సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 937వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఇలా పిలవగానే అలా కరుణించే బాబా
2. బాబా అనుగ్రహంతో సకాలంలో పూర్తైన రిజిస్ట్రేషన్

ఇలా పిలవగానే అలా కరుణించే బాబా


సదా నింబవృక్షస్య మూలాధివాసాత్

సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం!

తరుం కల్పవృక్షాధికం సాధయం తం

నమామీశ్వరం సద్గురుం సాయినాథం!!


శ్రీసాయినాథుని దివ్యచరణాలకు నమస్కరిస్తూ నా అనుభవాలను సాటి సాయిబంధువులతో పంచుకుంటున్నాను. నా పేరు మహేష్. 2021, ఆగస్టు చివరి వారంలో మా అమ్మకి జ్వరం వచ్చి, రోజురోజుకీ ఎక్కువ కాసాగింది. మందులు వాడుతున్నప్పటికీ జ్వరం తగ్గలేదు. అప్పుడు వేరే హాస్పిటల్‌కి వెళ్తే, డాక్టరు బ్లడ్ టెస్ట్, టైఫాయిడ్, మలేరియా టెస్టులు చేయించమన్నారు. సరేనని అన్ని టెస్టులూ చేయించాము. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! అమ్మకి ఎలాంటి వైరల్ జ్వరం రాకూడదు. కొంచెం బ్లడ్ తక్కువ ఉందనే రిపోర్ట్ రావాలి" అని వేడుకున్నాను. కాసేపటికి రిపోర్ట్ వచ్చింది. అద్భుతం! రిపోర్టులో 'అమ్మకు ఎలాంటి వైరల్ జ్వరమూ లేదు, కొంచెం బ్లడ్ తక్కువగా ఉంది' అని వచ్చింది. వెంటనే నేను బాబాకు నమస్కరించుకుంటూ బయటకు వచ్చాను. హాస్పిటల్ గేటుపై వ్రాసి ఉన్న 'శ్రీసాయి' అన్న అక్షరాలు చూసిన క్షణాన 'సాయిబాబా ఎల్లప్పుడూ మనతోనే ఉన్నార'ని నాకు అర్థమైంది. సాయినాథుని దయవల్ల అమ్మకి రెండు రోజుల్లో జ్వరం పూర్తిగా తగ్గింది. "మీకు వేలవేల వందనాలు సాయినాథా!".


2021, వినాయకచవితి సమయంలో నా స్నేహితునికి జలుబు చేసింది. అతనితో ఎక్కువగా ఉండటం వల్ల నాకు కూడా జలుబు చేసింది. తరువాత కూడా స్నేహితులతో కలిసి రెండు మూడుసార్లు కూల్‌డ్రింక్స్ త్రాగాము. దాంతో జలుబు విపరీతంగా పెరిగి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దాంతోపాటు ఒంటినొప్పులు కూడా మొదలయ్యాయి. నేను భయపడి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను. అయినా తగ్గలేదు. అప్పుడు, "నా ఆరోగ్యం మంచిగా అవ్వాల"ని మన బాబాను వేడుకున్నాను. అంతే! అంత తీవ్రమైన జలుబు తగ్గుముఖం పట్టింది. అంతా సాయిబాబా కృప. "చాలా ధన్యవాదాలు బాబా".


మా ఊరు సిద్ధిపేటకి దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామం. మా అక్క, అన్నయ్య వాళ్ళు హైదరాబాదులో ఉంటారు. మా నాన్న పేరు మల్లయ్య. నాన్నకి చదువు రాదు. అయినా ఒక్కరే అప్పుడప్పుడు హైదరాబాదు వెళ్లొస్తుంటారు. అలాగే 2021, సెప్టెంబరు 20, మధ్యాహ్నం ఒంటగంటకు బయలుదేరి అక్క, అన్నయ్యలను చూడాలని నాన్న హైదరాబాదు వెళ్ళారు. ఆ సాయంత్రం అన్నయ్య ఫోన్ చేసి, "నాన్న ఇంటికి ఇంకా రాలేదు" అని చెప్పాడు. దాంతో అందరం చాలా ఆందోళన చెందాము. మా మామయ్యవాళ్ళకు, బావవాళ్లకు 'నాన్న వచ్చాడా?' అని పదేపదే ఫోన్ చేస్తూ ఉన్నాం. అయితే మధ్యాహ్నం బయలుదేరిన నాన్న రాత్రి 8.30 దాటినా అన్నయ్య, అక్కల వద్దకు చేరలేదు. నాకు ఒకటే కంగారుగా అనిపించి, "బాబా! నాన్నని  క్షేమంగా అక్క, అన్నయ్యల వద్దకు చేర్చు" అని బాబాను మనస్ఫూర్తిగా వేడుకున్నాను. ఆశ్చర్యం! బాబాని వేడుకుని 10 నిమిషాలైనా కాలేదు, అన్నయ్య ఫోన్ చేసి, "నాన్న ఇప్పుడే అక్కావాళ్ళ ఇంటికి వచ్చాడు" అని చెప్పాడు. పిలిచిన వెంటనే పలికే దైవం మన బాబా. ఇలా పిలవగానే అలా కరుణించారు.


ఒకరోజు మేము కొమురవెల్లి శ్రీమల్లిఖార్జునస్వామిని దర్శించుకుందామని సిద్ధమయ్యాము. ఆరోజు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. అప్పుడు నేను, "బాబా! వర్షం తగ్గించి మాకు మల్లిఖార్జునస్వామి దర్శనం చేయించు" అని బాబాను వేడుకున్నాను. కొద్దిసేపట్లోనే వర్షం తగ్గింది. మేము మా ఊరిలో ఉన్న ఒక ఆటో అతనికి ఫోన్ చేశాము. అతను వెంటనే వచ్చాడు. ఆ ఆటోడ్రైవరు పేరు సాయి. అతను మమ్మల్ని అరగంటలో కొమురవెల్లికి చేర్చాడు. మేము అక్కడికి చేరుకోగానే వర్షం మళ్ళీ మొదలైంది. అంతసేపూ బాబా మాకోసమే వర్షాన్ని ఆపారని నాకు అర్థమైంది. బాబా దయవలన శ్రీమల్లిఖార్జునస్వామిని దర్శించుకుని తిరిగి ఇంటికి క్షేమంగా వచ్చాము. "ఇలానే మీ అనుగ్రహం మాపై ఎల్లవేళలా ఉండాలి సాయినాథా. దయతో నాకు ఒక మంచి ఉద్యోగాన్ని ప్రసాదించండి బాబా. అదేవిధంగా, నేను బయటకు చెప్పుకోలేని ఒక అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నాను సాయినాథా. చాలా ఇబ్బందిగా ఉంది, నయం చేయండి, ప్లీజ్ బాబా".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబా అనుగ్రహంతో సకాలంలో పూర్తైన రిజిస్ట్రేషన్


సాయిభక్తులందరికీ నా ప్రణామాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నా చిన్నతనం నుండి బాబా నాకు ఎల్లవేళలా తోడుగా ఉన్నారు, ఎన్నో ఆపదల నుండి నన్ను కాపాడారు. ఇప్పుడు ఒక అనుభవాన్ని పంచుకుంటున్నాను. బాబా అనుగ్రహంతో మేము ఒక సొంత ఇల్లు కొనుక్కున్నాము. అందులో భాగంగా మేము మొదట కొంత డబ్బిచ్చి సేల్ అగ్రీమెంట్ చేసుకున్నాము. అప్పటినుండి 45 రోజుల లోపల మేము మిగతా డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేకపోతే, మేము ఆ ఇంటిని అమ్ముతున్నవాళ్ళకి లక్షరూపాయలు ఇవ్వాలి. అది కాకుండా ఇక మాకు ఆ ఇల్లు దక్కుతుందో, లేదో తెలియని పరిస్థితి. కాబట్టి మేము వెంటనే బ్యాంకులో లోన్ కోసం అప్లై చేసాము. అయితే 30 రోజులు పూర్తవుతున్నా లోన్ ప్రక్రియ కొంచెం కూడా ముందుకు పోలేదు. దాంతో చాలా తక్కువ సమయం ఉండటం వలన మాకు ఏం చేయడానికి దిక్కు తోచలేదు. అంతలో బ్యాంకు వాళ్ళు ఈ వారంలో లోన్ ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. కానీ, ఏదో ఒక ఆటంకం వస్తూ చివరికి గడువులో ఒక్క వారం మాత్రమే మిగిలింది. అప్పుడు నేను, "బాబా! మాకు లోన్ వచ్చి, ఎలాగైనా గడువు లోపల రిజిస్ట్రేషన్ పూర్తి అవ్వాలి" అని బాబాకి చెప్పుకున్నాను. ఆయన అనుగ్రహంతో ఏ ఆటంకాలు లేకుండా రిజిస్ట్రేషన్ సకాలంలో పూర్తి అయ్యింది. "ధన్యవాదాలు బాబా. మీ దయ మా కుటుంబానికి ఎల్లవేళలా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను".



తాత్యాకోతేపాటిల్ - రెండవ భాగం..



బాబా ప్రేమ భక్తులందరిపై సమంగా వర్షించినప్పటికీ తాత్యాపై ఆయన చూపిన ప్రేమ మాత్రం అత్యంత ప్రత్యేకమైనదనే చెప్పాలి. ప్రతిరోజూ తాత్యా మశీదుకి వెళ్లినప్పుడు ఆ మేనమామ, మేనల్లుళ్ళ మధ్య చోటుచేసుకొనే ప్రేమపూర్వకమైన సన్నివేశాలు చూడముచ్చటగానూ, వారిమధ్య జరిగే సంభాషణలు బహు శ్రావ్యంగానూ ఉండేవి.

కొన్నిసార్లు బాబా తాత్యాతో సరదాగా కుస్తీ పట్టేవారు, హాస్యమాడేవారు, ఒక్కోసారి అతని చేతులు నొక్కేవారు. బదులుగా అతనలా చేస్తే బాబా, "నువ్వు నా ఎముకలు విరిచేస్తావా?" అని అనేవారు. అలాగే, ఒక్కోసారి తాత్యా సరదాగా బాబా వేళ్ళు నొక్కేవాడు. అప్పుడు బాబా, "నువ్వు నా వేళ్ళు విరిచేస్తున్నావ్" అంటూ కేకలు వేసేవారు. తాత్యా మసీదులో సేదతీరడానికి కూర్చున్నప్పుడల్లా బాబా అతనిని సరదాగా ఆటపట్టించేవారు. బాబా ఒక్కోసారి వెనుకనుండి వచ్చి తాత్యా వీపుపై తట్టడమో, అతని కళ్ళను తమ చేతులతో మూయడమో చేసి, ఆపై మసీదులో ఓ మూలన దాక్కునేవారు. "ఎవరది? నన్ను తట్టిందెవరు?" అని తాత్యా అడుగుతుంటే, బాబా నవ్వుతూ బయటకు వచ్చేవారు. ఇలా బాబా అతనితో సరదాగా దాగుడుమూతలాడేవారు.

బాబా తరచూ తాత్యా పైపంచెను తీసి మసీదులోని గోధుమల బస్తా వెనుక దాచిపెట్టేవారు. తాత్యా తన పైపంచె కోసం వెతుకుతూ, "నా పైపంచె ఏది?" అని బాబాను అడిగితే, బాబా కోపాన్ని నటిస్తూ, "నాకేం తెలుసు? నేనేమైనా అందరి పైపంచెలు దొంగిలించేవాడినా?" అని అనేవారు. అయితే బాబా మాత్రమే తననలా ఆటపట్టిస్తారని తాత్యాకు తెలిసినందువల్ల తన మానాన తను తన పైపంచె కోసం వెతుక్కుంటున్నట్లు నటించేవాడు. బాబా కూడా ఏమీ ఎరగనట్లు దాన్ని వెతకడంలో అతనికి సహాయం చేస్తున్నట్టు నటించేవారు. కొంతసేపటికి ఆయనే ఆ పైపంచను బయటకు తీసి తాత్యాకు ఇచ్చేవారు. బాబా ఒక్కొక్కప్పుడు తాత్యా పైపంచెను తమ భుజాలపై వేసుకొని తాత్యాలా కూర్చోవడం వంటివి చేస్తూ అతని ప్రతి కదలికన అనుకరించేవారు.

తాత్యా చాలాసార్లు బాబా తలపైని వస్త్రాన్ని తీసేసి తన షిండేషి పగిడీ ఉంచేవాడు. ఆపై తన ఉత్తరీయాన్ని వారిపై కప్పి, అద్దం తెచ్చి ఇచ్చేవాడు. అప్పుడు బాబా అద్దంలో తమ రూపాన్ని చూసుకుంటూ భుజాలెగరేసి, కనుగుడ్లు మిటకరిస్తూ, ముఖకవళికలు పలురకాలుగా మార్చి నవ్వుతూ, "ఏం అద్దమా! నేను అచ్చం ఈ కోత్యాలా కనిపిస్తున్నాను కదూ? అతనిలాగే చేస్తుంటాడు కదూ?" ఆంటూ అద్దంతో మాట్లాడుతున్నట్లు అభినయించేవారు. తరువాత ఆ పగిడీ, ఉత్తరీయం, అద్దాలను తాత్యాకు ఇచ్చేసేవారు. ఇదంతా వారివురే మశీదులో ఉన్నప్పుడు జరిగేది.

ఒడ్డు, పొడుగు, బలిష్ఠమైన దేహసౌష్ఠవాన్ని కలిగివుండే తాత్యా ఒక్కోసారి తన చేతులను బాబా నడుము క్రిందగా ఉంచి ఒక్క చేత్తో ఆయన్ను తన భుజాలపైకెత్తుకొనేవాడు. అప్పుడు బాబా, "అరే, అరే, నేను పడిపోతాను, నేను పడిపోతాను. నీకు దెబ్బ తగులుతుంది" అని అనేవారు. అప్పుడు తాత్యా బాబాను క్రిందికి దించగా ఆయన నవ్వేవారు. ఒక హోలీ పండుగనాడు నందూమార్వాడీ దుకాణం దగ్గర నిలబడివున్న తాత్యా ఎంతో ఉల్లాసంగా ఉన్న బాబాను చూసి అమాంతంగా ఆయనను తన భుజాలపైకెత్తుకొని మసీదు వైపు అడుగులు వేయసాగాడు. బాబా దారిపొడవునా, "అరే తాత్యా! అరే కోత్యా! నన్ను క్రిందికి దించు. నీ కడుపు నొప్పి పెడుతుంది" అని అరుస్తున్నా తాత్యా పట్టించుకోకుండా బాబాను అలాగే మసీదు వరకు తీసుకొని వెళ్లి అక్కడ వారిని క్రిందికి దించాడు. అలా రెండుసార్లు చేశాక తన మొరటు పనివల్ల బాబాకు బాధకలుగుతుందేమోనని అలా చేయడం మానుకున్నాడు తాత్యా.

బాబా కొన్నిసార్లు తాత్యా ఎదుట తమ రెండు చేతులూ జోడించి, "జై దేవా! జై దేవా!" అనేవారు. బదులుగా తాత్యా, "సలామాలేకుం బాబా! సలామాలేకుం" అంటూ సలాం చేస్తున్నట్టుగా తన చేతులను నుదుటి వద్దకు తెచ్చేవాడు. బాబా కూడా తమ చేతిని నుదుటిపై ఉంచి, "సలామాలేకుం, సలామాలేకుం" అని అనేవారు. ఒకసారి మరీ విడ్డూరంగా బాబా అకస్మాత్తుగా లేచి, తాత్యా పాదాలను తాకారు. బాబా చర్యకు తాత్యా ఒక్కసారిగా నివ్వెరబోయి, బాబా చేతులు పట్టుకొని బాధగా, "బాబా! మీరేం చేస్తున్నారు? ఇదేమైనా బాగుందా?" అని అడిగాడు. అంతలోనే బాబా తమ చేతులు విడిపించుకొని మళ్ళీ తాత్యా పాదాలను తాకి నమస్కరించారు. తాత్యా ఎంతగానో బాధపడి, "బాబా! మీరెందుకిలా చేస్తున్నారు?" అని అడిగాడు. అందుకు బాబా, "నోర్ముయ్, నీకేం తెలుసు?" అని గద్దించారు.  ఆ చర్యలలోని మర్మమేమిటో బాబాకే ఎఱుక!

బాబా ప్రతిరోజూ పది, పదిహేను రూపాయలతో బర్ఫీ, పేడాలు, రేవడి, వేరుశెనగపప్పు, పంచదార బిళ్ళలు మొదలైన వాటిని దుకాణం నుండి కొని తెప్పించి తాత్యాతోపాటు భక్తులందరికీ పంచిపెట్టేవారు. అప్పుడప్పుడు వచ్చినవారందరికీ బాబా స్వయంగా వంటచేసేవారు. బజారు నుండి దినుసులు కొనుక్కొని రావటం, పొయ్యి వెలిగించి ఎసరు పెట్టడం, ఉప్పు, మిరియాలు వంటివి నూరడం మొదలైన పనులన్నీ ఆయన స్వయంగా చేసుకునేవారు. ఒక్కోసారి పరమాన్నము, ఒక్కోసారి మాంసపు పులావు వండేవారు. పులుసు కాచి, అందులో గోధుమ రొట్టెలు, మిరియాలపొడి వేసేవారు. తర్వాత అంబలి కాచి మజ్జిగతో కలిపేవారు. ఉడుకుతున్న గుండిగలో చెయ్యిపెట్టి బాగా కలిపేవారు. అయినప్పటికీ ఆయన చెయ్యి కొంచెం కూడా కాలేది కాదు. వంట పూర్తికాగానే భోజనపదార్థాలను మౌల్వీచేత నివేదన చేయించేవారు. మొదట కొంచెం మహల్సాపతికి, తాత్యాపాటిల్‌కి పంపి తర్వాత అందరికీ వడ్డన చేసేవారు.

ఒక్కోసారి బాబా, "వణీతేలీలు (నూనెవ్యాపారస్థులు) నన్నెంతో బాధిస్తున్నారు. నేనీ మశీదులో వుండను" అని చెప్పి అప్పటికప్పుడే అక్కడనుండి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యేవారు. అప్పుడు తాత్యా పరుగున వచ్చి, "నేను వాళ్ళను దండిస్తాను. ఇప్పుడు శాంతించండి, మరోరోజు వెళ్దాం" అని బుజ్జగించాకనే బాబా శాంతించేవారు. బాబా తాము ధరించే కఫ్నీని, తలగుడ్డని కొన్ని నెలలదాకా మార్చేవారుకాదు. ఆయన కఫ్నీ మార్చడం మరీ ఆలస్యమై, పాతది చిరిగిపోయేది. అయినప్పటికీ బాబా క్రొత్త కఫ్నీ వేసుకునే బదులు మధ్యాహ్నం ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ముల్లును సూదిగా చేసుకొని, ఆ చిరుగులన్నింటికీ మాసికలు వేసుకునేవారు. అప్పుడు తాత్యా ఆయన దగ్గరజేరి, దానిని చూచే మిషమీద ఆ చిరుగులనింకా పెద్దవి చేసేవాడు. అప్పుడిక క్రొత్త కఫ్నీ వేసుకోక తప్పేదికాదు బాబాకు.

ఏ సత్పురుషుని హృదయంలో వాసుదేవుడు సదా వసిస్తాడో వారు ధన్యులు. వారి సహవాస సౌఖ్యాన్ని పొందిన భక్తులు అదృష్టవంతులు. తాత్యా, మహల్సాపతి అటువంటి మహాభాగ్యవంతులు. వీరిద్దరూ బాబాతో కలిసి మశీదులో శయనిస్తూ వారి సహచర్యాన్ని సమానంగా అనుభవించారు. బాబాకు వాళ్ళిద్దరిపై అనుపమానమైన ప్రేమ. వీరు ముగ్గురూ మశీదులో నేలపై పక్కలు పరచుకుని, తమ తలలను పడమర, దక్షిణ, ఉత్తర దిక్కులలో పెట్టుకొని, మధ్యన ఒకరి పాదాలు మరొకరికి తగిలేలా పడుకుని సరదాగా పిచ్చాపాటీ మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటుండేవారు. వీరిలో ఎవరైనా నిద్రలోకి జారితే మిగిలిన ఇద్దరూ వారిని మేల్కొలిపేవారు. తాత్యాకు నిద్రతూగి గుఱ్ఱుపెడితే బాబా మహల్సాపతితో కలిసి తాత్యాను అటు ఇటు దొర్లించి, అతని తల, కాళ్ళు, వీపు గట్టిగా నొక్కేవారు. వేసవికాలంలో మసీదు లోపల చాలా వేడిగా ఉండేది. పైగా తాత్యా పడక ధునికి దగ్గరగా ఉండేది. సరదానిష్టపడే బాబా అర్థరాత్రి నిద్రలేచి తాత్యాపై ఒక దుప్పటి కప్పేవారు. దాంతో తాత్యాకు విపరీతంగా చెమటలు పట్టి, మెలకువ వచ్చి లేచి వెళ్లి మశీదు మెట్లపై కూర్చునేవాడు. కొన్నిసార్లు గాఢనిద్రలో ఉన్న తాత్యాను బాబా మరో దిక్కుకి తిప్పేవారు. మరికొన్నిసార్లు గాఢంగా నిద్రపోతున్న తాత్యాను మశీదు బయటకు నెట్టేసి అతనెలా స్పందిస్తాడోనని సరదాగా గమనిస్తూ ఉండేవారు బాబా. తాత్యాకి మెలకువ వచ్చాక ‘తనక్కడికి ఎలా వచ్చానా?’ అని ఆశ్చర్యపోయేవాడు. కొన్నిసార్లు, పగలంతా కష్టపడి పనిచేయడం వలన తాత్యాకు ఒళ్ళునొప్పులుగా వుంటుందని గమనించి, అతనికి నిద్రపట్టాక మహల్సాపతితో కలిసి బాబా అతని ఒళ్ళు, కాళ్ళు, చేతులు పిసికేవారు. అది అతనికెంతో బాధనిపించేది. ఒకసారి, ‘అలా చేస్తే నేను మశీదుకే రాన’ని బెదిరించి 10, 12 రోజులు మశీదుకు వెళ్ళలేదు తాత్యా. బాబా బాధపడి మశీదు ముందుగా దూరాన వెళుతున్న అతన్ని తన వద్దకు రమ్మని కేకవేసేవారు. అయితే తాత్యా మాత్రం ఆయనతో తనకెట్టి సంబంధమూ లేదని సైగలతో తెలుపుతూ వెళ్ళిపోయేవాడు. "బయజామాయి కొడుకువి గనుక బాబాకు నీపై ఎంతో ప్రేమ" అని నచ్చజెప్పి, కాకాసాహెబ్ దీక్షిత్ అతన్ని మశీదుకు తిరిగి తీసుకువచ్చేవాడు. ఈ విధమైన అనుబంధంతో తాత్యా 14 సంవత్సరాలపాటు బాబాతో మశీదులో నిద్రించాడు. తండ్రి మరణించిన తరువాత తాత్యా సంసారంలో పడ్డాడు. ఇంటికి యజమానిగా గృహస్థుడై ఇంట్లోనే నిద్రించసాగాడు. ఆ రోజులెంత గొప్పవి! ఆ మధుర స్మృతులు శాశ్వతంగా నిలిచిపోతాయి. తల్లిదండ్రులను ఇంట్లో వదిలి మశీదులో నిద్రించిన తాత్యాకు బాబాపై ఉన్న ప్రేమను ఎంతని కొలవగలము? అలాగే బాబాకు అతనిపైగల కృపను ఎవరు విలువ కట్టగలరు?

ఒకసారి ఎవరో భక్తులు బాబాకు రెండు ఆవులను, ఒక మేకను సమర్పించారు. అవి తాత్యా వద్ద ఉండేవి. వాటి పాలు, పెరుగు, వెన్న, మజ్జిగ, నెయ్యి బాబా సేవించేవారు. ప్రతిరోజూ రాత్రి 8 గంటల ప్రాంతంలో తాత్యా రెండు జొన్నరొట్టెలు, పాలు, బెల్లం తీసుకొని మశీదుకు వెళ్లి, సగం రొట్టెను పాలు, బెల్లంతో కలిపి బాబా ముందుంచేవాడు. బాబా అందులోనుంచి కొంచెం తిని, ఆ పాత్రను దూరంగా తోసేవారు. భక్తుడు కొండాజీ మిగిలిపోయిన రొట్టెలను తీసుకొనేవాడు. బాబా రొట్టె తిన్న తరువాత తాత్యా ఒక చిన్న పళ్లెంతో ఏవైనా తినుబండారాలను వారి ముందు ఉంచేవాడు. బాబా కొంచెం తిని, కొంచెం అతని నోటిలో పెట్టేవారు. తరువాత బాబా అతనికి 35 రూపాయలు (ఆ రోజుల్లో ఒక ప్రభుత్వోద్యోగి సగటు నెలజీతంతో సమానం) ఇచ్చి, "ఈ ధనాన్ని వృధాగా ఖర్చు చేయక సద్వినియోగపరచుకో" అని చెప్పేవారు. మొదటినుండి మధ్యతరగతి వ్యవసాయ(రైతు) కుటుంబీకుడైన తాత్యా అలా బాబా ప్రతిరోజూ ఇచ్చే ధనంతోనూ, తన స్వయంకృషి వల్లా ఆ గ్రామంలోనే పెద్ద మోతుబరి రైతయ్యాడు. ఆ రోజుల్లో తాత్యాది పన్నెండెద్దుల వ్యవసాయం. అప్పటి ప్రమాణాల ప్రకారం పన్నెండెద్దుల సేద్యమంటే పెద్ద భూస్వామి క్రింద లెక్క. ఇలా తాత్యాకు ధనాన్నిచ్చి లౌకిక శ్రేయస్సునివ్వడమే కాకుండా అతని పారమార్థిక ప్రయోజనాల దృష్ట్యా శిరిడీలోని శని, గణపతి, శివపార్వతుల, గ్రామదేవత మరియు మారుతి మందిరాల పునరుద్ధరణ వంటి ధార్మిక కార్యక్రమాలను తాత్యా చేతుల మీదగా చేయించారు బాబా. అన్నిటికీమించి తమ నిత్య సాన్నిధ్యాన్ని ప్రసాదించి తాత్యాను అన్నివిధాలా అనుగ్రహించారు బాబా.

ఒకసారి బాబా ధునిలో తమ చేయిపెట్టి, వేరొక గ్రామంలో కమ్మరి కొలిమిలో పడబోయిన బిడ్డను రక్షించారు. అప్పుడాయన చేయి బాగా కాలింది. అది చూచి తాత్యా కంటతడి పెట్టాడు. బాబా నవ్వి, “తాత్యా! ఎందుకేడుస్తావు? రెండువేల పిడకలు పేర్చి, వాటిపై ఈ శరీరాన్ని కాలుస్తున్నా మనం చలించగూడదు. నిజమైన జ్ఞానానికి అదే గీటురాయి!" అన్నారు.


సోర్స్: శ్రీసాయిసచ్చరిత్ర,
సాయిలీల మ్యాగజైన్ అక్టోబర్, 1960 సంచిక,
Ambrosia in Shirdi & Baba's Gurukul by విన్నీ చిట్లూరి,
Ref : శ్రీసాయిభక్త విజయం బై పూజ్యశ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ.

  

 తరువాయి భాగం కోసం బాబా పాదాలు తాకండి.

సాయిభక్తుల అనుభవమాలిక 936వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. దయతో పరిస్థితులు చక్కబరచిన బాబా
2. చెప్పుకున్నంతనే లభించిన బాబా అనుగ్రహం

దయతో పరిస్థితులు చక్కబరచిన బాబా

నేను బాబా భక్తురాలిని. ముందుగా, సాయిబాబా భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. ఒకరోజు మా మేనేజర్ ఒక డెవలపర్ మీటింగ్ పెట్టి, డెవలపర్స్‌కి వున్న సమస్యల గురించి చెప్పమన్నది. అప్పుడు ఒక లీడ్ డెవలపర్, "బిజినెస్ అనలిస్టులు ఇన్ఫర్మేషన్ వివరంగా ఇవ్వట్లేదు, సమస్య అవుతోంది" అని కంప్లైంట్ ఇచ్చాడు. అది నిజమే అయినప్పటికీ నేను క్రొత్తగా ఈమధ్యనే ఆ సంస్థలో జాయిన్ అయినందున నేరుగా చెప్పక, "అవును, మాకు ఇంకొంచెం వివరంగా ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది. అప్పుడు మేము కరెక్ట్‌గా డెవలప్ చేయగలుగుతాము" అని చెప్పాను. మేము ఇలా కంప్లైంట్ చేసిన విషయాన్ని మేనేజర్ వెంటనే బిజినెస్ అనలిస్టులందరికీ చెప్పింది. సాధారణంగా ఎవరికైనా తామెంత కరెక్ట్‌గా ఉన్నామనేదానికంటే తమని వేలెత్తి చూపారన్నదే ఎక్కువ బాధిస్తుంది. అందుచేత బిజినెస్ అనలిస్టులందరికీ మా మీద కోపం వచ్చింది. ఈ విషయం మాకు తెలీదు. అప్పటివరకు బిజినెస్ అనలిస్ట్ ఇన్ఫర్మేషన్ సరిగా ఇవ్వకపోయినా వాళ్ళ పని, నా పని చేసుకుంటూ, కేవలం వాళ్ళు పంపాల్సిన వాలిడేషన్ ఈ-మెయిల్స్‌ను మాత్రమే పంపమని చెప్పే నా అలవాటు ప్రకారం ఆరోజు కూడా బిజినెస్ అనలిస్ట్‌కి నేను మెసేజ్ చేశాను. వెంటనే ఆ అనలిస్ట్, "కంప్లైంట్ ఇచ్చిన డెవలపర్(లీడ్)నే అడుగు" అన్నాడు. దాంతో, వాళ్లంతా కోపంగా ఉన్నారని నాకు అర్థమైంది. కానీ, గమ్మున పనంతా చేస్తున్నా కూడా ఇలాంటి పరిస్థితి వచ్చిందని నాకు బాధేసింది. నిజానికి లీడ్ డెవలపర్ తప్పుగా ఏమీ కంప్లైంట్ చేయలేదు. తప్పుగా అనలేదని తెలిసి కూడా మా మేనేజర్ పరిస్థితిని వాడుకొని టీమ్‌లో డిస్టర్బెన్స్ సృష్టించింది. ఎందుకంటే, ఏ బిజినెస్ అనలిస్ట్ అయితే 'కంప్లైంట్ ఇచ్చినవాళ్లనే అడుగు' అన్నాడో, అతను రెండు సంవత్సరాల నుండి మేనేజరుతో అదే కంపెనీలో వున్నాడు. కాబట్టి ఆమె, 'పని బాగా చేయండి' అని నేరుగా అతనితో చెప్పలేక మా మీద నెట్టి అందరినీ ఇబ్బందిపెట్టింది. ఆ పరిస్థితికి నాకైతే ఉద్యోగం మారిపోవాలని అనిపించింది. టీమ్‌లో అందరూ ఒకరితో ఒకరు మంచిగా ఉంటే బాగుంటుంది, అంతా సానుకూలంగా ఉంటుంది. ఇదంతా గురువారంనాడు జరిగింది. శుక్రవారమంతా నేను సైలెంట్‌గా గడిపేశాను. ఆ వారం నేను ఎక్కువ గంటలు పనిచేశాను. అంతకుముందు నేను ఎక్కువ గంటలు పనిచేసినపుడు మా మేనేజర్ నన్ను శుక్రవారం హాఫ్ డే లీవ్ తీసుకోమని చెప్పేది. అయినప్పటికీ పని ఉందని నేనెప్పుడూ లీవ్ తీసుకోలేదు, పైగా అదనపు గంటలకి ఛార్జ్ కూడా చేయలేదు. కానీ, ఈ వారంలో ఆమె పెట్టిన చిచ్చుకి కోపమొచ్చి, పనిచేసిన అదనపు గంటలకి ఛార్జ్ చేశాను. ఆ విషయం టైం షీట్‌లో కూడా పెట్టాను. కానీ, ఆమె సోమవారం ఏమంటుందోనన్న చింతతో శని, ఆదివారాలు చాలా అసహనంగా అనిపించి, "బాబా! టీమ్‌లో మళ్లీ అంతా మామూలుగా అయ్యేలా చూడు. ఇంకా, మేనేజర్ అదనపు గంటల గురించి అడగకుండా చూడు" అని బాబాని వేడుకున్నాను. ప్రతి సోమవారంనాటి ఉదయం నాకు మా మేనేజరుతో 'వన్ ఆన్ వన్' మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగులో ఆమె, ‘అన్ని అదనపు గంటలు పెట్టావేమిటి?’ అని మాటమాత్రమైనా అడగకుండా నా టైమ్ షీట్‌ని ఆమోదించింది. తరువాత కాసేపటికి ఆ బిజినెస్ అనలిస్ట్ తనంతటతానే నాకు మెసేజ్ చేసి, ‘ఫలానా వర్క్ చేస్తావా?’ అని ఏమీ జరగనట్లు నాతో మంచిగా మాట్లాడాడు. ఇదంతా బాబా దయ. ఆయన కృపవలన ఇప్పుడంతా మునుపటిలా సాఫీగా సాగుతోంది.

మరుసటివారం నేను, "ప్లీజ్ బాబా! ఈ సోమవారం మా మేనేజరుతో మీటింగ్ లేకుండా చూడండి. ఈ వారంలో నేను పనిచేసిన అదనపు గంటలు గురించి పెట్టాను. అవి కూడా ఆమోదింపబడేలా చూడు" అని బాబాని వేడుకున్నాను. ఆరోజు హఠాత్తుగా మేనేజరుకి మీటింగ్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఇలా కోరగానే అలా బాబా తీరుస్తున్నారు. ఇవేకాకుండా రోజులో నేనెప్పుడు "బాబా ప్లీజ్!" అన్నా వెంటనే బాబా నాకు సహాయం చేస్తున్నారు. "బాబా! నేను మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోగలను? మీ ఈ ప్రేమ, కరుణ ఎల్లప్పుడూ ఇలానే నా మీద, సమస్త ప్రజానీకం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను ఎన్నడూ వదిలిపెట్టవద్దు బాబా. సదా నాతోనే ఉండండి".

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు!

చెప్పుకున్నంతనే లభించిన బాబా అనుగ్రహం


సాయిబంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. నేను ఇప్పుడు చెప్తున్న సమస్య మీకు తేలికగా అనిపించవచ్చు. కానీ, నాకు అది సమస్యే. ఎందుకంటే, చంటిపిల్లలతో నాకు పెద్దగా అనుభవం లేదు. అసలు విషయమేమిటంటే, మా పాపకు రెండు నెలల వయసున్నప్పుడు తన ఆరోగ్యం అసలు బాగుండేది కాదు. తరచూ ఏదో ఒక సమస్య ఉండేది. అందువలన నా మనసంతా చాలా ఆందోళనగా ఉంటుండటంతో, తన ఆరోగ్యం బాగుండాలని ప్రతిరోజూ బాబాను వేడుకుంటుండేదాన్ని. అలా ఉండగా ఒకరోజు పాపకి నాలుగు రోజులవుతున్నా విరేచనం కాలేదు. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ విరేచనం మాత్రం కాలేదు. చిన్నపిల్లలకి మూడురోజుల వరకు విరేచనం కాకపోయినా పర్వాలేదని చాలామంది చెప్పారు. కానీ, నా తల్లి మనసు కుదురుగా ఉండేది కాదు. ప్రతిరోజూ బాబాని మామూలుగా వేడుకునేదాన్ని. కానీ, నాలుగవరోజు సాయంత్రం, "బాబా! పాపకి విరేచనమయ్యేలా చూడండి. రేపు గురువారం మీ గుడికి వస్తాను" అని మనస్పూర్తిగా బాబాను ప్రార్థించాను. అద్భుతం! అరగంటలో పాపకి విరేచనం అయింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. "తండ్రి సాయీ! ఇంట్లో కొన్ని సమస్యలతో మేము సతమతమవుతున్నాము. కర్మఫలితాన్ని అనుభవించాలని అంటారు. కానీ, మీ దయతో వాటినుండి తొందరగా మాకు విముక్తి ప్రసాదించండి".


సాయిభక్తుల అనుభవమాలిక 935వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అనారోగ్యానికి కలలో వైద్యం చేసిన బాబా
2. బాబా నామంతో సమస్యలు మాయం

అనారోగ్యానికి కలలో వైద్యం చేసిన బాబా


నేను ఒక సాయి భక్తురాలిని. మాది కాకినాడ. బాబా నామీద కురిపించిన కరుణారసవర్షాన్ని మీతో పంచుకునే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను చాలా సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడ్డాను. నేను తిరగని ఆస్పత్రి లేదు, చేయని ప్రయత్నము లేదు. అన్ని రకాల ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయాను. డాక్టర్లందరూ నా వ్యాధి నయం కావడానికి సమయం పడుతుందని చెప్పేవారు. ఇలాంటి పరిస్థితిలో ఒకరోజు మా పక్కింటివాళ్ళు 'సాయి' టీవీలో ప్రసారమవుతున్న 'అర్పణం' కార్యక్రమంలో పాల్గొని, బాబాకు గోధుమలు అర్పణం చేయడానికి వెళ్తూ, "మీరు కూడా వస్తారా?" అని నన్ను అడిగారు. "ఏమో! ఏం జరుగుతుందో చూద్దామ"ని అర్పణం కార్యక్రమానికి వెళ్లి  గోధుమలను అర్పణంచేసి, "బాబా! నా ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. నేనెప్పుడూ మీకు మ్రొక్కలేదు, ఇదే మొదటిసారి. అన్నిరకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయాను బాబా! చాలామంది మీ గురించి, మీ లీలల గురించి చాలా అద్భుతంగా చెప్తున్నారు. మీరు నా ఈ ఆరోగ్యాన్ని బాగుచేయగలరా? బాబా! ఇక్కడంతా మీరు మంచి వైద్యుడని అంటున్నారు. నామీద కాస్త దయ ఉంచు తండ్రీ!" అని బాబాకి నా బాధని  చెప్పుకుని ఇంటికి వచ్చాను. ఆరోజు రాత్రి నిద్రలో నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా తెల్లని వస్త్రాలను ధరించి నా మంచం ప్రక్కనే నిలబడి నాతో, "నీ కడుపులో సమస్య ఉంది. అది ఇప్పటితో తీరిపోతుంది. ఇక నువ్వు దిగులుపడాల్సిన పనేమీ లేదు. అంతా నేను చూసుకుంటాను, నీవు నిశ్చింతగా ఉండు" అని చెప్పారు. తరువాత నేను బాబాని తదేకంగా చూస్తూ ఉన్నాను. బాబా తమ చేతులు నా కడుపులో పెట్టి ఏదో చేస్తున్నారు. తన చేయంతా రక్తసిక్తమై ఉంది. కానీ నేను మాత్రం ఎలాంటి నొప్పి లేకుండా బాబానే చూస్తూ, తను మాట్లాడుతున్నటువంటి మాటలు వింటూ ఉంటే, ఆయన, "నేను అంతా సరిచేశాను. నువ్వు దిగులుపడకు. ఇప్పటినుండి నీకు ఆరోగ్య సమస్యలు రావు. నీవు నా నామాన్ని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండు" అని చెప్పారు. కొన్ని సెకండ్ల వ్యవధి తర్వాత చూస్తే బాబా కనిపించలేదు. నాకు కొంచెం కొంచెంగా మెలకువ వచ్చి లేద్దామంటే పడుకున్న చోటునుంచి కాస్తంత కూడా లేవలేకపోయాను. అప్పటివరకూ జరిగినదంతా కలా! నిజమా! అని తేల్చుకోలేకపోయాను. కానీ, నా ఆరోగ్యం కుదుటపడిందని అనిపించింది. తర్వాత రోజు మామూలుగా నేను చెకప్ కోసం వెళ్లాల్సి ఉండి, హాస్పిటల్‌కి వెళ్ళాను. డాక్టర్లు చూసి, "ఎలాంటి ఆరోగ్య సమస్యా లేదు, నీవు పూర్తి ఆరోగ్యంగా ఉన్నావు" అని చెప్పారు. ఆ మాట విని నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు నాకు అర్ధమయ్యింది, నిజంగానే రాత్రి నా కలలో బాబా డాక్టరుగా వచ్చి ఆపరేషన్ చేసి నా అనారోగ్యాన్ని దూరం చేశారని. తరువాత మాఇంట్లో వాళ్లందరికీ కల గురించి చెప్పాను. అందరూ ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు. నేను అందరిలాగా పూజలు, వ్రతాలు, హారతులు ఏవీ చేయలేదు. కేవలం ఒక్కసారి నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించమని అడిగాను, అంతే! దానికే కలలో ఒక డాక్టరులా వచ్చి, తన కర్తవ్యాన్ని తాను నిర్వహించి డాక్టరుగా, దేవుడిగా నా మనసులో పూర్తి భక్తివిశ్వాసాలను నింపి వెళ్లారు బాబా. "బాబా! మీ గురించి ఎంత మాట్లాడినా, ఎంత చెప్పినా తక్కువే. మీరు నామీద కురిపించిన కరుణారసవర్షానికి ఉబ్బితబ్బిబ్బవుతున్నాను. సదా మీ కృపాదృష్టి నామీద ఇలాగే ఉంచండి!".

బాబా నామంతో సమస్యలు మాయం


నా పేరు శ్రీదేవి. మన సాయితండ్రి పిలిస్తే పలికే దైవం కదా! నేను కోరిన కోరికలను తీరుస్తూ ఇంకా ఇంకా తమపై విశ్వాసం, ప్రేమ పెరిగేలా చేస్తున్నారు మన సాయితండ్రి. ఒకసారి సంవత్సరంపాటు మా అత్తగారిని తలనొప్పి ఎంతగానో బాధిచింది. ఒకటి, రెండుసార్లు డాక్టరుని సంప్రదిస్తే, ‘సైనస్’ అని చెప్పి కొన్ని మందులిచ్చారు. అవి వాడినప్పటికీ, తగ్గినట్లే తగ్గి మళ్లీ నొప్పి ఆమెను బాధిస్తుండేది. 2021, సెప్టెంబరు 17న ఆవిడ మరోసారి డాక్టరు దగ్గరికి వెళ్లారు. కాసేపటికి నేను ఫోన్ చేస్తే, "డాక్టరు తలకి స్కానింగ్ చేయించమని చెప్పారు. స్కానింగ్ చేయించుకోవడానికి వెళ్తున్నామ"ని అన్నారు. అప్పుడు నేను, "అత్తయ్య స్కానింగ్ రిపోర్టులో ఎటువంటి పెద్ద సమస్యా లేకుండా ఉండేలా చూడమ"ని బాబాను వేడుకుని రిపోర్టు వచ్చేదాకా బాబా నామస్మరణ చేసాను. బాబా దయవలన, 'పెద్దగా సమస్యేమీ లేదని, మందులతో తగ్గిపోతుంద'ని డాక్టర్ చెప్పారు. ఇదంతా నా సాయితండ్రి దయే.


2021లో మా అన్నయ్యకి ఆర్థికంగా ఒక పెద్ద సమస్య వచ్చింది. ఆ కారణంగా తనదికాని సమస్యకు తను డబ్బులు కట్టాల్సి వచ్చింది. నేను అప్పుడు "అన్నయ్యకి సహాయం చేయమ"ని బాబాను వేడుకుని, 'ఓం శ్రీసాయి అసహాయ సహాయాయ నమః' అనే మంత్రాన్ని పఠించసాగాను. బాబా దయవల్ల ఆ సమస్య తాత్కాలికంగా పరిష్కారమైంది. "ధన్యవాదాలు బాబా. కానీ బాబా, ఎప్పుడైనా మళ్ళీ ఈ సమస్య వస్తే, తనదికాని సమస్యకు అన్నయ్య డబ్బులు కట్టాల్సి వస్తుందని మీకు తెలుసు. కాబట్టి అసలు వ్యక్తుల ద్వారా ఆ డబ్బును తిరిగి ఇప్పించి అన్నయ్యను సమస్య నుండి పూర్తిగా కాపాడు తండ్రీ. సమస్య చిన్నదైనా, పెద్దదైనా నీవు తప్ప మాకు దిక్కెవరు బాబా?"


2021, సెప్టెంబరు 18న రాత్రి 11 గంటల సమయంలో నా స్నేహితురాలి చేయి విపరీతంగా నొప్పి పెట్టసాగింది. తను చెయ్యి కదిలించలేక చాలా ఇబ్బందిపడుతూ బాబాను ప్రార్థించి, బాబా ఊదీని తన చేతికి రాసుకుంది. తన భర్త డాక్టరుని పిలిపించి, నొప్పి తగ్గటానికి ఇంజక్షన్స్ వేయించారు. రెండు ఇంజక్షన్లు వేసినప్పటికీ తనకి నొప్పి తగ్గలేదు. తను భరించలేని నొప్పితో బాధపడుతూ నన్ను తలచుకుందట. సరిగ్గా అప్పుడే నాకు హఠాత్తుగా మెలకువ వచ్చి, 'ఇప్పుడెందుకు మెలకువ వచ్చిందా?' అనుకుంటూ మొబైల్ తీసుకుని యూట్యూబ్ ఓపెన్ చేస్తే, హిందీలో ఉన్న సాయి సందేశం ఒకటి నా కంటపడింది. బాబాపట్ల నా మనసులో ఉన్న భావాలకు, ఏ సేవ చేయలేకపోతున్నానన్న బాధకు తగ్గట్టు బాబా ఇచ్చిన ఆ సందేశం వింటుంటే నా కళ్ళంట నీళ్లు వచ్చేసాయి. ఆ సందేశం బాబా నాకే ఇచ్చినట్లు ఉన్నప్పటికీ అంత మంచి సందేశాన్ని ఎవరికైనా పంపిస్తే బాగుంటుందనిపించి మా బ్రదర్‌కి, నా స్నేహితురాలికి పంపాను. వెంటనే నా స్నేహితురాలు నాకు ఫోన్ చేసింది. నేను తన కాల్ చూసి, 'అయ్యో ఈ సమయంలో మెసేజ్ పంపి తనని డిస్టర్బ్ చేసానా ఏంటి?' అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాను. తను, "ఈ సమయంలో మెసేజ్ చేసేవేంటి? సరేగాని, నాకు బాగోలేదు. కొద్దిసేపటి క్రితమే నొప్పి భరించలేక బాబాని తలుచుకుంటూ 'నువ్వేం చేస్తున్నావో' అని నిన్ను కూడా గుర్తు చేసుకున్నాను" అని చెప్పి ఏడ్చింది. 'ఇందుకేనేమో నన్ను లేపి, సందేశాన్ని పంపించారు బాబా?' అని నాకనిపించింది. అప్పుడు నేను తనతో, “బాబా ఊదీ రాసుకుని, బాబా నామస్మరణ చేస్తూ ఉండు. రేపటికల్లా నీ చేయినొప్పి తగ్గుతుంది" అని చెప్పి తను తన బాధను మరిచిపోయేలా బాబా గురించి మాట్లాడుతూ తెల్లవారుజామున మూడుగంటల వరకు సత్సంగం చేశాను. అప్పుడిక తను నిద్రపోతానంటే నేను ఫోన్ పెట్టేసాను. మరుసటిరోజుకి కూడా తనకి కొద్దిగా నొప్పి ఉండటంతో హాస్పిటల్‌కి వెళదామని అనుకున్నారు. కానీ నేను వాళ్ళ అమ్మాయితో, "నువ్వు మీ అమ్మకోసం, 'హాస్పిటల్‌కి వెళ్లకుండా అమ్మకు ఊదీతో ఇంటివద్దే నయమైపోయేలా అనుగ్రహిస్తే సచ్చరిత్ర పారాయణ చేస్తాన'ని బాబాకి మొక్కుకోమ"ని చెప్పాను. తను అలాగే చేస్తానని చెప్పింది. ఆరోజు సాయంత్రానికి హాస్పిటల్‌కి వెళ్లకుండానే సాయి మహత్యం వల్ల నొప్పి తగ్గిందని నా స్నేహితురాలు చెప్పింది. తరువాత ఆదివారంనాడు నేను నా స్నేహితురాలితో మాట్లాడినప్పుడు తను, "చేయినొప్పి లేదు కానీ రెండు వేళ్ళు స్పర్శ లేకుండా ఉన్నాయి, భయమేస్తోంది" అని చెప్పింది. అయితే, బాబా ఊదీ రాసుకుంటూ, బాబా నామం చేస్తూ, స్తవనమంజరి వింటూ ఉంటే బాబా దయవలన తను తన సమస్య నుండి పూర్తిగా బయటపడింది. నా సాయితండ్రికి వేలవేల వందనాలు.



సాయిభక్తుల అనుభవమాలిక 934వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అపరిమితమైన బాబా అనుగ్రహం
2. బాబా కృపతో గృహప్రవేశం - వివాహం

అపరిమితమైన బాబా అనుగ్రహం


సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. చిన్నప్పటినుండి నేను సాయిని నమ్ముతాను. ఆ నమ్మకం ఇప్పుడు మరింత రెట్టింపు అయ్యింది. బాబాపై నాకున్న ఇష్టాన్ని, ప్రేమను నేను మాటల్లో చెప్పలేను.  ప్రతి వారం బాబా నాకు స్వప్నదర్శనమిస్తారు. ఇంకా, నేను ఏది అడిగినా ఇస్తారు. నాకు ఏ సమస్య రానున్నా ముందుగా హెచ్చరిస్తూ దానికి పరిష్కారాన్ని చూపుతారు. 2020 వరకు మేము శిరిడీ వెళ్ళలేదు. తీరా వెళ్ళాలని అనిపించేసరికి కరోనా కారణంగా లాక్‌డౌన్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో వెళ్ళలేమని అనుకున్నాము. కానీ బాబా మమ్మల్ని అనుగ్రహించారు. సరిగ్గా అప్పుడే లాక్‌డౌన్ ఎత్తివేశారు. ఆనందంగా కుటుంబసమేతంగా మేము శిరిడీ వెళ్లి సాయినాథుని దర్శించుకున్నాం. బాబాను దర్శించి నా కష్టమంతా చెప్పుకుని "ఎప్పుడూ నాతో ఉండమ"ని ఏడ్చాను. కానీ బాబాను చూసిన అనుభూతి నాకు కలగక, 'ఇంతదూరం వచ్చానుగానీ, బాబా కలవలేదు' అని నిరాశ చెందాను. ఆదివారం సాయంత్రం మా ఊరికి బయలుదేరాల్సి ఉంది. కానీ, బాబా నాకు కనిపించడం లేదని బాధపడుతున్నాను. ఆరోజు ఉదయం అకస్మాత్తుగా ఎందుకు వచ్చిందో తెలీదుగానీ నాకు చాలా తీవ్రంగా జ్వరం  వచ్చింది. అంత జ్వరంలోనూ ‘ప్రసాదాలయంలోనైనా సాయి కనిపిస్తారేమోన’ని ఆశగా అక్కడికి వెళ్లాను. భోజనానికి కూర్చోగానే జ్వరమంతా తగ్గిపోయింది, నీరసం కూడా లేదు. ‘ఉన్నపళంగా జ్వరం ఎలా తగ్గింద’ని నా కుటుంబసభ్యులందరూ షాకయి, ‘ఏమిటీ వింత!’ అనుకుంటున్నారు. తరువాత, అక్కడ భక్తులు తిన్న తరువాత ప్లేట్లు తీస్తున్న ఒక అన్నకు నేను కూడా ప్లేట్లు తీసి సహాయం చేశాను. అతను, "అల్లా అచ్ఛా కరేగా బేటా" అని అన్నారు. అతను సాయిబాబా అని నేను తేల్చుకోలేదుగానీ, "అన్నా, నిన్ను వదిలి వెళ్ళాలని లేదు" అని అన్నాను. తరువాత శిరిడీ విడిచి వెళ్తుంటే వస్తున్న  కన్నీళ్లను అందరూ చూస్తారని నాలోనే దాచుకున్నాను. ఇంతలో ఒకతను వచ్చి, "సాయిబాబా మూర్తి కావాలా?" అని అడిగారు. అయితే అప్పటికే నేను షాపింగ్ చేసి ఉన్నందున అతనితో వద్దని అన్నాను. అతను వెళ్తూ, "అల్లా అచ్ఛా కరేగా" అని అన్నాడు. "మళ్ళీ అతను మాట్లాడితే బాగుండు" అని నేను ఠక్కున అటో దిగాను. కానీ అతను కనపడలేదు. నేను, నా కుటుంబం అతని కోసం అక్కడంతా వెతికాము. కానీ అతనెక్కడా కనపడలేదు. అప్పుడు నా భర్త, "అతను ఆ సాయినాథుడే. నీకోసం వచ్చారు" అని అనేసరికి నాకు కన్నీళ్లు ఆగలేదు. ట్రైన్ కదిలేసరికి కట్టలు తెంచుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక నన్ను నేను మరిచిపోయి బిగ్గరగా ఏడ్చేశాను. అందరూ వింతగా చూస్తున్నారు. నేను మాత్రం ‘సాయిని చూసి కూడా ఏమీ మాట్లాడలేకపోయాన’ని బాధపడుతున్నాను. ఆ బాధతో ఏమీ తినలేదు. ఏడుస్తూ అలాగే పడుకుని ఉన్నాను. ఎవరో ఒకతను, "ఏమీ తినకుండా పడుకుని ఉన్నావు. ఇంద, ఈ ప్రసాదం తిను" అని అన్నారు. లేచి చూస్తే, నా చేతిలో కోవాబిళ్ళ ఉంది. అతను ఎవరో కాదు, ప్రసాదాలయంలో ప్లేట్లు తీసినప్పుడు మాట్లాడిన అన్న. నా ఆనందానికి అవధులు లేవు. 'ఇక నాకు ఏ కష్టం రాదు. ఒకవేళ వచ్చినా బాబా చూసుకుంటారు' అని నేను అప్పుడే నిర్ధారించుకున్నాను.


మేము శిరిడీ నుండి వచ్చిన తర్వాత ఒకరోజు మా అమ్మానాన్నలు మా ఇంటికి వచ్చారు. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు మేము వాళ్ళకి శిరిడీ నుండి తెచ్చిన బాబా ఫోటో, ప్రసాదం ఇచ్చాము. వాళ్ళు ఇంటికి వెళ్తుండగా వాళ్ళు ప్రయాణిస్తున్న టక్కర్‌ని ఒక లారీ గుద్దింది. ఆ ప్రమాదంలో టక్కర్ నుజ్జయిపోయింది. ముందు సీటులో కూర్చున్న నాన్న మీద పగిలిన టక్కర్ అద్దాలు పడ్డప్పటికీ నాన్న శరీరం మీద ఒక్క గీతైనా లేదు. అమ్మానాన్నలనే కాదు, టక్కర్‌లో ఉన్న ప్రతి ఒక్కరినీ సాయినాథుడు కాపాడారు. అందరినీ కాపాడిన ఆయన ఫోటో అద్దం మాత్రం పగిలింది. మా అమ్మకు ఆరోజు నుండి బాబా మీద అపారమైన నమ్మకం ఏర్పడింది. తనను నమ్మినవారినే కాదు, వారి కుటుంబసభ్యులను కూడా బాబా కాపాడుతారు.


ఈమధ్య మాకు కోవిడ్ లక్షణాలు ఉన్నాయని డాక్టర్ అన్నారు. నేను చాలా భయపడి బాబాను ప్రార్థించాను. వెంటనే బాబా నా భయాన్ని తొలగించారు. కోవిడ్ నెగిటివ్ అని రిపోర్టులు వచ్చాయి. "ధన్యవాదాలు బాబా. పెళ్లయి పదేళ్ళైనా నాకు సంతానం లేదు బాబా. మీ దయవల్ల మాకు సంతానం కలిగితే ఆ అద్భుతాన్ని పంచుకోవాలని ఉంది బాబా".


బాబా అంటే నాకు ప్రాణం, బాబా లేనిదే నేను లేను. ఆయన ఎల్లప్పుడూ నాతో ఉంటారు. ఒకరోజు రాత్రి పది గంటల సమయంలో అలా కూర్చుని ‘బాబా’ అని తలవగానే మబ్బుల రూపంలో బాబా నాకు దర్శనమిచ్చారు. నన్ను పెట్టి ఫోటో తీస్తే, ఆ ఫోటోలో బాబా వచ్చారు. కానీ నా ఫ్రెండ్స్‌కి తీసిన ఫోటోలో బాబా రాలేదు. ఒక గురువారంనాడు మేము భజన చేస్తుంటే, అక్కడ ఉన్న ఉద్ధరిణెలోని నీళ్ళు నా కళ్ళకి గులాబీపూలుగా కన్పించాయి. అది నన్ను నేను నమ్మలేని ఓ అద్భుతం. మేము ప్రతి గురువారం బాబాకి మధ్యాహ్న ఆరతి ఇస్తాం. ఒకసారి మధ్యాహ్న ఆరతి సమయంలో మా ఇంటిలోకి ఒక వీధికుక్క వచ్చింది. ఆ సమయంలో బాబా ఫోటో నుండి ఒక తెల్లని ఆకారం బయటకు రావడం నేను స్పష్టంగా చూశాను. ఇవి సాక్ష్యం లేని, నా మనసుకు మాత్రమే తెలిసిన నిజాలు. ఇలా బాబా దర్శనమిచ్చి నా బాధలను తీర్చిన అద్భుత క్షణాలు ఎన్నో, ఎన్నెన్నో.


చివరిగా, ఈమధ్యనే అనగా, 2021, సెప్టెంబరు 1న మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి విపరీతంగా జ్వరమొచ్చింది. హాస్పిటల్‌కి వెళ్తే ‘నిమోనియా’ అన్నారు. దాంతో, వాళ్ళు బాబుకి సర్జరీ చేయాల్సి వస్తుందేమోనని భయపడ్డారు. నేను వాళ్లతో, "బాబాని నమ్ముకోండి. మీకు అంతా మంచే జరుగుతుంది. గురువారానికల్లా బాబుకి నయం అవుతుంది" అని చెప్పాను. నేను కూడా వాళ్ళ బాబు కోసం బాబాను ప్రార్ధించాను. బాబా నా ప్రార్థన విన్నారు. ఆపరేషన్ అవసరం లేకుండా గురువారానికల్లా బాబుకి నయం చేశారు బాబా. మనం ఏది అడిగినా ఇస్తారు బాబా. "ఐ లవ్ యు బాబా".


శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబా కృపతో గృహప్రవేశం - వివాహం


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.

సాయి ఈశ్వరాయ విద్మహే

తత్పురుషాయ ధీమహి

తన్నో సాయి ప్రచోదయాత్.


నేనొక సాయిభక్తురాలిని. ఈమధ్య జరిగిన నా కుమారుని వివాహం, గృహప్రవేశం విషయంలో 'ఏ ఆటంకం లేకుండా అంతా చక్కగా జరగాలి. అలా జరిగితే ఆ అనుభవాలను బ్లాగులో పంచుకుంటాన'ని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవలన గృహప్రవేశం, వివాహం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా బాగా జరిగాయి. తలచుకుంటే, ఆ సమయంలో బాబా నాకు ఎంతో శక్తినిచ్చారనిపిస్తోంది. ఎందుకంటే, ఒక్క కార్యక్రమం అంటేనే అలసిపోతాం. అలాంటిది కేవలం పదిరోజుల వ్యవధిలో రెండు కార్యక్రమాలకు సిద్ధమయ్యాను. అది కూడా రెండు వేరువేరు చోట్ల (సిటీలో, గ్రామంలో). ఏర్పాట్లన్నీ ఎలా చేసుకున్నానో నాకే ఆశ్చర్యంగా ఉంది. అవన్నీ చేసుకోవడానికి అవసరమైన ధైర్యాన్ని, శక్తిని బాబానే నాకు ప్రసాదించారు. నాకు ఏ కొంచెం ఇబ్బంది అనిపించినా ‘బాబా’ అని అనుకున్నాను. బాబా కృపతో అన్నీ సజావుగా సాగిపోయాయి. కొన్నైతే అనుకున్న సమయంలో ఒంటరిగా నేనే చేసుకున్నాను. ఇదంతా బాబా వల్లే సాధ్యమైంది. "బాబా! నాకు ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించి నా కార్యక్రమాలను దిగ్విజయం చేశావు తండ్రీ. మా కుమారుని మరియు కోడలి విషయంలో అన్నీ నీవై చూసుకున్నావు. నేను ఏది కోరినా నిరాశపరచకుండా తృప్తిపరచావు. చాలా చాలా ధన్యవాదాలు బాబా. సాయీ! నిన్ను ఎలా కొలవాలో, ఎలా తరించాలో మాకు తెలియదు. ఈ కలియుగమందు వెలసిన దివ్య కారుణ్యమూర్తి నీవు. నిన్నే నమ్ముకున్న ఆర్తురాలిని నేను. నాకు తల్లి, తండ్రి, సమస్తం నీవే. మాకు, నా బిడ్డలకు నీవే దిక్కు. ఎల్లవేళలా మమ్మల్ని కాపాడు బాబా".



సాయిభక్తుల అనుభవమాలిక 933వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆరోగ్యప్రదాత సాయి
2. బాబా కృపతో దొరికిన డాక్యుమెంట్స్
3. సాయి కృపతో దొరికిన రిజిస్టర్

ఆరోగ్యప్రదాత సాయి


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథునికి నా శతకోటి వందనాలు. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు ధన్యవాదాలు. గతంలో నేను ఈ బ్లాగులో కొన్ని అనుభవాలను పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకోవాలనుకుంటున్నాను. ఇటీవల మా అబ్బాయికి తరచూ జ్వరం వస్తూ పోతూ ఉండేది. అయినప్పటికీ బాబు రోజూ స్కూలుకి వెళ్లి వస్తుండేవాడు. కానీ కరోనా సమయం వల్ల చాలా చాలా టెన్షన్‌గా అనిపించేది. అప్పుడు నేను, "బాబా! బాబుకి జ్వరం తగ్గిపోతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మాట ఇచ్చాను. తరువాత బాబుకి కరోనా టెస్టు చేయించాము. అప్పుడు కూడా, "రిపోర్ట్ నెగిటివ్ రావాల"ని బాబాను ఎంతగానో వేడుకున్నాను. బాబా దయవల్ల రిపోర్ట్ నెగిటివ్ రావడమే కాదు, ఆ మరుసటిరోజే బాబుకి జ్వరం తగ్గిపోయి మళ్లీ రాలేదు. "చాలా చాలా ధన్యవాదాలు సాయీ".


వినాయకచవితి రోజున నాకు ఒక చిన్న ఆరోగ్య సమస్య వచ్చింది. నేను ఆ నొప్పిని భరించలేక, "బాబా! నా ఈ నొప్పిని తొలగించండి. నేను నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకుని బాబాను స్మరిస్తూ ఉండగా కాసేపట్లో నాకు పూర్తిగా నయమయింది. అయితే అప్పుడప్పుడు నాకు ఆ సమస్య వస్తూ ఉంది. "బాబా! దయచేసి నాకొస్తున్న ఆ బాధను పూర్తిగా తీసివేయండి. మీకు మాట ఇచ్చిన ప్రకారం నా అనుభవాలను బ్లాగులో పంచుకుంటున్నాను. ఇంకా కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలను తీర్చండి బాబా. అవి కూడా తీరిపోగానే నా అనుభవాలను మళ్ళీ బ్లాగులో పంచుకుంటాను తండ్రీ. ఎల్లప్పుడూ ఇలానే అందరినీ చల్లగా చూడండి తండ్రీ. చాలా చాలా ధన్యవాదాలు బాబా". ఏ చిన్న సమస్య వచ్చినా బాబాను స్మరించడం మర్చిపోకండి. ఆయన మనకు సరైన సమయంలో సరైన దారి చూపిస్తారు.


అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబా కృపతో దొరికిన డాక్యుమెంట్స్


ముందుగా సాయికి నమస్కారం. నా పేరు శిరీష. 2021, సెప్టెంబరు 17న బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను. ఆరోజు మధ్యాహ్నం ముఖ్యమైన డాక్యుమెంట్స్ కనిపించలేదు. నేను, నా భర్త ఇల్లంతా వెతికినప్పటికీ డాక్యుమెంట్స్ దొరకలేదు. నాకు అప్పుడు భక్తుల అనుభవాలు గుర్తుకు వచ్చి 'శ్రీసాయి సూక్ష్మాయ నమః' అనే మంత్రాన్ని జపిస్తూ, "బాబా! ఆ డాక్యుమెంట్స్ దొరకకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. మీ దయతో అవి దొరికితే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకుంటూ డాక్యుమెంట్స్ వెతుకుతున్నాను. అంతలో నా భర్త, "ఒకసారి మీ నాన్నగారిని అడుగు" అన్నారు. సరేనని నేను నాన్నకి ఫోన్ చేస్తే ఆయన, "ఆ డాక్యుమెంట్స్ నేను మీకు ఎప్పుడో ఇచ్చేశాను. నా దగ్గర లేవు" అని అన్నారు. "అయినా ఒకసారి వెతికి చూడమ"ని నాన్నతో చెప్పి ఫోన్ పెట్టేశాను. కాసేపటికి నాన్న ఫోన్ చేసి, "డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయ"ని చెప్పారు. నేను సంతోషంగా బాబాకి ధన్యవాదాలు చెప్పుకుని, "రేపు ఈ అనుభవాన్ని మీ బ్లాగుకి పంపుతాను బాబా" అని చెప్పుకున్నాను. కానీ మరుసటిరోజు ఉదయం పని ఒత్తిడి వల్ల ఆ సంగతి మర్చిపోయాను. రోజూ ఉదయం బ్లాగులోని భక్తుల అనుభవాలు చదివాక నేను నా పని ప్రారంభిస్తాను. అలాంటిది ఆరోజు సమయంలేక చదవలేదు. వాటిని సుమారు మధ్యాహ్నం 12 గంటల సమయంలో చదువుతుంటే, అందులో బాబా అనుగ్రహంతో ముఖ్యమైన డాక్యుమెంట్స్ దొరికిన ఒక భక్తుని అనుభవం ఉంది. వెంటనే నా అనుభవం గుర్తొచ్చి ఈవిధంగా బాబా నాకు గుర్తు చేశారనిపించి వెంటనే నా అనుభవాన్ని వ్రాసి పంపాను. "ధన్యవాదాలు బాబా".


సాయి కృపతో దొరికిన రిజిస్టర్


ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.


ముందుగా నా తండ్రి సాయినాథునికి ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. నేను ఇదివరకు రెండు అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు 2021, సెప్టెంబరు రెండవవారంలో జరిగిన మరో అనుభవాన్ని పంచుకుంటాను. నా పేరు యశోద. మేము అనంతపురంలో నివాసముంటున్నాము. నేను టీచరుగా పనిచేస్తున్నాను. మా వృత్తిలో పాఠశాలకు సంబంధించిన అడ్మిషన్ రిజిస్టరును ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఎంత వెతికినా కనపడలేదు. దాంతో నాకు చాలా భయం వేసింది. అంతలో వినాయకచవితి పండుగ వచ్చింది. రిజిస్టర్ కనపడటంలేదన్న భయంతో నేను పండుగ కూడా సరిగా చేసుకోలేకపోయాను. తరువాత శని, ఆదివారాలు రావడంతో వరుసగా మూడురోజుల సెలవు తరువాత నేను పాఠశాలకు వెళ్లి మరోసారి వెతికినా రిజిస్టర్ కనపడలేదు. అప్పుడు నా సాయిని తలచుకుని, "రిజిస్టర్ దొరికితే నా అనుభవాన్ని సాటి సాయిభక్తులతో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. వెంటనే నా టేబుల్ సొరుగులోనే రిజిస్టర్ కనిపించింది. అది చూసి నాకు ఎంతో సంతోషం కలిగి, 'నా తండ్రి ఎప్పటికీ నాతో ఉన్నార'ని అర్థమైంది. "ధన్యవాదాలు బాబా".


అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!



సాయిభక్తుల అనుభవమాలిక 932వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. పిల్లలకు సాయి సంరక్షణ
2. ప్రెగ్నెన్సీ సమయంలో బాబా ప్రసాదించిన అనుభవాలు
3. బాబా దయతో ఆరోగ్యం

పిల్లలకు సాయి సంరక్షణ


నేనొక సాయిభక్తురాలిని. ముందుగా సాయిబంధువులందరికీ మరియు ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నమస్కారం. ఇది నేను ఈ బ్లాగులో పంచుకుంటున్న రెండవ అనుభవం. ముందుగా మా పెద్దబాబు నవతేజస్వత్‌సాయికి జలుబు, దగ్గు వచ్చాయి. ఆ దగ్గుతో నిద్రపట్టక బాబు పడుతున్న అవస్థను మేము చూడలేకపోయాము. ఎంత తీవ్రమైన దగ్గు అంటే కొన్ని రోజుల వరకు అది తగ్గదు అనిపించింది. ఒకరోజు రాత్రి 12 గంటల సమయంలో బాబు తీవ్రంగా దగ్గుతూ ఉంటే బాబా ఊదీని వాడి నుదుటన పెట్టి, మరికొంత ఊదీని నీళ్లలో కలిపి తనకు త్రాగించి, "బాబా! మీ ఊదీ మహిమ గురించి తెలియనిది కాదు. అయినా మీ ఊదీ మహిమను నాకు చూపించు తండ్రీ. ఈ రాత్రే బాబుకి దగ్గు పూర్తిగా తగ్గిపోయి ఉదయానికల్లా వాడు నార్మల్ అయిపోవాలి. దగ్గు అస్సలు రాకూడదు. నేను ఊదీ బాబుకి పెడుతూ ఉంటాను" అని మనసులోనే బాబాను ప్రార్థించాను. ఎంత అద్భుతం జరిగిందో చూడండి! బాబుకి ఊదీ నీళ్లు త్రాగించి నేను పడుకోబోయేంతలోనే బాబు ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం లేచిన తరువాత బాబుకి అస్సలు దగ్గు రాలేదు.


తరువాత 2021, సెప్టెంబరు నెల రెండవ వారం చివరిలో మా రెండవ బాబు విహాన్స్‌సాయి జ్వరం, జలుబు, దగ్గుతో వారం రోజుల పాటు బాధపడ్డాడు. మందులు వాడుతుంటే తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తుండేవి. దాంతో బాబుని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళినా తగ్గలేదు సరికదా మరుసటిరోజుకి మరింత ఎక్కువైంది. నాకు చాలా భయమేసి, 'సమయానికి ఊదీ కూడా నా దగ్గర లేదు. ఒకవేళ ఊదీ ఉండివుంటే బాబుకి తప్పకుండా తగ్గిపోయి ఉండేది' అని అనుకున్నాను. తరువాత తప్పనిసరై సెప్టెంబరు 16న మళ్లీ బాబుని హాస్పిటల్‌కి తీసుకెళ్లి మనసులో బాబాని తలచుకుని, "బాబా! బాబుకి జ్వరం అస్సలు తగ్గడం లేదు. సమయానికి నా దగ్గర ఊదీ లేదు. డాక్టరు తప్పనిసరిగా టెస్టులు చేయాలంటున్నారు. కానీ ప్రస్తుతం ఎక్కడ చూసినా డెంగ్యూ, మలేరియా జ్వరాలే. నా భర్త హైదరాబాదులో ఉన్నారు. హైకోర్టు జడ్జి వస్తున్నందున మరియు కాన్ఫరెన్స్ ఉన్నందున నాకు సెలవు అస్సలు దొరకదు. ఇటువంటి స్థితిలో బాబుని హాస్పిటల్లో చేర్చాల్సి వస్తే నా పరిస్థితి ఏమిటి సాయీ? కాబట్టి దయచేసి నా బాబు రిపోర్టులన్నీ నార్మల్ వచ్చేలా చూడండి" అని బాబాతో చెప్పుకుని ఏడ్చేశాను. ఇంకా, "రిపోర్టులు నార్మల్ వస్తే నా అనుభవాన్ని తోటి భక్తులతో వెంటనే పంచుకుంటాన"ని మ్రొక్కుకున్నాను. అయితే, రిపోర్టులన్నీ నార్మల్ గానే వచ్చాయిగానీ డాక్టరు, "కొంచెం టైఫాయిడ్ లక్షణాలున్నాయ"ని చెప్పారు. అప్పుడు నా ఆఫీసు సమస్యను డాక్టరుగారితో చెప్పాను. డాక్టరు సరేనని, బాబుని హాస్పిటల్లో అడ్మిట్ చేయమని చెప్పలేదు. నేను దేనిగురించైతే భయపడ్డానో అది జరగకుండా కాపాడారు బాబా. "థాంక్యూ సాయీ. ఈ అనుభవం ద్వారా నాకొకటి చాలా స్పష్టంగా అర్థం అయింది, 'నన్ను మీ నీడలో ఉంచుకుని నాకు సంబంధించిన ప్రతీది గమనిస్తున్నార'ని. ఎందుకు బాబా నా మీద మీకు అంత దయ? ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో చిన్నవయసులోనే మీరు నాకు గురువుగా లభించారు. మీ గురించి ఎంతని చెప్పను? ఏమని చెప్పను? ఎంత చెప్పినా తక్కువే. చివరిగా, ఆఫీసులో పనుల వల్ల వెంటనే ఈ అనుభవాన్ని పంపలేకపోయినందుకు నన్ను క్షమించండి బాబా".


ప్రెగ్నెన్సీ సమయంలో బాబా ప్రసాదించిన అనుభవాలు


ముందుగా సాయిభక్తులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. కష్టకాలంలో సాయిబాబా నాకు చాలాసార్లు సహాయం చేశారు. ఇప్పుడు నేను నా ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఒక అనుభవాన్ని పంచుకుంటున్నాను. నేను ఈ బ్లాగులో పంచుకుంటున్న మూడవ అనుభవమిది. మా నాన్నగారు బ్యాంకు ఉద్యోగి, అమ్మ గృహిణి. వాళ్ళకి మేము ముగ్గురం ఆడపిల్లలం. మాకు అన్నదమ్ములు లేనందున ప్రతీ సంవత్సరం రాఖీ పండుగనాడు నేను ‘అన్నయ్య కానీ, తమ్ముడు కానీ ఉంటే బాగుండు’ అనుకునేదాన్ని. ఇకపోతే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక నేను, "బాబా! నాకు బాబు పుట్టి, వాడు ఆరోగ్యంగా ఉంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. ప్రెగ్నెన్సీ సమయంలో రెండవసారి స్కానింగ్ తీసినప్పుడు బిడ్డ గుండెకు చిన్న మచ్చ లాంటిది ఉందని చెప్పారు. అది విని నేను కాస్త భయపడినప్పటికీ వెంటనే బాబాని తలచుకున్నాను. ఆరోజు రాత్రి బాబా స్వప్నదర్శనమిచ్చి, "నేను ఉండగా భయం దేనికి? బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది" అని అన్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించి ఆరోజే నా ఆనందాన్ని బ్లాగులో పంచుకుందామని టైపు చేస్తుంటే, 'బాబు పుడితే పంచుకుంటానన్నావు కదా!' అని బాబా నన్ను ఆపుతున్నట్టు నా మనసుకి అనిపించేలా చేశారు బాబా. వెంటనే టైపు చేయడం ఆపేశాను. ప్రెగ్నెన్సీ సమయంలో, ‘పుట్టబోయేది బాబో, పాపో’ అని నాకు కుతూహలంగా ఉండేది. అలాగని నేను బాబునే కోరుకునేదాన్నని మీరు తప్పుగా అనుకోకండి. నాకు ఎవరైనా ఓకే. కానీ నాకు అన్నదమ్ములు లేనందున బాబు కావాలని కాస్త ఉండేది. ఒకసారి నేను, "బాబా! నాకు బాబు పుడతాడంటే శిరిడీలో మీరు పింక్ రంగు దుస్తులు ధరించి నాకు దర్శనం ఇవ్వండి" అని అనుకున్నాను. తరువాత శిరిడీ లైవ్ దర్శన్ యాప్ ఓపెన్ చేసి చూస్తే, నేను కోరుకున్నట్లు బాబా పింక్ రంగు దుస్తుల్లో దర్శనమిచ్చారు. చాలా సంతోషంగా అనిపించింది. చివరికి నెలలు నిండాక బాబా దయతో నాకు బాబు పుట్టాడు. నా అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. "ధన్యవాదాలు బాబా".


బాబా దయతో ఆరోగ్యం


అందరికీ నమస్తే. నేనొక సాయిభక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. ఈమధ్య ఒకసారి మా బాబు శరీరం కాస్త వేడిగా అనిపించింది. అప్పుడు నేను, "బాబా! ఇది జ్వరం కాకూడదు. ఉదయానికల్లా తగ్గిపోవాలి" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవలన ఉదయానికి బాబు నార్మల్ అయ్యాడు. అలాగే, మా పాప కూడా జ్వరం, దగ్గుతో బాధపడినప్పుడు కూడా నేను, "బాబా! మీ దయతో పాపకి తగ్గిపోవాలి" అని బాబాను ప్రార్థించాను. బాబా కృపతో పాపకి తగ్గింది. ఇంకోసారి నా సోదరుని భార్య గ్యాస్ట్రిక్ మరియు గాల్‌బ్లాడర్‌లో స్టోన్స్‌తో బాధపడుతుంటే, "శస్త్రచికిత్స అవసరం లేకుండా మందులతో తనకి నయం కావాల"ని బాబాను ప్రార్థించాను. బాబా దయవలన డాక్టరు కేవలం మందులతోనే తనకి నయం చేశారు. ప్రియమైన బాబా చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆయన పవిత్ర పాదకమలాలపై నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.


సాయిభక్తుల అనుభవమాలిక 931వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయి తలచుకుంటే ఏదైనా ఎంత పని? 
2.  బాబా దయ 
3. యాక్సిడెంట్ నుండి కాపాడిన బాబా

సాయి తలచుకుంటే ఏదైనా ఎంత పని?


ఓం శ్రీ సాయినాథాయ నమః. నేనొక సాయిభక్తురాలిని. సాయి మనకి రోజూ చిన్న, పెద్ద అనుభవాలు చాలానే ప్రసాదిస్తూ ఉంటారు. కొన్ని అనుభవాలు చదివేవాళ్ళకి సిల్లీగా అనిపించినా వాటిని అనుభవించినవారికి మాత్రం అది సాయి కృపేనని స్పష్టంగా అనుభవమవుతూ అమితానందాన్ని ఇస్తాయి. ఈమధ్య జరిగిన అలాంటి అనుభవాలను నేనిప్పుడు సాయిబంధువులతో పంచుకోవాలనుకుంటున్నాను.


ఈమధ్య మా అమ్మాయికి, 'కాలేజీకి వచ్చి సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్ళమని, అలాగే హాస్టల్ ఖాళీ చేయమ'ని మెసేజ్ వచ్చింది. విషయమేమిటంటే, గత మార్చి నుండి కోవిడ్ కారణంగా మా అమ్మాయి ఇంట్లోనే ఉంటున్నందున హాస్టల్ గది అలాగే వదిలేశాము. సాయి దయవల్ల ఇంట్లోనే తన బి.టెక్ పూర్తయి మంచి ఉద్యోగం కూడా వచ్చింది. ఇదంతా నేను ఇదివరకే నా గత అనుభవాలల్లో పంచుకున్నాను. ఇక ప్రస్తుతానికి వస్తే, కోవిడ్ కారణంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉపయోగించుకోవడానికి మా అమ్మాయి భయపడింది. పోనీ, కారులో వెళదామంటే మావారికి వీలుపడలేదు. దాంతో తప్పనిసరై నేను, మా అమ్మాయి, "ఎటువంటి ఆటంకాలు లేకుండా, కోవిడ్ బారినపడకుండా చూడమ"ని సాయికి నమస్కరించుకుని ఇంటినుండి బయలుదేరాం. తీరా ఎయిర్‌పోర్టుకి వెళ్లిన తరువాత తాను 'కాలేజీ ఐడి కార్డు' మర్చిపోయానని చెప్పింది. అసలే వాళ్ళది చాలా స్ట్రిక్ట్ కాలేజీ, పైగా ఐడి కార్డు తీసుకుని రావాలని వాళ్ళు ముందే చెప్పారు. అయినప్పటికీ వెనుతిరిగి ఇంటికి వెళ్లకుండా బాబాపై భారం వేసి కాలేజీకి వెళ్ళాము. నేను కోరినట్టుగానే బాబా ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఈ-కాపీతోనే పని జరిగేలా చూశారు. ఆ కాలేజీలో ఇదంతా జరగడం నిజంగా చాలా గొప్ప విషయం. కేవలం బాబా వల్లే సాధ్యమైంది.


తిరుగు ప్రయాణంలో లగేజీ ఉండడం వల్ల మేము ట్రైనుకి బయలుదేరాం. తెల్లవారుఝామున మా ఊర్లో దిగాల్సి ఉండగా నేను నిద్రలేచినప్పటినుంచి ఒకటే వర్షం పడుతోంది. ఆ ట్రైన్ ఎప్పుడూ మా ఊరిలోని రెండవ నెంబర్ ప్లాట్‌ఫాం మీదకి వస్తుంది. ఆ ప్లాట్‌ఫాంకి షెల్టర్ ఉండదు, మొత్తం ఓపెన్ ఉంటుంది. పైగా అక్కడ దిగాక మెట్ల వరకు వెళ్ళడానికి చాలాదూరం నడవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్లాట్‌ఫాం మీద దిగితే మేము, మా లగేజీ అంతా వర్షంలో తడిసి ముద్దవడం ఖాయం. ఇటువంటి పరిస్థితుల్లో బాబానే మనకి శరణం. ఆయన తప్ప మనకి దిక్కెవరు? అందుచేత నేను, "బాబా! ఈ ఒక్కరోజు ట్రైన్ మొదటి ప్లాట్‌ఫాం పైకి వెళ్లేలా చూడండి" అని వేడుకుని ప్రశాంతంగా ఉన్నాను. ఏం జరిగిందో సాయిబంధువులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. కాసేపట్లో ట్రైన్ ఒకటో నెంబర్ ప్లాట్‌ఫాం మీద ఆగింది. మేము ఏ మాత్రమూ వర్షంలో తడవకుండా క్షేమంగా ఇంటికి చేరుకున్నాం. నేను ఇప్పటివరకూ కనీసం 10 సార్లైనా చూసి ఉంటాను ఆ ట్రైన్ రెండవ నంబర్ ప్లాట్‌ఫాం మీదకి రావడం. ఒక్కసారి కూడా మొదటి ప్లాట్‌ఫాంకి రావడం నేను చూడలేదు. కానీ సాయి తలచుకుంటే అదెంత పని? ఒకే ప్రయాణంలో బాబా నాకు ఈ రెండు అనుభవాలను ప్రసాదించారు. "థాంక్యూ వెరీ మచ్ బాబా".


సర్వం శ్రీసాయినాథ దివ్య చరణారవిందార్పణమస్తు!


బాబా దయ


ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేనొక సాయిభక్తురాలిని. నేను ఇంతకుముందు నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు సాయినాథుని దయవలన మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. 


ఈమధ్య మా రెండవ చెల్లికి జ్వరం, కాళ్లనొప్పులు వచ్చాయి. అసలే మూడు నెలల ముందు తనకు కోవిడ్ వచ్చి తగ్గినందున తను చాలా బలహీనంగా ఉంటోంది. అటువంటి తనకి మళ్లీ జ్వరం వస్తుండటంతో మాకు చాలా భయమేసి వివిధ రకాల రక్తపరీక్షలతోపాటు కోవిడ్ పరీక్ష కూడా చేయించి, "బాబా! మీ దయతో కోవిడ్ రిపోర్టు నెగిటివ్ వస్తే వెంటనే బ్లాగుకి రాసి పంపుతాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవలన కోవిడ్ రిపోర్టు నెగిటివ్ వచ్చింది. "సాయినాథా! మీ దయవలన చెల్లికి ఎటువంటి ఇబ్బందికర జ్వరము కాకుండా, త్వరగా తగ్గి తను పూర్తిగా కోలుకోవాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రీ".


నేను ఎల్లప్పుడూ బాబాను శరణు వేడుతాను. నేను టెన్షన్ పడిన ప్రతి సమయంలోనూ ఆ సాయినాథుని తలచుకుంటే వెంటనే ఆయన నాకు మంచి ఫలితాన్ని ఇస్తారు. ఈమధ్యకాలంలో జ్వరం వచ్చిందంటే భయంగా ఉంటోంది. మా మనవడికి 13 నెలల వయస్సు. ఈమధ్య ఒకసారి వాడికి జ్వరం వచ్చింది. వెంటనే నేను, "బాబుకి జ్వరం తగ్గిపోవాల"ని సాయిని వేడుకున్నాను. బాబా ఎంతో దయతో బాబుకి జ్వరం తగ్గించారు. "ధన్యవాదాలు బాబా".


మా చెల్లెలి కూతురికి నీట్ పరీక్షలో మంచి మార్కులు వచ్చాయంటే అది శ్రీసాయినాథుని దయేనని, సాక్షాత్తూ బాబానే తనచేత పరీక్ష బాగా వ్రాయించి ఉంటారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే పరీక్ష జరిగేరోజు తను చాలా టెన్షన్‌లో పరీక్షకు వెళ్ళింది. అప్పుడు నేను, "పాప పరీక్ష బాగా వ్రాస్తే ఆ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. ఇలాగే తను కోరుకున్న కాలేజీలో మంచి సీటు రావాలని బాబాను వేడుకుంటున్నాను. ఈవిధంగా ఎల్లప్పుడూ బాబా నాకు అండగా ఉంటారు. ఈ బ్లాగు ద్వారా బాబాకు కృతజ్ఞతలు తెలియజేసే అవకాశమిచ్చిన బ్లాగు నిర్వాహకులకు సదా ఋణపడివుంటాను. "ధన్యవాదాలు బాబా. నేను రెండు విషయాల గురించి చాలా మనోవేదనలో ఉన్నాను సాయీ. త్వరలోనే మీరు అనుగ్రహించి ఆ విషయాల్లో నాకు సంతోషం కలిగించాలని శరణు వేడుతున్నాను. శుభఫలితాలను అందుకున్న వెంటనే ఆ అనుభవాలను కూడా బ్లాగులో తెలియజేసుకుంటాను బాబా".


యాక్సిడెంట్ నుండి కాపాడిన బాబా


నేను ఒక సాయి భక్తురాలిని. నేను రోజూ స్కూటీ నడుపుతున్నప్పుడు 'బాబా బాబా సాయి' అని బాబాని తలచుకుంటూ ఉంటాను. 2021, సెప్టెంబర్ 16న కూడా బాబాని తలుచుకుంటూ నేను, నా ఫ్రెండ్ కాలేజ్ నుండి స్కూటీ మీద వస్తున్నాము. హఠాత్తుగా మాకు వ్యతిరేక దిశలో వస్తున్న ఒక వ్యక్తి(ఫుల్ గా డ్రింక్ చేసి) వేగంగా వచ్చి మా స్కూటీని గుద్దేసాడు. స్కూటీతో సహా నేను, నా ఫ్రెండ్ కింద పడిపోయాము. క్షణకాలం మాకేమీ అర్థం కాలేదు. బాబా దయవలన నాకైతే ఒక్క దెబ్బ కూడా తగల్లేదు. కానీ నా ఫ్రెండ్ కి కొంచం దెబ్బలు తగిలాయి. స్కూటీ అయితే పూర్తిగా డామేజ్ అయ్యింది. నాకు దెబ్బలు తగలకుండా ప్రమాదం నుండి కాపాడిన బాబాకు అనేకవేల శతకోటి వందనాలు సమర్పించుకుంటున్నాను. "బాబా! నేను మిమ్మల్ని ఒక కోరిక కోరుకుని 1008 సార్లు సాయి చాలీసా పఠిస్తానని అనుకున్నాను. ఇప్పటికి 250 సార్లు పఠించానని మీకు తెలుసు. నేను కోరుకున్నది నాకెంత అవసరమో మీకు తెలుసు. మీరు అనుకుంటే అది క్షణాల్లో నెరవేరుతుంది. అసాధ్యం అన్న దాన్ని కూడా మీరు సాధ్యం చేస్తారు. దయచేసి నన్ను అనుగ్రహించండి బాబా".



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo