సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1808వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. పొందిన మేలును విస్మరించి అటూఇటూ తిరిగిన తమ భక్తుని తిరిగి తమకు శరణుపొందేలా చేసిన బాబా
2. నమ్మినవాళ్ళకి బాబా ఎప్పుడూ తోడు ఉంటారు

పొందిన మేలును విస్మరించి అటూఇటూ తిరిగిన తమ భక్తుని తిరిగి తమకు శరణుపొందేలా చేసిన బాబా


నా పేరు కే. నాగశ్రీనివాసరావు. నేను కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండల వాస్తవ్యున్ని. 'సాయి మహారాజ్ సన్నిధి'కి ముందుగా నా నమస్కారములు. ప్రపంచంలోని అనేకమంది సాయిబాబా భక్తులు బాబా ద్వారా తాము పొందిన ఉపకారములను ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటూ ఉన్నందున ఈ బ్లాగును ‘ఆధునిక సచ్చరిత్ర’గా పిలవడంలో అతిశయోక్తి లేదు. నేను ఇప్పుడు ఈ ఆధునిక సచ్చరిత్రలో నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. నేను 25 సంవత్సరాలుగా సాయిబాబా భక్తుడిని. ఆయన వల్ల నేను ఎన్నో ఉపకారాలు పొందాను. సంతాన భాగ్యం కూడా దక్కింది. అయితే నేను ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఒక స్నేహితుడు మాట విని నా కష్టాలు తీరిపోతాయని చర్చికి వెళ్లడం మొదలుపెట్టాను. కానీ, ఆర్థికంగా ఎటువంటి అభివృద్ధి కనపడలేదు. మా ఇంట్లోవాళ్ళు సాయిబాబాని తప్ప వేరే ఏ దేవుణ్ణి పూజించకపోయినా నేను మాత్రం ఆరు నెలలు చర్చకి వెళ్లడం, ఆపై మానేసి మళ్ళీ సాయినాథుని పూజించడం, కొంతకాలానికి సాయినాథుని పూజించడం మానేసి మళ్లీ చర్చికి వెళ్ళటం చేస్తూ ఉండేవాడిని. అలా ఏడు సంవత్సరాలు గడిచాక ఈ మధ్యకాలంలో ఒక స్నేహితుడి మాట విని ఏదో విధంగా డబ్బు సంపాదించాలని ఆన్లైన్ గేమ్స్ ఆడి లక్షల్లో డబ్బు పోగొట్టుకున్నాను. చివరికి ఉండటానికి సరైన ఇల్లు కూడా లేక కుటుంబంతో రోడ్డున పడి చాలా ఇబ్బందులు పడుతూ మనశ్శాంతి లేకుండా పోయింది నాకు. అటువంటి సమయంలో 2024, జనవరి నెలలో సంక్రాంతికి ముందు బాబా నాకు స్వప్నదర్శనమిచ్చారు. ఆ కలలో నేను మా ఊరికి దగ్గరలో ఉన్న సాయిబాబా గుడి తలుపులు తీసి నేరుగా వెళ్లి, 'బాబా' అని అన్నాను. అప్పటీకే బాబా నన్ను చూసి తమలో తాము తిట్టుకుంటున్నారు. నేను బాబా అనగానే ఆయన, “నీకు డబ్బు... !” అని అన్నారు. తర్వాత, "నువ్వు నేరుగా నా దగ్గరకు రాకు. నువ్వు గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి నా వద్దకు రా" అని చాలా స్పష్టంగా చెప్పారు. దాంతో నేను ఆయన చెప్పినట్టే గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి గుడిలోకి వెళ్లాను. బాబా, “ఇతను నన్ను నమ్మి గత 25 సంవత్సరాల్లో ఎన్నో ప్రతిఫలాలు పొందాడు. సంతానం లేకపోతే సంతానం కూడా ప్రసాదించాను. అలాంటిది నన్ను విస్మరించి ఏదేదో చేసాడు" అని తిడుతూ నేను గుడిలోకి వెళ్ళగానే తల ఊపారు. అంతటితో నాకు మెలకువ వచ్చింది. అదివరకు ఈ 'సాయి మహరాజ్ సన్నిధి'లో "నీ డబ్బు ఎక్కడికీ పోదు. ఊరికే ఉండు. అదే వస్తుంది" అని బాబా ఫోటోతో సహా నాకు ఆయన సందేశం కనిపించింది. ఆ విషయం గురించే బాబా కలలో 'నీకు డబ్బు' అని స్పష్టంగా చెప్పారు. ఆ కల వచ్చిన తర్వాత నేను 'బాబా నా వెన్నంటే ఉన్నా ఇన్నాళ్లు నేను ఆ విషయాన్ని గ్రహించలేకపోయాను. ఆయన తప్ప నాకు ఇంకే దేవుడు అక్కరలేద'ని వేరే దేవుళ్లను పూజించడం మానేసాను. ఇప్పుడు బాబా చరిత్ర రోజుకు ఒక అధ్యాయం చదువుతూ బాబాయే నా సర్వంగా జీవిస్తున్నాను. 


నేను రైల్వే వికలాంగుల పాస్ కోసం ఆన్లైన్లో అప్లై చేస్తే డాక్టర్ సంతకం, రిజిస్టర్ నెంబర్ లేదని రిజెక్ట్ అయింది. అప్పుడు డాక్టర్ సంతకం, రిజిస్టర్ నెంబర్లతో రెండోసారి అప్లై చేసాను. అలా అప్లై చేసి ఇంచుమించు మూడు నెలలు గడిచిన తర్వాత ఒకరోజు ఈ బ్లాగులో అనుభవాలు చదువుతున్నప్పుడు, "బాబా! నాకు పాస్ త్వరగా వచ్చేలా చేయండి" అని అనుకున్నాను. అదేరోజు ఆన్లైన్లో చెక్ చేస్తే, '15 రోజుల తర్వాత మీకు సమీపంలో ఉన్న స్టేషన్‌లో మీ కార్డు తీసుకోండి' అని వచ్చింది. అది చూసి నేను ఆశ్చర్యానికి లోనయ్యాను. కస్టమర్ కేర్ వాళ్ళు కూడా, "మీ పాస్ విషయంగా మీకు ఫోన్ వస్తుంది" అని చెప్పారు. కానీ చాలా రోజులు గడిచినా నాకు ఏ ఫోన్ కాల్ రాలేదు. 2024, ఫిబ్రవరి 23, శుక్రవారంనాడు బాబా నిత్య పారాయణం చేస్తూ, "బాబా! ఈరోజు రైల్వేవాళ్ళు నాకు ఫోన్ చేసి, మీ పాస్ తీసుకెళ్ళమని చెప్పేలా చేయి తండ్రీ" అని అనుకున్నాను. అంతే, అరగంటలో నాకు రైల్వేవాళ్ళు ఫోన్ చేసి, "మీ పాసు వచ్చింది. తీసుకుని వెళ్ళండి" అని చెప్పారు. ఇలా బాబా నాకు ప్రతి విషయంలోనూ అండదండగా ఉంటూ నన్ను నడిపిస్తున్నారని నాకు అర్థమైంది. ఇక నా ప్రాణం ఉన్నంతవరకు బాబాని తప్ప ఇంక ఎవరినీ కొలవను. “చాలా చాలా ధన్యవాదాలు బాబా”.


నమ్మినవాళ్ళకి బాబా ఎప్పుడూ తోడు ఉంటారు


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!

సద్గురు శ్రీసాయినాథుని శరత్ బాబూజీ కీ జై!!!


నా పేరు సువర్ణ. బాబా నాకు తల్లి, తండ్రి అన్నీ. బాధైనా, సంతోషమైనా నాకు బాబానే. ఏ చిన్న సమస్య వచ్చినా నేను ఆయనకే చెప్పుకుంటాను. నాకు ఆయన మీద ఉన్న నమ్మకాన్ని, ప్రేమని మాటల్లో వర్ణించడం నాకు కష్టమనిపిస్తుంది. ఆయన నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. అందులో నుండి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో బాబా నన్ను ఆదుకున్న అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. నేను చాలా రోజులు ఉపాధి కోసం ఎంతో ప్రయత్నించాను. ఆ క్రమంలో నేను ఎన్ని కంపెనీలకు నా రెజ్యూమ్ పంపినా వాళ్ళ దగ్గర నుండి నాకు ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదు. చివరికి ఒకసారి యూట్యూబ్‌లో చూసి ఒక ఊద్యోగంకి అప్లై చేస్తే, వాళ్ళు రమ్మని పిలిచారు. కానీ అక్కడ నాకు చేదు అనుభవం ఎదురైంది. నేను ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదు. నేను అప్పుడు చాలా బాధపడ్డాను. "బాబా! నాకు ఎందుకు ఉద్యోగం రావడం లేదు" అని రోజూ బాబాకి చెప్పి ఏడ్చేదాన్ని. ఇలా ఉండగా ఒకరోజు, 'మన బాధలు బాబాకి చెప్పి, వాటి గురించి మార్చిపోవాలి' అని ఒక కొటేషన్ చదివి, బాబాకి చెప్పి వదిలేశాను. అలా వదిలేశానో, లేదో ఒక కంపెనీకి రెజ్యూమ్ మెయిల్ చేసాను. ఒక్క గంటలో వాళ్ళు కాల్ చేసి, "రేపు రండి" అని అన్నారు. బాబా మీద నమ్మకం ఉంచి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. వాళ్ళు నన్ను ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసారు. విచిత్రం ఏంటంటే, తర్వాత నన్ను ఇంటర్వ్యూ చేసిన హెచ్ఆర్ టేబుల్ మీద బాబా విగ్రహం ఉంది. అది చూసి నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. వాళ్ళు నన్ను వెంటనే ఉద్యోగంలోకి తీసుకున్నారు. బాబా నాతోనే వున్నారు. ఈ ఉద్యోగం బాబా అనుగ్రహంతోనే నాకు వచ్చింది. బాబాని నమ్మినవాళ్ళకి ఆయన ఎప్పుడూ తోడు ఉంటారని నేను ఈ అనుభవం ద్వారా తెలుసుకున్నాను.


సాయిభక్తుల అనుభవమాలిక 1807వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అద్భుత అనుగ్రహం
2. పాసయ్యేలా అనుగ్రహించిన బాబా

బాబా అద్భుత అనుగ్రహం


బాబాయే సర్వం అని నమ్మి ఆయన బాటలో నడవాలనుకునే వాళ్ళలో నేను ఒకదాన్ని. ఇంచుమించుగా 20 సంవత్సరాల నుంచి నాకు బాబాతో పరిచయం ఉంది. బాబా నాకు చాలా విషయాలలో తోడుగా నిలిచి నా సమస్యల్ని పరిష్కరించారు. అందులో కొన్నింటిని తోటి సాయి భక్తులతో పంచుకోవాలనుకుంటున్నాను. హిందూ కుటుంబానికి చెందిన అమ్మాయినైన నేను ఒక ముస్లిం అబ్బాయిని ప్రేమించాను. మా పెళ్ళికి మా ఇంట్లో పెద్దవాళ్లు ఒప్పుకోలేదు. నన్ను గృహనిర్బంధంలో ఉంచారు. ఆ సమయంలో నేను భారమంతా బాబా మీద వేసి పెద్దవాళ్ళని మా పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో నేను పడ్డ ప్రతి కష్టంలో నాకు తోడుగా నిలిచారు బాబా. నేను గృహనిర్బంధంలో ఉన్న సమయంలో బాబా పేరుతో నడిచే ఒక టీవీ ఛానల్‌వాళ్ళు బాబా డైరీని ప్రింట్ చేసి, 150 రూపాయలు రుసుము తీసుకొని భక్తులకు పంపిణి చేస్తూండేవాళ్లు. నేను ఆ డైరీ పొందాలని ఆ టీవీ ఛానల్ ఆఫీసుకి ఫోన్ చేసి, డైరీతోపాటు బాబా ఊదీ కూడా పంపమని నా అడ్రస్ చెప్పాను. అయితే వాళ్ళు తమ బ్యాంక్ అకౌంట్‌కి 150 రూపాయలు పంపమని చెప్పారు. గృహనిర్బందంలో ఉన్న నాకు ఆ నగదు పంపడానికి వీలుపడక ఆ విషయం గురించి వదిలేసాను. తర్వాత కొన్నిరోజులకి ఒక రోజు తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక అబ్బాయి ఆ డైరీ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. నేను డబ్బులు ఇచ్చేలోపే ఆ అబ్బాయి మా ఇంటికి దగ్గరలో ఉన్న బాబా గుడి వైపుకు వెళ్లిపోయాడు. అదేరోజు మధ్యాహ్నం నాకు ఒక పార్సిల్ హైదరాబాదు నుంచి వచ్చింది. ఆ పార్సెల్ విప్పి చూస్తే, అందులో బాబా డైరీ ఉంది. నిజానికి ఆ టీవీ ఛానల్‌వాళ్ళు మనం డబ్బులు పంపిన బ్యాంక్ అకౌంట్ నెంబరు, పేరు తనిఖీ చేసుకున్న తర్వాతనే డైరీ పంపుతామని నాతో ఫోన్లో చెప్పారు. అలాంటిది నేను ఎటువంటి డబ్బులు చెల్లించకుండానే నాకు ఆ డైరీ వచ్చింది. దాన్ని బాబాయే నాకోసం పంపించారని నేను మనస్పూర్తిగా నమ్మాను. ఇదే విషయం ఆయన నాకు ముందుగా కల రూపంలో తెలియజేశారు.


ఇకపోతే, నేను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి నేను ఎంత ప్రయత్నించినా మా పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు. అయినప్పటికీ ఎన్నో ఇబ్బందుల తర్వాత బాబా ఆశీర్వాదంతో మా పెళ్లి జరిగింది. పెళ్ళైన సంవత్సరం వరకు మాకు పిల్లలు పుట్టలేదు. ఈ విషయమై నేను బాబాని అడుగుతూ ఉండేదాన్ని. ఒకరోజు కలలో బాబా దర్శనమిచ్చారు. ఆ కలలో నేను బాబాని పిల్లల విషయమై అడగపోబోయేలోపు ఆయన చేతితో ఏదో సైగ చేసి వెళ్ళిపోయారు. తర్వాత ఆ కలలో ఒక చిన్నపాప మా ఆయన తల దగ్గర ఏడుస్తూ నాకు కనిపించింది. ఇంకా ఆ కలలోనే ఆ పాప పెరిగి ఏడు సంవత్సరాల వయసు వచ్చాక తన కాలికి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే మేము కంగారుపడటం కూడా కనిపించింది. సరిగ్గా ఈ కల వచ్చిన నెల రోజులకు నేను గర్భవతినని నిర్థారణ అయింది. నా భర్త పాప కావాలి అనుకున్నారు. నేను 'బాబా కలలో చూపించారు కదా! పాపే పుడుతుంది' అనుకున్నాను. కానీ 2020, జనవరి 13న మాకు బాబు పుట్టాడు. దాంతో నా భర్త నా కల విషయం నమ్మలేదు. అలాగే మా పక్కింటి ఆంటీ కూడా నమ్మలేదు. పాప పుడుతుంది అంటే బాబు పుట్టాడు అని ఎగతాళి చేశారు. కానీ నేను బాబా మాటలను మనస్ఫూర్తిగా నమ్మాను. బాబా దయవల్ల రెండోసారి ప్రెగ్నెన్సీ కష్టమని చెప్పినప్పటికీ బాబు పుట్టిన మూడు నెలలకే నేను రెండవసారి గర్భవతినయ్యాను. ఈసారి బాబా చెప్పినట్లే 2020, డిసెంబర్ 24న నాకు పాప పుట్టింది. అప్పుడు నేను నా భర్త, పక్కింటి ఆంటీలతో, "బాబా నాకు కలలో పాప పుడుతుందని చెప్పారు. అలాగే నాకు పాపం పుట్టింది. బాబా మాటలు ఎన్నటికీ అసత్యం కావు" అని చెప్పాను. ఇలా నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, అన్ని బంధుత్వాలు తామై బాబా నాకు అన్ని విషయాల్లో తోడుగా ఉండి మార్గం చూపిస్తున్నారు. నా జీవితాంతం బాబాతో నా ప్రయాణం ఇలాగే సాగాలని బాబాను మనస్పూర్తిగా వేడుకుంటున్నాను.


పాసయ్యేలా అనుగ్రహించిన బాబా


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు స్వాతి. నేను ఇదివరకు స్కూల్లో టీచరుగా పని చేసాను. కరోనా కారణంగా నా ఆరోగ్యం సహకరించక ప్రస్తుతం స్కూలుకి వెళ్ళకుండా ఇంటి దగ్గర ట్యూషన్ చెప్పుకుంటున్నాను. నేను గతంలో పనిచేసిన స్కూల్ మేడంవాళ్ళ పాలిటెక్నిక్ చదువుతున్న పాప రెండుసార్లు కెమిస్ట్రీ ఫెయిల్ అయింది. మేడం నా దగ్గరకు వచ్చి, "మేడం! మీరు మా పాపకి ట్యూషన్ చెప్పరా?" అని అడిగింది. నేను LKG నుండి పదవ తరగతి వరకు చెప్తున్నందువల్ల ఆ అమ్మాయికి చెప్పడం కుదరదు. ఆ విషయం మేడం గారితో ఎలా చెప్పాలో అర్థంకాక, "నా భర్త ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి ఒక కంపెనీలో పని చేస్తున్నారు. తను చాలా బాగా కెమిస్ట్రీ వివరించి చెప్తారు" అని చెప్పాను. మేడం, "సరే, ఇక మీదే బాధ్యత" అని చెప్పి ఫీజు ఎంతని అడిగారు. నేను, నా భర్త, "ఫీజు వద్దు. తను పాస్ అయిందన్న మాట మాకు చాలు" అని చెప్పాము. నా భర్త ఆ అమ్మాయికి సరిగ్గా రెండు నెలలు కెమిస్ట్రీ చెప్పాక 2024, జనవరి 10న పరీక్ష జరిగింది. ఫిబ్రవరి 27న నేను ఆ అమ్మాయిని "ఇంకా రిజల్ట్ రాలేదా" అని అడిగాను. అందుకు తను, "లేదు మేడం. వస్తే, కాల్ చేసి చెప్తాను" అని అంది. మరుసటిరోజు ఉదయం నేను పూజ చేసేటప్పుడు, "బాబా! ఆ పాప పాస్ అయ్యేలా చూడండి" అని అనుకున్నాను. అదేరోజు మధ్యాహ్నం సరిగ్గా 12:11 నిమిషాలకు ఆ పాప నాకు ఫోన్ చేసి, "మేడం పాస్ అయ్యాను" అని చెప్పింది. అది విని నాకు చాలా ఆనందంగా అనిపించింది. "చాలా ధన్యవాదాలు బాబా. మా పరువు కాపాడారు, ఆ పాప పాస్ అయ్యేలా చేశారు తండ్రీ. చాలా సంతోషం తండ్రీ".


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1806వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. భయపడుతున్న బిడ్డని అక్కున చేర్చుకుని ‘నేనున్నాను భయపడక’ని ఊరడించిన సాయి
2. మనసులో అనుకున్నవి కూడా బాబా వింటారు

భయపడుతున్న బిడ్డని అక్కున చేర్చుకుని ‘నేనున్నాను భయపడక’ని ఊరడించిన సాయి


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్‌కు వేల వేల ప్రణామాలు. నేను ఒక సాయి భక్తురాలిని. బాబా లీలలు నా జీవితంలో అన్నీఇన్నీ కావు. అవన్నీ వ్రాయటానికి నా జీవితం సరిపోదేమో! నేను ఏమీ కోరకపోయినా ఎన్నో సందర్భాలలో నా ఆపదలను గుర్తించి తల్లిలా నన్ను సమస్యల నుండి సాయి రక్షించారు. నా జీవితంలో వచ్చే ఆటుపోట్ల వల్ల నన్ను మానసికంగా ధృడం చేసి తండ్రిలా నా సమర్దతను పెంపొందించారు. నాకు అవసరమైన సమయంలో కళ్ళకు ప్రత్యక్షంగా కనబడకపోయినా తోబుట్టువులా నన్ను ఏదో ఒక రూపంలో ఆదుకున్నారు. నా పరిస్ధితి అగమ్యగోచరంగా ఉన్నప్పుడు గురువులా సరైన దారి చూపారు. 'పరిస్ధితులు నా చేయి దాటుతున్నాయి, నేను నిస్సహాయంగా వున్నాను నువ్వే దిక్కు సాయి' అని ఆయన పాదాలకు సర్వస్య శరణాగతి చేస్తే దైవంలా ఆదుకుంటారు. ఇక నా అనుభవానికి వస్తే.. 


2024, ఫిబ్రవరి నెల చివరి వారంలో నా భర్త వేరే దేశం నుండి అనుకోకుండా బయలుదేరి ఇండియా వస్తుండగా ఆయన ప్రయాణం ఎలా జరుగుతుందో అన్న ఆందోళనతో నాకు చాలా ఒత్తిడిగా అనిపించింది. నాకు అలా అనిపించిందంటే ఖచ్చితంగా ఏదో జరగబోతుందనే సంకేతాలు నాకు అందినట్లే. ప్రత్యేకంగా ఫలానా అని చెప్పలేను కాని అలాంటి సందర్భాలలో నా మనసుకు అశాంతిగా అనిపిస్తుంది. ఆరోజు కూడా అలాగే వుండి నిద్రపట్టలేదు. భయంకరమైన ఆలోచనలు, పీడకలలతో మనసంతా గందరగోళంగా అనిపించి మావారితో ఫోన్లో మాట్లాడాలని ప్రయత్నిస్తే లైన్ కలవలేదు. నా గదిలో చిన్న బాబా పాలరాతి విగ్రహం ఉంది. ఆ బాబా పాదాలు పట్టుకుని, "ఏ ఆపద రాకుండా చూడు తండ్రీ" అని వేడుకున్నాను. తర్వాత నాకు కాస్త నిద్రపట్టింది. నిద్రలో కూడా నా చేయి బాబా పాదాలపైనే వుంది. నిజంగా ఆయనే వచ్చి నా చేయి పట్టుకొని, "భయంలేదు తల్లి, నేను చూసుకుంటా!" అని స్పష్టమైన అభయమిచ్చినట్లు నాకు అనిపించింది. దాంతో ఏ భయం లేకుండా ప్రశాంతంగా నిద్రపోయాను. మరుసటిరోజు ఉదయం అనుకున్న సమయానికి బాబా దయవల్ల నా భర్త ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. అందుకు సాయినాథుని పాదాలకు వేలవేల నమస్సులు తెలియచేసుకుంటున్నాను. నా ఊహలు, భయాలు అర్ధవంతమైనవి కాకపోవచ్చేమో కాని, భయపడుతున్న బిడ్డని అక్కున చేర్చుకుని "నేనున్నాను భయపడకు" అని సాయి నన్ను ఎలా ఊరడించారో ప్రత్యక్షంగా అనుభవించిన నాకు మాత్రమే తెలుసు. "ఎల్లప్పుడూ అద్భుతమైన మీ పాదాలను ఆశ్రయించుకుని బ్రతికే అదృష్టాన్ని నాకు జీవితాంతం ప్రసాదించు సాయితండ్రీ! కలలో కూడా నన్ను నీ పాదాలకు దూరం చేయకు సాయిదేవా!".


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


మనసులో అనుకున్నవి కూడా బాబా వింటారు


శ్రీసాయినాథునికి నా వందనాలు. నేను ఒక సాయిభక్తురాలిని. సాయి తప్ప వేరే దిక్కు లేనిదానిని. బాబా నాకు చాలాసార్లు సహాయం చేసారు. 2024, జనవరి 11న యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల మూత్ర విసర్జన జరిగే ప్రాంతంలో చాలా మంటగా, మూత్రం లీకు అవుతున్న భావనతో ప్రతి 5 నిముషాలకి వాష్ రూముకి పోవాల్సి వచ్చి ఆఫీసులో చాలా ఇబ్బందిపడ్డాను. ఆ విషయం బాబాకి చెప్పుకొని బాధపడ్డాను. తర్వాత మెడికల్ షాపుకి వెళ్లి టాబ్లెట్లు తెచ్చుకొని, "బాబా! ఈ సమస్య తగ్గేలా అనుగ్రహించమ"ని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయవల్ల రెండు రోజులకి సమస్య తగ్గి చాలా ఉపశమనంగా అనిపించింది నాకు. "చాలా థాంక్స్ బాబా".


నేను పెళ్లికి ముందు హాస్టల్ ఉండేటప్పుడు, ఆ హాస్టల్‌కి దగ్గర్లో ఉండే సాయిబాబా గుడికి వెళ్తుండేదాన్ని. పెళ్ళైన తర్వాత 2024, జనవరి 22న మళ్ళీ ఆ గుడికి వెళ్ళాను. ఆ సమయంలో బాబాకి అభిషేకం చేస్తున్నారు. అయితే గతంలో ఉన్న పూజారి ఇప్పుడు లేరు. అతని స్థానంలో కొత్త పూజారి ఉన్నారు. అందువల్ల నేను నా మనసులో, "బాబా! నేను అప్పట్లో మీ దగ్గరకు వచ్చి శుభ్రం చేసేదాన్ని, మీతో చాలా సన్నిహితంగా ఉండేదాన్నని వీళ్ళకి తెలియదు" అని అనుకున్నాను. అంతలో పూజారి నన్ను పిలిచి, "బాబాకి అభిషేకం చేయమ"ని అన్నారు. మనం మనసులో అనుకున్నవి కూడా బాబా వింటున్నారని నాకు చాలా ఆశ్చర్యమేసింది. "ధన్యవాదాలు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1805వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శిరిడీ  యాత్ర

ఓం నమో సాయినాథాయ నమః!!! సాయిబంధువులందరికీ నమస్కారములు. నేను ఒక సాయి భక్తురాలిని. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న మా వివాహ వార్షికోత్సవం. ఆ సందర్భంగా నేను ఆరోజు శిరిడీలో ఉండాలని ఆశపడుతుంటాను. అలాగే ఈ సంవత్సరం 2024, ఫిబ్రవరి 19న బయలుదేరి 20కి శిరిడీ చేరుకొని, మరుసటిరోజు 21, ఉదయం కాకడ హారతి దర్శనం చేసుకుని అనంతరం బయలుదేరి లోనావాలా వెళ్లేలా ప్లాన్ చేసి, టికెట్స్ బుక్ చేసుకున్నాము. అదలా ఉంచితే, వేరే స్నేహితుల బృందంతో కలిసి ఫిబ్రవరి 8న పండరియాత్రకు వెళ్ళే అవకాశం అనుకోకుండా వచ్చింది. కొద్దిరోజుల వ్యవధిలో మళ్లీ శిరిడీ వెళ్ళటానికి ఇబ్బంది అవుతుందేమోనని నాకు అనిపించినప్పటికీ తెగించి పండరి యాత్రకు వెళ్ళాను. బాబా దయవల్ల ఆ యాత్ర అంతా బాగా జరిగి ఫిబ్రవరి 13న ఇంటికి తిరిగి వచ్చాము. ఫిబ్రవరి 19న శిరిడీకి ప్రయాణమవ్వాల్సి ఉండగా ఆలోగా నాకు నెలసరి రావాలి. అది ఖచ్చితంగా జరుగుతుందనే ధైర్యంతోనే నేను 3 నెలల ముందుగా టూర్ ప్లాన్ చేసుకొని టికెట్లు బుక్ చేసుకున్నాను. అంతటి ధైర్యం నాకు ఎందుకంటే, బాబా ఇంతవరకు నాకు ఎప్పుడూ నెలసరి ఆటంకం ఏ విషయంలోనూ కలగనివ్వలేదు. ఆ విషయంలో నాకు ఎన్నోసార్లు నిదర్శనం చూపించారు బాబా. అందుకని పండరి యాత్ర నుండి రాగానే చాలా సాధారణంగా ఒకసారి, "బాబా! శిరిడీ ప్రయాణానికి ముందే నాకు నెలసరి వచ్చేయాలి" అని మనసులో అనుకుని వదిలేసాను. అంతే, బాబా దయవల్ల 14వ తారీఖున నెలసరి వచ్చేసింది. 18వ తారీకుకి 5వ రోజు కూడా ఐపోయింది. అలా మేము బయలుదేరాల్సిన రోజుకి ఒకరోజు ముందే అంతా క్లియర్ ఐపోయేలా బాబా చేసారు.


మేము 20వ తేది ఉదయం 10.30కి శిరిడీ చేరుకొని, రూము తీసుకుని స్నానాలు చేసి గుడి దగ్గరకు వెళ్ళేసరికి మధ్యాహ్న హారతి సమయం అయింది. సమాధి మందిరంకి వెళ్తే ఎలాగూ హారతికి లోపలికి వెళ్ళలేమని ద్వారకామాయికి వెళ్ళాము. లోపల చాలా ఖాళీగా ఉన్నప్పటికీ మా దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నందున అక్కడున్న సెక్యూరిటీ గార్డు మమ్మల్ని ఒకరి తర్వాత ఒకరు విడివిడిగా వెళ్ళిరండి అని సూచించాడు. దాంతో మావారికి నా ఫోన్ ఇచ్చేసి నేను ముందు లోపలికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అరటిపళ్ళు, కిస్మిస్‌లు, ఇంకా ఏవో కలిపి నైవేద్యం తయారు చేస్తున్నారు. అది చూడగానే, 'ఇప్పుడు హారతి అయ్యాక ఈ నైవేద్యం బాబాకు నివేదించి అందరికీ పంచుతార'ని అనిపించి, 'ఎప్పుడూ దర్శనమై బయటికి వచ్చాక ఊదీతో పాటు ఇచ్చే బూందీ ప్రసాదం తీసుకోవడమేకానీ బాబాకు నివేదించిన ప్రసాదాన్ని తినలేదు. ఇప్పుడు బాబాకి నివేదించిన ఈ ప్రసాదం నాకు దొరికితే బాగుండు' అనుకున్నాను. కానీ బయట మావారు ఉన్నందున హారతి పూర్తయ్యేవరకు లోపల ఉండలేక బాబా దర్శనం చేసుకుని బయటికి వచ్చి మావారిని లోపలికి పంపించాను. ఆయన లోపల వుండగానే హారతి పూర్తి అవ్వడంతో బయటికి వచ్చేవాళ్ళకి ఆ ప్రసాదం ఇవ్వడం మొదలుపెట్టారు. దాంతో నేను మావారు రాగానే మళ్లీ వెళ్దామని సిద్ధంగా ఉన్నాను. కానీ మావారు రావడంతోటే, "అక్కడ ప్రసాదం ఐపోయింది. ఇంకేమి లేదు" అని చెప్పారు. అయినా గిన్నెకి అంటుకొని ఉన్న చిన్న పిసర అంత దొరికినా చాలని నేను మళ్ళీ లోపలికి వెళ్ళాను. నేను లైన్‌లో వుండగా నా ముందు ఉన్న ఒక ముగ్గురూ నలుగురు మధ్యలో నుంచి ఖాళీ ప్రసాదం గిన్నెను ధుని వెనక్కి తీసుకు వెళ్ళడం చూసాను. వాళ్ళని రిక్వెస్ట్ చేసి కాస్త గిన్నికి అంటిన ప్రసాదమైన ఇమ్మని అడుగుదామని ముందుకి వెళ్ళేసరికి ధుని వెనక ఉన్న కొలయి దగ్గర ఆ పాత్రని తోమేసి కడిగేసారు. నాకు ఒక్కసారిగా చాలా నిరుత్సాహంగా అనిపించింది. 'బాబా నాకు ప్రసాదం ఇవ్వలేదు, నా కోరిక తీర్చలేదు' అన్న భావం కలిగింది కానీ, 'నాకు ఎంత ప్రాప్తమో! అంతే ఇస్తారు బాబా. అలా బాధ పడకూడదు' అని సరి పెట్టుకున్నాను. అది కూడా బాబా నాకు ప్రసాదించినదే. ఎందుకంటే, సాధారణంగా నాకు కోపం ఎక్కువ. ఎప్పుడూ బాబాపై అలిగేదాన్ని. సరే, ద్వారకామాయి నుండి బయటికి వచ్చి చావడికి వెళ్ళాము. అక్కడ బాబాకి దణ్ణం పెట్టుకున్నాక అక్కడ ఖాళీగా ఉంటే కొంచెం వెనక్కి జరిగి ఒక నిమిషం పాటు కూర్చున్నాను. కళ్ళు తెరిచేసరికి అక్కడ ఉండే మహిళ సెక్యూరిటీ నా దగ్గరకి వచ్చి బాబాకి చావడిలో నివేదించిన కోవా నా చేతిలో పెట్టింది. ఒక్క క్షణం నాకు ఏం అర్థం కాలేదు గానీ తర్వాత ఇలా తట్టింది: 'కాసేపటి క్రితం ద్వారకామాయిలో జరిగింది బాబా నాకు పెట్టిన పరీక్ష అని, నేను సర్డుకుంటానా, లేదా నాకు ప్రసాదం ఇవ్వలేదని అలుగుతనా అని పరీక్షించారని, ఆ పరీక్షలో నేను పాస్ అయ్యాన'ని. దాంతో నాకు చాలా ఆనందమేసింది. ఆ ఆనందాన్ని అనుభవిస్తూ లేచి వెళ్లబోతుంటే ఆ మహిళ సెక్యూరిటీ నన్ను వెనక్కి పిలిచి బాబా శేష వస్త్రాన్ని ఇచ్చింది. ఇక నా మానసిక స్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించగలరానుకుంటాను.


తర్వాత ఎంతో సంతోషంగా సమాధి మందిర దర్శనానికి బయలుదేరాం. దారిలో జామకాయలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తే బాబాకోసం తీసుకుని వెళ్ళాలనిపించింది నాకు. కానీ ప్రస్తుతం సమాధి మందిరం లోపలికి ఏమీ తీసుకొని వెళ్లనివ్వట్లేదు. అయినా సరే బాబాకి నివేదిస్తే నివేదిస్తారు లేకపోతే లేదని రెండు జామకాయలు తీసుకున్నాను. విచిత్రంగా సెక్యూరిటీవాళ్ళు ప్యాకెట్లు, వస్త్రాలు, ప్రసాదాలు అన్నీ తీసేసుకున్నారు కానీ, మా కవరులో ఉన్న జామకాయలను చూసి కూడా వదిలేశారు. నేను తీసుకెళ్లిన ఒక కాగితంతో పాటు ఆ రెండు జామకాయలు సమాధి మందిరంలో పూజారికిస్తే, వాటిని బాబా పాదాల వద్ద పెట్టి, తిరిగి ఇచ్చారు. ఏమని వర్ణించాలి సాయి కటాక్షాన్ని? ఇకపోతే బాబా పాదాల వద్ద ఉంచిన కాగితం ఏమిటంటే, అది మా పాప బయోడేటా. మేము తనకి సంబంధాలు చూడడం మొదలుపెట్టాలనుకొని ముందుగా ఆ బయోడేటాని సాయి పాదాల వద్ద ఉంచి వారి ఆశీర్వాదం తీసుకొని, ఆపై ఎవరికైనా పంపాలని దాన్ని బాబా పాదాలు వద్ద ఉంచాము. అలా మాఘమాసం, ఏకాదశి వంటి పవిత్రమైన రోజున మా అమ్మాయి పెళ్ళి బాధ్యతను బాబాకి అప్పగించి చాలా సంతోషంగా బయటికి వచ్చాము. తర్వాత జామకాయ ప్రసాదం పక్కవాళ్ళకి పంచి మేము కూడా స్వీకరించాము. ఆ తర్వాత కూడా రెండుసార్లు దర్శనానికి వెళ్లినప్పుడు మా పాప బయోడేటాను బాబా పాదాల వద్ద ఉంచి ఆశీర్వదించమని కోరుకున్నాము. "బాబా తండ్రీ! పాపకి ఎన్నో మంచివి ఇచ్చి తనని ఎంతో ఉన్నతస్థానంలో ఉంచావు. రాబోయే చిన్నచిన్న అపాయాలను తొలగించావు. ఇప్పుడు తన జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం పెళ్లి. ఆ విషయంలో కూడా అడుగడుగునా మీరు అన్నీ అయి వుండి, నీ అంగీకారంతోనే అన్నీ ముందుకు నడిపించు బాబా. తన వైవాహిక జీవితం అంతా ఆనందమయంగా ఉండేలా ఆశీర్వదించు బాబా. మీ బిడ్డ మంచిచెడ్డలు మీరే దగ్గరుండి చూసుకోవాలి. ఇలాంటి సంబంధం కావాలి, అలాంటి సంబంధం కావాలి అని నేను కోరను. అది ఏదైనా మీరు పంపినదై ఉండాలి. మీ అంగీకార ముద్ర ఉండాలి. అన్ని పరిస్థితులు అనుకులించేలా చేసి మీ ప్రణాళిక ప్రకారం మీరే నడిపించండి బాబా. నా మనసులో కోరిక ప్రకారం పరిస్థితిని మార్చండి బాబా".


20వ తేదీ సాయంత్రం సంధ్యా హారతి తరువాత ఒక దర్శనం, రాత్రి ద్వారకామాయి దగ్గర శేజారతి చూసి మరుసటిరోజు పొద్దున్నే కాకడ హారతిలో బాబా అద్భుతమైన దర్శనంతో, వారి ఆశీస్సులతో మా పెళ్లిరోజును ప్రారంభించి తరువాత లోనావాలా వెళ్ళాము అక్కడ లోహగఢ్ ఫోర్ట్ అనే ఒక కోట ఎక్కేందుకు వెళ్ళాము. మెట్ల మార్గం మొదలులో కీరదోస ముక్కలు మొదలైన చిరు తినుబండారాలు అమ్ముకునే ఒక అతను మమ్మల్ని ఆపి, “పైకి వెళ్ళేటప్పుడు ఉతానికి కర్ర తీసుకొని వెళతారా?” అని అడిగి మరీ ఒక మీడియం సైజ్ కర్ర లాంటిది ఇచ్చారు. మళ్ళీ “ఇంకొకటి కావాలా?” అని అడిగి మావారికి కూడా ఒకటి ఇచ్చారు. చాలా ఎత్తుగా ఉన్న ఆ మెట్ల సులువుగా ఎక్కడానికి ఆ కర్ర ఎంత ఉపయోగపడిందో నాకు మాత్రమే తెలుసు. మాతో మెట్లు ఎక్కడం మొదలుపెట్టిన మిగతా వాళ్లంతా చాలా కష్టపడుతూ చాలా ఆలస్యంగా పైకి రాగలిగారు. కొండ దిగేటప్పుడు ఆ కర్ర మరింత ఎక్కువగా ఉపయోగపడింది. మేము అడక్కపోయినా, అలాంటిది ఒకటి వాడవచ్చని మాకు తెలియకపోయినా పిలిచి మరీ మాకు కర్రలు ఇచ్చి సహాయపడింది బాబానే అనటంలో నాకైతే ఎటువంటి సందేహం లేదు. లోనావాలాలో 2 రోజులు సంతోషంగా గడిపి ఫిబ్రవరి 24న క్షేమంగా మా ఇంటికి చేరుకున్నాం. ఆ విధంగా మా యాత్రను పూర్తి చేయించారు బాబా. మనసుకు కలిగిన అనుభూతిని పదాలలో పెట్టి వ్రాయడం చాలా కష్టమైన విషయం. ఉన్నది ఉన్నట్లుగా సాయి బంధువులకు అందించ సాధ్యం కాదు. అయినా ఏదో చిరు ప్రయత్నం చేసి ఈ సాయి లీలామృతాన్ని మీ ముందు వుంచాను.


ఓం నమో సాయినాథాయ నమః!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1804వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఉద్యోగ విషయంలో బాబా చూపిన దయ 
2. బాబా అనుగ్రహం

ఉద్యోగ విషయంలో బాబా చూపిన దయ 


నా పేరు మాధవి. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఒకరోజు ఆఫీసులో ఒక సమస్యను పరిష్కరించమని నాకు పని కేటాయించారు. మా మేనేజర్ ఫోన్ చేసి, "అది కొంచెం చిక్కు సమస్య. వీలైనంత త్వరగా చేయండి" అని అన్నారు. నేను అతనికి, "ఎంత సమయం పడుతుందో నేను ఇప్పుడే ఏం చెప్పలేను" అని సమాధానం ఇచ్చాను. కానీ నా పట్ల అతనికి చెడు అభిప్రాయం కలుగుతుందేమోనని భయపడి, "బాబా! నేను నా మేనేజర్‌తో ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే, నన్ను క్షమించి ఈ పని పూర్తి చేసేలా అనుగ్రహించండి” అని బాబాను ప్రార్థించాను. అదృష్టవశాత్తూ నా భర్త నాకు సహాయం చేస్తానన్నారు. ఎందుకంటే, నేను పనికి  కొత్త, నాకు అంత పరిజ్ఞానం లేదు. బాబా దయతో నేను, నా భర్త కలిసి నిర్ణిత సమయానికి 2 రోజుల ముందే పనిని పూర్తి చేయగలిగాము. తర్వాత ప్రొడక్షన్‌లో వచ్చిన సమస్యను కూడా పరిష్కరించడంలో బాబా నాకు సహాయం చేసారు. 


మరొకరోజు వేరే టీమ్‌వాళ్ళు నా పనిలో ఒక బగ్ ఫిక్స్ చేసి, నేను సరిగ్గా కోడ్ చేయలేదన్నారు. దాంతో నేను చాలా టెన్షన్‌ పడ్డాను. నేను ఆ పనికి కొత్త అయినందున నా భర్త సహాయంతో నా పని చేస్తున్నాను. అతనే ఆ కోడ్ వ్రాసింది. కానీ కోడ్ తప్పు ఉందంటే, అతను దాన్ని ఒప్పుకోలేదు. పైగా కోపం తెచ్చుకొని, చాటింగ్‌లో కొంచెం కఠినమైన వాక్యాలు మెసేజ్ చేసారు. దాంతో నేను చాలా భయపడిపోయాను. 'నా టీమ్ లీడ్ ఈ విషయాన్ని ఎలా తీసుకుంటాడో! అతను సానుకూలంగా తీసుకుంటాడా లేక ప్రతికూలంగా తీసుకుంటాడా? అది నా ఉద్యోగంపై ప్రభావం చూపుతుందా?' అని నా మనస్సులో చాలా ఆలోచనలు సాగాయి. నేను చాలా బాధతో, "నా భర్త అంత కఠినంగా ఉండకూడదు. ఏదైనా తప్పు ఉంటే అతను ఒప్పుకోవాలి" అని బాబాను ప్రార్థించి, ఆయన దయతో మావారు మంచిగా స్పందించి వేరే టీమ్‌వాళ్ళకి చక్కగా సమాధానం ఇస్తారని, సమస్యను పరిష్కరిస్తారని ఆశించాను. తర్వాత నేను నా భర్తతో, "ఆవేశపడకండి. దయచేసి వాళ్లతో మంచిగా చెప్పండి" అని చెప్పాను. బాబా దయవల్ల కొద్దిసేపటికి నా భర్త శాంతించి వేరే టీమ్‌వాళ్ల అవసరాలకు అనుగుణంగా సమస్యను పరిష్కరించడానికి ఒప్పుకున్నారు. అంతేకాదు, అవసరమైనది చేస్తానని మంచిగా సందేశం పంపారు. బాబా దయతో ఒక్క రోజులో సమస్య పరిష్కారమైంది. మరుసటిరోజు మీటింగ్‌లో నా టీమ్ లీడ్ బాబా అనుగ్రహం వల్ల సానుకూలంగా స్పందించాడు. అతను మీటింగ్‌లో ఆ విషయం గురించి అస్సలు మాట్లాడలేదు. "చాలా ధన్యవాదాలు బాబా. మీ ఆశీర్వాదం లేకుండా ఏదీ సాధ్యం కాదు బాబా. మీరే నాకు ఈ ఉద్యోగం ఇచ్చారు. అలాగే నేను సబ్జెక్ట్ నేర్చుకునేలా చేయండి బాబా, నాకు మీ ఆశీస్సులు కావాలి తండ్రీ. నా ఉద్యోగ జీవితం గురించి ఆలోచించినప్పుడు నేను కొన్నిసార్లు కొంచెం నిరాశకు గురవుతున్నాను. దయచేసి నా గురువుగా ఉండి అలాగే నా పని నేను చేసుకునేలా ఆశీర్వదించండి బాబా. నేను నా తల్లిదండ్రులకు చాలా దూరంగా ఉన్నందున కొన్నిసార్లు నాకు చాలా విచారంగా ఉంటుంది. దయచేసి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, అన్నిటికీ ధన్యవాదాలు బాబా".


ఓం సాయి రక్షక శరణం!!!


బాబా అనుగ్రహం


నా పేరు శ్రీకాంత్. 2024, ఫిబ్రవరి నెల మూడోవారంలో నా ఆఫీసు పనిలో మా టీం తప్పిదం వల్ల నాకు ఒక పెద్ద సమస్య వచ్చింది.  దానిని పరిష్కరించాలంటే 2 వారాలు ఆగాలి. కానీ అప్పటివరకు క్లయింట్ వేచి ఉండరు. నాకు ఏమి చెయ్యాలో తెలియక వెంటనే, "బాబా! ఈ సమస్య నుండి కాపాడండి" అని సాయిబాబాని వేడుకున్నాను. ఆశ్చర్యంగా మరుసటిరోజు క్లయింట్లు 2 వారాలు వేచి ఉండటానికి సిద్ధంగా ఉన్నారని నాకు మెయిల్ వచ్చింది. దాంతో నేను స్థిమితపడ్డాను. "ధన్యవాదాలు బాబా". 


2024, ఫిబ్రవరి నెల మూడోవారంలో మా అబ్బాయి గొంతు నొప్పి, వాంతులతో ఆరోగ్యం పాడవడంతో అత్యవసరంగా తనని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లాల్సి వచ్చింది. నేను వెళ్ళేముందు బాబాకి "బాబుని హాస్పిటల్ అడ్మిట్ చేయమనకుండా ఉండాలి. తనకి మందులతో తగ్గిపోవాలి" అని వేడుకున్నాను. డాక్టర్ బాబుని చూసి ఒక టాబ్లెట్ ఇచ్చి, “ఒక 30 నిమిషాలు వేచి ఉండమ”ని చెప్పారు. బాబా దయవల్ల వాంతులు ఆగిపోయాయి. దాంతో డాక్టర్, “అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. 5 రోజులపాటు మందులు వాడండి" అని చెప్పారు. నేను ఆనందంగా బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను.



సాయిభక్తుల అనుభవమాలిక 1803వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాక్షాత్తు సాయినాథుడే అందించిన సహాయం
2. బాబా దయతో చాలావరకు తగ్గిన సమస్య

సాక్షాత్తు సాయినాథుడే అందించిన సహాయం


సాయి భగవాన్‌కి శతకోటి వందనాలు. సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు కమల. మేము 2002, మే నెలలో మొదటిసారి శిరిడీ వెళ్లి మంచిగా సాయి దర్శనం చేసుకొని ఎంతో ఆనందంగా తిరుగు ప్రయాణమయ్యాము. సాయంత్రం 5 గంటలకి మన్మాడ్ స్టేషన్‌లో రైలు ఎక్కాల్సి ఉండగా మధ్యాహ్నం 3 గంటలకి మేము మా గది ఖాళీచేసి శిరిడీ బస్సు స్టాండుకని బయలుదేరాము. మాకు ఆటో దొరికి బస్సు స్టాండుకి వెళ్లేసరికి అప్పుడే మన్మాడ్ వెళ్లే బస్సు వెళ్లిపోయింది. ప్రైవేటు వాహనాలు కూడా ప్రయాణికులను తీసుకుని వెళ్ళిపోయాయని అక్కడివాళ్లు చెప్పారు. అప్పటికి సమయం 3:30 దాటిపోతోంది. తొందరగా ఏదో ఒక వాహనం దొరక్కపోతే రైలు వచ్చే సమయానికి మేము మన్మాడ్ స్టేషన్ చేరుకోవడం జరగని పని. మాకు దిక్కుతోచలేదు. నేను కంగారులో రోడ్డు మీద పోయే ఏదైనా ఆటో కనపడితే ఆపాలని రోడ్డు వైపు చూస్తున్నాను. ఇంతలో తెల్లని దుస్తులు, తెల్లని తలపాగ ధరించిన ఒక వ్యక్తి మావారి పక్కకొచ్చి, "ఎందుకు కంగారుపడుతున్నారు?" అని అడిగితే, మావారు విషయం చెప్పారు. అదంతా పట్టించుకునే స్థితిలో లేని నేను, ఏదో ఒక ఆటో దొరికితే చాలన్నట్టుగా రోడ్డుకి అవతల వైపు వెళ్తున్న ఒక వాహనాన్ని ఆపాలని చేతితో సైగలు చేశాను. కానీ ఆ వాహనం ఆగకుండా వెళ్ళిపోయింది. అప్పటివరకూ రోడ్డుకి అటువైపు ఉన్న ఆ వ్యక్తి హఠాత్తుగా నా వెనకలా నుంచి వచ్చి, "కోయి బాతో నాహీ, గాడి మిలేగా(ట్రైను అందుతుంది. కంగారుపడకుండి)" అని హిందీలో చెప్పి నా పక్కన నిలబడి ఆ దారిలో వచ్చే, పోయే వాహనాలను చూడసాగాడు. నాకు ఒక్క క్షణం ఆశ్చర్యంగా అనిపించిందిగాని, మా కంగారులో మేము ఉన్నాము. అందువల్ల ఎవరో ఒక పరిచయం లేని వ్యక్తి, పనిగట్టుకొని కొత్త ప్రదేశంలో, మధ్యాహ్నవేళ, ఎండలో మాతోపాటు నిలబడి మాకు సహాయం చేయాలని ప్రయత్నిస్తుంటే అతని గురించిగాని, అతని సహాయం గురించిగాని ఆలోచించే సమయం మాకు లేకపోయింది. హఠాత్తుగా ఎక్కడినుంచి వచ్చిందో ఒక తెల్లని కారు రోడ్డు మీద కనిపించింది. ఆ కారుని చూడగానే ఆ వ్యక్తి రోడ్డు మీదకి వెళ్ళి చేయి అడ్డం పెట్టి ఆపమన్నట్లు సంజ్ఞలు చేయగానే ఆ కారు మా ముందుకు వచ్చి ఆగింది. ఆ కారు ఖాళీగా ఉండటం చూడగానే మా ప్రాణం లేచి వచ్చింది. ఆ అజ్ఞాత వ్యక్తి కారు డ్రైవర్‌తో మమ్మల్ని మన్మాడ్ స్టేషన్‌లో దింపమని చెపితే, అతను సరేనని మమ్మల్ని కారు ఎక్కమన్నాడు. మేము ఇంకో ఆలోచన లేకుండా కారు ఎక్కాము. కారు కదులుతుండగా మావారు, "మేము దిగాక డ్రైవర్‌కి ఎంత ఇవ్వాల"ని అడిగితే, ఆ అజ్ఞాత వ్యక్తి, "చాలీసు(40) లేలో" అని ఆ డ్రైవర్‌తో చెప్పాడు. డ్రైవర్ ఆఘమేఘాల మీద మమ్మల్ని తీసుకెళ్ళి మన్మాడ్ స్టేషన్ వద్ద దింపాడు. మాకు అంతా ఒక కలలా అనిపించింది. స్టేషన్ లోపలికి అడుగుపెడుతుండగా మేము ఎక్కాల్సిన రైలు వస్తుందన్న అనౌన్స్మెంట్ వినిపించింది. ట్రైన్ ఎక్కి కూర్చున్నాక నెమ్మదిగా జరిగినదంతా తలుచుకొంటే మాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మాములు టాక్సీ అయితే ఎంత కాదన్నా ముగ్గురికి 250 రూపాయలు తీసుకోవాలి లేదా వేరేవాళ్లని అయినా ఎక్కించుకోవాలి. కానీ ఆ డ్రైవర్ అలాంటి ప్రయత్నమేమీ చేయకుండా కేవలం మా ముగ్గురిని స్టేషన్‌లో దింపి, గంటకు పైగా ప్రయాణానికి ముగ్గురుకి కలిపి 120 రూపాయలు మాత్రమే తీసుకుని ఎందుకు వెళ్లిపోయాడు? ముఖ్యంగా మేము ఏ సహాయం అడగకపోయినా తనంతటతానే వచ్చి మమ్మల్ని ఆదుకున్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? తెల్లని వస్త్రాలు ధరించి, తలకి తెల్లని వస్త్రం చుట్టుకున్న ఆ అజ్ఞాత వ్యక్తి రూపాన్ని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తే నిత్యం మేము పూజచేసే బాబా రూపం, చిన్న వయసులో ఉన్న ఆ అజ్ఞాత వ్యక్తి రూపం ఒకేలా ఉన్నాయని అనిపించింది. దాంతో సమయానికి మా దగ్గరకొచ్చింది సాక్షాత్తు ఆ సాయిబాబానే అని, ఆ తండ్రి తమ బిడ్డలకోసం ఎల్లప్పుడూ ఆపన్నహస్తం అందించి ఆదుకోవడానికి సదా మనతోనే ఉంటారని అర్థమైన క్షణంలో నా కళ్లనిండా ఆనందబాష్పాలు కమ్ముకున్నాయి. మనస్సు భక్తిభావంతో నిండిపోయింది. అప్పటి ఆ శిరిడీ ప్రయాణ అనుభవం సదా నా మనస్సులో ఇప్పటికీ పదిలంగా నిలిచిపోయింది. ఆరోజు మేము చూసిన ఆ సాయి రూపం నేటికీ నా కళ్ల ముందు మెదులుతుంది. "ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ మా హృదయంలో, మనసులో ఉండి మమ్మల్ని ఆదుకోండి తండ్రీ. ఎప్పటికీ మమ్మల్ని మీ అడుగుజాడలలో నడిపించండి".


బాబా దయతో చాలావరకు తగ్గిన సమస్య


సాయిభక్తులకు నమస్కారం. నా పేరు రజనీకాంత్. కొన్ని సంవత్సరాలుగా నాన్-వెజ్ తింటే కడుపునొప్పి వచ్చి నాకు చాలా ఇబ్బందిగా ఉంటుండేది. ఈ విషయం గురించి నేను ఒకరోజు ఒక అతనితో చెప్తే, "ఇది చాలా ప్రమాదకరం" అని కొన్ని టాబ్లెట్లు వ్రాసి, "వీటిని వాడు. తగ్గకపోతే స్కానింగ్ తీద్దామ"ని అని అన్నారు. నేను సరేనని ఆ టాబ్లెట్లు తీసుకోవడానికి ఒక మెడికల్ షాపుకి వెళ్లి, అక్కుడున్న అతనితో విషయం చెప్పి "ఈ టాబ్లెట్లు ఇవ్వండి" అని అన్నాను. అతను వేరే టాబ్లెట్లు ఇచ్చి, "ఇవి వాడండి. చూద్దాం" అని అన్నాడు. నేను ఇంటికి వెళ్లి, "బాబా! నాకు ఈ సమస్య చాలాకాలంగా ఉంది. ఇది కాస్త తగ్గేలా అనుగ్రహించండి" అని బాబాను వేడుకొని ఆ టాబ్లెట్లు వాడాను. బాబా దయవల్ల సమస్య చాలావరకు తగ్గింది. "చాలా ధన్యవాదాలు బాబా. నాకు ఇంకా కొన్ని సమస్యలున్నాయి. వాటిని కూడా పరిష్కరించు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1802వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయతో తీరిన మొక్కు
2. అసాధ్యాన్ని సాధ్యం చేస్తూ సమయానికి డబ్బు అందించిన బాబా

బాబా దయతో తీరిన మొక్కు


ఓం శ్రీసాయినాథాయ నమః!!! శ్రీసాయినాథుని దివ్య పాదాలకు శిరస్సువంచి నమస్కరిస్తున్నాను. నా పేరు సంధ్య. 10 సంవత్సరాల క్రితం కుటుంబ కలహాలు, తోడికోడళ్ళ వేధింపుల వల్ల మా అక్క విషం తాగింది. డాక్టర్లు తను బతకడం కష్టమన్నారు. అటువంటి సమయంలో నేను అప్పట్లో ఆరాధించే సంతోషిమాతను శరణువేడి, "అమ్మా సంతోషమాతా! మా అక్కను బ్రతికించు. నేను 16 శుక్రవారాలు వ్రతం చేస్తాను" అని కన్నీటితో వేడుకున్నాను. ఆ తల్లి దయవల్ల ఒక నెల రోజుల్లో మా అక్క కోలుకుంది. అందుకు కృతజ్ఞతగా వ్రతం చేయాలనుకున్నాను. కానీ ఆ వ్రతం సంతోషిమాత గుడిలోనే చేయాలి. గుడిలో 10 గంటలకు పూజారి వ్రతం ప్రారంభిస్తారు. కాబట్టి నేను ఉదయాన్నే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని 9 గంటలకల్లా గుడికి చేరుకోవాలి. కానీ గుడి మేము నివాసముంటున్న ఊరు నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక శ్రావణమాసంలో వ్రతం ప్రారంభించి ఐదు వారాలు చేసి ఆరవ వారం ఉద్యాపన చేశానుగాని కష్టకాలంలో మొక్కిన మొక్కును తీర్చడం నావల్ల కాలేదు. ఒక పది సంవత్సరాలు గడిచిపోయినా 16 వారాల వ్రతం చేయలేకపోయాను. నేను ప్రతిరోజూ ఈ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో భక్తుల అనుభవాలు చదువుతాను. తరచూ బ్లాగులో "మొక్కులు చెల్లించకపోతే కష్టాలొస్తాయి. మొక్కులు చెల్లించి తీరాలి" అని బాబా సందేశం వస్తూ ఉండేది. బాబా అది నాకే చెప్తున్నారనిపించి, "బాబా! నాకు తోడుగా ఉండి నా చేత 16 శుక్రవారాల సంతోషిమాత వ్రతం చేయించి 17వ వారం ఉద్యాపన కూడా చేయించండి. ఉద్యాపన పూర్తికాగానే మీ అపార ప్రేమను 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా సాయి బంధువులతో పంచుకుంటాను సాయీ" అని మొక్కుకున్నాను. తర్వాత ఒక శ్రావణమాసంలో శుక్రవారంనాడు సంతోషిమాత వ్రతం ప్రారంభించాను. సాయిబాబా నాకు తోడుగా ఉండి, నాకు కావాల్సిన శక్తిని ప్రసాదించి 16 వారాల వ్రతాన్ని పూర్తి చేయించి 17వ వారం ఉద్యాపన కూడా చేయించారు. సాయిమాతకు చాలా చాలా కృతజ్ఞతలు.


నా ఇష్టదైవాలు ఈశ్వరుడు, జగన్మాత. ఒకసారి నేను, "మీరు మీ భక్తులకు వారివారి ఇష్ట దైవాలను మీలో చూపించారు కదా బాబా! మరి నాకు ఎప్పుడు చూపిస్తార"ని అడిగాను. ఒకరోజు కలలో ద్వారకామాయిలో ధుని దగ్గర గరళాన్ని తాగుతున్న ఈశ్వరుడు అగ్నిజ్వాలల రూపంలో దర్శనమిచ్చారు. ఇంకోరోజు కలలో సమాధి మందిరంలో బాబా ఉన్న స్థలంలో జగన్మాత నీలంరంగు వస్త్రాలలో ఎనిమిది చేతులతో దర్శనమిచ్చింది. కాసేపట్లో అదే స్థానంలో బాబా దర్శనమిచ్చారు. ఆవిధంగా బాబా తామే ఈశ్వరుడు, జగన్మాత అని నిదర్శనమిచ్చారు. ఇలా ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలను ప్రసాదించిన సాయినాథునికి వేలవేల కృతజ్ఞతలు.


అసాధ్యాన్ని సాధ్యం చేస్తూ సమయానికి డబ్బు అందించిన బాబా

 

ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం. మొదట నేను సాయి భక్తుడిని కాదు కాని, సాయి భక్తుల అనుభవాలు చదివినప్పటినుంచి నేను కూడా సాయి భక్తుడినైపోయాను. ఇటీవల సాయితండ్రి నా జివితంలో చేసిన అద్భుతం వింటే మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు. నేను దుబాయ్‌లో 4 సంవత్సరాలు ఉన్నాక నా వీసా కాలపరిమితి పూర్తి కావడంతో తిరిగి ఇండియాలోని మా ఇంటికి రావడానికి నేను టికెట్ బుక్ చేసుకున్నాను. దుబాయ్ కంపెనీలు కొంతకాలం పనిచేసి తిరిగి వెళ్ళేటప్పుడు కొంత డబ్బు బోనస్‌గా ఇస్తాయి. చాలా కంపెనీలు మనం ఇంటికి రావడానికి 2 రోజులు ముందు ఇస్తుండగా నేను పని చేసిన కంపెనీ మాత్రం ఇంటికి వెళ్లిపోయిన నెల రోజుల తరువాత ఇస్తుంది. చాలామందికి అలానే ఇచ్చారు. అయితే నాకు కాస్త అర్జెంట్‌గా డబ్బుల అందాల్సిన అవసరం ఉండింది. కాని మా కంపెనీ అప్పుడే డబ్బు ఇచ్చే పరిస్థితి లేదని, ఒక నెల తర్వాతే ఇస్తుందని తెలిసిన నాకు ఏం చేయాలో తోచలేదు. అప్పుడే నాకు సాయితండ్రి గుర్తుకు వచ్చి, ఆయన్ని ఒక్కటే కోరుకున్నాను: "తండ్రీ సాయీ! ఎలాగైన నేను ఇంటికి వెళ్ళడానికి ఒకటి, రెండు రోజుల ముందు డబ్బులు వచ్చేటట్టు చూడండి. నేను కోరుకున్నట్టు డబ్బులు నాకు అందితే 10 మందికి అన్నదానం చేస్తాను, ఇంకా మీ అనుగ్రహాన్ని తోటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని. అంతే, ఇప్పటివరకు ప్రతి ఒక్కరికీ నెలా తర్వాతే డబ్బులు వస్తే సాయితండ్రి దయవల్ల నేను వెళ్లడానికి ఒకరోజు ముందే నాకు చెక్ రూపంలో డబ్బంతా కంపెనీ నాకు అందజేసింది‌. నాకు చాలా ఆనందమేసింది. నేను సాయి భక్తులకు ఒక్కటే చెప్తున్నాను, 'సాయితండ్రి మనతో ఉన్నంతవరకు చిన్న చీమ వల్ల కూడా మనకి అన్యాయం జరగదు, బాధ కలగదు. సాయితండ్రిని నమ్ముకుంటే మనకి ఎప్పుడూ అంతా మంచే జరుగుతుంది. "ధన్యవాదాలు బాబా. మీకు మాటిచ్చినట్లు అన్నదానం ఇంకా చేయలేదు. సమయం చూసుకొని చేస్తాను. ఆలస్యానికి క్షమించు తండ్రీ".


సాయి మహరాజ్ కి జై!!!


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo