1. బాబాను మనసారా కోరుకుంటే జరగనిదేముంటుంది?2. కేవలం ఆ సాయినాథుని అనుగ్రహం
బాబాను మనసారా కోరుకుంటే జరగనిదేముంటుంది?
ఓం శ్రీసాయినాథాయ నమః!!! నేను ఒక సామాన్య సాయిభక్తుడిని. నా పేరు గంగాధర్. బాబా నా జీవితంలోకి చాలా సంవత్సరాల క్రితం వచ్చారు. అప్పటినుండి ఆయన లీలలు నాకు తరచూ అనుభవమవుతూ ఉన్నాయి. 2024, మార్చి నెలలో ఒకరోజు మా పాపకి తీవ్రమైన జ్వరమొచ్చి, నిరంతరాయంగా వాంతులయ్యాయి. అదే సమయంలో నాకు ఎన్నడూ లేనంతగా డబ్బు విషయంలో చాలా ఇబ్బంది ఏర్పడింది. ఒక్క రూపాయి కూడా నా దగ్గర లేదు. నా భార్య దగ్గర ఉండాల్సిన డబ్బు కూడా కొద్దిరోజుల ముందు పిల్లల స్కూల్ ఫీజు కోసం ఇచ్చేసింది. అందుచేత తన దగ్గర కూడా ఏమీ లేని పరిస్థితి. చాలామంది స్నేహితులని అడిగినప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి లేవని సమాధానం వచ్చింది. ఇంకా నాకు ఏమి చేయాలో అర్ధంకాక బాబా మీద భారమేసి ఆయన నామస్మరణ చేస్తూ డబ్బుకోసం ప్రయత్నం సాగించాను. కానీ సాయంత్రమవుతున్నా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. దానికి కారణం నేనే. ఎందుకిలా అంటున్నానంటే, నేను అంతకుముందు అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి నా స్నేహితులకు సరైన సమయానికి ఇవ్వలేకపోయాను. అందువల్ల నేను కూడా అంత చనువుగా వాళ్ళని మళ్ళీ అడగలేకపోయాను. ఇకపోతే, నేను ఇంటికొచ్చి చూసేసరికి పాప ఆరోగ్యం నేను ఉదయం ఇంటి నుండి వెళ్ళేటప్పుడు ఎలా ఉందో ఇంచుమించు అలానే ఉంది. ఏ మార్పూ లేదు. అప్పుడు డాక్టరైనా నా భార్య సిస్టర్‌కి ఫోన్ చేసి పాప లక్షణాలు చెప్పాము. ఆమె, "బహుశా పాపకి ప్లేట్లెట్లు పడిపోయాయేమో, తనని వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లండి" అని సలహా ఇచ్చారు. అప్పటికి రాత్రి 9 అవ్వడంతో నా భార్య టెన్షన్ పడసాగింది. నా దగ్గర డబ్బు లేదని చెపితే నా భార్య తన అక్కవాళ్ళని అడిగైనా డబ్బు ఏర్పాటు చేస్తుంది. కానీ నేను ఆ మాట చెప్పలేకపోయాను. ఎందుకంటే, నేను డబ్బులు విషయంలో కొన్ని పొరపాట్లు చేశాను. అవి చెప్తే, అనవసరంగా ఇంట్లో గొడవలవుతాయమోనని నాకు భయమేసింది. ఇలాంటి పరిస్థితిల్లో నాకున్న ఏకైక దిక్కు బాబా. అందువల్ల నేను పూజగదిలో ఏడుస్తూ, "బాబా! ఉదయానికల్లా నా కూతురికి నయమై తను స్కూలుకి వెళ్లగలిగేలా అనుగ్రహించండి" అని బాబాను ప్రార్థించాను. తర్వాత నేను చేసిన తప్పుడు నిర్ణయాల వలన డబ్బు విషయంగా ఇంత ఇబ్బందిపడాల్సి వచ్చిందని ఆలోచిస్తూ ఆ రాత్రి చాలాసేపటివరకు నిద్రపోలేదు. నా మీద నాకు ఎప్పుడు లేనంత అసహ్యం వేసింది. ఆ ఆలోచనలతో బాబాని నేను చేసిన తప్పుల్ని మన్నించమని అడిగి, బాబా భక్తుల అనుభవాలు చదువుతూ ఏ సమయానికో నిద్రపోయాను. బాబా మా జీవితంలో గొప్ప అద్భుతం చేసారు. మరుసటిరోజు ఉదయం నేను నిద్ర లేవకముందే మా పాప నిద్రలేచి నా దగ్గరకొచ్చి, "నాన్నా! లే, నేను స్కూలుకి వెళ్ళాలి" అని నన్ను లేపుతుంటే, నేను ఆశర్యపోతూ లేచాను. చూస్తే, పాపకి పూర్తిగా నయమైంది. నేను ఆనందంతో, "బాబా! మీకు శతకోటి నమస్కారాలు" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను.
ఓం శ్రీసాయి రక్షక శరణం దేవా!!!
కేవలం ఆ సాయినాథుని అనుగ్రహం
సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు ఆశదీప్తి. మా బాబుకి 2024, మార్చి నెలలో ఫైనల్ ఎగ్జామ్స్ జరిగాయి. నేను, "బాబు పరీక్షల సమయానికి ఆఫీసులో నాకు సెలవు దొరికేలా అనుగ్రహించండి" అని సాయిని వేడుకున్నాను. సాయి దయవల్ల నాకు సెలవు దొరికింది. నేను బాబుతో పాటు ఉండి వాడిచేత పరీక్షలన్నిటికీ బాగా ప్రిపేర్ చేయించాను. తను పరీక్షలు చక్కగా వ్రాసాడు. మార్కులు కూడా బాగానే వచ్చాయి. ఇదంతా కేవలం నా సాయినాథుని అనుగ్రహం. ఎందుకిలా అంటున్నానంటే, మామూలుగా మా బాబు ఎప్పుడూ పెద్దగా శ్రద్ధ పెట్టి చదవడు. అలాంటిది ఫైనల్ ఎగ్జామ్స్‌కి మాత్రం మొత్తం సిలబస్ రోజున్నరలో పూర్తిచేసి పరీక్షలో చకచకా వ్రాసి మొత్తం అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాసాడు.
నేను నా ఆఫీసులో ఒక ఫీచర్ డెవలప్ చేశాను. అందుకు సంబంధించి మొత్తం పని అంతా పూర్తి చేసి ఇక టెస్టింగ్ మొదలుపెడదామనుకునే సమయానికి అనుకోకుండా నా కోడ్‌లో ఒక సమస్య వచ్చింది. అది ఎలా సరి చేయాలో ఎంత ప్రయత్నించినా నాకు అర్థం కాలేదు. దాంతో నా తోటి ఉద్యోగస్తులను ఆ సమస్యకు పరిష్కారం అడిగాను. వాళ్ళు కోడ్ చెక్ చేసి, "అంతా సరిగానే ఉంది. సమస్య ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు" అని చెప్పారు. ఇక ఈ క్లిష్టమైన సమస్యను పరిష్కరించగలిగేది ఆ సాయినాథుడే అని నమ్మి ఆయన్ని శరణువేడాను. అప్పుడు ఆ సాయినాథుని దయవల్ల నాకు ఒక ఆలోచన వచ్చి ఆ విధంగా చేస్తే, వెంటనే సమస్య పరిష్కారమే కోడ్ పని చేసింది. తోటి ఉద్యోగస్తులు, "నీకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది?" అని చాలా ఆశ్చర్యపోయారు. అంతా కేవలం ఆ సాయినాథుని దయ. "సాయిదేవా! ఎప్పుడూ మా వెన్నంటే ఉండి మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపించండి తండ్రి".
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!








