సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1702వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. భక్తదయాళువు సాయినాథుడు
2. వెర్టిగో సమస్య నుండి ఉపశమనం ప్రసాదించిన బాబా

భక్తదయాళువు సాయినాథుడు

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! భక్తదయాళువైన సాయినాథుని పాదపద్మములకు శతకోటి వందనాలతో భక్త పరమాణువైన అమరనాథ్ అనే నేను నా అనుభవాలను మీతో పంచుకుంటున్నందుకు నాకు  చాలా ఆనందంగా ఉంది. నేను బాబాను మనస్పూర్తిగా చంద్రబాబునాయుడుగారిని జైలు నుండి బంధవిముక్తుణ్ణి చేయమని వేడుకున్నాను. నాలాగే ఎంతోమంది వేడుకొని ఉంటారు. బాబా దయవల్ల అతను విడుదలయ్యారు. అతనికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించమని బాబాను వేడుకుంటున్నాను.

మా బాబు అమెరికాలోని మిస్సోరీలో ఎమ్మెస్ చదువుతున్నాడు. తను సెలవు దినాల్లో అట్లాంటాలో పార్ట్ టైం జాబ్ చేసి 42,000 డాలర్లు సంపాదించాడు. మన ఇండియాలో లాగా అక్కడ డబ్బులు నేరుగా తీసుకు రాకూడదు. అందుచేత ఏం చేయాలో తెలియక బాబు చాలా బాధపడ్డాడు. నేను బాబాని, "ఆ డబ్బు ఏ ఇబ్బంది లేకుండా బాబుకి అందేలా చేయమ"ని వేడుకున్నాను. బాబా దయవల్ల ఒక రెండునెలల తర్వాత ఒక ప్రైవేట్ మనీ ట్రాన్స్ఫర్ సంస్థ ద్వారా డబ్బులు మా వాడి చేతికి వచ్చాయి. బాబానే దారి చూపించి ఏ కష్టమూ లేకుండా చేసారు.

ఒకసారి నేను పనిచేసే కంపెనీలో మిషనరీ అద్దెకి ఇచ్చినవాళ్ళు కిరాయి డబ్బులు కోసం కంపెనీ మెయిన్ గేటు వేసి గొడవ చేశారు. హెడ్ ఆఫీసువాళ్ళు ఇంకా టైం పడుతుందంటే, వాళ్ళు డబ్బులు ఇస్తేనే పనిచేస్తామని గొడవగొడవ చేసారు. ఆ స్థితిలో నేను బాబాని శరణువేడాను. అంతే, 10 నిమిషాల్లో యూనియన్‌వాళ్ళు పనిచేయటానికి ఒప్పుకున్నారు. తర్వాత నాలుగు రోజుల్లో వాళ్ళ డబ్బులు వాళ్ళకి అందాయి.

నేను తరచూ నడుము నొప్పితో బాధపడుతుంటాను. ఒకసారి నొప్పి వచ్చిందంటే కనీసం 15 రోజులు నాకు ఇబ్బందిగా ఉంటుంది. అయితే 2023, అక్టోబర్ నెలలో చాలా తీవ్రంగా నొప్పి వచ్చినప్పుడు మాత్రం కేవలం మూడు రోజుల్లోనే నేను పనిలోకి వెళ్లగలిగాను. అంతా బాబా దయ. "ధన్యవాదాలు బాబా. మీరే నా బలము, బలహీనత. నన్ను, నా కుటుంబాన్ని ఎల్లవేళలా కంటికిరెప్పలా కాపాడు తండ్రీ. అలాగే నా మది కోరిక నెరవేర్చు తండ్రీ. మీ చరణములకు నమస్కారములతో మీ భక్తుడు..".


వెర్టిగో సమస్య నుండి ఉపశమనం ప్రసాదించిన బాబా

సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు గాయత్రి. నాకు ఏ చిన్న బాధ వచ్చినా, ఆరోగ్య సమస్య వచ్చినా, మనసు బాగుండకపోయినా నేను సాయినాథుని తలుచుకొని ఊదీ పెట్టుకుంటాను. వెంటనే నాకు ఉపశమనం లభిస్తుంది. 2022లో నాకు వెర్టిగో సమస్య వచ్చింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. అప్పుడొకరోజు సాయినాథునికి నమస్కరించి, "ప్రతి గురువారం సాయి సచ్చరిత్ర చదువుతాను. నాకొచ్చిన ఈ వెర్టిగో సమస్యను తగ్గించు తండ్రీ" అని ప్రార్థించి సచ్చరిత్ర చదవటం మొదలుపెట్టాను. నెలలో సమస్య చాలావరకు తగ్గి క్రమంగా పూర్తిగా తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా. నాకు సర్వమూ నీవే తండ్రీ. ఎప్పుడూ ఇలానే కాపాడు తండ్రీ".


సాయిభక్తుల అనుభవమాలిక 1701వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీ శిరిడీసాయి దర్శనభాగ్యం
2. తలచుకోగానే సహాయం అందించిన బాబా

శ్రీ శిరిడీసాయి దర్శనభాగ్యం


సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. ఆనాడు శిరిడీలో బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారు చేసిన అద్భుత లీలల గురించి నాటి భక్తులు చర్చించుకుంటూ ఎంతో ఆనందాన్ని అనుభవించారు. ఆ అదృష్టం మనకిప్పుడు ఈ బ్లాగు ద్వారా దొరికినందుకు మనం చాలా అదృష్టవంతులమని చెప్పవచ్చు. ఈ బ్లాగు వల్ల మనం ప్రతిరోజూ బాబా ప్రేమను ఆస్వాదిస్తూ వారి సాంగత్యంలో ఉంటున్నాము. అలాగే ఆ సాయినాథుడు మనకు ప్రసాదించిన అనుభవాలను సాయి దర్బార్‌లోని తోటి సాయిబంధువులందరితో పంచుకునే అదృష్టం మనకు లభించింది. బాబా భక్తులమవ్వడం మన భాగ్యం. ఇక నా అనుభవానికి వస్తే..


శ్రీ దాసగణు మహారాజ్ రచించిన శ్రీసాయినాథుని స్థవనమంజరి 105 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సాయి టీవీ ఆధ్వర్యంలో శిరిడీలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకుగానూ నేను 2023, సెప్టెంబర్ నెలలో శిరిడీ వెళ్ళాలని అనుకున్నాను. ఆ విషయమై, 'నన్ను శిరిడీ రమ్మంటావా బాబా?' అని బాబాను చీటీలు వేసి అడిగితే, 'రమ్మ'ని సమాధానం ఇచ్చారు బాబా. అయితే మా కుటుంబంలోని వారెవరూ రావట్లేనందున, 'కనీసం నేను వెళ్ళడానికి ఇంట్లో ఒప్పుకునేలా చూడండి బాబా' అని అనుకున్నాను. బాబా దయవల్ల మావారు ఒప్పుకున్నారు. అప్పుడు నేను, "ఇంట్లో అయితే ఒప్పుకున్నారు బాబా. కానీ నేను ఒక్కదాన్నే ఎలా వెళ్ళాలి బాబా. ఎవరైనా సాయిబంధువులతో కలిసి వచ్చేలా చూడండి బాబా" అని అనుకున్నాను. తర్వాత నేను సాయి టీవీవాళ్ళకి ఫోన్ చేస్తే, "ఈ కార్యక్రమానికి కొంతమంది భక్తులు వస్తున్నార"ని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి, "వాళ్ళకి కాల్ చేసి మాట్లాడండి" అని చెప్పారు. ఆ నెంబరుకి ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు నేను బుక్ చేసుకున్న ట్రైన్‌కే కుటుంబంతో ఏడుగురం వస్తున్నామని చెప్పారు. అంతేకాదు, నేను బుక్ చేసుకున్న హోటల్‌లోనే తాము కూడా బుక్ చేసుకున్నామని చెప్పారు. అది విని నాకు చాలా సంతోషమేసింది. అంతా బాబా ప్రణాళిక. ఆయన తన బిడ్డల్ని ఒంటరిగా వదలరు. నేనున్నానని ధైర్యం ఇవ్వటానికి ఎవరికివాళ్ళం తెలియకుండానే ఒకే ట్రైన్‌కి, ఒకే హోటల్లో బుక్ చేసుకొనేలా చేసి నాకు వాళ్ళ తోడును అనుగ్రహించారు.


శిరిడీ చేరుకున్నాక బాబా దయవల్ల విఠల మందిరంలో స్తవనమంజరి 21మార్లు పారాయణ చేసే అదృష్టం దక్కింది. బాబా దర్శనం చాలా బాగా జరిగింది. గురువారం చావడి ఉత్సవం చూసే భాగ్యం కూడా లభించింది. మేము ఎంతో ఆనందంగా ఆ ఉత్సవాన్ని తిలకించాం. తిరుగు ప్రయాణమయ్యే ముందు నేను మరోసారి సాయినాథుని దర్శించుకుందామని దర్శనానికి వెళ్లాను. అప్పుడు సమాధి మందిరంలో బాబా దివ్య మంగళ రూపాన్ని చూస్తూ, ఆయన నామం చెప్పుకుంటూ దాదాపు 30 నిమిషాలపాటు అలాగే ఉండిపోయాను. అక్కడున్న సెక్యూరిటీవాళ్లకు నేను కనిపించలేదేమోనని అనిపించింది నాకు. అంతా బాబా దయ. అదివరకెప్పుడూ అంత సమయం బాబాను చూసుకునే అవకాశం నాకు రాలేదు. ఈసారే బాబా నాకు ఆ అదృష్టం కల్పించారు. ఆయన దయతో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాను. నిజానికి శిరిడీ వెళదామని అనుకున్నప్పటినుంచి బాబా ఏదో ఒక రూపంలో "అంతా సవ్యంగా జరుగుతుంది. నీ ప్రయాణంలో నీకు తోడు ఉంటాను, కంగారుపడకు" అని సందేశాలు ఇచ్చారు. ఆయన మీద భారమేస్తే మన క్షేమం చూసుకుంటారు. మనకు కావలసింది 'శ్రద్ధ-సబూరీ'. "ధన్యవాదాలు బాబా. మీ భక్తులందరినీ రక్షించండి. అందరి మీద మీ కృపాదృష్టి సదా ఉంచండి బాబా".


చివరిగా మరో అనుభవం: నేను నా గత అనుభవంలో "బాబా! మా కొత్తింటి గృహప్రవేశానికి మీరు రావాలి. మీరు వచ్చి ఏ  ఆటంకాలు లేకుండా గృహప్రవేశం మంచిగా జరిగేలా చూడండి" అని బాబాను అడిగాను. మేము గృహప్రవేశానికి ముహూర్తం పెట్టుకునే ముందు బాబా వద్ద 'అక్టోబర్ నెలలో చేసుకోవాలా?, నవంబర్ నెలలో చేసుకోవాలా?' అని చీటీలు వేసి అడిగాను. బాబా అక్టోబరులో చేసుకోమని సమాధానం ఇచ్చారు. ఆయన దయతో 2023, అక్టోబర్ 26, గురువారం రోజున ముహూర్తం కుదిరింది. బాబా అనుమతితో ఆరోజే మా గృహప్రవేశం అని నిర్ణయించుకున్నాము. ఆలోగా నేను శిరిడీ వెళ్లి, తిరిగి వచ్చేటప్పుడు వంటపాత్రతో ఉండే బాబా విగ్రహం తెచ్చుకున్నాను. ఆ రూపంలో బాబా మా ఇంటికి గృహప్రవేశానికి వచ్చి, కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికీ వడ్డన చేసారు. మేము అనుకున్న దానికంటే కార్యక్రమం చాలా బాగా జరిగింది. మనం ఏదైనా పని ప్రారంభించేటప్పుడు బాబా అనుమతి తీసుకుంటే పనులన్నీ సవ్యంగా జరిగిపోతాయి. "ధన్యవాదాలు బాబా".


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.


తలచుకోగానే సహాయం అందించిన బాబా

నేను ఒక సాయి భక్తురాలిని. 2023, అక్టోబర్ 31న నేను ఒక ఇరుకు సందులో కారు రివర్స్ చేయడానికి చాలా ఇబ్బందిపడ్డాను. చాలాసేపు ప్రయత్నించిన తర్వాత, "నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళడం ఎలా బాబా?" అని అనుకున్నాను. మరుక్షణం ఎవరో ఒకతను నా కారు డోర్ వద్దకి వచ్చి, "నేను కారు తీసి ఇవ్వనా?" అని అడిగారు. నేను సరేనంటే, అతను చాలా జాగ్రత్తగా కారు వెనక్కి తీసి ఇచ్చారు. నేను సంతోషంగా అతనికి ధన్యవాదాలు చెప్పాను. అలాగే బాబాకి కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఆయన్ని తలుచుకోగానే అతను రావడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. ఇలా ఎవరైనా ఎవరికైనా సహాయం చేస్తారేమో గానీ, నాకు మాత్రం ఇది బాబా చేసిన సహాయమని నా నమ్మకం. అందుకే మీతో పంచుకున్నాను. "సదా మాతో ఉండి సంరక్షించు సాయిదేవా".

సాయిభక్తుల అనుభవమాలిక 1700వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. గోవా యాత్రలో బాబా చూసిన దయ
2. అడిగింది ఇచ్చి తామున్నామని నిరూపించే బాబా

గోవా యాత్రలో బాబా చూసిన దయ


సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు ఆశాదీప్తి. ఈమధ్య మా అత్తయ్యవాళ్ళు మొత్తం కుటుంబమంతా కలిసి వెళ్లడానికి అనువుగా ఉంటుందని ఒక సెవెన్ సీటర్ కారు తీసుకున్నారు. తర్వాత కొత్త కారులో అందరం కలిసి ఎక్కడికైనా వెళ్తే బాగుంటుందనుకుంటున్న సమయంలో పిల్లలు దసరా సెలవులకి గోవా వెళ్దామని పట్టుపట్టారు. మేము సరేనని కారులో గోవా వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. అయితే అందరూ గోవా వెళ్లే రోడ్డు మార్గం అంతగా బాగోదని, చాలా ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు. దాంతో నాకు పిల్లల్తో కారులో అంత దూరం ప్రయాణం కొంచెం రిస్కీ అనిపించింది. అందువల్ల గోవా వెళ్లేందుకు బయలుదేరేముందు నేను సాయినాథుని తలుచుకుని "ప్రయాణం అంతా సవ్యంగా జరిగి మేము క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే, మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను" అని బాబా మీద భారమేసాను. అందరూ చెప్పినట్లే 14 గంటల ప్రయాణం కాస్త 18 గంటలు పట్టింది. అంత ఆలస్యమైనా కూడా బాబా దయవల్ల సమయానికి ఆహారం తదితర అన్నీ లభించి, పిల్లలతో మాకు ఎక్కడా ఇబ్బందిపడాల్సిన పరిస్థితి రాలేదు.


ఒకరోజు మేమంతా గోవాలో బీచ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ అడుగుపెడుతూనే రెండు గిత్తలు పోట్లాడుకోవడం మా కంటపడింది. ఆ పక్కనే చాలా కుక్కలు ఉన్నాయి. మాకు కాస్త భయమేసి త్వరత్వరగా నడుచుకుంటూ వెళుతుంటే కుక్కలు బాగా మొరగటం మొదలుపెట్టాయి. దాంతో మిగిలిన గిత్తలు లేచి పరుగులు తీస్తూ మమ్మల్ని చుట్టుముట్టాయి. నేను, మా బాబు, మా మావయ్యగారు వాటి మధ్య ఇరుక్కుపోయాం. ఆ సమయంలో నాకు దిక్కుతోచక బాబుని గట్టిగా పట్టుకుని చుట్టూ చూడసాగాను. నాకప్పుడు కనీసం బాబాను శరణువేడాలన్న ఆలోచన కూడా రాలేదు. అయినా బాబా మమ్మల్ని కాపాడారు. ఎలాంటి హాని జరగకుండా మేము అక్కడినుండి తప్పించుకుని బయటపడ్డాం. అంతా బాబా మాపై చూపిన దయ, అనుగ్రహం.


గోవా నుండి తిరుగు ప్రయాణమయ్యే రోజున నాకు బాగా అలసటగా అనిపించి, జ్వరం కూడా వచ్చింది. నాకు జ్వరంతో 18 గంటల ప్రయాణమంటే చాలా భయమేసి కాస్త బాబా ఊదీ, ఒక టాబ్లెట్ నోట్లో వేసుకొని, "బాబా! మీదే భారం" అని వేడుకున్నాను. బాబా దయవల్ల కాసేపటికి నేను కోలుకున్నాను. ప్రయాణంలో జ్వరం నన్ను అస్సలు ఇబ్బంది పెట్టలేదు. 


ఇంకో ముఖ్య అనుభవం. మేము గోవాకి బయలుదేరే ముందు ఎంత వెతికినా మా బాబు వెండి కడియం కనిపించలేదు. ఇంకా వెతికేందుకు సమయం లేకపోవడంతో మేము గోవాకు బయలుదేరిపోయాం. నేను మనసులో, "బాబా! ఆ కడియం పోకుండా ఇంట్లోనే ఉండి త్వరగా దొరికితే, మీ అనుగ్రహం తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాని వేడుకున్నాను. గోవా నుండి ఇంటికి తిరిగి వచ్చాక కడియం కోసం మళ్ళీ వెతికితే, అది మా బాబు స్కూలు బ్యాగులో దొరికింది. ఇలా ప్రతి విషయంలోనూ మాకు అండగా ఉంటూ మమ్మల్ని ఎల్లవేళలా ముందుకు నడిపిస్తున్న సాయికి శతకోటి వందనాలు.


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


అడిగింది ఇచ్చి తామున్నామని నిరూపించే బాబా

ముందుగా సాయిభక్తులకు నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. సాయిబాబా నన్ను ఎన్నోసార్లు కాపాడారు. ఆయన్ని పిలిస్తే పలుకుతాడని ఎందుకు అంటారో నా విషయంలో చాలాసార్లు ఋజువైంది. నేను ఎప్పుడు బాధపడ్డా, నాకు ఇది కావాలని బాబాని ఒక్కసారి అడిగితే వెంటనే ఆయన అడిగినవిచ్చి తామున్నామని నిరూపించారు. నేను ఇప్పుడు చెప్పబోయేది చాలా చిన్న విషయమే అయినా కానీ నేను నా కోరిక తీరుస్తే, బ్లాగులో పంచుకుంటానని బాబాకి చెప్పాను. అందుకే మీతో పంచుకుంటున్నాను. మావారు చాలా రోజుల నుంచి తిరుమల వెళ్లాలని అనుకుంటున్నప్పటికీ వెళ్లడం కుదరలేదు. చివరికి 2023, అక్టోబర్ 1న వెళ్ళడానికి టికెట్లు బుక్ చేసారు. కానీ ఆ నెల నాకు నెలసరి ఆలస్యం అయింది. దాంతో ఎక్కడ తిరుమలకు వెళ్లేరోజు నెలసరి వస్తుందో అని నేను చాలా భయపడ్డాను. ఆ స్థితిలో బాబాని, "తిరుమల వెళ్లి తిరిగి వచ్చేవరకు నాకు నెలసరి రాకుండా ఉంటే మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. బాబాని అడిగాక జరగనిది ఏమైనా ఉంటుందా? మా తిరుమల యాత్ర, స్వామివారి దర్శనం అంతా సంతోషంగా జరిగి ఇంటికి తిరిగి వచ్చిన రెండు రోజులకి నాకు నెలసరి వచ్చింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1699వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా నాతో ఉన్నారన్న నమ్మకం
2. బాబా నాపై చూపించిన కరుణాకటాక్షాలు 

బాబా నాతో ఉన్నారన్న నమ్మకం

మేము వృత్తిరీత్యా చెన్నైలో స్థిరపడ్డ తెలుగువాళ్ళము. నేను బాబాని నమ్ముతాను, అలాగని బాబాకి పరమ భక్తురాలిని మాత్రం కాదు. అందరి దేవుళ్ళలాగానే బాబాని పూజిస్తాను. కాని బాబా మీద కాస్త ఎక్కువ నమ్మకం. ఒకసారి నాకు కుడి కాలు తొడ భాగంలో బాగా నొప్పి వస్తుండేది. అది ఏం చేసినా తగ్గలేదు. అలాంటి సమయంలో ఈ బ్లాగులో ఒక బాబా భక్తురాలు పంచుకున్న అనుభవం చదివి బాబా ఊదీ మహిమ తెలుసుకొని ఎలాగైనా నాకు బాబా ఊదీ కావాలని అనుకున్నాను. మరుసటిరోజు బ్లాగు ఓపెన్ చేయగానే, "నేను నీకు ఊదీ పంపాను. నువ్వు తీసుకున్నావా? లేదా?" అని సాయి వచనం కనిపించింది. నేను చాలా ఆలోచించిన తరువాత నా స్నేహితురాలితో విషయం చెప్తే, "నా దగ్గర ఊదీ ఉంది, తీసుకో" అని అంది. అయితే అదే సమయంలో అదివరకు నా సహోద్యోగి ఒకరు నాకు ఒక చిటికెడు ఊదీ ఇచ్చినట్లు గుర్తుకొచ్చి దాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాననుకుంటూ నా ఫోన్ పౌచ్‌‌లో చూస్తే, అందులోనే ఊదీ ఉంది. సమయానికి బాబానే ఆ ఊదీ నాకు అందేలా చేశారు. నమ్మకంతో దాన్ని నొప్పి ఉన్న చోట రాశాను. కొన్ని నెలలుగా నన్ను ఇబ్బందిపెడుతున్న నొప్పి కొన్ని రోజులకు తగ్గిపోయింది.


మేము విజయదశమి సెలవులకి మైసూర్ వెళ్ళొచ్చాము. అక్కడ బాగానే ఉన్న మా బాబు చెన్నైకి తిరిగి రాగానే దగ్గటం మొదలుపెట్టి కొన్నిరోజులు దగ్గు, జలుబుతో ఇబ్బందిపడ్డాడు. రాత్రిళ్ళు దగ్గు మరీ ఎక్కువగా ఉంటుండేది. ఒకరోజు నేను బాబా మీద నమ్మకంతో బాబుకి ఊదీ రాసి 'సాయిబాబా' అని అనుకోని పడుకోమన్నాను. అంతటితో బాబుకి దగ్గు రాలేదు, ప్రశాంతంగా నిద్రపోయాడు.


ఒకరోజు ప్రయాణంలో నేను, "బాబా! నువ్వు నాతో ఉంటే, నేను వెళ్తున్న దారిలో మీ నామమైన ఒకసారి నేను చూడగలగాలి" అని అనుకున్నాను. అయితే చాలాసేపటివరకు నాకు ఏమీ కనపడలేదు. కాని తర్వాత హఠాత్తుగా మా వెనకాల వస్తున్న వేరే కారు కోసం ఆగినప్పుడు 'శ్రీసాయి' అనే పేరుతో ఒక షాపు కనిపించింది. నేను ఆనందంతో ఒక 5 నిమషాలు అక్కడ ఆగిపోయాను. ఇంకోసారి కూడా ప్రయాణంలో అలాగే అనుకున్నాను. అప్పుడు కూడా కాసేపు ఏం కనపడలేదు. నేను ఆ రోజు బాగా అలిసిపోయి ఉండటం వల్ల మధ్యమధ్యలో కునుకుపాట్లు పడుతున్నాను. ఒకసారి హఠాత్తుగా మెలుకువ వచ్చినప్పుడు, 'అయ్యోయ్యో.. బాబాను వెతుకుతూ ఇలా పడుకున్నాను" అనుకుంటూ పక్కకు చూస్తే, సాయి పేరు కనిపించింది. దాంతో బాబా నాతో ఉన్నారన్న నమ్మకం నాకు వచ్చింది. కాకపోతే నేను ఉద్యోగపరంగా కష్టాలు పడీపడీ బాగా అలిసిపోయిన సమయంలో నేను బాబా వైపు అడుగులు వేసాను. ఆయన్నే నమ్ముకొని వేరే ఉద్యోగం చూసుకోకుండా బాబా తప్పకుండా నాకు సహాయం చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మేము గత సంవత్సర కాలంగా శిరిడీ వెళ్లాలని అనుకుంటున్నాం. అయితే కుటుంబమంతా కలిసి వెళ్ళాలనుకోవటం వలన ఏదో ఒక అవాంతరం వచ్చి ఇప్పటిదాకా వెళ్ళలేకపోయాము. తొందరలో శిరిడీ దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారని నమ్ముతున్నాను. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా".


బాబా నాపై చూపించిన కరుణాకటాక్షాలు 

బాబా భక్తులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. 7 సంవత్సరాల కిందట నేను గర్భవతిగా ఉన్నప్పుడు నాకు గ్యాస్ట్రిక్ సమస్య వచ్చింది. దాంతోపాటు అల్సర్లు కూడా ఏర్పడ్డాయి. నేను తీవ్రమైన నొప్పిని, బాధను అనుభవించాను. అప్పటినుండి ఆ గ్యాస్ సమస్య నన్ను వేధిస్తూ ఉండగా ఈమధ్య ఆ సమస్య మరింత అధికమై నేను తీవ్రమైన కడుపు నొప్పితో చాలా బాధపడ్డాను. అప్పుడు బాబా భక్తుడైన నా భర్త నన్ను, "బాబాను ప్రార్థించు, అయన దయవల్ల మొత్తం తగ్గిపోతుంది" అని దైర్యం చెప్పారు. అప్పటినుంచి నేను బాబాను ప్రార్థించడం మొదలుపెట్టి, ఆయన్నే తలుచుకుంటూ ఉండేదాన్ని. కొద్దిరోజులకి శిరిడీ దర్శించేందుకు మాకు బాబా అనుమతి లభించింది. మేము పిల్లలతో శిరిడీ వెళ్లి బాబాని దర్శించుకొని, వారి ఫోటో ఒకటి తీసుకొని తిరిగి వచ్చాము. బాబా దయవల్ల మా శిరిడీ యాత్ర సవ్యంగా జరిగింది. బాబాని దర్శించుకున్నాక నా గ్యాస్ సమస్య తగ్గుముఖం పట్టింది. అలాగే థైరాయిడ్ సమస్య కూడా అదుపులోకి వచ్చింది. తర్వాత ఈమధ్య నాకు జ్వరం వచ్చి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను. అప్పుడు బాబాని వేడుకోగా రిపోర్టులు నార్మల్ వచ్చాయి. బాబా దయవల్ల మా కుటుంబం ఇప్పుడు సంతోషంగా ఉంది. పిలిస్తే పలికే దైవం సాయి.

సాయిభక్తుల అనుభవమాలిక 1698వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఉన్నారు
2. ప్రతి కష్టంలో తోడుగా ఉండే బాబా

బాబా ఉన్నారు


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక ముస్లిం అమ్మాయిని. ఒకప్పుడు మా ఇంటి పక్కన ఉండే స్నేహితులు సాయిబాబా గుడికి వెళ్లే అలవాటు నాకు చేసారు. కొన్నాళ్ళకి మేము ఆ ఇల్లు మారాము. తర్వాత ఒకరోజు ఆ స్నేహితులు నాకు ఫోన్ చేసి, "మేము గుడికి వెళ్తున్నాము. వస్తావా?" అని అడిగారు. నేను వాళ్లతో "వస్తాన"ని చెప్పాను. కానీ మా నాన్నగారు, "వెళ్లొద్దు. మనం ముస్లింలం. విషయం అందరికీ తెలిస్తే నా పరువు పోతుంది" అని అన్నారు. నాకు మా నాన్న అంటే చాలా ప్రేమ, గౌరవం, మర్యాద. ఆయన అలా అనేసరికి నేను తట్టుకోలేక ఏడుస్తూ 'బాబా ఉన్నారు.. బాబా ఉన్నారు' అంటూ స్పృహ కోల్పోయాను. నాకు స్పృహ వచ్చేసరికి మా నాన్న, "ఉన్నారు, బాబా ఉన్నారు. లేమ్మా" అంటున్నారు. అంతేకాదు, అదేరోజు సాయంత్రం అమ్మానాన్న నన్ను బాబా గుడికి తీసుకొని వెళ్లారు. ఇది నా మొదటి అనుభవం.


ఇంటర్ చదువుతున్నప్పుడు అనారోగ్యం వల్ల నేను కాలేజీకి రెగ్యులర్‌గా హాజరు కాలేదు. అయినప్పటికీ ఇంటర్ రెండు సంవత్సరాలూ ఏ సబ్జెక్టులోనూ తప్పిపోకుండా అన్నీ సబ్జెక్టులు పాసయ్యాను. ఇది సాయి సచ్చరిత్ర పారాయణ చేయడం వల్లే సాధ్యమైంది. అయితే నేను తర్వాత సాయిబాబాకి దూరమయ్యాను. డిగ్రీలో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను. ఎలాగో ఆ సబ్జెక్టులు పాసై ప్రైవేట్ స్కూలులో టీచరుగా చేరాను. తరువాత నాకు పెళ్లైంది. మా నాన్న వద్ద ఉండేటప్పుడు ఆయన ఉద్యోగస్తులవ్వటం వలన అమ్మానాన్న, నేను, చెల్లి హాయిగా ఉండేవాళ్ళము. కానీ నా భర్తది వ్యవసాయ కుటుంబం. వాళ్లకు మామిడి తోటలు, గేదెలు ఉన్నాయి. వాళ్ల వ్యవహారాలు, మాటతీరు, జీవనశైలి అన్నీ చాలా వేరుగా ఉంటాయి. నాకు వంట రాదు. వాళ్ల వంట నాకు పడేది కాదు. ఉదయం పూట టిఫిన్ అయితే అసలే ఉండేది కాదు. అందువల్ల నా ఆరోగ్యం పాడయ్యింది. అతి కష్టం మీద నేను గర్భవతినైనా ఒక నెల వరకు వాళ్ళింట్లో ఉన్న తర్వాత మా అమ్మ వాళ్ళింటికి వచ్చి హాయిగా ఉండసాగాను. అచ్చం మా నాన్న పోలికలతో నాకు పండంటి పాప పుట్టింది. పాప చిన్నది కావడంతో నేను మొదట్లో తనని చూసుకోలేకపోయేదాన్ని. నా భర్త దగ్గరకి వెళ్లిన వారం, పది రోజులలో పాప ఆరోగ్యం పాడయ్యేది. దాంతో నేను పాపను తీసుకొని మా నాన్న దగ్గరకి వచ్చేదాన్ని. అక్కడికి రాగానే పాప ఆరోగ్యం కుదుటపడేది. ఇలా ఉండగా కరోనా సెకండ్ వేవ్‌లో నాన్న స్వర్గస్థులయ్యారు. ఆ తరువాత అమ్మ ఆరోగ్యం క్షిణించింది. దాంతో నన్ను, నా పాపని అత్తగారింట్లోనే ఉండమన్నారు అమ్మ, చెల్లి. మేము రెండు సంవత్సరాలు చాలా ఇబ్బందిపడ్డాము. ప్రతినెలా నాకు, పాపకి జ్వరం, వాంతులు, ఇవికాక పాపకి జలుబు, దగ్గు, కడుపులో ఇన్ఫెక్షన్ ఉంటుండేవి. ఇలాంటి పరిస్థితుల్లో నా స్నేహితురాలు శ్రావణి నా పరిస్థితిలో మార్పు రావాలని, "రోజూ ఉదయం నిద్రలేవగానే, రాత్రి పడుకొనేముందు బాబాకి దణ్ణం పెట్టుకో" అని నాతో చెప్పింది. నేను అలాగే చేశాను. ఆశ్చర్యం! కొన్ని నెలల్లో మార్పు వచ్చింది. మా అమ్మ మా ఊర్లో అద్దెకు ఇల్లు తీసుకోమని, వచ్చి మాతోనే ఉండసాగింది. మూడవరోజు బాబా నాకు స్వప్న దర్శనమిచ్చి, "ఈ ఇంట్లో నువ్వే కాదు నేనూ ఉంటున్నాను, మీతో పాటు తింటున్నాను" అని అన్నారు. బాబా మాటలు నాకప్పుడు అర్థం కాలేదు కానీ, కొన్ని రోజులయ్యాక నన్ను కొత్త ఇంటికి మార్చి, అమ్మను తోడుగా ఉండేలా చేసి ప్రతిరోజూ నేను కోరుకుంటున్న కోరికను నెరవేర్చింది బాబానే అని అర్థమై నాకు తోడుగా బాబా ఉన్నారని చాలా ఆనందపడ్డాను. ఇలా బాబా అనుగ్రహం నా మీద ఉంది. ఆయనే నన్ను నడిపిస్తున్నారు. నేను బాబా మీద నమ్మకంతో ప్రతిరోజూ బాబాని ధ్యానించటం, సచ్చరిత్ర పారాయణ, 'సాయి మహారాజ్ సన్నిధి' పారాయణ చేయటం చేస్తున్నాను. ప్రస్తుతం అవి నా దినచర్య అయిపోయాయి. "బాబా! మీ కృపకు కృతజ్ఞురాలిని తండ్రీ".


ప్రతి కష్టంలో తోడుగా ఉండే బాబా

నా పేరు సరిత. నాకు ఏ కష్టమొచ్చినా నేను సాయిని తలుచుకుంటాను. ఆయన నన్ను ఎన్నోసార్లు కాపాడారు. నా భర్త చనిపోయాక ఇంట్లో చాలా కష్టంగా ఉండటంతో నేను ఒక ప్రైవేటు పాఠశాలలో జీకే టీచరుగా చేరాను. నేను ఆ పాఠశాలలో చేరేసరికి 5వ తరగతికి క్లాస్ టీచర్ లేనందున నన్ను క్లాస్ టీచరుగా నియమించారు. ఆ సంవత్సరం ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తుండగా ప్రోగ్రస్ రిపోర్టులు తయారు చేయాల్సి వచ్చింది. అయితే 5వ తరగతి రిజిస్టర్ కనిపించలేదు. దాంతో నాకు చాలా భయమేసింది. ఎందుకంటే, మా ప్రిన్సిపాల్ మేడం చాలా కోపిష్టి. ఆవిడ వెనకముందు చూడకుండా అందరిముందు తిడతారు. నాకు ఏం చేయాలో అర్ధంకాక, "సాయిబాబా! మీరే వున్నారు. ఎలాగైనా రిజిస్టర్ దొరకాలి" అని బాబాను వేడుకున్నాను. విషయం స్కూలులో టీచర్ల అందరికీ తెలిసి వాళ్ళు కూడా, 'రిజిస్టర్ పోయిందని ప్రిన్సిపాల్ మేడంకి తెలిస్తే,  ఇంకేం లేదు అందరినీ ఇష్టమొచ్చినట్లు తిడతార'ని టెన్షన్ పడ్డారు. నేను అయితే రెండు రోజులు తిండి తినకుండా ఏడుస్తూ 'సాయిబాబా.. సాయిబాబా' అని అనుకుంటూనే ఉన్నాను. బాబా అద్భుతం చేశారు. రిజిస్టర్ LKG తరగతి గది కప్ బోర్డులో దొరికింది. ఇలా నా ప్రతి కష్టంలో బాబా నాకు తోడుగా ఉన్నారు. నిజంగా ఆయన లేకపోతే నేను ఈరోజు ఉండేదాన్ని కాదు. "శతకోటి ధన్యవాదాలు బాబా. నాకు, నా పిల్లలకి ఏ కష్టం లేకుండా చూసుకోండి బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1697వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఆశీర్వాదం
2. బాబాని నమ్ముకో - నీ సమస్యలన్నీ తొలగిపోతాయి

బాబా ఆశీర్వాదం

సాయిభక్తులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నా చిన్నతనం నుంచి మా అమ్మకి సాయిబాబా అంటే చాలా నమ్మకం. అమ్మ చెప్పేవి వినడం వలనో ఏమో నాకు కూడా బాబా మీద భక్తి, విశ్వాసాలు కుదిరి ఆ వయసునుంచే బాబాని పూజించడం మొదలుపెట్టాను. నేను ఏది కోరుకున్నా అది నెరవేర్చేవారు బాబా. అలా నాకు చాలా అనుభవాలు జరిగాయి. 2020లో నా గర్భసంచిలో సమస్య వచ్చి ప్రతినెలా నెలసరి వచ్చినప్పుడు నేను చాలా ఇబ్బంది పడుతుండేదాన్ని. అందుచేత నేను ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకొని హాస్పిటల్‌కి వెళ్లేముందు దారిలో బాబా గుడి వద్ద ఆగి బాబాని వేడుకున్నాను. ఆ సమయంలో బాబా నన్ను చూసి నవ్వినట్టు అనిపించింది. తర్వాత నేను హాస్పిటల్‌కి వెళ్ళాక డాక్టరు టెస్ట్ చేసి, "త్వరగా ఆపరేషన్ చేయించుకోండి. ఆలస్యం చేయవద్దు" అని చెప్పారు. ఒక నెల తర్వాత నేను ఆపరేషన్ చేయించుకోవడానికి హాస్పిటల్‌కి వెళ్లి, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. డాక్టర్, "లాప్రోస్కోపీ చేయించుకోమ్మా, కుట్లు అయితే చాలా బాధపడాలి" అని చెప్పారు. అయితే మా వాళ్లెవరికీ లాప్రోస్కోపీ ఇష్టం లేదు, నాకు కూడా ఇష్టం లేదు. అందువల్ల, "వద్దండి, నేను కుట్లు వేసే ఆపరేషనే చేయించుకుంటాన"ని చెప్పాను. ఆయన నాకు చాలా నచ్చజెప్పాలని చూసారుకానీ, నేను ఒప్పుకోలేదు. చివరికి, "సరే, నీ ఇష్టం అమ్మా" అని తర్వాత రోజు అంతా సిద్ధం చేసి నన్ను ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లారు. బాబా చూసుకుంటారనే ధైర్యంతో నేను ఆయన్ని తలుచుకుంటూ, సాయి అష్టోత్తరనామాలు చదువుకుంటూ మంచం మీద పడుకున్నాను. అంతే, నాకేమీ తెలియలేదు, కాస్త కూడా నొప్పి అనిపించలేదు. నాతోపాటు ఆపరేషన్ చేయించుకున్నవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని నర్సులు చెప్తుంటే, నేను మాత్రం మర్నాడు ఉదయమే లేచి నడిచాను. ఈరోజు వరకూ నేను ఏ కాస్త కూడా ఇబ్బంది పడలేదు. ఇదంతా బాబా ఆశీర్వాదమే. ఈనాటికీ ఈ అనుభవాన్ని గుర్తు తెచ్చుకుంటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈమధ్యనే ఈ బ్లాగు నా కంటపడింది. తోటి భక్తుల అనుభవాలు చదివాక నా అనుభవం పంచుకోవాలనిపించి ఇలా పంచుకున్నాను. "శతకోటి ధన్యవాదాలు బాబా. నా కొడుకు గురించి మీకు తెలుసు. వాడి ఆరోగ్యం సరి అయ్యేలా చూడు తండ్రీ. ఇంకో కోరిక కూడా మిమ్మల్ని కోరుకున్నాను. అవి నెరవేరితే మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను. త్వరగా అవి నెరవేరేలా చూడు బాబా".


బాబాని నమ్ముకో - సమస్యలన్నీ తొలగిపోతాయి


నా పేరు హారిక. నేను లండన్ నివాసిని. 2018 వరకు నేను బాబా భక్తురాలిని కాదు. ఆ సంవత్సరం నేను ఒక మంచి ఉద్యోగం సంపాదించే ప్రయత్నంలో చాలా కష్టపడ్డాను. ఆ సమయంలో నాకు బాబాపట్ల నమ్మకం లేకపోయినప్పటికీ మా బంధువులు, "బాబాని నమ్ముకో. నీ సమస్యలన్నీ తొలగిపోతాయి" అని చెప్పారు. తర్వాత ఒకరోజు ఉదయం 6 గంటలప్పుడు నేను నిద్రలో ఉన్నప్పుడు స్వప్నంలో బాబా నా ముందు కూర్చొని నవ్వుతూ, "నువ్వు నన్ను నమ్మట్లేదు. అందుకే నీకు ఉద్యోగం రావట్లేదు" అని అన్నారు. దాంతో నేను బాబా మీద నమ్మకముంచి సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టాను. వారంలోపు నాకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది.


ఈమధ్య మా ఆఫీసులో నా సహోద్యోగి ఒకతనికి ఛాతీలో నొప్పి వచ్చింది. అతను చాలా భయపడిపోయాడు. నేను, "అతనికి సహాయం చేయండి బాబా" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల పది నిమిషాల్లో అతని ఛాతీనొప్పి తగ్గింది. తర్వాత అతనికి టెస్టుల నిమిత్తం హాస్పిటల్‌కి తీసుకెళ్ళారు. అప్పుడు నేను మళ్లీ బాబాను, "అతని టెస్టు రిపోర్టులన్నీ నార్మల్‌గా వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. బాబా కృపతో రిపోర్టులన్నీ నార్మల్‌గా వచ్చి అతను ఇప్పుడు బాగున్నాడు. "బాబా! మీ సహాయానికి ధన్యవాదాలు. మీ ఆశీస్సులు ఎప్పుడూ నాతోనే ఉంటాయని నమ్ముతున్నాను బాబా. నేను ఫైల్స్ సమస్యతో బాధపడుతున్నాను. నా కర్మలన్నీ తొలగించి ఆరోగ్య సమస్యలు నుండి బయటపడేందుకు నాకు సహాయం చేయండి బాబా. ఏదో విధంగా నన్ను అనుగ్రహించండి బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1696వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • సాయినాథుని అండదండలు

నేను ఒక సాయిభక్తురాలిని. 2023, జూన్ 18న నేను, నా కుటుంబం శిరిడీ వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నాము. అయితే అవి ఆర్ఏసీ టికెట్లు. ఆర్ఏసీ 125 ఉంది. మా స్నేహితులు, "మీ శిరిడీ ప్రయాణం జరగదు. టికెట్లు కన్ఫర్మ్ కావు" అని ఒకటే ఊదరగొట్టారు. నేను వాళ్ళతో, "నేను సాయి బిడ్డను. ఎలాగైనా నన్ను, నా కుటుంబాన్ని ఆయన శిరిడీకి రప్పించుకుంటారు. ఏదో అద్భుతం చేస్తారు" అని బల్లగుద్ది చెప్పాను. నేను చెప్పినట్టే టికెట్లు కన్ఫర్మ్ అవ్వడంతో మేము ఎంతో సంతోషంగా సాయి దర్శనానికి శిరిడీ ప్రయాణమయ్యాము. అక్కడికి వెళ్ళాక ఒక చిన్న కారణంగా మాకు భక్తినివాస్‌లో రూము దొరకలేదు. అందుకు నేను చాలా బాధపడి బాబా మీద అలిగాను, 'నిన్ను చూద్దామ'ని వస్తే రూమ్ దొరకలేద'ని బాబాతో పోట్లాడాను. మళ్లీ అంతలోనే ఆయన చరిత్రలో 'కొబ్బరికాయ సమర్పించాలని వచ్చిన ఒక భక్తురాలి ముక్కెర కనపడకుండా పోవడం, కొబ్బరికాయ సమర్పించగానే దొరకడం' గుర్తొచ్చి బాబా ఇష్టమైనవాళ్ళని ఆటపట్టిస్తారని, నన్ను కూడా కాస్త ఆటపట్టిస్తున్నారు అనుకున్నాను. అదే నిజమేమో! మాకు రూము దొరకకపోయినప్పటికీ మాతోపాటు వచ్చిన చుట్టాలకి రెండు రూములు దొరికాయి. వాళ్ళు మేము వద్దన్నా ఒక రూము మాకు ఇచ్చారు. అలా సాయి మా వసతి సమస్యను తీర్చారు.


నేను శిరిడీ వెళ్ళినప్పుడు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వంటివి తీసుకెళ్లడం మర్చిపోయాను. నేను తీసుకెళ్లిన డబ్బంతా ఖర్చు అయిపోవస్తున్న తరుణంలో చుట్టాలని అడగటం ఇష్టంలేక అవసరమైతే గూగుల్ పే, ఫోన్ పే ఉన్నాయిగా అనుకొని శనిసింగణాపూర్‌కి బయలుదేరాను. అప్పుడు మా వద్ద ఉన్న డబ్బులు లెక్క పెట్టి పర్సులో పెట్టాము. ఆరోజు శనిసింగణాపూర్‌లో దర్శనం చేసుకుని మరుసటిరోజు తెల్లారి తిరుగు ప్రయాణమవుతున్నప్పుడు మా చెల్లి ఇంకోసారి డబ్బులు లెక్కపెడితే పర్సులో ఉండాల్సిన దానికంటే 2,500 రూపాయలు అదనంగా ఉన్నాయి. అది చూసి మేము, 'నిన్న లెక్కపెడితే అంత తక్కువగా ఉంది కదా! ఇంతలో 2,500 రూపాయలు అదనంగా ఎలా వచ్చాయ'ని ఆశ్చర్యానికి లోనై, 'ఆ డబ్బు సాయి తప్ప ఇంకెవరు పెట్టగలరు? మా ఇబ్బంది గ్రహించి, మేము బాధపడకూడదని ఆయనే ఆ డబ్బు మా పర్సులో పెట్టార'ని అనుకున్నాము. అప్పుడు మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ అనుభవాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. మా జీవితంలో ఇటువంటి అనుభవం ఊదీ విషయంగా ఇంతకుముందు ఒకసారి జరిగింది.


మేము మా ఇంట్లో ఎవరికి ఏ అనారోగ్య సమస్య వచ్చినా ఊదీనే ఔషధంగా వాడతాం. అదే మా రోగనివారిణి. 2017లో మేము శిరిడీ వెళ్ళినప్పుడు ఊదీ తెచ్చుకొని ఒక డబ్బలో నింపుకున్నాం. ఒకసారి మా పక్కింటి ఆంటీవాళ్ళు వాళ్ళింట్లో ఒకరి ఆరోగ్యం బాగాలేకపోతే ఊదీ అడిగారు. మా చెల్లి వాళ్లకి ఊదీ ఇచ్చాక, "అక్కా! ఇంకా కొంచమే ఊదీ ఉంది" అని అంది. నేను తనతో, "పర్లేదులే, మనం మళ్లీ శిరిడీ వెళ్తాం కదా!" అని చాలా ధీమాగా అన్నాను. కానీ మేము నాలుగు సంవత్సరాల వరకు శిరిడీ వెళ్లలేకపోయాము. అయినప్పటికీ మా ఇంట్లో ఊదీ నిండుకోలేదు. ఎంత వాడుతున్నా తరగకుండా డబ్బలో ఉన్న ఊదీ ఉన్నది ఉన్నట్లే ఉంది. అలాగని ఎవరూ శిరిడీ నుండి ఊదీ తెచ్చి మాకు ఇవ్వలేదు. సాయికి మాకు ఏం కావాలో, ఎంత కావాలో తెలుసు. ఏ సమయంలో ఇవ్వాలో ఆ సమయానికి ఏదో ఒక రూపంలో అన్నీ మాకు అందజేస్తారు.


ఒకప్పుడు మా చెల్లికి తరచుగా దగ్గు వస్తుండేది. ఎన్ని హాస్పిటళ్లకు తిరిగినా తగ్గలేదు. చివరికి టీబీ టెస్ట్ చేయించాము. బాబా దయవల్ల ఆ వ్యాధి లేదని వచ్చింది. కానీ చెల్లి దగ్గుతో ఇబ్బంది పడుతూనే ఉండేది. అప్పుడు అమ్మ, చెల్లి ఇద్దరూ దగ్గు తగ్గిపోవాలని సాయికి ఉపాసవముండటం నచ్చదని తెలిసి కూడా ఐదు గురువారాలు ఉపవాసం ఉన్నారు. ఆనాటినుండి ఈనాటివరకు మా చెల్లి మళ్లీ ఆ దగ్గు సమస్యతో బాధపడలేదు. ఈమధ్య ఒక అర్థరాత్రి మా చెల్లికి తీవ్రమైన తలనొప్పి వచ్చింది. టాబ్లెట్ వేసినా తగ్గలేదు. నేను మూడుసార్లు 'సాయిరక్ష' స్తోత్రం చదివి 'సాయిరాం' అని 108 సార్లు జపించాను. అంతే, క్షణాల్లో తలనొప్పి అదృశ్యమైంది. ఇలా అన్ని విషయాల్లో ఆ సాయినాథుని అండదండలు మాకు ఉన్నాయి. ఆయన మాకు ఎటువంటి అనారోగ్యాలు రాకుండా కాపాడుతున్నారు.


నేను ఒక కోర్టు వ్యవహారంలో ఉన్నాను. ఆ కేసుని  డీల్ చేస్తున్న లాయర్ నాతో చాలా దురుసుగా ప్రవర్తిస్తూ అమర్యాదగా మాట్లాడుతుంటే ఆ విషయాన్ని సాయికి చెప్పికొని  బాధపడ్డాను. తర్వాత ఒకరోజు ఆ లాయరుని కలవాల్సిన అవసరం వచ్చింది. నేను వెళ్లేముందు సాయిని, "ఆ లాయరు ప్రవర్తన ఏమీ బాగోలేదు. నాకు సహాయం చేస్తాడా?" అని అడిగి 'క్వశ్చన్ అండ్ ఆన్సర్' వెబ్సైటులో చూస్తే, "యువకుడు నీకు సహాయం చేస్తాడు" అని వచ్చింది. నిజంగానే అతను ఆరోజు ఎంతో మర్యాదగా సమాధానం చెప్పి నాకు సహాయం చేస్తానని మాటిచ్చాడు. ఇలా ఆ సాయినాథుడు చిన్న విషయంలో అయినా, పెద్ద విషయంలో అయినా మా కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. "ధన్యవాదాలు సాయి. నన్ను దీవిస్తున్నట్టే మీ భక్తులందరినీ దీవించు బాబా".


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.


సాయిభక్తుల అనుభవమాలిక 1695వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఊహించని రీతిలో అనుగ్రహించిన బాబా
2. నా తండ్రి బాబా అనుగ్రహం
3. ఊదీ మహిమ

ఊహించని రీతిలో అనుగ్రహించిన బాబా

నేను ఒక సాయి భక్తురాలిని. బాబా పరిచయం కాకముందు మాకు ఏ రకంగానూ కలిసి రాలేదు. ఒకరోజు నా మేనమామ ఇంటికి వెళ్ళినప్పుడు మా అత్తయ్య "బాబాని పూజించుకోమ"ని చెప్పి మొదటిసారి బాబా గుడికి తీసుకొని వెళ్ళింది. ఇక అప్పటినుంచి మాకు అంతా కలిసి వచ్చింది. మా పిల్లలు చదువులు పూర్తి చేసుకొని జీవితంలో మంచిగా స్థిరపడ్డారు. మా అబ్బాయి తన కుటుంబంతో ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. మా అమ్మాయి, మా అబ్బాయి, కోడలు అందరూ బాబా భక్తులే. బాబా దయవల్ల అందరమూ సంతోషంగా ఉన్నాము. ఇకపోతే, బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటాను.

2021, మే 1న మావారికి, అల్లుడికి మధ్య చిన్న చిన్న మాటలతో మొదలై పెద్ద గొడవ జరిగింది. దాంతో మా అల్లుడు, అమ్మాయి ఇక మా ఇంటికి రామని, మీకు, మాకు ఏ సంబంధం లేదని చెప్పి మనవరాలిని తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు మా ఇంటికి రాకపోతే నేను భరించలేను. ఆస్ట్రేలియాలో దూరంగా ఉంటున్న అబ్బాయివాళ్ళు ఎలాగూ రారు. ఇప్పుడు వీళ్ళని కూడా చూడకపోతే ఎలా అని నేను చాలా బాధపడి, "బాబా! సమస్యను సమసిపోయేలా చేసి సంక్రాంతికి మా మనవరాలు వచ్చేలా చేయండి" అని బాబాను మరీమరీ వేడుకున్నాను. తర్వాత మా మనవరాలు అమెరికాకి వెళ్ళిపోయింది. అంటే తను సంక్రాంతికి వచ్చే పరిస్థితి లేదు. కానీ బాబా తలుచుకుంటే మా మనవరాలు ఎలాగైనా వస్తుందని, అదే జరిగితే నా అనుభవాన్ని తోటి సాయిభక్తులతో పంచుకుంటానని నేను అనుకున్నాను. ఎవరూ ఊహించని రీతిలో మా మనవరాలు తన ఫ్రెండ్‌తో కలిసి మా ఇంటికొచ్చి పది రోజులు మాతో చాలా సంతోషంగా గడిపింది. ఇదంతా బాబా అనుగ్రహం కాకపోతే ఇంకేంటి? "చాలా చాలా ధ్యానావాదాలు బాబా. నా మదిలోని కోరికలన్నీ మీకు తెలుసు బాబా. మంచిగా అనుగ్రహించండి".

నా తండ్రి బాబా అనుగ్రహం

నా సాయి తండ్రికి, సాయిబంధువులకు వందనాలు. నా పేరు లలిత. నేను కర్నూల్‌లో ఒక వెల్నెస్ కోచ్‌ని. అంటే ఆరోగ్యం బాగుండటానికి గైడెన్స్ ఇస్తూ ఉంటాను. ఆ విధంగా ఒక సంవత్సరం నుంచి ప్రతినెల ఒక ఇద్దరు, ముగ్గురికి సహాయం చేస్తుండగా 2023, సెప్టెంబర్ నెలలో ఒక్కరికి కూడా సహాయం చేయలేకపోయాను. అందువల్ల నాకు ఏదోలా అనిపించి అక్టోబర్ నెల మొదటి వారంలో నేను బాబాని, "బాబా! ఈరోజు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను. నా స్టేటస్ చూసి ఎవరో ఒకరు నాకు కాల్ చేసి సహాయం అడగాలి. ఇది ఖచ్చితంగా జరగాలి బాబా. ప్లీజ్ జరిపించండి" అని వేడుకున్నాను. బాబా దయ చూపించారు. మరుసటిరోజు ఉదయం ఒక ఆమె, 'నాకు మీ సహాయం కావాలి' అని నాకు మెసేజ్ చేశారు. దాంతో నేను ఆమెకి ఆరోగ్యం గురించి మంచి అవగాహన కల్పించాను. నిజానికి ఆమె ఆరు నెలలుగా నన్ను ఫాలో అవుతూ, నన్ను సహాయం అడుగుదామని అనుకుంటూ కూడా అడగలేకపోయారట. అలాంటిది నేను బాబాని అడిగిన మరుసటిరోజే అడిగారంటే అది నా తండ్రి అనుగ్రహమే కదా!  "నా మీద కరుణ చూపించినందుకు ధన్యవాదాలు సాయి. ఎప్పుడూ ఇలానే నా మీద, నా కుటుంబం మీద మీ చల్లని చూపులు, దయ ఉండాలని కోరుకుంటున్నాను తండ్రీ. మీకు శతకోటి వందనాలు బాబా".


ఊదీ మహిమ

సాయిభక్తులకు నా నమస్కారాలు. నా పేరు కల్పన. మాది హైదరాబాద్. నేను నా గత అనుభవంలో 'ఎవరైనా గట్టిగా మాట్లాడితే నా తలలో నరాలు కదిలిపోతున్నట్లుండేదని, అప్పుడు నేను, "బాబా! రోజుకు మీ పాటలు తొమ్మిది పాడుకుంటాను స్వామి" అని అనుకున్నానని, బాబా నా మనసులో భావాలను కల్పించి నా చేత సుమారు 25 చక్కని పాటలు వ్రాయించారని, వాటిని పాడుకున్నంతనే వేరే ప్రపంచంలో ఉన్న అనుభూతి కలుగుతుందని, అలా బాబా దయతో నా ఆరోగ్య పరిస్థితి మెరుగైంద'ని పంచుకున్నాను. తర్వాత కూడా నేను బాబా దయతో పాటలు పాడుకుంటూ ఉంటున్నాను. అయితే ఈమధ్య ఎక్కువగా ఉద్రేకపడినా, గట్టిగా మాట్లాడినా తలలో నరాల కదలిక ఎక్కువగా ఉంటుండేది. అప్పుడు నేను భయంతో బాబా ఊదీ రాసుకున్నాను. దాంతో బాబా దయవల్ల నాకు ఆ బాధ తగ్గింది. ఇంకోసారి ఛాతి వెనుక భాగంలో నొప్పి అనిపించినప్పుడు, మరోసారి కంటి దగ్గర నొప్పి వచ్చినప్పుడు కూడా ఊదీ రాసుకున్నాను. బాబా దయవల్ల నా ఛాతి వెనక నొప్పి, కంటి నొప్పి తగ్గిపోయాయి. బాబా ఊదీ మహిమ గలదని, ఏ నొప్పినైనా తగ్గిస్తుందని, బాధలను నివారిస్తుందని చరిత్రలోనే కాదు ఇప్పుడు కూడా నిరూపణ అయింది. "సాయినాథునికి శతకోటి వందనాలు, సర్వజనులను మీరు కాపాడుతారని ఆశిస్తున్నాను తండ్రీ".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo