సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1718వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అడిగితే ఎంతటి కష్టాన్నైనా తీరుస్తారు బాబా
2. ఒడిదుడుకులు అన్ని తప్పించి జీవితాన్ని నిలబెట్టిన బాబా

అడిగితే ఎంతటి కష్టాన్నైనా తీరుస్తారు బాబా


‘సాయి మహారాజ్ సన్నిధి’కి నమస్కారాలు. నా పేరు సరిత. ఈమద్య మా బాబుని ఆకాష్ బైజూస్‌లో జాయిన్ చేసాము. వాళ్ళు ట్యాబ్ ఇస్తామని అన్నారు కానీ, నెల రోజులైనా ఏదో ఒక కారణము చెప్తూ ట్యాబ్ పోస్ట్ చేయలేదు. చివరికి నా భర్తకు చాలా చిరాకొచ్చి, “కోర్స్ నుండి తప్పుకుంటామ"ని చెప్పారు. అప్పుడు వాళ్ళు, “ఒక 10 రోజుల సమయమివ్వమ”ని అడిగారు. అందుకు మావారు, "సరే, ఒక పది రోజులు వేచి చూస్తాం. అప్పటికీ ట్యాబ్ రాకపోతే కోర్స్ నుండి వైదొలుగుతామ"ని చెప్పారు. ఒకవేళ ట్యాబ్ రాకపోతే కోర్స్ నుండి వైదొలగాలని మా బాబు, నేను చాలా కలవరపడ్డాము.  అప్పుడు నేను, "బాబా! 10 రోజుల్లో ట్యాబ్ వచ్చేటట్లు చూడండి. మీ అనుగ్రహం మీ మిరకిల్స్ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. అంతే, ఒక వారంలోపు ట్యాబ్ పోస్ట్ చేశామని మాకు మెసేజ్ వచ్చింది. అంతకుముందు ఒక వారంలో, పది రోజుల్లో పోస్ట్ చేస్తామని చాలాసార్లు అన్నారు కానీ, పంపలేదు. అలాంటిది బాబాని అడిగాక సమస్య తొలగిపోయింది. "ధన్యవాదాలు బాబా".


ఒకసారి నాకు తీవ్రమైన మైగ్రేన్ నొప్పి వచ్చి ఎంతకీ తగ్గలేదు. అప్పుడు నేను, "బాబా! రేపు ఉదయానికల్లా తగ్గితే, మీ అనుగ్రహం బ్లాగ్‌లో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల ఉదయానికల్లా బాధ తగ్గింది. సాయిని తలచుకుంటే చాలు - ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి. అడిగితే ఎంతటి కష్టాన్నైనా తీరుస్తారు బాబా. "ధన్యవాదాలు బాబా".


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


ఒడిదుడుకులు అన్ని తప్పించి జీవితాన్ని నిలబెట్టిన బాబా


నా పేరు దేవి. నాకు తల్లి, తండ్రి, గురువు అన్నీ బాబానే. ప్రస్తుతం యుఎస్‌లో ఉంటున్న మా అబ్బాయి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసినందుకు పోలీసు కేసు పెట్టి, పెద్ద మొత్తంలో పెనాల్టీ కట్టమన్నారు. అంత మొత్తం మా దగ్గర లేనందున నేను గుడికి వెళ్లి బాబా దగ్గర కన్నీళ్లు పెట్టుకొని, "సహాయం చేయండి బాబా. మీ అనుగ్రహం బ్లాగ్ ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాన"ని చెప్పుకొని రాత్రి 7 గంటలప్పుడు గుడి నుండి ఇంటికి వచ్చాను. తర్వాత రాత్రి 10 గంటలకు మా అబ్బాయి ఫోన్ చేసి, “రెండున్నర నెలలు సమయమిచ్చి డ్రైవింగ్ నేర్చుకోమన్నారు” అని చెప్పాడు. కష్టం వచ్చినపుడు బాబా మనతో ఉంటారని, మన చేయి వదలరని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనమేముంది? ఇలా 30 సంవత్సరాలుగా బాబా నా పక్కనే ఉన్నారు. ప్రశాంతంగా పెళ్లి జరగడం, బాబు పుట్టడం, పెద్ద ఇల్లు కట్టుకోవడం అన్నీ సవ్యంగా జరిగాక సరిగ్గా 15 ఏళ్లకు నడి సముద్రంలో పడవ బోల్తా పడినట్లు అనుకోని నష్టం రావడంతో ఇల్లు, డబ్బులు, బంగారం, కారు అన్ని పోయి మేము కట్టుబట్టలతో రోడ్డున పడ్డాము. ఆ సమయంలో మా అబ్బాయి చిన్న పిల్లాడు. ఎన్నో ఒడిదిడుకులు వచ్చి మా జీవితాలు గాలికి, దూళికి ఎక్కడికి కొట్టుకుపోతాయో అనుకున్నాము. కానీ ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదురైనప్పటికీ అన్నింటిని ఎదుర్కొనేలా బాబా ప్రతిక్షణం మా చేయి పట్టుకునే ఉన్నారు. ప్రతి కష్టంలో ఎవరో ఒకరిని పంపి మా కష్టాన్ని తొలగించారు. మా అబ్బాయి చేత ఇంజినీరింగ్ పూర్తి చేయించి క్యాంపస్‌లో పెద్ద ఉద్యోగం వచ్చేలా చేసారు. తర్వాత బాబు యుఎస్‌లో MS చేయడానికి వెళ్ళాలనుకున్నాడు. అప్పుడు కూడా బాబా అద్భుతం చేసి కావాల్సిన డబ్బులు సమకూరేలా చేసారు. ఇది మా జీవితాల్లో ఊహించని విషయం. "ధన్యవాదాలు బాబా. మీరు ఎప్పుడూ మాతో ఉండి మేము ధర్మం తప్పకుండా, అహంకారమునకు లోనుకాకుండా చూడండి తండ్రీ. నేను ఒక సమస్యను పరిష్కరించే విషయంలో దయ చూపించమని మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను. మీరు తప్పకుండా అనుగ్రహిస్తారని తెలుసు. త్వరలో మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా మన సాయి కుటుంబంతో పంచుకుంటాను బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1717వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. చేయాల్సింది మనసుకి ప్రేరణనిచ్చి పర్సు దొరికేలా అనుగ్రహించిన బాబా
2. బాబా దయవల్ల తొలగిపోయిన అపార్థం

చేయాల్సింది మనసుకి ప్రేరణనిచ్చి పర్సు దొరికేలా అనుగ్రహించిన బాబా


అనంతకోటి సాయిభక్తులలో నేను ఒక భక్తురాలిని. ముందుగా సాయిబాబా భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను ప్రతిరోజూ ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో వచ్చే భక్తుల అనుభవాలు తప్పకుండా చదువుతుంటాను. కొన్ని అనుభవాలు నా మనసుకు దగ్గరగా, నాకు జరిగిన అనుభవాలలానే అనిపిస్తుంటాయి. అనుభవాలను చదివిన ప్రతిసారీ బాబా ఎల్లప్పుడూ మనతో ఉంటారు, ఆయన మన ప్రార్ధనలు వింటున్నారు, మనకు ఒక మార్గాన్ని నిర్దేశిస్తున్నారు అన్న భరోసా, ఆత్మ తృప్తి కలిగి కళ్ళల్లో నీళ్లు తొణికిసలాడుతున్నాయి. "నా భక్తులు నేనే ఎన్నుకుంటాను" అని చెప్పినట్లుగా బాబా 30 సంవత్సరాల క్రితం తమ భక్త సామ్రాజ్యంలో నాకు ఇంత చోటు ఇచ్చారు. ఎన్ని జన్మల పుణ్యఫలమోగాని ఆ విధంగా తమ సంరక్షణలో నా జీవితం హాయిగా గడపడానికి అవకాశమిచ్చారు బాబా. ఆరోజు నుండి ఆయన నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నేను మీ అందరితో ముందు ముందు పంచుకుంటాను. ఇప్పుడు మాత్రం కొద్దిరోజుల క్రితం జరిగిన ఒక అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను.


మాకు ఒక బాబు, ఒక పాప. వాళ్ళిద్దరూ తమ భవిష్యత్తుకు సంబంధించి మంచి బాటను వేసుకొనే క్రమంలో అవసరమైన చదువులు చదువుతున్నారు. వాళ్ళిద్దరికీ సంబంధించి నేను సాయిబాబాను రెండు కోరికలు కోరుకున్నాను. అవి రెండూ చాలా పెద్ద కోరికలే. వాటిని పొందే అర్హత, అదృష్టం నా పిల్లలకి ఉందో, లేదో నాకు తెలియదుకానీ, బాబాకు అసాధ్యమైనది ఏదీ లేదని నాకు బాగా తెలుసు. అందుకే నా రెండు కోరికలను బాబా పాదాల వద్ద ఉంచి, "అవి తీరడానికి నేనేం చేయాలో నాకు ఆదేశాలు ఇవ్వండి స్వామి" అని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. ఆయన నా ప్రార్ధన స్వీకరించారు. ఎప్పటిలాగే అద్భుతాలను చూపిస్తూ ఒక్కొక్కటిగా నేను చేయాల్సిన కర్తవ్యాన్ని నాకు బోధిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా 2023, నవంబర్ నెల రెండో వారంలో నేను మా ఇంట్లో శుభ్రం చేసే పని పెట్టుకున్నాను. ఆ సమయంలో నేను మా బాబు పర్సు తీసి ఎక్కడో పెట్టి మరిచిపోయాను. దీపావళి సెలవులు ముగిసిన తర్వాత మా బాబు వేరే ఊర్లో ఉన్న కాలేజీకి వెళ్లేందుకు బయలుదేరేముందు చూసుకుంటే పర్సు కనపడలేదు. దానిలో బాబు కాలేజీ ఐడి కార్డు, ఏటీఎం కార్డు, పాన్ కార్డు మొదలైన అన్ని ఉన్నాయి. ఎంత వెతికినా పర్సు దొరకలేదు. అప్పుడు నాకు బాబా నేను చేయాల్సిన పూజ కార్యక్రమాల గురించి తెలియజేస్తున్నారనిపించింది. వెంటనే, "ఆలస్యం చేయకుండా నేను తొమ్మిది వారాలు దత్త ప్రదక్షిణాలు చేస్తాను" అని బాబాను ప్రార్థించాను. వెంటనే పర్సు దొరికింది. స్వామికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ దత్త ప్రదక్షిణాలు మొదలుపెట్టాను. ఇలాగే బాబా తమ భక్తులకు ఎల్లవేళలా తోడుగా ఉండి మార్గనిర్దేశం చేయాలని, వారి న్యాయమైన కోరికలను తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

బాబా దయవల్ల తొలగిపోయిన అపార్థం


సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. ఒక అపార్థం వల్ల చాలా రోజులు నేను, నా భర్త ఎక్కువగా మాట్లాడుకోలేదు. ఆ విషయం గురించి నేను 2023, నవంబర్ 19, ఆదివారం బాబాని, "మేమిద్దరం మంచిగా మాట్లాడుకొని ఒకరినొకరం అర్థం చేసుకునేలా చూడండి బాబా" అని వేడుకున్నాను. బాబా దయవల్ల అదేరోజు రాత్రి నా భర్త నా దగ్గరకి వచ్చి, "ఏంటి సమస్య, చెప్పు" అని అన్నారు. అప్పుడు నేను నాకు అనిపించిందంతా చెప్పాను. ఆయన నేను చెప్పింది అర్థం చేసుకొని, "నాదే తప్పు. క్షమించు" అని మంచిగా మాట్లాడారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అప్పటికి చాలారోజుల ముందు నుంచి క్వశ్చన్&ఆన్సర్ సైట్‌లో నేను ఏదైనా సమస్య గురించి బాబాని అడిగితే, "నీ సమస్య ఆదివారం పరిష్కారం అవుతుంది" అని వచ్చేది. అప్పుడు నాకు అది అర్థం అయ్యేది కాదుగానీ, ఇప్పుడు నాకు, నా భర్తకి మధ్య అపార్థం తొలగిపోయాక బాబా ఈ సమస్య గురించే ఆ సైట్ ద్వారా చెప్తూ వచ్చారని నాకు అర్థమైంది. "థాంక్యూ బాబా. ఏమైనా తప్పులు వుంటే క్షమించండి. ఎప్పుడూ అందరికీ ఇలాగే తోడుగా ఉండండి".


సాయిభక్తుల అనుభవమాలిక 1716వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఊదీతో పంటినొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యల నుండి ఉపశమనం
2. బాబాకు తన బిడ్డలపై ఉండే మాతృప్రేమ
3. సురక్షితంగా గమ్యం చేర్చిన బాబా

ఊదీతో పంటినొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యల నుండి ఉపశమనం

సాయిబంధువులందరికీ నమస్తే. నా పేరు కృష్ణకుమారి. బాబా నాకు చాలా విషయాల్లో సహాయం చేసారు. 15 రోజుల్లో నా పెళ్లి అనగా పది రోజులపాటు నేను విపరీతమైన పన్ను నొప్పితో బాధపడ్డాను. అది పిప్పి పన్నో లేక ఇన్ఫెక్షనో అర్ధం కాలేదుగానీ నొప్పి మాత్రం నన్ను రాత్రుళ్లు నిద్ర కూడా పోనిచ్చేదికాదు. మరోవైపు గ్యాస్ట్రిక్ సమస్య వల్ల ఏది తిందామన్న వాంతి వచ్చేలా అనిపించేది. కడుపులో మంట కూడా ఉండేది. ఈ సమస్యలతో సరిగా తినడానికి సాధ్యపడక పెళ్లికి ముందు చాలా బాధపడ్డాను. నేను పడ్డ మానసిక వేదన బాబాకే తెలుసు. అటువంటి స్థితిలో నాకు ఈ బ్లాగు గుర్తొచ్చింది. ఇందులో చాలామంది భక్తులు చాలా నొప్పులకి ఊదీ ఉపయోగించాక నొప్పి నుండి ఉపశమనం లభించిందని పంచుకున్నారు. అవి చదివిన నేను, "బాబా! పంటి నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్య రెండూ తగ్గి నా పెళ్ళికి ఇబ్బంది లేకుండా చేయండి" అని బాబాని వేడుకున్నాను. తర్వాత డాక్టర్ దగ్గరకి వెళితే "జ్ఞాన దంతం దగ్గర కొంచం వాచింద"ని ఆంటిబయోటిక్స్ ఇచ్చారు. ఆ మందులు వాడటంతోపాటు ఊదీ నీళ్లలో కలుపుకొని తగి, నొప్పి ఉన్న ప్రాంతంలో కూడా ఊదీ రాసుకుంటూ ఉండేదాన్ని. బాబా దయవల్ల రెండు రోజులకి నొప్పి, ఇన్ఫెక్షన్ చాలావరకు తగ్గాయి. ఆరోజు నేను క్లినిక్‌కి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు బస్సుకోసం ఎదురుచూస్తూ నిల్చున్నప్పుడు 'ఈ సమస్య నుంచి బాబానే ఇంత తేలికగా బయటపడేసార'ని అనిపించి ఆనందంతో నాకు కన్నీళ్లు వచ్చాయి. మరుక్షణం ఎదురుగా ఉన్న ఒక షాపు గోడ మీద ఉన్న బాబా ఫోటో నా కంటపడింది. అక్కడ వేరే ఇంకే ఫొటోలూ లేవు. బస్సు వచ్చేలోపు నేను బాబాని చూసిన ప్రతిసారీ 'బాబా దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు' అనిపించి చాలా ఆనందమేసింది. ఇకపోతే, గ్యాస్ట్రిక్ సమస్య కూడా చాలావరకు తగ్గింది. ఒకవేళ పన్ను తీసేయాల్సి వచ్చుంటే నా పెళ్ళికి సమస్య అయ్యేది. కానీ అలాంటిదేమీ జరగకుండా బాబా నా సమస్యను చాలా సులభంగా తీర్చారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

బాబాకు తన బిడ్డలపై ఉండే మాతృప్రేమ

ఓం నమో సాయినాథాయ. నా పేరు అనురాధ. మేము హైదరాబాదులో ఉంటాము. మా బాబు బీటెక్ చదువుతున్నాడు. మేము తన కాలేజీకి దగ్గర్లో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఆ ఇంటికి మారం. ఆ క్రమంలో నేను బాబా ఊదీ కొంత భద్రపరచాను. కానీ తర్వాత ఇల్లు సర్దుకునేటప్పుడు ఆ ఊదీ కోసం చూస్తే, ఎంత వెతికినా కనిపించలేదు. నేను ఊదీని బాబా ప్రేమకు గుర్తుగా భావిస్తాను. ఎప్పుడైనా ‘ఊదీ నిండుకుంటుంది’ అని నేను మనసులో అనుకుంటే చాలు, కొన్ని దినాల్లో ఎవరో ఒకరి ద్వారా శిరిడీ నుంచి ఊదీ ప్రసాదం నాకు అందిస్తారు బాబా. మా ఇంట్లో అందరం స్నానం చేసిన తర్వాత ఊదీ నుదుటన పెట్టుకొంటాము. మా ఇంట్లో ఏ ఆరోగ్య సమస్య ఉన్నా బాబా ఊదీయే మాకు సంజీవిని. అటువంటి ఊదీ కనిపించకపోయేసరికి నాకు చాలా బాధేసి, "బాబా! నా మీద మీకు ప్రేమ ఉంటే ఊదీ కనిపించాలి" అని బాబాను ప్రార్థించాను. తర్వాత నేను దాచిన ఊదీ కనిపించిలేదుగానీ వేరే ఊదీ ప్యాకెట్ ఒకటి నా బ్యాగులో దొరికింది. నిజానికి అదొకటి ఉన్నదన్న విషయం కూడా నాకు తెలీదు. బాబాకి తన బిడ్డలపై ఎంత ప్రేమో చూసారా! అయితే నేను మనసులో ఊదీ దొరికినందుకు ఆనందపడినా 'ఒక్క ప్యాకెట్టే దొరికింది. నేను ఇంకా రెండు, మూడు ప్యాకెట్లు దాచాను. అవి కూడా దొరికితే బాబా నువ్వు నన్ను మరింత ప్రేమిస్తున్నట్లు' అనుకొంటూ వాటికోసం వెతుకుతూ ఉండేదాన్ని. అప్పుడొకరోజు ఊదీ దొరికినట్లు కల వచ్చింది. నేను, 'రోజూ అనుకోవడం వల్ల కల వచ్చి ఉంటుంది. అంతేగాని అవి ఎంత వెతికినా దొరకవ'ని వదిలేసి ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయాను. అప్పుడు ఒకరోజు పర్సు కనిపించక దానికోసం వెతుకుతుంటే ఒక కవరులో ఊదీ ప్యాకెట్లు కనిపించాయి. నేను అదివరకు ఆ కవరులో కూడా వెతికాను. కానీ అప్పుడు ఆ ఊదీ ప్యాకెట్లు కనిపించలేదు. బాబా నా మీద చూపించిన ప్రేమకు ఉప్పొంగిపోయాను, మనం బాబాని అడిగి మర్చిపోతాం కానీ, బాబా మనం అడిగే ప్రతి చిన్న విషయాన్ని గుర్తు పెట్టుకుంటారు. అది బాబాకు తన బిడ్డలపై ఉండే మాతృప్రేమ. "ధన్యవాదాలు బాబా. నీ మార్గంలో ఎప్పుడూ నడిచే సద్బుద్ధిని ప్రసాదించు తండ్రీ".

సురక్షితంగా గమ్యం చేర్చిన బాబా


సాయిభక్తులకు నమస్కారం. నా పేరు లోకేష్. నేను విజయవాడ నివాసిని. 2023, నవంబర్ 22, సాయంత్రం నేను బెంగళూరు నుంచి విజయవాడ రావడానికి ఒక బస్సుకి రిజర్వేషన్ చేసుకొని బస్సు ఎక్కాను. కొన్ని అనివార్య కారణాల వల్ల బస్సు దారి మధ్యలో ఆగిపోయింది. అప్పుడు నేను సాయిబాబాకి మనసులో దణ్ణం పెట్టుకొని, "బాబా!  వెంటనే మళ్ళీ విజయవాడ వెళ్ళడానికి దారి చూపండి" అని వేడుకున్నాను. ఒక గంట తర్వాత బస్సు రిపేర్ అవ్వడంతో నేనే కాకుండా బస్సులోని అందరూ సురక్షితంగా విజయవాడ చేరుకున్నారు. “ధన్యవాదాలు బాబా.”


సాయినాథ్ మహారాజ్ కీ జై.


సాయిభక్తుల అనుభవమాలిక 1715వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబా మిరాకిల్స్‌కి రాజు

సాయి భక్తులకి నా నమస్కారాలు. నా పేరు పద్మజ. మా పెద్దమ్మవాళ్ళు 2023, సెప్టెంబర్ 20న తిరుమల యాత్రకు వెళ్లాలని అనుకున్నారు. వారం ముందు మా పెద్దమ్మ నన్ను తమతో తిరుమల రమ్మని అడిగింది. అయితే సెప్టెంబర్ 21 నా నెలసరి సమయమవ్వడం వల్ల నేను రాలేనని చెప్పాను. కానీ మా పెద్దమ్మ ప్రతిరోజూ, "కారులో వెళ్దాం. ఒక్క రోజులో దర్శనమైపోతుంది. ఏమీ కాదు. ఒకవేళ నెలసరి సమయమని నువ్వు భయపడుతునట్లేతే టాబ్లెట్ వేసుకో" అని నాతో అంటుండేది. కానీ నాకు టాబ్లెట్లు పడవు. అందుకని నేను ఖచ్చితంగా రానని చెప్పేసాను. దాంతో పెద్దమ్మ ఊరుకుంది. కానీ ప్రయాణానికి ముందురోజు నన్ను మళ్ళీ రమ్మని అడిగింది. అప్పుడు నేను, 'పెద్దావిడ ఇన్నిసార్లు అడుగుతున్నారు. ఒకసారి బాబాని అడిగి, వెళ్ళమంటే వెళదామ'ని బాబా దగ్గర చీటీలు వేశాను. అందులో 'తిరుమలకి వెళ్లి దర్శనం చేసుకో' అని వచ్చింది. ఇక నేను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. సాయంత్రం బట్టలు సర్దుకున్నాను. కానీ మా అమ్మవాళ్లు, "నెలసరి సమయం వెళ్లొద్దు. ఒకవేళ నెలసరి వస్తే దర్శనం చేసుకోకుండా వచ్చేయాలి. కానీ దర్శనం చేసుకోకుండా రాకూడదు" అన్నారు. నేను అమ్మతో, "బాబా వెళ్ళమన్నారు. ఏమీ కాదు" అని చెప్పాను. కానీ నాకు చాలా భయంగానే ఉండింది.

మేము మరుసటిరోజు ఉదయం 5 గంటలకి బయలుదేరుదామనుకున్నాం కానీ, పెద్దమ్మవాళ్ళు ఆలస్యం చేశారు. అప్పుడు నా మనసుకెందుకో ఒకసారి బాబాకి చెప్పుకొని వెళ్దామనిపించి పక్కనే ఉన్న బాబా గుడికి వెళ్ళాను. బాబాని దర్శించుకొని, "బాబా! దర్శనమై తిరిగి వచ్చేవరకు నాకు నెలసరి రాకూడదు. తిరుమల నుంచి రాగానే మొదట మీకు తొమ్మిది ప్రదక్షిణలు చేస్తాన"ని మొక్కుకొని వచ్చాను. తర్వాత మా తిరుమల యాత్ర మొదలైంది. నేను మనసులో నెలసరి వస్తుందేమోనని ఎంతగానో టెన్షన్ పడుతూ చేతిలో చిన్న బాబా ఫోటో పట్టుకొని 'సాయిరాం సాయిరాం' అని అనుకుంటూనే ఉన్నాను. బాబా తమ అనుగ్రహాన్ని చూపుతూనే ఉన్నారు. మేము ముందుగా కాణిపాకం వెళ్ళాము. ఊరిలోకి ప్రవేశిస్తూనే ఎదురుగా కారు మీద బాబా దర్శనమిచ్చారు. మా పెద్దమ్మ, "అదిగో మీ బాబా. నీకన్నా ముందే వచ్చేసారు" అని అంది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. నా చేతిలో ఉన్న బాబా ఫోటో వదలకుండా దర్శనానికి వెళ్ళాను. బాబా దయవల్ల మాకు గణపతి దర్శనం చాలా బాగా జరిగింది. అనంతరం మా కారు తిరుమలకు బయలుదేరింది. నేను, 'సాయిరాం సాయిరాం' అని అనుకుంటూ, "నెలసరి వస్తే, నా వల్ల వీళ్లంతా ఇబ్బందిపడతారు బాబా. నాకు భయంగా ఉన్నా మీరు చెప్పారని ధైర్యం చేసి వచ్చేసాను" అని బాబాతో మాట్లాడుకుంటూ ప్రయాణం సాగించాను. తిరుమల చేరుకున్నాక ఓ చోట కారు పార్కు చేసారు. అక్కడ ఎదురుగా బాబా మళ్ళీ దర్శనమిచ్చారు. ఆయనను చూడగానే నాకు ఆనందంతో కన్నీళ్లు ఆగలేదు. పెద్దమ్మ, "ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగింది. నేను, "నాకోసం మా బాబా మళ్లీ వచ్చేసారు" అని అన్నారు. పెద్దమ్మ, "ఆయన నిన్ను వదిలిపెట్టడు" అని అన్నారు. తర్వాత అందరూ టీ షాప్ దగ్గర టీ తాగుతుండగా నాకు నెలసరి మొదలవుతున్నట్లనిపించి దుఃఖం ఆగలేదు. "బాబా! ఇలా చేశావేంటి? నీ మీద భారమేసి ఇంత దూరం వస్తే ఇలా జరిగిందేంటి? నా వల్ల వీళ్లంతా ఇప్పుడు ఇబ్బందిపడతారు" అని చేతిలో ఉన్న బాబా ఫోటోని చూస్తూ ఉన్నాను. అప్పటికి మాకింకా రూము కేటాయించలేదు. అప్పుడు సరిగ్గా 5 గంటలైంది. "రేపు ఈ సమయం వరకు నాకు నెలసరి రాకుండా చూడు సాయి ప్లీజ్.. ఇంటికి రాగానే మీ దర్శనం చేసుకొని, తొమ్మిది ప్రదక్షణలు చేస్తాను" అని బాబాకి మొక్కుకున్నాను. ఆ వెంటనే మా తమ్ముడు రూము బుక్ అయిందని వచ్చాడు. నేను రూముకి వెళ్ళిన వెంటనే వాష్ రూములోకి వెళ్లి ఏడ్చేసాను. కానీ ఆశ్చర్యమేమిటంటే, నాకు నెలసరి రాలేదు. అప్పటి నా ఆనందాన్ని చెప్పలేను. మనసులోనే బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను.

మేము ఇంటి దగ్గర బయలుదేరేముందు మా పక్క ఇళ్ల వాళ్ళందరూ, "ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దర్శనానికి 2 రోజులు పడుతుంది" అన్నారు. వాళ్ళు చెప్పినట్లే తిరుమల కొండ మీద జనం బాగా ఎక్కువగా ఉన్నారు. రాత్రి 8 గంటలప్పుడు పెద్దమ్మవాళ్ళు "రేపు దర్శనంకి పోదాం" అన్నారు. నేను మాత్రం ఈ రాత్రే వెళ్దామని అందరినీ రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు సరేనని అన్నారు. మేము భయపడుతూనే ఉచిత దర్శనంకి వెళ్ళాము. నేను బాబా ఫోటోతో దర్శనానికి వెళ్లాను. ఫోటో కాదు, ఆ రూపంలో బాబానే నాతో ఉన్నారు. మాకు దర్శనం మరుసటిరోజు ఉదయం 11:30కి అని వచ్చింది. మా చెల్లివాళ్ళ పాప చిన్నది. తను ఇబ్బందిపెడుతుంటే తిరిగి వెళ్ళిపోదామని అన్నారు వాళ్లు. నేను నమ్మకంగా, "ఏమీ కాదు, వెళ్దాం" అన్నాను. నేను చిన్నప్పటినుంచి తిరుమలకు 20 సార్లుకు పైనే వెళ్లాను. ఎప్పుడూ దర్శనానికి సగం రోజు పట్టేది. కంపార్ట్మెంట్‌లో ఉంచేస్తుండేవారు. ఇప్పుడు కూడా అలానే కంపార్ట్మెంట్‌లో పడేస్తారేమోనని అందరూ భయపడ్డారు. నేను బాబాతో, "బాబా! మమ్మల్ని కంపార్ట్మెంట్‌లో పెట్టకుండా దర్శనం త్వరగా జరిగేలా చూడు తండ్రీ. తొమ్మిది ప్రదక్షిణలు చేస్తాన"ని చెప్పుకున్నాను. కానీ బ్రహ్మోత్సవాల కారణంగా బాగా జనం ఉన్నారు. దాదాపు కంపార్టమెంటులన్నీ నిండి ఉన్నాయి. మమ్మల్ని కూడా ఒక కంపార్ట్మెంట్‌లో పెట్టారు. అక్కడ కనీసం కాళ్లు చాపుకొని కూర్చొనే స్థలం కూడా లేదు. పెద్దమ్మ, "పద్మజ, బాబాకి మ్రొక్కుకో" అంటుంటే నేను నెలసరి టెన్షన్‌తో, "సరిగ్గా రేపు నెలసరి వచ్చేస్తుందేమో! అలా అయితే ఎలా బాబా? ప్లీజ్ బాబా.. మమ్మల్ని దర్శనానికి పంపాలి" అని నమ్మకంగా అనుకున్నాను. కానీ అక్కడ పరిస్థితి దృష్ట్యా త్వరగా దర్శనమవ్వడం అసాధ్యం. అలాంటిది అరగంటలో కంపార్ట్మెంట్ తలుపులు తెరిచారు. మరుసటిరోజు ఉదయం 11 గంటలకి దర్శనమని ఇచ్చినప్పటికీ అరగంటలో మమ్మల్ని దర్శనానికి పంపారు. దర్శనానికి వెళ్లే లైన్ అంతా జనం విపరీతంగా ఉన్నారు. మాతో చిన్న పాప ఉండటం వల్ల మాకు భయం భయంగా ఉంది. స్వామి దగ్గరకి చేరుకోవడానికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరం ఉంది. నేను, "బాబా సహాయం చేయండి. చిన్న పాప ఉంది" అని బాబాని అడుగుతూ ఉన్నాను. బాబా మిరాకిల్స్‌కి రాజు. ఆయన మళ్ళీ అద్భుతం చేసారు. సరిగ్గా మేము వెళ్తున్న దారిలో ఉన్న ద్వారం వద్దకి వెళ్ళగానే ఆ దారి మూసేసి వేరే మార్గం గుండా 10 నిమిషాల్లో గుడి లోపలికి పంపించేశారు. లోపల ఒకటే జనం ఉన్నందున భక్తులను ఒక్క క్షణం కూడా నిలబడనివ్వకుండా స్వామివారి సేవకులు లాగేస్తున్నారు. బాబా ఫోటో నా చేతిలోనే ఉంది. నేను నడుస్తూనే, "బాబా! స్వామి దర్శనం బాగా జరిగేలా చూడు. మీకు తొమ్మిది ప్రదక్షిణలు చేస్తాన"ని మళ్లీ బాబాకి మొక్కుకున్నాను. సరిగ్గా నేను స్వామి ముందుకు వెళ్ళగానే అక్కడ సేవ చేస్తున్న ఒకతను ముందు వాళ్ళకి ఏదో ఇస్తూ, మరో చేయి నాకు అడ్డంగా పెట్టాడు. అందువల్ల నేను స్వామికి ఎదురుగా ఒక నిమిషంపాటు అక్కడ నిలిచిపోయాను. పూర్తిగా వజ్రాల అలంకరణతో స్వామి ధగధగా మెరిసిపోతున్నారు. నా చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లో తిరుమల వెళ్ళాను కానీ, అంత స్పష్టంగా స్వామిని ఎప్పుడూ చూడలేదు. మామూలుగా అయితే లైన్లో ఎంతో సమయాన్ని వెచ్చించి నడుచుకుంటూ వచ్చే భక్తులను సరిగ్గా స్వామి దగ్గరకి రాగానే లాగేస్తారు. అలాంటిది నేను మొదటిసారి ఒక్క నిమిషంపాటు స్వామి ఎదురుగా నిలబడి స్వామిని తృప్తిగా దర్శించుకున్నాను. ఇప్పుడు ఈ అనుభవం వ్రాస్తుంటే కూడా నా కళ్ళముందు ఆనాటి ఆ దర్శనం మెదులుతుంది. అప్పుడు సాయే నాకు తోడుగా వచ్చారని నా నమ్మకం. ఆయన దయవల్ల రెండురోజులు పడుతుందన్న ఉచిత దర్శనం కేవలం రెండు గంటలలో అయిపోయి బయటకు వచ్చాము. ఇదంతా మన సాయి చేసిన అద్భుతం.

దర్శనానంతరం మేము రూముకి వచ్చాక మరుసటిరోజు పొద్దున్న అలివేలు మంగాపురం వెళ్లాలని అనుకున్నాము. కానీ నాకు నెలసరి టెన్షన్. అందువల్ల ఆ రాత్రి ఊదీ నా పొట్టకు రాసుకొని, బాబా ఫోటో పొట్ట దగ్గర పెట్టుకొని, 'సాయిరాం సాయిరాం' అనుకుంటూ పడుకున్నాను. తెల్లారక మంగాపురం వెళ్ళాము. అక్కడ దర్శనానికి విపరీతమైన జనం ఉన్నారు. ఆ జనంలో పాప ఏడుస్తుంటే పెద్దమ్మవాళ్ళు, "మరోసారి వద్దాం. ఈసారికి వెళ్ళిపోదాం" అని అనసాగారు. మరోపక్క చాలాసేపటివరకు దర్శనానికి వదలట్లేదు. కాసేపటికి పెద్దమ్మ, "బాబాని అడుగు" అన్నారు. బాబా ఫోటో నా చేతిలోనే ఉంది. "సాయీ! అమ్మవారి దర్శనం ఇప్పించండి. 9 ప్రదక్షిణలు చేస్తాను" అని మళ్ళీ బాబాతో చెప్పుకున్నాను. వెంటనే క్యూలైన్ కదిలింది. పెద్దమ్మ, "చెప్పాను కదా! బాబా నీతోనే ఉన్నార"ని అంది. అమ్మవారి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమయ్యాము. దారిలో శ్రీకాళహస్తి కూడా దర్శించి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాము. ఇంటికి రాగానే స్నానం చేసి బాబా గుడికి వెళ్లి ప్రదక్షిణాలు చేసి ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. తర్వాత ఇంటికొచ్చి పూజ చేసి తిరుమల లడ్డు అందరికీ పంచిపెట్టాను. తర్వాత నాకు నెలసరి వచ్చింది. ముందురోజు సాయంత్రం అదే సమయంలో తిరుమల కొండ మీద, "రేపు ఈ సమయం వరకు నాకు నెలసరి రాకుండా చూడు బాబా" అని బాబాను వేడుకున్నాను. సరిగ్గా అదే సమయానికి నెలసరి వచ్చేలా చేసారు బాబా.

2023, అక్టోబర్ 24న దసరా అనగా ముందురోజు నాకు 102 డిగ్రీల జ్వరం ఉంది. అప్పుడు నేను, 'రేపు దసరా, బాబా మహాసమాధి చెందిన రోజు. నేను గుడిలోని బాబా దగ్గరకి వెళ్ళాలి. ఈ సమయంలో నాకీ జ్వరం ఏంటి?' అని అనుకొని, "బాబా! నాకు జ్వరం తగ్గిపోవాలి. నేను రేపు మీ గుడికి రావాలి" అని వేడుకున్నాను. ఆ రాత్రి కూడా నాకు 102 డిగ్రీల జ్వరం ఉంది. పక్క రోజు ఉదయానికి కూడా జ్వరం అలానే ఉంది. కానీ సరిగ్గా 10 గంటలయ్యేసరికి జ్వరం కొంచం తగ్గింది. 'ఇంకా నా వల్ల కాదు బాబా. ఏమైనా అవనివ్వండి. నేను నీ గుడికి రావాలి, మీ దర్శనం చేసుకోవాల'ని వెళ్లి తలస్నానం చేశాను. తర్వాత మా తమ్ముడిని తోడుగా తీసుకొని వెళ్దామని మా పిన్నివాళ్ళింటికి వెళ్లాను. పిన్ని, "దసరా కదా! అమ్మవారి గుడికి వెళ్దాం" అంది. ఆ గుడికి వెళ్లడానికి అరగంట సమయం పడుతుంది. అందుచేత, "నాకు జ్వరం పిన్ని. నేను రాలేను" అని చెప్పాను. పిన్ని, "ఏమీ కాదు. మేమంతా ఆటోలో వెళ్తాము. నువ్వు, తమ్ముడు స్కూటీ మీద రండి" అని చెప్పింది. దసరా అయినందున నాకూ అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఉంది. అందువల్ల పిన్నితో సరే వస్తానని చెప్పి మొదట నేను, తమ్ముడు స్కూటీ మీద బాబా దగ్గరకి వెళ్ళాము. అప్పుడు నాకు తిరుమల యాత్ర గుర్తొచ్చి, 'బాబాకి చెప్పుకొని వెళ్తే, ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తార'ని అనిపించింది. వెంటనే మా తమ్ముడు ముందే, "బాబా! ఈరోజు మహాసమాధి రోజని జ్వరమైన తలస్నానం చేసి మీ దగ్గరకి వచ్చేసాను. ఇప్పుడైతే నాకేం జ్వరం లేదుగాని పిన్నివాళ్ళు అమ్మవారి గుడికి పిలుస్తున్నారు. ఆ గుడి కొంచెం దూరం కదా! ఏ ఇబ్బంది రాకుండా చూడండి. రేపు మీకు తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తాను" అని మొక్కుకున్నాను. తర్వాత నేను, తమ్ముడు స్కూటీ మీద అమ్మవారి గుడికి బయలుదేరాము. పిన్నివాళ్ళు ఆటోలో మాకంటే ముందే అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఉచిత దర్శనం లేదు. దర్శనానికి 20 మరియు 50 రూపాయల టికెట్లు ఉన్నాయి. పిన్నివాళ్ళు 20 రూపాయలు టికెట్ తీసుకొని క్యూలో నిల్చొని ఉన్నారు. పిన్ని మాతో, "మీరు కూడా వెళ్లి టికెట్ తెచ్చుకోండి" అని చెప్పింది. నేను, తమ్ముడు వెళ్లి టికెట్ కోసం లైన్లో నిలుచున్నాము. కానీ చాలా పెద్ద లైన్ ఉంది. నేను నాతోపాటు తీసుకొని వెళ్లిన బాబా ఫోటోని చూస్తూ, "నేను నిల్చోలేను బాబా. నాకు సహాయం చేయండి" అని అనుకున్నాను. వెంటనే ఎవరో ఒకతను వచ్చి, "నేను 50 రూపాయలు దర్శనం టికెట్లు రెండు తీసుకున్నాను. కానీ నేను దర్శనానికి వెళ్లలేను. మీరు వెళ్ళండి" అని నాకిచ్చి, నేను డబ్బులిస్తున్నా వద్దని వెళ్ళిపోయాడు. అంతమంది జనముంటే, అతను నాకే ఆ టికెట్లు ఎందుకు ఇచ్చారో, 20 రూపాయల టికెట్ కోసం చాలా జనం ఉన్నారు. 50 రూపాయల టికెట్ల లైన్ ఖాళీగా ఉంది. అయినా అతను దర్శనానికి ఎందుకు వెళ్లలేదో నాకైతే తెలియదుగాని సరిగ్గా రెండు టిక్కెట్లే నాకు ఇచ్చాడతను. మా పిన్ని, "సరే, మీరిద్దరూ వెళ్లి దర్శనం చేసుకోండి" అని చెప్పింది. ఆ లైన్లో కేవలం పదిమందిమే వెళ్లాం. అమ్మవారిని దగ్గరగా దర్శించుకొని 15 నిముషాల్లో బయటకు వచ్చాము. పిన్నివాళ్ళు దాదాపు అరగంటసేపు లైన్లో నిల్చున్నారు. నేను, మా తమ్ముడితో, "నేను గుడిలో బాబాకి దణ్ణం పెట్టుకొని వచ్చాను. ఇక్కడ చూడు, ఎవరో తెలియని వ్యక్తి లైన్లో అంతమంది ఉంటే మనకే టికెట్ ఇచ్చాడు" అని అన్నాను. "నిజంగా అద్భుతంలా ఉంది అక్క" అని అన్నాడు మా తమ్ముడు. అలా బాబానే నాకు సహాయం చేసారు. ఆయన నిజంగా పిలిస్తే పలికే దైవం. ఆయన చేసే  అద్భుతాలు చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. ఒకటి మాత్రం బాగా అర్థమైంది, మనం ఏ పనైనా మొదలుపెట్టాలని అనుకున్నప్పుడు ముందుగా బాబాకి చెప్పి మొదలుపెడితే ఆయన దగ్గరుండి అద్భుతాలు చేస్తారు. ఆయన ఋణం ఎన్ని జన్మలెత్తినా నేను తీర్చుకోలేను. "చాలా చాలా ధన్యవాదాలు".

సాయిభక్తుల అనుభవమాలిక 1714వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబా చేయి పట్టుకుంటే చాలు - అంతా సెట్ అయిపోతుంది

నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఈమధ్యనే ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదవడం ప్రారంభించాను. నిజంగా ఇది అద్భుతమైన బ్లాగు. భక్తుల అనుభవాలను తెలుగులో ప్రచురించడం చాలా బాగుంది. నాకు 2015లో పెళ్లైంది. పెళ్లికి ముందు నా భర్త మా ఊరిలోని బాబా గుడికి వచ్చి నాతో మాట్లాడారు. అలా బాబా గుడిలో మేము ఒకరి గురించి ఒకరం తెలుసుకుని పెళ్ళికి ఒప్పుకున్నాము. అతను నేను అప్పటికే ఇండియాలో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా ఇవ్వమని చెప్పారు. అయితే నేను రాజీనామా చేయడం మా అమ్మకి ఇష్టం లేదు. కానీ నా భర్త నన్ను రాజీనామా చేయమని బలవంతం చేసారు. నేను రాజీనామా ఇచ్చి మా అమ్మని బాధపెట్టలేక చాలా కష్టపడ్డాను. ఎలాగోలా పెళ్ళైయ్యేవరకు ఉద్యోగం చేసి, పెళ్లైయ్యాక నా భర్త మాట వినాలి కాబట్టి చివరికి రాజీనామా ఇచ్చి నా భర్తతో కలిసి యుఎస్ఏకి వచ్చాను. నేను సంతోషంగా ఉంటే మా అమ్మ కూడా సంతోషంగా ఉంటుందని అనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు నేను కోరుకున్నట్లు అంతా జరగలేదు. నాకు మద్యపానం తాగేవాళ్లంటే ఇష్టముండదు. అలాంటిది పెళ్లైయ్యాక నా భార్య మద్యపానం సేవిస్తారని తెలిసింది. అతను వారాంతాల్లో బాగా ఎక్కువగా తాగేవారు. నేను చాలా బాధపడుతూ కొన్నిసార్లు బాబా ముందు ఏడ్చేదాన్ని. ఒక్కోసారి తట్టుకోలేక బాబాని నిందించేదాన్ని. "నన్ను క్షమించండి బాబా. ఆ సమయంలో మీ విలువ నాకు తెలియదు".

పెళ్ళైన 3 నెలలకి నేను గర్భవతినయ్యాను. నిజానికి అంత తొందరగా గర్భం దాల్చడం నా భర్తకి ఇష్టం లేదు. కానీ మా తల్లిదండ్రుల, మరికొంతమంది ఒత్తిడి వల్ల నేను నా భర్తను ఒప్పుకోమని బలవంతపెట్టాను. ఆతను గర్భవతిగా ఉన్నప్పుడు నన్ను సరిగా చూసుకునేవాడు కాదు. నేను ఒంటరిగా ఏడ్చేదాన్ని. మా ఇంటి పక్కనుండే బాబా భక్తులొకరు నన్ను నొప్పులు మొదలయ్యే ముందు బాబా గుడికి వెళ్ళమని సలహా ఇచ్చారు. నేను ఆ సలహాను పాటించాలని అనుకున్నాను. అందువల్ల కాన్పు సమయం సమీపించి నాకు నొప్పులు మొదలైనప్పుడు ముందు బాబా గుడికి వెళదామని బయలుదేరాము. కానీ నిమిషాల్లో వాతావరణం మారిపోయి భారీ వర్షం కురువసాగింది. ఆ వర్షంలో బాబా గుడికి వెళ్లలేకపోయాము. అంతలో ప్రసవ నొప్పులు కూడా అధికమవుతున్నట్లు అనిపించడం వల్ల హాస్పిటల్ వైపుగా మళ్ళాము. హాస్పటల్‌కి చేరుకున్నాక నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. హఠాత్తుగా నా కడుపులోని బిడ్డ హార్ట్ బీట్ చాలా తగ్గడంతో నన్ను వెంటనే అత్యవసర వార్డుకి తీసుకెళ్లి నాకు అనస్థీషియా ఇచ్చారు. దురదృష్టవశాత్తు నా బిడ్డ చనిపోయింది. ఇది నాకు పెద్ద షాక్. చివరి క్షణాలో బాబా నన్ను తమ దర్శనానికి అనుమతించలేదని బాధపడ్డాను. అప్పటి నా బాధను వివరించడానికి మాటలు లేవు. వైవాహిక జీవితం బాగా లేదు, బిడ్డను కోల్పోయాను, వృత్తి జీవితాన్ని వదులుకున్నాను. ఇక నా జీవితం ఎలా ఉండబోతుందో తెలియదు. జీవితంపై అన్ని ఆశలు కోల్పోయాను. అట్టి స్థితిలో నా భర్త నన్ను ఇండియాకి వెళ్లిపొమ్మని చెప్పాడు. తన నిర్ణయం నాకు అస్సలు నచ్చలేదు. నేను అక్కడికి వెళ్లి బంధువులను ఎదుర్కోలేనని చాలాసార్లు చెప్పి చూసాను. కానీ అతను వినలేదు. నాకు వేరే దారి లేక నా బిడ్డకు బదులు ఆ దేవుడు నన్ను ఎందుకు తీసుకుపోలేదని బాధపడ్డాను. చివరికి తప్పనిసరై ఇండియాకి ప్రయాణమయ్యే ముందు నేను బాబా గుడికి వెళ్లి, "బాబా! నా జీవితంలో ఏమి జరుగుతుందో నాకు తెలియదు. నేను మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ దర్శిస్తానో, లేదో నాకు తెలీదు. నా భర్త విడాకులు ఇవ్వబోతున్నారేమో కూడా తెలీదు. సమస్తం మీ పాదాల దగ్గర పెడుతున్నాను. నాకు ఏ కోరికా లేదు, ఆశా లేదు" అని ప్రార్థించి ఇండియాకి వెళ్ళిపోయాను. అలా 2016 - 2017 మధ్యకాలంలో నా జీవితం పూర్తిగా తిరోగమన దిశలో సాగింది. నేను ఆ సమయంలో ఎన్నో కష్టాలు చవిచూశాను.

ఇండియా వచ్చాక నేను బాబా చేయి దృఢంగా పట్టుకున్నాను. ఒక్క నెలలో ప్రతిదీ సెట్ అయింది. బాబా నెమ్మదిగా నా జీవితాన్ని మార్చారు. మెల్లగా నా భర్తను మార్చి నా వైవాహిక జీవితాన్ని కాపాడారు. నాకు ఒక ఉద్యోగం ప్రసాదించారు. బాబా ఆశీర్వాదంతో నేను మళ్ళీ గర్భవతినయ్యాను. ఆ సమయంలో బాబా నాకు చాలా బలాన్ని ఇచ్చారు. ఆయన కన్న తల్లిదండ్రుల్లా నన్ను చూసుకున్నారు. చివరకు బాబా దయతో 2018లో నేను ఒక మగబిడ్డకు జన్మనిచ్చాను. నేను ఎల్లప్పుడూ సాయి నామాన్ని జపించాలనుకుంటున్నందువల నా కొడుకుకి సాయితో మొదలయ్యేలా పేరు పెట్టుకున్నాను. ఇప్పుడు నా జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ సంతోషం వచ్చినా లేదా ఇంకేదైనా వచ్చినా మొదట నా మదిలో మెదిలేది బాబానే. ఆయన నాకు సర్వస్వం, ఆయనే నా తల్లి, తండ్రి, గురువు, ఇంకా ఏ బంధమైనా. ఆయన ఒక కుటుంబసభ్యునిలా నాతో ఉంటున్నారు. ఆయన ఇచ్చిన "నేను ఇక్కడ ఉండగా మీకు భయమెందుకు?" అన్న హామీ నన్ను చాలాసార్లు రక్షించింది. ఈ కలియుగంలో ఎవరు మనల్ని అంతలా చూసుకుంటారు? మన ప్రియమైన, దయమయుడైన గురువు సాయిబాబా కంటే వేరెవరు అంతటి భరోసా ఇస్తారు? నేను ఎప్పుడూ ఆయన నామాన్నే జపిస్తూ ఉంటాను (భక్తులకు నా వినయపూర్వకమైన విన్నపం: ఆయన నామం ప్రతి సమస్యకు పరిష్కారం. నన్ను నమ్మండి). నా రోజువారీ జీవితంలో నేను బాబా అద్భుతాలను చాలా అనుభూతి చెందుతున్నాను. శ్రీసాయి సచ్చరిత్రలో తాబేలు కథలా బాబా నన్ను ఎప్పుడూ చూస్తూనే ఉన్నారు. నేను చాలా చాలా అదృష్టవంతురాలినని భావిస్తున్నాను. "చాలా ధన్యవాదాలు బాబా. మీరు చేసినదంతా గమనిస్తే నిజంగా నా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి బాబా. మీరు ఎంతో మృదువుగా నా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. మీకు కోటి కోటి ప్రణామాలు బాబా".

చివరిగా మరో చిన్న అనుభవం చెప్పి ముగిస్తాను. ఇటీవల బాబా నాకు ఒక ఉద్యోగాన్ని ప్రసాదించారు. భగవంతుని కృపవల్ల అంతా సాఫీగా సాగుంతుండగా ఒకరోజు నా టీమ్ లీడ్ పరిష్కరించమని నాకు ఒక టాస్క్(సమస్య) అప్పగించారు. వెంటనే నేను అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని ఉపయోగించి ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అది 'ప్రాధాన్యత 1' గల టాస్క్  అయినందున బిజినెస్ అంతా అప్‌డేట్ కోసం ఎదురుచూస్తుంది. నేను తొందరగా ఆ సమస్యను పరిష్కరించలేకపోతే వాళ్ళు ఉన్నతాధికారులను సంప్రదిస్తారని నేను చాలా భయపడ్డాను. "దయచేసి ఈ సమస్యను పరిష్కరించేందుకు నాకు సహాయం చేయండి" అని బాబాను ప్రార్థించాను. తరువాత ఒకపక్క బాబా జాగ్రత్త వహిస్తారని అనుకుంటూనే మరోపక్క ఒక మామూలు మనిషిగా ఎక్కడో ఓ చోట చాలా బాధపడసాగాను. నేను నాకు ఆ ఉద్యోగం వచ్చినప్పుడు ఒక వారంలో సచ్చరిత్ర పారాయణ చేస్తానని బాబాకి మాటిచ్చాను. కాని నాకు పారాయణ చేసే అవకాశం రాక వాయిదా వేస్తూ పోయాను. బహుశా ఆ కారణంగానే నేను ఉద్యోగంలో సమస్యలను ఎదుర్కొంటున్నననిపించి బాబాకు క్షమాపణలు చెప్పుకొని, "దయచేసి గురువారంలోపు ఈ సమస్యకు పరిష్కారం చూపండి. నేను వచ్చే గురువారం నుండి పారాయణ ప్రారంభిస్తాను" అని బాబాను ప్రార్థించాను. బాబా నా ప్రార్థన విన్నారు. మంగళవారం రాత్రి సమస్యకు పరిష్కారం దొరికింది. "చాలా కృతజ్ఞతలు బాబా. నేను ఏదైనా తప్పు చేసి ఉంటూ నన్ను క్షమించండి. మీరు ఎల్లప్పుడూ నాతో ఉండండి. దయచేసి నా సోదరుడిని మరియు అతని కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళ విషయంలో ఏమి జరుగుతుందో మీకు తెలుసు. దయచేసి తనని మీ భక్తునిగా పరిగణించండి. ఒకసారి మీరు తనని మీ భక్తునిగా పరిగణించినట్లైతే నేను అతనికోసం ఇక ప్రార్థించను. ఎందుకంటే, మీరు మీ భక్తులకు సంబంధించి ప్రతిదీ చూసుకుంటారని నాకు తెలుసు. దయచేసి నా తల్లిదండ్రులతో ఉండండి బాబా. దయచేసి నేను ఎల్లప్పుడూ మీ నామజపం చేసేలా, ప్రశాంతంగా మీ పారాయణ చేసేలా నన్ను ఆశీర్వదించండి బాబా".

సాయి స్మరణం - సంకట హరణం|

బాబా శరణం - భవభయహరణం||


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.



సాయిభక్తుల అనుభవమాలిక 1713వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • ఇలా ఉంటుంది సాయి దయ

నా పేరు కిరణ్మయి. నేను ఎంతో బాధలో వున్నప్పుడు ఈ బ్లాగు నాకు కనిపించింది. అప్పటినుంచి ప్రతిరోజూ నేను సాయి భక్తుల అనుభవాలు చదువుతున్నాను. అవి నాకు ఎంతో ధైర్యాన్నిచ్చాయి. నేను ఇప్పుడు సాయినాథుడు నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు మీతో పంచుకుంటాను. ఒకరోజు రాత్రి పడుకునేముందు సంవత్సరం వయసున్న మా పాపకి బాగా జలుబు చేసింది. తనకి జలుబు చేసిందంటే నాకు చాలా భయం. ఎందుకంటే, తను పళ్ళు, పెరుగన్నం మాత్రమే ఇష్టంగా తింటుంది. అలాంటి తనకి జలుబు చేసిందంటే తినడానికి ఇంకేమీ ఉండవు. అందుకని నేను ఆ రాత్రి నిద్రపోయేముందు పాప ముక్కుకి ఊదీ, విక్స్ రాసి, ఆ సాయినాథుని దణ్ణం పెట్టుకొని, "స్వామీ! రేపు ఉదయం నిద్రలేచేసరికి నా బిడ్డకి జలుబు తగ్గిపోవాలి. అదే జరిగితే మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని దృఢంగా వేడుకున్నాను. ఆ సాయినాథుడు దయతో ఉదయం లేచేసరికి నా బిడ్డ జలుబు తగ్గించారు. "ధన్యవాదాలు బాబా. మీ అనుగ్రహం పంచుకోవటం ఆలస్యమైన కారణంగా ఏమో నా బిడ్డకి మళ్ళీ మళ్లీ జలుబు చేస్తుంది. నన్ను క్షమించి నా బిడ్డను చల్లగా చూడు తండ్రీ".


ఒక ఆదివారం నేను, నా భర్త, నా బిడ్డ గుడికి వెళ్ళి, దర్శనమయ్యాక తిరిగి వచ్చేటప్పుడు బస్సు ఎక్కాక చూసుకుంటే నా భర్త ఫోన్ కనిపించలేదు. దాంతో టెన్షన్ పడుతూ ఇద్దరం బస్సులో వేతికాం కానీ, ఫోన్ కనిపించలేదు. నా భర్త, "వచ్చిన దారిలో కిందపడిపోయిందేమో! చూస్తాను" అని తరువాత స్టాపులో బస్సు దిగి వెనక్కి వెళ్లారు. మేము ఇంటికి వెళ్ళాము. మేము ఇల్లు చేరుకున్న గంట తర్వాత నా భర్త ఇంటికి వచ్చి ఫోన్ దొరకలేదని అన్నారు. అది ఐఫోన్ అయినప్పటికీ చాలా సంవత్సరాలుగా వాడుతున్నందువల్ల పాతది అయిపోయి సరిగ్గా పని చేయట్లేదు. అందువల్ల మావారు కొత్త ఫోన్ కొనుకున్నే ప్రయత్నాల్లో పడ్డారు. కానీ మా పాప పుట్టినప్పటినుంచి తనకు తీసిన ఫొటోలన్నీ ఆ ఫోన్‌లోనే ఉన్నందున మావారు చాలా బాధపడుతుండేవారు. విషయం తెలిసి నేను కూడా చాలా బాధపడ్డాను. ఆ రోజు రాత్రి నేను పడుకునేముందు బాధతో, "సాయినాథా! నా భర్త ఫోన్ దొరికేలా చేయండి స్వామి. అది దొరికితే మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. నిజంగా బాబా దయ చూపారు. మరుసటిరోజు మధ్యాహ్నం నేను, మా పాప పడుకొని లేచేసరికి ఫోన్ దొరికిందని మావారు చెప్పారు. విషయమేమిటంటే, నా భర్త ఫోన్ ఎవరో ఒక బస్సు డ్రైవర్‌‌కి దొరికితే, అతను తను పనిచేస్తున్న సంస్థవాళ్ళకి ఇచ్చాడు.  మేము నెదర్లాండ్స్‌లో వుంటాము. ఈ దేశం రూల్స్ ప్రకారం ఎవరైనా పోగొట్టుకున్న వస్తువులను ఒక వెబ్సైటులో పెడతారు. ఆ వెబ్సైటులో చూసి మావారు తన ఫోన్ తెచ్చుకున్నారు. ఆయన ఇలా అప్పుడప్పుడు జరుగుతుంటాయని చెప్పినప్పటికీ మా విషయంలో జరగడం నిజంగా ఆ సాయితండ్రి దయ.


నా భర్త ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయనకి 13 సంవత్సరాల అనుభవంలో ఎన్నడూ జరగని ఒక పెద్ద విషయం ఒకసారి జరిగింది. ఆయన కొత్తగా చేరిన కంపెనీలోని ఒక సహోద్యోగి, మావారి ప్రవర్తన సరిగా లేదని పిర్యాదు చేయడంతో మావారిని తను చేస్తున్న ప్రాజెక్ట్ నుంచి తొలగించాలని ఆ ప్రాజెక్ట్ మేనేజర్ నిర్ణయించుకున్నారు. దాంతో మావారికి వేరే ప్రాజెక్ట్ చూపించే బాధ్యత ఆ కంపెనీ మీద ఉన్నప్పటికీ వేరే ప్రాజెక్ట్‌లు లేవని మావారిని ఉద్యోగం నుంచి తొలగించాలని అనుకున్నారు. అయితే ఈ దేశం నియమ నిబంధనల ప్రకారం అలా ఎవరినీ ఉద్యోగంలో నుంచి తొలగించే హక్కు కంపెనీకి లేదు. అయినా తొలగించినట్లైతే చాలా పెద్ద మొత్తంలో ఆ కంపెనీవాళ్ళు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఈ విషయం లాయర్ ద్వారా ఆ కంపెనీవాళ్ళతో మాట్లాడమని ఫ్రెండ్స్ సలహా ఇవ్వడంతో మావారు లాయరుతో మాట్లాడించే ప్రయత్నం చేసారు. నేను, 'మావారిని ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు. బయట మార్కెట్ సరిగ్గా లేదు. అదీకాక చిన్న దేశం. కంపెనీలు తక్కువ, అవకాశాలు కూడా తక్కువ. మావారికి ఉద్యోగం దొరుకుతుందా? లేదా?' అని చాలా టెన్షన్ పడ్డాను. నేను భయపడినట్లే, మావారు కొన్ని ఇంటర్వ్యులకి హాజరైనప్పటికీ ఏదో ఒక కారణం చేత ఆఫర్ లెటర్ మావారి చేతి దాకా వచ్చేది కాదు. ఈ స్థితిలో నేను సాయినాథునికి మనసారా దణ్ణం పెట్టుకొని, "స్వామీ! మీ దయవల్ల నా భర్తకి మంచి ఉద్యోగం రావాలి. అలాగే లాయర్ ద్వారా ఆ కంపెనీ నుంచి మంచి మొత్తంలో డబ్బులు మాకు అందేలా చూడండి. అలా జరిగితే మీకు 50 యూరోల దక్షిణ సమర్పించుకొని, మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. బాబా దయవల్ల నా భర్త చాలా కంపెనీలలో ప్రయత్నించగా అన్నిటికంటే చాలా మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అలాగే లాయర్ ద్వారా పాత కంపెనీవాళ్ళు మంచి మొత్తంలో డబ్బులు మాకిచ్చారు. అలా ఉంటుంది సాయి దయ. "ధన్యవాదాలు బాబా. మీ సహాయం జన్మలో మరవలేను తండ్రీ. దయతో నా బిడ్డని చల్లగా చూడు తండ్రీ".


సర్వం శ్రీసాయినాథార్పణమస్తు.


సాయిభక్తుల అనుభవమాలిక 1712వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు
:

1. బాబా చూపిన కరుణ
2. సందేశం ద్వారా చెప్పినట్లే నయం చేసిన బాబా

బాబా చూపిన కరుణ


సాయిబందువులందరికీ నమస్కారం. నా పేరు ఉమ. మాది కర్నూలు. మా అన్నయ్యకి పెళ్ళైన తర్వాత చాలా గొడవలు, అపార్థాలు చోటు చేసుకున్నాయి. దాంతో మా వదిన మా ఇంటికి రానని వెళ్ళిపోయింది. మా ఇంట్లో అందరమూ చాలా బాధపడ్డాము. నేను రోజూ ఏడుస్తూ బాబా గుడికి వెళ్లి అర్చన చేయిస్తుండేదాన్ని. సంవత్సరం తర్వాత అన్నయ్యకి కొడుకు పుట్టాడు. అప్పటివరకు మా ఇంటికి అస్సలు రానన్న మా వదిన డెలివరీ అయిన 3 నెలలకి మా ఇంటికి వచ్చింది. నిజంగా ఇది బాబా చేసిన అద్భుతం.


ఒకసారి నేను నాకు ఉద్యోగం రావాలని 'నవగురువార' వ్రతం చేసాను. పూజ నేను చేస్తే, ఐదో వారం లోపు మా అన్నకి ఆర్మీ ఉద్యోగం వచ్చింది. కారణం మా అన్న కూడా ఉద్యోగం లేదని బాధపడుతుండేవాడు. తనకైనా ఉద్యోగం వచ్చినందుకు మేము చాలా సంతోషించాము.


తరువాత నేను ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నప్పుడు మార్కులు ఎంటర్ చేసే చోట ఎన్నిసార్లు ఎంటర్ చేసినా ఏదో ఎర్రర్ చూపిస్తుండేది. ఆ సమస్య గురించి నేను నా స్నేహితులను అడిగితే, వాళ్ళు పరిష్కారం చెప్పారు. కానీ నాకు అది అర్థం కాలేదు. అందువల్ల నేను బాబాను, "సహాయం చేయమ"ని అడిగి మళ్ళీ మార్కులు ఎంటర్ చేశాను. బాబా దయవల్ల నేను అప్పుడు  ఏ సమస్యా లేకుండా ఉద్యోగానికి దరఖాస్తు చేయగలిగాను. "థాంక్యూ సో మచ్ బాబా".    


ఒకసారి మా అమ్మమ్మ గొంతునొప్పితో బాధపడింది. అప్పుడు నేను ఊదీ బాబా గొంతు వద్ద తాకించి, "నొప్పి తగ్గించు బాబా" అని బాబాని వేడుకుంటే అమ్మమ్మకి నొప్పి తగ్గింది. ఇలా చాలాసార్లు బాబా ఊదీ మహిమ నాకు తెలిసింది. రోజూ బాబా ఊదీ వాడడం వల్ల ఎలాంటి రోగాలు రావని నా జీవితంలో ఋజువైంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా.  నేను మీకు చాలా ఋణపడి ఉన్నాను".


సందేశం ద్వారా చెప్పినట్లే నయం చేసిన బాబా

సాయిబంధువులందరికీ నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. సాయిబాబానే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, సర్వస్వము. సాయి లేకుండా ఒక అరసెకెండ్ కూడా నేను ఉండలేను. సాయితండ్రి నాకు ఎన్నో అద్భుతాలు చూపించారు. వాటిలో నుండి ఒకదానిని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఒకసారి నా ఎడమ చేతి మోచేతి దగ్గర చర్మం లోపల వాపు వచ్చింది. అక్కడ కొంచెం నొప్పి కూడా ఉంది. నాకు చాలా అంటే మాటల్లో చెప్పలేనంత భయమేసింది. ఈ వాపు ఏంటని ఏవేవో ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. వాటిలో పడి నాకు బాబాని ఏం అడగాలో కూడా అర్థం కాలేదు. నా భర్తకి చూపిస్తే, "అదేంటో, హాస్పిటల్లో చూపించాలి" అన్నారు. అది విని హాస్పిటల్లో ఏమంటారో అని నాకు మరింత భయమేసింది. నేను ఏడుస్తూ 'బాబానే కదా! వైద్యులకు వైద్యుడు. ఆయనని మించిన డాక్టర్ ఎవర'ని ఆయన్నే ప్రార్థించసాగాను. కానీ కొన్నిసార్లు నా భయం బాబాపై నా నమ్మకాన్ని అధిగమించేది. నేను అంతలా భయపడుతుండేదాన్ని. మా అమ్మతో విషయం చెప్తే, "ఏం కాదు. మనకి బాబా ఉన్నారు కదా! ఏం ఆలోచంచకు, తగ్గిపోతుంది" అని చెప్తుండేది. నా భర్తకి తన ఉద్యోగంలో బాబా చాలా అద్భుతాలు చూపిస్తుండేవారు. ఆయన వాటిని నాతో పంచుకుంటుండేవారు. నేను ఆయనతో నా గురించి ఒకసారి బాబాను ప్రార్థించమని చెప్పాను. ఆయన అలాగే చేసారు. 5 రోజుల వరకు వాపులో ఎటువంటి మార్పు లేదుగాని నొప్పి తగ్గింది. నేను రోజూ రాత్రి వాపుపై ఊదీ రాస్తూ ‘సాయినాథ రక్ష’ అని అనుకుంటూ పడుకునేదాన్ని. మరుసటిరోజు ఉదయం వాపు తగ్గిందా అని చూసేదాన్ని. అలాగే ఈ బ్లాగులో భక్తుల అనుభవాలు చదివేదాన్ని. అవి చదివాక నాకు చాలా ధైర్యం వచ్చేది. ఒకరోజు ఉదయం బాబాతో, "నా ఈ సమస్య తగ్గేలా అనుగ్రహించండి" అని చెప్పుకున్నాను. అప్పుడు బాబా నాకు, "ఎలాంటి గడ్డైనా అదే తగ్గిపోతుంది" అని సందేశం ఇచ్చారు. అంతే, 4-5 రోజులకి వాపు తగ్గడం మొదలై 2023, నవంబర్ 16 నాటికి పూర్తిగా తగ్గిపోయింది. అలాగే మా బాబుకి బాగా ఎక్కువగా ఉన్న దగ్గుని కూడా తగ్గించారు బాబా. 'సాయీ' అని పిలిస్తే తప్పక పలుకుతాడు నా తండ్రి. "నాపై భారం వేయండి. నేను మోస్తాను" అన్న తమ మాట నిజమని ఋజువు చేసిన సాయినాథునికి ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. సాయినాథుని చల్లని నీడలో అందరమూ చల్లగా ఉందాం. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


సమర్థు సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo