సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1832వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబాను మనసారా కోరుకుంటే జరగనిదేముంటుంది?
2. కేవలం ఆ సాయినాథుని అనుగ్రహం

బాబాను మనసారా కోరుకుంటే జరగనిదేముంటుంది?

ఓం శ్రీసాయినాథాయ నమః!!! నేను ఒక సామాన్య సాయిభక్తుడిని. నా పేరు గంగాధర్. బాబా నా జీవితంలోకి చాలా సంవత్సరాల క్రితం వచ్చారు. అప్పటినుండి ఆయన లీలలు నాకు తరచూ అనుభవమవుతూ ఉన్నాయి. 2024, మార్చి నెలలో ఒకరోజు మా పాపకి తీవ్రమైన జ్వరమొచ్చి, నిరంతరాయంగా వాంతులయ్యాయి. అదే సమయంలో నాకు ఎన్నడూ లేనంతగా డబ్బు విషయంలో చాలా ఇబ్బంది ఏర్పడింది. ఒక్క రూపాయి కూడా నా దగ్గర లేదు. నా భార్య దగ్గర ఉండాల్సిన డబ్బు కూడా కొద్దిరోజుల ముందు పిల్లల స్కూల్ ఫీజు కోసం ఇచ్చేసింది. అందుచేత తన దగ్గర కూడా ఏమీ లేని పరిస్థితి. చాలామంది స్నేహితులని అడిగినప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి లేవని సమాధానం వచ్చింది. ఇంకా నాకు ఏమి చేయాలో అర్ధంకాక బాబా మీద భారమేసి ఆయన నామస్మరణ చేస్తూ డబ్బుకోసం ప్రయత్నం సాగించాను. కానీ సాయంత్రమవుతున్నా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. దానికి కారణం నేనే. ఎందుకిలా అంటున్నానంటే, నేను అంతకుముందు అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి నా స్నేహితులకు సరైన సమయానికి ఇవ్వలేకపోయాను. అందువల్ల నేను కూడా అంత చనువుగా వాళ్ళని మళ్ళీ అడగలేకపోయాను. ఇకపోతే, నేను ఇంటికొచ్చి చూసేసరికి పాప ఆరోగ్యం నేను ఉదయం ఇంటి నుండి వెళ్ళేటప్పుడు ఎలా ఉందో ఇంచుమించు అలానే ఉంది. ఏ మార్పూ లేదు. అప్పుడు డాక్టరైనా నా భార్య సిస్టర్‌కి ఫోన్ చేసి పాప లక్షణాలు చెప్పాము. ఆమె, "బహుశా పాపకి ప్లేట్లెట్లు పడిపోయాయేమో, తనని వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లండి" అని సలహా ఇచ్చారు. అప్పటికి రాత్రి 9 అవ్వడంతో  నా భార్య టెన్షన్ పడసాగింది. నా దగ్గర డబ్బు లేదని చెపితే నా భార్య తన అక్కవాళ్ళని అడిగైనా డబ్బు ఏర్పాటు చేస్తుంది. కానీ నేను ఆ మాట చెప్పలేకపోయాను. ఎందుకంటే, నేను డబ్బులు విషయంలో కొన్ని పొరపాట్లు చేశాను. అవి చెప్తే, అనవసరంగా ఇంట్లో గొడవలవుతాయమోనని నాకు భయమేసింది. ఇలాంటి పరిస్థితిల్లో నాకున్న ఏకైక దిక్కు బాబా. అందువల్ల నేను పూజగదిలో ఏడుస్తూ, "బాబా! ఉదయానికల్లా నా కూతురికి నయమై తను స్కూలుకి వెళ్లగలిగేలా అనుగ్రహించండి" అని బాబాను ప్రార్థించాను. తర్వాత నేను చేసిన తప్పుడు నిర్ణయాల వలన డబ్బు విషయంగా ఇంత ఇబ్బందిపడాల్సి వచ్చిందని ఆలోచిస్తూ ఆ రాత్రి చాలాసేపటివరకు నిద్రపోలేదు. నా మీద నాకు ఎప్పుడు లేనంత అసహ్యం వేసింది. ఆ ఆలోచనలతో బాబాని నేను చేసిన తప్పుల్ని మన్నించమని అడిగి, బాబా భక్తుల అనుభవాలు చదువుతూ ఏ సమయానికో నిద్రపోయాను. బాబా మా జీవితంలో గొప్ప అద్భుతం చేసారు. మరుసటిరోజు ఉదయం నేను నిద్ర లేవకముందే మా పాప నిద్రలేచి నా దగ్గరకొచ్చి, "నాన్నా! లే, నేను స్కూలుకి వెళ్ళాలి" అని నన్ను లేపుతుంటే, నేను ఆశర్యపోతూ లేచాను. చూస్తే, పాపకి పూర్తిగా నయమైంది. నేను ఆనందంతో, "బాబా! మీకు శతకోటి నమస్కారాలు" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను.

ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః!!
ఓం శ్రీసాయి రక్షక శరణం దేవా!!!

కేవలం ఆ సాయినాథుని అనుగ్రహం

సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు ఆశదీప్తి. మా బాబుకి 2024, మార్చి నెలలో ఫైనల్ ఎగ్జామ్స్ జరిగాయి. నేను, "బాబు పరీక్షల సమయానికి ఆఫీసులో నాకు సెలవు దొరికేలా అనుగ్రహించండి" అని సాయిని వేడుకున్నాను. సాయి దయవల్ల నాకు సెలవు దొరికింది. నేను బాబుతో పాటు ఉండి వాడిచేత పరీక్షలన్నిటికీ బాగా ప్రిపేర్ చేయించాను. తను పరీక్షలు చక్కగా వ్రాసాడు. మార్కులు కూడా బాగానే వచ్చాయి. ఇదంతా కేవలం నా సాయినాథుని అనుగ్రహం. ఎందుకిలా అంటున్నానంటే, మామూలుగా మా బాబు ఎప్పుడూ పెద్దగా శ్రద్ధ పెట్టి చదవడు. అలాంటిది ఫైనల్ ఎగ్జామ్స్‌కి మాత్రం మొత్తం సిలబస్ రోజున్నరలో పూర్తిచేసి పరీక్షలో చకచకా వ్రాసి మొత్తం అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాసాడు.


నేను నా ఆఫీసులో ఒక ఫీచర్ డెవలప్ చేశాను. అందుకు సంబంధించి మొత్తం పని అంతా పూర్తి చేసి ఇక టెస్టింగ్ మొదలుపెడదామనుకునే సమయానికి అనుకోకుండా నా కోడ్‌లో ఒక సమస్య వచ్చింది. అది ఎలా సరి చేయాలో ఎంత ప్రయత్నించినా నాకు అర్థం కాలేదు. దాంతో నా తోటి ఉద్యోగస్తులను ఆ సమస్యకు పరిష్కారం అడిగాను. వాళ్ళు కోడ్ చెక్ చేసి, "అంతా సరిగానే ఉంది. సమస్య ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు" అని చెప్పారు. ఇక ఈ క్లిష్టమైన సమస్యను పరిష్కరించగలిగేది ఆ సాయినాథుడే అని నమ్మి ఆయన్ని శరణువేడాను. అప్పుడు ఆ సాయినాథుని దయవల్ల నాకు ఒక ఆలోచన వచ్చి ఆ విధంగా చేస్తే, వెంటనే సమస్య పరిష్కారమే కోడ్ పని చేసింది. తోటి ఉద్యోగస్తులు, "నీకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది?" అని చాలా ఆశ్చర్యపోయారు. అంతా కేవలం ఆ సాయినాథుని దయ. "సాయిదేవా! ఎప్పుడూ మా వెన్నంటే ఉండి మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపించండి తండ్రి". 


సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1831వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శిరిడీయత్రానుభవం

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! నాపేరు రాధ. శ్రీ సచ్ఛిదానంద సమర్థ సద్గురుని నాకు పరిచయం చేసినందుకు ఈ అనంత విశ్వానికి ముందుగా మనఃస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా జీవితంలో నేను తెలిసీతెలియక ఎన్నో తప్పులు చేసాను. నా తప్పులన్నింటిని సాయినాథుని పాదాల ముందు నేను ఒప్పుకుంటున్నాను. నా తప్పులను మన్నించమని ఆ తండ్రి పాదాలపై నా శిరస్సునుంచి ప్రాధేయపడుతున్నాను. నా కుటుంబంలో ఇప్పటివరకు నన్ను, నా భర్త, పిల్లల్ని ఎన్నోసార్లు, ఎన్నో విధాలుగా నా సాయి ఆపదల నుంచి రక్షించినందుకు నా సాయికి కోటానుకోట్ల సార్లు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పటికీ అనుక్షణం నన్ను కంటికి రెప్పలా కాపాడుతూ నా సమస్యలన్నింటినీ తన సమస్యల్లా మోస్తున్న నా సాయితండ్రిని మనఃస్పూర్తిగా ప్రేమిస్తున్నాను. మన బంధం ఇలాగే నా జీవితాంతం వుండేలా చూడు అని ఆ సాయితండ్రికి ప్రాధేయపడుతున్నాను. 

2024, మార్చిలో హఠాత్తుగా నాకు నా భర్తతో కలిసి శిరిడీ వెళ్ళాలనిపించింది. కానీ నా భర్త నాస్తికులు. అందువల్ల ఆయన ఒప్పుకుంటారో, లేదోనని సందేహిస్తూ సాయిని, "తండ్రీ! మీ దర్శనం చేసుకోవాలని వుంది. శిరిడీ రమ్మంటారా?" అని బాబాను అడిగాను. అప్పుడు బాబా శిరిడీ రమ్మని అనుమతి ఇచ్చారు. ఆయన దయవల్ల నా భర్త అడిగిన వెంటనే నాతో రావటానికి ఒప్పుకున్నారు. అయితే ముందుగా అనుకోని ప్రయాణం వల్ల ట్రైన్ టిక్కెట్లు వెయిటింగ్ లిస్టులో దొరికాయి. సాయి మీద భారమేసి ప్రయాణ ప్రయత్నాలు మొదలుపెట్టాము. సాయి అనుగ్రహంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుకున్న సమయానికి శిరిడీ చేరుకున్నాము. ముందుగా రిజర్వ్ చేసుకోకపోయినా గుడికి 5 నిముషాల దూరంలో మాకు హోటల్ రూమ్ దొరికింది. స్నానాలు చేసి సాయి దర్శనానికి బయలుదేరాం. ఆ తండ్రి సన్నిధికి వెళుతుంటే అవధులు లేని ఆనందంతో నా కళ్ళు నీళ్లతో నిండిపోసాగాయి. నా తనివితీరా సాయినాథుని దర్శనం నాకు అయ్యింది. నా భర్త మొదటిసారి సాయిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఎలా అనిపించిందని మావారిని అడిగితే, "ఆయన(సాయి) నన్నేచూస్తున్నారనిపించింది. మనసు ప్రశాంతంగా వుంది" అన్నారు. అది విని నాకు చాలా సంతోషమేసింది. నేను సాయంత్రం హారతి చూడాలనుకున్నాను కానీ, కౌంటరులో అడిగితే, "టికెట్ల్ ఆన్‌లైన్‌‌లోనే అందుబాటులో వుంటాయ"ని చెప్పారు. అది విని, "నాకు హారతి చూసే ప్రాప్తం వుంటే ఆ భాగ్యాన్ని ప్రసాదించమ"ని బాబాను వేడుకున్నాను. అంతలో కౌంటరులో ఉన్న అతను, "మీరు ఎక్కడ నుండి వచ్చారు?" అని నన్ను అడిగాడు. నేను ఫలానా చోటని చెప్పి, "హారతి టికెట్ దొరికే అవకాశం ఏమైనా ఉందా?" అని అతన్ని మళ్ళీ అడిగాను. అందుకతను, "NRI కోటాలో అయితే ఇప్పటికిప్పుడే దొరికే అవకాశం వుంటుందిగాని, మాములుగా కుదరదు" అని అన్నారు. అప్పుడు నేను, "నేనూ NRIని" అని చెప్పాను. అతను, "మీ పాస్పోర్ట్ చూపించండి" అని అన్నారు. నేను, "దాన్ని ఇంట్లో వుంచి, ఆధార్ కార్డ్ తెచ్చాన"ని చెప్పాను. అతను, "అలా కుదరదు. పాసుపోర్టు ఉండాల్సిందే" అని చెప్పారు. నేను నిరాశగా నాకు బాబా హారతి చూసే యోగం లేదనుకున్నాను. ఇంతలో అతను, "మీ ఫోన్‌లో మీ పాస్పోర్ట్ కాపీ చూపగలరా?" అని అడిగారు. వెంటనే నేను చూపించాను. అప్పుడు అతను, "టికెట్ ఇస్తాను. ఇంకో అరగంటలో 6 గంటల హారతి వుంది. వెళతారా?" అని అడిగారు. నేను సంతోషంగా సరేనన్నాను. అతను టికెట్ ప్రింట్ తీస్తున్న సమయంలో, "10 గంటల హారతి కూడా చూడాలని వుంది. ఆ టికెట్ కూడా యివ్వగలరా?" అని అడిగాను. అతను నవ్వి రెండు హారతుల టికెట్లు నా చేతిలో పెట్టారు. బాబానే ఆ విధంగా నాకు తమ హారతి చూసే అవకాశం యిచ్చారు. ఆయనకు శతకోటి నమస్కారాలు తెలియజేసుకుని సంతోషంగా సంధ్యహారతి, శేజారతి అతి దగ్గరగా చూసాను. బాబా దయవల్ల తప్ప మరే విధంగానూ యిది సాధ్యమయ్యేది కాదు.

నేను నా భర్తకు ద్వారకామాయి చూపించాలనుకున్నాను. ఇద్దరమూ అక్కడకి వెళ్ళాక అక్కడ సెక్యూరిటీవాళ్ళు నా భర్త వద్ద సెల్ ఫోన్ ఉన్న కారణంగా లోపలకి వెళ్ళటం కుదరదన్నారు. ఆ సమయంలో ఒక అర్జంట్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న నా భర్త 'నన్ను ఒక్కదాన్నే వెళ్ళిరమ్మని, నేను వచ్చేవరకు తను బయట వేచి ఉంటానని, కావలసినంత సమయం ద్వారకామాయిలో నన్ను వుండమని' అన్నారు. కానీ తను కూడా నాతో వస్తే బాగుంటుందని నా మనసులోని కోరిక. ఆ విషయం సాయికి చెప్పుకున్నాను. అంతలో నాకు, నా భర్తకి మధ్య జరుగుతున్న సంభాషణ అంతా వింటున్న సెక్యూరిటీ  ఏమనుకున్నారో ఏమోగానీ, ఫోన్ ఫాంట్ జేబులో పెట్టుకొని, దాన్ని బయటకు తీయవద్దని మా వద్ద మాట తీసుకుని మా ఇద్దరినీ లోపలకు పంపించారు. నేను అడిగిన వెంటనే నా కోరికను సెక్యూరిటీ రూపంలో నా సాయినాథుడే తీర్చారని మనసారా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఇలా అడుగడుగునా నా కోరికలు మన్నిస్తూ నా శిరిడీ ప్రయాణం, దర్శనం అన్నీ బాబా దగ్గరుండి చేయించారు. అందుకాయనకు ఈ బ్లాగులోని 'సాయిభక్తుల అనుభవమాలిక' ద్వారా కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రోజురోజుకు మాకు మీ పాదాలయందు అచంచలమైన భక్తివిశ్వాసాలు పెంపొందేలా మమ్మల్ని దీవించండి అని వేడుకొంటున్నాను. "సాయిదేవా! నీ తోడులేక నేను శూన్యం తండ్రీ. నాపై దయవుంచి నన్ను నీనుండి ఎప్పటికీ దూరం చేయకు సాయితండ్రీ. నా మనోనేత్రంతో ప్రతిక్షణం నిన్ను చూసుకునే అదృష్టాన్ని నాకు ప్రసాదించు సాయీ".

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1830వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • అటు తిప్పి, ఇటు తిప్పి చివరికి మధుర జ్ఞాపకంగా శ్రీసాయి ఇచ్చిన ఆశీర్వాదం

శ్రీసాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు రాజేశ్వరి. మా కుటుంబమంతా సాయిబాబా మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. ఇలా చెప్తుంటే నాకు ఎంతో గర్వంగా, సంతోషంగా అనిపిస్తుంది. బాబా దయవల్ల మా పెద్దబ్బాయి మెడిసిన్ పూర్తి చేసి ఇంటర్న్షిప్ హోల్డ్‌లో పెట్టి ఒక ఎనిమిది నెలలు USMLE(United States Medical Licensing Examination) స్టెప్ 1కి ఇంట్లోనే చాలా కష్టపడి చదివాడు. తను 2024, ఫిబ్రవరి 14న పరీక్ష వ్రాసి, "పరీక్ష చాలా కష్టంగా ఉంద"ని చెప్పాడు. మేము మా అబ్బాయితో, "బాబా ఆజ్ఞతో, ఆయన ఇచ్చిన ప్రేరణతో నువ్వు ఈ చదువు చదువుతున్నావు, ఈ పరీక్ష వ్రాసావు. కాబట్టి అంతా బాబా చూసుకుంటారు. నువ్వు ఏమీ కంగారుపడకు" అని చెప్పాము. ఆ పరీక్ష ఫలితాలు రెండు నుండి నాలుగు వారాలు మధ్యలో వస్తాయనగా రెండు వారాలు తర్వాత మా అబ్బాయి చాలా కంగారుగా మా వారికి, నాకు ఫోన్ చేసి, "నాతోపాటు ఆరోజు ఆ పరీక్ష వ్రాసిన ఒక ఫ్రెండ్ రిజల్ట్ వచ్చింది. తను ఫెయిల్ అయ్యాడు. నా రిజల్ట్ రాలేదు. నాకు భయంగా ఉంది" అని చెప్పాడు. మాకు కూడా కొంచెం కంగారుగా అనిపించినప్పటికీ, "బాబా ఆజ్ఞతో అంతా జరుగుతుంది. కాబట్టి నువ్వు భయపడాల్సినవసరం లేదు" అని మా అబ్బాయితో చెప్పాము. తర్వాత రెండు వారాలు గడిచినా మా అబ్బాయి రిజల్ట్ వెబ్సైట్లో పెట్టలేదు. మేము, "బాబా ఏంటి మీ పరీక్ష? అసలు ఏం జరుగుతుంది? ఏది జరిగినా మీ ఇష్టం" అని ప్రార్థించసాగాము. ఐదో వారంలో మా అబ్బాయికి ఒక సీనియర్, "USMLE వెబ్సైట్ కాకుండా ఇంకో వెబ్సైట్ ఉంది. దానిలో చూడమ"ని చెప్పాడు(అప్పటివరకు ఇంకో వెబ్సైట్ ఉందని మాకు తెలియదు). దాంతో మా అబ్బాయి ఆ వెబ్సైటులో చూస్తే, 15 రోజులు క్రితమే మా అబ్బాయి పాస్ అయ్యాడని పెట్టుంది. కానీ అసలు వెబ్సైట్లో పెట్టలేదు. అలా మా అబ్బాయి పాస్ అయ్యాడని సంతోషపడాలో, ఒరిజినల్ వెబ్సైట్లో ఎందుకు పెట్టలేదని దుఃఖించాలో అర్థంకాని సందిగ్ధంలో బాబా మమ్మల్ని పెట్టారు. సరే, మేము USMLE వెబ్సైట్‌కి మెయిల్ పెడితే వాళ్ళు, 'మా అబ్బాయి మెడికల్ కాలేజీవాళ్ళు, తను మా స్టూడెంటేనని కన్ఫర్మేషన్ లెటర్ పంపలేదని, అందుకే రిజల్ట్ హోల్డ్ చేసాము’ అని రిప్లై ఇచ్చారు. అప్పుడు కాలేజీవాళ్ళని కనుక్కుంటే, "మాకు ఎటువంటి మెయిల్ రాలేద"ని అన్నారు. దాంతో మరల USMLE వెబ్సైట్‌కి, "మీరు ఏమీ పంపలేదని కాలేజీవాళ్ళు అన్నార"ని మెయిల్ పెడితే, "మేము మెయిల్ కాదు. 2023, డిసెంబర్ 1న పోస్టులో లెటర్ పంపాము. మావాడి ఫ్రెండ్స్ అందరికీ మెయిల్స్ పంపి, మా వాడికి మాత్రం లెటర్ పోస్ట్ చేయడం, అది కూడా పోస్టులో(ఈరోజుల్లో) పంపడం విచిత్రంగా అనిపించింది మాకు. చూడండి, బాబా చమత్కారాలు!

ఏదేమైనా 2024, మార్చి 20న మాకు ఆ విషయం తెలిసి, ‘డిసెంబర్ 1న పంపిన లెటర్ మూడు నెలల తర్వాత ఉంటుందా? వాళ్లేమో అది తిరిగి పంపితేగాని రిజల్ట్ ఇవ్వమన్నారు. ఇప్పుడు ఆ లెటర్ ఎక్కడ వెతకాలి? ఎవరిని అడగాలి?’ అని అనుకున్నాము. అయినా బాబా మీద భారమేసి మావారు హెడ్ పోస్ట్ ఆఫీసుకి వెళ్లారు. వాళ్ళు అక్కడ, ఇక్కడ అడగండి అని తిప్పాక ఆఖరికి ఒక పోస్ట్మాన్, "కాలేజీలో ఫలానా సెక్షన్‌లో అడగండి. కానీ మూడు నెలలుపైగా అవుతుంది. మీకు అదృష్టముంటే దొరుకుతుంద"ని చెప్పాడు. మా అబ్బాయి కాలేజీలోని సదరు సెక్షన్‌కి వెళ్లి అడిగితే, అక్కడున్న ఒక మహిళ, "దొరకడం కష్టం. అయినా ప్రయత్నిస్తాన"ని చెప్పింది. మా అబ్బాయి, 'వచ్చినప్పుడు పక్కన పడేశారు. ఇప్పుడు కష్టపడి వెతుకుతారా? మనం నమ్మాలా? అయినా ఇంకేం చేస్తాం?' అని అనుకున్నాడు. అయితే బాబా అప్పటివరకు పెట్టిన పరీక్షలు చాలని నవ్వుకున్నారు కాబోలు! ‘వెతకడం, దొరకటం కల్లా!’ అని మేము అనుకుంటే ఆ మహిళ ఒక అరగంటలో మా అబ్బాయికి ఫోన్ చేసి, "నీ లెటర్ దొరికింది. నేనే స్వయంగా ప్రిన్సిపాల్‌కి తీసుకెళ్లి ఇచ్చాను. ఆయన సంతకం కూడా చేశారు. నువ్వు కొరియర్‌కి ఒక మూడు వేల రూపాయలు కడితే నేనిప్పుడే కొరియర్ చేయించేస్తాను" అని చెప్పింది. ఇదంతా ఒక అరగంటలో అయిపోయింది. మేము ఆశ్చర్యపోయాము. 'హమ్మయ్య.. ఇంకా ఈ లెటర్ పంపితే మా అబ్బాయి రిజల్ట్ ఒరిజినల్ వెబ్సైట్లో పెడతారు' అని అనుకున్నాము. కానీ జరిగిన విచిత్రం చూడండి. ఆ లెటర్ మీ కాలేజీ నుండి వస్తేగానీ, రిజల్ట్స్ అనౌన్స్ చేయమన్న USMLE వెబ్సైట్‌వాళ్ళు ఆ లెటర్ వాళ్లకు చేరకముందే రెండు గంటల్లో మా అబ్బాయి పాస్ అయ్యాడని రిజల్ట్ పెట్టారు. ఇదంతా వ్రాస్తుంటే నాకు చాలా సంతోషంతో నవ్వు వస్తుంది. ఈ విషయాన్నీ బాబా ఇలా త్రిప్పి, అలా త్రిప్పి మనకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఎంతో అద్భుతంగా, అందంగా, సంతోషంగా చేశారు కదా అని అనుకుంటున్నాం. బాబా ఎంత చిలిపివారో చూడండి. మా అబ్బాయి ఫలితాన్ని మేము మర్చిపోకుండా ఎప్పటికీ ఒక మధురమైన జ్ఞాపకంగా మలిచారు. వెంటనే రిజల్టు వచ్చేసి ఉంటే ఒక సంతోషం ఉండేది కానీ, ఇప్పుడు ఇది మాకు ‘ఇంత జరిగిందే!’ అనే మధురమైన జ్ఞాపకం అయింది. ఇదే కాదండి, ఇప్పటివరకు బాబా మా కుటుంబానికి ఇచ్చిన అన్నీ ఆశీర్వాదాలు మధుర జ్ఞాపకాలే. “చాలా చాలా ధన్యవాదాలు బాబా”.


సాయిభక్తుల అనుభవమాలిక 1829వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శిరిడీ దర్శనంతో తీరిన సమస్యలు
2. కేవలం బాబా అనుగ్రహంతో ఉపశమనం

శిరిడీ దర్శనంతో తీరిన సమస్యలు

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు శంకర్. నేను హైదరాబాదు నివాసిని. నేను చాలా సంవత్సరాల నుండి సాయి భక్తుడిని. నాలో చాలా తప్పులు ఉన్నప్పటికీ అడుగడుగునా బాబా నన్ను రక్షిస్తున్నారు. నేను 2023లో దసరా సెలవులకి శిరిడీ వెళ్లాలని టికెట్లు బుక్ చేసుకున్నాను. అయితే చాలా వెయిటింగ్ లిస్టు ఉండి కన్ఫర్మ్ కాలేదు. తెలిసిన రైల్వే టీసీతో సిపారస్ చేయించినా ప్రయోజనం లేకపోయింది. అయినా బాబా మీద భారమేసి టీసీని కలిసి మాట్లాడదామని బయలుదేరి వెళ్ళాను. టీసీని కలిసి మాట్లాడితే, "దసరా సెలవులు కావడం వల్ల ట్రైనులో అస్సలు ఖాళీ లేదు. సరే, చూద్దాం. కూర్చోండి!" అని అన్నారు. కాసేపటి తర్వాత మళ్లీ టీసీని కలిస్తే, "ఖాళీ లేదు" అన్నారు. ఇక చేసేదిలేక బాబాని తలుచుకొని స్లీపర్ కోచ్‌లో కింద కూర్చొని శిరిడీ వెళ్లాను. శిరిడీలో నాలుగు రోజులు గడిపి ఎంతో అనుభూతి పొందాను.

ఇకపోతే, నా వయసు 40 సంవత్సరాలు. నాకు పని ఎక్కువైనప్పుడు మోకాలు కింద బాగా నొప్పి వస్తుంటుంది. ఆ సమయంలో బండి కిక్ కొట్టాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. నేను ఆ నొప్పి తగ్గడానికి పెయిన్ ఆయిల్ వాడుతుండేవాడిని. ఆ ఆయిల్ వాడినప్పుడు నొప్పి తగ్గుతుండేది. శిరిడీ వెళ్ళక ముందు కూడా నొప్పి బాగా వచ్చింది. ఈసారి ఆ ఆయిల్ వాడినా నొప్పి తగ్గలేదు. డాక్టర్ని కలిసి టాబ్లెట్లు తెచ్చుకొంటే కొంత ఉపశమనం లభించింది కానీ, పూర్తిగా తగ్గలేదు. అలాగే శిరిడీ వెళ్ళాను. శిరిడీలో నాసిక్ అవి తిరిగేసరికి సాయంత్రానికి నొప్పి ఎక్కువగా వచ్చింది. నాకు చాలా బాధ, భయం కలిగాయి. నేను, "బాబా! నా కాలి నొప్పి పూర్తిగా తగ్గేలా దయ చూపండి” అని అనుకున్నాను. అలా అనుకొని శిరిడీ నుండి తిరుగు ప్రయాణానికి బయలుదేరాను. బాబా దయవల్ల రిటర్న్ టికెట్ ఆర్ఏసి వచ్చి కన్ఫర్మ్ అయింది. నేను చాలా సంతోషంగా ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చాను. రెండు రోజుల తర్వాత నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. బండి స్టార్ట్ చేయడానికి కూడా ఇబ్బంది అనిపించలేదు(అదివరకు బండి కిక్కు కొట్టాలంటే భయపడిపోయేవాడిని). అంతేకాదు, మళ్ళీ ఇప్పటివరకు ఆ నొప్పి కనిపించలేదు. అంతా బాబా దయ. 

ఇంకో విషయం నాకు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. శిరిడీలో ఉండగా, "బాబా! నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి" అని అనుకున్నాను. శిరిడీ నుండి వచ్చిన తర్వాత  రెండు నెలల్లో ఒక వ్యక్తి ద్వారా నేను చేసిన పనికి 3 లక్షల వరకు అందించారు బాబా. దాంతో చాలావరకు అప్పుల నుండి బయటపడ్డాను. ఇదంతా బాబా దయతోనే జరిగిందని భావిస్తున్నాను. మిగతా ఋణ భారాన్ని కూడా బాబా ఏదో రూపంలో తొలగిస్తారని ఎదురు చూస్తున్నాను. బాబా తన భక్తులను ఎన్నడూ వదిలిపెట్టరు. బాబా తోడుంటే జీవితంలో అన్నీ ఉన్నట్లే. నా తప్పులు మన్నించి బాబా నన్ను నా జీవితంలో ఉన్నత స్థాయిలో ఉంచుతారని భావిస్తూ.. 

ఓం శ్రీసాయినాథాయ నమః!!!


కేవలం బాబా అనుగ్రహంతో ఉపశమనం


సాయి బంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. ఈ మధ్యకాలంలో ఆఫీస్ పని ఎక్కువగా చేయడం వల్ల నాకు మెడనొప్పి బాగా ఉండింది. దానివల్ల తలనొప్పి కూడా ఎక్కువగా వచ్చింది. కొద్దిరోజులు నొప్పి ఎందుకు వస్తుందో అని ఎంత ఆలోచించినా కారణం తెలీలేదు. ఇక చివిరికి బాబాను తలచుకొని ఆయనను ప్రార్థించానో, లేదో నొప్పి తగ్గిపోయింది. ఇంకోరోజు అకారణంగా నా ఒళ్లంతా దురద పెట్టడం మొదలయ్యింది. చాలాసేపు ఇబ్బందిపడ్డాక బాబాను తలచుకొని దురద అనిపించిన చోట ఊదీ రాసుకుంటే, వెంటనే దురద తగ్గింది. మరోసారి తల భాగమంతా ఎవరో ఊపేసినట్టుగా ఉండింది. అప్పుడు బాబాను మనస్పూర్తిగా తలచుకోగానే అంతా బాగైపోయింది. పై ఏ సందర్భంలోనూ నేను డాక్టరుని సంప్రదించడం, మందులు వాడటం చేయలేదు. కేవలం బాబా అనుగ్రహంతో ఉపశమనం పొందాను. "ధన్యవాదాలు బాబా. ఎప్పటికీ మీ దయ మాపై ఇలాగే వుంచి మేము ఆరోగ్యంగా ఉండేలా అనుగ్రహించు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1828వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. దయతో అనుకున్నవి నెరవేర్చిన బాబా
2. సాయి మహిమ

దయతో అనుకున్నవి నెరవేర్చిన బాబా

నేను ఒక సాయిభక్తుడిని. మేము షోలాపూర్‌లో నివాసముంటున్నాము. ఇక్కడ ప్రతి బుధవారం శివాలయం నందు పిల్లలకి తాయత్తు కడుతుంటారు. పిల్లలకి ఏమైనా గాలి సోకితే, అది తొలగిపోయి వాళ్ళ ఆరోగ్యం చక్కబడుతుందని ఇక్కడి వాళ్ళకి ఏన్నో ఏళ్లుగా ఉన్న నమ్మకం. అందుకని నేను ఒక బుధవారం సాయంత్రం మా బాబుని తీసుకొని ఆ గుడికి వెళదామని అనుకున్నాను. అయితే ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకి మా సార్ ఒకరు నాకు ఫోన్ చేసి, "అగ్ని ప్రమాదం జరిగింది. నువ్వు నీ బృందాన్ని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది" అని అన్నారు. నేను ఆ పని మీద వెళ్తే, బాబుని తీసుకొని శివాలయంకి వెళ్లడం కుదరదు. మరో వారం రోజులు వేచి చూడాల్సి వస్తుంది. అందువల్ల నేను వెంటనే బాబాని తలుచుకొని, "బాబా! ఈ అత్యవసర విధులు రద్దయ్యేలా చేసి, నేను బాబుని తీసుకొని గుడికి వెళ్లి, తాయత్తు కట్టించి తెచ్చేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. బాబాని నమ్ముకుంటే కానిది అంటూ ఏమైనా ఉందా? బాబా దయవల్ల నేను శివాలయంకి వెళ్ళాను. అక్కడ రద్దీగా ఉంది. అంత రద్దీలో కూడా బాబుకి తాయెత్తు కట్టించి తిరిగి ఇంటికి వచ్చేవరకు ఆఫీస్ నుండి నాకు ఏ కాల్ రాలేదు. అంతా బాబా దయ. 

ఇంకోసారి కాస్త జలుబు, దగ్గు వల్ల కాబోలు మా బాబు సరిగా తినేవాడు కాదు. తినిపిస్తుంటే బాగా ఏడవటం, సగం తిని మిగతాది ఊసేయడం చేస్తుండేవాడు. అప్పుడు నేను, "బాబా! బాబు రేపటినుండి ఇబ్బంది పెట్టకుండా చక్కగా తినేటట్లు చేయండి. లేదంటే వాడు నిరసించిపోతాడు. మీ దయవల్ల వాడు సరిగా తింటే మీకు పాలకోవా నివేదిస్తాను" అని బాబాను ప్రార్థించాను. ఇక బాబా అద్భుతం చూడండి. మరుసటిరోజు నుండి బాబు ఏడవకుండా చక్కగా తినడం మొదలుపెట్టాడు. బాబాకీ మొక్కుకున్నట్లు గురువారంనాడు మందిరంలో బాబాకి పాలకోవా సమర్పించుకున్నాను. "ధన్యవాదాలు బాబా. ఇక మీదట కూడా బాబు ఇబ్బంది పెట్టకుండా చక్కగా తినేలా చూడండి బాబా. ఇలాగే నా భార్యాబిడ్డలను కాపాడుతూ ఉండండి తండ్రీ”.

ఒకసారి నేను నా ఆఫీస్ పనయ్యాక వేరే ఆఫీసుకి వెళ్ళాను. అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నా కుడిచేతి వేలికి ఉండాల్సిన బంగారు ఉంగరం లేదని గమనించాను. ఒక్కసారిగా నా మైండ్ బ్లాక్ అయింది. నిజానికి ఆ ఉంగరం చాలా టైట్‌గా ఉంటుంది. అలాంటిది ఎలా పడిపోయిందో నాకు తెలియలేదు. వెంటనే బాబాని తలుచుకొని, "బాబా! విలువైన ఆ బంగారు ఉంగరం దొరికేలా అనుగ్రహించండి. అది దొరికితే మీ పేరు మీద ఇద్దరు అభాగ్యులకు అన్నదానం చేస్తాను" అని అనుకున్నాను. తర్వాత ఇంటికెళ్లి మధ్యాహ్న భోజనానికి వచ్చినపుడు పడిపోయిందేమోనని ఇల్లంతా ఆ ఉంగరం కోసం వెతికాను. నా భార్యకి కూడా విషయం చెప్పి తనని కూడా వెతకమన్నాను. తను కూడా విలువైన వస్తువని చాలా బాధపడుతూ వెతికింది. కానీ ఎక్కడా దొరకలేదు. చివరికి ఎందుకైనా మంచిదని నా బ్యాగులో వెతికితే, అందులో ఆ ఉంగరం దొరికింది. నేను ఆశ్చర్యపోయాను. ఆ ఉంగరం అందులో ఎప్పుడు, ఎలా పడిందో నాకు అస్సలు తెలీదు. కానీ బాబానే అందులో దొరికేలా అనుగ్రహించారు. "ధన్యవాదాలు బాబా. మిమ్మల్ని మనసారా భక్తితో అడిగితే జరగనిది అంటూ ఏమీ ఉండదు. మీ దీవెనలు ఎల్లప్పుడూ మీ భక్తులపై ఉండాలని కోరుకుంటున్నాను బాబా".


సాయి మహిమ


సాయిబంధువులకు నమస్కారం. నా పేరు స్వాతి. మా ఇంటి బాల్కనీలో మొక్కలకు ఎన్ని మందులు వేసినా వాడిపోయినట్లు ఉంటుండేవి. నాకు చాలా బాధేసి బాబాకి దణ్ణం పెట్టుకొని ఊదీ మొక్కలకు వేసాను. కొన్ని రోజుల్లోనే ఆ వాడిన మొక్కలు చిగురించి పూలు కూడా వచ్చాయి. ఏమి నా సాయి మహిమ?


ఈమధ్య నా ఆరోగ్యం బాగుండటం లేదు. దానికి తోడు మా ఇంట్లో పనిచేసే అమ్మాయి సరిగా సమయానికి రాకుండా ఆలస్యం చేస్తుండేది. నాకు కోపమొచ్చి అడిగితే, "మీకు ఇష్టం లేకుంటే పనికి రాన"ని అంది. నేను కూడా రావద్దని చెప్పాను. తర్వాత బాబాకి నా పరిస్థితి చెప్పుకొని, 'సాయి అసహాయసహాయాయ నమ:' అని జపించసాగాను. బాబా దయతో 2వ రోజు వేరే పని అమ్మాయి వచ్చింది. బాబానే నా ఇబ్బందిని అర్థం చేసుకొని ఆ అమ్మాయిని పంపారు. "కోటి నమస్కారాలు సాయి. దయతో ఆ  అమ్మాయి మంచిగా చేసేలా చూడండి. నేను ఎదుర్కొంటున్న సమస్యల మూలన మీరు నాకు సహాయం చేయటం లేదనే భావన నన్ను వెంటాడుతోంది. నన్ను క్షమించండి సాయి. మీ సమక్షంలో నా కర్మఫలం అనుభవించనివ్వు సాయి. నా మనసు మీ పాదాల వద్ద వుంచే శక్తి ఇవ్వు".


సాయిభక్తుల అనుభవమాలిక 1827వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. డబ్బుల నెపంతో శిరిడీ ప్రయాణం మనుకోకూడదని తెలియజేసిన అనుభవం 
2. దయతో అవాంతరాలు తొలగించి రిజిష్ట్రేషన్ పూర్తి చేయించిన సాయినాథుడు

డబ్బుల నెపంతో శిరిడీ ప్రయాణం మనుకోకూడదని తెలియజేసిన అనుభవం 
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!
సద్గురు శ్రీసాయినాథుని శరత్ బాబూజీ కీ జై!!!
నాపేరు ధనలక్ష్మి. మాకు బాబా, గురువుగారు చాలా అనుభవాలు ఇచ్చారు. మేము బాబా, గురువుగారిని నిరంతరం స్మరించుకోవాలంటే మాకు ఒక సత్సంగం కావాలనుకొని 2006, జనవరి 15న మా ఊరిలో సత్సంగం మొదలుపెట్టాలనుకున్నాము. బాబా దయవల్ల సత్సంగం పెట్టుకోవడానికి ఒకరు ఖాళీగా ఉన్న తమ ఇల్లు ఇచ్చారు. శ్రీనివాసరెడ్డిగారు వచ్చి సత్సంగం ప్రారంభించారు. అప్పటినుండి మేము బాబా, గురువుగారికి బాగా దగ్గరయ్యాము. అదే సంవత్సరం అంటే 2006లో గురుపౌర్ణమికి మా అమ్మవాళ్ళు శిరిడీ వెళ్తున్నారని తెలిసి నాకు కూడా వెళ్ళాలని కోరిక కలిగింది. మావారిని అడిగితే, "ఇప్పుడు వద్దు. ఇంకోసారి వెళదాం" అన్నారు. కారణం, ఆరోజుల్లో డబ్బులకు మాకు చాలా ఇబ్బంది ఉండేది. అయినా  నాకు శిరిడీ వెళ్ళాలని, బాబాని, గురువుగారిని చూడాలనే తపన చాలా ఎక్కువగా ఉండింది. కానీ మావారు, "ఇప్పుడు శిరిడీ వెళ్ళాలంటే 3,000 రూపాయలు కావాలి. షాపులో కూడా ఇబ్బంది అవుతుంది" అని అన్నారు. ఇంకా నేను సరేననుకొని శిరిడీ వెళ్ళలేదు. అదే సమయంలో అనుకోకుండా మా బాబుకి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. మేము శిరిడీ వెళ్తే ఎంత ఖర్చు అనుకున్నామో! సరిగ్గా అంతే మొత్తం అంటే 3,000 రూపాయల హాస్పిటల్ బిల్ అయ్యింది. అప్పుడు నేను మావారితో, "మనం శిరిడీ వెళ్తే ఖర్చు అనుకున్నాము. కానీ ఈరోజు బాబుకి బాగలేకపోతే ఖర్చు పెట్టాము. ఇక నుండి ఎప్పుడైనా శిరిడీ వెళ్ళాలనిపిస్తే డబ్బులు లేవనే విషయం రాకూడదు. మనం వెళ్తుంది బాబా దగ్గరకు, బాబాని అడిగితే ఇస్తారు" అని అన్నాను. ఆరోజు నుండి మావారిలో మార్పు వచ్చింది. మేము చేసిన తప్పుకి బాబా, గురువుగారికి క్షమాపణ చెప్పుకొని ప్రతి సంవత్సరం శిరిడీ వెళ్లి వస్తున్నాము. మావారు తనకి కుదిరితే వస్తున్నారు, కుదరకపోతే నన్ను, పిల్లల్ని మా అమ్మవాళ్ళతో కానీ, గురుబంధువులతో కానీ పంపిస్తున్నారు. శిరిడీ ప్రయాణం మాత్రం మానుకోవడం లేదు. మా మనసుకి శిరిడీకి వెళ్ళాలనిపిస్తే, తప్పకుండా వెళ్లొస్తున్నాము. బాబా, గురువుగారి దయవలన మా ఆర్థిక సమస్యలు తగ్గుతూ వస్తున్నాయి. బాబా, గురువుగారి ఆశీస్సులతో 2007, 2009 సంవత్సరాలలో బాబా నామం, పల్లకీ ఉత్సవం సత్సంగం తరఫున ఘనంగా జరుపుకున్నాము. మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము. బాబా అంటారు కదా, 'సప్త సముద్రాలు అవతలున్నా పిచ్చుక కాలికి దారం కట్టినట్లు నా భక్తుణ్ణి నేనే ఎన్నుకుంటాను'. అది మా కుటుంబ విషయంలో అక్షరాల నిజం. బాబా, గురువుగారి అనుగ్రహం మాపై నిరంతరం ఉండాలని వారిరువురిని ప్రార్థిస్తున్నాను.

దయతో అవాంతరాలు తొలగించి రిజిష్ట్రేషన్ పూర్తి చేయించిన సాయినాథుడు

సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు గురుమూర్తి. మేము ఇటీవల ఒక స్థలం కొనే ప్రయత్నం చేశాము. అందులో రకరకాల ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒక ప్లాటుకు అడ్వాన్స్‌గా కొంత డబ్బు ఇచ్చిన తరువాత డాక్యుమెంట్లు లాయర్‌కి చూపిస్తే, "లింకు డాక్యుమెంట్లో సర్వే నెంబరు తేడాగా ఉంది. కాబట్టి మున్సిపల్ ఆఫీసు నుండి సర్వే సర్టిఫికెట్ ఖచ్చితంగా అవసరమవుతుంది" అని చెప్పారు. సాధారణంగా మున్సిపల్ సర్వే సర్టిఫికెట్ రావడానికి 180 రోజుల సమయం పడుతుంది. కానీ ఆ ఫ్లాట్ అమ్మే వ్యక్తి ఎన్నారై అవ్వడం వల్ల ఆయన ఎక్కువకాలం ఇక్కడ ఉండరని చెప్పారు. దానివలన రిజిస్ట్రేషన్ ఆగిపోతుందేమోనని మేము భయపడి, "మున్సిపల్ సర్వే సర్టిఫికెట్ సకాలంలో వచ్చేలా సహాయం చేయమ"ని సాయినాథుని, శ్రీనివాసుని వేడుకున్నాం. వారి కృపవలన మున్సిపల్ సర్వే సర్టిఫికెట్ సకాలంలో అంటే 40 రోజుల్లో వచ్చింది. దాంతో ఆ ఫ్లాట్ ఓనర్ ఇండియాలో ఉండగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వెళ్ళాము. రిజిస్టర్ ఆఫీసుకు వెళ్లగానే సాయినాథుని మరియు శ్రీనివాసుని పెద్ద పటములు దర్శనమిచ్చాయి. రిజిస్ట్రార్ దగ్గరకు వెళితే, వారి టేబుల్ మీద సాయినాథుని విగ్రహం ఉంది. అవి శుభసూచకములుగా అనిపించి నాకు చాలా ఆనందం కలిగింది. అలా దేవదేవుడైన సాయినాథుని మరియు ఆపద్బాంధవుడైన శ్రీనివాసుని కృపతో ఎలాంటి అవాంతరాలు, సమస్యలు లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తైంది. "ధన్యవాదాలు సాయినాథా! శ్రీనివాసా! మీ కృపాకటాక్షములతో మాకున్న మిగతా సమస్యలను కూడా త్వరలో తీరుతాయని నమ్ముతున్నాను".


సాయిభక్తుల అనుభవమాలిక 1826వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఊదీ 'అమృత సంజీవిని'
2. అన్నివేళలా తోడుగా వున్న బాబా

బాబా ఊదీ 'అమృత సంజీవిని'


రాజాధిరాజు యోగిరాజు పరబ్రహ్మ అయిన సాయినాథునికి నా నమస్కారములు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను బెంగుళూరు నివాసిని. సాయినాథుని అనుజ్ఞ లేనిదే చిన్న ఆకైనా కదలదు. ప్రతి విషయంలో సాయి అనుగ్రహం లేనిదే మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. అంతలా మనం బాబాపై ఆధారపడి ఉన్నాము. మా చిన్నపాపకి 6 నెలల వయసప్పుడు తనకి రోజూ డైపర్ వేయడం వల్ల రాషెస్ వచ్చి క్రీమ్ వాడినా తగ్గలేదు. డాక్టర్ దగ్గరకు వెళ్ళి, వారు ఇచ్చిన క్రీమ్ వాడాక కాస్త తగ్గింది కానీ, మళ్లీ చాలా ఎక్కువ అయ్యింది. ఎంతలా అంటే ఆ చోట అంతా ఎర్రగా అయిపోయింది. అప్పుడు బాబాను ప్రార్థించి, అలాంటి చోట ఊదీ రాయకూడదని నా మనసు చెబుతున్నా బాబా ఊదీని మించిన గొప్ప ఔషధం వేరే ఏదీ లేదని తప్పనిసరై ఆ చోట అంతా ఊదీ రాశాను. మరుసటిరోజు ఉదయం చూస్తే 50% తగ్గిపోయింది. ఆ రోజు రాత్రి కూడా బాబా ఊదీ రాశాను. మర్నాటికి రషెస్ పూర్తిగా నయం చేసారు బాబా. అలాగే ఒకసారి పాపకు దగ్గు, జలుబు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు ఎన్ని మందులు వాడినా తగ్గకపోయేసరికి బాబా ఊదీ పాప నుదుటిపై పెట్టి, అలాగే ఎదకు, వీపుకు పూసి, మరికొంత ఊదీ నోటిలో వేశాను. బాబా దయతో దగ్గు, జలుబు తగ్గుముఖం పట్టాయి.


నాకు వీజింగ్ ప్రాబ్లం(శ్వాస తీసుకునేటప్పుడు, విడిచిపెట్టేటప్పుడు గుర్రుగుర్రుమనే శబ్ధం వచ్చుట) దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ఉండగా 2023, సెప్టెంబర్‌లో చాలా ఎక్కువైంది. హాస్పిటల్‌కెళ్ళి డాక్టరుకి చూపిస్తే కొన్ని మందులు ఇచ్చారు. నేను ఆ మందులతోపాటు బాబా ఊదీ వాడుతుంటే సమస్య అప్పటికి తగ్గి మళ్లీ మొదలయ్యేది. చివరికి నేను మందులు పూర్తిగా వాడటం మానేసి బాబా ఊదీ మాత్రమే వాడుతూ పోయాను. బాబా దయవల్ల 2024, జనవరి నాటికి పూర్తిగా ఆ సమస్య నయమైపోయింది. బాబా ఊదీ నా పాలిటి 'అమృత సంజీవిని'. నేను రోజూ రాత్రి ఊదీ నుదుటన, ఎదపై రాసుకొని, అలాగే కాస్త నోటిలో వేసుకుంటాను. ఒకప్పుడు నాకు ఏదైనా దెబ్బ తగిలితే అమ్మ అనేదాన్ని కానీ ఇప్పుడు 'బాబా' అని అంటున్నాను, నాకు అన్నీ బాబాయే కాబట్టి.  ఆయన గురించి వర్ణించడానికి నాకు మాటలు రావడం లేదు. "ధన్యవాదాలు బాబా.  దయచేసి మా అందరి జీవితాలు అంతమయ్యేవరకు మీరు మాకు తోడుగా ఉండి మంచి మార్గంలో నడిపించండి. మీపై రోజురోజుకు భక్తి పెరిగేలా చేయండి".


అన్నివేళలా తోడుగా వున్న బాబా

నా పేరు నాగవల్లి. నేను ఎప్పటినుండో శిరిడీ వెళదామని అనుకుంటూ ఉండగా బాబా దయవల్ల 2024, మార్చి నెలలో మా స్నేహితులతో కలిసి వెళ్లే అవకాశం వచ్చింది. అప్పుడు నేను బాబా పసుపు రంగు వస్త్రాల్లో దర్శనమివ్వాలని కోరుకున్నాను. నేను కోరుకున్నట్లే బాబా ఆ రంగు వస్త్రాల్లో నాకు దర్శనం ఇచ్చారు. నాకు చాలా సంతోషమేసింది. మేము శిరిడీ నుండి శివరాత్రి రోజున త్రయంబకేశ్వరం వెళ్ళాం. ఆ రోజు చాలాసేపు వేచి వున్నా మాకు దర్శనం అవ్వలేదు. కానీ అక్కడ ఒక సాధువు మా ఆయనకి రుద్రాక్ష ఇచ్చి, వుంచుకోమని వెళ్ళిపోయారు. మావారు ఆ రుద్రాక్షను నాకు ఇచ్చారు. తరువాత ఇంస్టాగ్రామ్‌లో నాకు, 'ప్రియమైన బిడ్డా! నేను నీకు మహాశివరాత్రి రోజున రుద్రాక్ష ఇచ్చాను. దాన్ని రోజూ పూజించు. అది నేరుగా నా ఆశీర్వాదం నీకు' అని ఒక బాబా మెసేజ్ కంటపడింది. అది చూసి నేను షాకయ్యాను. ఆ మెసేజ్ స్క్రీన్ షాట్ కింద ఇస్తున్నాను, మీరూ చూడండి.

మొదట మాకు ద్వారకామాయి దర్శించడం కుదరలేదు. చివరికి తిరుగు ప్రయాణమయ్యేరోజు వెళితే, చాలా జనం ఉన్నారు. అక్కడున్న ఒక ఆమెను, "మేము తొందరగా వెళ్లి రైలు అందుకోవాలి. దర్శనం కుదురుతుందా?" అని అడిగాము. బాబా దయ చూడండి. ఆమె వెంటనే ఒప్పుకుంది. మేము ఆనందంగా లోపలికి వెళ్లి ద్వారకామాయి దర్శించాము. ఇలా బాబా అన్నివేళలా మాకు తోడుగా వున్నారు. చివరిగా ఒక విషయం, "ఈ ట్రిప్‌లో ఏ గొడవలూ మా మధ్య రాకూడదు" అని అనుకున్నాను. బాబా దయవల్ల అందరం సంతోషంగా వెళ్లి, తిరిగి వచ్చాము. "ధన్యవాదాలు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1825వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. తిరిగి పొందుతున్న బాబాకృప
2. వేడుకున్నంతనే అనుగ్రహించిన బాబా

తిరిగి పొందుతున్న బాబాకృప


నా పేరు హ్రీం. నాకు చిన్నప్పుడు బాబాపై నమ్మకం ఉండేది. కానీ పెద్దయ్యాక క్రైస్తవ మతంపై ఆసక్తి పెరిగి సుమారు 10 సంవత్సారాలు ఒక క్రైస్తవ టీవీ ఛానల్‌లో పని చేశాను. పోనుపోను అక్కడి ధోరణి చూసి ఆ మతంపై నాకు విరక్తి కలిగింది. సోషల్ మీడియాలో బాబాపై జరిగే ప్రచారం చూసి బాబాపట్ల కూడా విముకుడనయ్యాను. ఇలా ఉండగా నా కాలి తొడ భాగంలో క్యాన్సర్ గడ్డ ఏర్పడింది. 25 సార్లు రేడియేషన్ ట్రీట్మెంట్ జరిగింది. ఆ సమయంలో ఫిషర్స్(ఫైల్స్) సమస్య వచ్చి విపరీతంగా రక్తం పోయి నేను చాలా బలహీనంగా అయిపోయాను. ఎంతలా అంటే 103 కిలోల నుండి 65 కిలోలకు తగ్గిపోయాను. నాకు సర్జరీ చేసి సుమారు కేజీ బరువున్న గడ్డను నా తొడ నుండి తీశారు. అక్కడ కుట్లు వేసిన చోట సెప్టిక్ అయి రెండు నెలలైన తగ్గలేదు. సుమారు రెండు అంగుళాలు లోతు గొయ్యి ఏర్పడింది. చాలా బాధపడుతున్న సమయంలో సత్యసాయిబాబా ప్రసంగాలు, ఇతరుల ప్రసంగాలు చూస్తున్నప్పుడు ఒకాయన ప్రసంగంలో బాబా గొప్పతనం విని తప్పు చేశాననిపించింది. దాంతో సాయి సచ్చరిత్ర ఆడియోలు వింటూ బాబా కృపకోసం ఎదురుచూసాను. 2024, మార్చి 11, సోమవారం నుండి 3 రోజులపాటు కీమోథెరపీ మొదటి డోస్ ఇచ్చారు. ఆ సమయంలో మంచం మీద ఉన్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ గురించి బాబాని ప్రార్థిస్తూ ఎంతగానో ప్రాధేయపడ్డాను. బాబా దయవల్ల ఒక మూడు తేలికపాటి వాంతులు, సెలైన్ ఎక్కించిన చోట నల్లని గాయం, దానివల్ల నొప్పి, నిస్సత్తువ తప్ప పెద్దగా దుష్ప్రభావాలు కనిపించలేదు. బాబాకి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఇకపోతే కీమోథెరఫీ వల్ల డీహైడ్రేషన్ అయింది. అదీకాక తిండి తినక పోవడం వల్ల రేడియేషన్ ట్రీట్మెంట్ సమయంలో విపరీతంగా వేధించిన ఫిషర్స్ సమస్య మళ్ళీ మొదలై మలవిసర్జన చేసేటప్పుడు విపరీతమైన బాధ, ఇంకా రక్తం కూడా పడనారభించింది. అప్పుడు నేను, "బాబా! ఈ నొప్పి తగ్గించు. ఈ సమస్యను నయం చేయి. నా ప్రొఫైల్ పిక్‌గా నీ ఫోటో పెట్టుకుంటాను. అలాగే మీరు నాపై చూపే కృపను తోటి సాయిబంధువులకు తెలియజేస్తాను" అని బాబాకి మొక్కుకున్నాను. ఆ తరువాత నుండి మలవిసర్జన సమస్య కాలేదు కానీ, విపరీతమైన నొప్పి అనుభవించాను. ఆ సాయంత్రం అదివరకు ఇచ్చిన నొప్పి టాబ్లెట్ బాబాను తలచుకుని వేసుకున్నాను. బాబా దయవల్ల నొప్పి భరించే స్థాయికి వచ్చింది. మర్నాడు ఉదయం లేవగానే మళ్ళీ భయపడుతూ బాబాని ప్రార్థించి మలవిసర్జనకి వెళ్ళాను. నొప్పి ఉన్నా రక్తం మాత్రం రాలేదు. బాబా నాకు స్వస్థత చేకూర్చారని నమ్ముతూ ఇలా నా అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నాను. చివరిగా మరో చిన్న విషయం చెప్పి ముగిస్తాను. సర్జరీ కుట్ల దగ్గర నుండి నీరు కారడం వల్ల గాయమైతే రెండవసారి కుట్లు వేశారు. అయితే ఆ కుట్లు ఊడిపోయాయి. అప్పుడు నేను, "బాబా! ప్రతి వారం దగ్గరలో ఉన్న నీ మందిరానికి వస్తాను" అని మొక్కుకుంటే, సర్జరీ గాయం నుండి నీరు కారడం చాలావరకు తగ్గింది. బాబా చూపుతున్న కృపకి ఎంతగానో ఆనందంగా వుంది. శ్రీసాయి బంధువులందర్ని నా గురించి, నా ఆరోగ్యం గురించి మీ ప్రార్దనలో బాబాకు విన్నవించుకోమని అభ్యర్థిస్తున్నాను.


వేడుకున్నంతనే అనుగ్రహించిన బాబా


నా పేరు తేజశ్రీ. మేము యూరప్‌లో నివాసముంటున్నాము. ఒకరోజు నా భర్త మా పిల్లల్ని తీసుకొని రావడానికి స్కూలుకి వెళ్ళారు. మామూలుగా వాళ్ళు ఒక గంటలో వచ్చేస్తారు. కానీ, ఆ రోజు 3 గంటలైనా రాలేదు. దాంతో వాళ్ళు ఎక్కడకి వెళ్ళారో, ఏమైందో అని భయమేసి, "బాబా! మీ దయవల్ల వాళ్ళకి ఏం కాకుండా త్వరగా వచ్చేలా చూడండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల వాళ్ళు కాసేపట్లో వచ్చారు. "ధన్యవాదాలు బాబా".


మేము ఉంటున్న ఇంటి కాంట్రాక్ట్ పూర్తవడంతో వేరే ఇల్లు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మాకు చాలా తక్కువ సమయముంది. ఆలోపు ఇల్లు దొరకకపోతే మాకు చాలా సమస్య అవుతుంది. అటువంటి స్థితిలో నాకు ఏం చేయాలో అర్థంకాక, "మాకు తొందరగా ఇల్లు దొరికేలా దయచూపమ"ని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల తక్కువ సమయంలో మాకు ఇల్లు దొరికింది. "ధన్యవాదాలు బాబా".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo