొంగలించి ఎవరు నేరం ఒప్పుకుని, తిరిగి మన సొమ్ము మనకి ఇస్తారు?' అని అనుకున్నాను. నేను మా అమ్మాయితో విషయం చెప్పాను. తను, "పోయిన బంగారం ఎలా దొరుకుతుంది? నాకు నమ్మకం లేదమ్మా" అంది. కానీ నాకు నమ్మకం, ఆశ చావలేదు. రోజూ విష్ణు సహస్రనామ పారాయణ, 'రాజారామ్' మంత్రం జపం చేస్తున్నాను. అద్భుతం! 38వ రోజున మా అమ్మాయికి దొంగ దొరికింది. అది ఎవరో కాదు. తన క్లినిక్‌లో పనిచేసే ఒక జూనియర్ డాక్టర్. తను ఇంకొక దొంగతనం చేస్తూ మా అమ్మాయికి పట్టుబడింది. నిలదీసి అడిగితే, "ఈ రెండు దొంగతనాలు నేనే చేశాను. డబ్బు అవసరమైంది. బంగారం చూసి నా మనసు చలించింది. అందుకే దొంగిలించాను" అని నేరం ఒప్పుకుంది. అయితే అప్పటికే ఆ జూనియర్ డాక్టరు గాజులను ఒక షాపులో అమ్మడం, ఆ షాపు యజమాని ఆ బంగారాన్ని కరిగించడం జరిగిపోయినందున మా బంగారు గాజులకి వెలకట్టి డబ్బులిచ్చారు. విశేషమేమిటంటే, అది నేను చేస్తున్న మండల దీక్షలో అది 40వరోజు అంటే చివరి రోజు. పైగా ఆరోజు గురువారం. మొత్తానికి బాబా దయవల్ల మేము పోగొట్టుకున్నది అంతా డబ్బు రూపంలో తిరిగి మాకు దక్కింది. మా సంతోషానికి హద్దుల్లేవు. చాలా చాలా ఆనందించాము. ఈ కాలంలో పోయినవి తిరిగి దొరకడం అనేది చాలా అదృష్టం. దొంగతనం చేసిన ఆ జూనియర్ డాక్టర్ తన తప్పు ఒప్పుకుని క్షమించమని వేడుకుంది. మేము క్షమించాము. ఇలా చాలా సందర్భాలలో బాబా నాకు, మా కుటుంబసభ్యులకి తన లీలలు చూపిస్తున్నారు. నేను ఆయనను ఎప్పటికీ మరువలేను.

చివరిగా ఒక చిన్న అనుభవం చెప్తాను. 2021, ఆఖరి కార్తీక సోమవారంనాడు మా ఇంట్లో రుద్రాభిషేకం చేయించాము. మా దంపతులిద్దరమూ పీటల మీద కూర్చుని పూజ ప్రారంభించే సమయంలో నా దృష్టి పక్కనే ఉన్న అగరుబత్తీల ప్యాకెట్ మీద పడింది. దాన్ని చూస్తూనే 'బాబా వచ్చార'ని నా మనసుకి చాలా సంతోషం అనిపించింది. బాబా వచ్చింది ఇదిగో ఈ విధంగా....
"చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ అనుగ్రహం ఇలాగే ఎప్పుడూ మాపై, మీ భక్తులందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను తండ్రీ".

గాజు కనిపించేలా అనుగ్రహించిన బాబా


సాయిబంధువులందరికీ నమస్కారం. బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవం మీతో పంచుకుంటున్నాను. నేను ఒక సాయిభక్తురాలిని. 2021, డిసెంబర్ 9న నేను ఒక పెళ్లికి వెళ్ళొచ్చాను. ఇంటికి వచ్చాక నా చేతికున్న బంగారు గాజులు తీసి పాత గాజులు వేసుకున్నాను. వాటిలో ఒక గాజు తక్కువగా ఉన్న విషయం నేను చూసుకోలేదు. తరువాత స్నానం చేసేటప్పుడు చూసుకుని ఒక గాజు తక్కువగా ఉందని కంగారుపడి బాబాను మదిలో తలుచుకుని, "బాబా! గాజు కనిపించేలా చూడండి, మేరే దయామయ తండ్రి. గాజు కనిపిస్తే, మీ బ్లాగు ద్వారా నా అనుభవాన్ని అందరితో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. ఆపై మునుపు గాజులు ఉన్న చోట చూస్తే, నా గాజు కనిపించింది. "మేరే బాబా! ఓ కరుణామయ తండ్రి. ఎప్పటికీ మీరు మా వెంటే ఉంటూ మమ్మల్ని మంచి మార్గంలో నడిచేలా చూడండి బాబా".



సాయిభక్తుల అనుభవమాలిక 1024వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • అడుగడుగునా బాబా అనుగ్రహం

అందరికీ నమస్కారం! నేనొక బాబా భక్తురాలిని. బాబా నన్ను అడుగడుగునా కాపాడుతున్నారు. నాకేదైనా సమస్య వచ్చినప్పుడు, “బాబా! దయచేసి ఈ విషయంలో నాకు సహాయం చేయండి” అని బాబాను ప్రార్థించగానే బాబా వెంటనే బదులు పలుకుతున్నారు. ఈ బ్లాగులో ‘సాయి వచనం’ ఎన్నోసార్లు నాకు బాబా నేరుగా చెప్పినట్లే ఉంటుంది. ఈ ‘సాయి మహరాజ్ సన్నిధి’ బ్లాగులో ప్రచురిస్తున్న ‘సాయి వచనం’లో కూడా, "నేను నిన్ను అడుగడుగునా కాపాడుతున్నాను, లేకుంటే అసలు ఏమి జరిగేదో" అనే సాయి వచనం ఎన్నోసార్లు వచ్చింది. నేను బాబాను సహాయం కోరినప్పుడల్లా బాబా నాకు ‘సాయి వచనం’ ద్వారా ప్రతిస్పందించారు.

ఇక నా అనుభవం విషయానికి వస్తే... ఇది జరిగి ఎన్నో నెలలు గడిచినప్పటికీ నేను దీనిని మీతో పంచుకోలేదు. ఎందుకంటే, ఆ అనుభవం కలిగినప్పుడు, ‘నిజంగానే నేను అంత అదృష్టవంతురాలినా? ఒకవేళ ఇది నా భ్రమేమో!’ అనుకున్నాను. అందుకే నేను ఆ అనుభవాన్ని పంచుకోలేదు. కానీ, ‘శ్రీసాయిలీలామృతం’ చదువుతున్నప్పుడు అందులో అలాంటి ఒక సందర్భం చదివిన తరువాత నాకు నా అనుభవాన్ని పంచుకునే ధైర్యం వచ్చింది. అది నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ, వైఫల్యం చెంది విరక్తితో ఉన్న సమయం. ఆ సమయంలో చివరి ప్రయత్నంగా ఒకరోజు బాబాకు పూజ చేసి, "బాబా, నిన్ను నేను ఎంతగా నమ్మాను! కానీ నువ్వు నన్ను వదిలేశావు. నాకు తండ్రి కూడా లేరు. నిన్ను అంతగా నమ్ముకున్నందుకు నువ్వు మాకేమీ చేయలేదు” అంటూ ఎంతో బాధగా, హృదయపూర్వకంగా బాబాతో మాట్లాడుతున్నాను. అదే సమయంలో మా నాన్న కూడా గుర్తొచ్చేసరికి ఇంక దుఃఖం ఆపుకోలేక సోఫాలో కూర్చుని ఏడుస్తూ ఉండిపోయాను. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఉన్నట్టుండి నాకు ఒకరకమైన చక్కని సువాసన వచ్చింది. అది ముస్లిమ్స్ ధూపం వేయటానికి వచ్చినపుడు వేసుకుని వచ్చే అత్తరు పరిమళం లాగా వుంది. ఆ సువాసన నా ముందునుండి వచ్చి నా పక్కకి చేరుకుంది. హఠాత్తుగా వచ్చిన ఆ సువాసనని అదే పనిగా పీలుస్తూ, 'ఈ సువాసన ఎక్కడినుండి వస్తోంది? ఒకవేళ దూరంగా ఆరేసివున్న ఉతికిన బట్టల నుండి వస్తోందేమో?' అని అనుకుంటూ వాటి దగ్గరకి వెళ్ళి వాసన చూశాను. కానీ, ఆ సువాసన ఆ బట్టల నుండి రావటం లేదు. వేరే బట్టల నుండి ఆ సువాసన వస్తోందేమో అనుకుని ఇంట్లో వేరేచోట ఉన్న బట్టలన్నీ చెక్ చేశాను. కానీ, ఎక్కడా మళ్ళీ అలాంటి సువాసన నాకు రాలేదు. ‘అమెరికాలో అత్తరు సువాసన వస్తోందే, పైగా అలాంటి పెర్‌ఫ్యూమ్ ఇంట్లో ఎవ్వరూ వాడరు కూడా. అంతేకాదు, ఆ సువాసన హఠాత్తుగా వచ్చింది, మళ్ళీ అసలు రానేలేదు..’ అంటూ ఇలా అన్నీ ఆలోచిస్తుంటే, అది బాబానే (బాబా సన్నిధి) అని అనిపించినప్పటికీ, మళ్ళీ అంతలోనే ‘నాకు అంతటి అదృష్టమా?’ అని అనుకుని ఆ అనుభవం పట్ల అపనమ్మకంగా ఉన్నాను. కానీ మనసులో మాత్రం “బాబానే వచ్చారు” అనుకున్నాను. అంతేకాదు, ఆ సమయంలో బాబా దయవల్ల నేను ప్రయత్నిస్తున్న ఉద్యోగం కూడా వచ్చింది. అడుగడుగునా ఎన్నో చిక్కులు ఎదురైనా, ‘బాబా’ అని తలచుకోగానే వాటినుండి నన్ను కాపాడి నాకు ఉద్యోగం ప్రసాదించారు బాబా. అంతేకాదు, ఉద్యోగంలో చేరినరోజు నుండి ఇప్పటివరకు బాబా నన్ను అడుగడుగునా కాపాడుతూనే ఉన్నారు.

నేను ఉద్యోగం రాగానే బాబాకు నమస్కరించుకుని, “బాబా, నీ మీద నాకు ప్రేమతో కూడిన భక్తి ఉండాలేగానీ భయంతో కూడిన భక్తి వద్దు. నేను ఈ బ్లాగ్ చూసేటప్పుడు ఉద్యోగం వచ్చింది అనీ, బ్లాగ్ చూడకపోతే ఉద్యోగం పోతుందేమో అనే భయంతో కూడిన ప్రేమ ఉండకూడదు” అని కోరుకున్నాను. అదే రోజు బ్లాగ్ ఓపెన్ చేస్తే సాయి వచనంలో, "ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తున్నావు? వచ్చావంటే కొడతాను" అని వచ్చింది. ఎంత కరెక్ట్‌గా వచ్చింది నాకు బాబా నుండి మెసేజ్! అలా ‘సాయి వచనం’ ద్వారా బాబా నాతో మాట్లాడుతున్నారని నా మనసుకి అనిపిస్తుంది.

ఈమధ్య నాకు ఉద్యోగంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. బాబా అనుగ్రహం వలన వాటినన్నింటినీ నేను దాటగలిగాను. నేను కాంట్రాక్ట్ బేసిస్‌పై వర్క్ చేస్తున్నాను. ఒక సోమవారంనాడు మా మేనేజరుతో 1 on 1 మీటింగులో, “నా ఉద్యోగం పర్మినెంట్ అయ్యే ఛాన్స్ ఉందా?” అని ఆవిడని అడిగాను. అప్పుడు మా మేనేజర్ నాతో , “మన టీంలో ఆ అవకాశం లేదు. కానీ, నువ్వు వేరే టీంలో కావాలంటే అప్లై చేసుకో!” అంటూ ఎలా అప్లై చేసుకోవాలో కూడా చక్కగా చెప్పింది. కానీ, రెండు రోజుల తరువాత మళ్ళీ టీం అందరితో మీటింగ్ పెట్టి, “ఉద్యోగం పర్మినెంట్ కావాలనుకుంటే అందరూ అప్లై చేసుకోండి. కానీ, ఆ విషయం ఉద్యోగం వచ్చేశాక చెప్పకుండా కాస్త ముందే నాకు చెప్పండి. మీ అందరి కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ కోసం నేను ఎంతో కష్టపడుతున్నాను” అంటూ చాలాసేపు ఏదేదో చెప్పింది. అది విని నేను, “విడిగా అడిగినప్పుడు అంతా చక్కగా వివరించి, ఇప్పుడేంటి ఇలా అంటోంది? ఆవిడకేమైనా కోపం వచ్చిందేమో? అనవసరంగా నేను అంతా చెడగొట్టుకున్నానా?” అని నాకు చాలా బాధగా అనిపించింది. ఇదంతా గురువారంనాడు జరిగింది. ఆ మీటింగులో నేను మౌనంగా ఉన్నాను. మరుసటి సోమవారం నాకు మా మేనేజరుతో 1 on 1 మీటింగ్ ఉంది. ఆ వీకెండ్ అంతా నేను బాబాను ప్రార్థిస్తూ, “బాబా! ఆవిడ నాతో మంచిగా ఉండాలి. ఆ విషయం గురించి నన్ను ఏమీ అనకూడదు, ప్లీజ్ బాబా” అనుకున్నాను. సోమవారంనాడు ఆవిడ తనంతట తానే ఆ విషయాన్ని ప్రస్తావించి, “నేను అందరినీ భయపెట్టినట్లున్నాను. నేను చెప్పింది అందరికీ తప్పుగా అర్థమైంది. అందరూ భయపడ్డారు. సారీ, నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, మీ అందరూ ముందు మీ జీవితం గురించి, మీ కుటుంబం గురించి ఆలోచించండి. నేను కూడా మొదట కాంట్రాక్ట్ బేసిస్ మీదే ఇక్కడ చేరాను. ఆ తరువాత ఫుల్ టైం తీసుకున్నాను. మీరు కూడా మొదట మీ గురించి ఆలోచించండి, ఆ తరువాతనే టీం వస్తుందని చెప్పాలనుకున్నాను. కానీ అందరికీ వేరేగా అర్థం అయింది, సారీ!” అని చెప్పింది. అసలు నిజంగా బాబా ప్రమేయం లేకుంటే ఈ విషయమంతా ఇలా ఇంత సానుకూలంగా మారగలదా?

మళ్ళీ ఇంకొకసారి వేరేవాళ్ళ వర్క్‌ విషయంలో మా మేనేజర్ ఎన్నిసార్లు అడిగినప్పటికీ వాళ్ళు ఆ వర్క్ చేయగలిగినా కూడా ఆ వర్కులో సమస్యలున్నాయని చెప్పి ఆ వర్క్ చేయలేదు. అయితే నేను మీటింగులో, ‘ఆ వర్క్ చేయవచ్చు’ అని మా మేనేజరుకి చెప్పి అన్నీ ఫిక్స్ చేయించాను. అలా ఫిక్స్ చేయించినందుకు ఆ ఇంకో ఇద్దరు వర్కర్స్‌కి నా మీద చాలా కోపం వచ్చింది. అప్పటినుండి ఆ ఇద్దరూ నా మీద చాలా కోపంగా ఉండి నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. అప్పుడు కూడా నేను, “బాబా! ప్లీజ్, నాకు మనశ్శాంతి కల్పించండి” అని బాబాను వేడుకున్నాను. అప్పుడు మా మేనేజర్ మరియు ఇంకో కో-వర్కర్ కూడా నాతో మాట్లాడుతూ, “నువ్వు చాలా బాగా హెల్ప్ చేశావు. నిజానికి అవన్నీ వాళ్ళు చేయాలి. కానీ వాళ్ళు చేయలేక చేయలేదు. నీదేమీ తప్పులేదు. అవి ఫిక్స్ చేసినందుకు థాంక్స్” అని చెప్పారు.

అలానే ఇంకొకసారి, “నాకు మా మేనేజరుతో 1 on 1 మీటింగ్ వద్దు బాబా” అని అనుకోగానే ఆఖరి నిమిషంలో ఆవిడకి వేరే ఇంపార్టెంట్ మీటింగ్ వచ్చి మా 1 on 1 మీటింగుని క్యాన్సిల్ చేసింది. ఇలా బాబా నాకు అడుగడుగునా సహాయం చేస్తున్నారు. చాలాసార్లు నేను ఆఫీసులో ఎక్స్‌ట్రా వర్క్ చేసినప్పటికీ టైం షీట్‌ సబ్మిట్ చేసేటప్పుడు ఆ ఎక్స్‌ట్రా పనిగంటలు ఎంటర్ చేసేదాన్ని కాదు. కానీ, నేను అంత వర్క్ చేసినప్పటికీ, సిన్సియర్‌గా వర్క్ చేసినవాళ్ళకి, వర్క్ సరిగా చేయనివాళ్ళకి తేడా చూపటం లేదు అని మా మేనేజర్ మీద కోపం వచ్చినప్పుడు మాత్రం శుక్రవారంరోజున టైం షీట్ సబ్మిట్ చేసేటప్పుడు ఆ ఎక్స్‌ట్రా పనిగంటలు సబ్మిట్ చేసేదాన్ని. అయితే అలా సబ్మిట్ చేసినప్పుడల్లా తిరిగి సోమవారంరోజున జరగబోయే 1 on 1 మీటింగులో మా మేనేజర్ ఆ విషయం గురించి అడుగుతుందేమో అని కొంచెం భయం ఉండేది. మనం దానికి అర్హులమైనప్పటికీ ఎప్పుడూ అన్నీ రూల్స్ ప్రకారం జరగవు. అయితే, “బాబా! ప్లీజ్.. మా మేనేజర్ ఆ విషయం గురించి అడగకుండా చూడు” అని బాబాను ప్రార్థించిన ప్రతిసారీ సోమవారం ఉదయం నా టైం షీట్‌ను మా మేనేజర్ అప్రూవ్ చేసేసేది. ‘ఎక్స్‌ట్రా పనిగంటలు ఎందుకు ఎంటర్ చేశావు?’ అని నన్నసలు అడిగేది కాదు. చివరకు ఈరోజు (డిసెంబరు 7, 2021) కూడా నేను ఇదే సమస్య నుండి కాపాడమని బాబాను వేడుకున్నాను. “బాబా, నాకు మా మేనేజరుతో 1 on 1 మీటింగ్ వద్దు. అలాగే, సబ్మిట్ చేసిన ఎక్స్‌ట్రా పనిగంటల గురించి ఆమె నన్ను అడగకుండా చూడండి” అని. నేను కోరుకున్నట్లే మా మేనేజర్ నన్నేమీ ప్రశించకుండానే టైం షీట్‌ని అప్రూవ్ చేసింది. ఇదంతా కేవలం బాబా దయే. ఇలా బాబా నన్ను అడుగడుగునా కాపాడుతున్నారు.

అలానే ఈమధ్య ఒకసారి మా బాబు విషయంలో బాబా సహాయం చేసారు. అసలే కరోనా వల్ల ఏ కాస్త బాగాలేకపోయినా పిల్లలిద్దరూ స్కూలుకి వెళ్లడం మానేసి, కోవిడ్ పరీక్ష చేయించుకోవాల్సిన పరిస్థితుల్లో ఒకరోజు మా చిన్నబాబుకి ఐస్ క్రీం తినటం వల్ల జలుబు, జ్వరం వచ్చాయి. అది కోవిడ్ కాదని నాకు తెలుసు. ఎందుకంటే, మా చిన్నవాడు పెద్ద స్పూన్‌తో ఒక్కసారిగా ఐస్ క్రీం తింటే వాడికి జలుబు మొదలవుతుంది. అయితే అంతకుముందు వారంలో ఇలాంటి పరిస్థితి వస్తే, పిల్లల్ని స్కూలు నుండి ఇంటికి పంపండం, పరీక్షలు చేయించడం వంటి హంగామా జరిగింది. అప్పుడు కూడా నాకు తెలుసు, అది కోవిడ్ కాదని. కాబట్టి నేను భయపడలేదు. కానీ స్కూలు నుంచి బాబుకి లైట్‌గా ఫీవర్ మొదలైందని ఫోన్ వస్తే, వాడిని డాక్టరు దగ్గరకి తీసుకుని వెళ్లి అన్నీ పరీక్షలు చేయించాల్సి వచ్చింది. వారం గడిచేసరికి మళ్లీ ఇలా బాబుకి అతికొద్దిపాటి జలుబు మొదలైంది. అంటే మళ్ళీ పిల్లలు స్కూలు మానేయాలి, వాళ్లకి కోవిడ్ పరీక్షలు చేయించాలి. అయితే పెద్దబాబు మళ్ళీ ఒక వారం స్కూలు పోతుందని బాధపడుతుంటే, నేను వాడిని స్కూలుకి పంపించి, అది కోవిడ్ కాదని నాకు తెలుసినందున చిన్నవాడిని కూడా పంపాను. కానీ బాబుకి జ్వరం వస్తే స్కూలువాళ్ళు ఏమన్నా అంటారేమోనని భయపడి, "బాబా! ప్లీజ్ బాబా! బాబుకి జ్వరం రాకుండా చూడండి" అని బాబాను వేడుకున్నాను. తరువాత కూడా స్కూల్ నుంచి ఏదైనా ఫోన్ కాల్ వస్తుందేమోనని నాకు చాలా భయమేసింది. కానీ, బాబా దయవల్ల ఏలాంటి ఇబ్బందీ రాలేదు. బాబు మామూలుగానే ఇంటికి వచ్చాడు. జలుబు కూడా రెండు రోజులలో తగ్గిపోయింది. ఇలా ప్రతిసారీ బాబా నాకు సహాయం చేస్తున్నారు. "బాబా! మీ దయ, ప్రేమ నా మీద, నా పిల్లల మీద ఎప్పుడూ ఇలానే వుండేలా ఆశీర్వదించండి. మీ దయ లేకుంటే నాకు మనశ్శాంతి అనేది ఉండేది కాదు. బాబా, ఇంతవరకు మీరు నాకు ప్రసాదించిన అన్నిటికీ మీకు చాలా ధన్యవాదాలు. మీ ప్రేమ, కరుణ ఎల్లప్పుడూ ఇలాగే నా మీద, నా కుటుంబం మీద మరియు అందరిమీదా చూపించండి బాబా. నాపై ఎన్నడూ కోపగించుకోవద్దు బాబా. ఎన్నడూ మమ్మల్ని వదిలి పెట్టవద్దు బాబా. ప్లీజ్ బాబా, మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడండి బాబా”

ఓం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు!
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1023వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అడుగడుగునా మాతో ఉన్న బాబా
2. సాయి ద్వారా పొందిన సహాయాలు

అడుగడుగునా మాతో ఉన్న బాబా

సాయిబంధువులకు నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి చాలా కృతజ్ఞతలు. నేను ఒక సాయిభక్తురాలిని. బ్లాగులోని భక్తుల అనుభవాలు చదవుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. నేను కూడా ఇదివరకు నా అనుభవాలు కొన్ని బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవం పంచుకుంటున్నాను. 2021, మే నెలలో మా అమ్మానాన్నలకు కరోనా వచ్చి, బాబా దయవల్ల తగ్గింది. తర్వాత ఆగష్టులో నాన్న కరోనా వ్యాక్సిన్ రెండో డోస్‍ వేయించుకున్నారు. సరిగ్గా పదిరోజులకి నేను అమ్మతో ఫోన్‍లో మాట్లాడుతుండగా నాన్న 'నొప్పి' అన్నారు. హాస్పిటల్‍కి తీసుకెళితే, 'గ్యాస్' అని మందులిచ్చి పంపారు. అయితే అదేరోజు సాయంత్రం ఇంకా ఎక్కువ నొప్పి రావడంతో వెంటనే నాన్నను అత్యవసరంగా భీమవరంలోని వర్మ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అక్కడ ఆయనకు యాంజియోగ్రామ్ చేసి, "హార్టులో బ్లాకులున్నాయి. వెంటనే సర్జరీ చేయాలి" అన్నారు. అయితే వర్మ హాస్పిటల్ అంటేనే బాగా డబ్బులు ఖర్చు పెట్టేంచేవరకు రోగుల ఆరోగ్య విషయంలో ఏ గ్యారెంటీ ఇవ్వరని బాగా టెన్షన్ పడ్డాం. వెంటనే మేము దుబాయ్ నుండి బయలుదేరి ఇండియాకి వచ్చేసాము. వచ్చేముందు బాబాకి దణ్ణం పెట్టుకుని ఒకటే మొరపెట్టుకున్నాను, "అంతా బాగుండి, నేను సంతోషంగా తిరిగి దుబాయ్ చేరుకోవాలి" అని. తరువాత మా అన్నయ్య వర్మ హాస్పిటల్లో నాన్నని హైదరాబాద్ తీసుకెళ్తామని చెప్పి అక్కడినుండి బయటకు తీసుకొచ్చాడు. అంతలో రాజమండ్రి, బోలినేనిలో బాగా చూస్తారంటే, అక్కడికి తీసుకెళ్లాం. ఆ వ్యవధిలో నాన్న ఆరోగ్యం చాలా ఒడిదుడుకులకు గురైంది. కానీ బాబా వాటినుండి నాన్నను కాపాడారు. అడుగడుగునా బాబా మాతో ఉన్నారు అనడానికి ఇదొక నిదర్శనం.

తరువాత నాన్నకు రేపు ఉదయం ఆపరేషన్ చేస్తారనగా ఆరోజు సాయంత్రం మా అమ్మ, నేను, మా ఆడపడుచు మా ఇంటిదగ్గరలో ఉన్న సాయి మాత (పాత సోమాలమ్మ టెంపుల్) గుడికి వెళ్ళాము. ఆ గుడి బయట ఒక అవు కనిపిస్తే, మా అమ్మ దణ్ణం పెట్టుకుంది. గుడిలోకి వెళ్ళాక నేను సాయి మాత దర్శనం చేసుకుని, అక్కడ కూర్చుని లలితా సహస్రనామం చదివి, దర్శనానంతరం బయటకు వచ్చేముందు మా అమ్మ అక్కడున్న ఆవుల శాలలోకి వెళ్లి దణ్ణం పెట్టుకుంటానంటే, "వద్దు ఎర్ర చీరతో ఉన్నావు. అవి పొడుస్తాయేమో!" అని బయటకి తీసుకుని వచ్చేసాను. తరువాత మేము హాస్పిటల్‍కి బయలుదేరే సమయానికి మా ఇంటి ముందు గోమాత చక్కగా కూర్చుని కనిపించింది. దాని మొహానికి నిండుగా బొట్టు పెట్టి ఉంది. నేను మా అమ్మతో, "ఇదిగో సాయి మాత మనకి ఎదురు వచ్చారు. ఎంత మంచి శకునమో! వెళ్లి దణ్ణం పెట్టుకో" అని అన్నాను. 'హాస్పిటల్‍కి వెళ్లేముందు ఆవు ఎదురైంది, అంతా మంచి జరుగుతుంద'ని అమ్మ, నేను చాలా ఆనందపడ్డాము. అనుకున్నట్లే ఆపరేషన్ విజయవంతమైంది. తరువాత నాన్న డిశ్చార్జ్ అయ్యే సమయానికి ఏదో కారణంగా ఆరోగ్యశ్రీ మెషిన్ పని చేయలేదు. అయినా నాన్న ఈరోజే వెళ్ళిపోవాలి అని అన్నారు. ఆయన ఉన్న గదిలో ఆయనకి పీడ కలలు కూడా వస్తున్నందున మేము కూడా భయపడి తీసుకెళ్ళిపోదామనుకుని హాస్పిటల్ స్టాఫ్ అందరితో బాగా పరిచయమున్న మా ఆడపడుచు భర్తతో చెప్పాము. ఆయన రూపంలో బాబాయే మమ్మల్ని నడిపించారు. వాళ్ల మేలు మేము మర్చిపోలేము.

మా ఆడపడుచు భర్త, నేను కలిసి నాన్నని తీసుకెళ్ళిపోతామని అడిగాము. అందుకు వాళ్ళు సరే అన్నారు. అంతా బాబా దయ. నాన్నని తీసుకెళ్ళడానికి అనుమతించిన వెంటనే నేను రూమ్‍కి వెళ్లి, నాన్నని కిందకి తీసుకుని వచ్చేసాను. తీరా కిందకి వచ్చాక నాన్న షుగర్‍కి ఇన్సులిన్ ఎంత ఇవ్వాలి అని నాకు అనుమానం వచ్చి నాన్నని అక్కడే కూర్చోబెట్టి, నేను పైకి వెళ్లాను. అంతలో మా అమ్మ నాన్నకి దేవుడి కుంకుమ పెడుతుండగా ఒక్కసారిగా నాన్న చేతులు వంకరపోయి, కనుగుడ్లు పైకి పెట్టేశారు. నాన్నకి ఏదో అయిపోతుందని అమ్మ ఏడుస్తూ నాకు ఫోన్ చేసి విషయం చెప్పారు. రౌండ్స్ కి వచ్చిన సర్జన్‍తో మాట్లాడదామని పైన వేచి ఉన్న నేను బాబాకి గట్టిగా దణ్ణం పెట్టుకుని, "బాబా! నాన్నకి ఏమీ కాకుండా చూడు తండ్రి. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. మా అన్నయ్య, మా ఆడపడుచు భర్త నాన్నని వెంటనే పైకి తీసుకుని వచ్చారు. డాక్టర్ నాన్నని చూసి, బిపి డౌన్ అయింది. ఈరోజు ఉంచి రేపు తీసుకెళ్లండి" అన్నారు. అలాగే మరుసటిరోజు నాన్నని ఇంటికి పంపించారు. నమ్మిన వారిని ఎప్పటికీ వదలరు సాయి. మీకు చాలా చాలా ధన్యవాదాలు సాయి తండ్రి.

ఇండియా నుండి దుబాయ్‍కి తిరిగి వెళ్ళేలోపు నాన్న ఆరోగ్యం బాగుండాలి అనుకున్న నా కోరిక తీరింది. కానీ నాకు ఒక సమస్య వచ్చింది. నెలసరికి ముందు నా బ్రెస్ట్ లో చిన్న కణితిలా వచ్చింది. నెలసరి తర్వాత తగ్గుతుందేమో అనుకున్నాను. అయితే కొంచెం పరిమాణం తగ్గినప్పటికీ పూర్తిగా తగ్గలేదు. దాంతో మళ్ళీ నెలసరి వచ్చిన తరువాత తగ్గుతుందేమో అనుకున్నాను. కానీ అలాగే ఉండేసరికి 2021, డిసెంబర్ 5న హాస్పిటల్‍కి వెళ్తే, డాక్టర్ స్కాన్ రాశారు. రిపోర్టులో తేడా ఉంటే బయాప్సీ చేయాల్సి ఉంటుందని అన్నారు. అప్పుడు నేను, "బాబా! నా జీవితం నీ చేతిలో ఉంది" అని వేడుకున్నాను. స్కాన్ ఇంకా జరగాల్సి ఉంది. కానీ నన్ను ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి కాపాడుతున్న బాబా ఇప్పుడు కూడా కాపాడతారు. నాకు సమస్య లేదని తెలిస్తే ఆ అనుభవంతో మళ్లీ మీ ముందుకు వస్తాను.

సాయి ద్వారా పొందిన సహాయాలు

సాయిభక్తులుకు నమస్కారం. ఈ బ్లాగు నిర్వహించే సాయికి నా ధన్యవాదాలు. నేను ఒక సాయిభక్తురాలిని. ప్రతి కష్టంలోనూ బాబా నాకు తోడు ఉన్నారు. ఈమధ్య నేను సాయి ద్వారా పొందిన సహాయాల గురించి ఇప్పుడు మీ అందరితో పంచుకుంటున్నాను. ఈమధ్య ఒకసారి కుక్కర్ పడి నాకు కాలిపోయింది. అయితే పెద్ద మొత్తంలో కాలి పోకుండా కేవలం చిన్నగా తగిలేలా చేసి బాబా కాపాడారు. మా ఇంట్లో ఉన్న నా మేనల్లుడికి చాలా తీవ్రంగా కాళ్ళనొప్పులు వచ్చి నడవలేకపోయాడు. పోలియో ఏమోనని అనుమానపడ్డాము. అయితే బాబా దయవల్ల వారికి నమస్కరించుకున్నంతనే బాబు చక్కగా నడిచాడు. వేరే చోట ఉన్న మా అమ్మ క్షేమంగా మా వద్దకు వచ్చేలా చేశారు బాబా. ఇంకా ఆక్సిడెంట్ వల్ల నాకు ఏమీ కాకుండా కాపాడారు. ఏ టెన్షన్ లేకుండా నా ఫెర్టిలిటీ చికిత్స అయ్యేలా చూశారు బాబా. ఇలా ప్రతిక్షణం బాబా నాతో ఉంటూ అడుగడుగునా నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. "బాబా! నా ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ విజయవంతమై నేను ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కల నెరవేరి అందరూ గర్వంగా చెప్పుకోవాలని నా కోరిక. నా ఆస్తి, నా బలం, నా నమ్మకం, నా సంతోషం అన్నీ మీరేనని గట్టిగా అందరికీ చెప్పాలని ఉంది. ఆ అవకాశం నాకివ్వు బాబా. నువ్వు ఉన్నావన్న ఒకేఒక్క నమ్మకంతో ఈ రోజు నేను ఏ టెన్షన్ లేకుండా ఉన్నాను. మీరే నా ధైర్యం. నా ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ విజయవంతమయ్యేలా చూడండి బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1022వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. 'బాబా బాబా' అనుకుంటే సమస్య లేకుండా చేస్తారు బాబా
2. బాబా ప్రసాదమైన చిన్న అనుభవాలు
3. బాబా ఊదీ మహిమ

'బాబా బాబా' అనుకుంటే సమస్య లేకుండా చేస్తారు బాబా

రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కి జై!!!

నేను ఒక సాయిభక్తురాలిని. ముందుగా సాయిబంధువులకు నమస్కారం. "బాబా! ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి మీ సహకారం ఎప్పుడూ ఉండాలి. మీ ఆశీర్వాదంతో ఈ బ్లాగు దినదినాభివృద్ధి చెందాల"ని బాబాను కోరుకుంటూ ఆయన నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. మేము గ్రామంలో ఉంటాము. మా అబ్బాయి సిటీలో ఉంటాడు. తను రోజూ ఉదయం ఆఫీసుకి వెళ్ళేటప్పుడు నాకు ఫోన్ చేస్తాడు. ఆలాగే ఈమధ్య ఒకరోజు ఫోన్ చేస్తే నేను మాములుగా, "టిఫిన్ అయిందా?" అని అడిగాను. అందుకు తను, "అమ్మా! ఉదయం ముఖం కడుక్కునేటప్పుడు గొంతులో మంటగా అనిపించి చాక్లెట్ రంగులో వాంతి అయింది" అని చెప్పాడు. నేను, "రాత్రి ఏమి తిన్నావు?" అని అడిగాను. తను, "బిస్కెట్లు, ఖర్జూరం, ఆమ్లెట్, గారెలు, ఇంకా బోర్నవిటా కూడా త్రాగాను" అని భయంభయంగా చెప్పాడు. నేను గ్యాస్టిక్ సమస్య వల్ల జీర్ణం కాలేదేమో అని అన్నప్పటికీ తనకి భయంపోలేదు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే సాయిని స్మరించుకునే నేను 'సాయి సాయి' అనుకుంటూ డాక్టరైన మా మావయ్య కొడుకుకి ఫోన్ చేసి విషయం చెప్పి, మా అబ్బాయి పంపిన ఫోటోలు పంపాను. తను ఆ ఫొటోలు చూసి, "అన్న తిన్న పదార్థాల రంగులోనే వాంతి చేసుకున్నాడు. తనకి అస్సలు జీర్ణం కాలేదు. మరేం పర్వాలేదు" అని అన్నాడు. ఆ విషయం నేను మా అబ్బాయికి ఫోన్ చేసి చెప్పాను. కానీ తన భయం పోలేదు. అప్పుడు నేను, "బాబా! మా పెద్దబ్బాయి చాలా సున్నితస్తుడు, ఏ కొంచం కష్టమొచ్చినా భయపడతాడు. తనకి మళ్ళీ వాంతి కాకుండా ఉండాలి. అలా అయితే ఈరోజే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. ఆ రాత్రి నేను బాబా చాలీసా చదివి, 'బాబా బాబా' అని నామస్మరణ చేస్తూ ఎక్కువ భాగం మెలుకువగా ఉన్నాను. మరునాడు ఆదివారం ఉదయం మా అబ్బాయి ఫోన్ చేసాడు. తన నుంచి ఏం వింటానో అని నేను భయంగా ఫోన్ లిఫ్ట్ చేశాను. వాడు ఆనందంతో మాట్లాడుతూ ఉంటే, ఆనందం నిండిన గొంతుతో తగ్గిందా అని అడిగాను. తను తగ్గింది అమ్మా అని చెప్పాడు. ఏ చిన్న సమస్య వచ్చినా 'బాబా బాబా' అనుకుంటే సమస్య లేకుండా చేస్తారు బాబా. నేను కోరుకున్నది ఏదైనా నాకు ఏ విధమైన బాధ కలగకుండా నన్ను అనుగ్రహిస్తారు బాబా. ఇలా ఎన్నోసార్లు నాకు టెన్షన్ లేకుండా చేసారు బాబా. "ధన్యవాదాలు బాబా. మమ్మల్ని అనుగ్రహించు స్వామి. మమ్ము, మా కుటుంబాన్ని సర్వదా కాపాడు బాబా. నాకున్న రెండు కోరికలు నెరవేరితే ఆ అనుభవాలను కూడా పంచుకుంటాను".

బాబా ప్రసాదమైన చిన్న అనుభవాలు

నా పేరు అభి. ముందుగా సాయిబంధువులందరికీ మరియు ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నేను 6వ తరగతి చదవుతున్నప్పటినుంచి సాయిబాబా భక్తురాలిని. నాకు పెళ్ళైన తరువాత నా భర్త ముస్లిం కావడం వల్ల బాబాను పూజించడానికి సాధ్యపడలేదు. ఈమధ్య మాకు చాలా కష్టాలు వచ్చినప్పుడు మా ఫ్రెండ్ అయిన రమేష్ అన్న ప్రతిరోజూ బాబాని తలచుకోమని చెప్పారు. ఆయన ప్రతిరోజూ వాట్సప్‍లో సాయిభక్తుల అనుభవాలు పంపుతుంటే చదువుతున్నాను. ఇక నా అనుభవాల విషయానికి వస్తే... నేను టైలరింగ్ చేస్తాను. ఒకసారి ఒకామె బ్లౌజులు గురించి గొడవపడి వేరే వాళ్ళని నాకు బ్లౌజులు ఇవ్వకుండా చేయసాగింది. అప్పుడు నేను బాబాను తలచుకున్నాను. ఆయన దయవల్ల ఆమె మళ్లీ నాకు బ్లౌజులు ఇవ్వడం మొదలుపెట్టింది.

నాకు ముగ్గురు ఆడపిల్లలు. వాళ్ళలో ఇద్దరికీ ఫ్రీ సీటు రావాలని బాబాను కోరుకున్నాను. ఆయన దయతో నేను కోరుకున్నట్లే నా ఇద్దరు కూతుళ్లకి 6వ తరగతి ఫ్రీ సీటు వచ్చేలా అనుగ్రహించారు.

ఒకరోజు నేను బాబా సమాధి చెందిన తరువాత వారిని ఎక్కడ సమాధి చేయాలన్న విషయం గురించి చదువుతున్నప్పుడు ఇంకా కొంచం ఉందనగా నేను నిద్రపోయాను. అప్పుడు ఎవరో నన్ను కర్రతో తట్టి లేపినట్టు అనిపించి కళ్ళు తెరవగానే బాబా కనిపించారు. ఆయనే తమ చేతిలో ఉన్న కర్రతో నన్ను తట్టి లేపారని అర్థమైంది. ఆయన, "నువ్వు పూర్తిగా చదువు" అని చెప్పి మరుక్షణంలో అదృశ్యమయ్యారు. అది నా జీవితంలో మరిచిపోలేని అనుభవం. ఇలా చాలా అంటే చాలా అనుభవాలు నాకు ఉన్నాయి. "బాబా! మీకు చాలా చాలా కృతజ్ఞతలు. నా తప్పులు ఏవైనా ఉంటే క్షమించండి బాబా".

బాబా ఊదీ మహిమ

బాబాకి మరియు బాబా బిడ్డలందరికీ నా నమస్కారం. నా పేరు దేవి. నాకు బాబా అంటే ప్రాణం. 1983లో శిరిడీ దర్శనంతో మానాన్నగారు ఇచ్చిన నా జీవితంలోనే ఉత్తమమైన కానుక బాబా పరిచయం. అప్పటినుంచి ఈరోజు వరకు బాబానే నా సర్వస్వం. నాకు, నాకూతురికి మూగ జీవులన్నా, ముఖ్యంగా గాయపడిన జంతువులన్నా చాలా చాలా జాలి. అయితే కేవలం జాలిపడితే సరిపోదు కదా! బాబా భక్తులుగా చేతనైన సహయం చేసి వాటి బాధను తీర్చాలి. రాత్రివేళల్లో మా ఇంటికి చాలా పిల్లులు, కుక్కలు అన్నం తినడానికి వస్తాయి. వాటిలో ఒక కుక్కకి బాగా దెబ్బ తగిలి పైచర్మం ఊడిపోయి లోపల మాంసం బయటకు వచ్చి చీముకారడమేకాక వాసన రాసాగింది. దాన్ని వెటర్నరీ డాక్టరు దగ్గరకు తీసుకుపోదామంటే మావల్ల కాలేదు. దాని బాధ చూడలేక, ఏం చేయడానికి నాకు తోచక అది తినే అన్నంలో బాబా ఊదీ కలిపి రోజూ దాని బాధను తీర్చమని బాబాను అడిగేదానిని. అంతే మూడు వారాలలో దానికైన గాయం నెమ్మదిగా మానిపోయింది. ఇదంతా మన బాబా ఊదీ మహిమ. ఆయన మహిమకు నిదర్శనమైన ఈ క్రింద ఫోటోలు చూడండి.


సాయిభక్తుల అనుభవమాలిక 1021వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఎంతో జాగ్రత్తగా చూసుకునే సాయితండ్రి
2. కష్టం చెప్పుకుంటే బాబా తప్పక నిదర్శనం చూపిస్తారు

ఎంతో జాగ్రత్తగా చూసుకునే సాయితండ్రి


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సమర్థ సద్గురు శ్రీసాయినాథాయ నమః!!!


నా పేరు మల్లీశ్వరి. మనందరినీ అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీసాయినాథునికి ఎన్ని పాదాభివందనాలు చేసినా, ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. బాబా మనకు ప్రసాదించిన అనుభవాలను ఎన్ని పంచుకున్నా ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. మా శిరిడీయాత్ర గురించి మీతో పంచుకుంటానని ఇంతకుముందు చెప్పాను. ఆ అనుభవాన్ని ఇప్పుడు పంచుకుంటాను. మా కోసం ట్రైన్ స్లో అయిందని ఇంతకుముందు అనుభవంలో చెప్పాను కదా. తరువాత బాబా దయవల్ల అందరం క్షేమంగా శిరిడీ చేరుకున్నాము. ఈ కరోనా సమయంలో ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఆ సాయితండ్రిని మూడు రోజులు (13, 14, 15 తేదీలలో) కన్నులారా దర్శించుకున్నాము. శిరిడీ బయలుదేరేముందు మా పాప, “నాకు ఇది నెలసరి వచ్చే సమయం, అందుకే నేను శిరిడీ రాను” అంది. “నెలసరి వస్తే రూంలోనే ఉండు” అని చెప్పి తనను మాతో శిరిడీ తీసుకుని వెళ్ళాము. దయామయుడైన సాయినాథుని దయవల్ల మా పాప రెండు రోజులు ఎంతో సంతోషంగా బాబాను దర్శించుకుంది. మేము నాసిక్, శనిసింగణాపూర్ కూడా వెళ్ళాము. శనిసింగణాపూర్ వెళ్ళేటప్పుడు మా అల్లుడు శిరిడీలో పుట్టినరోజు జరుపుకోవాలని భావించి ఒక షాపులో కేక్ తీసుకున్నారు. కానీ, దాన్ని అక్కడే షాపులో పెట్టి మర్చిపోయారు. కారులో కూర్చున్న తరువాత ఆ కేక్ సంగతి గుర్తుకొచ్చింది. మన సాయితండ్రి మనతో ఉంటే మనకు చిన్నవి, పెద్దవి అని తేడాలేదు, అన్నీ బాబాకు చెప్పుకుంటాము. నేను మనసులోనే బాబాను స్మరించుకుని, “సాయినాథా, ఆ కేక్ అక్కడే ఉండేలా చేయి నాయనా” అని అనుకున్నాను. బాబా దయవల్ల అక్కడ షాపులోవాళ్ళు ఆ కేక్‌ని తీసి జాగ్రత్తగా ఫ్రిజ్‌లో పెట్టారు. ఎంత జాగ్రత్తో చూడండి. ఎవరైనా మర్చిపోతారేమోగానీ కరుణామయుడైన మన బాబా మాత్రం మర్చిపోరు. 


ఇకపోతే, బాబా మమ్మల్ని ఎంత జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చారో చెప్తాను. మేము కర్ణాటకలో ఉంటాము. మావాళ్ళేమో హైదరాబాదులో దిగాలి. మేము హైదరాబాదులో దిగి ఇంటికి రావాలంటే సాయంత్రం అవుతుందని అన్నారు. అటు వెళ్ళి రావడం అంటే చాలా ఆలస్యమైపోతుంది, పిల్లలకి ఇబ్బంది అవుతుందని అనుకున్నాం. కానీ, మన బాబా వేరే దారి చూపించి మమ్మల్ని అతి తొందరగా (5 గంటల లోపే) ఇంటికి చేర్చారు. మనల్ని మన గమ్యానికి చేర్చే ప్రయత్నంలో మనకు తెలియని దారులు కూడా బాబా తెలియజేస్తారు. అన్ని సమస్యలనూ దూదిపింజలా తీసిపారేసే మన సాయితండ్రి మనకు అండగా ఉండగా మనకు భయమెందుకు? 


ఇకపోతే, మా పాప అమెరికా నుండి వచ్చిందని ఇంతకుముందు అనుభవంలో చెప్పాను కదా. ఈ కరోనా సమయంలో తను తిరిగి అమెరికా ఎలా వెళుతుందోనని మేము కంగారుపడ్డాము. కానీ, అందరినీ చల్లగా చూసే మన బాబా ఉండగా మనకు భయమెందుకు? బాబా దయవల్ల మా పాప ఎంతో తేలికగా, ఏ టెస్టులూ లేకుండా 2021, మార్చి 12వ తేదీన క్షేమంగా అమెరికా చేరుకుంది. నిరంతరం మనల్నే గమనిస్తూ, ఈ సాయి మహారాజ్ సన్నిధి బ్లాగ్ ద్వారా మన ఇబ్బందులను దూరం చేస్తూ, మన కంటికి కనిపించకుండా మనందరినీ జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుతున్న మన సాయినాథునికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. 


సాయిబాబా గురించి నాకు తెలియకముందే ఆ సాయితండ్రి మా ఇంటికి వచ్చారు. ఇప్పుడు ఏ సమస్య వచ్చినా, ‘బాబా నా సమస్యకు ఏం సమాధానం చెప్తారా?’ అని నేను ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగ్ ఓపెన్ చేసి చూస్తాను. ఏ పని చేసినా ఆ తండ్రిని అడిగే చేస్తాను. ఏమి చేస్తున్నా ఎప్పుడూ ‘సాయి, సాయి’ అని అనుకుంటూనే ఉంటాను. ఎవరికి ఏ సమస్య వచ్చినా బాబా ఊదీనే మందు. ఒకరోజు మా ఇంట్లో టీవీ రాలేదు. దాంతో మావారు దానిని రిపేరుకు తీసుకువెళ్లారు. టీవీని పరిశీలించిన షాపువాళ్ళు, ‘ఇది పాతదయింది, వేరే టీవీ తీసుకోండి’ అన్నారు. టీవీ పనిచేయకపోవటంతో మా పాప, “ఇంట్లో టీవీ ఏమో రావటం లేదు, క్రొత్త టీవీ తీసుకురావటం లేదు” అంది. నేను వెంటనే బాబా ఊదీ తీసుకెళ్ళి టీవీకి పెట్టాను. తరువాత రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నేను చేస్తున్నదంతా చూస్తున్న మా పాప, ‘ఏంటమ్మా, ఏం చేస్తున్నావు?’ అని అడిగింది. ‘టీవీ పనిచేస్తుందేమోనని చూస్తున్నాను’ అని చెప్పాను. ఇంతలో, అంతకుముందు ఏమీ రాని టీవీలో వెంటనే సెట్టింగ్స్ స్క్రీన్ వచ్చింది. అది చూసి మా పాప, ‘నేను చూస్తాలేమ్మా’ అని రిమోట్ తీసుకుంది. బాబా దయవల్ల వెంటనే టీవీ పనిచేయటం ప్రారంభించింది. 


చెప్పుకుంటూపోతే ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి, కానీ అన్నీ రాయలేము కదా. “బాబా, ఇంకేమైనా మర్చిపోతే నన్ను క్షమించు తండ్రీ. తప్పులు చాలా ఉంటాయి తండ్రీ, క్షమించు నాయనా”. ఇకపోతే, మా పిల్లలకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నాము. మన సాయితండ్రి దయవలన వారి వివాహాలు సునాయాసంగా జరిగిపోతే ఆ అనుభవాలను కూడా మీతో పంచుకుంటాను. నా అనుభవాలను చదివిన అందరికీ ధన్యవాదాలు. 


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక సమర్థ సద్గురు సాయినాథాయ నమః!!!

ఓం శాంతి.. ఓం శాంతి...


కష్టం చెప్పుకుంటే బాబా తప్పక నిదర్శనం చూపిస్తారు


శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


నేను ఒక సాయిభక్తుడిని. బాబా నా జీవితంలో ఒక భాగం. నాకు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా మొదట నేను చెప్పుకునేది బాబాకే. బాబా నాకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తూ నన్ను అనేక ఇబ్బందుల నుండి కాపాడుతూ ఉన్నారు. ఇటీవల జరిగిన ఒక అనుభవం గురించి నేను ఇప్పుడు మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఈమధ్య పది సంవత్సరాల మా అమ్మాయికి శరీరమంతా పెద్దపెద్ద దద్దుర్లు వచ్చి విపరీతమైన దురదతో చాలా బాధపడింది. తను అలా ఇబ్బందిపడుతుంటే మాకు చాలా కష్టంగా అనిపించేది. రాత్రుళ్ళు మా అందరికీ నిద్ర ఉండేది కాదు. ఆ దద్దుర్లు వస్తే, ఎన్ని మందులు వాడినా కనీసం పదిరోజులు ఇబ్బంది పెడుతుంది. కానీ ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు నాకు మొదట గుర్తుకు వచ్చేది బాబానే. నేను ఆయనతో, "మా అమ్మాయికి వచ్చిన ఈ దద్దుర్లు తగ్గి తనకి ఉపశమనం కలిగినట్లయితే నా అనుభవాన్ని పంచుకుంటాన"ని మొక్కుకున్నాను. తరువాత నేను మా పాపకు డాక్టరు ఇచ్చిన మందులతోపాటు బాబా ఊదీ రాస్తూ ఉండసాగాను. ఆశ్చర్యంగా పదిరోజులైనా ఇబ్బందిపెట్టే ఆ ఎలర్జీ ఐదురోజుల్లోనే పూర్తిగా తగ్గిపోయింది. దాంతో మాకు ఎంతో ఉపశమనంగా అనిపించింది. మేము ఎల్లప్పుడూ బాబాకు కృతజ్ఞులమై ఉంటాము. బాబాతో నా కష్టం ఇది అని చెప్పుకుని మన ప్రయత్నం మనం చేస్తే, ఆయన మనకు తప్పక నిదర్శనం చూపిస్తారు.



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo